Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/నాచన సోమనాధుడు

వికీసోర్స్ నుండి

నాచన సోమనాధుడు.

చారిత్రికవిషయములు.

ఈకవిశేఖరుని చరిత్రము సంపూర్ణముగ నిదివఱకాంధ్రలోకమునఁ బ్రకటింపఁబడియుండలేదు. కవిజీవితకర్తలగు శ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతుల వారీతని చరిత్రము దొరకలేదని వ్రాసియుండిరి. పిమ్మట శ్రీ వీరేశలింగము పంతులు గారీ మహాత్ముఁడు రచియించిన యుత్తర హరివంశమును వ్యయప్రయాసల కోర్చి తంజావూరు మహారాజా వారి పుస్తక భాండాగారము నుండి వ్రాయించి తెప్పించి, ప్రకటించి యాంధ్రలోకమునకమితోపకారమొనర్చిరి. కాని ఈ గ్రంధమువలనఁ గవిచరిత్ర మేమియుఁ దెలియుటకాధారములు లేకపోయెను. గద్యమొక్కటి యీతఁడు తిక్కన సోమయాజి యనంతర మీగ్రంధము వ్రాసినట్లు తెలియఁజేయుచున్నది. శ్రీ వీరేశలింగము పంతులవారీతని గ్రంధమును బరిశీలించియు, నితరాధారములఁ జూచియు, నూహలఁజేసియు సందేహముతోఁ గొంత చరిత్రమును గవుల చరిత్రములోఁ బ్రకటించిరి. ఇటీవల శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారొకచోట నొక శాసనమును బ్రకటించి, శ్రీ వీరేశలింగము పంతులవారితోఁ గాలనిర్ణయ విషయమున నంగీకరించి, తక్కిన విషయములలో భేదాభిప్రాయముల నొసఁగిరి. అవియైన నూహించి వ్రాసినవి. కావున నింతవఱకీ కవిచక్రవర్తి చరిత్రము మనవారికిఁ దెలియదు, తెలిసికొనుటయైన సుకరముకాదు.

ఈకవి యెప్పటివాఁడు?

ఈ విషయమై శ్రీ వీరేశలింగము పంతుల వారిట్లు వ్రాసిరి. “వీనినన్ని టినిబట్టి విచారింపగా సోమకవి యెఱ్ఱాప్రగడకుఁ దరువాతను, శ్రీనాధాదులకుఁ బూర్వము నుండుట స్పష్టము. కాబట్టి యీతఁడు హూణశకము 1880 ప్రాంతములయందున్నాడని యించుమించుగా నిశ్చయింపవచ్చును.” దీనికాధారములు మాత్రము వారెవ్వియుఁ జూపలేదు. వీరుచూపిన ముఖ్యకారణము "పిల్లలమఱి పినవీరన్నయు 'మానన్నయ భట్టు దిక్క కవి నెఱ్ఱాప్రగ్గడ సోముని౯' అని యేఱ్ఱాప్రెగడ తరువాత సోముని జెప్పినాఁడు" అని కవులు ప్రబంధములయందు వ్రాసిన యాదికవి స్తుతి యందున్న వరుసనుబట్టి సోముఁడు యెఱ్ఱాప్రెగ్గడ తరువాత వాఁడని నిర్ణయించినారు."ఇది న్యాయమా? సత్యమగునా?" అని సందియము కలిగి నేనీ విషయమున సూక్ష్మముగఁ బరిశీలించితిని. నీలాసుందరీ పరిణయము, యేకాదశి మహత్మ్యము మున్నగు ప్రబంధములలో ననేకచోట్ల సోముని యెఱ్ఱాప్రగడ కంటెబూర్వమే పేర్కొనిరి. కొందఱు కేవలము యతిప్రాసముల కొఱకు సోముని తిక్కనకంటెఁ బూర్వము పేర్కొనిరి. కావున నట్టి స్వల్ప కారణముల నాధారముచేసికొని కాలనిర్ణయము చేయరాదు. శ్రీ వీరభద్రరావు గారొక శాసనమును కనుగొని రంటినిక గా! అందువలన సోముని విషయమై మనకనేక నూతనాంశములు తెలిసినవి. శ్రీ వీరభద్రరావుగారు మాత్ర మాశాసనమునకుఁ గొంత విపరీతార్ధములఁ గల్పించిరి.

ఆశాసనమున కాలనిర్ణయ భాగమిట్లున్నది:-

“ఆలంకృత శకస్యాభే రసా(ర్తు) నయనేందుభి:౹౹ ఇందు(రు) అను నది శాసనమును కనుగొనిన “రైను”గారు ఏపీ గ్రాఫికా కర్నాటికా పదియవ సంపుటమున, విపరీత వ్యాఖానములతో నీ“ర్తు" నుపూరించిరి. ఇందున్న రస=6, ఆగ్లు=6 ఋతువులు, నయన=2, ఇందు=1 గణితశాస్త్రప్రకారము 6621 (అంకానాంవామతో గతిః.) యెడమవైపునుండి లెక్కించినయెడల 1266 శాలివాహన శకమగుచున్నది. అది పూరించిన వారిపొరపాటు సరిగఁ జూడక 1266 + 78–1244 క్రీ.శ. మని యంగీకరించి, వీరేశలింగము పంతులవారి కాలనిర్ణయ సిద్ధాంతమును వీరభద్రరావు గారంగీకరించిరి.

నాకీవిషయమై సందేహము కలిగి పరిశీలనము చేయుచుండ నదృష్టవశమున నాకు మఱియొక శాసనము దొరికినది. అందు కాలనిర్ణయ భాగమిట్లున్నది:"ఆలంకృత శకస్యాభే! రసభునయ నేందుభిః" శాసనమూలము కన్నడ లిపియందుండుటచే నేనెట్లో శ్రమచేసి యది “రసాభూనయనేందుభిః" యని యొక కన్నడ మిత్రుని సాయమున స్థిరపఱచితిని. అందువలన నది 6121=1216+78=1294 క్రీ.శ. మైనది. కాని యిదియు సందేహముగ నేయుండెను. పిమ్మట వీరభద్రరావుగారి శాసనమునకు మూలము చూచితిని. అందు “రసాభ్రనయ నేందుభిః” అనియుండెను. ఇది దిద్దుబాటులక్కర లేక యున్నది యున్నట్లున్నది. అందువలన నది 1206 +78 =1284 క్రీ.శ. మగుచున్నది. వీరభద్రరావుగారు పొరబాటున ప్రతి లిఖియించిరో, అచ్చుతప్పోయని నేనీ కడపటి పాఠము నున్నది యున్నట్లు తీసికొంటిని. వెంటనే 1284లో నాశాసనము పుట్టియుండునని నే తలఁచి యట్లు కొంతకాలమున తెలుఁగు పత్రికలలో బ్రకటించితిని. నాకుఁ దోఁచినమఱికొన్ని యితరా ధారములఁ గూడనప్పుడు చూపియుంటిని. కాని, యనవి యిచ్చట వ్రాయుట మానితిని. నాసిద్దాంతము నెవ్వరు పూర్వపక్షము చేయలేదు. వీరభద్రరావు గారిని బ్రత్యుత్తరము కూడ వ్రాయుఁడని పత్రికాముఖమునఁ గోరి యుంటిని, వారొకసారి యొనర్చిన ప్రసంగమున సోముఁడు శంభుదాసునకంటె నించుక బూర్వుఁడనవచ్చునని మాత్రము చెప్పిరి. నేను 27.10.14న సువర్న లేఖాపత్రికలో వ్రాసిన వ్యాసము నందలి యుక్తులకెవ్వరును సమాధానము వ్రాయలేదు.

ఇటీవల నాంధ్రసాహిత్య పరిషత్పత్రిక లోఁ బ్కటింపఁబడిన విప్రనారాయణ చరిత్రమున మఱల నాకుఁ గొన్ని యాధారములు దొరికెను. అప్పుడుమఱల నేనిట్లు ప్రకటించితిని.

"సోముఁడుత్తర హరివంశమును వ్రాసినపిమ్మట యెఱ్ఱాప్రగడ హరివంశమును వ్రాసెను. చెదల్వాడమల్లయ్య రచియించిన విప్రనారాయణ చరిత్రావతారిక పద్యములలో

ఉ.

శాతకృపాణ నిర్దళిత
      శత్రుఁడు నారసింహధా
త్రీతల భర్తయా గజప
      తి ప్రముఖుల్ చతురంతయానభూ
షాతపనీయ వస్తువులో
      సంగదనర్చిరి నియనుఁగు ము
త్తాతయుఁ దాతయున్భువి వి
      ధాతలు మల్లనయెఱ్ఱనాహ్వయుల్. ఆ ౧.౧౬.

(ఇందు'యెఱ్ఱన మల్లనాహ్వయుల్' అనియుండవలసినట్లు తోఁచుచున్నది?)

కవితాతయగు యెఱ్ఱాప్రగడ (ముత్తాతయై యుండవలయునని తోఁచుచున్నది?) సాళువ నరసింహరాజుకడ బహుమానములందినట్లున్నది. ఈయెఱ్ఱన శంభుదాసుఁడే! విప్రనారాయణ చరిత్రముననే యిట్లున్నది.

గీ.

సుకవిసంస్తుత్యుళంభుదా ♦ సుని నుతింప
నేర్తు నేయైన నేనువ ♦ ర్ణింతునతని
చిన్నమనుమఁడ గావున ♦ చిన్నవాండ్ర
కొదవుపలుకులు ముద్దుసే ♦ యుదురుకాదె. ఆ ౧.౧౨.

కావున హరివంశము రచియించిన శంభుదాసుఁడే యీతఁడు, ఇంకను సందేహముండినచో నిదిచూడుఁడు.

ఆ.

దురితహరుప్రబంధ పరమేశ్వరుని
జెదల్వాడ నిలయు నాదు వంశకర్త
ధన్యమూర్తి శంభుదాసు నెఱ్ఱాప్రెగ
డ ను నుతింపబ్రహ్మాకునుదరంబె. ఆ. ౧. ౧౩.

కాబట్టి యెఱ్ఱాప్రెగడ సాళువ నరసింహరాజుకడ బహుమానములనంది యాతని కాలమున నుండెను. ఈ సాళువ నరసింహరాజు విజయనగర నిర్మాణమైన పిమ్మట రాజ్యము చేసిన (1) హరిహర (2) బుక్క రాయలు మొదలగు వారివంశములోఁ గడపటి పురుషుఁడు. అనగా విజయనగరమును 1834 మొ౹౹ క్రీ॥శ॥ 1400 వఱకును, (నావాదముననుసరించి 128 మొదలు 1400 వఱకును) బాలించిన పదముగ్గురు రాజులలో పదమూడు తరములవఱకు నరసింహరాజును పేరుగల రాజేలేఁడు! ఇంక నున్న వారెవరనగా 1490–1509 వఱకు ముగ్గురు నరస రాయలు కలరు. విప్రనారాయణ చరిత్రమునఁ జెప్పిన “ఉ.శాతకృపాణనిర్దళిత" యను పద్యమునందలి సాళువ నరసింహరాజు పిల్లలమఱ్ఱి పినవీరన జైమినీ భారతమును గృతినందిన నరసింహరాయుడే యైయుండు ననుకొనినచో (అనగా మొదటి నరసింహరాయలే యనుకొనినను) యెఱ్ఱాప్రగడ పిల్లలమఱ్ఱి పినవీరనకాలీనుఁ డగుచున్నాడు. కావుననే వీరన్న, నన్నయ, తిక్కన, నాచన సోమన, శ్రీనాధులను మాత్రమే శృంగార శాకుంతలమున వర్ణించియున్నాడు. దీనిని బట్టి శ్రీనాధుఁడు యెఱ్ఱాప్రగడ పిల్లలమఱ్ఱి పిన వీరన, సమకాలీనులని దోఁచుచున్నది. కాని యెఱ్ఱాప్రగడ యంతకుఁ బూర్వము పండ్రెండుగురు రాజులకుఁ బూర్వముగల బుక్క రాయనితో సమకాలీనుఁడైన నాచన సోమనాధునితో మాత్రమెన్నటికిని సమకాలీనుఁడుకాఁడు!!(19,1.1915ఁ సువర్ణ లేఖ'చూడుఁడు). ఇందువలన నాచన సోమనాధుఁడు 1284 క్రీ॥శ॥న బుక్కరాయఁడిచ్చిన శాసనముననుసరించి, 18వ శతాబ్దాంతమునను 14వ శతాబ్దాదిని యుండియుండవలయునని దలంచెదను. పెద్దలు నిర్ణయింతురుగాక!

కవికుల మెద్ది

వీరేశలింగము పంతులుగారు వీలైనచోటుల నెల్ల "యీకవి యారువేల నియోగి"యనిచెప్పునట్లే యీతని నియోగియని చెప్పిరి. “అట్లుకాదు శాసనమున (అష్టాదశ పురాణజ్ఞుడని వ్రాసియున్నది. ఈతఁడు వైదికియై యుండునని వీరభద్రరావు గారనికి, “ఏదియు కాదు నాకు కొన్ని చాటుధారలువచ్చును; ఈతడు క్షత్రియుఁ"డని నేనెఱిగిన క్షత్రియమిత్రుఁడనెను శాసనమునందతఁడు బ్రాహ్మణుఁడని స్పష్టముగ వివరింపఁబడియున్నది. నియోగియా వైదికీయాయను విచారణమంత యావశ్యకమైనదికాదు. కేవలమొక్క మతమునందున్న స్మార్తులయందీ స్వల్పభేదమును గురించి తెలియకపోయిన నష్టములేదు. తెలిసికొనక తప్పదందురా?

ఈతని యింటి పేరు నాచిరాజువారు. ఇందుకుదాహరణము: — కూచిమంచి జగ్గకవి సుభద్రాపరిణయమునందలి కృత్యాదిని "నాచిరాజు సోముని” అని వర్ణించినాఁడు, జగ్గకవి యిటీవల వాఁడాతని మాటలు పనికిరావందుమా? సోమునికిఁ బిమ్మట శతాబ్దముననున్న పిల్ల లమఱ్ఱి పినవీరన శృంగార శాకుంతలమున “నాచి రాజునిసోము” అని వ్రాసియున్నాడు. 'రాజు' అని యింటి పేరు వైదికులయందరుదు. కావున నీతఁడు నియోగియని చెప్పనగును. ఇంకను సందేహమున్న నారువేల నియోగి కవియగు కోవెల గోపరాజు వైదిక కవుల వేఱుఁగ వర్ణించి నియోగుల నిట్లు వర్ణించెను చూడుఁడు!

చ.

అనఘుహుళక్కి భాస్కరుమ
        హామతి పిల్లలమఱ్ఱి పెద్ది రా
జును బినవీరరాజు కవి
        సోముని తిక్కనసోమయాజి కే
తనకవి రంగనాధునుచి
        తజ్ఞుని నెట్టిన నాచిరాజుసో
మన నమరేశ్వరుం దలతు
        మత్కులచంద్రుల సత్కవీంద్రుల౯.

అని స్పష్టముగ “నాకులచంద్రులు” అని వ్రాసియున్నాడు. కావున నాచన సోమనాధుఁడు నియోగి యని స్పష్టముగ చెప్పవచ్చును.

ఇంటిపేరు.

నాచిరాజను పూర్వపురుషుని పేరున బిలువఁబడు యింటి పేరుగల యాతఁడని చెప్పవచ్చును. ఈయింటి పేరు నాచిరాజను సోమునితాతనుండియో తండ్రినుండియో వచ్చియుండు పౌరుష నామమేయైయుండును.

గోత్రము.సూత్రము.

భరద్వాజస గోత్రజుఁడని శాసనమున స్పష్టముగనున్నది. స్థలాభావమున నుదాహరింపనైతిని. (ఎపిగ్రాఫికా కర్నాటికాలో కనుగొనిన 46గొరి బిదునూరు శాసనముకానీ, వీరభద్రరావుగారు కనుగొనిన 158 మళబాగల శాసనముకాని చూడుఁడు)

అపస్తంబనూత్రుఁడగుట బ్రాహ్మణుఁడగుట నిర్వివాదాంశము! (Vide inscription).

గురువు.

"ఇది బుధారాధన విరాజి కొమ్మనా మాత్యపుత్ర తిక్కన సోమయాజి ప్రణీత భారత కథానంతరము" అని తన యుత్తర హరివంశీ గద్యమున సోముఁడు వ్రాసియుంట నీతఁడు తిక్కనయందు గురుభావముకలిగి ప్రవర్తిల్లైనని నిర్నయింపనగును. ఈతఁడు తిక్కన వృద్ధాప్యమున పడుచువాఁడై యుండవచ్చును. శిష్యుఁడైనఁగావచ్చును.

ఇష్టదైవము.

తిక్కన సోమయాజికి వలెనే యీతనికిఁ గూడ హరిహర దేవుఁడే యిష్టదైవము. కావుననే బైచరాజు వేంకటనాధ కవి తన పంచతంత్రమున నిట్లు వక్కాణించియున్నాడు.

క.

ఏచనువుకలదు హరిహర
సాచివ్యమునొంద నన్యజనులకు మదినా
లోచింపఁదిక్కయజ్వకు
నాచనసోమునకు మఱియు నాకుందక్క౯.

మతము.

స్మార్త బ్రాహ్మణుఁడు. శివకేశవ బేధములేని మహామహుఁడునద్వయితీయని యాతని గ్రంథమును బట్టియు శాసనమునుబట్టియు నిర్ణయింపనగును.

తండ్రి.

ఎఱ్ఱయకవి సకలనీతి కధానిదానమునందీ సోమునినిట్లు వర్ణించియున్నాడు.

చ.

వినుతియొనర్తు నాంధ్రనుక
వీంద్రుల నన్నయభట్టు దిక్కయ

  • * * * *

      * * * * * నా

చనసుతు సోముభాస్కరుని ఇందలి “నా చననుతు" అనుదానిననుసరించియు శాసనమునందలి “ నాచ నాత్మజః" అనియుఁ గలవాక్యముల ననుసరించియు నీతని తండ్రి పేరు నాచన్న' యని తెలియుచున్నది. వీరభద్రరావు గారు శాసనము నందలి “నాచనాంబుధి:" అను వాక్యములఁజూచి 'నాచన' యీతని తండ్రి పేరు కాదనిరి.'నాచన'యనునది తండ్రిపేరు నింటి పేరుకూడనని తోచుచున్నది.

వ్రాసిన గ్రంధములు.

ఈతఁడు వ్రాసినది యుత్తరహరివంశ మొక్కటియె దొరికినది. అదియైన కృత్యాదిలేదు. అదియెంతవఱకు వ్రాయఁబడినదో తెలియదు. సోముని వసంత విలాసములోనిదని" అత్తరి విట నాగరికులు" అను పద్యము లక్షణ గ్రంధములఁజూచి వీరేశలింగము పంతులుగారు వ్రాసి యున్నారు. “అంజెదవుగాక" అనునది రెండవ పద్యము. ఈరెంటిలో రెండవది యుత్తర హరివంశములోనిదే! “అత్తరివిట నాగరికుల”ను నది వైజయంతీ విలాసములోనిదని శబ్దరత్నాకరములో వ్రాయఁబడియున్నది. నా మిత్రులగు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారా వసంతవిలాస గ్రంధమునందలి మఱికొన్ని పద్యములు దొరికినట్లును, వసంతవిలాసముయక్ష గానమైనట్లును చెప్పెదరు. శ్రీమానవల్లి రామకృష్ణకవి గారి వద్ద వసంత విలాస ప్రతియున్నట్లు కొందఱు మిత్రులు చెప్పెదరు. ఇదమిద్ధమని చెప్పుటకువీలులేకున్నది.

నాకుఁ దెలిసినంతవఱకుఁ గవిచరిత్రమును సంగ్రహముగ వ్రాసితిని. ఇందుప్రమాదములుండిన నుండవచ్చును. ఈ మహాకవికవిత్వ విమర్శనమునకు మఱియొక సారి బ్రయత్నింప దలఁచితిని. దయామయులగు చదువరులిందలి గుణదోషముల నరసి సత్యప్రకటనమునకు సాయపడుదురుగాక!

వం.సుబ్బారావు.