గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/ఆంధ్ర గ్రంథాలయ సభ - దక్షిణాది

వికీసోర్స్ నుండి

(6) భారతీతీర్థపక్షమున గ్రంథాలయోద్యమము ప్రచారము చేయుటకు డిపార్టుమెంటును యేర్పరచవలసినదని తీర్మానించి అందుకు డాక్టరు బుర్రా శేషగిరిరావు (అధ్యక్షులు) తిత్తి బలరామయ్య (కార్యదర్శి) వి. ఎస్. శర్మ (అడయారు), జగన్నాథపాడీ, గిడుగు సీతాపతి, కోన వెంకటరాయశర్మ, తూముల కృష్ణమూర్తి, విద్వాన్ గంటి సోమయాజులు, కొండపల్లి జగన్నాథదాసు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగార్లు గల ఉపసంఘమును ఏర్పరచిరి.

ఆంధ్రగ్రంథాలయసభ - దక్షిణాది.

రామనాథపురం జిల్లా సాతూరు శ్రీవెల్లిపుత్తూరు తాలూకాల ప్రథమ ఆంధ్రగ్రంథాలయసభ సాత్తూరుగ్రామమున కమ్మవారి మందిరమున ది 24-6-28 తేదీ ఉదయం 8 గంటలకు సమావేశమైనది. రెండు తాలూకాలలోనిగ్రామపంచాయితీలు సంపాదించిన గ్రంథములు ప్రదర్శింపబడినవి. షుమారు 5 వేల గ్రంథములు 140 గ్రామపంచాయితులనుంచి ప్రదర్శనమునకు వచ్చినవి. ఆనరబుల్ వేమవరపు రామదాసు పంతులుగారు ప్రదర్శనమును తెరచిరి. ప్రదర్శనమునకు తేబడిన వివిధశాస్త్ర గ్రంథములను, పంచాయితుల పుస్తక భాండాగార వ్యాప్తికి చేయుచున్న కృషియు, పంచాయితీ ఆనరరీ ఆర్గనైజ రగు అళగిరిస్వామినాయుడుగారు పరిచయము చేసిరి. రామదాసుపంతులుగారు ప్రదర్శనమును తెరచుచు విద్యావ్యాప్తికి పాశ్చాత్య దేశములో పుస్తకభాండాగారోద్యమ మెట్లుపనిచేయుచున్నది తెలియజేసి, విద్యాభ్యాసము, బడులలో ముగిసిన తరువాత గ్రామపు బడులలో చదివిన చదువు మరచిపోకుండ పాఠశాల విడిచినతరువాత జనులలో సద్విద్యావ్యాప్తికి పుస్తకభాండాగారము లెట్లు యుపకరించునో వివరించి చెప్పిరి. సంచార పుస్తకభాండాగారములు బరోడా సంస్థానములో యెట్లు పనిచేయుచున్నవో తెలిపిరి. తూర్పుగోదావరిజిల్లా ఆలమూరు వాస్తవ్యులును సహకారోద్యమ నాయకులును అగు శ్రీయుత నరసింహదేవర సత్యనారాయణగారి యాధిపత్యమున పుస్తక భాండాగారసభ సమావేశమయినది. ఆహ్వాన సంఘాధ్యక్షులగు రామనాథజిల్లాచీఫ్ ఆనరరీ ఆర్గనైజరు ఆనందరావుగారు పంచాయితీ పుస్తకభాండాగారాభివృద్ధిగూర్చియు, ప్రజాసామాన్యమునకు పుస్తక భాండారములు విజ్ఞానవ్యాప్తికి యెట్లు తోడ్పడగలవో విశదీకరించిరి.

అధ్యక్షకోపన్యాసము ఆంధ్రమున యుపన్యసింపబడినది. ప్రతి వాక్యమును అరవమునకు తర్జుమాచేయబడినది. ఆంధ్రదేశమునుంచి సుమారునాలుగువందల సంవత్సరముల క్రితము వచ్చి అరవదేశములో నివాస మేర్పరచుకున్న ఆంధ్రులే యీ పంచాయితీ పుస్తకభాండాగారాభివృద్ధివ్యాప్తికి తోడ్పడుచున్నారు. అధ్యక్షులు వందనము లర్పించుచు పుస్తక భాండాగారోద్యమము ఆంధ్రదేశములో గత 25 సంవత్సరములనుంచి ప్రభుత్వయాదరణతో సంబంధము లేకుండగ జాతీయోద్యమ వ్యాప్తికి, జాతీయ ప్రబోధమునకు గ్రామసీమలలో యెట్లు కృషిసలిపినది వ్యాప్తిగాంచినది తెలియజేసిరి. ప్రాచీనకాలమున విజ్ఞానవ్యాప్తికి ప్రభుత్వమువారు విశ్వవిద్యాలయములు దేవాలయస్థాపకులు పుస్తకభాండాగారములను రాజనగరులలో విశ్వవిద్యాలయములందును దేవాలయములందు పెంపొందించి ఎటుల భద్రపరచెడివారో - పౌరాణికులు ఎట్లు పోషింపబడుచుండెడివారో - పౌరాణిక గ్రంథములు శాస్త్ర గ్రంథములు వ్రాయుటకు గ్రంథములు భద్రపరచుటకు ఎట్టి ఏర్పాట్లు కావింపబడెడివో - తాటియాకులు ప్రశస్థమైనవి, వ్రాయుటకు తగినవి భద్రపరచుటకు ప్రత్యేకముగ సేవకులు ఎట్లు పోషింపబడెడివారో - మొదలగు చారిత్రక విషయములను ప్రాచీన శాసనములలో యెట్లు వివరింపబడినది నిరూపించిరి. చదువను వ్రాయను నేర్వని వారలకుకూడ ఆధునిక కాలములో మ్యాజిక్కిలాంతర్లు బయస్కోపులు మూలమున యెట్లుప్రదర్శనమూలమున విజ్ఞానమునువ్యాప్తిచేయుచున్నారో - ప్రాచీన కాలమున ప్రజాసామాన్యమునకు చరిత్రాంశములు బోధించుటకు నైతికధర్మ వ్యాప్తికలుగజేయుటకు దేవాలయపు గోడలపై వ్రాయు చిత్తరువులను, బౌద్ధమఠములలోను, గుహలలోను చిత్రింపబడిన చిత్తరువులు, పడకటిండ్లలోను రాజమందిరములలోను అద్దములపై వ్రాయబడిన చిత్తరువులు, బొమ్మలాటలు, భాగవతకథలు, హరికథలు ప్రజాసామాన్యములో విజ్ఞానబోధనకు వివిధమార్గముల నన్వేషించి ఎట్లు ప్రచారము జరిగియుండెడిదో యుదాహరణపూర్వకముగ రుజువు చేసిరి. ప్రాచీన కాలమున ప్రతిగ్రామమున పౌరాణికులను పోషించి ధర్మగ్రంథపఠనమునకు ఎటుల హెచ్చరించి యుండిరో ఆరీతినే గ్రంథాలయములలో కేవలము పుస్తకములను సంపాదించుటతో మాత్రమే సంతృప్తిజెందక, నాలుగైదు పంచాయితులు కలసి పురాణవేత్తను నియోగించి, రైతులు తీరికగాయుండు కాలములో గ్రంథములు చదువుట, వార్తాపత్రికలు వినిపించుట మొదలగు కృషిసలుపుటకు పూనవలసినదిగా హెచ్చరించిరి. దేశ పురోభివృద్ధికి, జాతీయభావవ్యాప్తికి గ్రంథాలయము లెట్లు తోడ్పడగలవో వివరించి చెప్పిరి. పిమ్మట గ్రంథాలయ అభివృద్ధికి గావింపవలసిన పనులవిషయమై కొన్ని తీర్మానములు గావింపబడినవి.

____

శ్రీ సరస్వతీనిలయ గ్రంథాలయము

పొలమూరు - పశ్చిమగోదావరి జిల్లా.

ఈ గ్రంథాలయము 1913 సంవత్సరమున శ్రీ కొత్తపల్లి నరసింహముగారిచే స్థాపితమైనది. మొదట 150 గ్రంథములతో ప్రారంభింపబడి దినదినాభివృద్ధి గాంచినది. వారు అనేక వార్తాపత్రికలను గ్రంథములను తమస్వంత ద్రవ్యమును వ్యయపరచి రప్పించి చదువరుల కందించుచు పరోపకారార్థము మిక్కిలి దీక్షతో పాటుపడిరి. గ్రంథముల గృహములకు గొంపోయినవారు తిరిగి సరిగా నొసంగకపోవుటచే చాలభాగము గ్రంథము లంతరించినవి. మెంబర్లందరును చందాలు సరిగా నిచ్చు పద్ధతియే లేకపోయినది. ఈరీతిగా గ్రామవాసులకు