Jump to content

చంద్రభానుచరిత్రము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చంద్రభానుచరిత్రము

పంచమాశ్వాసము

క.

శ్రీయోగ [1]స్త్రీయోగప, గాయితరోమాంచభూషణనిరీక్షణ యా
మ్నాయమయభాషణ కృతా, ధ్యాయస్మృతరూపధేయ దత్తాత్రేయా.

1


వ.

అవధరింపు మాసమయంబున.

2


సీ.

పరవాహినీవిజృంభణము మానుచు మేటి నిర్ణిద్రశరసమున్మేషవేది
చనుదెంచు రాజహంసముల నేలెడుఱేఁడు కువలయమోదానుకూలవృత్తి
కమలాధివాసమై కనుపట్టుగుణశాలి మిత్రనిర్వ్యాజలక్ష్మీవిధాయి
సత్పరంపరకుఁ దేజంబు గూరుచుపెద్ద యతులవిధుప్రసాదైకపాత్ర
మఖలభువనంబుపంకంబు లడఁచుసుకృతి, సకలఫలవైభవంబు లొసంగుదాత
చంచలారంభములు లేనిచారుమూర్తి, జగతి మించె శరత్కాలచక్రవర్తి.

3


చ.

సరసవనాంతరాళవికసద్విషమచ్ఛదధూళికాపరం
పరలు మరుత్ప్రచారములఁ బైపయి నంబరవీథిఁ బర్వి పాం
డరజలదప్రకాండము లనంగఁ గనుంగొననయ్యెఁ గానిచో
గరిమ వహించునే యవి జగజ్జనరూఢసితాభ్రసంజ్ఞలన్.

4


చ.

సరసిజపాంసుసంవలితసైకతము ల్విలసిల్లునేఱులన్
శరదృతుభర్త నీరమయశాటిఁ దెరల్చినఁ జంద్రకావియ
స్తరులమఱుంగులం దగునితంబములో యనఁ బ్రాంతసీమఁ ద
త్కరనఖరాంకరేఖ లనఁగాఁ దెరతాఁకుడుజాడ లింపగున్.

5


మ.

అకరు ల్నిప్పులు తావిపుప్పొడి సముద్యద్దూపచూర్ణంబు కే
ళికరాళీప్రకరంబు, ధూమము మరాళీపక్షము ల్తాలవృం
తకము ల్గాఁ దగు రాజహంసతతిచెంతం బద్మిను ల్పూనుధూ
పకరండంబులువోలె సామిదళితాబ్జంబుల్ సరోవీథులన్.

6


క.

శరములు గావున మీఁద, న్నురువులు నెలకొల్పె ననఁగ నుతిఁ గని హరిదం
తరములఁ బూచినకనుములు, వరఁగె న్వలరాజు జల్లిబల్లెము లనఁగన్.

7

గీ.

దరుల విచ్చిన కపురంపుఁదరుల పొరల, నురలు గంబూరములు గాలికుప్పరంబు
లెగయఁదగు నేర్లు తమనీటి కగుకలంక, లడఁచుమౌనికి నుడుగర లనిపె ననఁగ.

8


చ.

అలయతిమాత్రవృష్టిసమయంబున నెప్పటియట్ల ధాత్రిపైఁ
గలయఁగఁ బర్వలేక శశికాంతి సభస్స్థలియందపేరి యా
జలదపువేళ రూపఱిన స్వచ్ఛతనుచ్చట గాననయ్యె నా
నలరె శరద్ఘనంబులు సితాంబుజపారదనారదచ్ఛవిన్.


ఉ.

బాహుల మీగతిన్ ధరణిభాగమున న్నెఱిఁ జూపుచుండ వై
వాహికలగ్నయోగ్యశుభవాసరము ల్చనుదెంచిన న్మహో
త్సాహముతోడఁ జైద్యవసుధాపతి యాత్మకుమారమౌళి కు
ద్వాహము సేయఁ బూనిక ముదంబు హృదంబుజసీమఁ దోఁపఁగన్.

10


[2]గీ.

ఆప్తవర్గంబుతో రహస్యంబు గాఁగఁ, గొంతసేపు విచారించి కుండినమున
రుక్మబాహుప్రభునిపుత్రి రుక్మగాత్రి, కుముదినీకన్య యునికి భావమునఁ దెలిసి.

11


చ.

తమకుఁ బురోహితుఁ డగుపితామహసన్నిభు గాలవాఖ్యసం
యమిఁ గదియంగఁ బిల్చి విమలాత్మ విదర్భధరిత్రి కేగి సం
భ్రమమున రుక్మబాహునరపాలశిఖామణిపుత్రి యైనయా
కుముదిని ధృష్టకేతువునకుం దగ వేఁడుము పొమ్ము గొబ్బునన్.

12


చ.

అనవుడు నట్లకాక యని యమ్ముని కుండినరాజధానికిం
జని తనరాక భీమనృపచంద్రతనూభవుఁ డైనరుక్మబా
హున కెఱిఁగింప నాతఁడు సముత్సుకుఁడై యెదురేగి యగ్రపూ
జన మొనరించి తెచ్చి మణిసాంద్రహిరణ్మయపీఠి నుంచినన్.

13


గీ.

కుశల మర్థించి యమ్మునికుంజరుండు, కువలయాధీశ నీపుత్రిఁ గుముదినీల
తాంగి శిశుపాలనృపతినిజాత్మజునకు, నడిగి రమ్మని నను బంచె నాదరమున.

14


[3]మ.

జననాథాగ్రణి యేమి చెప్పుదు భుజాస్తంభోరుకుంభీనసా
భినవక్ష్వేళశిఖాయితాసిముఖనిర్భిన్నారియౌ నాకుమా
రుని[4]యౌదార్యము రూపురేఖయును నోర్పు న్నేర్పుఁ గారుణ్యవ
రనముం కీర్తనము న్బలంబు చలము న్రాదెట్టి రాచూలికిన్.

15

క.

కావున నీపుత్రికి వసు, ధావలయమునందు వాఁడె తగు వరుఁ డిఁక నీ
వేవిధమును దలఁపక ప, థ్వీవల్లభ యతని కిమ్ము వే యేమిటికిన్.

16


చ.

అనుటయు రుక్మబాహువసుధాధిపుఁ డాప్తసుహృజ్జనంబుతోఁ
దనయవివాహకృత్య ముచితస్థితి నెంతయుఁ దెల్పి వారిచే
ననుమతుఁడై ప్రమోదమున నమ్మునినాథుని వెంటఁ జేదిరా
జునకు నిజాప్తమండలికి శోభనలేఖలు పన్ప నచ్చటన్.

17


[5]క.

చేదిధరాధవుఁడును స, మ్మోదము రెట్టింప బంధుముఖ్యుల మగధే
శాదీవసుధాధినాథుల, నాదరమునఁ బిలువనంపి [6]యతివేగమునన్.

18


గీ.

శుభముహూర్తంబునం దాత్మసుతయుతముగ
ధారిణీసురమంత్రము ల్పేరఁటాండ్ర
ధవళముల నాదములును వాద్యములరవళి
బోరు మని మ్రోయ నాత్మీయపురము వెడలి.

19


[7]సీ.

పాదాతకరకుంతపటలఘర్షణధూతరథకేతుమౌక్తికవ్రాతరజము
కూబరఘర్షణక్షుణ్ణవారణఘంటికాపద్మరాగనికాయధూళి
నవ్యకక్ష్యాఘర్షణప్రోత్థహయగళార్పితధామమరకతరేణువితతి
పల్యాణఘర్షణప్రస్ఖలద్భటమౌళిరత్నగోమేధికవ్రజపరాగ
[8]మలమఁ జత్రాకృతిఁ దనర్చు సంబరంబు, తనకు దిక్పద్మనయన లెత్తినమెఱుంగు
లడరుమంజటినన్నెయుల్లడ యనంగఁ, దనర నొయ్యనఁ గుండినమునకుఁ జనియె.

20


ఉ.

అంతకు మున్న భీమవసుధాధిపసూతి చమూసమేతుఁడై
యెంతయు వేడ్కతోడ నెదురేగి రయంబునఁ దోడి తెచ్చి గే
హాంతికకేళికావనమునందుఁ దగ న్విడియించి వారికిన్
సంతస ముప్పతిల్ల నుపచారవిధు ల్సవరించుచుండఁగన్.

21


ఉ.

ఆవిధ మెల్లఁ బ్రాణసఖు లారసి వచ్చి యెఱుంగఁబల్కఁ జిం
తావిలచిత్తయై కువలయాధిపునందన కూర్మిబోటిచే
నావనజాక్షసూతికిఁ దదన్యకరగ్రహణానపేక్షయుం
గేవలసాహసైకనిజకృత్యముఁ దేటగఁ దెల్ఫి పంచినన్.

22


గీ.

జనవరేణ్యునియత్నంబు విని నితాంత, దుఃఖితుం డయ్యు నతఁడు వధూవయస్య
వచనములచేతఁ గొంతయాశ్వాస మంది, చైద్యబలసంకులారామసరణి వెడలి.

23

క.

ఆపృథ్వీరమణుండు పు, రోపాంతంబునకు వచ్చి యొకచక్కటిల
క్ష్మీపద్మముఖీసద్మము, లోపల నున్నట్టివిజయలోలుని గనియెన్.

24


చ.

కనుఁగొని బాష్పపూరకలిక ల్కనుఁదమ్ముల నిండ డాయఁగాఁ
జనుటయు నాతఁడుం గదిసి చాఁగిలి మ్రొక్కిన గ్రుచ్చియెత్తి నె
మ్మనమున హర్షచిత్రములు [9]మల్లడిగొట్టుచునుండ నొక్కచో
ననితరవాస మైనవిమలావనియందు [10]వసించె నత్తఱిన్.

25


శా.

శైనేయాత్మజుఁ డామురారిసుతు సాశంకంబుగాఁ జూచి యో
యీ నిట్టూరుపు లేల పె ల్లడరె మే నేలా కృశం బయ్యెఁ గన్
గోనల్ కెంజిగిఁ బూనె నేమిటికి నాకుం జూడ నీతీరు విం
తై నేఁ డిచ్చటఁ దోఁచె నీదువిధ మాద్యంతం బెఱింగింపుమా.

26


సీ.

అనఁ జంద్రభానుఁ డి ట్లనియె నాఁడు మయూరములఁ బట్టుటకు మనము చని యడవిఁ
గవవాసి యొండొరుఁ గానంగలేక పోయిన నంతఁ జింత నే నిచటఁ జేరి
వీణారహస్యంబు వీరసేనుని గూడి తుంబురుచే విరితోఁటలోన
నభ్యసించుచునుండ నచటికిఁ గుముదిని యేతేరఁ గంటి నాయిందుముఖయు
నను వరించెద ననుచునుండఁగఁ దదీయ, జనకుఁ డాచైద్యసూతికి సంభ్రమింప
వారు నేతెంచి యావనవాటి విడియ, నే నచటు వాసి వచ్చితి నిట వయస్య.

27


గీ.

అనుచు నాద్యంత మేర్పడఁ దనతెఱంగు, దెలుప నాశ్చర్యవారిధిఁ దెప్పఁ దేలి
యామురాంతకసుతునితో నాత్మచర్య, విజయలోలుండు పలుకు సవిస్తరముగ.

28


మ.

అటు లాబర్హిణము ల్చనం దదనుయాత్రారంభము ల్మాని య
చ్చట నిన్నుం గనలేక ఖేదదళితస్వాంతంబుతోఁ గుంది యు
ద్భటహర్యక్షమృగాదనంబు లగుకాంతారంబుల న్దైవసం
ఘటనం బాంథులఁ గూడి యొయ్యనఁ జనంగాఁ గొంతకాలంబునన్.

29

వర్షకాలవర్ణనము

శా.

హంసోచ్చాటనమంత్ర, మంగభవసాహాయంబు కాదంబినీ
సంసద్వైశసనంబు భాస్కరతిరస్కారంబు ఘర్మచ్చటా
సంసారాపగమంబు పంకజతమిస్రావేళ విశ్వంభరా
పాంసుధ్వంసన మంబుదాగమము దీపం బయ్యె నుర్వీస్థలిన్.

30

చ.

సమదమయూరికాగణము శంబరవైరి సివంబు లాడఁగా
సమయపుజక్కులీఁడు హరిచాపపుగోణముఁ దాల్చి మబ్బుజొం
పములను బెట్టిదంపుటురుము ల్మొఱయించుచు మ్రోల నిల్పెఁ బ్రా
థమికపయఃకణార్ద్రవసుధాతలవిస్పురదూష్మధూపముల్.

31


[11]మ.

అలజీమూతకిశోరకుండు నవవర్షాశ్రు ల్దిగంబాఱ గ
ర్జిలుదంభంబునఁ బోరువెట్ట గగనశ్రీధాత్రి క్రొమ్మించుచే
తులచే నుగ్గిడ నొల్కి తచ్ఛకలసందోహంబు వర్షోపల
చ్ఛలన న్రాలెనొ కానిచోఁ గరఁగునే సంతప్తభూసంగతిన్.

32


మ.

స్తనితంబు ల్విని భీతినభ్రతటినీచక్రాంగము ల్టెంకికిం
జనుచోఁ దద్రయవాతజాతహతపర్జన్యావళీసంధులం
గనుఁగోనైన తదీయహేమమయపక్షచ్ఛాయలో నాఁగఁ బై
కొనియె న్దట్టము గాఁగ నెల్లకడలం గ్రొమ్మించు లక్కారునన్.

33


చ.

తొలుకరి నంబుదాళి శరధోరణి నింపుచు రాజహంసమం
డలముల నాక్రమించిన వడంకి ధరంగలరాజహంసమం
డలములు [12]క్రౌంచగర్భమునఁ డాఁగె ఘనార్తి జనించె నేని నీ
చులకడ కేగరే నిజవిశుద్ధతఁ జూడక యెట్టివారలున్.

34


చ.

హరిహయుఁ డభ్రవీథిఁ జెలువారెడు పచ్చనివిల్లు పాంథభి
కరముగ నెత్తి తానసమకాండమహోన్నతిఁ జూప ధాత్రిపై
హరిహయరూఢిఁ బూనిన యనంగుఁడు పచ్చనివిల్లు పాంథభీ
కరముగ నెత్తి తానసమకాండమహోన్నతిఁ జూపె నీసునన్.

35


క.

ఎచ్చటఁ జూచినఁ దఱచై, పచ్చిక కన్పట్టె ధాత్రి బహుళాంబుదని
ర్యచ్చటులజలమయంబున, నచ్చగు శైవాలరేఖ లడరె ననంగన్.

36


[13]చ.

సమధికవక్రలీలల దిశాతతిపై ముఖఫేనకందళం
బుమియుచు [14]సింధువు ల్పటురవోద్ధతి మీఱి నవాగమాలికా
దమస మొనర్పఁగా నపుడు ధాత్రి వహించెఁ గదంబనూతనో
ద్గమకమనీయసూనకళికానికురుంబకశాప్రకాండముల్.

37


చ.

విడువనివేలమై ఫణుల వ్రేలఁగఁగట్టినరీతి వర్షముల్
జడిగొన నానుచుం గుతికిలంబడి ఱెక్కలు విచ్చి పజ్జలన్

వడఁకెడు పిల్లలం బొదివి [15]వత్తులు గట్టినయట్టిమేనఁ దు
ప్పుడుగరుపాఱఁ గోటరపుఁబొంతల డాఁగెఁ బతంగసంఘముల్.

38


[16]సీ.

అసటిలో దిగఁబడి విసికి వెల్వడలేక యెలుఁగెత్తి పొలమర్లఁ బిలుచువారుఁ
గఱియరేవడిఁ బదాగ్రములు జిఱ్ఱన జాఱఁ బ్రాంతభూజము లూఁతపట్టువారు
నెదురువానకుఁ దలయెత్తక యేగుచో ముందఱ గానక మ్రొగ్గువారు
గొబ్బున జల్లు పైకొన్నఁ జెట్లను జేరి వంగుళ్లు ఘనమైన వడఁకువారు
నయి ముదురుజంబుగూడల బయి ధరించి
మొక మొకించుక గానరా ముసుఁగు వెట్టి
కేలనోరచ్చు [17]మడత్రాళ్లు వ్రేలుచుండ
నమ్రగతి నధ్వగులు త్రోవ నడచి రపుడు.

39

తిరుమలయాత్రావర్ణనము

గీ.

వార్షికదినంబు లిట్లు దుర్వారలీల, ధర విజృంభించువేళఁ బాంధప్రతాన
సహితముగ నేను బెక్కుదేశములు గడచి, యంతఁ బోవంగ మార్గమధ్యంబునందు.

40


[18]సీ.

అసశనవ్రతముచే నతులకార్శ్యంబునఁ గనుపట్టునోరిబీగములవారు
మ్రొక్కుఁ దీర్చుటకునై మూఁకమూఁకలు గూడి యేతెంచుతలమోపుటిండ్లవారుఁ
బ్రాణముల్ పిడికిటఁ బట్టుక యిట్టట్టు దెమలని [19]శిరసుకోడములవారు
దైహికాయాసంబు దలఁపక దొర్లుచు నడతెంచుపొరలుదండములవారు
నామటామట మ్రొకువా రడుగునడుగు, దండములవారు మిగులసందడి యొనర్ప
నడరి పన్నగసార్వభౌమాచలేంద్రుఁ, గొలువఁ గోటానుకోట్లు పెన్గూట మరుగ.

41


గీ.

ఏను వారలతోఁ గూడి యెలమి దిగువ, తిరుపతికి నేగి యాళ్వారితీర్థవారిఁ
దానములు సల్ఫి యుచితకృత్యములు దీర్చి, సంతసంబున నప్పురాభ్యంతరమున.

42


సీ.

పైఁ బొల్చు తొలుద్రాఁచుపడఁగయూరుపుఁబొగ ల్నాభిపంకజమిళిందములు గాఁగ
ఘనతలగ్రావభాగంబున కాజానుఘటితహస్తం బజగరము గాఁగ
మలఁచి తలాడగా నిలిపిన వలకేలినఖరుచు లౌళికుంచములు గాఁగ
నోరగాఁ గుడివంక కొఱగుకాస్తుభిరుచి శ్రీవత్సఘనరతటిద్రేఖ గాఁగ
రాత్రిఁ బవలును జారునేత్రద్వయంబు, పాదసంవాహనక్రియాపరవశకమ
[20]లోరుతలకుముదాబ్జధీకారి గాఁగ, వేడ్కఁ బవళించియున్న గోవిందుఁ గొలిచి.

43

క.

చకచకలు గలుగు నలిమే, చకకచ లిరుగడలఁ గలుగు సౌధశిఖావీ
థికలు గనుఁగొనుచుఁ దత్పుర, నికటోర్వికి వచ్చి యుపవనీభాగమునన్.

44


సీ.

చేమాకుతాళము ల్చెలఁగ రొండులఁ జేతు లుంచి యందఱ వెక్కిరించికొనుచుఁ
బజ్జధూపమున దీపపుఁగోల రాజహస్తము సాఁచి జేగంట చఱచికొనుచుఁ
దల యోరగిలఁ గ్రుంగి తప్పెట గతికి వాయించి గంగెడ్ల నాడించుకొనుచుఁ
దిరువడిసానుల బెెరసి గంటలు మ్రోయ బోడచప్పరముల నాడికొనుచుఁ
ద్రోవఁ గూర్చుండి [21]బొంతలు మ్రోలఁ బఱచి
ముదురుటెండల కోరగా ముసుఁగుఁ జేర్చి
పట్టెదండలు మొఱయించి పాడుకొనుచు
నలరు దాసళ్ల వీక్షించి యాక్షణమున.

45


గీ.

పంకజేక్షణు మురవైరి భక్తసులభు, వేంకటస్వామి వీక్షించువేడ్క హృదయ
పదమునఁ దొంగలింప సంభ్రమము మెఱసి, యామహీధర మెక్కితి నట్టివేళ.

46


[22]సీ.

చెక్కుల మకరికాచిత్రము ల్గరఁగంగఁ గలయమార్చుచు సారె నిలిచినిలిచి
కటులభారమున వెన్కకు వీఁగి యందంద [23]పతులయంసము లూఁత పట్టినట్టి
తరులనీడలు చేరనరిగి నెచ్చెలి వీచు సురటితెమ్మెరలకుఁ జొక్కి చొక్కి
పాదాబ్జములు తొట్రుపడఁగ జానువు లూఁది యెక్కుడుదగ మెట్టు లెక్కి యెక్కి
వలుదగుబ్బలఁ జెమటలు వడియఁ బయట
లుబ్బ నొత్తుచు నుస్సని యూర్చియూర్చి
యలఁతఁ దూలుచు వ్రాలుచు నలఘుహర్ష
జలధిఁ దేలుచు సోలుచు జలజముఖులు.

47


ఉ.

మందలు గూడి యెక్కి రతిమంజులవంజులకుంజమంజరీ
బృందమరందబిందులహరీబహురీతిసగీతినందదిం
దిందిరవందితుందిలనుతిప్రతికూజదళిందకందరా
మందనరజ్ఝరీఘుమఘుమధ్వనిజాలము శేషశైలమున్.

48


క.

తళతళన వెలుఁగు నిందూ, పలఫలకవనీపతత్ప్రబలబహులహరీ
సలయఝరీవలయదరీ, నిలయసరీసృపఫణామణిద్యుతు లచటన్.

49


గీ.

శబరకాంతాకుచాగ్రసంసక్తగైరి, కాంకనంబులు జనుల నఱ్ఱాఁచు నచట
ధాతుకృత్యంబు లౌట చిత్రంబె వాని, కతనుభావార్హకర్మశక్యప్రవృత్తి.

50

సీ.

నాళీకకాసారకేళీకలితనారినాళీకనత్తీరనాళికేర
మాలీనమకరందధూళీనతమిళిందకేళీనవానందశాలిరుంద
మేలాల తాలోలదోలాలసమరాళబాలాలఘుముదాలవాలసాల
మాలాపయుగనంగఖేలాపరవశాంగలీలాపరవిహంగజాలరంగ
మమరవరతనుకరతనునమితసుమిత, మునితకలరనకులరవముఖరశిఖర
తిలకసురుచిరతరుచరగళితలలిత, మధురమధురసపాళి యాకుధరమౌళి.

51


చ.

ఉరుతరకందరానిపతితోత్పతదంబుఝరీలవంబులం
బరఁగు నుదగ్రఘోషమయి పాపవినాశన మానగంబు సొం
పరయఁగఁ గోరి యేపతితులైన జడాకృతు లేగుదెంచినన్
సరసత నూర్ధ్వలోకము లొసంగుదు నే నని తెల్పుకైవడిన్.

52


సీ.

కమలాకరతఁ దామ యమరు నింతియ కాని క్రుంకువారికి సిరు ల్గూర్పఁగలవె
కువలయోద్ధతిఁ దామ కొఱలు నింతియకాని చేరువారికి ధరఁ జేర్పఁగలవె
యుత్కళికలఁ దాము యొప్పు నింతియకాని కనువారికి ముదంబు లునుపఁగలవె
యమృతసంగతిఁ దామ యలరు నింతియకాని తలఁచువారికి ముక్తిఁ దార్పఁగలవె
యితరతీర్థంబు లెందైన నీసరంబు
పగిది నని విశ్వభూజను ల్వొగడ నన్న
గమునఁ [24]జెన్నొందు స్వామిపుష్కరిణి యచటఁ
దాన మొనరించి యుచితకృత్యములఁ దీర్చి.

53


[25]క.

వారాహమూర్తికి నమ, స్కారం బొనరించి సంతసంబునఁ దత్త్కా
సారంబు వెడలి మురహరు, నారాధింపంగఁ దలఁచి యటఁ జన నెదుటన్.

54


సీ.

ప్రాకారఖచితహీరప్రభాచయదేవతాధునీబుద్బుదత్తారకంబు
గోపురేంద్రోపలాంకూరవిభాజాలయమునారథాంగదహస్కరంబు
కేతుగోమేధికద్యోతసరస్వతీహ్రాదినీశైవలదభ్రతలము
శిఖరాబ్జరాగరోచిఃప్రతానహిరణ్యవాహోత్సలన్నీలవారిదంబు
భక్తలోకైకభరణంబు పరమమౌని, కలుషసంతానహరణంబు ఘటితసుజన
నిచయసంసృతితరణంబు నిర్జరశర, ణంబు వేంకటపతిశరణంబు దనరె.

55


గీ.

అట్టిమురవైరినగరికి నరుగుదెంచి, వితతభక్తిఁ బ్రదక్షిణవిధు లొనర్చి
యావరణదేవతల నెల్ల ననుసరించి, గర్భగృహమున కేగి యుత్కంఠ మెఱయ.

56

ఇలఁ జూపు వలచేయి వెలిదమ్మికనుదోయిఁ జెలఁగువానిఁ బయోధి మెలఁగువాని
దట్టిఁ జేర్చిన వంకి గట్టుమీఁదటి టెంకిఁ దనరువానిఁ బురారి నెనరువాని
నెడమపెందొడఁగేలు నెడఁ జేరిచినయాలు నెసఁగువాని శుభంబు లొసఁగువాని
నిండుబంగరుపట్టు కొండవంచిన మెట్టు వెలయువాని శుకాత్మ నొలయువాని
చికిలిజగిచుట్టుకత్తి జేజేలుబత్తి, నెఱపువాని సురారులఁ బఱపువాని
వేంకటస్వామిఁ గనుఁగొని వినయవినమి, తాంగవైఖరి మెఱయసాష్టాంగ మెఱఁగి.

57


శా.

కాల న్ముత్తెగజాలు వేఁడిచలువల్ గ్రమ్మించుకన్డాలు కెం
గేలం బట్టినచుట్టువాలు నెడచక్కిం గల్మిప్రొయాలు నే
వేళన భక్తులఁబ్రోచుమేలు తెలిదీవిం బొల్చు పెన్బ్రోలు ని
ర్మేలం బాయనివేల్పుచాలు గల సామిన్ వెన్నునిం గొల్చెదన్.

58


శా.

ఆర్తత్రాణపరాయణాయ భువనైకాధారభూతాయ సం
వర్తాంభోనిధిమగ్నభూభరణకృద్వారాహరూపాయ దో
ర్వార్తాభీతమహీసుతాయ శిశుతావ్యాపారనశ్యత్తృణా
వర్తక్రూరనిశాచరాయ దివిషద్వంద్యాయ తుభ్యం నమః.

59


చ.

అని కొనియాడి తత్పదయుగాబ్జపవిత్రితతీర్థవారిలోఁ
గొని గతకల్పషుండనయి కోవెల వెల్వడి [26]బిల్వపాండవా
దినిఖిలతీర్థపంక్తుల క్షితిత్రిదశోదితరీతి భక్తి మ
జ్జన మొనరించి యర్షవిధి సల్పి క్రమంబున నేగి చెంగటన్.

60


సీ.

రేరిక్కరాఱాల నూరిననీ రేఱులై తూఱ నీరిక లైనచోటఁ
గ్రేళ్లుబ్బి సెలలు దాఁకిననుర్లు నెత్తాల నలరు కానలఁదారు తలిరుఁగత్తి
ఱేని [27]బాబాలేఁతఱెక్కసోఁకులసారెఁ దలఁకునీరంబుల నొలుకు తెలిసి
రంబుతోఁ దనర నొరలుకన్నెక్రొన్నన తేనెసోనల పసలైన నేలఁ
దొలఁకుకొలఁకులకెలఁకులఁదళుకుగులుకు, నున్నతిన్నెలఁ దరలక నూలుకొనిన
[28]కిన్నెరకలకలంబుల కేకికరుతు, లూనుచుండెడు తుంబురుకోన డాసి.

61


లయగ్రాహి.

రేవగలు ఠీవిగల తీపనసదీవిలయ కైవెఱచి పోవుటిరు లేవలనఁ బ్రోవం
[29]గేవలము ఠీవిఁగను కావియెలమావితలిరోవరుల సావిఁదగు లేవిరులలోనం

దావలముగా వదరుపూవిలుతుమావుల విరావముల [30]తావులగు క్రోపులకుఁ గ్రేవం
దావితొనబావిచలిరేవులసమీపమధుపావళివళావళులచే వెలయుత్రోవన్.

62


క.

[31]కంజరజఃపింజరతరు, కుంజరటదలిన్వనానుకూలనిగుంజ
న్మంజీరపుంజరంజిత, మంజులసింజారవంబు మల్లడిగొనఁగన్.

63


శా.

రావే యోవనమాలికా పొదలు చేరంబోకువే మల్లికా
యేవే బంతులు పద్మినీ యిచట లేదే తేనె వాసంతికా
తీవ ల్దూఱకు చంద్రికా యఱవిరు ల్దె మ్మిందిరా యంచు వ
న్యావీథి న్విహరించు తొయ్యలుల వాక్యంబు ల్వినన్వచ్చినన్.

64


శా.

ఆనాదంబు హృదంబుజాతమున కాహ్లాదంబుఁ గల్పింప నే
నానానూననికుంజపుంజములలోనం దూఱి యచ్చోట న
మ్లానామందమరందబిందురతిలీలాడోలబాలాళినీ
గానాధీననవీనసూనలతికాగారాంతరాళంబునన్.

65


శా.

కర్ణాంతాయతనేత్రకోణరుచు లగ్రక్షోణి [32]రాణింప సౌ
వర్ణాంభోజముఁ గేలఁ ద్రిప్పుచు నటద్వక్షోజయై బాలికా
తూర్ణాందోళితడోలికాంతరమునం దూఁగాడు చొక్కింత సౌ
ఖ్యార్ణోరాశిఁ జెలంగఁ గంటి నని యత్యానందముం జెందుచున్.

66


క.

ఏలాయతడోలాయత, లీలాయతనంబుకడ నళిభ్రమకరశో
భాలాలసఖేలాలస, బాలా లసమానదృష్టిపథమున నిలువన్.

67


క.

వనితాజనతావినుతా, ననతామరసంబు మలఁచి నను నాచెలి భా
వినితాంతావనితాంతా, వనతాంతాపాంగకోణవైఖరిఁ గనుచున్.

68


సీ.

పలుచనిచెమట గుబ్బల నంటి మూఁపునఁ [33]దొలఁకుపయ్యెదఁ జక్కఁద్రోచిత్రోచి
పిఱుఁదు నూయెల లూఁచు తెఱవలకై మోము మలఁచి నిల్వుమటంచుఁ బలికిపలికి
చేరు లంటఁగఁ బట్టి చికిలిమట్టెలు మ్రోయ నుర్వర మునివ్రేళ్ల నూఁదియూఁది
కౌను నిక్కఁగ నొండుకరమున వేనలి సవరించుచును దిగజాఱిజాఱి
తత్తఱంబునఁ బదములు తడఁబడంగఁ, బిఱుఁదువ్రేఁగునఁ జిఱుదొడ ల్బెళుక దిశలు
చెదరి చూచుచు నూర్పులు చెదర డిగ్గి, యలరుటెలమావిపొదదండ కరిగి నిలిచి.

69


చ.

అలరులతేనెఁ చ-గ్రోలుతమిగ్రోలి తమి నాడెడుతేఁటుల ఱెక్కసోఁకుచే
నలఁతిగఁ బాయలైన తలిరాకులసందులఁ జిత్తజల్లుగాఁ

బొలయఁగ నాపయిం జిగురుఁబోఁడి కటాక్షచయంబు నించె బూ
విలు గొని పంచసాయకుఁడు వెంటనె క్రొవ్విరితూపు లేయఁగన్.

70


క.

మఱువెట్టి చూచు నేఁ గ్ర, మ్మఱఁ జూచిన డాఁగుఁ జెంత [34]మగువలఁ గని నా
తెఱఁ గడుగు మగుడఁ గనున, త్తఱి నాకలకంఠి మన్మథవళాకృతి యై.

71


ఉ.

[35]ఆయలివేణికీ లెఱిఁగి యంతట నెచ్చెలి చేరి యక్కటా
యోయెలనాఁగ యింతతడ వొంటిమెయిం దరుణు ల్వనంబులో
నూయెల లూఁగు వేడుకల నుందురటే మనవారలెల్ల న
ల్లాయెడ నున్నవారు పదమా యని పల్కఁగ నాక్షణంబునన్.

72


సీ.

సామిసందష్టశశియైన సైంహికేయు, నగ్రమునఁ బూని తనరు మహాబ్ద మనఁగఁ
గ్రాంతదంతనితాంతోగ్రకరముతోడఁ, గరము భీకరముగ [36]నొక్కగంధకరటి.

73


[37]సీ.

కటనిస్సృతమదాపగావీచికణములకరణిఁ బైపై భృంగగణము లడర
గాఢఫూత్కారవే[38]గవిశీర్ణకుంభముక్తారీతి హస్తశీకరము లొలుక
సౌరధునీమధ్యసంభిన్నయమునానుకారియై రదయుక్తకరము దనర
సకలజంతుక్షోభసంధాయి ధూమకేతు స్ఫూర్తితో నెత్తుతోఁక యమర
నోరమై శైలములఁ జెక్కు లొరసికొనుచుఁ
జేఁ గఱచి సా నలుగుచు వేగ నరిగి
తరువు లగలించి యెత్తుచు దరి వొడుచుచుఁ
గ్రూరగతిఁ దద్వనక్షోణిఁ జేరుటయును.

74


సీ.

తద్ఘనాఘనఘనౌద్ధత్యవిస్ఫూర్తికి హంసకప్రచయ మందంద తూల
నామహోదారసారంగంబురవళికిఁ గర్ణికాజాలంబు కంప మొందఁ
దద్దుష్టకుంభినీధనమౌళి దుర్మదోగ్రతకు రత్నాకరరశన దలఁక
రూమత్తమాతంగభీమవృత్తికి నగ్రహారనాయకమణు లవిసి చెదరఁ
గౌను లసియాడ జఘనము ల్గదలఁ బాద
పదములు దొట్రువడఁ [39]గచభరము లులియ
నూరుపులు సందడింపంగ నుత్ఫలాక్షు
[40]లెడనెడన పాటి పఱవ నయ్యిందుముఖియు.

75

చ.

ననుఁ గని మున్ను కొంత దమి నాటఁగఁ జూచుటఁ జేసి లాఁతివాఁ
డనక మృణాలనాళమృదుహస్తము లెంతయుఁ జాఁచి కౌఁగిట
న్నినిచి యొకింతయుం దెలుపనేరనితత్తఱపాటుతోడఁ గో
పనమదహస్తి హస్తి యని పల్కెఁ దలంకు దొలంకుపల్కులన్.

76


ఉ.

ఆపువుఁబోఁడి యీగతి భయంబునఁ గౌఁగిటఁ జొచ్చి పల్క నే
నేపరిపాటియైన వగ నెంచక కేవలతన్మయానుమో
దోపచయంబుఁ గంటి మఱి యున్నదె ధాత్రి హఠాదవాప్తయో
షాపరిరంభసంభ్రమజసౌఖ్యముకంటెఁ బ్రమోద మేరికిన్.

77


క.

అడ లెడలఁ బలికి యప్పుడు, జడియకు మని సారె వెన్నుఁ జఱచి యెలమి న
ప్పడఁతుక నెత్తికొని రయం, బడరఁగ నే నొక్కకడకు నరుగుచు నెదుటన్.

78


ఉ.

వామనతీర్థతీర మనివారణవారణవారణక్షణే
చ్ఛామహితప్రచార మురుసారససారససారసంభ్రమో
ద్దామతరంగవారము సదానవదానవదానవర్ణిత
శ్యామలమూర్త్యుదారము శుభావనభావనభావనారమున్.

79


క.

కని యుక్కలికోజ్జ్వలమై, ఘనరససంభరితమై ప్రకంపనయుతమై
వనితామణిచిత్తముగతిఁ, దనరెడు నాసరసిఁ దఱిసి తత్తీరమునన్.

80


సీ.

పయినాడు తుమ్మెదపదువు క్రొంబొగలతోఁ బాటల కుసుమదీపములు వెలుఁగ
నానందనిభృతకీరాదిచిత్రములతోఁ బాయని చిగురాకుపటము లెసఁగ
వ్రాలెడు గెలబోదెకీలుదామరలతో స్థూలరంభాతరుస్థూణ లలర
నకృదాగతార్కభాస్వర్ణశృంఖలలతో నల తెలిదీపయుయ్యెలలు దనర
నరుణకాంతాగ్నిపతితసితాభ్రధూప, ముల [41]వలచు నొకపొదరింట లలనఁ దార్చి
కురు లెనయ దువ్వి చెమ టార్చి సరులు దీర్చి, బుజ్జగించి ముదంబునఁ బొదలునపుడు.

81


ఉ.

[42]ఆగజరాజ మన్యవిపినాంతవశావశచిత్తమై నిజే
చ్ఛాగతి నేగఁ దత్సఖులు చంద్రముఖి న్వెదకంగ వచ్చి త
ద్భాగమునందుఁ గన్లగొని ముదంబునఁ దోడ్కొనిపోవ నావనా
భోగమునందు నిల్వ కెడఁబొక్కుచు నంగజుబారిఁ జిక్కుచున్.

82


సీ.

తలిరుటాకులమీఁద నొలుకు తేనెలఁ జూచి పల్లవాధరి లేఁతపలుకుఁ దలఁచి
మెట్టుతమ్ములమీఁద మెలఁగు తేఁటులఁ జూచి సరసిజవదన ముంగురులు దలఁచి

యసదుదీవియమీఁద నలరుక్రొవ్విరిఁ జూచి నతలతామధ్యమనాభిఁ దలఁచి
పువ్వుగుత్తులమీఁదఁ బొలయుపుప్పొడిఁ జూచి గుచ్ఛవక్షోజుపైకొంగుఁ దలఁచి
తగులు నెగులును దిగులును దత్తఱంబు, నలుకు నులుకును దలఁకును నాదరంబు
మనమున జనింపఁ దద్వనీమధ్యసీమ, నంగనామణి వెదకి కానంగలేక.

83


ఉ.

వేగిరపాటుతో నపుడు వెల్వడి యొయ్యన శేషభూమిభృ
ద్భాగము డిగ్గి యాకులత దార్కొనుచిత్తముతోడఁ గుందునన్
దోగెడఁ గూడి యధ్వగులు దోడ్కొనివచ్చిన నప్పు డేను ని
న్నీగుడిలోనఁ గాంచితిఁ జెలీ యని యంతయుఁ జెప్పి వెండియున్.

84


సీ.

గాజుకుప్పెలవంటి గబ్బిగుబ్బలు గోర నంటిన వ్రీలుఁగా యనుచుఁ గొంకి
దిరిసెనపూవంటి తిన్ననిమై కేల నలమిన వాడుఁగా యనుచుఁ గొంకి
కండచక్కెరవంటి కమ్మనివాతెఱ నానినఁ గరఁగుఁగా యనుచుఁ గొంకి
చికిలియద్దమువంటి చిన్నినెమ్మో మూర్పు లడరినఁ గందుఁగా యనుచుఁ గొంకి
తళుకునెలకూన లునుపక తనివి తీఱఁ, గౌఁగిలింపక కెంపులు గలుగ నిడక
నలరువలపులు గ్రోల కందంద కనుచు, నూరకే మోసపోయితి నోవయస్య.

85


క.

అని యాద్యంతం బేర్పడఁ, దనవృత్తాంతంబుఁ దెలుపఁ దమ్ముఁడుఁ దానున్
జననాథమౌళి యొండొరు, ననునయమునఁ గలఁకఁదేఱునంతటిలోనన్.

86

సాయంకాలవర్ణనము

మ.

కలయ న్నీడలు తూర్పు సాఁగె నళిను ల్కంజాతము ల్వాసెఁ గొం
దల మందెన్, కవజక్కవ ల్తరణికాంతశ్రేణి చల్లారె మి
న్నుల నేగెం బులుఁగు ల్చకోరికల ఱంతు ల్గొంత దీపించె ను
త్పలము ల్విచ్చె నినుండు పశ్చిమకుభృద్భాగంబున న్నిల్వఁగన్.

87


క.

జలరాశి యనెడుబోయల, తలదొర చరమాద్రిపేరి తడికమఱువునన్
నిలిచి కిరణంపుటురి గో, లలఁ దిగిచెఁ బతంగమండలం బవ్వేళన్.

88


సీ.

తొలుదొల్త వినవచ్చె నలఘుకోలాహలం బామీఁదఁ దోఁచె వాద్యములరవళి
తరువాత నెఱిఁ జూపె దంతిఘీంకారంబు నంతటఁ దులకించె నశ్వహేష
పిమ్మటఁ దలమయ్యె బృథుకంచుకధ్వను లావెన్కఁ దనరెఁ దొయ్యలులపాట
పెద్ద మ్రోసెను వారభీరునూపురరుతు లాపై నెగడె వయస్యానులాప
మప్పు డాయాదవాన్వయు లారవంబు, సారె నాలించి లగ్న మాసన్న మైన
ధరణినాథుండుతనయ నిందిరకు మ్రొక్క, ననిచెనో యని భావింప నాక్షణమున.

89

కుముదిని లక్ష్మీమందిరమునకు వచ్చుట

చ.

ధరణితలేంద్రనందనవిధంబు గనుంగొనఁగోరి మున్ను కి
న్నరవరుఁ డిచ్చినట్టిభువనస్తుత మైనయదృశ్యవిద్య న
య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరిమందిరంబునం
దరలక యుండి రట్టియెడఁ దన్వియుఁ జేరఁగవచ్చి యచ్చటన్.

90


గీ.

జనులఁ గంచుకినిచయంబు జడియ వేత్ర
ధరలతాంగులు కొంద ఱెచ్చరికఁ దెలుప
[43]బాల లిరువంకఁ గరములఁ బంజు లూనఁ
బొలఁతుకలు మ్రోల రాఁగ గోపురము సొచ్చి.

91


చ.

జిలిబిలికమ్మఁదేనియలు చిల్కఁగఁ బల్కెడుపంచవన్నెరా
చిలుకలపంజరాలగమిచే నలరారెడు రంగమండపం
బలసత నెక్కి కూర్మిసఖు లందఱు వెంటనె రాఁ గరంబునన్
నిలుఁడని యడ్డగించి తరుణీమణి గర్భగృహంబులోనికిన్.

92


గీ.

సారెనియమరహస్యపూజాచ్ఛలమున, నొంటి నేతెంచి విజనమై యునికిఁ దెలిసి
రత్నమయ మగుతద్గృహాంతరముఁ జేర్చి, నళినగేహకు సాష్టాంగనతి యొనర్చి.

93


క.

ఈనళినగేహతనయుఁడు, కానను వలవంతఁ గుందఁగాఁ జేసెఁ గటా
యేనీసతి కిందులకై, ప్రాణము లర్పింతు ననుచు బద్ధోద్యమయై.

94


సీ.

భవదాత్మజశిలీముఖవివర్ణితం బని తలఁపక కర్ణిణోత్పలము గాఁగఁ
డ్వత్తనూభవవృషత్కమలీమస మని యరయక లీలాముకురమ్ము గాఁగ
భవదపత్యశరవృష్టివిదారితం బని కనక కెంగేలిపంకజము గాఁగఁ
ద్వత్కుమారాశుగధౌర్త్యాకులం బని తెలియక పెంచినతీవ గాఁగ
నవధరింపఁగదమ్మ లోకైకజనని, కనుఁగవయు గండతలము నాననముఁ దనువు
[44]పార్థివావయవముల పాల్పడకయుండఁ, బ్రీతి నసువులు నీకు నర్పింతుఁగాన.

95


చ.

అని యురి గాఁగఁ బయ్యెద నతానన యై నిజకంఠసీమఁ జే
ర్చినఁ గరుణార్ద్రచిత్త యయి చెందొవరాసయిదోడు చెల్లఁబో
నను నపకీర్తిఁ బాల్పడ నొనర్పఁగఁ జూచితి వంచుఁ గేలు కే
లునఁ గదియంగఁ బట్టి మదిలోని తలం కెడలంగ నిట్లనున్.

96

శా.

నాళీకాంబకు సారె దూఱుకొనుచు న్నామ్రోల కేతెంచి [45]నీ
వీలా గేల వహింప నేఁటి కకటా యేఁ జెల్ల నీసాహసం
బేలా పూనెద నమ్మ లాఁతి[46]వలె నీయిష్టంబుఁ జేకూర్చెదం
జాలుంజాలుఁ గలంక మాను మని యాశాచక్ర మీక్షించినన్.

97


క.

గ్రమ్మన నగ్రధరిత్రిని, దమ్మునితోఁ గూడివచ్చు తననాయకునిన్
సమ్మోదజలధిఁ దేలుచు, [47]నమ్ముద్దియ చూచి యవనతానన యైనన్.

98


ఉ.

కోమలి నీదునెమ్మనము కోర్కి ఘటిల్లెఁ గదమ్మ భూవర
గ్రామణి నీమనో౽౦బుజము కాంక్షిత మబ్బెఁ గదయ్య యంచు ల
క్ష్మీమృగనేత్ర యొండొరులచిత్తము రంజిలఁ బల్కి భక్తర
క్షామహనీయదృష్టి నల సాత్యకిపుత్రుని జూచి నెమ్మితోన్.

99


క.

ఓవిజయలోల యిప్పుడ, తావకహృదయాబ్జవాంఛితము సేకుఱుఁ జిం
తావిలత వలవదని పూ, ర్వావస్థితి నుండె నంబుజాలయ యంతన్.

100


చ.

చతురతరాంతరంగుఁ డయి సాత్యకిసూనుఁడు వల్కు నన్న యీ
యతివయు నీవుఁ గిన్నరవరాత్తమనోజ్జరథంబుచేత ను
[48]ద్ధృతగతి నేగి పేరడవి రుద్రగృహంబున నుండు మేఁ దద
ర్పితనవకామరూపకళపెంపున బిత్తరి నై శుభోన్నతిన్.

101


ఉ.

పాలకి నెక్కి యేగెద నృపాలనిశాంతముఁ జేరఁబోవుచో
జాల నదృశ్యవిద్య మెయి జాఱెదఁ గ్రమ్మఱ మిమ్ముఁ జేరెదన్
శ్రీలలనాప్రసాదమునఁ జింతిలుకార్యము సంఘటించె నిం
కేల విలంబ మంచు నల యిర్వుర వీడ్కొని సంభ్రమంబునన్.

102


క.

కాంతాకారముఁ గైకొని, యంతర్గేహంబు వెడలి యల్లన చెలువల్
ప్రాంతమునఁ గొల్వఁ బాలకి, యెంతయు ముద మొప్ప నెక్కి యేగెడువేళన్.

103

విజయలోలుఁడు పద్మినితోఁ భాషించుట

ఉ.

అంత నవంతిదేశపతి యౌ ననువిందునిపుత్రి పద్మినీ
కాంత తదంబుజాననకుఁ గాదిలినెచ్చెలి గానఁ జెంగటన్
సంతస మొప్ప నేగుచుఁ బ్రసంగవశంబునఁ బల్కరించి యే
కాంతమున న్నృపాలసుత యంచునె [49]త్యకిపట్టి కి ట్లనున్.

104

[50]చ.

చెలియ వృధావిచారమునఁ జిత్తము నొంపఁగ నేల యిట్టు లా
విలగతి నున్కి మేలె శుభవేళ మదిం గలవంత యేరికిన్
[51]దెలియకయుండు టొప్పదె సతీమణికి న్మఱియెవ్వరేనియుం
గలకల నవ్వకుందురటె కామిని నీచరితంబుఁ గాంచినన్.

105


చ.

సరసిజపత్రనేత్ర వెడచందము మానుము నీదుకోరికల్
తరళిక తెల్ప వింటి నిది ధర్మమె కూరిమి తల్లిదండ్రు లే
వరున కొసంగిన [52]న్సుతలు వాఁడె విభుం డని [53]భక్తియుక్తలై
పరిణయ మౌటగాక తమభావమునం గలవాఁడు గల్గునే.

106


ఉ.

ఇన్నియుఁ బల్క నేల వినవే నిను నొక్కతె దూఱనేటికిన్
మున్ను మదీయచిత్త మొకమోహనరూపవిలాసధన్యుపైఁ
గన్నువిరాళిఁ జిక్కి రతికాంతునిబారికి నగ్గమయ్యె నో
కిన్నరకంఠి నీకు నెఱిఁగించెద నత్తెఱఁ గాలకింపుమీ.

107


సీ.

ఒక్కనాఁ డే వార్షికోత్సవంబునఁ బొల్బు హరిఁ గొల్చుటకు శేషగిరికి నేగి
యచటివినోదంబు లరయుచు నెచ్చెలుల్ గొలువఁగాఁ దుంబురుకోనఁ జేరి
[54]యొరపైన యాచెంత గురివెందపొదరిండ్ల లీల దోలాకేళిఁ దేలుచుండి
గ్రక్కున నత్తఱిఁ గమ్మవిల్తుని గెల్వఁజాలిన యొక్కరాచూలిఁ గాంచి
పరమసమ్మోదమును జెంది మరలియేగు
వేళ మదహస్తిఁ గనుఁగొని వెఱచి యతని
నలమికొని యుండఁగా బోటు [55]లంత వచ్చి
పిలుచుటయుఁ బాసి వచ్చితి నలరుఁబోఁణి.

108


గీ.

నాఁటనుండియు నతని గానంగలేక
చింతఁ గుందెద నన మహీకాంతసుతుఁడు
బాపురే యగు నిదియ యా[56]పద్మనయన
యనుచుఁ గృతనిశ్చయుం డయి యబల కనియె.

109


క.

ఆకాంతుఁ డిపుడు వచ్చినఁ, గైకొందువె యనినఁ దరుణి కనుఁగవ నశ్రుల్
వ్యాకీర్ణముగా గద్గది, కాకులనిస్వనముతోడ నలనాలసయై.

110


ఉ.

అక్కట చాలు నన్ను నిఁక నాఱడి పెట్టకు వమ్మ యాతనిం
జిక్కనికౌఁగిటన్ బిగియఁ జేర్పఁ బురాకృతపుణ్యవాసనం

దక్క మ ఱేల కల్గు ననిన న్విని డాయఁగఁ బిల్చి మక్కువన్
గ్రక్కున భీరువేషముఁ దెరల్చి నిజాకృతిఁ [57]బూని యల్లనన్.

111


గీ.

పల్లకీగాలిచెఱఁగు లోపలకుఁ దిగిచి, నెలఁత నీకనుఁగొన్నట్టి నృపసుతుండు
నేన సు మ్మని గుఱుతు లెన్నేని నొడివి, తనతెఱుంగుఁ గుముదినివిధమ్ముఁ దెలిపి.

112


క.

ఆవనితయు నచ్చటకుం, దావచ్చినవిధము దెల్పినఁ బ్రమోదమునన్
భూవల్లభుఁ డిఁక మనముం, బోవలయు నటంచుఁ బల్కఁ బొదలినలజ్జన్.

113


[58]ఉ.

లేనగ వొప్పఁ జేయునదిలేక నతాననయైన నామహీ
జానియు నోలతాంగి మొగసాలను వెల్వడి నీవు నిల్వు మే
లోనికి నేగి యెట్లయిన లోఁగక వెల్వడివత్తు నంచు డెం
దానఁ దొలంకు సంతసమునం జెలరేఁగుచుఁ బోయి యచ్చటన్.

114


[59]చ.

మగఁటిమి మీఱ సాత్యకికుమారుఁ డదృశ్యతఁ బూని పాలకిం
డిగి మొగసాల వెల్వడి వడిం బ్రియఁ దోడ్కొని నర్మదాతటిన్
నగతనయాధినాథభవనంబునకుం జని కాంచె నందు ము
న్నుగ రథ మెక్కి తద్వరతనూమణిఁ దెచ్చిన యన్న నయ్యెడన్.

115


మ.

తరుణు ల్వెల్వడి యిట్లు పోవుటయు సంతాపంబున న్భీమభూ
వరపుత్రుం డరయించి కానక కృధావ్యగ్రాత్ముఁడై యుండఁ ద
త్సరణిం గన్గొని యాక్షణంబ దమఘోషక్షోణిభృత్పుత్రుఁడున్
మరలె న్బుత్రునితోడ సైన్యములతో మాహిష్మతిం జేరఁగన్.

116


ఉ.

అప్పుడు కిన్నరార్పితశతాంగలలామమునం గుతూహలం
బొప్పఁగ నెక్కి యయ్యువతియుగ్మముతో యదువంశవల్లభుల్
చప్పుడు సేయ కేగి రతిసాంద్రవనీనిచయంబు లేర్లు బల్
తిప్పలు పక్కణంబు లవలీలల దాటి మనోరయంబునన్.

117


క.

అత్తఱి వారల మనములఁ, దత్తఱము శమించురీతిఁ దమ మడఁగె మదిం
గ్రొత్తగ ననురాగము చిగు, రొత్తుగతిఁ బురోనురాగ ముజ్జ్వల మయ్యెన్.

118


చ.

సకలజగన్నివాసుఁ డగుశౌరికుమారునిపెండ్లి యంచుఁ బ
క్షికులరవంబుచే నెఱుఁగఁజేసి కరస్ఫురణన్ [60]ధరేశపం
క్తికి నరుణాంకురాక్షతతతిం దగ నీఁదొలుగట్టుటొజ్జ గై
రికమయపాత్ర మెత్తె సన ఱిక్కలగొంగ తనర్చెఁ దూర్పునన్.

119

గీ.

అట్టియెడఁ గాల్యకృత్యంబు లర్హగతి నొ, నర్చి యాయదువీరనందను లమంద
రథరయంబున నలసినరాజముఖుల, నూఱడించుచు నేగుచో నొక్కచోట.

120


[61]సీ.

మును గురంగములఁ గోసిన రచ్చచట్రాలఁ బేరిన పచ్చికస్తూరివలపుఁ
బులితోళ్లపై నారఁబోసిన రక్తార్ద్రకరిశిరోముక్తాళిఁ గదురుకంపు
వరుసతో ముంగిళ్ల గుఱుజిడ్డువెన్నలు గరఁగింపఁ బొడమెడు కమ్మదావి
కఱివన్నె నెఱిజల్లికప్పుపందిళ్లపై నెండెడు నిప్పపూనిండుగబ్బు
[62]సమదశబరప్రణీతసంకుమదసార, చిక్కణంబై యనరు నొక్కపక్కణంబుఁ
జేరి తదధీశుఁ డొసఁగు సత్కారములకు, నలరి తగుమందిరంబున నధివసించి.

121

ద్వారవతికిఁ జంద్రభానుఁడు శబరుని బంపుట

ఉ.

మంతనమాడి యాదవకుమారకు లచ్చట నుండువాని న
శ్రాంతగతిప్రసిదు నొక[63]శాబకునిం బిలిపించి యాత్మవృ
త్తాంతము తేటతెల్లముగ నంతయు వ్రాసిన విన్నపత్రముల్
సంతస మొప్పఁ జేతికి నొసంగి హరిం గనఁబొమ్ము నావుడున్.

122


[64]సీ.

హృదయప్రమోదవారిధిబుద్బుదంబులగతి మేన ఘర్మాంబు[65]కళిక లొల్క
నతితీవ్రగతి కేన యని టెక్కె మెత్తుతెఱంగున దట్టిచెఱంగు నిగుడ
దృఢతరస్వితకు ధాత్రి యొసంగుకావునా నడుగునఁ బాంసువు లతిశయిల్లఁ
దనుఁ గూడవచ్చు గంధవహంబు బంధించి గెలుతు నన్గతి ముష్టికేలు దనరఁ
బార్శ్వముల సారెనల్లాడు పంచెకట్టు, కోకకొంగులు వేగానుకూలఘటిత
విపుల[66]పక్షద్వయస్ఫూర్తి వెలయుచుండ, రయసముద్ధతి మీఱి ద్వారవతిఁ జేరి.

123


మ.

నడువీథి న్విడిగాలఁ దా నరుగుచుండ న్విస్మయం బంది య
య్యెడఁ బౌరు ల్గని యాడనాడఁ గుమురై యేవార్త యేవార్త యం
చడుగం బల్మఱు మేలుసుద్ది యని [67]యత్యంతంబుగాఁ బల్కుచున్
వడిఁ బదాక్షుహజారముం గదియ నానందంబుతోఁ బోవుచున్.

124


సీ.

కూచి సేయింపఁగాఁ జూచె నందమొ యేల వైద్యుఁ డెఱుంగఁడే శార్ఙ్గలతిక
వెలిగుడారంబుల నిలిపె నందమొ యేల బాణుఁ డెఱుంగఁడే బంధురగద
దాడి వెట్టుటకునై తలఁచె నందమొ యేల నరకుఁ డెఱుంగఁడే నందకంబు
గడీదుర్గములమీఁద విడిసె నందమొ యేల సాళ్వుఁ డెఱుంగఁడే చక్రధార

యిం దొకటియైనఁ గానరాదేమొ కాని
పూనుకొని మేలు దెల్పెడు వీనితెఱఁగు
లనుచుఁ దనుఁ జూచి ముదిమంత్రు లాడుకొనఁగఁ
దనరుకక్ష్యాంతరంబుల దాఁటి యేగి.

125

కృష్ణుఁడు చంద్రభానున కెదురుచనుట

ఉ.

కమలదళాయతాక్షుసముఖంబునకుం జని మ్రోల విన్నప
త్రము లిడఁ దక్కుమారలిఖితస్వశుభోత్తరవాచికంబులం
బ్రమదము గాంచి వానికి నపారధనంబు లొసంగి యారమా
రమణుఁడు పుత్రదర్శనపరత్వర నప్పుడు తేజి నెక్కినన్.

126


సీ.

విడిగాల శౌరితత్తడివెన్క నేతెంచె నగతులఁ జేఁబూని చారుచంద్రుఁ
డందంబు గాఁగ నైదాఱుగుఱ్ఱములతోఁ గదలె వేగమున సంకర్షణుండు
వడిఁ దెమ్ము తెమ్మని యడిదముఁ గైకొని పరువున నరిగె జాంబవతిపట్టి
పడివాగె హరిమ్రోలఁ బట్టి కీరపఠాణి నెక్కి ముంగల నేగెఁ జక్కనయ్య
వెలుపటిహజారముస నుండి వెలినె వెలినె, చేత బెత్తంబుఁ గైకొని సేన నెల్ల
వెడలు మని చెప్పి పంపుచు వెన్నునెదుట, హరిగెనీడల నడచె [68]గదానుజుండు.

127


మ.

హరి యిట్లేగినమాట వింట తడ వాత్మావాసము ల్వెల్వడం
ద్వరసామ్రాణుల సాదు లడ్డముగఁ ద్రోవం బట్టి రా నెక్కి యొం
డొరుల న్మీఱ హుటాహుటిం గదలి రత్యుత్కంఠ నల్లుండ్రు సో
దరులుం బుత్రులు చేర నచ్యుతుని గోత్రాపాంసువు ల్గ్రమ్మఁగన్.

128


[69]సీ.

ఎదురైనవారల నేత్రోవ హరి యేగె నని సారె కడుగుచు నరుగువారు
గ్రక్కున వీథులఁ గన్గొని కొలువు మ్రొక్కులు మ్రొక్కి వెనువెంట [70]వెలలువారుఁ
దమవారిఁ బొడఁగన్న దట్టికైదువులు గైకొని తెమ్మనుచుఁ గూడఁ [71]జనెడువారు
రా జేగెనేమొ రారా నీవు రమ్మని యొండొరుఁ బిలుచుచు నుఱుకువారుఁ
ద్రాళ్లు వైవక దంతులఁ దఱుమువారు, సిడెము లెత్తక రథములు నడపువారుఁ
బల్లణింపక హయములఁ బఱపువారు, నైనబలములు తోఁకచా లగుచుఁ గదలి.

129


క.

చనఁ జన నటఁ దోడ్తో వెను, కొని [72]కోట్లుం గొండ లగుచుఁ గూడుచు నడచెన్
వనమాలివెంట వాద్య, ధ్వనిఁ గులశైలములు వడఁక ధర యూటాడన్.

130

శా.

శ్రీకాంతుం డిటు లేగుదెంచె నని సంప్రీతిన్ హితు ల్దెల్ప ను
ల్లోకానందముతోడ నావిజయలోలుం గూడి సత్యాసుతుం
డాకంజాక్షు నెదుర్కొన [73]న్వెడలి డాయన్వచ్చెఁ దో శాబరా
నీకంబు ల్నలువంకలన్ బలసి యున్నిద్రస్థితిం గొల్వఁగన్.

131


ఉ.

వచ్చి వినీతితో దనుజవైరికిఁ జాఁగిలి మ్రొక్కి సీరికిం
బచ్చనివింటివానికి నమస్కరణం బొసరించి భక్తితో
నచ్చట నున్న పెద్దలపదాంబురుహంబుల వ్రాల నందఱున్
గ్రుచ్చియుఁ గౌఁగిలించికొని కూరిమి దీవన లిచ్చి రయ్యెడన్.

132


మ.

నతరక్షానిధిశౌరి పక్కణముచెంత న్వేలమున్ డించి యు
న్నతదివ్యాంబరమండపాంతరమున న్సద్బాంధవశ్రేణితో
నతులస్ఫూర్తి వసింపఁ దత్సకలనృత్తాంతంబు చారు ల్రయో
ద్ధతులై తెల్పిన రుక్మబాహుఁ డనువిందాన్వీతుఁడై చెచ్చెరన్.

133


క.

ప్రియబాంధవవర్గముతోఁ, బయనం బై వచ్చి దనుజభంజను బలదే
నయుతుం బొడఁగని మ్రొక్కుచు, నయమంజులఫణితి నాజనార్ధనుతోడన్.

134


ఉ.

ఏమఖిలంబునుం దెలిసి యిచ్చటికిం జనుదెంచినార మిం
కేమియు నానతీవలవ దిప్పుడు మామన వాలకించి దే
వా మముఁ బ్రోవు పుత్రులవివాహ మొనర్పఁగ నేగుదెమ్ము గా
రామడర న్మదీయనగరంబున కేమిట లాతివారమే.

135


[74]క.

అని [75]నయము నెనరు దొరలం, దనకును విన్నప మొనర్చు ధరణీశుల మ
న్ననఁ జూచి యపుడు సాత్యకిఁ, [76]గనుఁగొని యాతండు నట్ల కాఁ దెలుపుటయున్.

136


గీ.

సకలసేనలు గొలువ నానాశార్ఙ్గపాణి, రాజసంబునఁ గుండినరాజధాని
డాయవచ్చిన మునుమున్న పోయి రుక్మ, బాహుఁడు బిడారములు నులుపా లమర్చి.

137


[77]సీ.

అపరంజివాకిళ్ల ననఁటులో యిడుపుల నెసఁగు పచ్చలడాలొ యెఱుఁగరాదు
బంగారుటిండ్ల దీపంబులో గోడల వెలుఁగు కెంపులడాలొ తెలియరాదు
జాళువాలో వలజల్లులో కొణిగెల నలరు వజ్రపుణాలొ యరయరాదు
పసిఁడియోవరుల ధూపంబులో సోరణగండ్లనీలపుడాలొ కానరాదు
మేలిమిహజారములు వన్నె మేలుకట్లొ, చిత్రమణికాంతులో విభజింపరాదు
అనఁగఁ జనునొక్కనగరున [78]నపుడు లీల, వనజనాభుని విడియించె మనుజభర్త.

138

చ.

కళ గల జీవరత్నములు గందపుమ్రాఁకులు పంచవన్నెచి
ల్కలు పయిగోవకస్తురి కళాచి పునుంగు జవాది చాఁదుప
ట్టెలు పలువన్నెకోకలు పటీరము నిండ మెఱుంగుజాళువా
పలకలు నించియున్న యులుపా పొలుపారఁగ నాదరించుచున్.

139


[79]క.

వనమాలి యానృపులు వెను, కొనిరా మోదమునఁ గొలువుకూటంబునకుం
జని కూరుచుండి వారల, కనియె న్మందస్మితంబు లంకూరింపన్.

140


క.

వైవాహికలగ్న మొకటి, యీవేళం గలుగునేమొ యిప్పుడు తెలియం
గావలయు ముహూర్తజ్ఞుల, రావింపుఁ డటన్న వారు రప్పించుటయున్.

141


క.

బ్రాహ్మణులు కొంద ఱపుడా, జిహ్మగపర్యంకుని గదిసిరి "యోవైతాం
బ్రహ్మణ” యనుమంత్రమున స, జిహ్మతమంత్రాక్షతములు శిరమున నిడుచున్.

142


క.

వారలకున్ భక్తి నమ, స్కారం బొనరించి గరుడగమనుఁడు మీ రీ
లగ్నమొకటి వి, చారింపుఁ డటన్న వారు సంతస మెసఁగన్.

143


క.

విని కొంతతడవు తమనె, మ్మనముల నూహించి నేఁడు మా పొకలగ్నం
బనువైనది గల దది యో, వనజేక్షణ దంపతులకు వాంఛిత మొసఁగున్.

144


క.

అని తనకుఁ దెలుప విప్రులు, బనిచిన ననువిందరుక్మవాహులు హరిచే
ననుమతులై వేగమ తమ, తనయలఁ దోడ్కొనుచుఁ జనిరి తత్సమయమునన్.

145

వైవాహికయత్నము

సీ.

ఈడాపునీలాలగోడల మృగనాభికోదారచర్చ సహోక్తిఁ దెలుపఁ
గలువడాల్గలకెంపుమళిగెల మాల్యరక్తోత్పలంబులు విశేషోక్తిఁ దెలుప
వరుస సూత్రపురాల [80]వల లెత్తు సౌధవీథుల కేతుపటము లత్యుక్తిఁ దెలుపఁ
బుష్యరాగపుహర్మ్యములమీఁది కలశంపుటుదిరిచాయలు స్వభావోక్తిఁ దెలుప
నధికృతులు రుక్మబాహునియాజ్ఞ రాజ, ధానిఁ గైసేసి రప్పు డెంతయుఁ దదీయ
లక్ష్మిమేనఁ జతుర్వధాలంకృతులను, దాను హరిఁ గాంచువేడుకఁ బూనె ననఁగ.

146


ఉ.

కంసవిరోధి యానతిని గర్గమునిప్రముఖు "ల్తదేవల
గ్నం సుదినం తదేవ” యనఁగా శుభకాంచనపీఠి నుంచి యు
త్తంసముఖాచ్ఛభూషణకదంబ మెడల్చి మృదంగకాహళీ
సంసదుదారనాదము లెసంగ సతు ల్గవగూడి పాడఁగన్.

147

మ.

వలయవ్రాతము పైకిఁ ద్రోఁచి పదము ల్వాటంబుగా [81]నూఁది లే
జిలుఁగుంబయ్యెదకొంగుఁ జెక్కి యలఁతం జేమార్చుచు న్నమ్రయై
బెళుకుంగౌను గురు ల్చలింపఁగ సరు ల్పింపిళ్లు గూయం దమిం
దలయంటెం జెలి యోరతు వేడ్క నఱగంటం జొక్కురాచూలికిన్.

148


చ.

కెలన నొకర్తు బంగరపుగిన్నియఁ జందన మూని నిల్వఁగాఁ
గలయఁగఁ బెన్నెఱు ల్పులిమి గందము పైఁజిలికించి గోరుము
క్కుల దిగదువ్వి చేఁ బిడిచి కోమలియోర్డు కరాంబుజద్వయీ
లలితసువర్ణకంకణకలధ్వని వీనులవిందు సేయఁగన్.

149


మ.

తళుకున్బయ్యెద జాఱఁ జన్నుఁగవచెంత న్మించుడాలీనుకు
చ్చెలకొంగు ల్గుదియించి తంబుగలఁ జేచేఁ గొంద ఱందీ నొడల్
కలయ న్వేపధు వూన నూర్పు లడరంగా వేడ్కతో నొక్కనె
చ్చెలి కంసాంతకసూతికి జలకమార్చెన్ [82]గాంగతోయంబులన్.

150


క.

కడకొంగు ముడిచి తలపా, వడ యొకచెలి చుట్టె నొక్కవనిత తనువునం
దడియొత్తెఁ జలువదుప్పటి, పడఁతియొకతె యొసఁగె నానృపాలాగ్రణికిన్.

151


ఉ.

ఒక్కలతాంగి కైయొసఁగె నొక్కవధూటి కిరీటిపచ్చఱా
ముక్కలిపీఁట వెట్టె నొకముద్దియ కుంచియవైచె వెండ్రుకల్
చిక్కెడలించె నొక్కకలశీకుచ తొయ్యలియోర్తు జూళువా
చక్కనిబెజ్జపున్ బరణిసందుల ధూపము గొల్పె మెల్పునన్.

152


సీ.

కుఱుచకచంబులు గూడఁగూడఁగ దువ్వి యొఱపుగా సిగవైచె నొకవధూటి
పలుదెఱంగులకదంబపుఁబూవుటెత్తులు చుట్టెఁ జుట్టుగ నొక్కనూసగంధి
జీవరత్నంబులు చెక్కినసంపెంగ[83]మొగ్గతాయెతు లొక్కముదిత చేర్చెఁ
బన్నీటఁ బదనైన పైగోవకస్తూరితిలక మొయ్యన నొక్కతెఱవ దీర్చెఁ
వెలఁది యొక్కతె కుంకుమకలప మలఁదెఁ
దరుణి యొక్కతె గొజ్జంగిసురటి విసరె
మగువ యొక్కతె జిలుఁగుధూమ్రంబుఁ జిలికె
నువిద యొక్కతె నునుసోఁగయొంటు లిడియె.

153


క.

చెలి యొకతె పచ్చపట్టెల్, బలసిన బిదుహెళిసెసరిగెపనిపైఠానీ
చలువయఱచట్టఁ దొడిఁగెన్, సలలితగతి నొకతె కడకశలు ముడి వైచెన్.

154

గీ.

రమణి యొక్కతె పీతాంబరపుఁగుళాయిఁ
బెట్టె దంతంబుదబ్బ చేఁబెట్టె నొక్క
చెలి నెఱుల్ చక్కఁగాఁ ద్రోఁచె లలన యోర్తు
కేల నపరంజిగొలుసులు గీలుకొలిపె.

155


క.

నీలంపుమేను సూత్రపు, రాలకనుంగవయుఁ బుష్యరాగపుఁదేనుల్
గ్రోలెడి చొక్కపుఁదుమ్మెద, తాళియ నొకలేమ పేరెద న్నెలకొలిపెన్.

156


గీ.

కట్టికమృగేక్షణ ల్సముఖా యనంగ
నొకతె గొబ్బునఁ గైదండ యొసఁగ లేచి
నిలుచుటయుఁ బైఁటచెఱఁగుల జిలుఁగుచంద్ర
కావిపచ్చడ మతనికిఁ గట్టె నొకతె.

157


క.

క్షితినాథుని ముంగల నొక, యతివయుఁ దా మంచినిలువుటద్దము నిలిపెన్
లతకూన యొకతె యాదవ, పతిసుతునకుఁ గప్పురంపుబాగా లొసఁగెన్.

158


గీ.

ఈవిధమున నుచితశృంగారములు దాల్చి
యలరుసుతుని బిలువు మనుచు నపుడు
దానవారి వేడ్క నానతీ నందంద
చెలులు సంభ్రమమునఁ బిలువఁ బిలువ.

159


చ.

కులుకుమెఱుంగుక్రొంబికిలికుచ్చుల దంతపుఁబావ లొక్కతొ
య్యలి తొడిగింప మెట్టి మణిహంసకనాదము మించ నొక్కపై
దలి కయిదండఁ బూని వనిత ల్సముఖం బొనరింప నిండుచు
క్కలదొరలీలఁ బెండ్లిచవికం గదియం జని కూరుచుండినన్.

160


క.

ఆరాజన్యకుమారుని, [84]కారాదభిలోలకంకణాంకురితరుచి
ద్వైరాజ్యరాజితంబుగ, నీరాజన మెత్తి రసితనీరజనయనల్.

161


ఉ.

లోలవిలోచన ల్విజయలోలుని నట్టుల శౌరియానతిం
జాల నలంకరించి రతిసాంద్రశుభోన్నతి నంత నచ్చటన్
బాలికలం దదీయనరపాలు రలంకృతి సేయఁ బంచినన్
నీలకచామణు ల్కుముదినీసతిఁ గొందఱు చేరి రింపుగన్.

162


సీ.

చెలువ మున్నేఁచిన యలులసంపెఁగతేనె నానుచుగతి నోర్తు నూనె యంటఁ
గలికి యొక్కతె మరుకైదువు జల్లి కూఁకటిగింజ లిడుగతి నటక లిడియె

గనప బంగరుశలాకను జూజువట్టించుపగిది నొక్కతె మేనఁ బసుపుఁ బూసెఁ
నెలదీవెఁ బాఁదున నిలిపి నీరార్చులాగున నొక్కలేమ మజ్జన మొనర్చె
[85]నెలమిఁ గుముదిని నూరార్పి నలసి జిలుఁగుఁ
జంద్రికలఁ జేర్చగతి నోర్తు చలువ లొసఁగెఁ
గలికిపురి నెమ్మినిడుసోఁగ గఱులునివురు
చెలువున నొకర్తు పెన్నెఱు ల్చిక్కుపుచ్చె.

163


క.

తెలిగను నెలపులుఁ గుంబిలు, కలుపొదలన్ మేతఁ [86]మరపఁగా నడుమం గ్రొ
న్నెలమొలక నిలిపెనో యనఁ, దిలకము కపురమున నొకతె దీర్చెం జెలికిన్.

164


క.

లీలావతి యొకతె శ్రుతి, శ్రీలు సుముఖవిధుని కెత్తఁ జేకొను నునుము
త్యాలారతులో యనఁగా, బాలికకు మెఱుంగుఁగమ్మపంజులు చేర్చెన్.

165


క.

మెలపున నిశ్శ్వాసమరు, త్కుల మధరామృతముఁ జేఁదికొనుటకు జాళ్వా
గొలుసులఁ దీర్చిన పటికపుఁ, గలశం బన నొకతె నాసికామణి యిడియెన్.

166


గీ.

మెఱుఁగుఁదీఁగె తళుక్కున మించు కంధ
రాంచలంబున నుండి శైలాగ్రమునకు
జాఱు నాసారములు వోనిసరులు వైచె
నువిదయఱుతఁ గుచంబుల నొరయ నోర్తు.

167


క.

చెలిమో మనుకలువలచెలి, యలకావళిపేరి రజని నలమికొనఁ గరం
బులు సాఁచెనో యనంగాఁ, గలికి యొకతె యునిచె బాసికపుఁబూదండల్.

168


గీ.

ముదిత యొక్కతె విధుమణిముకుర మెదుట, నిలుప నచ్చటఁ దొయ్యలినీడ యడరి
విమలదుగ్ధపయోనిధి వెడలునట్టి, లచ్చిరూపంబు నచటఁ దలంపఁజేసె.

169


క.

ఈరీతిని ననువిందుకు, మారికఁ గైసేయఁ బనిచి మౌహూర్తికవా
క్ప్రేరితుఁడై వైదర్భమ, హీరమణుఁడు వచ్చి లగ్న మెఱిఁగించుటయున్.

170


ఉ.

అండజరాజవాహనసుతాగ్రణి పాండురవర్ణభద్రవే
దండము నెక్కి కల్పకలతాంతసరగ్రధితాతపత్రముల్
నిండిన [87]తారకేందుతతి నింగి ఘటింప మృదంగభేరికా
చండధణంధణధ్వని దిశాకుహరంబుల నాక్రమింపఁగన్.

171


సీ.

గంధతైలాపూర్ణకరదీపకోటితో నరనాథమకుటరత్నములు వెలుఁగ
హైమరథోత్కీర్ణయంత్రపుత్రికలతో వైమానికాంగనావళి నటింపఁ

బ్రసవతోరణరణద్భ్రమరగీతములతోఁ బుణ్యసాధ్వీగానములు సెలంగ
వందివైతాళికవ్రాతసన్నుతులతో యతికృతాశీర్వాదరుతు లెలర్ప
ననఘ శుభవస్తుపూరితకనకపాత్ర, పాలికలతో సువాసీసు ల్మ్రోల నడువ
నుద్ధవాక్రూరబలముఖ్యయుక్తుఁ డగుచు, యదుకులాధీశ్వరుఁడు వెంట నరుగుదేర.

172


క.

అలఘుతరశ్రీఁ గదిసిన, నెలమి నెదుర్కొని విదర్భనృపుఁ డతని పదం
బులు గడిగి భర్మమయని, ర్మలపీఠిక నునిచి యొసఁగె మధుపర్కంబున్.

173


చ.

గవిసెనఁ బూనినట్టిరతికాంతునికార్ముకవల్లియో యనం
బవిరిముసుంగు వెట్టి నలుపజ్జఁ జెఱంగులు కూడఁబట్టుచుం
గువలయలోచన ల్చవికకుం గొనితెచ్చిరి వెంట నైదువల్
ధవళముఁ బాడ భోజవసుధావరరాజతనూజ నత్తఱిన్.

174


గీ.

కుముదినీచంద్రభానుమధ్యమున నప్పుడు, తళుకువెన్నెలపగిది బాంధవచకోర
కోటి యుప్పొంగ శ్యామానిగుంభనమున, దీపితంబైన వెలిపట్టుతెఱ యెసంగె.

175


ఉ.

సంవిదపారగౌరవవిచక్షణు లైనధరాసురేంద్రు లే
వంవిధభద్రవేళ శుభవస్తులఁ బేర్కొనుచు “న్వధూవరా
భ్యాం వరదా భవం" తనుచు హర్షమునం బులకాంకురావళీ
సంవృతగాత్రుఁ డైననృపచంద్రున కెంతయు నెచ్చరించుడున్.

176


శా.

శ్రీరామారమణాత్మజన్మునకు లక్ష్మీనందనాకారరే
ఖారమ్యోజ్జ్వలరూపధేయునకుఁ దత్కన్యాశిరోరత్నమున్
ధారాపూర్వముగా నొసంగె నలవైదర్భుండు కంసారి కం
భోరాశీంద్రుఁడు లచ్చి నిచ్చుపగిదిం బూర్ణానుమోదంబునన్.

177


శా.

నారీరత్నము చారుహస్తకమలాంతఃకర్ణికాకేసరా
కారంబు ల్గుడజీరకంబు లిడియంగాఁ బట్టి మంజీరముల్
గేరన్ గ్రక్కున నిక్కి భర్తతలపైఁ గే లానించి నిల్పెన్ "ధ్రువం
తే రాజా వరుణో ధ్రువ" మ్మనుచు ధాత్రీనిర్జరు ల్పల్కఁగన్.

178


క.

గాంగేయగాత్రిగళమున, మంగళసూత్రంబుఁ గట్టె మాధవసుతుఁ డా
నంగాధిరాజ్యమున కెసఁ, గం గట్టిన తోరణంబుక్రమము దలిర్పన్.

179


మ.

చరణంబు ల్ధరనత్తఁమిల్లఁగ నుదంచన్మధ్యనీవీపరి
స్ఫురణ న్నాభి యొకింత దోఁపఁ గుచము ల్పొంగార దోర్మూలభ
ర్మరుచు ల్మించుల మించ నించెఁ దలఁబ్రా ల్రాజాస్య తత్తన్మనో
హరతాదర్శననమ్రుఁడైన పతిపై యత్నానపేక్షంబుగన్.

180

శా.

ప్రఖ్యాతాగమ[88]మంత్రరాజములు పైపైఁ గుంభీనీదేవతా
ముఖ్యు ల్విన్ప వరుండు తన్మృదుపదాంభోజాతసంస్పర్శభూ
సౌఖ్యశ్రీ నడిపించె సప్తపదము ల్సారంగశాబేక్షణ
"న్సఖ్యం సాప్తపదీన" మన్పలుకు డెందాన న్విచారించుచున్.

181


ఉ.

రాజతనూజయుక్త యయి రంజిలి వేలిమి వేఁడి వేల్పులో
లాజలు వేల్చె భోజసుత లాలితసాంధ్యగభస్తిఁ దారకా
రాజి ఘటింప బాలదినరాజసమేతవిభాతలక్ష్మికిం
దా జతయై ప్రఫుల్లముఖతామరసస్ఫురణంబు మించఁగన్.

182


సీ.

దివ్యసేవ్యారుంధతీవసిష్ఠాదిదంపతులు దీవన లిచ్చి రతులఫణితిఁ
బ్రార్థితసాంగవేదాఖిలక్షితిసురోత్తము లభీష్టము గాంచి రమితగరిమ
యదువిదర్భాన్వవాయనిధేయబంధువర్యులు వీళ్లు చదివించి రుచితవృత్తి
మహితోత్సవాయాతబహుదేశరాజచంద్రులు విందులు భుజించి రలఘులీల
బ్రబలగాయకనర్తకపాఠకాద్య, నేకవిద్యాధురీణు లీహితముఁ బడసి
రుర్వి లక్ష్మీశ్వరుఁడు సేయునుత్సవంబు, సకలభువనాద్భుతోన్మేషశాలి గాదె.

183


క.

ఈమాడ్కిన యనువింద, క్ష్మామండలనాథునింట సాత్యకితనయ
గ్రామణిపాణిగ్రహణమ, హామహితోత్సవము సాంగమై విలసిల్లెన్.

184


ఉ.

ఆతఱి రుక్మబాహువిభుఁ డాత్మసుతాకరపీడనోత్సవా
యాతసమస్తదేశవసుధాధిపచంద్రుల నంచె సత్క్రియా
జాతవినూతనప్రమదసాంద్రులఁ జేసి యనూనదానవి
ద్యోతితపంచశాఖి విజయోత్సవతేజితపంచశాఖియై.

185


సీ.

మణిరాజధరవంశ్యమండనంబునకు నీమణులు యోగ్యము లంచుఁ బ్రణుతి సేయఁ
గరివరావనవిచక్షణసత్కులేంద్రున కర్షంబు లీకరు లని గణింపఁ
హరిమహోదయనూతనాసమహరికి నీవారు లుచితంబులం చభినుతింప
నగణితకాంతాప్రియకుమారమదనున కనురూప లీకాంత లని తలంప
నసదృశామూల్యరత్నగంధాంధహస్తి
మల్లసామ్రాణికాశ్వరంభానిభాభి
రామరామాతతుల నిచ్చె మామ యహిమ
భానుసమభానునకుఁ జంద్రభానునకును.

186

గీ.

మఱియు బహువిధరత్నసంపద లొసంగి
యపుడు నిజకన్యఁ బ్రియునింటి కనుపఁదలచి
రాజమణి బుజ్జవముసఁ జేరంగఁ బిలిచి
యాదరోదారమృదులవాక్యములఁ బలికె.

187


క.

శ్రీభర్త మామ యలస, త్యాభినుతసమాఖ్య యత్తయఁట తత్సేవా
వైభవ మెప్పుడుఁ గలదఁట, నీభాగ్యం బేమి సెప్ప నీరజనయనా.

188


ఉ.

చిన్నటనాఁట నీకరకుశేశయముం గని పెద్ద లెల్ల లో
కోన్నతదివ్యజాతిమహిమోజ్జ్వల యౌ నని పల్కుపల్కు నేఁ
డెన్నిక కెక్కె సర్వభువనేశ్వరుఁడైన యుపేంద్రు[89]కోడలై
కన్నియ పారిజాతకలికావహనార్హత నీవు గాంచుటన్.

189


గీ.

ఇనవిముఖవృత్తి కలనైన నెనయకమ్మ, యెందు దోషాభిముఖ్యంబుఁ జెందకమ్మ
కన్నవారికి నతిచిత్రగరిమ గలుగఁ, గుముదినిహితాళులకు విందుఁ గూర్పవమ్మ.

190


క.

అని పలికి నృపతి కన్నియ, ననుపమతరవైభవమున ననుపఁ బ్రియసుహృ
ద్వినుతహృదయారవిందుం, డనువిందుఁడు నట్ల యనిచె నాత్మజ నంతన్.

191


మ.

ప్రమదాయుక్తకుమారరత్నములతోఁ బ్రత్యగ్రగంధేభవా
హమహాస్యందనవస్తుసంపదలతో నానందసందీప్తబం
ధుమహీభృన్నివహంబుతోఁ గతిపయాదూరప్రయాణంబులం
గమలానాథుఁడు వచ్చె ద్వారవతికిం గౌతూహలాన్వీతుఁడై.

192


క.

ఆవేళఁ జంద్రభానుని, దేవేరిం జూచువేడ్క దీపింపఁ బురీ
కేవలమధ్యలు మణీనం, భావితసౌధంబు లెక్కి పలికిరి తమలోన్.

193


చ.

పొలఁతుకఁ జూడరమ్మ గడివోవనిచక్కఁదనంబు తెమ్మ చెం
గలువలకోరికాని కయికానికి ముద్దులగుమ్మ నిండుచు
క్కలదొరనిగ్గుతోఁ గరువుగట్టినపుత్తడిబొమ్మ వాసనల్
గలవిరికొమ్మ యిట్టినవలా నవలా యొకబాల పోలునే.

194


చ.

తలవలచుట్టు వచ్చుఁ గనుఁదమ్ములు తమ్ములు గండుమీలకుం
దళతళ వొల్చు నంగములతావులు తావులు కమ్మపూలకుం
గళతులకించు పెందుఱుముకప్పులు కప్పులు మబ్బురేలకున్
మెలఁతుకగుబ్బచన్నుఁగవమించులు మించులు బొమ్మరాలకున్.

195

చ.

కలువల నేలవే వెడఁదకన్నులు చన్నులు పైఁడికుండలం
గెలువఁగఁజాలవే చికిలికెంజిగి క్రొంజిగురాకురేకుఁ లేఁ
దళుకులఁ దోలవే మృదుపదమ్ములు [90]దమ్ములు నించు చొక్కపున్
వలపులఁ బోలవే వదనవాసన లీసునయప్రచారకున్.

196


సీ.

కోకముల్ శశిమ్రోలఁ గూడలే వను టెట్లు శశిమ్రోల నిదె కూడెఁ జక్రయుగము
చీఁకటు ల్రవిదీప్తిఁ జేరలే వను టెట్లు రవిదీప్తి నిదె చేరెఁ బ్రబలతమము
అళులు సంపెఁగలచెంతలఁ జేర వను టెట్లు సంపెంగ నిదె చేరె షట్పదములు
కమలము ల్కరికేలఁ గడునొప్ప వను టెట్లు కరికేల నిదె యెప్పె సరసిజములు
నాననము చన్నుగవయు సీమంతమణియుఁ
దుఱుము నాసయుఁ గనుదోయి తొడలు చరణ
పల్లవంబులు ననుపేరఁ బరిఢవిల్లెఁ
జూడరే యింతు లిది యెంతచోద్య మరయ.

197


చ.

అని పొగడ న్యదుప్రవరుఁ డాత్మకుమారుల నానవాబ్జలో
చనల గృహప్రవేశశుభసంపదఁ బెంపు వహింపఁజేయ వా
రును గురుదేవతాభజనరూపమహాచరణం బొనర్చి త
ద్ఘనతరభద్రసూక్తుల సుఖస్థితిఁ గైకొని రంత నొక్కెడన్.

198


సీ.

[91]వరుల నెంతయుఁ బెన్కువలఁ దేల్చు ప్రతిమల కురువిదూరజరుచుల్ తెరలు గాఁగఁ
జెలువలమ్రోల దేశి నటించు ప్రతిమల [92]కరుణాశ్మదీప్తిదీపార్చి గాఁగ
రమణులతో వసంతము లాడు ప్రతిమల కలఘువజ్రమరీచి కొలను గాఁగఁ
గాంతుల నవ్యసంగతి కుల్కు ప్రతిమల కింద్రనీలచ్ఛాయ లిరులు గాఁగ
నధిపుల వరించుప్రతిమల కమితహరిత
మణిగభస్తులు దూర్వాంకమాల్యములుగ
నొనరు కేళీగృహంబున నున్నయయ్య
దూద్వహకుమారకుని యుల్ల ముల్లసిల్ల.

199


క.

కడుఁ బ్రార్దింపఁగఁ దగుజను, లడుగడుగున కెత్తులిడఁగ నలఁతి దివియఁగా
వెడవిల్తుతేరు నడచిన, వడువున సతి వచ్చెఁ గనకవసనావృత యై.

200


చ.

వనితలచాఁటున శుభనివాసము సొచ్చి మఱుంగు చేరి ని
ల్బినయది గావునం దరలలేమి యధీశునిమ్రోల సిగ్గునం

జనకుఁ డటంచు నాన యిడఁజాలమిఁ గన్యక కన్నుసన్నలం
బెనఁగఁగఁ గౌర్యగౌరవము పేరున నేగిరి బోటు లయ్యెడన్.

201


సీ.

రాజమండలజయప్రౌఢిఁ బెంపొందు నీవదనాబ్జ మున్నతిఁ బొదలఁదగదె
యతనుకళారూఢి నడరునీకనుదోయి నవదర్శనశ్రీ లొనర్పఁదగదె
సరససారసరాగసంపత్తి నలరు నీనునుమోవి మినుకుల నునుపఁదగదె
పటుగిరీశఖ్యాతిఁ బరఁగు నీకుచయుగ్మ మపగతాంబరవృత్తి నమరఁదగదె
మృదులతాలక్ష్మి నెసఁగునీ[93]మే న్మదీయ
వాంఛితఫలార్పణంబున వఱలఁదగదె
యనుచు నతిమంజులోక్తుల ననునయించి
సమధికోత్కలికాంచితస్వాంతుఁ డగుచు.

202


చ.

అనుగుణరాగసంఘటన మాఱడిచెందకయుండ శోభనాం
కనసుకరప్రవాళరుచిఁ గాసిలకుండ గ్రహించి యొయ్యనొ
య్యనఁ గలభాషిణిం దిగిచి యంకము సేర్చి ప్రవీణుఁ డాతఁ డిం
పున సడలించెఁ గంచుకము బోరున మించె నలంక్రియారుచుల్.

203


శా.

భావోజ్జృంభణము న్రసోదయపరీపాకంబు నవ్యధ్వని
శ్రీవిస్ఫూర్తియు మించె నాతిదృఢసంశ్లేషైకబంధాప్తితో
నావైదర్భి ప్రసన్నవృత్తి మృదుశయ్యం గూర్చి సాహిత్యమ
ర్మావిర్భావధురీణుఁ డై యలరె సత్యానందనుం డెంతయున్.

204


సీ.

రత్నహర్మ్యముల జంత్రపుబొమ్మ లనుఁగుచెయ్వు లొనర్పఁగాఁ బుట్టు నొక్కకినుక
నవవనంబులఁ దీవలివురు కేల్పాఁచి శుకోక్తిఁ బిల్వఁగఁ బుట్టు నొక్కకినుక
కేళీగిరుల నభ్రపాళీతటిద్రేఖ లొఱపుచూపఁగఁ బుట్టు నొక్కకినుక
దీర్ఘికాంతములఁ బద్మినులు తుమ్మెదచూపు లొనరింపఁగాఁ బుట్టు నొక్కకినుక
తక్కఁ దక్కినకినుకలఁ జిక్కువడని
మమతలఁదలంపు లీడేర్చుకుముదినీవి
శాలలోచనఁ దాఁ గూడి చంద్రభానుఁ
డనుపమానందసామ్రాజ్య మనుభవించె.

205


శా.

ఈమాడ్కిం గుముదిన్యరాళగమనాహేలామహోల్లాసియై
భామానందనుఁ డొక్కనాఁడు హరియుం బ్రద్యుమ్నుఁడు న్మెచ్చ వీ

ణామౌనిం బచరించి తుంబురునివల్నం గన్నగాంధర్వవి
ద్యామాహాత్మ్యముఁ జూపి [94]శౌరినుతుఁడై తాల్చెం గృతార్ధత్వమున్.

206


మ.

వితతధ్యానమదాలసాతనయనిర్విప్రాయ విప్రాయన
క్షతశంకాకరభక్తశోభనవిరాజన్మా యజన్మాయతి
ద్యుతికామప్రతిసంఘసంఘటితయోగోపాయ గోపాయనో
ద్యతమూర్తాస్మదఖండభాగ్యసముదాయచ్ఛాయ యచ్ఛాయదా.

207


క.

విశ్వనుతశశ్వదణిమా, ద్యైశ్వర్యవిశేషధుర్య యఘపాదపపా
రశ్వధికవర్య సాక్షా, ద్విశ్వంభరతాకృతార్యవిస్మయచర్యా.

208


భుజంగప్రయాతము.

భవాద్యాభిగద్యాత్మపద్యానవద్యా
నవాధ్యాత్మవిద్యానిషద్యాప్తవేద్యా
యవిద్యార్తివైద్యాయవిద్యాయహృద్యా
భవోద్యానసద్యాభవద్యాంబుపద్యా.

209


గద్యము.

ఇది శ్రీమద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసా
దిత సరసకవితారసోదాత్త దత్తనార్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం బైన
చంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందు సర్వంబునుం బంచమా
శ్వాసము.

  1. చ-ట-శ్రీయోగ
  2. ట-లో 11–12–13 పద్యములకు బదులుగా; వ. విచారించి రుక్మబాహునిపుత్రి యున్కిఁ దెలిసి నిజపురోహితుఁ డగుగాలవాఖ్యునిం బంచిన నతండునుం జని భీమనృపతనూభవుం డైనరుక్మబాహునిం గని. అనువచనము గలదు.
  3. ట-లో నీపద్యము లేదు.
  4. చ-యౌదార్య మవార్యధైర్యమును
  5. ట-లో నీపద్యము లేదు.
  6. చ-యతిమోదమునన్
  7. ఈపద్యము ట-లో లేదు.
  8. ద-మనులచిత్రాకృతి
  9. చ-మల్లడిఁ బెట్టుచు
  10. చ-వసింప
  11. ఇదియుఁ బైమూఁడుపద్యములును ట-లో లేవు.
  12. క-క్రౌంచపూగమున
  13. ట-లో నీపద్యము లేదు.
  14. చ-సింధుబాలలు రదోద్ధతి
  15. చ-వత్తులు పొత్తులు గట్టిమేన
  16. ట-లో నీపద్యము లేదు.
  17. చ-వెడవాళ్లు
  18. ట-లో నిదిమొదలు 45వ పద్యమువఱకు లేవు.
  19. చ-సిరసుకొండెములవారు
  20. లోరుతరకుముదధీకన్యశారి గాఁగ
  21. చ-జటలు
  22. ట-లో లేదు.
  23. జ-వరులయంసము
  24. చ-చెలువొందు
  25. ట-లో నిదియుఁ బైపద్యమును లేవు.
  26. చ-ట-భీల్లపాండవాది
  27. చ-బాచాచాలు
  28. చ-ట-కిన్నరీకలకలముల కేకి కురక, కోకరతు లూను తుందురుకోనలోన
  29. చ-ట-గేవలము ఠీవిగను
  30. చ-తావులకు
  31. కంజరజఃవింజరతర
  32. చ-రాజింప
  33. ట-దొలఁగుపయ్యెద
  34. చ-ట-మగువఁ బిలిచి
  35. చ-ఆయెలనాఁగ
  36. ట-వచ్చె గంధకరటి
  37. ట-లో నీపద్యము లేదు.
  38. చ-వేగక్షరత్కుంభ
  39. చ-గభభరము లురుల
  40. చ-ఎడనెడఁ బఱవ నంత
  41. చ-నమరు
  42. చ-ఆగజరాజు మధ్యవిపినాంతవశావశచిత్తమై
  43. చ-బాలకియు డిగ్గి జతగానిపంజు లూని, ట-పాలకీ డిగ్గి జతగానిపంజు పూని
  44. క-పార్థివావయవదయములు పడకయుండ
  45. చ-ట-నీలా గార్తి వహింప నేటి కకటా యేఁగల్గ
  46. చ.వనె
  47. చ-నమ్ముదితయు
  48. యిరులగువడి
  49. చ-సాత్యకినూను కి ట్లనున్
  50. ట-లో నీపద్యము లేదు.
  51. చ-దెలుపక
  52. చ-ట-సతులు
  53. చ-ట-భక్తియుక్తిమై
  54. చ-ట-గుబురైన
  55. చ-ట-లరయవచ్చి
  56. చ-పద్మగంధి
  57. చ-దెల్ఫి యల్లనన్, ట - బూని యిట్లనున్
  58. చ-ట-లో నీపద్యము లేదు.
  59. చ-లో నీపద్యమును దీనితరువాతి పద్యమును లేవు.
  60. చ-దిగీశపంక్తికి
  61. ట-ఈ పద్యము లేదు.
  62. చ-నమరశబరీప్రణీత
  63. చ-శైబకునిం
  64. ఇదిమొదలుగ మూఁడు పద్యములకు ట-లో "వాఁడునుం జని" యనువచనము గలదు.
  65. చ-కణిక లమర
  66. చ-పక్షద్వయంబున
  67. చ-సువ్యక్తంబుగా
  68. చ-బలానుజుండు
  69. ట-లో నీపద్యమును దీని క్రిందిపద్యమును లేవు.
  70. చ-కూడువారు
  71. చ-గునుకువారు
  72. చ-కోటులు కొండ లనుచు
  73. చ- దలఁచి
  74. ట-లో నీపద్యమునకుమాఱుగ "అనిన" అను వచనము గలదు.
  75. చ-ప్రియము
  76. చ-గనుఁగొన నాతండు నట్ల కానిమ్మనియెన్.
  77. ట-లో లేదు.
  78. చ-నధిపు లీల
  79. ట-లో నీపద్యము లేదు.
  80. వ-తెర లెత్తు
  81. క-మెట్టుచున్
  82. చ-గంధతోయంబు
  83. చ-తాయిత మొకతె వింతగ నమర్చె
  84. చ-కారాధనమంజుకంకణాల
  85. చ-కుముదినీకాంత నలరింపఁ గోరి
  86. చ-బెట్టఁగా
  87. చ-తారకేందురుచి
  88. చ-మంత్రనాదములు
  89. క-కోళ్లవై
  90. క-దేహము నిండుకాంతితో
  91. క-వరులచెక్కులకళ ల్వలదెల్పు
  92. క-కరుణాశ్మరింభోళికళలు గాఁగ
  93. చ-కును మదభి
  94. చ-తద్వినుతుఁడై