Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయములు (పద్యములు)

వికీసోర్స్ నుండి

గ్రంథాలయములు.


సీ.

అఖిలకాలములఁ బ్ర♦ఖ్యాతిఁగన్న మహాత్మ, మంజులాలాప ♦ సంపదయనంగ
సర్వదేశములఁ బ్ర♦శస్తిఁజాటిన ధీర, శేముషీ విభవ వి♦శేషమనఁ గ
కర్ణేంద్రియప్రీతిఁ ♦ గావించు కవిరాజ, సత్కావ్యకల్పనా ♦ సారమనఁగ
షట్ఛాస్త్రనిర్మాణ ♦ చణమైన పండిత, ప్రజ్ఞాతిశయ వి♦జృంభణమనంగ


గీ.

రాశిఁ జేసిన జ్ఞాన స♦ర్వస్వమనఁగ | ధర్మపుస్తక నిలయంబు ♦ తనరుచుండు
నుచితగతి దాని నెవఁ ♦ డుపయోగపరచు | నతఁడె వెల లేక విజ్ఞాన ♦ మందువాఁడు


ఉ.

బాలురవిద్యలన్ దనుపు ♦ ప్రౌఢులకున్ ముదమున్ ఘటించు సు
శ్రీలఁ జెలంగువారలకు ♦ చెల్వొనగూర్చును కష్టజాలముల్
జాలఁగఁగూరియున్న తఱి ♦ శాంతినెసంగి సతంబుమంచు; గ్రం
థాలయముల్ జగంబున ♦ కనంతశుభోదయముల్ దలంపగన్.


సీ.

అరువదినాల్గువిద్యలు ♦ నొక్కచో నేర్వఁ, దగు నిలయంబు గ్రంథాలయంబు
దరి లేని దుఃఖసా♦గరములనీదంగఁ, ధరణితుల్యంబు గ్రం♦థాలయంబు
బుద్ధిమదగ్రణుల్♦ పూర్వులొసంగిన, ధననిథానంబు గ్రం♦థాలయంబు
అజ్ఞానతిమిర సం♦హారంబుగావించు, నర్క తేజంబు గ్రం♦థాలయంబు


గీ.

యశమె కాయంబుగాఁగల ♦ ప్రాజ్ఞ సుకవి | బృందముల రూపములఁ బ్రద♦ర్శించిజన
గరము సమ్ముదితాత్ములు ♦ గానెునర్చు| నట్టి సన్మందిరంబు గ్రం♦థాలయంబు.


ఉ.

దీని నిజంబెఱింగి మన♦దేశమునంగల పట్టణంబులన్
జానపదంబులన్ సులభ♦సాధ్యములై తగ గ్రంథమందిరాల్
మానుగనిల్పి సర్వజన♦మండలి విద్యల నేర్వకున్న స
స్మానమొనర్తురే మనల♦ నాగరికాగ్రణులంచు నన్యులున్.


ఇవికూడా చూడండి

[మార్చు]
  1. గ్రంథాలయములు (పద్యములు)-1