Jump to content

గుత్తా/ఆత్మకథ విషయపేజీలు

వికీసోర్స్ నుండి
గుత్తా

‘‘గు’’ అనగా రహస్యము అని అర్థము. జగతిలో అత్యంత రహస్యమూ, అన్నిటికంటే పెద్దదీ, ఎవరికీ తెలియనిదీ ఒకే ఒకటి కలదు. అదియే దైవము. ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యము దైవము మాత్రమే. ఎవరికీ తెలియని రహస్యము దైవము అయినప్పుడు దైవమును గురించి ఎవరైనా ఎలా చెప్పగలరు? అని ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా ఎవరూ చెప్పలేరనియే చెప్పవచ్చును. దైవమును గురించి ఎవరూ చెప్పలేనప్పుడు, దేవుని గురించి మనుషులకు ఎలా తెలియునని కూడా ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా ఒకేమాటను చెప్పవచ్చును. అదేమనగా! దేవున్ని గురించిన జ్ఞానమును దేవుడే తెల్పాలి తప్ప ఏ మనుషులూ చెప్పలేరని ఏకధాటిగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక చిక్కు సమస్య వచ్చి పడుతుంది. అదేమనగా! దేవుడు ఎవరికీ తెలియని వాడేకాక, ఆయనకు రూపముగానీ, పేరుగానీ, పనిగానీ ఏమాత్రము లేవు. రూప, నామ, క్రియలులేనపుడు, ఒక క్రియ (పని) అయిన జ్ఞానము తెలియజేయడమును దేవుడు చేయడు కదా! అంతేకాక ఆకారము, పేరు లేనివాడు ఎలా చెప్పగలడు? ఆకారమున్నవాడు చెప్పితేగాని అర్థముకాని మనుషులకు, ఆకారము లేకుండా మాటల రూపముతో చెప్పుటకు వీలుకాదు. ఈ విధముగా పేరులేనివాడు, ఆకారమే లేనివాడు, పనియే చేయనివాడు దైవ జ్ఞానమును తెలుపుటకు అవకాశమే లేదు. అటువంటపుడు దేవునికి తప్ప ఎవరికి తెలియని దేవుని జ్ఞానము, మానవులకు ఎలా తెలియునని ఎవరైనా అడుగవచ్చును. ఇటు చూస్తే నుయ్యి (బావి) అటు చూస్తే గొయ్యి (గుంత) అన్నట్లున్న ఈ ప్రశ్నకు జవాబు చెప్పడము చాలాకష్టము. ఎంత యోచించినా జవాబే దొరకని ఈ ప్రశ్నకు చివరకు దేవుడే జవాబు చెప్పాలి. ఆ విధానము ప్రకారమే మా యోచనకు ఒక జవాబు దొరికింది. అదేమనగా! దేవుడు దేవునిగా ఎప్పటికీ తన జ్ఞానము చెప్పడు. అయితే దేవుడు దేవునిగా కాకుండా మరొక రకముగా చెప్పుటకు అవకాశమున్నది. మరొక విధానముగా అంటే ఎలాగ అని యోచిస్తే, భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 15వ శ్లోకమున ‘‘సర్వస్య చాహం హృది సన్ని విష్టో మత్తః స్స్మృతిర్‌ జ్ఞాన మపోహనంచ’’ అన్నట్లు సర్వ మానవుల హృదయముల నున్న దేవుడే అందరికీ జ్ఞప్తిని, జ్ఞానమును, ఊహలను అందిస్తున్నాడు (దేవుడు దేవునిగా కాకుండా ఆత్మగా ఈ పనిని చేయుచున్నాడు.) నా యోచనకు కూడా నా శరీరములో హృదిస్థానములోనున్న ఆత్మయే ఒక ఊహను జవాబుగా అందించింది. అదేమనగా!


దేవుని జ్ఞానము భూమిమీద అవసరమైనపుడు, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. కావున దేవుడు స్వయముగా చెప్పకుండా మరొక విధానమును అనుసరించి చెప్పును. ఆ విధానము ప్రకారము దేవుని జ్ఞానమును ఏ మనిషీ చెప్పకుండా దేవుడే చెప్పినప్పటికీ, దేవుడు స్వయముగా చెప్పినట్లు కూడ ఉండదు మరియు మనిషి స్వయముగా చెప్పినట్లు ఉండదు. కనిపించే మనిషే దేవుని జ్ఞానమును చెప్పినప్పటికీ, లోపలనుండి చెప్పినవాడు మనిషికాదు (జీవుడు కాదు). అలాగే లోపలనుండి చెప్పినవాడు దేవుడూ కాదు. ఈ విధానము ప్రకారము ఇటు మనిషి చెప్పినట్లుగానీ, అటు దేవుడు చెప్పినట్లుగానీ కనబడదు. ఇప్పుడు ఇటు మనిషీ చెప్పక, అటు దేవుడూ చెప్పక ఎవరు చెప్పారు అను ప్రశ్న రాగలదు కదా! దానికి సమాధానము ఇలా కలదు. దేవుని జ్ఞానము భూమిమీద ఏ మనిషికీ తెలియదు, కావున మనిషి చెప్పాడనుటకు వీలులేదు. అలాగే దేవుడు ఏ పనినీ చేయడు, కావున మనిషిలోనుండి దేవుడు చెప్పాడనుటకూ వీలులేదు. అందువలన దేవుడు ప్రత్యేకమైన విధానమును ముందే ఏర్పరచి దాని ప్రకారము చెప్పగలిగాడని చెప్పవచ్చును. ఆ ప్రత్యేక విధానమును వివరించుకొని చూస్తే ఇటు మనిషీకాక, అటు దేవుడూకాక, మనిషికీ దేవునికీ మధ్యలో ఆత్మ ఒకటున్నది. దేవుడు విశ్వములో జీవరాసులను సృష్ఠించినపుడే తనకూ (దేవునికి), జీవునికీ (మనిషికీ) మధ్యలో ఆత్మను ముందే పథకము ప్రకారము సృష్ఠించాడు. చాలామంది జ్ఞానులకు, భక్తులకు జీవుడు దేవుడు అన్న రెండు పదములే ఎక్కువగా తెలుసుగానీ మధ్యలోనున్న ఆత్మను గురించి తెలియదు. ఆత్మ అను పదము అనేక సందర్భములలో పలుకబడుచున్నప్పటికీ, దానిని కొందరు దయ్యముగానో లేక కొందరు దేవుడుగానో అనుకొనుచుందురు. కొందరు అజ్ఞానులు ఆత్మను దయ్యముగా చెప్పుకొంటే, కొందరు జ్ఞానులు ఆత్మను దేవునిగా చెప్పుకొనుచుందురు. ఎవ్వరు ఎలా చెప్పుకొనినా ఆత్మ ఇటు జీవుడూ కాదు, అటు దేవుడూ కాదు.


ఆత్మ ఎప్పుడూ జీవునికి తోడుగా ఉండునట్లు దేవుడు సృష్ఠించాడు. ఒక సజీవ శరీరములో జీవుడు ఉండగా, జీవునికి తోడుగా ఆత్మకూడా ఉన్నది. ఒక శరీరములోనున్న ఆత్మను గురించి ఆధ్యయనము చేయడమునే ఆధ్యాత్మికము అంటారు. ఇప్పుడు ఆత్మను గురించి పూర్తిగా తెలుసు కోవాలంటే పూర్తి ఆధ్యాత్మికము అవుతుంది. ఇప్పుడు అంత అవసరము లేకుండా ప్రస్తుతానికి ఎంత అవసరమో అంతమాత్రమే ఆత్మను గురించి తెలుసుకొందాము. ఇంతవరకు ఆత్మ ఎవరి అంచనాకు దొరకలేదనియే చెప్పవచ్చును. బాగా జ్ఞానము తెలిసిన వ్యక్తి వద్దకు పోయి ఆత్మను గురించి అడిగితే, దానిని అంతరాత్మ అని అంటారనీ, ఆత్మ శరీరము లోపల ఉంటుందని చెప్పాడు. అతను ఆత్మను గురించి తెలిసినట్లు చెప్పినా, ఆయన మాట పూర్తి సత్యమే అన్నట్లు అగుపించినా, వాస్తవానికి ఆత్మ శరీరములోపల దాగియున్న అంతరాత్మకాదు. అది శరీరము మీద బాహ్యముగా ఉండునదే. జీవాత్మ (జీవుడు) మాత్రము శరీరములోపల ఎవరికీ కనిపించక ఉండును. అందువలన అంతరాత్మ అనుమాట జీవాత్మకు వర్తించునుగానీ, ఆత్మకు వర్తించదు. ఇట్లు ఆత్మ విషయములో ఎందరో పొరపాటుపడుచున్నారు. ఎవరు ఏమనుకొనినా జీవాత్మకు తోడుగా ఆత్మ ప్రతి శరీరములో ఉన్నది. ప్రపంచములో ఒకవ్యక్తి ఉన్నాడు అంటే అతనిలో ఒక జీవాత్మ, ఒక ఆత్మ రెండూ జోడు ఆత్మలుగా ఉండునని తెలియవలెను. ఇదే సూత్రము ప్రతి ప్రాణికి వర్తించును. భూమిమీద ప్రతి వ్యక్తిలోనూ, ఏ మతస్థుని శరీరములో అయినా జీవాత్మ ఆత్మలు ఉండును. శరీరమునంతటిని పై వరకు ఆక్రమించి శరీరమును మాట్లాడించునది, ఆట్లాడించునది, కదిలించి పని చేయించునది ఆత్మకాగా, జీవుడు శరీరములోపల కనిపించని జాగాలో ఉండి బయటనుండి వచ్చు కష్టసుఖములను అనుభవించుచుండును. అయితే ఇంతవరకు అన్ని పనులు చేయునది ఆత్మేనని, జీవాత్మ ఏ పనినీ చేయడములేదనీ ఎవరికీ తెలియదు. జీవుడే అన్ని పనులూ చేస్తున్నాడని అందరూ అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా విచిత్రముగా ఎవరికీ తెలియకుండా అన్ని పనులు చేయుచున్న ఆత్మను ప్రతి శరీరములో దేవుడు ఉంచాడు.


దేవుడు ఆత్మకంటే పరాయిగా (వేరుగా) ఉన్నాడు. కావున దేవున్ని పరమాత్మ అనవచ్చును. ఆత్మకంటే వేరుగానున్న పరమాత్మ తన జ్ఞానమును ఆత్మచేత మనుషులకు చెప్పించునట్లు ముందే ఏర్పాటు చేసినది. మనుషులకు అవసరమొచ్చినప్పుడు ఆత్మ దేవుని జ్ఞానమును చెప్పుచున్నది. జీవునికి దేవునికి మధ్యలోనున్న ఆత్మ, దేవుని జ్ఞానము చెప్పడము వలన దేవుడు తన జ్ఞానమును స్వయముగా చెప్పినట్లు కాకుండాపోయినది. ఆత్మ మనిషిలో నుండి చెప్పడము వలన పైకి మనిషి చెప్పినట్లు కనిపించినా, చెప్పే మనిషికి దేవుని జ్ఞానము ఏమాత్రము తెలియదు. మధ్యలోనున్న ఆత్మ చెప్పడము వలన మనిషికి తెలియదనియే చెప్పవచ్చును. మనిషికి తెలియని జ్ఞానమును దేవుడు తాను స్వయముగా చెప్పకుండా, తన అంశను ఆత్మయందు చేర్చి, మనుషులకు మనిషిచేతనే చెప్పించునట్లు చేయుచున్నాడు. ఆత్మ చేయు ప్రతి పని మనిషే చేయుచున్నాడని ప్రపంచములో మనుషులందరూ అనుకోవడము వలన ఒక శరీరమునుండి ఆత్మ, దైవజ్ఞానమును బోధించినా, దానిని మనిషే బోధించాడని అందరూ అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా దేవుడు ఒక ప్రత్యేక విధానమును అనుసరించి మనిషి చెప్పకుండా, తానూ చెప్పకుండా మనుషులకు తన జ్ఞానమును తెలియజేయుచున్నాడు.


ఇక్కడ ఇంకా కొంత వివరము తెలుసుకోవలసివున్నది. తన ప్రత్యేకమైన విధానములో దేవునిలోని ఒక అంశ ఆత్మలో చేరిపోవడము వలన ఆత్మ, దైవజ్ఞానమును బోధించుచున్నది. లేకపోతే ఆత్మకు కూడా పరమాత్మ జ్ఞానము పూర్తి తెలియదు. దేవునికి లెక్కలేనన్ని అంశలు కలవు. భగవద్గీతలో విభూతియోగములో చివరి 42వ శ్లోకమున "ఏకాంశేన స్థితో జగత్‌" అని కలదు. దేవునికున్న ఎన్నో అంశలలో ఒక్క అంశచేతనే ఈ జగత్‌ అంతా సృష్ఠించబడివున్నది. అలాంటపుడు ఆయన అంశ అంటే ఎంతటిదో మనము అర్థము చేసుకోవచ్చును. ఒక అంశతో సర్వ ప్రపంచము స్థాపించబడి ఉండగా, ఒక అంశ ఆత్మలో చేరి భూమిమీద ప్రజలకు అవసరమొచ్చినపుడు కొన్ని యుగములకొకమారు తన జ్ఞానమును బోధించి తిరిగి దేవునిలోనికే చేరిపోవుచున్నది. అలా ప్రత్యేకమైన విధానముచేత ఆత్మలోనికి చేరిన పరమాత్మ అంశ, తాను జ్ఞానమును బోధించునపుడు తాను మనిషి శరీరములోనుండి బోధించుచున్నప్పటికీ, తాను పరమాత్మనేనని అవసరమునుబట్టి చెప్పగలదు. అవసరము లేకపోతే ఏమాత్రము బయట పడదు. అంతా ఆయన ఇష్టము. మనిషి అయిన కృష్ణుని శరీరమునుండి జ్ఞానమును బోధించునపుడు నేనే పరమాత్మనని కూడ దేవుడు తెలియజేశాడు. అది ఒక నిరూపణ నిమిత్తము తన విధానమును తెలియుటకు అలా తెలిపాడు. ద్వాపరయుగములో కృష్ణుని శరీరమునుండి తెలుపబడిన విషయమును బట్టి, దేవుడు మనిషిలో ఆత్మనుండి మాట్లాడగలడని రుజువు కాబడింది.


దేవుడు తన జ్ఞానమును ఐదువేల సంవత్సరముల పూర్వము ద్వాపర యుగమున శ్రీకృష్ణుని శరీరమునుండి బోధించాడు. తర్వాత కూడా ఒకమారు అదే విధముగా బోధించాడని తెలియుచున్నది. తర్వాత కూడా మరొక మారు బోధించవలసిన అవసరమున్నది. దేవుడు మూడుమార్లు భూమి మీదకు వస్తే ఆయన పూర్తిగా తన ధర్మములను బోధించినట్లగును. రెండు మార్లు తన ధర్మములను జ్ఞానరూపములో తెలిపినప్పటికీ, మానవులు వాటి వివరమును గ్రహించలేరు. కనుక మూడవ మారువచ్చి తాను చెప్పిన వాటికి పూర్తి వివరమును తెలియజేయును.


ఇప్పటి వరకు దేవుని ధర్మములు భూమిమీద రెండుమార్లు బోధించ బడినప్పుడు మనుషులే కాకుండా గ్రహరూపములో మరియు భూతముల రూపములోనున్న కొందరు విని, వాటిని భూమిమీద ముఖ్యమైన వ్యక్తులకు కొందరికి బోధించారు. అయితే వారు కొన్ని ధర్మములను చెప్పినప్పటికీ వాటి వివరము తమకు తెలియదనీ, వాటి వివరము దేవునికే తెలియునని చెప్పారు. దూత అని పిలువబడు భూతములు లేక గ్రహలచేత తెలుసుకొన్న వ్యక్తులు తాము విన్న బోధలను వక్తలుగా ఇతరులకు చెప్పినప్పుడు, వీటి అంతరార్థము భవిష్యత్తులో రాబోయేవారు తెలియగలరని చెప్పారు. దీనిని బట్టి దూతల ద్వారా విన్న వక్తలు కూడా కొన్ని వాక్యముల పరమార్థము తమకు తెలియదనియే చెప్పారని తెలియుచున్నది. ఈ విధముగా దేవుడే కాకుండా దేవుడు చెప్పినప్పుడు వినిన సూక్ష్మ (కనిపించని) గ్రహములు కూడా దూతల పేరుతో భూమిమీద అక్కడక్కడ కొందరికి తెలిపినట్లు అర్థమగుచున్నది.


ద్వాపర, కలియుగములలో దేవుడు కనిపించే మనిషినుండి రెండు మార్లు చెప్పినా, అదే జ్ఞానమునే కనిపించని గ్రహములు, దేవదూతలు అనుపేరుతో మనుషులకు చెప్పినా, చెప్పిన జ్ఞానమంతయు మతాలుగా మారిపోయినది. కానీ చెప్పబడిన జ్ఞానము యొక్క వివరము మాత్రము ఎవరికీ తెలియకుండాపోయినది. దేవుని జ్ఞానమును మాయ మతములుగా మార్చివేయడము వలన ఒకే దేవుని జ్ఞానము మతముల రూపములో వేరువేరుగా కనిపిస్తున్నది. అలా కనిపించుట వలన వేరువేరు మతములకు వేరువేరు దేవుడన్నట్లు ఆయా మతముల వారికి అర్థమైనది. ఈ విధముగా దేవుని జ్ఞానము మతములుగా చీలిపోయి ఒకే దేవుని జ్ఞానమే కొందరికి భగవద్గీతయనీ, కొందరికి బైబిల్‌ అనీ, మరికొందరికి ఖురాన్‌ అని తెలియ బడినది. అలాగైనప్పటికీ వారివారి గ్రంథములలోని వాక్యములకు అర్థము మాకు తెలియునని ఆయా మతములవారు అనుకొనినా, వాస్తవానికి వాటి పరమార్థము మాత్రము ఎవరికీ తెలియదు. భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ, ఖురాన్‌లోగానీ గల వాక్యములకు దేవుడే వివరము చెప్పవలసివున్నది. దేవుడు చెప్పిన జ్ఞానమును దేవుడే వివరించి చెప్పువరకు ఏ మతము వారికైనా వారి గ్రంథములలోని అంతరార్థము తెలియదు. నేటికాలములో కొన్ని మతములలోని పండితులు, స్వామీజీలు తమ గ్రంథముల జ్ఞాన వివరము అంతా తెలియునని చెప్పుచుండినా, సూటిగా వేయు ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తికమకపడుచుందురు. తమ లోపమును బయట పడకుండునట్లు తగిన ప్రయత్నములు చేయుచుందురు. కొందరు తమకు తెలిసినదే సత్యమని మొండిగా వాదించుచుందురు. అన్ని మతములలోను జ్ఞానులున్నా వారిది సరియైన జ్ఞానముకాదని అర్థమైపోయినది. అంతే కాకుండా అన్ని మతములలోను అజ్ఞానము తారా స్థాయికి పెరిగిపోయి, మతద్వేషములు ఎక్కువయిపోయి, ఒక మతమువారు మరొక మతము వారిమీదికి భౌతిక దాడులకు దిగుచున్నారు. ఒకరికొకరు ప్రాణాంతకముగా తయారైనారు. ఇటువంటి పరిస్థితి కొంతకాలముగా కొనసాగుచున్నది.


ప్రపంచములో ఎన్ని మతములుండినా అన్నిటికంటే ముందునుండి ఉన్న మతము ఇందూ (హిందూ) మతము. ఇందూ మతము అనునది సృష్ఠి ఆదిలో దేవుడు జ్ఞానమును బోధించినప్పటినుండి ఏర్పడినది. ఇందూ మతము ఎప్పుడు పుట్టిందో స్పష్టముగా చెప్పలేము. ఐదువేల సంవత్సరముల పూర్వము ద్వాపరయుగం చివరిలో కృష్ణుడు దేవుడు ఆదిలో చెప్పిన జ్ఞానమే చెప్పాడు. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానమే దేవుడు చెప్పిన జ్ఞానముగా ఉండినప్పటికీ, మాయ ప్రభావము చేత కొందరు మనుషులు వ్యాసుడు వ్రాసిన వేదములే గొప్పవని చెప్పడము జరిగినది. కొంతకాలమునకు కేరళ రాష్ట్రములో పుట్టిన ఆదిశంకరాచార్యులు దైవజ్ఞానమును అద్వైత సిద్ధాంత రూపముగా చెప్పడము జరిగినది. తర్వాత కొంత కాలమునకు తమిళనాడు రాష్ట్రములో పుట్టిన రామానుజాచార్యులు విశిష్ట అద్వైత (విశిష్టాద్వైత) సిద్ధాంతమును ప్రతిపాదించి చెప్పడము జరిగినది. ఆ కాలములో అద్వైతము వారూ, విశిష్టాద్వైతము వారూ ఒకరికొకరు మాది గొప్ప, మాది గొప్ప అని ఘర్షణపడినట్లు చరిత్ర కలదు. తర్వాత కొంత కాలమునకు కర్ణాటక రాష్ట్రములో పుట్టిన మధ్వాచార్యులు ద్వైతసిద్ధాంతమును ప్రతిపాదించాడు. ఆదిశంకరాచార్యులు కేవలము 32 సంవత్సరములు మాత్రము జీవించగలిగి, చిన్నవయస్సులోనే అద్వైతమును ప్రచారము చేయగా తర్వాత 197 సంవత్సరములకు వచ్చిన రామానుజాచార్యులు 120 సంవత్సరములు బ్రతకగలిగి, విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. తర్వాత 100 సంవత్సరములకు వచ్చిన మధ్వాచార్యులు 79 సంవత్సరములు బ్రతకగలిగి తన ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. మధ్వాచార్యుల తర్వాత 633 సంవత్సరములకు (1950) ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు జన్మించి 27 సంవత్సరముల వయస్సునుండి త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించి ప్రచారము చేయగలిగాడు. ఈ విధముగా ఇందూ (హిందూ) మతములో నలుగురు ఆచార్యులు దైవజ్ఞానమును వారి వారి సిద్ధాంతములను ఆధారము చేసుకొని బోధించారు.


ముఖ్యవిషయమేమనగా! శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వా చార్యుల సిద్ధాంతములు తెలియును, కానీ వారి వ్యక్తిగత జీవితములు నాకు తెలియవు. అయితే చివరి సిద్ధాంతకర్త అయిన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల యొక్క జీవితము పూర్తిగా నాకు తెలియును. ఎందుకనగా ప్రబోధానంద యోగీశ్వరులు అనబడు వ్యక్తి నాకు బాగా తెలుసు కనుక ఇంతవరకు ఏమి జరిగినది అన్నీ తెలియును. నాకు తెలిసి ప్రబోధానంద యోగీశ్వరులు సర్వసాధారణ మనిషి. బయట కనిపించే ఏ ప్రత్యేకతా ఆయనలో లేదు. అయితే ఆయన శరీరములో నివసించే ఆత్మ ఏదో ప్రత్యేకమైనదని చెప్పవచ్చును. ఒక ప్రక్క ఆయనకు తన ఆత్మ గొప్పదని అనిపించినా మరొక ప్రక్క అది నా భ్రమ అనుకొనేవాడిని. ఆయన ఆత్మ గొప్పదైతే ఆయన జీవితము సగటు మనిషికంటే హీనముగా ఎందుకు మొదలయింది? ఆయన ఎందుకు ఆర్థిక ఇబ్బందుల పాలైనాడు? ఎవరూ అతనికి విలువ నివ్వక హేళనగా ఎందుకు చూచేవారు? సమాజములో ఏ గుర్తింపూ లేని పూర్తి అజ్ఞానులైన తల్లితండ్రులకు ఎందుకు పుట్టాడు? ముఖ్యముగా ఆయన తల్లియే ఆయనను గురించి చెడుగా ఎందుకు చెప్పేది? ఆయన బంధువులు ఎవరితోను ఆయనకు ఎందుకు సంబంధములేదు? ఆయనను ఆయన బందువులు ఎగతాళిగ, చులకన భావముతో ఎందుకు మాట్లాడేవారు? యుక్తవయస్సులో ఆయనకు ఆమ్మాయినిచ్చే దానికి ఆయన కులస్థులు ఎందుకు వెనుకాడేవారు? చివరకు తెలివి తక్కువ అమ్మాయి మరియు మూర్చ రోగమున్న అమ్మాయిని ఎందుకు వివాహమాడవలసి వచ్చినది? అటువంటి భార్యకూడా ఆయనకు ఏమాత్రము విలువనివ్వకుండ మాట్లాడుచు ఆయనను వదలి ఎందుకు వెళ్ళిపోయింది? తన కులముకాని అమ్మాయిని అతను రెండవ భార్యగా చేసుకోవడమేమిటి? ఇప్పటికీ తల్లి ప్రక్క బంధువులుగానీ, తండ్రి వైపు బంధువులుగానీ, భార్యవైపు బంధువులు గానీ ఆయనతో ఎందుకు సంబంధము పెట్టుకోలేదు? ఆయనవద్దకు ఏ బంధువూ ఎందుకు రావడములేదు? ఇలా ప్రశ్నించుకొంటే ఎన్నో ప్రశ్నలు రాగలవు. ఇన్ని ప్రశ్నలను చూచిన తర్వాత ఆయనను ఎవరూ సమర్థించరు, శుద్ద పనికి మాలిన వానిక్రిందికి జమకట్టుదురు. ఇదంతయు ఒకవైపునుండి చూస్తే ఆయన సక్రమమైన మనిషి కాదు అని ఎవరైనా చెప్పగలరు.


మరొకవైపునుండి ఉన్న వాస్తవికతను చూస్తే ఆయనయందు ఏ లోపమూలేదు. ఆయన పుట్టినది ఏ గుర్తింపూలేని అజ్ఞానులకు, అంతేకాక తల్లిదొకదారి, తండ్రిదొకదారిగా బ్రతికేవారు. తల్లితండ్రులు తిండి కొరకే బ్రతికేదన్నట్లు ఏమాత్రము ముందు చూపులేకుండా తిండికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అటువంటి పరిస్థితిలో ఆయనకు యుక్తవయస్సు వచ్చేటప్పటికి ఏమాత్రము ఆస్తిలేనందువలన సమాజములో గౌరవము లేని స్థితి ఏర్పడినది. తల్లితండ్రులు పెద్దమ్మ అను గ్రామదేవతను ఇంటి దేవతగా పూజించేవారు. అందువలన అదే పేరునే పుట్టిన బిడ్డలకు పెట్టెడివారు. ఆ పద్ధతిలోనే నేడు ఆచార్య ప్రబోధానందయోగీశ్వరులుగా ఉన్న ఆయన అందరిచేత పెద్దన్నగా పిలువబడెడివాడు. పదహారు సంవత్సరముల వయస్సులోనే తల్లితండ్రులు విడిపోవడము వలన తల్లిని పోషించే బాధ్యత ఆయన మీదే పడింది. తల్లిని పోషిస్తూ 1969 మే నెలకు ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి (పదకొండవ తరగతి) ని పూర్తి చేయగలిగి, అదే సంవత్సరము బ్రతుకు తెరువు నిమిత్తము మిలిటరీలో ఒక భాగమైన ఆర్మీలో చేరి దాదాపు మూడు సంవత్సరములు అందులో చేయగలిగాడు. బ్రతుకుతెరువు కొరకు ఆర్మీలో పని చేయుచున్నప్పటికీ అక్కడ ఆఫీసర్‌లతో సమానముగా ఆఫీస్‌లోనే పని ఉండేది. అక్కడి ఆఫీసర్‌లందరు ఎంతో పరిచయముగా ఉండేవారు. అటువంటి స్థితిలో పెద్దన్న అను ఆయన అప్పుడప్పుడు దైవజ్ఞానమును గురించి అక్కడి అధికారులకు సమయము దొరికినప్పుడంతా చెప్పెడివాడు. ఆ సందర్భములో ఈ ఉద్యోగము నాకు సరిపోదు, నేను బయటి మనుషులలో ఉండి వారికి ఎంతో జ్ఞానము చెప్పవలసివుంది అని చెప్పెడివాడు. ఆ రెజిమెంట్‌లో ఉన్న అధికారులు ఆ మాటకు స్పందించి ఆయనను ఆర్మీనుండి బయటకు పంపించడము జరిగినది.


ఉద్యోగము వదలి బయటికి పోతే ఎలా బ్రతుకుతావు అను ప్రశ్న ఒకటి వేధిస్తున్నా, దానికి సమాధానమును వెదకకుండానే ఉద్యోగము నుండి బయటికి వచ్చి ఎంతో శ్రమపడవలసివచ్చినది. కర్నాటకలో ఒక సంవత్సర కాలము వ్యవసాయము చేయవలసివచ్చినది. తర్వాత తప్పనిసరిగ ప్రవేట్‌ కంపెనీలో క్లర్క్‌ ఉద్యోగమును చేయవలసివచ్చినది. మనస్సుకు నచ్చని పని అయినందున దానిని కూడా ఆరునెలలకే వదలివేయడము జరిగినది. తర్వాత ఒకవైపు తల్లిని పోషిస్తూ, వైద్య వృత్తిని చేస్తూ ప్రజలతో సంబంధము ఏర్పరుచు కొని వచ్చిపోయేవారికి కొంత జ్ఞానమును చెప్పేవాడు. ఆయనవద్ద ఎంత పెద్ద రోగములైనా సులభముగా నయమైపోయేవి. వైద్యవృత్తితో అంతో ఇంతో డబ్బు వచ్చేది, ఆ సందర్భములో వచ్చినవారికి రోగములు కర్మలనుబట్టి వస్తాయని జ్ఞానమును చెప్పుటకు అవకాశము ఉండేది. తనకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా జీవితము మాత్రము సుఖముగా సాగి పోయేది. ఆయన ఎంత సుఖముగా బ్రతికినా, ఎంత తెలివిగలవాడైనా ఆయన కులమువారు ఆయనను ఆస్తిలేనివాడని హేళనగ చూచెడివారు. ఒక విధముగా సమాజములో ఆస్థిలేనివాడైనా ధైర్యముగా బ్రతికెడివాడు. ఎక్కడా నేర్వకనే ఆయనకు వైద్యము, జ్యోతిష్యము వచ్చెడివి. వాటితో ప్రజల సంబంధము ఏర్పరుచుకొని ఎన్నో వైద్యములను చేయడము జరిగినది. ఆయనకు నేను ఏమీ తెలియనివాడిని కదా! అని ఒక ప్రక్క అనిపిస్తున్నా, ఒకప్రక్క అన్నీ తెలిసినవాడిగా అప్పటికప్పుడు వచ్చిన యోచన ప్రకారము వైద్యము చేసెడి వాడు. దానితో ఎక్కడా నయముకాని రోగములు బాగైపోయేవి. అలాగే ఎవరైన జ్యోతిష్యమును గురించి అడిగితే తాను ఏమి చెప్పితే అదే జరిగేది. ఇట్లు తక్కువ కాలములోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇది బ్రతుకు తెరువే అయినా తనకు ఆ పని నచ్చక తాను ఆ వృత్తిని చేయకుండా ఇతరులచేత చేయించెడివాడు. ఆ సమయములోనే ప్రబోధ అను గ్రంథమును వ్రాసి తనకు పరిచయమున్న ఒక ఆశ్రమములోని స్వామీజీకి చూపడము జరిగింది. ఆ స్వామిజీ దానిని చూచి ఆశ్చర్యపోయి ఇంతటి జ్ఞానమున్న వానికి గురువు తప్పకుండా ఉండాలి, నేను ఉపదేశమిస్తాను తీసుకోమన్నాడు ఆ స్వామిగారు ఒక మంత్రమును చెప్పి అదే ఉపదేశమన్నాడు. అంతేకాక నీకొక పేరును పెట్టుతానని చెప్పి, ప్రబోధానందా అని చెప్పడము జరిగినది. తల్లితండ్రులు పెట్టినపేరు పెద్దన్న అయితే ఆధ్యాత్మికములో గురువు పెట్టిన పేరుగా ఈ పేరునుంచుకోమని చెప్పడము జరిగినది.


అప్పటినుండి పెద్దన్న అను పేరు పూర్తిగా లేకుండా పోయినది. ప్రపంచ వ్యవహారములలో గుత్తా ప్రబోధానంద చౌదరిగా వ్యవహరించగా ఆధ్యాత్మిక విద్యలో ప్రబోధానందగా ప్రారంభమై తర్వాత కొంత కాలమునకు ప్రబోధానంద యోగీశ్వరులుగా చెప్పబడినది. ఒక స్వామివద్ద మంత్రో పదేశమును తీసుకొనినా, ఆ మంత్రమును ఆయన ఎన్నడూ జపించలేదు. మంత్రములు ఉపదేశములుకావు అని ముందునుంచి చెప్పుచున్న ఆయన గురువు పెట్టిన పేరును తీసుకొన్నాడుగానీ, మంత్రమును తీసుకోలేదు. ఆయన వైద్య వృత్తి ద్వారా ప్రజలలో కొంత పేరును సంపాదించుకొనినా సాటి కులములోగానీ, సాటి బంధువులలోగానీ ఏమాత్రము గుర్తింపు లేకుండెడిది. తన 25 సంవత్సరము నుండి వైద్యవృత్తిని చేయడముగానీ, జ్యోతిష్యమును చెప్పడముగానీ చేయలేదు. ఒకే ఒక దైవజ్ఞానమును తప్ప దేనినీ చెప్పనని అనుకొన్నాడు. అప్పటినుండి ఎవరికైనా ప్రాణాపాయస్థితిలో వైద్య సలహాను చెప్పాడుగానీ, వైద్యమును చేయలేదు. అలాగే జ్యోతిష్యము తెలిసినా ఎవరికీ చెప్పలేదు. తనకు ఎన్నో విద్యలు తెలిసినా ఏ విద్యనూ వాడుకోక సర్వసాధారణముగా బ్రతుకుచూ ఎవరి నుండి డబ్బును ఆశించక, జ్ఞానమును గ్రంథరూపములో వ్రాస్తూ తనకు తెలిసిన వ్యాపారములను చేస్తూ చేయిస్తూ కాలమును సాగించెడి వాడు. మనుషులలో సామాన్య మనిషిగా, ఏ గుర్తింపూ లేకుండా బ్రతుకుచూ ఆయన వ్రాసిన గ్రంథములలో కొన్ని సందర్భములలో ప్రబోధానంద యోగీశ్వరులుగా తన పేరును వ్రాయడము జరిగినది. కొంత కాలమునకు భగవద్గీత గ్రంథమును వ్రాయపూనినపుడు తనపేరు ముందర "త్రైత సిద్ధాంత ఆదికర్త" అని వ్రాయడమైనది. అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరాచార్యుడు ప్రకటించినట్లు, రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రకటించినట్లు, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతమును ప్రకటించినట్లు, ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ప్రకటించాడు. త్రైత సిద్ధాంతమును ఆధారము చేసుకొని భగవద్గీతను త్రైత సిద్ధాంత భగవద్గీతగా వ్రాయడము జరిగినది.


సాధారణ మనిషిగా జీవమును సాగించు ప్రబోధానంద సమాజములో సామాన్య మనుషులలో ఏ గుర్తింపూ లేకుండా బ్రతుకు చుండెను. అందువలన సామాన్య మనుషులు ఆయనను సర్వ సాధారణముగా చూచినా, కనిపించని దయ్యాలు, దేవతలు ఆయనను గొప్పగ చూచెడివి. ఆయన మాటను గౌరవించేవి. త్రైత సిద్ధాంత భగవద్గీత ఆయన ఐదవ రచనగా వచ్చింది. అప్పటికే ఆయన ఫోటో ముందర కూర్చున్న వారికి కొన్ని రకముల రోగములు పోయేవి. ఇతరులలోనికి పూనకము వచ్చిన దేవతలు సహితము ఆయనకు నమస్కరించి మాట్లాడేవారు. చెప్పినమాట వినేవారు. బయటికి ఇదొక వింతగా ఉండినా ప్రబోధానంద మాత్రము తనను సాధారణ మనిషిగానే లెక్కించుకొనేవాడు. ఆయన ముఖ్యముగా ఒక మాట చెప్పెడివాడు. అదేమనగా "నేను చెప్పునది భూమిమీద ఇంత వరకు ఎవరూ చెప్పనిదిగా ఉంటుంది. అలాగే నేను వ్రాయునది ఇంతవరకు భూమిమీద ఎవరూ వ్రాయనిదిగా ఉంటుంది." నిజముగా ఆయన చెప్పే జ్ఞానముగానీ, వ్రాసే వ్రాతగానీ ఎవరిచేతా తెలియబడనిదిగా ఉంటుంది. దీనిని ఇంతటి రహస్యమును మీరు ఎలా చెప్పగలుగుచున్నారని ఎవరైనా అడిగితే, వ్రాసేదిగానీ, చెప్పేదిగానీ నేను కాదు నాకు తోడుగా ఉన్న ఆత్మ అని చెప్పేవాడు. అన్ని పనులు ఆత్మే చేయుచున్నదని అందరికీ చెప్పేవాడు.


త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అను పేరుతో త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక విద్యలో ఎన్నో రహస్యములను చాలా గ్రంథముల రూపముతో వ్రాయడము జరిగినది. గ్రంథములను చదివిన వారు అందరూ ఇవి చాలాగొప్ప గ్రంథములనీ, ఇంతవరకు మాకు తెలియని జ్ఞానము తెలిసినదనీ చెప్పెడివారు. చదవని వారు త్రైత సిద్ధాంతము అంటూనే ఇదేదో క్రైస్తవులకు సంబంధించినదని అసూయగా చూడడమేకాక, ప్రబోధానంద యోగీశ్వరులను క్రైస్తవ బోధ చేయుచున్నావా అని నిందించెవారు. ఇంకా కొందరు హిందువుల ముసుగులో క్రైస్తవమతమును ప్రచారము చేయుచున్నారని ఆరోపించేవారు. విశ్వహిందూ పరిషత్‌లాంటి హిందూమతసంస్థల మనుషులు చాలామార్లు ప్రబోధానంద శిష్యులమీద దాడి చేయడము కూడా జరిగింది. ఈ గ్రంథములు దేనికి సంబంధించినవని చూడకుండానే భగవద్గీత అని పేరున్న త్రైత సిద్ధాంత భగవద్గీతను కూడా అగ్గిపెట్టి కాల్చడము జరిగింది. ఇలాంటి చర్యలను చూచిన ప్రబోధానంద ‘‘నేను చెప్పితేనే హిందూధర్మములేవో తెలియ బడేది. అటువంటి హిందూధర్మములున్న గ్రంథములను కాల్చువారు హిందువులా? వీరికి పెద్ద పాపమే చేరింది. అది ఒక జన్మతో అయిపోదు’’ అన్నాడు. ప్రపంచములోని మనుషులు కొందరు మాత్రమే ఆయన జ్ఞానమును చూచి ప్రశంసించి అనుసరించుచుండగా, కొందరు మాత్రము మతములను అడ్డము పెట్టుకొని మాట్లాడడము ఆయనకు కొంత ఇబ్బంది కరముగా తోచినది.


ఒక మనిషిగా ఆయనను ఆలోచింప చేసినది. ఇంత మూర్ఖులకు నేనెందుకు జ్ఞానము చెప్పాలి? నేను కూడా అందరివలె బ్రతుకవచ్చును కదా! నేను బయట వ్యాపారములలో సంపాదించిన సొమ్మునంతటిని ఖర్చుచేసి ఎవరి చేతినుండి డబ్బును ఆశించక కృష్ణమందిరమును కట్టించి నప్పటకీ, ఎన్నో గ్రంథములు వ్రాసి జ్ఞానమును తెలియజేసినప్పటికీ, అందరి స్వాములవలె డబ్బుకోసమే ఇదంతా చేస్తున్నాడను మనుషుల కొరకు ఎందుకు చేయాలి? నా మంచితనమును ఇటు బంధువులుగానీ, కులస్థులుగానీ, బయటవారుగానీ ఏమాత్రము గ్రహించక నీచముగా, హేళనముగా మాట్లాడునప్పుడు అందరికీ అవసరమైన దానిని నేనెందుకు చేయాలి? అనుకోవడము జరిగినది. ఒక సాధారణ మనిషికి వచ్చే ఆలోచనే ఆయనలో వచ్చినా కొన్ని సందర్భములలో అన్నిటిని మరచిపోయి జ్ఞానమును చెప్పెడివాడు. అప్పటినుండి హిందువులకే కాకుండా, ఇటు క్రైస్తవులకు అటు ముస్లీమ్‌లకు కూడా జ్ఞానమును చెప్పెడివాడు. ఇలా ప్రబోధానంద చెప్పే జ్ఞానము క్రైస్తవులకు, ముస్లీమ్‌లకు బాగా నచ్చేది. ముస్లీమ్‌లు వచ్చినపుడు ఖురాన్‌ గ్రంథములోని వాక్యములకు సరిపోయే జ్ఞానమూ, క్రైస్తవులు వచ్చినపుడు బైబిలులోని వాక్యములకు సరిపోవు జ్ఞానమును చెప్పెడివాడు. ఒకవైపు అలా జరుగుచున్నా ఒకవైపు నేనెందుకు ఇతర మతముల వారికి జ్ఞానమును చెప్పాలి? అను ప్రశ్న వచ్చేది. ఆయన గ్రంథములు చదివిన హిందువులు కొందరు ఈయన నిజముగా దేవుడే అని అనగా, ఆయన బోధలు వినిన క్రైస్తవులు, ముస్లీమ్‌లు గొప్పగా చెప్పుకొనెడివారు. అయితే ప్రబోధానంద అప్పుడప్పుడు ఇలా ఆలోచించేవాడు. ‘‘సంస్కృతము ఏమాత్రము రానినేను శంకరాచార్యులు వలె సిద్ధాంతకర్తనా? అని అనుకొనెడివాడు. ఒక సాధారణ మనిషి యోచించునట్లు అజ్ఞాన పొరలు క్రమ్ముకోగా ‘‘ ఏ జ్ఞానమూ తెలియని నేను జ్ఞానము చెప్పడమేమిటి? ఏమీ తెలియని వారు నన్ను మెచ్చు కోవడమేమిటి? ఇదంత తెలివి తక్కువ’’ అని అనుకొనెడివాడు. అంతలోనే జ్ఞానము తనకు మతికి వచ్చి ‘‘చెప్పేవాడిని నేను కాదు కదా’’ అని తలచే వాడు. ఇటువంటి ఘర్షణ అప్పుడప్పుడు జరుగుచుండేది.


ఇటువంటి సందర్భములో హిందువులమనీ, హిందూ ధర్మ రక్షకుల మనీ పేరుపెట్టుకొన్న వారు త్రైతసిద్ధాంతమును క్రైస్తవములోని త్రిత్వముగా భావించి ప్రబోధానంద యోగీశ్వరులను హిందూ ముసుగులో నున్న క్రైస్తవుడనీ, క్రైస్తవమతమును ప్రచారము చేయుచున్నాడని నిందించడ ము జరిగినది. దానికి స్పందించిన ప్రబోధానంద ఇకమీదట ఎవరికీ జ్ఞానమును చెప్పకూడదనుకొన్నాడు. నేను మనుషుల మంచిని కోరి ఎంతో వివరముగా ఇందుత్వము (హిందుత్వము) లోని ఆత్మజ్ఞానమును బోధించితే, పరాయి మతమని కొందరనుకోవడము వలన తాను జ్ఞానమే చెప్పకుండా అందరివలె సాధారణముగా ఉండవలెనని అనుకొన్నాడు. ఒకప్రక్క ఎవరో అజ్ఞానులు అనుకొను మాటలను ఎందుకు పట్టించుకోవాలి, నేను మతము అను పేరుతో ఏ బోధలు చెప్పలేదు కదా! నేను చెప్పునది స్వచ్ఛమైన దైవజ్ఞానము కదా! అని అనుకొనెడివాడు. ఈ విధమైన ఆలోచనలలో ఆయనయందు కొంత స్తబ్దత ఏర్పడినది. ఆయన మొదట ప్రబోధ గ్రంథమును వ్రాసిన తర్వాత, ఒక స్వామీజీవద్ద మంత్రోపదేశము పొంది ప్రబోధానంద అను పేరును పొందిన తర్వాత, 1980వ సంవత్సరము ప్రబోధాశ్రమమును స్థాపించియుండెను. హిందూపరిషత్‌లోని అజ్ఞానులు కొందరు ఆరోపణలు చేయడముతో ప్రబోధాశ్రమము అను పేరునే తీసి వేయాలనుకొన్నాడు. ఆ సమయమలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞానములో ‘‘ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానము కలది’’ అను వాక్యమున్నట్లు వీరనారాయణరెడ్డి అను వ్యక్తి ద్వారా తెలిసింది. అప్పుడు అంతపెద్ద యోగీశ్వరులైన వీరబ్రహ్మముగారే, ఆయన వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమును గురించి అంతగొప్పగ మూడు వందల సంవత్సరముల క్రితమే వ్రాసియుంటే ఏమాత్రము హిందుత్వ జ్ఞానము తెలియని వారు మేము హిందువులమని పేరు పెట్టుకొని అజ్ఞానముగా మాట్లాడితే వారి మాటలను ఎందుకు లెక్కించుకోవాలనుకొన్నాడు. తర్వాత ప్రబోధానంద యోగీశ్వరులే స్వయముగా బ్రహ్మముగారు వ్రాసిన ఏష్య కాలజ్ఞానమను గ్రంథమును చూడడము జరిగినది. అందులో ప్రబోధానంద యోగీశ్వరులు నమ్మలేని నిజమొకటి కనిపించింది. అది ఏమనగా! ప్రబోధాశ్రమాధిపతి శయనాధిపతి గుణములు కలిగియున్నాడనీ, శయనాధిపతియే ఆనంద గురువనీ, ఆనందగురువే మీకు నాకు గురువని వ్రాయబడి ఉన్నది. అంతేకాక ఇంకా చాలా విషయములు ఆనందగురువు అనే పేరుతో వ్రాయబడి ఉన్నాయి. బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో చెప్పిన గురువు తానేయని ప్రబోధానంద గారికి అర్థమైపోయినది.


శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన విషయములన్ని తనను గురించేనా అని ఒకప్రక్క యోచనరాగా, తనను గురించేనని మరొక ప్రక్క యోచన వచ్చేది. అప్పటికీ ప్రబోధానంద యోగీశ్వరుల దగ్గర దేవతలు సహితము మాట విని పోవడమూ, ఆయన నోటిమాటతో కొన్ని భయంకర మైన రోగములు, కాన్సర్‌, ఎయిడ్స్‌లాంటి రోగములు నయమైపోవడమూ జరగడము వలన కొందరి దృష్ఠిలో ఆయన కొంత గుర్తింపుకు వచ్చాడు. ఆయన మాత్రము తనకు ఏ గుర్తింపు లేకుండా సాధారణముగ ఉండవలెనను కొనెడివాడు. ఆయనకు సాటిరాని సాధారణ మనుషులు ఆయనును గురించి ఆసూయతో దూషణగా మాట్లాడినా, ఆ సమయములో అక్కడ ఎవరైనా దేవతలుండివుంటే వారి మాటలను విని ఆయనను దూషించినందుకు ఆ దేవతలు మనుషులమీద కోపగించుకొని వారిని హింసించిన సంఘటనలు కొన్ని ఉండగా, ఏకంగా దేవతలు వారిని చంపివేసిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటువంటి విషయములు తెలిసిన యోగీశ్వరులు తాను బ్రహ్మముగారు చెప్పిన వ్యక్తినేనని అనుకొనెడివాడు. అంతలోనే మరియొక విధమైన యోచనతో అంతటి గొప్ప వ్యక్తినయితే ఇలా ఎందుకుంటాను. నాకంటే అజ్ఞానులే అన్ని విధముల యోగ్యతగా, ధనికులుగా, పేరు ప్రఖ్యాతులుగాంచినవారుగా ఉన్నారు కదా! అటువంటి వారిముందర నేనెంతటివాడిని? నాకు కొన్ని సంవత్సరములనుండి సుగర్‌ వ్యాధి ఉన్నది. మందులు ఎన్నివాడినా తగ్గకుండా ఎప్పుడూ 300 లేక 350 పాయింట్స్‌కంటే ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అందరికున్నట్లే నాకు కొన్ని సమస్యలుకలవు. అందరిలా సర్వ సాధారణముగానున్న నాకు బ్రహ్మముగారు చెప్పిన మాటకు పోలికలు లేవు. కావున బ్రహ్మముగారు చెప్పిన వ్యక్తి మరొకరుండవచ్చును. నేనుమాత్రము కాదు అని అనుకొనెడి వాడు. ఆయన చెప్పిన జ్ఞానము ఆయనకు జ్ఞప్తికి వచ్చినప్పుడు నేను ఒక జీవున్ని మాత్రమే, అన్నిటికీ కారణము ఆత్మేనని అనుకొనెడివాడు.


అప్పటికే ప్రబోధానంద యోగీశ్వరుల వారు ముప్పైఆరు (36) గ్రంథాలను వ్రాయడము జరిగినది. తర్వాత ఇస్లామ్‌ మరియు క్రైస్తవ గ్రంథములని పేరుగాంచిన ఖురాన్‌, బైబిలు గ్రంథములు, దైవవాక్కులున్న గ్రంథములని వాటిలోని పరమార్థమును ఆయా మతముల వారు గ్రహించ లేదనీ, ఇంతవరకు వారికి తెలిసినది సరియైన భావముకాదనీ, వాటి వివరములను నా గ్రంథములైన "ఖురాన్‌లోని పవిత్ర వాక్యములు" మరియు "బైబిలులోని పవిత్రవాక్యములు" అను వాటిలో చెప్పబడుతాయని ఆయన చెప్పడము ఆయనకే ఆశ్చర్యమైనది. ఆయా మతములలో ఎంతోమంది మతపండితులు, వారి వారి జ్ఞానమందు ఆరితేరిన వారుండగా, వారిని ఆతిక్రమించి వారికి దేవుని వాక్యముల పరమార్థము తెలియదనీ, నేను తప్ప ఎవరూ చెప్పలేరని ప్రకటించడము ఆయనకే వింతగా త్రోయడముకాక ఇదెలా సాధ్యము అనిపించింది. ఎటువంటి పరిచయములేని ఇతర మత గ్రంథముల వివరము చెప్పుతానని అనుకోవడము తనలోని గర్వము తప్ప ఏమీకాదనీ, అలా చెప్పడము పూర్తి అసాధ్యమనీ, మాయ (సాతాన్‌ లేక సైతాన్‌, (ఇబ్లీస్‌) అనునది అలా అనిపించుచున్నదనీ ఆయన అనుకోవడము జరిగినది. ఎవరైనా తన మాటలను వింటే నవ్విపోతారని అనుకొన్నాడు. ఒకవైపు ప్రపంచములో ఎక్కడాలేని ఆత్మజ్ఞానమును శాస్త్రబద్దముగా చెప్పుచున్నప్పటికీ తన సిద్ధాంతము ప్రకారము అంతా ఆత్మే చేయుచున్నదని తనను తాను పూర్తి తగ్గించుకొనెడివాడు.


ఆత్మజ్ఞానము ప్రకారము ప్రబోధానంద తాను ఏమీ చేయలేదనీ, తాను ఏ గొప్పతనము లేనివాడిననీ, తనలో ఏ ప్రత్యేకతా లేదని చెప్పడము వాస్తవమే, అయినా ప్రపంచములో అందరికీ ఆ విషయము తెలియదు కదా! అందువలన పైకి కనిపించే ప్రబోధానంద యోగీశ్వరులే అన్నీ చేయుచున్నాడని అనుకోవడము జరుగుచున్నది. ఆయనే వ్రాయుచున్నాడనీ, ఆయనే బోధించుచున్నాడనీ అనుకోవడము వలన జ్ఞానము అర్థముకాని మనుషులు అన్నిటికీ ఆయననే బాధ్యున్ని చేసి తమకు వ్యతిరేఖమైన జ్ఞానమును చెప్పుచున్నాడని అనుకోవడము కూడా జరిగెడిది. అధర్మవరులకు ధర్మవరులు వ్యతిరేఖమే కదా! శరీరమే తాము అనుకొను మనుషులందరూ కనిపించే శరీరముతోనున్న ప్రబోధానందను తమవలెనున్న మనిషిగా లెక్కించుకోవడము జరిగినది. దానివలన చేసేది ఆత్మ, అనుకొనేది నన్ను అనే తపన ప్రబోధానందలో ఉండేది. ఇలా ఎందుకు జరగాలి అను ప్రశ్న ఆయనకుండేది. ఈ ప్రశ్న ఆయనదే కాదు ప్రజల తరపున అందరిది అనుకొందాము. దానికి అందరికి అర్థమయ్యేలాగున దేవుడే జవాబు చెప్పాలి. ఈ జవాబు తప్పనిసరిగా ప్రబోధానంద యోగీశ్వరులకు మరియు ప్రజలకు తెలియాలి. కావున దేవుడు తన విధానమును అనుసరించి ప్రబోధానంద యోగీశ్వరుల హృదయమునుండి తెలియజేయడము జరిగినది. ప్రబోధానంద హృదయమునుండి ఏమి తెలియబడిందో ప్రజలకు కూడా తెలియాలి, కావున వివరముగా తెలియజేస్తాను చూడండి. ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును, అదేమనగా! ప్రబోధానంద హృదయములో తెలుప బడినది ఆయనకు మాత్రమే తెలుసుకదా! ఆయన తెలియజేస్తేనే కదా మిగతా ప్రజలకు తెలిసేది. ఆయన చెప్పకుండా మీరెలా ఆ విషయమును తెలియజేయుచున్నారని అడుగవచ్చును. దానికి నా సమాధానమును క్రింద చూడండి.


ప్రబోధానంద యోగీశ్వరులు అనుపేరుగల వ్యక్తి యొక్క శరీరములో ప్రకృతి (స్త్రీ) సంబంధమైన భాగములు కాకుండా, పరమాత్మ (పురుష) సంబంధమైన భాగములు మూడుకలవు. ఆ మూడులో ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మ. ఆ శరీరములో జీవాత్మగయున్న ప్రబోధానంద అనబడు వానిని నేనే, కనుక ఆ శరీరములోని పరమాత్మ ఆత్మచేత ఏమి చెప్పించినది ముందు నాకే తెలిసింది. ఇప్పుడు నేను చెప్పితే మీకు తెలియగలదు అని మీరు అనుకోగలరు వివరముగా చెప్పాలంటే ప్రబోధానంద యోగీశ్వరులుగా బయట ప్రజలకు నేనే లెక్కించబడుచున్న నేను కేవలము జీవాత్మనే అయినా, ప్రబోధానంద యోగీశ్వరులుగా ఇంతవరకు మాట్లాడినది నేనే అనుకొనినా ఇప్పుడునుండి మాట్లాడునది పరమాత్మ అంశతో కూడుకొన్న లేక పరమాత్మ ఆజ్ఞతో కూడుకొన్న ఆత్మయని తెలియవలెను.


ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టిన సంవత్సరము యొక్క పేరు వికృతి నామసంవత్సరము. ప్రకృతికి వికృతి విభిన్నమైనది. ఒక లెక్క ప్రకారము చెప్పితే ప్రకృతి అంటే మాయ, వికృతి అంటే మాయకంటే విభిన్నమైన దేవుడు అని అర్థము. దైవమునకు గుర్తుగా పిలువబడు వికృతి నామ సంవత్సరములో పుట్టడమే ప్రబోధానంద యోగీశ్వరులకు ఒక ప్రత్యేకతయని తెలియాలి. ఇప్పటికి వికృతి నామసంవత్సరము రెండవమారు వచ్చి దాని తర్వాత ఖర నామ సంవత్సరమూ, దాని తర్వాత నందన నామ సంవత్సరము వచ్చినది. రెండవమారు వచ్చిన వికృతి 61వ సంవత్సరమున కాగా, ఖర 62వ, సంవత్సరమైనది. ప్రస్తుతము జరుగుచున్న నందన సంవత్సరము 63వ సంవత్సరము. అందువలన ఇప్పుడు ప్రబోధానంద యోగీశ్వరుల యొక్క వయస్సు 62 అయిపోయి 63వ సంవత్సరము జరుగుచున్నది. ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానము అను అర్థమునిచ్చు ఇందూమతములో (హిందూమతములో) పుట్టడము జరిగినది. ప్రత్యేకమైన పూర్వ చరిత్రయున్న కమ్మకులమున పుట్టడమైనది. కమ్మ కులములో ఎన్నో ఇంటిపేర్లు (వంశము పేర్లు) ఉన్నా ప్రత్యేకించి గుత్తా వంశములోనే పుట్టడము జరిగినది. ప్రబోధానంద పుట్టిన సంవత్సరమూ, పుట్టిన మతమూ, పుట్టిన వంశమూ, పుట్టిన కులమూ అన్నీ ఒక విధముగా ప్రత్యేకత కలిగినవేనని చెప్పవచ్చును. ఆయన పుట్టినప్పటికే సంవత్సరము పేరూ, వంశముపేరూ రెండూ మార్పు చెందకుండా ఉండగా, మతము, కులము యొక్క పేర్లలో కొంత మార్పు జరిగినది. జ్ఞానుల మతమను పేరుగలదీ, శివుడు ధరించిన చంద్రవంక పేరుగలదీ అయిన ఇందూమతము ఏ అర్థమూ లేని హిందూ మతముగా మారిపోయినది. అలాగే ఎంతో ప్రేమతో ఆదరించి అన్నము పెట్టు అమ్మ కులముగా పేరుగాంచిన కులము కమ్మకులముగా మారిపోయినది. కులము, మతములు మధ్యలో పుట్టుకొచ్చినవైనా, వంశము అనునది ఆదిలోనే ఏర్పరచ బడినది. ప్రబోధానంద జీవితము దైవాంశగల ఆత్మతో కూడుకొన్నది, కావున ఆయన ప్రత్యేకించి గుత్తావంశములో పుట్టడము జరిగినది. ఇప్పుడు గుత్తా అను పేరులోగల విశిష్టతను గురించి తెలుసుకొందాము.


ఈ పుస్తకము మొదటిలోనే ‘‘గు’’ అను అక్షరమును గురించి చెప్పడము జరిగినది. ‘‘గు’’ అనగా రహస్యమనీ, రహస్యమైనది దైవమనీ, పరమాత్మను (దైవమును) తెల్పు గుర్తుగా ‘‘గు’’ను వాడుచున్నామని చెప్పు కొన్నాము. దేవుడు మూడు ఆత్మలుగా విభజింపబడినాడని భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తియోగమను అధ్యాయమున 16, 17 శ్లోకములలో చెప్పబడినది. దేవుడైన పురుషుడు ఆధ్యాత్మిక జ్ఞానములో ముగ్గురు పురుషులుగా చెప్పబడుచున్నాడు. ఆదియందు మొదట పరమాత్మనుండి ఆత్మ ఉద్భవించగా, తర్వాత జీవాత్మ ఉద్భవించినది. ప్రపంచములో జీవాత్మ, ఆత్మలు జోడు ఆత్మలుగా శరీరమందు ఉండగా, పరమాత్మ ప్రత్యేకముగా ఉన్నాడు. సాధారణ మనిషిలో జీవాత్మ, ఆత్మలు రెండూ పుట్టడము చావడము జరుగుచున్నది. పరమాత్మ మాత్రము పుట్టువాడు కాదు, గిట్టువాడు కాదు. జీవరాసుల శరీరములో లేక మనుషుల శరీరములో పరమాత్మ, ఆత్మ జీవాత్మలతో ఎటువంటి సంబంధములేకుండా ఉన్నాడు. జీవుని కర్మానుసారము ఆత్మ శరీరమును ఆడించుచుండగా, శరీరములో సంభవించు కష్టసుఖములను జీవుడు (జీవాత్మ) అనుభవించుచున్నాడు. ప్రతి మనిషిలోను అలాగే ప్రతి జంతువులలోనున్న జీవాత్మకు ఆత్మతోడుగా ఉండి, జీవాత్మ ఆత్మ ఒకదానితో ఒకటి సంబంధపడివున్నవి. మూడవదైన పరమాత్మ శరీరములో ఉన్నప్పటికీ జీవాత్మ ఆత్మతో ఎటువంటి సంబంధము లేకుండా ఉండడమేకాక శరీరమునుండి ఆత్మ, జీవాత్మలు పోయి మరణమును పొందినప్పటికీ, మృతదేహములో కూడా పరమాత్మ వ్యాపించియున్నది. ఇకపోతే పరమాత్మ అంశతో కూడుకొన్న శరీరములో ఆత్మ పరమాత్మతో సంబంధపడివుండును. ఆత్మ ఒకప్రక్క శరీరములోని పరమాత్మతో సంబంధము పెట్టుకొని, మరొక ప్రక్క జీవునితో కూడా సంబంధపడి శరీరమును నడుపుచున్నది. అటువంటి శరీరముగల వ్యక్తిది ప్రత్యేకమైన జన్మయని అనవచ్చును. ఆ శరీరములోనున్న ఆత్మ సర్వసాధారణముగా శరీరమును నడుపుచూ జీవునికి కష్టసుఖములను అందించుచుండును. అటువంటి స్థితిలో ఆ వ్యక్తిది ప్రత్యేకమైన జన్మ అని ఎవరికీ గుర్తింపు లేకుండా పోవును. బయటి శరీరమును సర్వసాధారణముగా నడిపించు ఆత్మ పరమాత్మతో సంబంధపడి ఉండడము వలన, పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశ ఆత్మతో కూడివుండుట వలన, పరమాత్మ జ్ఞానమును ఆత్మ శరీరము ద్వారా తెలియజేయుచున్నది. పరమాత్మ జ్ఞానము పరమాత్మకు తప్ప ఆత్మకు కూడా తెలియదు. అందువలన అన్ని శరీరములలోనున్న ఆత్మ దేవుని జ్ఞానమును చెప్పడములేదు. ఒక్క పరమాత్మ అంశ కల్గిన ఆత్మమాత్రము దేవుని జ్ఞానమును తెల్పుచున్నది. దేవుని అంశ కలిగియున్న ఆత్మకూడా ఒక శరీరములో ఉండుట వలన ఆ శరీరమునుండి దైవజ్ఞానము వెలువడుచున్నది. ఏ శరీరములో ఏ ఆత్మ నివసించుచున్నదీ ఎవరికీ తెలియదు. కావున ఫలానా శరీరమునుండి చెప్పబడునదియే నిజమైన దైవజ్ఞానమని ఎవరూ కనుగొనలేరు. పరమాత్మ అంశతో కూడిన ఆత్మ ధరించిన శరీరము భూమిమీద అరుదుగా పుట్టుచుండును.


దైవాంశగల శరీరములో ఆత్మ, జీవాత్మ మరియు పరమాత్మ ఉండినప్పటికీ, ఆ శరీరము సర్వసాధారణముగా కనిపించినప్పటికీ, మీకు తెలియని ప్రత్యేకత ఆ శరీరమునకున్నది. సాధారణ మనిషి జన్మించినపుడు శిశుశరీరము తల్లిగర్భమునుండి పుట్టిన తర్వాత, కదలికలేని శిశుశరీరము లోనికి ఆత్మ జీవాత్మతో పాటు వచ్చిచేరును. ఒక ప్రదేశములో మరణించిన జీవుడు ఆత్మతోసహా కలిసివచ్చి అప్పుడే పుట్టిన శిశువులో చేరడము జరుగుచున్నది. జన్మించిన శిశుశరీరములోనికి జీవుడు, ఆత్మ చేరడము సర్వజీవరాసులకు జరిగెడి విధానముగా ఉన్నది. అయితే దైవాంశగల ఆత్మపుట్టునపుడు శిశుశరీరము తల్లిగర్భములో ఉండగానే ఆ శరీరములో ఆత్మ జీవాత్మ ఉండును. శిశువు పుట్టకముందే తల్లిగర్భములోనే ఆత్మ ఉండడము ఒకే ఒకదైవాంశగల శరీరములో మాత్రము జరుగును. దానిని అరుదైన జన్మగా భావించుచున్నాము. అటువంటి జన్మ కొన్నివేలసంవత్సర ములకొకమారో లేక కొన్ని లక్షల సంవత్సరములకొకమారో జరుగుచుండును. భూమిమీద అజ్ఞానము పెరిగిపోయి, జ్ఞానము తెలియకుండాపోయినపుడు, అజ్ఞానమునే జ్ఞానముగా, జ్ఞానమునే అజ్ఞానముగా చెప్పుకొనువారుండు నపుడు, మనుషులు ఎవరూ ఇది నిజమైన జ్ఞానమని చెప్పలేరు. అటువంటి సమయములో దేవుడే తన జ్ఞానమును చెప్పవలసియున్నది. దేవుడు తాను స్వయముగా పనిచేయనివాడు కావున దేవుడు ప్రత్యేకమైన విధానమును అనుసరించి తన అంశగల ఆత్మచేత జ్ఞానమును చెప్పించును.


ముఖ్యముగా ఇప్పుడు చెప్పు సత్యమేమనగా! దైవాంశగల ఆత్మ యున్న శరీరము బయటికి ఎవరికీ గుర్తింపు లేకుండా ఉండును. అయితే ప్రబోధానందయోగీశ్వరులు కూడ ఇతరులు చూచుటకు ఏ గుర్తింపు లేనివాడైనా దేవుడుమాత్రము ఆయనకు కొన్ని గుర్తింపులను, యోచించు వారికి మాత్రము తెలియునట్లుంచాడు. ఒక ప్రక్క ప్రబోధానంద చెప్పు జ్ఞానము గొప్పదేమీకాదన్నట్లు అందరికీ అగుపించునట్లు చేసి, కొందరికి మాత్రము ఆయన చెప్పు జ్ఞానము నిజమైనదని తెలియుటకు కొన్ని ప్రత్యేకతలు ఏర్పరచాడు. ఆయన జ్ఞానమును చాలామంది గుర్తించనట్లు, ప్రబోధానంద పుట్టిన వికృతి నామ సంవత్సరమునుండి తర్వాత వికృతి నామ సంవత్సరము వచ్చు వరకు అరవై (60) సంవత్సరములలో సృష్ఠ్యాది నుండి లేని నాగరికతను, విజ్ఞానమును (సైన్సు) దేవుడు ప్రపంచములో అభివృద్ధి చేశాడు. విజ్ఞానము పెరుగుట వలన యంత్రములనుండి విపరీత సుఖములను పొందు మనిషి దేవున్ని, దేవుని జ్ఞానమును నమ్మలేని స్థితికి చేరుకొన్నాడు. అన్నిటిని మనిషే చేయుచున్నాడని దేవుని పాత్ర ఏమీలేదను వారు చాలామంది తయారైనారు. 60 లక్షల సంవత్సరముల నుండి లేని అభివృద్ధి 60 సంవత్సరములలో వచ్చినదని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఇది భూమిమీద దేవుని జ్ఞానము గుర్తింపు పొందకుండా పోవుటకు పెద్ద ఆటంకమును ఒకవైపు దేవుడే సృష్టించాడని చెప్పవచ్చును. ఒకవైపు తనమీద ఆసక్తికలవారు మాత్రమే దైవజ్ఞానమును గుర్తించునట్లు ప్రబోధానంద జన్మకు కొన్ని ప్రత్యేకతలను దేవుడు కల్పించాడు. ఆయన సాధారణ మనిషే అన్నట్లు ఆయన జీవితమును అమర్చినా, ఆయన అందరివలె సామాన్యుడుకాడు అన్నట్లు ఆయన శరీరము మీద రెండు గుర్తులుంచబడినవి. ఆ గుర్తులున్న మనిషితో ఎవరు శత్రుత్వము చేసినా వారు అన్ని విధముల భ్రష్టులై పోవుదురు. ఆ గుర్తుల మహత్యము ఎవరికీ తెలియదు. మనిషి శరీరములో అరుదుగానున్న ఆ గుర్తులు ప్రబోధానంద శరీరములో ఉండడము ఒక ప్రత్యేకత. ఆయనకు భౌతిక శరీరము మీదున్న భౌతిక గుర్తులు ఆయనను ద్వేష భావముతో చూచిన వారిని హీనస్థితికీ, అజ్ఞానస్థితికీ చేర్చుననీ, పూజ్య భావముతో చూచువారిని ఉన్నత స్థితికీ, జ్ఞానస్థితికీ చేర్చునని చెప్పవచ్చును. దీనివలన ఆయన శరీరమునకు పుట్టుకతోనే వచ్చిన భౌతిక గుర్తులకు అభౌతికమైన ప్రభావమున్నదని కూడా చెప్పవచ్చును.


ఆయన పుట్టిన వంశము పేరు కూడా ఒక ప్రత్యేకమైనదే. ఒక విధముగా చెప్పాలంటే ప్రబోధానంద పుట్టుక కొరకే ఆ పేరుగల వంశము భూమిమీద తయారు చేయబడినదని చెప్పవచ్చును. ఆయన శరీరము సర్వసాధారణముగా కనిపించినట్లు, ఆయన వంశము కూడా సాధారణము గానే కనిపించినా దాని లోతుల్లో ఎంతో రహస్యము దాగియున్నది. దానిని వివరించుకొంటే ఇలా కలదు. మనిషి శరీరములో మూడు ఆత్మలు కలవని తెల్పినవాడే త్రైతసిద్ధాంతకర్త. త్రైత సిద్ధాంతమును తెల్పినవాడు ప్రబోధానంద యోగీశ్వరులు, కావున ఆయన పుట్టిన వంశము కూడా త్రైత సిద్ధాంతమును కల్గినదై ఉన్నది. త్రైత సిద్ధాంతములో పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అను మూడు ఆత్మలున్నారని ప్రబోధానంద యోగీశ్వరులే తెలిపాడు. ఇక్కడ మూడు ఆత్మల వరుసక్రమములో జీవాత్మనుండి మొదలు పెట్టి ఆత్మ, పరమాత్మ వరకు చెప్పవచ్చును. లేకపోతే పరమాత్మనుండి ప్రారంభించి ఆత్మ, జీవాత్మ అని కూడా చెప్పవచ్చును. అయితే సర్వసాధారణ మనుషుల విషయములో చెప్పినపుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని చెప్పవలెను. అదే ప్రత్యేకమైన దైవాంశముగల మనిషిలో చెప్పునప్పుడు పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అని చెప్పవలెను. రెండు రకముల మనుషులలో ఆత్మ మధ్యలో ఉండడము గమనించతగిన విషయము. పరమాత్మ లేక దేవుడు అందరికంటే, అన్నిటికంటే గొప్పవాడు కనుక గణిత శాస్త్రములోని సంఖ్యలలో అన్నిటికంటే పెద్ద సంఖ్య తొమ్మిది (9) కావున పరమాత్మ గుర్తుగా 9 ని చెప్పడము జరిగినది. పరమాత్మ మూడు భాగములుగా విభజింపబడి నాడనుటకు గుర్తుగా 9 ని మూడు సమాన భాగములు చేస్తే ఆత్మ గుర్తుగా ఆరు (6)ను, జీవాత్మ గుర్తుగా మూడు (3)ను చెప్పవచ్చును. అందువలన సృష్ఠికర్త 9,6,3 అని ప్రబోధానంద రచనలో వ్రాయాబడినది. ఈ సూత్రమును అనుసరించి ఒక అజ్ఞాని విషయములో 3 6 9 అనీ, ఒక జ్ఞాని విషయములో 9 6 3 అని చెప్పవలెనని ఉన్నది. ప్రత్యేకమైన, దైవాంశగల కల్గిన ప్రబోధానంద విషయములో 9 6 3 అనియే చెప్పాలి.


అంకెలలో పెద్దసంఖ్య ‘9’ ని పరమాత్మ గుర్తుగా తీసుకొన్నాము. అలాగే అక్షరములలో రహస్యమైన దేవుని గుర్తుగాయున్న ‘గు’ అను అక్షరమును తీసుకొంటున్నాము. ప్రబోధానందది ప్రత్యేకమైన జన్మ కావున గు అను అక్షరముతో ప్రారంభమగు పేరు గల వంశములోనే పుట్టాలి. గు అను అక్షరముతో ప్రారంభమగు ఎన్నో వంశముల పేర్లు కలవు. అయితే వాటిలో పుట్టకుండా ఒక గుత్తా అను పేరుగల వంశములో పుట్టుటకు కొంత కారణముగలదు. అదేమనగా! ప్రతి శరీరములోనూ ఆత్మ జీవాత్మలు జోడుగా ఉండును. అందువలన జోడుగా ఉన్న అక్షరముగల త్తా అను రెండవ అక్షరమున్న గుత్తా వంశములోనే ఆయన పుట్టడము జరిగినది. జీవాత్మకంటే ఆత్మ పెద్దదను విషయమును తెలుపునట్లు దీర్గముగల "తా" ను ఆత్మగా పోల్చి చిన్నదైన జీవాత్మను "త" గా పోల్చి, రెండు అక్షరముల జోడుగా కలిసియున్న త్తా "గు" ప్రక్కనయుంచిన గుత్తా వంశమును ఎన్నుకోవడము జరిగినది. మూడు ఆత్మల గుర్తింపును ప్రతి మనిషి హస్తములోనూ, కన్నులోనూ దేవుడు గుర్తింపుగా ఉంచాడు. హస్తములోనున్న మూడు రేఖలు మూడు ఆత్మలుగా గుర్తింపు పొందియున్నవి. హస్తములోని మూడు రేఖలను తర్వాత పేజీ పటములో చూడుము.

పరమాత్మకు గుర్తింపుగాయున్న పై రేఖ గు అను అక్షరముగా గుర్తించగా, క్రింద కలిసియున్న రెండు రేఖలలో పొడవైన మొదటి రేఖ ఆత్మగా గుర్తించగా, క్రిందయున్న రేఖను జీవాత్మగా గుర్తించడము జరిగినది. పై రేఖకు ‘‘గు’’ను క్రిందిరేఖకు ‘‘తా’’ను దానికంటే క్రిందిరేఖకు దీర్గము లేని ‘‘త’’ ను గుర్తించడము జరిగినది. క్రింది రెండు రేఖలు కలిసివుండుట వలన ‘తా’ క్రింద ‘త’ ను ఉంచడము జరిగినది. అలా ఉండడము వలన ఒకే జోడుగా నున్న ఆత్మ జీవాత్మలు ‘‘త్తా’’గా ఏర్పడగా, పైనున్న రేఖ గుర్తు ‘‘గు’’ను, త్తా ముందరయుంచితే గుత్తా అయినది. ఈ విధముగా పరమాత్మ, ఆత్మ, జీవాత్మల సారాంశమును తెలుపునది ‘‘గుత్తా’’ అను పదము, కావున గుత్తా అను పేరున్న వంశములోనే ప్రబోధానంద పుట్టడము జరిగినది. ఆయన జీవితము ఒకవైపు మనుషులు గుర్తించలేని విధానముతో ఉండినా, ఒకవైపు జ్ఞానసంబంధ విలువలు బయటికి కనిపించునట్లు దేవుడే అమర్చాడు. ఈ విధముగా ఆయన పుట్టిన సంవత్సరము ప్రత్యేకమైన అర్థముకలదే, అలాగే ఆయన పుట్టిన వంశము గొప్పదే. ఇప్పుడు ఆయన పుట్టిన కులమును గురించి చెప్పుకొందాము.


గుత్తా అను వంశము రెడ్డి కులమున మరియు కమ్మ కులమునా కలదు. రెడ్డి కులమున ఉన్న గుత్తావంశములో ప్రబోధానంద పుట్టకుండ, కమ్మ కులములోనున్న గుత్తావంశములో పుట్టాడు. దానికికల కారణము తెలియాలంటే ముందు కమ్మ కులమును గురించి తెలుసుకొందాము. పూర్వము ఎగువ, దిగువ అను రెండు సమాజములు రెండు కులములుగా ఉండేవి. దైవజ్ఞానముగల వారు ఎగువవారిని పిలువబడేవారు. దైవజ్ఞానము లేనివారిని జ్ఞానమున్న ఎగువవారు, మా దిగువవారని పిలిచెడివారు. ఎగువవారు బ్రహ్మజ్ఞానము తెలిసినవారని బ్రహ్మణులుగా పిలువబడేవారు. జ్ఞానములేని వారందరిని మా దిగువ కులమని బ్రహ్మణులు చెప్పుట చేత, మా దిగువ అను పదము ఒక కులముగా ఏర్పడినది. బ్రహ్మణుల చేత మా దిగువవారని పిలిపించుకొను సమాజమునుండి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేయుటకు అలవాటుపడడము వలన గుడ్డలు ఉతుకువారిని చాకలి యనీ, నెత్తికొరుగు వానిని మంగళియనీ వారు వారు చేయుపనులను బట్టి దిగువ కులమునుండి అనేక కులములు చీలిపోయాయి. ఇలా చీలిపోగా మా దిగువ కులము కొంత మిగిలిపోయింది. అలా మిగిలి పోయిన మా దిగువ కులమే నేడు కొంత పేరుమారి మాదిగ కులముగా చెప్పబడుచున్నది. ఈ కుల వ్యవస్థను మొదట బ్రహ్మణులు ఏర్పరచినదేనని తెలియవలెను. ఈ విధముగా ఏర్పడిన అనేక కులములలో కమ్మ కులము కూడా ఒకటి. ‘ఇందూ’ అను శబ్దము కాలగమనములో ‘హిందూ’ అను శబ్దముగా మారినట్లు, ముంబాయి ‘బొంబాయి’గా మారినట్లు మొదట అమ్మ కులముగా పేరుగాంచిన కులము కాలక్రమములో కమ్మ కులముగా మారిపోయినది. మొదట అమ్మకులము అనునది ఎలా వచ్చినదనగా!


పూర్వము దైవజ్ఞానము తెలియని దిగువ వారిలో కొందరు వ్యవసాయము మీద మక్కువగలవారై భూమిని దున్ని సాగుచేసి పంటలు పండించెడివారు. అప్పటికాలములో భూములన్నీ సారవంతమైనవిగా ఉండుట వలనా, వర్షములు సక్రమముగా కురియుచుండుట వలనా భూములన్నీ బాగా పండేవి. ఇప్పటివలె అప్పుడు ధాన్యమును కొనుగోలు చేసే మార్కెటింగ్‌ వ్యవస్థలేదు. కావలసిన వస్తువులను ధాన్యమును ఇచ్చి తెచ్చుకొనెడివారు. ధాన్య మార్పిడి తప్ప డబ్బు మార్పిడి లేకుండెడిది. అందువలన పండిన ధాన్యమును భూమిలోని పాతర్లలో దాచెడివారు. పండిన ధాన్యము సంవత్సరములోపల అయిపోయేవి కావు. అలా ధాన్యము మిగులు పడుచుండుట వలన ఉదార స్వభావముతో చాలామందికి అన్న దానము చేసెడివారు. కొందరికి ధాన్యమునే ఉచితముగా ఇచ్చెడివారు. వ్యవసాయము చేయకుండా మిగత పనులు చేయు అన్ని కులముల వారికి అమ్మవలె ఆదరించి అన్నము పెట్టు సమాజమునకు అమ్మకులము అని ఆనాడు పేరువచ్చినది. ఆనాడు ఎవరిమీద ఎటువంటి దౌర్జన్యము చేయకుండ, ఇతరులపట్ల అన్యాయముగా ప్రవర్తించకుండా, లేని వారినందరిని ప్రేమతో పలకరించి, ఆకలికి అన్నము పెట్టు సమాజము అమ్మసమాజముగా, అదియే అమ్మకులముగా మారిపోయినది. ఆ కాలములో తమ భూమిలో కాయకూరలతో సహా అన్ని పంటలు పండించుచూ బ్రాహ్మణుల తర్వాత అమ్మకులమువారు రుచిగా తినెడివారు. వారు రుచిగా తినడమేకాక, ఇతరులకు కూడా రుచిగానే పెట్టెడివారు. ఆహారమును కమ్మగా తినడమే కాక ఇతరులకు కూడా కమ్మగా పెట్టడము వలన కాలక్రమమున అమ్మకులము, కమ్మ కులముగా రూపాంతరము చెందినది.


ప్రబోధానంద యోగీశ్వరులకు యుక్తవయస్సు వచ్చినప్పుటినుండి ప్రతి దినము కొంతమందికైనా భోజనము పెట్టు అలవాటున్నది. అప్పటి నుండి ఇప్పటివరకు పూర్వము అమ్మకులము అనుసరించిన విధానము ప్రకారము అనుసరించడము ఆయన స్వభావములో ఉండుట వలన ఆయనను కమ్మకులముననే పుట్టించడమూ జరిగినది. నేటి కమ్మ కులస్థులు కొందరు తమ పూర్వపు విధానమును మరచిపోయి ఇతరులకు అన్నము పెట్టు పద్ధతిని వదలివేశారు. అందువలన దైవిక అర్థమునిచ్చు గుత్తా వంశమున, ప్రపంచములోని విధానమును తెల్పు కమ్మ (అమ్మ) కులమునే ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టడము జరిగినది. ప్రపంచములో ప్రకృతి సంబంధమైన అమ్మ విధానమును అనగా మాయ విధానమును ఒక ప్రక్క చూపువాడుగా కమ్మకులమున, అలాగే ఆధ్యాత్మికములో దైవికమైన మూడు ఆత్మలను గుర్తుచేయు వాడుగా గుత్తావంశమున ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టడము జరిగినది.


పరమాత్మ అంశతో కూడుకొన్న ఆత్మగల మనిషి భూమిమీద అరుదుగా పుట్టుచుండును. అలాంటి జన్మ భూమిమీద జరిగినపుడు ఆ మనిషి అందరికీ సర్వసాధారణ మనిషిగా కనిపించినా, కొందరు జ్ఞానులు మాత్రము అటువంటి జన్మయొక్క ప్రత్యేకతలను గుర్తించగలరు. పరమాత్మ అంశగలదనుటకు ఏమి నిరూపణ అను ప్రశ్నకు ఇంతవరకు పుట్టిన సంవత్సరము, పుట్టిన వంశము, కులమును గురించి చెప్పుకొన్నాము. ఇప్పుడు ఆయన పుట్టిన స్థలమును గురించి చెప్పుకొందాము. పరమాత్మ అంశ అంతములేనిది, అనంతమైనది. అటువంటి అనంతమైన దైవాంశ ‘‘అనంత’’ అను పేరుగల ఊరిలోనే పుట్టవలెనని దైవనిర్ణయము ఉండడము వలన అనంతపురము అను పేరుగల ఊరిలోనే ప్రబోధానంద పుట్టడము జరిగినది. అనంతపురములో నివసించువారిలో అజ్ఞానముండినా, అక్కడ వారిలో జ్ఞానము లేకపోయినా ఊరి పేరులో మాత్రము దైవధర్మము కలదు. దైవము అనంతుడు, కావున అనంతపురము అను పేరులో పరమాత్మ అంశ పుట్టడము జరుగవలసిందే. కావున జరిగిందని చెప్పవచ్చును.


ప్రబోధానంద యోగీశ్వరులు అనంతలో పుట్టినపుడు, పరమాత్మ అంశకు తగినపేరే నిర్ణయించబడినది. ప్రపంచములో అతి రహస్యమైనవాడు దేవుడు. అలాగే అన్నిటికంటే పెద్దవాడు దేవుడే. దేవున్ని మించిన వాడుగానీ, దేవునికి సమానమైన వాడుగానీ భూమిమీద ఎవరూ లేరు. అందువలన అందరికంటే ఆయనే (దేవుడే) పెద్ద. పెద్ద అను పదమును బ్రహ్మ అని కూడా అనవచ్చును. బ్రహ్మ అంటే పెద్ద అని అర్థము, కావున దేవున్ని బ్రహ్మ అనికూడా అనుచున్నాము. దేవుని అంశతో కూడుకొన్న ఆత్మ ప్రబోధానందగా పుట్టినపుడు, అంతములేని అంశ అయిన దానివలన అనంతలో పుట్టడము, అందరికంటే పెద్ద అయిన దానివలన పుట్టినపుడు పెద్దన్న అనుపేరు పెట్టడము జరిగినది. ఆయన ప్రత్యేకతను అందరూ గమనించనట్లు అదే జిల్లాలో, అదే ఊరిలో పుట్టిన చాలామందికి కూడ అక్కడక్కడ పెద్దన్న అనుపేరు పెట్టబడినది. ఆయనకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఒక స్వామీజీవద్ద మంత్రోపదేశమును పొందినప్పుడు ప్రబోధానంద అని పేరు పెట్టబడినది. అప్పటినుండి పెద్దన్న అను పేరు పోయి ప్రబోధానంద అను పేరు వచ్చినది. అప్పటినుండి ప్రపంచ వ్యవహారములలో గుత్తా ప్రబోధానంద చౌదరిగా, ఆధ్యాత్మిక విషయములలో ప్రబోధానంద యోగీశ్వరులుగా కొనసాగడము జరిగినది. తర్వాత త్రైతసిద్ధాంతమును ప్రతిపాదించినప్పటి నుండి త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులుగా చలామణి అగుచున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథములను ఆయన వ్రాయడము జరిగినది. ఇంతవరకు ఎవరూ వ్రాయని విషయము లను మరియు చెప్పని విషయములనే వ్రాసెదనని చెప్పి వ్రాసెడివాడు. ఒక్క ఇందూ (హిందూ) మతములోని ఆధ్యాత్మిక రహస్యమునే కాక, ఇస్లామ్‌ మరియు క్రైస్తవ మూలగ్రంథములైన ఖురాన్‌ మరియు బైబిలు గ్రంథములలోని సూక్ష్మాతి సూక్ష్మ విషయములను కూడా అవలీలగా చెప్పెడివాడు. ఇతర మత గ్రంథములలోని వాక్యములకు మీరెలా వివరమును చెప్పగలుగుచున్నారని అడిగినపుడు ఆయన ఇలా సమాధానము చెప్పెడివాడు. ‘‘నేను గ్రంథములను చూచి ఏదీ చెప్పలేదు. నేను చెప్పినదే గ్రంథములలో వ్రాయ బడివున్నది. నా బోధలకు వ్యతిరేఖమైన ధర్మములు ఏ మూల గ్రంథములలో లేవు. నాకు తెలియని ఆధ్యాత్మిక రహస్యములు ఏవీలేవు. నా ధర్మములను అనుసరించిన మూలధర్మములే అన్ని గ్రంథములలో ఉన్నవి’’ ఈ మాటలను విన్నవారు ఎవరైనా, ఇవి సామాన్యమైన మాటలు కాదు, చెప్పిన వాడు గొప్ప వ్యక్తి అనునట్లున్నా, అందరికీ ఆ విషయము అర్థము కాకుండుటకు భూమిమీద ఎందరో స్వామీజీలు, ఎందరో బాబాలు రావడమూ, వారు అనేక ఉపన్యాసములు చెప్పడమూ, అనేక గ్రంథములు వ్రాయడమూ జరిగినది. ప్రబోధానంద పుట్టిన తర్వాతనే విరివిగా స్వామీజీలు తయారు కావడము వలన వారిలో ప్రబోధానంద కూడా ఒక స్వామిగా లెక్కించబడి నాడు, అందువలన ఎవరూ ఆయనను ప్రత్యేకముగా గుర్తించలేకపోయారు.


ప్రబోధానంద చెప్పేబోధ మతాతీతమైనదై, అన్ని మతములలోని ప్రతి మనిషికీ వర్తించునదై ఉండెడిది. ఆయన బోధలలో ప్రకృతికి అతీతమైన పరమాత్మ బోధనలు ఉండేవి. ఆయన బోధలు దైవము మీద ఆసక్తివున్న వారికి మాత్రమే అర్థమయ్యేవి. దైవము మీద కాకుండా దేశము మీద, మతము మీద ఆసక్తియున్నవారికి అర్థమయ్యేవి కావు. ఆయన వ్రాసిన గ్రంథములలో కొన్నిటియందు అధికమైన దైవశక్తివుండేది. అటువంటి గ్రంథములను చదివినా, లేక భక్తిగా దగ్గరయుంచుకొనినా కొన్ని రకముల రోగములు, కొన్ని గ్రహబాధలు తొలగిపోయేవి. రోగములు, మేఘములు జీవమున్న జీవరాసులేనని ఆయన చెప్పేవాడు. ఇతర శరీరములలోనున్న రోగములను పలకరించేవాడు. జ్ఞానమార్గములోనికి వచ్చిన వారిని వదలి పొమ్మనేవాడు. ఆయన చెప్పినట్లే పెద్ద రోగములని పేరుగాంచిన రోగములు కూడా మాటవినేవి. ఆయన శరీరములో కొన్ని లోపములు ఏర్పడి ఆరోగ్యములో కొన్ని మార్పులు జరిగినా, అవి రోగములు కాకపోయిన దానివలన ఆయన శరీరము తిరిగి యధాస్థితికి వచ్చేది. ఏ రోగమైనా నా ఎరుకలేనిది నా శరీరములో ప్రవేశించదు అనెడివాడు. ఆయనకు 60 సంవత్సరములు పూర్తి అయినప్పుడు ఆరు రోజుల వ్యవధిలో నాలుగు మార్లు తీవ్రమైన గుండెపోటు వచ్చినది. అలా నాలుగుమార్లు వచ్చేవరకు ఎవరూ బ్రతకరు. తర్వాత దానిని సరిచేసుకోవడము జరిగినది. ఆయన 24 గంటలలో ఒకటి లేక రెండు, రెండున్నర గంటలు నిదురించే వాడు. రెండున్నర గంటల నిద్ర నెలకొకమారు ఉండెడిదని, మిగత దినములలో తక్కువగా నిద్రించెడివాడని, కొన్ని దినములలో ఏమాత్రము నిద్రించేవాడు కాదని చెప్పవచ్చును. ఆయన శరీరములో ఇన్సులిన్‌ లోపము వలన సుగర్‌ లెవల్‌ మూడువందలకు పైన 350, 400 వరకు 18 సంవత్సరము లుగా ఉన్నది. అయినా ఆయన శరీరములో ఎటువంటి మార్పు రాలేదు. తాను ప్రయాణిస్తున్న కారు ఎన్నోమార్లు ఘోరప్రమాదానికి గురియైనా ఆయనకు ఎటువంటి హాని కలుగలేదు. ఇంత పెద్ద ప్రమాదములో మీరెలా బ్రతికారని ఇతరులు అడిగినప్పుడు నేను చేయవలసిన పనులు,వ్రాయవలసిన వ్రాతలు ఇంకా ఉన్నాయి అనెడివాడు.


ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పే బోధలను గ్రహించిన కొందరు జ్ఞానులు, ఈ జ్ఞానమును భూమిమీద ఏ మనుషులు చెప్పలేరని అనుకొని ఆయనను ప్రత్యక్షముగా చూచిన తర్వాత గొప్పభావము వారిలో లేకుండా పోయేది. కొందరు ఇదే విషయమునే ‘‘మిమ్ములను చూడక ముందువున్న భావము మిమ్ములను చూచిన తర్వాత ఎందుకు లేకుండా పోయింది’’ అని అడిగెడివారు. దానికి సమాదానముగా ‘‘దేనికైనా కాలము రావాలి, మనిషి దేనికీ బాధ్యుడు కాడు’’ అని అనెడివాడు. ఎప్పుడూ తనను గూర్చి గొప్పగా చెప్పుకోక తనను తాను తగ్గించుకొని నేను మీలాంటి మనిషినే నాకు ఎవరూ నమస్కరించవద్దండి. మీరు నేరుగా దేవున్నే మ్రొక్కండి అనెడివాడు. అలాంటి వాడు తనను గొప్పగ అనుకొనునట్లు ఇప్పుడు ఈ రచనలో వ్రాయడమేమిటని ఎవరికైన ప్రశ్న రాక తప్పదు. దానికి ప్రబోధానంద యోగీశ్వరులు ఏమి సమాదానము చెప్పక నాపైనున్న వానికి తెలుసు అన్నాడు.


ఆయన చెప్పలేకపోయినా నేనుమాత్రము చెప్పగలను చూడండి. ఆయన తన చిన్న వయస్సు నుండి ఇతరులకు జ్ఞానమును చెప్పుచున్నప్పటికీ, తర్వాత ప్రబోధ, జననమరణ సిద్ధాంతమును 27 సంవత్సరముల వయస్సు లోనే వ్రాయడము జరిగినది. 2+7=9 అవుతుంది కదా! తొమ్మిదికి ఆయన జీవితములో ప్రత్యేకతగలదు. ఎందుకనగా 9 దైవమునకు గుర్తు అని ముందే చెప్పుకొన్నాము. ఆయన 27 సంవత్సరములో ఆత్మయొక్క ప్రత్యేకతను జననమరణ సిద్ధాంతమందూ, జీవునియొక్క కర్మబంధమును ప్రబోధ గ్రంథమందు వ్రాయడము జరిగినది. తర్వాత ఆయనకు 36వ సంవత్సరము కూడా ప్రత్యేకతను కూర్చినది. 3+6=9 అగుట వలన దైవత్వము యొక్క అంశ ఆయనలో ప్రజ్వరిల్లి, భగవద్గీతను త్రైతసిద్ధాంత భగవద్గీతగా వ్రాయునట్లు ప్రేరేపించినది. తర్వాత 45వ సంవత్సరము భగవద్గీత రచనను పూర్తి చేయడమూ జరిగినది. 54వ సంవత్సరము శ్రీ కృష్టమందిరమును ప్రబోధాశ్రమములో స్థాపించడము జరిగినది. తర్వాత ఇప్పుడు నందననామ సంవత్సరము ఆయనకు 63వ సంవత్సరము జరుగుచుండగా ఈ రచనను వ్రాయడము జరుగుచున్నది. ఈ విధముగా 27వ సంవత్సరమునుండి ప్రతి 9 సంవత్సరములకు ఒక ప్రత్యేకతను సంతరించుకోవడము జరుగు చున్నది. నందననామ సంవత్సరములో ఈ విధముగా జరుగునని శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞానములో "ఆధ్యాత్మిక యోగ పురుషుడు మహా ప్రకాశము అగును" అని ఉన్నది. ప్రస్తుతానికి భూమిమీద యోగ పురుషుడు ప్రబోధానంద యోగీశ్వరులు తప్ప ఎవరూ లేరు. యోగ పురుషుడు అనగా పరమాత్మ అంశతోకూడుకొన్న ఆత్మను గలవాడు అని అర్థము. బ్రహ్మముగారు చెప్పినట్లు ఈ సంవత్సరము ప్రబోధానంద ప్రత్యేకత బయటపడవలసియున్నది. కావున ఆయన చేతనే బలవంతముగా ఈ పుస్తకమును వ్రాయించడము జరుగుచున్నది. ఇంతకాలము మసిపాతలోని మాణిక్యమువలెనున్న ప్రబోధానంద ఎటువంటి ఆత్మను కలిగియున్నాడో తెలిసిపోయింది.


నేను ఉంటే ఆయన ఉంటాడు. నేను పోతే నావెంటే ఆయన కూడా వస్తాడు. అవసరమనిపిస్తే ఇద్దరము మరొక తొమ్మిది (9) సంవత్సరములు ఉంటాము. అవసరములేకపోతే లేదు. ప్రబోధానంద యోగీశ్వరులకు 63 సంవత్సరములు వచ్చువరకు ఆయన వంశమువారైన గుత్తావారికి ఆయన ఎవరో తెలియదు. ఆయనకొరకే గుత్తా వంశము త్రైతసిద్ధాంతమును అనుసరించి ఏర్పడినదని గుత్తావంశస్థులకెవరికీ తెలియదు. బ్రహ్మముగారు చెప్పిన కాలజ్ఞానము ప్రకారము ప్రబోధానంద విషయము తెలిసినవారు చాలామంది సంతోషిస్తారు. నాకు తెలిసి ప్రబోధానందకు తన వంశము అంటే చాలా ఇష్టము. ఎక్కడాలేని అర్థము గుత్తావంశములో ఉన్నదని చెప్పెడివాడు. ఆ వంశములో పుట్టాలంటే కొంత పూర్వజన్మ పుణ్యము అవసరమని కూడా చెప్పెడివాడు. ప్రస్తుతము గుత్తావంశములోనున్న వారికి ఒక లాభముకలదు. తనవంశము యొక్క గొప్పతనమును తెలిసి, తన వంశము తయారగుటకు కారకుడు త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులని తెలిసి, ఆయనను ప్రత్యక్షముగాగానీ, పరోక్షముగాగానీ దర్శించుకొన్నవారికి కొంత కర్మ విముక్తి కలుగగలదు. ఆయన జ్ఞానమును పూర్తి తెలిసిన ఎవరైనా, ఏ మతస్థునికైనా, ఏ కులస్థునికైనా మానసిక బాధలు తొలగిపోవును. యోగీశ్వరులైన ఆచార్య ప్రబోధానంద త్రైతసిద్ధాంత జ్ఞానమును తెలిసి ప్రచారము చేసిన వారికి జన్మరాహిత్యము ఏర్పడగలదు. త్రైత సిద్ధాంతము ప్రకారము కాల, కర్మచక్రములను నుదుటి మీద ధరించిన వారిని చూచి దేవతలు, దయ్యాలు సహితము భయపడును.


ఈ పుస్తకము చదువువారికి ‘‘ఇంతకూ ఈ చెప్పే ఆయన ఎవరు’’ అను ప్రశ్న రావచ్చును. దానికి జవాబు ఏమనగా! పైకి కనిపించి వ్రాసేది ప్రబోధానందే అయినా వాస్తవముగా వ్రాయునది ఆయన కాదు. ప్రబోధానందయోగీశ్వరుల శరీరములో ఆయన, నేను ఇద్దరమూ ఉన్నాము. అందువలన రెండవ వ్యక్తిగా ఆయనను గురించి నేను చెప్పుచున్నాను. ఒక శరీరములో ఇద్దరుండడమేమిటి? అని మీరు అనుకోవచ్చును. రెండవ వాడు దయ్యమో, భూతమో అని కూడా అనుకోవచ్చును. వాస్తవానికి నేను దయ్యమునుగానీ, భూతమునుగానీ కాను. మీ శరీరములలో కూడ మీతోపాటు ఆత్మ అనునది ఉన్నది. మీరు జీవాత్మ అయితే మీతో ఉన్నది ఆత్మ. ఆత్మ అంటే ఏ దయ్యమో అనుకోవద్దండి. ఆత్మ జీవాత్మ ఏ శరీరములో నైనా జోడు ఆత్మలుగా నివసించుచుండును. ప్రబోధానంద శరీరములో ఆయన (జీవాత్మ) తలలో ఉండగా, నేనుమాత్రము శరీరమంతా వ్యాపించి అన్ని అవయవములను కదలించి శరీరముతో పని చేయించుచున్నాను. అన్ని శరీరములలో ఇదే తతంగము జరుగుచున్నది. ప్రస్తుతము మీ శరీరములో కూడా అన్నిటి చేత అన్ని పనులు చేయించునది ఆత్మేగానీ, మీరుకాదు. ఈ విషయము మీకు క్రొత్తగా ఉండినా ఉన్న సత్యము అంతే. ఆత్మ అంటే ఏమిటో ఇప్పటి వరకు హిందూ (ఇందూ) మతములోనే సరిగా తెలియకుండా పోయినది. ఇతర మతములలో ఆత్మ విషయమే ఎవరికీ తెలియదు. నేను, మీ శరీరములలోనున్న ఆత్మ ఏక స్వరూపులమే అయినా వేరువేరుగా ఉన్నాము. నేను పరమాత్మ అంశతో కూడుకొన్న ఆత్మను. అందువలన దేవుడు చేయవలసిన పనిని నేనే చేయుచున్నాను. దేవుడు చెప్పవలసిన జ్ఞానమును నేనే చెప్పుచున్నాను. ప్రబోధానందగా కనిపిస్తు ఆయన శరీరములోనున్న నేను ఆయనకు తెలుసు. అందువలన మేము ఇద్దరము ఒక్కటేనను సూత్రము ఈయన శరీరములో మాత్రము సరిపోవును. ఇది అంతయు లోతైన జ్ఞానము. ఒక్కమారుగా మీకు అర్థముకాదు.


నేను ప్రబోధానంద యోగీశ్వరులతో కలిసివుండడమే కాకుండా, మా ఇద్దరికి (జీవాత్మ, ఆత్మకు) పెద్దయిన పరమాత్మ (దేవుడు) నాతో కలిసి యున్నాడు. నేను జీవాత్మయిన ప్రబోధానంద యోగీశ్వరులతో కలిసివుండగా, నాతో పరమాత్మ అయిన దైవము కలిసివున్నాడు. అందువలన ఒకే శరీరములోనున్న మేము ముగ్గురము ఒక్కటేనని తెలియవలెను. మీ శరీరములలో ఆత్మనైన నేను జీవాత్మతో సంబంధపడి ఉన్నానుగానీ, పరమాత్మతో ఎటువంటి సంబంధములేదు. అందువలన మిగతవారికి ఎవరికైనా గానీ, దేవుని జ్ఞానము యొక్క రహస్యము పూర్తిగా తెలియదు. ఇది ఒక మతమునకు సంబంధించిన విషయముకాదు. అన్ని మతముల మనుషుల లోపల ఉన్న విధానము. దైవాంశగల ఆత్మగల వ్యక్తి మాత్రమే సంపూర్ణ జ్ఞానమందించు అవకాశము గలదు. దైవాంశ లేని మనిషి ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఎంతటి జ్ఞాపకశక్తి గలవాడైనా సరియైన దైవధర్మములను అందించలేడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశము కలదు. కానీ అది మీ యోచనకు రాలేదు. ఆ ప్రశ్నను నేనే జ్ఞాపకము చేసి తర్వాత నేనే జవాబును చెప్పెదను. దైవాంశగల ‘‘ఆత్మయున్న శరీరములో జీవాత్మ ఎలాగుండును? ఏ స్థోమత కల్గియుండును? ఏమనుకొనుచుండును?’’ అని అడుగవచ్చును. దానికి జవాబు ఇలాగ ఉన్నది.


పుట్టిన ప్రతి మనిషి శరీరములో రెండు జోడు ఆత్మలు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉండును. జోడుగానున్న ఆత్మలు రెండిటిలో ఒకటి జీవాత్మ కాగా, రెండవది ఆత్మ. ఇక మూడవ దానిని పరమాత్మ అంటాము, లేక దేవుడు అంటాము. శరీరములోనున్న జోడు ఆత్మలలో జీవాత్మకంటే గొప్పది, శరీరమంతా వ్యాపించినది, శరీరమునకు అధిపతిగా ఉండునది ఆత్మ. ఆత్మకంటే వేరుగా ఉండి శరీరము లోపల, శరీరము బయట అంతటా వ్యాపించినది పరమాత్మ. ఆత్మ శరీరమంతటావుండి శరీరమును కర్మ ప్రకారము నడిపిస్తూ జీవునికి సుఖదుఃఖములను అందించుచుండును. ఈ విధముగా ప్రతి శరీరములోనూ ఉండగా, జీవుడు మాత్రము శరీరములో ఉన్నది తానొక్కన్నేనని తలచుచుండును. జీవుడు తాను శరీరములో ఒక భాగముగా ఒకచోట ఉన్నవాడిననీ, శరీరములో తాను ఏమీ చేయలేదనీ తెలియక అజ్ఞానముతో శరీరములో ఆత్మచేయు పనులన్నీ తానే చేయుచున్నా నని అనుకొనుచున్నాడు. శరీరములో తానున్నానని అనుకోక శరీరమే తానని జీవుడు అనుకొనుచున్నాడు. శరీరమే నేనని తలచు జీవుడు, శరీరములో ఒక ఆత్మ ఉందనీగానీ, అదే తనను నడిపిస్తుందని గానీ తెలియదు. అంతేకాక ప్రపంచమంతా వ్యాపించియున్న దేవుడు తానున్న శరీరములో ఉన్నాడని కూడా తెలియడు. ఇది సామాన్య మనిషిలో ఉన్న విధానముకాగా, కొన్ని లక్షల సంవత్సరములకొకమారు అరుదుగా పుట్టు పరమాత్మ అంశగల ఆత్మవున్న శరీరములో కూడా సాధారణ మనిషిలో ఉన్నట్లే మూడు ఆత్మలుండును.


సాధారణ మనిషి శరీరములో ఆత్మ జీవాత్మతో సంబంధపడివుండి జీవునికి సుఖదుఃఖములనందించుచుండును. అటువంటి ఆత్మ అదే శరీరములోనున్న పరమాత్మతో ఏ సంబంధము పెట్టుకొని ఉండదు. అయితే ప్రత్యేకజన్మ అయిన పరమాత్మ అంశగల ఆత్మ శరీరములో పరమాత్మతో సంబంధపడి ఉండడమేకాక, జీవాత్మతో కూడా సంబంధమును కొనసాగించు చుండును. అంతగొప్ప ఆత్మగల శరీరములోని జీవుడు మాత్రము తాను జీవునిగానే ఉంటూ తన శరీరము నుండి చెప్పబడు జ్ఞానమును, తన శరీరమునుండి జరుగు కొన్ని గొప్ప కర్మ నివారణ కార్యములను చూచి ఇవన్నీ నేనే చేశానని ఒకవైపు అనిపించినా, ఇంతటి జ్ఞానము నాకు తెలియదు కదా! అని, ఇంతటి గొప్ప కార్యములను నేను చేయలేను కదా! అని అనుకొనుచుండును. తన శరీరమునుండి చెప్పబడు జ్ఞానము తనకుకూడా క్రొత్తగా తెలియడము వలన, అందరికంటే ముందుగా తనకు తెలియడము వలన, ఆ జీవుడు కూడా గొప్ప జ్ఞానిగా మారిపోవును. శరీరములోని అహము చేయు పనివలన జీవుడు అప్పుడప్పుడు జ్ఞానమును మరచిపోయి అహము యొక్క భావముతో అన్నీ నేనే చేయుచున్నానని అనుకొనినా వెంటనే ఆ జీవుడు ఎరుక కల్గి తాను ఏమీ చేయలేదను భావములోనికి వచ్చును. దైవాంశగల శరీరములోనున్న జీవుడు అందరికంటే ముందు సంపూర్ణ జ్ఞానియై, తర్వాత అహమును వీడి తాను ఏమీ చేయలేదను భావములోనికి వచ్చుట వలన కర్మయోగిగా మారిపోవును. దైవాంశగల ఆత్మయున్న శరీరములో ఆత్మ తెలుపు దేవుని జ్ఞానము మొదట జీవునికి, తర్వాత ప్రజలకు తెలియును.


బయట ప్రజల దృష్ఠిలో ఒక శరీరమునుండి దైవజ్ఞానము తెలుపబడునప్పుడు, కనిపించే వ్యక్తియే చెప్పుచున్నాడని అనిపించుట వలన, ఆ వ్యక్తిని బయట ప్రజలు గౌరవించుదురు. బయటి ప్రజలకు జ్ఞానము చెప్పే వ్యక్తి గొప్పవాడనిపించినా, అతనిలో ప్రత్యేకమైన దైవాంశగల ఆత్మ ఉన్నదనీ, అటువంటి ఆత్మ ద్వారా దేవుడు తన జ్ఞానమును బయటికి తెలుపుచున్నాడని ఏమాత్రము తెలియదు. ఎవరూ చెప్పలేని జ్ఞానమును ఒక వ్యక్తి చెప్పుచున్నపుడు, ఆ వ్యక్తి చెప్పే జ్ఞానము ఇతరులు చెప్పే జ్ఞానము కంటే ఎంతో విభిన్నమైనదై, ఎంతో రుచిగలదై, ఎంతో సంతోషము నిచ్చునదై ఉన్నప్పుడు, అటువంటి జ్ఞానమును చెప్పు మనిషి సాధారణ మనిషికాదు అని ఎవరికైనా యోచన వచ్చినప్పుడు చెప్పే వ్యక్తి దైవాంశగల వాడని బయటపడుటకు అవకాశము గలదు. అయినా అటువంటి యోచన నుండి బయటపడి ఇతను సామాన్యమైన మనిషేనను భావములోనికి వచ్చెదరు. చెప్పేవాడు గొప్పవాడని యోచన వచ్చినా, కాదు అతను సామాన్యమైన మనిషేనను భావము ఎందుకొచ్చినది? ఎలా వచ్చినది? అనగా! దేవుడు గుహ్యమైనవాడు (రహస్యమైనవాడు) కదా! సముద్రమనినా నీటిబిందువనినా రెండిటియందు నీరే ఉన్నట్లు దేవుడనినా, దేవుని అంశ అనినా రెండిటి యందు దైవమే ఉన్నది. దేవుడు రహస్యమైనవాడు, వెదకబడే వాడేకానీ, తెలియబడేవాడు కాడు. అందువలన దైవాంశగల ఆత్మకూడా ఎవరికీ తెలియబడదు. ఇతను దేవుడు అను భావము ఎవరికైనా వస్తే, అతను దేవుడు కాదు అను ప్రపంచ ఆధారములు వందవచ్చును. ప్రపంచ కార్యములను, ఆ వ్యక్తి అనుభవమును చూచిన తర్వాత ఎవరూ ఇతను దైవాంశగలవాడని అనుకోరు. అందువలన దైవాంశ భూమిమీదకు ఎప్పుడు వచ్చినా ఎవరికీ తెలియదు. వచ్చిపోయిన తర్వాత ఫలానా మనిషి దైవాంశగలవాడని చెప్పవచ్చును. కానీ ఉన్నప్పుడు అతనిని ఎవరూ గుర్తించలేరు. అదే విధముగా ఒకప్పుడు కృష్ణుడు దైవాంశ గలిగి వచ్చాడు. అప్పుడు ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు ఆయన దైవము అని మనము అనుకొంటున్నాము.


దేవుని అంశకు చావుపుట్టుకలులేవు. అందువలన దైవాంశగల శరీరము తల్లిగర్భమునుండి సజీవముగా బయటపడుచున్నది. ఆ శరీరములో మూడు ఆత్మలు వేరువేరుగా ఉండినా మధ్యలో ఆత్మ ఇటు జీవాత్మతో, అటు పరమాత్మతో సంబంధపడివున్నది. అందువలన ఒక్కొక్కప్పుడు మూడు ఆత్మలు ఒకటిగా ఉన్నవి, ఒక్కొక్కప్పుడు వేరువేరుగా ఉన్నవని చెప్పవచ్చును. దైవము మనిషిలోనున్నా అందులోని జీవాత్మ కొన్ని సమయములలో వేరుగా ఉండి కర్మలను అనుభవిస్తుందని చెప్పవచ్చును. అదే విధముగా కొన్ని సమయములలో ఆత్మ ప్రత్యేకముగా ఉంటూ శరీరమునుండి దైవజ్ఞానము చెప్పును. ఆత్మ చెప్పునప్పుడు జీవాత్మ వినగలుగును. ఆత్మ చెప్పునప్పుడు మొదట జీవాత్మ ఆ విషయమును తెలియగలుగుట వలన అప్పుడు ఆత్మ, జీవాత్మ వేరుగా ఉన్నాయని చెప్పవచ్చును. ఈ విధముగా దైవాంశగల శరీరములో జీవాత్మ, ఆత్మ రెండూ నిరూపణకు వచ్చినవి. కానీ ఇంతవరకు నిరూపణకు రానిది ఒక పరమాత్మ మాత్రమే. ఏ నిరూపణలేనప్పుడు హేతు బద్దముగా, శాస్త్రబద్దముగా పరమాత్మ ఒకటున్నదని నిరూపించాలేము. కావున అటువంటి ఇబ్బంది లేకుండా పరమాత్మ కూడా నిరూపణకు వచ్చిన సందర్భములు కొన్ని కలవు. ఆత్మ శరీరములోపల మాత్రము వ్యాపించి ఉండగా, పరమాత్మ ప్రపంచమంతా శరీరములోపల, శరీరము బయటా వ్యాపించియున్నది. ఆత్మ శరీరము అంతటా అధికారము కల్గియుండగా, పరమాత్మ చరాచర ప్రపంచమంతా అధికారము కల్గియున్నది. అందువలన దైవముగల శరీరము బయటికి సాధారణముగా కనిపించినా ఆ శరీరము నుండి వచ్చు ఆజ్ఞ చరాచర ప్రపంచమంతా అమలు కాగలదు. ఆగిపో అంటే వీచే గాలి ఆగిపోగలదు. కదిలే సముద్రము ఆగిపోగలదు. మండే అగ్ని ఆరిపోగలదు. గతములో దైవాంశగల జన్మలు రావడము, ఎంతో జ్ఞానము బోధించడము జరగడమేకాక, నోటిమాటతో ప్రకృతిని శాసించిన సంఘటనలు జరిగినవి. అందువలన శరీరములో జీవాత్మ, ఆత్మయేకాక, పరమాత్మ కూడా నిరూపణకు వచ్చినదని తెలిసిపోయినది. దైవాంశ ఎప్పుడో ఒకప్పుడు భూమిమీదకు వచ్చి దాని జ్ఞానమును అదియే చెప్పుననీ, అట్లు రాలేదని వాదించు వారికి జవాబుగా దైవాంశ తన ఉనికిని జ్ఞానులు మాత్రము తెలియుటకు తగినట్లు ఏదో ఒక ఆధారముండునట్లు చేసివుండుననీ, అటువంటి ఆధారముతోనే శ్రీకృష్ణున్ని భీష్ముడు గ్రహించగలిగాడనీ తెలుపుచూ ఇంతటితో నేను (ఆత్మను) ముగిస్తున్నాను.

-***-