చంద్రికా పరిణయము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీలక్ష్మీనరసింహాయనమః

చంద్రికాపరిణయము

షష్ఠాశ్వాసము

క. శ్రీమజ్జటప్రోలుపురీ
ధామ! సుధాధామతిగ్మధామస్ఫూర్జ
త్కోమలనయనద్వయ! యు
ద్దామగుణాభీల! శ్రీమదనగోపాలా! 1

తే. చిత్తగింపుము శౌనకా ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహర్షణతనూజుఁ
డలనృపతి రేయి శుభలగ్న మనువుపఱిచి
పురము గయిసేయ శిల్పికోత్కరముఁ బనుప. 2

సీ. చంద్రవితానముల్ చక్కఁగాఁ దార్చి రా
స్థానాజిరముల సౌధవ్రజముల,
రామాకృతిశ్రేణిఁ బ్రబలఁ జిత్రించిరి
కురుఁజుల నవమణికుడ్యతటుల,
హరిణకేతుచయంబు వరుసఁ బొందించిరి
సాలాగ్రముల గృహస్తంభతతులఁ,
దోడ్తో నమేరు లద్భుతముగా నిల్పిరి
రాజవీథికల ద్వారప్రతతుల,

తే. విలసితచ్ఛదగుచ్ఛమండలముఁ బూన్చి
రంగడులఁ దోరణస్రగ్లతాంతరముల
నప్పురంబున సకలదేశాధిరాజ
శేఖరులు మెచ్చ నవ్వేళ శిల్పివరులు. 3

మ. అలఘుస్వర్ణసుచేలకాప్తి ఘనముక్తాళీసమాసక్తి ను
జ్జ్వలపద్మోద్ధృతి వైజయంత్యభియుతిన్ సంధించి యప్పట్టునన్
బలునేర్పు ల్మన శిల్పిరాజి ఘటియింపం బొల్చె నెంతేఁ గురుం
జులచా లచ్యుతరూపవైభవమునన్ సొంపొంది తద్వీథులన్. 4

చ. సరససుధాప్లుతంబు లగు చక్కనిగోడల శిల్పిరాజి భా
స్వరకనకద్రవప్రతతి వ్రాసినచిత్రపుబొమ్మ లొప్పెఁ ద
త్పరిణయరీతిఁ గాంచ వడిఁ బాటులఁ జేరి వధూటికాసము
త్కరశుభగీతిఁ జొక్కి సురకాంతలు నైశ్చలి నిల్చిరో యనన్. 5

మ. తళుకుం బంగరుకుచ్చుడాలు నవసంధ్య న్నీలగుచ్ఛప్రభా
వళి యిర్లన్ సుమదామదీధితి యుడువ్రాతంబుల న్వజ్రకుం
భలసచ్ఛాయ సితాంశుదీప్తి నిగిడింప న్శిల్పికు ల్దార్చు మే
రులు ధాత్రిం గన నద్భుతంబె క్షణదారూఢి న్విజృంభించుటల్. 6

చ. కువలయరాజచక్రములకుం బెనువేడుక సంఘటించుకాం
తివితతి మించ శిల్పికులు దీర్చిన నూతనచంద్రసూర్యకో
టి వెలిఁగె ధూపకైతవపటిష్ఠతమస్తతి గాంచి యోర్వ మం
చవనికిఁ జేరు నైకవపురాత్తతమీశదినేశులో యనన్. 7

చ. ధరణిజనంబు మెచ్చఁగ ముదంబున శిల్పికులంబు చిత్రవై
ఖరిఁ గయిసేయ నప్డలరెఁ గన్గొన నంచితవైజయంతయై
పరిభృతచిత్రరేఖయయి భవ్యమహాసుమనోవితానభా
స్వరయయి దృశ్యరంభయయి చక్కఁగ నప్పురి వేల్పువీఁ డనన్. 8

మ. ప్రసవస్రక్పరివీతయై పరికనత్పాటీరకాశ్మీరగం
ధసముల్లిప్తపయోధరాధ్వయయి నూత్నస్వర్ణచేలాప్తయై
పొసఁగెం దన్నగరీలలామ యపు డొప్పు ల్మీఱఁ దన్గాంచుమా
త్ర సముత్థాతనుసంభ్రమస్ఫురణ గోత్రాలోకము ల్దోపఁగన్. 9

చ. తొడిఁబడి దిక్ప్రతీరములఁ దూల్చుచు నద్రిబిలాంతరంబులన్
సుడిగొనుచున్ ధరిత్రిఁ గలచోటుల ముంచుచు నభ్రపద్ధతిం
దొడరి తరంగితం బగుచు దుస్తరవర్తనమై మెలంగె న
ప్పుడు పురి భద్రవాద్యకులభూరిరవౌఘము చిత్రవైఖరిన్. 10

మ. అనఘంబై సుమనోనికాయసముదారామోదసంవర్ధకం
బునునై శోభితనైకరాగయుతమై ప్రోద్యత్సువర్ణాఢ్యమై
ఘనమధ్వభ్యుదయంబు దెల్పు గిరిజాకల్యాణ మప్పట్టునన్
వినతాంగీనికరంబు వాడెఁ గలకంఠీకంఠనాదోపమన్. 11

ఉ. ఆయెడ గౌరిపంపున సురాంబుజనేత్ర లఖండహార్దధా
రాయతి వెల్లి మీఱఁ దలయంటఁగ మజ్జన మాచరింపఁ గై
సేయఁగఁ జంద్రికావనితఁ జేరిరి నవ్యఫలాక్షతాదికం
బాయతహేమపాత్రనిచయంబులఁ బూని రయంబు మీఱఁగన్. 12

శా. ఆనారీమణు లంత శోభనవితర్ద్యగ్రస్థలిన్ స్యూతర
త్నానీకం బగుపెండ్లిపీఁట నిడి యందాభూపకన్యామణి
న్వ్యానమ్రాననచంద్ర నుంచి శిర సంటం జేరి రింపెచ్చ ‘శో
భానేశోభనమే’ యటంచు విబుధాబ్జాతాననల్ పాడఁగన్. 13

సీ. సొగ సెచ్చ నీధరేశునిపట్టి తలయంటఁ
దగు నీకళానిధిదంట యనుచు,
నీకంజకర కభిషేకంబు సవరింప
నీసుమనోదంతి యెఱుఁగు ననుచు,
నలువుగా నీకొమ్మనలుఁగు గావింప నీ
సురభిచరిత్ర నేర్పరి యటంచు,
మహితాళి యివ్వేళ మసలఁగా నేటికే
యీశ్యామ సేవ కీవేగు మనుచు,

తే. సరసముగ నీగతులఁ బరస్పరము పలికి
కొనుచు నారార్తికంబు లొయ్యన నొసంగి
వీడియం బంజలి ఘటించి వేడ్కమీఱఁ
మదిరలోచన శిర సంటఁ గదిసి రపుడు. 14

చ. కురు లర వీడ దివ్యమణికుండలరోచులు గండభాగభా
ఝరముల నోలలాడఁ గుచశైలయుగంబున ఘర్మవాఃకణో
త్కరములు గూడ మధ్యమపథం బసియాడ ముదంబుతోడఁ జా
తురిఁ దగు నొక్కప్రోడ యలతొయ్యలికిన్ శిర సంటె నూనియన్. 15

ఉ. భాసురరక్తిమైఁ గలమపాళికఁ గుందెన నించి కంకణౌ
ఘాసమనిస్వనాళి వెలయంగ నయోగ్రము లూని ‘సువ్విసు
వ్వీ సువి సువ్వి లాలి’ యని వింతగఁ బాడుచు దంచి పుణ్యగో
త్రాసురకామినుల్ సతిశిరంబున సుంకులు చల్లి రత్తఱిన్. 16

క. బాలామణి యపు డొకచెలి
కైలా గొసఁగం దమీశకాంతామయపయ
శ్శాలాంతర మెనసె మరు
త్కాలాహికచాలలామకములు భజింపన్. 17

చ. నెలజిగిభీతి నిర్లు ధరణీధరకందరఁ దజ్జయాప్తికై
బలుతప మూన్చి కైశ్యగతి బాగుగఁ బుట్టఁగ జ్యోత్స్నికాదనా
కలనము నేర్ప వాని లలిఁ గైకొని మేపుపురాతపోరమా
కల యనఁ బెట్టె గంధ మొకకాంత వధూటిశిరోజపాళికన్. 18

తే. ఘనపయోధరపదవి నక్షత్రమాలి
కారుచులు పర్వ శ్యామ యొక్కర్తు చంద్ర
కలశిఁ బూని నవామృతమ్ములఁ జకోర
చపలనయనకు వేలార్చె సమ్మదమున. 19

మ. కనకాంగీజన మారతు ల్వొనరుపం గంజద్విషత్కాంత మ
జ్జనశాలాకలశాంబుధి న్వెడలి తేజం బెచ్చ నాపద్మపా
ణి నవీనచ్ఛదమండలీవృతి సమున్నిద్రాళి గేయాభిపూ
ర్తిని జూపట్టెడు పుష్కరాఖ్యగలవేదిం బొల్చె నప్పట్టునన్. 20

సీ. కనకదామముఁ జేర్చి వనితకు జడ యల్లె
నళిపాళికలఁ గేర నబల యొకతె,
వరచంద్రరేఖ సుందరినెమ్మొగంబునఁ
దీర్చెఁ దామర నొవ్వఁ దెఱవ యొకతె,
చలువగందంబు తొయ్యలిమేన నెనపెఁ జం
పకవల్లిఁ గికురింపఁ బడఁతి యొకతె,
ఘనకంకణమ్ము లంగనకరమ్ముల నుంచెఁ
జిగురాకు నెగ్గింపఁ జెలువ యొకతె,

తే. చారుపత్రమ్ము లెడయ కొప్పార భూరి
వజ్రమాలిక నెలకొల్పె వనిత గబ్బి
గుబ్బకవ గుబ్బలులయుబ్బు కొంచెపఱుప
దంటతన మొప్ప విరిదమ్మికంటి యొకతె. 21

మ. లలనామౌళి శివార్పితంబు లగుమేల్కట్టాణిముత్యంపుక
మ్మలు దాల్చె న్భవదాస్యదీప్తిగతి కాత్మ న్గుందు రేఱేని ని
స్తులవీక్షామృతధారచే మనుపు మంచున్ వేగ తచ్చంద్రమం
డలడింభంబులు భక్తి విన్నపముఁ బూన్పన్ జేరుదారిం దగన్. 22

ఉ. చక్క మఘోని యత్తఱి నొసంగిన సారమసారహారముల్
చక్కెరబొమ్మచన్గవఁ బొసంగె వధూమణి శ్యామ గావునం
జొక్కపుగుత్తు లన్మనముఁ జొన్పఁగ గుబ్బలు నిబ్బరంపు మేల్
మక్కువ నందు వ్రాలునళిమాణవకప్రకరంబులో యనన్. 23

ఉ. ఆయరవిందగంధి చరణాంబురుహంబులఁ దాల్పఁ బొల్చె న
గ్నాయి యొసంగినట్టి యభినవ్యవిదూరజనూపురంబు లౌ
రా యని హంసకత్వమున రాజిలుటం బలె నిస్సమస్వర
శ్రీయుతి నొంది డా లెనసి చెల్వముఁ బూనె నటంచు నెంచఁగన్. 24

ఉ. అంగన యంతకీపరిసమర్పితరోహితకాండపాండుర
త్నాంగదముల్ వహించె శుభహారమసారకదృష్టిడాలు రే
ఖం గన నుజ్జ్వలేందిర వికస్వరపల్లవకోరకాళికా
సంగతిఁ దద్భుజాతిలకసాలలతల్ వడిఁ బూనుచాడ్పునన్. 25

చ. సకియ తమీచరాబల యొసంగినచొక్కపుముత్తియంపుబా
సికము ధరింపఁ బొల్చె నది చిక్కనిడాలు నిశాప్తిఁ గాంచి బా
లిక యలికస్థలంబు స్వకులీనత మించఁగఁ గాంచఁ జేరి చం
ద్రకళ ప్రియంబు మించఁ బరిరంభముఁ దార్చినదారిఁ బూనుచున్. 26

చ. నలిననిభాస్యమౌళి వరుణానివితీర్ణము కెంపురాగమిం
దళతళ మంచు రాజిలు సుదర్శన మెంతయు నొప్పెఁ గందర
మ్ములఁ దప మాచరించి తమముల్ గచలీల జనించి భానుమం
డలి గ్రహియించెఁ జుమ్మనుమనంబు సఖీతతి కొందఁ జేయఁగన్. 27

మ. తరళాక్షీమణి యప్డు మారుతవధూదత్తంబు ముత్తెంపుముం
గర నాసన్ ధరియించి చెల్వెనసెఁ జక్కన్ వేగుఁజుక్క న్వహిం
చి రసం దోఁచుదినాస్యలక్ష్మి యన నక్షీణాంగరాగంబు ని
ర్భరసంధ్యారుచియై సురేంద్రమణిహారచ్ఛాయ లిర్లై తగన్. 28

మ. నవలా యైలబిలీసమర్పితము నానారత్నసంయోజితం
బవు నొడ్డాణము దాల్ప నొప్పె నది తారాధ్వస్థలీరీతిఁ దొ
ల్త విమర్శించితి నిప్డు మధ్యపథలీలం గాంతుఁ బో యంచు మిం
చువడిం జేరు ననేకవర్ణపరిధిస్ఫూర్తి న్విజృంభించుచున్. 29

మ. అలగోత్రాపతిపుత్రి యిట్లు గిరికన్యాముఖ్యదిగ్దేశరా
ణ్ణలినాస్యాజనతాసమర్పితమహానానామణీభూషణా
వళిశృంగారితగాత్రియై ద్విజసతీవారంబు దీవింపఁ దొ
య్యలు లారాత్రికముల్ ఘటింప నవమోదారూఢి మించెం గడున్. 30

తే. అంతకయ మున్ను బంధువయస్యదండ
నాథముఖ్యులు తత్సుచంద్రక్షితీంద్రుఁ
బెండ్లికొడుకు నొనర్ప దర్పించువేడ్కఁ
గడఁగి శుభలీల నాళిసంఘములఁ బనుప. 31

చ. తరుణులు చేరి కాంచనవితర్దిక శోభనపీఠిఁ బెట్టి భూ
వరు వసియింపఁ జేసి ద్విజవారిజలోచన లెల్లఁ గోకిల
స్వరమునఁ బాట పాడ ననివారితమంగళవాద్యనిస్వనో
త్కరములు చాల బోరుకొన గ్రక్కున నారతు లెత్తి రయ్యెడన్. 32

సీ. అఱచందమామపై కుఱుకుచీఁకటిపిల్ల
లన ఫాలతటిఁ గుంతలాళిజాఱ,
మదిపేరిమరుమేడఁ బొదలుధూపము పర్వు
పోల్కిఁ గ్రొందావియూర్పులు జనింప,
నన నూఁగువేడ్కఁ జేకొని మ్రోయు తేఁటిచాల్
సరి నీలవలయముల్ చాల మొఱయ,
లవలియాకులఁ గ్రమ్మునవహైమకణముల
గతిఁ జెక్కుల శ్రమాంబుకణిక లుబ్బ,

తే. సరులు నటియింప, నునుఁగౌను సంచలింప
గుబ్బకవ రాయిడింప, సకు ల్నుతింప,
చూపునెఱమించు మించుమేల్సొగసు నింప
నమ్మహీపాలు శిర సంటెఁగొమ్మయొకతె. 33

తే. అంత నప్పురుషోత్తముఁ డంఘ్రియుగళి
నడరుమిన్కులపావాలు దొడిగి కమల
హస్తకర మూని ఘనవేణికాళికాభి
కలితపాథోగృహము మందకలన నెనసి. 34

చ. అలినిభవేణి యోర్తు మహిపాగ్రణికైశికవీథిఁ జందనా
మలకము వెట్ట నొక్క సుకుమారలతాసమగాత్రి కోష్ణవాః
కులముల మజ్జనంబు సమకూర్చె మనోభవరాజ్య మందఁగాఁ
జెలువుగఁ గట్టఁ బట్ట మభిషేక మొనర్చినచాయ నయ్యెడన్. 35

చ. చెలువ యొకర్తు చెందిరికచేల మయిం దడి యొత్తి వైచి ని
స్తులవిశదాంబరం బొసఁగఁ దోడనె దాల్చి సదప్రియంబు మ
త్సులలితరోహితాంశుపటి సుమ్మని దాని సడల్చి వెన్నెలన్
వలనుగఁ బూని తోఁచు రవివైఖరి నప్పతి యొప్పె నంతటన్. 36

చ. అలజలశాలిక న్వెడలి యాజననాయకుఁ డబ్జరాగవ
ద్వలభివిభాజటాయుతి నవారితమౌక్తికకుడ్యదీప్తి ని
ర్మలగగనాపగాప్తిఁ గడురాజిలు పూఁజవికె న్వసించెఁ గ
ల్వలదొర యబ్ధి వెల్వడి శివాపతియౌదలఁ జేరుపోలికన్. 37

సీ. తడి యొత్తి నేర్పు గన్పడ నఖాంకురపాళి
నెఱులు చిక్కెడలించె నెలఁత యొకతె,
యింపు రెట్టింపఁ జొక్కంపుసాంబ్రాణిధూ
పపుఁదావిఁ బొందించెఁబడఁతి యొకతె,
తళుకుఁగుంచియఁ బూని కలయ నెఱు ల్దువ్వి
సొగసుగా సిగ వైచె మగువ యొకతె,
మొగలిఱేకులదంట మొనసినబొండుమ
ల్లియపూసరులు చుట్టె లేమ యొకతె,

తే. దివ్యతరరత్నజాలాప్తిఁ దేజరిల్ల
నబ్ధికన్యామనోహరుం డాత్మశక్తి
మహిమ సృజియించి యంచినమంజుమకుటి
నప్పతి కలంకరించెఁ గంజాస్య యొకతె. 38

క. అలనృపమణి కస్తూరీ
తిలకము దాఁ దీర్చె నిరతదీప్తికళాసం
కలితమయి మించు మో మను
కలువలదొరయందుఁ జిన్నెకరణి వహింపన్. 39

క. జనపతివీనుల హరి యం
చిన ముత్తెపుటొంటు లలరెఁ జేరువ లగ్నం
బెనసె విలంబం బిఁక నే
లని దెలుపఁగఁ జేరు కవిసురాచార్యు లనన్. 40

క. వీవలిచెలి పనిచినము
క్తావళితో విభునివక్ష మలరారెన్ దా
రావిసరప్రతిఫలన
శ్రీవిలసితకనకధరణిభృత్తటిపోల్కిన్. 41

క. జముఁ డంచిన మణిహంసక
మమరెం బతియంఘ్రిఁ ద్వత్పరాళికృతశ్వ
భ్రముఁ బాపుము ధామవిభౌ
ఘముచే నని యడుగునొందుకంజాప్తుక్రియన్. 42

క. పలభుజుఁ డంచిన రతన
మ్ములపతకము నృపతి దాల్పఁ బొసఁగెం జిత్త
స్థలచంద్రికానురాగా
వలి వెగ్గల మగుచుఁ బైకి వడి వెడలెననన్. 43

క. శరధీశప్రేషితభా
స్వరమౌక్తికశుభికఁ దాల్చె జనపతి ‘శుభికే
శిర ఆరోహ’ యటంచున్
ధరణీసురపాళి సుస్వనంబునఁ బలుకన్. 44

క. మరుదర్పితమణిముద్రిక
నరనాథుకరాంగుళికఁ దనర్చెఁ బ్రవాళేం
దిర తనచెల్మికి రా భా
సురభద్రాసనము నిచ్చుసొంపు వహింపన్. 45

క. పతి దాల్పఁ బొలిచె ధనదా
ర్పితహీరాంగదము తనధరిత్రీభారో
ద్ధృతి కలరి భుజాభజనా
దృతిఁ గుండలితాహినేత యెనసినపోల్కిన్. 46

క. హరుఁడంచిన నవకనకాం
బర మయ్యెడఁ గప్పి నృపతి భాసిల్లెను బం
ధురసాంధ్యరాగవృతుఁడై
ధరణిం గనుపట్టు శిశిరధామునిచాయన్. 47

వ. ఇవ్విధంబున సకలదిగ్రాజనియోజిత నానావిధదివ్యమణివిభూషణభూషితగాత్రుం డగుచు, నాసుచంద్రధరాకళత్రుండు నిశాముఖకృత్యంబులు నిర్వర్తించి మించినముదంబున వేల్పుదొర యంచిన చౌదంతి నెక్కి యుదయనగవజ్రశృంగాగ్రవిద్యోతమానుండగు నరుణభానుండో యన నఖిలచక్రలోచనసమ్మోదసంపాదకమహాస్ఫురణంబునం బొలుపొందుచు, నభినవ్యశాతకుంభకుంభవారాంచితపాండురాతపత్రసహస్రంబు చుట్టు వలగొన నరుణమణిగణసంస్యూతఫణిరమణఫణాదశశతమధ్యస్థితుండగు నృసింహదేవుండునుంబోలె నపరిమితవిబుధమనఃపథ జరీజృభ్యమాణ మహాద్భుత సంవర్ధకవిగ్రహప్రకా శంబునం బొగడొందుచు, నాత్మోత్సవసందర్శనలాలసా నానంద్యమాన పౌరమానవతీజనంబులు చల్లు మల్లికామాఘ్యాదివల్లికాదికోరకవారంబులు చుట్టు నావరింప శీతశైలహిమాధిదేవతావికీర్యమాణమిహికా ఘటికాపటల సంవృతమూర్తి యగుదక్షిణామూర్తి తెఱంగున దిగ్దళనకలనా వరీవృత్యమాన సద్గణకోలా హలంబుల కింపుఁబూనుచుఁ, బార్శ్వద్వయ పరిభ్రాజమాన గజాధిరాజాధిరోహి సామంతమహీకాంత సంవీజ్యమాన ధవళవాలవ్యజనంబు లసమానపవమాన మందయానవైఖరిఁ జాంచల్యమాన నవీనకాశ మాలిక లన్మనంబుఁ బొదలింప మహీతలంబునం దోఁచిన శరద్దినదైవంబు తెఱంగున ననేకరాజహంస సంసేవ్యమానుండయి రాజిల్లుచు, నగణేయతపనీయభంభికాతుత్తుంభికా తమ్మటతమామికాప్రముఖ బహుముఖవాద్యనిస్వానంబుల నలరి తదేకమంగళం బవలోకింపఁ దివుర షడ్ద్వయవిభాకరులు తమతమ ప్రియజనంబుల కరంబుల కొప్పగించి యంచిన నేతెంచి నిలుచు గురుసమాతత తేజోవిలాస లాలస్యమాన తత్కుమారశతశతంబులదారిం దైవాఱు పరిచారిక పాణిభృతగంధతైలధారా దేదీప్యమాన దీపికాసమూ హంబుల వీక్షాలక్ష్యంబులుగా నొనర్చుచు, నిరుగడల నెడయీక యడరునొయ్యారంబున నడచుగణికా గణంబులం గనుంగొని తొంగలించుమోహంబునఁ దదేకతానతం బొలుచు నభోవితర్దికాసీన నిర్జరస్తోమం బులపైఁ గంతుఁడు తత్సమయ సముచిత బహురూపంబు లంగీకరించి ప్రయోగించు నిర్వేలజ్వాలాకుల జాజ్వల్యమాన కలంబకదంబకంబులడంబున యంత్రకారవారంబు లొక్కమొత్తంబుగా ముట్టింపఁ బఱచు నాకాశబాణంబుల నవలోకించుచు, సర్వంసహాజనశ్రవణపర్వంబుగా నిజానవద్య పద్యగద్యంబులు చదువుచుం బఱతెంచు యాచకకవీశలోకంబుల కాత్మీయ బంధుమిత్రదండనాథపురోహితముఖ్యులు దోయిళ్ల ముంచి వెదచల్లు నవరత్నసువర్ణజాలంబులతో వైమత్యం బూను కారునికరకరశృంగ సముత్పాత్యమాన చారుధమనికాశిఖి స్ఫులింగికానికాయంబులం గాంచి వేడుకఁ బూనుచు, నుత్తుంగమాతంగచక్రాంగ సంఘాత సంఘటితజయపతాకాగ్రతట హాటకపటాంచల టేటిక్యమాన పవమానధారానిర్ధూతంబై స్వాశ్రయ రూపజలదవ్రాతంబు దెసలకుం బాఱి చన నంబరాంతరంబున నిలువ నోపక దివిజరాజరాజధాని కారావ రుద్ధముదిరంబులఁ గదియం బఱచు శంపాలతావితానంబుల మేనులం గురియు తత్ప్రయాణ జంజన్య మాన స్వేదోదబిందు సందోహంబులయందంబున నక్షత్రమార్గాభియాయి నక్షత్రబాణగణ పాపట్యమాన గర్భస్థలీ సనీస్రస్యమాన పాండుజ్వలన గుళికాజాతంబులపైఁ జూపులు నిలుపుచు, నశేషజగజ్జనజేగీయమాన చిత్రసృజనాపారీణ లోహకారకౌశికవారంబు లపరిమితంబుగా నిజచమత్కారంబునం బుట్టింపఁ బట్టఁజాలమిం బగులు వేధోండభాండమండలంబువలన బలువడి వెడలి నలుదిక్కులకుఁ బఱచు నుజ్జ్వల జ్జ్యోతిర్జాతంబులతీరున బంభజ్యమాన ఘటబాణపటలంబుల నిర్గమించు నానాళిబాణంబులం గాంచి మెచ్చుచుఁ, గబరికావిన్యస్తచాంపేయప్రసవ చరీచర్యమాణ పరాగపాళికావలయంబులుం గమనీయ ధూమప్రరోహాంతరాంతర బనీభ్రశ్యమాన తనుతరానలకణాలికావలయంబులుం బరస్పరంబు సతీర్థ్య త్వంబునం జూపట్ట నుదారభ్రమణయంత్రంబుల గుండ్రవరుసలు దిరుగు తెఱగంటికంటితో నద్వైతవాదంబులు సేయు ననల్పశిల్పికరయష్టికాగ్ర బంభ్రమ్యమాణ చక్రబాణచక్రంబులఁ జూపున నాక్రమించుచుఁ, దమోరిపుత్రీయ మహామహోనివహంబులు తృణీకరించి నిరర్గళనీరంధ్రపట్టాతపవారణచ్ఛాయా కపటంబునఁ బుడమి నంతయు నాక్రమించు కటికచీఁకటి గని భయంబు పుట్టఁ బాతాళంబుఁ జొరఁబాఱి యనేక దేశాధినాయక చమూసహచరణన్యాసంబున నచ్చట నిలువలేక యవారితవారవాణ సాహోనినాద పాఫల్యమాన ధరాభాగంబున నొక్క మొత్తంబుగా గ్రక్కునం బైకి వెడలు తైజసత్ర్యణుకపరంపరల పెంపున భ్రాంతి వుట్టింప నిగుడు బిఱుసులమిణుంగురుల వీక్షించుచు, నిరతసురతతి వర్ణ్యమాన వితీర్ణిచాతురీపోపుష్యమాణంబు లగురారణ్యమాన మానితబిరుదశంఖధ్వానంబులఁ దనశుభంబు దెలిసి యది తిలకింప నేతెంచిన సత్కీర్తిప్రవాహంబు పోలికం బ్రకాశించు నహర్వర్తికామరీచిధట్టంబుల దృగ్ధామంబులం గట్టుచు, నిర్వేలసూర్యజ్యోతిఃప్రభావసద్యోంతర్హితుం డగుట నన్నెలమిన్నం గన్నులఁగానక తాతప్యమానాంతరంబున వియత్తలంబున నంబుజారిబింబసత్వం బైనఁ గనుంగొనుదుము గాక యని చయ్యన నెగసి యగణిత పారలోకసంఘ సంఘర్షణోత్పతద్భుజాంగదమణిచూర్ణపరంపర నిండారఁ గప్పిన నచ్చటం జూడనోపమి సంజాతమూర్ఛామహత్త్వంబున గ్రక్కునం ద్రెళ్లు నీలోత్పలకులంబుచెలువున వలుఁదకంబంబుల పయి నుండి జల్లున రాలు నీలోత్పలబాణకులంబులం గని యలరుచు, సుకరభ్రమరకప్రకరభాగ్యంబును, సురు చిరకైరవదళలోచనసమ్మదకృత్స్వరూపవైఖర్యంబును, సుందరకింజల్కమాంజుల్యంబును, శోభిల్ల నుల్ల సిల్లు సల్లకీపల్లవాధరామతల్లికల సరసకళాపాళికా రోచమాన కువలయేశసేవామనోరథంబున నేతెంచిన కుముదలతికలంగాఁ దలఁచి నభోంతరవావస్యమాన మరున్మానవతీపాతితసంతానలతాంత జాగళ్యమాన మరందబిందుసందోహకుహనా మహితహిమపృషద్వర్షంబుల కెట్టు లోర్చునని తన్మైత్రీగౌరవంబున నీడఁ జేరిన చంద్రాతపమండలంబు బెడంగునఁ గురంగలోచనామణులపై నెత్తిన యుల్లాభంబుపై దృష్టి వెల్లివిరియించుచు, నభంగుర మార్దంగిక మృదంగ ధిమిర్ధిమిధ్వానంబులు నతివేలతాళిక తాళనిస్వానంబులు ననూనవాంశిక వంశికానేకరాగతానంబులు నసమానగాయకమానంబులు నతిశయిల్ల నాత్మీయ తాండవవిలాస ప్రతిమాన భావభావనా నరీనృత్యమాన సురమీనలోచనా జనంబుల మీఁదికిం గుప్పించి తిరస్కరించి మరలం జేరుతీరున లాఁగులు వైచుచుం బఱతెంచు బిరుదుపాత్రల నేత్రంబు నానుచు, నసదృశంబును, నవాఙ్మనసగోచరంబును, నత్యద్భుతంబును, నభూతపూర్వంబును, ననితరలభ్యంబును నగు వైభవంబునఁ బాంచాలభూపాలమందిరంబు చేరం జనుసమయంబున. 48

శా. ఛద్మాన్యాంకురితత్రపాభరయుతేక్షారీతి నాలేఖరా
ట్పద్మిం జక్కఁగ నెక్కి వచ్చుధరణీభర్తం గనం దత్పురీ
పద్మాస్యామణు లెల్ల సమ్మదము లొప్పం జేరి రంచు న్శిర
స్సద్మౌఘంబుల నూపురార్భటిక లోజం జాటె వేగస్థితిన్. 49

సీ. పుణ్యవాసన పొంగిపొరలె నాఁ జెమట పై
కొనఁ గప్పురపుపూఁత గుమ్మురనఁగఁ,
బరువూనుబుద్ధి వెంబడిఁ బర్వురాగంబు
గతిఁ జలన్మణిహారకాంతి నిగుడఁ,
ద్వర నేగ దృక్ప్రేషితవయస్య దెల్పుదా
రి వతంసితాబ్జాతభృంగి మ్రోయ,
మోమునభఃకాలమునఁ గైశ్యఘనసీమ
సౌరుమిం చన హైమసరము వ్రాల,

తే. నలక లరవీడఁ దనుఁ జూచి యలరి వాడ
సకులు గొనియాడ నంఘ్రులజవము గూడఁ,
జొక్కమగుమేడ కేతెంచె నొక్కప్రోడ
యింపు దొలఁకాడ గోత్రామరేంద్రుఁ జూడ. 50

చ. తిలకము దీర్చి దీర్పక సతీమణి యొక్కతె హీరదర్పణం
బలరఁ గరంబునం జనవరాగ్రణిఁ గన్గొన వచ్చె ధామమం
డలి నిను లోకబాంధవు ఖడాఖడి నేఁచినయట్టి చల్లమిం
చులదొరఁ బట్టి తెచ్చితిని జుమ్మని చేరుదినాధిదేవినాన్. 51

చ. తరుణి యొకర్తి వేగజనితశ్రమవాఃపరిపృక్తమానితాం
బరయయి పైఁట జాఱ నెదఁ బాణి ఘటించి మహిస్థలీపురం
దరుఁ గన నేగుదెంచెఁ గడు దక్కితి నీకని నిర్మలాత్మతో
నిరుపమచిత్తవాసగతనీరరుహాంబకు ముట్టుపోలికన్. 52

మ. కనకాంగీతిలకం బొకర్తు పతి సింగారించుచుం గేల నూ
తనముక్తావళి వ్రేల వచ్చె నలగోత్రాకాంతు వీక్షింపఁ జ
క్కనిక్రొమ్మొగ్గలపేరు పూని లలిమైఁ గందర్పసామ్రాజ్యల
క్ష్మి నవేహ న్వరియింపఁ జేరె నని నెమ్మిం జూపఱు ల్మెచ్చఁగన్. 53

చ. తరళితపారిజాతసుమదామకవాసన పిక్కటిల్ల వి
స్ఫురదహిశత్రురత్నమయభూషణదీధితి పర్వ నొక్కసుం
దరి నృపుఁ గాంచ వచ్చె వడిఁ దద్విభవంబు సురేంద్రవైభవేం
దిర నెకసక్కెమాడ జగతిం గన నొందు మఘోనితీరునన్. 54

మ. అనురాగంబునకన్న మున్ను హృదయం బాసన్మనోవీథిక
న్నను ము న్వీక్షణపంక్తి యంతకును ము న్పాదప్రవేగంబు చా
ల నహంపూర్విక నొంద వచ్చె నతిహేలావైభవశ్రీయుతిన్
ఘనవేణీతిలకం బొకర్తు ధరణీకాంతాగ్రణిం గన్గొనన్. 55

మ. సకిచా లిట్లు శుభాప్తి వచ్చుపతిఁ గాంచం జేరి యవ్వేళ మౌ
క్తికజాలాక్షతపాళిఁ జల్లె నలధాత్రీనేతపై మల్లికా
ప్రకరంబు ల్మధుమాసలక్ష్మి వరియింపం బెంపుతో వచ్చుచై
త్రికుమీఁదన్ సుమజాలకేసరము లెంతే వైచుచందంబునన్. 56

మ. జలజాప్తాన్వయమౌళి యప్పు డలపాంచాలేంద్రచంచన్మణీ
నిలయాభ్యంతికసీమ లేఖవరదంతిం డిగ్గి యమ్మేటి యు
త్కలికాసంపదచే నెదుర్కొన లతాగాత్రీశిరోరత్నమం
డలి యారాత్రికముల్ ఘటింప బుధసంతానంబు దీవింపఁగన్. 57

చ. లలితసువర్ణవేత్రికకులంబు బరాబరి యూన్పఁ జెంతలం
గలసి నిజాప్తబంధుమహికాంతచయం బరుదేర నొక్కనె
చ్చెలికయిదండఁ జేకొని వచింపఁగరాని యొయారమెచ్చ ని
ర్మలినవివాహరత్నమయమండపరాజముఁ జేరె నయ్యెడన్. 58

క. నరపతి పాంచాలక్షితి
వరుపనుపునఁ గనకపీఠి వసియించి యన
ర్ఘ్యరుచిఁ గనుపట్టెఁ బ్రాఙ్మహి
ధరవీథిం బొలుచు తుహిన ధామునిచాయన్. 59

చ. విమలబుధాంతరంగనవవిస్మయదంబు మహాసదృక్షరా
ట్ప్రమదకరంబు నై దనరుభవ్యమహంబునఁ బొల్చుపూరుషో
త్తముపద ముల్లసత్ప్రియవిధానముతోఁ గడిగెం బ్రజేశుఁడా
త్మమహిళ నించుదివ్యజలధారలఁ గాంచనపాత్రి నత్తఱిన్. 60

చ. యువతులు పాటఁబాడఁగ నవోత్కలికన్ శుభమంత్రజాలకం
బవనిసురాళిక ల్దెలుప నాక్షణదోదయరా జొసంగునిం
పవుమధుపర్క మన్నృపకులాగ్రణి కుత్సవ మూన్చెఁ జంద్రికా
ధవళవిలోచనాధరసుధారస మిట్టిదెయన్న కైవడిన్. 61

చ. కనకపుగద్దె నొప్పుమహికాంతునిముంగల నప్డు చక్కఁ దా
ర్చినబలుచెంద్రకావితెర జిష్ణుదిశాధరభాసమానసూ
ర్యనికటశోభిసాంధ్యరుచియందము గైకొనెఁ బద్మినీవిలో
చనకమలానుమోదరసజాతము మిక్కిలి హెచ్చఁ జేయుచున్. 62

శా. ఆవేళన్ క్షణదోదయక్షితివరాభ్యర్ణస్థలిం జేర నా
ళీవారంబుల కెచ్చరించి బలుహాళిం దత్పురోధుం డుమా
దేవీసన్నిధిఁ బొల్చుభూపసుతఁ దోడ్తెచ్చెన్ వరశ్రీ ‘మమా
గ్నేవర్చోవిహవేషు’ యంచు సరసోక్తి న్భూసురు ల్పల్కఁగన్. 63

సీ. నిఖిలాద్భుతముగ మున్నీటిమన్నీని వె
ల్వడి తోఁచులచ్చినెలంత యనఁగఁ,
దళతల మనుచుక్కచెలిచాలు వలగొనఁ
గనుపట్టు శీతాంశుకళ యనంగ,
నధికయత్నమున నొయ్యన నడతెంచు ర
తీశునిపట్టంపుటేనుఁ గనఁగ,
భువనైకమోహంబు పొదలాడ నలువయం
తిక మొందుమోహినీదేవి యనఁగ,

తే. చారుకులదేవతానివాసమ్ము వెడలి
యజరవనితాళి చుట్టు రా నాళి యత్న
రీతి నొల్లన నడుచుచు నృపులు గాంచి
నిశ్చలత నిల్వ గురుఁ జేరె నెలఁత యపుడు. 64

మ. కనకాంగీమణి యాత్మదృగ్రిపుమహాకంజావళి న్మెట్టుతీ
రునఁ జొక్కమ్మగుమెట్టుఁబ్రాల్పుటిక నంఘ్రు ల్దార్చి యవ్వేళ నా
జననాథాగ్రణిముంగల న్నిలువ నోజ న్భూసురు ల్మంజుల
ధ్వనిఁ గన్యావరణంబుఁ జెప్పిరి ప్రమోదం బూన బంధు ల్మదిన్. 65

మ. వనజాక్షు ల్ధవళంబుఁ బాడఁగ మహావాదిత్రనాదంబు బో
ర్కొనఁ జారూక్తిఁ బురోహితుండు ‘స హరిఃకుర్యా త్సదామఙ్గళ’
మ్మని చిత్రంబుగ మంగళాష్టకము నెయ్యం బొప్పఁగాఁ జెప్పి శో
భనలగ్నం బదె చేరె నంచు వివరింపన్ సంభ్రమౌఘస్థితిన్. 66

మ. జలజాప్తాన్వయు దైత్యభేదిగఁ దనూజ న్వారిరుక్పాణిగాఁ
గలితైకాత్మఁ దలంచి యత్తఱి ‘నిమాం కన్యాం ప్రదాస్యామి’ యం
చలపాంచాలుఁడు ధారఁబోసెఁ దనకన్యం దత్సుచంద్రావనీ
వలజానేతకు లేఖపాళి ప్రసవవ్రాతంబు వర్షింపఁగన్. 67

చ. ధరణిఁ బరస్పరోక్తి జవదాఁటక యుండ ఘటింపఁ గర్త తో
యరుహశరుండు గావునఁ దదాత్మ నన న్సరిగా వధూవరు
ల్శిరముల నుంచి రప్డు గుడజీరకము ల్పతి మున్ను దార్చె సుం
దరి యట మున్నె చేర్చె నని తత్ప్రియబాంధవు లుగ్గడింపఁగన్. 68

క. అలమహిపతి మది సమ్మద
మలరన్ ‘మాంగల్యతంతునా౽నేన’ యటం
చెలమిఁ బురోధుఁడు దెలుపఁగఁ
గలకంఠికిఁ దాళిబొట్టు గట్టెం జక్కన్. 69

మ. సకిపై నానృపమౌళి నింప నలకంజాతాక్షి గోత్రాధినా
యకుపై నింపఁగ సేసఁబ్రా ల్దనరె సామ్యస్ఫూర్తి నవ్వేళఁ ద
త్సుకరాలంకృతినాదవాదములు దోడ్తో మించ సాహిత్యపో
షకుఁ డబ్జాస్త్రుఁడు దార్చునర్జునమణీజాలాభిషేకం బనన్. 70

మ. కపిలావాచనభద్రవేళఁ దగి రాకాంతావిభు ల్సేసము
త్తెపుచా ల్దార్కొనుమెట్టుఁబ్రాల్పుటిక లుద్దీపించు పెన్కాఁడితోఁ
దపనీయాంశుకసూనుసంభృతతులాత్మం బూన లావణ్యభా
గ్యపటుశ్రీసమరీతిఁ దెల్ప సరి దూఁగన్నిల్చుచందంబునన్. 71

చ. అలయినసన్మహస్స్ఫురణ నందుచు శ్యామయు నాకలాపినీ
కులతిలకోత్సవాకలనఁ గూడుచు నాహరివంశనాయకుం
డలరి యజస్రము న్వెలయ నయ్యెడ నంచితమంత్రశక్తిఁ ద
త్కలితకరాంబుజస్థలులఁ గట్టిరి కంకణము ల్ధరామరుల్. 72

చ. అలిచికురాసువర్ణవసనాంచలసంగ్రథితాంశుకాంతుఁడై
యలనరపాలమౌళి విమలాంబుజరాగవివాహపీఠికా
స్థలి వసియించి లాజసముదాయమున న్శిఖిహోమ మూన్చె ను
త్కలిక చెలంగ భూసురవితానము మంత్రము లుగ్గడింపఁగన్. 73

మ. సనెకల్ హత్తఁగఁ జేసె నంఘ్రి చెలి చంచత్కుడ్యచిత్రాత్మ ని
ల్చినకంతుండు పురాకృతాగము సనం జిత్తంబులో నిల్పి యం
చనరక్తిం దనుఁ బ్రోవు మంచుఁ దదనుచ్ఛాయోపధిం డాసి వం
దన మూన్పం గని ప్రోతు నం చభయపాదం బూన్చు చందంబునన్. 74

చ. జనపతి మౌళి భూసురు లొసంగుశుభాక్షతపాళిఁ దాల్చి యం
గనలు ఘటించునారతులు గన్గొని యంత వధూకరాత్తహ
స్తనళినుఁడై ముదంబున లసత్కులదేవగృహంబుఁ జేర నొ
య్యనఁ జనియెన్ గలధ్వనుల నైదువు లింపుగఁ బాటఁ బాడఁగన్. 75

ఉ. మ్రొక్కు ఘటింపఁ బెండ్లికొమరుం డబలాయుతి నేగుదేరఁగా
నక్కులదేవతాజనుల యంచున వే యెదు రేగుదెంచి మేల్
నిక్కఁగ నిల్చి తత్సఖులు నీటున వారల నిల్పి రంగునన్
గ్రక్కునఁ దత్సమాఖ్యలఁ బరస్పరవాణి వినంగ నయ్యెడన్.76

చ. తెలుపుము చంద్రికాఖ్య జగతీవర యన్న విభుండు నవ్వునం
దెలుపక తెల్ప లో నెఱిఁగి నీరజలోచన యాళు లందఱుం
దెలుపు సుచంద్రనామము? సతీ! యన నెమ్మొగ మెత్తి దానిచేఁ
దెలిపె సకుల్ ధరన్ సహజదీపితకౌశల లౌదురే కదా. 77

చ. చెలి సుముఖోక్తిఁ దెల్పు? నృపశేఖరుపే రని డాసి వెండియుం
గలరవ లెల్ల వేఁడ, “సుముఖం ”బని నేర్పునఁ బల్కు; “నీవు మున్
దెలిపినఁ దెల్పుఁ గొమ్మ పతి! దెల్పవె? యీవనితాఖ్య కాంతవా
క్కలన” నటన్నఁ, “గాంత” యనఁగా మది మెచ్చిరి తద్వచోర్థముల్. 78

ఉ. వెన్నెల కెద్ది పేరు పృథివీవర! తెల్పఁ గదే? య టన్నచో
నన్నృపమౌళి “జ్యోత్స్న” యను; నంగన! యొప్పగురాజుపే రదే
మన్న “సుశీతరశ్మి” యను; నబ్రము “చంద్రిక” యంచు భర్త యా
కన్నె “సుచంద్ర” యంచుఁ బలుక న్మది నాఁగిరి లజ్జపెంపునన్. 79

చ. మును హృదయాలయాభివృతమోహనిరూఢిఁ బరస్పరాఖ్య లిం
పున ననిశంబుఁ బిల్చునలభూపతియున్ సతియున్ బ్రియాళికా
జనములు దెల్పుమన్న నొకసారి వచింపఁగ నేర రౌర! యే
మనఁ దగుఁ దత్త్రపాజలరుహాశుగశాంబరికావిలాసముల్? 80

చ. అలతఱి నాళి యత్నగతి నంచితమంధరవాఙ్నిరూఢిఁ బే
రులు వచియించి భక్తి మదిఁ గ్రుమ్మర దేవుల మ్రొక్కి బాసిక
మ్ములు సడలించి బంధువృతి ముద్దుగ బువ్వము లారగించి తొ
య్యలియు విభుండు మించిరి నిరర్గళసంభ్రమ వైభవంబులన్. 81

క. ఈలీల నశేషనిలిం
పాళీనుతతత్కరగ్రహచతుర్ఘస్రీ
వేలాంచితవిభవము హే
రాళంబై వెలయ నాధరాపతి యలరెన్. 82

ఉ. వేదవిధానముం బుడమివేల్పులు దెల్పఁగ నంత శేషహో
మాదికమంగళాచరణలన్నియుఁ దీర్చి చెలంగునాధరి
త్రీదయితామరేంద్రునకు దివ్యమహర్షికులాగ్రగణ్యు లా
మోదముతో నభీష్టకరము ల్వరము ల్ఘటియించి రందఱున్. 83

ఉ. వేఁడినకోరికల్ గురియువింతగుమానికము ల్జగంబులం
జో డొకచోట లేని పలుసొమ్ములు హెచ్చగు పైఁడివల్వలు
న్వేడుక పొంగ వీడు చదివించిరి బంధులు సర్వదేశస
మ్రాడమరేంద్రులున్ హితులుమంత్రులు తన్మహినేత కయ్యెడన్. 84

సీ. అహికి లోఁబడనిదివ్యగజంబు బృంహితా
ర్భటిఁ గేరు భద్రవారణశతముల,
ననికి వేలుపుతేజి నలరుకైజామోర
యల్లార్పుచేఁ జీరుహయకులముల,
వేగంటితేరికావిమెఱుంగు పడగవీ
వలిఁ బాయఁ జేయునుజ్జ్వలరథములఁ,
దెఱగంటితెఱవలతీరెల్ల బెళుకుచూ
పులనె పోనాడు పూఁబోఁడిగములఁ,

తే. దులకు జేజేలరతనంబు దొడర సుగుణ
భారగతి నెగఁబట్టు నుదారమణుల,
నపుడు పాంచాలుఁ డొసఁగెఁ దద్విపులవిభవ
జనితహర్షాప్తమతికిఁ దన్మనుజపతికి. 85

సీ. సన్మణిచాప మొసంగెఁ దన్గను నరి
మండలి కిది యార్తి మన్పు ననుచు,
నాశుగౌఘ మొసంగె నాశువర్తన నిది
పరవాహినుల భంగపఱచు ననుచు,
శాతహేతి నొసంగె సమిదుజ్జ్వలితవీర
తరులను నిది మాయఁ దార్చు ననుచు,
ఘనవల్లి నొసఁగె వేగ మహాహితాళుల
కిది సుమనోయోగ మెనపు ననుచు,

తే. మఱియు దివ్యాయుధంబు ల త్తఱి నొసంగె
నవ్యవిజయేందిరానిదానమ్ము లనుచు,
హాళి దళుకొత్త నలకూకుదావతంస
మవ్విభున కిట్లు దెలుపుచు నాదరమున. 86

చ. అసమబుధప్రకాండయుతి నాతతనిర్మలపుష్కరాపగా
ప్తి సరసపారిజాతజగతీరుహశోభితసౌధయుక్తి ని
వ్వసుధ మరుత్పురస్ఫురణ పాటిలుభవ్యపురీశతంబులం
బసుపున కిచ్చె నయ్యవనిపాలుఁడు పుత్త్రికి సమ్మదంబునన్. 87

మ. ధరణిన్ మేల్ రతనాలసొమ్ములును జల్తార్చీరలుం గ్రొత్తక
స్తురివీణెన్ ఘనసారసాంద్రధమనీస్తోమంబు లవ్వేళ ని
ర్భరచామీకరపేటికోత్కరములం బన్నించి దా వెండియున్
దరుణీమౌళి కొసంగె నయ్యవనికాంతాభర్త చిత్రంబుగన్. 88

చ. స్థిరతమభక్తి మ్రొక్కి తమచెంగట నిల్చినఁ గ్రొత్తపెండ్లికూఁ
తురు కడు బుజ్జగించి లలితో మునికామిను లెల్ల నాసువ
ర్ణరుచికిఁ జాల నైదువతనం బతిదీర్ఘతరాయురున్నతుల్
సరసతనూజలాభము నొసంగిరి తత్పరతాయుతాత్మచేన్. 89

సీ. అలఘుభోగసమృద్ధి నర్పించెఁ బౌలోమి
యనుపమౌజశ్శ్రీల నెనపె ననలి,
ధర్మైకబుద్ధి నొందఁగఁజేసె యమభామ
యిష్టరమ్యోత్సవం బిచ్చె నసురి,
కమలాభ్యుదయముపొం దమరించెఁ బాశిని
సుస్పర్శనాసక్తిఁ జొన్పెఁ బవని,
రాజపూజ్యోన్నతిఁ బ్రబలించె ధనరాజ్ఞి
ఈశభక్తి ఘటించె మృడవధూటి,

తే. మఱియుఁ దక్కిననిర్జరీమణు లుదార
కలితసౌభాగ్యవిభవము ల్గలుగఁజేసి,
రపుడు పాణౌకరణమంగళానురచిత
కుతుకయై శ్రీ రహించు నాక్షితిపసుతకు. 90

మ. మనుజాధీశసతుల్ నుతింప ననుకంపాలక్ష్మి నవ్వేళఁ గం
ధినిషంగప్రియభామ యాత్మమహిమ న్నిత్యాంగరాగంబు సే
యనిసింగారము వాడనట్టివిరి పాయ న్లేనితారుణ్యవ
ర్తనము న్వీడనిసొంపుపెంపు కలుగ న్దార్చె న్వరం బింతికిన్. 91

చ. పలుకులఁ దేనె లుట్టిపడ భావిశుభంబులు దెల్పు నేర్పుమైఁ
బొలయలుక ల్మరల్పి చెలిపోలిక నీవిభు నిన్నుఁ గూర్చు ని
చ్చలు భవదిష్ట మంతయుఁ బొసంగఁ దనర్ప నెఱుంగు నంచు ను
త్కలిక వచించి యొక్క చిలుకం గిరికన్య యొసంగెఁ గొమ్మకున్. 92

మ. సురభి న్బొన్నలతావి మల్లియలతేజు న్వేసవిన్ జాతివై
ఖరి వర్షాది శరద్దినాళి నసనౌఘస్ఫూర్తి సేమంతిడా
ల్వరహేమంతముఖంబున న్శిశిరవేళ న్మొల్లచాల్పెంపు దా
ల్చి రహిం గూర్చు నటంచు నొక్క విరి నిచ్చె న్గౌరి యబ్జాక్షిన్. 93

చ. తలచినకోరిక ల్గురియుదాని, మెఱుంగుమెఱుంగుమిన్నలం
దళతళమంచు మించుజిగిదాని, భరించినమాత్ర దేవకాం
తలఁ గికురించుసొం పెసఁగుదాని, నొకానొకరత్నమాలికన్
జలరుహలోచనామణి కొసంగె గిరీంద్రకుమారి యత్తఱిన్. 94

చ. మఱియు నమూల్యవాంఛితసమాజము లాదృతిచే ఘటించి యా
తెఱవఁ గవుంగిలించి నరదేవకుమారిక పోయి వత్తు ని
త్తఱి నని దెల్పి యాగిరిశతన్వి ముదంబున నేగె వేలుపుల్
తఱిగొని వెంట నొంద రజతక్షితిభృన్నిలయంబుఁ జేరఁగన్. 95

ఉ. అంత సుచంద్రమానవకులాగ్రణిచే క్షణదోదయక్షమా
కాంతునిచే బహూకృతులు గైకొని తత్సకలాంతరీపరా
ట్సంతతు లెల్ల నైజపురజాతముఁ జేరఁగ నేగె మానసా
భ్యంతరసీమఁ దచ్ఛుభమహావిభవోన్నతి సన్నుతించుచున్. 96

మ. అలపాంచాలవిభుండు పుత్త్రి కధికాంతావాసనూత్నప్రవే
శలసన్మంగళ మూన్పఁగాఁదలఁచి తత్సారంగదేశీయకుం
తలఁ దాఁ గౌఁగిటఁ జేర్చి యంకవసతిం దార్కొల్పి నవ్యాశ్రుసం
కులమై కన్గవ దోఁప నచ్చెలువఁ బల్కుం బ్రీతిచే నత్తఱిన్. 97

క. నిచ్చలు పుట్టినయింటికిఁ
జొచ్చినయింటికి నపూర్వశుభకీర్తితతుల్
హెచ్చ మెలంగవె తల్లి భ
వచ్చరితము భువనపుణ్యవైఖరిఁ బొదలన్. 98

సీ. వంశధర్మనిరూఢి వఱలించె నీనారి
మహితశాస్త్రాధిగమంబుకలిమి,
గురుతరులకు వన్నెగూరిచె నీశ్యామ
ఘనసుమనోవికసనముచేత,

నిను నుదయంబున నెసఁగు నీపద్మిని
మంజులామోదసామగ్రి మెఱయ,
ద్విజరాజిఁ బోషించి దీపించు నీకొమ్మ
భాసురఫలదానపటిమఁ బూని,

తే. యనుచు జగమెల్ల నుల్లాస మతిశయిల్ల
సంతతము మెచ్చ మను మమ్మ క్షమకు జన్మ
పద మనఁ దనర్చు నంభోజపాణిజీవ
నమ్మ జీవన మని యెంచుమమ్మకొమ్మ. 99

క. అట్టియెడ నశ్రు లక్షులఁ
దొట్టఁగ నవనమితవదనతోయజ యగు నా
పట్టిఁ దనయంకపాళిం
బట్టి నయం బొప్ప జనని పలికె న్గరుణన్. 100

మ. అలశైలేంద్రతనూజ యంతసతి నర్ధాంగీకృతం జేసె శీ
తలరోచిర్మకుటుండు గానఁ జెలులం దత్తత్తదాత్వోచితో
జ్జ్వలకృత్యంబుల మెచ్చి మెచ్చరు ధరాచక్రంబునన్ భర్త లై
న లతాంగీమణి పూతధర్మసరణి న్వర్తింప మే లెంతయున్. 101

ఉ. కైరవకోటికూటములు గావని చక్ర మవక్రకౌతుకో
దారత మీఱ సద్వరవితానము లెల్ల మహామహంబులన్
భూరివికాసవైఖరులఁ బూనఁగఁ జేయుచు లోకచిత్రగం
భీరచరిత్ర వై జగతిఁ బెంపు వహింపఁ గదమ్మ చంద్రికా! 102

క. ఘనవేణి నిన్ను నీశుఁడు
దనమూర్తిగఁ దలఁచి మిగుల దయచేసినచో
వినయంబ పూని విశ్వభు
వనపూజ్యత మెలఁగవమ్మ వసుమతిలోనన్. 103

సీ. కవఁగూడి సత్పతిఁ గువలయంబు చెలంగ
నలరు శ్యామయె శ్యామ యవని నెంచఁ,
బురుషరత్నముఁ జెంది సురభివృత్తి
సుమనోగుణ మూనుకొమ్మయే కొమ్మ తలఁప,
సర్వమంగళ యధీశ్వరునకు సామేన
యనఁ దగు సతి సతి యగు నుతింప,
నినపాదసేవనంబున ఘనామోదంబు
నెనయుపద్మినియె పద్మిని నుతింప,

తే. సుచిరముగ సుమనోవృత్తి సొబగుఁ బూని
కలదినంబులు ప్రియుమదిఁ గలసి మెలసి
నడచుకామిని కామిని నళిననయన
తెలిసి నీవింకఁ బతిచెంత మెలఁగు మమ్మ. 104

మ. అని వా రంబుజనేత్ర నంప నటఁ దత్ప్రాణేశ్వరీయుక్తుఁడై
జననాథేంద్రుఁడు కాంచనాంచితమణీజ్వాజ్వల్యమానప్రభా
జనితక్ష్మాచరదైనబింబధిషణాసంస్థాన మౌస్యందనం
బున నాత్మీయపురీలలామకము నామోదంబుమైఁ జేరఁగన్. 105

సీ. వరవర్ణసంపత్తి నిరుపమశ్రీఁ బూను
సాంగనానాకళాచక్ర మనఁగ,
వసుకలాపవిభూతిఁ బస మీఱుశ్రీవధూ
రమణీయతరతనూరాజి యనఁగ,
స్ఫుటతరతారకాపటిమఁ గౌతుక మూన్పు
బహుకీర్తినవవప్రపాళి యనఁగ,
ఘనజఘనోదారగరిమ నింపులు నింపు
వివిధభూమ్యవతారవితతి యనఁగ,

తే. పౌరవరవర్ణినీకోటి బారు దీరె
భర్మమయహర్మ్యవీథులఁ బార్థివేంద్రుఁ
డసమసుమపేశలాలాభహర్షభార
వారకర్ణేజపానుభావముల రాఁగ. 106

చ. సకలజగన్మనోహరు సుచంద్రునిఁ జంద్రికఁ జూడ నిట్లు కౌ
తుకమునఁ జేరి పౌరనవతోయదవేణిక లెల్ల నుల్లస
చ్చకచకతాసమానమణిసంకులకంకణరాజి గల్లన
న్వికసితమల్లికావితతి నింపుచు నింపులు పెంపు మీఱఁగన్. 107

సీ. చట్టుకూఁతు నొకర్తు సర్వజ్ఞుఁ డగుమహే
శ్వరునితోఁ దార్చినవామరచన,
ఖరపాదు రసవదంతర యైనపద్మిని
తోన గూర్చినపవలైన చెయ్వు,
లలకుముద్వతి మనోహారి యౌసత్పతి
తో ఘటించిన యాప్రదోషసృష్టి,
చిరపూరుషుని వసుస్ఫురితాంగి యగులక్ష్మి
తో నెనయించు నతుల్యసర్గ,

తే. మన్నియు జగంబు మఱవ నయ్యబ్జజన్ముఁ
డతులధీచాకచక్యంబు నసమరూప
మానుకూల్యంబు ననురూపయౌవనంబు
నమర నిద్దంపతులఁ జేసె ననఘశక్తి. 108

చ. క్షమ నొకకిన్నరాగ్రసరుసఖ్యముఁ బూని మహానటుండు నా
నమరి తపస్విరాజవనితాళి వ్రతంబులు దూల్చినట్టి యా
కమలకరున్ వరించుగిరికన్యక నవ్వఁగఁ జాలుఁ జంద్రికా
కమలదళాక్షి సద్గుణనికాయపయోధి సుచంద్రుఁ జేరుటన్. 109

మ. కమలావాప్తి మలీమసాంతరమున న్గన్పట్టు మిన్నందు దు
ర్గమవృత్తిం జరియించుఁ దద్వ్యయమున న్గాంచు న్విరూపంబు మే
ఘము తద్యుక్తిఁ బొసంగె నా కచిరరుక్త్వం బంచు నామించు తాఁ
గమలాలోకనయై యుదారగుణవత్కాంతాప్తిఁ బొల్చెన్ ధరన్. 110

వ. అను నప్పౌరకామినీ కలాపాలాప ప్రపంచంబున కుదంచితం బగుమనోంచలంబునం దట్టం బగు మోదంబు రెట్టింప, నొకశుభముహూర్తంబున భగవదనంగవిద్య యగునయ్యనవద్యాంగియుం దాను ననేక రంభా సంభ్రమ విజృంభితంబు, నగణ్య మఘవదలంకృతంబు, నపరిమిత సుమనో వితాన విద్యోతి తంబు, నసంఖ్య కవిజన విభ్రాజితంబు, ననుపమ గురుసమాజ సంకులంబు, నకలంక కలానిధి ధురంధ రంబు, నపార శుచిధర్మ పుణ్యజన రసాధీశ మండితంబు, నచంచల సదాగతి ధనద మహేశ్వర రాజి విరాజితంబు నై, యమంద విభవ జిత పురందర మందిరం బగు నాత్మీయ నివేశనంబు ప్రవేశించి, యా సుచంద్ర ధరణీచంద్రుండు, పక్షపాత పరాఙ్ముఖ ప్రచారుండయి, మహనీయ వసు కలాపంబున నభిరూప చక్రంబున కవక్ర ప్రమోదంబు గూర్చుచు, సద్గణంబుల కహీన ద్యుమ్నంబు లొసంగుచుఁ, బద్మినీ సముద యంబున కభ్యుదయంబు ఘటించుచు, నపూర్వ వితరణ పాండితీ ధురంధరుండై, కువలయంబునకుఁ బోలె దుర్వార శార్వర వ్రాతంబున కామోద వర్ధనంబుం జేయుచు, నభంగ మంగళ తరంగితం బగు నొక్క సమయంబున. 111

సీ. తెఱగంటిరారాలఁ దీర్చినకంబాల
జతఁ గూడి యున్నవజ్రంపుబోది
యల నంటఁ దార్చినఁ దలుకు లీనెడుజాతి
గుజరాతికెంపురాకులుకుతమ్మి
మొగడలలోయంత్రముల జాఱుపన్నీటి
పలుచనితుంపురుల్పడఁగ మీఱు
జాళువాబొమ్మలకేల నుండెడువట్టి
వేరులసురటీలవీజనంబు

తే.

విరళవిరళంబులై దెసల్పరిమళింపఁ
జేయ గారుత్మతగవాక్షసీమసంఘ
టితభరణినాఁ గళద్ధూపవితతిచేత
గమ్మనువిహారగేహప్రఘాణమందు.

112


సీ.

రతిరహస్యాధిదేవత తదాశ్రయ మంది
     శృంగారకళ బయల్ చేసె ననఁగ,
మరురాజ్యరమ నిన్న మరగి డాసితి నంచు
     మచ్చికమైఁ గరంబిచ్చె ననఁగ,
మధులక్ష్మి ప్రాచీనమంతువు మఱపింప
     వెసఁ బరిచర్య గావించె ననఁగ,
రతి భర్త కభయంబు మతిఁ గోరి తద్ధేమ
     నిశితశస్త్రి నెదుటనిలిపె ననఁగ,


తే.

లీల నలువంక వేర్వేఱఁ గీలుబొమ్మ
లగరుధూపంబు లిడ తెలనాకుమడుపు
నొసఁగఁ బువ్వుల సురటిచేవిసర రత్న
దీపిక గ్రహింప నెమ్మది ధృతి రహింప.

113


చ.

ప్రకటితచిత్తభూబిరుదపద్యములంబలె వింతఱంతులన్
సకినము లుగ్గడించు నెరచాయలఁ బాయని కెంపుకోళ్ళతోఁ
జికిలి చొకాటపున్మెఱుఁగుచిక్కని పెందెరతో విధూతవృం
తకుసుమతల్పమై సిరులఁదార్కొనుశయ్య వసించినంతటన్.

114


క.

చిత్తప్రభూతకలహా
యత్తతఁ గడుఁ దత్తఱించునాత్మన్ వ్రీడో
ద్వృత్తి నడంచుచుఁ దగున
బ్బిత్తరిఁ గని వల్కి రపుడుప్రియసఖు లెల్లన్.

115

తే.

పురుషమణిఁ గూడి యామోదగరిమఁ బూను
నట్టి లతకూన సౌమనస్యంబుఁ బొగడ
నౌనె? యాకల్పకం బైనఁ గానఁ దరుణి!
తాల్పు మాకల్పకస్ఫూర్తి ధవునిఁ గదియ.

116


తే.

అని చెలులు ఘనమణికలాపాళి భాస్వ
దంశుకంబున నలరించి యద్భుతముగఁ
జంద్రిక నృపాంబుకాబ్జముల్సంతసిల్ల
నతనిఁ జేర్పంగఁ దలఁచి దీవ్యన్నవోక్తి.

117


చ.

చనుదము లెమ్ము శ్యామ! యిఁక క్ష్మాధరచంద్రుని డాయఁగా వలెన్
మన మలరంగఁ దత్కరవిమర్దము దక్కినఁ దెల్వి దక్కునే?
యని నయ మొప్పఁ దచ్ఛయము నంటి తెమల్చిన లజ్జపెంపునన్
వనజదళాక్షి నమ్రముఖవారిజయై నిలఁ బూన వెండియున్.

118


సీ.

తొయ్యలి! నీచన్నుదోయి చక్రము గెల్చు
     నదియె? రాజపరిగ్రహంబు లేక;
వెలఁది! నీకటిసీమ విషమగోత్రము నొంచు
     నదియె? దేవేశలీలాప్తి లేక;
కాంత! నీకనుఁగవ కైరవావళి మీఱు
     నదియె? యినాలోక మొదవ కున్నఁ;
గలికి! నీమయికాంతి కైతకంబులమించు
     నదియె? యీశ్వరయుతిఁ బొదల కున్నఁ;


తే.

గాన, నీవింత హిత మాత్మఁ గాంచ లేక,
గోలవయి యేల యీవేళఁ గోమలాంగి;
మొక్కలము చేసె? దని పల్కిముదిత లెల్ల
తోడితేఁ గాంత పడకిల్లు దొరయ వచ్చె.

119

మ.

అమరేశాశ్మవిజేతృకుంతల వయస్యాయత్నయుక్తి న్విహా
రమహాగేహము సొచ్చి, యచ్చట మసారస్తంభపార్శ్వంబునం
దు మొగి న్నిల్వఁగ రాగయుక్తి నది దోడ్తోఁ దెల్పె భూభర్తకు
న్రమణి న్నిత్యమహాశుచిప్రకృతికి న్నైజంబు పోఁబోవునే?

120


ఉ.

అత్తఱిఁ దత్సఖీజన మనావిలధీయుతి హత్తి మీర లి
ప్పుత్తడిబొమ్మ రాజమణిపుత్రికలార భజించుచుండుఁడీ
చిత్తము వొంగ నం చొకవిశేషవిధానము నెంచి వంచనా
యత్తత నేగె దాని జలజాక్షి యథార్థమ కా గణింపఁగన్.

121


సీ.

సుమశరప్రావృడాగమశక్తి నంబుద
     శ్రేణిఁ గన్పడు తటిద్రేఖ యనఁగఁ,
బతిపూన్కి గ్రహియింప భావజుండు పునర్గ్ర
     హణ మూన్చు సుమచాపయష్టి యనఁగ,
సాహిణి రా నిగ్గ సాధించు నావల
     రాజుక్రొత్తచిలుకతేజి యనఁగ,
వనపాలుదోటినేర్పున వచ్చు శృంగార
     ధరణిజభూరిమంజరిక యనఁగ,


తే.

నపుడు నృపుకన్నుఁగవ నాంగి కాభ నలమి
యతఁడు దివియంగ వెనుదీసి యంత రాక
గబ్బి యయి నిల్చి తత్కరాకర్షణమునఁ
గదిసె నక్కాంత తల్ప మక్కంబ మెడసి.

122


మ.

సదనాధారసమగ్రవాసననొ తత్స్వాధ్వీవతంసంబు తా
నుదితస్తంభతఁ గాంచెఁ దత్కలన నయ్యుర్వీశరత్నంబు తా
నదియే తాల్చెఁ దదాత్వమం దగుఁ గదా శ్యామాతిభూమప్రభా
స్పదమూర్తిన్ భజియించి తద్గుణతతిన్ సంధింప రెవ్వా రిలన్.

123

చ.

జలరుహనేత్రగాత్రమహి సాంద్రమహాంకురపాళి యంటఁ ద
త్కలితమనస్తటాకమును గాఢశరాళి నగల్చి చిత్తజుం
డలరు మహారసోత్కరము నచ్చటఁ దారిచె నాఁగ నత్తఱిం
బులకిత మైనమైఁ బొరలి పొంగె నవోదితఘర్మవాశ్ఛటల్.

124


చ.

చెలి చెలు లందఱుం జనిన సిగ్గది పోవక యున్న దేమి తాఁ
జలమున నంచు నెంచి యతిసాంద్రరుషాయుతిఁబోలె ఘర్మవాః
కలికలఁ దోఁగి శోణరుచి గన్పడ నొయ్యన జాఱి తద్వధూ
కులమణిసమ్ముఖం బెడసెఁ గుంకుమబొట్టురసంబు చయ్యనన్.

125


చ.

జలజశరాశుగప్రచురచంక్రమణంబు లమందతం గనన్
గలికి తమిన్ ద్రపాంబుదము గప్పిన నాననచంద్రదర్శనం
బలవడ కున్కి నత్తఱి నిజాక్షిచకోరకయుగ్మ మాఁకటం
దలఁకుచు నుండ నద్ధరణినాథుఁడు పల్కు రసోత్తరంబుగన్.

126


సీ.

వరశంఖపూగసంపద గళస్థము నీకు
     సతి! పోఁకముడి సుంతసడల రాదె?
కువలయశ్రీ నేలుకొను నేత్రరుచి నీకుఁ
     దొయ్యలి! రెం డూరు లియ్య రాదె?
ఘనకుందవిభవంబు గను దంతములు నీకు
     బిసబాహ! యొకరేఖ యొసఁగ రాదె?
బహుదివ్యఫలలక్ష్మిఁ బరఁగువాతెఱ నీకు
     నింతి! మంజులకుచం బిడఁగ రాదె?


తే.

రాజవిజయంబు చేసె నీరమ్యముఖము
లేమ! యవనతవృత్తి చాలింప రాదె?
నిరుపమరుచిమణికి నీకరయఁ దగునె
వరపటలరీతి చే విడువఁగను రాదె?

127

క.

అనునయపూర్వకముగ న
వ్వనజానన నిటులు పలికివసుధాపతి త
ద్ఘనరమ్యాంగకసంస్ప
ర్శనలాలసవృత్తి యగుట సంభ్రమ మెసఁగన్.

128


చ.

నృపతిమహాబలోత్కరము నేర్పున వళ్యధిరోహిణిన్ సమ
గ్రపటిమ లగ్గ కెక్కుతఱిఁ గంపమునొందు సతీకుచాద్రి దు
ర్గపదవి నాక్రమించి యట రంజిలు నాయకరత్నముం గ్రహిం
చి పరమకౌతుకం బతని చిత్తమునన్ ఘటియించె నత్తఱిన్.

129


తే.

అటులు నేత్రాహరణయుక్తి నతిశయిల్లు
రాజమౌళికి నీవి క రస్థమయ్యె,
నైన పిమ్మట దానె తదంగసీమ
యతనిఁ బొదివి సుఖించె సాంద్రానురక్తి.

130


తే.

అపు డతర్కితసంప్రాప్త మగు పరస్ప
రాంగ సాంగత్యసౌఖ్యంబు ననుభవించు
జంపతుల కెన్నఁ దత్త్రపసదృశ యైన
యాళి యగుఁ గాదె మఱి జగత్పాళియందు.

131


మ.

జలజాతాప్తకులావతంస మటఁ దత్సారంగనేత్రాధర
చ్ఛలబింబీఫలచుంబనంబువలనన్ సద్యస్సముద్భూతపి
చ్ఛిలమోహుం డయి చన్ను లంటి తగ నాశ్లేషంబు నూన్పం గన
త్పులకంబై యది చేసెఁ గంచుకభిద న్భూయస్త్రపాయుక్తిగన్.

132


చ.

క్రమమున రాజమౌళి యెడగానని ధౌతపటంబు దీయఁ ద
త్కమలదళాక్షి బెగ్గడిలి క్రమ్మఱ రాఁ గొను సారెసారెకున్
విమలపయస్తరంగతతి వేమరు నేగుచు నాఁగుచుండఁగా
నమరెడు గాంగసైకతమునందమునన్ జఘనంబు మీఱఁగన్.

133

సీ.

చానచెక్కిలిపేరి చంద్రఖండమున భా
     స్వత్కరజక్షతి వఱల నీక,
జలజాక్షిగుబ్బగుబ్బలుల సద్వజ్రశ
     యోన్నతసమ్మర్ద మొంద నీక,
సతిరదనాంశుకచ్ఛలసుమాసవమున
     నలరుద్విజావళి నాన నీక,
నెలఁతతనూపద్మిని విగాఢదోషాను
     బంధనిర్బంధంబుఁ బడయ నీక,


తే.

తార్చెఁ బర్వంబు, పక్షపాతంబుఁ గూర్చె
నుంచె నామోద, మొసఁగెఁ బద్మోదయంబు
నంత సుమశస్త్రశాస్త్రరహస్యతత్త్వ
మదనభుండు సుచంద్రక్షమావిభుండు.

134


తే.

అతనుశాస్త్రవిభేదంబు నాదిఁ గాంచి
యంత నద్వయభావనాయత్తవృత్తి
నలరి తత్ప్రియసాయుజ్య మంది పొందె
నసదృశానందమయత నబ్జాక్షి యపుడు.

135


చ.

తొలుత దృశావిలాసములు, తోరపుటాననవిభ్రమంబు ల
వ్వల, నటుమీఁద నావయవవైఖరులుం గనుపట్ట నాన యన్
బలుతెర నారతిస్మరులు పట్టి సడల్పఁ, గ్రమంబున న్వధూ
తిలకము రాజమౌళికి మది న్ముద మూనిచె నర్తకీగతిన్.

136


క.

కంతుకలాపారగ మగు
స్వాంతమునం దిటులు రాగవల్లిక మెఱయన్
గాంతుఁడు కాంతామౌళికి
నెంతయు సంతసము నూన్చె హితనవరతులన్.

137

సీ.

మంజులాహీనహర్మ్యప్రదేశంబున
     శుచిగరుత్మల్లీలఁ జూచికొనుచుఁ,
గలధౌతమయశైలకందరాస్థలుల మ
     హానందిహరిలీల లరసికొనుచు,
సుమనోనివాసభాసురనగాగ్రములందు
     దివ్యసారంగాభ దెలిసికొనుచుఁ,
బుష్కరవీథులఁ బొలుపొందు నేకచ
     క్రరథవిస్ఫూర్తిని గాంచికొనుచుఁ,


తే.

గమల దైత్యారి శర్వాణి కమలవైరి
ధారి పౌలోమి యుర్వరాధరవిదారి
ఛాయ హరి యన నలరిరి సకలకాల
సముచితాఖేలనంబుల సతియుఁ బతియు.

138


సీ.

ఆధరాధిపు యశోహరి జగత్తటి వ్రాల
     నుడిగె ఘనఘనాభ్యుదయలీల,
లామహీభృతుధామధామనిధిస్ఫూర్తి
     ధరఁ దూలె శార్వరపరవిభూతి,
యారాజువితరణభూరిభూరిజలాళిఁ
     జనె దుర్గదుర్గతిశాదపటిమ,
మారసాపతితరవారివారిదరేఖ
     నడఁగె శాత్రవహంసహంసపాళి,


తే.

యాసుచంద్రుఁడు ధర్మంబు నాశ్రయించి
నీతి దయివాఱఁ గాంచి యనీతి నొంచి
యరిది జగ మెల్లఁ బాలించు నపుడు సకల
జనులు శుభసమ్మదస్ఫూర్తి మనిరి వేడ్క.

139

క.

అని రోమహర్షణాత్మజుఁ
డనఘ మఖండైకచరిత మంతయుఁ దెలుపన్
విని శౌనకాదిమునిచం
ద్రనికాయము గాంచె నధికతరహర్షంబున్.

140

ఆశ్వాసాంతము

మ.

పరవిద్రావణ! రావణప్రబలహృత్పత్త్రీశ! పత్త్రీశభా
స్వరయానక్రమ! నక్రమర్దనవిధాసచ్చక్ర! సచ్చక్రసం
భరణశ్రీధర! శ్రీధరప్రభుమహాపర్యంక! పర్యంకదు
స్తరసాళ్వాదన! వాదనప్రమదవత్సత్యాత్మ! సత్యాత్మకా!

141


క.

గణనాతిగాప్తరక్షణ!
క్షణదాంబుజినీకళత్రసారసవైరీ
క్షణ! వృజినకూటతక్షణ!
క్షణఖండితనిర్జరారిఘనసైన్యగణా!

142

మాలిని

శకటదనుజభీమా! క్షాళితాఘౌఘనామా!
వికటబకవిరామా! విశ్వసంపూర్ణధామా!
స్వకపరినుతసోమా! శక్రకోటీరధామా!
వికలచరణసీమా! విద్విషద్ధ్వాంతభామా!

143

గద్యము
ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకలాకళత్ర
రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ
మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయం
బను మహాప్రబంధంబునందు
సర్వంబును షష్ఠాశ్వాసము
సమాప్తము