కోనంగి/త్రయోదశ పథం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


త్రయోదశ పథం

స్వప్న ప్రపంచం

కోనంగి జైలులో ఏదో స్వప్నప్రపంచంలో జీవించసాగాడు. మహామహులైన ఆంధ్రనాయకులు, తమిళ, మళయాళ, కర్ణాటక నాయకులు జైలు నిండా ఉన్నారు.

దూరాన ఉన్నప్పుడు వారు దేవతలులా తోచారు కోనంగికి. దగ్గరకు వస్తే చెమటలు పట్టే మానవులు.

వారి కోపాలు, వారి ఆశలు, వారి నిస్పృహలు, వారి అపేక్షలు దుర్బిణీయంత్రంలో కనబడినట్లయింది కోనంగికి. అతనికి భయమూ కలిగింది, అనుకంపమూ కలిగింది.

చిన్న చిన్న జాతీయవాదులు మొదటి నుంచి కోనంగికి సంపూర్ణంగా అర్థమయిన వారే! అలాగే నేడూ ప్రత్యక్షమయినారు.

కొందరికి ప్రపంచం పయిన కోపం, కొందరికి తమ పైననే కోపం. అందరికీ దేనిపైనో కోపం! కోపం లేనివారు ప్రేమించడం ఎలా సాధ్యం. కాబట్టే దేశాన్ని అకుంఠితంగా అందరూ ప్రేమిస్తారు. ఆ ప్రేమలో ఇమిడే వారి సంపూర్ణత్వాలు శ్రుతిలో కనబడ్డాయి కోనంగికి.

కాంగ్రెసు ప్రచారకులకూ, సేవకులకూ, నాయకులకూ అతడు క్రొత్తవాడు. అందరూ అతన్ని ఎరుగరు. అతని పత్రికను అందరూ ఎరుగుదురు. అందరూ అతన్ని ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు భావించుకున్నారు. కొందరికి అతడు సన్నగా పొట్టిగా ఉంటాడని తోచింది కొందరు సన్నగా పొడుగ్గా ఉంటాడని మనస్సులో అనుకున్నారు. కొందరి ఊహలో అతడు బంగారు ఛాయ. మరి కొందరి హృదయ దర్పణంలో అతడు నల్లగా కన్పించాడు. అతడు ఏ రంగో, ఎలా ఉంటాడో కొందరు ఊహించనేలేదు.

అందరూ అతన్ని చూడడం ఆనందంగా ఉంది అన్నారు. కొందరికి ఉడుకుబోతుతనం. కొందరు మెచ్చుకున్నారు. కొందరు బాగానే ఉంది కోనంగి పని అనుకున్నారు.

కోనంగి ఇతరులను అర్థం చేనుకుందాము అని ప్రయత్నించాడు. “కొందరిని పూర్తిగా గ్రహించగలను” అనుకున్నాడు.

“ఎందుకు వీరు స్వాతంత్ర్యంకోసం ఈలాటి బాధలు పడడం?” అని ప్రశ్నించు కున్నాడు. తన స్నేహితుడు డాక్టర్ రెడ్డి కమ్యూనిస్టు. సామ్యవాదంకోసమే పాటుపడుతున్నాను అనుకొంటాడు. ఎందుకాతనికి ఆ గొడవ?

యుద్ధాలకు వెడతారు ప్రాణాలకు వెరవకుండా! దేనికీ వెరవకుండా ప్రాణాలు బలి తీసుకుంటారు.

ఆలోచించినకొలదీ కోనంగికి ఆవేశోత్సాహం కలిగింది. అతడు సర్వవిశ్వమూ తిరిగి వస్తాడు. ఆ విశ్వాన్ని ఎన్ని రకాలుగా దర్శింపవచ్చును? ఆ దర్శించడము భయకారణమూ, ఆనందయుతమూ, హాస్యపూర్ణమూ ఔతుంది.

“ఉత్సాహమూ, కల్లూ ఒకటేనా?” అని కోనంగి ఆలోచించేవాడు. ఉత్సాహం మనుష్యుణ్ణి వీర భూమిలో తాండవం ఆడిస్తుంది. ఉత్సాహంలో దేశాలు నాశనం చేయగలడు. ప్రాణాలు వేలకొలదీ అర్పించగలడున్నూ.

కోనంగి జయిలులో తన తోటి వారందరినీ హాస్య వస్తువులుగా చూద్దామను కుంటాడు. అలాంటి సమయంలో అతని కళ్ళకు కొందరి పెద్ద ముక్కులు రాంబందు ముక్కులులా కనబడతాయి. కొందరాతనికి కంఠం లేనివారుగా ప్రత్యక్షమవుతారు. కొందరి చేతులు మాత్రమే కోనంగికి కనబడేవి.

ఎవరికయినా ప్రేమ మూత్తమ సంస్థ అనుకుంటాడు కోనంగి. అనంతలక్ష్మితో ఈ మానవ ప్రపంచం దర్శించడం ఆనంద శిఖరితమే అనుకున్నాడు. జైలులో ఉన్న రెండువేల ఖయిదీలు కోనంగికి కనపడ్డారు. జయిలు పైన ప్రపంచ జనసంఖ్య ఏమీ అతనికి కనబడేదికాదు. అతనికి కావాలన్నప్పుడే హృదయంలో ఏదో కవాటం తెరచి చూచేవాడు. ఇప్పుడు జనం మధ్యనే సర్వకాల సర్వావస్థలూ ఉన్నట్లు తోచింది కోనంగిరావుకు.

రాత్రిళ్ళు తనతో తెచ్చుకున్న నరసారావుపేట మంచంమీద పడుకుని ఆ జైలుగదిలో ఆకాశమూ, తారకలూ, సర్వవిశ్వమూ దర్శించేవాడు.

ఒకరి పోలికలొకరికి లేక ఆంధ్ర ప్రజలందరూ వేరువేరుగా ప్రత్యక్షమై కనపడ్డారాతనికి. కాని ఈ భిన్నత్వంలో ఏకత్వమూ కనబడింది.

ఈఏకత్వమే భూమి అని అతడు అనుకున్నాడు. ఈ భూమిలో మానవజాతికి విత్తనాలు ఉండేవా? అవి తక్కిన గ్రహాలలో, గ్రహరాట్ సూర్యునిలో ఉండేవా? అన్ని లక్షల డిగ్రీల వేడిలోనూ ఉండేవా?

అప్పుడు కావ్యాలు, చిత్రలేఖనాలు ఆ మహెూష్ణస్థితిలో ఉండేవా?

ప్రపంచంలోని సర్వభావాలూ ఆ సూర్యమండలంలో ఉండేవా?

ప్రేమ! ఏ విధంగా ప్రేమికులు?

2

“ఏమండీ కోనంగిరావుగారూ, మీరు ఈ యుద్ధం జరిగినన్నాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం పైన కత్తికట్టకుండా మీ పత్రిక నడుపుతామనీ, యుద్దం బాగా సాగేందుకు మీకు శక్తి ఉన్నంతమట్టుకు పనిచేస్తామనీ మాటఇస్తే ప్రభుత్వంవారు మిమ్ము వదలివేస్తారు. మీకు ప్రభుత్వం ఎన్నో సహాయాలు చేస్తుంది” తని వేలూరు జయిలులో సూపరింటెండెంటు గదికి పక్కనున్న గదిలో కోనంగిరావును కలుసుకొని ఒక గూఢచారోద్యోగి తెలిపినాడు.

కోనంగిరావు ఆశ్చర్యం పొందాడు. ఇది ప్రభుత్వంవారు పంపిన రాయబారమా? లేక తన హృదయాన్ని పరీక్షించడానికి వచ్చాడా? అని కోనంగి అనుకున్నాడు. వెంటనే కోనంగి “అయ్యా, మీరు ఆ ప్రశ్న అడగకూడదు, నేను జవాబు చెప్పకూడదు” అని ప్రత్యుత్తర మిచ్చాడు.

“యుద్ధం ఉన్నంతకాలమేగా, మేము మీ బోటివాళ్ళ సహకారం వాంఛిస్తున్నది?”

“ఆ తర్వా త!”

“ఆ తర్వాత కాంగ్రెసు తన ఇష్టం వచ్చినట్లు చేసుకొనవచ్చును.”

“ఇనస్పెక్టరుగారూ, మీరు నాతో ఈలాంటి విషయాలు మాటాడకూడదు, నేను వినకూడదు.”

ఆ గూఢచారి ఉద్యోగి “ఆలోచించండి, తొందరపడకండి” అని కోనంగికి సలహానిచ్చి వెళ్ళిపోయాడు.

కోనంగి నవ్వుకొన్నాడు. ప్రపంచం అంతా హాస్యంతో నిండివుంది. హిట్లరు, స్టాలిన్ వంటి ప్రపంచనాయకులు ప్రపంచ స్వరూపాన్నే మార్చడానికి ప్రయత్నిస్తారు. ప్రపంచశక్తి ఒక తిమింగలం ఐతే, దాని ముక్కుకు ఒక సన్నదారం కట్టి ఈ నాయకులు ఆ తిమింగలాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తారు. తిమింగలము తన దారిని తానే వెడుతూ ఉంటే, తామే నడుపుతున్నామనుకుంటారు. ఒక్కొక్కప్పుడు ఆ దారపు లాగుళ్ళే హృదయానికి నూత్న స్పందనాలు కలగడానికి కారణాలవుతున్నాయి. ఇంతకన్న హాస్యరసం ప్రపంచంలో ఎక్కడుంది? తను నాయకుడనని తనకే తెలియని పిచ్చివాని మాటలు లోకానికి ఒక్కొక్కప్పుడు పరమాద్భుతమయిన దారి చూపిస్తాయి.

కోనంగికి ఏదో కుంగిపోయినట్లయింది. లోకంలో నవ్వుకు తావు ఉందా? లోకం అంతా బాధాపూర్ణ జీవితాలతో నిండి వున్నప్పుడు నవ్వడం ప్రపంచాన్ని అవమానించినట్లా?

ఈ లోకం అంతా ఒక్కసారి ఆనందపడుతుందా? మహాత్మాజీ జన్మదిన మహెూత్సవం ఇరవై కోట్ల భారతీయులకు ఆనందం ఇస్తే, తక్కినవారికి? హిందూదేశంలోనే అనేకులు పళ్ళు కొరుక్కోవచ్చును. లోకం అంతా ఒక్కసారిగా ఎండకాసి, ఉక్కబోసి, ప్రాణుల్ని మలమల మాడ్చి, ఆ వెంట ఒక మంచి రోజున చల్లనిగాలీ, జల్లున వానా, కురిస్తే కూడా అందరూ ఆనందించరు. కాని ప్రపంచ తత్వమే వెలుగునీడలతోనూ, నవ్వు ఏడుపులతోనూ నిండి ఉండే పథకంలో ఉన్నప్పుడు, నవ్వే ఉండాలని మనుష్యుడు వాంఛించి అది లేదని బాధను పొందడం వెర్రితనమే ఔతుంది.

మనుష్యుడు ఒక్కడూ ఉండడానికి భయపడతాడు. అందుకని కారాగారవాసము మనుష్యునికి బాధ ఐంది. కాని పురుషులలో పురుషశక్తి స్త్రీశక్తి ఇవ్వగలిగిన ఉపశమనం కోరుతుంది. ఒకే శ్రుతిలో నడిచే స్త్రీ పురుషులు ఒకరి కొకరు నవ్వూ, వెలుగూ ఔతారు. అపశ్రుతికల కుటుంబం యమలోకం.

తాను యమలోకంలో ఉన్నా అనంతలక్ష్మి ప్రక్కనే వుంటే యమధర్మరాజుపై ఆభిశంసన తీర్మానం పెట్టగలశక్తి సంపాదించే ఉండును.

అనంతలక్ష్మి అనుమానం పటాపంచలైంది. ఆ ఆలోచన రాగానే కోనంగికి తన్మయత్వము, ఆనందావేశము కలిగినవి. అతడు తండ్రి కాబోతున్నాడు. ఇది కాదా సృష్టి? మనుష్యునికి జీవితంలో దొరకని శ్రుతి స్వప్నలోకంలో దర్శనం అవుతుంది అనుకున్నాడు.

అతడు డాక్టరును ఆపేక్షతో తలపోసుకున్నాడు. డాక్టరుకూ చౌధురాణికీ వివాహం అవడం ఎంతచక్కని శ్రుతి! స్టాలిన్ కు నాడియా వంటి భార్య ఆమె! లోకంమీదున్న అతనికోపం చౌధురాణి హస్తపల్లవ కమస్పర్శ వల్ల నశించి ముడుతలు పడిపోయిన అతనిఫాలము స్నిగ్ధమై కాంతివంతమై పోతుంది.

ఏ అనుభవమైనా సన్నిహితమైనవరకూ ఆ అనుభవం అసంభవమని మనుష్యు డనుకుంటాడు. అ అనుభవము గ్రంథాలలో మాత్రం ఉంది అనుకుంటాడు. గ్రంథాలలో లిఖించినవాళ్ళూ, ఆ అనుభవము వాంఛించో, అనుభవించే వ్రాస్తారుగదా!

కోనంగి ఉప్పొంగిపోయాడు. అతడు తన గదిలో గోడను గట్టిగా హృదయానికి అదుముకొని శ్రుతా, అపశ్రుతా విశ్వంలో ఎక్కువ బలవత్తరమైనది? 'విశ్వశ్రుతిలో అపశ్రుతి ఇమిడి ఉండాలి. అపశ్రుతిలోని శ్రుతి శక్తివ్యక్తమైన ఈశ్వరునివంటిది.

కోనంగి కటకటాలవద్దకు వచ్చి, ఆ రాత్రిలో ఆ దూరపు నక్షత్ర లోకంలో భారతీయ వేదన దర్శించుకొన్నాడు. సంస్కారంలో ఎంతో తేడా ఉన్న మనుష్యులు, వందలకొలది భాషలు, వందలకొలది మతాలు, ఎన్నో భేదాలున్న ఆశయాలు, రాజకీయభావాలు. ఈ జనం అంతా బానిసత్వంతో ఎక్కడికి పోతున్నారు?

తన దేశము, తన మన్ను, తన నదులు, తన గాలి, తన పొలాలు, తన ప్రజలు తనలోనే ప్రతిఫలిస్తున్నారు. రాజ్యాలు, విదేశీయులు, యుద్దాలు, నాశనాలు, కరువులు, రోగాలు, వివిధమతాలు ఉద్భవించడం, మతయుద్దాలు, బానిసత్వము, బానిసత్వాన్ని నాశనం చేసి స్వేచ్ఛ పొందాలన్న కాంక్ష, అందుకు ప్రయత్నాలు, కుట్ర, రహస్యమార్గాలు, ప్రథమ స్వాతంత్ర్యయుద్దము, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, కాంగ్రెసు సంస్థ ఉద్భవము, మాధ్యమికవాదులు, కుర్చీవాదులు, అతివాదులు, రాజకీయ హత్యలు, జాతీయ మహాభావోద్భవము, జాతీయ భావ అఖండతాండవము, హింస, అహింసభావోద్భవము, గాంధీ మహాత్ముడు, సత్యాగ్రహం, ఖైదు, పాకిస్తాన్ భావప్రాదుర్భావము - ఓహెూ! తనదేశం ఎన్నాళ్ళవరకు ఈ పంజరంలో ఉండడం?

అతడు క్రుంగిపోయాడు, వణికినాడు, ముడుచుకుపోయినాడు.

నక్షత్రాల వంటి బిందువులు నక్షత్ర కాంతిని ప్రతిబింబిస్తూ అతని కళ్ళల్లో సుడి తిరిగినవి.

తాను కటకటాల వెనుక, తనదేశం కటకటాల వెనుక, అఖిలాశియా కటకటాల వెనుక - ముందు పహరా ఇచ్చే తెల్లవాడు:

* * * *

చూస్తూ చూస్తూ, కటకటాలదగ్గరే, కుంగి జారిపోయే నక్షత్రాలను చూస్తూ కోనంగి.

తన భావాలనూ, జీవితమార్గాన్నీ రియాసత్ మార్చుకోలేడు. తన పట్టుదలను మెహరున్నీసా తగ్గించుకోలేదు. రియాసత్ మేహరున్నిసాను ప్రేమించిన ప్రేమ అతిసనాతనమూ, అతిపవిత్రమూ ఆయినది. మెహర్ తన్ను ప్రేమించినది. అ ప్రేమను ఆమె మరచిపోలేదని అతనికి తెలుసును. మెహర్ అందం అతిలోకమయినది. ఆమె అందాన్నిచూచి బాలికలే ముగ్గులయ్యేవారు.

బాలికల అందం బాలురకోసం. బాలురకు అందం ఉన్నా, లేకపోయినా అందమే. అరేబియన్ కధలలో కమరజ్జమాన్ అందము బాలికల అందమేమో!

అందమునకు, ప్రేమకు, జీవితమునకు, మానవుని ఆశయాలకు, సంకల్పించుకొన్న కర్మలకు ఏమి సంబంధం ఉందో? లోకమంతా బాలికల అందాలను గురించి కావ్యావళి వ్రాస్తుంది. బాలికల అందం లోక వ్యవహారాలలో అర్థం లేనిదా? లోకాద్భుత సౌందర్యమయిన నూర్జహాను మొగలుసామ్రాజ్యం అంతా అవిచ్చిన్నంగా ఏలింది.

లోకంలో ప్రేమలే లేవా? ఈ ప్రేమ లోకానికి అడ్డం తగిలితే నశించిపోవాలా?

సాధారణంగా ముస్లింబాలికలు ప్రేమించుట ఎరుగరు. వారు పరపురుషుల కంట పడనే పడరు. పరపురుషుల చూడవలెనన్న ఆలోచన వారికి కలుగదు.

* * * *

తానూ, తన బావా చిన్నతనాన్నుంచీ ఒకచోట ఆడుకొని, ఒకేచోటే చదువుకోవడం చేత ప్రేమ ఉద్భవించడానికి కారణమయింది. ఒక రాజకీయ మార్గం అల్లాకు ప్రీతికరమయి, ఇంకో రాజకీయమార్గం కాబోదా? ఐతే సున్నీలు అల్లాకు ఎక్కువ ప్రియులా? షియ్యాలా? మైహర్ ఆలోచనాధీన ఆయినది ఒకనాడు.

సున్నీలకు, షియాలకు, అహమదియాలకు, భోరాలకు, ఇస్తామీలకు, సుఫీలకు అల్లా ప్రేమలో తేడాలుండగలవా? రాజకీయమార్గాలలో ముస్లింలీగువారు ఎక్కువ ప్రియులై జైమతులు. అహరులు దూరం అవుతారా? ఖాకారుల మాట? ఎవరయినా ముస్లిములైతే అల్లాకు దగ్గరై, కాఫరులు మొదలయినవారు దూరమా?

ఈ పెళ్ళిమాటలు లోనలోన దాగి ఉండి పైకి రానంతకాలమూ తనకు బావను గురించిన అపోహాదికాలు రావలసిన అవసరమే లేకపోయింది. పెళ్ళినిగూర్చిన మాటలు వ్యక్తమైనప్పటినుంచీ, తన బావను తాను మైక్రోస్కోపులో పెట్టి చూచుకొన ప్రారంభించింది.

ప్రేమ విషయంలో నవీనధర్మం ప్రకారం స్త్రీకోసం పురుషుడూ, పురుషునికోసం స్త్రీయున్నూ తన సర్వస్వమూ ఆహుతించడానికి సిద్దంగా ఉండాలి. తన బావ తన రాజకీయపక్షం నుండి విడివడినాడు. ఇంక తనకు మాత్రం ఇజ్జత్ (గౌరవము) లేదా? అభిమానం లేదా?

అభిమానమే గొప్పా? ప్రేమ గొప్పా? మెహరున్నీసాకు కంటనీళ్ళు తిరిగాయి. రియాసత్ మాట్లాడడు. దూరాన్నుంచి తన్ను ప్రేమమయదృష్ణుల తిలకిస్తాడు. వెళ్ళిపోతాడు.

తన తండ్రి ముస్లింలీగ్ నాయకులలో ఒకరు. తన బావ జాతీయ నాయకులలో ఒకడు. పాకిస్తాన్ విషయమయి ముస్లింలీగు నాయకవర్గం అనుమానరహితంగా మాట్లాడుతోంది.

పాకిస్తానం సృష్టించడం ముస్లింజాతిని రక్షించడం. ముస్లింజాతిని రక్షించకపోతే ముస్లింజాతి నశించిపోతుంది. ఆ జాతి నశిస్తే ఇస్లాం మతమే నశిస్తుంది. అలాంటి పాకిస్తానును కోరకూడదనే ముస్లిం మతద్రోహి కాడా? ఏమో ఎవరికి తెలుసు?

ఆమె లోగొంతుకతో ఈ పాట పాడుకొనసాగింది.

“ఏక్ ఖాబ్ సాదే ఖాతా

మాలుం నహి క్యా?

'ఆబ్ తక్ అసరే ఖాబ్ హై

మాలుం నహీ క్యుం?

బేకైవ్ మైనాబ్ హై

మాలుం నహీ క్యుం?

ఫీకీ షబే మెహతాబ్ హై

మాలుం నహీ క్యుం?

(ఒకనాడొక కలను కంటి

ఆ కలనే మరచిపోతి

కాని నన్ను ఆ స్వప్నము

శాంతి పారద్రోలిపోయెకారణమే తెలియదాయె
నాడు నిండు వెన్నెలలో
ఏదో పరిమళ ముండెను
ఈ దినమున ఈ వెన్నెల
కర్కశమై పొడి రాలెను
కారణమే తెలియరాదు
కారణమే తెలియరాలేదు.)

మెహరున్నీసా నిట్టూర్పుపుచ్చి ముందున్న బల్ల పైన మోము వాల్చింది. ఇంతలో ఆమె తండ్రి అక్కడకు వచ్చాడు. “బేటీ! ఏమిటి అల్లాగు పడుకోన్నావు?” అని ఆయన కొమరితను ప్రశ్నించాడు.

“అబ్బాజాన్, ఏమీలేదు.”

“ఏమీలేదు అనకమ్మా. అంతా నాకు అర్థం అయినది. నేను లీగు మనిషినే, అయితే ఏమి నీ మోస్తరుగా నాకు వెర్రిపట్టుదల తక్కువేమో?”

“అబ్బాజాన్! మీకు లీగు అంటేనే పట్టుదల తక్కువేమో?”

“బేటీ! నీ మాటలకేమన్నా అర్థంఉందా?”

“మీ మాటలకేమన్నా అర్థం ఉందా?”

“మన భావాలూ, మన నడకలూ ఒకదానికొకటి శ్రుతి కలిగి ఉండాలి. కొన్ని మతదృష్ట్యా, కొన్ని రాజకీయదృష్ట్యా చూచి, ఈ రెంటిని సమన్వయం కుదుర్చుకోకుండా ఉంటే జీవితం అంతా కష్టాలతో నిండిపోతుంది.”

“సమన్వయం కుదిరినవాళ్ళకు కష్టాలు రావా అబ్బాజాన్?”

“వస్తాయి బేటీ! కాని, ఆ కష్టాలు మనుష్యులు సంతోషంతో భరిస్తారు. లేకపోతే ముక్కలయిపోతారు.”

“ఇంతకూ మీరనేది?”

“నేననేది ఏముంది? రియాసత్ ఉత్తముడు. అతన్ని నీతో సమానంగా ప్రేమించి పెంచాను. మీ ఇద్దరి వివాహము చిన్నతనాన్నుంచీ కాంక్షించాను. దానికి తగినట్లు మీ రిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొంటూ పెరిగారు. నా హృదయానికి పట్టలేని ఆనందం వచ్చేది మీ ఇద్దరి ప్రేమా సందర్శిస్తూంటే. అలాంటిది నీకు ఎక్కడ నుండి వచ్చిందో ఈ పట్టుదల?”

“అబ్బాజాన్! మేము వివిధపక్షాలకు చెందినవాళ్ళము. మా సంసారం ఆనందంగా ఎలా నడుస్తుంది?”

“ఓసి వెర్రితల్లీ! మన బాలురు ఇంగ్లండు వెళ్ళి ఇంగ్లీషు భార్యలను కట్టుకు వస్తున్నారు. వాళ్ళ ఆచారాలు, భావాలు వేరు. మనవి వేరు. అయినా ఆ భార్యాభర్తలు ఎంత ఆనందంగా జీవితం గడపటంలేదు?”

మెహర్ లేచి చిరునవ్వునవ్వుతూ తండ్రికి సలాముచేసి “అబ్బాజాన్! మీ హృదయం నవనీతం!” అని వెళ్ళిపోయింది.

3

యుగయుగాలనుండీ మానవులలో తేడాలు. ఆ తేడాలు తీసివేయాలని పెద్దల ప్రయత్నాలు. నీచస్థితిలో ఉన్న మనుష్యులలోనే పైకి పోవాలన్న వాంఛ పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. పంజరంలోని పక్షి రెక్కలు టపటప కొట్టుకున్నా పైకి పోలేనట్లు ఆ నీచమానవులు వృధాగా ఇనుపగోడలు బద్దలుకొట్టుకుందామని చూస్తారు.

ప్రపంచంలో ఏదోమూల అధమస్థితిలో ఉన్న మనుష్య జాతులు ఉండేవారు. ఈనాడు నీగ్రోలు, ఆస్ట్రేలియా, న్యూగినియా, న్యూజిలాండులలో అథమమానవుడు ప్రయత్నించి ఎక్కువగా నాగరికతగల జాతుల విశాలకరాళాలలో బోల్తాలై పడిపోయారు. ఎప్పుడూ ఒకజాతి విజృంభణ వేరొకజాతి నాశనానికే! అన్ని జాతులూ మహాసామరస్యంలో ఎప్పుడయినా పైకి రాలేవా?

ఈ ప్రశ్నవేసుకుంటూ ఆ నవంబరు రాత్రి వాన జోరుగా కురుస్తూండగా రియాసత్ ఆలీ తన ఇంటిముందు ఒక కారు ఆగడం గమనించాడు.

అతడేదో స్వప్నంలో పడిపోయినాడు. కారులు! అందరికీ కారులేవి? అందరికీ కారు లెప్పుడన్నా రాగలవా? జట్కాలే అందరికీ లేవు. ఒక మనుష్యుడు ఇంకొక మనుష్యుని బండి డబ్బుకోసం లాక్కుపోయే రోజులే ఎప్పుడూ ఉంటాయి. ఆ రిక్షాలలో అందరూ ఎక్కరు. ఆ రిక్షాలు అందరూ లాగలేరు. లోకంలో ఎప్పుడూ మనుష్యులను నడుపుకోవాలి. ఒక్కడ్రయివరు కొన్ని వందలమందిని రైలులో నడుపుకొని పోతున్నాడు. ఎడ్లబండయినా మనుష్యుడు తోలవలసిందే!

ఈలా రయిలు మొదలయిన బళ్ళను నడిపే మనుష్యుడు ఏదో మహా స్వప్నాన్ని అల్లుకుంటాడు. ఆ స్వప్నంలో ప్రగతి ఉందని స్వప్న ప్రారంభం జీవితంలోంచి, స్వప్న ప్రాంతం జీవితంలోకి నడక. ఈ స్వప్న రూపమయిన కారును నడిపే డ్రైవరెవడు? ఎవరికి వారే స్వప్న చోదకులయితే మనకు కావలసిన మధుర స్వప్నాలే మనం అల్లుకుంటూ ఉందుము.

వీధిలో కారు భోం థోం అంది. జోరున వానా, భోం థోం థోం అని ఆ కారుహారను అంది.

ఎవరికోసమో ఆ కారు ఎప్పుడూ ఎవరికోసమో బండి వస్తూనే ఉంటుంది. ఎవరూ లేకుండా కారు వెళ్ళిపోయినట్లు జీవితం మనుష్యులు లేకుండా వెళ్ళిపోగలదా? రియాసత్ ఆలీ లేచి నుంచున్నాడు..

ఎదుట రియాసత్గారి భయ్యా నుంచొని, “సర్కార్! మీకోసం ఎవరో పెద్దలు వచ్చి మీ డ్రాయింగురూములో కూర్చున్నారు” అని విన్నవించుకొన్నాడు.

రియాసత్ విసుక్కుంటూ “కూర్చోపెట్టు, వస్తున్నాను” అని ఆజ్ఞ ఇచ్చి మళ్ళీ భంగమయిన స్వప్నాన్ని ఆహ్వానించుకొన్నాడు.

ఏ స్వప్నానికైనా ఆదిదేవత ఉండాలికదా అనుకున్నాడు. తనదేవి తనకు సాక్షాత్కరించిన కోనంగికి స్వప్న మధ్యస్థ ఎవరు ఇంక? అతనికి కలలుంటాయా? తన స్వప్నాధిదేవి ఇక తనకు కాదు. ఎప్పుడూ స్వప్నంలోనే ఉంటుంది. లైలా మజ్నూల గాథే తనగాథానూ, మజ్నూలానిరాశ పొందిన ప్రతి యువక ప్రేమికుడు ఎడారుల వెంట పోవాలి! ఈనాటి ఎడారులే మానవ ప్రయత్నాలా? అని అనుకున్నాడు రియాసత్.

ఎవరు ఈ వచ్చింది అని రియాసత్ లేచి, గబగబ అతిథిమందిరం లోనికిపోయి గుమ్మం దగ్గర నిలువబడి గదిలోనికి చూచాడు. అతడు తెల్లబోయినాడు. గొంతుకు డగుత్తిక పడింది. అతని చేతులు వణికి పోయాయి.

మెహరున్నీసా ఒక కుర్చీలో కన్నులు మూసికొని తల వెనుకకు వాల్చి కూర్చొని ఉంది.

“మెహర్!”

మెహర్ కన్నులు తెరచి చిరునవ్వు నవ్వింది. వెన్నెలలు స్వప్నాలు రంగరింపయి పోయి సుడిగుండాలయినవి.

“మెహర్! నువ్వా?”

“ఔను నేనే! అనుమానమా? నేనో కాదో ఈలా వచ్చి ఈ చేతులు స్పృశించి చూచుకోరాదూ?”

“నువ్వు వట్టి కలవేమో?”

“కలలోని బాలిక మాత్రం స్వప్న సమాగమానికి రాకూడదా?”

“మెహర్! నన్ను క్షమించే వచ్చావా?”

“ఏమి ఇంచానో, రావడం మాత్రం వచ్చాను.”

“కోనంగిరావులా మాట్లాడుతున్నావు.”

“ఆయన మళ్ళీ జైలుకు వెళ్ళినాడుగా, అనంతలక్ష్మి చెప్పింది. అక్కడ నుంచే ఇక్కడకు వచ్చాను. అబ్బాజాన్ కారులో ఉన్నారు.”

“మామూజాన్ వచ్చారా?”

“ముందర నాతో మాట్లాడకూడదా?”

“నేను నీతో యుగాలు మాట్లాడినా నాకు తృప్తి తీరుతుందా? మెహర్! ఎలా కలిగింది నీకీ పరమదయ?”

“నేను ప్రేమ మరచిపోగలనా డార్లింగ్!”

“డార్లింగ్! మెహర్ నన్ను క్షమించావు, కాని....”

“కానీలేదూ అర్ధణాలేదు. నీ భావాలు నీవి. నా భావాలు నావి. నేను ముస్లింలీగు దానినే. నీ రాజకీయాలు నీవి. కాని మన ప్రేమ కవి అంతరాయాలు కల్పించగలవా? అని నీవు నన్నడిగిన ప్రశ్న సమంజసమే! నీ ఆదేశమే నాకు పరమవాక్కు”

రియాసత్ సంతోషంతో వణికిపోయాడు. అతని కన్నుల నీరు తిరిగింది. ఆతడు చిరునవ్వుతో వచ్చి మెహర్ పాదాల దగ్గర మోకరించి సైగల్ గొంతుకవంటి గొంతుతో,

“పకీ దునియా బసాలే, మేరే మన్ దునియా బసాలే
దూరకహీఁజహాంకోయి ఆ నసకేగా
దరద్భరే గీతా కోయి గా నసకేగా
చుప్కేసే నైననమే సీత్ బులావే
మేరే మన్ దునియా బసాలే
చోటీసీ దునియా వో ధోటీసీ బాతేఁ
చోటీసీ దిన్ హెూఁఅవుర్ చోటిచోటీ రాతేఁ
రాతోంకో సవనోనె ఖబ్ సజాలే

మేరే మన్ దునియా బసాలే

ఘర్ ఘర్ హెూఁజాదూకే ఖేల్ నిరాలే
సాఫ్ చెలీ ఆయ్ జహాఁలూట్నేవాలే
ఓతుఝకో మనాలే తు ఆగర్ ముఝకో మనాలే

మేరే మన్ దునియా బసాలే”

అని పాడుతూ ఆమెను కౌగలించుకున్నాడు.

4

అనంతలక్ష్మికి లోన శిశువు నృత్యము చేయుచున్నాడు. పగడముల వలెనుండు ఆమె పెదవులు ముత్యముల రంగులను పులుముకొనుచున్నవి. దేహము కొంచెము నీరు పట్టినట్లున్నది. ఆయాసము, కదలక పండుకొనవలెనని కోరిక. కాని డాక్టరు రెడ్డి “ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండు అనంతలక్ష్మీ!” అని ఆదేశమివ్వడంవల్ల నడక, చెట్లకు నీళ్ళు పోయడం మొదలగు పనులు చేస్తూ ఉండేది.

తన గురువు తన జీవితంలోకి ఎంత విచిత్రంగా వచ్చినారు! పూర్వజన్మలో తన తపస్సు ఎంత గొప్పది అయి ఉండాలి. లేకపోతే చీకటిలో వెన్నెలకిరణం ప్రవేశించినట్లు వారు తన జీవితంలో ఎందుకు ప్రవేశిస్తారు? ఆ వెన్నెలే తన జీవితంలో లేకపోతే, చెట్టియారనే చీకటి దయ్యం నోటిలో పడిపోయి ఉండును తాను.

తాను నేర్చుకొన్న సంగీతము, తనలోని మహత్తర గంధర్వకళ వారికి వినిపిస్తోంటే అలా ఒయ్యారంగా సోఫాలో పండుకొని తన్ను తన చూపులతో తన సంగీతము తన చెవులతో ఆస్వాదిస్తూ, దూరాన నుండి చూపులతో తన పెదవులను చుంబిస్తూ, ఊర్పులతో పైకి ఉబుకుతూ దిగుతూ ఉండు తన వక్షోజాలను చుంబిస్తూ, ఫిడేలు తీగలపై లతలపై ఊగులాడు పూవులవలె నున్నవని ఎన్నిసారులో పోల్చిన వేళ్ళను చుంబిస్తూ ఎదుట ప్రత్యక్షమై ఉండిన ఆ దివ్యపురుషుని తాను వినరాని మాట అంది.

ఎన్నిసారులో తనమీద తామే రచించిన గీతికలు చదువుతూ, తన్ను ఫిడేలుతో ప్రక్కవాద్యం వాయించమనేవారు. తమ పాటలకు నన్ను రాగమూ, తాళమూ, పాడే విధానం సంతరించు అనంతం అనేవారు. ఏమి అద్భుత కవిత్వం వారిది. వేళాకోళంగా ఉన్నట్లు యితరులకు ఉండేదేమో కాని, ఆ గీతాలు ఎంత మధురమయినవి! ఒకనాడు వారు

“ప్రణయేశ్వరీ!

భర్తకు భార్యకు ప్రళయ మేమిటని

ధూర్తులు కొందరు అంటే అననీ;

తనదే అయినా తన హృదయముపై

తనకే ప్రేమా ఉండకపోదాం


ప్రేమనిధానము ఇల్లాలయితే

ప్రేమగౌరవము అడుగంటేనా?

ప్రేమించితినని ప్రియసుందరి నా

ప్రేమకు అవధే లేదు, ఆవరించినది.

సర్వలోకములు సర్వవిశ్వములు

ప్రేమదేవి నా మోక్షము సర్వము

ప్రేమదేవి నా చిట్టిభార్యయే!”

అని పాడినారు. తానే వారి స్వప్నమట! తన్ను స్వప్నప్రియ అనిపిలుస్తూ తన చుబుకముపట్టి కళ్ళల్లోకి తేరిపార చూస్తూ “దేవీ! నీ నీలిపాపలలో ఎన్నో కలలు, కుసుమ వాటికలు నిర్మించుకొని వాసం చేస్తున్నాయి. ఆ స్వప్న కుసుమాలు ఒక మనోహరమాల నిర్మించి నా మెళ్ళోవేయవా?” అన్నారు.

వారి మధుర మందహాసాలో స్వప్నాలు యెలా స్వానందంచేస్తూ ఉంటాయి. ఆ స్వప్నాలు “నాకు వరమివ్వండీ!” అని తానొకనాడు అడిగితే “సరే, వరమిచ్చినాను. ఇవిగో” అంటూ తన పెదవులపై కొన్ని వందల ముద్దులు కురిపించినారు. ఎంత అల్లరివారు వారు.

లోకం అంతా ఒకటైన స్వప్నం. లోకంలో జాతి మత విభేదంలేని స్వప్నం. లోకంలో ఆస్తిపాస్తులు సమమయిన స్వప్నం. లోకంలో ద్వేషంలేని స్వప్నం. లోకంలో యుద్దంలేని స్వప్నం తేడాలు ప్రకృతి సిద్దమయినవేకాని, మానసిక సిద్దమయినవి కాని స్వప్నం. ఈ స్వప్నాలు నిజమయే పవిత్రదినం త్వరగా వచ్చే స్వప్నం. అవి వారి స్వప్నాలట. ఆ స్వప్నాలు ముద్దులతో తనకు అర్పించినారట. అవి వారి పూజట. అవే కుసుమాలట. అక్షతలట. ఆరతి అట.

తాను వారూ కలసి, తమ చిన్నబిడ్డ ముందు నడవ ఈ జగత్తు అంతా తమ ఆశయమై ఆ మూత్తమ స్థితికి ముందుకు సాగిపోవాలి. తనకూ వారికి ఉద్భవించిన బాలబాలికలు “జయ భారతమాతా, జయ లోకమాతా” అని ముందుకు సాగిపోవాలి. ఆ పోలీసువారి గదిలో తానూవారూ ఒంటరిగా ఉన్నప్పుడు వారు వేలూరు వెళ్ళక ముందు, వారు తన్ను హృదయానికి అదుముకొని, “నా హృదయేశ్వరీ! ఈ నీగర్భములో మన ఇరువురి చిన్నారి శిశువు ఉన్నది. నువ్వు ఎంత అదృష్టవంతురాలవు. నువ్వే ఆ శిశువును గర్భంలో నిన్నే ఆహారం అర్పించుకొంటూ పెంచుతావు. ఈవలకు వచ్చిన వెనుక నాకు ప్రియతమమయిన ఆ మేలిమి బంగారు కలశాలలోని స్వచ్ఛాంబువులు యిచ్చి పెంచుతావు. నేనేమి ఆ శిశువుకు ఈయగలను? ఆ శిశువుకు బలం నా ముద్దుల ద్వారా నీకు అర్పించుకోగలను” అని అంటూ పయ్యెద సవరించి, బాడీని తొలగించి, “బంగారు బంతులగు ఈ నీలిపిందెలు ఆ అమృతము ఆ శిశువునకు అర్పించడానికేనట!” అని అంటూ వాటిని కళ్ళతో తాగి చుంబించినారు. చీకటి రాత్రి జవరాలట, పతిని పొందిన యోష వెన్నెల రేయియట. గర్భవతి ప్రత్యూషమట. శిశువును ఒడిని తాల్చిన తల్లి హృదయమట.

తన గురువు అంశ తనలో ప్రత్యక్షమయింది. ఎంత విచిత్రసంఘటన. ప్రేయసి అంశ ప్రియునిలో ప్రత్యక్షమయ్యే దివ్యభాగ్యము పురుషులకు లేదట. పురుషులు దౌర్భాగ్యులట! అని అన్నారు.

తనలో లోకాలలోని తీపులన్నీ మూర్తించి ఇమిడిపోయినాయి. ఆ మధురాలు ధరించిన పాలసముద్రం తానట. అది మధించే సురాసురులూ తామేనట. అమృతము తల్లులూ బిడ్డలూనట. ఆయన అంతటితో వెళ్ళిపోయినారు. వెళ్ళలేక వెళ్ళినారు. ఆయన ఉత్తరాలా, కావ్యాలే అవి.

“ప్రపంచమందో మహాబాధ

మన విపంచి తీగెల మ్రోగుచున్నదే!

ప్రతి బాలికకూ బంగరు చీరలు

ప్రతి బాలునకూ బంగరు బాలిక

బాలబాలికల రాజ్యపాలనము

బాలబాలికల ప్రగతి ఖేలనము

వచ్చుచున్నదను విజయగీతమును

హెచ్చుస్థాయిలో ఎత్తే గొంతుక

ఎక్కడ ఎక్కడ అన్న కాంక్షలో

ప్రపంచమందో మహాబాధ మన

విపంచి తీగెల మ్రోగుచున్నదే!

ప్రతి వనితకు ఒక బంగరు కంచం

కంచం నిండా మధురాన్నములు

అన్నమునందే అమ్మల హృదయము

అన్నము పండే భూముల సేద్యము

సేద్యముచేసే వీరపురుషులట

పురుషులు స్త్రీలూ సమమై నడకలు

వచ్చుచున్నవను విజయగీతమును

హెచ్చుస్థాయిలో ఎత్తే గొంతుక

ఎక్కడ ఎక్కడ అన్న కాంక్షలో

ప్రపంచమందో మహాబాధ మన

విపంచి తీగెల మ్రోగుచున్నదే!

హెచ్చుతగ్గులకు మెచ్చని హృదయము

స్వచ్చమార్గముల గడిచేయానము

పురుషులు స్త్రీలకు ఒకటే ఒకటని

బీదల బాధలు బిచ్చమెత్తుటలు

నాదిది నీదిది యన్న వివాదాలు

లేని యుగమ్మది అదిగో తూర్పున

వచ్చుచున్నదను విజయగీతమును

హెచ్చుస్థాయిలో ఎత్తే గొంతుక

ఎక్కడ ఎక్కడ అన్న కాంక్షలో

ప్రపంచమందో మహాబాధ మన

విపంచి తీగెల మ్రోగుచున్నదే!

అని పాట చదువుతోంటే వారి కంఠమాధుర్యమే తన్ను చుట్టిపోగా “గురువుగారూ! మీరు ఉన్నది స్వప్నమా, మీరు వెళ్ళినది స్వప్నమా, ఈ నాగర్భస్థ శిశువు స్వప్నమా” అని ఆమె హృదయమున పల్లవి ఒకటి మారుమ్రోగింది.

5

డాక్టరు రెడ్డి కోనంగి వచ్చేటంతవరకూ వివాహం చేసుకోదలచుకోలేదు. కోనంగి. తన వివాహానికి పెద్ద కాకపోతే తాను వివాహమే చేసుకోనంది చౌధురాణీ.

మధుసూదనుడు, సరోజిని, చౌధురాణీ, రియాసత్ ఆలీ అందరూ రాక్షసులవలె పనిచేస్తున్నారు. నవజ్యోతి అవిచ్చిన్నంగా మహావార్తయై దేశం అంతా ప్రసరించిపోతోంది. రియాసత్ ఏ పని తలపెట్టినా కాలమువలెనే పనిచేసుకుపోతాడు. మధురమయిన తెలుగు వ్రాస్తాడు. చాణక్యునిలా చూస్తాడు. చంద్రగుప్తునిలా విజృంభిస్తాడు. అక్బరులా ఆదరిస్తాడు. రియాసత్, మెహరున్నీసాల వివాహం నిశ్చయమయినందుకు నవజ్యోతి ఉప్పొంగి పోయింది. అందరూ అతన్ని ముబారక్ అన్నారు.

అనంతలక్ష్మి మెహరున్నీసా యింటికిపోయి, “ఓసి నూర్జహాన్, నీవు నీ బావను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నువ్వు అంతప్రేమతో నిండి ఎల్లా చేసుకోనను అనగలిగావు అసలు? విను నేను నా గురువుగారిని వివాహం కాకుండా ఏడాది ఉండేటప్పటికి నా తలప్రాణం తోకకు వచ్చింది. అమ్మో! ప్రేమించిన నాయకుని కౌగలింతలో కరిగిపోని స్త్రీ ఎంత దురదృష్టవంతురాలు?”

“ఓహ్ ఏమి లెక్చరు? అయితే ఎందుకే మీ ఆయన్ను అలా ఏడిపించావూ! పెళ్ళయిన తర్వాత పేకబెత్తం ఒకటి తెప్పించి, మొగుణ్ణి రోజూ వీపు చితకకొడుతూ ఉండాలే!”

“ఛీ! ఛీ! నేను శుద్ద తెలివితక్కువదాన్ని. ఒక వారంరోజులు బాధపడ్డా! ఇంక ఆయన్ను వదలి ఉండలిగేదాన్నా?”

“ఏం చేద్దువు?”

“వెళ్ళి ఆయన పాదాల వాలి-”

“ప్రాణేశ్వరా క్షమింపుము. నేను వట్టి డండర్ హెడ్డును అందువుకాబోలు!”

“ఆ డండర్ హెడ్డును, బ్లాక్ హెడ్డును, వట్టి తలకాయను, బూడిద మెదడు గలదాన్ని అందును.”

“అప్పుడు మీ ఆయన ఏమంటాడు-”

“ఈలారా...”

“ప్రాణేశ్వరీ, నా చిన్నారి చిలుకా...”

“ఊరుకుందూ మెహర్. నిన్ను కాబోయే మీ ఆయన నా బుల్ బుల్, నా రోజా, నా దిల్కుష్-”

ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. మెహరున్నీసా “మీ ఆయన తిరిగి వచ్చిందాకా మేము వివాహం చేసుకోం. డాక్టరు రెడ్డి, చౌధురాణీ అలాగే నిశ్చయించుకొన్నారటగా!” అంది.

“అవును!”

అనంతలక్ష్మి ఇంటికి వచ్చేసింది. ఆ సాయంకాలమే చౌధురాణీ అనంతం దగ్గరకు వచ్చి “చెల్లీ! నేను డాక్టర్ను చూడగానే నా స్వేచ్ఛను ఆవలుంచే మూర్తి ఇతడేనని అనుకున్నాను. ఆయన ఇదివరకు ఎవర్నీ ప్రేమించలేదట. కాని ఆయన తన దేహాన్ని పవిత్రంగా నా కోసం ఉంచాడని నేననను, ఆయనే కంటినీటితో నా కళ్ళ దగ్గర మోకరించి చెప్పాడు” అన్నది.

“అవును అక్కా!”

వీరిద్దరూ మొదటి వరసనే ఇప్పుడు పిలుచుకోడం మొదలు పెట్టినారు.

అనంతలక్ష్మి దగ్గర చౌధురాణి కూర్చుండి “చెల్లీ! నాకు చాల గర్వం ఉండేది. నా స్వప్న ప్రపంచంలో విహరిస్తూ నా నాయకుని నేను ఊహించుకొని ఎంతో ఆనందం పొందేదానిని. అనగనగా ఒక రాజకుమార్తె. ఆమె తన రాజకుమారునికయి ఎదురు చూసేది, అన్నట్లుగా నేనూ నా రాజకుమారునికై ఎదురు చూసేదాన్ని. ఆరోజులలో కోనంగి బావ నాకు రాజకొమరుడు. కాని అది ప్రేమచేత కాదు. నేను ప్రేమనే ప్రేమించాను. చెళ్ళెళ్ళు లేక, అమ్మ ప్రేమ ఎరుగక గాలికి బ్రతికిన కోనంగిబావ అంటే ఏదో కరుణ మా అందరి హృదయాలలో ఉండేది. మా మధు అన్న కోనంగిని బావా అని హృదయానికి అద్దుకునేవాడు. కోనంగిబావ నవ్వించని మనుష్యుడు ప్రపంచంలో లేడు. అంత గడుసరి ఇంకొకరు లేరు చెల్లీ! ఆయనకు తగిన రాకొమరితవు నువ్వు. నీకు తగిన రాకొమరుడు” అని అన్నది.

“అక్కా నీ రాకొమరుడు ఈనాటికి దొరికాడే! డాక్టరుగారు ధర్మశీలి, మాట ఇస్తే ఆ మాట శిలాశాసనమే ఆయనకు!”

“అయితే ఏమి, ఆయన కమ్యూనిస్టు!”

“కమ్యూనిస్టు అయితే నీకు భయమా? ఇప్పుడే మెహర్ దగ్గర నుంచి వస్తున్నా! మెహరోకు కాంగ్రెసు ముస్లిం అంటే పట్టరాని కోపం. వాళ్ళను క్విసిలింగులంటుంది. ఫిప్తకాలం వాళ్ళంటుంది. కాని అలాంటి కాంగ్రెసు ముస్లింనే ప్రేమించింది. ఆ ప్రేమకు తానే వ్యతిరేకించింది. దానితో పోరాడినది. చివరకు తెలివయినది గనుక ఆ ప్రేమకు లొంగిపోయింది.”

“కమ్యూనిస్టు అంటే నాకున్న భయం కొంత విపులంగా చెపుతా! కమ్యూనిస్టులకు దేవుడు లేడు.”

“అందరికీ ఉండడనా, రెడ్డిగారికి లేడనా?”

“అందరికీ లేడనే!”

“ఓసి వెర్రిఅక్కా! స్టాలిన్ తల్లి బ్రతికి ఉన్నంతకాలం భగవంతుని ప్రార్థించేది. మన ప్రాపంచిక జీవితంలో భగవంతుణ్ణి ప్రవేశపెట్టి, మనుష్యుని పురోభివృద్ధికి అడ్డం పెట్టుకోవడం పనికిరాదన్నారు. భగవంతుని భావం "చర్చియానిటీ” కారాదన్నారు. చర్చీ. ప్యూడలిజం వాని వాని కాలములలో మంచివే. కాని ఈ కాలంలో అవి నిరోధక శక్తులన్నారు. నీ భగవంతుడు నీ పురోభివృద్ధికి ఎందుకు అడ్డం రావాలి?”

“రష్యాలో వివాహాలే లేవటకదా?”

“అదేమి భావమే! ఎవరన్నారు ఈ పిచ్చిమాటలు? అన్ని దేశాలవలెనే అక్కడా వివాహం ఉంది. అన్ని దేశాల వలెనే అక్కడా విడాకులున్నాయి. కాని వివాహమంటే ఎంతో జాగ్రత్తగా ఆలోచింపవలసిన సంస్థగా చేశారు. వివాహం లేకుండా స్త్రీ పురుషులు కామసంబంధం కలగించు కోకుండా చాలా కష్టపడతారు. స్టాలిన్ ప్రథమభార్యను ఎంతో ప్రేమించాడు. ఆయన సైబీరియాలో నిర్బంధితుడై ఉండగా ఆవిడ చచ్చిపోయింది. తర్వాత మళ్ళీ పెళ్ళిచేసుకొన్నాడు. నాడియా ఆయనకు ఆశయభూమి అయినది, కుటుంబం, సంసారం, భార్యా బిడ్డలూ అంటే రష్యనుల కెంతప్రేమ అనుకున్నావు?”

“ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు అనంతం?”

“నేనూ మా గురువుగారూ కలిసి ఎన్నో పుస్తకాలు చదివినాము.”

“వారి విడాకులు?”

“అమెరికాలోవలె అతిసులభమనుకున్నావా రష్యాలో? విడాకులు పుచ్చుకుని ఇంకో భార్యనో, భార్యభర్తనో చేసుకోవడంకన్న ఉన్నవారితో జీవించడమే మహోత్తమం అన్నంత చేశారు. కాబట్టే విడాకులు ఉండటమే లేదు రష్యాలో! అంతగా విడాకులు కావాలన్నవారికి ఎన్ని అడ్డంకులు వచ్చినా భయంలేదు.”

చౌధురాణీ ఆలోచనాధీనయై అయిదు నిమిషాలు అలాగే కూచుంది. "అయితే మనదేశంలో కమ్యూనిస్టులంటే అంత చెడుపేరు వచ్చిందేమిటి?” అని ఆమె ప్రశ్నించింది.

6

రెడ్డీ చౌధురాణీ కలిసి సినీమాలకు, వాహ్యాళులకు వెళ్ళుతున్నారు. అలా ఇద్దరే వెళ్ళడం సాగించిన మొదటి దినాలలో ఏవేవో విషయాలు మాట్లాడడమేగాని ఒక ప్రేమ సంభాషణ వచ్చేదిగాదు. “డాక్టరుగారూ!” అని చౌధురాణి పిలిస్తే “చౌధురాణిగారూ!” అని డాక్టరు రెడ్డి పిలిచేవాడు. రష్యా సంగతులు, యుద్ధం, వ్యాపారాలు, భారతదేశంలో కాంగ్రెసు, ముస్లింలీగు, కమ్యూనిస్టులపక్షాల విషయం, వాని భవిష్యత్తులు, ఇవన్నీ కలసి పనిచేసే సావకాశాలు మొదలయినవి మాట్లాడేవారు.

కాంగ్రెసు ఉపనాయకులు, అరుణ అసఫాలీ, పట్వర్దన్ మొదలయిన వారి దాగుడుమూతలు, బోసు, అజాద్, హిందూసేన మొదలయిన విషయాలన్నీ చర్చకు వచ్చేవి.

ఒకరోజు సాయంకాలం వారిద్దరూ మోటారులమీద చెంగల్పట్టు, కంచి వెళ్ళడం సంకల్పించుకొన్నారు. బయలుదేరినారు. కంచిలో శిల్పం చూడాలని చౌధురాణి సంకల్పింది. ఏవేవో మాటామంతి ఔతున్నాది. చౌధురాణి శిల్పకళను గూర్చి, చిత్రకళను గూర్చి బాగా చదువుకుంది. బందరు జాతీయ కళాశాల వాతావరణంలోకి పోయి చిత్రలేఖనం నేర్చుకుంది. కళను గూర్చి తన అభిప్రాయాలు రెడ్డితో చెప్పడం సాగించింది.

ఇద్దరూ ఒకరిదగ్గరకు ఒకరు చేరుదామనుకుంటున్నారు. కాని జరగలేదు. ప్రేమవాక్యాలతో చౌధురాణీని ముంచెత్తుదామని రెడ్డి ఉవ్వీళ్ళూరుతాడు. ఏమి మాట్లాడాలో తెలియదు. కోనంగే అయితే ఈపాటికి మూడు ప్రణయకావ్యాలు వ్రాసి ఉండును. ఇంటి దగ్గర రోజూ ఎలా ప్రారంభించాలో అవన్నీ ఊహించుకుంటాడు రెడ్డి. అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి అబ్బాయి పని నత్తిరావడంవరకు వస్తుంది.

చౌధురాణీ డాక్టరు ఎప్పుడు ప్రణయ సంభాషణ ప్రారంభిస్తాడా అని ఎదురు చూస్తూంది. ఒక్కసారయినా తన్ను గాఢంగా హృదయానికి అదుముకుంటాడా? నిజంగా ఆయన తన్ను ప్రేమిస్తున్నాడా, లేక ప్రేమిస్తున్నానని అనుకున్నాడా అని ప్రశ్నించుకొంది.

ఆ వనితను ప్రేమిస్తూ, ఆమెతో ప్రేమ సంభాషణ ప్రారంభించవలసింది పురుషుడుగాని, పురుషునితో స్త్రీ ఎల్లా సంభాషణ ప్రారంభిస్తుంది. ఇవి అనుకుంటూ ఏమీ మాట్లాడకపోతే ఎట్లా అని ఇద్దరూ ఏవేవో పిచ్చి సంభాషణలు ప్రారంభిస్తారు. ఆ సంభాషణలోంచి తప్పుకోలేరు.

 రెడ్డిగారి కిష్టమయిన విషయమని వైద్యాన్ని గూర్చి చౌధురాణి సంభాషణ ప్రారంభిస్తే, చౌధురాణి కిష్టమైన విషయమని రెడ్డి చిత్రలేఖనాన్ని ప్రారంభిస్తాడు. చౌధురాణి కమ్యూనిజాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించేది.

ఆ సంభాషణ అంతంత మాత్రంగనే సాగేది. హృదయంలో సంభాషించదలచుకొన్న విషయం వేరు, పైకి వచ్చే సంభాషణ వేరు. హిమాలయాలలో ధాన్యం పండదు. కుంకుమపువ్వు ఆంధ్రదేశంలో పండదు.

కంచి చేరారు. వరదరాజ స్వామిదేవాలయం చూచినారు. ఏకాంబరేశ్వరుని దేవాలయం చూశారు. కంచికామాక్షీ ఆలయం దర్శించినారు.

సాయంకాలం వారు ఒక బంగాళాలో మకాం పెట్టినారు. బంగళా బంట్రోతుచేత పడకకుర్చీలు పైన వేయించినాడు డాక్టరు ఎన్నో పువ్వులు కొన్నాడు. రెడ్డి వంటవాడు శాకాహారమైన అందాల వంటకాలెన్నో చేసినాడు. వెన్నెల కాస్తూ ఉంది.

భోజనాలు చేసి పడక కుర్చీలలో కూర్చొని ఏ విషయం చేతికందితే ఆ విషయాన్ని గూర్చి మాట్లాడుకొంటూ నిశ్శబ్దం వహించారు. ఇద్దరూ స్వప్నాలపాలయ్యారు. ఒకరి స్వప్నానికి రెండోవారు స్వప్నమధ్యస్థులయ్యారు.

డాక్టరు రెడ్డి తరపున కోనంగి చౌధురాణిని ఆడగడం, ఆమె రెడ్డిగార్ని వివాహ మాడడానికి ఒప్పుకోడం, ఆ విషయం ఉత్తరం ద్వారా రెడ్డికి తెలియజేసి కోనంగిరావు తాను అరెస్టు అవడం, ఇవీ డాక్టరు రెడ్డికి చౌధురాణికీ జరిగిన ప్రణయ కార్యకలాపం.

ఆ తర్వాత ఇద్దరూ ప్రణయ వాక్యాలు తప్ప ఏవైనా మాట్లాడుకొనే వారు. ఆ మాటలు ఏ ధ్వని సూత్రాల ప్రకారం చూచినా ప్రణయాన్ని స్ఫురింపజేయలేవు.

చౌధురాణి తన రాజకుమారుడయిన రెడ్డి మదరాసులో ఉంటాడని అనుకోలేదు. రెడ్డిని చూడగానే మొదట చౌధురాణికి చాలా కోపంగా ఉండేది. ఆ కోపానికి కారణం రెడ్డిగారు వచ్చి ఆమె హృదయంలో తిష్టవేసి కూచోడమే.

ఒకరోజు ఆమె ఉదయం తలుపులు తీసిలోనికి వెళ్ళేసరికి అక్కడ నవ్వుతూ భక్తునిలా రెడ్డిగారు కూర్చుని ఉన్నాడు. ఆమె తెల్లబోయింది. ఆమెకు కోపం వచ్చింది. ఎవరైనా సరే పెద్దమనిషి అయినా ఇంటియజమాని నడగక వచ్చి కూర్చుంటారూ? పోనీ ఆ కూర్చోడం ఏ ముందర హాలులోనో అధివసిస్తే అంతకోపం రాదు. మనకు అత్యంత ఇష్టమైన మనకోసమే కేటాయింపయిన గదిలోకి వెళ్ళడమే!

“అదోయి నువ్వు చేసినపని, చౌధురాణి మొదటే నిన్ను ప్రేమించింది. ఆమె ప్రేమంటే ఆమెగారే సిగ్గుపడింది, కొంచెము నువ్వు ప్రేమికుడవు. అంత సిగ్గుపడడానికి చిన్న కుర్రవాడవా నువ్వు?” ఈలా వ్రాశాడు కోనంగి జైలు నుంచి. చౌధురాణి ఆ పేరులో ఉంది మాధుర్యం. స్టాలిన్ భార్యనాడియా, తన భార్య “చౌధు.” ప్రపంచంలో అందమైన వాళ్ళందరూ రష్యాలోనే ఉంటారు అని అనుకునేవాడు రెడ్డి కాని భారతదేశంలో సోవియటు దేశ నారీమణులకు పాఠాలు నేర్పే అందకత్తియలున్నారు. అందులో ఆంధ్రయువతులు పురుషుల హృదయాలను మాలలు మాలలుగా గుచ్చుకొనడానికైనా లెక్కచేయని అందకత్తెలు. వారందరిలో రాణీ చౌధురాణీ!

అయితే ఇండియా కమ్యూనిస్టుదేశం అయితే ఈ రాణీలు? అందాల రాణులు అప్పుడు అందాల కామ్రేడులవుతారు.

డాక్టరు రెడ్డి ఎంత చక్కని హృదయం కలవాడు. కమ్యూనిస్టులు ఖసఖసలాడే విషప్పుచ్చేలనుకొనేది. కాని గాంధీమహాత్ముని తమ్ములని తనకేం తెలుసును? ఒకసారయినా కోపం వస్తే చూద్దాం అనుకొంది. కాని ఆయన ఒక్క విషయంలో నయినా ఖారంగా మాటాడందే!

ఈతడు తన రాజకుమారుడు. తానాతనికి రాజకొమారి. తానూ డాక్టరు విద్య చదవడంకన్న డాక్టర్ని హృదయాన ధరించుకుంటూ, ఆయన మెట్లు ఎక్కుతూ తన్ను చేయిపట్టుకొని నడిపించుకుని పోతూవుంటే తాను ఆయనకు స్నేహితురాలై అనుప్రియురాలై ఆయనకు బాసటయై నడుస్తుందిగాక!

చటుక్కున చౌధురాణీ రెడ్డి వైపునకు తిరిగి “నాకు నర్శింగు నేర్పుతారా?”

రెడ్డి ఉలిక్కిపడి లేచి వెన్నెలలో చంద్రబింబములా వెలిగిపోయే ఆమె మోము చూచి ఆశ్చర్యంతో, ఆనందంతో లేచి ఆమె కుర్చీకడకు వచ్చి ఆమె కుర్చీమీదకు వాలి, “రాణీ! నీకు నేనేమి నేర్పగలను? నువ్వే నాకు ఎన్నో నేర్పాలి!” అన్నాడు.

“నేనేం నేర్పగలను? ఈలా రండి. (ఆ పడకకుర్చీ చేయిచూపించి) ఇక్కడ కూర్చొని జవాబు చెప్పండి.”

రెడ్డి గుండె కలకత్తా మెయిలుబండిలా పరుగెత్తుతూ ఉంటే, ఆ పేము కుర్చీలోనే ఆమెను జరిపి ఆమె పక్కనే జేరుతూ “నువ్వు నేర్పలేని దేమున్నది?” అని అంటూ ఆమె నడుంచుట్టూ చేయిపోనిచ్చాడు. ఆమె కరిగిపోయి, అతని ఒడిలో ఒదిగింది. అతడు ఆమె కళ్ళల్లోకి తేరపార చూస్తూ, ఆ బాలికను రివ్వున ఎత్తి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు.

చౌధురాణీ రెడ్డి మెడచుట్టూ చేతులు చుట్టి “డాక్టరుగారూ!” అన్నది.

“చౌధు!” అంటూ రెడ్డి ఆమె పెదవుల్ని చుంబించాడు.

వారిద్దరి మధ్యా సిగ్గుతెరలు జలజలారాలి క్రిందకు కూలిపోయినాయి. రెడ్డి చౌధురాణీని కోయంబత్తూరు కృష్టయ్యరు హల్వాను ఆస్వాదించినట్టు ఆస్వాదించాడు.

7

1943 మార్చి నెలాఖరున కోనంగిరావుకు అనంతలక్ష్మి గర్భశుక్తి ముక్తాఫలమై పురుషశిశువు జన్మించాడు. పురుడు వచ్చేరోజులని కోనంగికి ఉత్తరం వచ్చినప్పుడు అతడు పడిన ఆవేదన ఇంతింతనికాదు.

ఆరోజునుండి వరుసగా నాలుగురోజులు రాత్రుళ్ళు నిద్దర పట్టక తన జైలుకొట్టులో మతిలేనివానిలా తిరిగేవాడు. పగలు ఏమీ తోచేదికాదు. “పరమాత్మ! నా అనంతాన్ని రక్షించు! కాబోయే శిశువును రక్షించు తండ్రీ” అని నిరంతరము ప్రార్థన చేసేవాడు. ఇంతలో “పుత్రుడు పుట్టినాడు, తల్లి, పిల్లవాడు క్షేమంగా ఉన్నారు. ఏమీ ఆదుర్దా పడవద్దురెడ్డి” అన్న తంతివార్త వచ్చిన తరువాత కోనంగికి ఆనందంచేత కళ్ళలో నీరు తిరిగినవి.

ఆ దినమున జైలు అధికారి ఉత్తరువుకొని, జైలులో అందరికి మిఠాయిలు పంచిపెట్టినాడు కోనంగి.

ఆ మర్నాడు ఉత్తరం వచ్చింది సరోజిని నుంచి “అన్నయ్యా! నీ కొడుకు బంగారుముద్ద! ఎంత ఒత్తుగా నల్లగా వుంది జుట్టు! ఆచ్చంగా నీ పోలికే. కళ్ళుమాత్రం తల్లివిసుమా, ఎంతో ఆకలివేసిన వానిలా తల్లి పాలుపుణుక్కుంటున్నాడు. కెవ్వు కెవ్వున ఇల్లంతా ఎగరగొడ్డాడు ఆకలివేస్తే. నువ్వు వచ్చిందాకా నామకరణం, బారసాల ఆపుతాము. అనంతం వదిన ఆరోగ్యంగా వుంది. మరేమీ కంగారులు రాలేదు. మొదటి పురుడయినా ఎంత సులభంగా నీళ్ళాడింది! మొదటిరోజునే లేచి కూర్చుంది. బిడ్డను అందించాము. తన బిడ్డను తాను ఎత్తుకొనడానికి సిగ్గు పడింది. పక్కలో పడుకోబెట్టాము. అలా ఇద్దరూ పడుకొంటే ఎంత అందంగా ఉంది ఆ దృశ్యం!

“అన్నా! మామూలు దక్షిణాది వారివిగాని, మనవిగాని పిచ్చి ఆచారాలు ఏమీలేకుండా డాక్టరు రెడ్డిగారు పురుడుపోశారు. రెడ్డి అన్నగారే మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉన్నారనుకున్నావు!

“ఇంక చౌధు తానే నర్సయింది. నర్సింగు పనిని కాబోయే భర్త దగ్గరే నేర్చుకుంటున్నది.

“ఇంక చౌధురాణీగారి విషయం! రెడ్డి, రాణీ ఇద్దరూ మామూలుగా వుండేవారు. ప్రేమికులులా కనబడేవారుకాదు. కాని ఇద్దరూ అతి దగ్గరగా వచ్చేవారు. నువ్వు వచ్చిందాకా పెళ్ళిచేసుకోమని అన్నారని అనంతం వదిన తన ఉత్తరాలలో ఇదివరకే వ్రాసి ఉంటుంది.

“నీ కొడుకు రెడీ అవుతాడులే! అంత పెద్దకళ్ళయినా బుగ్గలు మింగేస్తున్నాయి. ఆ కళ్ళను నా వైపు త్రిప్పి గుప్పిళ్ళు ముడుచుకొని చూస్తూ ఉంటే “మానాన్న ఏడీ?” అని ప్రశ్నించుచున్నట్లుగా కనబడతాడు. కాళ్ళు, చేతులు తెగఎగరవేస్తాడు. సంగీతం కూడా పాడతాడయ్యా!

“చౌధురాణీ వాడిమీద జోలపాటలు వ్రాయాలంటుంది. కమల నయన “ఓయి. కుర్రవాడా నువ్వు త్వరగా వెళ్ళి మీ నాన్నను జైలు నుంచి కొట్టుకు రారా!” అంటుంది. నిద్దల్లో అలా నవ్వుతాడే! ఈ రెండోరోజునే అందరూ క్షేమం. అనంతం నిన్ను మరీమరీ అడగమంది. ఓపిక రాగానే తానే ఉత్తరం వ్రాస్తుందట.

“ఇంక మీ అత్తగారి ఆనందం చెప్పడానికి వీలులేదు. కళ్ళు తన భర్తకళ్ళేనట. తన భర్త పేరుతోనే పిలుస్తున్నది. ‘రంగా' అంటుంది. ఆ పేరు వింది చౌధు. ఈ రాత్రే తానో పాట పాడింది.

రంగరంగా కావేటి రంగరంగా

కస్తూరి రంగరంగా

ఏలోకమున నుంటివీ నా తండ్రి

ఈ లోక మెట్లున్నదీ ఓ తండ్రి

నీ లీలలను చూపరా-చిన్నయ్య

మాలోన ఒకటవ్వరా!'

అన్నది. అందరికీ ఎంత ఆనందమయినదనుకున్నావు?”-మీ చెల్లి సరోజ.

ఈ ఉత్తరం చూచుకొన్నాడు, తన బాలుని రూపం ఊహించుకొన్నాడు. తన భార్య అనంతం బాలుణ్ణి అందిస్తూ ఉంటే తాను చూడడం కలలు కన్నాడు. తాను కుమారుని ఎత్తుకొని ఆడించడం ఊహించుకొన్నాడు.

ఆ చిట్టితండ్రి తన్ను 'నానా!' అని పిలుస్తాడా, 'బాబా!' అని అంటాడా, 'అప్పా!' అని సంబోధిస్తాడా? 'డాడీ' అంటాడా? ఏమని పిలుస్తే బాగుంటుంది?

ఎప్పుడు తనకీ జైలు నుండి విముక్తి?

వేలూరు జైలు తనకి దుర్భరమే ఔతున్నది. ఆంధ్రులు పదిమంది ఒకచోటకూడి ఉండలేరు. ఒకరిని చూస్తే ఒకరికి పడదు. నాయకులంటే చిన్నవారికి గౌరవం ఉండదు, అందరూ నాయకులే! బ్రాహ్మణులను బ్రాహ్మణేతరులు ద్వేషించడం, ఎవరో కొద్దిమంది తప్ప తక్కినవారు ఎప్పుడూ పెద్దలంటే రుసరుస లాడుతూ ఉండడం.

“ఈ చిన్న చిన్న కుట్రలు చూస్తే దోమల బాధ జ్ఞాపకం వస్తుంది నాకు!” అని కోనంగి ఒకనాడు గుంటూరుజిల్లా నాయకుడయిన డాక్టరు చలపతిరావుగారితో అన్నాడు.

డాక్టరు చలపతిరావుగారు; దోమలు మలేరియా తెస్తాయి. మన వాళ్ళు దేశం అంతా అల్లరి చేస్తారు.

కోనంగి: దేశం అంతాటయేరియా తెస్తారండీ!

ఇంకో గుంటూరుజిల్లా నాయకుడు రామకోటేశ్వరరావుగారు 'అది కాదండీ, వీళ్ళ గడబిడవల్ల డయేరియా వస్తుంది దేశమాతకే!' అన్నారు.

కోనంగి జైలులో నాయకులందరితో చనువుగా వుంటాడు. స్వరాజ్య సంపాదన మహాయజ్ఞానికి ఒకడే యజమాని, తక్కినవారు అనుయాయులు. ఈ మహాయజ్ఞం ఇంతకాలం పడుతుంది అని కాలం పంచాంగములో వ్రాయబడి ఉంది. గాంధీజీ మహాధార్మికులు. అలాంటి సమయంలో ముసలి నాయకత్వం మాకు పనికిరాదనడం ఏం మంచిదండీ?' అని చలపతిరావుగారితో అన్నాడు.

“మీరు అన్నమాట నిజం కోనంగిరావుగారు! కాని యువకులు ముందుకు వస్తున్నారు, ప్రతి సంవత్సరం ఒక కొత్త జట్టు వస్తూందన్న మాటేగా! వారు మన జాతీయత్వంతోపాటు, ప్రపంచ రాజకీయవాతావరణాలు చూస్తున్నారు. వారు మాకుమల్లే గాంధీజీ నాయకత్వంలో పెరగలేదు? వాళ్ళు జాతీయోద్యమంలో ప్రవేశించిన ప్రథమంలో ఉన్నతస్థితిని నిరసిస్తారు. ఆ తర్వాత కొంచెంకొంచెంగా గాంధీజీ వాదన అర్ధమౌతుంది. అప్పుడు జాతీయ మహాశ్రుతికి వారి గొంతుక సమన్వయం చేస్తారు” అన్నారు చలపతిరావుగారు.

కోనంగి వేళాకోళాలవల్ల ఎన్నిసారులో ఎందరి తగాదాలో పరిష్కారం అయ్యేవి.

“అదేమటండీ చాల ఘాటుగా వాదించుకొంటున్నారు?” అని కోనంగి ఒక జిల్లా తగాదా గొడవ దగ్గరకు వెడుతూనే అన్నాడు.

ఒకరు: (గుంటూరువారు) ఏమండీ కోనంగిరావుగారు! మీరు మద్రాసువాళ్ళు కనక మధ్యవర్తిత్వం చేయవచ్చును. బందరు బడాయి, గుంటూరు లడాయి అన్నమాట నిజమా, కాదా?

కోనంగి: బందరు అంటే కోతి.

రెండవవారు: (కృష్ణాజిల్లావారు కోపంతో) కోనంగి అన్నా కోతి అని అర్థం ఉంది.

కోనంగి: ఔనండీ, ఉండదూ మరి, నేనూ బందరువాణ్ణి.

రెండో: అయితే మీ మధ్యవర్తిత్వం ఎలా పనికి వస్తుంది?

కోనంగి: మీది దిట్టమయిన “లా పాయింటే” అయినా నేను కృష్ణాజిల్లావాణ్ణి అయికూడా అలా చెప్పుతున్నానంటే, ఎంత పెద్దమనిషినో ఆలోచించండి.

మొదటి: తర్వాతనండీ కోనంగిరావుగారూ?

కోనంగి: గుంటూరు అంటే, వట్టి గోతులున్న ఊరు అని. వట్టి గోతుల ఊరు అని ఎందుకన్నారంటే నీరుంటే నూయి, లేకపోతే గోయి అన్న మాటేగా! గుంటూరు గుంటల ఊరు; లడాయివల్లనే గుంటలు ఏర్పడినాయి. బడాయిల వేడివల్ల నీరు ఎండిపోయింది.

మొదటి: యేమి తీరయ్యా నీది! మమ్మల్ని యెద్దేవా చేస్తున్నావా? మెచ్చుకుంటున్నావా?

8

1943 జూన్ నెలలో కోనంగిరావుగారు విడుదలై చక్కా వచ్చారు. కమ్యూనిస్టు డాక్టరు రెడ్డి, బోసుపక్షీయుడు మధుసూదన్, జాతీయ ముస్లింరియాసత్ ఆలీ, ముస్లింలీగు “అనా” మెహరున్నీసాయు, ఆమె తండ్రియు. కాంగ్రెసుపక్షం అనంతలక్ష్మి, కోనంగి కుమారుడు శ్రీ రంగారావు (ఈ పేరు కోనంగి పెట్టవలసిఉంది కానీ అందరూ ఆ బంగారు పాపాయిని ఆ పేరుతోనే పిలుస్తున్నారు) భక్తిపక్షం జయలక్ష్మి, జస్టిసుపక్షం అంబుజం, ప్రజాపక్షం వినాయగంపిళ్ళే, ఆతని స్నేహితుడూ, ఆనందం నాయుడు, సినీమాతారలు ఎంతమందో స్టేషను దగ్గర కోనంగికి స్వాగతం ఇచ్చారు.

మెహర్ పరదా తీసివేసింది. అనంతం ప్రక్కనే నిలుచుంది. ఆమె తండ్రి కోనంగిరావును కౌగలించుకొన్నాడు. “కోనంగిరావుగారూ, మీరూ మేమూ రెండు పక్షాల వాళ్ళం అయినా మన ప్రేమలకు ఏమీ అడ్డం ఉండదు. పాకిస్తాన్ గొడవ మీకు వద్దు. అఖండ హిందూస్తాన్ గొడవ నాకు వద్దు. మనం స్నేహితులం, చుట్టాలం” అన్నాడు.

కోనంగి వంగి ఆయన పాదాలకు నమస్కరించాడు. అతడు మెహరున్నీసా కడకు వెళ్ళి “చెల్లీ! మాబావ నీ మనస్సును ఇంత కష్టపెట్టినాడు. ఆతని ముక్కులాగేస్తాను” అన్నాడు.

రియాసత్: “నా ముక్కు నువ్వు లాగే అవసరం యెప్పుడూ కలుగదుగాని, నాకు నీ చెవులు పట్టి జాడించవలసిన అవసరము వచ్చింది.”

మధుసూదన్: ఎందుకురియా?

రియా: ఎందుకా? తర్వాత చెప్తాను.

కోనంగి కొడుకును ఎత్తుకున్నాడు. “మూడునెలల పసికూన అయినా తండ్రిని ఆనవాలు పట్టాడండో!” అంది చౌధురాణీ.

సరోజ: వాడెవరురా, నీ కొడుకుకాడూ! నీ తెలివి తేటలే!

కమలనయన: మా తెలివి తేటలూ, మేనత్తల అందమూ వదినా!

అనంతం భర్త పిల్లవాణ్ణి పడవేస్తాడేమోనని హడలిపోతూ ఉంది. ఆ బాబిగాడు వెన్న బంగారాల తొనలు తిరిగిన చిట్టితండ్రిని కోనంగి భార్యచేతికి అందించాడు. అనంతలక్ష్మి ముక్కుపుటముననున్న రవలబేసరులతో, చేవుల తమ్మెలనున్న రవలకమ్మలలోని వెలుగులకన్న ఎక్కువ కాంతితో కన్నులు మెరిసిపోయినవి.

అతని చేయి ఆమె దేహానికీ, ఆమె చేయి అతని దేహానికీ, ఇరువురి శరీరాలకు ఆ చిట్టిబాబు దేహము తగిలి అత్యంత పవిత్ర మధురాలు వారి మువ్వురిలో ప్రసరించి పోయినవి. ఈ విషయంలోని పరమార్థం గ్రహించిన వానిలా ఆ చిట్టిబాబు బోసినవ్వుల చిరునవ్వులు నవ్వినాడు.

కోనంగి "అరే నవ్వుతున్నాడే!” అన్నాడు. అనంతలక్ష్మి “బాబాయి నిద్దట్లో నవ్వుతాడండీ!” అన్నది. జయలక్ష్మీ కోనంగి తనకు వంగి నమస్కారం చేయగా తనచేయి ఆతని తలపై వేసి “నాయనా, ఈ తొమ్మిది నెలలు నీకోసం బెంగలు పెట్టుకున్నాం. నిన్నా మొన్నా అమ్మిణికి నిద్రలేదు” అన్నది.

కోనంగి పకపక నవ్వి “రండి వెడదాము” అన్నాడు. కోనంగీ, అనంతం, చిట్టిబాబూ ఒక కారులో కూర్చున్నారు. అనంతం కళ్ళనీరు తిరుగగా “గురువుగారూ, నన్ను క్షమించారా?” అని దీనవదనంతో అడిగింది.

“ఓసి నా ఆత్మమధ్యనా! నువ్వే నేను, నేనే నువ్వు. నీపై నాకు ప్రపంచం అంతా అణువుల క్రింద మారినా నీమీద కోపం వస్తుందా అనూ! నా అనూ! నా దివ్యబాలికా!”

“ఎంత అందంగా ఉన్నావు. రయిలు దగ్గర నిన్ను ఎత్తివేసి హృదయానికి గాఢంగా అదుముకుని, నీ ఆ తీయతీయని పెదవులు పీల్చివేద్దామనుకున్నాను అనంతం! ఇంటికి పద. నాన్నతోపాటు (నాన్న అని కొడుకు ననడం సులభంగా వచ్చేసింది కోనంగికి) నిన్ను నలిపివేస్తాను. ప్రేమ ఆకలి అంత ఎక్కువగా ఉంది!”

“అన్న ఆనందం బండి నడుపుతున్న సంగతి మరువకండి!”

“వింటే విననీ!”

అతడు కారులోనే భార్యను కొడుకు ఒళ్ళో ఉండగా కూడా, తన ఒళ్ళోకి తీసుకుని, ఆమె మోము తనవైపు త్రిప్పి “నా అనంతం! నా అనంత! నా ప్రేమ దేవీ! నా అదృష్టమూర్తీ! నిన్ను విడిచి తొమ్మిది మహాయుగాలు వేలూరు జయిలులో ఎల్లా గడిపానో!” అని అంటూ ఆమె పెదవుల ముద్దు పెట్టుకున్నాడు. “నాన్నా, ఔనా కాదా? నా కన్నగా!” అని వాడి చిట్టినోరుపై ముద్దు పెట్టాడు.

ఇంటికి రాగానే జయలక్ష్మి అతనికి దిష్టితీసింది. మనుమనికీ కొమరితకూ కూడా దిష్టితీసింది.

ఆరోజు అందరూ జయలక్ష్మిగారి యింటిలో భోజనాలుచేసి ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ముందు వరండాలో కూర్చున్నారు. ఆడవారంతా లోపల హాలులో కూర్చున్నారు.

మన చెట్టిగారి కారు వీధిలో ఇటూ అటూ తచ్చాడింది. ఒకసారిలజు వరకూ పోయి తిరిగి వస్తూ ఉంటే చెట్టిగారిపై పత్రికా ప్లేట్టు జరిపే ఆ అరవపెద్ద మనిషి జయలక్ష్మి ఇంటి దగ్గరనే నడిచిపోతూ కనబడ్డాడు చెట్టిగారికి. అసలే కోనంగి రావడం, ఆతడు భార్యతో, కొమరునితో ఆనందంగా యింటికి పోవటం; వారంతా సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం చూచి చెట్టిగారు మండిపోతున్నాడు.

ఎగ్మూరు రయిలుస్టేషను దగ్గరకు ఈ దృశ్యం చూదామనే చేరాడు. ఆ దృశ్యం చూడగానే చెట్టిగారు కుంగిపోయాడు, కుళ్ళిపోయాడు, పిచ్చివాడయాడు. అనంతలక్ష్మి తనకు ఒక చక్కని బిడ్డను కనవలసిన అందాలపడుచు. ఇప్పుడు ఆ మొద్దువెధవకు కనిపెట్టింది అనుకున్నాడు.

ఇంక ఇంటికి పోదామనుకున్నాడు. అనవసరంగా జయలక్ష్మిని, అనంతలక్ష్మిని వంచన చేద్దామనుకున్నాడు. వాళ్ళని ఆ విధంగా లోబరచు కొందామనుకొన్నాడు. చెట్టిగారు “నీతో ఉంది చెట్టియారూ!” అంటే ఉబ్బితబ్బిబ్బయి ఎంతపనయినా చేసిపెడ్తాడు! తనకు అడ్డం వస్తే నలిపిపారవేస్తాడు. భక్తిపరుడు. కాని ఏ దుర్మార్ధ కార్యమయినా భగవంతుని ప్రార్థిస్తే జరుగుతుందని నమ్మకం కలవాడు. దేవునికిగాని, అతని పరివార దేవతలకు గాని ఇంత లంచం పారవేస్తే పని జరుగుతుందనే ధీమాతో పనులు తలపెట్టుతాడు.

చిదంబరంలో ఒక అమ్మాయి ఆతనికి లోబడక చాలా చిక్కులు పెట్టింది. ఎంత డబ్బయినా యిస్తానన్నాడు. ఆస్తి కొని ఇస్తానన్నాడు. ఆ అమ్మాయి ససేమి అన్నది. ఇంక చెట్టిగారికి మరీ ఆదుర్గా, దుఃఖమూ ఎక్కువయింది. కొందరి ముఖ్య స్నేహితులకడ ఏడ్చాడు కూడా. చివరకు మధుర మీనాక్షికి వెయ్చినూటపదహార్లు ఇవ్వడం, నూరు కొబ్బరికాయలు కొట్టించడం, సంపూర్ణభోగం చేయించడం మొక్కుకున్నాడు. మధురపోయి పెళపెళ లెంపలు కొట్టుకొని, నడుముకు కండువా కట్టుకొని, సమాలింగిత భూతలుడై అమ్మవారిని ప్రార్థించాడు. తన మొక్కులు అడ్వాన్సుగా నూరు రూపాయలర్పించుకున్నాడు.

చిదంబరం అమ్మాయి తన స్వాధీనం అయింది. అతని ఆనందానికి అంతులేదు. అంతా దేవికరుణే అనుకున్నాడు. తన మొక్కుకు యింకో వెయ్యి కలిపాడు.

అలాంటి చెట్టియారుకి ఈ మధ్య పాపం అయిదారు ఘాటైన విధిచెంపపెట్టులు తగిలాయి. మలయాలో చాలా డబ్బు నష్టమైంది. ప్రభుత్వంవారు తెచ్చిన “వ్యవసాయదారుల అప్పుల తగ్గింపు చట్టం” క్రింద మూడు లక్షలు హతం అయిపోయినాయి. తాను నాలుగు లక్షన్నర పెట్టి తీసిన ఒక చలనచిత్రంవలన లక్షన్నర రూపాయలు నష్టం వచ్చినది. అదీకాక ఆ ప్రసిద్ధతార మాయా మంత్రంచేసి తన దగ్గిర జీతాదులు కాకుండా ఏభై అయిదువేలు లాగి పారవేసింది. అనంతలక్ష్మిమీద వ్యాజ్యంవలన అతనికి ముప్పయివేలు నష్టం వచ్చింది.

ఇవన్నీ ఆలోచించుకుంటూ కారు ఇంటికి పట్టమని అన్నాడు చెట్టి. కాని ఆ వెంటనే ఆ తుక్కు పత్రికా సంపాదకుడు కనిపించాడు. ఆ కోపంతో కారు ఆపు చేయించి కారు దిగి ఆ సంపాదకుణ్ణి వినరాని బూతులుతిట్టి నాలుగు లెంపకాయలు వాయించాడు. చెట్టియారు డ్రయివరు పేరు పొందిన గుండా. వాడు తన అరువల్ తీసి, ఆ సంపాదకుణ్ణి ఒక్కపోటు పొడిచాడు. అతని భుజం చీరుకుపోయింది.

ఈ తగాదా చూస్తున్న వినాయగం మహావేగంతోపోయి, డ్రయివరు చేతిలో కత్తిలాగి. పళ్ళూడేటట్లు రెండు లెంపకాయలు కొట్టి పట్టుకొన్నాడు. ఎప్పుడు ఏ సినీమా మహావీరుడు తనకు ఈలాంటి శిక్ష విధిస్తాడో అని, రొంటిని రహస్యంగా దాచుకొన్న బాకు పట్టి ఆ సంపాదకుడు చెట్టియారుపై ఉరికి గుండెలో పొడవబోయాడు. ఆ సమయంలో వినాయగం స్నేహితుడు అనంతలక్ష్మి ఇంటిలో నుండి పరుగెత్తి వచ్చినాడు. ఆ సంపాదకుని కాలుపై తన్నాడు. వాడు కూలబడ్డాడు. కానీ, అతని బాకు చెట్టియారు మొగాన్ని ఒక పెద్ద రక్తపుగంటు పెట్టింది.

ఈ కేకలు విని కోనంగీ, డాక్టరు రెడీ, మధుసూదన్, రియాసత్, అతని మేనమామా అందరూ అక్కడకు పరుగున లోపలి నుంచి వచ్చారు. వినాయగం, ఆతని స్నేహితుడు, ఇద్దరూ చెట్టియారునీ, చెట్టియారు డ్రయివర్నీ, ఆ అసాధ్యపు సంపాదకుణ్ణి అనంతలక్ష్మి ఇంటిలోనికి తీసుకు వచ్చారు. రెడ్డి చెట్టియారుకూ, సంపాదకునికీ వైద్య సహాయంచేసి కట్లు కట్టినాడు.

చెట్టియారు అందరికీ నమస్కారం చేసినాడు. కోనంగిరావు చెట్టిగారి డ్రయవర్ని చూచి “ఈ మహానుభావుడే, నన్ను ఆ రోజు చంప ప్రయత్నం చేసింది” అని తెలియచెప్పాడు.

వినాయగంపిళ్ళే: అవును స్వామీ, వీడుదా నిన్ను చంప ప్రయత్నించింది అని నాకు ఆ దినాలలోనే తెలిసింది. నేనూ మా వాడు వీడి దగ్గరకూ, వీడి స్నేహితుల దగ్గరకు పోయి వాళ్ళెవరయినా సరే జయలక్ష్మిగారి కుటుంబంవైపు, కోనంగిగారివైపు, ఆయన స్నేహితులవైపు తలెత్తి చూసినా, మరి ఏమి చేసినా, అందర్నీ ముక్క ముక్కలక్రింద నరికి, నిజంగా గద్దలకు వేస్తామన్నాము. ఆనాటి నుంచీ వీళ్ళు ఈ వైపుకు ఊరికేనన్నారాలేదు.

చెట్టియారు: “క్ష-క్షమిం -చం-డి, ఏ, ఏదో ఐంది. కోనంగిరావుగారూ, అన్నివిధాలా పాడయిపోయాను.” అని కళ్ళనీళ్ళు రాల గోలపెట్టినాడు.

డాక్టరు రెడ్డి: ఓరి రాక్షసుడా! మీరు తేళ్ళురా, మీకు బుద్ది రావడమే! (పళ్ళు కొరికినాడు)

కోనంగి: (నవ్వుతూ) పోనీయండి. ఇంక కొంచం జాగ్రత్తగా ఉండవయ్యా! ఏమండీ స్వామీ, మీ పత్రికలో ఇవన్నీ రాయకండి. పోలీసుకు రిపోర్టు చేయకండి. మా వినాయగం మాట అంటే హరి హరి బ్రహ్మాదులు అడ్డు రాలేరు.

సంపాదకుడు: కోనంగిరావుగారూ! మీమాట నాకు శాసనం అండీ.

వినాయగం: నడురా ఎదవా, నడు. నీ ప్రాణం దక్కింది. నా బిడ్డలజోలికి రాకు. చెట్టీ! నీ లక్షలు మా ఇద్దరికి గడ్డిపోచలు, మాకు కోపం వస్తే తెల్లవాడయినా నిన్ను రక్షించలేడు. పో!

చెట్టియారూ, అతని డ్రయివరూ తలవంచుకుపోయారు. కోనంగి అనంతలక్ష్ముల జీవితంలోంచే అతడు తలవంచుకు వెళ్ళిపోయాడు.

9

కోనంగి వచ్చాడు. శుభముహూర్తాలు పెట్టినారు. రియాసత్ మెహరున్నీసాల వివాహం ముందయింది. మనవాళ్ళందరూ సాక్షి సంతకాలు చేశారు. ఆ వివాహానికి ఎందరో ముస్లిం స్నేహితురాండ్రు, 'హిందూ స్నేహితురాండ్రు స్నేహితులు అందరు వచ్చినారు. మెహర్ స్నేహితురాండ్రు వెండిసామానుల బహుమతులతో ఆమె గది అంతా నింపారు. కోనంగి, మధుసూదన్, రెడ్డి, రియాసత్ ఇల్లంతా బహుమతులతో నింపారు.

రియాసత్ ఆనంద పరవశుడయ్యాడు. అంత సన్నిహితురాలయిన మెహర్ వధువుగా శయనమందిరములో త్రపామూర్తియై ఆసనమలంకరించి ఉన్నది. రియాసత్ వధువు మేలిముసుగు తొలగించి, “ఓ నా ప్రాణమహారాణీ! నీ వింతలజ్జావతి వైనావు. నీకు లజ్జయూ అందమేసుమా! నా సుల్తానా! నువ్వూ నేను భావిభారతదేశానికి అభ్యుదయ చిహ్నాలం. నువ్వు ఈ దీనుణ్ని చేపట్టడం ఒకనాటి మూత్తమ భవిష్యదశ సూచింపబడు తూన్నది. నీ అందం నా ఊహలకు దాటింది. నా పూజ ఆ సౌందర్యానికి తగినది మాత్రం కాదు.”

“ఏమిటయ్యా డార్లింగ్ ఏమిటీ కవిత్వపు మాటలు. నేను నిన్ను విడచి బ్రతికి ఉండేదాన్నా? నువ్వు నా భర్తవు. నా సుల్తానువు! నా హృదయానివే. నా అంత అదృష్టవంతురాలెవ్వరింక?”

వారి పడకగది ఓ స్వప్నంలా అలంకరించారు. ఓ దివ్వస్వప్నంవారి పడకగదిలో ఉన్న వారిరువురనూ కమ్మివేసింది.“ఖుర్ హు అల్లాహెూ ఆహద్

అల్లాహుసమన్ లం ఎలిద్

వలం యూలద్ వలం

ఎఖుల్లుహు ఖుర్ ఒన్ ఆహద్”

(భగవంతుడు ఒక్కడు - గుణాతీతుడు - జన్మ లేనివాడు - ఇతరుల కననివాడుఅతడే ఏకైక మహాభావము)

* * * *

ఆ తర్వాత మూడు దినాలకు డాక్టరు రెడ్డి, చౌధురాణీల వివాహం జరిగింది.

ఇంతమందీ ఆ వివాహానికి వచ్చారు. రెడ్డి ముఖ్యబంధువులందరూ వచ్చారు.

ప్రథమంలో రిజిష్టరు వివాహం జరిగింది. తర్వాత కోనంగి దర్శకత్వంలో అద్భుతమయిన వివాహమూత్సవం జరిగింది. సామ్యవాది అయిన డాక్టరు రెడ్డి “ఈ ఖర్చంతా ఎందు” కన్నాడు.

“నువ్వు 'సామ్యవాదివే. నీ భార్య జాతీయవాది. ఖర్చు నాది. నీకెందు కాగొడవ?”

“నా పెళ్ళికి నిన్ను ఖర్చు పెట్టనిస్తానా?”

“అయితే మనం ఇద్దరివంతులుగా ఖర్చు పెడదాం బూర్జువాల ధనం ఖర్చుపెట్టడమే మనవంతు.

1. బీదవాడి పూలతోటలు ఎక్కడున్నాయో ఆ పూలు కొనడం.

2. చిన్నకూరల దుకాణాలు వగయిరాల దగ్గర సరుకులు కొనడం.

3. బీదవంటవారిని తీసుకొచ్చి వంట చేయించడం.

4. తోలుబొమ్మలాట, వీధినాటకం, జంగాలవారి కథ అందంగా చెప్పించడం; సంగీతం కచ్చేరి, భరతనాట్యం ఏర్పాటుచేయడం.

5. బీదవారికి సంతర్పణ, వస్త్రదానం, కార్మికులకు భోజనాలు.

“ఇదయ్యా నా కార్యక్రమం. ఇందులో సగం ఖర్చు నీది. సగం ఖర్చు మాది. అంటే మేం ఆడపెళ్ళివారం కాబట్టి ఆడపెళ్ళివారిది అన్నమాట.”

“ఎంత పెద్దమనిషివి. ఈ కరువు రోజులలో, యుద్ధం భయంకరంగా సాగే రోజులలో?”

“నీ డబ్బు దాచుకొని దేశానికి సహాయం చేస్తావా?”

“నీ యిష్టం వచ్చినట్లు చేయి నాయనా!”

“అలాగేనయ్యా! రెడ్డి మహారాజా!”

“నన్ను మహారాజును చేయకు!”

“నన్ను నాయన్ను చేయకు!”

వివాహ మూత్సవములు అద్భుతంగా జరిగినాయి. కోనంగి స్నేహితులందరూ వచ్చినారు. అనంతలక్ష్మి స్నేహితురాండ్రందరూ వచ్చినారు,

చిన్నరంగారావును ఒక్కరూ వదలరు. వాడు ఒక్కటే కిలకిల. ఓ ఉయ్యాలలో పండుకొని ఒక్కటే అల్లరి. కాళ్ళు కదుపుతాడు, చేతులు ఆడిస్తాడు.

అనంతలక్ష్మితో స్నేహితురాండ్రందరూ “వీడు గొప్ప నాట్యవేత్త ఔతాడే అనంతం” అని ఒకబాల, వాడి ఊఁ ఊఁలు విని “వీడు గొప్పసంగీత పాటకుడౌతాడు” అని ఒక సుందరి, ఆ శిశువు పకపక నవ్వటం విని విని, “వీడు తండ్రిలా అల్లరి పిల్లవాడమ్మా!” అని ఒక యోష రంగారావుకు ముద్దులు ముద్దులు బహుమానాలిచ్చినారు.

ఆ మాటలన్నీ వింటూ కోనంగి ఆ బాలికతో “ఇప్పుడే వీడు ఈ నగరంలోని బాలలందరి ముద్దులూ కొట్టేస్తున్నాడు. పెద్దవాడయితే అచ్చంగా గోపికా కృష్ణుడై ఊరుకుంటాడు” అని అన్నాడు. అందరూ గొల్లుమన్నారు. ఒక బాలిక అందరికీ వినీవినబడనట్లు “వట్టి కొంటె కోనంగమ్మా వీడు” అన్నది. ఇంక బయలుదేరాయి చప్పట్లు! మధుసూదనుడు “ఒరే బావా, నీ కొడుకూ కోనంగేనటరా” అన్నాడు. మరీ చప్పట్లు.

పెళ్ళి జయలక్ష్మి ఇంట్లో, చౌధురాణీ చుట్టాలందరూ వచ్చారు. చివరకు చెట్టిగారు కూడా వచ్చి రెడ్డికీ, అనంతలక్ష్మీ కొడుక్కీ బహుమతులు ఇచ్చినారు.

ఆ రాత్రి విందులు అయినవి. స్నేహితులు వెళ్ళిపోయినారు.

శయనమందిరం జయలక్ష్మి స్వయంగా అలంకరించింది.

ఆ మందిరంలోనికి డాక్టరు రెడ్డిని ముందుగా తీసుకువచ్చి కోనంగి ప్రవేశపెట్టాడు. “రెడీ! చౌధురాణి నా కన్నచెల్లెలు వంటిది. ఆమెను నీ స్వంత హృదయగోళంలా, నీ స్వంత మెదడు గోళంలా కాపాడుకో! తెలుసునా?” అన్నాడు.

“లేకపోతే ఏం చేస్తావు?”

“నీ సందేహం అంతా శస్త్రచికిత్స చేస్తాను.”

“నీకేం తెలుసునోయి శస్త్రచికిత్స?”

“నీ సావాసంబట్టి నేర్చుకున్నానులే!”

“అయితే ఆ చికిత్సలో నాదేగా పైచెయ్యి!”

“ముందు వచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడివి!”

ఇద్దరు స్నేహితులు గాఢంగా కౌగలించుకొని విడిపోయారు. కోనంగి నిష్క్రమించాడు.

రెండు నిమిషాలయిన వెనుక అనంతలక్ష్మీ, జయలక్ష్మీ, సరోజినీ, కమలనయనా చౌధురాణీని తీసుకువచ్చారు.

కమలనయన, “రెడ్డి బావగారూ! ఇదిగోనండీ బావకు పన్నీరు!” ఆంటూ అతనిపై పన్నీరువాన కురిపించింది.

“ఇంక 'తన్నేరు' ఎవరు కమలా?” అని కోనంగి గుమ్మం దగ్గర నుంచి కేక వేశాడు.

కమలనయన “ఎవరు? మా అక్కే” అంటూ పైకి పారిపోయింది. అందరూ వెళ్ళి తలుపులు వేసేశారు.

డాక్టరు రెడ్డి గబగబా వచ్చి చౌధురాణి కడ మోకరించి "రాణీ! నూత్న పురుషుణ్ణయి చిన్న బిడ్డలా నీ పాదాల కడ ఉన్నా”ననినాడు.

"డాక్టరుగారూ?” అని ఆ బాలిక ఆతని చేతులుపట్టి లేవనెత్తినది. అత డామెను బిగ్గియగా కౌగలించుకొని పెదవులు ముద్దుపెట్టుకొన్నాడు.

స్వప్న పన్నీ రా దంపతుల ముంచెత్తినది.

10. మంగళ హారతి

నవజ్యోతి దినపత్రిక అఖండంగా జరుగుతున్నది. కోనంగి అనంతలక్ష్మిని చూచి ఆనందిస్తాడు “ఓసి గండుతుమ్మెదల రెక్కలవంటి జుట్టు కలదానా! ఓసి అమృతకలశ హృదయా! నేనేమి చేసితిని, నిన్ను నా అర్ధాంగిగా వరం పొందడానికి” అని ఒకనాడు అడిగినాడు.

“ఏం తపస్సా? గాలి మాత్రం మింగుతూ చేయి వాల్చకుండా పైకెత్తి ఆరు నెలలు హిమాలయంలో తపస్సుచేసి ఉండాలి.”

“అయితే నా చెయ్యి బిగుసుకుపోయి ఉండలేదే.”

“క్రిందటి జన్మలోనండీ గురువుగారూ! మీ చెయ్యి కూడా ఆ తపస్సుచేసి ఉండడంచేత, బంగారు మామిడిపండుతో పోల్చదగిన నా మనోహరచుబుకాన్ని గడియ గడియకు పుణికే భాగ్యం సంపాదించుకుంది!”

“అయితే దేవతలు వాళ్ళ స్వర్గలోకంలో దేవేంద్రబ్యాంకిలో, ఉక్కుకొట్టులో దాచుకున్న అమృతంలో మధ్య ఉన్న అసలయిన చుక్కలులాంటి నీ పెదవుల మధువును ఆస్వాదించే నా పెదవులు ఏ తపస్సు చేసుకున్నాయి చెపుమా! ఓసీ తేనే పెరలవంటి పెదవులు కలదానా?”

“ఓహెూ! సర్వకాలాల అల్లరి మాటలతో హడలకొట్టే దేశికుడవయిన ఓ ప్రాణేశా! సావధానులై వినుండు! కృతయుగంబున రెండు శకుంతాలు కలవు. అవి పాలసముద్రపు ఒడ్డున కాపురంబు చేయుచుండ, జగన్మోహిని అమృతం పంచడానికి ఆ దారిని నడుమున అమృతపు కలశం పుచ్చుకుంది. అప్పుడు ఆమె చెవిని ఉన్న అవతంసకుసుమం క్రిందకు జారింది. వెంటనే ఆ పిట్టలు రెండూ ఆ పూవును ఎత్తి పొరపాటున ఆమె పెదవుల మధ్య పెట్టినాయి. జగన్మోహినీదేవి నవ్వుతూ, ఓయి పిట్టలారా కలియుగంబున నా అంశాన ఒక బాలిక ఉద్భవించును. నా భక్తుడాకు డామెను భర్తగా వరించును. మీరిరువురూ వాని పెదవులుగా ఉద్భవింతురు అని వరంబిచ్చినదాయెను. మీ పెదవులే రెండు పిట్టలున్నూ!”

కోనంగి పకపక నవ్వుతూ, అనంతాన్ని హృదయానికి గాఢంగా అదుముకొని ఆమె పెదవులు చుంచించినాడు.

ఆమె అతని కౌగిలిలో ఆనందమున ఒక్క నిమిషం సర్వమూ మరచి, నిర్వచింపలేని ఏదియో మహదానంద మనుభవించింది. 'మా' అని రంగారావు కెవ్వున ఏడ్చినాడు. అనంతం భర్త కౌగిలి వదలి, వారి పడకగదిలో వారి పెద్ద పందిరిమంచం దగ్గరే ఉన్న బాలకుని ఉయ్యాల దగ్గరకు పరుగెత్తి బాలకుని సువ్వున ఎత్తుకొని, అక్కడే వున్న కుర్చీపై కూర్చొని ఆ శిశువును అడ్డాల వేసుకొని, పయ్యెదలాగి, బాడిసుఘ, బాడియు సడలించి పిల్లవానిని పాలు పుణకనిచ్చెను.

నిన్నటివరకు అనంతము కాలేజీ బాలిక. బిడ్డ నెత్తుకొనుటయైనచేత కాదు. ఆ బాలిక ఒకనాడు తాను మాత కావచ్చును అన్న భావమే లేక అందమయిన అల్లరిచేస్తూ, మహా మధుర ప్రణయాన తన్ను లోకాలోకాలకు తేల్చుకొనిపోతూ వుండేది.

ఆమె అల్లరి అంతా, మాధుర్యమంతా ఆమె బిడ్డలలో ప్రతిఫలించ ప్రారంభిస్తుంది. ఎంత ధీమాగా బాలకుణ్ణి ఎత్తుకుంది! ఆ ఎత్తుకోవడంలో అందమూ ఉంది, కౌశల్యమూ ఉంది. నలుగురు బిడ్డల తల్లిలా ఆమె వాణ్ణి అడ్డాల వేసుకొని పాలిస్తున్నది. ఇంకను ముగ్ధ, యోష, ఐనా తల్లి. ఆయోషా వేషంలో మాత్రం కాలేజీ బాలికలానే ఉంటుంది. పిల్లవాని యేడుపు వినబడేసరికీ నిత్యషోడవర్షయైన జగన్మాత, సుబ్రహ్మణ్య జననియైనట్లు అయిపోతుంది. ఈ ఆలోచనలు క్రమ్ముకొని రాగా కోనంగి తన భార్య పిల్లవానికి పాలిచ్చు పరమదృశ్యం చూస్తూ ఆనంద పరవశుడయ్యాడు.

ఆ బాలుడు కుడివైపు పాలు త్రాగుతూ, ఎడమవయిపు తల్లి ఉరోజంతో ఆడుతున్నాడు. ఆనందంగా పాలు తాగుతున్నాడు, పెదవులలోంచి పాలు దిజ్మాత్రంగా ప్రసరిస్తున్నాయి.

ఆ తల్లి కుడిచేయి వాడికి తలగడగా, ఉయ్యాలగా ఎడంచేత్తో వాడి పండులాంటి పిఱ్ఱలు, పాదాలు, తొనలు తిరిగిన తొడలు ఆనందంతో స్పృశిస్తున్నది. పాలుత్రాగే పిల్లవాని ఆనందంకన్న ఆరమూత కన్నులు పడిన అనంతలక్ష్మి చూపులలో ఎక్కువ ఆనందం కనిపిస్తున్నది. ఆ మాతృమత్తతార్థ నిమీలిత దృష్టులను మధ్య మధ్య అనంతం తనపై ప్రసరింపచేస్తున్నది. అందంగా తన హృదయం గతులు తప్పేటట్టు రెండు పెదవులు విడిపోగా చిరునవ్వులు ఉదయకాంతులమధ్య ఎగిరే రాయంచపిండులా తేలియాడుతున్నది.

నవోఢ అయిన తన ముద్దరాలి వక్షోజద్వయము ఏదో మహత్తరరూపం దాల్చినది. ఆనాడు కమలకుట్మలాంచల సన్నిభారుణాలయిన చుబుకాలు, ఈ దిగువ నానాగాఢవర్ణాలు సేకరించి పూర్ణత నొంది తన పూజను చూరగొంటున్నవి.

తొలుత వధువై వచ్చిననాడు అనంతలక్ష్మి చూపులు వసంతసాయంకాల నిర్మలాకాశపు లోతులు, స్వచ్చనీలకాసారనీలాలు, వేయి గులాబి పూవుల నుండి జాలువారిన మధురాలు! నేడు ఆమె ప్రథమ మాతృత్వేషణాల ఈనాడు తనపై ఆమె ప్రసరించే చూపులు నిశ్చలయామినీగాఢవినీల గంభీరాలు, మహాసముద్ర నీలాతినీలాలు, సర్వకుసుమోత్కృష్ట పరిమళాలు.

కోనంగి తన్ను ప్రణయపూర్ణ ప్రకాశితాలైన చూపులతో చూడడం చూచి, అనంతానికి సిగ్గు కలిగి పయ్యెదను సవరించుకొని, తన హృదయాన్ని, పాలు త్రాగే బాలకుణ్ణి కప్పివేసుకుంది.

కోనంగి విరగబడి నవ్వినాడు. ఆ బాలిక దగ్గరకు పరమ ప్రేమార్థ హృదయంతో పోయి ఆమె కూర్చున్న కుర్చీకడ ఆమె పాదాలకడ రత్నకంబళిపయిన కూర్చుండి, అందమై ఒకదానిపై ఒకటి వేసుకొని ఉన్న ఆమె కాళ్ళపై చేతులు ప్రసరించి, అందమయిన ఆమె పాదాలు తన రెండు అరచేతుల పట్టి వంగి రెంటిని ముద్దుకొన్నాడు.

“అనంతం, నన్ను చూసి సిగ్గుపడినావా?”

అనంతం సిగ్గుతో నవ్వుకొని ఎడంవయిపునకు బాలకుణ్ణి తిప్పి ఆ వైపున పాలిస్తూ, కుడిచేతితో కోనంగి తల తడుముతూ “మీరు కొంటెపిల్లవాళ్ళు! నన్ను అంత ప్రేమతో చూస్తూంటే, అప్పుడు నా భర్తలు మాత్రం. నేనిప్పుడు తల్లిని. అందుకని సిగ్గువేసింది గురువుగారూ!” అని వంగి కోనంగి పెదవులు గాఢంగా చుంబించి ఆ వెంటనే తన పుత్రుని బుగ్గలు ముద్దు పెట్టుకుంది.

తాను వంగి భర్త మోము దగ్గరగా తీసుకొని, అతని చెంపలకు తన పెదవు లానించి “నా సర్వస్వమయిన గురూ! వీడు నా కడుపులో పడిన కొద్ది రోజులకు కాబోలు మీరు నా ప్రక్క పడుకొని అంత దివ్యమూర్తులై నిద్రపోయే సమయంలో, నాకు మెలకువ వచ్చేది. ఆ నిదురలో మీరు చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు. ఆ నవ్వు కారణము ఏమో! నాకు చిన్న బిడ్డలా కనిపించేవారు. నా చుట్టూ చూచుకొని బ్లవుజు విడదీసి, అతిగా సిగ్గుతో కరగిపోతూ, గుండెలు కొట్టుకుంటూ ఉండగా, మీ పెదవులకు నేను తల్లిలా... ఆనించేదానను. గు-రు-వు-గారూ, నాకా సమయంలో కలిగిన ఆనందం లోకంలో యెవరికీ గ్రాహ్యంకాలేదు.”

“అవును ప్రాణకాంతా! అలాంటి కలలే నాకు రెండు మూడుసారులు వచ్చినట్లు అయింది.”

కోనంగి భార్యను పాలుత్రాగే తన ఆత్మజునితోసహా ఎత్తుకుపోయి పందిరి మంచంమీద పడుకోబెట్టినాడు.

అనంతలక్ష్మి, బాలకుడూ భర్త కౌగిలిలో సమానంగా ఒదిగిపోయారు. ఇద్దరి బుగ్గలపై ముద్దులు కురిసినవి. కోనంగి “వీడు మన తపఃఫలముసుమా అనంతలక్ష్మి!” అన్నాడు.

“గురువుగారూ! నా తపస్సుకు భగవంతుడు నాకు ప్రసాదించిన ఫలం మీరు; మీరు నాకు ప్రసాదించిన ఫలం ఈ చిట్టిబాబున్నూ! వినండీ, నిన్ననే వ్రాసుకొన్నాను ఈ పాట!

యామినీయోష పూజాఫలము

ఆమె హృదయేశుడు సుధాకరుడు నాథ!

యామినీ యామినీ కాంతుల తపఃఫలము

భూమి శాంతిని నింపు వెన్నెలలూ వెలుగూ

గురుదేవ నువ్వు నా కోటిపూజలఫలము

అరుదేరే మన తపఃఫలమయిన ఈ చిట్టిబాబూ!”

“ఓసి నా ఆత్మమూర్తీ! ఎంత మధురాతి మధురంగా వ్రాశావు. ఏమి బహుమానం ఇవ్వగలను! నువ్వే నా ఆత్మమూర్తివి. నువ్వే నా బ్రతుకువు. నువ్వేనేను.”

“నువ్వే నేను. నేనే నువ్వు” అని మధురకంఠాన పాడుతూ కోనంగి భార్యను. బిడ్డను కలిపి హృదయాన కదుముకున్నాడు.

ఓం అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతం గమయ.సమాప్తము