చాటుపద్యమణిమంజరి/పాఠం

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చాటుపద్యమణిమంజరి

శ్రీ నారాయణస్తుతి

మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
     పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
     సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియై
     పరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!

శ్రీకృష్ణస్తుతి

గీ. చేత వెన్నముద్దచెంగల్వపూదండ
     బంగరుమొలత్రాడు పట్టుదట్టి
     సందెతాయెతులును సరిమువ్వగజ్జెలు
     చిన్నికృష్ణ! నిన్నుఁ జేరి కొలుతు.

త్రిమూర్తిస్తుతి

చ. కమలజకృష్ణ శంకరులు కాంచననీలపటీరవర్ణు లా
     గమనగచంద్రధారు లఘకంసపురారులు హంసతార్క్ష్యగో
     గమనులు జన్మపుష్టిలయకారులు వాక్కమలాంబికేశ్వరుల్
     శమకరుణావిభూతిగుణశక్తులఁ బ్రోతురు మిమ్ము నెప్పుడున్.

శ్రీరంగనాథస్తుతి

ఉ. సింగపుమోమువాఁడు తులసీదళదామమువాఁడు కామినీ
     రంగదురంబువాఁడు వలరాయనిఁ గాంచినవాఁడు భక్తి కు
     ప్పొంగెడువాఁడు దానవులపొంక మడంచెడివాఁడు నేఁడు శ్రీ
     బంగరురంగశాయి మనపాలఁ గలండు విచార మేటికిన్.

వినాయకస్తుతి


క. ఉండ్రాళ్ళు పప్పునెయ్యిని,
    బండ్రించిన చెఱుకుఁబాలుఁ బడితపుటట్లున్
    జుండ్రేచుపచ్చితేనియ
    తండ్రీ వెనకయ్య! నీకుఁ దడయక తెత్తున్.

దిక్పాలస్తుతి


చ. హరిశిఖి ధర్మదైత్యవరుణానిలయక్షశివుల్ గజాజకా
    సరనరనక్రకైణహయశాక్వరయానులు వజ్రశక్తిము
    ద్గరశరపాశకుంతసృణికార్ముకహస్తులు భోగశుద్ధిసం
    గరజయశౌర్య సర్వజవకావ్యవిభూతులు మాకు నీవుతన్.

శివస్తుతి


చ. భసితము కన్నులం బడినఁ బాములు బుస్సనఁ గంట మంట పె
    ల్లెసఁగి విధుండు గంద నొకయింత గజాసురుచర్మ మూఁగినన్
    గసరుచు నల్లపెద్దపులి గాండ్రన గిత్తయుఁ దత్తరిల్లఁ జేఁ
    బొసఁగినలేడి కుందువడ భూతభయంబున గౌరి లేవ న
    వ్వెసఁగఁగ సంతరించుకొను నీశ్వరుఁ డిచ్చుత మీ కభీష్టముల్.
సీ. సర్వసర్వంసహాసముదయంబు రథంబు
                    రథమధ్యమున నున్నరాయి విల్లు
    విల్లువెంబడిఁ దిర్గువెలుఁగులు చక్రాలు
                    చక్రాలకును వైరి చారునారి
    నారిఁ బట్టుక తిర్గునాగరకుఁడు శరము
                    గరిమీఁద విహరించుఘనుఁడు శరము
    శరము నాభిక నున్న శతవృద్ధు సారథి
                    సారథిమాటలు సైంధవములు
ఆ. గాఁగ నేగుదెంచి కణఁకతోఁ బురములు
    గెలిచినట్టి ఘనుఁడు గిరిజతోడఁ
    గలసి యుండునట్టి కరుణాసముద్రుండు
    నిష్టసిద్ధు లొసఁగు నెలమి మనకు.

మృడునిఁ గనుఁగొంటి


సీ. అర్థంబు సత్పురుషాకృతిగాంచిన
                    వెండిచాయల పెద్దకొండఁ గంటి
    ఆకొండపార్శ్వమం దంటి పాయఁగలేక
                    సగమైన యొకమహాశక్తిఁ గంటి
    ఆశక్తికుడివంక నద్రిశృంగముమీఁద
                    నద్భుతం బైనకాఱడవిఁ గంటి
    అక్కానలోఁ గంటి నరుదైన యొకయేఱు
                    నయ్యేటిదరులయం దమృత మొలుక
గీ. పాఱి తడుపారు నొకపాలపాఁపఁ గంటి
    యదియు నదియును నదియును నదియు నదియు
    హరిశిరోజూటగంగాబ్జు లగుట గంటి
    మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.
సీ. సీతాద్రియామ్యదిక్సీమభూములు గంటిఁ
                    జెలువైన కేదారశిఖరిఁ గంటి
    ఉగ్రుని నిజకాంత నుమఁ జెంతఁ గనుఁగొంటి
                    మధుమాధవుని దైత్యమథనుఁ గంటి
    కంటి విఘ్నేశ్వరు గణనాథుఁ గనుఁగొంటిఁ
                    జండభైరవుని గోస్వామిఁ గంటి
    ఉత్తమసంస్తుత్యు నుత్తరార్కునిఁ గంటి
                    గాలభైరవు ఛన్నఘంటఁ గంటి
గీ. కంటి వటవృక్ష మాదిమగంగఁ గంటిఁ
    గంటిఁ గేదారకుండోదకములు గ్రోలి
    మహితవృషరాజు నెక్కినమహిమవాని
    మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.

సీ. ఆలపోతులఱేని నాతనిపగవాని
                    బెంపంగఁ జంపంగఁ బెంపు గలిగి
    హాలాహలపుమందు హల్లకములవిందుఁ
                    గుడువంగ ముడువంగఁ గోర్కిగల్గి
    ఎడమదిక్కువధూటి జడలమక్కువబోటిఁ
                    బొలపింప వలపింపఁ బొందు గలిగి
    పచ్చియేనికతోలు ప్రాఁతకంగటికాలు
                    కట్టంగఁ బట్టంగఁ గణఁక గల్గి
గీ. ఎసఁగి లోకంబు లీరేడు నేలువాని
    మిగులఁ బొడవైన తెల్లనిమేనువాని
    మహితవృషరాజు నెక్కినమహిమవాని
    మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.
సీ. తారకాసురభుజాదర్పంబు దెగటార్చు
                    ఘనుఁ గన్నతండ్రి మాయనుఁగువేల్పు
    కుండలిజ్యావల్లి కొండవింటను గూర్చు
                    విలుకాండ్రమేటి మాకులగురుండు
    తలిరాకుబాకు గద్దరివజీరుని క్రొవ్వు
                    మట్టు పెట్టినదిట్ట మాకుఁ బ్రాపు
    హత్తి తెల్లనిగిత్త కత్తలాణము నెక్కి
                    మహి మించునెఱకాఁడు మాధనంబు
గీ. జాటజూటాగ్రవీథిని జహ్నుకన్య
    మమత నిడుకొన్న వగకాఁడు మాబలంబు
    పార్వతీసాధ్వి సామేనఁ బాదుకొల్పి
    వెలయుపటుశీలి మాపాలివేల్పుమొదవు.

సీ. సుర లర్థిఁ గల్పప్రసూనముల్ వర్షింప
                    నప్సరోవనితలు నాట్యమాడ
    దుందుభిధ్వానముల్ తుములంబులై మ్రోయ
                    దూర్యఘోషంబులు తొంగలింపఁ
    జేరి వసిష్ఠుఁ డాశీర్వాద మొనరింప
                    నల యరుంధతి శోభనంబు పాడ
    వరగుణంబులనెల్ల వాల్మీకి నుతియింప
                    నారదమౌని గానం బొనర్పఁ
గీ. జెలఁగి సింహాసనంబున సీతతోడ
    రమణఁ గూర్చుండి రాజ్యపాలనము సేయు
    నట్టియాయోధ్యరాము నే నాత్మలోన
    మెలఁత! కలఁగంటి నంతట మేలుకొంటి.
సీ. సౌమిత్రి వేడుక ఛత్రంబు దాల్పంగఁ
                    బాదుకల్ భరతుండు భక్తి నిడఁగ
    శత్రుఘ్నుఁ డంతలోఁ జామరంబును వీవ
                    సుగ్రీవుఁ డర్థితో సురఁటి వీవ
    అంగదుం డంతంత నడపంబు పట్టంగ
                    సరసఖడ్గము విభీషణుఁడు తాల్ప
    సామీరి మతిమీఱి సన్నుతిఁ గావింప
                    జాంబవంతుండు హెచ్చఱిక దెల్ప
గీ. అవనిజను గూడి భద్రసింహాసనమున
    రమణఁ గూర్చుండి రాజ్యపాలన సేయు
    నట్టికోదండరాము నే నాత్మలోన
    మెలఁత! కలఁగంటి నంతట మేలుకొంటి.
సీ. సీతావధూమణి మాతల్లి భృగురామ
                    గర్వాపహారి మా కన్నతండ్రి

    దశరథాత్మజుఁడు మా దాత విశ్వామిత్ర
                    మఘరక్షణచణుండు మాకుఁ గర
    మారీచదమనుండు మాయిలవేలుపు
                    కోదండపాణి మాకులగురుండు
    జనకజానేత మా నెనరైనచుట్టంబు
                    రావణహంత మా జీవధనము
గీ. కైక యీప్సితకారుండు మాకు హితుఁడు
    హేమమృగచర్మశాయి మా స్వామిజలధి
    బంధనుఁడు మాకు సంసారభారవహుఁడు
    రామచంద్రుండు మాకు సర్వస్వ మరయ.
సీ. వనరాశిఁ దనయంప మొనకుఁ దెప్పించిన
                    కోదండధరుఁడు మా కులగురుండు
    తారకబ్రహ్మవిద్యాస్వరూపం బైన
                    వేదవేద్యుండు మా విమలవిద్య
    దండకాంతరమౌని మండలిఁ గాచిన
                    మనువంశతిలకుండు మాకుఁ బ్రాపు
    పగవాని తమ్మునిఁ బట్టంబు గట్టిన
                    కరుణాపయోధి మా పరమదాత
గీ. శబరి యొసఁగిన ఫలములు చవులుగొన్న
    భక్తి మాత్రైకదర్శి మాపాలివిందు
    కఠినదశకంఠభుజగర్వగౌరవంబు
    మట్టు పెట్టిన విలుకాఁడు మా బలంబు.
సీ. నాలుగు మోములబాలునితోఁ దన
                    బొడ్డున బాలెంతపూవు దనర
    అడుగుఁ గెందామరఁ బొడమినతేనియ
                    ముల్లోకములమీఁద వెల్లిగొలుప

    ఉరమున నున్న యిందిరచేతికమలంబు
                    మెలఁగుతుమ్మెదల కామెతలు గొలువఁ
    గరమున నొకమనోహరతరశంఖంబు
                    పొలివోని నిండువెన్నెలలు గాయఁ
గీ. బాలమున్నీటికరడు లుయ్యాలలూఁప
    ముదురునాగువుపైఁ గనుమోడ్చి యున్న
    వాని లోకంబు లేలెడువరుసవాని
    మెలఁత! కలఁగంటి నంతట మేలుకొంటి.

దశావతారస్తవము
గునుగు సీసములు
(ఈ పద్యములు సత్యవోలు భగవత్కవి రచించినవియట)
రక్షణపరాయణుండ! నారాయణుండ!


సీ. వదనభుజోరోంఘ్రివలన విప్రక్షత్ర
                    వైశ్యశూద్రులు మదివలనఁ జంద్ర
    ముఁడుఁజూపువలన సూర్యుఁడు మోమువలన మ
                    రుత్పతి వీతిహోత్రులను బ్రాణ
    మువలన వాయువు బొడ్డువలన నాక
                    సము శిరమువలన స్వర్గము పద
    మువలన భువి చెవులవలన దిశలును
                    నుదరమువలన హేమోదరాండ
తే. చయము జని వృద్ధి లయ మంద సలుపు నీవు
    నా హృదయపీఠి నుండు మామ్నాయసుప్ర

    సిద్ధ! వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. విరజానదీపరివృతసప్తసాలావృ
                    తపరమభాగవతసదనపద
    వైకుంఠభువనభవనసదనానుకృ
                    తనవీనపవనాదతల్పమున జ
    గత్కల్పనాకల్పకల్పుండవై కుడి
                    కాలు వంచి యెడమకాలు సాఁచి
    కుడిచే యనంతుని యొడలిపై నెడమచే
                    యిని జానువందున నిడి వెనుకటి
గీ. కరయుగంబుల శంఖచక్రములు మెఱయ
    సిరియు భువి నీళ గొలువ భాసిల్లు నిను భ
    జింతు వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. శ్రీదేవిభూదేవి సేవింపఁ గస్తూరి
                    తిలకము మాణిక్యములుఁ గిరీట
    ము మకరకుండలములుఁ గౌస్తుభమణి తా
                    ళీలు లక్ష్మీకుచాలేపము వన
    మాల శ్రీవత్సము మంచిసాలు భుజకీ
                    ర్తులు బాజుబందులు గొలుసులు మురు
    గులు బటువులు ముద్రికలు శంఖచక్రాది
                    పంచాయుధములు సుభద్రసూత్ర
గీ. కలితపీతాంబరంబు గజ్జెలు వెలుంగ
    నా హృదయపీఠి నుండు మామ్నాయసుప్ర
    సిద్ధ వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. మహనీయమత్స్యకూర్మవరాహనరసింహ
                    వామనభృగురామరామరామ

    బుద్ధకలికిరూపములు నారదకపిల
                    వ్యాసదత్తాత్రేయు లాదిగా న
    నంతరూపము లయ్యు “నత్యతిష్ఠద్దశాం
                    గుల” మని బ్రహ్మాండకోటి యేక
    పాద్విభూతిత్రిపాద్భూతిగను పరమ
                    పదముగ నీ స్వరూపము దెలిసిన
గీ. తత్త్వవేత్తలు పురుషసూక్తమున నిన్నుఁ
    బొగడనెగడితి వౌ విరాట్పురుష! సుప్ర
    సిద్ధ వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. మొగము శంఖము మీసము ల్గదాఖడ్గము
                    ల్పొలను చక్రము వాలమును సుశార్ఙ్గ
    మును బూని మగమీసమూర్తివై మెఱసి పా
                    తాళ మొఱసి తటస్థిలి దొఱసి య
    రసి “స్వయంతీర్ణః పరాం స్తారయతి” యను
                    నోజ గా నీతి “యత్యుఛ్రయః
    తనహేతు” వని సోమకునకుఁ దెల్ప గుభా ల్గు
                    భాల్గుభాల్మ నెగసి పడుచుఁ గదలిఁ
గీ. గ్రచ్చుకొని వచ్చు మ్రుచ్చుమై వచ్చి శ్రుతులు
    దెచ్చి విధి కిచ్చినట్టి నీ హెచ్చు వినుతి
    సేతు వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. అమృతవారాశి ఘటము మందరముఁ గవ్వ
                    ము ఫణి రజ్జువుఁ జేసి పూర్వదేవ
    తలు దేవతలుఁ బట్టి తరువఁగా ఘుమఘుమ
                    ధ్వనుల బ్రహ్మాండము తల్లడపడ
    నపుడు “పరోపకారార్థ మిదం శరీ
                    ర” మని కూర్మావతారమునఁ గ్రుంగి

    నగిరి క్రింద నిలిచి “నాన్నోదకసమం
                    దాన” మని సురల కమృత మిచ్చి(?)
గీ. నిరుపమాన లక్ష్మీరమణీమణీమ
    ణులు గొలువ విలసిల్లి తౌ నలఘు దాన
    శీల వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. హిమగిరిఁ గేరుదేహము వజ్రములతీరు
                    రోమములుఁ బ్రళయార్కులసరి కను
    గవయు బ్రహ్మాండముఁ గబళించుముట్టె పా
                    తాళముఁ బెకలించుదంష్ట్ర యొప్పఁ
    గ వరాహమూర్తివై కదిసి హిరణ్యాక్ష
                    గర్భనిర్భేదివై భూర్భువస్సు
    వర్ఛయచ్ఛేదివై వారాశిమగ్న భు
                    గ్న వసుంధరోద్ధరణ ప్రమోది
గీ. వై జగతి “యతో ధర్మస్తతో జయ” యను
    వచనము నిజముఁ జేసిన వర్ధమాన
    కీర్తి! వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. ఎంతఁ జదివిన రవంత కులాచార
                    ధర్మ మెఱుంగడ తన కుమార
    కుఁడయిన ప్రహ్లాదు నొడిసి పట్టి నఱుక
                    రహి వచ్చినట్టి హిరణ్యకశిపు
    కట్టెదుట నినుపకంబము పటపటఁ
                    బగులఁ బొగ లెగయ భగభగ మను
    పెనుమంటఁ జిటజిట మనుమిడుఁగురులు బ్ర
                    హ్మాండము నిండ బ్రహ్మాదులు గడ
గీ. గడ వడఁక నల్గడ లడల వెడలి కెవ్వు
    నార్చి రిపు నేర్చి వటు నేలినట్టి శ్రీ నృ
    సింహ! వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!

సీ. అదితికశ్యపునకు “నంగుష్ఠమాత్రః పు
                    రుష” యను వచనము రూఢి సేయ
    వామనమూర్తి నవతరించి వడుగవై
                    గొడుగు జందెముఁ బచ్చగోఁచిపంచె
    పంచశిఖలు మౌంజి పాలాశదండము
                    కృష్ణాజినము చెంబు నిట్టివేష
    మమర “సణోరణీయా న్మహతో మహీ
                    యా” నన్న వేదవాక్యము ప్రసిద్ధి
గీ. వడ బలికడను బుడమి మూఁ డడుగు లడిగి
    త్రిభువనము లాక్రమించు వర్థిష్ణు వని భ
    జింతు వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. జమదగ్ని గర్భవాసమునఁ బుట్టి వివిధ
                    విద్యాతపోధనుర్విద్య లధిక
    పతివై ప్రబలి “ఇదం బ్రాహ్మ్య మిదం క్షాత్ర”
                    మని మునిరాజచిహ్నముల శాప
    చాపనైపుణిఁ జూపి పాపభూపతుల శ
                    ఠారికరోరకుఠారధార
    నస్రధారాప్రవాహములుగా శతధా స
                    హస్రధా ఖండించి యానదులను
గీ. దర్పణము భూమిదేవతార్పణముగఁ
    జేసిన పరశురామవేషి వని నిను భ
    జింతు వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. సూర్యవంశము పరిశుద్ధ మని దశర
                    థుఁడు నతులమనోరథుఁ డని భరత
    లక్ష్మణశత్రుఘ్నులకు నన్నవై పుట్టి
                    సౌందర్యచాతుర్యసౌకుమార్య

    శౌర్యధైర్యౌదార్యవీర్యసత్యౌచిత్య
                    గాంభీర్యకర్తుమకర్తుమన్య
    ధాకర్తు మతిసమర్ధత్వసత్వాఘట
                    ఘటనాపటీయస్తవఘనయశస్త్వ
గీ. సౌఖ్యసఖ్యదయాముఖ్యశాలి వైన
    రాముని సరాముని దయాభిరాము నిను భ
    జింతు వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. బ్రహ్మను గన్న పరబ్రహ్మమూర్తివై
                    యాద్యంతశూన్యుండ వయ్యు “ధర్మ
    సంస్థాపనార్థాయ సంభవామి యుగే యు
                    గే” యటంచును దేవకీతనయుఁడ
    వయి బలరామసహాయుఁడవై శిష్ట
                    రక్షణమును దుష్టశిక్షణమును
    సలుపుచు రుక్మిణి సత్యభామ సుదంత
                    భద్ర కాళింది జాంబవతి మిత్ర
గీ. వింద లక్షణయును బదార్వేలనూర్వు
    రంగనలు గొల్వ వెలయు కృష్ణాహ్వయ ప్ర
    సిద్ధ! వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. త్రిపుర దైత్యులను మిత్తికి బుత్తిఁ జేయఁ ద
                    లఁచి తదీయాంగనల యతిజృంభ
    కుచకుంభపరిరంభనరంభాత
                    రుస్తంభశుంభదూరుఘనజఘన
    బింబబింబాధరపీడనతాడన
                    దంతక్షతనఖక్షతప్రముఖర
    తుల నతులగతులఁ గలసి మెలసి విల
                    సితతద్వ్రతక్షతిఁ జేసి చేసి

గీ. కంటిగొంటమ్మువై మింట గంటక త్రి
    పురచరులఁ గాల్చి కాల్చినబుద్ధ! గుణస
    మృద్ధ! వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!
సీ. కలియుగాంతమున దుష్కరముష్కరతురుష్క
                    చండాలపతితపాషండమండ
    లీమండితాఖండభూమండలముఁ జూచి
                    కమ్రామ్రపర్ణార్ణతామ్రపర్ణి
    తటమున బ్రహ్మవిద్బ్రాహ్మణునకుఁ బట్టి
                    వై పుట్టి యుత్తమాశ్వాధిరూఢుఁ
    డ వయి జోడుఁ దొడిగి డాలు కత్తికమానుఁ
                    బూని పూనిక మీఱఁ బుడమిఁ బుట్టి
గీ. నట్టిదుష్టులఁ బుడమిఁ జెండాడ నున్న
    కలికిమూర్తి! గుణస్ఫూర్తి! కలితశౌర్య
    కీర్తి! వైకుంఠనాథ! లక్ష్మీసనాథ!
    రక్షణపరాయణుండ! నారాయణుండ!

ఈక్రిందిపద్యము లెలకూచి బాలసరస్వతిమహోపాధ్యాయుఁడు రచించెను.

1. మత్స్యావతారము


శా. సాధీయోముఖపూరితోద్యమితతాసత్యోర్ధ్వగోదన్వ ద
    ర్ణోధారాంతరటత్తిమింగిలగిల ప్రోద్ధాననిధ్యానల
    బ్దాధీశప్రభుతాస్వభాగహరణార్థాయాయినాథానుజ
    ప్రాధాన్యాం కవిలోలవాగ్ధృగబట బ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్.

2. కూర్మావతారము


శా. ద్యూతంభద్గిరికల్పితావతరణద్యోవాహినీసంగమో
    పాత్తేందూతయనిష్పితౄణజలధిప్రారబ్ధపుత్రోత్సవో

    దాత్తత్పాత్తగజాశ్వవస్యశనకన్యాగోమణీదానసం
    పత్తి ప్రీణితదేవఢుల్యధిపతి బ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్.

3. వరహావతారము


శా. ఆద్యాలోకనభక్తిసంభ్రమదనేహఃపూరుషత్యక్త స
    త్పాద్యాంభస్తులసీభ్రమప్దరఖురప్రక్షాళనామాత్ర జా
    గ్రద్యోగాంబుధి దంష్ట్రికాగ్రరిపుహృత్కాలామిషప్రాయ శుం
    భద్యాదోనిధిసప్తకీస్థలికిటి బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

4. నరసింహావతారము


శా. డింభద్రోహివధోత్కటోత్క్రమణరుష్టిక్లిష్టతారోమకూ
    పాంభోజప్రభవాండభాండతళనోద్యద్ద్వానధీకృత్సభా
    స్తంభాంతస్తృటనాస్ఫురత్పటపటధ్వన్యాస్త నిశ్చేష్ట ని
    ర్దంభోద్యోగదిశావశాపనృహరి బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

5. వామనావతారము


మ. స్వతలస్వచ్ఛతరారుణత్వరచితస్వస్త్రీః పరేడ్భ్రాంతివా
    క్ప్రతికూలత్వదశానుకారిగళగాద్గద్యక్షమాంభోజభూ
    నుతిహాసన్నఖరోర్ద్వసారితపదార్ణోరుడ్జగంగాసవా
    ప్రతిమాశీశకపర్దమండలపటుబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

6. పరశురామావతారము


శా. ఆజిప్రౌఢిమదుర్జయార్జునగళోదగ్రాసృగాస్వాదన
    వ్యాజాపోశనభాక్తదస్వపహృతి ప్రాణాహుతి ప్రస్ఫుర
    ద్రాజాళీదివసావసానవిఘసప్రాయేందువేలాయితా
    భ్రాజాధ్యక్షకురారధరిభృగురాడ్బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

7. శ్రీరామావతారము


శా. చాపచ్ఛాత్రనిషంగ భంగ కుపిత క్ష్మాభృద్ధనుః పంచవ
    క్త్రీపంచాళికదృఙ్నియుక్తహుత భుగ్గ్రీవాద్వయీ పంచక

    వ్యాపార భ్రమకారి పంక్తిగళగళ్యాఖండనాఖండదో
    ర్నైపుణ్యప్రదరౌఘరాఘవపరం బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

8. బలరామావతారము


మ. కరిపూరుద్దరణేద్దలాంగలవిభగ్న క్ష్మాభరాదక్షది
    క్కరిపాద ప్రహతిస్పుట స్ఫుటితభాగవ్యావృత గ్రీవసూ
    కరపీరీకృత పృష్ణతాహిత మహాగాధాధి కూర్మాధిరా
    ట్పరిక్లుప్తప్రళయాంబుగాహనహలిబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

9. శ్రీకృష్ణావతారము


మ. అతిదోఃపీడిన కర్కరీ ఫలితకంరాభత్పదుత్తర్తుధూ
    ర్తతృణావర్త దృఢాంగపాతహత గోత్రా భర్తృకోత్పాదిత
    క్రతుభుగ్రాడ్గ్రహణాగ్రహోన్ముఖశతారధ్వస్తమైనాకని
    ష్పతన భ్రాంతినందగోపకసుత బ్రహ్మస్తుమ స్త్వా మనున్.

10. బౌద్ధావతారము


మ. గిరియుష్మద్ధనురస్త్రతాప్రభృతిమోఘీకృద్వధూశీలవి
    స్ఫురణావర్మభి దాఢ్యదార్ఢ్యసఫలీ భూతత్రిపూతత్రపూ
    ర్వరదైతేయజిఘాంసు శాసనపరోగ్ర ప్రాప్యసారూప్యని
    ర్భరదైతేయతథాగతాంగక పరబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

11. కల్క్యవతారము


మ. స్వమహాబాహు కృపాణకృత్త గళతుచ్ఛమ్లేచ్ఛవీరచ్ఛటో
    త్క్రమదాపాదితపద్మినీరమణ మధ్యచ్ఛిద్రఖస్వామికా
    గమనానాస్రపయఃపరాగ మథితక్ష్మాసౌర గంగానదీ
    భృమకృత్కీర్తిక కల్కిమూర్తిక పరబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

సంకీర్ణపద్యములు

గీ. అక్షరంబు వలయుఁ గుక్షిజీవనులకు
    నక్షరంబు జిహ్వ కిక్షురసము
    అక్షరంబు తన్ను రక్షించుఁ గావున
    నక్షరంబు లోకరక్షితంబు.
క. సరి నక్షరములె మంత్రం
    బరయఁగఁ దరుమూల మెల్ల నౌషధచయమే
    ధర యెల్ల ఫలనిదానమె
    నరు లాస్థితి యెఱిఁగి క్రియన నడపిరయేనిన్.
శా. ఆలస్యంబును గామినీజనరతాత్యాసక్తియున్ జన్మభూ
    లోలత్వంబును రోగపుంభయము దుర్లోభంబు సంతోషమున్
    బోలంగా నివి యాఱు నెప్పుడు జగత్పూజ్యప్రతాపోదయ
    శ్రీలం జెందఁగ విఘ్నకారణములై చెల్లున్ ధరామండలిన్.
ఆ. దేవునాన మున్ను దేశాన కొకరుండ
    నిప్పు డూరనూర నింటనింట
    నేవు రార్గు రేడ్వు రెనమండ్రు తొమ్మండ్రు
    పదువురైరి కవులు పద్మనాభ!
చ. అవనిపుఁ డాదరించిన భటాళిభటత్వము వైద్యువైద్యమున్
    గవికవితామహత్త్వమును గాయకుగానము కోటిసేయు న
    య్యవనిపుఁ డాదరింపని భటాళిభటిత్వము వైద్యువైద్యమున్
    గవికవితామహత్త్వమును గాయకుగానము గవ్వసేయునే?
మ. నయనానందకరం బనిందితము నానాసద్ద్విదశ్రేణి కా
    శ్రయ మశ్వత్థమహీజ మంచు నళు లాసం జెంది యాస్వాదన
    క్రియకుం బుష్పచయంబు గోరి చనుమాడ్కిన్ సుందరాకారు ని
    ర్దయు నాసింతురుగా కెఱుంగుదురె యంతస్సారనిస్సారతల్?
చ. సరసులు గానివారియెడఁ జాలఁ గవిత్వప్రసంగముల్
    కఱపుట కంఠశోషణమె కాక రసజ్ఞత గూర్ప నేర్చునే?

    స్మరశరజాలవేదనకుఁ జాలక భ్రాంతిని రాతిబొమ్మతో
    మఱఁగి రమింపఁగాఁ దివురుమానవుఁ డేమి సుఖింపఁగల్గెడిన్?
సీ. నిపుణత రాజ్యవినీతుఁడు గాఁడేని
                    నేల యేలెడువాఁడు బేలకాఁడె
    సంగీతసాహిత్యసరసుఁడు గాఁడేని
                    కృతి సెప్పువాఁడు దుష్కృతుఁడు కాఁడె
    కుశలత నతిమతివిశదుఁడు గాఁడేని
                    విటుఁడగువాఁడు దుర్విటుఁడు గాఁడె
    మాధవశ్రీపాదమగ్నుండు కాఁడేని
                    మోక్షార్థి ననువాఁడు మొప్పెగాఁడె
గీ. అతులరాజ్యనీతి యమలకావ్యసుశక్తి
    యంగనానురక్తి యచలభక్తి
    రతుఁడు గానివాఁడు పతిగాఁడు కృతిగాఁడు
    కామిఁగాడు మోక్షకామి గాఁడు.
గీ. ఆఢ్యుఁ డున్నయప్పు డందఱుఁ బూజ్యులె
    లెక్కమీఁద సున్న లెక్కినట్లు
    అతఁడు పోవువెనుక నంద ఱపూజ్యులే
    లెక్కలేక సున్న లేఁగినట్లు.
క. సామర్థ్య మున్నవేళల
    నేమనుజునకేని నింద యె ట్లొదవుఁ? గుసుం
    బామేల్మిచీర దాల్చిన
    భామ చెఱఁగుమాయుఁగాక బయలంబడునే?
క. చేతనగువాఁడు కార్యము
    కై తగ్గును వంగుఁగక యల్పుం డగునా?
    యేతముచడి దా వంగును
    బాతాళమునీరు దెచ్చి బయలం జల్లున్.

చ. పరఁగఁగ నాల్గుపాదములు బగగుతుండము ఘీంకృతంబు మా
    కిరువురకున్ సమంబె మఱి యెక్కువయొక్కటి పక్షయుగ్మ ఖే
    చరుఁడను నాకు సామ్య మొకసామజమా? యని దోమ పల్కున
    ట్లరయ మహానుభావులను నల్పుఁడు నోరికొలందు లాడెడిన్.
మ. సకలస్థాణుశిరఃప్రవర్తి నురుపక్షద్వంద్వశౌక్ల్యాభిరం
    జకుఁడన్ సర్వదిగంతగామి నసకృత్సంసేవ్యమానుండ నై
    ష్ఠికుఁడన్ గావున మత్సమానుఁ డగునే శీతాంశుఁ? డం చెప్పుడున్
    బక మిందుం బ్రహసించురీతి సుజనుం బల్కుం దురాత్ముం డిలన్.
క. కవితాలక్షణ మెఱుఁగని
    యవివేకికిఁ బద్య మిచ్చి యడుగుటకంటెన్
    చవిలెఁగొని దండెఁగొనుకొని
    భువిలో హరిదాసుఁ డైనఁ బుణ్యమె దక్కెన్.
క. పదపద్యంబులు చదివిన
    విదలించుకలేచిపోక వేడుకతోడన్
    దుద ర మ్మని యిప్పించినఁ
    బదివే లొకపోవవక్క భట్టరుచిక్కా!
ఈ భట్టరుచిక్కాచార్యులు తెనాలి రామకృష్ణప్రభృతులకు గురు వనంబడు.
క. నక్కలు బొక్కలు వెతకును
    నక్కఱతో నూరఁబంది యగడిత వెతకున్
    గుక్కలు చెప్పులు వెదకును
    డక్కిడినాలంజెకొడుకు తప్పే వెదకున్.
గీ. తప్పు గుఱుతించివ్రాయు టుత్తమము; లోక
    ప్రతిసమానముగాఁ వ్రాయు టతిముదంబు

    రెండు విడనాడి వ్రాసెడిలేఖకుండు
    కలుగు టరయంగఁ గవి యభాగ్యంబకాదె?
చ. వెనుకకుఁ బోక హు మ్మనక వేసట పొందక బంతిబంతిలోఁ
    బెనుపక లోపలం బ్రమసి బెగ్గిన కంతయు మున్నె సూచుచున్
    గనుఁగొను నక్షరక్రమముకందున దప్పక యేకచిత్తుఁడై
    యనుపమభక్తితోఁ జదువునాతని వాచకుఁ డండ్రు సద్బుధుల్.

షట్చక్రవర్తులు


శ్లో. హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సః పురూరవాః
    సగరః కార్తవీర్యశ్చష డేతే చక్రవర్తినః.
జిగియును, రుచియును గల యీక్రిందిపద్యరాజములు యత్కర్తృములో తెలిసినదికాదు.
సీ. హరిహరబ్రహ్మాదు లద్భుతం బందంగ
                    నెగడె సత్యవ్రతనిష్ఠ కలిమి
    నాలుగుయుగముల నోలిని బదునాల్గు
                    వరుసల వర్తిల్లి వసుధ యేలె
    సప్తపాథోధిసంగుప్తసప్తద్వీప
                    సంధుల జయశిలాస్తంభవితతి
    నిలిపె నాఖండాదులు పంపు సేయంగ
                    రాజసూయమహాధ్వరం బొనర్చె
గీ. నతలవితలరసాతలాద్యఖిలదనుజ
    లోకగంధర్వలోకాహిలోకనాక
    లోకగోలోకకమలజలోకభరిత
    సాంద్రయశుఁ జెప్పఁ దగు హరిశ్చంద్రవిభుని.

సీ. చంద్రకందర్పాదిసౌందర్యవంతులు
                    తనుఁజూచి సిగ్గునఁ దనరఁ దనరె
    త్రైలోక్యసుందరి దమయంతి తనయందు
                    బద్ధానురాగగాఁ బరఁగఁ బరఁగె
    అర్థికిఁ బ్రాణంబు నర్థంబు నిచ్చుట
                    నెట్టన బిరుదుగా నెగడ నెగడె
    అమరులు దనమనోవిమలత కిచ్చమై
                    మెచ్చి నెచ్చెలులుగా మెఱయ మెఱసె
గీ. మహితకర్కోటకాహీంద్రమైత్రిపరుఁడు
    పుణ్యఋతుపర్ణవర్ణితాగణ్యగుణుఁడు
    వితతకలిదోషసంహారవిమలయశుఁడు
    నలుని గీర్తింప నఘములు దొలఁగు టరుదె?
సీ. చంద్రనందనునకు సాధ్వియిలాకన్య
                    యం దుద్భవించెఁ బుణ్యములతోడ
    శ్రీమత్సురాంగనాసీమంతమణియైన
                    యూర్వశి పత్నిగా నుర్వి యేలె
    వితతభాండాగారవిపులగోష్ఠాగార
                    తతి విప్రహస్తసంగతిగ నిచ్చె
    ఆయుర్దృఢాయుస్సుఖాయుర్ముఖుల దేవ
                    పతి చూచి వెఱఁగంద సుతులఁ బడనె
గీ. సుజనముచికుందభూపాలసోదరత్వ
    మేరుమందరధృతియశోమేదురత్వ
    సకలగుణరత్నభూషణసాగరత్వ
    ధను నఘచ్యుతుఁ బురుకుత్సుఁ జను నుతింప.
సీ. మహి యెల్లయెడ నేలుమాంధాతృనకుఁ బుట్టి
                    యాదిగర్భేశ్వరుం డనఁగఁ బరఁగె

    బ్రాహ్మణభక్తిసంపన్నసౌజన్యత
                    విప్రవశు డన వినుతి కెక్కె
    ఇరువేలవర్షముల్ గుఱుతుగా నొకదినం
                    బాదిగాఁ గలయధ్వరాళిఁ జేసె
    త్రిభువనప్రీతిగా దివ్యకోదండుఁడై
                    బహుకోటిదనుజుల బల మడంచె
గీ. ప్రకటశాత్రవభంజనభైరవుండు
    పౌత్త్రతాయత్తకౌరవపౌరవుండు
    హర్షితానేకజనవినుతారవుండు
    గౌరవోన్నతి నొప్పెఁ బురూరవుండు.
సీ. పటుశక్తిశౌర్యు లర్వదివేవు రాత్మజుల్
                    పనిసేయ నిమ్మహీభరము దాల్చె
    ఒక్కొక్కసుతుపేర నొక్కొక్కపట్టణం
                    బిలయెల్లఁ గల్పించె నలఘుమహిమ
    అన్నిపట్టణముల నఖిలమహారత్న
                    చయములు గల్గ రాజ్యంబు చేసె
    పుత్త్రమోహభ్రాంతి పొందక మర్యాద
                    తొలఁగినసుతుల నిల్ తొలఁగఁ దోలె
గీ. చెప్ప నొప్పదె నిజపౌత్త్రచిత్రఘోర
    తమతపోలబ్ధగంగాంబుతరళసలిల
    వీచికానూనసోపానవితతయాన
    మననివాసత వైకుంఠనగరు సగరు.
సీ. హేహయవంశధాత్రీశాబ్ధిచంద్రుఁడై
                    జనియించి విశ్వభూచక్ర మేలె
    అచ్యుతమూర్తి దత్తాత్రేయయోగీంద్రు
                    చేత జగజ్జైత్రసిద్ధి వడసె

    ఏతప్పు నెన్నఁడు నెవ్వరు నెచ్చోటఁ
                    దలఁప రాకుండంగ నిలిపె నాజ్ఞ
    ఏడుదీవులయందు నెన్నూఱు హయమేధ
                    యాగంబు లొనరించె నలఘుమహిమ
గీ. అతులతరదీర్ఘసత్త్వసహస్రబాహు
    డహిగణాధిపఫణగణాయత్తభూరి
    భూభరముఁ దాల్చె నవలీలఁ బొగడఁ దగదె
    కార్తవీర్యార్జు నాహ్వయక్ష్మాతలేంద్రు?
సీ. ఒగిఁ జతుర్దశమహాయుగములు భువిఁ దాల్చె
                    సత్యవ్రతము హరిశ్చంద్రవిభుఁడు
    జంభారివరుణాదిసంభవితులలోన
                    దమయంతి వరియించెఁ దనర నలుఁడు
    ఆదిగర్భేశ్వరుం డై విప్రదాసుఁడై
                    చరియించెఁ బురుకుత్సజనవిభుండు
    బ్రాహ్మణహస్తంబు భండార మదియె కొ
                    ఠారంబుఁ జేసెఁ బురూరవుండు
గీ. సాగరము పేర్మి నిర్మించె సగరనృపతి
    కార్తవీర్యుండు మహి జైత్రవర్తనుండు
    వీరలార్గురుఁ దలపోయ విష్ణునిభులు
    చక్రవర్తులు నిత్యనిర్వక్రయశులు.

రణతిక్కన – నెల్లూరుపురము

విరాటపర్వముఁ దొట్టి తుదముట్ట నాంధ్రమహాభారతమును రచించిన తిక్కనసోమయాజి కీతఁడు పెద్దతండ్రికుమా రుఁడు. పదుమూఁడవ శతాబ్దియందు విక్రమసింహపురమున రాజ్యమేలిన మనుమసిద్ధిరాజునొద్ద సేనాని.

సీ. వీరివివాదంబు వేదనినాదంబు
                    పాయక యేప్రొద్దు మ్రోయుచుండు
    భూసురప్రకరంబు సేసలు చల్లంగఁ
                    బాయ కెన్నియొ కుటుంబములు బ్రతుకు
    బ్రాహ్మణావళికి ధారలుపోసినజలంబు
                    సతతంబు ముంగిట జాలువాఱు
    రిపుల కొసఁగిన పత్రికలపుత్త్రికలను
                    బాయక కరణముల్ వ్రాయుచుంద్రు
గీ. మానఘనుఁ డైనతిక్కనమంత్రియింట
    మదనసముఁ డైనతిక్కనమంత్రియింట
    మహితయశుఁ డైనతిక్కనమంత్రియింట
    మంత్రిమణి యైనతిక్కనమంత్రియింట.

మనుమసిద్ధిరాజునకును నెఱగడ్డపాటియేలిక యగుకాటమరాజుకును జరిగినసంగ్రామమున నీధన్యచరిత్రుఁడు కీర్తిశేషుఁ డయ్యెను. పుల్లరియిచ్చు నొడంబడికపైఁ గాటమరాజు తనపసుల మనుమసిద్ధిరాజు మేఁతబీళ్ళలో మేపుకొని యక్కడఁ దలకోడెదూడలలో నేదో నష్టము సంభవించిన దన్నకారణమునఁ బుల్లరి నెగఁగొట్టెను. దానిపై మనుమసిద్ధిరాజు పసులఁ బోనీయడయ్యె. పరస్పరయుద్ధమున కిది కారణము. ఈయుద్ధచరిత్రము “కాటమరాజుకథ”యనుపేర గ్రంథరూపమున వెలసినది. మనుమసిద్ధి పక్షమునఁ గొంతసేనతో ఖడ్గతిక్కన కాటమరాజుసేన నెదుర్కొన కొంత పోరాడి తన బలము చెల్లాచెదరుకాఁగా నిలువరాక తిరిగి యింటికి వచ్చెను. నాఁడు స్నానము చేయఁబోఁగా స్త్రీలు జలకమాడు మఱుఁగుపట్టున భార్య నులకమంచ మడ్డుసేసి పసపుటుండ పెట్టి దాన పైనుంచి నీళ్ళబిందెఁ దెచ్చిపెట్టెనఁట! ఇది యే మని వ్యసనపడి యడుగ—

క. పగఱకు వెన్నిచ్చినచో
    నగరే నిను మగతనంపు నాయకు లెందున్?
    ముగు రాఁడువార మైతిమి
    వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్?
అని యవమానకరముగా సైతము పల్కెనఁట! తర్వాతఁ దల్లి యన్నములో విఱిగినపాలు పోసెను. తిక్కన తల్లి నిదియేమని యడిగెను. తల్లి “నాయనా! నీవు పోయినచోటికే పసులును మేఁతకుఁ బోయెను. అవియును విఱిగి వచ్చినవి. పాలును విఱిగెను.” అనెనఁట!
క. అసదృశముగ నరివీరుల
    మసిపుచ్చక విఱిగివచ్చు మగపందక్రియన్
    గసవున్ మేయఁగఁ బోయిన
    పసులున్ విఱిగినవి తిక్క! పాలున్ విఱిగెన్.
అంతట నన్నము విడిచి లేచి యుద్ధసన్నద్ధుఁడై పోయి పగతుఱ నెదుర్కొని వీరస్వర్గము నందినట్లు నాఁటికవుల వర్ణనము.
చ. పదటున వాజిరాహుతులపై దుమికించుచుఁ దిక్కఁ డార్చినన్
    బెదరి పరిభ్రమించి కడు బిమ్మిట వీరులు భిత్తచిత్తులై
    యదె యిదె వాలు వాల్మెఱుఁగు లల్లవె యల్లదె యాతఁడం చనన్
    గొదుకక యాజిఁజేసె రిపుకోటుల కందఱ కన్నిరూపులై.
ఉ. చిక్కక మన్మసిద్ధివిభుచే మును గొన్నఋణంబు దీర్చె మా
    తిక్కనమంత్రి సోమశిల దేవరసాక్షిగఁ బెన్నసాక్షిగా

    నెక్కినవాజి సాక్షిగ మహి న్నుతి కెక్కినకీర్తిసాక్షిగా
    స్రుక్కక మారుకొన్నరణశూరులు సాక్షిగఁ గొండసాక్షిగన్.
సీ. [1]రణరంగమున మోహరంబులఁ బొడగని
                    ప్రాణంబు వాసినపందగజమ!
    విజయాధిపుని దాడి వెనుకొని తగులంగ
                    దెసదప్పి పాఱినదిగ్గజంబ!
    చేరఁజాలక తిర్గి చేమడ మళ్ళించి
                    మంచాన కందనీమదగజంబ!
    బెనుతుల్లిచెఱువులోఁ బిరుదు లన్నియు రొంపిఁ
                    గ్రుంగంగఁ దొక్కనకుంజరంబ!
గీ. నేఁడు మొదలుగాఁగ నెల్లూరివీథిలోఁ
    బొగడుతనము సేయుమగలతలలు
    పూరిగఱచి తిక్క! భూతమై సోఁకుము
    యూరివారిసోఁకు గారుసేసి.

సీ. ధైర్యంబు నీమేనఁ దగిలియుండుటఁ జేసి
                    చలియించి మందరాచలము తిరిగె
    గాంభీర్య మెల్ల నీకడన యుండుటఁ జేసి
                    కాకుత్స్థుచే వార్ధి కట్టుపడియె
    జయలక్ష్మి నీయురస్స్థలిన యుండుటఁజేసి
                    హరి పోయి బలి దాన మడుగుకొనియెఁ
    ఆకారమందెల్ల నీయంద యుండుటఁజేసి
                    మరుఁడు చిచ్చునఁ బడి మడిసి చనియె
గీ. దిక్కదండనాథ! దేవేంద్రపురికి నీ
    వరుగు టెఱిఁగి సగము తిరుగు టుడుగు
    నబ్ధి కట్టువిడుచు నచ్యుతుకొద మాను
    మరుఁడు మరలఁ గలుగు మగలరాజ!
సీ. నందిని బుత్తెంచె నిందుశేఖరుఁడు నీ
                    వన్న! యేతెమ్ము తారాద్రికడకు
    గరుడినిఁ బుత్తెంచె నరహరి రావయ్య
                    వడి సిద్ధతిక్క! కైవల్యమునకు
    హంసను బుత్తెంచె నజుఁడు నీకడకు ను
                    భయకులమిత్ర! రా బ్రహ్మసభకు
    ఐరావతముఁ బంపె నమరేంద్రుఁ డిప్పుడు
                    దివమున కేతెమ్ము తిక్కయోధ!
గీ. యనును వేఱువేఱ నర్థితోఁ బిలువంగ
    వారు వీరుఁ గూడ వచ్చి వచ్చి
    దివ్యయోగి యైన తిక్కనామాత్యుండు
    సూర్యమండలంబు సొచ్చి చనియె.
ఉ. వెన్నెలలేనిరాత్రియు రవిప్రభలేనిదినంబు నీరులే
    కున్నసరోవరంబు కడు నొప్పగు దీపము లేని యిల్లు నై

    పెన్నఁదనంబు నొందె మనవిక్రమసింహపురంబు చూడఁగాఁ
    బున్నమచంద్రుఁ బోలు మనపోలమతిక్కఁడు లేమి నక్కటా!

సిద్ధయ తిక్కన


ఈ తిక్కన రణనిహతుఁ డయినపిదప వేములవాడ భీమకవి యాతని యింటికేఁగి యాతని భార్యను ‘దీర్ఘసుమంగలీభవ’ యని యాశీర్వదించెనఁట! ఆమె భర్తృవియోగవార్త తెలిపి శోకింపఁగా నాతఁడు—
క. గుణముల నిధాన మగు మన
    రణతిక్కన తాఁ గళేబరంబును శిరమున్
    గణఁకమెయిఁ గలయ బ్రదుకును
    బ్రణుతాఖిలవైరమకుటబాసితపదుఁఢై.
అని పద్యము చెప్పి రణతిక్కన నుజ్జీవింపఁజేసెనఁట! ఇది కట్టుకత. రణతిక్కనను గూర్చి చెప్పఁబడినపద్య మిదియొకటి—
ఉ. ఏమితపంబు చేసి పరమేశ్వరు నేమిటఁ బూజ చేసిరో
    రాముని తల్లియు బరశురాముని తల్లియు భీము తల్లియున్
    గాముని కన్నతల్లియును గంజదళాక్షుననుంగుఁదల్లియున్
    శ్రీమహితప్రతాపుఁజగు సిద్దన తిక్కన కన్నతల్లియున్.
ఉ. శ్రీయలరార శత్రువులఁ జెందితి వార్యులు మంత్రివర్యు లా
    ర్వేలఘనుల్ నుతించి రలవేల్పుదొరల్ ముదమంది మెచ్చిరో
    లాలితశౌర్యధైర్య జయలక్ష్మి ప్రియంబున ని న్వరించె నీ
    లీలలు హెచ్చెఁ దిక్కనికళేబరమా! యిఁక నిల్చి యాడుమా!

[2]నెల్లూరుప్రాంతమునఁగల పట్టుపురాయిగ్రామానకుఁ దూర్పుభాగమునఁ బినాకినీనదీతీరమునఁ దిక్కనపాడనుస్థలము గలదు. ఆస్థలమందు గుఱ్ఱముమీఁద రౌతును జెక్కినశిల యొకటి నేఁటికిని గలదు. అది తిక్కనప్రతిమ యని స్థలజ్ఞులు చెప్పుదురు.

నెల్లూరు

సీ. ధీరుఁడై ధరయేలెఁ దిరుకాళదేవుండు
                    తిక్కనాయకుఁ డేలెఁ దేజ మెసఁగ
    మన్మసిద్ధన యేలె మహిమతో దీపించి
                    దాదినాగన యేలె ధర్మరీతి
    మనుగండగోపాలమనుజాధిపతి యేలె
                    స్వర్ణదేవుం డతిప్రభగ నేలె
    గోపినాథుం డేలె గుణపయోరాశియై
                    రమణతో శ్రీరంగరమణుఁ డేలె
గీ. తిక్కనయు మఱియొకకొన్నిదినము లేలె
    నేలె మీతండ్రి మర్యాద లెల్లఁ గలుగఁ
    గడఁక నీవేలి తందఱకంటె మించి
    శరధిగంభీర! సంగమక్ష్మాతలేంద్ర!
సీ. పాలించు నేవీట బ్రహ్మాదివంద్యుండు
                    లీల మూలస్థానలింగగురుఁడు
    దీపించు నేవీట దేవాలయంబులు
                    ధావళ్యనవసుధాధౌతము లయి

    ప్రవహించు నేవీట బ్రహ్మాండకర్పరం
                    బొరసి మిన్నులుముట్ట నున్న పెన్న
    చెలు వందు నేవీటఁ జిరకాలజీవన
                    స్వర్ణాలచెఱువు సంపూర్ణమగుచు
గీ. ప్రజలకును మన్కి సకలసంపదలకునికి
    భోగములవీడు సురపతిపురికి నీడు
    నమ్మికలటెంకి వైరులఁ జిమ్ముకొంకి
    భాగ్యనికరంబు నెల్లూరు పట్టణంబు.
సీ. ఏపట్టనంబున నెన్నంగ మున్నూట
                    యఱువది దేవాలయంబులుండు
    ఏపట్టనంబున రూపింపనన్నియు
                    నీరేడు బావు లింపారుచుండు
    ఏపట్టనంబున నెల్ల మానవులుఁ బ్ర
                    శస్తిగాంచిరి నెఱజాణలనఁగ
    ఏపట్టనంబున నే కొలమును బెన్న
                    కాల్వలచేత ముక్కాఱుఁ బండు
గీ. శివునికృపఁ బుట్టె వేమాలసెట్టిబావి
    పరఁగ జగ మెల్ల నెఱుఁగ నేపట్టణమున
    నట్టిపట్టణ మిలను సౌఖ్యముల కునికి
    పట్టనందగు నెల్లూరుపట్టణంబు.
సీ. చరియించితిని గాని జగము మూలస్థాన
                    పరమేశ్వరునివంటి భక్తవరదు
    విహరించితిని గాని వివిధభూములు [3]పల్లి
                    కొండనాథునివంటి కూర్పువేల్పు

    పరికించితిని గాని బహుదేశము లనంత
                    పద్మనాభునివంటి భవ్యమూర్తి
    వీక్షించితిని గాని విశ్వ మంతయుఁ బెన్న
                    నదివంటి దివ్యపుణ్యస్రవంతి
గీ. అరిగితిని గాని దేశదేశాంతరముల
    వేదగిరివంటి పావనోర్వీధరంబుఁ
    గాన మిన్నివిశేషముల్ గలిగి ధరఁ బ్ర
    సిద్ధికెక్కెఁ ద్రివిక్రమసింహపురము.
సీ. ఆపట్టణంబున నమరంగఁ దూర్పున
                    మాకందచందనమహితవనము
    ఆనగరంబున కటు దక్షిణంబునఁ
                    జెలువారు వేమాలసెట్టిబావి
    ఆయూరిపడమట నంభోజరాజిచేఁ
                    బ్రాకంటం బైనతటాక మమరు
    ఒప్పారు నవ్వీటియుత్తరదిక్కున
                    మున్నీటి కెదురైన పెన్న దనరు!
గీ. కలిమి నారాజధాని మార్గంబు నెన్న
    బహుళగంధర్వసింధురబంధురంబు
    రతనంపుబొమ్మ లప్పురిమణు లనఁగ
    వినుతి కెక్కెను నెల్లూరి విభవమహిమ.
శా. మల్లెల్ మొల్లలు సేమమా? శుభములా మాకందముల్ జాజులున్?
    మొల్లం బారక యుండునా? సుదతులున్ మోదంబు వాటింతురా?
    విల్లుం గోలయు (యేమరూఢమరునా?) వేమాలనూ యున్నదా
    నెల్లూరన్? బెదమసోమవీథిన కదా నీరాక జైవాతృకా!

రెడ్డిరాజులు

కాకతీయులయొద్దఁ దొలుత దండనాథులుగానుండి తత్సామ్రాజ్యము సన్నగిల్లినతర్వాతఁ బద్మనాయకులవలెనే వీరును స్వతంత్రరాజులైరి. తొలుత వీరిరాజధాని యద్దంకి. తర్వాతఁ గొండవీడు, రాజమహేంద్రవరము, కందుకూరు. వీరు మహాదాతలు. పదమూఁడవశతాబ్దినుండి వీరిపాలనము పెంపొందెను. నూఱుసంవత్సరములకంటె వీరిరాజ్యము మహోచ్ఛ్రయమున లేదు. వెల్గోటివెలమరాజులును, ఒడ్డెరాజులును బ్రబలశత్రువులై యీరాజ్య మంతరింపఁజేసిరి. ఈరెడ్లపరిపాలనక్రమమునుగూర్చి యీక్రిందిసీసపద్యము వాడుకలో గలదు. శాసనములఁ బట్టి పరిశీలించిన నిది మిక్కిలి యక్రమ మగుచున్నది.

సీ. పోలయవేమన్న పొలుపారఁ బండ్రెండు
                    వత్సరంబులు గాచె వసుధయెల్ల
    అటవెన్క ముప్పది యనపోతవేమన్న
                    వన్నెవాసికి నెక్కి వసుధ యేలె
    ధర్మాత్ముఁ డనవేమధరణీకళత్రుండు
                    పదియు నేనిట భూమి పదిలపఱిచె
    ప్రజల కుబ్బసముగఁ బదునాలుగేఁడులు
                    కొమరగి రేలెను సమయుదాఁక
గీ. ఏలెఁ గోమటివేమన యిరువదేడు
    రాచవేమన్న నాల్గువర్షములు నేలె
    మించి కట్టిరి గృహరాజుమేడ కొండ
    వీట నూరేండ్లు రెడ్లు భూవిదితయశులు.

అనవేమనృపాలుఁడు

క. కవితాకన్యకు నలుగురు
    కవి జనకుఁడు భట్టు దాది గణుతింపంగా
    నవరసరసికుఁడె పెనిమిటి
    యవివేకియె తోడఁబుట్టు వనవేమనృపా!
క. కొంచపుజగములలోపల
    నంచితముగ నీదుకీర్తి యనవేమనృపా!
    మించెను గరి ముకురంబునఁ
    బంచాక్షరిలోన శివుఁడు బలసినభంగిన్.
గీ. పందికొ మ్మెక్కి పెనుపాముపడగ లెక్కి
    మేటితామేటివీఁ పెక్కి మెట్టలెక్క
    విసివి వేసారు యనవేమవిభునిఁ జేరి
    రాణివాసంబుగతి మించె రత్నగర్భ.
క. రాకున్నఁ బిలువఁ డేనియు
    రాకకు ముద మంది చేర రమ్మనఁ డేనిన్
    ఆఁకొన్న నీయఁడేనియు
    నాకొలు వటు కాల్చవలయు ననవేమనృపా!
శ్లో. అనవేమమహీపాల స్వస్త్యస్తు తవ బాహవే
    అహవే రిపురోద్దండచంద్రమండలరాహవే!

ఈశ్లోకము ననవేమనృపాలునిపై నొకకవి చెప్పఁగా సంతసించి రాజు మూఁడువేలు పారితోషిక మొసఁగెనట. కవి నేను నాల్గువేలు (వే అను నక్షరములు) ఒసఁగిన మీరు మూఁడువే లిచ్చెదరా యనెను. రాజు నాల్గువేఁ లొసఁగితి ననెను. కవి మే మొసఁగినదే తిరిగి మాకొసఁగి పంపెదరా యనెను. రా జయిదువేలు కొమ్మనెను. కవి (ఆర్వేలనియోగి) కులమును గుంచించెదరా యనెను. రాజు ఆఱువే లిచ్చితి ననెను. కవి నేను పుట్టువుతోడనే యార్వేలవాఁడ ననెను. రాజు చాతుర్యమునకు మెచ్చి యేడువేలు కొనుమనెను. కవి సంఖ్య మంచిది కాదనెను. రా జెనిమిదివేలిచ్చి పుచ్చెను.

కాటయ వేమన

క. వెలయాలు శిశువు నల్లుఁఢు
    నిలయేలిక యాచకుండు నేగురు ధరలోఁ
    గలిమియు లేమియుఁ దలఁపరు
    కలియుగమునఁ గీర్తిగామ! కాటయవేమా!

కోమటి వేమన

ఈతని యాస్థానమున శ్రీనాథకవిసార్వభౌముఁఢు విద్యాధికారి. అమరుశతకవ్యాఖ్యాత. వేమభూపాలచరిత సాహిత్యచింతామణ్యాదికృతులకు నాయకుఁడు.

క. ఈరేడుజగము లనఁ జె
    న్నారెడు పదునాల్గుగ్రుడ్ల ననిశము ఱెక్కల్
    సారించి పొదుగుచున్నది
    కోరిక నీకీర్తిహంసి కోమటివేమా.
సీ. వీరశాత్రవరాజవృక్షముల్ పడగొట్టి
                    దుర్మార్గపురములు దుక్కిదున్ని

    చెనటి విరోధులశ.................
                    .........................
    వైరికాంతానేత్రవర్షముల్ కురిపించి
                    పగతుల యమ్ములు పంట చేసి
గీ. మొరయు మన్నీలగుంపుల మొదలు గోసి
    మెసఁగ నూరిచి తూర్పెత్తి యేకరాశి
    గాను గావించె నీకత్తి కాఁపులకొడుకు
    గాయ గోవాళ జగనొబ్బ గండవేమ.

ఈకోమటి వేమారెడ్డి యాస్థానమున మామిడిసింగనాదులు మంత్రులు. తురగారామన యనుమంత్రి దుష్టుఁడట! ఒకకవి వానిఁ బేర్కొనె.

క. కోమటి వేమనత్యాగము
    భూమిఁ బ్రసిద్ధంబు కల్పభూజముచేతన్
    బామున్నపగిదిఁ దురగా
    రాముం డున్నాఁడు చేరరా దెవ్వరికిన్.

సాళువగుండ నరసింహరాయలు

ప్రౌఢదేవరాయలయనంతర మీతఁడు కర్ణాటరాజ్య మాక్రమించుకొని పరిపాలించెను. క్రీ.శ. 1480 ప్రాంతములందీరాజురత్నము కలఁడు. డిండిమభట్టారకుఁ డను సంస్కృతకవి యీతని దిగ్విజయాదికమును వర్ణించుచు సాళ్వాభ్యుదయ మను పదునాల్గు సర్గముల మహాకావ్యమును రచించెను. పిల్లలమఱ్ఱి పినవీరభద్ర కవి యీతని కంకితముగా జైమినిభారతము రచియించెను. ఈతనిపేర “నవరత్న”పద్యములును “సప్తాంగపద్ధతి”పద్యములును రచింపఁబడినవి. వీనికిఁ గర్త పినవీరభద్రుఁడు కాఁదగును.

నవరత్నములు

సీ. దినదినంబును నెల్లదివిజులఁ బోషించుఁ
                    గైరవబంధుఁ డేకార్యకాంక్ష?
    అప్పటప్పటికి లోకాంధకారము మాన్చు
                    నినుఁ డేమిలాభంబు నిచ్చగించి?
    సచరాచరం బైనజగతియెల్ల భరించు
                    ఫణిపతి యేఫలప్రాప్తిఁ జూచి?
    అదనున వర్షించి యఖిలజీవులఁ బ్రోచు
                    జలధరం బే ప్రయోజనము గోరె?
గీ. పరహితం బాత్మహిత మని పరమపుణ్యు
    లన్యు లొనరించుమేలు తా రాసపడరు
    సకలభాగ్యోదయ కఠారిసాళువాంక!
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. ఆకారసంపద ననుకరించినవిద్య
                    విద్యకుఁ దోడైన వినయగుణము
    వినయగర్భిత మైన విక్రమారంభంబు
                    విక్ర మార్జితమైన విభవగుణము
    విభవానుగుణమైన వితరణోన్మేషంబు
                    వితరణోపేతమై వెలయుప్రియము
    ప్రియవచోనిరతమై పెంపొందు సత్కృతి
                    సత్కృతిఁ జేకొన్న చారుకీర్తి

గీ. చారుకీర్తికి నెలవైన పౌరుషంబు
    పౌరుషంబున వర్తించు భాగ్యభూమి
    భూమి పాలించు నృపతికి భూషణములు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. సర్వజ్ఞుఁ డగుమంత్రి నవదరించిన రాజు
                    కార్యఖడ్గమ్ముల క్రమ మెఱుంగు
    కార్యఖడ్గమ్ములక్రమ మెఱింగినరాజు
                    బహువిధంబుల మూలబలముఁ గూర్చు
    బహువిధంబుల మూలబలముఁ గూర్చినరాజు
                    శత్రుల నవలీల సంహరించు
    శత్రుల నవలీల సంహరించినరాజు
                    ధరణి యేకాతపత్రముగ నేలు
గీ. కావున మహాప్రధానాగ్రగణ్యుబుద్ధి
    యధిపుసామ్రాజ్యమునకు సర్వాంగరక్ష
    రాయమలవరగండ! వీరప్రచండ
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. సంగీతధర్మంబు సాహిత్యధర్మంబు
                    తెలియనేర్చుట ప్రజ్ఞ గలఫలంబు
    వితరణప్రౌఢియు వినయసంరూఢియుఁ
                    గైకొంట సంపద గలఫలంబు
    కుజనశిక్షణమును సుజనరక్షణమును
                    గల్గుట నిజశక్తిగలఫలంబు
    బ్రాహ్మణభక్తియుఁ బరహితశక్తియుఁ
                    గావింపు విభవంబుగలఫలంబు
గీ. బట్టు విప్రుండు విద్యార్థి పరఁగ దాత
    కిదియ లక్షణ మెన్నంగ నెలమి నెపుడు

    సాళువక్షోణిపతివంశజలధిచంద్ర!
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. బంగారునకు సౌరభము జనియించియట్లు
                    కులజుఁ డుత్తమగుణకలితుఁడేని
    కస్తూరి నికరంపుఁ గాంతిఁ జెందినయట్టు
                    లుత్తమోత్తముఁడు శ్రీనొందెనేని
    భావింపఁ జెఱకునఁ బండు పండినయట్లు
                    నెఱదాత ప్రియవచోనిరతుఁడేని
    అలరుగందపుమ్రాన నలరు పూచినయట్లు
                    శ్రీమంతునకుఁ గీర్తి చెందెనేని
గీ. భవ్యగుణసాంద్ర! సకలవైభవసురేంద్ర!
    సహజదానశిబీంద్ర! భాషాఫణీంద్ర!
    సాళువక్షోణిపతివంశజలధిచంద్ర!
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. వాహ్యాళిచో మత్తవారణసూకరా
                    శ్వములఁ గన్గొనుచోట సాముచోట
    ఆరగించెడిచోట నౌషధంబులుచోట
                    నిద్రవోయెడిచోట నెలఁతచోట
    వేఁట వెళ్ళెడుచోట విందుచెప్పినచోట
                    నాటపాటల వేడ్క నలరుచోట
    వైద్యుచే ......... నిఱకటం బైనట్టి
                    తెరువున ననిమొనల్ దీర్చుచోట
గీ. దైవతస్థానవైభవతతులచోటఁ
    గ్రొత్తవారలఁ గాన్పించుకొనెడుచోట
    నాత్మరక్ష యేమఱకుండునతఁడె రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

సీ. ప్రియముతో నిజమాతృ పితృభక్తి యొనరించు
                    ధర్మాత్ములకు వేఱె దైవ మేల?
    మమతమై సర్వభూతములందు దయగల్గు
                    ధన్యులకును వేఱె తపము లేల?
    సరససత్కవికావ్యసరణి వినోదించు
                    నతిపుణ్యులకు వేఱె యమృత మేల?
    సతతంబు సత్యభాషానిష్ఠ వదలని
                    కృతకృత్యులకు వేఱె క్రతువు లేల?
గీ. ప్రాణప్రదమైన లలితాంగిఁ బాయకుండు
    పురుషులకు వేఱె దేవేంద్రపుర మదేల?
    రాయచౌహత్తమల్లధరావరాహ
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. ధనికులఁ గావింపఁదగదు సోదర్యుల
                    బడవాలుఁ జేయఁ జొప్పడదు కుటిలు
    తగదు దుర్గాధిపత్యము జ్ఞాతి కొసఁగంగ
                    ధనము కావలిఁ బెట్టఁదగదు ఖలుని
    దేశాధికారిఁగాఁ ద్రిప్ప నొప్పదు క్రూరుఁ
                    జనవు ప్రమాదంబు సాహసునకు
    కాదు భీరుఁ దలారికము ప్రతిష్ఠింపంగఁ
                    గీడు వంచకుని వాకిటను నిల్ప
గీ. నమ్మ ననుమాన మగువాని నమ్మఁదగదు
    నమ్మియుండినచోట వ్రణంబు గనిన
    వ్రణమునకుఁ దగఁజేయంగ వలెఁ జికిత్సఁ
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. మంత్రాధిపునితోడ మర్మజ్ఞుతో రాజ
                    హితునితోడను నిగ్రహింపఁజనదు

    అతిమతాంధునితోడ నంగనాసక్తుతోఁ
                    జెడుగుతోఁ దనయాత్మ చెప్పఁదగదు
    నిందితుతోఁ బరనిందాభిలాషితోఁ
                    గ్రూరకర్మునితోడఁ గూడఁ జనదు
    రాజవిద్వేషితో భూజనద్రోహితో
                    వంచకుతోఁ బొత్తు వలదు సేయ
గీ. పరఁగ నీరీతిఁ జరియించు నరవరునకు
    నూర కెవ్వారు మార్ఖులై వైరు లగుచు
    నడచిరేని యవశ్యంబు చెడక పోరు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సప్తాంగపద్ధతియనుపేరిపద్యము లేడును జేకుఱినవి కావు. చేకుఱునమట్టున కుదాహరింపఁ బడుచున్నవి.

రాజపద్ధతి


సీ. ఉత్తమకులజుఁడై యుద్యోగశీలుఁడై
                    భాషలలిపు లెల్లఁ బరికళించి
    వాక్పటుత్వము గల్గి వ్యసనము మాని య
                    ర్థము గూర్ప దక్షుఁడై శ్రమము దెలిపి
    ప్రజలకుఁ జల్లనై బలములఁ బోషించి
                    సుకృతియై శూరుఁడై శుద్ధి మెఱసి
    రాజదోషములు భూరమణుఁ బొందఁగనీక
                    పరమర్మభేదియై వెర నెఱింగి
గీ. గుప్తమంత్రుఁ డై కుశలుఁ డై కొలు వెఱింగి
    చారచక్షుఁ డై దేశవిచార మరయు
    నట్టి సన్మంత్రి గలిగిన యతఁడు రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

కోశపద్ధతి


గీ. తనభుజార్జిత మైనయర్థంబు దెచ్చి
    యాయ మెఱిఁగి వ్రయించుచు ననుదినంబు
    నరసి భండార మొడఁగూర్చునతఁడు రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

రాష్ట్రపద్ధతి


సీ. వర్ణాశ్రమంబుల వరుస దప్పఁగనీక
                    జారచోరాదులపే రడంచి
    దేవభూదేవతాస్థితులు పాలించుచు
                    నల్పువిన్నపమైన నాదరించి
    అబలుని బలవంతు లడరి త్రోవఁగనీక
                    వ్యవహారధర్మముల్ తివిరి నడపి
    కొలువుమన్నీలలోపలిపోరు లడఁగించు
                    గళ్ళ కూళ్ళకు నలజళ్ళు మాన్పి
గీ. నిఖిలదేశంబులకును జక్క నిజగృహంబు
    లరయువిధమున దివ్యాజ్ఞ లనువుపఱిచి
    యప్రమత్తుఁడై ధర యేలునతఁడు రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

దుర్గపద్ధతి


సీ. తృణకాష్ఠజలసమృద్ధిని బ్రధానంబుగాఁ
                    గలకాలమును సమగ్రంబు సేసి
    కోటి యాళ్వరి కొమ్ము క్రొత్తళంబు లగడ్త
                    లట్టళ్ళు యంత్రంబు లనువుపఱిచి

    ధాన్యంబు లాదిగాఁ దగుసవరణ లెల్ల
                    నొకటియుఁ గొదవ లేకుండ నునిచి
    నీతిమార్గంబున నెనరైన దొరలను
                    బలసి పాళెములందుఁ గొలువు నిలిపి
గీ. నగరికావలి సావధనముగ నునిచి
    చోద్య మిది యెట్టివారి కభేద్య మనెడు
    నట్టు దుర్గంబులం దుండునతఁడు రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

బలపద్ధతి


సీ. బేడు పైతరువులు పెట్టక చేజేత
                    ఠవణదప్పకయ జీతంబు లిచ్చి
    చేరువదొర లిచ్చుజీతంబు వచ్చుట
                    రాకయుండుట విచారంబు చేసి
    యగువలై తల..............తగ్గినైనను
                    గట్టకుండిన వారకముగ నిచ్చి
    రణరంగమునఁ గానరా మెలంగినచోట
                    నుచితంబు లొసఁగుచు నుపచరించి
గీ. ప్రాఁతవారిని గొల్వాసపడనివారి
    మూలబలముల మన్నీల మొనలకంటె
    నంగళంబుగ నేలినయతఁడు రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

మల్కిభరామ్

ఈతురుష్కప్రభువు క్రీ.శ.1550 తరువాత నాంధ్రదేశము నాక్రమించుకొని పరిపాలన మొనర్చినవాఁడు. ఈతనివిజయముల నీచాటువు చాటుచున్నది.

ఉ. ధాటిగ నేఁగి యుద్దగిరిఁ దార్కొని వేంకటరాజుఁ దోలి ముం
    గోట లగ్గపట్టి వినుకొండయు బెల్లముకొండ తంగెడల్
    పాటిమెయిన్ హరించి మఱి బల్మిని గైకొనెఁ గొండవీడుఁ గ
    ర్ణాటకరాజధాని యిభరాముఁడు బాహుబలంబు మీఱఁగన్.
ఈతనిపేర “ఇభరాం పట్టణ”మని నేఁటికిని బుర మొకటి కలదు. తురుష్కుఁ డైనను నీతఁ డాంధ్రభాషయం దత్యంతాదరము కలవాఁడై యనేకాంధ్రకవుల నాదరించి ధన మొసఁగి మిక్కిలి విఖ్యాతి సెందెను. పొన్నిగంటి తెలగనార్యుఁ డనుకవి యయాతిచరిత్ర మను నచ్చతెల్గుప్రబంధమును, అద్దంకి గంగాధరకవి తపతీసంవరణోపాఖ్యానమును, నీతని ప్రాపున రచించిరి. కవీశ్వరులగోష్ఠియం దీతనికిఁ గుతూహలము మెండు. ఒకప్పుడు మల్కిభరామ్ ప్రభువు తనయాస్థానమునకుఁ బెమ్మసాని తిమ్మానాయని, అనంతపురపు హండెయప్పను, మట్ల అనంతరాజును, బంగారేచమనాయని, పేర మల్లారెడ్డిని, వారి వారి కవీశ్వరులతోఁ బిలిపించి, వారినిఁ బొగడిన పొగడ్తలు వినిపింప నాయాకవీశ్వరులఁ గోరెనఁట! ఆకవీశ్వరులు చదివిన పొగడ్తపద్యము లివి—
ఉ. చాలు గుఱాలు మాగడినిసంగడిరాజులు గొల్వరం డహో
    హాలహలోగ్రఫాలదహనాక్షునియంతటిధాటివాఁడు నా
    యేలిక వేంకటాద్రిధరణీశుని తిమ్మఁడు పెమ్మసాని భూ
    పాలుఁడు హెచ్చుధాత్రిఁగల పార్థివు లెల్లరు లొచ్చు వానికిన్.
ఉ. మట్టకరాఁడు బెట్టుఱికి మన్నెకుమారులసీమ ధూళిగాఁ
    గొట్టక మానఁడేకద యకుంఠితసింహడలాటరాయఁ డీ
    పెట్టినదండుఁదీఁడు రణభీష్ముఁడు హండియయప్పశౌరికిన్
    బెట్టుఁడు వేగ దండములు బింకము లేటికి శత్రుభూపతుల్!

ఉ. కొద్దినిరాఁడు దిం డుఱికి కోటలుకొమ్మలు గొన్నశూరుఁ డా
    గద్దరిగప్పి రాచపులి గండరచాలుఁడు మ ట్లనంతుఁ డే
    ప్రొద్దును వైరిభూభుజులపొంక మడంపనె పుట్టినాఁడు మీ
    పెద్దఱికాలు సాగ విఁకఁ బ్రేలకుఁడీ కుడిమన్నెభూపతుల్!
ఉ. టెక్కునఁ గొండతోఁ దగరు డీకొని తాఁకినజోకగాక యీ
    బిక్కపకీరుమన్నెసరిబేసిదొరల్ మొనలందు నిల్వనా!
    నిక్కము బంగరేచనృప నీవు రణస్థలి మోహరించినన్
    బక్కున లోకముల్ పగిలి పాఱవె కూలవె దిగ్గజంబులున్?
చ. బలపురిభోగ! కృష్ణనరపాలునిపేరకుమారమల్ల! మీ
    కలితయశఃప్రభావములు కన్గొనలే కలకట్టుమన్నెమూఁ
    కలు తల లొల్లరో బిరుదుగద్దియముల్ చదివించుకొందు రౌ
    కొలఁది యెఱుంగనేర కలకుక్కలు చుక్కనఁ జూచి కూయవే.
పేరమల్లారెడ్డిపొగడ్తకుఁ దక్కినరాజు లెల్లరు నాగ్రహభరితులై యుద్ధసన్నద్ధు లయిరట! అంతట మల్కిభరామ్ ప్రభువు “ఈపొగడ్తవలనఁ బొగడినవారికి న్యూనత యేర్పడును గాని మీ కేమియుఁ గొఱఁతకల్గ”దని చెప్పి వారిని శాంతింపఁజేసెనఁట!

ఈతనిపైఁ జెప్పఁబడిన చాటువులు—


సీ. నవ్వెనా సంగీతనాదభేదవిధిజ్ఞ
                    ధీరాత్ములకుఁ బదినూఱు లిచ్చి
    రమ్మనెనా సభాప్రౌఢసత్కవివర
                    జాలములకుఁ బదివేలు నిచ్చు
    కూర్చుండు మనియెనా గురుతరశాస్త్రజ్ఞ
                    లక్షణవిదులకు లక్ష యిచ్చు

    సాబాసురా యన్న సకలాశ్రితానేక
                    కోవిదులకు మెచ్చి కోటి యిచ్చు
గీ. బళిర! చతురబ్ధిమేఖలాకలితధాత్రి
    చక్రనిర్వక్రపాలనాచారుకీర్తి
    రమ్యముక్తాతపత్రరారాజితుండు
    చారుతరమూర్తి! యిభరాముచక్రవర్తి!
సీ. కర్ణాటకాధీశుకంఠమాలికమీఁదఁ
                    గురురాజుముత్యాలగొడుగుమీఁద
    వింధ్యదేశాధీశువెల్లవల్వలమీఁద
                    గౌళేశువజ్రాలగద్దెమీఁద
    పాంచాలభూమీశుపట్టుపల్లముమీఁదఁ
                    బాండ్యభూపతివెండిబరణిమీఁద
    బంగాళజననాథుపాంచజన్యముమీఁదఁ
                    గుకురేంద్రుధవళగోళకముమీఁద
గీ. ఆడిపాడించు నటియించు నవఘళించు
    మెచ్చి కుప్పించుఁ గెరలించు మేబళించు
    సంతసంబున నీకీర్తి జలజనేత్ర
    మానవోపేంద్ర! యిభరాము మండలేంద్ర!
ఉ. రా యిటు భట్ట! యేమి కవిరత్నమ! పిల్చితి; వీవి పద్యముల్;
    ఏయవనీశుపై? నృపకులేశ్వరుఁడౌ నిభరాముశాహిపై;
    నాయతపుణ్యమూర్తి యతఁ డర్థులు వేఁడిన నిచ్చు; నిచ్చునా
    వేయును రెండువేలు పదివేలును లక్షలుఁ గోట్లు నిచ్చు; నౌ!

కవిత్వము నేర్చినవారికిఁ గాని మల్కిభరామ్ ప్రభువు సమ్మానము మెండుగాఁ గావించుచుండెడివాఁడు కాఁడఁట! ఒకప్పుడు కవిత్వము నేరని చతురు లిర్వురు “కరయుగమును” “యరలవమదనస”యను కందపద్యములను దలలు మార్చి మల్కిభరాము ప్రభువున కన్వయించునట్లు చదివి పెద్దగా సమ్మానింపఁబడిరఁట.

క. కరయుగమును జరణంబులు
    నురము లలాటస్థలంబు నున్నతభుజముల్
    సరి ధరణి మోసి మ్రొక్కిరి
    మఱిమఱి నీశత్రులెల్ల మల్కిభరామా!
క. యరలవమదనస యనుచును
    బరుపడి నీయక్షరములు భయనయతతులన్
    నిరతమును వ్రాయనేర్చిరి
    మఱిమఱి నీపుత్త్రులెల్ల మల్కిభరామా!
ఉ. ఏడు కులాద్రు లెక్కి వెస నేడు పయోధులు దాఁటి లీలమై
    నేడవు దీవులం దిరిగి యేడుగడన్ విహరించి కీర్తి యీ
    రేడు జగమ్ములన్ వెలయ నేచిన మల్కిభరాముచంద్రుఁ డే
    యేడవచక్రవర్తి పదునేడవరాజు ధరాతలమ్మునన్.
ఉ. రాజును రాజుగాఁ డతఁడు రాహుముఖంబునఁ జిక్కె, వాహినీ
    రాజును రాజుగాఁ డతఁడు రామశరాహతిఁ దూలె, దేవతా
    రాజును రాజుగాఁ డతఁడు రావణసూతికి నోడె, నాజిలో
    రాజనరాజు మల్కి యిభరాముఁడె రాజు ధరాతలంబునన్.
ఉ. రాముఁడు దుక్కిముచ్చు, రఘురాముఁడు క్రోఁతులరాజు, రేణుకా
    రాముఁడు పోటుబంటు, పటురాగసమంచితుఁ డైనగోపికా
    రాముఁడు వెఱ్ఱిగొల్లఁ డిఁక రాష్ట్రములందు సమానులేరయా
    రాముల నెంచిచూడ నిభరామ మహీధవ భవ్యవైభవా.
చ. మలికిభరామభూప! మహిమండలరాజకులప్రదీప! నీ
    పలుకు శిలాక్షరం బితరపార్థివకోటులపల్కులన్నియున్

    జలలిపు లెండమావులు (........) బూడిదపొల్లునీరుబు
    గ్గలు వడగళ్ళు (..........) శారదమేఘజాలముల్!
ఉ. రార విధాత! యోరి వినరా! తగురా! తలకొట్లమారి! ని
    స్సారపులోభిరాజులను జంపక మల్కిభరామభూవరున్
    జారుయశోధనున్ సుగుణిఁ జంపితి వర్థుల కేమి దిక్కురా
    చేరిక నింతరాజును సృజింపఁగ నీతరమా వసుంధరన్?

మైసూరి చిక్కదేవరాయలు


ఈతఁడు పదునేడవశతాబ్దియందు మైసూరుప్రభువై పేరెన్నిక గన్నవాఁడు. ఈతనిపేర సంస్కృతాంధ్రకర్ణాటభాషలలోఁ గొన్ని గ్రంథములు రచింపఁబడినవి.
సీ. స్వస్త్యస్తు విశ్వవిశ్వంభరాభరణైక
                    దక్షదక్షిణభుజాస్తంభ! నీకు
    విజయోస్తు విర్వక్రవిక్రమక్రమకలా
                    పరిభూతవిద్విషత్పటల! నీకు
    మహనీయతాస్తు సామంతచూడారత్న
                    బిరుదాంగస్ఫారచరణ! నీకు
    హర్షో౽స్తు పృథుశాశ్వతైశ్వర్యధూర్ధుర్య
                    సౌందర్యధుర్యతాశ్చర్య! నీకు
గీ. వివిధవిభవో౽స్తు సత్కీర్తివిజితరజిత
    తారకాదారతారకాదారవార
    హారనీహారదివిషదాహారరుచిర
    హార! మైసూరిచికదేవధీర! నీకు.

సీ. శ్రీమించు జడదారి చికిలి డెందపు టాట
                    పట్టువాఁ డపరంజి పట్టువాఁడు
    తన భక్తులగువారి తప్పు లన్నియును మ
                    న్నించువాఁ డనుకంప నించువాఁడు
    తలఁచినఁ జాలుఁబాతకము లన్నియు రాచు
                    పేరువాఁ డరదంపుఁబేరువాఁడు
    తఱచు లెవ్వియులేక తానయై త్రైలోక్య
                    మేలువాఁ డిందర మేలువాఁడు
గీ. రంగరమణుఁ డభంగసామ్రాజ్యలక్ష్మి
    నొసఁగుఁ గాత నిజాంఘ్రిసారసమదాళి
    పటలదరివీరమకుటాగ్రఘటితదివిజ
    రాజమణికిని జికదేవరాజమణికి.
సీ. జంగమార్చనము భూషాయమాణమహాభు
                    జంగమార్చనము నేజాణ సేయు
    చారదర్శనము సజ్జనశుద్ధమగు శివా
                    చారదర్శనము నేసరసుఁ డెఱుఁగు
    దేవమాన్యములు సంభావితాభోగ భూ
                    దేవ మాన్యములు నేధీరుఁ డొసఁగు
    రణపరాక్రమము దుర్ధర ధరాధరవిదా
                    రణపరాక్రమము నేరాజు గాంచు
గీ. అతఁడు పొగడొందు నెందు నుదగ్రనిజభు
    జాగ్రజాగ్రన్మహామండలాగ్రఖండి
    తాగ్రహగ్రహదుర్నిగ్రహారిహారి
    పాలనవిహారి చిక్కభూపాలశౌరి.
సీ. సిరి మించు ................................
                    పఱపువాఁ డొకఁడు నీ యొఱపువాఁడు

    కళకు బంగరుపట్టు గరుల సింగిణి కోపుఁ
                    బఱపువాఁడొకఁడు నీయొఱపువాఁడు
    కడలిరాయలతరంగముల చిందులు పొందు
                    పఱపువాఁ డొకఁడు నీ యొఱపువాఁడు
    నునుఁబూల రెండు నొండుగ నేయు విలువిద్య
                    పఱపువాఁ డొకఁడు నీ యొఱపువాఁడు
గీ. విక్రమవిభూతి గానవాగ్విలసనముల
    నౌర! యాహవధీర! సాహసకుమార!
    కోవిదవిధేయ! హగలగగ్గోలురాయ!
    రాజదేవేంద్ర! చికదేవరాజచంద్ర!
సీ. కడఁగి వీరాధివీరుఁడు వచ్చె నని పూరి
                    గఱచువారును దారి మఱచువారు
    హగలుగగ్గోలురాయఁడు వచ్చె నని చెట్లఁ
                    దారువారును గట్లఁ జేరువారు
    గడిమన్నెదొరలగండఁడు వచ్చె నని కూలి
                    పొరలువారలు జాలి నొరలువారు
    ఘోరాజివిక్రమార్కుఁడు వచ్చె నని నీళ్ళు
                    చొచ్చువారును గాళ్ళు చచ్చువారు
గీ. నగుచుఁ దారెలగోల్ హళాహళికి నళికి
    పఱచునిజబల మాజికిఁ బఱపలేక
    పఱచె నిక్కేరిశివ్వభూవరుఁ డయారె
    రాజదేవేంద్ర! శ్రీదేవరాయచంద్ర!
సీ. డాసి ఢిల్లీకవాటములు వాటములయ్యె
                    గోలకొండకుఁ గొత్తళాలు బలిసె
    తగవిజాపురి నగడ్తలు పొగడ్తలు గాంచెఁ
                    గటకార్గళములు మిక్కుటము లయ్యె

    ప్రబలి కల్బరిగవప్రములు దీవ్రము లయ్యె
                    నాగడా నుక్కుడా లతిశయిల్లె
    కొల్లూరు పలుదెఱంగులఫిరంగులఁ బొల్చె
                    బెడదకోటకు రస్తు బెడిద మయ్యె
గీ. ఔర తొల్జగడాన వఱిమి తఱిమి
    నిక్కునిక్కేరిశివ్వపనేని సరగ
    విఱుగఁ బొడిచిన యావార్త విన్ననాఁడె
    యాహవోపేంద్ర! దేవరాయక్షితేంద్ర!
మ. కడిమిన్ మైసురిదేవరాయలకు రంగస్వామి వెన్నాసగా
    నడువన్ దండి నఖండచండిమఖండాల్వూని చాముండి యె
    ల్లెడలన్ దోడును నీడ యై నడువఁగా నిక్కేరిలండీలవం
    గడపుం బ్రా పయి నిల్చె నంతకుఁ డహంకారంబు దా నెట్టిదో.
సీ. చూచినఁ జాలదా సుల్తాన్మహమ్మదు
                    పాదుసాయెదఁ దాకు నీదుబాకు
    ఎదిరినఁ జాలదా యిక్కేరిశివ్వప
                    నేనిపాలిటిమిత్తి నీదుకత్తి
    కవసినఁ జాలదా రవణించురాయదు
                    నేదారులకుమారి నీదుచూరి
    మలసినఁ జాలదా మథురతంజాపురీ
                    నేతలపై దూరు నీదుబారు
గీ. పరనృపతు లెంత నీయంత దొరకు రాయ
    భేరికాభూరికాహళాభీలమకర
    మర్తు బాంకుశదోనేజమహితబిరుద
    రాజదేవేంద్ర! శ్రీదేవరాయచంద్ర!
ఉ. మీజముదాడివాఁడి కడిమిం గడి మించినదుండగీలఁ జెం
    డేజముదాడి యొక్కురవడిన్ రవడిండెడుమీకడింది ఖం

    డాజగడంబు కవ్వడి కడంగెడు పెన్ జగడం బయారె నీ
    తేజులు దేవరాయనృపతీ! జగతీతరుణీపురందరా!
మ. కడిమిన్ మైసురి దేవరాయమణి ఖడ్గాఖడ్గిచేఁ బోరుపా
    రిడినన్ డీకొని నిల్వలేక యిహిహీ యిక్కేరి శివ్వప్పనా
    యఁడు దానూడనిఁ బాడెఁగాక కళ్యాణాగడాంబాగడా
    గడవై రాగడశాగడాసహగడాఖానుల్ మదింగుందఁగన్.
మహాస్రగ్ధర. గడిసీమల్ దేవరాయగ్రణిఁ గనిబెగడుల్ గాంచుటేవింతవైరా
    గడరాడాలాహురాంబాగడశహగడమక్ఖామహల్గోలకొండా
    గడఢిల్లీఘాహురాసాగరకలుబరగీఖానవర్గంబు తడ్ఢా
    క్కడమాత్కారం బటంచున్ గడగడ వడఁకున్ గర్జ విన్నప్పు డెల్లన్.
మ. కలకాలం బరియైన శివ్వసుధాకాంతుండు శ్రీరంగరా
    యలఁ జేపట్టుక నేఁడు తా గెలుచునా యాచంద్రతారార్క మా
    జలజాతప్రబవాభవాదిసురపూజన్ గాంచు శ్రీరంగరా
    యలు చేపట్టిన దేవరాయల కసాధ్యం బెద్దియుం గల్గునో!
మ. గడిసీమల్ బెగడన్ విజాపురము వేఁగన్ గోలకొండన్ హడా
    హడి పుట్టన్ గటకంబు డంబుచెడి వ్రయ్యన్ జెంజితంపూపురుల్
    వడఁ కందన్ మథురన్ మహాభయము పర్వ న్నీ బలం బాజికిన్
    వెడలున్ జేకొనువార లేరి యిఁక నుర్విన్ దేవరాయాగ్రణీ!
చ. గడగడ నన్యభూమి వడఁకన్ గడకన్నులఁ గెంపునింపు న
    ల్గడగడిరాజు లెల్ల నళుకందళుకన్ జిగివాలుఁ బూని పో
    రడపులరాతికోటు లరయన్ నెరయందపుఁదేజి నెక్కునీ
    పుడమిని దేవరాయనృపపుంగవుఁ డీఘనుఢాక యెట్టిదో!
శా. కట్టున్ మట్టును మీఱు నగ్గలికలగ్గల్ పట్టి యీరోడ్డు తాఁ
    గట్టల్కం జలపట్టి కట్టుకొని యక్కారెడ్డిఁ జేపట్టు గాఁ
    బట్టెన్ బట్టినమాత్రమా కరుణచేఁ బాలించి లాలించి చే
    పట్టెన్ మాయురె చిక్క దేవధరణీపాలుండు సామాన్యుఁడే?

మ. ధరణీచక్రమవక్రవిక్రమముచేతన్ నేనె సాధించి భూ
    సురులం బ్రోవనె పుట్టినాఁడ నిదె యంచున్ వామపాదంబునం
    బిరుదుంబెండెము పెట్టినాఁడవఁట యెంతే మమ్ముఁ బోషింప నీ
    కరుదే మైసురిదేవరాయనృపచంద్రా! సాంద్రతేజోనిధీ!
మ. శ్రీరంగైకవిహారి శౌరి భువనక్షేమంకరప్రాభవో
    దారస్ఫారకృపాకటాక్షములచేత న్విశ్వవిశ్వంభరా
    ధౌరంధర్యకళావిశేషవిలసద్బాహార్గళుం డైనమై
    సూరి శ్రీచికదేవరాయలకు నిచ్చున్ శాశ్వతైశ్వర్యముల్.
సీ. కురు విరాట వరాట కరహాటనృపజూట
                    తటకిరీటములపైఁ దాఁకితాఁకి
    చోళ నేపాళ పాంచాల భూపాలవి
                    స్ఫాలఫాలములపైఁ వ్రాలి వ్రాలి
    యంగ గౌళ కళింగ వంగ బంగాళరా
                    డుత్తమాంగములపై నుఱికి యుఱికి
    కకుర కాశ కరూశ కోసలక్ష్మాధీశ
                    మాంసలాంసములపై మలసి మలసి
గీ. యెవ్వనిభుజాసి జయలక్ష్మి నెసఁగియుండు
    నతఁడు పొగడొందు నెందును నసమసమర
    విసృమరచమూసమూహ సాహసధురాప
    రాచితనకారి చికదేవరాయశౌరి.
సీ. కడఁగివై రాగడాగడగడాగడపడం
                    తులపాపటలకు సిందూరరజము
    గోలకొండబెడందకోటవిజాపుర
                    స్త్రీలచన్నులకుఁ గాశ్మీరరసము
    కటకకళ్యాణమక్ఖావధూకబరీభ
                    రములకుఁ జంపకప్రసవసమితి

    ఆముదానగరఢిల్లీమాహురాపురాం
                    గనలమోవులకు లాక్షాద్రవంబు
గీ. తానయై యుండు నేయశోధనునితేజ
    మతఁడు పొగడొందు నెందును నసమసమర
    సాహసకళావిహారి దుస్సహవిరోధి
    రాణ్మదవిదారి చికదేవరాయశౌరి.
సీ. గడిదొరల్ గడగడ వడఁక నీరోడుపై
                    గగ్గోలుపడి కోట గట్టుకొనియె
    దిక్కుదిక్కులవార్త కెక్కునక్కారెడ్డి
                    నట్టిట్టుచేసి చేపట్టు పట్టె
    తోడ్తోడ గంధసింధురసైంధవవ్రాత
                    ముడివోనికడిమిచే నొడిసితెచ్చె
    శ్రీదేవితో జయశ్రీ లెదుర్కొనుచు రాఁ
                    గీర్తిప్రతాపవిస్ఫూర్తిఁ గాంచె
గీ. ఔర కేతనపటపటాత్కారధీర
    కరటిఘీంకారపటహభాంకారవీర
    వారహుంకారచాపటంకారఘోర
    రణవిఘటితారి చికదేవరాయశౌరి.
గీ. పంజరమున నుంచి పండ్లు చక్కెర లిచ్చి
    మాట నేర్పి చిలుక మనుపునట్లు
    నిం డ్లొసంగి ధనము లిచ్చి విద్యలు నేర్పి
    ప్రోవు బుధులఁ జిక్కదేవవిభుఁడ.
లయగ్రాహి. లిబ్బివిరిబోణిదయ గుబ్బతిలుసంపదల
                    నుబ్బుచికదేవవిభునిబ్బరపుఁదేజం
    బబ్బురము లైనతరిమబ్బులన పైఁబడదు
                    గబ్బితనపుందురుకబెబ్బులులబిబ్బీ

    గుబ్బెతలతండములసిబ్బెపుమిటారివగ
                    లబ్బుబిగిగుబ్బచనుగుబ్బలులమీఁదన్
    జొబ్బిలుమృగీమదపుగబ్బులు వెసం దొలఁగ
                    ద్రొబ్బుచు దిగంతముల గెబ్బుచు మెలంగున్.
చ. ఒకచెలి నొక్కచే వెనుక నుండి కనుంగవ మూసిపట్టి వే
    ఱొకకర మెత్తికొ మ్మనుచు నొక్కతెకు గనుసన్న చేసిన
    న్నొకపరి ముద్దు వెట్టుకొన నొక్కతె వెంటనె వచ్చి మెచ్చె దా
    నికిఁ జికదేవరాయ లొకనేర్పున వంచన సేయకుండునే?
సీ. నెనరుఁజూపులు వాఁడిఁ దనరుతూపులు భక్తి
                    పరులపై నరులపైఁ బఱపువాఁడు
    చుట్టుకైదువుఁ దమ్మిఁ బుట్టునైదువు నైజ
                    కరమున నురమునఁ గలుగుఁవాఁడు
    చందుఁగేరెడుతమ్మినిందుమీఱెడుశంఖ
                    రాజంబు తేజంబు గ్రాలువాఁడు
    కెంపుపావలు విడియంపుఠేవలు నాత్మ
                    పదముల రదములఁ బరఁగువాఁడు
గీ. రంగరమణుఁ డభంగసామ్రాజ్యలక్ష్మి
    నొసఁగుఁగాత నిజాంఘ్రిసారసమదాళి
    పటలదివీరమకుటాగ్రఘటితదివిజ
    రాజమణికిని జికదేవరాజమణికి.
సీ. అరికాంతలముసుంగుతెరలఁదెంపరలాడి
                    కడుఁ బొగడొందు జిష్ణుఁడవు నీవు
    కళలచే విబుధలోకముల కెంతయుఁ బ్రీతి
                    నెఱపఁ జాలినకళానిధివి నీవు
    సర్వసర్వంసహాచక్రంబు జీవనా
                    కలనచే నలరించు ఘనుఁడ వీవు

    మహనీయముగ సర్వమంగళావాప్తిచేఁ
                    గర మొప్పు రాజశేఖరుఁడ వీవు
గీ. అవుర! నృపమాత్రుఁడవె మహోదగ్రనిజభు
    జాగ్రజాగ్రదనర్గళోగ్రాసిజప్ర
    తాపతపనప్రతాపితోద్దండరిపునృ
    పాలి శ్రీచిక్కదేవభూపాలమౌళి.
మ. అమృతం బానకయున్నఁ దద్రుచులపై వాసక్తియే కల్గదా
    యమృతం బానినమీఁద మానవశమా? యాహా! భవద్విస్ఫుర
    త్కమనీయోక్తులు నట్లగాదె? యిఁకమీఁదన్ గ్రోల కెట్లుందు నే
    నిమిషంబేనియుఁ జిక్కదేవనృపతీ! నిస్తంద్రసాద్రద్యుతీ!

కోటి రఘునాథరాయలు


ఈతఁడు పుదుకోటప్రభువు. పదునేడవశతాబ్దివాఁడు. ఆంధ్రభాషార్ణవకర్త నుదురుపాటి వెంగన యీతని యాస్థానకవి.

తురంగపంచకము


సీ. ఆస్కందితాసుప్రహసితాశుగోద్యత్తు
                    రంగమం బగు నీతురంగమంబు
    ధౌరితకత్వరోద్ధతిధుతస్థావర
                    జంగమం బగు నీతురంగమంబు
    రేచితోద్వాగాధరీకృతహరిభృద్వి
                    హంగమం బగు నీతురంగమంబు
    వల్గితస్యదవినిర్భగ్నఫణాద్యభు
                    జంగమం బగు నీతురంగమంబు

గీ. ప్లుతజవనినిర్జితసురాశ్వవితతగమన
    చంగమం బగు నీదుతురంగమంబు
    కలితగుణపేణి! కవికోటికల్పవాట
    రాయరఘునాథ పంచణ ప్రభుకిరీటి!
సీ. పుటములు ద్రొక్కెనా కుటిలారిరాజస్య
                    కోటికోటీరముల్ కుదియఁబడును
    జోడెనల్ చూపెనా శూరవీరకఠోర
                    గంధాంధసింధురఘటలు చదియు
    చౌ దాఁట్లు దాటెనా సామంతభూపాల
                    జవనకంఖాణముల్ స్రగ్గి మ్రొగ్గు
    వేడెముల్ తిరిగెనా విమతులపురములు
                    గాలిచక్రమ్ములకరణిఁ దిరుగు
గీ. బళిర రవగాలు ఘటియింప భండనమున
    వెడఁదయురములు బరులును విఱిగి విఱిగి
    దొరఁగు రిపుకోటి నీదెరా బిరుదు కోటి
    రాయరఘునాథ పంచణ ప్రభుకిరీటి.
సీ. కదలిక చూపెనా కక్కసంపడు నేల
                    గుండెలు కలఁగు గగ్గోలుగాను
    దులదుల నడచెనా దుర్దాంతసామంత
                    బలములగమముల గర్భములు గలఁగు
    పరువులు వాఱెనా పరిపంథినరపాల
                    చిత్తముల్ మెత్తనై తత్తళించు
    కరికరి నెదిరెనా గర్వితారాతిరాట్
                    ప్రాణంబు లటునిటు పఱచి వెఱచి
గీ. దూఱి రణమున హదలికల్ మీఱఁగాను
    ఖురపుటోద్ధతు లడరంగఁ గొట్టి మెట్టఁ

    దొరఁగె రిపుకోటి నీదెరా బిరుదు కోటి
    రాయరఘునాథ పంచణ ప్రభుకిరీటి.
సీ. సమరాన శాత్రవసమితిశిరోజముల్
                    గసకస ఘాసమ్ముకరణి నమలి
    కదనాన విమతులకండలు గుండెలు
                    ఝళఝళ కబళమ్ముసరణి మెసఁగి
    ప్రధనాన మార్తుఱప్రక్కలు డొక్కలు
                    కరకర ఖాణంబువరుస మెక్కి
    బవరానఁ బరరాజవరులరక్తంబులు
                    గళగళ జలములగతిని గ్రోలి
గీ. మొట్టి మర్దించి చుట్టుక మెదలనీక
    గొట్టి గోరింప రణమున గుండె లవిసి
    తొరఁగె రిపుకోటి నీదెరా బిరుదు కోటి
    రాయరఘునాథ పంచణ ప్రభుకిరీటి!
సీ. గర్వాంధపరిపంధిగంధసింధురముల
                    కొమ్ముకత్తుల మొనల్ కొట్టి కొట్టి
    చెనఁటిదునేదార్లశిరముల గొగ్గీల
                    గొలుసులు వీడంగఁ గూల్చి గూల్చి
    మూర్ఖారివీరులౌ ముసలమానులమోము
                    ముక్కుదూలము లూడ మోఁది మోఁది
    ఘోరవజీమోటుజీరాలయుంగరాల్
                    చెదరి ఝల్లన రాలఁ జెండి చెండి
గీ. చీఱి తూఱుచు ఖురములఁ జించి చించి
    పేరెములు వార బారువ పెంట లగుచుఁ
    దొరఁగె రిపుకోటి నీదెరా బిరుదు కోటి
    రాయరఘునాథ పంచణ ప్రభుకిరీటి!

వెలుగోటివారు

వీరిచాటుపద్యములు పరశ్శతముగా నున్నవి. మచ్చునకుఁ గొన్నిమాత్ర ముదాహరించెదను. వేంకటగిరిప్రభువులు వాని నన్నిటిని ముద్రింతురుగాక!

చ. కదనమె బొమ్మరిల్లు చెలికత్తెలు వీరజయాంగనామణుల్
    మదకరిమస్తకుంభముల మాటికి దొంతులు సంగరస్థలిన్
    గుదిగొని పడ్డరాహుతుల క్రోపులు గుజ్జనగూళ్ళు బాపురే
    పొదలెడు రాయరాపు ననపోతని ధర్మని ఖడ్గపుత్రికిన్.
ఉ. మత్తుఁడు కూర్మరాజు విషమత్తుఁడు నాగవిభుండు మిక్కిలిన్
    మత్తుఁడు సూకరాధిపుఁడు మత్తగజంబులు తిండిపోతు లీ
    తొత్తడికాఁపురంబు తులఁదూఁగ దటంచును రత్నగర్భ నీ
    పొత్తుల నీభుజాబలము పొందెనపో యనపోతభూవరా!
శా. ఏమీ శేషుఁడ? ఏమి నారద; ముదం బేపారునా? తొంటి ని
    శ్రామంబేమియు లే; దదేమి? ససిమీఱన్ రావుసింగాంకుఁ డు
    ద్దాముప్రౌఢి జయింప సోమకులగోత్రాధీశ్వరుల్ జోగులై
    భామల్ దామును బాములన్ వెదకఁగా బాతాళమున్ దూఱితిన్.
చ. కుదురుగ మిమ్ముఁ గొల్చి వెలుగోటిపురీంద్ర! కొమారతిమ్మ! నిన్
    గదియఁగ నగ్రహారములు కైకొనఁజూతురు భూసురోత్తముల్
    బెదరక నీకరాసిహతిఁ బెల్కురి వైరులు పోయి యూర్వశిన్
    గదిసి కుచాగ్రహారములు కైకొనఁజూతు రదేమి చిత్రమో!
ఉ. రంగపనేనియబ్బనృపరత్నము గోపనృపాలుధాటికిన్
    సంగరరంగభూములను శాత్రవకోటులు నిల్వలేక సా
    రంగముఖీలలామలను రాజ్యతురంగకవీంద్రసంపదల్
    సంగతి నప్పనం బొసఁగి శైలములన్ విహరింతు రెప్పుడున్.

మ. తలఁపెల్లన్ హరిభక్తియుక్తి దినకృత్యం బెల్ల ధర్మక్రియల్
    నిలు వెల్లన్ దయ రూపమెల్లయెడలన్ నిర్గర్వ మశ్రాంతమున్
    గొలు వెల్లన్ గవిగాయకాళి యితరక్షోణీశ్వరుల్ సాటియే
    వెలుగోట్యన్వయనారసింహ సకలోర్వీనాథ రాయన్నకున్?
ఉ. ఆలములోన సింగవసుధాధిపనందన! యన్నపోతభూ
    పాలక! నీకు నోడి యనిఁ బాఱినవైరుల నాలభంగి నే
    తోలుదుగాని చంపవఁట దోస మటంచును నౌర! గాయగో
    వాళుఁడ వైననీకుఁ బశువర్గముఁ గాచుట నైజమేగదా!
క. ఇనువెనుకయ గ్రహచక్రము
    వినుతామరవర్గమెల్ల వెనకయవెనుకే
    జనపతులు సాహసంబున
    ననపోలనృపాల! నీకు నందఱు వెనుకే.
చ. అగణితకీర్తిలోల! సుగుణాకర! దాచయవెన్నభూప! నీ
    పగతుఱు కొండలెక్కఁ దమభామలకోమలదేహదీధితుల్
    జిగిగొని నిండినన్ గుహలఁ జీఁకటివాసినఁ దమ్ముఁ గాంతురన్
    దిగులునఁ గస్తురిన్ వెదకి తెత్తురు మేనుల మెత్త నత్తఱిన్.
ఉ. బల్లరగండ లింగవిభుపాదమునందుఁ బసిండియందె తా
    ఘల్లురుఘల్లుఘల్లురని ఘల్లని మ్రోయఁగ భీతి గుండియల్
    ఝల్లురు ఝల్లుఝల్లురని ఝల్లున నల్లలనాడుచుందురా
    యల్లమరెడ్డివేముఁడును నాతనితమ్ముఁడు వీరభద్రుఁడున్.
క. తమ్మతమకెంతప్రియమో
    తమ్మకుఁ జెయిసాఁచి రిపులు తలక్రిందై నీ
    తమ్మపడి గాన నుందురు
    బొమ్మలక్రియ రావుదాచభూవరుసింగా!
ఉ. ఈక్షితిఁ గాశికానగరి నీల్గినమాత్ర లభించు నెంచఁగాన్
    భిక్షపుఁగూడు యాచధరణీతలనాథవతంసు ఖడ్గధా

    రాక్షతి మేనువీడిన యరాతికిఁ గల్గు సుధారసంబు త
    ద్భైక్షము మంచిదో యమృతపానము మంచిదొ యెంచిచూడఁగన్.
మ. అరుదౌ నీబిరుదప్రతాపములు కల్యాణాద్రిపై నుండి కి
    న్నరగంధర్వసతుల్ సదా శ్రుతిపుటానందంబుగాఁ బాడఁగా
    నరరే బాపు బళీ! సెబా! నహహ! యౌరా! మే! లహో! యందు ర
    య్యరివీరుల్ వెలుగోటి యాచవిభురంగా! సంగరక్ష్మార్జునా!
ఉ. అంచితరాయరావుబిరుదాంకము రాజులఁ గొట్టి యందె గీ
    లించిన మాదభూవిభుని లింగనృపాలున కొప్పుఁగాక గ
    ర్వించిన నీకుఁ జొప్పడునె వేమఱునల్లయవేమరెడ్డి! పో
    కొంచెపుఁ దమ్మతిండితినుకూళకు సింహతలాట మేటికిన్?

ఈ వంశమున సర్వజ్ఞ సింగభూపాలుఁడు, విద్వత్కుమార యాచమనాయఁడు మొదలగు విద్వత్ప్రభువుల వెలసినారు. విద్వద్కుమార యాచమనాయని వైదుష్యదాతృత్వములకు ద్యోతకముగా నీ క్రింది విధమున నొక కథ యున్నది.

“విద్వత్కుమార యాచమనాయఁడు ప్రభుత్వము చేస్తుండగా, ఒక విద్వాంసుఁడు ఆస్థానమునకు వచ్చి శాస్త్రప్రసంగము చేసి సంస్థాన పండితులను వోడగొట్టెను. కుమార యాచమనీడు మిక్కిలి సంతోషించి ఏమి కావలెనో కోరుకొండని పండితుని అడిగెను. ఆయన దేవర సంస్థానములో నా మనోవృత్తికి చాలినంత భూమి దయచేసి, నా నిత్యకర్మానుష్ఠానములు చక్కగా జరిగేటట్టు అనుగ్రహించవలసినదని కోరెను. ఏ వూళ్ళో ఏ పొలము కావలెనో, మీరే సస్యగర్భముగా చూచుకొని వచ్చి చెప్పితే సర్వమాన్యముగా దానపత్రము వ్రాయించి యిప్పిస్తున్నామని రాజుగారు సెలవిచ్చిరి. ఆ పండితుఁఢు వారి తాలూకాలో తీర్థం పా డనే వూరికి పోయి అక్కడ జలసమృద్ధి, స్థలసమృద్ధి చూచుకొని తన స్నానసంధ్యానుష్ఠానములకు అనుకూలంగా ఉన్నదనుకొన్నాఁడు. ఆ వూఱి చెఱువుకు దక్షిణపు తట్టు పొలం తనకు వనరుగా భావించెను. రాజుగారి దగ్గిరకు వచ్చి, ఆ సంగతి విన్నవించి అక్కడు ఆ చెఱవు దక్షిణపు చేనుకు దానపత్రము పుట్టించుకొనెను. ఆ వూరికి బోయి గ్రామస్తులతో మాట్లాడి గ్రామకరణమును సంతోషపెట్టి తన దానపత్రము చూపించెను. “అయ్యో బ్రాహ్మడా! చెఱువుకు ఉత్తరపు చేను సుక్షేత్రమై వుండగా వట్టి చౌటిపఱ్ఱ, దక్షిణపు చేను కోరుకొన్నావేమిటి? మాతో చెప్పక వెఱ్ఱిపని చేస్తివి” అని కరణం చెప్పేటప్పటికి, ఆ పండితుఁడు “సరి కుదురుతుందిలే” అని లోలోపల సరిచూచుకొని, “అయ్యా! నేను కోరినదిన్నీ అదేనండీ! అట్లాగే వ్రాయించినా” నని ఆయనకేదో చెప్పి లోబరుచుకొని, చెఱువు కుత్తరపు చేనే విడుదల పెట్టించుకొన్నాఁడు. దాన్ని సాగుబడిచేసే రైతును వెళ్ళగొట్టి తన సేద్యగాళ్ళను చొప్పించి తగువు సాగించినాఁడు. అంతట ఆ భూమి కాపు రాజుగారి దగ్గిర ఫిర్యాదు చేసుకొనెను. పిలిపించి, “యిదేమిటి? మీరిట్లా చేయవచ్చునా?” అని రాజుగారు పండితుణ్ణి అడిగిరి. “తమరు దానపత్రంలో వ్రాయించిన ప్రకారం చెఱువు వుత్తరపు చేనే నేను లోబరుచుకొన్నాను. నా తప్పేమి?” అని పండితుఁ డనెను. స్వయము పండితుఁడు గనుక ఆ రాజు, “ఓహో! చెఱువు వుత్తరపు చేననగా ఏ చేనుకు చెఱువు వుత్తరముగా వున్నదో ఆ చేనని అర్థము చేసినాఁడు సుమా” అని గ్రహించి “బహువ్రీహి చేస్తిరా?” అనెను. “దేవరవారు దయచేసిన భూమి బహువ్రీహిగాక అల్పవ్రీహి కావచ్చునా” అని ఆ పండితుఁడు చమత్కరించెను. బహువ్రీహి అనగా హెచ్చు ధాన్యము కలది. బహువ్రీహి అనే సమాసమున్ను అర్థము. విద్వత్కుమార యాచమనాయనివారు పరమానందము చెంది, “మునుపు యిచ్చినది అబద్ధము ఇప్పుడు ఇచ్చినది నిబద్ధి” అని మెచ్చి అట్లాగే మార్చి యిచ్చి సంసారినిన్ని సమాధానపరిచి పంపెను.

పోలెపల్లి బుక్కరాయలు

సీ. కొలువులో మీసాలు కొనలు దిద్దఁగవచ్చుఁ
                    జికిలిసేనాకత్తి చిమ్మవచ్చు
    మేలైనయంగీలు మెఱచి తొడ్గగవచ్చు
                    సతులు చూడఁగ నెమ్మె సలుపవచ్చు
    గరడిసాదనఁజూచి ఘాతసేయఁగవచ్చు
                    బిరుదులు చదువంగ బిగియవచ్చు
    .................................................
                    .............................................
గీ. కాక యరి నని వ్రేయ సత్కవుల కీయ
    నీవె నేర్తువు ధరలోన నేర్పు మెఱయఁ
    బరమకల్యాణ! నూతనపంచబాణ!
    భూనుతాటోప! తిమ్మయ బుక్కభూప!
సీ. కలగుండ్లువడుబారు కన్పించు దుర్గాలు
                    కడఁగి భగ్గన విచ్చు గండవిండ్లు
    పెందూళిపైఁ గప్పి భీతిల్లుఁ గోటలు
                    కమలి భస్మంబు లౌఁ గాననములు
    చీకాకుపడు దొడ్డసింహాసనంబులు
                    హల్లకల్లోలమౌ నష్టదిశలు

    గగ్గులకాడౌను గడిమన్నెభూములు
                    పంచబంగాళమౌఁ బట్టణములు
గీ. గర్వదుర్వారభూపసంఘములలోన
    నుట్టుపడ్డట్టు నీధాటి పుట్టినపుడె
    మన్నెశార్దూల! రిపుమన్నెమర్తజాల!
    భూనుతాటోప! తిమ్మయబుక్కభూప!
సీ. మత్తారిరాజన్యమకుటంబులనె కాని
                    పాదంబు చాఁపఁడు బలిమి మెఱసి
    బిరుదాడురాజులపేరురమ్మునె కాని
                    మన్నెబెబ్బులిబాకు మహి నిడండు
    పచరించురిపురాజపట్టణంబునె కాని
                    వాజి నెక్కాడండు రాజసమున
    కపటరాజకఠోరకంఠరక్తమె కాని
                    యడిదంబు కడుగఁ డాహవమునందు
గీ. మన్నెమాత్రుండె బద్దరిమన్నె మావు
    మలయుబిత్తరిమన్నీల మగలమగఁడు
    దండిమన్నీలవలపులమిండగీఁడు
    భోగసురరాజు తిమ్మయ బుక్కరాజు.
సీ. అనిలో విఱిగివచ్చి యందల మెక్కునే
                    ముక్కుసెవుల్లేని మొండి గాక
    పోరిలో గుఱ్ఱంబు పొలియించి వచ్చునే
                    గుఱిచెడ్డ గుఱ్ఱాల గోవు గాక
    బవరంబునకుఁ బోయి పతిని వంచన చేసి
                    తొలఁగునే బణ్ణంగిదూఁబ గాక
    ఏలినపతిసొమ్ము నెల్లకాలము దిని
                    పాఱిపోనెంచునే పంద గాక

గీ. సమరతలమునఁ దమప్రాణసతిని దలఁచి
    సుఖము గోరునె జోగులనుతుఁడు గాక
    యనుచు గెల్వంగ నేర్తువౌ నాహవమున
    భూనుతాటోప! తిమ్మయ బుక్కభూప!

తంజావూరి విజయరాఘవరాయలు

ఈతఁడు తంజాపురము నేలిన యాంధ్రనాయకరాజు. రఘునాథరాయల కుమారుఁడు. మహారసికుఁడు. మహాదాత. మహాకవి.

లయగ్రాహి. తావిజగడంపు సిగపూవులసరుల్ తళుకు
                    మోవి పలుగెంపు బురుసావలువు సొంపుల్
    ఠీవిదులకింపు నొకతావి చుఱుకు న్మరుతు
                    మావుపయి నెక్కి పురిలో వెడలి రాఁగా
    నీవగలు చూచి చెలి రేవగలు సొక్కుచును
                    పూవుజముదాడి దొరహావళికిఁ జిక్కెన్
    మావెలఁది నేలుకొన రావలదె నీవు దయ
                    తో విజయరాఘవమహీవర! పారాకా!
క. భూతలమున శిబికర్ణులు
    దాత లనేసుద్ది సుద్దదబ్బర నిన్నెం
    చేతఱి వదాన్యుఁ డెవ్వడు
    రా? తంజావూరి విజయరాఘవనృపతీ.

ఈయన యాస్థానమున రంగాజి, కృష్ణాజి మొదలకు వారాంగనలు, సరసకవిత నేర్చివా రుండెడివారు. అందు రంగాజి ‘మన్నారుదాసవిలాస’ మనుపేర నీయన శృంగారచరిత్రమునే గ్రంథముగా రచించినది. ఆపె యారాజేంద్రునిచేఁ గనకాభిషేకసత్కారమును వడసినది. ఆయనవలపునెలఁత. ఎల్లవేళలయందును వెల్లాటకత్తెతో నానందించు నీనృపాలుని మహిషి తనయాగ్రహము నాపుకొనఁజాలక యొకనాఁ డావారాంగనకు దూషణోక్తులతో నొకదూతికమూలమున వార్త నంపె నఁట! విదుషీమణి యగునావారాంగన యాదూతి కీపద్యమును రచించి చెప్పి పుచ్చెనఁట—

ఉ. ఏవనితల్ మముం దలఁప నేమిపనో? తమ రాఁడువారు గా
    రో? వలపించునే ర్పెఱుఁగరో? తమకౌఁగిటిలోన నుండఁగా
    రా వదియేమిరా విజయరామ! యటం చిలు దూఱి బల్మిచేఁ
    దీవరకత్తెనై పెనఁగి తీసుకవచ్చితినా తలోదరీ!
ఉ. రాజనిభాననా! సరసురాలవు జబ్బుగ నల్లినా వదే
    మే జడ? యింతకంటె వలెనే? వలనొప్ప బిగించి యల్లవే
    యోజవరాల వేఱె పనియున్నది; దోసమె దోసమే మహా
    రా జగునట్టి యవ్విజయరాఘవు మై చిగురాకె కోమలీ!
చ. కులికెద వేటికే చెలియ! కుంచెఁడు మానెఁడు గాను నెల్లవా
    రలు వినినారులే; విజయరాఘవరాయఁడు నిన్నుఁ గూడుటల్
    వలపులె చాటుచున్నవి జవాదియు నల్దవు విఱ్ఱవీఁగఁగా
    వలెనటె చూచియోర్తురటె వంతులు జంతు లవేటియెమ్మెలే?
క. ఇంతీ! పానుపుపైనిదె
    కంతుఁడు కూర్చున్నవాఁడు కనుఁగొను మహహా!
    కంతుఁ డనంగుఁడు నీతెలి
    వింతేనా విజయరాఘవేంద్రుఁడె చెలియా!

మట్లవారు

ఉ. అక్కజ మొప్పఁగా భుజపరాక్రమశక్తుల నెంచిచూచినన్
    దిక్కులలోనఁ బోలిపలి తిమ్మయ బుక్కఁడు రాజు నాఁటికిన్
    మక్కువ దోర్బలంబునను మానవనాథులలోన నంతకు
    న్నెక్కువ మట్లకోనధరణీశ్వరు నెల్లమరాజు నేఁటికిన్.
ఉ. మాయురె! సద్గుణాభరణ! మల్లకుమారయనంత శౌర్యధౌ
    రేయుని నిన్ను నాజి నెదిరింపను శక్తులు గాక కైదువుల్
    వేయని రాజులున్ శరణు వేఁడని మన్నెకొమాళ్ళు కానికల్
    సేయని శూర్లు మ్రొక్కని వజీర్లును లేరు వసుంధరాస్థలిన్.
ఉ. వెండియు మట్లరాజు తిరువేంగళనాథుఁడు కందనోలికా
    భండనభూమిలోఁ దురకబారులపైఁ బడి సంహరింపఁగాఁ
    గండలు కొండలయ్యె నెముకల్ ధరణీజము లయ్యె నెత్తురుల్
    గందపుటేఱు లయ్యెఁ దలకాయలు తారక లయ్యెఁ జూడఁగన్.

అద్దంకి నృపాలురు

మ. పదవే రంభ! సురేంద్రుకొల్వునకు నప్పా! నాకు రాఁ దీరదే;
    యది యేమే; ధర మందపాటి రఘునాథాధీశుబాహాసిచేఁ
    గదనక్షోణిని నీల్గినట్టి రిపుసంఘాతంబు వే వచ్చెడున్
    వదిలే దెప్పుడు వచ్చుటెప్పుడు, చెలీ; వామాక్షి! వారెందఱే?
    బదులు న్నూఱులు వేలు లక్షలు గణింపన్ శక్యమే చెల్లెలా.
ఉ. ఇంద్రుని సన్నిధానమున కేఁగె రణోజ్జ్వలవిక్రమక్రియా
    సాంద్రుఁడు మందపాటికులసాగరచంద్రుఁడు రామభద్రరా
    జేంద్రుఁడు పార్థివాబ్దమున నేకతఁ గార్తికశుద్ధపూర్ణిమా
    చంద్రదినాంతమందు రవి జారినకైవడి మారుతాత్మజా!

వత్సవాయవారు

ఉ. తీరుగ వత్సవాయతిమ్మ జగత్పతికీర్తిహార మా
    హారశరద్ద్విజన్మకులిశాయుధజాతుల మించె శౌర్యమా
    హారశరద్ద్విజన్మకులిశాయుధజాతుల మించె రూపమా
    హారశరద్ద్విజన్మకులిశాయుధజాతుల మించె నిద్ధరన్.
ఉ. రాజులరాజు లోభి యొకరాజులరా జతిమూర్ఖుఁ డష్టది
    గ్రాజులరాజు చోరుఁడు విరాజులరా జొక పక్షి తారకా
    రాజులరాజు దోషి ఫణిరాజులరా జొకవక్రగామి యీ
    రాజులు రాజులా సుగుణరాజులరాజవు నీవుగాక యో
    రాజవతంస? వత్సవయ రాజమహీపతి, తిమ్మభూపతీ!
ఉ. రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీనుఁ డంబికా
    రాజు దిగంబరుండు మృగరాజు గుహాంతరసీమ నుండు వి
    భ్రాజితపూసపాడ్విజయరామనృపాలుఁడు రాజుగాని యీ
    రాజులు రాజులా పెనుతరాజులు గాక ధరాతలంబునన్.

వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడుగారు

ఈకమ్మప్రభువు పదునాఱవశతాబ్దితర్వాతఁ గృష్ణాతీరమందలి యమరావతి రాజధానిగాఁ గొంత తెల్గుదేశ మేలినవాఁడు. మహాదాత. శూరుఁడు. ‘అటునుండి కొట్టుకు రమ్మన్నారు’ అనుసామెత కీతఁడే జననకారణము. ఆకాలమునందు దారిదోఁపుడుగాండ్రు మెండుగాఁ నుండిరఁట. అనేకుల ప్రాణధన ములఁ గొనుచుఁ బ్రజలకు మిక్కిలి పీడ గల్గించుచున్న యాపచ్చెపుదొంగలలో బహుప్రయత్నమున వేంకటాద్రినాయఁడు నూర్గురను బట్టించి వరుసగా నిల్వఁబెట్టి తలలు నఱకఁ దలారుల కనుజ్ఞ నొసఁగెనఁట! ఒకకొననుండి నఱకఁ బ్రారంభింపఁబోఁగా నచ్చటివాండ్రు, అటునుండి కొట్టుకొనుచు రమ్మని కోరిరట! (కొందఱ నఱికినతర్వాతనేని జాలి వొడమక పోదని) నాయఁడుగారును నట్లే రెండవప్రక్కనుండి యారంభింపఁజేసి నిశ్శేషముగనే సంహరింపించి ప్రజలకుఁ జోరభీతి మాన్పిరఁట!

మ. వరహా ల్కానులభంగి సాలువులు కంబళ్ళట్ల రూపాయలున్
    మఱి గవ్వల్వలెఁ గంకణమ్ములుఁ దృణప్రాయమ్ముగా నిచ్చి బం
    గరుపళ్ళెంబులఁ బాయసాన్నములుఁ లక్షబ్రాహ్మణాపోశనం
    బర లే కిత్తువు వాసిరెడ్డి కులదీపా! వేంకటాద్రీశ్వరా!

ఒకప్పుడు, వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడును, నర్సారావుపేట మల్రాజు గుండారాయఁడును, నుజివీటి యప్పారావును, చల్లపల్లి యంకినేఁడును, మొదలుగాఁ గొందఱు జమీందారులు కూడి యిష్టగోష్ఠీవినోదము సల్పుకొను సందర్భమున హాస్యచతురుఁడగు గుండారాయఁడు ‘మనజీవితములు కడచనినతర్వాత లోకము మనల నెట్లు ప్రశంసించునో తలఁచి చూచుకొందమా’ యనెనఁట! అందఱు నంగీకరించి రఁట! ఇట్లు పేర్కొనెనఁట! ‘నూజివీటి యప్పారాయఁడు చనిపోయెనా బైరాగులందఱును బలివించెదరు. తాను చనిపోయితినా వేశ్యలందఱును విలపించెదరు. వేంకటాద్రినాయఁడు చనిపోయెనా యందఱును నల్లో యని దుఃఖించెదరు. అంకినేఁడు చనిపోయెనా యందఱు నాహా యని సంతోషించెద’ రనియెనఁట!

అమరావతిలో నీ వేంకటాద్రినాయని శిలావిగ్రహ మున్నది.

దరిద్రుఁడగు నొకకవి యావాసిరెడ్డి వేంకటాద్రినాయని దాతృత్వము విని యాతని దర్శింపఁ బల్నాడుప్రాంతమునుండి యరుదెంచుచు గుంటూరు చేరునప్పటి కాభూపతి పరలోకయాత్ర గావించినట్లు తెలియరాఁగా నీక్రిందిపద్యమును జెప్పెనందురు.

చ. నలువ! చిచీ! నినుం దలఁప న్యాయముగా దిఁక వేంకటాద్రిభూ
    తిలకునిఁ జంపి యర్థులకు దిక్కు మఱేమొనరించినావు? నీ
    విలఁదలకొట్లమారితన మెన్నఁటికిన్ విడవైతి వౌర! భూ
    తలమున నిట్టిరాజును యథావిధి నీతరమా సృజింపఁగన్?

వేంకటాద్రినాయఁడు ‘వారికి వారికిన్ మఱియు వారికి వారికి వారివారికిన్’ అను సమస్యనీయఁగా వట్ఠెం విరూపాక్షశాస్త్రు లనుకవి యిట్లు పూరించెనఁట.

ఉ. భూరమణీమనఃకుముదపుంజసుధాంశుని వేంకటాద్రిల
    క్ష్మీరమణావతారుని భజింతురు రాజులుఁ దత్సుతున్ హితుల్
    సూరిజనుల్ తదీయులును సొంపుగ నాప్రభు విచ్చుఁ గోరికల్
    వారికి వారికిన్ మఱియు వారికి వారికి వారివారికిన్.

సి. పి. బ్రౌన్ దొరగారు

క్రై 1770 తర్వాత 1820 వఱకు నీమహాశయుఁ డాంధ్రభాషకై యతిప్రయాసపడి మహోపకృతి సల్పినవాఁడు. అనేక సంస్కృతాంధ్రగ్రంథములను సేకరించెను. తెల్గునకు నిఘంటువులు నిర్మించెను. జూలూరి అప్పయ్య, గురుమూర్తి శాస్త్రి మొదలగు ననేక పండితుల నాదరించెను. ఇప్పుడు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నున్న సంస్కృతాంధ్రగ్రంథములం దనేకము లిమ్మహనీయుఁ డార్జించినవే.

క. నూరార్లు లెక్క సేయక
    పేర్లందిన విబుధవరులఁ బిలిపించుచు నే
    మా ర్లర్థ మిచ్చు వితరణి
    చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్.

బీదఱికమును గుడుచుచున్న యొక యాంధ్రపండితుఁడు సి. పి. బ్రౌన్ దొరగారికి భాగవతమందలి యీ క్రిందిపద్యమును వ్రాసి తనకు ద్రవ్యసాహాయ్యము వేఁడుకొనుచు నొకయర్జీ పంపికొనెనఁట! ఆపద్యము.

ఉ. లా వొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులా
ఠావు ల్దప్పెను మూర్ఛవచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగుం దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!

బ్రౌన్ దొరగారికిట్లుమనుష్యునొరుని స్తుతించుటయందు రోత. (వారిస్వహస్తముతో నొకచోట “ఈ దేశపుజనులుకార్యార్థమై నీవే తండ్రివి, నీవే దైవమవు, అని నరునొరుని స్తుతింతురు; అట్లు స్తుతించుట తల్లిని దండ్రిని దైవమును వంచించుట యగును ఆంగ్లేయు లిది యేవగొందురు” అను నర్థము వచ్చునట్లు తెల్గుననే కొంత వ్రాసియున్నారు.) ఆయర్జీని జూచి దొరగారు తిరిగి భాగవతములోనిదే యగు నీ క్రింది పద్యముఁ బ్రత్యుత్తరముగాఁ బంపిరట.

ఉ. ఏను మృతుండ నౌదునని యింతభయంబు మనంబులోపలన్
మానుము సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిక్కమౌఁ
గాన హరిం దలంపు మిఁకఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై
మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్.

సిద్ధయామాత్యుఁడు

సీ. శేషాహి భాషావిశేషుఁ డింతే కాని
                    యెలమిఁ గర్ణునిరీతి నీయలేఁడు
    ఎలమిఁ గర్ణుఁడు దాన మీయు నింతే కాని
                    పుడమి నింద్రునివంటి భోగి గాఁడు
    పుడమి నింద్రుఁడు కడుభోగి.....నకుఁ గాని
                    ధర్మనందనువంటి తాల్మి లేదు

    ధర్మనందనుఁ డెంత తాల్మి దాల్చినఁ గాని
                    వార్ధినా గాంభీర్యపరుఁడు గాఁడు
గీ. గాక యిటువంటిగుణములు గలిగె నీకు
    శత్రునిశ్శంక! ఉటుకూరుశాసనాంక!
    భాగ్యగంభీరవేంగయప్రభుకుమార!
    మహితమందార! సిద్ధయామాత్యధీర!

ద్వాత్రింశన్మంత్రులు

ముప్పది యిద్దరు మంత్రులను దెలుపు నీసీసమాలిక కట్టుకతలనుబట్టి యొక బట్టుకవిచేఁ గూర్పఁబడినది. పేర్కొనఁబడిన మంత్రులక్రమము కాలక్రమమునకు ననుకూలింపదు. చరిత్రకారులు దీనినిఁ బరమప్రమాణముగాఁ దీసికొనరాదు.

1. సీ. కవులిచ్చి భూపతి గాసి పెట్టఁగఁ జచ్చెఁ
                    బ్రజలకై రాయన భాస్కరుండు
2. వరదాతయై మణీవలయముల్ కవి కిచ్చె
                    దండిభాస్కరసూతి కొండమంత్రి
3. భాస్కరువలెఁ గీర్తిపడసెఁ దత్పౌత్రుఁడౌ
                    ఘనరామలింగ భాస్కరుఁ డొకండు
4. గణకనిర్వాహంబు గల్గించె నూరూర
                    మహి గోపరాజు రామప్రధాని
5. దుర్గ మియ్యక శత్రువర్గంబుతోఁ బోరెఁ
                    బెల్లుగాఁ గరణము మల్లమంత్రి
6. ఆత్మీయతపముచే నర్థినాలుక మడ్డు
                    కేడించె బండారు కేతమంత్రి

7. కవిపాముచేఁ జావఁగనునాయువాతని
                    కై యిచ్చె సీదయ యాచఘనుఁడు
8. వేఁటాఱుతునియల విమతులఁ జెండాడె
                    నాజిలో నాదెండ్ల యయ్యలయ్య
9. పోరిలో నసహాయశూరుఁడై తెగివెన్క
                    బ్రతికె సిద్ధయ తిక్కఁ డతులితముగ
10. పట్టిసపుర వీరభద్రుని ప్రేమచేఁ
                    జెన్నొందె శ్రీకోటసింగరాజు
11. ఇలుచూఱ యాచకావలికి దాతలదాత
                    యై యిచ్చెనిట్టల హరిహరిప్ప
12. తనదుమీసము దీసి తాకట్టుగా నుంచి
                    కొర్ఠ రెఱ్ఱం డర్థి కోర్కె తీర్చె
13. గణపతిదేవుని కరుణభట్టుకుమణి
                    యడపం బొసంగె గూడార్యవరుఁడు
14. అష్టసహస్రంబు లర్థి కిచ్చి సుకీర్తి
                    మహిని సింగనమంత్రి మాచఁ డందె
15. కొనియె భాస్కరునిచేఁ దెనుఁగురామాయణం
                    బారూఢిసాహిణి మారమంత్రి
16. ఆంధ్రనైషధకావ్య మందె శ్రీనాథుచే
                    మామిడి సింగనామాత్యమౌళి
17. ఘనదానకర్ణుఁడై గండపెండెము దాల్చెఁ
                    గొఱవియన్నామాత్య కుంజరుండు
18. పగతుఁజుట్ట మటంచుఁ బల్కఁగా ధన మిచ్చి
                    చేపట్టెఁ బెమ్మయసింగరాజు
19. గురుజగత్త్రయదాన గురుమూర్తియై మించె
                    నండూరి భీమన గుండమంత్రి

20. ప్రాణికోటికి నెల్ల బహుబక్ష్యభోజ్యాన్న
                    సత్రముల్ పెట్టె విస్సప్రధాని
21. భట్టుమూర్తికిఁ గిన్క రెట్టింపఁ బచ్చల
                    హార మర్పించెఁ దిమ్మరసమౌళి
22. ఘనదైవతంబు దాక్షారామభీమేశుఁ
                    డని కొల్చె బెండపూఁడన్నమంత్రి
23. నీడ ద్రొక్కెడువేళ నెఱి కర్థి కభిమతం
                    బిప్పించెఁ జేమకూ రప్పరాజు
24. ఘనసప్తసంతతు లొనరించిన సత్కీర్తి
                    వెలయించె విఠ్ఠల వెఱ్ఱమంత్రి
25. అమితశత్రులఁ గెల్చి యవనిపాలన చేసె
                    రహి గుంటుపలి ముత్తరాజమంత్రి
26. తను నేలు నృపతిచేతనె మేటికృతి గాంచె
                    శ్రీగుంటుపలి నరసింగమంత్రి
27. ఘనభట్టు సుకవికి మణికుండల మొసంగి
                    నంది తిమ్మకవీంద్రుఁ డందెఁ గృతుల
28. కవుల కర్థ మొసంగి ఘనకీర్తి వహియించె
                    రహిఁ గూరగాయన రామమంత్రి
29. వాకిటికావలి జోఁకతో నొనరించి
                    దివ్యకీర్తి వహించెఁ దిమ్మమంత్రి
30. రిపు గెల్వ నృపుఁ డిచ్చు విపులార్థముల నర్థి
                    కర్పించెఁ గటికి కామన్నమంత్రి
31. కవిబుధావళి నేలి ఘనకీర్తి వహించె
                    వరకోటిపల్లి శ్రీశరభమంత్రి
32. నిరతాన్నదాతయై నిత్యకీర్తి వహించెఁ
                    గాశి బందా పరదేశిమంత్రి

ఒకానొకబట్టురా జీక్రిందివిధమున ద్వాత్రింశన్మంత్రుల సీసమాలికను జదువఁజాగెను; గాని, కడముట్టింపఁజాలఁడయ్యె. అందినంతవట్టు—

సీ. బళిర! రామయ మంత్రిభాస్కరామాత్యుండు
                    నిండారు నండూరి గుండమంత్రి
    శివపాదభక్తుండు శ్రీకంఠవెంగన్న
                    శ్రీనిధి యోకోటసింగరాజు
    వేమభూపతిమంత్రి మామిడిసింగన్న
                    యెన్న నౌ బెండపూఁ డన్నమంత్రి
    మేటైన కొచ్చెర్లకోట కర్ణము మల్లు
                    స్తుతి కెక్కువా డలతుక్కమంత్రి
    ప్రియ మాడు నెఱజాణ పెమ్మయసింగన
                    మహితుండు సింగనమంత్రి మాచ
    సర్వజ్ఞుఁ డైనట్టి సర్వయ చిక్కన
                    యధికుండు నెల్లూరి యాదిరాజు
    ధీరుండు సాళువ తిమ్మనరేంద్రుండు
                    గురిజాల నాదిండ్ల గోపమంత్రి
    ప్రధితి కెక్కుచు నుండు భాస్కరామాత్యుండు
                    మాన్యుండు కొడపర్తి మాదిరాజు
    ఇలఁ గొండవీటిలో వెలయు ప్రధానుండు
                    భవ్యుండు బలభద్రపాత్రఘనుఁడు
    కుల ముద్ధరించిన గోపయరామన
                    పేరిమి తిరువెళ్ళ పెమ్మరాజు
    విస్మారసత్కీర్తి విలసిల్లు వర్ధిల్లు
                    విదితుండు సండూరి వెంగళయ్య

    కేవలపుణ్యుండు కేసయరామన
                    సుజనుండు శ్రీపతిసోమరాజు.

పై సీసమాలికయందుఁ బేర్కొనఁబడినవారిలోఁ గొందఱపైఁ జెప్పఁబడిన చాటుపద్యములు చేకుఱినవి.

భాస్కరుఁడు

ఈనామము గల ప్రఖ్యాతపురుషు లనేకులు గలరు. తిక్కనపితామహాదులటుండ రాజమంత్రులును దాతృత్వమునఁ బ్రఖ్యాతులును నందవరీకులును నగు భాస్కరులే నల్వురైదుగురు గన్పట్టుచున్నారు. రామయభాస్కరు లిర్వురు. పదునాల్గవశతాబ్దియందుఁ బ్రఖ్యాతకవీశ్వరుఁడుగానున్న రావిపాటి త్రిపురాంతకునిచే—

మ. సరబేసై రిపు డేల భాస్కరులు! భాషానాథ! పుత్త్రా! వసుం
    ధరయందొక్కఁడు మంత్రి యయ్యె; వినుకొండన్ రామయామాత్యభా
    స్కరుఁడో; యౌ; నయినన్ సహస్రకరశాఖ ల్లే; వవే యున్నవే
    తిరమై దానము సేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచోన్.
అని పొగడఁబడిన వాఁడొకఁడు.
సీ. నిర్మించె నేమంత్రి నిరుపమప్రాకార
                    నవకంబుగా గోపినాథపురము
    గెలిచినాఁ డేమంత్రి లలితవిక్రమమునఁ
                    బ్రబలుఁడై యవనుల బలమునెల్ల
    నిలిపినాఁ డేమంత్రి నియతవైభవమున
                    గోపికావల్లభుఁ గూర్మి వెలయ

    పాలించె నేమంత్రి ప్రకటధర్మఖ్యాతి
                    మహిమ మీఱఁగ నాంధ్రమండలంబు
గీ. అతఁడు భూపాలమంత్రీంద్రసతతవినుత
    ధీవిశారదుఁ డచ్యుతదేవరాయ
    మాన్యహితవర్తనుఁడు శౌర్యమహితయశుఁడు
    భానుతేజుండు రామయభాస్కరుండు.
కొండవీటి గోపీనాథపురపు గోపీనాథస్వామి యాలయము ముఖద్వారశాశయందు వ్రాయఁబడిన యీపద్యమువలన నచ్యుతదేవరాయననాఁడు వేఱొక రామయభాస్కరుఁ డున్నట్లు ధ్రువపడుచున్నది. ఇంక రాయనభాస్కరులుకూడ ననేకు లున్నట్లు స్పష్టపడుచున్నది. మనలోఁ దండ్రిపేరు కుమారునకుఁ బెట్టెడు నాచారము కలదుగదా! దానివలననే యేకనామ మనేకులకుఁ బొసఁగియుండె నని తలఁపఁదగి యున్నది.
చ. కలయఁ బసిండిగంటమునఁ గాటయవేమసమక్షమందు స
    త్ఫలముగ రాయనప్రభునిబాచఁడు వ్రాసిన వ్రాలమ్రోఁతలున్
    గలుగలు గల్లుగల్లు రనఁ గంటకమంత్రుల గుండెలన్నియున్
    జలుజలు జల్లుజల్లు రనె సత్కవివర్యులు మేలుమే లనన్.
అను చాటుపద్యమువలనఁ గాటయవేమునికాలమున క్రై.1400న నొక రాయనభాస్కరుఁ డుండిన ట్లేర్పడుచున్నది.
శ్లో. శాకాబ్దే వసువహ్ని వేదధరణీగణ్యే చ ధాత్రబ్దకే
    వైశాఖే వినుకొండసీమని సుధీ ర్నాదెళ్ళ యప్పప్రభుః
    వాసిష్ఠాయచభర్తపూండి మఖిలంగ్రామం స్వనామాంకితం
    ప్రాదా ద్రాయనిభాస్కరాయ విదుషే ష్టైశ్వర్యభోగాన్వితమ్.

అను శాసనమువలన క్రై.1500 తర్వాత నొక రాయనభాస్కరుఁ డుండిన ట్లేర్పడుచున్నది. ముప్పదియిద్దఱు మంత్రుల సీసమాలికలోఁ బేర్కొనఁబడిన రాయనభాస్కరుఁడు ప్రాచీనుండుగాఁ నూహింపఁదగియున్నాఁడు. ఆతఁడు మహాదాత. ఆరాయని భాస్కరునిఁ గూర్చి చెప్పఁబడిన చాటుపద్యము లనేకములు గలవు.

క. పన్నిద్దఱు భాస్కరులని
    యెన్నికసేయుటది కల్ల యిద్దఱు గా దా
    మిన్నున నొకభాస్కరుఁడును
    బన్నుగ వినుకొండనున్న భాస్కరుఁ డొకఁడున్.
క. పసముత్య మొకటి చాలును
    గస వూడ్చిన చింపిరాలు గంపెం డేలా?
    రసికుం డొక్కఁడె చాలును
    రసహీనులు పదువురేల రాయనిబాచా!
క. చేకొని రాయని బాచఁడు
    కాకాలు గుణించు పిదపకాలమునాఁడే
    లాకేత్వ మియ్యనేరఁడు
    దాకును గొమ్మియ్యఁ డిట్టి ధన్యులు గలరే?
క. ఏవ్రాలైనను వ్రాయును
    నావ్రాయఁడు వ్రాసెనేని నవ్వుచునైనన్
    సీ వ్రాసి తావ డియ్యఁడు
    భావజ్ఞుఁడు రాయనార్య భాస్కరుఁ డెలమిన్.
క. వగమాన్పి యర్థి కియ్యని
    మగముండకు మీస మేల మఱిమూతిపయిం
    దెగగొఱుగఁ డాయె మంగలి
    రగడందునఁ గీర్తిదోఁచ రాయనిబాచా.

ఉ. ఒక్కఁడు మాంస మిచ్చె మఱియొక్కఁడు చర్మముఁ గోసి యిచ్చె వే
    ఱొక్కరుఁ డస్థి నిచ్చె నిఁకనొక్కఁడు ప్రాణము లిచ్చె వీరిలో
    నొక్కొకపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరో
    చక్కఁగఁజూడు మంత్రికులసంభవ! రాయనమంత్రి భాస్కరా!
ఉ. రాజితకీర్తిశాలి యగు రాయనిబాచ! భవ్యదశంబు ది
    క్పూజిత మౌచు మించె సురభూధరభూధరభూధరేంద్రకాం
    తాజసుగోత్రరుగ్విధు రథాంగరథాంగరథాంగశేషభా
    షాజలజాహితాహితతుషారతుషారతుషారధాములన్.
ఉ. ఏమి నిలింపశాఖి? పని యేమి సురేశ్వర! యీవి నిన్నుఁ జిం
    తామణి మీఱినాఁడటకదా మనరాయనబాచకోవిద
    గ్రామణి; యౌన యింతటనె కాదుచుమీ విభవంబునందు ని
    న్నో మతియందు నీగురువునో సుకుమారత నీకుమారునో.
మ. ఆయతలక్ష్మీనిధి రాయనప్రభుని బాచామాత్యుఁ డశ్రాంతమున్
    నియతిన్ బ్రాహ్మణపూజ సేయు టభివర్ణింపంగ శక్యంబె త
    త్ప్రియగేహంబున హేమపంజరమునన్ బె‘ల్లర్చతప్రార్చత
    ప్రియమేధా’ యనుచుం బఠించు శుకశారీకిన్నరీద్వంద్వముల్.
ఉ. అన్నరొ కొండపల్లి సచివాగ్రణి రాయనమంత్రిపట్టి బా
    చన్నజలాన్నసత్ర మెడపైన పథంబునఁ బెట్టు నెయ్యి రా
    జాన్నము లొప్పుఁబప్పు పదియాఱు తెఱంగుల కూరగాయలున్
    వెన్నెలగుజ్జుఁ బోలు దధి వేసవికాల మవారితంబుగన్.
క. ముసలాపె వ్రేలుఁజన్నుల
    పసవంటిది లోభివానిబ్రతుకు ధరిత్రిన్
    బసిబాలవయసు వంటిది
    రసికునిజీవనము మంత్రిరాయనిబాచా!

సీ. ఫణిరాజు తనశిరోమణు లర్థి కిచ్చునో
                    యనుచు విష్ణునుక్రింద నణఁగియుండె
    కైలాసుధర మెక్కడ నిచ్చునో యని
                    యుగ్రుఁ డక్కడఁ గావ లుండఁబూనె
    తనయందు మణుల నేతఱి నిచ్చునో యని
                    వనధి సంతతమును వణఁకుచుండె
    సురధరాధరము నెవ్వరి కిచ్చునో యని
                    తరణి యగ్గిరిచుట్టుఁ దిరుగుచుండె
గీ. ఔర! నీదానవిఖ్యాతి యఖిలదిశల
    మించి వర్తించె నీకీర్తి నెంచఁ దరమె
    గాఢదారిద్ర్యయామినీకాంతిచంద్ర
    భాగ్యదేవేంద్ర! రాయన భాస్కరేంద్ర!
సీ. నీపంక్తి నొకనాఁడు నెఱిభుజించిన విప్రుఁ
                    డమృతాన్నమైనను నరుచిసేయు
    నీసభాస్థలి నొక్కనిముసమున్నజనుండు
                    తల్పశేషునినైనఁ దప్పుపట్టు
    నీరూప మొకనాఁడు తేఱిచూచినభామ
                    కందర్పునైన డాకాలఁ దన్ను
    నీచేతిదానమ్ము నెమ్మినమ్మినయర్థి
                    యెమ్మెధనాధిపుఁ బొమ్మబెట్టు
గీ. నీవె నినుఁ బోలుదువుగాక నిన్ను నెన్ని
    యున్నమంత్రుల నెన్నుట పిన్నతనమె
    బాలికాప్రాణనూతనపంచబాణ!
    భాస్కరేంద్రుని రాయనభాస్కరేంద్ర!
సీ. అక్షరాభ్యాసంబు శిక్షచేసెడునాఁడె
                    యోవ్రాసి నా వ్రాయకుండినావు

    గుణితవేళలయందుఁ గారి లాకేత్వంబు
                    దాకుఁ గొమ్మియ్యక తర్లినావు
    ఒకటి పఙ్క్తిని వ్రాయు నూహ నేర్చిననాఁడె
                    సున్నచుట్టక వ్రేలు చూపినావు
    గణితవేళలనాఁడె ఘనయుక్తిగా నేర్పు
                    గురుకీర్తికిని బాలు గూర్చినావు
తే. నిజకులాచారధర్మంబు నిర్వహించి
    హెచ్చు గలయట్టిదాతవై హెచ్చినావు
    సరసహృదయుండ వినుకొండశాసనుండ!
    భవ్యభరతుండ! రాయనభాస్కరుండ!
సీ. సంగీతసాహిత్యసరసవిద్యల కిచ్చు
                    బహురూపులకు నిచ్చుఁ బట్టు కిచ్చు
    పెండ్లిపేదల కిచ్చుఁ బేదవిప్రుల కిచ్చు
                    బీదసాదల కెల్లఁ బిలిచి యిచ్చు
    తిట్టవచ్చిన నిచ్చు దీవించఁగా నిచ్చుఁ
                    గొట్టవచ్చిన నిచ్చుఁ గొంటె కిచ్చు
    బాచన్న! యన నిచ్చు భాస్కరా! యన నిచ్చుఁ
                    దేర బాచా యన్నఁ దిరిగి యిచ్చు
గీ. మెచ్చి తగ నిచ్చు మెచ్చులు మెచ్చి యిచ్చు
    వీఁడు వాఁ డనకయె సొమ్ము వేఁడ నిచ్చు
    మంత్రిరాయని భాస్కరామాత్యుఁ బోలఁ
    గలరె దాతలు మూఁడులోకములయందు?
సీ. కదలి యి ల్వెడలంగఁ గడప కాల్ దాఁకినఁ
                    దలపాగ పందిటఁ దగులుకొన్న
    ఎందుఁబోయెద వన్న నేకవిప్రునిఁ గన్న
                    నొంటిరోదన మన్న నుండు మన్న

    తగినచోఁ దుమ్మినఁ దంబళి యెదురైన
                    వీడినతలవాని వీథిఁ గన్న
    ఒలిమిడి మిక్కిలి యొంటికొ మ్మెక్కినఁ
                    బులుఁగు వీచినఁ బొడపురుగుఁ గన్న
గీ. మాన కేతెంచు నర్థిసమాజములకు
    నిచ్చు నిష్టార్థవస్తువు లెలమితోడ
    సరసహృదయుండు వినుకొండశాసనుండు
    భవ్యభరతుండు రాయనభాస్కరుండు.
క్రిందిపద్యమున భార్య నిచ్చె, ననఁగా వివాహము చేసె ననియే యర్థము నిర్ధారించుకొందము.
సీ. ఆవుపొడ్చినయర్థి లేవకుండఁగ నిచ్చె
                    వలవేసి తీసిన వాని కిచ్చె
    గుడివ్రాసియాఁగినఁ గొఱకొఱపడ కిచ్చె
                    బ్రార్థించి బుజ మెక్కు బట్టలు కిచ్చె
    మొగసాలఁ జిచ్చిడ్డ తగవరిఁ బిలి చిచ్చె
                    నిలుచూఱ వేఁడిన నెసఁగ నిచ్చె
    ప్రాణముల్ వేఁడినఁ బ్రాభవంబుగ నిచ్చె
                    భార్యను వేఁడినఁ బరఁగ నిచ్చె
గీ. పల్ల మడిగినఁ బదటులోఁ బల్ల మనక
    భట్టు గొంపోయి మున్ను తాకట్టు పెట్ట
    ముచ్చవెంగనఁ జేపెట్టి మెచ్చి యిచ్చె
    భవ్యభరతుండు రాయనభాస్కరుండు.
ఈయన దాతృత్వపు బిచ్చిని వినుఁడు! విటగ్రామణులకుఁ గామసత్రము పెట్టించినాఁడఁట!

సీ. అతిథికోట్లకు నిల నమృతాన్నసత్రంబు
                    నంబలిసత్రంబు నాతురులకు
    ఆచార్యులిండ్ల రామానుజసత్రంబు
                    నూనెసత్రము శిరస్స్నానమునకు
    బాలకులకును నేర్పడఁ బాలసత్రము
                    కామసత్రము విటగ్రామణులకు
    జలకమాడుట కింట జలసృష్టి సత్రంబు
                    తాంబూలసత్రంబు ధన్యులకును
గీ. కట్టడలు చేసె వినుకొండ పట్టణమున
    సర్వకాలము సత్కారపూర్వకముగ
    మంత్రిరాయనభాస్కరామాత్యుఁ బోల
    గలరె దాతలు మూఁడులోకములయందు?
మఱియు—
సీ. బట్టు దీవించుచు బాసికంబును జూప
                    వెలయఁ బెండిలిచేసి వేడ్కఁ బంపెఁ
    జొప్పకట్టలమీఁద సోలియుండఁగఁ జూచి
                    పట్టెమంచము పాన్పు బట్టు కిచ్చె
    వలెత్రాడుఁ జూపినఁ జెలఁగి యెద్దు నొసంగెఁ
                    బలుపుఁ జూచినఁ బాడిపశువు నిచ్చెఁ
    గళ్ళెంబుఁ జూపిన ఘనత గుఱ్ఱము నిచ్చె
                    జుట్టఁ జూపిన దాసిసుదతి నిచ్చె
గీ. స్నానమాడంగఁ గడియంబు జారఁ గడమ
    కడియమును వేయ శాంభవి కరము చూపె
    వెలయ రాయలకుం గ్రమ్మువేసి చూపె
    సరసహృదయుండు వినుకొండశాసనుండు
    భవ్యభరతుండు రాయనభాస్కరుండు.

సీ. నిత్యసత్యత్యాగనీతిలో శిబిఁ జెప్పి
                    నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
    బహుపరాక్రమమునఁ బరశురామునిఁ జెప్పి
                    నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
    రఘుకులోత్తముఁ డైన రామచంద్రునిఁ జెప్పి
                    నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
    సుకుమారతను సరి సురరాజసుతుఁ జెప్పి
                    నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
గీ. చెప్పఁ దగుఁగాక యితరులఁ జెప్పఁదగునె?
    కలియుగంబున నీవంటిఘనుఁడు కలఁడె?
    అమితగుణసాంద్ర! మానినీకుముదచంద్ర!
    భాగ్యదేవేంద్ర! రాయనిభాస్కరేంద్ర!
ఉ. సన్నుతలీలఁ బాండవులసంతతిఁ గర్ణుఁడు దాత గాక వా
    రన్నలు దమ్ములందు నొక రైన వదాన్యులు గారు; కీర్తిసం
    పన్నుని రాయనప్రభుని భాస్కరుసంతతి నెంచి చూడ వా
    రన్నలు దమ్ము లింటఁ గలయందఱు దాతలు భూతలమ్మునన్.
సీ. ఏవేళఁ జూచిన నిందిరానంద మై
                    యందమై చెలఁగు నీమందిరంబు
    ఏపాళఁ జూచిన గోపాలసత్కథా
                    ళిందమై చెలఁగు నీమందిరంబు
    ఏజాముఁ జూచిన నిష్టాన్నభోజనా
                    ళిందమై చెలఁగు నీమందిరంబు
    ఏప్రక్కఁ జూచిన సుప్రజానాయకా
                    ళిందమై చెలఁగు నీమందిరంబు

గీ. గాక తక్కినమంత్రివర్గములయిండ్లు
    మేకమెడచండ్లు గిజిగాండ్ల మెఱుగుగూండ్లు
    పూవుఁబోఁడులు నిర్మించు బొమ్మరిండ్లు
    భవ్యవిభవేంద్ర! రాయనిభాస్కరేంద్ర!
సీ. రంగత్కృపాదృష్టి గంగాభవానికి
                    మణికంకణంబు లేమంత్రి యొసఁగె
    భిక్షార్థ మీయఁగా నక్షయం బగునట్లు
                    మార్తాండుఁ డర్థ మేమంత్రి కొసఁగెఁ
    దగ వేఁడినంతలో జగతిపై నర్థికి
                    మానంబు ప్రాణ మేమంత్రి యొసఁగె
    మీసంబు తాకట్టు వేసి పదార్థంబు
                    మహిమచే నర్థి కేమంత్రి యొసఁగె
గీ. అతఁడు నందవరీకవరాన్వయుండు
    దుర్ఘటుండు వసిష్ఠగోత్రోద్భవుండు
    శత్రుమథనుండు వినుకొండశాసనుండు
    భవ్యభరతుండు రాయనిభాస్కరుండు.
క. వసుధేశుఁ గొల్వరాదో
    పసగలమణియంబు చేసి బ్రదుకఁగరాదో
    రససిద్ధిఁ బడయరాదో
    రసికుఁడు కారాదు గాక రాయినబాచా!
క. మీఁగాళ్లబంటినీళ్ళకు
    వీఁగుదు రమ్మక్క యనుచు వెరపున వనితల్
    చాఁగి పయోధులు దాఁటెను
    రాఁగై నీకీర్తికాంత రాయనిబాచా!
సీ. ఉత్తుంగభుజసూనుదత్తనందాపురీ
                    పుణ్యాగ్రహారాంశభోక్త యితఁడె

    ఆజన్మసంసిద్ధభూజనప్రఖ్యాత
                    దానసింహాసనాధ్యాసి యితఁడె
    కొండపల్లీరాజ్యమండలాఖిలమహా
                    గణకసందోహాగ్రగణ్యుఁ డితఁడె
    వైకుంఠతీర్థనిర్వాణసంయమికృపా
                    సంవర్ధితాఖిలైశ్వర్యుఁ డితఁడె
గీ. కొండవీ డుద్దగిరి పెనుగొండ గుత్తి
    పానుగ ల్విజయనగరపట్టనముల
    యర్థులకు నిచ్చు యితఁడె యిష్టార్థ మనుచు
    జగము రాయనభాస్కరుఁ బ్రెగడఁ బొగడు.
ఉ. రాజతకీర్తిశాలి యగు రాయనిభాస్కరు వేఁడఁబోవఁగా
    నాజికి నిట్లనున్ బరునియాలికి నిట్లను నర్థి కిట్లనున్
    దేజము పెంపులేని యతిదీనుని హీనుని వేఁడఁబోవఁగా
    నాజికి నిట్లనున్ బరునియాలికి నిట్లను నర్థి కిట్లనున్.
శ్లో. కృతయుగే బలిర్దాతా త్రేతాయాం రఘునందనః
    ద్వాపరే సూర్యపుత్త్రశ్య కలౌ రాయనభాస్కరః.
గీ. పరఁగ రాయనికులబాచని ధనమెల్ల
    భటులపాలు కవులపాలు దలఁప
    ధరను లోభివాని ధనము దాయాదుల
    పాలు జారకాంతపాలు వేమ!

ఈపద్యమువలన, వేమనకర్తయగు వేమన రాయని భాస్కరుని కాలపువాఁడని తేలుచున్నది. వేమాభిధానులగు నప్పటి కొండవీటి రెడ్డిరాజుల సంతతిలోనివాఁడె యైయుండును. ఈయుదాహరింపఁబడు పద్య మాతనిరీతిఁ దెలుపును.

క. కాదనఁ డెవ్వరినేనియు
    వాదులకుం బోఁడు వెఱ్ఱివానివలెనె తా
    భేదాభేదము లెఱుఁగఁడు
    వేదాంతరహస్య మెల్ల వేమన యెఱుఁగున్.
ఈపద్య మాభాస్కరునిర్యాణముఁ గూర్చి చెప్పఁబడినది.
చ. సహజకళంకమూర్తులు కుజాతులు గూఢతరోదయప్రభా
    మహితులు గోత్రవిద్విషదమాత్యులు రాత్రిచరానుకూలధీ
    సహితులు మందవర్తనులు సర్పసమానులు రాజసేవక
    గ్రహములు కాననయ్యె నల రాయనిభాస్కరుఁ డస్తమించినన్.

భాస్కరసూతి కొండమంత్రి

శా. కాండావిర్భవభాండభూపరివృఢగ్రైవేయశైలేయసూ
    కాండాటాధిపకేతుమాతులబలాకాశస్రవంతీమరు
    త్కాండాఖండలతుండిపాండురయశఃకర్పూరపేటీభవ
    త్కాండా! రాయనమంత్రి భాస్కరునికొండా! దండనాథాగ్రణీ!
శా. రెండా నాల్కలు సాంప్రదాయికునకున్ లెక్కింపఁగా నొక్కటే
    గండాగొండిశిఖండిబండనికి లెక్కల్లేని నాల్కల్గదా
    చండారాతికులాటవీదహనతేజస్స్ఫారధాటీలస
    త్కాండా! రాయనమంత్రి భాస్కరునికొండా! దండనాథాగ్రణీ!
క. పద్యము చెప్పిన సుకవికి
    హృద్యముగా నియ్యనట్టి హీనాత్ముని యా
    పద్యము పామై కఱచును
    బ్రద్యోతితకీర్తికాండ! భాస్కరుకొండా!

గీ. పడుచు నిడినవానిఁ బద్య మిచ్చినవానిఁ
    గడుపు కిడినవాని నడుపవలయు
    నడుపలేనివాని నయవిదు లెంతురా?
    భువిని భాస్కరేంద్రపుత్త్రకొండ!

రామలింగభాస్కరుఁడు

రామలింగభాస్కరుఁడు చిఱుతనాఁడు విద్యాభ్యాసము చేయుచుండఁగా నొక బట్టువాఁడు—
క. రాయని భాస్కరుతోనే
    పోయెసుమీ కీర్తికాంత—
అనెనఁట! తోడనే యాతఁడు తనకరముననున్న మణికంకణమును వాని కొసంగి— పోదె—అనెనఁట! అచ్చట మఱియొకఁడు మఱేదీ—అనెనఁట! అంతట నాభట్టుకవి పూరించెను.
    ఆయనమనుమఁడు చతురో
    పాయుండగు రామలింగ భాస్కరుఁ జేరెన్.
సీ. ఏమంత్రి సత్కీర్తి హిమసేతుపర్యంత
                    మవనిమండలము ముత్యాలశాల
    ఏమంత్రి మొగసాల యేప్రొద్దు చూచిన
                    సంగీతసాహిత్యసరసగోష్ఠి
    ఏమంత్రి యిలవేలు పిందురేఖామౌళి
                    చౌడేశ్వరీమహాశంభుశక్తి
    ఏమంత్రి సౌందర్య మిందీవరాక్షుల
                    వాలారుఁ జూపుల వలపుముద్దు

గీ. అతఁడు హరిదాసవంశాబ్ధి కబ్ధిభవుఁడు
    అర్థిదారిద్ర్యగాఢతమోర్కుఁ డతఁడు
    దానధర్మపరోపకారానుకూలి
    భాస్కరుని రామలింగన్న భాస్కరుండు.
సీ. నీదేవదేవుండు నిజభక్తరక్షాప
                    రాయణుం డాదినారాయణుండు
    నీతాత జగదేకదాత రాయనమంత్రి
                    భాస్కరాన్వయుఁ డైన భాస్కరుండు
    నీతండ్రి వితరణఖ్యాతినిఁ గలియుగ
                    కర్ణుండు రామలింగప్రధాని
    నీతల్లి పతిహితనీతి నరుంధతీ
                    దేవితోఁ బ్రతివచ్చు తిరుమలాంబ
గీ. తనర వెలిసితి వత్యంతవినయవిభవ
    గురుతరైశ్వర్య మహనీయగుణగణాఢ్య!
    భవ్యభరతుండ! వినుకొండ పాలకుండ!
    భాస్కరుని రామలింగయ్య భాస్కరుండ!
సీ. కడఁగి మేఘుం డేకకాలంబుననె కాని
                    కొమరొప్ప నేవేళఁ గురియఁగలఁడె
    కల్పభూరుహ మొక్కకాలంబుననె కాని
                    గరిమ నేవేళలఁ గాయఁగలదె
    కమలారు తా నొక్కకాలంబుననె కాని
                    యేవేల నమృతంబు నీయఁగలఁడె
    కామధేనువు నేకకాలంబుననె కాని
                    పెంపొంద నేవేళ బిదుకఁబడునె
గీ. పలుచనై పోక యాకులపాటు లేక
    వట్టిపోవక చిల్లరవంకలేక

    యనుదినం బర్థుల కొసంగె దౌర! భువిని
    ఘనసుగుణసాంద్ర! రామలింగయ్యచంద్ర!

గోపరాజు రామప్రథానుఁడు

శ్లో. శ్రీమాన్ గణపతి ర్భూపో గజపత్యన్వయోద్భవః
    అస్మిన్ భూమండలే తస్య బహవ స్సంతి మంత్రిణః
శ్లో. గోపరాజాన్వయో౽మాత్యో రామాఖ్యో గణకాగ్రణీః
    గణకానాం హితార్థాయ సద్యశ స్స్థాపనాయచ.
శ్లో. తిష్ఠత శ్శశిమార్తాండౌ యావత్తావ......
    గోత్రశా స్త్రాంబరేందూనాం సంఖ్యాబ్దే శాలివాహనే
శ్లో. రక్తాక్ష్యబ్దే భాద్రదర్శే అర్కగ్రహణకాలికే
    తేన రాజ్ఞా గ్రహీ ద్దానం కృష్ణవేణ్ణాతటే తథా.
శ్లో. ధర్మ మేత త్కలౌ యేన చాక్షిప్తంచ దురాత్మనా
    షష్ఠివర్షసహస్రాణి జాయతేఖరయోనిషు.

ప్రాచీనలేఖనములం దీశ్లోకము లగపడుచున్నవి. శా.1067లో గజపత్యన్వయుఁడగు గణపతి కలఁడో యని విచారింపవలసియున్నది. లేక, పైశ్లోకములందు ‘గణపత్యన్వయోద్భవః’ అని యగునో! ఈరామప్రథానుఁడు కమసాలులపరమయియుండు కరణికవృత్తులను నియోగిబ్రాహ్మణుల కిప్పించెనఁట! గృష్ణవేణ్ణానదీతీరమున భూదానప్రతిగ్రహ మొనర్చి సజాతీయుల నర్థించెనఁట! దానికి వైదీకు లెవరో యాక్షేపింపఁగా నియోగు లెవరో బదులుచెప్పిరి—

ఆక్షేపము


చ. అవగతశబ్దశాస్త్రచయు లైన మహాత్ములు పండితోత్తముల్
    భువనతలంబునం దధికపూజ్యులు వార లటుండఁ గూటికై
    నవనవకల్పవావిధిచణత్వము తోఁప నబద్ధమాడు నీ
    కవు లిల దానపాత్రు లయి గౌరవమందుట చూవె చిత్రముల్!
ఉ. మానఘనుండు బ్రహ్మకులమండనమూర్తి పరోపకారి దు
    ర్దానదురన్నముల్ గొనఁడు తప్పఁడు స్వామిహితోపకారముల్
    దీనులఁ బ్రోచు బాంధవవిధేయుఁడు డస్సియు వేఁడఁ బోఁడు తా
    నూనినవేడ్కతోడుత నియోగికి నిచ్చినదాన మల్పమే!
ఉ. వ్రాయుట చిత్రమా వికృతవైదికమా నిజదారరక్షణో
    పాయముకై నియోగి యిలఁ బార్థివసేవ యొనర్చినంతనే
    పాయునె వంశశీలములు పాయక యెప్పుడు చిత్రగుప్తులున్
    వ్రాయరె యెల్లలోకములవారలుఁ జేసిన పుణ్యపాపముల్.
చ. కవి కమలాసనుండు త్రిజగత్పతి యైనపినాకపాణియుం
    గవియె తలంపఁగాఁ గవులుకారె పరాశరబాదరాయణుల్
    కవికృతపుస్తకగ్రహణగర్వితు లల్పులె పూజ లందఁ గాఁ
    గవు లఁట! దానపాత్రు లఁట! కారఁట! యిట్టివిపో విచిత్రముల్.

ఆతని ప్రశస్తి


సీ. తనకీర్తి యాచంద్రతారార్కముగ మంత్రి
                    కులులకుఁ గరణికముల నొసంగె
    నతిథిసంతర్పణ మనుదినంబు నొనర్చి
                    ఖ్యాతిగా హరిహరప్రీతిఁ జేసె
    వర్ణాశ్రమాచారనిర్ణయంబుల నెల్ల
                    వేదోక్తరీతిగా వెలయఁజేసె

    ఘనవిప్రవందిమాగధకవీంద్రుల నెల్ల
                    నగ్రహారము లిచ్చి యాదరించె
గీ. నతఁడు శ్రీగోపరాజాన్వయాబ్ధిచంద్రుఁ
    డనఁగ విలసిల్లెఁ దనసాటిఘనులు పొగడ
    మంత్రిదైవేంద్రుఁ డనఁగ స్వతంత్రలీల
    మంత్రికులహేళి రామయామాత్యమౌళి.
సీ. వీఁడెపో! దుష్టారి వీరమంత్రికఠోర
                    భూధరంబులకు దంభోళిధార
    వీఁడెపో కవిరాజగాఢదారిద్ర్యాంధ
                    కారంబు లడఁగించు కమలహితుఁడు
    వీఁడెపో బహునీతివిద్యానిరూఢిచే
                    సురగురుఁ గెల్చిన శుభకరుండు
    వీఁడెపో చతురబ్ధివేష్టితావనిఁ గల్గు
                    బహుమంత్రికులసార్వభౌమమూర్తి
గీ. ఈతఁడే సర్వదేవతాప్రీతికరుఁడు
    ఈతఁడే గోపరాట్కులశీతభానుఁ
    డని కవీంద్రులు పొగడంగ నతిశయులై
    మంత్రి జంభారిరామయామాత్యశౌరి.

కరణము మల్లన


క. గంటము ఖడ్గముతోడుత
    నంటినఁ బగ దీర్పవలయు నవసరమైనన్
    గంటము శంఠముకొఱకా
    కంటకరిపుహృదయ భల్ల! కరణము మల్లా!

క. వంచింపఁ జనదు మంత్రికి
    వంచించినఁ గీర్తి గలదె వసుమతిలోనన్
    బెం చనిసిన ఖం గనునా
    కం చవిసిన ననును గాక కరణము మల్లా!
క. కరణము గ్రామాభరణము
    కరణము తమవంకవారి కాభరణం బౌ
    కరణము నృపునుపకరణము
    కరణము కులవార్ధిచంద్ర కరణము మల్లా!

బండారు కేతమంత్రి


ఉ. ఆలములోన నోడమికి నన్యవధూటులదిక్కు వోమికిన్
    మేలిమి కైన బొంకమికి మెచ్చినచో వృథ గామికిన్ మహీ
    పాలనకీర్తిలోలుఁ డగు బండరుకేతననీతిసాటికిన్
    నాలుక మడ్డుపట్టెద మనంబున రాముని నిల్పి వేడుకన్.

సీదయయాచమంత్రి


ఉ. మీఁదవెలుంగు పూర్ణశశిమేనికళంకము కప్పుఁ గ్రిందటల్
    రోఁదుచు నున్న శేషఫణరోచులకప్పు సుధాపయోధిలో
    నీఁదెఁడు కృష్ణు కప్పుఁ బరమేశ్వరుకంఠము కప్పుఁ గప్పి మా
    సీదయయాచకీర్తి విలసిల్లెను దిక్కులఁ బిక్కటిల్లుచున్.

కోటసింగరాజు

ఈతఁడు విద్యానగరప్రభువును శ్రీకృష్ణదేవరాయల తండ్రియు నగు వీరనరసింహరాయలకాలమున నున్నవాఁడు. రాజ శేఖరచరిత్రమును రచియించిన మల్లయకవితండ్రి మాదయ మైరావణచరిత్రమున వెంజెర్ల గోపమంత్రి తన్నిట్లు ప్రశంసించినట్లు చెప్పుకొన్నాఁడు.

సీ. మెప్పించినాఁడవు మెఱవడిఁ గర్ణాట
                    నరనాయకుని వీరనారసింహు
    ధట్టించినాఁడవు తస్కరకవిరాజిఁ
                    గోటసింగయ మంత్రి కొల్వులోన
    కాంచినాఁడవు కనత్కాంచనాభరణంబు
                    లేపార నందాపురీశుచేత
    అందినాఁడవు నుత్తమాశ్వద్వయంబును
                    గడిమి భూమండలరమణుచేత
గీ. నతిమతిస్ఫూర్తిఁ గ్రోడించినాఁడ వఖిల
    కావ్యలక్షణలక్ష్యసాగరము నెఱయ
    నిన్నుఁ బేర్వేర వర్ణింప నింక నేల
    ప్రోడ వన్నింట సర్వయమాదసుకవి!

కోటసింగరాజు నిరతాన్నదాత


సీ. పాయసాన్నప్రౌఢిపరిపాకమే చాలు
                    పిండివంటలరుచుల్ మెండు మేలు
    ఆజ్యప్రభావంబు రాజ్య మేమని చెప్పఁ
                    బల్చని పెస రొల్పుఁ బప్పు చెప్ప
    మెత్తనై స్వచ్ఛమై మెదవెడు రాజాన్న
                    మెన్నఁ గైకొంటి మోయన్న! నిన్న
    బహువిధశాకప్రపంచంబు తుదిముట్ట
                    నూరుఁగాయలరుచు లొరవు లుట్ట

గీ. అనుచు నీపంక్తి భుజియింతు రనుదినంబు
    భూసురశ్రేష్ఠు లెలమి నుప్పొంగి పొంగి
    మహితచారిత్ర కొండయామాత్యపుత్ర!
    కుటిలదుర్మంత్రిమదభంగ! కోటసింగ!
సీ. రావూరుపురిఢిల్లిరాజ్యంబులందుండి
                    సింధుబర్బరమధ్యసీమనుండి
    పాంచాలమాళవపాండ్యభూములనుండి
                    కటకకుల్యాచరగయలనుండి
    ఘోట్టాణటెంకణఘూర్దరోర్వులనుండి
                    మళయాళకేరళమహులనుండి
    భోజకర్ణాటకాంభోజభూములనుండి
                    సాల్వాంధ్రముఖ్యదేశములనుండి
గీ. చాలనేతెంచు సద్ద్విజసంఘములకు
    నన్నదానంబు గావించుచున్న దొరవు
    భవ్యచారిత్ర! కొండయప్రభుసుపుత్ర!
    కుటిలదుర్మంత్రిమదభంగ! కోటసింగ!
క. నరజన్మంబునఁ బుట్టినఁ
    గరణీకమె యుత్తమంబు కరణంబైనన్
    పురుషార్థపరుఁడు గావలె
    శిర సెత్తినఫలము కోటసింగనవర్యా!
చ. గడుసరి లోభియర్థ మది కన్నపుదొంగల బందిపోటుకున్
    బుడమిని వారకాంతలకు భూపతికిం జనుఁ గోటసింగ! నీ
    పడసిన యర్థ మార్తులకు బాంధవకోటికి యాచకాళికిన్
    గుడికిని సత్త్రశాలకును గూపతటాకవనప్రతిష్ఠకున్.
గీ. కోటసింగరాజు మాటవాసియె కాని
    గంగమాంబవలన ఘనత కెక్కె

    గంగమాంబ జగతి గయ్యాళియైనను
    సింగరా జింకేమి సేయఁగలఁడు.

నిట్టల హరిహరప్ప


క. నిజమా రాజ్యసుఖంబులు
    నిజమా తరుణీవిలాసనిరుపమలీలల్
    నిజమా సంపచ్చయములు
    నిజమా యీజీవనంబు నిట్టల హరియా!
క. ధీరోదారగుణంబులు
    కారణజన్మునకు వేఱె కఱపఁగవలెనా
    ధారుణిలోఁ డెంకాయకు
    నీరెవ్వరు పోసి రయ్య నిట్టలహరియా!
క. నిట్టలహరియుండయి యిలఁ
    బుట్టెను సురధేనుకల్పభూరుహములు దా
    మట్టులు గాకుండినచో
    నెట్టుల నిడు నర్థికోటి కీప్సితఫలముల్.
క. దాతలదాతవు గదరా
    భూతలమున నెట్టిసుకృతముం జేసిరొకో
    ఖ్యాతిగలనిన్నుఁ గనుటకు
    నీతరిదండ్రులు గడంగి నిట్టిలహరియా!

కొట్ఠరువు ఎఱ్ఱమంత్రి


ఉ. వీనులు సంతసిల్లు నిను విన్నఁ; గనుంగవ నిండువారు నీ
    మానితమూర్తిఁ గన్న; నిను మంత్రిశిఖామణి వన్ననాలుకం

    దేనియ లొల్కు; నీ వొసఁగు దివ్యవిభూషణచందనాదులన్
    మేనును నాసికేంద్రియము మెచ్చుర కొట్టరువెఱ్ఱధీనిధీ!

గుండమంత్రి


క. నెట్టన గజపతిదేవుని
    పట్టఁమునఁ గల్గు వీరభటసామంతుల్
    చుట్టములు దాతవే బళి!
    గట్టిగ గుండన్న కరుణ గల్గినకతనన్.

సింగనమంత్రి మాచఁడు


సీ. కులమును రూపును గుణమును గల్గిన
                    యింతి నిల్లాలుగా నేలవలయు
    వీర్యంబు హితమును వెరవును గల్గిన
                    పురుషుని బంటుగాఁ బ్రోవవలయు
    స్త్రీపెంపు వాటింప నోపక కలిమిమై
                    నిలయేలురాజును గొలువవలయు
    అఖిలంబు నెఱిఁగి దయాళుఁడై పెంపొందు
                    మూర్తి సద్గురుఁ డంచు మ్రొక్కవలయు
గీ. కాన నిన్నిగుణంబులు గల్గెనేని
    ఆలియెడఁ బుత్త్రునందు భూపాలువలన
    గురునిపట్టున సౌఖ్యంబు గూడు టరుదె
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. న్యాయంబు దప్పని నరపతి
                    నరపతి పాలించునాడు నాడు

    నా డెఱింగినదొరపోఁడిమి పోఁడిమి
                    పోఁడిమి సొబగైనబుధులు బుధులు
    బుధులు సంభావించుపురుషుండు పురుషుండు
                    పురుషోత్తమునిమీఁదిబుద్ధి బుద్ధి
    బుద్ధిమంతున కైనపుణ్యంబు పుణ్యంబు
                    పుణ్యలక్షణమైనపొలఁతి పొలఁతి
గీ. పొలఁతి యట్టిద కలవానికలిమి కలిమి
    కలిమి చల మని తెలిసినతెలివి తెలివి
    భానునిభతేజ! లక్కమాంబాతనూజ!
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. అర్థులయెడలఁ బ్రత్యర్థులయెడలను
                    వెఱ పెఱుంగనివాఁడె వీరవరుఁడు
    సతులసన్నిధి మహీపతులసన్నిధియందుఁ
                    దత్తఱింపనివాఁడె ధైర్యపరుఁడు
    ధన మగ్గలంబైనఁ జన నగ్గలంబైన
                    గర్వ మెర్గనివాఁడె కార్యపరుఁడు
    శివుమీఁద నైనఁ గేశవుమీఁద నైనను
                    దలఁపు నిల్పినవాఁడె తత్త్వఘనుఁడు
గీ. కాన నిట్టివివేకంబు గలిగి మెలఁగు
    పురుషు లిహపరసౌఖ్యముల్ పొందువారు
    భానునిభతేజ! లక్కమాంబాతనూజ!
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. ఈలోకపుసుఖంబు నాలోకపుసుఖంబు
                    సతిచేత సుతుచేతఁ జాలఁ బడసి
    మేనిరోగంబును లోనిరోగంబును
                    వెజ్జుచె వేల్పుచే నుజ్జగించి

    సురతర్పణంబు భూసురతర్పణంబును
                    భక్తిచే శక్తిచేఁ బరఁగఁ జేసి
    అతిసుకృతంబును నభిమతార్థంబును
                    నీతిధైర్యంబుల నెఱయఁజేసి
గీ. తొల్లిచన్నమహాత్ములత్రోవ దెలిసి
    తప్పకుండ మెలఁగువారు తత్త్వఘనులు
    భానునిభతేజ! లక్కమాంబాతనూజ!
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. తల్లిదండ్రులఁ బ్రోచుతనయుండు తనయుండు
                    తగురాజు చేపడ్డధరణి ధరణి
    అభిమానవతియైన యంగన యంగన
                    యక్కఱకొదవిన యర్థ మర్థ
    మొరుకాంతఁగోరనిపురుషుండు పురుషుండు
                    వేఁడనియోతనివిద్య విద్య
    సంగరాంగణమునఁ జచ్చుట చచ్చు టు
                    పవసించి సల్పెడువ్రతము వ్రతము
గీ. ఎదురు తన్నెఱిఁగినయట్టి యెఱుక యెఱుక
    ప్రజలు మెచ్చఁగఁ జెప్పెడిపాటి పాటి
    వగయె లేకుండ బ్రదికినబ్రదుకు బ్రదుకు
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. ఎరువుశృంగారంబు నరవుసంభోగంబుఁ
                    జేయుట యెల్లను సిగ్గుగాదె
    విప్పనిపువ్వును నొప్పనికాంతను
                    ననుభవించుట యెల్ల నధమవృత్తి
    తన్నెఱుంగక యున్న మన్నింపులేకున్నఁ
                    గాఁపురం బుండుట కష్టతరము

    తరమెఱుంగనిరాజు వరమీనిదైవంబుఁ
                    గొల్చుట యెల్లను గూళతనము
గీ. గాన నెప్పుడుఁ జతురుఁడై ఘనత మెఱసి
    ప్రజలు మెచ్చంగ సుఖలీల బ్రదుకవలదె
    భానునిభతేజ! లక్కమాంబాతనూజ!
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. ఉద్యోగహీనుఁడై యుండెడుమనుజునిఁ
                    బ్రోవంగఁ జాలఁ డేదేవుఁడైన
    ధరఁ గృతఘ్నుండైననరునివర్తన చూచి
                    క్రక్కదే పుచ్చినకుక్క యైన
    అత్యంతధనలోభి యగువాని యెడరోసి
                    నవసి వర్తిలవె ప్రాణంబు లైన
    అఖిలజగద్రోహి యగువాని కలుగరే
                    కృప చాలఁ గల్గిన తపసులైన
గీ. గాన నుద్యోగియై కృతఘ్నతకుఁ బాసి
    వెలయ లోభంబు విడిచి జీవులకు నెగ్గు
    సేయకుండెడువాఁడు విశిష్టుఁ డంద్రు
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. సంపద్ఘనునిఁ జేయఁజనదు కృతఘ్నుని
                    సైన్యాధిపతిఁ జేయఁజనదు భీతు
    కపటాత్ము నాత్మీయుఁగాఁ జేయ వలవదు
                    సన్మంత్ర మెఱిఁగింపఁజనదు సభల
    కార్యంబు లూహింపఁ గా దవివేకితోఁ
                    గాదు వంచకుఁ గార్యకర్తఁ జేయ
    పాపాత్ముఁ బరమిత్రు భక్తివిహీనుని
                    వలవదు పరిచరవర్తిఁ జేయ

గీ. అనృతభాషణుచేత దుర్వ్యసనిచేత
    లోలమతిచేత నత్యంతలోభిచేత
    వినినకార్యంబు వలవదు విశ్వసింప
    మనుజమందార! సింగనమంత్రిమాచ!
సీ. కులమున నధికుఁడై గుణవంతుఁ డయ్యెనా
                    యాకారహీనుఁడై యలరుచుండు
    నాకారలక్షణం బంతయుఁ గల్గెనా
                    యోగ్యత లన్నియు నొప్పకుండు
    యోగ్యత లన్నియు నొప్పుచ నుండెనా
                    గర్వాంధకారంబు గప్పియుండు
    గర్వాంధకారంబు గప్పక యుండెనా
                    యనుకూలసతి లేక యవయుచుండు
గీ. కొమ్మ గలిగిన సంతతికొఱకు వగచు
    పుత్త్రసంతతి మొదలుగాఁ బొందె నిన్ను
    భానునిభతేజ! లక్కమాంబాతనూజ!
    మనుజమందార! సింగనమంత్రిమాచ!

సాహిణి మారన


ముప్పదియిద్దఱుమంత్రుల సీసమాలిక యాసాహిణిమారుని నియోగిని జేసినది. ఈతఁడు బ్రాహ్మణుఁడుగాఁ దోఁపఁడు.
క. అప్పు లిడునతఁడు ఘనుఁడా
    అప్పు డొసఁగి మఱలఁ గాంచునాతఁడు రాజా
    చెప్పఁగవలె సాహిణిమా
    రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్.

క. మాటాడరాదు సభలన్
    మాటాడినఁ దప్పరాదు మగసింగముకున్
    మాటే మానము గాదా
    సాటువ గలవారికెల్ల సాహిణిమారా!
క. ఇంతులమనమున సరిసా
    మంతులమనములను బుద్ధిమంతులమదిలోఁ
    జింతింపని బ్రదు కేటికి
    సంతతసత్కీర్తిహార! సాహిణిమారా!
శ్లో. అజాగళస్థస్తన ముష్ట్రపృష్ఠం
    నాసాంతరే కేశ మథాండయుగ్మమ్
    వృథా సృజం త్సాహిణిమారభూపం
    పూజాం నలేభే భువి పద్మయోనిః

పెమ్మయ సింగరాజు

“పెమ్మయసింగధీమణీ” యను మకుటముతో నొక శతకమే రచింపఁబడెనేమో! ప్రయోగరత్నాకరమున “జక్కన చెప్పిన పెమ్మయధీమణిశతకము” అని యుదాహరింపఁబడెను. కాన నీసింగరాజు, ప్రౌఢదేవరాయలనాఁటివాఁ డగును.

చ. మిరియము లేని కూరయును మెచ్చు నెఱుంగని వారియీనియున్
    గరగరగానిభోజనము కన్నులపండువుగాని రూపమున్
    మురిపములేనియౌవనము మోహములేని లతాంగికూటమున్
    సరసుల కింపుగావు సుగుణాకర! పెమ్మయసింగధీమణీ!

పోర్చుగీసువారు (బుడతకీచులు) మనదేశమునకు రాకపూర్వ మిక్కడ మిర్యపుఁగాయలు లేవు. కారమునకు మిరియములే యుపయోగించెడివారు. ఆదేశమునుండి పోర్చుగీసువారే తొలుత వీనిని మనదేశమునకుఁ దెచ్చిరి. కావుననే నేఁటికిని గొందఱు వైదికకృత్యములందుఁ గారమునకుఁ మిర్యములనే యుపయోగింతురు. మిరియములకు బదులుగా నేర్పడినవిగాన వీనిని మనవారు మిర్యపుఁగాయ లనిరి.

ఉ. మచ్చికలేనిచోట ననుమానము వచ్చినచోట మెండుగాఁ
    గుచ్చితు లున్నచోట గుణకోవిదు లుండనిచోట విద్యకున్
    మెచ్చనిచోట రాజుకరుణించనిచోట వివేకు లుండిరే
    నచ్చట మోసమండ్రు సుగుణాకర! పెమ్మయసింగధీమణీ!
ఉ. వాసనలేనిపువ్వు బుధవర్గములేనిపురంబు నిత్యవి
    శ్వాసములేనిభార్య గుణవంతుఁడుగానికుమారుఁడున్ సద
    భ్యాసములేనివిద్య పరిహాసప్రసంగములేనివాక్యమున్
    గ్రాసములేనికొల్వు కొఱగానివి పెమ్మయసింగధీమణీ!
ఉ. ఆడిక కోడఁ డేని యుచితానుచితంబు లెఱుంగఁ డేని ము
    న్నాడినమాట తాఁ దిరుగనాడక యుండఁడ యేని ప్రల్లదం
    బాడెన యేని సిగ్గువివయంబు నయంబును వీడె నేని వాఁ
    డేడ నియోగి యయ్యెడు మహీస్థలిఁ బెమ్మయసింగధీమణీ!
ఉ. మాడలమీఁద నాస గలమానిసి కెక్కడికీర్తి కీర్తిపై
    వేడుక గల్గునాతనికి విత్తముమీఁద మఱెక్క డాస యీ
    రేడుజగంబులందు వెల హెచ్చినకీర్తిధనంబు గాంచి స
    త్ప్రౌఢయశంబుఁ జేకొనియె బమ్మయసింగఁడు దానకర్ణుఁడై.
ఉ. పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి నింపు లేదు తాఁ
    దిట్టక వాదు లేదు కడు ధీరత వైరుల సంగరంబులోఁ

    గొట్టక వాడలేదు కొడు కొక్కఁడు పుట్టక ముక్తి రాదయా
    పట్టపురాజుకైన నిది పద్ధతి పెమ్మయసింగధీమణీ!

నండూరి గుండమంత్రి


కేయూరబాహుచరిత్ర కృతిపతి యీతఁడు.
మ. ధరణిం దానగురుండ వీ వని కవీంద్రశ్రేణి వర్ణింపఁగా
    బిరుదుల్ నిండినగుండయేంద్రునకు గంభీరప్రభావోన్నతిం
    దొరకుం గా కతిలుబ్ధులైన గణకస్తోమంబుకుం గల్గినన్
    గిరికిం బెట్టినచందమౌ నితరులన్ గీర్తింపఁగా నేటికిన్.

తిమ్మరుసు


ఈతఁడు కృష్ణదేవరాయలయొద్ద ముఖ్యమంత్రి. రాయలకుఁ బితృసముఁడు. కృష్ణరాయ లీతని ‘నప్పాజీ’ యని పిల్చువాఁడు. ఒకప్పు డీతనియెడ భట్టుమూర్తికవి కడుఁ గుపితుఁడై యీక్రింద నుదాహరింపఁబడు నుత్పలమాలికాదులను జెప్పెనఁట.
ఉ. లొట్ట యి దేటిమాట పెనులోభులతో మొగమాట మేల తాఁ
    గుట్టకయున్న వృశ్చికముఁ గుమ్మరపుర్వని యందురే కదా
    పట్టపురాజుపట్టి సరిపల్లెసరాసరి యీయకున్న నేఁ
    దిట్టకమాన మహాగ్రహమతిన్ మరకగ్రహజర్జరీభటా
    పట్టనదట్టఫాలపణిభర్తృబహూకృతపర్జటస్ఫుటా
    ఘట్టపుదట్టణాలకవిఘట్టనిరర్గళరాజభృత్యకీ
    చట్టచటార్భటీనయనజర్జరకీలలు రాలఁగావలెన్

    జుట్టఱికంబునం బొగడఁ జూచితినా రజతాద్ర్యధిత్యకా
    పట్టణమధ్యరంగగతభవ్యవధూవదనానుషంగసం
    హట్టశిరస్స్థగాంగఝరహల్లకజాలసుధాతరంగముల్
    చుట్టుకొనన్వలెన్ భువనచోద్యముగా సయదంబుగా మఱిన్
    దిట్టితినా సభాభవనధీంకృతభీమనృసింహరాడ్ధ్వజా
    తాట్టమహాట్టహాసచతురాస్యసముద్భృకుటీతటీనటీ
    కోట్టణరోషడాలహృతకుంఠితకంఠగభీరనాదసం
    ఘట్టవిజృంభమాణగతి గావలె, దీవనపద్య మిచ్చి చే
    పట్టితినా మణీకనకభాజనభూషణభాసురాంబరా
    రట్టతురంగగంధగజరాజదమూల్యఘనాతపత్రభూ
    పట్టణభర్మహర్మ్యభటపఙ్క్తిచిరాయురనామయంబునై
    గట్టిగఁ దోడుతో వెలయఁగావలె నెక్కువఠీవిఁ జూడుఁ డీ
    యట్టిటు మందెమేలముల నందరనుం బలెఁ జుల్కఁజూచి యే
    పట్టుననైనఁ గేరడము పల్కకుఁడీ పయిపెచ్చునందులన్
    గొట్టుద దుష్కవిద్విరదకోటులఁ బంటముఖోద్భటాకృతిన్
    బెట్టుదు దండముల్ సుకవిబృందము కే నతిభక్తి సారెకున్
    గట్టితి ముల్లె లేఁబదియుఁ గాఁగలనూటపదాఱు లెయ్యెడన్
    రట్టడి భట్టుమూర్తికవిరాయనిమార్గ మెఱుంగఁ జెప్పితిన్.
గీ. ముందు నిప్పుడు నిఁకమీఁద మోద మలరఁ
    బద్యదండంబు చేఁబూని పార్థివులను
    జంపుచున్నాఁడు చంపును జంపఁగలఁడు
    పరుషవాక్యత సమవర్తి భట్టుమూర్తి.
శా. గుత్తిం బుల్లెలు కుట్టి చంద్రగిరిలోఁ గూ డెత్తి పెన్గొండలో
    హత్తిన్ సత్రమునందు వేఁడి బలుదుర్గాధీశుతాంబూలపుం
    దిత్తు ల్మోసి పదస్థులైన ఘనులన్ దీవింప—

అనునంతవఱకుఁ జెప్పునప్పటికిఁ దిమ్మరుసు దుష్కీర్తికి భయపడి పచ్చలహారము మెడనుండి తీసి భట్టుమూర్తికి సమర్పింపఁగా నాతఁడు ప్రహృష్టుఁడై పూరించెను—

    .........................................................దీవించెదన్
    మత్తారాతియయాతి నాగమసుతున్ మంత్రీశ్వరున్ దిమ్మరున్.
క. అయ్య యనిపించుకొంటివి
    నెయ్యంబునఁ గృష్ణరాయనృపపుంగవుచే
    నయ్యా! నీసరి యేరీ?
    తియ్యనివిలుకాఁడవయ్య! తిమ్మరుసయ్యా!
గురువై మహారాజ్యప్రదాపయితయై తన్ను సర్వవిధముల సంరక్షించిన తిమ్మరుసుమంత్రిని శ్రీకృష్ణరాయలు కడకాలమున విద్వేషించెను. ఆయన రెండుగుడ్లను దోడించెను. తన యశశ్చంద్రున కి ట్లపయశఃకళంకమును గూర్చుకొనెను.

చేమకూర అప్పరాజు


సీ. దాతతో నర్థులతారతమ్యముఁ జెప్పి
                    యిప్పింప నేర్చుఁ దా నీయనేర్చు
    నవరసాలంకారనయకవిత్వప్రౌఢిఁ
                    దెలియనేర్చును నన్యుఁ దెలుపనేర్చు
    భట్టవాగ్ధట్టసంఘట్టకవిత్వంబు
                    చదువఁగా విననేర్చుఁ జదువనేర్చు
    మానవోత్తము లైనమహితలాధీశుల
                    మెప్పింప నేర్చుఁ దా మెచ్చనేర్చు

గీ. దాత కవి భట్టురాజును దానయనుచు
    మహిమ నుతి కెక్కె ధారుణీమండలమున
    వీరరిపుదంతిమథనకంఠీరవుండు
    రమ్యశ్రీచేమకూరప్ప రాజుమంత్రి!
క. అనుదినము నీడ ద్రొక్కఁగ
    నొనరఁగ సురభూజ మీయ దొకకాసైనన్
    దినదినము సుకవిజనులకు
    ననయము శ్రీచేమకూరయప్పన యిచ్చున్.

విట్ఠల వెఱ్ఱమంత్రి


క. తనపేరు తల్లిపేరును
    తనుఁగాంచినతండ్రిపేరు దైవముపేరున్
    తనయున్నయూరుపేరును
    వినుకలిగా బ్రతుకవలయు విట్ఠలవెఱ్ఱా.
ఉ. శ్రీగలవేళి నాశ్రితుల శిష్టజనంబుల భూసురాళి న
    భ్యాగతులన్ గవీశ్వరుల బాంధవులన్ దగ నాదరించి మే
    ల్త్యాగము సేయు సర్వధన ధర్మవిధిజ్ఞులఁ జెందు కీర్తి బ
    ల్రాగకు యుక్తిమంత్రులకు రాదు గదా యిల వెఱ్ఱధీమణీ!

గుంటుపల్లి ముత్తరాజు


ఉ. అద్దిర! వీరముత్తఁ డభియాతిహరుండు కఠోరశాత్రవో
    ద్యద్దళనప్రచండకరుఁ డాజిభయంకరుఁ డబ్బ! వానితో
    వద్దు విరోధ మెంత బలవంతులకైనను నిన్నఁ బంపఁడే
    గద్దరివైరిరాచతలకాయలు నాలుగు గోలకొండకున్?
మ. అని నీవైరులమంత్రు లిట్లనిన నిన్నార్యుల్ కవుల్ పండితుల్
    ఘనదానంబున మేఘునిన్ శిబిఘను గంధీశ్వరుం గర్ణునిం

    జనులెల్లన్ వినుతింప గెల్చె నని విశ్వాసంబుగాఁ బల్కితౌ
    మును నీచేయుతపంబు గుంటుపలి శ్రీముత్తప్రధానాగ్రణీ!
క. పదివేలమాడ లిచ్చిన
    నిదిగొమ్మని యగ్రహార మిచ్చినఁ గానీ
    తుద ప్రియము చెప్పకుండిన
    ముదుగు సుమీ గుంటపల్లి ముత్తయమంత్రీ!
మ. అనఘప్రాభవ! గుంటుపల్లిసచివేంద్రా! ముత్తయామాత్య! నీ
    ఘనహస్తాబ్జనవీనవాసన మదంగవ్యాప్త మైనప్పుడే
    కనుఁగొంటిన్ జతురాంతయానపదముల్ గైకొంటి మేల్వస్తువుల్
    గనకస్నానము లబ్బె మాకు సెలవా కర్ణాటకక్షోణికిన్.
ఉ. వార్తల శత్రురాజుల నవశ్యము గెల్చె నటన్న మేటిస
    ద్వార్తలు బ్రహ్మచారులు వివాహము సేయుదు రన్నవార్తలుం
    స్ఫూర్తిగ షడ్రసాన్నములు భూసురకోటి కొసంగువార్తలుం
    గీర్తివిభూష గుంటుపలిఖేలన! వీరయమంత్రిముత్త! నీ
    వార్తలె కాని యెన్న నిఁక వార్తలు లేవు ధరాతలంబునన్.
ఉ. సంతత మారగించునెడ సజ్జనకోటులఁ బూజసేయు శ్రీ
    మంతుఁడు గుంటుపల్లికులమంత్రిశిఖామణి ముత్తమంత్రి దౌ
    బంతియె బంతిగాక కడుపందగులాముల బంతులెల్ల నూ
    ల్బంతులు దుక్కిటెడ్లమెడబంతులు విప్రవినోదగారడీ
    బంతులు దొంగవాండ్రములుబంతులు సుమ్ము ధరాతలంబునన్.
సీ. దుమ్ముధూళిగఁ జేసి తూర్పాలఁ బట్టఁడే
                    కోపాగ్నిచే బొమ్మలాపురంబు
    నుగ్గునూచంబుగా నూర్పిడి సేయఁడే
                    ధాటి మీఱఁగ నెఱ్ఱపాటి కోట
    కండతుండెములుగాఁ జెండి చెక్కాడఁడే
                    దండిబోయలపేటఁ జుండికోట

    కుటిలవైరులఁ ద్రుంచి కొల్లఁ బట్టింపఁడే
                    శ్రీలు మీరఁగ బోర లోలకోట
గీ. పాదుషాదత్తఘనరాజ్యపదనిరూఢిఁ
    జెందె శ్రగుంటుపలికులశేఖరుం డ
    టంటు నీవైరిమంత్రు లిట్లంద్రు భువిని
    మంత్రికులహేళి ముత్తయామాత్యమౌళి.

గుంటుపల్లి నరసింగమంత్రి


క. యాచకసంరక్షణకై
    భూచక్రమునన్ జనింపఁ బొ మ్మని నిన్నా
    వాచస్పతి పంపెనటే
    నాచక్కని గుంటుపల్లి నరసింగన్నా!
గీ. గురుయశశ్శాలి యగునట్టి గుంటుపల్లి
    మంత్రినరసింగరాయసన్మందిరమున
    నొక్కనాఁటివ్యయంబగుఁ దక్కినట్టి
    దేశపాండ్యాల యొకయేఁటిప్రాశనంబు.
మ. వరగంభీరతసింధురాజు కళలన్ వారాశిపుత్త్రుండు సుం
    దరభావంబున మన్మథుండు కరుణ న్దార్క్ష్యధ్వజుం డార్యస
    ద్గురునిప్రావనదానకర్ణుఁ డఖిలక్షోణీస్థలిన్ మంత్రిశే
    ఖరుఁ డీశ్రీకరగుంటుపల్లినరసింగామాత్యుఁ డెన్నందగున్.

నంది సింగన

పారిజాతాపహరణమును రచించిన నందితిమ్మనకు ముక్కు పొడుగుగా నుండుటచే ముక్కుతిమ్మన్న యనియుఁ బేరుకల్గెను. పారిజాతాపహరణము కృతినందినప్పుడు కృష్ణరాయ లీతనికి రత్నకుండలముల నొసఁగెను. ఒకనాఁ డీకవి కుండలముల ధరించి తన యింటియరుఁగుపైఁ గూర్చుండియుండఁగా భట్టుకవి త్రోవ నరుగుచు నీకందపద్యముఁ జెప్పెను—

క. మాకొలఁది జానపదులకె
    నీకవనపుఠీవి యబ్బునే కూపనట
    ద్భేకములకు? గగనధునీ
    శీకరములచెమ్మ నందిసింగయతిమ్మా.

ఆనందించి తిమ్మకవి చేత నేమియు లేకపోవుటచేఁ గర్ణమున నున్న కుండల మొకటి తీసి యాతని కొసఁగెనఁట! తర్వాత రాయలయాస్థానమునకు నొంటికుండలముతోఁ దిమ్మకవియు భట్టుకవియు వచ్చిరఁట! ప్రస్తావవశమున నీవృత్తాంతము రాజు విని ‘గగన’యనుచో ‘నాక’యని మార్చి పద్యము మిసమిసలార్చెనట.

క. మాకొలఁది జానపదులకె
    నీకవనపుఠీవి యబ్బునే కూపనట
    ద్భేకములకు నాకధునీ
    శీకరములచెమ్మ! నందిసింగయతిమ్మా!

తిమ్మకవియు భట్టుమూర్తికవియు రెండుకుండలములను రాజునకు సమర్పించిరఁట! రాయలు వారిసరసతకు మెచ్చి హెచ్చు బహుమతు లిచ్చెనఁట!

కటికి కామన్నమంత్రి

క. తననుడివడి గలదినములు
    కని మనవలె నరుఁడు కటికికామనవలెనే

    తనువులు ధనువులు రాజుల
    చనవులు నెన్నాళ్ళు నమ్మ సాళువతిమ్మా!

కోటిపల్లి శరభరాజు

గీ. నీతిదానహీనుని నియోగి నెవ్వరు
    కరణ మనరు వానికరుణ మనరు
    జాణ కోటిపల్లి శరభన్న నందఱు
    కరణ మనిరి వానికరుణ మనిరి.

వేములవాడ భీమకవి

ఈతఁడు పండ్రెండవశతాబ్ద్యారంభమున నున్నవాఁ డందురు. ‘లేములవాడ భీమకవి’ యనుపేరు కొన్నిపద్యముల యతిస్థానస్థాపితమై కలదు. అతఁడు నీతఁడును వేఱో! ఒక్కరో! ఈతఁ డాంధ్రకర్ణాటభాషలలో గొప్పకవి.

సీ. గడియలోపలఁ దాడి కడఁగి ముత్తునియగాఁ
                    దిట్టిన మేధావిభట్టుకంటె
    రెండుగడెల బ్రహ్మదండిముండ్లన్నియు
                    డుల్లఁ దిట్టిన కవిమల్లుకంటె
    మూఁడుగడెలకుఁ దా మొనసి యత్తినగండి
                    పగులఁ దిట్టిన కవిభానుకంటె
    అఱజాములోపలఁ జెఱువునీ ళ్ళింకంగఁ
                    దిట్టిన బడబాగ్నిభట్టుకంటె
ఆ. ఉగ్రకోపి నేను నోపుదు శపియింపఁ
    గ్రమ్మఱింప శక్తి కలదు నాకు

    వట్టిమానఁ జిగురు పుట్టింప గిట్టింప
    బిరుదు లేములాడ భీమకవిని.
ఈతఁడు శైవుఁడు. పాల్కురికిసోమనాథుఁ డాంధ్రమున రచియించిన బసవపురాణము నీతఁడు కన్నడించెను. “సోమగురువాక్యములు సొన్పి భీమసుకవి, గరిమ బసవపురాణంబు కన్నడించె”—తెలుఁగున నృసింహపురాణము రచియించె నఁట! కవిజనాశ్రయముకూడ నీతనిదే యందురు. ఈతని నివాసము దాక్షారామముగాక నైజాంరాష్ట్రమందలి వేములవాడ గ్రామమని కొందఱందురు. అది చింత్యము. నృసింహపురాణమందలిదని యీపద్యము లక్షణగ్రంధములం దుదాహరింపఁబడెను.
క. ఈక్షితికి వచ్చి ముందుగ
    దాక్షారామమున వారతరుణులనృత్యం
    బీక్షించి యంతకంటెను
    దత్క్షణమున నేర్చి రంభ తగ వేర్పడఁగన్
నృసింహపురాణమున—
క. కెంజిగురునకుం గఠినత
    వంజకుఁ బాల్ పిచ్చుగుంటువానికిఁ బరువున్
    నంజుడుకుఁ గమ్మఁ దావియు
    లంజెకు మే లెందు లేదురా విటరాయా!
కోమట్ల నీతఁడు తిట్టెను.
చ. గొనకొని మర్త్యలోకమునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
    కును గపటంబు లాలనయుఁ గుచ్చిబుద్ధియు రిత్తభక్తియున్
    ననువరిమాటలున్ బరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
    కొనుటలు నమ్ముటల్ మిగులఁ గొంటుఁదనంబును మూర్ఖవాదమున్.

ఉ. కోమటి కొక్క టిచ్చి పది గొన్నను దోసము లేద; యింటికిన్
    సేమ మెఱింగి చిచ్చిడినఁ జెందద పాపము; వాసి నెప్పుడే
    నేమరుపాటున స్మఱియు నేమియొనర్చిన లేద దోస మా
    భీముని లింగమాన! కవిభీమునిపల్కులు నమ్మి యుండుఁడీ!
ఉ. వేములవాడభీమ! భళిరే! కవిశేఖరసార్వభౌమ! నీ
    వేమని యానతిచ్చితివి యిమ్ములఁ గోమటిపక్షపాతివై
    కోమటి కొక్క టిచ్చి పదిగొన్నను దోసము లే దటంటివా
    కోమటి కొక్క టీక పదిగొన్నను ధర్మము ధర్మపద్ధతిన్.
భీమకవి యొకప్పుడు గుడిమెట్టయనుగ్రామమున కరిగెనఁట! సాగి పోతురా జనురా జాతనిగుఱ్ఱము నక్కడఁ దనసాహిణమునఁ గట్టిపెట్టించి యాతఁడు వేఁడినను విడిపింపఁ డయ్యె నఁట! దానిపైఁ గోపించి భీమకవి చెప్పిన పద్యము—
చ. హయ మది సీత పోతవసుధాధిపుఁ డారయ రావణుండు, ని
    శ్చయముగ నేను రాఘవుఁడ, సహ్యజ వారిధి మారుఁ డంజనా
    ప్రియతనయుండు లచ్చన విభీషణుఁ డాగుడిమెట్టలంక నా
    జయమును బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడుఁడీ!
సాహిణమారుఁ డనుదండనాథుఁడు చాళుక్యచొక్కభూపతి నెదిరించెనఁట! భీమకవి యామారుని శపించి చొక్కభూపతికే జయము చేకుర్చెనఁట—
ఉ. చక్కఁదనంబుదీవి యగు సాహిణిమారుఁడు మారుకైవడిన్
    బొక్కిపడంగలండు చలమున్ బలమున్ గల యాచాళుక్యపుం
    జొక్కనృపాలుఁ డుగ్రుఁడయి చూడ్కులమంటలు రాలఁ జూచినన్
    మిక్కిలి రాజశేఖరునిమీఁదికి వచ్చిన రిత్తవోవునే.

చాళుక్యచొక్కభూపాలుఁ డొకప్పుడు భీమకవిమాహాత్మ్యమును బ్రత్యక్షముగా నెఱుఁగఁగోరి “స్వామీ! మీ రాడినది యాట పాడినది పాట యగునందురు. వినోదార్థము కొండొకటి ప్రదర్శింప వేఁడెదను” అనఁగా భీమకవి నీయభీష్ట మే మని యడిగి తెలుసుకొని యచ్చటి మల్లెసాలనున్న స్తంభము చివుళ్ళతో జొంపములతో వృక్ష మగున ట్లీక్రింది పద్యము చెప్పెను.
శా. ఆనీతాభ్యుపదానశృంఖళకరాభ్యాలంబితస్తంభమా!
    నేనే వేములవాడభీమకవినేనిన్ జిత్రకూటంబులో
    భూనవ్యాపృతపల్లవోపలతికాపుష్పోపగుఛ్ఛంబులన్
    నానాపుష్పఫలప్రదాయి వగుమా నాకల్పవృక్షాకృతిన్.
అట్లే యాస్తంభము పుష్పఫలభరిత మగువృక్ష మయ్యెనఁట
ఉ. శంభువరప్రసాది కవిజాలవరేణ్యుఁడ నైన నావచో
    గుంభన మాలకించి యనుకూలత నొంది తనూనభావనన్
    గుంభినిఁ జొక్కనామనృపకుంజరుపందిటిమల్లెసాలకున్
    స్తంభమురీతి నీతనువు దాలిచి యెప్పటియట్ల యుండుమా!
భీమకవి తెలుంగాధీశునిఁ (కళింగాధీశుఁ డని కొన్ని ప్రతులు) గస్తూరి యాచించుచుఁ జెప్పిన పద్యము—
మ. ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ ద్రాక్షారామభీమేశనం
    దనుఁడన్ దివ్యవిషామృతప్రకటనానాకావ్యధుర్యుండ భీ
    మన నా పేరు వినంగఁ జెప్పితి, దెలుం(గళిం)గాధీశ! కస్తూరికా
    ఘనసారాదిసుగంధవస్తువులు వేగం దెచ్చి లాలింపురా!
చోడగంగుపైఁ జెప్పిన పద్యములు—
చ. అనిమొనఁ జోడగంగఁడు మురారి బలారి నరుండు మాద్రిజుం
    డన ఘనచక్రతోమరశరాసనకుంతము లల్కఁ బూని వ్రే

    యను వడి డాయ నేయఁ బొడువన్ గళమస్తకవత్సమర్మముల్
    తునియవె నుగ్గుగావె యెదఁదూఱవె నాటవె వైరివీరులన్.
ఉ. భోజుఁడు మంకు ధర్మజుఁడు బొంకు శచీపతి రంకు గల్వపూ
    రాజు కళంకు దైవతధరాజము డొంకు పయోధి యింకు నం
    భోజభవుండు పంకు ఫణిభూషణదేవుఁడు సంకు పద్మినీ
    రాజహితుండు క్రుంకు సరి రారు గుణంబుల నీకు ధారుణిన్.
భీమకవి మైలమభీమునిమీఁదఁ జెప్పిన పద్యములు—
చ. గరళపుముద్ద లోహ మవగాఢమహాశనికోట్లు సమ్మెటల్
    హరునయనాగ్ని కొల్మి యురగాధిపుకోఱలు పట్టుకార్లు ది
    క్కరటిశిరంబు దాయ లయకాలుఁడు కమ్మరి వైరివీరసం
    హరణగుణాభిరాముఁ డగు మైలమభీముని ఖడ్గసృష్టికిన్.
ఉ. ఏఱువభీమ! నీపగతు ఱెక్కనికొండలు చంచలాత్ములై
    దూఱనియట్టిఘోరవనదుర్గములున్ వనితావియోగులై
    పాఱనిద్రోవలుం దిననిపండ్లును నాఁకటఁగూర లుప్పగా
    నేఱనికఱ్ఱలుం గలవె యీలవణాంబుధివేష్టితావనిన్?
కళింగగంగునాస్థానమునకు భీమకవి యరుగఁగా నాతఁ డనాదరమున నిది సమయము కాదు పొమ్మనెనఁట! దానిపై భీమన కోపించి శాప మి ట్లొసఁగెను—
ఉ. వేములవాడభీమకవి వేగమె చూచి కళింగగంగు తా
    సామము మాని కోపమున సందడిదీఱిన రమ్ము పొ మ్మనెన్
    మోమును జూడ దోష మిఁక ముప్పదిరెండుదినంబులావలన్
    జామున కర్ధమం దతనిసంపద శత్రులపాలు గావుతన్.

శాపము ఫలించెను. రాజకళింగగంగు గర్భదరిద్రుఁడై పరుల కెఱుకపడకుండఁ బ్రచ్ఛన్నవేషము దాల్చి తిరిపమెత్తుచుఁ బొట్టగడపుకొనుచుండెను. భీమకవి యొకనాఁడు రాత్రి పల్లకి నెక్కి దివటీలతో నెక్కడకో పోవుచుండఁగా నాతఁడు త్రోవ నేఁగుచుఁ జీకటిలో నొకగోతఁ గూలి ‘అయ్యో! కాలిదివటీ యైన లే దయ్యెఁగదా’ యనుకొని చింతిలెనఁట! అది భీమకవి విని ‘నీ వెవ్వండ’ వని యడుగ ‘భీమకవిగారిచే జోగి చేయఁబడినవాఁడ’ ననెనఁట! భీమకవి ‘రాజకళింగగంగువా’ యనఁగా నాతఁడు కేల్మోడ్చి ‘రక్షింపుఁ’ డనెనఁట! అంతట—

ఉ. వేయుగజంబు లుండఁ బదివేలు తురంగము లుండ నాజిలో
    రాయల గెల్చి సజ్జనగరంబునఁ బట్టము గట్టుకో వడిన్
    రాయకళింగగంగు కవిరాజ భయంకరమూర్తిఁ జూడఁగాఁ
    బోయెని మీనమాసమునఁ బున్నమవోయినషష్ఠినాఁటికిన్.

అని యాశీర్వదించి తిరిగి లబ్ధరాజ్యునిఁ జేసెనఁట!

ఉ. రామునమోఘబాణమున రాజశిఖామణికంటిమంటయున్
    భీముగదావిజృంభణ ముపేంద్రునివజ్రము చక్రిచక్రమున్
    దామరచూలివ్రాఁతయును దారకవిద్విషుఘోరశక్తియున్
    (వే)లేములవాడభీమకవివీరుని తిట్టును రిత్తవోవునే!

కవిసార్వభౌముఁడు శ్రీనాథుఁడు

క్రై.1380 ప్రాంతమున జనియించి 1450 తర్వాతవఱకు జీవించి పూర్ణపురుషాయుషజీవియై యనేకసుకవిరాజసమ్మానములఁ గాంచి యాంధ్రకవిమండలియం దనన్యసామాన్యమైన సుప్రతిష్ఠ నంది మహాభోగముల ననుభవించుటయకాక తుదకుఁ గష్టములఁగూడఁ జవిసూచి బృహస్పతికి సయితము గుండియలు దిగ్గు రనునట్లు స్వర్గమున కరిగిన యుద్దండపండితకవిని దెల్గుదేశమున మాతృభాషాభిమానులలో నెఱుంగనివా రుండరు. ఈమహాకవిచే శృంగారనైషధాదులగు ప్రబంధములే కాక యింక ననేకము లగు చాటుపద్యములును రచియింపఁబడినవి. అందు రసోత్తరము లిం దుదాహరింపఁబడును.

శ్రీనాథుఁడు కర్ణాటాంధ్రరాజ్యాధీశ్వరుఁడగు సంబుపరాయని తెలుంగురాయలయొద్ద కరిగి యాతని నాశీర్వదించినది—

శా. ధాటీఘోటకరత్నఘట్టనమిళద్ద్రాఘిష్ఠకల్యాణఘం
    టాటంకారవిలుంఠలుంఠితమహోన్మత్తాహితక్షోణిభృ
    త్కోటీరాంకితకుంభినీధ సముత్కూటాటవీఝాటక
    ర్ణాటాంధ్రాధిప! సాంపరాయని తెలుంగా! నీకు బ్రహ్మాయువౌ.
ఆనృపాలునిఁ గస్తూరి యాచించుచుఁ జెప్పిన పద్యము—
శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా
    భిక్షాదానము సేయురా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
    దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
    వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.
వెల్గోటిరాజును బండితకవియు నగు సర్వజ్ఞసింగభూపాలు నాస్థానమునకుఁ బోయి యానృపాలుని కొల్వుకూటమునకు ముందుఁ బూజింపఁబడుచుండెడు శారదావిగ్రహమును గాంచి యాతఁడు చెప్పిన పద్యము—
సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి
                    దక్షిణాధీశు ముత్యాలశాల
    పలుకుఁదోడై తాంధ్రభాషామహాకావ్య
                    నైషధగ్రంథసందర్భమునకు

    పగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి
                    గౌడడిండిమభట్టు కంచుఢక్క
    చంద్రభూపక్రియాశక్తి రాయలయొద్దఁ
                    బాదుకొల్పితి సార్వభౌమబిరుద
తే. మెటులు మెప్పించెదో నన్ను నింకమీఁద
    రావుసింగమహీపాలు ధీవిశాలు
    నిండుకొలువున నెలకొనియుండి నీవు
    సకలసద్గుణనికురంబ! శారదాంబ!
సింగభూపాలుపైఁ జెప్పినది—
క. సర్వజ్ఞ నామధేయము
    శర్వునకే రావుసింగజనపాలునకే
    యుర్విం జెల్లును దక్కొరు
    సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే.
ఆయాస్థానమున నొకబట్టుకవి యిచ్చిన సమస్య—“కుక్కవొ నక్కవో ఫణివొ క్రోఁతివొ పిల్లివొ బూతపిల్లివో” కవిసార్వభౌముని పూరణము—
ఉ. తక్కిన రావుసింగవసుధావరుఁ డర్థుల కర్థ మిచ్చుచో
    దిక్కులలేనికర్ణుని దధీచిని ఖేచరు వేల్పుమ్రానుఁ బెం
    పెక్కిన కామధేనువు శిబీంద్రుని నెన్నుదు భట్ట! దిట్టవై
    కుక్కవొ! నక్కవో! ఫణివొ! క్రోఁతివొఁ! పిల్లివొ! బూతపిల్లివో!

శ్రీనాథుఁడు రెడ్లయాస్థానకవి. రెడ్లకు వెల్గోటివారికి వైరము. ఈతఁడు తిరిగి రెడ్లయాస్థానమునకుఁ బోఁగాఁ దమశత్రువగు సింగమనేని నట్లు పొగడినందుకు వారు కుపితులై యిచ్చకాలమారి వని చుల్కనచేసి పల్కిరఁట! నే నాపద్యమున నాతని గూఢముగా వెక్కిరించితినేగాని పొగడలేదని శ్రీనాథుఁ డిట్లాపద్యమున కన్వయము చెప్పెనట! “సర్వజ్ఞ నామధేయము శర్వునకే. రావుసింగజనపాలున కేయుర్విం జెల్లును? (శివునిఁగాక) తక్కొరు సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే.”

వేఱొకప్పుడు వెల్గోటి మాదయలింగమనేఁడు రెడ్లకఠారిని గైకొనఁగా నాకఠారిని దిరిగి రెడ్లకడకుఁ జేర్చుటకై శ్రీనాథుఁ డాతనికడ కరిగి పొగడిన పొగడ్త—

సీ. జగనొబ్బగండాంక సంగ్రామనిశ్శంక
                    జగతీశ రాయవేశ్యాభుజంగ
    అఖిలకోటలగొంగ యరిరాయమదభంగ
                    మే లందు ధరణీశమీనజాల
    మూరురాయరగండ ముఱియురాజులమిండ
                    యభివృద్ధి మీరు చౌహత్తమల్ల
    ఘనగాయగోవాళకామినీపాంచాల
                    బ్రహ్మాయు శశివంశపరశురామ
తే. దండిబిరుదులసురతాణిగుండె దిగుల
    బళిర యల్లయవేముని పగరమిండ
    రమణమించినమేదిని రావుబిరుద
    సంగరాటోప! మాదయలింగభూప!
కర్ణాటరాజ్యమున కరిగినప్పు డారాజు మీవాసస్థల మెట్టి దనఁగాఁ జెప్పినది—
సీ. పరరాజ్య పరదుర్గ పరవైభవశ్రీలఁ
                    గొనకొని విడనాడు కొండవీడు
    పరిపంథిరాజన్యబలముల బంధించు
                    కొమరు మించినబోడు కొండవీడు
    ముగురు రాజులకును మోహంబు పుట్టించు
                    గుఱుతైన యుఱిత్రాడు కొండవీడు

    చటులవిక్రమకళాసాహసం బొనరించు
                    కుటిలాత్ములకు గాడు కొండవీడు
తే. జవనఘోటకసామంతసరసవీర
    భటనటానేకహాటకప్రకటగంధ
    సింధురారవమోహనశ్రీలఁ దనరు
    కూర్మి నమరావతికి జోడు కొండవీడు.
అక్కడ రాజసమ్మానమునకుఁ గాలయాపనము కొంత సంభవింపఁగా నాదేశపు విధము తనకు సరిపడక కర్ణాటరాజ్యలక్ష్మిం బ్రార్థించుచుఁ జెప్పిన పద్యము—
శా. కుల్లాయుంచితిఁ గోఁక సుట్టితి మహాకూర్పాసముం దొడ్గితిన్
    వెల్లుల్లిం దిలపిష్టమున్ మెసివితిన్ విశ్వస్త వడ్డింపఁగా
    సల్లా నంబలిఁ ద్రావితిన్ రుచులు దోసం బంచుఁ బోనాడితిం
    దల్లీ! కన్నడరాజ్యలక్ష్మి! దయలేదా నేను శ్రీనాథుఁడన్.
తొలుత నీతఁడు కొండవీటిరెడ్లయాస్థానకవి. ఆరాజ్య మంతరించినతర్వాత రాజమహేంద్రవరమున రాజ్యమేలు నళ్లయవేమవీరభద్రారెడ్లయొద్దఁ జేరెను. వేముని వర్ణించిన వర్ణనము—
సీ. రాజనందనరాజరాజాత్మజులు సాటి
                    తలఁప నల్లయవేమధరణిపతికి
    రాజనందనరాజరాజాత్మజులు సాటి
                    తలఁప నల్లయవేమధరణిపతికి
    రాజనందనరాజరాజాత్మజులు సాటి
                    తలఁప నల్లయవేమధరణిపతికి
    రాజనందనరాజరాజాత్మజులు సాటి
                    తలఁప నల్లయవేమధరణిపతికి
తే. భావభవభోగసత్కళాభావములను
    భావభవభోగసత్కళాభావములను

    భావభవభోగసత్కళాభావములను
    భావభవభోగసత్కళాభావములను.
ఉ. వీరరసాతిరేక రణవిశ్రుత! వేమనరేంద్ర! నీయశం
    బారభమానతారకరహారవిలాసము నీ భుజామహం
    బారభమానతారకరహారవిలాసము నీపరాక్రమం
    బారభమానతారకరహారవిలాసము చిత్ర మారయన్.
వేమవీరభద్రారెడ్లు ప్రతివర్షమును సింహాచలపునృసింహస్వామికిఁ దిరునాళ్ళు జరిపించుచుండెడివారు. శ్రీనాథుఁడును వారితో నచ్చటి కరిగెడివాఁడు. ఆపర్వతముమీఁదికి యాత్రార్థము వచ్చు నానాస్త్రీలను జూచి యాతఁడు వర్ణించిన వర్ణనము—
సీ. హరినీలములకప్పు లణగించు నునుకొప్పు
                    విడఁ బువ్వుదండ తా వీడఁబాఱ
    కోటిచందురుడాలు గోటుమీటఁగఁ జాలు
                    మొగముఁ గుంకుముచుక్క సొగసు గుల్క
    అలజక్కవలజిక్కు లణఁగఁద్రొక్కఁగ నిక్కు
                    పాలిండ్లపై నాఁచుపైట జాఱ
    ఇసుకతిన్నెలమెట్టు పసిఁడిచెంపలఁగొట్టు
                    పిఱుఁదుపై మొలనూలు బెళుకుదేర
తే. చిగురుఁగెమ్మోవిఁ బగడంపు బిగియు మెఱయ
    మాట లాడఁగఁ గనుదోయితేట లమరఁ
    జెమట లూరంగ సింహాద్రి చేరవచ్చె
    భోగగుణధామ యాంధ్రనియోగిభామ.
సీ. విడినకొప్పున జాజివిరు లొప్పుగా రాలఁ
                    జిట్టికుంకుముచుక్కబొట్టు చెదర
    చక్కఁగాఁ బటువారుసందెడుకుచ్చెళ్ళు
                    చెలఁగు మెట్టియలపైఁ జిందులాడ

    కొదమగుబ్బలఁ బైఁటకొంగు సయ్యన జాఱ
                    ముక్కున త్తొకవింతముద్దుఁ గుల్క
    మొలగంట లిమ్మగుమ్రోతఁతో రంజిల్ల
                    గనకంపుటందియల్ ఘల్లు రనఁగఁ
తే. బొసఁగఁ గప్రంపువీడెముల్ పొందుపఱిచి
    యనుఁగుఁజేడెలతో ముచ్చ టాడికొనుచు
    నలరుసింహాద్రిపై కెక్కి హర్షమునను
    వచ్చెఁ గలకంఠి వేపారిమచ్చెకంటి.
శా. రా పాడంగల గుబ్బచన్నుఁగవతో రాకేందుబింబంబుపైఁ
    దూ పేయంగల ముద్దునెమ్మొగముతోఁ దోరంపుమైచాయతోఁ
    జూపున్ ముద్దుల బాలసంఘములతో సొంపారు లేనవ్వుతో
    వేపార్యంగన వచ్చెఁ గాసెబిగితో వేణీభరచ్ఛాయతోన్.
సీ. పలుతెఱంగులరంగు పద్మరాగలవీణె
                    చకచకత్ప్రభల సాక్షాత్కరింప
    సొంపుతో రవచెక్కడంపుముంగరచాయ
                    పవడంపుమోవిపైఁ బరిఢవిల్ల
    విరిసి యోసరిలి క్రిక్కిఱిసిన చనుదోయి
                    బిగువున నెఱఱైక పిక్కటిల్ల
    ఒసపరి యొయ్యారి ముసుగులో నెఱివేణి
                    కొమరాలిమూఁపున గునిసియాడ
తే. విరులతావియు నెమ్మేనివెనుకకచ్చ
    పెళపెళక్కనుచిఱుదొడల్ బెళుకునడుము
    వలుదపిఱుఁదులు కలికిచూపులబెడంగు
    లొలయఁ గన్గొంటి వేపారికలువకంటి.
క. రంభాస్తంభము లూరువు
    లంభోరుహనిభము లక్షు లతనుశరంబుల్

    జంభాసురారిమదగజ
    కుంభము లీనంబివారికోడలికుచముల్.
క. అద్దిర! కులుకులు బెలుకులు
    నిద్దంపుమెఱుంగుఁదొడలనీటులు గంటే
    దిద్దుకొని యేలవచ్చును
    ముద్దియ యీ నంబిపడుచు ముచ్చట దీఱన్.
సీ. పొలుపొందఁగ విభూతిబొట్టు నెన్నొసలిపైఁ
                    దళుకొత్తుచెమట కుత్తలపడంగ
    సొగసుగాఁ బూదండఁ జోఁపిన కీల్గొప్పు
                    జాఱఁగా నొకచేత సరుదుకొనుచు
    బిగిచన్నుగవమీఁద బిరుసుఁబయ్యెదచెంగు
                    దిగజాఱి శివసూత్ర మగపడంగ
    ముక్కున హురుమంజిముత్యాలముంగర
                    కమ్మవాతెఱమీఁద గంతులిడఁగ
తే. కౌను జవ్వాడ మట్టియల్ గదిసి మ్రోయ
    గమ్మవిలుకాని జాళువాబొమ్మ యనఁగ
    మెల్లమెల్లన సింహాద్రిమీఁది కేఁగెఁ
    గన్నెపూఁబోఁడి యగసాలి వన్నెలాఁడి.
అక్కడఁ దంబురా చేతఁబూని గానముసేయుచు వచ్చు సాతానివెలఁదిపైఁ జెప్పినది—
సీ. మీఁగాళ్ళ జీరాడు మేలైనకుచ్చెళ్ళ
                    తీరున మడిచీర తీర్చికట్టి
    బిగువుగుబ్బలమీఁద నిగనిగల్ దళుకొత్తు
                    నోరపయ్యెదకొంగు జాఱవైచి
    వలపుల కొకవింత గలుగఁగా గొప్పలౌ
                    కురులు నున్నగ దువ్వి కొప్పువెట్టి

    నెలవంక నామంబు సలలితంబుగ నుండి
                    తిరుచూర్ణ మామీఁదఁ దీర్పుచేసి
తే. ఓరచూపుల విటులఁ దా నూరడించి
    గిల్కుమెట్టెలరవరవల్ గుల్కరింపఁ
    జిలికి చేసిన తామ్రంపుఁజెంబుఁ బూని
    వీథి నేతెంచె సాతానివేడ్కలాఁడి.
అట దుకాణమునఁ దమలపాకులు కొనఁబోయి చెప్పినది—
చ. తొలకరిమించుఁదీవగతి తోఁప దుకాణముమీఁద నున్న య
    య్యలికులవేణితోఁ దములపాకులబేరము లాడఁబోయి నే
    వలచుట కేమి శంకరునివంటిమహాత్ముఁడు లింగరూపియై
    కులికెడు దానిగబ్బిచనుగుబ్బలసందున నాట్య మాడఁగన్.
ఉ. అంగడివీథిఁ బల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచున్
    జంగమువారిచిన్నది పిసాళితనంబునఁ జూచెఁబో నిశా
    తాంగజబాణకైరవసితాంబుజమత్తచకోరబాలసా
    రంగతటిన్నికాయముల రంతులు సేసెడు వాఁడిచూపులన్.
సీ. బాలేందురేఖసంపద మించి విలసిల్లు
                    నొసటితళ్కులనీటు నూఱు సేయు
    భ్రమరికాహరినీలచమరవాలములఁ బోల్
                    వేణీభరముచాయ వేయు సేయు
    దర్పణద్విజరాజధాళధళ్యప్రభ
                    లపనబింబస్ఫూర్తి లక్ష సేయుఁ
    కోకహాటకశైలకుంభికుంభారాతి
                    కుచకుంభయుగళంబు కోటి సేయు
తే. జఘనసీమకు విలువ లెంచంగ వశమె
    దీనిసౌందర్యమహిమంబు దేవుఁ డెఱుఁగుఁ
    నహహ! యెబ్భంగి సాటిసేయంగ వచ్చు
    భావజునికొల్వు జంగముభామచెల్వు.

మ. విమలాంభోరుహపత్రజైత్రములుగాఁ బెంపారు నేత్రమ్ములన్
    గమనీయంబగుకజ్జలం బునిచి రేఖాసౌష్ఠవం బొప్ప నా
    గముతోఁ జేసిన సిందురంబు నుదుటం గాన్పింపఁ బయ్యంటయున్
    యమునాఱైకయు దాఁటి పూఁపచను లొయ్యారంబు సూపన్ దుకా
    ణముపై బొందిలి దోర్తు నిల్చె ముఖచంద్రస్ఫూర్తి శోభిల్లఁగన్.
నీలాటిరేవున స్నానమునకై యరిగి యచ్చట నున్న నానావనితలఁ జూచి చెప్పిన పద్యములు—
ఉ. వీసపుముక్కునత్తు నరవీసపుమంగళసూత్ర మమ్మినన్
    గాసుకురానికమ్మ లరకాసును గానివి పచ్చపూసలున్
    మాసినచీర గట్టి యవమాన మెసంగఁగ నేఁడు రాఁగ నా
    కాసలనాటివారికనకాంగిని జూచితి నీళ్ళరేవునన్.
క. పూజారివారికోడలు
    తా జారఁగ బిందె జారి దబ్బునఁ బడియెన్
    మైజాఱుకొంగు దడిసిన
    బాజారే తిరిగి చూచి పక్కున నవ్వెన్.
శా. పొచ్చెం బింతయు లేనిహంసనడతోఁ బొల్పొందు లేనవ్వుతోఁ
    బచ్చల్ దాపిన గుల్కుముంగరలతో బాగైనకెమ్మోవితో
    నచ్చంబైన ముసుంగువెట్టి చెలితో నామాటలే యాడుచున్
    వచ్చెంబో కుచకుంభముల్ గదలఁగా వామాక్షి తా నీళ్ళకున్.
ఉ. శ్రీకరభూషణంబులును సిబ్బెపుగుబ్బలు ముద్దుఁజెక్కులున్
    గోకిలవంటిపల్కులును గొల్చినఁ జేఱలఁ గేరుకన్నులున్
    బ్రాకటదేహకాంతియును బంగరుబొమ్మకు హెచ్చు వచ్చు నీ
    చాకలవారిజవ్వనికి సాటికి రా రికఁ దొంటిజవ్వనుల్.
క. నీలాటిరేవులోపల
    మేలిమితోఁ దీర్చినట్టు మెఱసి నిలుచుచున్

    దాలిమిని వాలుఁజూపుల
    బాలామణి గుట్టు బైటఁబడఁగాఁ జూచెన్.
కొండవీట నున్నప్పు డెడనెడఁ బల్నాటిసీమకు శ్రీనాథుఁడు పోవుచుండెడివాఁడు. పల్నాటిసీమపై నీతనికిఁ గల యనాదరము ననేకపద్యములఁ బట్టి తెలిసికొననగు. పల్నాటివారికిఁ గారెమపూఁడి కాశి యట.
ఉ. వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుఁడు కళ్ళిపోతురా
    జారయఁ గాలభైరవుఁడు నంకమశక్తియ యన్నపూర్ణయున్
    గేరెడుగంగధారమడుఁగే మణికర్ణిక గాఁ జెలంగు నీ
    కారెమపూఁడిపట్టణము కాశిగదా పలినాటివారికిన్.
పల్నాటిసీమపై నీతనికిఁ గల యనాదరము—
క. రసికుఁడు పోవఁడు పల్నా
    డెసఁగంగా రంభయైన నేకులె వడుకున్
    వసుధేశుఁడైన దున్నును
    గుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్.
పల్నాటిసీమలో నెంతోలోఁతు త్రవ్వినఁగాని నీళ్ళూరవు. అక్కడి చేఁత్రాళ్ళు కొండవీటిచేఁత్రాళ్ళకు ద్విగుణితములై యుండవలయును. అంతలోఁతు త్రవ్వినను గొన్నిచోట్లు నీరూరక రాతిచట్టులు వచ్చును; కాన నీళ్ళకై యెంతోసొమ్ము భంగపడవలసి వచ్చుచుండును. ఈవిషయమునఁ జెప్పిన పద్యము—
ఉ. అంగడి యూర లేదు వరియన్నము లేదు శుచిత్వ మేమి లే
    దంగన లింపు లేరు ప్రియమైనవనంబులు లేవు నీటికై
    భంగపడంగఁ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
    న్నంగను సున్న గాన పలినాటికిఁ మాటికిఁ బోవ నేటికిన్?

పల్నాటిప్రాంతములందు గ్రామమున కెవ్వరేని పెద్దలు వచ్చిన గ్రామపురోహితునింట విడిదల సేయింతురు. శ్రీనాథుఁ డొకపురోహితునింట విడిసి యచ్చటి రోఁత నిట్లు వర్ణించె. (ఆవైపులఁ బురోహితు లూరిలోని తమయాశ్రితులయిండ్ల కనుదినమును విస్తళ్ళు కుట్టి యిచ్చుచుండవలెనఁట! దానికై నిల్వచేసి యుంచుకొన్న విస్తరాకులు గలవు.)

ఉ. దోసెఁడుకొంపలోఁ బసులత్రొక్కిడి మంచము దూడరేణమున్
    బాసినవంటకంబు పసిబాలురశౌచము విస్తరాకులున్
    మాసినగుడ్డలున్ దలకుమాసినముండలు వంటకుండలున్
    రాసెఁడుకట్టెలుం దలఁపరాదు పురోహితులింటికృత్యముల్.
ఆ. చిన్నచిన్నరాళ్ళు చిల్లరదేవళ్ళు
    నాగులేటినీళ్ళు నాఁపరాళ్ళు
    సజ్జజొన్నకూళ్ళు సర్పంబులును దేళ్ళు
    పల్లెనాఁటిసీమ పల్లెటూళ్ళు.
క. జొన్నకలి జొన్నయంబలి
    జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్పన్
    సన్నన్నము సున్నసుమీ
    పన్నుగఁ బల్నాటిసీమ ప్రజ లందఱకున్.
త్రోవను మంచినీరు దొరకక చెప్పినది—
క. సిరిగలవానికిఁ జెల్లును
    దరుణులు పదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్
    దిరిపెమున కిద్దరాండ్రా
    పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్.

ఒకప్పుడు పల్నాటిలో నొకరింట నీతనికి జొన్నకూడును, జింతచిగురును బచ్చలియాకును గల్పివండిన యుడుకుఁగూరయు వడ్డింపఁగాఁ జెప్పిన పద్యము—
ఉ. ఫుల్లసరోజనేత్ర! యలపూతనచన్నులచేఁదు ద్రావి నాఁ
    డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేల? తింత్రిణీ
    పల్లవయుక్తమౌ నుడుకుబచ్చలిశాకము జొన్నకూటితో
    మెల్లన యొక్కముద్ద దిగమ్రింగుము! నీపస కాననయ్యెడిన్.
గురిజాలసీమను గల పులిపాడనుగ్రామమునకు శ్రీనాథుఁడు పోఁగా నాతనియెడ నచ్చటి శేషయ్య యను కరణమును హనుమయ్య యనుకాఁపును పుల్లయ్య యనురెడ్డియును ననాదరము చూపిరఁట! దానిపై నాతఁడు చెప్పిన పద్యము—
ఆ. ఊరు వ్యాఘ్రనగర మురగంబు కరణంబు
    కాఁపు కపివరుండు కసవు నేఁడు
    గుంపు గాఁగ నిచట గురిజాలసీమలో
    నోగు లెల్లఁ గూడి రొక్కచోట!
నెమలిపురిపైఁ జెప్పినది—
క. నెమలిపురి యమపురముగా
    యముఁ డాయెను బసివిరెడ్డి యంతకు మిగులన్
    యమదూత లైరి కాఁపులు
    క్రమ మెఱుఁగని దున్న లైరి కరణా లెల్లన్!
అడిగొప్పులపైఁ జెప్పినది—
క. గుడిమీఁదిక్రోఁతితోడను
    గుడిలోపలినంబివారికోడలితోడన్
    నడివీథిలంజెతోడను
    నడిగొప్పులయోరుగాలి నడిగితి ననుమీ!

మసర(?)రాజ్యముపైఁ జెప్పిన పద్యములు—
ఉ. గొంగడి మేలుపచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్
    జెంగట వాయుతైలము లజీర్ణపుమందులు నుల్లిపాయలున్
    ముంగిట వంటకట్టియలమోపులు దోమలు చీఱపోతులున్
    రంగ! వివేకి కీమసరరాజ్యము కాఁపుర మెంత రోఁతరా!
ఉ. వంకరపాగలున్ నడుమువంగినకత్తులు మైలకోఁకలున్
    సంకటిముద్దలుం జనుపశాకములుం బలుపచ్చడంబులుం
    దెం కగునోరచూపులును దేఁకువదప్పినయేసబాసలున్
    ఱంకులబ్రహ్మ యీమసరరాజ్యము నెట్లు సృజించె?నక్కటా!
ఉ. ఆదరణంబు సున్న వినయంబు హితంబును బొంకు సత్యమా
    లేదు దయారసం బది హుళక్కి పసాపడువేళ పఙ్క్తిలో
    భేదపుఁబెట్టు దిట్టబలిభిక్షముఁ ……................… త
    త్వాదుల బుట్టఁజేసినవిధాత ప్రజాపతి గాకయుండునే!
రేనాటినిగూర్చి—
క. గరళము మ్రింగితి నంచుం
    బురహర! గర్వింపఁబోకు పో! పో! పో! నీ
    బిరు దింకఁ గానవచ్చెడి
    మెఱసెడి రేనాఁటిజొన్నమెదుకులు తినుమీ!
పడమటిసీమ వ్యాపారులపైఁ జెప్పిన పద్యము—
శా. దస్త్రాలున్ మసిబుఱ్ఱలుం గలములుం దార్కొన్నచింతంబళుల్
    పుస్తుల్ గారెడుదుస్తులుం జెమటకంపుం గొట్టునీర్కావులుం
    అస్తవ్యస్తపుఁగన్నడంబును భయంబై తోఁచు గడ్డంబులున్
    ‘వస్తూ చూస్తిమి రోస్తిమిన్’ బడమటన్ వ్యాపారులం గ్రూరులన్.

శబరకాంతలు—
క. గిటగిటనగు నెన్నడుములు
    పుటపుటనగు చన్నుఁగవలు పున్నమనెలతో
    జిటపొటలాడెడు మొగములు
    కటితటములకొమరు శబరకాంతల కమరున్.
తే. వీనులకు విందులై తేనెసోన లెనయ
    ముందురాగంబునను జగన్మోహనముగ
    పాడె నొకజాలరిమిటారి యీడులేని
    కాకలీనాదమున నోడగడపుపాట!
ఒకప్పుడు ధనలబ్ధి తనకు లేకపోఁగాఁ జెప్పినది—
మ. కవితల్ సెప్పినఁ బాడనేర్చిన వృథాకష్టంబె యీబోగపుం
    జవరాండ్రేకద భాగ్యశాలినులు పుంస్త్వంబేల పో పోఁచకా
    సవరంగా సొగసిచ్చి మేల్ యువతివేషం బిచ్చి పుట్టింతువే
    నెవరున్ మెచ్చి ధనంబు లిచ్చెదరుగాదే పాపపుందైవమా!
రాజమహేంద్రవరమున శాస్త్రపండితులతో వివాదపడి చెప్పినపద్యములలో నొకటి—
మ. శ్రుతిశాస్త్రస్మృతు లభ్యసించుకొని విప్రుం డంత నానాధ్వర
    వ్రతుఁడై పోయి కనున్ బురందరపురారామద్రుమానల్పక
    ల్పతరుప్రాంతలతాకుడుంగసుఖసుప్తప్రాప్తరంభాంగనా
    ప్రతి.......oకురపాటనక్రమకళాపాండిత్యశౌండీర్యముల్.
ఒకనాఁ డొకవనిత తన్నుఁ గికురింపగా జెప్పినది—
ఉ. హా జలజాక్షి! హా కిసలయాధర! హా హరిమధ్య! హా శర
    ద్రాజనిభాస్య! హా సురతతంత్రకళానిధి! యెందుఁ బోయితే

    రాజమహేంద్రవీధిఁ గవిరాజు ననుం గికురించి భర్గకం
    ఠాజితకాలకూటఘుటికాంచిత మైన యమాసచీఁకటిన్?
కడిదిపురమున కరిగి చెప్పినవి—
క. ముదివిటులు విధవలంజెలు
    పదకవితలు మాఱుబాసబాఁపనవారల్
    చదువనిపండితవర్యులు
    కదనాస్థిరవీరవరులు కడిదిపురమునన్.
ఉ. చీరయు ముక్కుముంగరయుఁ జెంపలగంధము చుక్కబొట్టు మం
    జీరఝణంఝణారవముఁ జేతులఁ గంకణనిక్వణంబు నొ
    య్యారపుజాఱుకొప్పును గయాళితనంబును గాని లోన శృం
    గార మొకింత లే దనుటఁ గంటిని యీపురివారకాంతలన్.
రాచవీటి కరిగినప్పుడు చెప్పికొన్న పద్యము—
చ. పసగలముద్దుమోవి బిగివట్రువగుబ్బలు మందహాసమున్
    నొసటవిభూతిరేఖయుఁ బునుంగునతావి మిటారిచూపులున్
    రసికులు మేలు మేలు బళిరా యని మెచ్చఁగ రాచవీటిలోఁ
    బసిఁడిసలాకవంటి యొకబల్జెవధూటిని గంటి వేడుకన్.
దక్షిణదేశమున కరిగినప్పుడు చెప్పినవి—
తే. మేఁతఁ గరిపిల్ల పోరున మేఁకపిల్ల
    పారుఁబోతుతనంబునఁ బందిపిల్ల
    ఎల్లపనులను జెఱుపంగఁ బిల్లిపిల్ల
    అందమునఁ గ్రోఁతిపిల్ల యీయఱవపిల్ల.
సీ. కూడు తలఁపఁ జోళ్ళు కూర కారామళ్ళు
                    చెవులంత వ్రేలాళ్ళు చేలు మళ్ళు

    దుత్తెఁడే నాగళ్ళు దున్నపోతులయేళ్ళు
                    కలపు మాపటివేళ గంజినీళ్ళు
    మాటమాటకు ముళ్ళు మరి దొంగదేవళ్ళు
                    చేఁదైనపచ్చళ్ళు చెఱకునీళ్ళు
    వంటపిడ్కలదాళ్ళు వాడనూతులనీళ్ళు
                    విన విరుద్ధపుఁ బేళ్ళు వెడఁదనోళ్ళు
    సఖులచన్నులబైళ్ళు చల్లనిమామిళ్ళు
                    పరుపైనవావిళ్ళు పచ్చపళ్ళు
తే. దళమయిన యట్టికంబళ్ళు తలలుబోళ్ళు
    పయిఁడికిని జూడఁ బయిఁడెత్తుప్రత్తివీళ్ళు
    చలముకొని వెదికిన లేవు చల్లనీళ్ళు
    చూడవలసెను ద్రావిళ్ళకీడుమేళ్ళు.
సీ. తొలుతనే వడ్డింత్రు దొడ్డమిర్యపుఁజారు
                    చెవులలోఁ బొగ వెళ్ళి చిమ్మిరేఁగఁ
    బలుతెఱంగులతోడఁ బచ్చళ్ళు చవిగొన్న
                    బ్రహ్మరంధ్రముదాఁకఁ బారు నావ
    యవిసాకు వేఁచిన నార్నెల్లు ససి లేదు
                    పరిమళ మెంచినఁ బండ్లు సొగచు
    వేపాకు నెండించి వేసిన పొళ్ళను
                    గంచానఁ గాంచినఁ గ్రక్కు వచ్చు
తే. నఱవవారింటివిం దెల్ల నాగడంబు
    చెప్పవత్తురు తమతీరు సిగ్గులేక
    …………..............................
    చూడవలసెను ద్రావిళ్ళకీడుమేళ్ళు.

శ్రీరంగక్షేత్రమున కరిగి యచ్చట నొకబిత్తరిపైఁ జెప్పినది—
సీ. ఒకచెంప కోరగా నొనగూర్చి దిద్దిన
                    తురుముననుండి క్రొవ్విరులు రాల
    రాతిరి నిదురఁ గూరమిఁ జేసి ముడివడు
                    బడలిక నడుగులు తడఁబడంగ
    వింతవారలఁ జూచి వెసనవ్వినెడఁ గప్పు
                    గలదంతములకాంతి వెలికిఁబాఱ
    చిడిముడి నడచుటఁ జెలరేఁగి గుబ్బల
                    పైఁ దాకి యొక్కింత పైఁట జాఱ
తే. చెమటచేఁ దిరునామంబు చెమ్మగిల్ల
    హాళి డా చేత విడియంబుఁ గీలుకొల్పి
    రంగపురిరాజవీథిఁ గానంగనయ్యె
    నాదుమది గోర్కు లూర వైష్ణవవధూటి.
మారెళ్ళసీమ కరిగినప్పుడు చెప్పినవాటిలో నొకటి—
సీ. నడివీథిలో రాళ్ళు నాగులే దేవళ్ళు
                    పరగట సావిళ్ళు పాడుగుళ్ళు
    ఐదువన్నెలకూళ్ళు నంబటికావిళ్ళు
                    నూరూర జిల్లేళ్ళు నూటనీళ్ళు
    నడుముకు వడదోళ్ళు నడువీథి కల్ రోళ్ళు
                    కరుణాలవడిసెళ్ళు కాఁపుముళ్ళు
    ………......................................
                    ................................……….
తే. ....................................................
    ....................................................
    ......................….. నేరెళ్ళ వాగునీళ్ళు
    సిరులఁ జెలువొందు మారెళ్ళసీమయందు.
రెడ్లప్రాచీనరాజధాని యగు నద్దంకి కరిగినప్పుడు చెప్పినది—
సీ. తళ్కుతళ్కనుకాంతి బెళుకెంపులముంగ
                    రందమై కెమ్మోవియందుఁ గుల్క

    ధగధగద్ధగలచే తనరారు బంగారు
                    గొలుసులింగపుఁగాయ కొమరుమిగుల
    నిగనిగన్నిగలచే నెగడు చెల్వపుగుబ్బ
                    దోయి యొండొంటితో రాయిడింప
    రాజహంసవిలాసరాజితం బగుయాన
                    మందు మెట్టెలు రెండు సందడింప
తే. సరసదృక్కుల విటులను గరఁగఁ జూచి
    పొందికైనట్టిమోమున భూతిరేఖ
    రాజకళ లొప్ప నద్దంకిరాజవీథిఁ
    బొలిచె నొకకొమ్మ గాజులముద్దుగుమ్మ.
ఉ. గండము దప్పె నాంధ్రకవిగానికి నిన్నటిరేయిఁ బుష్పకో
    దండుని గారవింపక తద్దయు నిల్చితిఁ గాని యయ్యయో!
    బండరువారిపాటికిని బైటిపసారమె యట్టె! మైమెయిం
    బుండయియెబ్లవంకఁ జెడిపోవుదుగా! యటువోయియుండినన్.
మఱికొన్ని పద్యములు—
ఉ. వాలగుకన్నుదోయి బిగివట్రువగుబ్బలు కాఱుచీఁకటిం
    జాలహసించుకొప్పుజిగి సారసమున్ నగుమోము గల్గు నా
    బాలికఁ గూలి కమ్ముకొన బట్టలు నేసెడువాని కిచ్చె హా
    సాలెత కాదురా కుసుమసాయకుపట్టపుదంతి! యింతియే!
ఉ. కుమ్మరివారిబాలిక చకోరవిలోచన ముద్దుగుమ్మ యా
    వమ్ముదరిన్ రసామలినవస్త్రము చుంగులుజాఱఁ గట్టి తాఁ
    గమ్మనిమ్రోఁతతోఁ గరనఖమ్ములభాండము లంగజాస్త్రపా
    తమ్మనఁ బ్రోవు దీసె విటతండము గుండియ లార విచ్చఁగన్.
క. ఆకదురునఁ బికరవమున్
    ఆకదురున భృంగరవము నాత్మరవంబున్

    ఏకీకృతముగ నేకు ల
    నేకులు విన వడికె ముదిర యేకులముదిరా!
ఉ. గుబ్బలగుమ్మ లేఁజిగురుఁగొమ్మ సువర్ణపుఁగీలుబొమ్మ బల్
    గబ్బిమిటారిచూపులది కాఁపుది దానికి నేల యొక్కనిం
    బెబ్బులి నంటఁగట్టితివి పెద్దవు ని న్ననరాదు రోరి దా
    నబ్బ! పయోజగర్భ! మగనాలికి నింత విలాస మేఁటికిన్?
శా. దాయాదుల్వలె గుబ్బచన్ను లొఱయన్ ధావళ్యనేత్రాంబుజ
    చ్ఛాయ ల్తాండవమాడఁ గేరి పురుషస్వాంతమ్మున న్మన్మథుం
    డేయం జంగమువారిచంద్రముఖి విశ్వేశార్చనావేళలన్
    వాయించెం గిరిగిండ్లు బాహుకుశలవ్యాపారపారీణతన్.
ఉ. పువ్వులు కొప్పునం దురిమి ముందుగఁ గౌ నసియాడుచుండఁగాఁ
    జెవ్వునఁ జంగసాఁచి యొకచేతను రోఁకలి పూని యొయ్యనన్
    నవ్వుమొగంబుతోడఁ దననందనుఁ బాడుచు నాథుఁ జూచుచున్
    సువ్వియ సువ్వియంచు నొకసుందరి బియ్యము దంచె ముంగిటన్.
సీ. బొమవింటఁ దొడిగిన పూవింటిదొరముల్కి
                    పోల్కిఁ గస్తురి సోఁగబొట్టు దిద్ది
    చకచకలీనుతారకలరేకలువోలెఁ
                    గొలుకులు వెడలఁ గజ్జలము దీర్చి
    పొడుపుగుబ్బలిమీఁదఁ బొడమునీరెండ నా
                    రంగుచందురుకావిరైక దొడిగి
    పిఱుఁదు పొక్కిలి యను మెఱక పల్లము గప్పఁ
                    బాలవెల్లువవంటిచేల గట్టి
గీ. అంచకొదమలగమి బెదిరించుపోల్కి
    నందెచప్పుళ్ళు ఘల్లుఘల్లనుచు మొరయ
    నడుము జవజవలాడఁ గీల్జడ ఘటించి
    వచ్చె ముక్కంటిసేవకు మచ్చెకంటి.

సీ. తాటంకయుగధగద్ధగితకాంతిచ్ఛటల్
                    చెక్కుటద్దములపై జీరువార
    నిటలేందుహరినీలకుటిలకుంతలములు
                    చిన్నారిమోముపైఁ జిందులాడ
    బంధురమౌక్తికప్రకటహారావళుల్
                    గుబ్బచన్నులమీఁద గునిసియాడ
    కరకంకణక్వణక్వణనిక్వణంబులు
                    పలుమాఱు రాతిపైఁ బరిఢవిల్ల
తే. ఓరచూపుల విటచిత్త మూఁగులాడ
    బాహుకుశలతఁ జక్కనిమోహనాంగి
    పాటఁబాడుచుఁ గూర్చుండి రోటిమీఁదఁ
    బిండి రుబ్బంగఁ గన్నులపండు వయ్యె.
సీ. శ్రీరస్తు భవదంఘ్రిచికురంబులకు మహా
                    భూర్యబ్దములు సితాంభోజనయన!
    వరకాంతిరస్తు తావకముఖనఖముల
                    కాచంద్రతారకం బబ్జవదన!
    మహిమాస్తు నీకటిమధ్యంబులకు మన్ను
                    మిన్నుగలన్నాళ్ళు మించుబోఁడి!
    విజయోస్తు నీగానవీక్షల కానీల
                    కంఠహరిస్థాయిగా లతాంగి!
తే. కుశలమస్తు లసచ్ఛాతకుంభకుంభ
    జంభభిత్కుంభికుంభాభిజృంభమాణ
    భూరిభవదీయవక్షోజములకు మేరు
    మందరము లుండుపర్యంత మిందువదన!
సీ. చక్కని నీముఖచంద్రబింబమునకుఁ
                    గళ్యాణ మస్తు బంగారుబొమ్మ!

    నిద్దంపు నీచెక్కుటద్దంపురేకకు
                    నైశ్వర్య మస్తు నెయ్యంపుదీవి!
    మీటినఁ బగులు నీమెఱుఁగుఁబాలిండ్లకు
                    సౌభాగ్య మస్తు భద్రేభయాన!
    వలపులు గులుకు నీవాలుఁగన్నులకు న
                    త్యధికభోగోస్తు పద్మాయతాక్షి!
తే. మధురిమము లొల్కు నీముద్దుమాటలకును
    వైభవోన్నతి రస్తు లావణ్యసీమ!
    వన్నెచిన్నెలు గల్గు నీమన్ననలకు
    శాశ్వతస్థితిరస్తు యోషాలలామ!
సీ. సొగసుకీల్జడదాన! సోఁగకన్నులదాన!
                    వజ్రాలవంటిపల్వరుసదాన!
    బంగారుజిగిదాన! బటువుగుబ్బలదాన!
                    నయమైనయొయ్యారినడలదాన!
    తోరంపుఁగటిదాన! తొడలనిగ్గులదాన!
                    పిడికిటనడఁగు నెన్నడుముదాన!
    తళుకుఁజెక్కులదాన! బెళుకుముక్కరదాన!
                    పింగాణికనుబొమ చెలువుదాన!
తే. మేలిమిపసిండిరవకడియాలదాన!
    మించిపోనేల రత్నాలమించుదాన!
    తిరిగిచూడవె ముత్యాలసరులదాన!
    చేరి మాటాడు చెంగావిచీరదాన!
క. కుంకుమ లేదో మృగమద
    పంకము లేదో పటీరపాంసువు లేదో
    సంకుమదము లేదో యశు
    భంకరమగుభస్మ మేల బాలా! నీకున్.

శ్రీనాథుని బావమఱఁది రామయమంత్రి యననతఁడు మంచిభోజనపుష్టి గలవాఁడఁట! ఆతఁ డొకయూరికరణము. పాఁడిపంటలు గల సంసారి. ఒకసారి బంతిని గలసి భుజించుచు శ్రీనాథుఁ డాతని నీపద్యము చెప్పి గేలిగొనెను.
ఉ. గ్రామము చేతనుండి పరికల్పితధాన్యము నింటనుండి శ్రీ
    రామకటాక్షవీక్షణపరంపరచేఁ గడతేఱెఁ గాక మా
    రామయమంత్రి భోజనపరాక్రమ మేమని చెప్పవచ్చు? నా
    స్వామి యెఱుంగుఁ దత్కబళచాతురి తాళఫలప్రమాణమున్.
వేఱొక బంధుజనునిపైఁ జెప్పినవి.
ఉ. మా కలిదిండికామయకుమారకుఁ డన్నిటఁ దండ్రివైఖరే
    కాక తదన్యుఁ డెట్లగును? గాడిదకుం దురగంబు పుట్టునే?
    చేకొని కొంకినక్కకును సింగము పుట్టునె? మాలకాకికిం
    గోకిల పుట్టునే? చిఱుతకుక్కకు మత్తగజంబు పుట్టునే?
తనయెడ నత్యంతాదరము సూపిన రాజులును, రాజమంత్రులును స్వర్గస్థులైరి. కడుపు కక్కుర్తిచేఁ గృష్ణాతీరమున బొడ్డుపల్లెను గుత్తకుఁ గొని శ్రీనాథుఁడు కృషిచేయమొదలిడెను. కృష్ణవరదవలనఁ బైరు ముఱిఁగిపోయినది. అప్పుడు తన్నాదరించిన రెడ్డిరాజులకు గర్భశత్రువులగు నొడ్డెరాజులు రాజ్య మేలుచుండిరి. విద్యాగౌరవములేక యాయొడ్డెరాజులు శ్రీనాథునిఁ బలుసిలుఁగులకుఁ బాల్పఱిచిరి. శ్రీనాథకవిసార్వభౌముఁ డీక్రింది పద్యమును జెప్పి యాంధ్రవాఙ్మయ మున్నంతకాలమును శాశ్వత మగున ట్లారాజుల కపకీర్తిని నెలకొల్పెను.
సీ. కవిరాజుకంఠంబు కౌఁగిలించెను గదా
                    పురవీథినెదురెండ బొగడదండ

    ఆంధ్రనైషధకర్త యంఘ్రియుగ్మంబునఁ
                    దగిలియుండెనుగదా నిగళయుగము
    వీరభద్రారెడ్డివిద్వాంసుముంజేత
                    వియ్యమందెనుగదా వెదురుగొడియ
    సార్వభౌమునిభుజాస్తంభ మెక్కెనుగదా
                    నగరివాకిటనుండు నల్లగుండు,
తే. కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
    బిలబిలాక్షులు తినిపోయెఁ దిలలుపెసలు
    బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి
    నెట్టు చెల్లింతుఁ డంకంబు లేడునూర్లు.
అవసానకాలమున శ్రీనాథమహాకవిసార్వభౌముఁడు చెప్పికొన్న పద్యము—
సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
                    రత్నాంబరంబు లేరాయఁ డిచ్చు?
    రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు
                    కస్తూరి కేరాజుఁ బ్రస్తుతింతు?
    స్వర్గస్థుఁ డయ్యె విస్సనమంత్రి మఱి హేమ
                    పాత్రాన్న మెవ్వనిపంక్తిఁ గలదు?
    కైలాసగిరిఁ బండె మైలారువిభుఁ డేగి
                    దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు?
తే. భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ
    గలియుగంబున నిక నుండఁ గష్ట మనుచు
    దివిజకవివరుగుండియల్ దిగ్గు రనఁగ
    నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి.

బమ్మెర పోతన

ఈతఁడు క్రై.1400ప్రాంతముల నున్నవాఁడు. శ్రీనాథునకు బావమఱఁది యందురు. శ్రీభాగవతము, భోగినీదండకము, వీరభద్రవిజయము నీతనికృతులు. కొందఱు భోగినీదండకవీరభద్రవిజయములకుఁ బోతనకర్తృత్వమునెడ సంశయపడెదరు. ఈపవిత్రకవి వైషయికేచ్ఛావైముఖ్యమును బ్రశంసించు కట్టుకతలు కొన్నికలవు. వానిని విడిచి యాప్రసక్తిలోనిపద్యము లుదాహరించెదను.

ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయిం బడ నేల యేడ్చెదో
    కైటభదైత్యమర్దనునిగాదిలికోడల! యోమదంబ! యో
    హాటకగర్భురాణి! నిను నాఁకటికై కొనిపోయి యల్ల క
    ర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!
శ్రీనాథకవీశ్వరుఁడు పోతనామాత్యునితో నిట్లనియె నఁట!
క. కమ్మనిగ్రంథం బొక్కటి!
    యిమ్ముగ నేనృపతికైనఁ గృతి యిచ్చినఁ గై
    కొమ్మని యీయరె యర్థం?
    బిమ్మహి దున్నంగ నేల యిట్టిమహాత్ముల్?
నందిమల్లయ ఘంటసింగయలు శృంగారషష్ఠ మనుపేర భాగవతషష్ఠస్కందమునే తెలిఁగించినారు. దానిఁ గూర్చి—
శా. చండాంశుప్రభవీక్ష! తిమ్మయతనూజా! తిమ్మ! విధ్వస్తపా
    షండంబైన త్రిలింగభాగవతషష్ఠస్కంధభాగంబు నీ
    కుం డక్కెం జతురాననత్వగుణయుక్తు ల్మీఱ వాణీమనో
    భండారోద్ధతి చూఱకారబిరుదప్రఖ్యాతి సార్థంబుగన్.

వెల్లంకి తాతంభట్టు


కవిలోకచింతామణి యనుపేరి లక్షణగ్రంథమును రచియించిన యీకవీశ్వరుఁడు పదనైదవశతాబ్దిలో నున్నవాఁడు. ఈక్రిందిపద్యము లాతని ప్రశస్తిని దెలుపుచున్నవి—
సీ. ఏకవి నిర్మించె నీశబ్దశాస్త్రప
                    ద్ధతి యెల్ల సుకవిచింతామణి యన
    ఏకవి చెప్పె ననేకపుణ్యానల్ప
                    బంధురసంక్షేపభాగవతము
    ఏకవి పఠియించె నెల్లభాషలు నతి
                    ప్రకటనిర్భరమతిప్రౌఢి మెఱసి
    ఏకవి తెచ్చె మహీశసంఘముచేత
                    వారణాశ్వాదివస్తుచయము
గీ. అతఁడు వెల్లంకితాత మహాయశోగ్ర
    గణ్యుఁ డుత్తమసుకవిముఖ్యాధినాథుఁ
    డంబరాశావకాశవిఖ్యాతచక్ర
    వాళశైలాంతరావాప్తఖేలయశుఁడు.
సీ. కర్ణాటకటకభూకాంతసభాంతప్ర
                    గల్భకవీశ్వరకమలహేళి!
    గజపతిసంసదఖర్వవిద్యాగర్వ
                    తార్కికకుముదసుధామయూఖ!
    అశ్వసాధనమహేంద్రాస్థానశాబ్దిక
                    వర్యచూతద్రుమవనవసంత!
    మాళవేశ్వరసదోమధ్యమస్థాయికా
                    లంకారికమయూరలలితమేఘ!

గీ. యనుచు ని న్నవనీపతు లహరహంబు
    సరగ గంభీరవాక్ప్రౌఢి సన్నుతింతు
    రబ్జధీమణితనయ! శబ్దార్థనిలయ
    తాస్థిరాత్మక! వెల్లంకితాతసుకవి!

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి

ఈమేటికవి క్రీ.1480ప్రాంతము నాంధ్రదేశమునఁ బ్రఖ్యాతికెక్కినవాఁడు. శృంగారశాకుంతలము, జైమినిభారతము నను రెండుకృతులు మాత్ర మీతనివి లభించుచున్నవి. విద్యానగరమును బరిపాలించిన సాళ్వగుండ నరసింహరాజునకు జైమినిభారతము కృతిగా నొసఁగఁబడినది. నరసింహరాజునకు కృతి రచించి కొనివచ్చుట కేర్పఱిచిన గడువునాఁటివఱకు నీతఁడు గ్రంథరచన మారంభింపనే లేదనియు నాఁడు తద్బంధుజనులు కృతి రచింపవైతితి. రాజువలనఁ జిక్కు వచ్చునని మొఱపెట్టఁగా నారాత్రి యింటిలో నొకగది యలికించి మ్రుగ్గు వెట్టించి తాటియాకులును గంటమును గొని తానొక్కరుఁడ యందుఁ బ్రవేశించి సరస్వతీసాహాయ్యమునఁ దెల్లవారువఱకుఁ గృతిని సమకూర్చి మఱునాఁడు రాజాస్థానమున వినిపించి ‘వాణి నారాణి’ యనెననియు నొకకట్టుకథ కలదు. అంత శీఘ్రకాలములో నతిరసవంత మగునాకృతి నాతఁడు రచించుట సత్యమయియుండును. పైకథకుఁ దోడుగా నీపద్య మొకటి కలదు—

క. పిల్లలమఱిపినవీరన
    కిల్లా లట వాణి యట్టులే కా కున్నన్

    దెల్లముగ నొక్కరాతిరి
    తెల్లగఁ దెలవారువఱకుఁ దేఁగలఁడె కృతిన్.

తెనాలి రామకృష్ణకవి

ఆంధ్రకవులలోఁ దెనాలిరామకృష్ణకవి మిక్కిలి పరిహాసచతురుఁడు ప్రౌఢకవితాధురీణుఁడు. శ్రీకృష్ణదేవరాయలవారి యాస్థానకవులలో నొక్కఁడని కొందఱు తర్వాతివాఁ డని మఱికొందఱు. రాయల యాస్థానకవి యనుటకును నాధారములు కలవు. పాండురంగమాహాత్మ్యము, ఘటికాచలమాహాత్మ్యము నీతనికృతులు. ఈతనికి వికటకవి యని పేరు. ఈతనియశస్సును గూర్చి యితరకవిచేఁ జెప్పఁబడినపద్యము—

రామకృష్ణుఁడు వేఱు, రామలింగఁడు వేఱుగాఁగూడఁ దెలియవచ్చుచున్నది. ఉద్భటారాధ్యచరిత్రాదులు రామలింగకృతులఁట! విచారింపవలసియున్నది.

ఉ. లింగనిషిద్ధుఁ గల్వలచెలిం గని మేచకకంధరుం ద్రిశూ
    లిం గని సంగతాళి లవలిం గని కర్దమదుషితన్మృణా
    ళిం గని కృష్ణచేలుని హలిం గని నీలకచన్ విధాతృనా
    లిం గని రామకృష్ణకవలింగనికీర్తి హసించు దిక్కులన్.

రాయలయాస్థానకవులలో నగ్రగణ్యుఁడగు పెద్దనామాత్యుని మనుచరిత్రమున “అమవసనిసికిన్” అనుపదప్రయోగమును విని రామకృష్ణుఁడు—

క. ఎమి తిని సెపితివి కపితము
    బ్రమపడి వెఱిపుచ్చకాయ వడిఁ దిని సెపితో

    యుమతకయ తిని సెపితివొ
    యమవసనిసి యనెడిమాట యలసనిపెదనా!

అని యాక్షేపించె నందురు. ఈయాక్షేపము నొకవేళఁ బరిహాసమునకై పెద్దనామాత్యునిఁ గూర్చి రామకృష్ణుఁడు చేసియుండునేమో! ఈతనికిఁ బెద్దనపై నపరిమితగౌరవము కలదు. పెద్దన్న కెంతోయుత్కృష్టత వెట్టి దనకెంతయు నిసృష్టతను బద్యమునఁ జెప్పుకొనెను—

క. కవి యల్లసానిపెద్దన
    కవి తిక్కనసోమయాజి గణుతింపంగాఁ
    గవి నేను రామకృష్ణుఁడఁ
    గవి యనునామంబు నీరుకాకికి లేదే?

అల్లసాని పెద్దన కవి, తిక్కన సోమయాజి కవి, రామకృష్ణుడను నేను కవిని, ఇంకను గొందఱకుఁ గవియనుపేరు గలదు, నీరుకాకికిని కలదు అనికూడ నర్థము చూచుకొన నగును.

నందితిమ్మన యొకనాఁడు తనయింట నుయ్యెలలో నూఁగుచుఁ గవిత్వము రచించుకొనుచుండఁగా నీకొంటెకోణంగి రామకృష్ణుఁ డక్కడ కరిగి ‘తాతా! ఊతునా’ యని యడిగెనట! తిమ్మకవి యంగీకృతి సూచింపఁగా రామకృష్ణుఁడు తుబుక్కన మొగమున నుమిసి, ‘నీకిదేమిచేటుఁగాల’మన ‘నూఁతునా యనిగదా నేనడిగినది; దాని కంగీకరించితిరి గావున నట్లు చేసితి’ ననెనఁట! కోప మాపఁజాలక తిమ్మకవి యెదురనున్న యాతని నుయ్యెలపైనుండి యెడమకాలితో మొగమునఁ దన్నెనఁట! పాపము పల్లూడెను. చప్పున నింటి కరిగిదుప్పికొమ్ము నరుగఁదీసి పల్లుగా నదుకుకొనెను. మఱునాఁడు రాయలసభకు వచ్చినప్పుడెట్లో యీవార్త రాయలకుఁ దెలిసి యాస్థానకవుల కిట్లు సమస్య నొసఁగెను— “రవి గాననిచోఁ గవి కాంచునే గదా” ఏకవియోగాని సరిగా నిట్లు పూరించెను—

ఉ. ఆరవి వీరభద్రుచరణాహతి డుల్లిన బోసినోటికిన్
    నేరఁడు రామకృష్ణకవి నేరిచెఁబా మనముక్కుతిమ్మరాట్
    క్రూరపదాహతిం దెగిన కొక్కిరిపంటికి దుప్పికొమ్ము ప
    ల్గా రచియించె నౌర! రవి గాననిచోఁ గవి కాంచునే గదా!

ప్రెగడరాజు నరసరా జనుకవియొకఁడు పెద్దనాదికవీశ్వరుల సరకుగొనక వారికవిత్వములందు దోషములు గలవని యందందు వదరులాడుచుండెడివాఁడఁట! ఆతఁడును స్వతస్సమర్థుఁడే. ఒకప్పు డాతఁడు కృష్ణరాయల యాస్థానమునకు వచ్చి పెద్దనాదులకంటె హెచ్చుగా నాశువుగాఁ గవిత్వము రచింతును; సభ కూర్పింపుమని కోరెను. రాయలు మఱుదినము సభగూర్ప నంగీకరించెను. పెద్దనాదులు కొంకఁదొడఁగిరి. రామకృష్ణుఁడు “నే నాకవి నడఁగఁద్రొక్కెద”నని పెద్దనాదులకు ధైర్యము చెప్పెను. మఱునాఁడు సభకు నరసరాజు వచ్చి గంటకుఁ గొన్నివందలు పద్యములు చెప్పెదననెను. వారిర్వురకు స్పర్థ యేర్పడెను. నీ కవిత్వమునఁ దప్పు లుండునని నరసరాజు రామకృష్ణు నాక్షేపించెను. ఉండునేమో! నేను కవిత్వము చెప్పెదను; చూపుమనెను. నరసరాజునకు వ్రాయడమునఁ దనయంతవాఁడు లేఁడనియు గర్వము గలదు. గావునఁ దానె వ్రాసెదననియుఁ గల మాఁగనీయనంత వడిగాఁ జెప్పవలయుననియుఁ దప్పులు చెప్పిన

దిద్దెదననియుఁ బ్రతిన పూనెను. రామకృష్ణుఁడు చిత్రోచ్చారణముతో నొకపద్యమున జదివెను. నరసరాజు వ్రాయలేక గింజులాడుకొని యెట్టకేల కిట్టు వ్రాసెను—
క. తృవ్వట బాబా తలపైఁ
    బువ్వట జాబిల్లి వల్వ బూచట చేఁదే
    బువ్వట చూడఁగను హుళు
    క్కవ్వట తలఁపంగ నిట్టి హరునకు జేజే!
ఇది వ్రాయుటకు రామకృష్ణకవి పద్యము చదివి కొంతసే పూరకుండవలసివచ్చెను. నరసరాజునకు వ్రాఁతబిరుదు పోయినది. రెండవపద్య మిట్లు చెప్పెను—
మ. గననీహారగు రామపద్మధళరంగత్కీర్తి చానూరమ
    ద్ధన శుక్రాక్షికళేభరాణ్మృగవతీ త్రైలోక్యధామోదరా
    యనఁగా శంకరవాంఛితార్థకృపదివ్యాస్తోకపాణీ జనా
    ర్థనవామేకపవైరివిగ్రహ ముకుంధా మిత్రవింధాధిపా!
నరసరాజు తననేర్పు వెల్లడి యగునట్లుగా ననేకదోషములను సంస్కరించి రామకృష్ణుని గేలిసేసెను. నిజముగా రామకృష్ణునియుచ్చారణప్రకార మాపద్యమున కర్థము కలదు. అందు దోషములు లేవు. సామాన్యబుద్ధికి దోషములుగాఁ గన్పట్టునట్లు రామకృష్ణుఁడు రచించెను. నరసరా జట్లే పొరఁబడెను. అంతట రామకృష్ణుఁడు లేచి యీక్రింది పద్యములఁ జెప్పి గెల్పుకొని నరసరాజును వంచించి పంపెను.
చ. ఒకనికవిత్వమం దెనయు నొప్పులు తప్పుల నావిత్వమం
    దొకనికిఁ దప్పుబట్టఁ బని యుండదు కాదని తప్పుపట్టినన్

    మొక మటుక్రిందుగాఁ దివిచి ముక్కలువోవ నినుంపకత్తితో
    సిక మొదలంటఁ గోయుదును జెప్పునఁ గొట్టుదు మోము దన్నుదున్.
చ. తెలియనివన్ని తప్పు లని దిట్టతనాన సభాంతరంబున్
    బలుకఁగ రాకురోరి పలుమాఱుఁ బిశాచపుఁబాడెకట్టె! [4]నీ
    పలికిననోట దుమ్ముపడ! భావ్య మెఱుంగవు పెద్దలైనవా
    రల నిరసింతురా! ప్రెగరాణ్ణరసా! విరసా! తుసా! బుసా!

రాయల యాస్థానమున నప్పలాచార్యులను పండితకవి యొకఁడు కలఁడట! ఆతనిఁగూర్చి యొకరు—

శ్లో. అపశబ్దభయం నాస్తి అప్పలాచార్యసన్నిధౌ

రామకృష్ణుఁ డుత్తరార్ధమును వెంటనే యిట్లు పూరించె—

....అనాచారభయం నాస్తి తిష్టన్మూత్రస్య సన్నిధౌ.

రాయలయాస్థానముననే యొకనాఁడు బట్టుమూర్తికవి “కుంజరయూధంబు దోమకుత్తుక సొచ్చెన్” అన్న సమస్యఁ జెప్పి దీనిఁ బూరింపుఁ డని తక్కినకవుల నడిగెనఁట! రామకృష్ణుఁడు—

క. గంజాయి త్రాగి తురకల
    సంజాతులఁ గూడి కల్లు చవికొన్నావా?
    లంజెలకొడుకా యెక్కడ
    కుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్?

రాయలు కోపించి ‘యిదియా పూరణ’ మనెను. రామకృష్ణుఁడు ‘దేవా! పెద్దనాదిమహాకవుల కీ బట్టుకవి సమస్య నొసఁగువాఁడు! అతని కిట్టిపూరణమే పోలు’ ననెను. రాయలు ‘నేనొసఁగితిని పూరింపు’ మని యాగ్రహముతోనే పల్కెను. వెంటనే—

క. రంజన చెడి పాండవు లరి
    భంజనులై విరటుఁ గొల్వఁ బాల్పడి రకటా!
    సంజయ! యే మని చెప్పుదుఁ
    గుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్.

అని పూరించెను. రాయలు పరమానందభరితుఁ డయ్యెను.

పెద్దన మనుచరిత్రము, తిమ్మన్న పారిజాతాపహరణము, బట్టుమూర్తి వసుచరిత్రము రాయలు మిక్కిలి మెచ్చుకొనుచుండువాఁడఁట! ఒకనాఁడు సభలో మూఁడుగ్రంథములనుండియుఁ దుల్యసందర్భముగల వగు మూఁడు పద్యములఁ జూపి వానిని విమర్శింప సభ్యులను గోరెనఁట! ఆపద్యము లివి—

ఉ. పాటున కింతు లోర్తురె! కృపారహితాత్మక! నీవు ద్రోవ ని
    చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య
    ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ గలస్వనంబుతో
    మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందుగన్‌.(మను)
ఉ. ఈసునఁ బుట్టి డెందమున హెచ్చినకోపదవానలంబుచేఁ
    గాసిలి యేడ్చెఁ బ్రాణవిభుకట్టెదురన్‌ లలితాంగి పంకజ
    శ్రీసఖమైన మోముపయిఁ జేలచెఱంగిడి బాలపల్లవ
    గ్రాసకషాయకంఠకలకంఠవధూకలకాకలీధ్వనిన్‌.(పారి)
శా. ఆజాబిల్లివెలుంగువెల్లికల డాయన్ లేక రాకానిశా
    రాజశ్రీసఖ మైనమోమునఁ బటాగ్రం బొత్తి యెల్గెత్తి యా
    రాజీవానన యేడ్చెఁ గిన్నరవధూరాజత్కరాంభోజకాం
    భోజీమేళవిపంచికారవసుధాపూరంబు తోరంబుగాన్.(వసు)

రామకృష్ణుఁ డీపద్యములపై నిట్టు లభిప్రాయ మొసఁగెనఁట. అల్లసానిపెద్దన అటునిటు నేడ్చెను;—ముక్కుతిమ్మన్న ముద్దు ముద్దుగా నేడ్చెను;—బట్టుమూర్తి బావు రని యేడ్చెను;—భట్టుమూర్తికిని రామలింగనికిని ఘోరవైరము. ఆబట్టుకవితను గూర్చి రామలింగకవి యి ట్లధిక్షేపించెను.

క. చీఁపర పాఁపరతీఁగలఁ
    జేఁపలబు ట్టల్లినట్టు చెప్పెడు నీయీ
    కాఁపుఁగవిత్వపుఁగూఁతలు
    బాఁపనకవివరునిచెవికిఁ బ్రమదం బిడునే!
శా. అద్రిస్నిగ్ధతలంబు బుద్బుదము లుద్యద్దారుభూషావళుల్
    క్షుద్రౌదుంబరపాకపక్వఫలముల్ శుక్త్యంతరాకాశముల్
    రుద్రాక్షాక్షరపంక్తివిభ్రమము లీరూఢి న్నిరూపింప నీ
    శూద్రప్రజ్ఞలు విప్రసత్కవివచస్స్ఫూర్తి న్విడం బించునే!
క. కెంగేల రామకృష్ణుని
    బంగరుకడియంబు లుండఁ బండితుఁ డగునా
    జంగులు జల్లులు గల్గిన
    సింగారపుటూరఁగుక్క సింగంబగునా!

కవీశ్వరులస్తోత్రపాఠములకు నతిశయోక్తులకును నేవగొని తిరుమలరాయ లొకనాఁడు స్వభావోక్తిమధురముగానే తన్ను వర్ణింపుఁడని వారి కాజ్ఞాపించెనఁట! ఆతని కొంటికంటిగ్రుడ్డి కలదు. రామలింగకవి వర్ణించిన వర్ణనము—

క. అన్నాతిఁ గూడ హరుఁడగు
    నన్నాతిని గూడకున్న నసురగురుండౌ
    నన్నా! తిరుమలరాయఁడు
    కన్నొక్కటి లేదు గాని కంతుఁడుగాఁడే.

రామకృష్ణుని ఇతర చాటువులు
గీ. అతివ కచ నాభి జఘన దేహాసనము త
    మీనదరసాలతారాజపానిరాక
    రణ మనంత మనాది నేత్ర గళ భుజన
    ఖోష్ఠ కుచ వచో దంతము లుభయగతుల.
గీ. అధరముఖవర్ణశూన్యంబు లతివకుచము
    లాననాకారరహిత మబ్జాక్షిమేను
    అజఘనమండలము లంచయానకురులు
    చరమబాధితకరములు చామతొడలు.
గీ. ఆననాధరగళమూర్తు లతివ కజుఁడు
    చంద్రకురువిందశంఖచంచలలఁ జేసి
    చెలఁగి తచ్చిహ్నకాఠిన్యసితచలతలు
    సొరిదిఁ గచ కుచ హాస దృష్టులుగఁ జేసె.
సీ. నడచెనా గంధగండకబంధధుర్యవే
                    దండతండము నటుండుండు మనును
    పలికెనా పల్లకీకలకంఠకలరవ
                    మండితధ్వని నటుండుండు మనును
    నవ్వెనా మల్లికానవహీరచంద్రికా
                    డిండీరముల నటుండుండు మనును
    చూచెనా పుష్పనారాచజాతస్ఫుర
                    త్కాండద్యుతుల నటుండుండు మనును
గీ. ఏమి చెప్పుదు నాయింతి కెవ్వ రీడు?
    అహహ! రతివలె నది నీకు నబ్బెఁగాక
    పరమభాగ్యైకశాలి యోపాండురంగ
    విట్ఠలేశ! యనంతరవిప్రకాశ!

చ. అల ఘనచంద్రబింబసమ మై తనరారెడు వక్త్ర మందులోఁ
    గలిగిన నామభేదములకైవడి నొప్పెడిఁ గప్పుకొప్పు చె
    క్కులు రదనాంశుకంబు లవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే
    తులు సరులయ్యె దానివలె నున్నది పొంకపుటారు బోఁటికిన్.
చ. దరభుజగైణసింహములఁ దద్గతవేణ్యవలోకనద్వయో
    దరముల కోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
    తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
    త్వరముగ నేఁగి నీడగని తత్తఱమందఁగ జేసి తౌ చెలీ!
మ. వరబింబాధరమున్ బయోధరములున్ వక్త్రాలకంబుల్ మనో
    హరలోలాక్షులుఁ జూప కవ్వలిమొగం బైనంత నేమాయె నీ
    గురుభాస్వజ్జఘనంబుఁ గ్రొమ్ముడియు మాకుం జాలవే! గంగ క
    ద్దరిమే లిద్దరికీడునుం గలవె యుద్యద్రాజబింబాననా!

కృష్ణదేవరాయలు

బళ్ళారిమండలములోని యానెగొందికి సమీపమున నుండిన విద్యానగర మనుపట్టణరాజము రాజధానిగా దక్షిణహిందూదేశమున కెల్ల నేకచ్ఛత్రాధిపత్యమును నిర్వహించిన యీనృపాలరత్నము క్రై.1509 మొదలు 1530 వఱకు రాజ్యము వహించినట్లు తెలియుచున్నది. కృష్ణరాయలు బహువారములు దండయాత్రలు చేసి నానారాజుల జయించి తురుష్కులముష్కరకృత్యముల సాగనీయక రాష్ట్రముల నాక్రమించుకొని మహారాజ్యవైభవ మనుభవించివాఁ డగుటయకాక సరసకవితావిలాసుఁడై పెద్దనాదిసుకవీంద్రుల పల్కుఁదేనియలఁ జూఱలఁగొని సంస్కృతాంధ్రములందు మేలయిన కవనము సెప్పనేర్చిన సుకవిరాజశిఖామణి. ఆంధ్రమున విష్ణుచిత్తీయమును సంస్కృతమున మదాలసాచరిత్రాదికములు నీతనికృతులు. ఆంధ్రవాఙ్మయమున కీమహారాజుకాలమున నిం తం తనరానిమహోన్నతి చేకూఱెను. పెద్దనాదికవిశ్రేష్ఠు లీతని యాస్థానమునఁ గవీశ్వరులు. మనుచరిత్రము పారిజాతాపహరణము మొదలగు కృతుల కీతఁడు కృతిపతి. పెద్దనామాత్యున కీతఁ డాంధ్రకవితాపితామహుఁ డన్నబిరుద మొసఁగెను. విద్యావిషయమున నీమహారాజు నాస్థానమునందు జరిగినవృత్తాంతములు వింతవింతలుగాఁ జెప్పుకొనఁబడుచున్నవి. కొన్నిమాత్ర మిందుఁ దెల్పఁబడును.

ఒకప్పుడు కృష్ణరాయలు పసిఁడిపళ్ళెరమునఁ గవిగండపెండేరమును గొనివచ్చి సభాస్థానమున నిడి సంస్కృతాంధ్రములందు సమముగాఁ గవనము సెప్ప నేర్చినవా రిద్దానిఁ గైకొన నర్హు లనఁగా సభ్యులు మిన్నకుండిరనియు దానిపై నాతఁడే—

ఉ. ముద్దుగ గండపెండియరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా
    నొద్దిక నాకొసంబు మనియొక్కరుఁ గోరఁగలేరు లేరొకో—
అని సగముపద్యముఁ జదివినఁ బెద్దనామాత్యుఁడు లేచి—
    పెద్దనబోలుపండితులు పృథ్విని లే రని నీ వెఱుంగవే
    పెద్దన కీఁదలంచినను బేరిమి నా కిడు కృష్ణరాణ్ణృపా!
అని పూరించి యీమాలిక నాశువుగా రచించి చదివె నఁట!!
ఉ. పూఁతమెఱుంగులుం బసరుపూఁపబెడంగులుఁ జూపునట్టివా
    కైతలు జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనగమ్మనన్వలెన్

    రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని
    ద్దాతరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
    బాఁతిగఁ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ
    కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
    జేతికొలందిఁ గౌఁగిటనుజేర్చినకన్నియచిన్నిపొన్నిమే
    ల్మూఁతలచన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్
    డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ
    వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
    గాతలఁ దమ్మచూలిదొర కైవసపుంజవరాలిసిబ్బెపు
    న్మేతెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం
    బూఁతలనూనెకాయసరిపోడిమి కిన్నెరమెట్టుబంతి సం
    గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడగౌళపంతుకా
    సతతతానతానలపసన్ దివుటాడెడుగోటమీటుబల్
    మ్రోఁతలనుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ
    రీతిగ సంస్కృతం బుపచరించెడుపట్టున భారతీవధూ
    టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
    భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
    పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
    జాతకతాళయుగమలయసంగతిచుంచువిపంచికామృదం
    గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి
    వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ
    నూతనఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం
    ఘాతవియద్ధునీచకచకద్వకచోత్పలసారసంగ్రహా
    యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై

    యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
    చేతము చల్లఁజేయవలె జిల్లనఁ జల్లవలెన్ మనోహర
    ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయసప్రసా
    రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్.
రాయ లంతటఁ గవిగండపెండేరమును దానై యాతనిపాదమునఁ దొడిగెనఁట! రాయలు వేఱొకప్పు డేదో యాశువుగా రచింపుమనఁ బెద్దనగారు చెప్పినది—
చ. నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చుక
    ప్పురవిడె మాత్మ కింపయినభోజన ముయ్యెలమంచ మొప్పు త
    ప్పరయురసజ్ఞు లూహ తెలియంగలలేఖకపాఠకోత్తముల్
    దొరకినఁగాక యూరక కృతుల్ రచియింపు మనంగ శక్యమే!
కృష్ణరాయ లొకనాఁ డాస్థానమునఁ గవీశ్వరుల కీసమస్య నొసఁగెనఁట! “విస్ఫురితఫణామణిద్యుతులఁ బొల్పగు నాగకుమారుఁడో యనన్”—పెద్దనగారి పూరణము—
చ. వరుఁడు చెఱంగు వట్టినను వల్వ తొఱంగిన లేదు సిగ్గుప
    ట్లురుతరరత్నముద్రికల నొప్పగు డాకలికేల మాయఁగాఁ
    గర మమరెం గరం బపుడు కామనిధానముఁ గాచియున్న వి
    స్ఫురితఫణామణిద్యుతులఁ బొల్పగు నాగకుమారుఁడో యనన్.
నగరు, తగరు, తొగరు, వగరు అనుపదములు ప్రాసస్థానమున నెలకొల్పి రామాయణ, భారత, భాగవతపరములుగాఁ గృష్ణరాయనియాస్థానమున రాధామాధవకవిచేఁ జెప్పఁబడిన పద్యములు—
చ. నగరు పగాయె నింక విపినంబులకేఁగుఁడు రాజ్యకాంక్షకుం
    దగరు కుమారులార! యని తల్లి వగ ల్మిగులంగఁ దోఁపఁగాఁ

    దొగరున రక్షగట్టి మదిఁదోఁపక గద్గదఖిన్నకంఠియై
    వగరుచుచున్నఁ జూచి రఘువంశవరేణ్యుఁడు తల్లి కి ట్లనున్.
చ. తొగరుచి కన్నుదోయిఁగడుఁ దోఁపఁగఁ గర్ణుఁడు భీమసేనుపైఁ
    దగరుధరాధరంబునను దాఁకినభంగిని దాఁకి నొచ్చి తా
    వగరుచుచున్ వెసన్ బరుగువాఱిన నచ్చటిరాజలోకముల్
    నగరు సుయోధనాజ్ఞ మదినాటుటఁ జేసి ధరాతలేశ్వరా!
చ. వగరుపుమాత్రమే వరుఁడు వశ్యుఁడు గాఁడు సఖీసఖత్వమె
    న్న గరుడవాహనుండు మము నాఁడటు డించుటయెల్ల నుద్ధవా
    తగ రని కాక మోహపులతాతను లైన విడంగఁ జూతురే
    తొగరుచి యోషధీశునకుఁ దోపఁగఁజేయునె వీడనాడఁగన్?
కృష్ణరాయలు ధూర్జటికవి కవనశక్తినిఁగూర్చి పద్యరూపమునఁ బ్రశ్నింపఁగా నొక కవి పూరించిన పూరణము—
చ. స్తుతమతియైన యాంధ్రకవిధూర్జటిపల్కుల కేల కల్గెనో
    యతులితమాధురీమహిమ!—హా! తెలిసెన్ జగదేకమోహనో
    ద్ధతసుకుమారవారవనితాజనతాగనతాపహారిసం
    తతమధురాధరోదతసుధారసధారలఁ గ్రోలుటం జుమీ.
రాయలకోరికపై నీక్రింది మూఁడుపద్యములును బెద్దన తిమ్మన భట్టుమూర్తి కవులచే రచింపఁబడినవి—
శా. రంతుల్ మానుము కుక్కుటాధమ! దరిద్రక్షుద్రశూద్రాంగణ
    ప్రాంతోలూఖిలమూలతండులకణగ్రాసంబుచేఁ గ్రొవ్వి దు
    ర్దాంతాభీలవిశేషభీషణఫణాంతర్మాంససంతోషిత
    స్వాంతుండైన ఖగేంద్రుకట్టెదుర నీజంజాటముల్ సాగునే?
ఉ. స్థానవిశేషమాత్రమునఁ దామరపాకున నీటిబొట్ట! నిన్
    బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన యింతగర్వమా

    మానవతీశిరోమణులమాలికలందును గూర్ప వత్తువో
    కానుక లియ్య వత్తువొ వికాసము నిత్తువొ విల్వదెత్తువో.
ఉ. తక్కక నేలముట్టెగొని త్రవ్వఁగనేర్తు నటుంచుఁ దాకుతా
    వొక్కటె జాతి యంచు ముద మొందకు బుద్ధిని వెఱ్ఱిపంది! నీ
    వెక్కడ! యాదిఘోణి యన నెక్కడ! యద్రిసముద్రదుర్గభూ
    ర్భాక్కుతలంబు నొక్కయరపంటనె మింటికి నెత్త నేర్తువే.

రాయలయాస్తానమున కొక సంస్కృతకవి యరుదెంచి పెద్దనాద్యాంధ్రకవీశ్వరుల యెడ నీసడింపుతో నిట్లు పల్కెనఁట—

శ్లో. ఆంధ్రభాషామయం కావ్య మయోమయవిభూషణమ్

వెన్వెంటనే పెద్దనామాత్యుఁడు చెంపపెట్టు పెట్టినట్లు పూరించె!

    సంస్కృతారణ్యసంచారి విద్వన్మత్తేభశృంఖలమ్.

రాయలకుఁ జదరంగపుటెత్తులు వేయుటయం దత్యంతాసక్తి యుండెడిదఁట! బొడ్డుచర్ల చినతిమ్మన యను కొప్పోలు కరణము కవీశ్వరదిగ్దంతియను ప్రతిష్ఠగలవాఁడై శ్రీకృష్ణరాయలతోఁ జదరంగమాడుచుండెడువాఁడు శ్రీకృష్ణరాయలపక్షమున నెంద ఱాలోచించి యెత్తు వేయుచున్నను నీతఁ డొక్కడే యెదురెత్తు వేసి యాట గెల్చుచు వేయార్లు పందెము గొనుచుండెడివాఁడట! ఆతనిశక్తికి సంతోషించి కొప్పోలు గ్రామమునకు గృష్ణరాయపురమనునామ మేర్పఱిచి రాయలు సర్వాగ్రహారముగా నాతనికి ధారవోసెను.

క. శతసంఖ్యు లొక్కటైనను
    సతతము శ్రీకృష్ణరాయజగతీపతితోఁ

    జతురంగ మాడి గెల్చును
    ధృతిమంతుఁడు బొడ్డుచెర్లతిమ్మన బళిరే!
ఉ. ధీరుఁడు బొడ్డుచెర్లచినతిమ్మనమంత్రికుమారుఁ డంచితా
    కారుఁడు సత్కళావిదుఁడు కౌశికగోత్రుఁడు పద్మనేత్రసే
    వారతబుద్ధి నందవరవంశ్యుఁడు సత్కవిలోకనాథుఁడా
    చారసమగ్రవర్తనుఁడు చారువచస్స్థితి నొప్పువాఁ డొగిన్.

రాయలు కళింగదేశవిజిగీషామనీష దండెత్తిపోవుచు బెజవాడలో విడిసి హరివాసరోపవాసవ్రతమును గృష్ణాతీరమున నున్న శ్రీకాకుళపుణ్యక్షేత్రమునఁ గావించుటకై పెద్దనాదివిద్వత్కవులతో నరిగెను. అప్పుడే యక్కడ వెలసియున్న యాంధ్రనాయకస్వామి కృష్ణరాయల స్వప్నమున నాముక్తమాల్యద రచింప నాదేశించిన ట్లాముక్తమాల్యదయందుఁ జెప్పఁబడి యున్నది. అక్కడ నేకాదశినాఁడు పండితమండలితోఁ బుణ్యకథాగోష్ఠి సలుపుచుఁ గృష్ణరాయలు దాశరథు లెక్కువవారా? పాండవు లెక్కువవారా? యని ప్రశ్నించెనట. పెద్దనాదులు తమకుఁ దోఁచినరీతిని బలుదెఱఁగులఁ జెప్పిరట. దాశరథులు ఈశ్వరాంశమున జన్మించినవారుగావున వారి కమానుషశక్తులును లోకోత్తరయోగ్యతయును గల్గుట వింతకాదు. పాండవులయెడ నీశ్వరాంశములేదు. అట్లయ్యు శక్తులయందును యోగ్యతయందును దాశరథులతో సాటివచ్చిరి. కావునఁ బాండవులే యెక్కువవా రగుదురని తనయాశయమును రాయలు తుదకు వెల్లడించెనట! అది విని రాయలప్రక్కను జామరము విసరుచున్న చాకలియొకఁడు కేలుమోడ్చి “దేవర జన్మాంతరమున నున్నను బాండవుల మీఁది యభిమానమును మానలే”దనెనట! రాయ లత్యానందము సెంది యాచాకలివాని నేది కావలయునో కోరుకొమ్మనెనఁట! వాఁడు దేవరకోట యేలవలెనని కోరిక కలదనెనట! అప్పుడే యక్కడ వానికి దేవరకోట సీమ నేలుకొమ్మని యనుజ్ఞ నొసంగెనఁట. నేఁ డాదేవరకోట సీమను గమ్మజమీందారులు పాలించుచున్నారు. కాని నేఁటివఱకును నాసంస్థానమునఁ జాకలిచేఁ బల్లకి మోయింపకుండుటయు సీలు మొహర్లు వానియొద్దనే యుంచుటయు నాచారముగా వచ్చుచుండె నందురు. కృష్ణరాయలపై ననేక కవులచేఁ జెప్పఁబడిన చాటువులు—

ఉ. శరసంధానబలక్షమాదివివిధైశ్వర్యంబులుం గల్గి దు
    ర్భరషండత్వబిలప్రవేశకలనబ్రహ్మఘ్నతల్ మానినన్
    నరసింహక్షితిమండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీసాటిగా
    నరసింహక్షితిమండలేశ్వరుల కృష్ణా! రాజకంఠీరవా!
మ. కలనం దావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండమం
    డలభేదం బొనరించి యేఁగునెడఁ దన్మధ్యంబునన్ హారకుం
    డలకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లోఁ
    గలఁగం బాఱుచు నేఁగె నీవ యనుశంకన్ గృష్ణరాయాధిపా!
ఉ. ఏపునఁ గృష్ణరాయజగతీశ్వరుఖడ్గము మింట మార్గముం
    జూపిన భానుమండలము సొచ్చి హుటాహుటి శత్రు లేఁగుచో
    రేపటిబాపనయ్య పగలింటిమహోగ్రపుజంగమయ్య! యో
    మాపటి దాసరయ్య! మము మన్నన సేయు మటందు రెంతయున్.
ఉ. కాశియు నీకరాసిసరిగాదు నృసింహునికృష్ణరాయ! యా
    కాశిని జచ్చువారికిని గల్గును జేతికిఁ బుఱ్ఱె నీమహో
    గ్రాసిని గండతుండెమాలుగా మృతిఁ బొందిన వైరికోటికిన్
    భాసురరాంభకుంభకుచభారము లబ్బెడు నేమిచిత్రమో!

మ. రాయగ్రామణి కృష్ణరాయ! భవదుగ్రక్రూరఖడ్గాహిచేఁ
    గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ కానిర్ఝరీపోషణీ
    మాయాభీకుముటూరులోటుకుహుటూమాయాసటాజాహరే
    మాయాగ్గేయమడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్.
మ. సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచేఁ బడ్డ దు
    ర్దమదోర్దండపుళిందకోటి యవనవ్రాతంబు సప్తాశ్వమా
    ర్గమునన్ గాంచి సెబా సహో హరిహరంగాఖూబుఘోడాకితే
    తుముకీబాయిలబయిదేమలికి యందు ర్మింటికిం బోవుచున్.
మ. గవఁకుల్ బల్లిదమయ్యె ఢిల్లికిని మక్కాకోటమేలయ్యెఁ బం
    డువకుం గ్రొత్తగఁ గ్రొత్తడంబు లమరెన్ బోలేరుచందేరులన్
    దవసం బెక్కె బెడందకోటపురకాంతాగర్భనిర్భేదన
    ప్రవణం బైనభవత్ప్రయాణజయవార్తన్ గృష్ణరాయాధిపా!
ఒకప్పుడు కృష్ణరాయలకు గృష్ణడగ్గఱఁ దురుష్కులతోఁ బోరు వాటిల్లెను. రాయలసేన కృష్ణ కిద్దరిని దురుష్కసేన యద్దరిని నుండెను. నది దాఁటి రాయలసేనపైకి రావలయునని యేన్గులతోఁ దురకలు నదిలోనికిఁ జొచ్చి కృష్ణ వెల్లువగాఁ బారుచుండుటచేఁ జెల్లాచెదరై కొట్టకొనిపోయిరి. ఏన్గులుమాత్ర మీదరికి వచ్చి రాయలసేనలోఁ జిక్కెను. అప్పుడొక కవి చెప్పిన పద్యము—
క. నరసింహకృష్ణరాయా
    దురమున నీపేరిటేరు తురకలఁ జంపెన్
    గరిరాజవరదుఁ డంచును
    గరిఘట లట మిమ్ముఁ జూచి గ్రక్కున వచ్చెన్.
శా. శ్రీలీలాత్మజ! కృష్ణరాయ! సమరోర్విన్ నీదువైరిక్షమా
    పాలు ర్వీఁగి హయాధిరూఢు లగుచుం బాఱన్ వనీశాఖిశా
    ఖాలగ్నాయతకేశపాశులయి యీఁగన్ గేకిస ల్గొట్చి యు
    య్యాలే జొంపలో యంచుఁ బాడుదురు భిల్లాంభోజపత్రేక్షణల్!

మ. బలభిన్నాగము చెంపఁగొట్టి గిరిజాప్రాణేశునఱ్ఱెక్కి నా
    గ్జలజాతేక్షణకొప్పు వట్టి శశివక్షం బెక్కి ధట్టించి యా
    బలరామున్ మొలఁబట్టి నీ యశము భూభాగమ్మునన్ మించె నౌ
    లలనామన్మథ! కృష్ణరాయనరపాలా! రాజకంఠీరవా!
క. నరసింహకృష్ణరాయని
    కరమరుదగుకీర్తి యొప్పెఁ గరిభిద్గిరిభి
    త్కరికరిభిద్గిరిగిరిభి
    త్కరిభిద్గిరిభిత్తురంగకమనీయం బై.
గీ. పద్మనాట్యస్థలంబునఁ బక్కిలోనఁ
    బైరుపైఁ బవ్వళించిన పరమమూర్తి
    అనుదినంబును గృష్ణరా యాధిపునకుఁ
    జుక్కజగడాలవేలుపు శుభము లొసఁగు.
చ. పెనిమిటి చేయు పుణ్యజనపీడనవృత్తియుఁ దండ్రిభంగమున్
    దనయుననంగభావమును దమ్మునికార్శ్యముఁ జూచి రోసి స
    జ్జనపరిరక్షు శౌర్యనిధిఁ జారుశరీరుఁ గళాప్రపూర్ణ న
    వ్వననిధికన్య చేరె జితవైరినికాయునిఁ గృష్ణరాయనిన్.
ఉ. అబ్జముఖీమనోజ! నరసాధిపనందన! కృష్ణ! నీయశం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీవితీర్ణిమం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీపరాక్రమం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము చిత్ర మిద్ధరన్య
ఉ. కాయము వంగి తా ముదిసెఁ గన్నులునుం బొరగప్పెఁ గాలు పే
    దాయె నటంచు రోసి నరసాధిపనందన! కృష్ణరాయ! యీ
    భూయువతీలలామ నినుఁ బొందిన నాదిభుజంగభర్తకున్
    బాయనిచింతచేతఁ దలప్రాణము తోఁకకు రాకయుండునే!

ఆంధ్రవాఙ్మయమున శ్రీకృష్ణరాయలవిఖ్యాతి యవినశ్వరమును బ్రధానమును గావున నామహారాజునుగూర్చి సంస్కృతమునఁ జెప్పఁబడిన చాటుపద్యములఁగూడ నిందుఁ జేర్చుట సముచిత మని యట్లు చేయుచున్నాఁడను—

శ్లో. వీరాగ్రేసర! కృష్ణరాయనృపతే! త్వద్వైరికాంతావనే
    ధావంత్యః కుటయానరోమలతికావ్యాహారలీలాభృతః
    ప్రాప్తాన్ కోకమహేభపన్నగశుకాన్ రుంధంతి వక్త్రేందునా
    మధ్యే నాసి కచేన కంకణనసద్వైడూర్యరత్నైరసి.
శ్లో. భో భోభూవర! భూరివిక్రమ! భవద్ధాటీషు విద్యాధరై
    ర్నిస్సాణేషు ధణం ధణం ధణం ధణధణం ధాణం ధణధ్యానిషు
    త్వత్కృత్తప్రతిమల్లవీరవరణే దేవాంగనానా మభూ
    న్నృత్తేభ్యో ధిమిధిమ్మి ధింధిమి ధిమిం ధింధిం ధిమింధింకృతిః
శ్లో. దృగ్భీత్యా నరసక్షమాపతిసభస్త్రీణాం మృగేణాశ్రితో
    రాజా తన్ముఖతర్జిత స్స్వయ మపి త్యక్త్వా౽౽త్మనో మండలం
    దుర్గేశస్య జటాటవీ ముపగతః పాణౌ త మేణం దధౌ
    సన్మార్గప్రవణో నిజాశ్రితతమం క్షీణో౽పి నోపేక్షతే.
శ్లో. వీరాగ్రేసర! కృష్ణరాయ! భవతా కృత్తారణ ప్రాంగణే
    ప్రౌఢాః కేచన పారసీకపతయః ప్రాప్తాః పురీ మామరీం
    పీరుత్తేతి గురౌ, నలద్విషి సురత్తణేతి, శచ్యాంపున
    ర్బిబ్బీతి, ప్రణతౌ సలామితి సురాన్ స్మేరాననాన్ కుర్వతే!
శ్లో. కృష్ణరాయ! స్తువంతు త్వాం కవయో న వయం స్తుమః
    నరసింహకిశోరస్య కియాన్ గజపతే ర్జయః?

శ్రీకృష్ణదేవరాయలు లావణ్యగణ్య మగు నొక స్త్రీరత్నమును బహుయత్నమున సాధించి యవరోధవధూసవిభమునఁ దనయుల్లాసమును వెల్లడించెనట! అంత నాయంతఃపురిక “యింతకే యింత యుప్పొంగవలెనా యిది యేమి గజపతికుమార్తను సాధించుటయొక్కో!” యని తేలనాడెనట! రాయలడెందమున చుఱుకు మని తాఁకెను. గజపతికుమార్తెను సాధింపఁ దలం పొదవెను. ఒకనాటిరాత్రి యుపశ్రుతిపరిజ్ఞానమునకై చాకివానియింటిదరి కొకయాప్తభృత్యుని, దిమ్మరుసును బంపెనఁట! ఆయింటి చాకివాఁడు సుఖశయితుఁడై యిట్లు పాడుచుండెనఁట!

    కొండవీడు మందేరా కొండపల్లి మందేరా
    కాదని యెవ్వఁడు వాదుకు వచ్చిన కటకందాకా మందేరా.

విజయసూచకమగు నాయుపశ్రుతిని గొనియే రాయలు దాడి వెడలి కటకమువఱకును గలదేశమును వశపఱచుకొనుటయేకాక గజపతికుమార్తెను గూడ దక్కఁగొని యంతఃపురమున జరిగిన యవమానమును బాపికొనెనఁట!

శ్రీకృష్ణదేవరాయల నిర్యాణకాలము—

ఉ. బోరన యాచకప్రతతి భూరివిపద్దశ నందుచుండఁగా
    నారయ శాలివాహనశకాబ్దము లద్రియుగాబ్ధిసోములం
    దారణవత్సరంబున నిదాఘదినంబున మాఘ శుద్ధష
    ష్ఠీరవివాసరంబున నృసిహునికృష్ణుఁడు చేరె స్వర్గమున్
    ద్వారక నున్నకృష్ణుఁ డవతారసమాప్తిని జెందుకైవడిన్.

రాయలనిర్యాణానంతరము కొన్నిసంవత్సరములు పెద్దనామాత్యుఁడు జీవించి స్వావస్థ నిట్లు చెప్పుకొనెను—

సీ. ఎదురైనచోఁ దనమదకరీంద్రము నిల్పి
                    కేలుఁత యొసఁగి యెక్కించుకొనియె
    మనుచరిత్రం బందుకొనువేళఁ బురమేఁగఁ
                    బల్లకిఁ దనకేలఁ బట్టి యెత్తె
    గోకటగ్రామాద్యనేకాగ్రహారంబు
                    లడిగినసీమలయందు నిచ్చె

    బిరుదైన కవిగండపెండేరమున కీవ
                    తగు దని తానె పాదమునఁ దొడిగె
గీ. ఆంధ్రకవితాపితామహ! అల్లసాని
    పెద్దనకవీంద్ర! యని తన్నుఁ బిల్చునట్టి
    కృష్ణరాయలతో దివి కేఁగలేక
    బ్రదికియున్నాఁడ జీవచ్ఛవంబ నగుచు.
రాయలనిర్యాణానంతరమే గజపతిరాజు కన్నడరాజ్యముపైకి దండెత్తిరాఁగాఁ బెద్దనామాత్యుఁ డీసీసపద్యమును రచించి పంపెను. సిగ్గిలి గజపతిరాజు తిరిగిపోయెను.
సీ. రాయరాహతమిండరాచయేనుఁగు వచ్చి
                    యారట్లకోట గోరాడునాఁడు
    సంపెటనరపాలసార్వభౌముఁడు వచ్చి
                    సింహాద్రి జయశిలఁ జేర్చునాఁడు
    సెలగోలుసింహంబు చేరి ధిక్కృతిఁ గంచు
                    తల్పులఁ గరుల డీకొల్పునాఁడు
    ఘనతరనిర్భరగండపెండెర మిచ్చి
                    కూఁతు రాయల కొనగూర్చునాఁడు
గీ. ఒడ లెఱుంగవొ చచ్చితొ యుర్విలేవొ
    చేరఁజాలక తలచెడి జీర్ణమైతొ
    కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర!
    తెఱచినిలు కుక్కసొచ్చినతెఱఁగు దోఁప.

తురగా రామకవి

ఈతఁడు పెద్దాపురపుఁబ్రభువగు వత్సవాయతిమ్మజగపతి మహారాజులుంగారి నాఁటివాఁడు. ఈతని చాటుపద్యములేగాని గ్రంథములు తెలియరాలేదు. వత్సవాయతిమ్మనృపాలు నీతఁడు తిట్టెను.

క. అద్దిర! శ్రీభూనీలలు
    ముద్దియ లాహరికిఁ గలరు ముగు రందఱలోఁ
    బెద్దమ్మ నాట్య మాడును
    దిద్దిమ్మని వత్సవాయతిమ్మనియింటన్.
మఱియు నీపద్యమును వినుఁడు.
ఉ. పెండెలనాగికొప్పుపయిఁ పెద్దికటిస్థలి గంగిగుబ్బచ
    న్గొంజలనుండు రామకవికుంజరుహస్తము క్రిందుఁ జేసె హా!
    పండక బంటు మిల్లి యది పండిన నీ కసుమాలధారుణీ
    మండలనాథుఁ బోలు నొకమానవమాత్రుని వేఁడఁబోవునే?

వింతయొక్కడి వెల్లడియయినది. సింగారము చెలరేఁగుచున్న పద్యములన్నియు శ్రీనాథునితలకుఁ దగిలింపఁబడుచున్నవి. పెండెలనాగి, గంగి, పెద్ది యనువిలాసినులు రామకవిగారికిం గామినులని పైపద్యము పలుకుచున్నది. కాన యావెలఁదుకలపేర నున్నపద్యములు రామకవికృతములే యగును.

ఉ. చూడఁగ నల్పుగాని పరిశోభితదివ్యకురంగనాభమే
    జాడను..........

అను పద్యమును,

ఉ. భూతలమందు ధాతకు నపూజ్యత గల్గెను రెంట మూట భా
    గోతులబుచ్చిగాని కొకకొంచెము......

అనుపద్యమును శ్రీనాథకృతులుగాఁ దలఁపఁబడుచున్నవి. రామకవిగ్రామణివని నిజము నేఁటఁ దేటపడినది. ఈపద్య మీరామకవి దగునో కాదో!

గీ. విప్పుతలముండ తల్లి వివేకి గాదు
    ఎన్ని దిట్టిన నాభార్య యేభ్యరాశి
    అన్నిటికిఁ దోడు నాకాలు నవటికాలు
    రామకవిగానిబ్రదుకు శ్రీరామరామ!


నృసింహభారతి

ఈయన శృంగగిరిపీఠాధికారి కాఁబోలును. ఎవరో వీరిని బొగడినారు.

మ. కరహాటాంధ్రమారటలాటవిలసత్కాభోజనేపాళికా
    కురుకాళింగవిదర్భచేదియవనాఘూర్జావనీనాయక
    స్ఫురితానేకసభాంతరాళములలో భూషింతు వాక్ప్రౌఢిచే
    నరసింహోత్తమభారతీందుగురునిన్ నాస్వామినిన్ వేడుకన్.

ఈయన తనపీఠమునకు వచ్చుద్రవ్య మంతయును మేడలకును మిద్దెలకును వ్యయించెడువాఁడఁట!

శ్లో. కారూణా మసి దారూణా మశ్మనాం వేశ్మనా మపి
    నృసింహభారతే ర్ద్రవ్య మయ్యో అయ్యో వృథావృథా.

పింగళిసూరకవి

ఈతడు కళాపూర్ణోదయము, ప్రభావతీప్రద్యుమ్నము, రాఘవపాండవీయము ననుకృతులను రచియించిన చతురకవి. ద్వ్యర్థికావ్యములలో నీతని రాఘవపాండవాయ మగ్రగణ్యము. ఈక్రిందిపద్యము తద్గ్రంథరచనమును శ్లాఘించుచున్నది.

క. విశదం బొకపక్షంబున
    విశయము వేఱొకట నిట్లు విలసిల్లిన యా
    శశి యెట్లు సాటియగుఁ గవి
    శశియగు రఘుపాండుకావ్యచరణసూరనకున్.


అడిదము సూరకవి

క్రై.1750 ప్రాంతములం దీకవిరత్నము విశాఖపట్టణపు మండలమందలి విజయనగరసంస్థానపుంబ్రభువగు పూసపాటి చినవిజయరామరాజుగారియొద్దఁ గవీశ్వరుఁడుగా నుండెను. ఆంధ్రచంద్రాలోకము, కవిసంశయవిచ్ఛేదము, కవిజనరంజనము మొదలగునవి యీతను కృతులు. ఈతని చాటువులు—

చ. గడియకు నూఱుపద్దెములు గంటములేక రచింతుఁ దిట్టఁగాఁ
    దొడఁగితినా పఠాలుమని తూలిపడుం గులశైలరాజముల్
    విడిచి యనుగ్రహించి నిఱుపేద ధనాధిపతుల్యుఁ జేతు, నే
    నడిదమువాఁడ! సూరనసమాఖ్యుఁడ! నా కొకరుండు సాటియే!
చ. గరిసెలువ్రాఁతగాని మఱిగంపెఁ డెఱుంగము మన్యదేశముల్
    తిరిగి యభీష్టవస్తువులు తెచ్చి భుజింతుము సర్వకాలమున్

    సురుచిరసత్కవిత్వనిధి సూరకవీంద్రున కేల కల్గెఁ గం
    చరమును రేగ మేకమెడచన్నులవంటివి రెండుమాన్యముల్!
ప్రశ్నోత్తరరూపముగాఁ దనవృత్తాంతముఁ జెప్పుకొన్న పద్యము—
క. ఊరెయ్యది? చీపురువలె
    పేరో? సూరకవి; యింటిపే? రడిదమువార్;
    మీరాజు? విజయరామ మ
    హారా; జతఁ డేమి సరసుఁడా? భోజుఁడయా.
రాజును బొగడినపద్యములు
శా. ఢిల్లీలోపల గోలకొండపురి నిండెన్ నీప్రశంసల్ గుఱాల్
    బల్లాలం బొడిపించి హు మ్మన యరబ్బా నెక్కి పైకొంచు బా
    దుల్లాఖానునిఁ బాఱఁదోలితివి నీదోశ్శక్తి సూబాలకున్
    మళ్ళింపం దరమౌనె శ్రీవిజయరామా! మండలాధీశ్వరా!
ఉ. పంతము నీకె చెల్లె నొకపాటియమీరుఁడు నీకు సాటియా?
    కుంతముఁ గేలఁ బూని నినుఁ గొల్వనివాఁడు ధరాతలాన భూ
    కాంతుఁ డొకండు లేఁడు కటకంబు మొదల్కొని గోలకొండప
    ర్యంతముఁ జూడ శ్రీవిజయరామనృపాలక! మండలాధిపా!

విజయరామరాజుగా రేదోకారణమున సూరకవిగారియెడ నాగ్రహమూని యాస్థానమునుండి తొలంగించిరఁట! బాదుల్లాఖానుతో నొకసారి యుద్ధము సేయఁబోయి పరాభూతులై యారాజుగారు తిరిగి వచ్చుచుండఁగా సూరకవి తనగ్రామముప్రక్క త్రోవలోఁ బనసచెట్టెక్కి విస్తళ్ళకై యాకులు గోసికొనుచుఁ జూచి యెదురుపోయి పల్లకీ నాపి తనకసి తీఱునట్లు చుఱుకుగా నీపద్యమును జెప్పెనఁట—

గీ. మెత్తనైయున్నయరటాకుమీఁదఁ గాక
    మంటమీఁదను జెల్లునే మంటివాఁడి
    బీదలై యున్నసర్దార్లమీఁదఁ గాక
    కలదె క్రొవ్వాఁడి బాదుల్లఖానుమీఁద?
పొనుగుపాటివేంకటమంత్రి యనునియోగిమీఁద సూరకవి చెప్పిన పద్యములు—
క. ఘనకులమునఁ బొడమిన దు
    ర్మనుజు డిల నింద్యుఁడగు వమన మూర్ధ్వముఖం
    బున వెడలి మంచిదగునా
    విను మవహిత! పొన్గుపాటి వేంకటమంత్రీ!
క. కినుకమెయిఁ దన్నులాడఁగ
    మొనకట్టిన సరయె గుఱ్ఱమున్ గాడిదయున్
    ఘనుఁ డల్పుఁడు సరి యగుదురె
    విను మవహిత! పొన్గుపాటి వేంకటమంత్రీ!
క. సామజము చెఱకు మెసిన
    దోమలు పదివేలు చేరి త్రోలం గలవా?
    గ్రామపతి తగవుదప్పిన
    గ్రామములో నున్నవారు కా దనఁగలరా?
క. ఇత్తడి పుత్తడి యగునా?
    తొత్తది నగ లెన్నియిడిన దొరసా నగునా?
    యుత్తమకులుఁ డౌనా దౌ
    లత్తునఁ దాఁ దిరిగినను గులాము గులామే!
క. బలవంతుఁడు బలహీనుఁడు
    పొలియుదు రిది తప్ప? నల్లపూసలు ముత్యాల్

    దొలఁగుఁగద! మగఁడుపోయిన
    వెలఁదుకకున్ బొన్గుపాటి వేంకటమంత్రీ!
క. జలచరము లబ్ధిఁ బొడమవె?
    జలరాశికి మోదకరుఁడు చంద్రుం డొకఁడే
    కుల ముద్ధరింప నొకఁడే
    విలసద్యశ! పొన్గుపాటి వేంకటమంత్రీ!
క. వలరాచపనికిఁ గాదా
    వెలవెలఁదుక పాన్పు నెక్క విటుఁడు సహించున్
    జల మేల కార్యవాదికి
    విలసద్యశ! పొన్గుపాటి వేంకటమంత్రీ!
పూసపాటి సీతారామరాజుగా రొకప్పు డేకవచనమున సంబోధించినందులకుఁ గుపితులు కాఁగా సూరకవి
చెప్పినది—
క. చిన్నప్పుడు రతికేళిక
    నున్నప్పుడు కవితలోన యుద్ధములోనన్,
    వన్నె సుమీ రాకొట్టుట
    చెన్నుగ నోపూసపాటి సీతారామా!
దంతులూరి యన్నమరా జనునాతఁ డీ యడిదమువారి రేగమాన్యమునుండి యక్కడి చెఱువుముఱుగునీరు పోనీక యడ్డుకట్టి చిక్కులు వెట్టుచుండఁగా నీసూరకవికిఁ దండ్రివరుసవాఁడగు రామకవి మోకాలిబంటిలోఁ దనమాన్యమున నిలుచుండి యీక్రిందిపద్యములఁ జెప్పెనఁట! అంతట నారాజు కట్టిన యడ్డుకట్ట తెగి పల్లమునకు నీరు వంచుకొని పోయెనఁట!
సీ. బ్రహ్మాండభాండసంపత్తి కుక్షిని గల్గు
                    పద్మనాభునిపదాబ్జమునఁ బుట్టి

    సకలరత్నాకరస్థానమై యుప్పొంగు
                    నంబుధీశునిచరణంబు ద్రొక్కి
    పరమతత్త్వజ్ఞుఁడై పరఁగు శంతనుమహీ
                    రమణువామాంకభాగమునఁ జేరి
    అఖిలలోకాధ్యక్షుఁడై మించి విహరించు
                    శివుజటాజూటాగ్రసీమ నిలిచి
గీ. తనరు నీవంటిధన్య కుత్తమము గాదు
    పూసపాటిమహాస్థానభూమియందుఁ
    గాలు త్రొక్కంగ నోడుఁ జండాలుఁడైన
    గదలు మిటమాని దివిజగంగాభవాని!
సీ. ఆదిబిక్షుం డీతఁ డని రోసి విడియాకు
                    గొనివచ్చి యిట నిల్వఁ గోరితొక్కొ
    జగడాలచీలివై సవతితోఁ బోరాడి
                    వీఁగివచ్చి యిచట డాఁగితొక్కొ
    నిర్జరాంగన లెల్ల నీఱంకు వెలిపుచ్చ
                    దూఁబవై యిచ్చోట దూఱితొక్కొ
    బీదబాఁపలఁ గష్టపెట్టుటకై మిన్ను
                    దొలఁగి యిచ్చోటను నిలిచితొక్కొ
గీ. వలదు ద్విజభూమిఁ గాల్నిల్ప వరుసగాదు
    రవ్వ నీ కేల తగ దంబురాశి కరుగు
    నాతి యతఁడె కాఁడటె పిన్ననాఁటిమగఁడు
    కదలు మిటమాని దివిజగంగాభవాని!
సీ. భావింప నిలువెల్ల భంగంబులే కాని
                    భంగము ల్దొలఁగు టెప్పటికి లేదు
    తిరుగుచో వంకరతిరుగు డింతియ కాని
                    తిన్నగాఁ దిరుగుట యెన్నఁ డెఱుఁగ

    మొనసి రేయుఁ బవళ్ళు మొరయుచుండుటె కాని
                    మొరయ కూరకయుంట యెఱుఁగ మెపుడు
    పరులకల్మిని రోసి పల్చనగుటె కాని
                    పలుచనిగతి మాని మెలఁగు టెఱుఁగ
గీ. మనుచు నీలోన నీవైన యవగుణంబు
    లరసి లజ్జించి దివినుండ కరుగుదెంచి
    నిలువునీరైన నీవిందు నిలిచితొక్కొ
    కదలు మిటమాని దివిజగంగాభవాని!
సీ. పచ్చిమాంసము కల్లు భక్షించి మత్తెక్కి
                    రాణించు తిరుగుపరాంసులైన
    గంజాయి గుండ హుక్కాలుడికెడి నీళ్ళు
                    ద్రావి మ్రాన్పడెడుతురుష్కులైన
    గోవులఁ బడమొత్తి కోసి ముక్కలు మెక్కు
                    సమదాంధు లగుకొండసవరులైన
    తెరవాట్లు గొట్టి కత్తెరదొంగలై చాల
                    వాలించు తిరుగుచండాలు రైన
గీ. భూసురక్షేత్ర మిది యన్నఁ బోఁ డొకండు
    చిన్నపొలములు; బ్రాహ్మణక్షేత్రమునకు
    ఘాతుకత్వంబు సేయుముష్కరులు గలరె?
    కదలు మిటమాని దివిజగంగాభవాని!
సీ. కృతకాద్రు లాయెనా కీలోగ్రఫణిఫణా
                    నేకఫూత్కారవల్మీకచయము
    విరిదోఁట లాయెనా కఱకుకంటకకంట
                    కాంకురవిస్ఫురితాగచయము
    పువుఁబాన్పు లాయెనా నవమంజు లశ్వేత
                    లవణాలవాలమౌ చవుటినేల

    బొమ్మరిం డ్లాయెనా భూరిభేకాండజా
                    ధారమై తనరు కేదారచయము
గీ. నీకు విహరింప వసతులై నివ్వటిలెనె
    చిన్నపొలములు; బ్రాహ్మణక్షేత్రమునకు
    ఘాతుకత్వంబు సేయుముష్కరులు గలరె?
    కదలు మిటమాని దివిజగంగాభవాని!
అడిదము రామకవి పైవిషయమునుగూర్చి పూసపాటి విజయరామరాజుగారి కిచ్చుకొన్న యర్జీపద్యములు—
సీ. అవధారు! దేవ! మహాప్రభూ! విన్నపం
                    బాశ్రితోత్తముఁడ శుద్ధాంధ్రకవిని
    పేరు రామన యింటిపే రడిదమువారు
                    మాజాగ భూపాలరాజురేగ
    వల్లకృష్ణక్షమానాయకాగ్రేసరుఁ
                    డెఱ్ఱకృష్ణక్ష్మాతలేంద్రు లచటఁ
    గరణికధర్మంబు గల్పించి మాన్యంబు
                    దయచేసి రది యాస్పదంబు మాకు
గీ. నదియు నీయేఁడు దంతులూరన్ననృపతి
    సత్తముఁడు గ్రామమెల్లను గుత్తచేసి
    చెఱువు బిగఁగట్టి ప్రజలు జేజేపడంగ
    ముంపుగట్టించె వరిపొట్ట ముంపఁదలఁచి.
సీ. విన్నవించెద నాదువృత్తాంత మది కొంత
                    చిత్తగింపు పరాకు సేయకుండఁ
    బొలములో నొకఁ డేరు పూన్పంగఁ జాలఁడు
                    గంగాభవానిఢాకకును జడిసి
    దుక్కిటెడ్లను గొని దున్నుకుంద మటన్న
                    బదులియ్యఁ డెవ్వఁడు పాఁతనేబు

    ఏజోలియును లేక యింట నుండెద మన్న
                    సాలుకు వచ్చు గంటాలపన్ను
గీ. దేశమునవారు పొన్నూరుతెన్నుగాదు
    పంట పస లేదు గంటాలపన్ను పోదు
    మీకు దయరాదు మునుపటిమిసిమి లేదు
    అతులగుణదీప! విజయరామావనీప!
సూరకవి ప్రపౌత్త్రుఁడు బాలభాస్కరకవి చల్లా పట్టాభిరామయ యనువానిఁగూర్చి చెప్పినపద్యము—
సీ. విజయరామక్షమావిభు మెచ్చి భాసిల్లె
                    ధరణిలో మాప్రపితామహుండు
    గంగాభవానిని గడుదిట్టరై తిట్టి
                    ఖ్యాతిఁ జెన్నొందె మాతాత యొకఁడు
    వెలయంగ మగటిపల్వెంకను బడఁ దిట్టి
                    తగఁ దెగటార్చె మాతండ్రిగారు
    ఆరీతిగాఁ దిట్టి యమపురంబునకును
                    నిన్నుఁ బంపఁదలంచి యున్నవాఁడ
గీ. గాచుకొమ్మిటు మీఁద నఖండచండ
    దారుణోద్దండకవితాగభీరశక్తి
    నీతరము గాదు కలహించి నిర్వహింప
    చల్లపట్టాభిరామ! నీచగుణధామ!

అహోబలపండితుఁడు

ఆంధ్రశబ్దచింతామణి సూత్రములకు భాష్య మొనరించిన గాలి యహోబలపండితుఁడు మైదవోలున నుండఁగా గుండ్లకమ్మ వఱద వచ్చి కొంపలు కూలి పంటలు పాడ్వడి తిన నన్నమును గట్ట గుడ్డయు లేనిదుర్దశ వాటిల్లెను. అపుడు నరసారావుపేట మల్రాజువారి సంస్థానమున కరుగుదెంచి యీ క్రిందిసీసపద్యమును జెప్పి వారివలన నొకయగ్రహారముం బడసి యాతఁ డచ్చటకు నివాసము మార్చుకొనెనఁట!

సీ. జానకీపతి లేఁతసజ్జరొట్టెలపాలు
                    కొంపలకప్పెల్ల గొడ్లపాలు
    సంవాసములు దొంగజాగిలంబులపాలు
                    నయనముల్ జాగరణంబుపాలు
    కలపుస్తకపుఁద్రాళ్ళు కట్టెమోపులపాలు
                    పొలుపైనచేతులు ముండ్లపాలు
    భూరిసంధ్యావిధుల్ బురుదనీళులపాలు
                    నాలుక దీనోక్తినటనపాలు
గీ. ఘనతరస్నేహ మతినీచజనముపాలు
    చిత్త మేవేళ నతిదీర్ఘచింతపాలు
    హరిహరీ! దేహ మంతయు నలఁతపాలు
    మైదవోలున నుండుట మాకుఁ జాలు.
ఆతని ప్రతిజ్ఞ
క. నెట్టన నభనవనన్నయ
    భట్టాచార్యాభిధానపటుబిరుదాంకం

    బి ట్టట్టనక వహించిన
    దిట్టఁడ! ననుఁ బోలఁగల సుధీవరు లేరే?
నక్కలపాటి బాలసరస్వతి యను కవీశ్వరుఁడు కడపరెడ్లనుగూర్చి చెప్పినది—
ఉ. రెడ్ల మటంచుఁ గ్రొవ్వునఁ జరించి వరాలు గడించె యూరకే
    బుడ్లకొలందిఁ ద్రావి కడుపు ల్కడుఁ బెంచి వివేకహీనులై
    యెడ్లవలెన్ వసించు గుణహీనుల కెక్కడి కీర్తు లోరి వి
    ద్విడ్లయకాల! గోళ్ళ చినతిమ్మతనూభవ! తాతభూవరా!
దేవలూరి కేశవరెడ్డియను నాతఁ డొకకవీశ్వరుఁడు త్రోవ నరుగుచుండఁగా—ఓహో! కపీశ్వరులా! యని గేలిచేసెనఁట! కోపము వేడెత్తి యాకవీశ్వరుఁ డీపద్యముఁ జెప్పెను.
క. పీ పట్టినట్టు నోరను
    వీ పట్టదదేమి నీకు? వీ, పీ, లందున్
    దీపయి రుచిపుట్టెనొ నీ
    కీపట్టున దేవలూరి కేశవరెడ్డీ!
నారయప్పారావువారి సంస్థానమున జమాబందికిఁ గరణములు వచ్చి చిరకాలము నూజివీట వసింపవలసివచ్చుచుండెడిదఁట! ఒకప్పు డాపరస్థలవాసక్లేశమును సైఁపలేనికరణమొకఁడు నారయభూపాలునొద్దఁ జెప్పిన పద్యము—
త. శీతజలస్నానంబును
    భూతలశయనంబు నొంటిపూ టశనంబున్
    నాతిగలబ్రహ్మచర్యము
    నాతరమా! పూట గడప నారయభూపా!

భృంగపంచకము. శ్రీనాథకృతి యందురు.

సౌందర్యశాలినియగు నొకనరపాలునిదేవేరి యమాత్యునకుఁ జనవుపడియుండెను. ఒకప్పు డాభూపతి కార్యవశమున స్థలాంతరమున కరుగుడు నామంత్రి యంతిపురమునఁ జేరుకొని రాజమహిషితోఁ గేరింతలాడుచుండెను. పుడమిఱేఁడును నాఁటిరేయికే మరలఁ దిరిగివచ్చుటయుఁ గోటలోనికి వచ్చినతోడన కవాటములెల్ల బంధింపఁబడుటయు నెఱిఁగి దూతికయొక ర్తీవృత్తాంత మమాత్యునకుఁ దెలిపి దాఁకొనుటకు భృంగాపదేశమునఁ జెప్పినది—

ఉ. మాయురె భృంగమా! వికచమల్లికలన్ విడనాడి తమ్మిలో
    నీయెడఁ బూవుఁదేనియల నింపు జనింపఁగఁ గ్రోలి సొక్కియున్
    బోయెద నన్నభ్రాంతి నినుఁ బొందదు రా జుదయించె నిప్పు డీ
    తోయజపత్రముల్ వరుసతే ముకుళించెఁ జలింపకుండుమా!

పుడమిఱేఁడు శయనాగారమున కరిగినపిదపఁ గొంతదడవునకు మంత్రి యిఱుకటమున దాఁగియుండఁజాలక యిటునటుఁ గదలఁగాఁ జప్పుడగుట విని మఱల నాదూతి చెప్పునది—

చ. అళికులవర్య! పద్మముకుళాంతరమందు వసింపనేరమిన్
    జలనము సెందెదేమి నవసారసమిత్రుఁడు రాకయుండునా?
    తొలఁగక యందె యుండు మిఁకఁ దోయజవైరి తిరంబె రాత్రి యీ
    కలవర మేల? తమ్మి తుద గానక తూఱక యూరకుండుమా!

సాధ్వీమణి యగు నామంత్రిభార్య ఱేఁ డంతిపురమునఁ జేరుటవిని రేయి రెండుజాములు కటచనినను దనభర్త యిలు సేరమిచేఁ దిగుల్వడి యేమికీడు వాటిల్లెనో యని కనుఁగొనరాఁగా నామెనుగూర్చి దూతి చెప్పునది—

మ. అలినీ! తత్తఱమేలె నేఁడు నిదె నీయాత్మేశుఁడౌ భృంగమున్
    జలజాసక్తమరందపానవశతన్ సానందుఁడై యున్నవాఁ
    డులు కింతేనియు లేక నీ వరుగుమా! యొప్పార నిప్పాట నీ
    చెలువుండుం బఱతెంచుఁ దేకువము రాజీవంబు పుష్పించినన్.

తా మింక వెలుపలకు దయచేయుం డని మంత్రికిని సంబోధించుచుఁ జెప్పునది—

మ. పతి నిద్రించినవేళ రాఁదగున యోపద్మారి! యీకేళికా
    యతనంబందు రతిశ్రమన్ విభుఁడు నిద్రాసక్తుఁడై యుండె నీ
    శతపత్రేక్షణ మోము వాంచినది నీసామర్థ్యమున్ జూపఁబో
    కతివేగంబున నేఁగునా! తొలఁగి మాయాత్మల్ సుఖం బందఁగన్.

రేయి రాజమహిషి తనకంఠహారమును మంత్రికంఠమున వైచెను. ఆతఁడు నది మఱచి మఱునాఁడు దానిఁ దాల్చియే రాజసభ కరుదెంచెను. అది గాంచి రాజు గుఱుతించునేమో యని భీతిలి నిపుణయగు నాదూతి వందివేషమున నరుగుదెంచి యీక్రిందిపద్యమును జదువ నందలి “మానపరిపాల” యనువిశేషణముఁ బట్టి మంత్రి తెలిసికొని తనకంఠమందలి హారమును బైపచ్చడమునఁ జుట్టి పారితోషికముగా నొసంగెను.

చ. అతులసభాంతరస్థితబుధావళికెల్ల జొహారు వీరరా
    హుతులకు మేల్జొహారు సతతోజ్జ్వలవిక్రమసార్వభౌమసం
    తతికి జొహారు వైభవవితానపురందరుఁ డైనయట్టి భూ
    పతికి జొహారు మానపరిపాల! జొహారు ప్రధానశేఖరా!

కందుకూరి జనార్దనాష్టకము


1. సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
    జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
    మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
    గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
2. ఆనపెట్టిన రాకపోతివి ఆయెఁబో అటుమొన్ననూ
    పూని పిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
    నేను చూడఁగఁ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ
    కానిలేరా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
3. నిన్నరాతిరి చవికెలోపల నీవుచెలి కూడుంటిరా
    ఉన్నమార్గము లన్నియును నే నొకతెచేతను వింటిరా
    విన్నమాత్రము కాదురా నిను వీధిలోఁగనుగొంటిరా
    కన్నులారా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
4. దబ్బు లన్నియుఁ దెలిసికొంటిని తప్పుబాసలు సేయకూ
    మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ
    ఉబ్బుచేసుక తత్తఱంబున నొడలిపైఁ జెయివేయకూ
    గబ్బితనమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
5. బిత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్వతె ఉంచెరా
    గుత్తమైనమిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా
    చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతె నొక్కెరా
    కత్తిగోరుల, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
6. అండబాయక కూడియుంటిమి ఆయెఁబోయెను నాఁటికి
    ఖండిమండిపడంగ నేటికి? కదలు మెప్పటిచోటికి
    ఉండరా నీమాటలకు నే నోర్వఁజాలను మాటికి
    గండిదొంగవు దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

7. అలుక లన్నియుఁ దీఱ నివు నాయండ కెప్పుడు వస్తివి
    పిలిచి నవరత్నాలసొమ్ములు ప్రేమతో నెపుడిస్తివి
    వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు మెస్తివి
    కలసి వేడుక దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

వలపు


చ. అలరులు సూదులై మలయజాదిసువస్తువు లగ్నికల్పమై
    మలయసమీరముల్ విషసమానములె హిమభానుఁడైనయా
    కలువలఱేఁడు చండకరుకైవడియై కనుపట్టె నయ్యయో!
    వలపను పాప మెట్టిపగవారలకున్ వల దింక దైవమా!
చ. చెలువగు మించుటద్దములు చెక్కులటంచుఁ దలంచి మెచ్చుచున్
    కలువలఁ జూచి కన్ను లని కైరవమిత్రునిఁ జూచి మోమటం
    చలరుచు నీగతిం దరుణియందము లెంచి విరాళి నొందితిన్
    వలపను పాప మెట్టిపగవారలకున్ వల దింక దైవమా!
చ. కులుకుమిటారి గబ్బిచనుగుబ్బలసొంపు చెలంగఁ దళ్కుఁగ
    న్నులు దయివాఱఁ జూచుచు వినోదముగా మృదులీలఁ బాడుచున్
    వలనగు హంసయానమున వచ్చినయట్టులె తోఁచె నింతి; హా
    వలపను పాప మెట్టిపగవారలకున్ వల దింక దైవమా!

శృంగారము


సీ. సారమా నీశరాసార మానింత వ
                    సారమా విరహిణీమార మార
    రాకుమా నీ వీచిరాకు మాటుగ నేచ
                    రాకు మారాకుమాద్యౌకుమార

    పంతమా నీదురుసంత మాయెడల వ
                    సంతమాధవ మీపసంత మార
    చెందిరా దుర్గుణమందిరా సత్కార
                    మందిరాకృతి ముదమంది రార
గీ. యనుచు వగమీరి కను దూరి మనసు జారి
    శౌరి హరిఁ జేరి దరితారి తారి మనికి
    గోరి తనబారి గడువ వేసారి నుడువ
    నోరుచే దూరి కేరి మురారి నారి.
గీ. అడుగున ధరించు మాణికయ మబ్ధిరాజు
    కణఁగి శిరమునఁ దాల్చును గడ్డిపోఁచ
    వనధిదే గని దోష మెవ్వరిది గాదు
    మణి మణియె పూరి పూరియె మందగమన.
శా. ఎంచన్ మించుగ నెత్తమాడుదుగదా యేప్రొద్దు బంగారపుం
    బంచల్ తీర్చిన రత్నమందిరములన్ బారా దుగా దచ్చి తీ
    వం చా ఱొక్కటి తొమ్మి దేడు పది చవ్వం చిత్తిగంచుం జెలుల్
    ప్రాంచల్లీలల నీకు నాకు సరితోడై పల్క బింబాధరా!
మ. ఎనయ న్నీజిగిమేనిక్రొంజెమటచే నేప్రొద్దు సుస్నానమున్
    నిను వర్ణించుట సంధ్యయున్ జపవిధుల్ నిత్యంబు నీపాదవం
    దనమే యెప్పుడు దేవపూజనము నీనవ్యాధరానూనచుం
    బనమే మాకనిశం బనర్గళసుధాపానంబు బింబాధరా!
శా. కౌనా పేదలకెల్లఁ బేద పలుకా కర్పూరఖండంబు నె
    మ్మేనా పైఁడిసలాక ముద్దుమొగమా మేలైనక్రొత్తమ్మి కొ
    ప్పా నీలంబులకప్పు గప్పునెఱిచూపా కంతుచేతూపు ని
    న్నీ నేనా నుతియించువాఁడఁ దగవా యీమాట బింబాధరా!
మ. వనజాతాంబకుఁ డేయుసాయకములన్ వారింపఁగారాదు నూ
    తనబాల్యాధికయౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయ ది

    ట్లనురక్తిన్ మిముఁబోంట్లకుం దెలుప నాహా సిగ్గు మైకోదు పా
    వనవంశంబు స్వతంత్రమీయదు సఖీవాంఛల్ తుదల్ ముట్టునే!
ఉ. అక్కరొ! నీదువల్లభుఁ డహంకృతిఁ జేసినచేఁత వింటివా;
    యెక్కడనెక్కడే మఱియు నెవ్వరి? నెవ్వరి? నన్నె నన్నె; నీ
    వక్కడి కేల పోవలయు? నంపవ; యంపితిఁ గూడుమంటినా?
    మ్రొక్కితి వేఁడుకొంటి నను ముట్టకు మంటి నిఁ కేమి చేసెదన్.
క. ఔరా! యేమని చెప్పుదు
    నారీమణిచక్కఁదనము నాణెము చేరన్
    జేరెఁడుకన్నులు బారన్
    బారెఁడు నెఱికురులు పట్టుపట్టెఁడు కుచముల్.
ఉ. ఎన్నఁడు నేరిచెన్ బెళుకు లీచెలి కన్నులు కార్ముకమ్ము ల
    న్నన్న! కురుల్ పిఱుందు పటువై పటువైఖరిఁ గైకొనెంగదే
    మొన్నఁ గదమ్మ పిన్న మొనమొల్కలు నేఁడివె ముద్దులాఁడి లేఁ
    జన్నులు మిన్నలై పయఁటసందున డాఁగుడుమూఁత లాడెడున్.
చ. పడిగము తమ్మలం బుమియు పల్లవకోటికి నోరు వేణి యం
    గడిసవరంబు సంతసొరకాయ లురోజము లచ్చరచ్చసా
    వడి యెద యూరువుల్ గమిడివాతయనంటులు మోవి జిడ్డిగి
    జ్జిడి వెలయాలిజీవనము జీవనమే తలపోసిచూచినన్?
సీ. సాటివాతెఱమీఁద గాటు లేర్పడియుండ
                    వేఱె యింకొకసాక్షిఁ గోరవలెనె?
    చక్కఁ జెక్కుల గోటినొక్కు లేర్పడియుండ
                    మించి నీ వింత వాదించనేల?
    ఉరముపై హారముల్ గుఱుతు లేర్పడియుండ
                    సత్యాన కింకఁ గేలె సాఁచవలెనె?
    పసపంట చలువదుప్పటి తేటపఱుపంగఁ
                    దెలియఁ దార్కాణముల్ పలుకవలెనె?

గీ. తేటతెన్నులు నిద్దురతేలుచూపు
    కందునెమ్మేను వేకువచందమామ
    కొలఁది వెలవెల నగుముఖకళలతీరు
    చూడ బయలాయె నడత లీజాడ లేల?
భక్తిపరవశుఁ డై పోతన్నగారు భాగవతమునందు—
శా. లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
    ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
    నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
    రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
అనుపద్యమును జెప్పఁగాఁ గామపరవశుఁడై వేఱొకకవి—
శా. పూవిల్కానిసరోజబాణముల నంభోజారిమైచాయలన్
    భావం బెంతయు డస్సె మేను బడలెన్ దాపంబు వుట్టించె నే
    నీవాఁడన్ మధురాధరం బొసఁగవే! నిక్కంబు న న్నేలవే!
    రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!
అనుపద్యమును చెప్పెను.
శా. ఆయం బోయె నింకేల నావలనఁ దప్పా మాట సైరింపవా
    ఱో కానము నీమనంబు; దయమీఱం బల్క వింతైన నీ
    ప్రాయం బేటికి నిన్నుఁ బాసినఁ దృణప్రాయం బయో “కొక్కురో
    కో” యంచుం దొలికోడి కూయుదనుకం గోపంబె బింబాధరా!
మ. మృదుతల్పంబు వికారలీల దిగి ధమ్మిల్లంబు చేఁబూని రా
    గదదృగ్జాలముతోడఁ గౌను నులియంగా మోము మార్వెట్టుచున్
    వదలం బాఱిన నీవిఁ బట్టుకొని కన్యారత్న మప్డేఁగెఁ ద
    త్సదనభ్రాజితరత్నదీపకళికాస్తంభంబు క్రీనీడకున్.
ఉ. ఏమనె? నేమి పల్కె? నిను నేమని పంపెను? నన్ను దూఱెనో?
    రామనెనో? పరాకిడెనొ? రాజులయేలిక కృష్ణమూర్తి నా

    స్వామి ముకుందుఁ డచ్యుతుఁడు వారిజనాభుఁడు శేషశాయి న
    న్నేమనె? నేమి పల్కె? నిను నేమని పంపెను? దెల్పు నెచ్చెలీ.
ఉ. ఆతఁడు దూరదేశమున కల్కనెపమ్మునఁ బోయి రాఁడు నే
    నాతనిఁ బాపి మన్మథశరాగ్నిఁ దపించుచునున్నదాన నీ
    వాతని నన్నుఁ జూచితి వియత్తల మెక్కి సుధాకరుండ! నే
    నాతనికంటెఁ జిక్కితినొ యాతఁడె చిక్కెనొ నాకుఁ దెల్పుమా!
శా. లోకాలోకపరీతభూభువన మాలోకించి పుణ్యుండ వో
    రాకాచంద్ర! భవత్సమానముఖి మత్ప్రాణేశ్వరిం బాసి నే
    నాకందర్పశరాగ్నికీలలకు లోనై యున్నచందంబు నీ
    వేకాంతంబునఁ దెల్పవయ్య! దయతో నేలాలతాతన్వికిన్.
సీ. పరిణామ మేమయ్య! ప్రాణనాథునివార్త
                    విందునో యని యుందుఁ జందమామ!
    విరహాగ్ని చల్లగా విభునియాకారంబు
                    కందునో యని యుందుఁ జందమామ!
    పతి కాకుఁ జుట్టిచ్చి మతికాంక్ష దీరంగ
                    నుందునో యని యుందుఁ జందమామ!
    వల్లభుఁ డేవేళ వచ్చు నప్పుడె మోవి
                    విందు సేతని యుందుఁ జందమామ!
గీ. చక్కఁదనమున నీసరి చందమామ!
    యాతఁ డున్నట్టి యూరిపై నయ్య! మీరు
    పోతిరా నాదువివరంబు పొసఁగఁ జెప్పి
    సాహసాంకుని రమ్మను చందమామ!
సీ. భామాలలామకు క్షేమమా తెల్పుమా
                    సకలకళాధామ! చందమామ!
    పల్లవపాణికి భద్రమా పల్కుమా
                    సర్వకళాధామ! చందమామ!

    కోకవక్షోజకుఁ గుశలమా చెప్పుమా
                    చక్రవాకప్రేమ! చందమామ!
    పద్మాయతాక్షికిఁ బరిణామమా ధర
                    సంపూర్ణగుణధామ! చందమామ!
గీ. పద్మలోచన యున్నట్టిపట్టణంబు
    త్రోవగాఁ బోదువా నీవు తోయజారి!
    సకియమేలిమి యంతయుఁ సరవిఁ దెలిసి
    యంద మందంగ రమ్మ యోచందమామ!
మ. కలిగేనా యొకనాఁటి కైన మదిలోఁ గాంక్షారతుల్ దీరఁగా
    దలకుం బాసినవెండ్రు కైతి మదనాస్త్రజ్వాలచేఁ జిక్కితిన్
    బలుకుం బంతము లొక్కటాయె విధిచేఁ బ్రాణంబు లెట్లో కదే
    నెల నాళ్ళాయెను మోముఁ జూచి యకటా నీరేజపత్రేక్షణా!
మ. కలలో నైనను బాయఁజాల నకటా కాంతుండ! నన్ బాసితే
    తలపూవాడక పోయి రమ్మనుచుఁ జెంతం జేరి హస్తాక్షతల్
    తలపైఁ జల్లగఁ బూనఁ జేచెమట సంతాపాగ్నిఁ గూడయ్యె న
    చ్చెలి ప్రాణేశుని చుట్టు రాఁ దిగిచి వైచెన్ సిగ్గు రెట్టింపఁగన్.
శా. [5]బాలా! రేయి విభుండు నాకు రతిసంపర్కం బెఱింగింపరా
    నాలాగౌట యెఱుంగనమ్మ! సదయుం డచ్చీరకొం గూడ్చినన్
    ఆలోఁ జంచల మంది దివ్వెకుఁ జెఱం గడ్డంబు గావింప హా
    రాలే దివ్వలు గాఁగ నే నతని నేత్రద్వంద్వమున్ మూసితిన్.
సీ. భామామణీ! వాఁడు పైన మయ్యెడువేళ
                    నిమ్ముల నొకఁడైనఁ దుమ్మఁ డాయె
    ముద్దుగుమ్మా! వాఁడు చద్ది గట్టెడువేళ
                    పకపక నొకగౌళి పలుక దాయె

    నిందుముఖీ! వాఁడు నిలువెళ్ళి పోవుటఁ
                    బంచను బి ల్లడ్డగించ దాయె
    జలజాక్షి రో! వాఁడు పొలిమేర దాఁటుచోఁ
                    గడఁగి గొబ్బునఁ బాల గట్ట దాయె
గీ. ఏల యూరక యలిగెనో నీలవేణి!
    యెన్నఁ డిటు మళ్ళి వచ్చునో సన్నుతాంగి!
    [6]వేడ్క రతికేళి సలుపునో వెలఁది! నేఁడు
    ఆసపడువారి నెఱుఁగఁడో అబ్జవదన!
చ. మమతను దాను నొక్క చెలి మానిని! నీవిభునామ మేమనన్
    గమలజగంధి పల్కెఁ గరికంధిప్రజాపతిచంద్రికాతప
    త్రములు త్రివర్ణయుక్తముగ వ్రాసియు నందులమధ్య వర్ణముల్
    క్రమమునఁ గూర్చి చూడ గజగామిని! నావిభునామ మయ్యెడిన్.
మ. అరవిందానన! నిమనోహరునిపే రారూఢిగాఁ బల్కుమా
    మరుఁడున్ దామరసంబు కాంచనము భూమ్యాకాశమున్ గేశమున్
    గరిమన్ మారుతపుత్రచంద్రులను వేడన్ మూడువర్ణంబులన్
    బరఁగ వ్రాసినమధ్యవర్ణములు మత్ప్రాణేశ్వరుం డయ్యెడిన్.
మ. పొరుగూరన్ విభుఁ డుండి వేడ్క లలరన్ బుత్తెంచు నాభూషణో
    త్కరముల్ నెచ్చెలి తెచ్చియిచ్చుటకుఁ గాంతారత్న మీక్షించి య
    బ్బురమందెం గొనియాఁడె దిట్టె వగచెన్ బోఁద్రోచె దీవించె నా
    భరణంబుల్ వివరించుఁడీ సరసులై భావోదయస్థానముల్.
చ. రమణునిఁ గూర్చి యొండొకకరండము నంపుచు దానిమీఁద నొ
    క్కముగుద సర్పమున్ బిదపఁ గామవిరోధినిఁ బైనమీరపుం
    గొమరునిఁ జంపకంబు ననుఁగుంజెలిచే లిఖియింపఁజేసె భా
    వము నిట మల్లినాథకవివర్యుఁడు కోరెడి వెల్వరింపఁగన్.

ఉ. కన్యకు నైదు జంఘలును గన్యకు నాఱు కుచంబు లెన్నఁగాఁ
    గన్యకు నాల్గు కన్బొమలు కన్యకు నేడు విశాలనేత్రముల్
    కన్యకు ద్వాదశంబు నులికౌనును గల్గు సులక్షణాఢ్య కా
    కన్యకు నీకు నింకఁ బదికావలెఁ గస్తురిరంగనాయకా!
సీ. శృంగారవనమునఁ జెలులతోఁ గ్రీడించు
                    తొయ్యలి గాంచెను ధూర్తుఁ డొకఁడు
    తొడ కేలఁ జఱచుచుఁ గడనుండి తనుఁ జూడ
                    మొలనూలు సవరించె ముద్దుగుమ్మ
    విటుఁ డొక్కజాజిచెంగటఁ జేరె పరికింప
                    రేలచెంతకుఁ జేరె నీలవేణి
    కంఠమాలిక సంజ్ఞగా జారుఁ డంటినఁ
                    గొమ్మ యెఱ్ఱనిపూవుగుత్తి విఱిచె
గీ. వెలఁదిలీలలుఁ గని వాఁడు విన్నఁబోవ
    సుదతికర్ణాగ్రమున నున్నసొమ్ముఁ జూపె
    స్థలముఁ గులమును నామంబు నెలవు నెఱిఁగి
    హితవు గలిగించె నప్పు డయ్యతివ కతఁఢు.
క. ఎంచఁగఁ జతుర్థజాతుఁడు
    పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజం
    గాంచి తృతీయం బచ్చట
    నుంచి ద్వితీయంబు దాఁటి యొప్పుగ వచ్చెన్.
సీ. రాముఁ డెవ్వానితో రావణు మర్దించె?
                    పరవాసుదేవుని పట్ణమేది?
    రాజమన్నారుచే రంజిల్లుశర మేది?
                    వెలయఁ గానుకపంట విత్తునేది?
    అలరంభకొప్పులో నలరుపూదం డేది?
                    సభవారి నవ్వించుజాణఁ డెవఁడు?

    సీతపెండ్లికి నోలి చేసినవిల్లేది?
                    శ్రీకృష్ణుఁ డేయింటఁ జెలఁగుచుండు?
గీ. అన్నిటికిఁ జూడ నైదేసియక్షరములు
    ఈవలావలఁ జూచిన నేకవిధము
    చదువునాతఁడు భావజ్ఞచక్రవర్తి
    లక్షణోపేంద్ర! ప్రౌఢరాయక్షితీంద్ర!
తోకమూకతో, రంగనగరం, లకోలకోల, జంబీరబీజం, మందారదామం, వికటకవి,
పంచాస్యచాపం, నందసదనం
చ. నలశశిబింబలీలల నణంచుసతీమణిపాణిపల్లవం
    బులు నగుమోము నారు జిగిమోవియు వాక్యములున్ బిసాళిమీ
    నులగరిమం బణంచు సరుణోష్ఠికుచంబులు మందయాన మ
    య్యలకలు నాసికంబు తగునక్షులు నిబ్బరపుబ్బుగుబ్బలున్.
సీ. ఆద్యంతమధ్యమాంతాదిమధ్యంబుల
                    తేటి రక్కసిరాజు తెలియఁ దల్లి
    ఆద్యంతమధ్యమాంతాదిమధ్యంబుల
                    శివువిల్లు విఱిచెను క్షీరధార
    ఆద్యంతమధ్యమాంతాదిమధ్యంబుల
                    భార్యయు ఖడ్గంబు పరఁగఁ జెట్టు
    ఆద్యంతమధ్యమాంతాదిమధ్యంబుల
                    మార్వన్నె యీటె ధూమంబు మఱియు
గీ. అన్నిటికిఁ జూడ మూఁడేసియక్షరములు
    మొదలుతుదలును నడితుద మొదలునడుము
    ప్రాణరక్షను లతలను బాదపములఁ
    బరికరములందు నీపదా లరయవలయు.
ద్విపద. అంబలి గుమ్మడి యావాలు పొగడ
    డంబుగా వీని కడం బరికించు.

పొడుపుఁ బద్యాలు



క. వండగ నెండినదొక్కటి
    వండక మఱి పచ్చిదొకటి వడిఁ గాలినదిన్
    దిండికి రుచియై యుండును
    మండలమున జనుల కెల్ల మహిలో వేమా!—తాంబూలము
ఆ. వ్రేలిమీఁదనుండు వెండుంగరము గాదు
    వ్రేలిమీఁదనుండి నేలఁజూచు
    అంబరమునఁ దిరుగు నది యేమి చోద్యమో
    విశ్వదాభిరామ వినురవేమ!
క. ముక్కున పైనము నడచును
    పక్కను నోరుండు గాలి పారణసేయున్
    గ్రక్కున వేసిన కూయును
    మక్కువతో దీనిఁదెలియు మనుజులు గలరే?—బొంగరము
క. శిలవృక్షలతలఁ బుట్టిన
    చెలువలు మువ్వురును గూడి శుభలగ్నమునన్
    తలవాకిట రమియింతురు
    చెలువలరఁగ దీనిఁ దెలియు సుగుణుల గలరే!—తాంబూలము
ఆ. చీరగట్టి రాత్రి సిగ్గున నొదిగుండు
    పగలు చీర విడిచి పనులు సేయు
    చేయివాఁడికత్తెచేడియ గాదయా
    సమ్మెటాంకసోమ! జాణరాయ!—పగడసాలకాయలు
ఆ. ఆడఁబోవుచోట ఆయిండ్లవారెల్ల
    సారెసారెకొట్టి చంపిరనుచు

    పుట్టినిల్లు చేరు పొలఁతి తాఁ గాదయా
    సమ్మెటాంకసోమ! జాణరాయ!
ఆ. పక్షిరాజుపేరఁ బరఁగినమ్రానిపై
    వెలుగుపిట్టజనులు వేడ్కతోడ
    ఆవు నిచ్చెదమని అందఱు మ్రొక్కుదుర్
    దీని భావ మేమి తిరుమలేశ?—గరుడగంబం
ఆ. మ్రానునందు పుట్టి మక్కువకాయలై
    యిండ్లలోనఁ బెరిగి పండ్లు నవును
    తీపురసము లేదు తినరాదు చెప్పుమా
    సమ్మెటాంకసోమ! జాణరాయ!
క. చెక్కుల పస గలిగుండును
    చక్కనిగుబ్బల నెసంగి సౌరై యుండున్
    చిక్కు నొకగడియలోపల
    మక్కువసతిగాదు చూడ మహిమండలిలోన్.—జోడుతలుపు

సమస్య
శంఖంబుల్ దివినుండి జాఱిపడియెన్ జంబూఫలప్రక్రియన్


శా. ప్రేంఖత్పుష్పకచంపకాటవులదారిన్ వ్యోమమార్గంబునన్
    రింఖద్వాయువశంబునం దగిలి యా నెత్తావికిం జొక్కిత
    త్శంఖాక్తంబులు తేంట్లమొత్తములు లక్షల్ కోట్లు పద్మంబులున్
    శంఖంబుల్ దివినుండి జాఱిపడియెన్ జంబూఫలప్రక్రియన్.
ఉ. అంటనిమ్రానిపండు కరియంటనికాముశరంబు తేఁటిము
    క్కంటనిపువ్వు హంసముఖమంటనితూఁడు పయోధినిప్పునీ
    రంటనిరత్న మన్యభృతమండలికెందలిరాకు రాహుతా
    నంటనిచంద్రబింబ మన నానృపకన్య వెలింగె నత్తఱిన్.

చలి


మ. చలి! మమ్మీగతి బాధపెట్టెదవు నీసామర్థ్యముల్ వట్టిబీ
    దలపైఁ గాక ధగద్ధగాయితమణిస్తంభౌన్నతాంతఃపుర
    స్థలసంవాసితకామినీదృఢపరిష్వంగానుసంయుక్తిని
    శ్చలులౌ భోగులమీఁద లేశమును నీజంజాటముల్ సాగునే?
చ. చలిగా! నీకొకవార్త తెల్పెదను నిశ్శంకోద్భటుల్ దంపతుల్
    గలయాయిండ్లకుఁ బోకు దంపతుల మేల్ కౌఁగిళ్ళమధ్యంబునన్
    నిలువన్ దార్ఢ్యము లేదు; మిట్టిపడినన్ నీప్రాణముల్ గొందు; రే
    చెలి లేకుండెడు బ్రహ్మచారులపయిం జెల్లించు నీదర్పమున్.
చ. తరణిసుకాంతభిత్తిమయతల్పగృహాంతరహంసతూలికా
    స్థిరశయనస్థలీశయకుశేశయకుట్మలకోమలస్తనీ
    పరమశరీరసంగపరభాగ్యులపాదనఖైకదేశమున్
    బెఱుకఁగ లేవు నీవు నిఱుపేదల నేఁచెద వేమి యోచలీ!
మ. చలి నీ వెందుకు సందడించెదవు? నీశౌర్యంబు మూన్నాళ్ళె గా!
    కలకాలంబును నిల్వలేవు గదవే! కాకున్నఁ బాకోజ్జ్వల
    జ్జలజాక్షీకుచకుంభమధ్యమునఁ బెల్చన్ జొచ్చి గోరాడలే
    కిలలో బాలుర రోగులన్ విరహులన్ వృద్ధాళి బాధుంతువా?
శా. స్థూలద్విత్రిపటావకుంఠనము కస్తూరీరజఃపాళికా
    కాలాగుర్వనులేపనంబును వధూగాఢోపగూహంబులున్
    గేళీగర్భనికేతనంబులును గల్గెం గాక లేకున్న నీ
    ప్రాలేయాగమ మేవిధంబున సహింపన్ వచ్చు నెవ్వారికిన్?
క. అహములు సన్నము లాయెను
    దహనుఁడు హితవయ్యె దీర్ఘతరలయ్యె నిశల్
    బహుశీతోపేతంబై
    యుహుహూ యన వణఁకె జగము లుర్వీనాథా!

వేసఁగిని మందమారుతము లేమి


శా. ఆ కల్లాడ దదేమొ నేఁడు పవనుం డాకాశవాపీతటా
    శోకానేకవనాళిఁ గ్రుమ్మఱుచు నచ్చో డాఁగెనో; లేక గం
    గాకల్లోలవతీప్రవాహముల నూఁగం బోయెనో; లేక కాం
    తాకర్పూరకపోలపాళికల నిద్రాసక్తుఁడై యుండెనో!

పొగాకు


ఇది పోర్చుగీసువారిచే మనదేశమునకు మూఁడువందలసంవత్సరములకు మున్ను కొనితేఁబడినది. అంతకుఁ బూర్వ మిచ్చట లేదు.
సీ. దంతలూటీఘోరదంతిహర్యక్షంబు
                    కుష్ఠరోగాచలకులిశధార
    పీనసాండజభూరివైనతేయస్వామి
                    వాతటవీదావవహ్నికీల
    జలదోషహిమపూరచండార్కకరరోచి
                    బహుళకాసాంభోధిబాడబంబు
    ఉరుతరాజీర్ణైణగురుతరవ్యాఘ్రంబు
                    ముఖరోగనిఖిలజీమూతపతన
గీ. మనఁగ వార్తకు నెక్కితి నఖిలజనుల
    జీవరక్షఁదివ్యసంజీవి వగుచుఁ
    బ్రస్తుతింపంగ సకలదిక్పతులసభల
    నూర్జితం బగు నీరాక యోపొగాక!
సీ. ఆఁకొన్న మనుజుల కమృతంపుసేవయై
                    యుండుగా నీరాక యోపొగాక!

    మతిహీనులకు సరస్వతిని బ్రసన్నగా
                    నొనరించు నీరాక యోపొగాక!
    అతిపథిశ్రమమెల్ల నణఁప గర్పూరమై
                    యుండుగా నీరాక యోపొగాక!
    రతికాంక్ష లూరింప రసపాకగుళికయై
                    యుండుగా నీరాక యోపొగాక!
గీ. అవనివార్తకు నెక్కితి వఖిలజనుల
    జీవరక్షణదివ్వసంజీవి వగుచుఁ
    బ్రస్తుతింపంగ సకలదిక్పతులసభల
    నూర్జితంబుగ నీరాక యోపొగాక!
సీ. నీమహత్త్వము మును నిర్జరు లెఱిఁగినఁ
                    దరతోడ నమృతంబు తఱవఁబోరు
    నీవిధంబును మును పావని యెఱిఁగిన
                    సంజీవి వెదకెడిజాడఁ బోడు
    నీవార్త మును దేవతావైద్యు లెఱిఁగిన
                    నౌషధావళికిఁ బ్రయాసపడరు
    నీరీతి మును మౌనినికరంబు లెఱిఁగిన
                    బలుతపోనిష్ఠలు సలుపఁబోరు
గీ. సంతతోత్క్షిప్తజీవరక్షణములకును
    రోగముల్ పాపమోక్షంపురూఢి దెలుపఁ
    బుడమిలోపల జనులను బ్రోవ నీవు
    ఒనర జనియించితివొకాక! యోపొగాక!
సీ. పైగోవసరకుగాఁ బ్రార్థించి నినుఁ దెచ్చి
                    నిమ్మపంటిరసాన నీడనార్చి
    పుడకలు లేకుండఁ బొడిసన్నముగఁ జేసి
                    సిరికొల్ది ధూమ్రంపుఁజిట్టినించి

    లలి నొక్కనిడుదనాళపుఁ గ్రోవి సంధించి
                    చిన్నారిపటకారి చేతఁబూని
    జాతిరత్నమువంటి చండ్రనిప్పు ఘటించి
                    నిజధూమలహరిచే నెగడు ఘనుల
గీ. కెంతఘన మెంతదీపన మెంక సొగసు
    సంతతోద్రేకలాహిరిసార్వభౌమ!
    సకలగుణశీల! యెటువంటి సుకృతవేళ
    నుదయమందితివో కాక! యో పొగాక!
సీ. బంధురామోదప్రభవిభ్రమంబుల
                    నెనయు కెందమ్మిఱే కీపొగాకు
    పరిమళాంచితకళాప్రావీణ్యవిభవంబు
                    లెనయు గేదంగిఱే కీపొగాకు
    ఘనతనూరానసుగంధప్రదీప్తుల
                    నెనయు చెంగల్వఱే కీపొగాకు
గీ. జలధిపర్యంతధారుణీవలయనిలయ
    పాంథసందోహమోహసంపత్కరంబు
    నగుచు ధారుణి విలసిల్లె నందమైన
    యించువిలుకాని చేతిబా కీపొగాకు.
క. మీరుం బొగ ద్రాగుదురా
    వారిజభవ! వామదేవ! వైకుంఠ! హరీ!
    ఓరీ నారద! వినురా
    యీరెడుజగంబులకును నిది ముఖ్యమురా!
క. భుగభుగమని పొగ లెగయఁగ
    నగణితముగ నాజ్యధార లాహుతిగాఁగా
    నిగమాదిమంత్రయుతముగఁ
    బొగద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్.

క. పొగక్రోవికి సతిమోవికి
    నగణితముగ నూరబావి కమృతంబునకున్
    దగ నుచ్ఛిష్ఠత లేదని
    ఖగవాహనుతోడఁ గాలకంఠుఁడు పల్కెన్.
చ. పదపడి ధూమపానమునఁ బ్రాప్తములౌఁ బదుమూఁడుచేటులున్
    మొదల ధనంబువోవుట నపుంసకుఁడౌట విదాహమౌటయున్
    వెదకుచు జాతిహీనులను వేఁడుట తిక్కట చొక్కుటల్ రుచుల్
    వదలుట కంపువేయుట కళల్ దొలఁగించుట రిమ్మపట్టుటల్
    పెదవులు నల్లనై చెడుట పెద్దకులోఁగుట బట్టకాలుటల్.

మూషకచక్రవర్తి


సీ. నిర్ణిద్రవిషయుక్తనిశితదంష్ట్రలఁ బూని
                    భేదించు నెటువంటి గాదెలైన
    దారుణోద్యద్దంతతిచేత ఖండించు
                    గుఱుతుగా నెటువంటికోఁకలైన
    పటుసురంగాగారభరితంబుగాఁ ద్రవ్వుఁ
                    బొంకాన నెటువంటిభూమినైన
    కీచుకీచుధ్వని ప్రాచుర్యమహిమచే
                    వర్ణించు నెటువంటివారినైన
గీ. అతఁడు సామాన్యుఁడే నరేంద్రాలయాంత
    రంతరానేకపేటికాక్రాంతవస్తు
    హరణసురధాణి యవ్వినాయకుపఠాణి
    చారుతరమూర్తి మూషకచక్రవర్తి.

మార్జాలచక్రవర్తి


సీ. క్షీరఘటాంబుధిస్థితికుంభసంభవ
                    బహుమూషకోరగపక్షిరాజ
    శుకకులమత్తేభనికరకంఠీరవ
                    శలభసంకులవనజ్వాలికీల
    వృశ్చికదానవవిష్ణుసుదర్శన
                    వాయసమేఘదుర్వారపవన
    కుక్కుటపర్వతఘోరవజ్రాయుధ
                    రౌద్రాంధకారమార్తాండతేజ
గీ. వ్యాఘ్రకులమాతులస్వామి శీఘ్రగమన
    పైనములదొత్తి దొత్తులపాలిమిత్తి
    రమ్యతరమూర్తి నఖరసంప్రాప్తకీర్తి
    సకలగృహవర్తి! మార్జాలచక్రవర్తి.

పుల్లకవి


సీ. కోణంగి నాట్యముల్ క్రోఁతు లాడించఁగా
                    నూరఁబందులు సభ నున్నయట్లు
    గూఁబకూఁతలు విని గువ్వలు తలలూఁచి
                    పోయి కాకులయొద్దఁ బొగడినట్లు
    కాలువదరినుండి కప్ప లంకించఁగా
                    నెండ్రకాయలు తల లెత్తినట్లు
    ఎనుబోతుబిరుదులు మనుబోతు పొగడంగ
                    మేలుమేలని గొఱ్ఱె మెచ్చినట్లు

గీ. ఓగుధగిడీలు తమలోన నొకరి కొకరు
    మెచ్చుకొనుచుందు రెటువంటిపిచ్చితనమొ!
    మేలుమే లెట్టిగుణము నిర్మించినాఁడు
    పుల్లకవి నేలు గోపికావల్లభుండు.
సీ. దొరకైన కరణముతో విరోధము సెబ్ర
                    అతిలోభిమొండికి నర్థి సెబ్ర
    పార్థివోత్తమునకు బహునాయకము సెబ్ర
                    పెనుఱంకుటాలికిఁ బిల్ల సెబ్ర
    దాతకు రాజుకుఁ దామసంబులు సెబ్ర
                    వసుధ నిల్లాలికి వగలు సెబ్ర
    ఘనుఁడైన విద్యాధికున కహంకృతి సెబ్ర
                    యరయ దుర్బుద్ధి యెవ్వరికి సెబ్ర
గీ. మిమ్ముఁ గొల్వమి యన్నింట మేటి సెబ్ర
    సెబ్రలెవ్వియు మిముఁ గొల్వఁ జేర వెఱచు
    శైలకోదండకాండ! నిజాముకొండ
    బాలగోపాల! రాధికాప్రాణలోల!
సీ. నరనాథవంశకాననము దహించుట
                    కవనీసురులవిత్త మగ్నికీల
    జననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప
                    బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు
    పార్థివోత్తములసంపచ్ఛైలములు గూల్చు
                    భూసురధనము దంభోళిధార
    జగతీవరులకీర్తిచంద్రిక మాప వి
                    ప్రేత్తముధనము సూర్యోదయంబు
గీ. విప్రతతిసొమ్ముకంటెను విషము మేలు
    గరళమున కుర్విఁ బ్రతికృతి కలదుగాని

    దాని మాన్పంగ నిల నౌషధములు లేవు
    కాన బ్రహ్మస్వములు పట్టఁ గాదు పతికి.

రాజ్యతంత్రము


సీ. బ్రాహ్మణభూములపై నాస యుంచకు
                    దేవతాద్రవ్యంబు తెరువు సోకు
    తగలంచగొండిని దగవరి సేయకు
                    కపటికి సత్త్రాధికార మియకు
    గుడిపారుపత్తెంబు కడభోగి కియ్యకు
                    చెనఁటికి నిండినసీమ యియకు
    విత్తహీనులకును గుత్తలుకట్టకు
                    మఱి జారచోరుల మఱుఁగనియకు
గీ. నీచజాతులవీరి మన్నింపఁబోకు
    దుర్మదాంధుల వాకిలి ద్రొక్కనియకు
    ...........................................
    తలఁపు ధర్మాభివృద్ధి కావలయునేని.
సీ. గాంభీర్యపరులను గడిదుర్గమున నుంచు
                    చతురుని సేనాధిపతినిఁ జేయు
    పాయక సరసుల రాయబారులఁ జేయు
                    ముచితజ్ఞు దగ్గఱ నుంచికొనుము
    మఱిధనాధ్యక్షుల మణియగార్లను జేయు
                    మతిమంతుఁ గరణికమార్గుఁ జేయు
    పరఁగ విశ్వాసులఁ బరిచారకులఁ జేయు
                    కరుణాన్వితుని గార్యకర్తఁ జేయు
గీ. సతతవిద్యుక్తమతిఁ బురోహితునిఁ జేయు
    నవరసాలంకృతిని మహాకవిని జేయు

    షణ్మతజ్ఞానవంతు నాచార్యుఁ జేయు
    వార్త కెక్కనికీర్తి కావలయునేని.
సీ. శరణన్నశత్రునిఁ జనవిచ్చి రక్షించు
                    దీనులమనవులఁ దెలియ వినుము
    విష్ణుభక్తులజోడు విడువక వర్తించు
                    మాధవుపైచింత మఱవఁబోకు
    పేదసాదులనేలఁ బిలిచి రక్షింపుము
                    పలుచనిపలుకులు పలుకఁబోకు
    అన్నదమ్ములసొమ్ము లపహరింపఁగఁ బోకు
                    తలిదండ్రిహితవును దప్పఁబోకు
గీ. దయయు సత్యంబు మదిలోనఁ దఱుగనియకు
    పరసతులమీఁద భావంబు పాఱ నీకు
    భగవదర్పణ కానిది పట్టఁబోకు
    నెలయ మోక్షాభివృద్ధి కావలయునేని.
సీ. నమ్మినవారల నమ్మి వర్తింపుము
                    నమ్మనివారల నమ్మఁబోకు
    మఱి శత్రువులమీఁద మఱపించి దండెత్తు
                    కైజీతగాండ్రను గలుగనేలు
    పొడిచి గెల్చినవారిఁ బోనీక మన్నించు
                    వంచించు మన్నీల గొంచెపఱచు
    వెరపుమాలినవాని దొర సేయఁ బోకుము
                    పందకు సేనాధిపత్య మియకు
గీ. చేరి చనవిచ్చి దాయల మీఱనియకు
    నిక్కమైనట్టి రాణువలెక్క లెల్ల
    నెలమి నశ్రద్ధ చేయక తెలియవినుము
    వెలయు భాగ్యాభివృద్ధి కావలయునేని.

అష్టకష్టములు


సీ. అరయఁ బరదేశయాత్ర సేయుట యొండు
                    తనకుఁ దానే వండుకొనుట రెండు
    కులసతి నెడఁబాసి తొలఁగిపోవుట మూఁడు
                    వెలయఁగ యాచకవృత్తి నాల్గు
    తనసరివారిపంచను జేరుకొను టైదు
                    గుఱు తెఱుంగనిరాజుఁ గొల్చు టాఱు
    చదువునేరకయుండి సభకుఁ బోవుట యేడు
                    పెన్న దారిద్ర్యంబు నెన్మిదవది
గీ. అష్టకష్టంబు లనియెడునవ్వి యివ్వి
    గాన యిటువంటి వెవ్వరికైన వలదు
    చారుతరమూర్తి! దేవతాచక్రవర్తి!
    రమ్యగుణధామ! కావేటిరంగధామ!
క. ఆడిన మాటలు దప్పిన
    గాడిదకొడుకంచుఁ దిట్టఁగా విని యయ్యో!
    వీఁడా నా కొకకొడు కని
    గాడిద యేడ్చెం గదన్న ఘనసంపన్నా!
క. అసమానదానవిద్యా
    రసికత లేనట్టినరునిబ్రదు కేటికి సీ
    కస వేఱుక తిని బ్రదుకదె
    పసరము తనకడుపు నిండఁ బర్వతకొండా!
క. సమశీలశ్రుతియుతులకు
    సమధనవంతులకు సమసుచారిత్రులకున్

    దమలోన సఖ్యము వివా
    దము దగుఁగా కసములకును దగునే యెందున్?
క. కోటానుకోటు లిచ్చినఁ
    గూటికి సరిరాదు దేవకోటులు రారా
    పాటించి యజ్ఞవాటికిఁ
    గూటికి మారెళ్ళకొండ! గుణరత్ననిధీ!
క. అనిఁ బాఱిన విధి నవ్వును
    ధనసంపద నవ్వు నుచితదానవిహీనున్
    దనయుని ముద్దాడంగాఁ
    బెనిమిటిఁ గని జార నవ్వుఁ బిచ్చయరేచా!
క. పదివేలమంది కిచ్చియుఁ
    దుద కొక్కని కీయకున్న దొరకవు కీర్తుల్
    పదివేలు నోము నోఁచిన
    వదలదె యొకఱంకు వంక వన్నియసుంకా!
క. ఇప్పటియన్నముకొఱకై
    త్రిప్పులఁ బడి కుందనేల? దేవుఁడు శిలలోఁ
    గప్ప కొసంగెడు హారము
    కుప్పలుగ మహేంద్రవాశ! గోకర్ణేశా!
క. చెప్పినపని యొనరించిన
    యప్పణఁతుక గల్గుగహన మది సదనమగున్
    జెప్పినపని యొనరింపని
    య ప్పణఁతుక గల్గుసదన మది గహన మగున్.

గువ్వలచెన్ననిపద్యములు

క. అడుగఁ దగువారి నడుగక
    బడుగుల నడుగంగ లేమిఁ బాపంగలరా
    వడగళ్ళఁ గట్టువడునా
    గుడి రాళ్ళను గట్టకున్న గువ్వలచెన్నా.
క. సారాసారము లెఱుఁగని
    బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా?
    నీరెంత పోసి పెంచినఁ
    గూరగునా నేలవేము?గువ్వలచెన్నా!
క. కలిమిఁగల నాఁడె మనుజుఁడు
    విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా!
    గలిమెంత యెల్లకాలము
    కులగిరులా కదల కుండ? గువ్వలచెన్నా!
క. కలిమిగల లోభికన్నను
    విలసితమగు పేదమేలు వితరణియైనన్‌
    జెలమైన మేలుకాదా
    కులనిధియంభోధికన్న గువ్వలచెన్నా!
క. విలువరుస దానగుణములు
    గలవారికిఁ గాక లోభిగాడ్దెల కేలా
    తలు పేల చాఁప గుడిసెకు
    గులపావనకీర్తి వన్న గువ్వలచెన్నా!
క. వెలివిద్య లెన్నయైనను
    గులవిద్యకు సాటిరావు కుంభినిలోనన్
    వెలకాంత లెంద ఱున్నను
    గులకాంతకు సాటిరారు గువ్వలచెన్నా!

క. తల లెంత పెంచుకున్నన్
    గులధర్మము విడిచి కన్నకూళ్ళుం దిన్నన్
    గలుగదు మోక్షము చిత్తము
    విలయము గాకున్న బిజనవేములచెన్నా!
క. ఎన్నఁగల జీవరాసుల
    యన్నిఁటిగర్భమునఁ బుట్టి యట మనుజుండై
    తన్నెఱిఁగి బ్రదుకవలెరా
    కొన్నాళ్ళిఁక నెచటనున్న గువ్వలచెన్నా!
ఉ. వారక యీశ్వరుండు తలపై ధరియించినయంతమాత్ర న
    వ్వారిజవైరితోడ సరివత్తువె యుమ్మెతపూవ! నీపసన్
    వారిధు లుబ్బునో దెసలు వన్నెలఁ దేరునొ చంద్రకాంతముల్
    నీరవునో చకోరముల నెవ్వగ దీఱునొ తాప మాఱునో!
ఉ. పీనసరోగి నిన్నుఁ దిలపిష్టసమానము చేసినంతనే
    వానివివేకహీనతకు వందుఱనేల కురంగనాభమా!
    మానవతీకపోలకుచమండలమండితచిత్రపత్రికా
    నూనవితానవాసనల నొందుట లోకము ని న్నెఱుంగదే!
ఉ. ఎవ్వఁడ వీవు కాళ్ళు మొగ మెఱ్ఱన? హంసమ; నెందు నుందువో?
    దవ్వుల మానసంబునను; దానవిశేషము లేమి తెల్పుమా?
    మవ్వపుఁ గాంచనాబ్జములు మౌక్తికముల్ గల వందు; నత్తలో?
    యవ్వి యెఱుంగ; మన్న నహహా! యని నవ్వె బకంబు లన్నియున్.
ఉ. ధర నత్యుత్తముఁడైన ధీరుని మనస్తాపంబు దీర్పంగ స
    త్పురుషానీకమ యోపుఁగాని యొకయల్పుం డోపునే తీవ్రదు
    స్తరనైదాఘవిదాహతాప మడఁపన్ ధారాధరాంచద్రసో
    త్కరధారావళిగాక యర్హ మగునే గండూషతోయంబులన్?
ఉ. చేతికి వచ్చుకార్య మెడసేసితి వర్థులు శత్రులైరి యిం
    కేతరినైనఁ గార్యము ఘటించెదనన్న ఘటింపనీవు నీ

    చేఁతగునట్టిచెయ్దమును జేసితి వింతియకాక యింకనా
    వ్రాఁ తొకయింత మార్పఁ గలవా గ్రహచారమ! దుర్విచారమా!
ఉ. కా దనిపించుకోఁదగదు కానిగుణంబు వహించి లోభిచే
    లే దనిపించుకోఁదగదు లేనిదురాశకుఁ బోయి యిందురా
    రా దనిపించుకోఁదగదు రట్టడియై కరినెక్కిదిడ్డిదూ
    ఱే దదియెంత? తుంపెరపురీహనుమంత! నితాంతవైభవా!
చ. ఎనయఁగ హీనుదంట జలమింతయ నిల్వని పాడుగుంట నీ
    చునకుఁ బదార్థముంట తనుఁ జూచి సహింపనియూర నుంట లే
    దనియెడు చేనిపంట వెసనాఁకటికందనివంట మంటకా?
    జనకసుతాభిరామ! బుధసన్నుత! శ్రీపెనుమళ్ళరాఘవా!
చ. కరిగమనల్ దురాత్ములనెకాని రమింపరు హీనజాతికా
    పురుషులఁగీని భూభుజులు ప్రోవరు కానలఁగాని మేఘముల్
    కురియవు సత్యశౌతములకుం బెడఁబాసినవానిఁగాని యిం
    దిర వరియింప దుర్వి యవినీతులఁగాని భరింప దెంతయున్.
చ. పిలువనికూటికిన్ వెతలఁ బెట్టుధారవరుఁ డేలువీటికిన్
    జలములు లేనియేటికిని సారెకు బందుగు లున్నచోటికిన్
    బలువురతోటిపోటికి నృపాలురసాటికిఁ బోవరాదయా
    బలవదరీ! దరీకుహరభాస్వదరీ! యదరీదరీహరీ!
ఉ. తంత్రులులేనివీణయును దానము రాగము లేనిగీతమున్
    మంత్రము లేనిసంధ్యయును మౌనములేనితపంబు వేదవి
    ట్తంత్రములేనియాగముఁ బదజ్ఞతలేనికవిత్వతత్త్వమున్
    మంత్రులులేనిరాజ్యము సమానము లియ్యవి దుష్ప్రయుక్తముల్
ఉ. గందపుఁజెట్టుక్రింద నురగంబు పయోనిధి బాడబాగ్ని మా
    కందఫలంబుక్రింద నోకకందురుదుంప జగద్విలోకనా
    నందము మేఘునందుఁ బవి నాఁచినమాడ్కి నకారణంబుగా
    నుందురు దాతసన్నిధి నయోగ్యులు కొందఱు మల్లికార్జునా!

ఉ. చూతఫలావతంస! నినుఁజూచినఁ గన్నులపండు వయ్య! లో
    పాతిశయంబునన్ బరిమళాన్విత మయ్యె దిశౌఘమెల్ల వి
    ఖ్యాతియొనర్చె నీగుణము లైనను గల్గదు నాకు నెమ్మదిన్
    గౌతుక మెప్డు నీహృదయకర్కశభావము జూడఁజూడఁగన్.

శరభాంకలింగమా


చ. పెనిమిటికిం దలారికిని బిమ్మిటివారికి బంధుకోటికిన్
    వనరుహనేత్ర తా వెఱచి వాకిటి కేఁగదుగాక! యాత్మ నె
    వ్వని మఱి పొందరాదె బలవంతపుఁగాఁపులు వెట్టి కామినీ
    జనముల నేలువారు నెఱజాణలయా శరభాంకలింగమా!
చ. పొరిఁబొరి మేఁకమాంసములు బొక్కుచు నిక్కుచు సోమయాజియై
    సురపురి కేఁగి రంభకడఁ జొక్కుచ సోలుచుఁ గామయాజియై
    ధరణికి డిగ్గి యిండ్లఁబడి తండుల మెత్తుచుఁ గర్మయాజియై
    సొరిఁదిరుగాడుకామి మిముఁ జూడఁడయా శరభాంకలింగమా!
ఉ. గారుడమంత్రసిద్ధుఁ డురగంబులచేఁ గఱపించుకొన్నఁ ద
    ద్ఘోరవిషంబు లెక్కవఁట కుంభినిలో శివమంత్రసిద్ధుఁడై
    జారవినోదియై విషయసంగతిఁ జెందిన జెందుఁగాక యా
    పూరితమోహపాశములఁ బొందఁఢయా శరభాంకలింగమా!
ఉ. కండలు వహ్నిదేవునకుఁ గాలినయెమ్ములు భూమిదేవికిన్
    వండినకూడు కాకులకు వాతిహిరణ్యము చీర మాలకున్
    నిండినసొమ్ము భూపతికి నిత్యము ప్రాణము మృత్యుదేవికిన్
    మిండతయాలు నన్యులకు మేదినిలో శరభాంకలింగమా!
ఉ. వండెడువాని సత్కవిని వైద్యుని మంత్రిని దంత్రవాదినిన్
    గొండెముపల్కువాని రిపుఁ గూడినవాని ధనేశునిన్ మహీ

    మండలమేలువానిఁ దనమర్మ మెఱింగినవాని నిష్టునిన్
    ఖండితమాడునే నదియు గండమయా శరభాంకలింగమా!

భైరవా


చ. కలిగినవానియింట శుభకార్యము గల్గినఁ గీడి గల్గినన్
    బిలువకమున్నె బాంధవులు పెల్లుగఁ బోయి తదంగమంతయున్
    దెలుపుచునుందు రాతనికి దీనునియింట శుభంబె కల్గినన్
    బలుమఱుఁ బిల్చినప్పటికిఁ బల్కరుగా యెవరైన భైరవా!
చ. పరువు గ్రహింపనేర కొకపాటిదురాత్ముఁడు మించనాడినన్
    సరసు లెఱింగి మార్కొనక సైఁచినయంతట నైచ్య మై లగున్?
    అరుదుగ వచ్చు మార్గమున కడ్డముగా నొకకుక్క వచ్చినన్
    గఱచినఁ గోపగించి కరి కర్వగరాదుగదయ్య భైరవా!
గీ. ఇఱుకరాదు చేత నిసుమంతని ప్పైనఁ
    గొఱుకరాద యినుము కొంచె మైన
    నఱుకరాదు నీళ్ళు నడిమికి రెండుగా
    బెఱుకరాదు బావి పెళ్ళగిలఁగ.
ఉ. ఎక్కడి కేఁగెదో వడుగ యేఁగెద బెండ్లికి మాడ లేవిరా
    నిక్కము నాల్గు చేఁగలవు నీకటరా యవియేవి చూపుమీ
    యొక్కటి త్రోవలోఁ గనెద నొక్కటి కొక్కరిఁ బూట పెట్టెదన్
    ఒక్కటి తప్పనెంచెద మఱొక్కటి లే దని కొక్కరించెదన్.
సీ. పోఁకలు నమలుచు నాకులు చేకొని
                    సున్న మడ్గినవాఁడు శుద్ధవిధవ
    ఇద్దఱు నొకచోట నేకాంతమాడంగ
                    వద్ద జేరినవాఁడు వట్టి విధవ

    ఆలితోఁ గలహించి యాఁకలి కా దని
                    పస్తున్నవాఁ డొక్క పంజివిధవ
    వారకాంతలయిండ్ల వాసంబుచేయుచు
                    మగువ కేడ్చెడువాఁడు మడ్డివిధవ
    చదువుచెప్పినజీత మదనులో నీయక
                    మిటకరించెడువాఁడు మేటివిధవ
    త్రోవబోయెడు స్త్రీలతో మొగం బిగిలించి
                    ముచ్చటాడెడువాఁడు ముష్టివిధవ
    కట్ణ మిచ్చెద నని కాల మందీయక
                    గోళ్ళు గిల్లెడువాఁడు కొంటెవిధవ
    ఇంటి ఱంగెఱుఁగక యిరుగుపొరుగుఱంకు
                    వెంటాడువాఁ డొక్క యంట్లవిధవ
    దారిద్ర్యములనుండి తనపూర్వసంపద
                    లూరకతలఁచువాఁ డుత్తవిధవ
    .............................................
ఉ. శ్రీకరమూర్తి! హారిగుణశేఖర కొమ్మయమంత్రి తిక్క! నీ
    రాకలుగోరుముగ్ధ కనురాగము మీఱిన మన్మథాగ్నిచేఁ
    బ్రాకటమైన ముత్యములు భస్మము లాయెను వేగ రావనా!
    యాకులుపోఁకలుం గలుగ నంతియె చాలును సున్న మేటికిన్?
త. అసదృశగంధబంధుర మటంచు వడిన్ జనుదెంచి కేతకీ
    ప్రసవమునందుఁ జెంది మకరందము పెందమిఁగ్రోలలేమికిన్
    దెసచెడి కుంద నేమిటికిఁ దేఁటి! యరాళకరాళకంటక
    ప్రసవముచే భవత్తనువు వ్రయ్యక వచ్చిన మేలు చాలదే!
మ. ఠవణింతున్ నుతి కాలకంఠమకుటాట్టాలప్రతోళీమిళ
    త్స్రవమానామరసింధుబంధురపయస్సంభారగంభీరవా
    గ్వ్యవహారైకధురంధరత్వమున జిహ్వాలోలమత్తల్లికిన్
    జవికిం దల్లికిఁ గారవేల్లికధనుర్జ్యావల్లి నీరుల్లికిన్.

మ. ఠవణింతున్ నుతి దైవతప్రమదదార్ఢ్యన్మోహినీనీరభృ
    చ్చ్యవమానామృతశీకరాభనవబీజప్రాంతరౌపమ్యస
    ద్భవనాజాండకు షడ్రసప్లుతసముద్యత్స్వాదుమత్ఖండకున్
    అవితుంగోద్భవకాండకున్ బ్రబలరేఖాదండ కాదొండకున్.
ఉ. తూరుపునాఁటిక్షత్రియులతోరపుబాంధవలీల యద్భుత
    స్ఫారవిలాసమందును వివాహమహోత్సవముల్ నిరన్నస
    త్కారపరిగ్రహంబు లవిధాయకకల్పితవిద్విషత్క్రియా
    వారము లన్యవర్ణజనవర్ణితహాస్యరసాలవాలముల్.

అత్తింటికోడలు


సీ. పొరుగిళ్ళఁ గూర్చుండి ప్రొద్దు పుచ్చఁగ నేర్చె
                    నీలాటిరేవున నిల్వ నేర్చె
    అత్తాఁడుబిడ్డల నా
                    గూర్చుండి నట్టింట గొణుగ నేర్చె
    పనివేళ మూల్గుచుఁ బండుకుండఁగ నేర్చె
                    జెంపను సున్నంబు నింప నేర్చె
    పసిబిడ్డ లేడ్వంగ విసరి కొట్టఁగ నేర్చె
                    నొకరెండుపస్తులు నుండ నేర్చె
గీ. పెళ్ళుపెళ్ళన మెటికలు విఱువ నేర్చె
    నెవ్వరును నాకు లేరని యేడ్వ నేర్చెఁ
    బుట్టినింటికి జెప్పుకోఁ బోవ నేర్చె
    నవుర! యత్తింటికోడలి యవగుణములు!
సీ. వాలము నులిచియు నేలఁ గా ళ్ళణఁచియు
                    ధాత్రిపైఁ బొరలియుఁ దాల్మివిడిచి

    వదనంబు దెఱచియు నుదరంబుఁ జూచియుఁ
                    బెక్కుపాటునఁ బడ్డఁ గుక్క కొక్క
    కడిమాత్రమన్న మాఁకలిదీఱ నిడఁబోరు
                    నాగంబునకుఁ బ్రార్థనంబుతోడ
    కబళశతంబులు కరమున కందీయ
                    నాఁకలిదీఱఁగ నదిభుజించు
గీ. ఎంతవేఁడిన హీనున కెవ్వ రీరు
    ఇచ్చిరేనియుఁ గడుఁ గొంచ మెచ్చు లేదు
    ఘనున కూరక యుండినఁ గాంక్షదీఱ
    గురుతరార్థంబు లిత్తురు ధరణిపతులు.
గీ. పౌరుషజ్ఞానకీర్తులఁ బరఁగెనేని
    వానిజన్మం బదొక్కపూటైనఁ జాలు
    నుదరపోషణమాత్ర మీయుర్విమీఁదఁ
    గాకి చిరకాలమున్న నేకార్యమగును?

నియోగులు


గీ. భాగ్యవశమున బుద్ధిసంపన్నుఁ డగును
    బుద్ధిబలమున నృపులకుఁ బూజ్యుఁ డగును
    నృపులు మన్నింప నయకళానిపుణుఁ డగును
    పూని రాజ్యము నడుపఁ బ్రధానుఁ డగును.
ఉ. వ్రాలివిగోఁ గనుంగొనుమి వన్నియమీఱఁగ వ్రాల కేమి నా
    వ్రాలు సుధారసాలు కవిరాజులకెల్ల మనోహరాలు వ
    జ్రాలు సరస్వతీవిమలచారుకుచాగ్రసరాలు చూడఁ జి
    త్రాలు మిటారిమోహనకరాలు నుతింపఁ దరంబె యేరికిన్?
ఉ. మేదినినాథుఁ డల్గినను మించినకార్యము చక్కసేయ స
    మ్మోద మెలర్పఁగా గణకముఖ్యునిసఖ్యము లెస్సయెట్లనన్

    ఆదటఁ గాలుఁ డల్గియు గతాయు వటన్నను జిత్రగుప్తుఁ డా
    ‘గా’ దొలగించి ‘శా’ మొదట గ్రక్కునవ్రాసి సజీవుఁ జేయఁడే.
చ. హరిహరి! యేమి సాంబశివ! అయ్య భయంపడి పల్కనోడెదన్
    అరమరలేల పల్కు భవదగ్రపురంధ్రి పెదక్క యేదయా
    సిరికిని దానికిం బడక చీఁదరయెత్తఁగఁ జింతపల్లెలో
    వరకరణాలయిండ్లకడ వారక యున్నదయా యుమాపతీ!
క. అధికార మబ్బినప్పుడు
    బుధులు ప్రమోదించి వీఁడె పురుషోత్తముఁ డం
    చధికంబుగ గొనియాడెడు
    విధమున వర్తింపఁ దరమె వేల్పులకైనన్?
మ. విధిసంకల్పముచే నొకానొకఁడు తా విశ్వంబు పాలించుచో
    బధిరం బెక్కువ చూపు తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనో
    వ్యధతో మత్తతతోడ దుర్వ్యసనదుర్వ్యాపారతం జెందు న
    య్యధికారాంతమునందుఁ జూడవలదా యాయయ్యసౌభాగ్యమున్.
క. ఉద్యోగ మొదవినప్పుడు
    సద్యోమద మొదవి పూర్వసరసత లుడుగున్
    విద్యావంతున కైనను
    విద్యాహీనునకు వేఱె వివరం బేలా!
సీ. బళిబళీ! మీతాత బల్లెంబు చేఁబూని
                    పుల్లాకు తూటుగాఁ బొడిచినాఁడు
    ఎద్దుచ్చ పోయంగ నేఱులై పాఱంగ
                    లంకించి లంకించి దాటినాఁడు
    కలుగలోనూ కప్ప గఱ్ఱుగఱ్ఱు మనంగ
                    కట్టారి తీసుక గదిమినాఁడు
    నాగలాపురికాడ నక్క తర్ముకురాఁగ
                    తిరువళూరూకాడ తిరిగినాఁడు

    ఎలుక యెదురుకురాఁగ నీటె చేతను బూని
                    యేడాఱుబారులు యెగిరినాఁడు
గీ. ఔర! వీనిపరాక్రమం బద్భుతంబు
    ...........................................
    ...........................................
    ....................చిన్నపక్ష్మాతలేంద్ర!

భారతకథనుగూర్చి చాటువులు


ఉ. ధీరతతోడ నీరథము దీవ్రగతిన్ గురురాజుసేనపై
    శూరతఁ బోవనిమ్ము ననుఁ జూడుము యుత్తర వీరయోధులన్
    బే రడఁగించి యాపసులఁ బెంపెసలార మరల్ప కున్న నా
    పేరు కిరీటియే నినదభీషణశంఖము దేవదత్తమే!
ఉ. సారథిగమ్మి యుత్తరుఁడ! చాలు జయించెద నింద్రునైన నా
    బారికి నడ్డమైన మును బ్రహ్మలిఖించినవ్రాలు తప్పునే
    ధీరత శంఖనాదమున దిగ్విజయంబును జేయకున్న నా
    పేరు కిరీటియే నినదభీషణశంఖము దేవదత్తమే!
ఉ. నీరజనాభ! నీవు చని నెయ్యముతో మనపాలు వేఁడఁగాఁ
    గౌరవు లీకతక్కినను గాఢనిరంతరచండమండితో
    దారదురంతదంతురశితాస్త్రపరంపర లేయకున్న నా
    పేరు కిరీటియే నినదభీషణశంఖము దేవదత్తమే!
ఉ. వారిజనాభ! యెల్లి చని వాసవుఁ డడ్డము వచ్చి నిల్చినన్
    వారిజబాంధవుం డపరవారిధిఁ గ్రుంకకమున్న సైంధవుం
    జేరి శిరంబు ద్రుంచి ధరణీస్థలికిం బలిసేయకున్న నా
    పేరు కిరీటియే నినదభీషణశంఖము దేవదత్తమే!

ఉ. పాఱెడుభీముఁ బట్టుకొని పట్టి శరంబున నూనినిల్చి ని
    ష్ఠూరము (?) లాడినట్టి రవిసూనుని ధర్మజ! నీవు చూడఁగా
    ఘోరరణంబులో నెదిరి గుండెలు వ్రక్కలు సేయకున్న నా
    పేరు కిరీటియే నినదభీషణశంఖము దేవదత్తమే!
ఉ. పా లడుగంగఁ గౌరవులపాలికిఁ బోవ నతండు లోభియై
    పా లది యేడదో యనినఁ బాలుతెఱం గెఱుఁగంగ భీమభూ
    పాలునిపాలు తాను తనపాలిటిరాజ్యము నన్నపాలు నా
    పాలు సమస్తసైన్య మని పల్కుము పంకజనాభ; యచ్చటన్.
సీ. చరణారవిందము ల్సమ్మతి మది నెంచి
                    ముమ్మాఱు రాజుకు మ్రొక్కి రనుము
    వచ్చినవైరంబు వారింప నూహించి
                    మాభూము లిమ్మను మనుజవిభుని
    ఆరీతి నృపతికి హర్షమ్ము గాకున్న
                    నేవురి కైదూళ్ళ నీయు మనుము
    పుడమీశుఁ డామాట కొడఁబడ కుండెనా
                    నడవడి యెఱిఁగించి నడుపు మనుము
గీ. పనులు సేయంగ నేదేనిఁ బంపు మనుము
    పంపు పనిసేయ సేవకభటుల ననుము
    ధర్మమార్గంబు వినబుద్ధి దనర దేని
    కదలిరమ్మను కలనికిఁ గమలనాభ!
మ. పదరుల్ పల్కక ధర్మశాస్త్రగతి భూభాగమ్ము మారాజ్యసం
    పద మా కిమ్మను మీయకుండిన మహాబాహాబలస్ఫూర్తి మై
    యెదు రై రమ్మను వచ్చి మద్బలము దా నేపారఁగాఁ జూచుచో
    గదఘాతంబుల నూరువుల్ దెగిపడున్ గంజాక్ష! యింతేటికిన్?
మ. కలహం బేటికి వద్దువద్దను మిటుల్ గర్వాంధుఁడై మమ్ముఁ దా
    జులకం జూచుట నీతిగా దనుమ యీక్షోణీతలంబందునన్

    నిలువన్నేరఁ డధర్మవృత్తి ననుమా నీ విన్నియుం బల్కితిన్
    బలవద్వైరమె కోర దుర్మరణముల్ ప్రాపించునంచాడుమా!
శా. పాండవులన్న దైవమును బౌరుషముం గలవారు వారికిం
    గొండొక కీడు చేసి నిలఁగూడదు కూడనిలోభ మూని వీ
    రిండితనంబునన్ దర హరింపనె చూచెదవేని వారు నిన్
    బిండలిపం డొనర్తు రని పేర్చి యథార్థ మెఱుంగఁ జెప్పుమా!
ఉ. మచ్చరమేల కర్ణ! విను మానవు లర్జునితోడివారలా?
    రచ్చల మెచ్చు లాడెదవు రాజును దమ్ములు నిచ్చ మెచ్చఁగా
    వచ్చినవాఁడు ఫల్గునుఁడు వాని నెదుర్కొను యోధఁ జూడుమా
    చెచ్చెర నూర జోగులకు శేషునికంఠము లంటవచ్చునే!
క. వరమునఁ గుంతికి సుతుఁ డై
    వెరవెఱుఁగక యేటివరద విడిచినపిదపన్
    ధరయెల్ల నేలెఁ గర్ణుఁడు
    దరిఁ జేర్పను గూడువెట్ట దైవముగాదే!
గోలకొండ మాలముండ పూలకుండ కొత్తకుండ అనిపదములతో భారతకథకు సంబంధించునట్టు చెప్పఁబడినపద్యము—
గీ. ఓయి కురురాజ! నీకొడు కుత్తగోల
    కొండవలెనుండు క్షణ మాల ముండ దిఁకను
    భండనంబున గెల్తురు పాండుసుతులు
    ఉదరమునఁ బూలదండ రే కొత్తకొండ.

పాండవు వర్తనము


సీ. ఇభపట్టణంబున కేగునాఁటికి ధర్మ
                    రాజు పదాఱువర్షములవాఁడు
    వాయుజుండు పదేను వత్సరంబులవాఁడు
                    పదునాలుగేండ్లు వివ్వచ్చునకును
    పరికింపఁ గవలకుఁ బదుమూఁడు వర్షముల్
                    జననీసమేతులై సౌఖ్యముండి
    విద్యలు నేర్చిరి వెసఁ బదుమూఁడేండ్లు
                    లక్కయిం టాఱునెలలు వసించి
    రిరవుగా నార్నెల లేకచక్రమునందు
                    నేఁడాది ద్రుపదుని యింటనున్కి
    ఐదువత్సరములు యౌవరాజ్యంబున
                    నిరువదిమూఁడేండ్లు నింద్రపురిని
    వనము నజ్ఞాతంబు చనెఁ బదుమూఁడేండ్లు
                    నటమీఁద ముప్పదియాఱునేండ్లు
    రాజ్యాభిషేకంబు రాజు లెల్లను గొల్వ
                    ధర్మంబుతో మించి ధాత్రిప్రోవు
    శ్రీకృష్ణుకృపకల్మి సిద్ధసంకల్పత
                    నష్టోత్తరశతహాయనము లుర్విఁ
గీ. జెలఁగి పట్టంబు తుదఁ బరీక్షితున కొసఁగి
    సోదరులు సతి జతగూడి సొరిది దివికి
    నరిగి వేడుక స్వర్గసౌఖ్యంబు గనిరి
    పాండవులు వారియశ ముర్వి నిండి వెలసె.

ఈశ్వరాజ్ఞ


గీ. కర్మ మెవరికైనఁ గడఁ ద్రోవఁగారాదు
    ధర్మరజుఁ దెచ్చి తగనిచోటఁ
    గంకుభట్టుఁ జేసెఁ గటకటా! దైవంబు
    ఏమి చేయవచ్చు నీశ్వరాజ్ఞ!
గీ. కష్టవేళలందుఁ గమలాసనునకైన
    ననుభవింపవలయు ననిలసుతుని
    వంటపూటివానివలెఁ జేసె దైవంబు
    ఏమి చేయవచ్చు నీశ్వరాజ్ఞ!
గీ. పాటు తప్పదు సుమి బ్రహ్మాదులకునైన
    నీడుగానచోట నింద్రతనయుఁ
    బేడివానిఁ జేసి పెట్టఁడా దైవంబు
    ఏమి చేయవచ్చు నీశ్వరాజ్ఞ!
గీ. అనువుగానివేళ నధికుల మనరాదు
    కాల మెఱిఁగి రీతిఁ గడపవలయు
    విశ్వమేలునకులుఁ డశ్వశిక్షకుఁడాయె
    నేమి సేయవచ్చు నీశ్వరాజ్ఞ!
గీ. పూర్వజన్మకృతము పోవ దెవరికైన
    మాన్పరాదు దైవమాయచేత
    ద్రౌపది యొకయేఁడు తగనిబాములఁ బడె
    నేమి సేయవచ్చు నీశ్వరాజ్ఞ!

తెలుఁగుభారతము


సీ. ఆదిపర్వము వసు, వరయంగ సభ నేత్ర
                    మారణ్య మద్రి, విరాట శరము

    నుద్యోగ వారిధి, యొనరంగ భీష్మాగ్ని
                    శరద్రోణ, కర్ణాగ్ని, శల్య నేత్ర
    సౌప్తిక మిథునంబు, సతిబాహు, ఋతుశాంతి
                    యానుశాసనిక మే, నశ్వమేధ
    మునునాల్గు, యాశ్రమంబును యుగళంబునౌఁ
                    బరఁగ మౌసల మొండు, ప్రస్థ మొకటి
గీ. స్వర్గగమనంబు చంద్రుతో సాటివచ్చు
    వెలయ నీరీతి సర్వంబు వెరసివేయ
    వరుస నర్వదిమూఁట నాశ్వాసములను
    దెలుఁగుభారత మలరు విస్తీర్ణ మగుచు.
క. వ్రాలా తప్పులు సెబ్రలు
    చాలంగల వేనుశబ్దసంగతు లెఱుఁగన్
    గేలింబెట్టక తిట్టక
    పోలంగా దిద్దరయ్య బుధజనులారా!
క. చేతప్పు నెఱుకమఱపును
    నేతెఱఁగుననైనఁ గల్గు నెవ్వరికైనన్
    వ్రాఁతం దప్పులు గల్గిన
    బాఁతిగ దిద్దుకొనుఁడయ్య పండితులారా!
గీ. వ్రాఁతతప్పువలన వాచకు లలుగక
    తప్పు గల్గెనేని తగిలయెడల
    వలయు నక్షరములు వర్ణించి నిలుపుఁడీ
    సుకవులయినవారు సురుచిరముగ.

  1. పాఠాంతరము
    సీ. విజయాధిపునిదాడి వెనువెంటఁ దగిలినఁ
                        బ్రాణముల్ దాచిన పందగజమ!
        పెనుజల్లెపల్లెలో బిరుద లన్నియు వైచి
                        పరుగెత్తి వచ్చిన పారుఁబోత!
        దురములోఁ జావక దొరలెల్ల హసియింప
                        మంచాన కొరిగిన కొంచెకాఁడ!
        చతురంగబలముతో సమరంబు సేయక
                        మానంబు విడచిన మందబుద్ధి!
    గీ. యనుచు నార్వేలవారు ని న్నపహసింప
        ధరణ నెల్లురీలో నెట్లు తిరుగఁ గలవు?
        వైరులను గెల్చి సత్కీర్తి వరలు మయ్య!
        మంత్రికులహేళి, తిక్కనామాత్యమౌళి!
  2. ఈవిషయము ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమందలి చారిత్రకసంపుటములం దున్నది.
  3. పల్లికొండనాథుఁడు, శయనించినస్వామి, రంగనాథుఁడు
  4. ప్రయోగవైచిత్రి
  5. బావా! నాకు విభుండు రేయి సుఖసౌభాగ్యం బెఱింగింపరా
  6. వేడ్క నానందపఱుచునో వెలఁది! నేఁడు