Jump to content

గురుజాడలు/కవితలు/నాటిమాట

వికీసోర్స్ నుండి

నాటి మాట

రాగము, అఠాణా - తాళము, రూపకము

                  పల్లవి
    నాటి మాట మఱచుట యే!
    నాటికైన మఱవ వశమ||
               అనుపల్లవి
    బోటి ప్రాణ మీ వంటి, ము |
    మ్మాటికి నిను విడ నంటి||
              చరణములు
1. మాట మూట గట్టి కొని|
   పాటిదప్పి తనుట నా పొర|
   పాటుగాక, మాటన నే|
   పాటిర నీ సాటి దొరకు||

2. బ్రతుకు నందు లేని స్థిరత|
   వెతక నేల భాషయందు!
   నతుకు వేష భాష కోడు!
   నతివలదే తప్పుగాక||

3. సాటి లేదు నా కంటివా!
    మాట నిజము నేడు గంటి|
    సాటి కలదె నమ్మి భంగ|
    పాటు పడిన పడఁతి కెందు||

4.మేటివైన నీ యెద మొగ|
   మాట మెటుల బాసె, నొక్క|
   మాటురా, నీ యోటు మాటె
   కోటి ధనము లిచ్చి కొందు!!