గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005
{{left|Registered No. 1)-221
[Prico Rs. 8.00పైస మూల్యము : రూ. 6.00 పలు.
EXTRAORDINARY
అసాధారణ
Part XVI Section
భాగము XVI అనుభాగము 1
PUBLISHED BY AUTHORITY
ప్రాధికారము ద్వారా ప్రచురింపబడినది
New Delhi Monday 11 అక్టోబర్, Badrapad Vol. 17
సంఖ్య 1 న్యూఢిల్లీ సోమవారము 11 October, భాద్రపద సంపుట17
MINISTRY OF LAW AND JUSTICE
(LEGISLATIVE DEPARTMENT)
New Delhi, 7th June, 2010/Chaitra, 1932 Vikruthi.
The Translation in Telugu of the following Acts namely:-
(1) The Anti-Apartheid (United Nations Convention) Act, 1981 (Act No. 48 of 1981) (2) The Anti-Hijacking Act, 1982 (Act No. 65 of 1982) (3) The Protection of Human Rights Act, 1993 (Act No. 10 of 1994) (4) The Coastal Aquaculture Authority Act, 2005 (Act No. 24 of 2005) (5) The Protection of Women from Domestic Violence Act, 2005 (Act No. 43 of 2005) and (6) The Scheduled Tribes and Other Traditional Forest Dwellers (Recognition of Forest Rights) Act, 2006 [Act No. 2 of 2007) are hereby published under the authority of the President and shall be deemed to be the Authoritative Texts thereof in Telugu under Clause (a) of Section 2 of the
Authoritative Texts (Central Laws) Act, 1973 (Act 50 of 1973). శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ
(శాసన నిర్మాణ విభాగము)
ఈ క్రింది చట్టములు, అనగా,
(1) వర్ణ వివక్ష వ్యతిరేక (ఐక్య రాజ్యసమితి ఒడంబడిక) చట్టము, 1981(1981లోని 48వ చట్టము) (2) విమాన అపహరణ వ్యతిరేక చట్టము, 1982 (1982లోని 65వ చట్టము) (3) మానవ హక్కుల రక్షణ చట్టము, 1993 (1994లోని 10వ చట్టము) (4) సముద్ర తీర నీటి ప్రాణుల పెంపకపు ప్రాధికార చట్టము, 2005 (2005లోని 24వ చట్టము) (5) గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005 (2005లోని 43వ చట్టము) మరియు (6) అనుసూచిత జనజాతుల మరియు ఇతర పరంపరానుగత అటవీ నివాసితుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టము, 2006 (2007లోని 2వ చట్టము)ల యొక్క తెలుగు అనువాదములను రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందుమూలముగా ప్రచురించడమైనది. చట్టములకు గల ఈ అనువాదములను ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము 1973 (1973లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఏ) క్రింద, ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005
(2005లోని 43వ చట్టము)
[సెప్టెంబరు 13, 2005]
కుటుంబములో సంభవించిన ఏ రకపు హింసకైనను గురయిన బాధితులకు భారత సంవిధానము క్రింద హామీ ఈయబడిన మహిళల హక్కులను అత్యంత కట్టుదిట్టంగా రక్షించుటకు మరియు వాటికి సంబంధించిన లేక అనుషంగికమైన విషయములను నిబంధించుటకైన చట్టము.
భారత గణరాజ్యపు యాభై ఆరవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది:-
అధ్యాయము -I
ప్రారంభిక
1. (1) ఈ చట్టమును గృహ హింస నుండి మహిళలను రక్షించు చట్టము, 2005 అని పేర్కొనవచ్చును.
(2)ఇది జమ్మూ కాశ్మీరు రాజ్యము మినహా యావద్భారత దేశమునకు విస్తరించును.
(3) ఇది కేంద్ర ప్రభుత్వము అధికారిక రాజపత్రములో ఆధి సూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును.
2. ఈ చట్టములో, సందర్భమును బట్టి అర్థము వేరువిధముగా కోరిననే తప్ప,--
(ఎ) "వ్యధిత వ్యక్తి" అనగా ప్రతివాది గృహ సంబంధ బంధుత్వము కలిగినదై లేదా కలిగివుండినదై, అట్టి ప్రతివాది తనను గృహ హింసకు గురిచేసినాడని ఆరోపించు చున్నట్టి ఎవరేని మహిళ అని అర్థము;
(బి) “బిడ్డ” అనగా పదునెనిమిది సంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలిగిన ఎవరేని వ్యక్తి అని అర్థము మరియు ఇందులో దత్తత పొందిన బిడ్డ, సవతి బిడ్డ లేక పెంపుడు బిడ్డ చేరియుందురు;
(సి) “నష్ట పరిహార ఉత్తర్వు” అనగా 22వ పరిచ్ఛేదము యొక్క నిబంధనల ననుసరించి జారీ చేయబడిన ఉత్తరువు అని అర్థము;
(డి) "అభిరక్ష ఉత్తరువు" అనగా 21వ పరిచ్ఛేదపు నిబంధనలననుసరించి మంజూరు చేయబడిన ఉత్తరువు అని అర్థము; (ఇ) “గృహ సంఘటనా నివేదిక' అనగా వ్యధితవ్యక్తి నుండి గృహ హింసకు సంబంధించి అందిన ఫిర్యాదుపై, విహితపరచబడిన ప్రరూపములో తయారు చేయబడిన నివేదిక అని అర్థము;
(ఎఫ్) “గృహ సంబంధ బంధుత్వము” అనగా ఏదో ఒక సమయంలో ఒకే కుటుంబంలో కలసి జీవించిన లేక జీవిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్యగల బంధుత్వము అని అర్థము, ఆ బంధుత్వము రక్తసంబంధమైనది కావచ్చు, వైవాహికమైనది కావచ్చు లేక వైవాహిక సంబంధమును పోలినదైనను కావచ్చు, దత్తత వలన ఏర్పడినది లేక ఉమ్మడి కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నది అయిన బంధుత్వము కావచ్చును;
(జి) “గృహ హింస" అను పదమునకు 3వ పరిచ్చేదములో ఒసగబడిన అర్థమునే కలిగియుండును;
1961 లోని 28 చట్టము (హెచ్) "వరకట్నము" అనే పదము వరకట్న నిషేధ చట్టము, 1961 యొక్క 2వ పరిచ్ఛేదములో ఈయబడిన అర్థమే ఉండును;
1974 లోని 2 వ చట్టము (ఐ). "మేజిస్ట్రేటు” అనగా వ్యధితురాలైన స్త్రీ తాత్కాలికముగా లేక ఇతరవిధంగా నివసించు ప్రదేశములో లేక ప్రతివాది నివసించు ప్రదేశములో లేదా గృహహింస జరిగిన ప్రదేశములో అమల్లోవున్న క్రిమినలు ప్రకియా స్మృతి, 1973 క్రింద అధికారితా పరిధిని వినియోగించుచున్న మొదటి తరగతి న్యాయిక మేజిస్ట్రేటు లేక సందర్భానుసారము మహానగర మేజిస్ట్రేటు అని అర్థము;
(జె) "వైద్య సదుపాయం” అనగా ఈ చట్ట ప్రయోజనములకై రాజ్య ప్రభుత్వముచే అధి సూచింపబడినట్టి వైద్య సదుపాయము అని అర్థము;
(కె) "ఆర్థిక సహాయము" అనగా ఈ చట్టము క్రింద నష్టపరిహారము కోరుచు అభ్యర్థించిన వ్యధిత వ్యక్తి దరఖాస్తు పై ఆకర్ణనము జరుగు ఏదేని సమయములోగాని, లేదా గృహ హింసకు గురైన వ్యధిత వ్యక్తి ఖర్చు చేసిన మరియు నష్టపోయిన ఇతర ఖర్చుల నిమిత్తముగాని మేజిస్ట్రేటు ప్రతివాదికి ఉత్తరువు జారీచేయుట ద్వారా చెల్లించమని ఆదేశించు నష్టపరిహారము అని అర్థము;
(ఎల్) "అధిసూచన" అనగా అధికారిక రాజపత్రములో ప్రచురించబడిన అధి సూచన అని అర్థము, మరియు అధి సూచింపబడిన అను పదబంధమును తదనుసారముగ అన్వయించుకొనవలెను;
(ఎమ్) “విహితపరచిన" అనగా ఈ చట్టము క్రింద చేయబడిన నియమములచే విహితపరచబడు అని అర్థము; (ఎస్) “రక్షణ అధికారి" అనగా 8వ పరిచ్ఛేదములోని ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వముచే నియమించబడిన అధికారి అని అర్థము;
(ఒ) “రక్షణ ఉత్తరువు" అనగా 18వ పరిచ్ఛేదములోని నిబంధనలననుసరించి చేయబడిన ఉత్తరువు అని అర్థము;
(పి) “నివాస ఉత్తరువు" అనగా 19వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లోని నిబంధనలననుసరించి జారీ చేయబడిన ఉత్తరువు అని అర్థము;
(క్యూ) “ప్రతివాది" అనగా వ్యధిత వ్యక్తితో గృహ సంబంధమైన బంధుత్వమును కలిగియుండిన లేక కలిగియున్న మరియు ఈ చట్టము క్రింద ఎవరి నుండి వ్యధితవ్యక్తి పరిహారమును కోరుచున్నచో అట్టి ఎవరేని వయోజనుడైన పురుషుడు అని అర్థము;
అయితే, వ్యధితురాలైన భార్య లేక వైవాహిక సంబంధమైన బంధుత్వము కలిగి కలిసి జీవించుచున్న స్త్రీ కూడ భర్త యొక్క బంధువుపైన లేక పురుష భాగస్వామిపై ఫిర్యాదును చేయవచ్చును.
(ఆర్) “సేవలు సమకూర్చువారు” అనగా 10వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రిజిస్టరైన సంస్థ అని అర్థము;
(ఎస్) "ఉమ్మడి ఇల్లు" అనగా వ్యధిత వ్యక్తి ప్రతివాదితో కలిసి నివసించిన లేదా నివసిస్తున్న గృహము లేదా ఒంటరిగా నివసించిన గృహము అని అర్థము. ఆ గృహము వారిద్దరికి సంబంధించిన స్వంత గృహము లేదా అద్దె గృహము లేదా వ్యధిత వ్యక్తి స్వంత గృహము లేదా అద్దె గృహము లేదా ప్రతివాది స్వంత గృహము లేదా అద్దె గృహము లేదా ప్రతివాది ఒక సభ్యునిగా ఉన్న ఉమ్మడి కుటుంబమునకు చెందినదై ఉండవచ్చును. వ్యధిత వ్యక్తి లేక ప్రతివాదికి ఆ గృహములో ఏదేని అధికారము, హక్కు లేక హితము ఉన్నదా లేదా అను దానితో సంబంధము లేదు;
(టి) "ఆశ్రయ గృహము" అనగా ఈ చట్టము యొక్క ప్రయోజనముల నిమిత్తము రాజ్య ప్రభుత్వము చే ఆశ్రయ గృహముగా అధిసూచించబడిన ఆశ్రయ గృహము అని అర్థము;
అధ్యాయము -2
గృహహింస
గృహ హింస నిర్వచనము.
3. ఈ చట్ట ప్రయోజనముల నిమిత్తము ప్రతివాది. చేసిన ఏదేని కార్యము, కార్య లోపము లేదా కార్య నిర్వర్తన లేదా ప్రవర్తన వంటివి ఈ క్రింది పరిస్థితులలో గృహహింసగా పరిగణించబడుతాయి.- (ఎ) వ్యధితవ్యక్తి ఆరోగ్యానికి, భద్రతకు, జీవితానికి, అవయవములకు లేక క్షేమమునకు శారీరకంగా లేక మానసికంగా హాని లేక గాయములు లేక అపాయమును కలిగించు లేక అట్లు చేయుటకు ప్రయత్నించుట. ఇందులో శారీరక, లైంగిక దురుపయోగము, మౌఖిక మరియు ఉద్రేకపూర్వకమైన దురుపయోగము మరియు ఆర్థికపరమైన దురుపయోగములు కూడ చేరియుండును; లేదా
(బి) ఏదేని వరకట్నము లేక ఇరర ఆస్తి లేక విలువైన సెక్యూరిటీ కొరకు వ్యధిత వ్యక్తిని లేదా ఆమెకు సంబంధించిన ఎవరేని ఇతర వ్యక్తిని శాసన విరుద్ధముగా వేధించుట, హానికలిగించుట, గాయపరచుట లేక అపాయమును కలుగజేయుట; లేదా
(సి) ఖండము (ఎ) లేక ఖండము (బి)లో తెలుపబడిన ఏదేని చర్యతో వ్యధిత వ్యక్తిని లేక ఆమెకు సంబంధించిన ఎవరేని వ్యక్తిని బెదిరించుట; లేదా
(డి) వ్యధితవ్యక్తిని ఇతర విధముగా మానసికంగా లేక శారీరకంగా గాయపరచుట లేక హాని తల పెట్టుట;
విశదీకరణ-I :- ఈ పరిచ్ఛేదము యొక్క ప్రయోజనముల నిమిత్తం, -
(i) “శారీరక దురుపయోగము” అనగా వ్యధిత వ్యక్తిని శారీరక బాధకి, జీవితమునకు లేక అవయవములకు అపాయమును, ఆరోగ్యమునకు ప్రమాదమును తల పెట్టుట లేక ఆరోగ్యమును చెడగొట్టుట, శారీరక అభివృద్ధిని నిరోధించుట మరియు అట్టి స్వభావముగల ఏదేని చర్య మరియు ప్రవర్తన కలిగియుండుట అని అర్థము, దీనిలో దౌర్జన్యం, నేరపుర్వక జడిపింపు మరియు బలప్రయోగములు కూడి చేరియుండును;
(ii) "లైంగిక దురుపయోగము"లో స్త్రీ యొక్క గౌరవమునకు భంగము కలిగించు రీతిలో దురుపయోగపర్చు, అవమానించు, చిన్నబుచ్చు, కించపరచు లేక తగ్గించుట వంటి ఏదేని లైంగిక స్వభావముతో కూడిన చర్య చేరియుండును;
(iii) “మౌఖిక మరియు ఉద్రేకపూర్వక దురుపయోగము”లో, ---
(ఎ)అవమానపరచుట, ఎగతాళి చేయుట, చిన్నబుచ్చుట, పేరుతో పిలుచుట మరియు అవమానించుట లేక ప్రత్యేకముగా పిల్లలు లేరని లేక మగపిల్లలు లేరని ఎగతాళి చేయుట; మరియు
(బి) వ్యధితవ్యక్తి అభిమానించే ఎవరేని వ్యక్తిని మరల మరల భయపెట్టుచు శారీరక బాధకు గురిచేయుట చేరియుండును.
(iv) "ఆర్థికపరమైన దురుపయోగము”లో ఈ క్రిందివి చేరియుండును, (ఎ)ఏదేని శాసనము లేదా ఆచారము క్రింద వ్యధిత వ్యక్తికి హక్కు కలిగిన ఏదేని ఆర్థిక లేక ఆర్థిక వనరులను అన్నింటిని లేక కొన్నింటిని గాని ఆమెకు అందకుండా చేయుట, న్యాయస్థానపు ఉత్తరువుల ద్వారా లేక వేరేవిధంగా గాని ఆమెకు చెల్లించవలసిన వాటిని నిలిపి వేయుట, వ్యధితవ్యక్తికి సంబంధించిన ఏదేని స్త్రీధనం లేక ఆమె కలిగియున్న ఉమ్మడి లేక విడి ఆస్తి, ఉమ్మడి ఇల్లు నుండి రావలసిన అద్దె, మరియు మనోవర్తి ద్వారా ఆమెకు సంక్రమించవలసిన వాటిని సంక్రమించకుండా నిరోధించుట, వ్యధితవ్యక్తికి మరియు ఆమె పిల్లలకు నిత్యావసరములేగాక ఇతర అవసరాల నిమిత్తం ఆమెకు అవసరమైన వాటిని అందకుండా చేయుట;
(బి) వ్యధితవ్యక్తికి తనకుగల గృహ సంబంధమైన బంధుత్వము వలన ఉపయోగించుకొను హక్కుకలిగిన చర లేక స్థిరాస్తులు, విలువగల వస్తువులు, షేర్లు, సెక్యూరిటీలు, బాండ్లు మొదలైన వాటిని లేక వ్యధితవ్యక్తికి లేక ఆమె పిల్లలకు లేక ఆమెకు గల స్త్రీదన పూర్వక ఆస్తితో సమిష్టిగా గాని లేక విడిగాగాని హక్కు కలిగియున్న ఇతర ఆస్తులతో సహా విక్రయించుట లేక అన్యాక్రాంతము చేయుట; మరియు
(సి) వ్యధితవ్యక్తి గృహ సంబంధమైన బంధుత్వము వలన ఉమ్మడి ఇల్లులోనికి ప్రవేశించు హక్కుతో సహా ఉపయోగించుటకు లేక అనుభవించవలసిన వనరులు లేక సౌకర్యములను ఆమెకు లేకుండా చేయుట లేక నిరోధించుట.
విశదీకరణ-II :- ప్రతివాది యొక్క ఏదేని చర్య, కార్యలోపము, కార్యము లేదా ప్రవర్తన “గృహ హింస"గా పేర్కొనుటకు లేక నిర్ధారించుటకు ఈ చట్టము క్రింద సందర్భాన్ని బట్టి కేసుకు సంబంధించిన మొత్తం పూర్వపరాలన్నింటిని పర్యాలోచించవలెను.
అధ్యాయము-3
రక్షణ అధికారుల, సేవలు సమకూర్చువారి అధికారములు
మరియు కర్తవ్యములు మొదలగునవి
రక్షణ అధికారికి సమాచారము అందించుట మరియు సమాచారము అందజేసిన వ్యక్తి దాయిత్వము నుండి తప్పించుట.
4. (1) గృహహింస జరిగినదనిగాని లేక జరుగుతున్నదని లేక జరుగవచ్చునని ఒక వ్యక్తి విశ్వసించుటకు కారణమున్నచో అతడు దానిని గురించి సంబంధిత రక్షణ అధికారికి తెలియజేయవచ్చును.
(2) ఉప-పరిచ్ఛేదము (1)లోని ప్రయోజనము నిమిత్తము సద్భావనతో సమాచారమునిచ్చిన వ్యక్తి పై ఎట్టి సివిల్ మరియు క్రిమినల్ దాయిత్వము ఉండదు. పోలీసు అధికారులు సేవలు సమకూర్చు వారు మరియు మేజస్ట్రేటుల కర్తవ్యములు. ' 5.గృహ హింసను గురించి ఫిర్యాదును అందుకొనిన లేక ఇతర విధముగా గృహ హింస జరిగిన ప్రదేశమునకు హాజరయిన లేదా గృహ హింస సంఘటన గురించిన సమాచారము అతనికి అందిన ఎవరేని పోలీసు అధికారి, రక్షణ అధికారి సేవలు సమకూర్చు వారు లేక మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తికి ఈ క్రింది విషయాలను, ---
(ఎ) ఈ చట్టము క్రింద రక్షణ ఉత్తరువు, ఆర్థిక సహాయ ఉత్తర్వు, అభిరక్షణ ఉత్తర్వు, నివాస ఉత్తర్వు, నష్ట పరిహార ఉత్తర్వు లేదా ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఉత్తర్వుల ద్వారా పరిహారము పొందు నిమిత్తము దరఖాస్తు చేసుకొను హక్కు ఆమెకు కలదని;
(బి) సేవలు సమకూర్చు వారి సేవలను పొందుటకు అవకాశమున్నదని;
(సి) రక్షణ అధికారుల సేవలను పొందుటకు అవకాశమున్నదని;
1987లోని 39వచట్టము.
(డి) న్యాయ సేవల ప్రాధికారములు చట్టము, 1987 క్రింద ఉచిత న్యాయమును పొందుటకు హక్కు ఉన్నదని;
1960 లోని 45 వ చట్టము.
(ఇ) సందర్భమును బట్టి భారతీయ శిక్షాస్మృతిలోని 498-ఎ పరిచ్ఛేదము క్రింద ఫిర్యాదును దాఖలు చేసే హక్కు ఆమెకు ఉన్నదన్న విషయాన్ని: తెలియజేయవలెను.
అయితే, సంజేయమైన అపరాధము జరిగినదను సమాచారము అందుకొన్న పోలీసు అధికారిని చట్ట ప్రకారము చర్య తీసుకొనవలసిన బాధ్యత నుండి ఏ విధముగానైనను అతనిని విముక్తుని చేయునదిగా అన్వయించుకోరాదు.
6. వ్యధితవ్యక్తి లేక ఆమె తరఫున రక్షణ అధికారి లేదా సేవలు సమకూర్చువారు ఆమెకు ఆశ్రయము కల్పించవలసినదిగా ఆశ్రయ గృహము యొక్క ఇన్ ఛార్జి అధికారిని కోరినచో ఆశ్రయ గృహము యొక్క అట్టి ఇన్ ఛార్జి అధికారి ఆశ్రయ గృహములో వ్యధిత వ్యక్తికి ఆశ్రయమును ఏర్పాటు చేయవలెను.
ఆశ్రమ గృహముల కర్తవ్యము.
7. వ్యధితవ్యక్తి లేక ఆమె తరఫున రక్షణ అధికారి లేదా సేవలు సమకూర్చువారు ఆమెకు వైద్యపరమైన సహాయమును ఏర్పాటు చేయవలసినదిగా వైద్య సదుపాయముల ఇన్ ఛార్జి అధికారిని కోరినప్పుడు అట్టి ఇన్ ఛార్జి అధికారి ఆమెకు వైద్యపరమైన సహాయమును ఏర్పాటు చేయవలెను.
రక్షణ అధికారుల నియామకము.
8.(1) రాజ్య ప్రభుత్వము అధిసూచన ద్వారా ప్రతి జిల్లాలోను తాను అవసరమని భావించనంత మంది రక్షణ అధికారులను నియమించవలెను; మరియు ఈ చట్టముచే లేక దాని క్రింద వారు వినియోగించదగిన అధికారములను మరియు నిర్వర్తించవలసిన కర్తవ్య ముల యొక్క ప్రాంతము లేక ప్రాంతములను కూడ అధిసూచించవలెను. (2) రక్షణ అధికారులు సాధ్యమైనంత వరకు మహిళలై ఉండవలెను మరియు విహితపరచబడిన అట్టి విద్యార్హతలు మరియు అనుభవము కలిగియుండవలెను.
(3) రక్షణ అధికారుల మరియు అతని యొక్క ఇతర సబార్డినేటు అధికారుల సేవా నిబంధనలు మరియు షరతులు విహితపరచబడినట్టివై ఉండవలెను.
రక్షణ అధికారుల విధులు మరియు కర్తవ్యములు.
9.(1) రక్షణ అధికారి ఈ క్రింది కర్తవ్యములను నిర్వర్తించవలెను.--
(ఎ) ఈ చట్టము క్రింద మేజిస్ట్రేటుకు అతని విధులను నిర్వర్తించుటలో సహాయము చేయవలెను.
(బి) గృహహింసకు సంబంధించిన ఫిర్యాదు అందినపుడు విహితపరచబడిన రీతిలో మరియు అట్టి ప్రరూపములో గృహ సంఘటన నివేదికను మేజి స్ట్రేటుకు మరియు ఎవరి అధికారితా పరిధిలోని స్థానిక హద్దుల లోపల ఆ సంఘటన జరిగినదని ఆరోపించబడినదో ఆ ప్రాంతములోని పోలీసు స్టేషను ఇన్ ఛార్జి పోలీసు అధికారికి మరియు సేవలు సమకూర్చు వారికి ఆ ఫిర్యాదు ప్రతులను పంపవలెను;
(సి) సహాయము కొరకు రక్షణ ఉత్తర్వు జారీ చేయుటకై వ్యధితవ్యక్తి కోరినపుడు విహితపరచబడిన అట్టి రీతిలో మరియు అట్టి ప్రరూపములో మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేయవలెను;
1967 చట్టములోని 39 వ చట్టము.
(డి) న్యాయ సేవల ప్రాధికారముల చట్టము, 1987 క్రింద వ్యధిత వ్యక్తికి న్యాయ సహాయము అందించుట కొరకు ఫిర్యాదు చేయుటకు విహితపరచబడిన ప్రరూపమును ఉచితముగా అందించునట్లు చూడవలెను;
(ఇ) మేజిస్ట్రేటు యొక్క అధికారితా పరిధిలోనున్న స్థానిక ప్రాంతములోని న్యాయ సహాయమును లేక సలహాలను అందించు సేవలు సమకూర్చు వారుల, ఆశ్రయ గృహముల మరియు వైద్య సదుపాయముల, వివరముల జాబితాను నిర్వహించవలెను;
(ఎఫ్) సురక్షితమైన 'ఆశ్రయ గృహము ఏర్పాటు చేసి వ్యధిత వ్యక్తి కోరికపై వ్యధితుని అట్లు ఆశ్రయ గృహములో ఉంచిన నివేదికను ఆశ్రయ గృహము ఉన్న ప్రాంతము యొక్క అధికారితా పరిధిలోని మేజిస్ట్రేటుకు మరియు పోలీసు స్టేషనుకు పంపవలెను;
(జి) వ్యధిత వ్యక్తి ఒంటి పై గాయములున్నచో ఆమెకు వైద్య పరీక్షలు చేయించి, వైద్య పరీక్ష నివేదికను గృహ హింస జరిగిన ప్రదేశము యొక్క అధికారితా పరిధి కలిగిన మేజిస్ట్రేటుకు మరియు పోలీసు స్టేషనుకు పంపవలెను; 1974లోని2వ చట్టము.
(హెచ్) 20వ పరిచ్ఛేదము క్రింద ధన పరిహారము కొరకైన ఉత్తరువును క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 క్రింద విహితపరచబడిన ప్రక్రియను అనుసరించి రూపొందించబడి అమలుపరచబడునట్లు చూడవలెను;
(ఐ) విహితపరచబడినట్టి ఇతర కర్తవ్యములను నిర్వర్తించవలెను;
(2) రక్షణ అధికారి మేజిస్ట్రేటు నియంత్రణ మరియు పర్యవేక్షణ క్రింద పనిచేయవలెను మరియు ఈ చట్టముచే - లేక దాని క్రింద లేక మేజిస్ట్రేటు మరియు ప్రభుత్వముచే అతని పై ఉంచబడిన కర్తవ్యములను నిర్వర్తించవలెను.
సేవలు సమకూర్చు వారు. 1860లోని 21వ చట్టము 1956లోని 1వ చట్టము
10.(1) ఈ విషయములో చేసినట్టి నియమములకులోబడి న్యాయ వైద్యపరమైన, ఆర్థికపరమైన లేక ఇతర విధమైన సహాయములతో సహా మహిళల యొక్క హక్కులను మరియు హితములను ఏదేని శాసనపుర్వకమైన రీతిలో కాపాడవలెననే ఉద్దేశ్యముతో సంగముల రిజిస్ట్రీకరణ చట్టము, 1860- క్రింద రిజిస్టరైన స్వచ్ఛంద అసోసియేషన్ లేక కంపెనీల చట్టము, 1956 లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద గాని రిజిస్టరైన ఏ కంపెనీ ఈ చట్టము యొక్క ప్రయోజనముల నిమిత్తము సేవలు సమకూర్చువారు గా రాజ్య ప్రభుత్వము వద్ద రిజిస్టరు చేసుకొనవలెను.
(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రిజిస్టరైన సేవలు సమకూర్చువారు ఈ క్రింది అధికారమును కలిగియుండును,--
(ఎ) వ్యధిత వ్యక్తి కోరికపై గృహహింస సంఘటనను విహితపరచబడిన ప్రరూపములో నమోదు చేసిన నివేదిక ప్రతిని గృహ హింస జరిగిన స్థలము పై అధికారితా పరిధి కలిగిన మేజిస్ట్రేటుకు మరియు రక్షణ అధికారికి పంపవలెను;
(బి) వ్యధితవ్యక్తికి వైద్య పరీక్షలు జరిపించవలెను మరియు ఆ వైద్య పరీక్ష నివేదిక ప్రతిని గృహహింస జరిగిన స్థానిక ప్రాంతములోని పోలీసు స్టేషనుకు మరియు రక్షణ అధికారికి పంపవలెను;
(సి) వ్యధిత వ్యక్తి కోరికపై ఆమెను ఆశ్రయ గృహములో ఉంచి ఆశ్రయమును కల్పించునట్లు చూడవలెను మరియు వ్యధితవ్యక్తిని అట్లు ఆశ్రయ గృహములో ఉంచిన నివేదికను గృహహింస జరిగిన స్థానిక ప్రాంతములోని పోలీసు స్టేషనుకు పంపవలెను.
(3) గృహ హింసలు జరుగుటను నిరోధించుటలో ఈ చట్టము క్రింద అధికారములను వినియోగించుటకు లేక కృత్యములను నిర్వర్తించుటకు ఉద్దేశించిన దేనికొరకుగాని, ఈ చట్టము క్రింద నిబంధనలననుసరించి సద్భావముతో చేసిన లేక చేయుటకు ఉద్దేశించిన ఏదేని చర్యను తీసుకున్న లేక తీసుకున్నట్లు కనిపించు ఏదేని సేవలు సమకూర్చువారు లేక సేవలు సమకూర్చువారి యొక్క ఎవరేని సభ్యుడిపై ఎట్టి దావా, అభియోగము లేక ఇతర శాసనిక చర్యలు ఉండవు. ప్రభుత్వము యొక్క కర్తవ్యములు.
11. కేంద్ర ప్రభుత్వము మరియు ప్రతి రాజ్య ప్రభుత్వము ఈ క్రింది వాటికి సంబంధించి చర్యలన్నింటిని తీసుకొనునట్లు చూడవలెను, --
(ఎ) ఈ చట్ట నిబంధనలకు నియత అంతరావధులలో రేడియో, టెలివిజన్ మరియు ముద్రణ వంటి మాధ్యమాలతో సహా ప్రజా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారము ఇవ్యవలెను;
(బి) న్యాయక సర్వీసుల సభ్యులు మరియు పోలీసు అధికారులతో సహా కేంద్ర ప్రభుత్వ మరియు రాజ్య ప్రభుత్వ అధికారులకు ఈ చట్టములో పేర్కొనబడిన విషయములను తెలుసుకొని అవగాహన చేసుకొనుటకు నియతకాలిక శిక్షణ ఇవ్వవలెను;
(సి) గృహ హింసకు సంబంధించిన విషయములను మాట్లాడుటకు మానవ వనరులు, ఆరోగ్యం, శాంతిభద్రతలతో సహా ఆంతరంగిక వ్యవహారములు మరియు న్యాయ వ్యవహారాలతో వ్యవహరించుచున్న విభాగాలు మరియు మంత్రిత్వ శాఖలచే అందించబడు సేవల మధ్య కట్టుదిట్టమైన సమన్వయం ఉండు విధంగాను మరియు ఆయా అంశాల పై నియతకాలిక పునర్విలోకనములను నిర్వహించవలెను;
(డి) న్యాయస్థానములతో సహా ఈ చట్టము క్రింద మహిళలకు సేవలను అందించడానికి సంబంధించిన మంత్రిత్వశాఖల కొరకు ప్రాధాన్యత విషయాల జాబితా (ప్రొటోకాల్స్) తయారు చేసి, ఒకచోట ఉంచవలెను.
అధ్యాయము - 4
పరిహారపు ఉత్తరవులను పొందుటకైన ప్రక్రియ
మేజి స్ట్రేటుకు దరఖాస్తు.
12.(1) వ్యధిత వ్యక్తి లేదా వ్యధిత వ్యక్తి తరఫున రక్షణ అధికారి లేదా ఎవరేని ఇతర వ్యక్తి, ఈ చట్టము క్రింద లభించుచున్న ఒకటి లేక అంతకంటే ఎక్కువ పరిహారములను కోరుచూ, మేజిస్ట్రేటుకు దరఖాస్తు సమర్పించవచ్చును:
అయితే, మేజిస్ట్రేటు అట్టి దరఖాస్తు పై ఏ ఉత్తరువునైనను ఇచ్చుటకు ముందు రక్షణ అధికారి లేక సేవలు సమకూర్చువారి నుండి సదరు గృహ సంఘటన నివేదికను పర్యాలోచించ వలెను.
(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద కోరబడిన పరిహారంలో, ప్రతివాది వ్యధిత వ్యక్తిపై జరిపిన గృహ హంసపరమైన పనుల వలన, వ్యధితవ్యక్తికి కలిగిన గాయములకు గాను నష్టము లేదా చెరుపు కొరకు దావా వేయుటకు అట్టి వ్యధిత వ్యక్తికి గల హక్కుకు భంగము కలుగకుండా నష్ట పరిహారము లేదా చెరుపు చెల్లింపు ఉత్తరువు జారీచేయడానికి గల పరిహారం కూడ చేరవచ్చును. 1908లోని 5వ చట్టము.
అయితే వ్యధిత వ్యక్తికి అనుకూలంగా ఏదేని న్యాయస్థానము నష్టపరిహారము లేక చెరుపు క్రింద ఏదైనా మొత్తమునకు డిగ్రీని ఇచ్చినపుడు ఈ చట్టము క్రింద మేజిస్ట్రేటుచే చేయబడిన ఉత్తర్వును అనుసరించి చెల్లించిన లేక చెల్లించవలసిన మొత్తము ఏదైనా ఉన్నచో, దానిని అట్టి డిక్రీ క్రింద చెల్లించవలసిన మొత్తములో సర్దుబాటు చేయవలెను మరియు సదరు డిక్రీ సివిల్ ప్రక్రియా స్మృతి, 1908లో లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమున్నప్పటికినీ సర్దుబాటు తరువాత ఏదైనా మిగిలివున్నచో మిగిలిఉన్న ఆ మొత్తం పై అమలుజరుపదగినదై ఉండవలెను.
(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ప్రతి దరఖాస్తు విహితపరచబడినట్టి వివరములను కలిగియుండవలెను మరియు అట్టి ప్రరూపములో లేక సాధ్యమయినంత వరకు దానికి దరిదాపుగా ఉండవలెను.
(4) న్యాయస్థానమునకు దరఖాస్తు అందిన తేదీ నుండి సాధారణముగా మూడు దినములకు మించని కాలావధిలో మేజిస్ట్రేటు మొదటి ఆకర్జన తేదీని నిర్ధారించవలెను.
(5) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద చేయబడిన ప్రతి దరఖాస్తును మొదటి ఆకర్ణన తేదీ నుండి అరువది దినముల లోపుగా పరిష్కారమగునట్లు మేజిస్ట్రేటు ప్రయత్నము చేయవలెను.
నోటీసును తామీలు చేయుట.
13.(1) 12వ పరిచ్ఛేదము క్రింద నిర్ధారించబడిన ఆకర్ణన తేదీ యొక్క నోటీసుకు మేజిస్ట్రేటు రక్షణ అధికారికి ఇవ్వవలెను, రక్షణ అధికారి మేజిస్ట్రేటు నుండి నోటీసు అందిన తేదీ నుండి గరిష్టముగా రెండు దినముల లోపుగా లేక మేజిస్ట్రేటుచే అనుమతించబడినట్టి సబబైన గడువులోపు ప్రతివాదికి లేక మేజిస్ట్రేటుచే ఆదేశించబడిన ఎవరేని ఇతర వ్యక్తికి విహితపరచబడునట్టి పద్ధతుల ద్వారా తామీలు చేయవలెను.
(2) రక్షణ అధికారి విహితపరచబడినట్టి ప్రరూపంలో నోటీసును ప్రతివాదికి లేదా మేజిస్ట్రేటు ఆదేశించినట్టి ఎవరేని ఇతర వ్యక్తికి తామీలు చేసినారని చేసిన అధిప్రఖ్యానము ఇందుకు విరుద్ధముగా నిరూపించబడిననే తప్ప అట్టి నోటీసు తామీలు చేయబడినదనుటకు సాక్ష్యముగా ఉండవలెను.
కౌన్సిలింగ్
14.(1) ఈ చట్టము క్రింద ప్రొసీడింగులలోని ఏదేని దశలో ప్రతివాదిని లేక వ్యధిత వ్యక్తిని, ఒకరిగా లేక సంయుక్తంగా విహితపరచబడినట్లుగా అర్హతలు మరియు అనుభవము గలిగిన సేవలు సమకూర్చువారి యొక్క ఎవరేని సభ్యుని వద్దకు సలహాలు పొందుటకు వెళ్లమని మేజి స్ట్రేటు ఆదేశించవచ్చును. (2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద మేజిస్ట్రేటు ఏదేని ఆదేశమును జారీచేసిన యెడల, రెండు నెలల కాలావధికి మించకుండా కేసుయొక్క తదుపరి ఆకర్ణన తేదీని నిర్ధారించవలెను.
సంక్షేమ నిపుణుల సహాయమును కోరుట.
15. ఈ చట్టము క్రింద ఏదేని ప్రొసీడింగులో మేజిస్ట్రేటు సబబని భావించిన, కుటుంబ సంక్షేమ విషయములలో నిమగ్నమైన వ్యక్తితోసహా వ్యధిత వ్యక్తికి సంబంధించిన వారైనను కొకున్నను మహిళకు ప్రాధాన్యమునిచ్చుచూ మేజిస్ట్రేటు తన కృత్యములను నిరర్తించు నిమిత్తము సహాయమును పొందుటకు అట్టి వ్యక్తి యొక్క సేవలను వినియోగించు కొనవచ్చును.
ప్రొసీడింగులు రహస్యముగా కొనసాగించుట.
16. ప్రొసీడింగులలోని ఎవరేని పక్షకారు కోరినచో మరియు కేసు స్వభావమును బట్టి రహస్యముగా కొనసాగించుట అవసరమని మేజిస్ట్రేటు భావించినచో, ఈ చట్టము క్రింద ప్రొసీడింగులను రహస్యముగా నిర్వహించవచ్చును.
ఉమ్మడి ఇంటిలో నివసించు హక్కు
17.(1) తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమియున్నప్పటికిని, గృహసంబంధ బంధుత్వము గల ప్రతి మహిళ ఆమెకు ఏదేని హక్కు, హక్కు మూలము లేక లాభదాయకమైన హితము ఉన్నను లేకున్ననూ ఉమ్మడి ఇంటిలో నివసించు హకు ఆమెకు ఉండును.
(2) వ్యధిత వ్యక్తి ఉమ్మడి ఇల్లు నుండి లేక దానిలో భాగము నుండి శాసనబద్ధమైన ప్రక్రియననుసరించిననే తప్ప ప్రతివాదిచే గృహము నుండి వెళ్లగొట్టబడరాదు లేక తొలగించబడరాదు.
రక్షణ ఉత్తర్వులు.
18. వ్యధిత వ్యక్తికి మరియు . ప్రతివాదికి విన్నవించుకొనుటకు అవకాశము నిచ్చిన మీదట గృహ హింస జరిగినదని లేక జరుగగలదని ప్రధమ దృష్ట్యా మేజిస్ట్రేటు సంతృప్తి చెందిన యెడల వ్యధిత వ్యక్తికి అనుకూలంగా రక్షణ ఉత్తరువు జారీ చేయవచ్చును మరియు ప్రతివాదిని ఈ క్రింది పనులు చేయుట నుండి-
(ఎ) గృహ హింస వంటి ఏదేని చర్యకు గురిచేయకుండాను;
(బి) గృహ హింస యొక్క చర్యలు జరుగుటకు సహాయపడుటను లేక దుష్ప్రేరణ చేయుటను;
(సి) వ్యధిత వ్యక్తి పనిచేయు స్థలములోనికి ప్రవేశించుట లేక వ్యధిత వ్యక్తి బాలుడు/బాలిక అయినయెడల ఆమె తరచుగా సంచరించు పాఠశాల లేక ఏదేని ఇతర ప్రదేశములోనికి ప్రవేశించుటను; (డి) వ్యధిత వ్యక్తితో వ్యక్తిగతంగా, మౌఖికంగా లేక వ్రాతమూలకంగా లేక ఎలక్ట్రానిక్ లేక టెలిఫోన్ ద్వారా ఏదేని రూపంలోగాని సంభాషించుటకు ప్రయత్నించుటను;
(ఇ) మేజిస్ట్రేటు అనుమతి లేకుండా వ్యధిత వ్యక్తికి సంబంధించిన లేక ఆమె పేరు మీదున్న స్త్రీ ధనంతో సహా లేదా వ్యధిత వ్యక్తి ప్రతివాది పేర్లమీద ఉమ్మడిగా ఉన్న లేక వ్యధిత వ్యక్తి మరియు ప్రతివాది చే నిర్వహించబడుతున్న లేక అనుభవించుచున్న లేక విడివిడిగా లేక కలసి నిర్వహించబడుచున్న ఏవేని ఆస్తులను బ్యాంకు లాకర్లను లేక బ్యాంకు అకౌంట్లను ఉపయోగించిన లేక నిర్వహించుచున్న వాటిని అన్యాక్రాంతము చేయుటను;
(ఎఫ్) గృహహింసకు గురైన వ్యధిత వ్యక్తికి సహాయం అందిస్తున్న లేక ఆధారితులు, ఇతర బంధువులు లేదా ఎవరైనా ఇతర వ్యక్తిని హింసకు గురిచేయుటను;
(జి) రక్షణ ఉత్తర్వులో నిర్దిష్ట పరచిన ఏదేని ఇతర చర్య చేయుటను; నిషేధించవచ్చును.
నివాస ఉత్తర్వులు.
19.(1) 12వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తును పరిష్కరించునపుడు మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి పై హింస జరిగినదని, రూఢిగా విశ్వసించిన మీదట--
(ఎ) వ్యధిత వ్యక్తి ఉమ్మడి ఇంటిలో ప్రతివాదికి శాసనిక లేక న్యాయోచిత హక్కు ఉన్ననూ లేకున్ననూ ఆమె స్వాధీనములోవున్న ఆ ఉమ్మడి ఇంటి నుండి, ఆమెను వెళ్లగొట్టుటకు లేదా ఇతర విధముగానైనను ఇబ్బంది కలిగించకుండా ప్రతివాదిని అవరోధించుచూ,
(బి) ఉమ్మడి ఇంటి నుండి తొలగిపొమ్మని ప్రతివాదిని ఆదేశించుచూ;
(సి) వ్యధిత వ్యక్తి ఉమ్మడి ఇంటిలోనికి ప్రతివాది లేక ఎవరేని అతని బంధువుల ప్రవేశమును అవరోధించుచూ;
(డి) ప్రతివాది ఉమ్మడి ఇల్లును అన్యాక్రాంతము లేక తాకట్టు పెట్టుట లేక అమ్మవేయుట నుండి అవరోధించుచూ;
(ఇ) మేజిస్ట్రేటు అనుమతి పొందిననే తప్ప ఉమ్మడి ఇంటిలో తన హక్కులను ప్రతివాది పరిత్యజించుటను అవరోధించుచూ; లేదా
(ఎఫ్) పరిస్థితులు అట్లు కోరినచో వ్యధిత వ్యక్తికి ఇంతవరకు ఆమె అనుభవించిన ఉమ్మడి ఇల్లునకు సమానమైన స్థాయిలో ఉన్న అలాంటి ప్రత్యామ్నాయ వసతిని ఏర్పాటు చేయమని లేక దానికి అద్దె చెల్లించవలసినదిగా ప్రతివాదిని ఆదేశించుచూ;
నివాస ఉత్తరువును జారీచేయవచ్చును:
అయితే, ఖండము (బి) క్రింద ఉత్తరువును ఏ మహిళ కైనను జారీ చేయరాదు. (2) వ్యధిత వ్యక్తి లేక అట్టి వ్యధిత వ్యక్తి యొక్క ఏ బిడ్డకైనను రక్షణ లేక భద్రత కలిగించుటకు మేజిస్ట్రేటు సహేతుకముగా అవసరమని భావించునట్టి ఏవేని అదనపు షరతులను విధించవచ్చును లేదా ఏదేని ఇతర ఆదేశమును జారీచేయవచ్చును.
(3) మేజిస్ట్రేటు ప్రతివాది గృహ హింసకు పాల్పడుటను నివారించుటకు పూచికత్తు (ప్రతిభూతి)తోగాని అవి లేకుండాగాని బాండు పత్రం వ్రాసి ఇవ్వవలసిందిగా అతనిని కోరవచ్చును.
1974లోని 2వ చట్టము.
(4) ఉప-పరిచ్చేదము (3) క్రింది ఉత్తర్వు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క అధ్యాయము-VIII క్రింద ఇచ్చిన ఉత్తర్వుగా భావించవలెను మరియు తదనుగుణం- గానే వ్యవహరించవలెను.
(5) ఉప-పరిచ్ఛేదము (1), ఉప-పరిచ్ఛేదము (2) లేదా ఉప-పరిచ్చేదము (3) క్రింద ఉత్తర్వు జారీచేయునపుడు న్యాయస్థానము ఉత్తర్వును అమలుపరచుటలో వ్యధిత వ్యక్తికి రక్షణ కల్పించవలసినదిగా లేక ఆమెకు లేక ఆమె తరఫున దరఖాస్తు చేయు వ్యక్తికి సహాయపడవలసినదిగా సమీపములోని పోలీసు స్టేషను అధికారిని ఆదేశించుచూ ఉత్తర్వులను కూడా జారీచేయవచ్చును.
(6) ఉప-పరిచ్చేదము (1) క్రింద ఉత్తర్వు చేయునపుడు మేజిస్ట్రేటు పక్షకారుల ఆర్ధిక అవసరాలు మరియు వనరులను దృష్టియందుంచుకుని అద్దె మరియు ఇతర చెల్లింపులు చేయుటకు సంబంధించిన బాధ్యతలను ప్రతివాది పై ఉంచవచ్చును.
(7) ఏ పోలీసు స్టేషను అధికారితా పరిధిలో మేజిస్ట్రేటును కోరినారో ఆ పోలీసు స్టేషనుకు ఇన్ ఛార్జిగా ఉన్న అధికారిని రక్షణ ఉత్తర్వులను అమలుపరచుటలో సహాయము చేయవలసినదిగా మేజిస్ట్రేటు ఆదేశించవచ్చును.
(8) వ్యధిత వ్యక్తికి చెందిన స్త్రీధనమ లేక ఏదేని ఇతర ఆస్తి లేక విలువైన సెక్యూరిటీలను తిరిగి ఆమెకు స్వాధీనపరచవలసినదిగా మేజిస్ట్రేటు ప్రతివాదిని ఆదేశించ వచ్చును.
ధన పరిహారాలు.
20.(1) 12వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తును పరిష్కరించు నపుడు మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి లేదా ఆమె యొక్క ఎవరేని బిడ్డకు గృహహింస వలన కలిగిన వ్యయములను లేదా నష్టములను భరించుటకు ధన పరిహారమును చెల్లించవలసినదిగా ప్రతివాదిని ఆదేశించవచ్చును అట్టి పరిహారములో ఈ క్రిందివి చేరును. అయితే ఈ పరిహారము ఈ క్రింది వాటికి మాత్రమే పరిమితము కారాదు,-
(ఎ) సంపాదనలో నష్టాలు;
(బి) వైద్య ఖర్చులు; 1974లోని 2వ చట్టము.
(సి) వ్యధిత వ్యక్తి నియంత్రణలోనున్న ఏదేని ఆస్తిని ధ్వంసము చేసినందు వలన, నష్ట పరిచినందువలన లేక ఆమె అధీనము నుండి తొలగించినందు వలన ఆమెకు కలిగిన నష్టము; మరియు
1974లోని 2వ చట్టము.
(డి) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 125వ పరిచ్ఛేదము క్రింద లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనం క్రింద మనోవర్తి ఉత్తర్వు క్రింద లేదా దానికి అదనంగా వ్యధితవ్యక్తికి మరియు ఆమె బిడ్డకు మనోవర్తి ఏదైనా ఇచ్చివుంటే ఆ మనోవర్తి.
(2) ఈ పరిచ్ఛేదము క్రింద మంజూరు చేయు ధన పరిహారము చాలినంతగా, సముచితంగా, సబబైన మరియు వ్యధిత వ్యక్తి అలవాటుపడిన జీవన విధానమునకు అనుగుణమైనదిగా ఉండవలెను.
(3) కేసు స్వభావము మరియు పరిస్థితులను బట్టి మేజిస్ట్రేటు మనోవర్తి ఏక మొత్తముగాగాని లేదా నెలవారీగా గాని చెల్లింపు చేయవలసిందిగా ఉత్తర్వునిచ్చుటకు అధికారము కలిగివుండవలెను.
(4) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ధనపరిహారము కొరకు ఇచ్చిన ఉత్తర్వు ప్రతినొక దానిని మేజిస్ట్రేటు ప్రతివాది నివసించు స్థానిక ప్రాంతము యొక్క అధికారితా పరిధి కలగిన పోలీసు స్టేషనుకు, మరియు దరఖాస్తు చేసిన పక్షకారులకు పంపవలెను.
(5) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద మంజూరు చేసిన ధన పరిహారమును ఉత్తర్వులో నిర్దిష్టపరచిన సమయము లోపల ప్రతివాది వ్యధిత వ్యక్తికి చెల్లించవలెను.
(6) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద చేయబడిన ఉత్తర్వు ననుసరించి చెల్లింపు చేయుటలో ప్రతివాది విఫలుడైన మీదట మేజిస్ట్రేటు వ్యధితవ్యక్తికి నేరుగా చెల్లించమని లేక ప్రతివాది జీతము లేక వేతనము లేక అతనికి రావలసిన బాకీ లేక ఖాతాకు జమఅయిన మొత్తములోని భాగమును న్యాయస్థానములో డిపాజిటు చేయవలసినదిగా ప్రతివాది యొక్క యజమాని లేక అతని ఋణగ్రస్తుని ఆదేశించవచ్చును మరియు ఆ మొత్తమును ప్రతివాది చెల్లించవలసిన ధన పరిహారము క్రింద సర్దుబాటు చేయవచ్చును.
అభిరక్ష ఉత్తర్వులు.
21.తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమున్నప్పటికిని మేజిస్ట్రేటు రక్షణ ఉత్తర్వుల కొరకు లేదా ఈ చట్టము క్రింది ఏదేని ఇతర పరిహారము కొరకు చేసిన దరఖాస్తును ఆకర్ణించు ఏ దశలోనైనను, వ్యధిత వ్యక్తి ఎవరేని బిడ్డ లేదా బిడ్డల అభిరక్షను తాత్కాలికముగా ఆమెకు లేక ఆమె తరఫున దరఖాస్తు చేసిన వ్యక్తికి అప్పగించుటకు అనుమతి నీయవచ్చును. మరియు అవసరమైనచో అట్టి బిడ్డ లేదా బిడ్డలను సందర్శించుటకు ప్రతివాదికి అవకాశములను ఇచ్చు ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్దేశించవచ్చును. అయితే, ఏదేని అట్టి ప్రతివాది సందర్శన, బిడ్డ లేక బిడ్డల హితమునకు హానికరమని మేజిస్ట్రేటు భావించినచో, అట్టి సందర్శనకు అనుమతించుటను నిరాకరించవచ్చును.
నష్ట పరిహారపు ఉత్తర్వులు,
22. ఈ చట్టము క్రింద మంజూరు చేయబడునట్టి పరిహారములకు అదనంగా, మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి. చేసుకున్న దరఖాస్తు పై ప్రతివాది పాల్పడిన గృహ హింస కృత్యముల వలన కలిగిన మానసిన యాతన, భావ ధ్వేగయాతనతో సహా కలిగిన గాయములకు నష్టపరిహారము లేక నష్ట పూర్తి (డ్యామేజీలు) చెల్లించవలసిందిగా ప్రతివాదిని ఆదేశిస్తూ ఉత్తర్వును చేయవచ్చును.
మధ్యకాలిక మరియు ఏకపక్షీయ ఉత్తర్వులు మంజూరు చేయుటకు అధికారము.
23.(1) ఈచట్టము క్రింద మేజిస్ట్రేటు ఆయన ముందున్న ఏదేని ప్రొసీడింగులో తాను న్యాయమని, యుక్తమని భావించినట్టి మధ్యంతర ఉత్తర్వును జారీ చేయవచ్చును.
(2) మేజిస్ట్రేటు దరఖాస్తును ప్రధమ దృష్ట్యా చూచినంతనే ప్రతివాది గృహహింస కృత్యమునకు పాల్పడినాడని లేక పాల్పడుచున్నాడని, లేక పాల్పడవచ్చునని రూఢిగా విశ్వసించినపుడు 18వ పరిచ్ఛేదము, 19వ పరిచ్ఛేదము, 20వ పరిచ్ఛేదము, 21వ పరిచ్ఛేదము లేక సందర్భానుసారము 22వ పరిచ్ఛేదము క్రింద వ్యధిత వ్యక్తి యొక్క ప్రమాణ పత్రం ఆధారంగా విహితపరచినట్టి ప్రరూపములో ప్రతివాదిపై ఏకపక్షీయ ఉత్తర్వును మంజూరు చేయవచ్చును.
ఉత్తర్వుల ప్రతులను న్యాయస్థానము ఉచితముగా ఇచ్చుట.
24. మేజిస్ట్రేటు, ఈ చట్టము క్రింద అన్ని కేసులలో తాను ఇచ్చిన ఏదేని ఉత్తర్వులకు సంబంధించి అట్టి ఉత్తర్వు ప్రతిని దరఖాస్తు యొక్క పక్షకారులకు, మేజిస్ట్రేటును కోరిన స్థానిక ప్రాంతపు అధికారితా పరిధిలో ఉన్న పోలీసు స్టేషను యొక్క ఇన్ ఛార్జీ పోలీసు అధికారికి, మరియు న్యాయస్థానపు అధికారితా పరిధిలోని స్థానిక ప్రాంతపు అధికారితా పరిధిలోవున్న సేవలు సమకూర్చువారు మరియు గృహ సంఘటన నివేదికను నమోదు చేసిన ఏదేని సేవలు సమకూర్చువారు ఉన్నచో దానికి ఉచితముగా ఇవ్వవలెను.
ఉత్తర్వుల మార్పు మరియు కాలావధి.
25.(1) 18వ పరిచ్ఛేదము క్రింద చేసిన రక్షణ ఉత్తర్వు వ్యధిత వ్యక్తి దానిని ఉన్ముక్తత చేయమని దరఖాస్తు చేయునంతవరకు అమలులోనుండును.
(2) మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి నుండి లేక ప్రతివాది నుండి దరఖాస్తు అందిన మీదట ఈ చట్టము క్రింద చేయబడిన ఏదేని ఉత్తర్వుకు మార్పు, సవరణ లేక ఉపసంహరణకు అవసరమైన పరిస్థితులు ఏర్పడినవని సంతృప్తి చెందినచో దానికి గల కారణములను రికార్డు చేసి తాను సబబని భావించినట్టి ఉత్తర్వును జారీ చేయవచ్చును.
ఇతర దావా మరియు శాసనిక కార్యకలాపాలలో పరిహారము.
26 (1) వ్యధిత వ్యక్తిని మరియు ప్రతివాదిని ప్రభావితము చేయు అట్టి ప్రొసీడింగులను ఈ చట్టము ప్రారంభమునకు పూర్వము లేక తరువాత ప్రారంభించననూ, లేకున్నను 18, 19, 20, 21, మరియు 22వ పరిచ్ఛేదము క్రింద లభించు ఏదేని పరిహారము సివిల్ న్యాయస్థానము, కుటుంబ న్యాయస్థానము లేక క్రిమినలు న్యాయస్థానములోని ఎదుటవున్న ఏదేని శాసనిక ప్రొసీడింగులలో కూడ కోరవచ్చును.
(2) సివిలు లేక క్రిమినలు న్యాయస్థానము ముందున్న అట్టి దావా లేక శాసనిక ప్రొసీడింగులలో కోరిన ఏదేని ఇతర పరిహారమునకు అదనముగా మరియు దానితో పాటుగా వ్యధితవ్యక్తి ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించబడిన పరిహారము కూడ కోరవచ్చును.
(3) ఈ చట్టము క్రింద ప్రొసీడింగులలో కాకుండా ఏదేని ఇతర ప్రొసీడింగులలో ఏదేనీ ఇతర పరిహారము పొందియున్నచో అట్లు మంజూరైన పరిహారమును గురించి వ్యధిత వ్యక్తి మేజిస్ట్రేటుకు తెలియజేయుటకు బద్ధురాలైవుండవలెను.
అధికారితా పరిధి.
27.(1) ఈ క్రింది స్థానిక ప్రాంత పరిధి కలిగిన మొదటి తరగతి న్యాయిక మేజిస్ట్రేటు న్యాయస్థానము లేక సందర్భానుసారముగా మహానగర మేజిస్ట్రేటు న్యాయస్థానము --
(ఎ) వ్యధిత వ్యక్తి శాశ్వతముగా లేక తాత్కాలికముగా నివసించుచున్న లేక వ్యాపారమును నిర్వహించుచున్న లేక ఉద్యోగము చేయుచున్న; లేదా
(బి) ప్రతివాది నివసించుచున్న లేక వ్యాపారమును నిర్వహించుచున్న లేక ఉద్యోగము చేయుచున్న; లేదా
(సి) వ్యాజ్య కారణం ఉత్పన్నమైన,
ప్రదేశము ఈ చట్టము క్రింద అపరాధములను విచారణ జరుపుటకు మరియు ఈ చట్టము క్రింద రక్షణ ఉత్తర్వు మరియు ఇతర ఉత్తర్వులు మంజూరు చేయుటకు సమర్థ న్యాయ స్థానముగా ఉండును.
(2) ఈ చట్టము క్రింద జారీ అయిన ఉత్తర్వులను భారత దేశమంతటా ఎక్కడైనను అమలుపరచబడదగినదై ఉండవలెను.
ప్రక్రియ. 1974లోని 2వది.
28.(1) ఈ చట్టములో ఇతర విధముగా నిబంధించబడిననే తప్ప, పరిచ్ఛేదములు 12, 18, 19, 20, 21, 22 మరియు 23, 31వ పరిచ్చేదము క్రింద అపరాధములకు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క నిబంధనలే వర్తించును.
(2) ఉప-పరిచ్ఛేదము (1)లో ఉన్నదేదియు, 12వ పరిచ్ఛేదము లేక 23వపరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద ఒక దరఖాస్తును పరిష్కరించుటకై తనదైన ప్రక్రియను రూపొందించుకొనుటలో న్యాయస్థానమును నివారించదు.
అఫీలు.
29. మేజిస్ట్రేటుచే జారీ చేయబడిన ఉత్తర్వు వ్యధిత వ్యక్తికి లేదా సందర్భాను సారముగా ప్రతివాదికి తామీలు చేసిన తేదీ నుంఢి ఇందులో ఏది తరువాత అయినచో ఆ తేదీ నుండి ముప్పది దినముల లోపుగా ఆ ఉత్తర్వుల పై సెషన్సు న్యాయస్థానమునకు అపీలు చేసుకొనవచ్చును.
అధ్యాయము - 5
వివిధ విషయములు
రక్షణ అధికారులు మరియు సేవలు సమకూర్చువారి సభ్యులు పబ్లిక్ సేవకులుగా ఉండుట.1860లోని 45వ చట్టము
30. ఈ చట్టము యొక్క నిబంధనలు లేక ఏవేని నియమములు లేక దాని క్రింద చేయబడిన ఏవేని ఉత్తర్వుల ననుసరించి రక్షణ అధికారులు మరియు సేవలు సమకూర్చు వారి సభ్యులు తమ విధి నిర్వహణ లేక నిర్వహణకు ఉద్దేశించిన పనులను నిర్వహించుటలో భారత శిక్షా స్మృతి యొక్క 21వ పరిచ్ఛేదపు అర్థములో పబ్లిక్ సేవకుడుగా భావించబడవలెను.
ప్రతివాదిచే రక్షణ ఉత్తర్వును ఉల్లంఘించినందుకు జరిమానా,
31.(1) ప్రతివాది రక్షణ ఉత్తర్వు లేక మధ్యకాలిన రక్షణ ఉత్తర్వును ఉల్లంఘించుట ఈ చట్టము క్రింద అపరాధముగా భావించబడి అతడు ఒక సంవత్సర కాలము వరకు ఉండగల కాలావధికి ఏదేని రకపు కారావాసముతోనైనను లేదా ఇరువది వేల రూపాయల వరకు ఉండగల జరిమానాతోనైను లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడును.
(2) నిందితునిచే ఉల్లంఘించబడినదిగా ఆరోపించబడినట్టి ఉప-పరిచ్ఛేదము(1) క్రింద అపరాధ ఉత్తర్వు, దానిని జారీచేసిన మేజిస్ట్రేటుచే సాధ్యమయినంత వరకు విచారించబడవలెను.
1860లోని 45వ చట్టము. 1961లోని 28వ చట్టము.
(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఆరోపణలను రూపొందించునపుడు మేజిస్ట్రేటు భారత శిక్షా స్మృతిలోని 498-ఏ లేక ఆ స్మృతి యొక్క ఏదేని ఇతర నిబంధనలు లేక సందర్భానుసారముగా వరకట్న నిషేధ చట్టము, 1961లోని నిబంధనల క్రింద అపరాధము జరిగినదని వెల్లడించ సంగతులు ఉంటే ఆ నిబంధనల క్రింద కూడ ఆరోపణలను రూపొందించవచ్చును.
32.(1) భారత శిక్షా స్మృతి, 1973లో ఏమున్నప్పటికినీ, 31వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద అపరాధము సంజేయమైనది మరియు జామీను ఇవ్వలేనట్టి అపరాధమగును.
సంజేయము మరియు రుజువు. 1974లోని 2వ చట్టము.
(2) వ్యధితవ్యక్తి ఇచ్చిన ఏకైక సాక్ష్యం పై ఆధారపడి న్యాయస్థానము 31వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము - (1) క్రింద నిందితుడు అపరాధము చేసినట్లు న్యాయస్థానము నిర్ణయమునకు రావచ్చును.
రక్షణ అధికారి తన కర్తవ్యము నిర్వహించనందుకు జరిమానా,
33. మేజిస్ట్రేటుచే రక్షణ ఉత్తర్వులో ఆదేశించబడిన విధంగా తగువిధమైన కారణము లేకుండా తన కర్తవ్యమును నిర్వర్తించుటకు తిరస్కరించిన లేక విఫలుడైన ఎవరేని రక్షణ అధికారి ఒక సంవత్సర కాలమువరకు ఉండగల కాలవధికి ఏ రకపు కారావాసముతో నైనను, లేక ఇరువదివేల రూపాయల వరకు ఉండగల జరిమానాతో నైనను లేక రెండింటితో నైనను శిక్షింపబడదగియుండును. రక్షణ అధికారిచే చేసిన అపరాధమును సంజేయము చేయుట.
34.రాజ్య ప్రభుత్వము లేక దానిచే ఈ విషయములో ప్రాధికారమీయబడిన ఎవరేని అధికారి యొక్క పూర్వానుమోదముతో ఫిర్యాదును దాఖలు చేసిననే తప్ప రక్షణ అధికారి పై ఎట్టి దావా, లేక ఇతర శాసనిక ప్రొసీడింగులు ఉండవు.
సద్భావముతో చేసిన చర్యకు రక్షణ.
35. ఈ చట్టము క్రింద లేక దాని క్రింద చేయబడిన ఏదేని నియమము లేక ఉత్తర్వు క్రింద సద్భావముతో చేసిన లేక చేయుటకు ఉద్దేశించిన దేనివలననైనను కలిgiన లేదా కలుగబోవు ఏదేని చెరుపునకు రక్షణ అధికారి పై ఎట్టి దావా లేక ఇతర శాసనిక ప్రొసీడింగులు ఉండవు.
చట్టము ఏదేని ఇతర శాపనమును మ్యాన పరచకుండుట.
36. ఈ చట్టము యొక్క నిబంధనలు, తత్సమయమన అమలునందున్న ఏదేని ఇతర శాసనములోని నిబంధనలకు అదనముగా ఉండునేగాని, వాటిని న్యూనపరచునవిగా ఉండవు.
నియమములు చేయుటకు కేంద్ర ప్రభుత్వమునకు అధికారము.
37.(1) ఈ చట్టము యొక్క నిబంధనలను అమలుపరచుటకు కేంద్రప్రభుత్వము అధి సూచన ద్వారా నియమములను చేయవచ్చును.
(2) ప్రత్యేకించియు, పైన పేర్కొనబడిన అధికారముల యొక్క సాధారణతకు భంగము లేకుండాను అట్టి నియమములను ఈ క్రింద అన్ని లేక ఏవేని విషయములను చేయవచ్చును, అవేవనగా:-
(ఎ) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద రక్షణ అధికారి కలిగియుండ వలసిన అర్హతలు మరియు అనుభవము;
(బి) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (3) క్రింద రక్షణ అధికారుల మరియు అతని అధీనస్థ ఇతర అధికారుల సేవా నిబంధనలు మరియు షరతులు;
(సి) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (బి) క్రింద గృహ సంఘటన నివేదికను తయారు చేయవలసిన ప్రరూపము మరియు రీతి;
(డి) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (సీ) క్రింద మేజిస్ట్రేటుకు రక్షణ ఉత్తర్వు కొరకు దరఖాస్తు ప్రరూపము మరియు రీతి;
(ఇ) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (డి) క్రింద ఫిర్యాదును దాఖలు చేయు ప్రరూపము;
(ఎఫ్) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (ఐ) క్రింద రక్షణ అధికారిచే నిర్వర్తించవలసిన ఇతర కర్తవ్యములు; (జి) 10వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద సేవలు సమకూర్చువారి రిజిస్ట్రేషనును క్రమబద్ధీకరించు నియమములు;
(హెచ్) ఈ చట్టము క్రింద సహాయములను అర్థించుచూ 12వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద చేయు దరఖాస్తు ప్రరూపము మరియు సదరు పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (3) క్రింద అట్టి దరఖాస్తు కలిగివుండవలసిన వివరములు;
(ఐ) 13వ పరిచ్ఛేదపు, ఉప-పరిచ్ఛేదము (1) క్రింద నోటీసులను తామీలు చేయు పద్ధతులు
(జె) 13వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద రక్షణ అధికారిచే నోటీసులను తామీలు చేయు ప్రరూపము;
(కె) 14వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద సలహాలనిచ్చు సేవలు సమకూర్చువారి సభ్యుడికి ఉండవలసిన అర్హతలు మరియు అనుభవము;
(ఎల్) 23వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద వ్యధిత వ్యక్తిచే దాఖలు చేయు ప్రమాణ పత్రము యొక్క ప్రరూపము;
(ఎమ్) విహితపరచిన లేక విహితపరచవలసిన ఏదేని ఇతర విషయము.
(3) ఈ చట్టము క్రింద చేసిన ప్రతి నియమమును, దానిని చేసిన పిమ్మట వీలయినంత త్వరితముగ పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున, మొత్తము ముప్పది దినముల కాలావధిపాటు దాని ప్రతియొక సదనము సమక్షమున ఉంచవలెను. ఆ కాలావధి, ఒకే అధివేశనములోగాని, రెండు లేక అంతకుమించి వెనువెంటనే వచ్చు అధివేశనములలోగాని చేరియుండవచ్చును మరియు పైన చెప్పిన అధివేశనమునకు లేకవరుసగా వచ్చు. అధివేశనమునకు వెనువెంటనే వచ్చు అధివేశనము ముగియుటకు పూర్వము ఆ నియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు అంగీకరించినచో లేక ఆ నియమమును అట్లు చేయరాదని ఉభయసదనములు అంగీకరించినచో, అటు పిమ్మట ఆ నియమము అట్లు మార్పు చేసిన రూపములో మాత్రమే ప్రభావము కలిగియుండును, లేక సందర్భానుసారముగా ప్రభావరహితమైయుండును. అయినప్పటికినీ, ఆ నియమమునందలి ఏదేని అట్టి మార్పుగాని, ఆ నియమపు రద్దుగాని అంతకు పూర్వము ఆ నియమము క్రింద చేసిన దేని శాసనమాన్యత కైనను భంగము కలిగించదు.