చంద్రగుప్త చక్రవర్తి/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము

సైన్య వ్యవస్థ.

క్రీ. పూ. నాలుగవ శతాబ్దమున నుండిన ఈ ప్రథమ చక్రవర్తి కాలముననే మన ఇరువదియవ శతాబ్దమునందలి రాజ్యాంగ నిర్మాణమును బోలిన విశేష రాజ్యాంగ నిర్మాణముండెను. ఒక్కొక్క.యంగమును వర్ణించుట కొక్కొక్క ప్రకరణమయినం జాలదు. ప్రతిభాశాలియగు చంద్రగుప్త చక్రవర్తియు మంత్రాలోచనా ధురీణుండగు చాణక్యుఁడును పన్నిన రాజ్యాంగముల స్వరూపముసు మాచే నయినంత సంక్షిప్తముగ నిటఁబొందుపఱచెదము.

విస్తీర్ణమున ప్రస్తుతపు భరత ఖండమునకంటే నెక్కుడగు భూభాగమును చంద్రగుప్తునకు సంపాదించి పెట్టిన సైన్యపు సంఖ్య యపరిమితముగా నుండెనని గ్రీకు చరిత్రకారులు వ్రాసి యున్నారు, ఆ రాజపుంగవునికడ నాఱులక్షల పదాతులును, 30,000 అశ్వికులును 9000 ఏనుఁగులును, 8000 యరదంబులును, ఉండెనని తెలియుచున్నది.

సారథిగాక ప్రతిరథముమీదను ఇద్దఱు రథికులుందురు, అందుచే 8000 భటులనఁగా 24,000 రథికులని యర్థము, ప్రతి ఏనుఁగుపై మావటివాఁడు గాక ముగ్గురు యుద్ధభటు లెక్కుచుండిరి. కాన 9,000 గజములనఁగా 36,000 భటులని యర్థము. ఇట్లు వీరినందఱను లెక్క వేయఁగా రమారమి ఏడు లక్షల బలమగుచున్నది.

ఇంతగొప్ప స్కంధావారమున వ్యవస్థకల్పించి, ఒక్కొక్కరికి వారివారి పనుల నిర్ణయించి యేవేళ నే సందర్భము వాటిల్లిన నద్దాని కనువగు తెఱుంగున బలంబుల నడిపి వ్యూహచమత్కారంబుల గనుపఱచి చంద్రగుప్తుఁడు విజయంబుఁగొనియె.

సైన్యవ్యవస్థకయి యీచక్రవర్తి ముప్పది యధికారుల సంఘమేర్పఱచి దానిని గూడ నాఱు పంచాయతులుగ విభజించె. మొదటి పంచాయతిలోని యధికారులు సముద్ర సైన్యమునకును, రెండవ పంచాయతి వారు రస్తుసామగ్రికిని ప్రయాణ ప్రయత్నములకును, సైన్యమునకుఁ గావలసిన తృణకాష్ఠాదులను సంపాదించుటకును, మూడవ పంచాయతి వారు కాల్బలమునకును, నాల్గవవారు. రథసైన్యంబులకును, ఐదవవారు అశ్వసైన్యములకును, ఆఱవవారు ఏనుంగులకును నధికారులై, యుండిరి. 1[1]

సముద్ర సైన్యము

ఈ చక్రవర్తివద్ద సముద్ర సైన్యముండినటుల మెగస్తనీసు వ్రాతల వలనఁ దెలియుచున్నది. కాని ఆ సైన్యమును గురించిన విశేషము లెఱుంగుటకు సాధనములు గానవచ్చుట లేదు. కౌటిల్యుని అర్థశాస్త్రమును బట్టి చూడఁగా నా కాలమున 'నావాధ్యక్షుఁడ'ను అధికారి యుండినట్లును సముద్రముల మీఁదను సరస్సులమీఁదను దిరుగునట్టి యోడలను గుఱించిన యధికారమంతయు నాతని చేత నుండినట్లును గనుపించుచున్నది. రేవులయందు సుంకములు వసూలు చేయు పనిని గూడ నితఁడే తీర్చుచుండెను. నావికాచోరులను దండించుటయు గాలివానలచే నలంగిన యోడలకు శరణమిచ్చుటయు నీతని ధర్మముల లోనివయి యుండెను. గొప్పగొప్ప నదులను దాటుటకొరకై ప్రభుత్వము వా రేర్పఱిచిన నావలకును పడవలకును వానిపై నుండు నౌకరులకును నితఁడే యధికారి.

రస్తు సామగ్రి

రెండవ పంచాయతివారు రస్తుసామగ్రి మున్నగువానిని సమకూర్చువారని వ్రాసితిమి. యుద్ధమునకు సైన్యము బయలుదేరు తరి భోజనము సిద్ధపఱుచుటకుఁ గావలసిన ధాన్యాదులును, గట్టియలును, యుద్దమువ గాయపడు భటుల చికిత్సకొఱకగు మందులును ఉపకరణములును, గుఱ్ఱములకు నేనుంగులకు వలయు మాసాదులును, యుద్ధము సలుపునెడ నవసరమగు నాయుధాదులును వెంటపంపుటకే యీపంచాయితి యేర్పడినది. ఆకాలము నందు వైద్యశాస్త్రము భరతవర్షమున మిక్కిలి పెంపుగాంచి యుండెను. కాశీనగరంబునను తక్షశిలా నగరంబునను నెలకొల్పఁబడి యుండిన సర్వకళాభవనములు ప్రసిద్ధిఁ జెంది యుండె. అచ్చట విద్యగఱచిన వైద్యవిద్యా విశారదులు శస్త్రములును, యంత్రములును, తైలములును ( Oils ) కాళ్లు చేతులు విరిగినవారికి కట్టులుగట్టుటకు వస్త్రములును మున్నగు వైద్యోపకరణంబులఁ గొని బలంబుల వెంబడి నేగుచుండిరి. గాయములువడిన యుద్ధభటులకు నుపచారములు సలిపి, పధ్య పానాదుల. నమర్చుటకయి తత్తదర్హ వస్తుసంచయంబులఁ గొనుచు ధాత్రికలు (దాదులు) ను వీరితోడం గూడనుందురు. ఇట్టి ధాత్రికలకు మార్గదర్శినియని యీ కాలమున లోకమునందంతట పేరుగాంచిన ఫ్లారెన్సు నైటింగేలుసతి. గత శతాబ్దము నందలిది. ఇట్టి ఫ్లారున్సు నైటింగేలులు చంద్రగుప్త చక్రవర్తి కాలమున నెందరో యుండిరి. అట్టివారిని నియమించుటయు రస్తుసామగ్రి పంచాయతివారి కర్తవ్యంబె. 1[2]

కాల్బలములు

చంద్రగుప్తుని కాలమునందలి పదాతులు ముఖ్యముగ ధనుర్దరులు. ప్రతిభటుఁడును దన పొడవునకు సమమగు పొడవు గలవింటిని మోయుచుండును. అవసరమగుడు దానిని భూమిపై మోపి గుణము సంధించి ఆకర్ణాంతముగఁ దిగిచి మూఁడు గజములఁ బాణంబులఁ బ్రయోగించు చుండును. ఈ బాణములకు డాళ్లుగాని కవచములుగాని మఱియెంత బలిష్ఠమయిన ఇతర రక్షలుకాని అడ్డుపడలేకుండెను. ఆ కాల్పంబులు తమ శరీరముల సంరక్షించుకొనుటకు పదునుచేయని తోళ్ళతోఁ జేయఁబడిన నిలువునతమ్మును బూర్ణముగ గప్పఁ గలుగు కేడెముల నెడమచేత ధరించుచుండిరి. ఈ ధనుర్ధరులుగాక పదాతిసైన్యంబున ఖడ్గధారులును గొంద ఱుందురు. వారికత్తులు పొడవును వెడల్పునునై ఇరుకు సందుల నగు యుద్ధముల మిక్కిలిగ నుపయోగింపఁబడు చుండెను. అట్టి సందర్భముల భటు లొక్కొకవేళ రెండు చేతులతోడను ఖడ్గముం జళిపించి వేయుచుందురు. 1[3]

చంద్రగుప్త చక్రవర్తి కడనుండు బలములు మూలబలంబులు, కృతబలంబులు, శ్రేణిబలంబులు, అని మూఁడు తెఱంగులుగ నుండెను. రాజుచే శాశ్వతముగ నిలుపుకొనఁబడి యుండిన సైన్యములు మూలబలంబులు. యుద్ధప్రసంగము వచ్చినప్పుడు సిద్ధపఱిచి . వేతనమొసంగి నిలుపుకొనఁబడినవి కృతబలంబులు. శ్రేణిబలంబులు అను పదమునకుఁ గొంచెము విపులమగు వ్యాఖ్యయవసరము. దేశమునం దచ్చటచ్చట క్షత్రియ వీరుల 'శ్రేణులు' అనఁగా సంఘములు నెలకొని యుండెను. వీరు వర్ణమునందు క్షత్రియులేయయ్యును రాజ్యాధికారము లేమింజేసి యుద్ధవిద్య నభ్యసించియు నితరవృత్తులచే జీవనము గడుపుకొనుచుండిరి. వీరి సాహాయ్యమును యుద్ధముల యందుఁ జక్రవర్తులు పొందుచుండిరి. వీరే శ్రేణులు. ఆ కాలమున నిట్టి శ్రేణులలోఁ బ్రసిద్ధమయినవి కాంభోజమునను, సౌరాష్ట్రమునను, లిక్షవియందును, వ్రిజకమునందును, మల్లకమునందును, మద్రక కుకురు కురు పాంచాలములయందును.2[4] నుండెను. అందు కాంభోజ సౌరాష్ట్రముల వారు కృషీవలులు గను వర్తకులుగను గాలము గడుపుచుండిరి. తక్కుంగలవారు రాజు లనఁబడుచుండిరి. ప్రతిశ్రేణియు నొక్కనాయకునకు లోఁబడి ప్రవర్తించుచుండెను.

ఈ మూఁడు తెఱంగుల బలములు గాక ఆరణ్యకులును పార్వతేయులును సందర్భ వశంబున విశేష సైన్యాంగముగ నుపయోగించుకొనఁ బడుచుండిరి. జయింపఁబడినవారిని దోఁచుకొనుటయే. వీరిని వేతనము.

ఇట్లేర్పడిన కాల్బలంబులకు నాయకుండగువాఁడే సర్వ సైన్యంబులకును నధ్యక్షుండు.

ఆశ్విక సైన్యము

ఆశ్విక సైన్యమునఁ బ్రతి భటుఁడును రెండు ఈటెలును డాలును యుద్ధమునకు గొంపోవుచుండెను. ఈతని డాలు కాల్బలంబు డాలునకంటె కురుచగ నుండును. గుఱ్ఱముపై జీనులు వేయుట యాచారముగాదు. గుఱ్ఱములకుఁ గళ్లెము దగిలించుటయు లేదు. కాని గుండ్రముగ కుట్టబడిన ఎద్దుతోలు మూఁతతో వాని ముఖములు కప్పఁబడు చుండెను. ఆ మూఁతల లోభాగమున వాడియంతగ లేని ఇనుము, ఇత్తడి లేక దంతపు ముండ్లి ముడ్పఁబడి యుండుటచే నదియే కళ్లెమువలె నుపచరించుచుండెడిది. 1[5]

యుద్దమునకయి గుఱ్ఱములకు వల్గనలంఘనేత్యాద్యనేక గతి విశేషంబులు నేర్పఁబడుచుండె. యుద్ధభూములయందును అరణ్యములయందును మధ్యభాగమున నిల్చి మిగత సైన్యంబు. చేరుటకు గురియై యుండుటయు, సైన్యోపయోగమున కగు జంతువులు ప్రవాహములు దాఁటవలసి వచ్చినప్పుడును ఝంఝామారుతమున ప్రయాణము సలుపవలసి వచ్చినప్పుడును చెదరిపోకుందుటకయి వానికి కట్టఁబడిన పగ్గములఁ బట్టుకొనుటయు, తమ రస్తుసామగ్రిని కాపాడుకొనుటయు, శత్రువుల రస్తుసామగ్రిని గొల్లకొట్టుటయు, క్రొత్తఁగ తమ సాహాయ్యూర్థము వచ్చు దండులను సంరక్షించుకొనుటయు, శత్రువులకు సాయమువచ్చు దండుల చెదరగొట్టుటయు, తమ సైన్యమును సుశిక్షితముగఁ బెట్టుకొనుటయు, సమయమగుడు దానిని పొడువుగ గానవచ్చునట్లు దీర్చుటయు, సైన్యపార్శ్వాంగముల సంరక్షించు కొనుటయు, యుద్ధము ప్రారంభ మగునప్పుడు మొదట స్వారికి వెడలుటయు, శత్రుబలంబుల చెల్లా చెదరుచేసి నుఱుమాడుటయు, తమ బలంబుల నాకస్మికముగ వైరు లెదిర్చినచో నడ్డువడయుటయు, వారిం బట్టుటయు, వారు లోఁబడి శాంతిమై వెడలుచో వారిని వదలుటయు, తమ సైన్యంపు మార్గమును మరల్చుటయు, రాజులను ధనంబును మోసికొనిపోవుటయు, శత్రువుల వెన్నుదన్ని తాఁకుటయు, పారిపోవు రిఫులఁ దరుముటయు, జయించిన స్థానంబుల, పోగగుటయు నాశ్విక సైన్యంబుల కర్తవ్యంబులయి యుండె.

ఈ యాశ్విక సైన్యంబులకు నుత్తమాశ్వంబులు కాంభోజ సింధ్వారట్టవనాయు బాహ్లిక సౌవ్వీర పాపేయతైతల దేశంబుల1[6] నుండి కొనిరాఁబడు చుండెను. ఇందులో కాంభోజ సింధ్వారట్టవ నాయువుల గుజ్జములు శ్రేష్ఠములుగ నెన్నఁబడు చుండెను.

గుఱ్ఱములమీఁది. యధికారికి అశ్వాధ్యక్షుఁడని పేరు. తీక్ష్ణ, భద్ర, మంజాది గుణముల ననుసరించియు వాని జన్మస్థలముల ననుసరించియు గుఱ్ఱముల తరగతుల నేర్పఱచి లెక్కలు వ్రాయించుటయు, వానికి యుద్ధమునందును ఇతర సమయము లందును బనికివచ్చు నానాగతులను2[7] నేర్పుటయు విశాలమయిన అశ్వశాలలను నిర్మించుటయు, అశ్వచికిత్సకుల నేర్పఱిచి వారిచేఁ బనులు గొనుటయు మఱి యితర విధముల నశ్వముల పోషించి కాపాడుటయు నీయధ్యక్షునికిఁ గర్తవ్యములయియుండెను. అశ్వముల కుపచారములు చేయుట కీ క్రింది క్షుద్రసేవకులు నియమింపఁబడి యుండిరి.

1. సూత్రగ్రాహకుఁడు -నఫరుపని చేయువాఁడు

2. అశ్వబంధకుఁడు - గుఱ్ఱములను గట్టివేయువాఁడు

3. యావశికుఁడు - తృణమును కొని తెచ్చువాఁడు

4. విధాపాచకుఁడు - గుఱ్ఱములకుఁ బెట్టు నిమిత్తమయి గుగ్గిళ్ళు మొదలగు వానిని వండువాఁడు 5. స్థానపాలకుఁడు - అశ్వశాలలను సంరక్షించువాఁడు

6. కేశ కారుఁడు- వెండ్రుకలు కత్తిరించి గుఱ్ఱములకు నునుపు పెట్టువాఁడు

7. జాంగలికుఁడు - ఆహారాదులఁ బరీక్షించువాఁడు


గజములు

మనదేశమున ప్రాచీన కాలమునందు సైన్యములోని యంగములలో గంజాంగ మెక్కువ యుపయోగకారియై కన్పట్టు చున్నది. చంద్రగుప్తుని కాలమునఁ బ్రతి గజముపై మావటివాఁడు గాక ముగ్గురు యుద్ధభటు లెక్కుచుండిరి. వారు మువ్వురును ధనుర్ధరులు. ఇద్దఱు ప్రక్కలనుండియు మూఁడవవాఁడు వెనుకనుండియు బాణముల వేయుచుండిరి.1[8] ఆ కాలమున గజసైన్యము యుద్ధ సమయములఁ జేయుచుండిన పను లెవ్వియనిన :--

సర్వసేనాముఖంబున నడచుట, సైన్యము నడచుటకు మార్గములను శిబిరస్థానములను నీరు దెచ్చుటకు త్రోవలను సిద్ధపఱచుట, సైన్యము చుట్టును నావరించి రక్షించుట, అంగేతరంబులు చలించినను చలింపక యెదురొడ్డి నిలుచుట, ప్రవాహంబు లడ్డము వచ్చినప్పుడు సైన్యములను దాఁటించుట, అభేద్యస్థలంబులను బలంబున భేదించుట, శత్రుసైన్యంబులకు నగ్ని ముట్టించి స్వసైన్యంబున గలిగిన యగ్నిబాధల నివారించుట, చెదరిన సైన్యంబును నొక్కెడ ప్రోగుచేయుట, వైరుల గట్టి మొనలను చెల్లాచెదరొనర్చుట, రిపువర్గమును హుంకరించి బెదరించుట, వారిని తొక్కి వినాశముచేయుట, కోటగోడలను దుర్గద్వారములను బురుజులను డీకొని పడద్రోయుట, ధనమును మోసికొని పోవుట; ఇందు దుర్గములను సాధించుట ముఖ్యతమము.

ఇట్లుపయోగ పడుచుండుటం జేసీ గజములనిన చక్రవర్తికి మహాప్రీతి. వాని సంరక్షణార్థము ఒక్కయధ్యక్షుఁడును, అనేకులు అధికారులును, లెక్కలేని క్షుద్రసేవకులును నియమింపఁబడి యుండిరి. వానికై గొప్పగొప్ప యడవులు విడదీసి యుంచియుండిరి. వాని కేమాత్రము నొప్పి కలుగఁజేసిన వారికిని శిక్షలు విధింపఁబడు చుండెను. గజశాలల కసవుచేర నిచ్చుటయు, ఏనుంగులకు ఆహారము పెట్టకపోవుటయు, వానికి పరుండ నేర్పఱచిన మెత్తని భూములలోఁ గాక ఇతరస్థలములలో వానిని పరుండనిచ్చుటయు, ఆయువుపట్టున వానినిగొట్టుటయు, వానిపై నితరుల నెక్కనిచ్చుటయు, సమయముగాని వేళల వాని నెక్కుటయు, ఇఱుకుసందులలోనుండి వానిని నీటి యొడ్డునకు నీళ్లు త్రాగించుటకుఁ గొని పోవుటయు, వానిని దట్టమగు నడవులలోనికిఁ బోనిచ్పుటయు నను నివి నేరములుగా నెంచఁబడి యట్టి యపరాధమునకుఁ గారకులైనవారు జరిమానాతో దండింపఁబడుచుండిరి. ఏనుఁగును చంపినవాఁడు ఉరిదీయఁ బడుచుండెను.1[9]

ఈ కాలమునందువలెనే ఆ కాలమునందును ఏనుఁగులు తమ్మును పెంచిన మావటివాండ్రయందు మిక్కిలి విశ్వాసము కలిగి యుద్దములలో సంరక్షించుచుండెను. ఇందును గుఱించి చంద్రగుప్తుని యాస్థానమున గ్రీకువారి ప్రతినిధిగ నుండిన మెగస్తనీ సొక చిత్రమయిన కథ వ్రాసియున్నాఁడు.

ఒకానొక భారతీయునకు తెల్ల ఏనుంగు గున్న యొకటి చిక్కెను. అతఁడు దానిని పెంచుకొని వాహనముగ నుపయోగించుకొనుచుండె. దినదినమునకును దానియెడ నతని కనురాగము హెచ్చుచువచ్చెను. అదియును దన యజమానునికి విశ్వాసము నెఱపుచుండెను. ఇట్లుండ రాజున కద్దానిని అపహరింపవలెనను దురాశ పొడమెను. కాని స్వంతగాని కా జంతువుపై నెక్కుడు ప్రేమయుండుటచేతను ఇతరుల వశమున దాని నుంచుటకు బుద్ధిపుట్టకపోవుట వలనను దానితోడంగూడ దేశము వదలి యడవులకుఁ బారిపోయెను. ఈ వార్త విని రాజు కోపోద్దీపితుఁడయి ఏనుంగును మనుష్యుని బట్టి తెచ్చుటకుఁ దన పరివారము నంపెను. వారును దరలిపోయి ఏనుంగును దాని యజమానుని దాఁకిరి. గజంబుపై నుండి అతఁడు రాజభటులతోఁ బోరాటము సలిపెను. వానికి ఏనుంగుకూడ సాయమొనర్చెను. కాని రాజభటు లనేకు లై నందున వాఁడు గాయములుపడి సోలి క్రిందఁ బడిపోయెను. యుద్దమునందు పడిన భటుని నాతని సహభటులు దమ డాలులతో గప్పుపగిది అప్పుడీ యేనుంగు తన స్వామిని గప్పియుంచి శత్రువులను గొందఱను మడియించి తక్కినవారిం జెల్లాచెదరొనర్చివైచెను. పిదప నాతనిని తన తొండముతో నెత్తి వీపుపై నిడికొని శాలకుఁ గొనిపోయి స్నేహితుఁడు పోలె నతని ప్రక్క దుఃఖించుచు నిలుచుండె.1[10]

రథములు

రామాయణ మహాభారతాది కాలమునుండి మనదేశమున మహాయోధులు రధారూఢులయియే యుద్ధము చేయు చున్నట్లు కానవచ్చుచున్నది. సాధారణ సైనికులు మాత్రము నేలపై నిలువంబడి పెనంగుచుండిరి. చంద్రగుప్తుని కాలమున సాధారణముగ నరదంబునకు రెండు గుఱ్ఱములు పూన్చెడువారు. నాలుగు గుఱ్ఱంబుల రథంబులును నుండె. ప్రతి రథంబు మీఁద సారథిగాక ఇద్దఱు రథికులుందురు. కొన్ని రథముల మీఁద నిద్దఱు సారథులును, ఇద్దఱు ధనుర్ధరులును, ఇద్దఱు ఫలకధారులును నుందురు. పనిఁ బడిన వేళల సారథులుగూడ సమరరంగంబున దమ శౌర్యంబు సూపి యని సల్పుచుండిరి. 2[11]

ఇట్టి రథసైన్యంబునకు రథాధ్యక్షుం డను అధికారి యుండెడువాఁడు. యుద్ధంబునకుఁ దగిన రథంబులను సిద్దపఱపించి యుండుట యతనిపని.

నైన్యములోని యధికారుల పరంపర

చతురంగములోని యొక్కొక యంగమునందలి పదుగురు భటులకుఁ బై యధికారి పదికుఁడు. అట్టి పదికులు పదుగురిపై యధికారి సేనాపతి నాఁబరంగు. అట్టి సేనాపతులు పదుగురిపై యధికారి నాయకుండు నాఁజను. అట్టి నాయకులందఱకును సర్వ సైన్యంబునకును నధికారి యగువాఁడు సేనాముఖ్యుం డనంబడు చుండెను.

స్కంధావారనివేశము

సైన్యము యుద్ధమునకు సన్నద్ధమయి వెడలుటకు మున్నొక నాయకుఁడును నొక ఔ్యతిష్కుండును నొక వర్థకుఁడును, అనఁగా వడ్రంగియు, బెక్కండ్రు కూలివారును బయలు దేరి మార్గములను, అందలి గ్రామములను, అరణ్యములను, వంతెనలను, కాలిత్రోవలను, బావులను, చెఱువులను బరీక్షించి చెడిపోయిన వానిని సంస్కరింపు చుందురు. సైన్యము విడియుటకుఁ దగినస్థలములను నిర్ణయించి వీలుకొలఁది వలయాకారము గలథిగఁగాని చతుష్కోణాకృతి గలదిగాఁ గాని శిబిరంబును నేర్పఱుతురు. శిబిరమునకు నాలుగు ద్వారములును ఆఱుత్రోవలును నుండును. అది తొమ్మిది భాగములుగా విభజింపఁబడును. శత్రువులవలన నపాయము జరుగకుండ దాని చుట్టును కందకములును, గోడలును, పరిధులును, బురుజులును నిర్మింపఁబడును. రాత్రింబవళ్ళు పహరాయిచ్చుటకు పదునెనిమిది జతల సైనికు లుందురు. శిబిరమునం దప్రమత్తత నెలకొనుటకయి ద్యూతము త్రాగుడు విందులు కలహములు పూర్ణముగ నిషేధింపఁ బడియుండెను. శత్రువులు మారు వేషముతో శిబిరముఁ జొరకుండుట కొఱకు అభిజ్ఞానపత్రము (pass-part) పొందనివారు లోనికి రానియ్యఁ బడుచుండ లేదు. 1[12]

సైన్యంబులు దాడి వెడలు విధము

గడ్డియు నీళ్లును కట్టియలును సమృద్ధిగ దొరకు మార్గమని ముందు వెడలిన నాయకునిచే సూచింపఁబడిన వార్తననుసరించి ఆయా గ్రామముల నెఱింగికొని రాజు యుద్ధమునకు వెడలును.

సేనాముఖంబున నాయకులును, నడుమ రాజును అంతఃపుర స్త్రీలును, కుడియెడమవైపుల నాశ్విక సైన్యమును, చుట్టును నేనుంగులును దక్కుంగల సైన్యమును నడుచును. త్వరగా నడచిన యెడల దినమునకు రెండు యోజనములును (రమారమి 13 మైళ్ళు) మందముగా నడచిన నొక్క యోజనంబును (రమారమి 6 మైళ్లు) ప్రయాణము సాగించుచుండిరి. సేన విడిసి యున్నప్పుడు సేనాధ్యక్షుని కుటీరము సేనకు ముందుండును, సైన్యములు నెడలునప్పు డతఁడు వెనుక నడచును.

యుద్ధముచేయు సమయముల భటు లుత్సాహముతో బనిచేయఁగలందులకు గాను శత్రుసైన్యములలోని బంటును చంపినవానికి 20 పణములును, కాల్బలముల నాయకుని జంపిన వానికి 100 పణములును, ఆశ్వికుని జంపినవానికి 1,000 పణములును, ఏనుంగునుగాని రథంబునుగాని నాశనమొనర్చిన వానికి 5,000 పణంబులును శూరాగ్రేసరుల నాయకుని జంపిన వానికి 10,000 పణంబులును, యువరాజును గాని నేనాధ్యక్షునిగాని జంపినవానికి 50,000 పణంబులును, శత్రురాజును మడియించిన వానికి లక్ష పణంబులును బహుమాన మొసంగఁబడు చుండెను,

ధర్మ యుద్దము

హిందువుల యుద్ధవిధులు ఇతర దేశస్థుల వానికంటె మిగుల కరుణాయత్తములు.

"ఆయుధములు పడవైచినవారిని, జుట్టు విరియంబోసి కొనియో చేతులను జోడించుకొనియో దయవేఁడు వారిని,శరణు జొచ్చినవారిని హింసించఁగూడదని యార్యశాసనము."1[13]

"భీరులతో, మత్తులతో, ఉన్మత్తులతో, మైమఱచిన వారితో, కవచ భ్రష్టులతో, స్త్రీ, శిశు వృద్ధ బ్రాహ్మణులతో, యుద్దము చేయరాదు."2[14]

"సంహృత యోధుల పత్నులకు సంరక్షణ నొసంగ ఫలయు,"3[15]

మెగాస్తనీసు ఇట్టి హిందువుల యుద్ధధర్మకారుణ్యమునకు సాక్ష్యము పలుకుచున్నాఁడు. "ఇతర దేశస్టులలో నుద్ధ కాలములందు భూనాశనము సామాన్యమైయుండఁగ నందునకు మాఱుగ హిందువులలో పంటకాఁపులు-పవిత్రులును సహింసనీయులును గావున-సమీపముననే పోరు చెలరేగుచున్నను భయమించుకయు లేకయే నెమ్మదిగ నుందురు. ఏలయన ఇఱు తెగల పోటరులును పోరుసలుపుచు నొండొరుల నఱకు కొనుచున్నను. సేద్యకాండ్ర జోలి కించుకయుఁ బోక నుందురు. మఱియు పగతుని భూమిని అగ్నిదగ్ధముచేయుట గాని అచ్చటి చెట్లను నఱకివేయుట గాని వారికి వాడుక లేదు.

  1. 1. మెగ స్తనీసు.
  2. 1. చాణక్యుని అర్థశాస్త్రము. 10 వ భాగము
  3. 1. ఆర్టియను అను గ్రీకులేఖకుని వ్రాతల ననుసరించి
  4. 2. ఆర్థశాస్త్రము 11 వ భాగము 1 వ ప్రకరణము
  5. 1. ఆర్టియ నను గ్రీకు లేఖకుఁడు.
  6. 1. కాంభోజమనఁగా ఆఫ్ఘనిస్థానము, సింధువుమన మెఱింగినదియే. ఆరట్టు పంజాబునందలి అరాష్ట్రకుల దేశము వనాయు వనఁగా ఆరబ్బీదేశము. బాహ్లికమనగా మధ్య ఆసియా యందలి బాల్ట్ దేశము, సౌవీరమనగా గుజరాతుదేశమందలి ఈడరురాష్ట్రము. పాపేయ తైతల దేశంబు లెవ్వియో కనుంగొనవలసి యున్నది.
  7. 2. యుద్ధ సమయమునందలి గతులకు “ఔపవాహ్యక " గతులనియు శాంత సమయములందుచేయు స్వారిసంబంధమగు గతులకు “సన్నాహ్య" గతులనియు పేళ్లు
  8. 1 మెగస్తనీసు
  9. 1, చాణక్యుని అర్థశాస్త్రము 2 వ భాగము 32 ప్రకరణము
  10. 1. మాక్రిండలు మెగస్తనీసు 118 ప్క్వేజి
  11. 2. కర్టియసు 8. 14
  12. 1. చాణక్యుని అర్థశాస్త్రము. 10; 1,
  13. 1. ఆపస్థంబ. 11 5-10-11
  14. 2. బోధాయన. 1 10-16-11
  15. 3. వసిష్ఠ. XIX 30