Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆంధ్రగ్రంథవిభజనము

వికీసోర్స్ నుండి

ఆంధ్ర గ్రంథ విభజనము


కడచిన సంవత్సరము ఏప్రిలు 10వ తేదీన బెజవాడలో జరగిన ఆంధ్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల సభయందు, శ్రీ బ్రహ్మపురాంధ్ర భాషాభివర్ధనీ భాండాగార పక్షమున “ఆంధ్ర గ్రంథ విభజనము" ను గూర్చి నేనొక చిన్న వ్యాసమును జదివియుంటిని. అందు ఆంధ్రమున నింతవరకు గల గ్రంథనామములను, తత్క ర్తల నామములతో సయితము సేకరించి, వాటిని కొన్ని ముఖ్య తరగతుల క్రింద విభజించి, అకారాది పట్టికలను తయారు చేయించినచో నవి యనేక గ్రంధ భాండాగారముల వారికి మిగుల నుపయోగకారిగా నుండునని సూచించి యుంటిని. ఆ సభ యందు ఏర్పాటు కాబడిన ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘమువారు క్రిందటి సంవత్సరము మే నెల 10వ తేదీన కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు నందు సమావేశమై ఆంధ్ర గ్రంధ విభజన మవసరమని తీర్మానించి, ఆపనిని నెర వేర్చుటకు బరంపురములోనినన్నును, రాజమంద్రిలోని వీరేశలింగ భాండాగారమువారిని నియమించిరి. ఈపనిని నిర్వహించుటకుగావలసిన సాధన సామగ్రి బాగుగా లేనందున 'ఓడ్ర దేశములోని బరంపురమునందు నేను వసించుట చేతను సర్కారు ఉద్యోగమున పండుటవలన తగిన కాలవ్యవధి లేకుండుటచేత, తృప్తికరముగా నెరవేర్పలేనని నాకు తెలిసినను, ఈ విషయమున నాకు గల అభిమానమే నేనెనర్చిన కొద్ది కార్యమునకైనను ప్రోత్సాహము కలిగించినది.

ఇంతవరకు చేసిన పని

గ్రంధ నామములను, తత్కర్తల నామములు సంగ్రహించుటకు ముఖ్యముగా మూడు ఆధారములుగలవని నేను బెజవాడయందు చదివిన వ్యాసమునందు సూచించియుంటిని. వాటిలో మొదటిది పూర్వ ప్రణీత గ్రంధముల దెలుపు కవులచరిత్ర; రెండవది అచ్చు గ్రంధ నామములను మూడు మాసముల కొకసారి కడచిన ఇరువది ముప్పది సంవత్సరములుగ బ్రచురించుచున్న సర్కారువారి పోసెంటుజార్జి గెజెటు; మూడవది భాండాగార గ్రంధముల పట్టికలు. వీటిలో నాకు దొరికిన కవుల చరిత్ర, కడచిన ఎనిమిది సంవత్సరమ గెజెట్లు, హైదరాబాదులోని శ్రీ కృష్ణదేవరాయ పుస్తక భాండాగార గ్రంధముల పట్టికయ బరంపురములోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజ గ్రంధముల పట్టికయు మాత్రమే. ఈ స్వల్ప సామగ్రితో నేను తయారుచేసిన “ఆంధ్ర గ్రంథ విభజన పట్టికా వివరము” ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘమువారు బ్రకటించిన 1914-1915 సంవత్సర వృత్తాంతము నందు ముద్రింపబడియున్నది.

నాకు దొరకిన గ్రంధనామముల నన్నిటి ఆయాతరగతుల యందు సరిగా విభజింప గలిగితినని చెప్పజాలను. ఏలననగా చాల భాగము గ్రంధములను నేను స్వయముగా చూచుటకు దొరకనందున కొంతవరకు ఊహను బట్టియు కొంతవరకు వినికిడినిబట్టియు ఆయా తరగతుల క్రింద భాగించితిని. మరియు ఒకే గ్రంథము అందుగల పలు విషయములనుబట్టి 2,3 తరగతుల క్రిందకు రావచ్చును. అట్టి విషయమయిన వాటిని ఏదోయొక తరగతి క్రింద మాత్రమే జేర్చితిని. ఇదిగాక కొన్ని గ్రంధముల విభజనమును గూర్చి అభిప్రాయ భేదముండుటకు అవకాశమున్నది. ఈ మూడు యిబ్బందుల చేత నా జనము నిర్దుష్ఠమైనదని చెప్ప సాహసింపను. కాని ఈ విషయమున ఇంకముందు తగినవారు ఈయవలసిన మహాకార్యమునకిది కొంత వరకు అస్ధిభారముగ నుండవచ్చునేమోయని దలచుచున్నాను. నేను సేకరించిన 3259 గ్రంధములలో గొన్నిటికి గ్రంధకర్తల నామములు దొరకనందున వాటికి ప్రచురణకర్తల నామములను దెలిపితిని, మరియు ఆయా తరగతులక్రింద విభజింపబడిన గ్రంధనామములు చాల భాగము అకారాదిగా కూర్చితిని. అందువలన కావలసిన గ్రంధమును కనుగొనుట బహు సుళువు. ఒకే పేరుగల గ్రంధములు పలువురు కవులు చేసియున్నారు. అవియు ఆయా తరగతుల క్రింద నెక్కచోట దెలుపబడినవి.

అంతర్భాగ విభజన వివరములు

(1) పురాణముల క్రింద పురాణమను పేరుల గ్రంధములను మాత్రమే గాక పోతనామాత్యుని భాగవతము, కవిత్రయము వారి భారతము, వావిలికొలను సుబ్బారావుగారి వాల్మీకి రామాయణమునుగూడ జేర్చితిని.

(2) కొన్ని గ్రంధములు కావ్యలక్షణమున్నిటిని సరిగా కలిగియుండక బోయినను వాటిని సామాన్య పద్యగ్రంధములనుండి వేరుపరుచుటకై పద్యకావ్యములను తరగతి క్రిందనే చేర్చితిని.

(3) కొన్ని కొన్ని గ్రంధములు వచన కావ్యసులక్రింద జేరునో, నవలల క్రింద జేరునో, చారిత్రక కథల క్రింద జేరునో, లేక నీతి, వినోద, చారిత్రిక కథల క్రింద జేరునో, లేక నీతి, వినోద, కల క్రింద జేరునో యను సంశయము బుట్టు చుండును

(4) కొన్ని కొన్ని నాటకములనిగాని ప్రహసనములనిగాని నిర్ధారణ జేయుటకు వీలగాకయున్నది.

(5) కృషి, వైద్య, న్యాయ, గాన, పాక, జ్యోతిషాది విషయకములగు గ్రంధములను వేరు వేరుగా విభజించినను మొత్తము మీద వాటిని శాస్త్రముల తరగతి క్రిందనే జేర్చితిని.

(6) కొన్ని లకణగ్రంధములు, వ్యాకరణము, చందస్సు, అలంకారము మొదలగువాటి నన్నిటిని గురించి చెప్పుచున్నను యేదోయొక తరగతిక్రింద మాత్రమే విభజించితిని

(7) కొన్ని కొన్ని శతకములు, నీతి, మత, వినోద, తరగతుల క్రింద విభజింపవలసి యుండినను గ్రంధములు నాకు స్వయముగా దొరకమిచే నిద్ధారణ చేయలేక ప్రస్తుతమున వాటి నన్నిటిని “మతపద్యముల” క్రింద జేర్చితిని.

(8) మహాత్మ్యములలో పాండురంగమహాత్మ్యము, భూతపురిమహాత్మ్యము, మున్నగువాటిని పద్యకావ్యతరగతి క్రింద జేర్చితినిగాని మిగిలినవాటిలో ఏవి పద్యములో, ఏవి గద్యము బాగుగా తెలియనందున ప్రస్తుతమున వాటి నన్నిటిని “మత) పద్యముల” క్రింద జేర్చితిని.

(9) ఇదేవిధముగా పద్యములయందు జేర్చిన స్తోత్రములలోగొన్ని గద్యము లేమోయని యనుమానముగానున్నది.

(10) కవుల చరిత్రలో బేర్కొనబడి నర్వప్రణీత గ్రంధములన్నియు, నిపుడచున్నీ

లేకున్నను, వాటినిగూడ పైతరగతుల క్రింద విభజించితిని. అచ్చుపడిన వేపూ, లేని వేపూ తెలిసికొనవలసి యున్నది.

ఇకముందు చేయవలసిన పని.

ఆంధ్రగ్రంధవిభజన విషయమునందు నాకుగల అభిమానమువలన నేనీ పనినిర్వహింప మొట్టమొదమొదట నొడంబడితినిగాని పని ప్రారంభించిన వెంటనే అది దరి లేని మహాసాగరమువలె గనవట్టెను. ఆపనిని తృప్తికరముగ నెరవేర్చుట గుతగిన సాధన సామగ్రి కాలవ్యవధి నాకు చాలని తెలిసెను. ఇక ముందు చేయవలసిన పనులు రె౦డువిధములు. (1) నేను చేసిన పనియందు నిప్పుడుజూపినవి లోపములుగానున్న యెడల వాటినిసవరించవలెను.(2) నాకు దొరకని, ఇంకను, కనీసము రెండు వేలవరకు ఉండవచ్చను. ఆంధ్ర గ్రంథనామములను తత్కర్తల నామములతో సేకరించి ఆయాతరగతుల క్రింద విభజించి అకారాదిగా పట్టికలను తయారు చేయవలెను. ఈ రెండుపనులను జేయుట, అందుకుతగిన సాధన సామాగ్రిగల చెన్న పట్టణమునగాని, వేరుచోట సాధ్యముగాదని తోచుచున్నది. ఇరువది, ముప్పది సంవత్సరములుగా నచ్చుబడుచున్న గ్రంధనామముల నన్నిటిని విషయములతో సహా బ్రచురించు ఫోర్టు సెంట గెజెట్లు అక్కడనే దొరుకును. ఈ సామగ్రికి తోడు, ఆధునిక ప్రసిద్ధ గ్రంధకర్తల పేర్లు, వారొనర్చిన గ్రంధ నామములు, మరియు పెద్ద పెద్ద ఆంధ్ర గ్రంధ భాండాగారములు గ్రంథపట్టికలు. గూడనవసరము. వీలయిన యెడల వావిళ్ళ రామస్వామిశాస్త్రులవారి పుస్తకాలయముల వంటి విక్రయ శాలల యందుండు గ్రంధములను స్వయముగా జూచి విషయములను గ్రహించి సరిగా తరగతులక్రింద విభజించుటకు అవకాశముకూడ కలిగించవలెను.

కావున ఈ ఆంధ్ర గ్రంధ భాండాగార ప్రతినిధులసభవారు పైవిషయములను ఆలోచించి సరియైన ఆంధ్రగ్రంధ విభజనమును గావించి, దానిని పుస్తక రూపమున అచ్చొత్తించుటకు తగిన ప్రయత్నములు చేయుదురుగాక యని ప్రార్ధించుచున్నాను.

ఆ౦ధ్రుల జనహిత పరత్వము

మద్రాసునందు బ్రచురింపబడు హిందూపత్రికయందు ఒక యుపవిలేఖరి యిట్లు వ్రాయుచున్నాడు.

ఆంధ్రులెంతమాత్రమును లోకహిత కార్యములందు వెనుదీయు వారుకారు. అందులకీ క్రిందియంశములే నిదర్శనములు. కార్య మొనర్చినచో నిండ్లలో పొరుపులు పుట్టి గృహసౌఖ్యమునకును భంగము కలుగునో అట్టి సంఘ సంస్కరణ విషయమునగూడ గాఢతత్పరులగువారీ యాంధ్రసంఘమునందున్నారు. లెక్కలేని రాజకీయ సమావేశములును సభలను వారికి నీవిషయమునగల పట్టుదలకు నిదర్శనములు ; ఇటీవల జరుగుచున్న కమ్మవారు వైశ్యులుమున్నగు కులసభలవలన నాగరకోద్యమములందు వెనుకబడిన సంఘము లేతీరున మేల్కొనుచున్నవను సంగతి స్పష్టమగుచున్నది. ఈ రాజధాని యందలి తక్కిన సంఘముల వారికంటే నాంధ్రులే తమ భాషాభివృద్ధివిషయమున నెక్కుడు శ్లాఘ్యమగు శ్రద్ధనుగొనుచున్నారనుట యాంధ్రుల పక్షమున నొక్కి చెప్పవలసిన విషయమే. దొరతనమువారివలన నెట్టి సహాయమును బొందకయే, ముఖ్య గ్రామములన్నిటియం దేశ భాషా గ్రంధభాండాగారములను స్థాపింప బ్రయత్నించుచున్నారు. ఈ ప్రయత్నములందు వీరికి జాలవరకు జయముగ ఉన్నది. పల్లెయందుగాని పట్టణమందు గాని నివసించుచు నేమాత్రమైన జ్ఞానముగల ప్రతివానికిని స్వదేశాభివృద్ధి విషయను అందులో ముఖ్యముగ నాంధ్రమండలాభివృద్ధిని గురించియు నపరిమితమగునుత్సాహము జనింపజేసిన యీ యాంధ్రోద్యమెంతయు బ్రశంసనీయము, ఏదేశమునకైన నెట్టేసఁఘమున కైన కీర్తిన్ దెచ్చునంతటి ప్రజానాయకులును కార్యతత్పరులు ఇచ్చటగలరు. ముఖ్యములగు పట్టణములన్నిటి యందును డంబమునకు గాక యధార్థముగ కార్యములను బూనుకొని తోశ్పర్యముతో నిర్వహించు యౌవనులు కలరు.