కోరికలే గుర్రాలయితే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కోరికలే గుర్రాలయితే

(ఈ కథ 1 జులై, 1949న w:తెలుగు స్వతంత్ర వారపత్రికలో ప్రచురితమైంది)

రచన - w:శారద యస్. నటరాజన్

1943లో రాయల్ ఇండియన్ విమాన శాఖలో పనిచేస్తూ పసిఫిక్ మహా సముద్రంలో ఒక విమాన ప్రమాదంలో ఎవరికీ తెలియకుండా పోయాం ఇద్దరం. మేము సముద్రంలో పారాఛూట్లతో దిగి, చాలా దూరం ఈది, కనబడ్డ ఓ దీవికి చేరుకున్నాం. ఆ దీవి నిర్మానుష్యంగా ఉంది. బహుచిన్నది. ఆ దీవిలోంచి బైటబడి నాగరిక ప్రపంచాన్ని చేరుకోవాలని మేము చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయినై. నాల్గంవైపులా ఘోష పెట్తూన్న మహా సముద్రమయ్యె! మేము ఏ దిక్కున ఉన్నామో తెలిసినా, ఎటుపోవాలో తెలీటం లేదు. ఇక నిరాశ చేసుకుని, ఇద్దరం మిత్రులమూ, ఆ దీవిలోనే జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాము. ఏదైనా ఓడ ఎప్పటికన్నావస్తే బైటపడ వచ్చనే ఆశ మా ప్రాణాల్ని ఎప్పటి కప్పుడు నిలబెడ్తూ వొచ్చింది. ఆ దీవిలో దొరికే అడవి మేకల్ని, దుంపల్నీ తింటూ, మా పారాఛూట్లనే తాత్కాలికంగా డేరాలల్లే బిగించి వాడుకుంటూ, కొద్ది కాలానికి గట్టి నివాసాలేర్పరచుకున్నాం. ఇట్లా ఎన్నేళ్లు గడిచాయో తెలీదు. ఒకరోజు ఉదయం నా స్నేహితుడు తన దగ్గరి ఉన్న దూరదర్శనితో మూమూలుగా సముద్రం వేపు చూస్తున్నవాడు, ఎగిరి గంతేసి, ‘రాజా, రాజా, ఇటు చూడు. ఏదో ఒక ఓడ ఇటువేపే వొస్తోంది. మనం కాస్త సంజ్ఞ చేస్తే మనని గుర్తించవచ్చు’అన్నాడు చాలా ఆదుర్దాగా. అట్లాగే ఇద్దరమూ, రెండు గుడ్డల్ని జండాల్లాగా పైకి ఎగరేసి ఊపాము, రెండు గంటల సేపు. మా అదృష్టం కొద్దీ, ఆ ఓడ దీనికి రెండు ఫర్లాంగుల దూరంలో ఆగి, మా వైపు చిన్నపడవ నొకదాన్ని పంపింది. నా మిత్రుడు ప్రకాశరావు దూరదర్శినితో ఆ ఓడ ఏ దేశపుదో పరీక్షిస్తూ సంతోషంతో వెర్రికేక వేశాడు.

‘ఏమిటిరా అది?’ అని అడిగాను వాణ్ణి.

‘నువ్వే చూడు’ అంటూ దూరదర్శిని నాచేతి కిచ్చాడు. అట్లానే దూరదర్శినిలో చూశాను. ఆ ఓడ మీద ఇంగ్లీషులో, సంస్కృతంలో, తెలుగులో, ‘మాంచాల’ అని పెద్ద అక్షరాల్లో ఉన్నది. ఆ పేరుకింద ‘ఆంధ్రారిపబ్లికు’ అని చిన్న అక్షరాల్లో రాసి వుంది. ఓడ మీద కొత్తరకం జండా ఒకటి ఎగురుతోంది.

తర్వాత అరగంట కల్లా మా సరంజామాతో ఓడలో అడుగుపెట్టాం. ఓడలో వాళ్లంతా ఆంధ్రులు., చెదురుగా ఒకరిద్దరు యూరోపియన్లు, ఇద్దరు తమిళులూ, ఒక గుజరాతీ వాడూ, ప్రయాణం చేస్తున్నారు. ఓడలో అడుగు పెట్టిం దగ్గిర నించీ, తెలుగుదేశంలో ఉన్నట్టే ఉంది. కొంతసేపటికి మాకొక పెద్దమనిషి పరిచయమైనాడు. ఆయన విశాఖపట్నం హార్బర్‌లో ఏదో ఉన్నతోద్యోగట. మేము ఆదుర్దాగా ప్రశ్నలవర్షం కురిపించాం. ఆయన మా దురదృష్టం విని చాలా విచారపడ్డాడు.

బహు ఆదరంగా సమాధానాలివ్వసాగాడు.

‘ఇండియాకు స్వాతంత్రం వొచ్చాందా?’

‘ఆహా!’

‘బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయారా? మన నాయకులు దేశం ఏకఖండంగా ఉండాలన్నారు గదా? ఆంధ్రారిపబ్లికు విడిగా వుంటానికి ఎట్లా అంగీకరించారు?’

‘నెమ్మదిగా వినండి. మన నాయకులు స్వాతంత్య్రం వొచ్చాక చాలారోజుల వరకు, ఆంధ్రరాష్ట్రానికే అంగీకరించారు గాదు. ఆంధ్రులు ఒప్పుకోక, చివరికి అన్ని రాష్ట్రాలూ విడిపోయి, ప్రత్యేక రిపబ్లికులైనాయి.’

‘అయితే జిన్నా గారి సంగతేంటి?’ ప్రకాశరావు అడిగాడు ఉత్సాహంగా.

‘మరిచిపోయినాను.. వాళ్లు మొదటనే విడిపోయారు, పాకిస్తాను సంపాయించుకుని.’

‘ఇన్ని ముక్కలుగా దేశం విడిపోతే, బలహీనం గాదూ?’ నాది మొదట్నించీ ఇదే ధోరణి. ఆఫీసర్ గారు నవ్వాడు భావగర్భితంగా.

‘పొరపాటు పడుతున్నారు. విడిపోయినంత మాత్రాన, కత్తితో నరికినట్టు ముక్కలైందనా అర్థం? ఏ రిపబ్లికు కారిపబ్లికు బలీయమై మిత్రత్వసంధులు చేసికొని, చాలా బలమైన కేంద్రాన్ని స్థాపించుకున్నాయి. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే బలమైన రాజ్యాల్లో రెండవది.’

‘అయితే యూనైటెడ్ రిపబ్లిక్స్ ఆఫ్ ఇండియా అయిందన్న మాట?’ ఇంకా వందల ప్రశ్నలు వేశాం. ఆయన అన్నిటికీ ఓపికగా ఒక్క జవాబే ఇచ్చాడు, ‘మీరు ఆంధ్రదేశంలో దిగాక అనేక ప్రశ్నలు తీరిపోతాయి’ అని.

కాకినాడ హార్బరులో ఓడ దిగాం. అది కాకినాడ హార్బరని ఓడలోవాళ్ళు చెప్పబట్టి తెలిసింది. పెద్ద పెద్ద మేడల్ని, ఫ్యాక్టరీల్నీ, నవీన పద్ధతితోటి నిర్మించబడ్డ హార్బరునూ చూసేటప్పటికి ఇదేనా కాకినాడ అనిపించి సంతోషంతోటి కంపించిపోయాం. మేము దిగీదిగటంతో, కస్టమ్సు వ్యవహారాలు ముగించుకుని ఊళ్లోకి బయల్దేరాం. పోతూపోతూ మాఓడ పరిచయుణ్ణి కొన్ని వివరాలడిగాం. ఆయన మా ఆదుర్దాకి నవ్వి ‘మీరేమీ కంగారుపడవద్దు. మీరే సమాచారం కావలన్నా ఊళ్ళలో స్టేట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో మీకు సహాయం చేస్తుంది. వెళ్లండి’ అన్నాడు.

సిటీలో అడుగుపెట్టిం దగ్గిర నుంచీ మా పని కొంచెం తికమక అయినా, ప్రతి పోలీసు, మాకు చాలా సహాయం చేశాడు. మేము అడిగిన ప్రతి వివరమూ చెబుతూ, విసుక్కోకుండా మాకు దోవలు చూపాడు. మా ఆశ్చర్యానికి మేరలేదు!

ఎంత మార్పు ! ఇది వరకు పోలీసు అంటే ‘దండన’ అని అర్థం. ఇప్పుడో – ప్రజాసేవకుడు. అంతే కాదు. కాకినాడ నిండా ట్రాములు, బస్సులు., రోడ్లల్ని, ప్రతిసందు గూడా సిమెంటుతో నిర్మించారు. ప్రతి మేడా సిమెంటు కాన్‌క్రీటుతో, ఉక్కుతో నిర్మించారు. పదంస్తుల్నించి, ఏభై అంతస్తులికి పెరిగిపోయాయి మేడలన్నీ. ఇద్దరు మిత్రులమూ.. ఓహో అనుకున్నాము. అల్పాహారం అయింతర్వాత, స్టేట్ బస్సులో ఇన్‌ఫర్మేషన్ బీరోకి వెళ్లాం.

అదొక పెద్ద ఇరవై అంతస్తుల భవనం. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ భవనంలోనే ఉన్నాయి. ఈ భవనంపైని కూడా మేము ఓడ మీద చూసిన లాంటి జండా ఒకటి ఎగురుతోంది. మాకు ఆ జండా ఏమిటో తెలీక, ఇన్‌ఫర్మేషన్ బీరో ఆఫీసర్ని అడిగాం. ఆయన నెమ్మదిగా శాంతంగా చిరునవ్వు నవ్వి, గర్వంగా ‘అది మన తెలుగు జండా, మన రిపబ్లికు ఆమోదించిన తెలుగు పతాక’ అన్నాడు.

నా మటుకునేను, తెలుగుతనంతో, నా జండా అనే మమకారంతో అపతాకముందు మోకరిల్లాను. నా పూర్వుల్ని, నా ఆప్తుల్ని, నా గత వేలయేండ్ల చరిత్రని కళ్లముందు చూసినట్టయి, కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ప్రకాశరావు కూడా మమకారం తోటి, తెలుగుతనంతోటి కంపించిపోవడం చూశాను.

ఇన్‌ఫర్మేషన్ ఆఫీసరు మా చరిత్రంతా విని, ‘ఇప్పుడు మీకే భోగట్టా కావాలో చెప్పండి. సాధ్యమైనంత వరకు మీకు సాయపడగలను’ అన్నాడు.

‘తెనాల్లో మా నాన్నాఅన్నయ్య వాళ్లూ ఉండాలి. ఇప్పుడు వాళ్లున్నారో లేదో, ఉంటే ఎక్కడ ఉన్నారో కాస్త చెప్పండి కనుక్కొని’ అని అడిగాను. ప్రకాశరావు ‘మా వాళ్లు బెజవాడలో ఉండాలి. వాళ్ల సంగతి కావాలండీ” అని అడిగాడు.

ఆఫీసర్ గారు ఒక క్షణం ఆలోచించ, మా దగ్గిర మావాళ్ల పేర్లూ అవీ అడిగి తీసుకొని, ‘మీరు ఇక్కడే ఉండండి. తెనాలీకి, విజయవాడకీ ఫోన్ చేసి కనుక్కుంటాను. మీవాళ్లుంటే, అక్కడ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసులకు పిలిపిస్తాను. మీరే సరాసరి మాట్లాడుకోవచ్చు’ అని లోపలి గదిలోకి వెళ్లాడు. మేము, ఆయన వచ్చే వరకూ, గదిలో పరిచిన రత్నకంబళి ఖరీదూ, గోడలకు వేళాడుతున్న విలువైన సిల్కు తెరల ఖరీదులూ అంచనావేస్తూ కూర్చున్నాం.

అరగంటకల్లా ఆయనవొచ్చాడు. రావటం తోటే నావైపు తిరిగి ‘మీవాళ్లు తెనాలిలోనే ఉన్నారండి. మీ నాన్నగారు కాలం చేశారట. మీ అన్నయ్యగారున్నారు. వారితో పది నిమిషాల్లో మాట్లాడవచ్చు ఫోనులో’ అనేసి, ప్రకాశరావు వైపు తిరిగి, ‘మీ తమ్ముళ్లిద్దరూ, చెల్లెలు, ఆమె భర్తా విశాఖపట్నంలో ఉన్నారట. మీ పెద్ద తమ్ముణ్ణి మీతో మాట్లాడడానికి పిలిపిస్తున్నాను ఫోన్‌లో’ అన్నాడు. మాకు ఇదంతా నిజమో, కలో బోధపడలేదు. ఇంత కొద్ది వ్యవధిలో ఇన్ని సంగతులు ఎట్లా తెలిశాయా అని నా నరాలు ఆశ్చర్యంతో కొంకర్లు పోతున్నాయి. ఇది వరకు యూరోపులో, అమెరికాలో ఇలాంటి సౌకర్యాలుండేవి అని వినేవాణ్ణి. పదినిమిషాలకల్లా లోపలి గదిలోకి వెళ్లాం. ఆ గదంతా నాకేమీ అర్థం కాని యంత్ర నిర్మితంగా ఉంది.

ఆఫీసరుగారు మా ఇద్దర్ని రెండు ఫోనుల దగ్గిరకి తీసుకెళ్లి కూర్చోబెట్టి, ప్రకాశరావు చేత ‘విశాఖ 023’ నెంబరు డయల్ చేయించి, నా చాత ‘ తెనాలి 023’ నెంబరు డయల్ చేయించాడు. రిసీవర్ చేతికి తీసుకున్నాను. నాకెదురుగుండా రేడియోవంటి ఒక యంత్రం ఉంది. దానిపై భాగంలో ఉన్న అద్దపు తెరమీద, మా అన్నయ్య రూపం కనబడ్డది. ఆ క్షణంలోనే నా చెవులో, ‘హలో రాజా.. ఎప్పుడొచ్చావు.. ఎక్కడున్నావు...’ అంటున్నాడు మా అన్నయ్య. ఇది టెలివిజన్ కాబోలునుకుంటూ ‘నేనే నన్నాయి’ అన్నాను. తర్వాత రెండు నిమిషాలు నోట మాట పెగల్లేదు.

మరుసటిరోజు ఉదయం 8 గంటలకల్లా ఆంధ్రా రిపబ్లికన్ ఎయిర్ సర్వీసు విమానాల్లో నేను ఇటు తెనాలికి, ప్రకాశరావు అటు విశాఖపట్నానికి బయలుదేరాం... మళ్లీ కలుసుకుందామని సెలవు తీసుకొని. ముప్పావుగంట ప్రయాణం తరువాత దుగ్గిరాల విమానాశ్రయంలో దిగాను. మా అన్నాయ్యా, ఆయన కొడుకులిద్దరూ విమానాశ్రయానికొచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. అందరం మా అన్నయ్య వొచ్చిన చిన్నకారులో ఇంటికి బయలుదేరాం. దారిలోనే ప్రారంభించాను నా సందేహాలడిగేందుకు.

‘తెనాలి ఇదేనా?’ నా మొదటి ప్రశ్నఅది.

అవును. ఇటు దుగ్గిరాల వరకూ, అంతా కలిసిపోయింది రాజా’ అన్నాడు అన్నయ్య.

‘ఈ కారు ఎవరిది అన్నాయి?’ అని అడిగాను. ఓ ప్లీడరు గుమాస్తా కారు ఎట్లా కొనగలడని.

‘నాదే రాజా!’ అన్నయ్య గర్వంగా అన్నాడు.

‘కారు చాలా ఖరీదుకదూ?’ ఆశ్చర్యంగా కనుక్కున్నాను.

‘ఎబ్బే, 300 రూపాయలు పెద్ద ఖరీదు’ నవ్వాడు అన్నయ్య.

‘నిజమా’

ఇంతలోనే కారు ఆగింది. ఇంట్లోకి అడుగుపెట్టాను. ఎంత మార్పు. వెనక ఓ పూరింట్లో ఉండేవాళ్లం. ఇప్పుడు ఒక మేడలో, అన్ని ఆధునిక సౌకర్యాలతోటి, ఒక చిన్నసైజు జమీందారల్లే ఉన్నాడు అన్నయ్య.

ఆ రాత్రి భోజనాలయ్యాక, మేడ మీద కూర్చొని, అన్నయ్యతో బాతాఖానీ ప్రారంభించాను.

‘అయితే అన్నాయి, ఇంత మార్పు, ఇంత సంపదా, ఆంధ్రదేశానికి ఎట్టా సంభవమైంది’

‘నువ్వు పిచ్చివాడివిరా, నీకు 1943 మనస్తత్వం పోలేదు ఇంకా’

‘అది సరే అన్నాయి.. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు’

‘అన్ని రాష్ట్రాలూ ప్రత్యేక రిపబ్లికులుగా విడిపోగానే దేని సంపదని అది అభివ్రుద్ది పరచుకోసాగింది. అట్టాగే తెలుగుదేశమూనూ. మొట్టమొదట, ఆది వరకూ బుట్టదాఖలైన ప్రాజెక్టుల ప్లానులన్నిటినీ బయటకు తీసి నిర్మించడానికి పూనుకున్నారు.’

‘ఎవరు?’

‘అధికారంలో ఉన్న కాంగ్రెసు నాయకులే’

‘ప్రాజెక్టుల నిర్మాణానికి బోలెడు డబ్బు కావాలిగా. ఎట్లా.. కేంద్రం వారు ఇచ్చారా’

‘డబ్బుకేం? ఆంధ్రులకి డబ్బులేకనా, కేంద్రం వారిచ్చేందుకు. ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటూ, ఆంధ్ర రిపబ్లికు ప్రభుత్వం, ప్రజలకి ఓ విజ్నప్తి చేసింది. ప్రతి తెలుగువాడూ తలాకొంత ఇవ్వాలని, మూడోరోజుకల్లా బోలెడు తెలుగు రూపాయలు పోగయ్యాయి’.

‘ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?’

‘మూడు పంచవర్ష ప్రణాళికల్లో, రామపాద సాగరం ప్రాజెక్టు, ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులూ తయారైనాయి. దీంతో దేశంలో అదనంగా వెనక బంజరుగా పడిఉన్న పాతిక లక్షల ఎకరాల భూమి పచ్చని పొలాలైంది. ఇదే కాకుండా ఎక్కడెక్కడ ఏమేం గనులున్నాయో వెతికి తవ్వసాగారు. ప్రాజెక్టుల్లో తయారయ్యే విద్యుచ్ఛక్తితో ఆంధ్రభూమి యావత్తూ, ప్రతి పల్లెటూరూ దీపాలయమైంది. ప్రసిద్ధమైన కర్మాగారాలు వెలిశాయి. పొలాలన్నీ ట్రాక్టర్లతో నిండాయి’

‘అయితే ఏ అమెరికాలాగానో, ఫ్రాన్సులాగానో తయారైందంటావు. భారీ యంత్రాలు ఎట్లా వచ్చినాయి’

‘మొదట విదేశాలనుంచే తెప్పించారు. ఇప్పుడు అన్నీ ఇక్కడే తయారవుతున్నాయి. మన విజయవాడ ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక నగరాల్లో ఒకటి. పెద్ద నగరాల్లో మూడవదీనూ’

‘మరి బొగ్గు, పెట్రోలే ఎట్లా’

‘రైళ్లన్నీ చవకగా వొచ్చే విద్యుచ్ఛక్తితో వస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనుల నుండి పుష్కలంగా బొగ్గు లభిస్తుంది. పెట్రోలూ, తరుగుబొగ్గూ విదేశాల నుంచి వొస్తాయి’

‘సొంత సైన్యం గూడా ఉందా తెలుగు రిపబ్లిక్‌కు?’

‘ఉంది. సుప్రసిద్ధమైన నావికాబలం, వైమానిక బలం, అన్ని రకాలైన మిలటరీ బలాలూ ఉన్నాయి మనకి. వీటన్నిటికీ తోడు, ఇతర రిపబ్లికులతోటి మైత్రి ఒక అభేద్యమైన బలం.’

‘అయితే అన్నాయి, ఇది వరకు హిందీ దేశభాష కావలనేవారు గదా, హిందీ ఏమన్నా నిర్భందమా?’

‘ఏమీ లేదు. మన విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, కాకినాడ, రాయలసీమ విశ్వవిద్యాలయాల్లోనూ, ఇతర కళాశాల్లలోనూ ప్రపంచ భాషలలన్నీ నేర్చుకోవచ్చు, తెలుగు ఒక్కటే తప్పనిసరిగా రావాలి. నిజం చెప్పాల్సివస్తే వెనక, ప్రపంచానికి ఫ్రెంచి సాహిత్యం ఎంత గొప్పగా వుండేదో, ఇవ్వాళ తెలుగు సాహిత్యం ప్రపంచానికి అంత గొప్పదైంది’

‘అంతా సరేగానీ, ఇంత మార్పురావటానికి, ఆదివరకు కన్న ఇప్పుడున్న అవకాశాలేమిటంటావు’

‘ఏముంద రాజా! విదేశీ క్షవరం ఒదిలినా, ఉత్తరాది క్షవరం ఉన్నన్నాళ్లూ ఆంధ్రజాతి ఒకటి ఉన్నదన్న సంగతే ప్రపంచానికి తెలిసింది కాదు., ఆంధ్రజాతి విడిపోయి, తన కాళ్ళ మీద తాను నిలబడి, తన సంపదని అభివ్రుధ్ది చేసుకోనారంభించగానే ప్రపంచమే విస్తుపోయింది. ఆంధ్రదేశం ఒకప్పుడు కరువులతో మాడింది. కేంద్రం వారు దయతలిస్తే.. కాసిని గోధుమలు వచ్చేవి. ఇప్పుడో ? తెలుగు గడ్డ నుంచి, తెలుగు వారు తమకు పోను మిగిలిన బియ్యం, గోధుమలు ఇతర దేశాలకు సప్లయి చేస్తున్నారు.

‘ఇంతకీ, తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంత సిరి సంపన్నమైందంటావు’

‘సరిగ్గా అదే.’