Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆంధ్రుల జనహితపరత్వము

వికీసోర్స్ నుండి

ఆ౦ధ్రుల జనహిత పరత్వము

మద్రాసునందు బ్రచురింపబడు హిందూపత్రికయందు ఒక యుపవిలేఖరి యిట్లు వ్రాయుచున్నాడు.

ఆంధ్రులెంతమాత్రమును లోకహిత కార్యములందు వెనుదీయు వారుకారు. అందులకీ క్రిందియంశములే నిదర్శనములు. కార్య మొనర్చినచో నిండ్లలో పొరుపులు పుట్టి గృహసౌఖ్యమునకును భంగము కలుగునో అట్టి సంఘ సంస్కరణ విషయమునగూడ గాఢతత్పరులగువారీ యాంధ్రసంఘమునందున్నారు. లెక్కలేని రాజకీయ సమావేశములును సభలను వారికి నీవిషయమునగల పట్టుదలకు నిదర్శనములు ; ఇటీవల జరుగుచున్న కమ్మవారు వైశ్యులుమున్నగు కులసభలవలన నాగరకోద్యమములందు వెనుకబడిన సంఘము లేతీరున మేల్కొనుచున్నవను సంగతి స్పష్టమగుచున్నది. ఈ రాజధాని యందలి తక్కిన సంఘముల వారికంటే నాంధ్రులే తమ భాషాభివృద్ధివిషయమున నెక్కుడు శ్లాఘ్యమగు శ్రద్ధనుగొనుచున్నారనుట యాంధ్రుల పక్షమున నొక్కి చెప్పవలసిన విషయమే. దొరతనమువారివలన నెట్టి సహాయమును బొందకయే, ముఖ్య గ్రామములన్నిటియం దేశ భాషా గ్రంధభాండాగారములను స్థాపింప బ్రయత్నించుచున్నారు. ఈ ప్రయత్నములందు వీరికి జాలవరకు జయముగ ఉన్నది. పల్లెయందుగాని పట్టణమందు గాని నివసించుచు నేమాత్రమైన జ్ఞానముగల ప్రతివానికిని స్వదేశాభివృద్ధి విషయను అందులో ముఖ్యముగ నాంధ్రమండలాభివృద్ధిని గురించియు నపరిమితమగునుత్సాహము జనింపజేసిన యీ యాంధ్రోద్యమెంతయు బ్రశంసనీయము, ఏదేశమునకైన నెట్టేసఁఘమున కైన కీర్తిన్ దెచ్చునంతటి ప్రజానాయకులును కార్యతత్పరులు ఇచ్చటగలరు. ముఖ్యములగు పట్టణములన్నిటి యందును డంబమునకు గాక యధార్థముగ కార్యములను బూనుకొని తోశ్పర్యముతో నిర్వహించు యౌవనులు కలరు.