Jump to content

చంద్రాలోకము

వికీసోర్స్ నుండి

చంద్రాలోకము

అడిదము సూరయ

క.

శ్రీరామచంద్రపురకే
ళీరసరసికాంతరంగలేఖర్షభకో
టీరమణిఘటితపదకా
ళీరమణీలోల రామలింగ మహేశా.

1


వ.

అవధరింపుము.

2


గీ.

బాలురకైననుఁ దెలియఁగా గాళిదాసు
మును రచించెఁ జంద్రాలోకమును, ద్రిలింగ
భాషఁ జేసితి నీ కృప భవ్యముగను
దీనిఁ గరుణించి కైకొమ్ము దేవదేవ.

3


క.

లలి నొండొరులతపంబుల
ఫలంబులై యమరియుండి ప్రాణులకెల్లం
దలిదండ్రులగుచుఁ దగు తొలి
యలదంపతుల నుతియింతు ననయము భక్తిన్.

4


క.

అమరీ కబరీభార
భ్రమరీ ముఖరీకృతంబు పరమోజ్జ్వలమౌ
హిమవత్తనయాశుభపద
కమలము దూరీకరిం చఘంబులు సతమున్.

5


క.

బాలురకు నలంకృతులన్
సౌలభ్యమునం బ్రవేశ సంసిద్ధిఁ దగున్
మూలమగు లక్ష్యలక్షణ
మాలాసంగ్రహ మనుక్రమంబునఁ జేతున్.

6

ఉపమాలంకారము

గీ.

వర్జ్య ముపమాన ముపమానవాచకము స
మానధర్మము సంఘటింపనగు నుపమ
హంసిచందాన నీకీర్తి యబ్జనాభ
యభ్రగంగావగాహనం బాచరించు.

7

లుప్తోపమ

గీ.

వర్ణ్య ముపమాన మౌపమ్యవాచకు స
మానధర్మంబు ననువానిలో నొకండు

హంసిచందాన నీకీర్తి యబ్జనాభ
యభ్రగంగావగాహనం బాచరించు.

7

లుప్తోపమ

గీ.

వర్ణ్య ముపమాన మౌపమ్యవాచకు స
మానధర్మంబు ననువానిలో నొకండు
రెండు మూఁడు వచింపకయుండ లుప్త
యుపమ యెనిమిదివిధముల నొప్పగునది.

8

వాచకలుప్త, ధర్మలుప్త, ఉపమానలుప్త, ధర్మవాచకలుప్త, వాచకోపమేయలుప్త, వాచకోపమానలుప్త, ధర్మోపమానలుప్త, ధర్మోపమానవాచకలుప్త

గీ.

చంచలాగౌరి శశిధరసన్నిభాస్య
చూడఁ గర్పూర దాకృతి శోభస్మర వ
ధూ యదాత్మిక వాచక తుల్యధర్మ
తద్ద్వితీయ వర్ణలుప్తలై దనరు వరుస.

9


గీ.

కాకతాళీయ మయ్యె నక్కాంత మేల
నమును రతియు నతర్క్యోపనతి ననంగఁ
బొల్చు నుపమానవాచకంబు లుపమాన
మును వికల్పంబునన్ ధర్మమును విడుచుట.

10

అనన్వయాలంకారము

క.

జగతి నొకవస్తువునకే
తగ నుపమానోపమేయత ఘటించుట చె
న్నగు నేని నది యనన్వయ
మగు శశి శశి భంగి కాంత్యుదగ్రుడను క్రియన్.

11

ఉపమేయోపమాలంకారము

క.

మునుపటివలెఁ బర్యాయం
బున నుపమానోపమేయమున నది గల్పిం
చిన నుపమేయోపమ యనఁ
దనరారుచునుండుఁ గృతు దర్పక మథనా.

12


గీ.

ధర్మ మర్థముభంగి నర్థంబు ధర్మ
మట్లు నీయందు లక్ష్మీసమన్వితంబు
లతను డిందుండుఁబలె నిందుఁ డతనుఁడుఁబలె
విరహపీడన దక్షు లన్కరణి శర్వ.

13

ప్రతీపాలంకారము

గీ.

అలరును బ్రతీప ముపమాన మైనయట్టి
వస్తు వుపమేయ మగుచును వరలెనేని
నీ విలోచనసదృశముల్ నీరజములు
నీ ముఖసముండు పరిపూర్ణసోముఁ డనఁగ.

14


గీ.

పరగ నన్యోపమేయలాభంబుచే న
నాదరము వర్ణ్యమున కిడ నదియ యగును
గర్వ మొందగ నేల మొగంబ నీకుఁ

గాంతిని భవాదృశుఁడు తారకావిభుండు.

15


గీ.

ఒరుని ననాదరంబు వర్ణ్యోపమేయ
లాభమునఁ గల్గ నదియుఁ జెలంగు; మిత్తి!
క్రౌర్యదర్పంబు నీకేల? కలరు చాలఁ
ద్వత్సమములైనయట్టి కాంతాజనములు.

16


గీ.

వర్ణ్యమున నుపమానాన్యవస్తువునకు
దగ ననిష్పత్తి వచనంబు దవుల నిదియ
ధవళనయన! మృషాపవాదంబు యుష్మ
దానన సమాన మౌనంట యంబుజంబు.

17


గీ.

తనరు నుపమాన కైమర్ద్యమును ప్రతీప
మనగఁ గావ్యములందు నీయలరుఁబోడి
నెమ్మొగము చూడఁబడెనేని నీరజముల
తోడ నేమి? సుధాంశునితోడ నేమి?

18

రూపకాలంకారము

రూపకాలంకారము అభేదరూపకాలంకారము, తాద్రూప్యరూపకాలంకారము అని రెండురకములు. ఈరెండును మరల అధికోక్తి, న్యూనోక్తి, అనుభయోక్తి అని మూడేసివిధము లగుచున్నవి. దీనినిబట్టి అధికాభేదరూపకము, న్యూనాభేదరూపకము, అనుభయాభేదరూపకము, అధికతాద్రూప్యరూపకము, న్యూనతాద్రూప్యరూపకము, అనుభయతాద్రూప్యరూపకము అని మొత్తము ఆరువిధములు.

గీ.

ప్రకటమగునట్టి విషయంబునకు విషయ్య
భేదతాద్రూప్యరంజనం బేది యదియ
రూపకం బిది మూఁడుతీరులఁ దనర్చు
నధికతా న్యూనతా నుభయవచనాప్తి.

19


క.

ఈతండే కద సాక్షా
ద్భూతేశుఁడు క్షణములోనఁ బురములు భస్మీ
భూతంబులయ్యె నెవ్వని
చేత ననగ లక్ష్య మమరు శేషవిభూషా!

20


గీ.

ఉన్నవాఁడీతఁడే తిగ కన్నులేని
శంభుఁడవుచును; శంభుఁ డీసమయమునను
విశ్వమేలెడి సమదృష్టి స్వీకరించి
యనఁగ విని లక్ష్యములగు శశాంకమౌళి!

21


క.

దీని ముఖేందునిచే నే
త్రానందము నాకు లబ్ధమగుచుండంగా
నానిండుకలువ నెచ్చెలి
చే నేమగునన్న యట్లు శీతాంశుధరా!

22


గీ.

సాధ్వి యిది యసుధార్ణవజాతయైన

యపరలక్ష్మి కళంకి యైనట్టి విధుని
కంటె మీఱెడు ముఖసుధాకరుఁ డనంగ
లక్ష్యములుగాఁ దనర్చు నిలాశతాంగ!

23

పరిణామాలంకారము

గీ.

విషయి విషయాత్మతను గ్రియాన్వితమైన
నదియుఁ బరిణామ మనఁగఁ బ్రఖ్యాతి కెక్కు
నవనిలోనఁ బ్రసన్నేక్షణాంబుజమున
నాయతేక్షణ చూచెడి ననఁగ శర్వ!

24

ఉల్లేఖాలంకారము

గీ.

పెక్కువిధముల నొక్కనిఁ బెక్కువార
లెన్న నుల్లేఖ మగునది యెటులనన్న
అతఁడు గన్పట్టె నింతుల కతనుఁ డనఁగ
అర్థులకుఁ గల్పకము, కాలుఁ డరుల కనఁగ.

25


గీ.

అమితగతులగు విషయభేదముల నొకని
చేత నుల్లేఖ మొదవినఁ జెలఁగు నదియు
గురుఁడు వచనంబులందున నరుఁడు గీర్తిఁ
జాపమున భీష్ముఁ డతఁడన్న చందమునను.

26

స్మృతి, భ్రాన్తి, సందేహాలంకారములు

గీ.

అలరు స్మృతి భ్రాంతి సందేహ పదములఁ
దగు నలంకారములు మూఁడు; తమ్మిఁజూచు
నాదు డెందంబు వికసితనలిననేత్ర
యాస్యమున కగ్గమయ్యెడి ననఁగ శర్వ.

27


ఆ.

ఈ ప్రమత్తమధుప మెఱిఁగెడి నీ మోము
పంకజం బఁటంచుఁ బంకజంబొ
యమృతకరుఁడొ నిర్ణయము లేదు మాకైన
ననఁగ లక్ష్యములు సుధాంశుమకుట.

28

అపహ్నుత్యలంకారము

అపహ్నుతి యనగా కప్పిపుచ్చుట. ఇది ఆరువిధములు – శుద్ధాపహ్నుతి, హేత్వపహ్నుతి, పర్యస్తాపహ్నుతి, భ్రాంతాపహ్నితి, ఛేకాపహ్నుతి, కైతవాపహ్నుతి.

గీ.

అన్యధర్మంబు నిలువ, లేదందు ధర్మ
మనిరయేని శుద్ధానహ్నుతి నెగడుఁ గృతి
నితఁడు గాఁడు సుధాంశుఁ డదేమి యనిన
వభ్రగంగాసరోరుహం బన్నయట్లు.

29


గీ.

అదియకద యుక్తిపూర్వక మయ్యెనేని

హేత్వపహ్నుతి యనఁగను గృతులఁ బేర్చుఁ
గాఁడు శశి తీవ్రుఁ, డర్కుండు లేఁడు రాత్రి
వనధిగర్భ సముత్థితౌర్వం బితండు.

30


క.

కృతి నగుఁ బర్యస్తాప
హ్నుతి పెరచోట నుపమానము నునుచుటకై ని
హ్నుతిఁ జేసినఁ గాఁ డితఁడు
సితకిరణుఁడు విధుఁడు ప్రేయసీ ముఖ మనగన్.

31


గీ.

భ్రాంతి వారింపబడెనేనిఁ బరుని శంకఁ
దేజరిల్లు భ్రాంతాపహ్నుతి యనఁ గృతులఁ
దాప పఱచెడి మిత్ర! సోత్కంపముగను
జ్వరమ? యది కాదు మరుఁ డన్న చందమునను.

32


గీ.

తేజరిల్లు ఛేకాపహ్నుతి పరశంక
వలనఁగద తధ్యనిహ్నవం బలరెనేని
రొద యొనర్చుచుఁ దవిలె మత్పదములందు
నధిపుఁడా? కాఁదు, నూపురం బన్నయట్లు.

33


గీ.

వ్యాజముఖపదముల నిహ్నవంబు నెగడఁ
గైతవాపహ్నుతి యఁటండ్రు కవిజనములు
కామినీజనదృక్పాతకైతవమున
నతను శరములు వెలువడు నన్న యట్లు.

34

ఉత్ప్రేక్షాలంకారము

క.

విదితము లుత్ప్రేక్షలు పెం
పొదవెడుఁ గావ్యములయందు నుక్తానుక్తా
స్పదమును సిద్ధాసిద్ధా
స్పదము ననన్ వస్తుహేతుఫలరూపమునన్.

35


గీ.

చక్రవాకీవియోగాగ్నిజనితధూమ
సమితి యని శంకచేసెదఁ దిమిరపటలి
తమము కురిసెడిఁబలె నుండె ఖగము గనియెడు
నంగము లలఁదునది బలె నంజనంబు.

36


గీ.

అవని మోచుటవలన సూయరుణములు భ
వన్మృదుపదాంబుజములు ధ్రువంబనంగఁ
ద్వన్ముఖాభేచ్ఛచేతఁ బద్మములతోడఁ
బగయొనర్చెడి యామినీభర్త యనఁగ.

37


గీ.

కట్టఁబడెనేమొ మధ్యంబు కనకదామ

ములను వక్షోజధారణంబునకు ననఁగఁ
ద్వత్పదైక్యము గనఁగఁ బద్మములు నీటఁ
దపము చేసెడి ననెడి చందమున శర్వ.

38


క.

వలెనను పదంబు మొదలుగఁ
దగ ధ్రువముగ శంకఁ జేసెదను నిశ్చయమన్
పలుకులతోఁ బాసిన వ
ర్తిలు గమ్యోత్ప్రక్ష యనఁగఁ గృతుల మహేశా.

39

అతిశయోక్త్యలంకారము

ఇది ఎనిమిది విధములు. రూపకాతిశయోక్తి, సాపహ్నవాతిశయోక్తి, భేదకాతిశయోక్తి, సంబంధాతిశయోక్తి, అసంబంధాతిశయోక్తి, అక్రమాతిశయోక్తి, చపలాతిశయోక్తి, అత్యంతాతిశయోక్తి.

గీ.

రూపకాతిశయోక్తి పేర్చు నుపమాన
మాత్రము వచించి వర్ణ్యంబు మాటిరేని
నల్ల దొవకవఁ గ్రొవ్వాడి నారసములు
వెలువడె ననంగ లక్ష్యమౌ నలికనేత్ర.

40


గీ.

అగు నవహ్నుతు గర్భత్వ మయ్యెనేని
నదియ సాపహ్నవాఖ్యయౌ యతిశయోక్తి
యుష్మదుక్తుల సుధ వెల్గుచుండ దాని
భ్రాంతు లీక్షించుదురు నిశాభర్తయందు.

41


గీ.

అన్యథా కౢప్తి యద్దాని కయ్యెనేని
భేద కాతిశయోక్తి నాఁ బెంపు మీఱు
వింత యీతని గాంభీర్యవిలసనములు
వింత యీతని ధీరతావిభవ మనఁగ.

42


క.

ఇంబడరు కావ్యములయో
గం బొదవకయుండ యోగకల్పనమైనన్
సంబంధాతిశయోక్తి పు
రిం బలుసౌధములు విధుని స్పృశియించెడి నాన్.

43


గీ.

యోగ మొదవుచునుండి సుయోగ మొదవ
కున్న మును చెప్పునదియయై యొప్పుఁ గృతుల
దాత వీ వగుచుండఁగ ధరణినాథ!
యాదరింపము దివిదద్రుమాలి నాగ.

44


గీ.

అక్రమాతిశయోక్తి ప్రఖ్యాతి కెక్కు
హేతుకార్యంబులకు సహవృత్తి గలుగ
జ్యాపరీరంభణైకదక్షత వహించె
నీ శరంబులు నీ శత్రునృపులతోడ.

45

గీ.

ఒప్పు కృతిఁ జపలాతిశయోక్తి కార
ణప్రసక్తిజకార్యమైనను, విభుండు
చనియెద నఁటన్నమాత్రనే చాన కయ్యె
వలయ ముంగరమన్నట్లు వామదేవ.

46


క.

ప్రియ మత్యంతాతిశయో
క్తి యనన్ మును కార్య ముప్పతిలఁ గారణమా
పయి నగుట, యింతి మానము
పయనంబాయెను బ్రియుండు పదపడి సనియెన్.

47

తుల్యయోగితాలంకారము

ప్రకృతగోచరతుల్యయోగిత

గీ.

వర్ణ్యములకు నితరవస్తువులకు ధర్మ
మొక్కటైన తుల్యయోగిత యగు
ముకుళితంబులయ్యె ముగ్ధాబ్జములు కుల
టాననములు నన్న యట్లు శర్వ!

48

అప్రకృతగోచరతుల్యయోగిత

గీ.

సఖియ! నీ మృదుతనుత దృష్టమగునేని
చిత్తమున నెవ్వనికిఁ బ్రకాశింపకుండు
కదళికామాలతీలతికాశశాంక
రేఖల కఠోరతయటన్న రీతి శర్వ.

49

తుల్యయోగిత

గీ.

ఆప్తరిపులందు వృత్తి తౌల్యమగునేని
నదియు నొక తుల్యయోగిత యండ్రు గృతుల
రాజ! నీచేత మిత్రశాత్రవుల కియ్యఁ
బడె నరిష్టం బనిన మాడ్కి ఫాలనేత్ర.

50


గీ.

ప్రాకటగుణాఢ్యుతోడ సమీకరించి
కృతి వచించినఁ దుల్యయోగతి యటండ్రు
లోకపాలురు వజ్రి, కాలుండు, వరుణుఁ
డర్థపతి నీవు నన్నట్లు నలికనేత్ర!

51

దీపకాలంకారము

క.

తనరారుఁ గృతుల దీపక
మన వర్ణ్యావర్ణ్యధర్మ మైక్యమయిన నా
మునను కలభము ప్రతాపం
బునను నృపాలుఁ డలరునన భుజగవిభూషా!

52

ఆవృత్తిదీపకాలంకారము

పదావృత్తిదీపకము

గీ.

పదము నర్థంబు నుభయ మిబ్బడిగఁ బలుక
త్రివిధమైయుండు నావృత్తిదీపకంబు
వారిదావళి దుస్సహవర్ష మయ్యె
వనిత కారేయి దుస్సహవర్ష మయ్యె.

53

ఉభయావృత్తిదీపకము

క.

వికసించెఁ గదంబంబులు
వికచత్వము నొందెఁ గుటడవృక్షోద్గమముల్
ప్రకటమదము లయ్యెం జా
తకములు శిఖులుం బ్రకటమదము లయ్యె నిలన్.

54

ప్రతివస్తూపమాలంకారము

క.

ఏపారుఁ గృతులఁ బ్రతి వ
స్తూపమవాక్యములు రెంటి కొకసమత తగన్
దాపమున నలరు సూర్యుఁడు
చాపంబున శూరుఁ డొనరు జగతి ననుక్రియన్.

55

దృష్టాంతాలంకారము

క.

కృతిబింబ ప్రతిబింబా
కృతిఁ దగ దృష్టాంత మగును నృప! నీవ సము
న్నతకీర్తిసమన్వితుఁడవు
సితకిరణుఁడు కాంతియుతుఁడు క్షితి ననుపోల్కిన్.

56

నిదర్శనాలంకారము

వాక్యార్థవృత్తినిదర్శనము

గీ.

అగు నిదర్శనసదృశవాక్యార్థములకు
నేకతారోపణ మొనర్చిరేని దాత
కెద్ది సౌమ్య యదియ పూర్ణేందునకును
నిష్కళంకత యన్నట్లు నిఖిలకృతుల.

57

పదార్థవృత్తినిదర్శనము

గీ.

ఒక్కటి పదార్థవృత్తి సంయుక్తిఁ దనరు
వేఱొకనిదర్శన యనంగ వినుతి కెక్కుఁ
దాలిచెడి నల్లకలువలఠీవి నీదు
కన్నుదోయి యనంగ లక్ష్యము మహేశ.

58

అసదర్థబోధనరూపనిదర్శనము

గీ.

కీడు మేలు నొండె క్రియచేత బోధింప
నదియు నగు నిదర్శనాఖ్య నొందు
రాజు వైరి చేటు ప్రకటించుఁ జీకటి
చందమామ యుదయమందుఁ జెడుచు.

59

సదర్థబోధనరూపనిదర్శనము

క.

ఉదయించునంతనే సం
పద నొసంగున్ భాస్కరుండు పద్మంబుల క
భ్యుదయములకు ఫలము సుహృ
త్సదనుగ్రహమే యటంచు సంబోధింపన్.

60

వ్యతిరేకాలంకారము

గీ.

మానుగ విషయివిషయులలో నొక్కఁ
డధికముగఁ జెప్ప వ్యతిరేక మనఁగఁబరగు
నగముల విధంబునను సమున్నతులుగాని
ప్రకృతి కోమలు లార్యు లన్నగిది శర్వ.

61

సహోక్త్యలంకారము

క.

తనరును సహోక్త్యలంకృతి
జనరంజన మగుచుఁ దనర సహభావం బా
తని కీర్తి యాక్రమించెను
ఘనశాత్రవకోటితోడఁ గకుబంతములన్.

62

వినోక్త్యలంకారము

హేయస్వరూపవినోక్తి

గీ.

ఇంచుకగు వస్తువును బాసి హీనముగను
బ్రస్తుతము పల్కఁబడెనేని రహి వినోక్తి
ప్రణుతి కెక్కును వినయసంపదను బాసి
హృద్యయయ్యును విద్య యవిద్య గాదె.

63

రమ్యస్వరూపవినోక్తి

గీ.

అల్పవస్తువు బాసి రమ్య మగునేని
నదియును వినోక్తి యనఁగఁ బ్రఖ్యాతి కెక్కు
ఖలజనంబులతోఁ బాసి యలరె మిగుల
నీభవత్సభ ధరణీతలేంద్ర వంద్య.

64

సమాసోక్త్యలంకారము

గీ.

ప్రస్తుతంబు వచింప నప్రస్తుతంబు
దోఁచెనేన సమాసోక్తి యేచుఁ గృతుల
ముద్దుఁ గొనియెడి నీయైంద్రి ముఖముఁ జూడు
రక్తుఁ డగుచున నిశీధినీరమణుఁ డనఁగ.

65

పరికరాలంకారము

క.

సాభిప్రాయవిశేషణ
మై భాసిల్లినను బరికరాలంకృతి నా
శోభిల్లు మాకు హిమధా
మాభరణుఁడు శివుఁడు తాప మడచు ననుక్రియన్.

66

పరికరాంకురాలంకారము

గీ.

అది యభిప్రాయయుతవిశేష్యముగఁ జెప్పఁ
బరికురాంకుర మనఁగను బ్రణుతి కెక్కు
భువిఁ జతుర్విధపురుషార్థములకు దాత
దేవుఁడు చతుర్భుజుండను ఠీవిఁ గృతుల.

67

శ్లేషాలంకారము

గీ.

అర్థములు రెండు ప్రకృతంబు లయ్యెనేనిఁ
దనరు నది ప్రకృతశ్లేష మనఁగఁ గృతులఁ
బ్రకృతమున నప్రకృతము చూపట్టెనేని
నదియ యప్రకృతశ్లేష మగు మహేశ.

68


క.

ప్రకృతార్థంబును మఱి య
ప్రకృతార్థముఁ దోఁచెనేని భాసిలుఁ బ్రకృతా
ప్రకృతశ్లేష యనంగను
ముకుటీకృతశిశిరకిరణ మునినుతచరణా.

69

ప్రకృతశ్లేష

గీ.

మమ్ము పుష్కరనేత్రుండు మాధవుండు
భువనరక్షణచతురాత్మభుజపటిష్ఠుఁ
డసమబాణాంతకుఁడు కలాసావతంసుఁ
డగనివాసుఁడు ప్రోవుత ననుదినంబు.

70

అప్రకృతశ్లేష / ప్రకృతాప్రకృతశ్లేష

గీ.

అబ్జసుందరముఖప్రవాళాధరోష్ఠి
కాంచనాభాంగి యచలోరుకటి యనంగ
నుచ్చలద్భూరికీలాలుఁ డొనరె వాహి

నీశ్వరుండను భంగినిఁ గృతుల శర్వ.

71

అప్రస్తుతప్రశంసాలంకారము

గీ.

ఎచటనేఁ బ్రస్తుతాశ్రయ మేని నదియ
జగతి నప్రస్తుతప్రశంస యనఁబరఁగు
ఖగకులమునందు సుకృతి యొక్కటియ యొరుని
వేఁడ దయ్యది దేవతావిభునిఁ దక్క.

72

ప్రస్తుతాంకురాలంకారము

గీ.

ప్రస్తుతం బగుదానిచేఁ బ్రస్తుతంబు
తనరె నేఁ బ్రస్తుతాంకుర మనఁగఁ బరఁగు
మాలతీలత గలుగంగ మధుప నీకుఁ
గంటకనిషేధకేతకీకాంక్ష యేల?

73

పర్యాయోక్తాలంకారము

గీ.

అమరభంగ్యంతరమున గమ్యార్థసిద్ధి
యది చెలంగుఁ బర్యాయోక్త మనఁగఁ గృతుల
వందనం బిదె యతని కెవ్వానిచే ము
ధాకృతము లయ్యె రాహువధూకుచములు.

74


గీ.

వ్యాజ్యమున నిష్టసాధనం బయ్యెనేని
నదియుఁ బూర్వోదితాలంక్రియయ యఁటందు
రిచట మీరిర్వు రుండుఁడి యేను మావి
గున్నఁ గనుగొని వచ్చెద నన్న మాడ్కి.

75

వ్యాజస్తుత్యలంకారము

గీ.

నిందచే స్తుతి స్తుతిచేత నింద దోఁప
నదియు వ్యాజస్తుతి యనంగ నలరుచుండు
గంగ నీకు వివేక మెక్కడిది? స్వర్గ
మందఁజేసెదు పాపాత్ములైన జనుల.

76


గీ.

మంచిదానవు దూతిక మంచిదాన
వింతకంటెను గర్తవ్యమేమి కలదు
అతనిశిత నఖదంతలూనాంగి వైతి
వెందువలన మదర్థమునందు హహహ!

77

వ్యాజనిందాలంకారము

గీ.

నిందచే నింద విస్ఫూర్తి నెగడెనేని
వ్యాజనింద యనంగఁ బ్రఖ్యాతి కెక్కు
నేమియనవలె విధిని మున్నేకశిరము

నలియఁజేసిన హరు నెన్నవలయుఁగాక.

78

ఆక్షేపాలంకారము

ప్రతిషేధాభాసము

గీ.

ఊహసేయుట వలన నిజోక్తవాఙ్ని
షేధ మాక్షేప మనఁగను జెలఁగుఁ గృతుల
గలువ చెలిచూపు నిన్నది గానినాఁడు
నున్నయది ప్రేయసీముఖం బన్నయట్లు.

79

నిషేధాభాసము

గీ.

బుధజనులు నిషేధాభాసమును వచింతు
రింపు మీఱంగ నాక్షేపమే యఁటంచు
దూతికను గాను కాలాగ్నితుల్య మౌను
దాని తనుతాప మనియెడి దారి శర్వ.

80

భ్యంగ్యంతరము

గీ.

తనరుచుండంగ విధి, నిషేధము తిరోహి
తముగ వేఱొక యాక్షేపణమగుఁ గృతులఁ
జనుము చనియెదవేని నచ్చటనె నాకు
జవన మయ్యెడుఁ గాంత! యన్ చందమునను.

81

విరోధాభాసాలంకారము

క.

తనరు విరోధాభాసం
బనఁ గృతుల విరోధమునకు నాభాసత గల
ల్గిన, హారములను బాసియు
ననృతోదరి నీ కుచములు హారులుగావే.

82

విభావనాలంకారము

గీ.

కారణము లేక కార్యంబు గలుగఁజెప్ప
నది విభావన యనఁగఁ బ్రఖ్యాతి గాంచుఁ
దరుణి లాక్షారసానిషిక్తములు గాక
యరుణములు నీదు చరణంబు లన్నయట్లు.

83


ఆ.

హేతువులకు బలిమి యెనయకుండినఁ గార్య
మొదవఁ జెప్ప నదియె యొప్పుఁ గృతులఁ
గాయజుం డతీక్ష్ణకఠనాస్త్రములచేత
గెలుచుచున్నవాఁ డఖిలజగములు.

84


గీ.

కార్య మొదవినఁ బ్రతిబంధకంబు గలుగ

నది తృతీయవిభావన యండ్రు గృతుల
దొరల తలమానికమ! నరేంద్రులనె కఱచు
చున్నయది యుష్మదీయఖడ్గోరగంబు.

85


గీ.

కార్య మొదవిన యెడల నకారణమున
నాల్గవవిభావన యనం దనర్చుఁ గృతుల
గలిత వీణారవంబు శంఖంబువలన
జననమందెడి నిది వింత యను విధమున.

86


గీ.

అతిరుద్ధమువలనఁ గార్యంబు గలుగ
నదియు నొక్కవిభావన యనఁగఁ దనరుఁ
దాపమందఁగఁ జేసెడి తన్వి నహహ
శీతలాంశుని కరములన్ రీతి శర్వ.

87


గీ.

కారణము కార్యము వలనఁ గలిగెనేని
వేఱొకవిభావన యటండ్రు విబుధవరులు
నీకరంబను కల్పకానోకహంబు
వలనఁ బుట్టె మహాకీర్తి వారిరాశి.

88

విశేషోక్త్యలంకారము

గీ.

కారణము పుష్కలంబుగాఁ గలుగు కార్య
ముద్భవింపమి యగు విశేషోక్తి యనఁగ
అహహ! స్నేహక్షయంబు గాదయ్యె మదిని
విపులమన్మథదీపంబు వెలుఁగుచుండ.

89

అసంభవాలంకారము

గీ.

అర్థనిష్పత్త్యసంభావ్యతానువర్ణ
నం బసంభవ మనఁగఁ దనర్చుఁ గృతులఁ
గోపబాలుండు దానిట్లు కొండయెత్తఁ
గలఁడనుచు నెవ్వఁ డెఱుఁగునన్కరణి శర్వ.

90

అసంగత్యలంకారము

గీ.

అవు నసంగతి కార్యహేతువుల కతివి
రుద్ధతయు భిన్నదేశత రూఢమైన
వనధరమ్ములు విషము ద్రావంగఁ బధిక
కామినులు మూర్ఛ చెందిరన్ కరణి శర్వ.

91


ఆ.

అగు నసంగతి యనునది యొక్కచోఁ జికీ
ర్షితము నితరమునకుఁ జేసెనేని
క్షితి నపారిజాతఁ జేయంగబూని స్వ
ర్గము నపారిజాతము సలిపితి.

92

గీ.

ఒకటి సేయంగఁబూని దానికి విరోధ
కరము నొనరించటయు నసంగతి యనఁబడు
నతఁడు గోత్రోద్ధరణము సేయంగఁబూని
సలిపె గోత్రోద్దలనమని పలుకునపుడు.

93

విషమాలంకారము

గీ.

తగని వస్తుద్వయంబు సందర్భ మెచట
నైనఁ వర్ణింపబడెనేని నదియ విషమ
మనఁగఁ దగు నీ శిరీషమృద్వంగి యేడ
నిట్టి చేతోభవజ్వరం బేడ ననఁగ.

94


గీ.

అగు విరూపకార్యోత్పత్తి యయ్యెనేని
నపరవిషమంబు ధరణీశ్వరావతంస
ధవళకీర్తిని నీనెడిఁదావకీన
మేచకకృపాణి యన్నట్లు మృగధరాంక.

95


గీ.

ఇష్టసంసిద్ధిఁ గోర ననిష్టసిద్ధి
యయ్యెనే న్విషమాహ్వయం బనఁగఁ బరఁగుఁ
గొక్కు భక్ష్యాశ ఫణి పేటిఁ గొఱికి దాని
చేత భుజియింపఁబడినట్లు శేషభూష.

96

సమాలంకారము

గీ.

పొగడఁబడె నేస్థలంబునఁ దగినవస్తు
యుగ మది సమం బనంగను నెగడుఁ గృతుల
నమలహారంబుచేత నాత్మానురూప
మందిరము సేయఁబడెఁ గుచమండలంబు.

97


ఆ.

కారణంబుతోడఁ గార్యమునకు సరూ
పత లభింపఁ జెప్పఁబరఁగు సమము
నీరజాత వగుట నీచప్రవణత నీ
కుచితమౌనుగద పయోజసదన.

98


ఆ.

ఇష్టసిద్ధి యగుట నిష్టంబు లేకుండ
యదియు సమవిభేదమండ్రు బుధులు
వారణంబు గోరువాని కర్హముగాదె
ద్వారమందుఁ గలిగె వారణంబు.

99

చిత్రాలంకారము

గీ.

క్షితిని విపరీతఫలవాంఛచేతఁ దత్ప్ర
యత్న మగునేని నది చిత్ర మనఁగఁ బరఁగు
నమ్రులై యుండెదరు సజ్జనంబు లెల్ల

ముజ్జగంబులకంటె సమున్నతిఁ గన.

100

అధికాలంకారము

గీ.

తోరమైన యాధారవస్తువులకంటె
ఘనత యాధేయమునకుఁ గూర్చిన నధికము
నలువ యెయ్యెడనో నీట ములుఁగు నచట
ములుఁగఁబడవు భవద్గుణంబులను కరణి.

101


గీ.

ఎంతపెద్దది యాధేయ మంతకంటె
నధిక మాధారమగుటయు నధికమయ్యె
నెంతపెద్దదొ వాగ్బ్రహ్మ మెన్నరాని
నీ గుణంబులు దనలోను నింపెననఁగ.

102

అల్పాలంకారము

గీ.

అలఁతి యాధేయమునకంటె నల్పభావ
మధిక మాధారమున కది యల్ప మగును
ఇపుడు నీకేల నూర్మికజపవటాయ
మాన మగుచున్నయది యనుమాడ్కి శర్వ.

103

అన్యోన్యాలంకారము

గీ.

భ్రాజిలుఁ బరస్పరోపకారముగఁ జెప్ప
నది కృతులయందు నన్యోన్య మనెడు పేర
రాత్రి శశిచేఁ బ్రకాశించు రాత్రిచేత
శశి ప్రకాశించు నన్నట్టి చందమునను.

104

విశేషాలంకారము

గీ.

తనరును విశేష మాధారమునను బాసి
నపుడు నాధేయ వర్ణన మయ్యెనేని
నర్కుఁ డరుగ దీపస్థము లగుచుఁ దత్క
రము లిరులఁ దున్మెడి ననంగ రాజమకుట.

105


గీ.

అదియును విశేషముఁ బెక్కులైన యట్టి
యెడల నొకవస్తు వగ్గింపఁబడినయేని
వెలుపలను లోన ముందర వెనుక నన్ని
దెసలఁ గానబడియె నన్నతెఱఁగున శివ.

106


గీ.

అల్పయత్నముచేత శక్యంబుగాని
యన్యవస్తువు సమకూర్ప నదియె యగును
నిన్నుఁ గనుఁగొను నాచేత నేడు లబ్ద
మయ్యెఁ గల్పద్రుమేక్షణం బన్నయట్లు.

107

వ్యాఘాతాలంకారము

గీ.

ఒక్కవిధమైనదాన వేఱొక్కపనికి
సర్వముగఁ జేయ వ్యాఘాత మండ్రు దాని
నెవ్వి జగమున కింపగు నవ్వు హింస
సలువ కరణములుగఁ బంచశరుఁ డొనర్చె.

108


గీ.

అభిమత నిమిత్తమని పల్కునదె విరుద్ధ
మైన నదియును వ్యాఘాత మండ్రు బుధులు
నేను బాలుఁడ నని దయ నీకుఁ గలిగె
నేని నను విడనాడుట యెట్లు గూడు.

109

కారణమాలాలంకారము

గీ.

వరుస దప్పని కారణావళులతోడఁ
గీలు కొల్పినఁ గారణమాల యగును
నీతిచే సిరి సిరిచేత దాతృతయును
దాతృతను భూరియశ మన్నరీతి శర్వ.

110


క.

నరకములు పాపమునఁ జే
కుఱుఁ బాపము లేమిచే నగును లేమి పరి
స్ఫురణం బీకుండుటచేఁ
బరఁగు నటులుగాన దానపరుఁడవు గమ్మా.

111

ఏకావళ్యలంకారము

గీ.

అలరును గృహీతముక్తరీత్యర్థపంక్తి
యగుచు నేకావళి యనంగ నఖిలకృతుల
దీనికి వచింతు లక్ష్యంబు దెలియ వినుము
శైలజానాథ! ప్రమథసంచయసనాథ!

112


గీ.

కన్ను లాశ్రవణాంతదీర్ఘములు శ్రవణ
ములు భుజనికాయభావితంబులు భుజములు
జానులంబముల్ జానువు ల్చారుముకుర
సదృశములు చోళ వసుమతీశ్వరున కనఁగ.

113

మాలాదీపకాలంకారము

గీ.

దీపకైకావళీసంగతిం దనర్చి
ఖ్యాతి కెక్కు మాలాదీపకం బనంగ
స్మరుఁడు వసియించెఁ దన్మానసమున దాని
మనసు నీయందు వర్తించె నను విధమున.

114

సారాలంకారము

గీ.

సారమను పేరుగల యలంకార ముత్త
రోత్తరోత్కర్షగతి నొప్పుచుండుఁ గృతుల
దేనె యమృతంబు మధురము ల్వానికంటెఁ
గవిజనంబుల పలుకు లన్కరణి శర్వ.

115

యథాసంఖ్యాలంకారము (క్రమాలంకారము)

గీ.

వరుసనే క్రమికాసమన్వయము గలుగ
నది యథాసంఖ్య మనఁగఁ బెంపారుఁ గృతుల
నహితకోటుల నాప్తుల నాపదలను
గెలుము రంజిల్లఁజేయుము గెడపు మనఁగ.

116

పర్యాయాలంకారము

గీ.

తనరుఁ బర్యాయ మొకవస్తువున కనేక
సంశ్రయతభాతిచేతను సంభవింపఁ
దమ్మి విడిచి సుధాకరుఁ దవిలెఁ గామి
నీ ముఖప్రభ యన్నట్లు నీలకంఠ.

117


గీ.

ఒక్కట ననేక మగునేని నొప్పుచుండు
నదియు వేఱొకపర్యాయ మనఁగఁ దొల్లి
ఎచట జనియించెను బ్రవాహ మచట నిప్పు
డిసుకతిన్నియ యన్న ట్లహీనభూమ.

118

పరివృత్త్యలంకారము

గీ.

కావ్యములయందు న్యూనాధికముల వినిమ
యంబు పరివృత్త్యలంకృతి యండ్రు బుధులు
ఏకవిశిఖంబు విడిచి గ్రహించె నాతఁ
డరినృపాలకలక్ష్మీకటాక్షములను.

119

పరిసంఖ్యాలంకారము

గీ.

ఒక్కచోట నిషేధించి యొకట వస్తు
యంత్రణము సేయఁ బరిసంఖ్య యనఁగఁ బరఁగు
లేదు స్నేహక్షయంబు నాళీకముఖుల
డెందములయందు దీపములందుఁ గాని.

120

వికల్పాలంకారము

గీ.

కృతిఁదగు వికల్పమను నలంకృతి సమాన
బలములకు విరోధంబు గలుగుచుండ
మస్తకము లొండె విడ్లొండె మనుజనాథు

లపుడు వంతురు గాక యన్నట్టు లీశ.

121

సముచ్చయాలంకారము

ఆ.

యౌగపద్యభాజనావళీగుంభనం
బైన నది సముచ్చయం బటండ్రు
సమయుదురు గనుదురు జాఱిపోదురు పాఱు
దు రని నీ రిపు లన నురగభూష.

122


గీ.

ఏకమగు కారణముచేత నెనయు కార్య
మునకు బహుకారణము లుంపనొనరు నదియుఁ
గులము రూపును వయసును గలిమి విద్య
యితని మత్తిల్లఁజేసెడి నెంతయు నన.

123

కారకదీపకాలంకారము

క.

తనరును గారకదీపక
మనఁ గ్రమికైకగతగుంభనమైనను గృతులన్
జనియెడిఁ గ్రమ్మర వచ్చెడిఁ
గనియెడిఁ బాంథజనుఁ డడుగఁ గడఁ గెడి ననఁగన్.

124

సమాధ్యలంకారము

గీ.

కార్యసుకరత వేఱొక్కకారణాప్తి
వలనఁ గలుగ సమాధినా నలరుఁ గృతులఁ
గులట వాంఛను బొందె నర్కుఁడును గ్రుంగె
ననెడు చందాన శైలకన్యాసహాయ.

125

ప్రత్యనీకాలంకారము

గీ.

ప్రబలతరనిజశాత్రవపక్షవర్తి
నిరసనముసేత యగు ప్రత్యనీక మనఁగ
తన్ను గెలిచిన చూడ్కుల దాకియున్న
చెవుల నుత్పలములు క్రిందుఁ జేసికొనియె.

126

కావ్యార్థాపత్త్యలంకారము

క.

ఏపారుచుండుఁ గావ్యా
ర్థాపత్తి యనంగఁ గృతులయందును గైము
త్యాపాదితార్థసిద్ధత
శ్రీపర్వతదుహితృరమణ శేషాభరణా!

127


గీ.

శక్రనీలతిరస్కారచారుచికుర
గెలిచితివి నీముఖంబుచే జలజరిపునిఁ
బంకజంబుల వార్తఁ జెప్పంగనేల

యనెడుచందాన శైలకన్యాసహాయ.

128

కావ్యలింగాలంకారము

గీ.

సాధనీయార్థసిద్ధికి సాధనంబు
కావ్యలింగ మనంగఁ బ్రఖ్యాతి కెక్కు
మనసిజుఁడు గెల్వబడియెడు మన్మనంబు
లో నిలిచియున్నవాఁడు త్రిలోచనుండు.

129

అర్థాంతరన్యాసాలంకారము

గీ.

సర్వసామాన్యమును విశేషంబు నుక్తి
యమర నర్థాంతరన్యాస మనఁగఁ బరగు
నాంజనేయుఁడు లంఘించె నంబురాశి
యహహ! దుస్తర మెద్ది మహాత్ములకును.

130


గీ.

అల్పవస్తువైన నధికగుణాఢ్యసం
బంధమునను గౌరవంబు గాంచు
కుసుమమాలతోడఁ గూడుటచేఁ గాదె
త్రాడు తలలచేతఁ దాల్పఁబడియె.

131

వికస్వరాలంకారము

గీ.

సరవిగా విశేషసామాన్యములు విశే
షంబులును వికస్వరం బనఁబడు
నతఁ డజయ్యుఁ డయ్యె నట్లనౌ గంభీరు
లప్రధృష్యు లగుదు రబ్ధు లట్ల.

132

ప్రౌఢోక్త్యలంకారము

గీ.

ఎసగు ప్రౌఢోక్తి యుత్కర్ష హేతుతావి
హీనమైనది యతిశయహేతు వనినఁ
దరుణి కురులు కళిందజాతటతమాల
సముదయశ్యామలము లనుచందమునను.

133

సంభావనాలంకారము

గీ.

ఎనయు నీకార్య మిది యయ్యెనేని ననెడు
నూహ సంభావన యనంగ నొప్పుఁ గృతుల
నహికులాధీశ్వరుఁడు వక్త యయ్యెనేని
నెన్నఁదగు నీదు సుగుణంబు లన్నయట్లు.

134

మిథ్యాధ్యవసిత్యలంకారము

గీ.

అల్పతరమైన యట్టి మిథ్యాత్వసిద్ధి
కన్యమిద్యార్థకల్పనం బయ్యెనేని

నగును మిథ్యాధ్యవసితి యార్యను భజించు
ది నభస్స్రజ మూనుచు నన్నకరణి.

135

లలితాలంకారము

గీ.

ప్రస్తుతం బగుచుండ వర్ణ్యవచనార్థ
మపుడు ప్రతిబింబవర్ణనం బయ్యెనేని
లలితమన నలరుచునుండు జలము దొలఁగఁ
గట్ట గట్టెడి నిది యను కరణి ధరణి.

136

ప్రహర్షణాలంకారము

గీ.

అప్రయత్నంబుచే వాంఛితార్థసిద్ధి
యయ్యెనేనిఁ బ్రహర్షణం బనఁగఁ బరఁగు
దానిని మనంబునందునఁ దలఁచుచుండ
నదియె దూతికయై చనె నతనికొఱకు.

137


గీ.

అన్యగతి వాంఛితాభ్యధికార్థసిద్ధి
యును బ్రహర్షణాలంకార మనిరి కృతుల
నెంతవడి దివ్వె వెలిఁగించె నంతలోన
నర్కుఁ డభ్యుదితుండయ్యె ననఁగ శర్వ.

138


గీ.

అభిమతార్థ ముపాయ సిద్ధ్యర్థయత్న
మునను సాక్షాత్కరించినఁ దనరు నదియ
కోరి నిధ్యంజనౌషధివేరు ద్రవ్వు
నతనిచే నిధి సాధితంబయ్యె ననఁగ.

139

విషాదనాలంకారము

గీ.

అభిమతార్థంబునకు విరుద్ధార్థసిద్ధి
యైనను విషాదనం బన నలరుఁ గృతుల
నెంత వడి దివ్వె వెలిగించె నంతలోన
నది నశించె ననంగ లక్ష్యము మహేశ.

140

ఉల్లాసాలంకారము

గీ.

ఒప్పు నుల్లాస మన్యునం దొక్కనిగుణ
దోషములచేత నవి రెండు దొరలెనేని
నన్ననఘఁ జేయుఁగాత స్నానం బొనర్చి
సాధ్వి యని యిచ్చగించెడు జహ్నుకన్య.

141


గీ.

కఠినత కుచంబులకుఁ జేసెఁగాక చరణ
ములకు నీఁడయ్యె మార్దవంబునె యొసంగె
నకట యిట్లేల చేసెనో యంబుజభవుఁ

డనుచు నిందించు నీ ధాటి యరివధూటి.

142


గీ.

సజ్జనుని నాశ్రయింపదు స్వాపతేయ
మాయభాగ్యంబు దానిదే యరసి చూడ
వధము లేకున్కి నీదు సేవకజనులకు
పరమలాభంబు గాదె భూపాలవర్య!

143

అవజ్ఞాలంకారము

గీ.

వానిచే నవి రెండు గావేనిఁ గృతుల
నది యవజ్ఞ యనంగఁ బ్రఖ్యాతికెక్కుఁ
దోయ మల్పముఁ జెందెడిఁ దూము వారి
రాశి చెందియు నన్నట్లు రాజమకుట
తన యుదయమందు నిద్రించు తామరసము
లట్లయిన చంద్రనకు నేమి హాని యభవ.

144

అనుజ్ఞాలంకారము

గీ.

గుణ మచటఁ జూచిఁ దోషంబు గోరెనేని
నది యనుజ్ఞ యనంగఁ బ్రఖ్యాతికెక్కు
నాపదలె యుండుఁగాక మా కనయమును వి
పత్తులను శౌరి కీర్తింపఁబడు ననంగ.

145

లేశాలంకారము

క.

సముచితవృత్తిని దోషగు
ణములకు గుణదోషకల్పనము గల్గిన గా
వ్యములన్ లేశాలంకా
ర మనం బ్రఖ్యాతికెక్కు రాజవతంసా.

146


గీ.

వలసి నట్టులు దిరుగు నఖిలవిహంగ
రాజియందున రాజకీరంబ నీకుఁ
గటగటా! పంజరంబునఁ గట్టువడుట
యనుపమములైన మధురవాక్యముల ఫలము.

147

ముద్రాలంకారము

గీ.

ప్రణుతి కెక్కును బ్రకృతార్థపరపదాళి
చేత సూచ్యార్థసూచన చేయ ముద్ర
హరుని కీర్తించుచున్నవాఁ డతఁడు వినుము
సాటి లేనిది సువ్వె యీ తేటగీతి.

148

రత్నావళ్యలంకారము

క.

కృతి రత్నావళి దనరు ప్ర

కృతార్థసంచయము వరుసఁగీలు కొలిపినన్
జతురాననుండు లక్ష్మీ
పతి సర్వజ్ఞుండు నీవ పార్థివ యనఁగన్.

149

తద్గుణాలంకారము

క.

స్వగుణత్యాగంబున న
న్యగుణావ్యాప్తి యగునేని నది తద్గుణమౌఁ
దొగకంటి నత్తు ముత్తెము
పగడమువలెఁ దోఁచె నధరభాభాసితమై.

150

పూర్వరూపాలంకారము

క.

తనరారుఁ బూర్వరూపము
పునరాత్మగుణాప్తియైనఁ బురహరకంఠాం
శు నిలిప్తుఁడయ్యు నీ యశ
మున శుభ్రశరీరుఁడయ్యె భుజగేంద్రుఁ డనన్.

151


గీ.

వస్తువు వికృతమైన పూర్వదశ జెడక
యమరుటయు పూర్వరూపభేద మగుచుండు
దీప ముపశమితంబైనఁ దేజరిల్లె
మున్నువలె మేఖలారత్నములు వెలుంగు.

152

అతద్గుణాలంకారము

క.

జానొందు సంగతానుగు
ణానంగీకృతి యతద్గుణాలంకినాఁ
జాన! చిరరాగయుతవును
మానసహితవు నయియుండి మనసీవుగదే.

153

అనుగుణాలంకారము

గీ.

అనుగుణంబగుఁ బూర్వసిద్ధాత్మగుణము
అన్యసన్నిధివలనఁ బెంపందెనేని
నల్లతొవలు కటాక్షేక్షణములచేత
నధికనీలిమఁ దాల్చెడు నన్నయట్లు.

154

మీలితాలంకారము

గీ.

మీలితంబగు భేద మేమియును సమత
వలనఁ గానంగబడదేని వామనయన
కానఁబడ దించుకేని లాక్షారసంబు
సహజశోణమ్ములైన నీ చరణములను.

155

సామాన్యాలంకారము

గీ.

అమరు సామాన్యమన విశేషము సదృశత
కంటెఁ జూపట్టదేని సత్కావ్యములను
దమ్మికొలఁకుల దాఁకొన్న తలిరుఁబోండ్ల
యాననము గుర్తుపట్టరా దనిన కరణి.

156

ఉన్మీలితాలంకారము

గీ.

భేదవిస్ఫురణంబు గల్పించుచుండఁ
దనరుఁ గృతులందు నున్మీలితం బనంగ
నీయశోలగ్నమైన దానిఁగ హిమాద్రి
నమరు లెఱిఁగెద రివముచే ననువిధమున.

157

విశేషాలంకారము

క.

అలరు విశేషక మనియెడు
నలంక్రియ విశిష్టభావ మలరుచునుండన్
నెలవొడమఁ దెలియఁబడియెడు
జలజంబులు నెమ్మొగములు జనుల కనుక్రియన్.

158

ఉత్తరాలంకారము

గూఢోత్తరము

గీ.

గూఢమగు నుత్తరంబు సాకూతమైన
నాయలంకార ముత్తరం బనఁగఁ బరఁగు
పాంథ! యా ప్రబ్బపాదయున్న పట్టునందు
నీతరంగిణి దాఁటుట యెల్లిదమన.

159

చిత్రోత్తరము

క.

పరఁగుఁ గృతులందు ప్రశ్నో
త్తర మనఁగ నలంక్రియావతంసము ప్రశ్నో
త్తరము లొకటైన నెద్దీ
శ్వరవాహన మనఁగ సరససమ్మత మగుచున్.

160


గీ.

కృషికు లెద్దాని వాంఛింతు రెల్లయప్డు?
వక్క నెద్దాన నొక్కంగ వలయు చెపుమ?
పంటనని యుత్తరము చెప్పువాఁడ! సఖుఁడ!
రెండిటికి నది యొక్కటే లెక్కగాను.

161

సూక్ష్మాలంకారము

గీ.

ఒరుల యాశయ మెఱిఁగిన యొరులు సేయు

సరససాకూతచేష్ట సూక్ష్మ మనఁబరఁగు
నేను చూచుచునుండ నా యింతి తనదు
కచములను మౌళిరత్నంబు గప్పె ననఁగ.

162

పిహితాలంకారము

గీ.

ఇతరగూఢప్రవృత్తి దా నెరిఁగినట్టు
దెలుపు చేష్ట పిహిత మన దెలియఁబడును
దయితుఁడు గృహంబునకుఁ బ్రభాతమున రాఁగఁ
దల్పకల్పన యొనరించె దరుణి యనఁగ.

163

వ్యాజ్యోక్త్యలంకారము

గీ.

ఆత్మకృతచిహ్నగోపనం బమరఁ గార
ణాంతరము దెల్ప వ్యాజోక్తి యనఁగ నమరు
గంటివె యిప్పుడే చెలి! యింటిదోఁట
లోని కెంధూళి పడియె నామేన ననఁగ.

164

గూఢోక్త్యలంకారము

గీ.

ఒకని యుద్దేశమునను వేఱొక్కదాని
నుగ్గడించుట దనరు గూఢోక్తి యనఁగ
నొరుని చేనున నీవు మేయుట పొసఁగునె
వృషభమా! దాని కర్షకుం డేఁగుదెంచె.

165

వివృతోక్త్యలంకారము

గీ.

శ్లిష్టగుప్తము కవి వివేచించి దెలుప
నదియ వివృతోక్తి యనుపేర నమరుఁ గృతుల
వృషభమా! పరక్షేత్రంబు విడిచి తొలఁగు
మని ససూచనముగఁ జెప్పె నన్నయట్లు.

166

యుక్త్యలంకారము

గీ.

పరుని వంచించి మర్మగోపనము క్రియను
జేయునది యుక్తియని వివక్షింపఁబడియె
యింతి నీ రూపు వ్రాయుచు నితరుని గని
చేతఁ బూవిల్లు లిఖియించె శీఘ్రమె యన.

167

లోకోక్త్యలంకారము

క.

తనరును లోకోక్తి యనన్
జను లాడెడు నుడువులట్ల సత్కృతులం జె
ప్పిన యేనియుఁ గొన్నినెల
ల్కనుగవ మూసికొనియుండు కలికి యనంగన్.

168

ఛేకోక్త్యలంకారము

గీ.

కథితలోకోక్తి యన్యార్థగర్భితమయి
కృతుల ఛేకోక్తి యనఁగ సమ్మతికి నెక్కు
బన్నగము పాదములజాడఁ బన్నగంబ
యెఱిఁగెడు ననంగ లక్ష్య మహీనభూష.

169

వక్రోక్త్యలంకారము

గీ.

అవును వక్రోక్తిశ్లేష కాకువులచేత
నమర నపరార్థకల్పనం బయ్యెనేని
సూరకవి వేలు పెవ్వఁడు? సోముఁ డుత్ప
లాప్తుఁడా? కాఁడు గౌరీసహాయుఁ డనఁగ.

170

స్వభావోక్త్యలంకారము

గీ.

అగు స్వభావోక్తి జాత్యాదులందుఁ గల స్వ
భావ మెంతేని వర్ణింపఁబడియెనేని
హరిణములు చూచె నుత్తరంగాక్షములను
స్తబ్దకర్ణము లగుచు నన్చందమునను.

171

భావికాలంకారము

గీ.

అలరు భావక మనఁగ గతాగతార్థ
ములు పదంపడి ప్రత్యక్షముగ వచింప
నిప్పటికి నేను జూచెద నిచట దివిజ
దనుజు లని యొనరించెద రనిన మాడ్కి.

172

ఉదాత్తాలంకారము

గీ.

శ్లాఘనీయంబు నన్యోపలక్షణంబు
నైన చరితం బుదాత్తమై యతిశయిల్లు
నా హరకిరీటులకు యుద్ధ మయ్యె నెచట
నదియ యిది యను చందాన నహివిభూష.

173

అత్యుక్త్యలంకారము

గీ.

తనరు నత్యుక్తి యద్భుతాతధ్యశౌర్య
వితరణాదికవర్ణనాన్వీత మగుచు
దాత నీ వగుచుండఁగ ధరణినాథ!
యాచకులు కల్పశాఖు లన్నట్లు కృతుల.

174

నిరుక్త్యలంకారము

గీ.

అధికయోగమువలన నన్యార్థఘటన
నామములకైనను నిరుక్తి నా నెసంగు

నీదృశచరిత్రములచేత నే నెఱిఁగెద
నీవు దోషాకరుండవు నిజ మనంగ.

175

ప్రతిషేధాలంకారము

గీ.

కృతిఁ బ్రసిద్ధనిషేధానుకీర్తనంబు
పనుపడినయేనిఁ బ్రతిషేధ మనఁగఁ బరఁగు
గితవ! యతిశితసాయకక్రీడనబు
గాన కాదిది జూద మన్కరణి శర్వ!

176

విధ్యలంకారము

గీ.

సిద్ధమగు నర్థమును వెండిఁ జెప్పిరేని
విధ్యలంకృతి యనంగను వినుతిఁ గాంచుఁ
బంచమం బెత్తుగడ చేయఁబడియెనేనిఁ
గోకిలం బప్పు డవుఁగదా కోకిలంబు.

177

హేత్వలంకారము

గీ.

కార్యకారణములు రెండు గలియఁ బలికె
నేని యది హేత్వలంకృతి నా నెసంగు
నుదయ మందెడు నీశశి మదవతీక
దంబమానము ల్విచ్చు చెయ్దంబు కొఱకు.

178


గీ.

కార్యకారణములకు నైక్య మగునేనిఁ
గృతులఁ గొందఱు హేత్వలంకృతియ యండ్రు
సత్కవులకున్ రామావిలాసములు వేంక
టేశ్వరకటాక్షము లనంగ నిందుమౌళి.

179


క.

ప్రాచీనుల మతములు న
ర్వాచీనుల మతములు గని గ్రంథముగా నా
లోచించి శతాలంకృతి
వాచకముగఁ జేయఁబడియె భర్గుని కరుణన్.

180

గద్యము
ఇది శ్రీమదశేషమనీషిహృదయంగమ మృదుపదరనీంధ్ర శుద్ధాంధ్ర
రామాయణఘటనావైదుషీధురంధర అడిదము బాల
భాస్కరకవితనూభవ సరసకవిత్వవైభవసౌ
జన్యనిధాన సూరయాభిధానప్రణీ
తం బైనచంద్రాలోకంబునందు
సర్వంబు నేకాశ్వాసము.