Jump to content

చారుచర్య/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

తెనుగుభాషలో వెలసిన కొలది శాస్త్రీయగ్రంథములలో నీచారుచర్య యొకటి. ఇది వైద్యశాస్త్రమునకు సంబంధించినది. అయిన నావైద్యశాస్త్రమున రోగములను, వానిలక్షణములను, వాని చికిత్సలను నౌషధములను తెలుపక, రోగములు రాకుండ మానవు డెట్లు తనయారోగ్యమును కాపాడుకొనుచు, ధృఢకాయుడై, చిరజీవిగా నుండగలడో ఆపద్ధతులను దెలుపున దీలఘుకృతి. ఇది కేవలము పద్యమయము. శాస్త్రీయగ్రంథములు కూడ తెనుగున మొదట పద్యమయముగ వెలువడుటచే నిదియును నాదారినే యనుసరించినది. తెనుగులో క్రీ. శ. 1450 కి ముందు వెలసిన శాస్త్రీయగ్రంథములు.

గణితము (Mathematics)

1. సారసంగ్రహగణితము - పావులూరి మల్లన

రాజనీతి (Political Science)

2. నీతిభూషణము - ఆంధ్రభోజుడు
3. నీతిసారము - రుద్రదేవుడు
4. కామందకము - కవి పేరు తెలియదు
5. పంచతంత్రము - కవి పేరు తెలియదు
6. పురుషార్థసారము - శివదేవయ్య
7. ముద్రామాత్యము - కవిపేరు తెలియదు
8. బద్దినీతులు లేక నీతిసారముక్తావళి - బద్దెన

మడికిసింగన సకలనీతిసమ్మతములో వాని పేర్కొన్నాడు. పై 8వ గ్రంథము పూర్తిగ లభ్యమగుచున్నది.

ధర్మశాస్త్రము (Law)

9. విజ్ఞానేశ్వరీయము - కేతన

వ్యాకరణము (Grammar)

10. ఆంధ్రభాషాభూషణము - కేతన

ఛందశ్శాస్త్రము (Prosody)

11. కవిజనాశ్రయము - మల్లియ రేచన
12. గోకర్ణచ్ఛందస్సు - గోకర్ణుడు
13. అధర్వణచ్ఛందస్సు - అధర్వణుడు
14. అనంతచ్ఛందస్సు - అనంతుడు

అలంకారము (Poetics)

15. కావ్యాలంకారచూడామణి - విన్నగోట పెద్దన
16. రసాభరణము - అనంతుడు

వైద్యము (Medicine)

17. చారుచర్య - అప్పనమంత్రి (Health and Hygiene)
18. పశువైద్యము - నారనమంత్రి (Cattle Medicine)
19. అశ్వవైద్యము- (Horses) మనుమంచిభట్టు

వాతావరణము వ్యవసాయము (Meteorology & Agriculture)

20. సస్యానందము - దోనయామాత్యుడు

ధాతుశాస్త్రము (Precious metals)

21. రత్నశాస్త్రము - భైరవకవి (Metallurgy)

సాముద్రికశాస్త్రము (Palmistry)

22. సాముద్రికశాస్త్రము - అన్నయమంత్రి

వేదాంతశాస్త్రము (Philosophy)

23. జ్ఞానవాసిష్టము - మడికిసింగన

కవి కాలము

ఈ గ్రంథరచయిత అప్పనమంత్రి గూర్చి చారుచర్యలో తెలిసినదానికంటె హెచ్చుగా మన కేమియు తెలియరాలేదు. ఈచారుచర్యలోగల 35వ పద్యము “కొనగొని కొండముచ్చులు చకోరములున్ శుకశారికావళుల్" అను 35-వ పద్యము మడికి సింగన సకలనీతిసమ్మతములో నుదాహరించినాడు. సింగనకాలము క్రీ. శ. 1400 ప్రాంతము కావున అప్పన యంతకుముందువా డగును.

అనువాదరీతి

మూలశ్లోకములను కొన్నిటిని వేర్వేఱుగా చిన్నపద్యములు గాను, 4, 5 శ్లోకములను సీసముగాను వ్రాసి యున్నాఁడు. మొత్తముపైని యాంధ్రీకరణము బాగుగనున్నది. మచ్చునకు—

శ్లో.

మలినం పరవస్త్రంచ స్త్రీవస్త్రంచ తథైవచ,
ఖండంచ మూషకైర్విద్ధ మగ్నిదగ్ధంచ వై త్యజేత్.


ఆ.

మలినమైన యదియు మగువ గట్టినయది
నితరజనులు యదియు నెలుకపోటు
ఖండమైన యదియు గాలినయదియు వ
ర్జింపవలయుఁ జుమ్ము చీరలందు.

25-వ పద్యము

శ్లో.

లోకే౽స్మిన్ మంగళాన్యష్ట బ్రాహణోగౌర్హుహుతాశనః
హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజాతథాష్టమః.


క.

గోవుం గనకము విప్రుఁడు
పావకుఁడు ఘృతంబు జలము భానుండు ధరి
త్రీవిభు డీయెనిమిదియు శు
భావహములు మంగళాష్టకాఖ్యం జెందున్.

30-వ పద్యము

ఈగ్రంథముద్రణమున కీక్రిందిప్రతులు తోడ్పడినవి.

1. తాళపత్రప్రతి (తెనుగు) ఆంధ్రసాహిత్యపరిషత్పుస్తకభాండారము సంఖ్య 3875
2. సంస్కృతము ద్రవ్యగుణరత్నాకరము లేక ద్రవ్యరత్నాకరము.
3. ముద్రితప్రతి శ్రీమాహిష్మతీముద్రాక్షరశాల, ముక్త్యాల, 1922.

పైవానిలో రెండవదియగు ద్రవ్యరత్నాకరమే చారుచర్య యని పేర్కొనబడినది. ఇది 33 వర్గములుగల సంస్కృతగ్రంథము. దీనితో తెనుగు చారుచర్య సరిచూడబడినది. ఈసంస్కృతమూలమును మేము ముద్రించుచున్నారము.

తెనుగున దీనివెనుక వైద్యశాస్త్రగ్రంథములో వేదయ ఆయుర్వేదార్థసారసంగ్రహము అచ్చుకాలేదని వినుచున్నాము. ఈతఁడు ప్రసిద్ధుఁడగు అనంతామాత్యునికొమారుఁడట. దానిని ముద్రించుటకు యత్నించుచున్నాము.

సంస్కృతాంధ్రములలో చారుచర్యలను ఆంధ్రసాహిత్యపరిషత్తునుండి సంప్రతించి ప్రతులను వ్రాసి పరిష్కరించిన శ్రీయుత చిలుకూరి పాపయ్యశాస్త్రిగారికి మేము కృతజ్ఞులము.

ఇట్లు,

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్