Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/సారస్వత జీవనము

​

సారస్వత జీవనము.

ఉ.⁠

భూషలు గావు మర్త్యులకు◆భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదు◆పుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని◆భూషితుఁజేయు పవిత్రవాణివా
గ్భూషణమే సుభూషణము◆భూషణముల్ నశియించు నన్నియు౯.

⁠

(లక్ష్మణకవి)

సారస్వత జీవన మననేమి?

సారస్వత జీవన మననేమో యాంగ్లేయభాషాపరిచితులు కానివారికి బోధపడక యెద్దియో యొక క్రొత్తవిశేపముగాఁ బొడకట్టవచ్చును. గ్రంధరూపమున నున్న వాఙ్మయమునకే సారస్వతమనునామము వర్తించుచున్నది. అట్టిసారస్వతనిర్మాణమునే జీవనాధారముగాఁ జేసికొని లోకయాత్ర గడపునట్టి వృత్తికే సారస్వత జీవనమని నామకరణముఁ జేయుచున్నాఁడను. దీనినే గ్రంధములు వ్రాసి తన్మూలమున ధనమాజి౯౦చుటయే వృత్తిగాఁ గలిగియుండుట యని తేటమాటలతోఁ జెప్పఁదగును. ఇట్టి సారస్వత జీవనము నాగరికులైన విదేశీయులలో నెక్కువగాఁ గాన్పించుచున్నను మనయాంధ్రులలో నరుదైయున్నది. ఈవిషయము మహత్తరమైన దగుటచేతను, యిదియొకవృత్తిగా మన దేశమున నిదివఱకుఁ బరిగణింపఁబడ కుండుటచేతను, ఆంధ్రసారస్వతమును గూర్చి మాత్రమే వ్రాయుదును.

ప్రాచీన కాలమున సారస్వతజీవనము.

“సారస్వత జీవనము పూర్వముండెనా? ఉన్నచో, నేరీతి నుండెను? ఇప్పుడే రీతినున్నది? దీనినవలంబించుటవలనఁ గలుగు లాభనష్టము లెట్టివి? దీని నభివృద్ధిపరచుటెట్లు?" అనునీ మొదలగు ప్రశ్నంబులకుఁ దగిన ప్రత్యుత్తరంబులు సంగ్రహముగానైనఁ జర్చించి చెప్పవలసియుండును. సారస్వతజీవన మొకరీతిగాఁ బూర్వకాలమున మన దేశముననుండెనుగాని స్వచ్ఛమైన రీతినుండక యది యొక ప్రత్యేక మొకశాఖవారిలోనే యత్యల్ప సంఖ్యాకులులచే నలంకరించుకొనఁబడి దేశకాల స్థితులనుబట్టి యెదుగుబొదుగు లేక సంస్కారరహిత మైయొప్పుచుండెను.

పూర్వకాలమున రాజ్యపరిపాలనము చేసిన మహారాజులు, మండలాధిపతులు, సేనానాయకులు, మంత్రులు, ధనికులు మొదలగువారు కొందఱు భాషాభిమానులును కీర్తికాములునై కవుల నాదరించి భూవసతులను, కొన్నివేళలనగ్రహారములను నొసంగియు, ధన కనక వస్తు వాహనాదులచే సంతరింపఁజేసియు బహువిధంబుల సత్కరించుచుండుట చేత ననేకులు వారలకు కృతుల నంకితములఁ గావించి కుటుంబ పోషణముఁ జేసికొనుచుఁ వచ్చిరి గాని యదియంతియుత్తమ మార్గము గాఁగనుపట్టకుండెను. అంతియగాక మహాసముద్రములో నొక జలబిందువువలె మహా సంఘములో వారిసంఖ్య యత్యల్పమై యుండెను. ఆయత్యల్పసంఖ్యగల వారి మార్గము కూడ నిఱుపేదలై, భక్తాగ్రగణ్యులయిన కవివరేణ్యులచే నీచమైనదిగాఁ గర్హింపఁబడుచునే వచ్చినదికాని యుత్తమ మార్గమని సూచింపఁబడలేదు.

బమ్మెర పోతన.

పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథాప్రపంచ రచనా కుతూహలుండును, సహజ పాండిత్యుండును, కవివరుండును, భక్తాగ్రేసరుండునగు బమ్మెర పోతన నిఱుపేదయయ్యును నరకృతి నిషేధించి, తనభాగవతమును శ్రీవారి కంకితము చేసినట్టుగనేతత్కృతిలోని

ఉ.⁠

ఇమ్మనుజేశ్వరాధముల
       కిచ్చి పురంబులు వాహనంబులు
సొమ్ములుఁ గొన్ని పుచ్చికొని
       సొక్కి, శరీరమువాసి కాలుచే
సమ్మెట వేటులంబడక
       సమ్మతి శ్రీవారికిచ్చి చెప్పెనీ

⁠

​

⁠

బమ్మెర పోతరాజు కఁడు
        భాగవతంబు జగద్ధితంబుగ౯."

⁠

అనుపద్యమువలన విస్పష్టమగుచున్నది.
మఱియు సంకుసాల నృసింహకవియు తన కవికర్ణ రసాయనమున

"సీ.⁠

ఆందోళికలయందు నంతరచరులైన
      శవకృతాకృతులఁ బిశాచజనుల
వాలవీజనములఁ గ్రాలుచునీఁగకు
      గాలునిఖరవర్తు లాండసముల
నేత్రపరంపరా విలకంటకాకృతిఁ
      జేరఁబోరానిఖర్చూరతరుల
పరక రాలంబులై ప్రార్థింపఁగైకోక
      వాయెత్తకుండు జీవచ్ఛవముల
శంఖనాగస్వరాదిక శ్రవణసమద
విన్ఫుటచ్ఛత్ర విస్ఫారిత స్ఫటాక
దిష్టవిన వైద్య వశవర్తి దుష్టఫణుల
ప్రభుదురాత్ముల నెవ్వాఁడ ప్రస్తుతించు.”

⁠
గీ.⁠

నరగుణాంకిత మయ్యెనే సరసకృతియు
దూష్యమగు శునరోద్వృత్తదుగ్ధమట్ల
హరిగుణాంకితమయ్యెనే సరసకృతియు
హారసూత్రంబుగతిహృదయంగమంబు."

⁠

అనివాక్రుచ్చి గర్హించి యున్నాఁడు. బమ్మెర పోతరాజు కర్ణాటులకుఁ గృతియొసంగి ధనము సంపాదింపవలసినదని శ్రీనాధనిచేఁ బ్రేరేపింపఁబడినపుడు భారతి కన్నీరు మున్నీరుగా నేడ్చుచుఁ బ్రత్యక్షమైనట్లు గాఁగాన్పించిన నతఁడు

"ఉ.⁠

 కాటుకకంటినీరు చను
     కట్టుపయింబడ నేలయేడ్చెదో
కైటభదైత్యమర్దనుని
     గాదిలికోడల!యోమదంబ! యో
హాటకగర్భురాణి! నిను
     నాకటికిం గొనిపోయి, యల్ల క
ర్నాట కిరాట కీచకుల
కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతీ!"

⁠

అనిపలికి యామెనూరార్చి నట్లు గాఁ జెప్పెదరు.

ఒకప్పుడు బమ్మెర పోతరాజు పొలముదున్నుకొనుచు నలసిగట్టునఁ గూర్చుండియుండఁగా నతని బావమఱదియని చెప్పఁబడేడీ పై శ్రీనాధకవి “హాళికులు సుఖముగా నున్నారా”యని పరిహాసముజేయఁగా నమ్మహనీయుఁడు

"ఉ.⁠

బాలరసాలపాలనవ
      పల్లవకోమల కావ్యకన్యక౯
గూళలకిచ్చి యప్పడుపు
      కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గ్రహ
      నాంతరసీమలఁ గందమూలకొ
ద్దాలికులైననేమి నిజ
      దారసుతోదర పోషణార్ధమై."

⁠

అని యతఁడు మాఱుమాటాడకుండునట్లుగాఁ బ్రత్యుత్తరం బిచ్చెనని కూడ చెప్పెదరు. ఇట్టి దుృష్టాంతములను మఱికొన్నిటి నాంధ్రసారస్వతమునుండి యెత్తిచూపవచ్చునుగాని గ్రంధవి స్తర భీతివలన వానిని విరమించుచున్నాను.

ప్రాచీన కాలమున సారస్వత జీవనము వృద్ధి బొందకుండుటకు గారణము.

ఈకాలమునందువలె నాకాలమున నచ్చుకూటములు వెలసి, గ్రంధములు ముద్రింపబడి మూల్యమునకు విక్రయింపఁబడుట లేని కారణమున, నాకాలమాన స్వతంత్రమైన సారస్వత జీవనమున కవకాశము లేకయుండెను. ఏతన్మూలమున నాంధ్రసారస్వత మీకాలమునందువలె శాఖోపశాఖలతో వర్ధిల్లుటకు మార్గము లేక యున్న తావుననేయుండి యాకాలఁపుం బ్రభువర్యుల దయాధర్మ భిక్షములకులోనై మనవలసిన దయ్యెను. కాఁబట్టి యాకాలమునాటి సారస్వత జీవనము నొక జీవనముగాఁ బరిగణింప వలసిన పనిలేదు.

పూర్వకాలమునందు కవులు.

పూర్వమునఁ గవులయెడఁ బ్రజలకు భక్తికన్న భయ మెక్కువగ నుండెను. కవులు తిట్టిన శాపమై తగులు ​నన్న వెఱ్ఱిభయ మాకాలమున నుంటచేఁ గొందఱుకవులు భూషించియు, దూషించియుఁగూడ ధనహరించుచుండిరి. ఒకని గుఱించిన కీర్తి గాని యపకీర్తిగాని వ్యాంపిపఁజేయుటకు నీకాలమునందలి వార్తాపత్రికలవలె నాకాలమునందలి కవులు కారకులగుటచేత సాధారణముగా నెల్లవారును కవులకు భయపడుచు, శుభకార్యాదులలో కట్నములు కానుకలుగూడ చెల్లించువారుగ నుండిరి. ఎవ్వరు సన్మానింపకో వారిపై కత్తికట్టి, కలము చేఁబట్టి, చలము చేనొక దూషణ పద్యమును గాని గ్రంధమును గాని/వాసి దేశదేశములఁజాటు దుష్కవులు కూడ నుంటచే గ్రంధకర్త పదము భయంకరమైనదై యపకీర్తిపాలయ్యెను. సామాన్యులలో "గ్రంధకర్త" యనఁగా చెడుగు చేయువాఁడని యపార్ధమేర్పడినది. అతఁడు "గ్రంధసాంగుఁడు; మనవాఁడు గ్రంధకర్తయైనాఁడు" అనునవి చెడు పనులు చేయువారిని గూర్చి పలుకునట్టి వాక్యములుగానున్నవి.

గీర్వాణభాషాపండితులు.

ఇట్లే గీర్వాణభాషాపండితులు కొందఱు సామాన్య జనుల వేషభాషల నధిక్షేపించుచు నౌచితి నెఱుంగక ఛాందసులై పామరులతో సంభాషించునపుడు సయితము సంస్కృత పదాడంబరమును జూపుచుంట చేత సామాన్యజనులకు వారిభాష యర్థము గాక యుండెను. అందువలన సామాన్య జనులా గీర్వాణ పండితులను గర్వభూయిష్టులను గాఁ దలంచుచుండిరి. ఏతత్కారణము వలన గీర్వాణశబ్దమున కపార్థ మేర్పడినది. అతనికి గీర్వాణము బలిసిపోయినదనఁగా వానికి గర్వమతిశయించినదను నర్ధము స్ఫురించుచున్నది. ఎంతటి సద్వస్తువు నైనను సద్వినియోగమునకుఁ దేక దుర్వినియోగ పఱచుచున్న యెడల దానికుండు సహజ గౌరవము కూడ చెడుచుండుననుటకు పైవిషయములను తార్కాణముగఁ జూపవచ్చును. కాఁబట్టి గ్రంధకర్త శబ్దమునకట్టి యపార్ధమేర్పడినప్పుడు సారస్వత జీవనమునకు సంఘములో గౌరవ మెట్లేర్పడఁగలదు?

నవీన కాలమునందలి యభివృద్ధి.

కనుకనే మన దేశములో నింతకుఁ బూర్వము గ్రంధరచన యొకవృత్తిగాఁ బరిగణింపఁబడుచుండలేదు. ఆదిసద్వృత్తులలో నొక్కటి యనుమాట జనసామాన్యమునకుఁ దెలియకుండెను. ప్రస్తుతస్థితియొకింత పరికింతము. బ్రిటిషు ప్రభుత్వము మనదేశమునకు లభించిన నాటనుండి మనదేశములో ముద్రా యంత్రములు వెలసి ప్రాచీనాంధ్రగ్రంధములనేకములు ముద్రింపఁబడి కాక వెలలకు వేనవేలు విక్రయింపఁ బడుచున్నవి. వార్తాపత్రికల మూలమునను యేటేటను ముద్రాయంత్రములనుండి వెలువడు గ్రంధములవలనగు భాషాభివృద్ధి యగుచున్నది. స్వదేశోద్యమమువలన మన దేశమునకు; గలిగిన లాభము భాషోజ్జేననముని ముఖ్యముగాఁ జెప్పఁదగును, సర్వకళాశాలాధికారులు దేశభాషలనుద్ధరింప నుదాసీనులై యున్నను దేశమున గ్రంధప్రచారమునకై యనేక సమాజము లేర్పడి యేటేట బెక్కు గ్రంధములనచ్చొత్తించుచు దేశమున వెదఁజల్లుచున్నవి. ఆగ్లేయభాషావిశారదులైనవారు మాతృభాష పట్లవిముఖులు గాక యనేకులిప్పుడు మాతృభాషాభిజ్ఞులై యత్యంతోత్సాహముతో మాతృభాషా సేవకై గడంగుచున్నారు. పల్లెలలో సైతము గ్రంధభాండారములు వెలయుచున్నవి.

మార్పు కాలము.

శాస్త్రగ్రంధములు, చరిత్రగంధములు, నవలలు, నాటకములు, ముద్రాయంత్రములనుండి వెలువడుచు నొకరీతిగా నమ్ముడువోవు కాలమువచ్చినది. ఇదియొక మార్పుకాలము, ఈ కాలస్థితిని జూచి యనేకులాకర్షింపఁబడి గ్రంధరచనకుఁ బూరుకొని దానినే జీవనాధారమగు వృత్తిగఁ జేసికొనవలయునని సాహసించి ముందుకువచ్చుచుండుటచే భాషా ప్రపంచమున నొక గొప్పకలవరము జనించుచున్నది. దానిస్వరూపమిట్టిదని తెలిసికొనుట గ్రంధరచనకు దొరకొనఁబూనిన ప్రతిమనుష్యున కవశ్యకర్తవ్యమైయున్నది. గ్రంధకర్తలకు మాత్రమెకాదు. దేశక్షేమము నభిలషించి సారస్వతాభివృద్ధి కైపాటుపడుచున్నట్టి ప్రతిదేశాభిమానికిని కలవరస్వరూపమును దెలిసికొనుట విధియైయున్నది. ఈకలవరమే నేఁడీవ్యాసమును వ్రాయుటకు నన్నుఁ బ్రేరేపించుచున్నది.

ఈ కాలమునందలికవులు.

వస్తుస్వరూపమును సరిగా గ్రహింప శక్తులు లేక దురాశాబద్ధులై యనేకులు సరియైన భాషాజ్ఞానము గాని ​శిక్ష గాని, లోకానుభవము గాని, యోర్పుగాని లేక గ్రంధకర్తలకుండు బాధ్యతలను గుర్తెఱుంగక దుస్సాహసమునకుఁగూడ నొడిగట్టి చేతగాని పనులకుఁ|జేయిచాచి, తాము నష్టముఁ బొందుటయె కాక తాఁజెడ్డ కోతి వనమెల్ల జెఱిచినదన్నట్లు ప్రతిభాశాలురయిన గ్రంధకర్తల ప్రయుత్నములకుఁ గూడ నాశనమును గల్పించి, దేశమునకుఁ జేటు వాటిల్లురీతి వర్తింపసమకట్టుట శోచనీయము, మనదేశములో నెవ్వఁడేని సమర్థుఁడొకఁ వ్యాపారముకుజేసి, యావ్యాపారమునకై నానాకష్టములుపడి సమర్ధతతో దానిని నిర్వహించి కొంచెము లాభము బొందుట తటస్థమైనతోడనే యనేకులదివఱకు మాంద్యులైయుండియు, మఱియొక వృత్తికి దొరకొనక వానిపై పోటీకిబోయి, యావ్యాపారము నే చేయనవలంబించి, తామునష్టమును బొందుటయేగాక, లాభమును బొందుచున్న మొదటివానికి నష్టముగలిగించి, చెఱచుచుండుట, మనము కన్నులారఁ జూచుచున్నారము. సారస్వత విషయమునఁ గూడ నిట్టిచందములే గానం బడుచున్నవి. సారస్వత జీవనము కష్టసాధ్యము. మిక్కిలి పవిత్రవంతము. సుగుణాఢ్యులకు సులభసాధ్యము, దురాశాపాశబద్ధులకు దుస్సాధ్యము.నాల్గుపత్రము లల్లఁగల్గినవాఁడు కవియు, నాల్గుపత్రములు గీకినవాఁడు గ్రంధకర్తయుఁ గాఁజాలడు. సత్కావ్యములను రచించువారు సత్కవులు, సత్కవులసంవృత్తమును సంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనమున నిట్లభివర్ణించి యున్నాఁడు.

"చ.⁠

“మనమునఁగొన్న నెవ్వగలు
        మాన్ని ఘటింతురకాండసమ్మదం
బనఘ కథాముఖంబున హి
        తాహితబోధ మొనర్తురింపుగా
గనుఁగొనుకంటె నద్భుతము
       గా నెఱిగింతు రతీంద్రియార్థముల్
ఘనమతులెల్ల వారికి న
       కారణబంధులు కారె సత్కవుల్"

⁠

ఇక్కాలమున నిట్టి సత్కవు లెక్కడనో గాని కానంబడరు. సత్కవులెట్టివారో సద్గ్రంధకర్తలు గూడ నట్టివారె యగుదురనుటకు సందియములేదు. నిష్కళంకమైన యోచన, సత్యమందనరాగము, కీర్తిప్రదమైన స్వేచ్ఛ వీనితోఁగూడుకొన్న దైనయెడల సారస్వతజీవనము తక్కినవానికన్న శ్రేష్ఠమైనదనుటకు లవమాత్రము సందియములేదు.

గ్రంథకర్తలు.

తనంతగ తానొక పక్షమునకు మొగ్గ నూహించినప్పుడుతక్క గ్రంథకర్త యెన్నఁడుము నొక మనుష్యునకుఁగాని, యొక స్థలమునకుఁ గాని, యొక పక్షమునకుఁ గాని వశుఁడు కాఁజాలఁడు. గ్రంథకర్తకు జనసామాన్యమైనను రాజాధిరాజైనను నొక్కటియె. గ్రంథకర్త యనేక ప్రజలను బరిపాలింప సమర్థత గలవాఁడు. అతనిశక్తి మహత్తరమైనది, ఆ ప్రతిమానమైనది. కనుక సారస్వత జీవనము తక్కినవానికన్న నధిక సంతోషకరమయినదిగానే నూహించెదను. అయినను గొందఱు నాయభిప్రాయముతో నేకీభవింపకపోవచ్చును. అట్టివారు సారస్వత జీవనముగలవారిలోనే పెక్కందుకలరని నేనెఱుంగుదును. అగ్ని మాంద్యముచే క_సిపడువారనఁగా మనోరథభగ్నులైన గ్రంధకర్తలు పెక్కండుగలకు. ప్రచురణకర్తలకు ననేక సంవత్సరములవఱకు నొడంబడికలు వ్రాయువారు శృంఖలములలో నృత్యములు సేయు వారి పగిది దుఃఖభోజనులగుచున్నారు. సారస్వత జీవనమువలనఁ గలుగవలసిన యానందము గలుగనేరదు. ప్రచురణకర్తలు తమ కృషికి నెంతప్రతిఫలము నొసంగుదురో యని యను దినమును తాను వ్రాసిన కాగితములను లెక్క పెట్టుకొనుచుండు గ్రంథకర్త యెన్నఁడును సుఖమనుభవింపఁ జూలఁడు. జనప్రవాహ మెట్లీడ్చిన నట్లుపోవుచు, నేఁడిచ్చట, రేపు వేఱొక్కచోట, నెల్లుండి మతొక్కచోట స్తుతి పాఠములంగనుచు, తిబ్బిబ్బులగుచు, అప్పటి కానందమును బొందఁగోరు గ్రంధకర్త దేవతా ప్రసాదమునకు దూరగుఁడై, తానెవ్వరితోఁ గలిసి మెలసి తిరుగఁదలంచెనో యట్టి గొప్పవారిచేతనే పరిత్యజింపఁబడి తుదకు కష్టకాలమునకు నసహాయుఁడై పరితప్తుఁడుగాక మానఁడు.

శ్రీనాధుని యవసానదశ.

మహారాజుల చెలిమిఁజేసి, బంగరుతూగుటుయ్యేలలో నూగుచు, హంసతూలికా తల్పంబుల శయనించుచుఁ ​జల్లకులలో నెక్కి యెల్ల వేళల విహరించుచు, బమ్మెర పోతరాజుదారిద్ర్యమును బరిహసించిన కవిసార్వభౌముఁడు శ్రీనాధునివంటివాఁడు సయితము వార్ధక్యమునఁ గష్ట పరంపరల పాలయినవిషయము శ్రీనాధక వికృతము లైన

"సీ,⁠

కవిరాజుకంఠంబుఁ గౌగలించేనుగదా
       పురవీధి నెదురెండ పొగడ దండ
సార్వభౌమునిభుజా స్తంభమెక్కెనుగదా
       నగరివాకిటనుండు నల్లగుండు
ఆంధ్రనై పధక ర్త యంఘ్ర యుగ్మంబునఁ
       దగిలియుండెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసముం జేత
       వియ్య మొందెనుగదా వెదురుగొడియ
   కృష్ణవేణమ్మకొనిపోయె నింతఫలము
   బిలబిలాక్షులు తినిపోయె తిలలుఁ బెసలు
   బొడ్డుపల్లెను గొడ్డేలిమోసపోతి
   నెట్లుచెల్లింతు టంకంబులేడునూర్లు."

⁠


"సీ,⁠

కాశికావిశ్వేశుఁగలిసె వీరారెడ్డి
     రత్నాంబరంబు లేరాయఁడిచ్చుఁ
గైలాసగిరిఁబండ మైలారివిభుఁడేగా
     దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
రంభగూడె తెనుంగు రాయరాహుత్తుండు
     కస్తూరికేరాజుఁ బ్రస్తుతింతు
స్వర్గస్థుఁడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
     పాత్రాన్న మెవ్వనిపంక్తిఁగలదు
   భాస్కరుఁడు మున్నె దేవునిపాలికరిగెఁ
   గలియుగంబు-నిఁక నుండఁ గష్టమనుచు
   దివిజకి వివరు గుండియల్ దిగ్గురనఁగ
   నరుగుచున్నాఁడు శ్రీనాధుఁ డమరపురికి."

⁠

అను పద్యములలోఁ దెలుపఁబడియుండెను.

"రాబర్టు బరున్సు"

ఇట్లే ప్రసిద్ధిఁగాంచిన “రాబర్టు బరన్సు”యను నాంగ్లేయకవి యౌవన కాలమున గొప్పవారిచే సన్మానింపఁబడుచు వారిచేఁ గావింపఁబడువిందులం గుడుచుచు నుండియు, తుదకవసానకాలమున తన్నావఱకు గౌరవించి శ్లాఘించుచుండెడి తనతొంటిమిత్రులుపేక్షాపరులై, యొక్కరొక్కరే విడిచిపోవ "నైదుపౌను"లప్పీయవలసినదని యొక ప్రచురణకర్తను బ్రార్థింపవలసివచ్చినది. తన యౌవనమున దన్ను స్తుతించిన ధనాఢ్యులగు ప్రభువులందఱునేమైరి ? వారి సంబంధములు, వారి కార్యములు నెఱవేరినంతవఱకె. కుక్షింభరణార్థము స్తోత్రప్రియులైన ప్రభువులను ధనాఢ్యులను బొగడుచుండెడి కవులుకెప్పటికి సారస్వత జీవనమువలనఁ గలిగెడి నిజమైన సౌఖ్యము గలుగ నేరదు. కుక్షింభరణార్ధము తన యమూల్యమయిన స్వాతంత్ర్యామృతమును ధారవోసి, బానిసుతనమునలంకరించుకొను గ్రంధకర్తకు నిజమైన సౌఖ్యమెట్లులభించును ? మఱికొందఱు గ్రంధకర్తలు కుక్షింభరణార్ధము తమకృతినాధుల సంతోషపెట్టుటకై యోగ్యులైన సత్కవులెన్నఁడును, వినరాని కనరాని క్షుద్రవిషయములకుఁ దిగి తమశక్తులను భ్రష్టపఱచుకొనుచున్నారు.

గ్రంథకర్త కష్టములు.

ఇట్టివారివిషయ మటుండనిచ్చి, సారస్వతము జీవనముగాఁ జేసికొన్న సద్గ్రంధకర్తలకు కష్టములు లేవాయని యడుగవచ్చు. గ్రంధకర్తలకు ఆశాభంగములు, నిరుత్సాహములు, కష్టములు లేక యున్నయెడల వారు ఆనందముయొక్క విలువ యెటు తెలిసికొననగును? సుస్థిరచిత్తుఁడైన గ్రంథకర్త ఫలసిద్ధిని గోరువాఁడగునేని యెన్నఁడు నాశాభంగములకు, నిరుత్సాహములకు, నాటకములకు భయపడి వెనుదీయఁడు. అతఁడు వానినే విజయకారణములుగాఁ జేసికొనఁ జూచును. సారస్వతమునకు సేవఁ జేయఁబూనిన నిజమైన గ్రంధకర్త యుత్కృష్టాదర్శములను గలిగియుండు భాగ్యము వహించి యుండెనేని సౌఖ్యప్రదములయిన వస్తువులను వ్యర్థవ్యయములను దాంభికత్వమును విడిచి సులభ జీవనమున కలవాటుపడి, తృప్తిఁగాంచియుండును. పుష్టికరమైన భోజనము మెదటికీ చుఱుకుఁబుట్టింపఁజాలదు. ప్రతిభాశాలి లక్షాధికారిగఁబుట్టియుండలేదు. అసూయాపిశాచగ్రస్థులగు కువిమర్శకులవలన గ్రంధకర్తలకు మనస్తాపములు కలుగుచుండును. గొప్పతనమునుగోరి ముందుకు సాగివచ్చు ప్రతి గ్రంథకర్తకు నిట్టిపీడ కలుగుచునేయుండును. ​

నిజమైన గ్రంథకర్త.

కాని ప్రతిభాశాలియైన గ్రంధకర్త యెన్నఁడును నిరుత్సాహమును జెందక, పట్టుదలయు, నభిని వేళమునుగలిగి నిరంతరకృషిచే నట్టిశత్రువుల కందనివాఁడై యున్నత స్థానమును జేరి పరమానందమును బడయుచుండును. సత్యానురక్తి, ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము,ఆత్మశిక్ష జితేంద్రియత్వము, నిరంతరపరిశ్రమ, అభినివేశము, సాహసము, ధైర్యము గలిగియుండునట్టి ప్రతిభాశాలియైన గ్రంథకర్త పామరజనాను రాగమునకై యుత్తమగుణములను గోల్పోవఁజూడఁడు. ప్రపంచమును దనవెంట నీడ్చుకొనిపోవఁ జూచును కాని ప్రపంచము వెంటఁ దాను బఱుగిడఁజూడఁడు. ఇట్టిశక్తులు లేనివాఁడు గ్రంథరచనమునకు దిగరాదు. దిగినను నిష్ప్రయోజనము.

"క.⁠

నేరిచి సుకవికృతిచే
బేరెఱిఁగించుకొని జగతిఁ బెంపగుటొప్పుకో
నేరక కృతి చెప్పుటతగ
నేరమియపకీర్తి జగతినిలుపుటకాదే!

⁠


క.⁠

"ఏరసము జెప్పఁబూనిన
నారసమాలించువాని నలరింపని యా
నీరసఁపు కావ్యశవముల
దూరముననబరిహరింపుదురునీతిజ్ఞుల్."

⁠


చ.⁠

"ఫణతుల రెంటమూఁట నొక
        పద్యముఁ గూర్చెడివారు లక్ష్యుల
క్షణసహకావ్యనిర్వహత
        చిత్రముగానియట్లపో
ఫణమణిమాత్రధారులగు
        పాము లసంఖ్యము గాక తత్ఫణా
మణివిధ విశ్వభూభృతి స
        మర్థుఁడు శేషుఁడుగాక కల్గునే.

⁠

అని పైపద్యములోఁ గవికర్ణ రసాయనకావ్యకర్త విస్పష్టములగు వాక్కులతోఁ బ్రతివాఁడును గ్రంథరచనమునకు దిగ రాదని సూచించియున్నాఁడు.

"Valuable energy is wasted by being misdirected. Men are constantly attempting without special aptitude, work for which special aptitude is indispensable"
అని జార్జి హెన్రీ లూయిస్ వక్కాణించుచున్నాఁడు. అన్ని ఁటికంటెను సారస్వత జీవన ముత్కృష్టమైనదనుటకు సందియములేదు. ప్రతిభాశాలియైన గ్రంథకర్త యొక్కఁడు మాత్రమే కష్టపరంపరలనుండి తప్పించుకొని, సానంబట్టిన మణివలెఁ బ్రకాశింపఁగలఁడుగాన ప్రతిభాశాలురుమాత్రమే సారస్వతమును స్వతంత్ర జీవనముగఁ జేసికొనఁదగియుందురుగాని యేవిధమైన విద్యాశిక్షణమును లేక యచ్చుకూటములు తేరగనున్నదికదాయని పాడు పొత్తములను రచించి ముద్రణము గావించి యదియొక జీవనోపాధిగఁ జేసికొనఁగోరువారు తుదకు నష్టమును బొందగలుగుదురే కాని లాభమును బడయఁజాలరు. ఎల్లవారును సద్గ్రంధకర్తను బ్రోత్సాహపఱుచుచు నసద్గ్రంధ కర్తల నిరుత్యాహపఱుచుచు నాంధ్ర సారస్వతము పరిశుద్ధమైనదానినిగఁ జేయుట విధ్యుక్త ధర్మమని వేఱుగనేఁ జెప్పనక్కరలేదు.

మనము చేయవలసిన పని.

ఆంధ్రసారస్వతముఁ బెక్కువిధముల నేఁడభివృద్ధి గాంచుచున్నను, సంస్కార మభిలషించుచున్నది. నేటికాలమున వందలకొలఁది నవలలు ముద్రింపఁబడుచున్నను గొన్నిట మృదుమధురమయిన శైలి మృగ్యమగుచున్నది. మన యాంధ్రులలో బ్రతిభాశాలురైన మేధావులుకొందఱాంధ్రసారస్వతమును జీవనాధారముగఁ జేసికొని సంఘమున కత్యావశ్యకములును, ఆరోగ్యప్రదములు నగు గ్రంథసముదాయము నుజ్జీవింపఁ జేయవలసియున్నది. అట్టి ప్రతిభాశాలురు బయల్వెడలినయెడల దేశభాషాభిమాను లెల్లరును వారికి సర్వవిధములఁ దోడ్పడి, యాంధ్రసారస్వతమున్నత స్థితికి వచ్చునట్టులను జేయుటయ గాక సారస్వతజీవనముగూడఁ బవిత్రమైనదనియు, సత్యావశ్యకమైనదనియు, బ్రోత్సాహపఱుపఁ దగినదనియు నాంధ్రలోకము గ్రహించునట్లు కృషి సల్పుట మనకెల్లకు ముఖ్యకర్తవ్యమని నివేదించుచుఁ బ్రస్తుత మింతటితో విరమించుచు న్నాడఁను.