గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/అపూర్వ ప్రకటన
అపూర్వ ప్రకటన.
అమెరికాదేశమునందున్న 'బుఫెలో' సార్వజనిక గ్రంథాలయమువారు ఈ క్రింది రీతిని ప్రకటనను గావించిరి.
"మీకు గావలసినదెల్ల గ్రంథాలయమునందు లభ్యమగుచున్నదా? 'బుఫెలో'యందుండు సర్వజనుల చేతను ఈ గ్రంథాలయము పోషింపబడుచున్నది. సాధ్యమైనంతమంది జనులకు విశేషముగనుపకారము జేయవలెనని దీని కోరికయైయున్నది. దీని యుపయోగమును ఇంకను వృద్ధి జేయుటకు తగు సలహాల నియ్యవలయునని ప్రజలు కోరబడుచున్నారు. మీకు గావలసిన ఏ పుస్తకములు గ్రంథాలయమునఁదు లేవు?
ఇంకను గ్రంథాలయము ఏరీతిని మీకు సహకారి కాగలదు?"
దీనినిబట్టి జూచిన ఆదేశమున ఒక పట్టణమునందుండు జనుల వాంఛితాధములను బట్టి అచటి గ్రంథాలయము పనిజేయుచుండునని దేలుచున్నది. ఆహా! అట్లు పనిజేయు గ్రంథాలయముగల పట్టణమే స్వర్గ తుల్యము గదా!
గతవత్సరమున గోదావరి జిల్లాయందొక గ్రామమునందున్న గ్రంథ భాండాగారమును దర్శింపవల
యునని బోతిమి, ఆభాండాగారము ప్రధమమున పదునైదుగురు పౌరులచే స్థాపింపబడినది. కాని ఇపుడు దానియందు ఇతర పౌరులును జేరి చందాల నిచ్చుచున్నారు. ఐనప్పటికిని ప్రధమమున స్థాపించిన పదునైదుగురే ఆభాండాగారము యొక్క పరిపాలనను తమ వశమునందుంచుకొన వాంఛించుచున్నారని వింటిమి. ఈ సంగతి నిజయేయైనచో మన దేశమునకును అమెరికా దేశమునకును—అంతవరకును బోనేల, బరోడా రాష్ట్రమునకును తారతమ్య మెంతగలదో చదువరులకే గోచరించును. ఆరాష్ట్రమునందు మూడు వందల నేబదికంటే నెక్కువ సార్వజనిక గ్రంథాలయములు గలవు. వీటియందు గోన్ని శ్రీశాయాజీ గాయక్వార్ మహారాజు గారిచే స్థాపింపబడినవి. మరికొన్నిటిని మహారాజు గారి సహాయముచే ప్రజలు స్థాపించిరి. ఐనప్పటికిని వీటియొక్క పరిపాలన యంతయు జనులకే విడచి పెట్టబడినది.