చంద్రగుప్త చక్రవర్తి/మొదటి ప్రకరణము
చంద్రగుప్త చక్రవర్తి
మొదటి ప్రకరణము
మగధ రాజ్యము
మగధము ఆర్యావర్తంబునందు మిక్కిలి పురాతన కాలమునుండి ఖ్యాతివడసిన యొక మహారాజ్యము. ఈ రాజ్యము యొక్క వైశాల్యము వేరు వేరు యుగములయందు వేరు వేరు విధములుగ నుండినను మొత్తము మీఁద నీ దేశమునకు ఉత్తరమున గంగానదియు, దక్షిణమున వింధ్యగిరియు, పడమట శోణానదియుఁ, దూర్పున చంపాదేశమును నెల్లలుగా నుండెనని చెప్పవచ్చును. ఇప్పు డీ ప్రదేశమును దక్షిణబేహార్ అనియెదరు. బేహారనునది విహారశబ్ద భవనము. బౌద్ధయుగమునం దీ రాజ్యముయొక్క చుట్టుకొలత రెండువేల మూఁడువందల మైళ్లు. ఇందలి గ్రామములసంఖ్య యెనిమిది వేలు.
మగధదేశపు రాజధాని ప్రథమమున గిరివ్రజ మను దుర్గము. పిదప క్రమముగా రాజగృహము, వైశాలి, పాటలీపుత్రము అను పట్టణములు రాజధాను లయ్యెను. ఉత్తర ప్రాంతమందలి రాజ్యముల యభివృద్ధియే యిట్టి మార్పులకు ముఖ్యకారణము. గిరివ్రజ మయిదుపర్వతముల నడుమ నిర్మింపఁబడిన యొక దుర్గము. రామాయణమునందు గిరివ్రజ మీలాగుననే వర్ణింపఁబడి యున్నది.*[1]
మహాభారతమునం దీపర్వతముల పేళ్లు వైహార, వరాహ, వృషభ, నృషిగిరి చైత్యకము లయినట్లు చెప్పఁబడియున్నది. ♦[2]ఇప్పు డీపర్వతములను జనులు వైభార, విపుల, రత్నోదయ, సోనగిరు లని వాడుకొనియెదరు. వైభార పర్వతము మీఁద జైనుల శాసనములు పెక్కులు గలవు. ఈ పర్వతము మీఁదనే క్రీ. పూ 543లో బౌద్ధుల యొక్క ప్రథమ పాంచవార్షిక సంఘము కూడియుండెను. గిరివ్రజము యొక్క చుట్టుకొలత నాలుగున్నర మైళ్లు. గిరివ్రజము కుశరాజు యొక్క కుమారుఁడగు వసురాజుచేఁ గట్టింపఁబడియె. కట్టిన శిల్పి పేరు మహాగోవిందుఁడు. గిరివ్రజపు రాతిగోడలకంటెఁ బురాతనమైన కట్టడము లెవ్వియు నార్యావర్తమునందుఁ గానరావు. గిరివ్రజమునే యిప్పటి జనులు పురాతన రాజగృహమని వాడెదరు.
రాజగృహ పట్టణము గిరివ్రజమున కుత్తరమున అర్థ క్రోశము దూరమున నిర్మింపఁబడియె. ఈపట్టణము బింబిసారుఁడను నృపపుంగవునిచేఁ గట్టింపఁబడియె. ఈతని కుమారుఁడగు ప్రజాతశత్రువు గౌతమ పుత్త్రునకు సమకాలికుఁడు. ప్రస్తుత మీ స్థలమందు రాజగిర్ అను జీర్ణదుర్గ మొకటి గలదు. ఇఁక మగధదేశపు రాజులనుగుఱించి విచారింతము.
మహాభారతకాలమునం దచ్చట జరాసంధుఁడను రాజు రాజ్యము చేయుచుండెను. అతఁడు మిక్కిలి పరాక్రమవంతుఁడు. ఆతని దాడికి ఓర్వలేక యాదవులు మధురానగరము విడిచి పాఱిపోయి ద్వారకలో నివసించిరి. అతఁడు పెక్కండ్రులగు రాజులను బట్టితెచ్చి తన చెఱసాలలో నుంచెనని మహాభారతమునందు వర్ణింపఁబడు యుండుటఁ జూడ నతఁడసామాన్య పరాక్రమశాలి యనియుఁ, బెక్కురాజులు తన్ను బలిసికొలువఁ బ్రభుత్వము చేయుచున్న చక్రవర్తియనియుఁ దోఁచుచున్నది. ధర్మనందనుఁడు రాజసూయ యజ్ఞముఁ సేయ నుద్యమించినప్పుడు కృష్ణ భీమార్జునులు గిరివ్రజమునకు బ్రాహ్మణులవలెఁ బోయి జరాసంధుని వధించి యతని చెఱసాలలోనున్న నసంఖ్యులగు మూర్ధాభిషిక్తుల విడిపించి, యతని పుత్త్రుఁడగు సహదేవునకే పట్టాభిషేకముచేసిన సమాచారము మహాభారతముఁ జదివినవా రందఱకును దెలిసిన విషయమే.
మహాభారత యుద్ధమునం దీ సహదేవుఁడు పాండవపక్షమునం బోరాడి హతుఁడయ్యెను. అతని వంశపువారగు నిరువదియొక్కరు రాజులు తరువాత రాజ్యము చేసిరి. చివరవాఁడు పురంజీవుఁ డను నామాంతరము గల రిపుంజయుఁడు. వీరందఱును గలసి వేయిసంవత్సరముల వఱకు రాజ్యముచేసిరని పురాణమువలనఁ దెలియ వచ్చుచున్నది. పురంజయునిమంత్రియగు శునకుఁడు తన రాజును జంపి తన కుమారుఁ డయిన ప్రద్యోతునకు రాజ్యము నిచ్చెను. ఈ వంశమువా రైదుగురు రాజ్యము నేలిరి. చివరవాఁడగు నందివర్ధనుని జంపి యాతని మంత్రియైన శిశునాగుఁడు రాజయ్యెను. ఈ వంశమునకు శిశునాగవంశ మని పేరు. శిశునాగుఁడు, కాకవర్ణుఁడు, క్షేమధర్ముఁడు, క్షత్త్రౌజుఁడు, బింబిసారుఁడు, అజాతశత్రువు, దర్శకుఁడు, ఉదయనుఁడు, నందివర్ధనుఁడు, మహానంది, అని శైశునాగులు పదుగురు.
శిశునాగు డేడవశతాబ్దమున రాజయ్యెనని చెప్పవచ్చును. ఈ వంశమునం దయిదవవాఁడు బింబిసారుఁడు. ఇతనికి శ్రేణికుడని నామాంతరము. ఇతడు క్రీ. పూ. 528 వ సంవత్సర ప్రాంతమున అంగరాష్ట్రము నాక్రమించి వశపఱచు కొనెను. ఇతడు కోసలరాజు కూతుఁను లిచ్చవివంశ కన్యను వివాహమాడెను. ఈరాజు రాజ్యము చేయుచుండఁగనే గౌతమబుద్ధుఁడును, మహావీరుఁడును దమతమ క్రొత్తసిద్ధాంతములను మాగధులకు బోధజేసి నూతన మతాభివృద్ధి చేసిరి. జైన మతాచార్యుఁడగు మహావీరుఁడు బింబిసారుని రెండవ భార్యకు దగ్గరి చుట్టము. గౌతమ బుద్ధుఁడు తన జీవితములో చాలకాల మితని రాజ్యములోనే నివసించి యుండెను. రాజ్యము విడిచి సన్న్యాసి యయి బయలుదేరిన తరువాత బుద్ధుఁడు ప్రప్రధమమున రాజగృహమునందే గురువులయొద్ద తత్త్వవిచారము నేర్చుకొనెను. అతఁడు బుద్ధత్వము చెందిన బుద్ధగయ మగధ దేశములోనిదే. బుద్ధుడు బింబిసారుని దనశిష్యునిఁ జేసికొని రాజగృహ పట్టణమునకు వెలపలనున్న వేణువనమునందు విశేషముగా వాసము చేయుచుండెను. అనేక రాజులును, విద్వాంసులును, బ్రహ్మవేత్తలును వేణువనమునకు వచ్చి యాతని మతమును స్వీకరించిరి. బుద్ధుఁడు నిర్యాణము చెందిన సంవత్సరముననే రాజగృహము నొద్ద సప్తపరిణెగుహలో ఏ నూరుగురు బౌద్ధాచార్యులు చేరి బుద్ధుని యుపదేశ వాక్యములను మూఁడు పిటకములుగా సంగ్రహించిరి.
బింబిసారుఁ డిరువదియెనిమిది సంనత్సరములు రాజ్యము నేలి తన రెండవ భార్య కుమారుఁ డగు అజాతశత్రునకు పట్టముఁగట్టి తాను ముక్తిమార్గమును వెతకుచుండెను. కాని అజాతశత్రువు దుర్మార్గుఁడై దేవదత్తుఁ డనువాని బోధవలనఁ దండ్రిని జంపించెను.
అజాతశత్రువు క్రీ. పూ 500 ల ప్రాంతమున రాజ్యమునకు వచ్చెనని చెప్పవచ్చును. గౌతమబుద్ధుని బోధవలన నీతనికిఁ దానుజేసిన పితృహత్యకై పశ్చాత్తాపముగలిగెననియు దరువాత నాతఁడు పరిశుద్దాచరణ గలవాఁడుగ నుండెననియు బౌద్ధ గ్రంథములు చెప్పుచున్నవి. ఈ యజాతశత్రువునకును, గోసలదేశపు రాజునకును, జరిగిన యుద్ధవిషయమైన యొకవింత కథ గలదు. అప్పటి కోసలాధీశ్వరుడు పసేనది. (ప్రసేనధీ ) ఈతని యక్కయగు కోసలాదేవి బింబిసారుని భార్య ; అనగా అజాతశత్రువునకు సవతి తల్లి. తన సవతికొమారుడగు నజాత శత్రువు తన భర్తను జంపగాఁ గోసలాదేవి యా దుఃఖముతో మరణ మొందెను. కోసలరాజులు కాశీరాజ్యములోని కొన్ని గ్రామములు కోసలాదేవికి నరణమిచ్చియుండిరి. ఆమె పోగానే యా గ్రామములు గోసలరాజయిన పసేనదిచే నాక్రమింపఁ బడియె. అందుపై ముసలివాడగు పసేనదికిని, అతని సవతి మేనల్లుడగు నజాతశత్రువునకును యుద్ధము ప్రారంభమాయెను. మొదట నజాతశత్రువునకు గొంచెము జయము కిలిగెఁ గాని నాల్గవసారి యాతడు దాడి వెడలినప్పుడు పసేనదిచేఁ జెఱఁబెట్టఁ బడియె. కాశీదేశము గ్రామములపై దనకు నేమియు హక్కులేదని యనిపించుకొని యాతని గోసలేశ్వరుడు విడిచి పెట్టెను. కాని చెఱలో నున్న కాలమందు నాతనికిని గోసలేశ్వరుని కూఁతునకును బ్రేమ యంకురించినందునఁ గోసలేశ్వరుడు తన కూతురగు వజిరా (వజ్రా) దేవిని అజూతశత్రువునకిచ్చి వివాహము చేసి వివాద గ్రామములనే యూమెకు అరణ మిచ్చెను.
ఇట్లు కోసలదేశములోని కొంత భాగమును స్వాధీన పఱచుకొని యజాతశత్రువు గంగ కుత్తరమందున్న లిచ్ఛవీ దేశముపై దండు వెడలి రాజధానియైన వైశాలి పట్టణమును స్వాధీన పజచుకొనెను. అజాతశత్రుని తల్లి లిచ్ఛవీ రాజు కూతురైనందున యిప్పుడీతడు జయించిన రాజ్యము తాతదయినను, మేనమామ దైనను కావలయును. ఈ దిగ్విజయముచే నాతడు గంగా నదికిని, హిమాలయ పర్వతమునకును నడుమ నున్న రాజ్యముయొక్క ఎక్కువ భాగమును సంపాదించి మగధ సామ్రాజ్యముయొక్క వైభవమును హెచ్చించెను. అజాతశత్రువు క్రీ. పూ. 475 సంవత్సర ప్రాంతమున గాల ధర్మము నొందియుండవచ్చును. ఆతని మనుమడు ఉదయుడు. ఉదయుని కాలము క్రీ.పూ 450 ఇతడే పాటలీపుత్రపట్టణమును గట్టించెనని చెప్పెదరు. అతని తరువాత నందివర్ధనుడు, మహానంది అనురాజులు రాజ్యము చేసిరి.
మహానందితో క్షత్రియకులము నశించినదనియుఁ దరువాత రాజ్యముచేసిన వారందఱును శూద్రులనియు మన పురాణకారుల యభిప్రాయము. మహానందికి ఔరస సంతానము లేదు. మహా పద్ముడను దాసీపుత్తుఁ డొకడు మాత్రముండెను. మహానందికి తరువాత మహాపద్ముడే మగధరాజ్యమునకు జక్రవర్తి యయ్యెను.