Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/మనుచరిత్ర నాయకలు

వికీసోర్స్ నుండి

మనుచరిత్ర నాయికలు

వరూధిని

ఆహో ! రసదేవతా ! నీ తారుణ్యము నారాధించిన సహృదయులు ధన్యులు. మహాకవి పెద్దనార్యుని నీవెఱుంగుదువు. ఆరౌచికుని కావ్యపుత్రికయు నిను సేవించినదే; కాని కాల మనేకగతుల భ్రమించినది. ఆమహాకవి నివసించిన నగరము పాడయినది. విద్యానగరనాగరకతీయందలి నానాగుణవికాసముల నిపుడు చర్చించుచున్నారు. అమృతాంశుఁడగు చంద్రుని కిరణగుచ్ఛము లేనగరీమతల్లి యందములను బాలించినవో, అచట నిపుడు పొడుపడిన దిబ్బలపై వ్రాలి మాసిపోవుచున్నవి. మనుచరిత్ర నాయికల నుజ్జీవింపఁజేసిన మనోహరవ్యక్తు లేమయిపోయినవో? పోయినవి. వారిబింబములు రసికులగు ఆంధ్రులహృదయ ఫలకములపైనున్నవి. ఏ సెలయేటి కలకలములలోనో వారి స్మృతిగీతికలు వినవచ్చుచునేయున్నవి. ఇంక స్థూలరూపప్రసక్తి యెందుకు? భావనయందుఁ ప్రతిబింబించు నాయికాస్వరూపమును విమర్శింతము.

చరిత్ర

.వరూధుని పుట్టిల్లు 'సుధాబ్ధి'. చంద్రుని చెల్లెలగు లక్ష్మీదేవి 'తోఁబుట్టువు'. దేశము 'కనక నగ' ప్రాంతము.'రాలుగరఁగించు గాంధర్వము' విద్య. 'మన్మధశాస్త్రాధ్యయనము' వెన్నతిన్న నాటినుండియుఁ జేసినది. 'సవనతంత్రములు' ఓలి పెట్టించుకొన్న లాంఛనములు. రచ్చపట్టులు

కల్పవృక్షచ్ఛాయలక్రింది మరకతమణీ వేదికలు. వైకుంఠ కైలాసములు ఆమెకు నాట్యసభలు. ఇదియంతయు వరూధిని స్వయముగాఁ జెప్పినదే! ప్రవరాఖ్య సందర్శనాసమయమందే కవి యీనాయికా పూర్వవృత్తమును జిత్రించియున్నాడు. నాయిక అపుడు 'అబ్బురపొటు'లో నున్నది. కాని యింకను 'రయోద్ధతి'కి వశురాలగు ఉత్కంఠ దీపింపలేదు. ఈలోపల ఎవ్వతెవీవ'ను 'భూసురకౌతవరుసుమశరాసనునకు బదులు చెప్పినది. వరూధిని వాక్యములయందివి ప్రధమములు కావు. ఇంతంత కన్నులుండఁగా తెరువెవ్వరి వేడెదవను' తొలిసారి మాటలయందు కేవల నర్మ్యప్రాగల్భ్యము సూచింపఁబడినది; ‘భయములేదా' యను సుకుమారప్రౌఢిమ కొంత తరువాత తోపకపోదు, కాని ఎల్లిదమైతిమి మాటలేటికీ౯' అను చివరనుడువులయందే వరూధునీ స్వభావమునకుఁ గవి బీజబిందువులు వేసినాఁడు. ఈనాయికా ప్రధమ సంభాషణమునుబట్టి కొన్ని నైజవిలక్షణములు విమర్శకుఁ డూహింపక పోఁడు; ఈ పె మితభాషిణి; కాని ప్రొఢసూక్తి యెఱుఁగనిది కాదు. సరళధోరణి కలదు; కాని దేవ దేవీ మేనకల వలె ధారాళ వాచాలత లేదు. నిశితశిక్షాలబ్ధమయిన నాతి ప్రౌఢిమ యెంతయో రుచించుచున్నది; అయితే ఆ జన్మసిద్ధమగు ధోరణీ చాతుర్యము ఉలూచీనాయి కాదులయందుంబలె స్ఫురింపదు. వరూధిని స్వభావసిద్ధమయిన సరళనాయిక; అందువలననే భావమును కనువయిన భావపూవున కనురూపమయిన తొడిమవలె నొప్పులోదవుచుండును. అవస్థలనుబట్టి యాలాపములు మాఱుట ప్రకృతి సిద్ధము. వరూధునియందు ఛాయలు మాఱును గాని శైలి సంపూర్ణమగు మార్పును బొందుట గావరాదు. ప్రవరాఖ్యుడు 'పొమ్మంచు ద్రోసిన' సందర్భమును బరిశీలింపుఁడు. ఆబిడ యాశాపతనమువలెనే యామె మాటల మధురిమయును భిన్నమైపోయినది. అపుడు 'కోపమునఁ జూచి'నదఁట. 'క్రేఁటుగొనుచు' బలికినదఁట. ఆవస్థలయందెంత తెచ్చుకోలు కోపమున్నను, సహజ సరళమయిన వాణియం దాపరిణామము వచ్చినదికాదు. కలస్వనములో నేడ్చుచు ఆబ్రాహ్మణుని దిట్టిన తిట్లన్నియు నాలకింపుఁడు. ఈరహస్యము గోచరింపఁగలదు. వరూధిని ప్రవరాఖ్యుని దూఱు భాగమును సత్యభామ శ్రీకృష్ణుని దూఱుభాగముతోఁ గలిసి చదువుఁడు. వరూధిని ప్రవరాఖ్యుని 'భూసురవర్య' యని సంబోధించినది. సత్య 'పసులకాపరి,'వల్లవీకింకర' యని తృణీకరించినది. సత్యా తిరస్కారమునకుఁ జిరపరిచయపారమ్యము నొక కొంతసహకారముగ సహృదయులు 'రసపోషణ'మును సమర్థింపవచ్చును; నాకిచట కావలసినదియవస్థాంతర ప్రసక్తి మాత్రమె.

వరూధిని యాకారము

కవి రచించిన నాయిక పదములలో ఆమె యాకృతియు నణఁగియుండును. నాయికల కందఱకును సమానరీతిగల వర్ణనలనేకములు కలవు. అయినను ప్రతిభావంతుఁడగు సుకవి తననాయికకు 'విలక్షణతఁ గల్పింపకవిడువడు. పాత్రోచితీ నిరూపణమునందు ఈవిలక్షణత్వ చర్చ కవకాశమధికము. పెద్దన మహాకవి. ప్రకృతి విలాసమును చక్కగా గుర్తించిన రౌచికుఁడు. వరూధుని వంటి నాయికకు ఆకృతి స్వభావములందుఁ బరిస్ఫుటమగు నైలక్షణ్యమును బాటించి యుండకపోఁడు, వరూధిని సర్వాంగ సౌందర్యముగల నాయికయని భావవీధియందాలోకింతము. ఊహాప్రతిష్ఠితమగు బింబము నందేమోహనాంగము విలక్షణశోభతో రాణించుచున్నది? పెద్ద నార్యుఁడిచ్చిన వర్ణనలతోఁ జిత్రకారుఁడొక పటము వ్రాయుననుకొందము, అతడేయంగమునందుఁ గళాప్రాణమగు విలక్షణతను దిద్దవలెను? ఈ ప్రశ్నలకు మనుచరిత్ర వర్ణనలే ప్రత్యుత్తరము లియవలసియున్నవి. వరూధినీ సౌందర్యము నేత్రములయందుఁ బరమావధి నందినదని నాయూహ. ఇట్లంటినని యితరావయవములు యధాసుందరములుగా పొందుపొంకములందలేదని నాయాశయముకాదు. తీర్చిదిద్దిన చక్కదనాల రేకలలో నేది విలక్షణమయిన శోభను జూపుచున్నదని నాయర్ధము. ప్రవరాఖ్యునకు గానఁబడిన నాయికా మూర్తిని భావింతము. మొదట 'విద్యుల్లతా విగ్రహాయని విశేణముతో వరూధిని యాకృతిని మొత్తముమీద సూచించినాఁడు. తరువాత శతపత్రేక్షణయని పలికి నేత్రములకుఁ బ్రధాన సౌభాగ్యము నిచ్చినాఁడు. ఇదియె ఆమె నేత్రలావణ్యమునకుఁ బ్రధమ బీజము. పిదప కొంతసేపటికి వరూధినికి అబ్బురపాటు'దయించినది. ఆ యవస్థయందుఁ గూడ ప్రధమరాగము నయనాంబుజములు వికసించుట'తో నుదయించినట్లు జిత్రించుట కారంభించినాఁడు. అందు కాంతిపెల్లుబ్బినది. కనీనికలు' పూచిన కలువమాలలను గ్రుమ్మరించినవి. అనంతర దశయును కావ్యసౌందర్యమును దోహలించునదె. 'లేనడు మల్లలు నాడగా' పూచిన పోక బోదియచాటునకుఁ బోయినది. అందెలు రవళించినవి. అచటనుండి దృగంచల ప్రభాతరంగములు త్రోవయందు వెల్లువఁబెట్టినవి. అప్పటికి (ప్రఫుల్ల నేత్రమ్ములతో, యిక నాయకునిఁ జూచినది. అంతట పులకలు మేననం కురించినవి, ఆవాలకమునందు కన్నంగవ... ముఖచంద్రు నాక్రమించుకొనునో' యను భ్రమ మన్మధునకారోపించిన కవి రసాత్మకుఁడనుట నిర్వివాదము, ఇందును కన్నులయందమె పుష్పించుచున్నది. ఇంకను భ్రమరకీట న్యాయముననుకరించినపుడు గూడ నాయికకు మొట్టమొదటి మార్పు క్షేత్రాంచలములయందే పొలుపువారినది. బిత్తరచూపు అని మేవ స్థితిని మాన్చినది. ఇంతటితో నయనానందమాగలేదు. కవికి నాయికా కటాక్ష సౌభాగ్యమునందుఁగల యా సమమత యపారమైనదిగఁ దోఁచుచున్నది.

"చెలువగు వానిఁజూచినను
జెల్వకుఁజూపులఁగావె కూటముల్

అను రసరహస్య పక్షపాతముగూడ వరూధినీ సౌందర్య రాశియందు కటాక్ష కాంతి కదంబ ప్రాధాన్యము: సూచించుటకే సంఘటించినాఁడు. 'నితంబా భోగ ధవ

ళాంశుక'మను పెద్దనార్యప్రయోగము నందు సార్ధకమంజిమ యున్నది. ధవళాంకుక ప్రశంసచే తెలుఁగు పడఁతుల సహజ దేశీయ వేషమునకు (విలక్షణత' బోసియున్నాడు. తెల్లచీరలు ధరించు నితంబినీమణులలో తెలుఁగుదేశీయులు ప్రధానులు.

వయసు.

వరూధినికి తరుణి, నవలా, మున్నగు విశేషణములు వాడఁబడి యున్నవి.ఐనను వయసు నిర్ణయించుట కింతకంటె సహజరసోచితములును, ప్రత్యేక స్థలప్రసక్తములును నగు నిదర్శనములు కావలెను. నాయిక వయస్సును నిరూపించుటకుఁ గావ్యమునందే అంతస్సాక్ష్య సంపత్తి నన్వేషింతము, విజయవిలాసమునందు

చ.

కన్నియఁగాని వేఱ కటిగాదు.....నీకు నే
జన్నియఁ బట్టియుంటి నెలజవ్వనమంతయు'

అను పద్యమునుబట్టి కావ్యక్రమమున ఉలూచి వయసు నూహింతుము. ఇంత స్ఫుటముగ వరూధిని వయసు ని రూపించుటకు అవకాశములు లేవు. తరుణీ అని ప్రవరాఖ్యుడు సంబోధించినాఁడు. అందువలన లేతపడతిగా నతనికి గన్పడితీరవలెను. (అనన్యకాంత'యనుట చేఁ గూడ నామె యీడువాడినది గాదని భావము. నవలాశబ్దమునకు (ఆ ౨.౨గి.) కోమలియను స్ఫురణకలదని కొందఱనిరి; కాని అచ్చ తెనుఁగు నిఘంటువులా రూఢార్దమును శాసించుటలేదు. శాచికులగు కవుల రసవద్రచనయందుఁగూడ ఆయర్థముగానరాదు. వరూధినీ విలాపమునందు (ఆ3_2).

 ......నోచని యింతిదైన యా
చక్కఁదనంబ దేమిటికి జవ్వన మేటికి'...

అను పలుకులు వినఁబడుచున్నవి. నాయికకు వియోగదశ యలమినది. త్రోపువడి' 'లజ్జాపరవశ భావములతో 'గుమారిల్లుచున్నది. నిస్పృహదృష్టితోనున్న నాయికా సంకల్పములు ఆత్మ విలాపమునందు ధ్వనించుట సహజము. ఈ చక్కదన జవ్వనములు వరూధినివేయైయుండుననుట రసచర్చకు సమీపము. ఇంకను శోధింతము, వనవిహారమునందున్న వరూధిని నామెసబులు దర్శించిన భాగమునకుఁ బోవుదము. వారి సంభాషణయందును అనునయాలాపములయందును ఒక సొబగుస్ఫురించుచున్నది. వరూధిని చిన్నతనమందున్నట్లురు. కులనీతులను సామెతలు నెఱిగిన పెద్దముత్తెదువలా'మె సకియలయినట్లును తోఁచుచున్నది.

 * * * ముల్లువుచ్చి కొ
ఱ్ఱడచిన చందమాయె పదమా?......

అను సఖీమణుల సంభాషణల నుండి వారియాఱితేఱి'న' లోక జ్ఞానమూహ్యము. అందఱును 'లేమ?' అని యామె నాదేశించిరి. ఇవియన్నియునటులుంతము. పెద్దనార్యుడింతకంటె రసముగ్ధ మైన విశేషణముచే వరూధిని వయసును సూచించియున్నాఁడు.

తరుణాంగుళీ ధూత తంత్రీస్వరంబుతో ......

లేఁతరికము వదలని వ్రేళ్ళచేత మీటబడిన వీణాతంత్రులనుండి లేచు కలస్వనముతో నామె'జిలిబిలి పాట ముద్దులు నటించు'చున్నదని చెప్పినాడు. లేఁతవగు 'వ్రేళ్ళనుటచే వరూధినీ వయఃతోమలత యంతయు ధ్వనించుచునేయున్నది.

వైదగ్ధ్యము.

వరూధిని చక్కని విదుషి. నిశితమయిన సాహిత్య పరిచయము ఆమె సంభాషణయందెందుఁ జూచినను ఉట్టిపడుచున్నది. కాని నాయికయందు వైద్యము కంటె వైదుష్యమెక్కువ, మన్మధశాస్త్రా ధ్యయనము తాను చిన్ననాఁటీనుండియు జేసితినని చెప్పికొనినది; కాని వీణావాదనమునందును, కీరశారికలకు పలుకులు నేర్పు'టయందును ఆప్తలాలసము గానవచ్చుచున్నది. వీణావాదనముఁజేయుచు నాయిక మన కగపడుచున్నది. రామభూషణుని గిరికానాయికయును ఈయవస్థయందెచిత్రింపఁబడినది; కాని ఈనాయికా ద్వయము నడుమ ఒక భేద మును దీయవచ్చును. వరూధిని వీణపాటయందు 'ఆలాపగతియు' పారవశ్య విభ్రమమును' ప్రధానములుగా మ్రోగుచున్నవి. అందువలన గానకళయందు నాయికకు గల స్వాదురస పక్షపాతము సూచ్యము. ఇంక గిరికాగానమునాలకింతము.'ప్రాణాను బంధములు' వానికిగల 'తాళగతులు,' ముందుఁ జీవింపబడుచున్నవి.'ఆలాపభంగి'యన్ననో అత్యత్త సంవాది స్వరంబులకు గ్రామంబు'లునుచుచున్నవి. ఇందు శాస్త్రీయ సంకేతము అధికము. గిరికకుగల శాస్త్రప్రవేశ ప్రాగల్భ్యమును, తదాభిముఖ్యమును ఇందుధ్వనించుచున్నవి. వరూధిని కిన్నరలోగలహాయి, గిరికావాదనములో లేదు. వరూధినికిఁ బ్రకృతి సౌంద ర్యము ననుభవించు నవనీత హృదయము' కలదు. 'భోగపరుఁడవై' యానందింపుమని ప్రవరాఖ్యుని సంబోధించినది. అపుడా పరిసర ప్రకృతిని తేనెలూఱునట్లు వర్ణించినది. ఆమె కాంక్ష పడీ వలచిన కస్తూరి 'సద్యోవినిర్భిన్నమై పడియున్నది;' కాని బంగారపు బరిణలలో లేదు. జవ్వాజి యెండకుఁగరఁగి, కసటువోయినది. పిదప కఱ్ఱలనంటి' గుమగుమలాడుచున్నది; కాని కృత్రిమపు రూపములతో దాపఁబడి యుండలేదు. ఘనసార తరువుల పొరలలోనుండి పచ్చకర్పూరము పొడిపొడిగా రాలియున్నది. 'పన్నీరు పూలనుండిజాఱినది. 'ఈ వర్ణనమును భావనయందు జీవింపఁజేయుఁడు. ఎక్కడి సౌందర్యమక్కడనే' ఎచ్చటి పరిమళమచ్చటనే! ప్రకృతిసిద్ధముగాఁబడిఁయున్నవి. ఇదియే నైసర్గిక సౌందర్యము. ఇందుసఖీజనులు దిద్దిన కృత్రిమాలంకారంమేమియు లేదు. పూచినపూవును పూచినట్లే దర్శించు మానసికరుచివేఱు. దానినికోసి యాకులతో దారములతోఁ బొదివిచూచు మనోవికారము వేఱు, సహజముగా కొండదాపున పొరలిపోవు సెలయేటి చక్కదనము నాస్వాదించువాఱు కొందఱు. కౌత్తవలతో తవ్విన నిలువు కాల్వలను జూచి యానందించువాఱు కొందఱు. ఇందు మొదటివారు సహజశోభనప్రియులు. రెండవవారు కృత్రిమవిలాసపరతంత్రులు. వరూథిని మొదటిజాతిలోనిది. ప్రవరాఖ్య సంబోధనముపట్ల నాయికా వైదగ్ధ్యము నిరూపించు భావచిహ్నములు కొన్నియున్నవి. ఆరంభదశయందు నర్మపరిచితి కొంత కానవచ్చినను, ప్రణయజనమదకలితములగు నానార్థ ప్రచారములు తోపవు. నాయిక వాక్కులలో మధురమగు నొక దైన్యలాలనము రసజ్ఞుఁడు చవిచూడఁగలడు. అనంతర సంభాషణయందు గూడ మోహావస్థల యందుఁ జూపట్టు చిక్కులు' వరూధినీ వచనములలో లేవు.

కం.

....... యిట్లు పలుక వరుసయె వ్రతులై
దినములు గడ పెడు విప్రుల
జనుునే గామింప......

అని ప్రవరాఖ్యుడు పలుకగా వరూధునికి వదనంబున చిన్న బాటు'వాటిల్లినది.

కం.

 కాముకుఁడగాక ప్రతినై
భూమి ప్రదక్షిణముఁ జేయఁ బోయెడువానిం
గామించి తోడితే తగవా?

అను అర్జునభాషాధ౯ము నూహించిన యులూచికి 'మోమున మొలకనవ్వు' పేటేత్తినది. ఇట వరూథిని యజ్ఞకోటియందు 'పావను లౌటకు' మాకవుగిండ్ల సుఖించుటేగదా ఫలము? అని యెత్తి పలికినది. అట ఉలూచి

కం.

నిను గీతిసాహితీ మో
హనవాణులు చెవులువట్టి యాడింపంఁగా
గనియుండి కాముకుఁడఁగా
నని పలికిన నాకు నమ్మికౌనె నృపాలా!

కం.

అతులితవిలాస రేఖా
కృతులక్షా వలపించియిట్లు త్రిభువనలీలా
వతుల నలయించుటేనా?
వ్రతమనఁగానీకు? రూపవంచితమదనా?

అని భావగర్భితముగా గడుపైన యెత్తెత్తినది. రసపుత్రులీ భాగములు తఱఁచినకొలఁది నా యాశయము తేటలు తేఱఁగలదు. మనుచరిత్రనాయికయందు మనోరథరక్తి యధిక మైనదే; కాని తత్సాధనా నైపుణ్యమునందు విలాసపరములగు 'త్రిప్పులాటలు' తక్కువ.

ప్రణయమువంటి కార్యకరణములయందు పన్నఁబడెడి వలలు మిగుల రహస్యములు. తత్కల్పనములుగూడ క్రమానుగతములై యుండవలెను. అది చతురమకు లక్ష్మణము. వరూధునీ రాగసంకల్పముల పరిణామమునందురు. ఈ భేదము స్ఫురించుచున్నది. రాగ పుష్పము క్రమక్రమముగా రేకులు రేకులై వికసించినది; కాని వశీకరణ వాగురులు మాత్రము పోగు వెంట పోగుతీసి వేసినట్లు తోపవు. ప్రవరాఖ్యుని 'ధీరచిత్తము' పరిమళించినతోడనే

నిక్కము దాపనేల? ధరణీసురనందన! యింక
నీపయి౯ | జిక్కె మనంబు నాకు'.......

అని ఒక్కసారిగాఁ బలికినది. ఇది ఈ నాయి కాగుణములయందొక లోపమని నేను భ్రమింపను; కాని చాతుర్యవతియగు నాయిక యిట్లు ప్రవతి౯పదు. ప్రవరాఖ్యునివంటి బుద్ధిజాడ్యోన్మాదుఁడుగూడ 'ఈ పాండిత్యము నీకు దక్క, మఱి యందేగంటిమే?' యని సాభిప్రాయముగఁ బ్రబోధించి వరూధినీ వైదుష్యమునకు గతిఁగల్పించియున్నాడు. ఇందు నర్మమయిన వ్యతిరేకథ్వనియును గలదు. ఎందుకుఁ జెప్పవచ్చితినన నాయిక యందు వైదగ్ధ్యముకన్న వైదుష్యమధికమని ప్రతిపాదించుటకే!

స్వభావము

వరూధిని పరిస్ఫుటయైన ప్రణయపాత్ర.'వెన్నవలె కఱఁగు' హృదయము గలదని కవిసూక్తి చెప్పనట్లు చెప్పుచున్నది. (ననవిల్తుశాస్త్రము' నావతి౯చినది; కాని యభిమాన శాస్త్రము రహి పుట్టించు గాంధర్వ'మనకతీరదు. పాటయందు అన్నిటికన్న హాయి' నెట్లుపాసించినదో! సౌందర్యార్చనయందు గూడ నైసర్గిక రామణీయకమునే యాప్తముగా నాదరించినది. ఈమె గుణస్వరూపము నాలోచించినచో ఒక రహస్యము పొడకట్టుచున్నది. వరూధునీ స్వభావముందు వశీకరణశక్తికన్న వశ్యమార్దవ మధికము, ఆమె సురచారణ విద్యాధర కుమారుల నెందఱనో చూచియున్నది. సుందర పురువ సందర్శన మెఱుఁగనిదికాదు. మఱియు నొక గంధర్వుడు రాగాంధుఁడై యామె చక్కఁదనమునకుఁ బట్టువడెను. కాని అతనికి హత్తినదికాదు. కవి చిత్రించిన వరూధిని యందమునందు కన్నులసోయగము ముఖ్యమయినది. ఆపై నేత్రాభినయ ప్రౌఢిమయును జూచియున్నాము• మొట్టమొదట ప్రవరాఖ్యుని ఆలేఖ్యతనూవిలాసమునందు నాయికా దృజ్మోహము లగ్నమయినది. ఇందువలన వరూధుని యందు రూపమునకుఁ బట్టువడును. మానసికరుచి స్ఫురించకపోదు. ప్రవరాఖ్యునిఁ గూర్చి నాయిక అదివఱకెఱుగదు. ఉలూచి విజయ యశోగానమున నావఱకె యున్మాదినియై యుండెను. నలగుణకథనమధురిమవలన దమయంతి తగులమునకు 'ఉదయవ్యవస్థ' యేర్పడినది. ఉషాకన్యకు స్వప్న సాంగత్యముచేఁ గవి రసోదయముఁ జేసియున్నాడు. వరూధునియందిట్టి 'దశాచిత్ర' మేమియు లేదు. నలకూబరసన్నిభునిఁ జూచినది అబ్బురపాటుదయించినది. లేచి నడుమల్లాడగా దాగినది. సంపూణ౯మగుచూపుచే ఆ బ్రాహ్మణకుమారుని తారుణ్యవగ్ధ్యము'లను ద్రావినది. భావమందాతని స్పర్శామంజిమననుభవించినది.

ఉత్తమవిమర్శయందు కేవల రూపవివశమయిన నాయికాహృదయము ఉదాత్తస్థానము నాక్రమించుకొనలేదు. ఈరసభేద మెట్లు కలిగినదో తుల్యనాయికల యాచిత్యప్రసక్తివలన తేలఁగలదు.

వనిత తనంతఁదా వలచి వచ్చిన చుల్కన గాదె యేరికి౯" అను కవిమధురచరణమునందు నాయికాశయము కొంత బోధపడుచున్నది. మదనవ్యధా భిన్నతచే 'అలివేణులు వాడివత్తు లగుచున్నారని' పలికెను. అనునయ పూర్వమగు భావదైన్య మిందు చాలఁగలదు. నైజ సిద్ధముగా ఈ నాయిక 'నయభయ' సాధనసంపత్తికలది కాదు. దేవదేవివలె నయచాతుర్య మెఱుఁగదు. భయపెట్టి కాంక్షా మాధుర్యమును బోషించు ప్రౌఢనాయికా లక్షణములును లేవు. ఇట్టి జాతి నాయికలలో రసవిశిష్టమగు 'మిటార'ముండినను శుకగుప్తతి పాత్రలవలె రుచినైచ్యమునకు లోనుగాకుండవలెను. అపుడే సాహిత్యచర్చకు యోగ్యమగుదురు,

సాహసము తక్కువ. ఆత్మగతమయిన ప్రజ్ఞావిశ్వాసముగూడ గానరాదు.'ఇటు జపియించిన౯ విడుతునే' యని ఉలూచి విజయాపహరణమున కాయత్తపడినది. మన్మధుని 'ఏలని బంటుగా, దక్కించుకొనరాదా? నను వీడు పరిగ్రహించినచో' అని వరూధుని సంకల్పమును కదపినది. వాడు తన్ను పరిగ్రహింపవలసినదే కాని, తన్నువాని నేలుకొను ముచ్చటలు దోచవు. నాయిక సాత్విక భావవిశిష్టయియిన ట్లూహించు సరసవణ౯నలం చాలఁగలవు. త్రోపువడిన తరువాత గూడ నాయిక నాయకుని నిందించి యెఱుఁగదు. తిట్లు తూఱుపాఱఁబట్టలేదు. విఫలమనోరధమైన దేవయాన కచునకు 'సంజీవని పని సేయకుండెడుమని శాప' మిచ్చినది. పార్థనిరాకృతయయిన ఊర్వశి కామినీజననిరధ౯కమయిన నపుంసకత్వమును వానికిఁ గట్టిపెట్టినది. కాని వరూధిని 'నేనెక్కడ ? వాని గౌఁగిలెక్కడ?' అని నిస్పృహ విలాపమునారంభించినది.

తరువాత విరహము, వరూధిని ప్రణయిని యని చెప్పియున్నాను. నిశితమధురమైన యుత్కంఠ నందినది. అచట భగ్నదశకుఁ బాత్రమయినది; అయితే దుర్మోహ నైజమగు ఉన్మాద దోషమున కగ్గమయినది కాదు. చూడుఁడు ! హంసీముఖమున 'ప్రియోదంతమును'వినిన ప్రభావతి

సీ.

ఆరతికిఁగరంబు లైతిరే నవ్విభుఁ
        గౌఁగిలింపఁగ నబ్బు కరములార!
యాయింతికిఁ గుచంబులైతిరే నతని వ
        నిపీడనమబ్బు కుచములార !
యాలతాంగికిఁ జెక్కులైతిరే నారమ్య
        శీలు చుంబనమబ్బు చెక్కులార!
యానెలంతకు వీనులైతీరే నాకళా
        విదు మంతనములబ్బు వీనులార !

గీ.

 అటుగానోఁచకేల నా కైతిరకట !
యని నిజావయంబుల కాత్మవగుచు

బాల్యమునఁదన్ను రమణ సౌభాగ్యకలిత
యనిన సాముద్రికులమాట లరసి తిట్టు.

ఆని ఉన్మాద విరహము ననుభవించినది. ఇది యింకను ప్రద్యుమ్న సహవాసముఖమబ్బకమునుపే, మనవరూధిని యన్ననో 'విసివివినివితనువుదొఱఁగ' దలచినది. విరహ దశలయందు వరూధిని యపస్మారము ఆమె స్వభావస్నిగ్ధతను సహస్రముఖములతోఁ బాడుచున్నది.

'సగము గొఱికినయాకును, సఖులు పిలువ
సగమొసగునుత్తరము, తెల్వి సగము, మఱపు
సగము, నయి చింతచే సగమగుచు నరిగె.”

ఈ నాయిక యొక్క ప్రేమాదర్శనమును చక్కగా గుర్తించుటకుఁ గొన్ని యవకాశము లున్నవి.

'నానోముల్ ఫలియించె, నావయసుధన్యంబయ్యె విప్రోత్తమా'?

అను వాక్యములె యామె యాదర్శమునకు మాత్రములు, బాల్యయౌవన కౌమారాదికములగు దశలు నాలుగు అందొక్కటొక్కటి 'ధన్య'ము గావలయునని యామె యాశయము. బాల్యమునఁ రంభాది సఖీసాహచర్యమబ్బినది. వెన్నతో ననవిల్తుమినుకులావర్తించినది. ఇక జవ్వన మాముకొనినది. 'మానంజాల'నను ప్రియసల్లాపము చేనదియు ‘ధన్య'మైనట్లు ఆనందించుచున్నది. కవియు నెడఁగన్నుమూయొ'ట కొప్పుకొనిన నాయికా భావదైన్యమత్యంత కరుణము. రసోపపత్తి యిందొదుగు నవకాశములు లేవు. ఆనందో బ్రహ్మ' మున్నగు సాంప్రదాయకములు తడవిన యీనాయికకు విమర్శకుఁడు వైష్ణవమత స్పర్శను సూచింపకపోఁడు, ఇంకొకమాఱు 'మనోరమ'ను దిలకింతము.

రాయప్రోలు సుబ్బారావు