గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/ఎవరు? (సశేషము) పద్యములు
ఎవరు?
[రాయప్రోలు సుబ్బారావు గారిచే వ్రాయఁబడినది.]
I
ఆరుచున్న కలంకారిచీర చెఱఁగు
లనగ నాశాముఖంబుల నందగించె
భాద్రపదనీలనీరదపంక్తులపుడు
వ్రాలుచుండె నభోమణి వాడుకళల.
తామ్రపర్ణి ప్రవాహంబు దరులుదాటి
వఱదఁ బెట్టినయట్లు చూపసంధ్య
మఱలిచనుచుండెఁ బశువులు మార్గలక్ష్మి
యాటలాడుచువలచు నెయ్యారినడల.
కృష్ణయొడ్డున నేకాంతి కేళిఁగొరి
కూరుచుంటిని యొక చోటఁ, గొండనీడ
లొలయఁగఁ గుమారకోమలమలయపవన
మల్ల నల్లనఁగెరలియుయ్యాలలూగ.
ఎఱుపువిఱుగదయ్యె నేటినీట, మెకింత
మునిఁగియుండె జెల్లు పూలపడక,
దరులనలుపుమిగులు దర్శనీయమ్ముగ
నచ్చటచటఁ గానవచ్చుచుండె.
కృష్ణ వేణియందెల మ్రోత యింపువోలి
లాలిత తరంగ భంగి మాలాపసరణి
శ్రవణలాలన మొనరించె, పరిసరమున
వేణువులనుశ్రుతులమురి పెములుగొలుప.
నిండికొన్న సంధ్యా రామణీయకంబు
పొంగిపొరలు స్రవంతీతరంగ శోభ,
యొండొరుల ముద్దులాడుచు నుల్లసిల్లె
లసదపూర్వ ప్రణయ లగ్నలాలనమున.
ఇంతలోన రక్తిమ కృశియించిపోయె,
చీకటిజడల్ ముడుల్ విచ్చిచిందులాడెఁ
గాని విశ్రాంతిఁగన లేదు కర్ల మోహ
లలితమైన వీచీ వేణుమిళితగీతి.
పొదలయందెందొ కనరాక పూర్ణపరిమ
ళమునఁ ద్రోవరులనులాగు సుమములట్ల
కటిక చీకటిలో పలఁ గానరాక
పాడుచుండిరి గంధర్వభామలెవరొ?
హో! రనుచుఘోషి లెడి యేటిఁబాఱఁజూడ
చూపుదగులవు పాలయిసుక పడకలు
గాని, ఱెల్లుపూఁబాన్సులుగాని, మునుఁగ
నట్టి గట్టుల నలుపుచిహ్నములుగాని.
చాకిరేవునఁగాలెడు శవమొకండు,
మినుకులాడుదీపముతోడఁ జనుచునున్న
నావయొకఁడుమాత్రముదోఁచెనాకుముందు
హృదయమేదోకలస్ఫూర్తి ముదితమయ్యె.
అపుడు చప్పుడుగాకుండ నడుగులిడుచు
నెవరొ నడయాడు సరిసన్న లేగుదెంచె
తొణఁకియలసాలసములయితోచునూర్పు
తెమ్మెరలఁబట్టి వలఁగొనెఁ గమ్మదనము.
స్ఫుటముగాఁగానరాని యాసొగసురూపు
ఎటుచనుచునున్న యనుమానమె తెనాకు
తదభిముఖుఁడఁగా, నూరించెనదియునన్ను
సంవృతంబైన కవి కావ్యశైలి వోలె.
‘ఎవ్వరీ చిమ్మచీకటి నేకతమ నఁ
బోవువా'రని యడిగితి ముందు నేను,
ఎడతెగని వేణుగానము దడఁగెఁ గొంత
నాదుకంఠస్వరంబు విన్నాణముగను.
ప్రకృతిసాక్షిగఁబల్లెత్తి పలుకలేదు
తనయుదంతమానం తేని చనవు పెనఁగ
పరిచయము లేనివారల వరుసలేడ
వలపు వాడల ననియైనఁ దెలుప లేదు.
మేలిపూదండయొకటి నామెడనుపై చెల
జుట్టు చెంగావి చీర యంచులు బిగించి
పిరుఁదులసియాడఁగట్టిన వెలదియోరు
భ్రాంతిమానసవీచికల్ తాపిలంగ
మగువహస్తమ్ముతోఁఁ దనమస్తకమును
నాభుజస్కంధమందు నానఁగఁదవిల్చి,
చేరెడేసికన్నులనిండ ధారగట్ట
విడిచెనశ్రులు పయ్యెదితడియు చుండ!
పద్మముఖి నోటి దాంబూల పరిమళంబు
తరుణమగుపాణి మంచిగందం పుఁబూఁత
ఫాలతలినున్న కస్తూరి వాసనలును
నాదుహృదయమాకర్షింపలేదు మొదలు.
సగమ తడిసిన పైటయు, సగమువ్రాలి
యున్న కనురెప్పలును, సగముడుకురక్తి
మనసుసగము, సిగ్గుసగముఁ బెనఁగులాడు
నాయమయవస్ధలే సగమాయెనాకు,
వింతపైవింత మంచుగప్పిన విధాన
ననుజెనకియాక్రమించెఁ గృష్ణాతటాన,
అకట! యేటియానంద భిక్షాటనంబొ!
మోహనము లైన సంకేతభూములందు.
ముదిత పెదవి నిగారింపముత్యమంత
మాటలాడనిఱఁత యారాట పెట్ట
పైటదడపు కన్నీళ్ళతో ఁ బాట నాదు
మనసుఁదడి పె న నేక భావనలునపుడు.
కాంక్ష లేనిన్ను విడ చెనోకలికి! లేక
నీవెకాంక్షల విడనాడినావొ దెలుపు;
మీనిశీధితారలతోడు! కృష్ణతోడు!
చెడ్డయొట్టున్న దిఁక మీద జెప్ప వేసి;
అనుచు దూరమునకు వినవచ్చి వినరాని
యెలుఁగుఁ బెట్టియామెఁ బలుకరించి
యూరకుంటినంత, నొకకొంతసేపటి
క బలయిట్టులనియె నమృతవాణి!
II
ఓర్వలేనివారెవ్వరో యొకరినొకరు
పోల్చుకొనకుండఁ గ్రిందకు వాల్చినారు
నీకు నాకును నడుమ నీ నీలి తెరలు
సెజ్జపయి ప్రణయుల మధ్య లజ్జలాగు
ఎవతవనుచు నన్నడిగితి వీవుముందు ?
ఎవఁడవనినిన్ను నడుగ రాదేల యిపుడు?
సందియంబందితోటు నాయందెరవళి?
ఏల నీవాలకము సంశయింపరాదు.
ఎవతెనని స్పష్టముగ వచియింపఁగలను?
అనువుగాఁగన్న వారింటి యాడుఁబడుచు
నీడుగాఁగొన్న వారింటి తోడికోడ
లిని, గ్రహింపుమిందెవతనో! మనసులోన
ఒకనికిఁ గుమారితను, మఱియొకని కాలి
నింక నెుకనికి తల్లిని యిందులోన
నెవ్వరితనె? భావింపుము హృదయమందు
వావివరుసలు జ్ఞానసంభవము లేని?
నన్ను గనిపాఱవైచి ప్రాణములువిడ చె
ననఁటిచందానమాయమ్మ, యప్పుడాది
పెంచిరఱచేతులం బెట్టి పిన్ని మొదలు
గాగ నా ప్తజనంబులు కాంక్షతోడ.
వెన్నతోడ వండిన ధవళాన్నములను
ఎండ బడి భుజించుటే యెఱుగ నెపుడు
పూఁతనలుగుల తలయంట్లు బోసికొనక
శుక్రవాసర ముఖములు చూడలేదు.
ఆకుమరుఁగుపుష్పముపోల్కి నందముగను
నన్ను బెంచుచురుండి, రైననుమదీయ
తరుణసౌందర్య రేఖలే యిరుగుపొరుగు
ఆడిపోతలకాకర మాయెనోయి !
చదువుఁజెప్పెను నాకొక సాటియింటి
చిన్న వాఁడు, నేరుపులు పుష్పించుఛాతి,
నలవడియెఁ గొంత చక్కనియన్వయంపు
పాటవమును నలుకారపరిచయమును.
అందమయిన పద్యంబుల నల్లునతఁడు
నునుపుఁబోగుల పట్టు వేసిన విధాన,
పాడఁగలఁడు తీయని యష్టపదుల నెల్ల
సందెలందుఁ గల కల కషాయఫణితి.
పాడుచుందునే వాతఁడు పాడినట్లు,
చదువుచుందునే నాతఁడు చదివినట్లు,
ఇరువురముగూడి మొక్కప్పుడేకకంఠ
సరణిమైనాలపించు ముచ్చటలు గలవు!
తేటలారెడు శుక్లచంద్రికలమాద్రి
మా వయసుతోడఁ జెలిమియుఁదీవలెత్తె,
యూరివారలదృష్టులు గోరగింప,
నాల్క లపవాదరచనలఁ జిల్కరింప.
కొమ్మకొననందగించిన క్రొత్త పువ్వు
ఎందఱెందఱి కెన్నెన్ని చందములను
భిన్న భిన్నాశయములు మొల్పించునపుర?
ఐక్యగతియె ద్వైతాద్వైతమైనరీతి.
కావ్యకలలసింగారించు కవులమనసు
నళిమధుపుఁబోలె నాసింతుమనవరతము.
నవరససుధా కణాస్వాదనమును మరగి
తనివి యేయెఱుంగము స్తనందయములట్లు.
చదివినకొలంది నాత్మల నుదయమయ్మె
భావములు స్వాతిముత్యాలకోవలటుల
బాల్య సంలగ్నమైన ప్రపంచరక్తి
పాలువిఱిగినగతియయ్యెఁ బడుచువాఁడ !
III
పగలురేలిట్లు దినమొక యుగముగాఁగఁ
గడుచుచుండఁ గొండొక పొద్దుపొడుపువేళ
బిచ్చమునకయి బైరాగిపిల్ల యొకతె
వచ్చెఁ బాడుచుఁగోయిలల్ మచ్చరింప.
మాసిన మొగాన చెక్కిళ్ళమవ్వ మొలయ,
పచ్చతంగేటి పూరేకువంటి మేని
పసిమి మురికి పేలికలలో వాడుచుండె
ధూళిమునిఁగిన బంగారుతునుకఁబోలె.
ముదిత యింతంత వాల్గనుల్ బెదరిబెదరి
యెంతవఱకుఁగటాక్షించె నంతవఱకు
నల్లకలువపూవుల తోరణములునిండె
పెండ్లి వాకిండ్ల చందాన వింతభంగి.
అబల యలుగులుదీసిన యమృత సరసి
సరణిఁగలకఁఠమెత్తి మూర్ఛనలునింపె,
నెన్ని విసరులు విసరె నాకన్నె పాట
యన్ని విసరులఁ బారవశ్యములె గురిసె.
పూరిగుడిసెముందట దేవపారిజాత
సాలమతి పరిమళములు జల్లుకరణి,
ఎక్కడఘుటిల్లెనో యెల్లచక్కదనము
లా దరిద్రకుమారి మోహనపువాణి.
కడుపునిండఁ గమ్మని యన్నకబళములకు
నోచుకొనని యాకన్నె కే నోములిచ్చె,
తాలుగరగించు గంధర్వలాలనమ్ము
జన్మవాసనలెంత నైజములో జగతి.
మలిన వసనమ్ముఁ గట్టిన మలిన తనువు
మలిన భిన్నములుదిన్న మలినవాణి
నెట్టులాసించెనౌరౌరు! యింపుగులకు
అఖిల కిన్నరీ దుర్లభమయిన గీతి.
తీవ లెగలాగి దిగలాగి అవరించు
వైణికులకుఁ జీరంతనాభ్యాసపటిమ
స్వరములనుబ్రస్తగించెడు పాటకులకు
అమృతసదృశంబయిన గీతియబ్బదేమొ!
మొగము నవనీతమృదులమై యెగయుచెలికి
మనసునవనీతమయియుండదనుటెనిజము!
వనలతలకును నుద్యానవనలతలకు
భేదమరాసినకవి ఎంతవేత్తయగునో
గాత్రమెత్తి యా బైరాగి కన్నె యట్లు
పాడుచుండెను, వాకిండ్ల వాడలెల్ల
చిత్తరువులలో రాణించు చెలువుదోఁచె
ఎచటివారచ్చటనె చలియింపకుంట.
వీధి వీధులఁ బొరలె నాబిడ విలాస
రాగలాలిత గానతరంగ భరము
తెలి తమలపాకు తీవ పాదులకుఁబాఱు
ధవళజలకుల్య భాతినార్ద్రంపుగతుల.
ఆమె పాడిన పాటల నాలకించి
అందుముకుళించియున్న భావార్థమెంచి
ఒక విధంబైన యున్మాద చకితదశల
కగ్గమైతిమే మిరువుర మద్భుతముగ.