Jump to content

కేయూరబాహుచరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కేయూరబాహుచరిత్రము

తృతీయాశ్వాసము

క. శ్రీరమణీకారుణ్యసు, ధారససరసీమరాలుఁ దారకవాణీ
     శారదనీరదనారద, హారనిభయశస్కు గుండనామాత్యనిధిన్.1
వ. కేయూరబాహుమహానాథుం గటాక్షించి దృష్టి మరలఁ దిగిచి.2
చ. తొఱగుము నంత నీ విది విదూషకమంత్రముచేతఁ గాదు మా
     కెఱుఁగఁగవచ్చె నెల్లవియు నేటికి మాటలు వేయు నందుఁ గ్రొ
     మ్మెఱుఁగులు గ్రమ్ము కేలఁ గొని మేఖల బాహువు నూఁది చిత్తముం
     బిరుదును నల్లనల్లనఁ దపింప మృగేక్షణ వోయె నల్కతోన్.3
వ. ఇట్లు దేవి నిజనివాసంబున కరుఁగఁ దత్పరిచారిక లగుసుమతీసుకుమారికామక
     రందిక లొకచోటికిం గూడి రహస్యగోష్టి యొనరించు నవసరంబున సుమతి
     యి ట్లనియె.4
క. చెలులార కంటిరే మే, ఖలబేలతనంబు మున్నుఁ గానక పగతో
     బలియింపనేల నెయ్యము, సలుపంగా నేల పిదపఁ జారాయణుతోన్.5
క. ద్రోహోక్తల వైరానల, మూహింపక రాఁజవెట్టి యుక్తిరహితు లై
     స్నేహంబు పిదపఁ జనునె య, పోహంబుగ నుండుఁగాక వొనుబాటగునే.6
క. బలవంతుఁడుఁ బగవాఁడును, ఖలుఁ డనఁగా జాలువాఁడుఁ గపటోక్తులఁ దాఁ
     గలయఁగ వచ్చిన వెల్వడి, కలపికొనిరయేనిఁ గీడు కాకుండ దిలన్.7
క. నేరుపుమై మేఖలయెడఁ, జారాయణుచేత తొల్లి సర్పముఁ గపటా
     ధారోక్తుల దర్దురములు, చేరి పిదప దాని కెగ్గు సేయుట వోలెన్.8
వ. అనుటయు నది యె ట్లన నహిభేకోపాఖ్యానంబు సవిస్తరంబుగా వినిపించెద వి
     నుండని సఖులతో ని ట్లనియె.9
ఉ. పూచినతీఁగెలన్ మధురభూరిఫలంబుల వ్రేఁగునన్ మహిన్
     మోచినకొమ్మలుం గలిగి మూఁకలుగట్టిన పోఁకమోకలన్
     రాచినవాల్మృగంబులు దినంబడి వర్ణన సేయ నొప్పు విం
     ధ్యాచలపార్శ్వకానన మనన్యవనీవిభవోపమాన మై.10
వ. అట్లయ్యరణ్యం బభిరామగమ్యం బై పరఁగునంత.11

క. తొల్లి యుగసంధి నొకతఱి, నెల్లెడఁ బొడవడఁగఁ దాప మెక్కుడు గా
     ధిల్లె నొకవఱపు ప్రాణులు, తల్లడిలఁగ నిడివియగుచు ధరణి కడంకన్.12
వ. ఆక్కాలంబున.13
సీ. పసిమి యెచ్చట లేక పాడగుటకుఁ దోడు పాతాళమునదాఁకఁ బగిలె నేల
     బిలములు వ్రయ్య లై నెలవు లేమికిఁదోడు హీనజంతువు లెల్ల నివికె నెండఁ
     జండాతపముచేత నెండిపోకకుఁదోడు ద్రుమములఁ బెనుగాలి తుమురుసేసె
     నాఁకలి నీరువ ట్టనుచిచ్చునకుఁదోడు కార్చిచ్చు మృగములఁ గాల్పఁ దొడఁగెఁ
గీ. నాపదల మదనాపద లావహిల్లె, వట్టిపోయిన డొక్కలు వాము లయ్యె
     నివుఱుబొగ్గులప్రోవులు నిఖిలదిశల, నధికదుస్సహమయ్యె నయ్యడవియందు.14
క. పరిపూర్ణోదక మై కడు, నిర వగునొకకూపమున ననేకంబులు ద
     ర్దురములు బహువర్ణంబులు, పరఁగు సుహృద్భ్రాతృపుత్రపౌత్రయుతము లై.15
వ. ఇట్లన్నియుం దమకు మహావేగుం డనునొకచక్కనిమండూకంబు రాజుఁగా నిలు
     పుకొని సుఖం బుండునంత.16
క. ప్రియబంధు లెల్లవారును, లయ మందినఁ దాను జాల లావఱి కంఠా
     శ్రయజీవన మై తిరిగెడు, భయదర్శక మనఁగ నొప్పు పా మచ్చోటన్.17
క. మండూకనినాదము విని, నిండినసంతసముతోడ నీరుండనిచో
     నుండ వివి యచట నుదకము, లుండంగఁబోలు నని మేన నుమ్మసలారన్.18
మ. కదియం జయ్యన వచ్చి నాగ మచటం గాంభీర్యసంపత్తికిం
     గుదు రైయుండెడునూయిఁ గాంచి మదిఁ గోర్కుల్ నేఁడు సేకూఱఁ బో
     వుదు నాతృష్ణ బుభుక్ష యిప్పుడ వెసం బుత్తు న్మహావగ్రహా
     స్పదదుష్కాలదినంబు లెల్ల నిచటన్ సమ్యక్సుఖావాసి నై.19
క. చెఱవెడలఁ డెఱువుఁ గానక, దరి నుండుచు లోన నుండు దర్దురనాథున్
     బరిమితపరిజనపరివృతు, నిరవున నున్నతనిఁ జూచి యి ట్లని పలికెన్.20
శా. దేవా! భేకకులాధినాథ! కరుణాదృష్టి న్ననుం జూడవే
     జీవం బుండదు నీరువట్టుకతనన్ శీఘ్రంబ నిం గొల్వరాఁ
     ద్రో వేదిక్కునఁ గాననేర మదిలో దుఃఖంబునం బ్రుంగెదన్
     నీవారిం గలయంగ రాఁ బనిచి మన్నింపంగదే వేఁడెదన్.21
క. మా పెద్ద లెఱుక సాలక, మీ పెద్దల కెగ్గు నేసి మలఁగుట చెయ్దం
     బాపికొనవలయు నను నీ, శ్రీపాదసమీప మిపుడు చేరితి కొల్వన్.22

గీ. ఉరగసంఘంబులకుఁ గప్ప లోడు టెల్ల,
     నీవు పుట్టకమునుఁ గాని నీ ప్రతాప
     మెఱిఁగి రిఁక మిమ్ముఁ దొరయ రా వెఱవకుంద్రె,
     చారుతరమూర్తి మండూకచక్రవర్తి.23
క. హనుమంతునిం బ్లవంగం, బని పిల్తురు నిన్నుఁ బిలుతు రాపేరనె యిం
     ద్రుని హరి యందురు హరి యని, నినుఁ జెప్పుదు ర న వినుతి నీకుం దగదే.24
క. అని తన్ను నిట్లు వొగడిన, విని యొడ లుబ్బంగ భేకవిభుఁ డయ్యహి కి
     ట్లను నామంత్రులయనుమత, మున నిను రప్పింతు నిలువు ముదమున నచటన్.25
చ. అని తనయిష్టమంత్రుల రయంబునఁ బిల్వఁగఁ బంచి వారి క
     ప్పని యెఱిఁగించిన న్వశమె పాములపొత్తు మనంగ దీని నే
     మని యొకగొప్పకార్యముక్రియం దలపోసెద వన్న వెండియున్
     మనమున సర్పబాంధవము మానని యేలిక మోము చూచుచున్.26
వ. స్వేతుం డనుదర్దుకం బి ట్లనియె.27
క. తనకు నెడ రైనతఱిమా, లనికంటెం గీడువడు నలజ్జత నదివా
     సినయపుడ మఱచి కుజనుఁడు, దనుఁ బట్టపురాజుఁగాఁగఁ దలఁచు మనమున్.28
క. చెలిమి శిలాక్షర మెప్పుడు, నలుక జలాక్షరము సుజను లగువారలకున్
     జెలిమి జలాక్షర మెప్పుడు, నలుక శిలాక్షరము కుజను లగువారలకున్.29
వ. పిదపఁ గృష్ణరూపం బనుమండూకం బి ట్లనియె.30
మ. అరయం దుష్టజనుల్ స్వదుశ్చరణజాత్యంధుల్ నిజాచారధీ
     గరిమాతిస్తుతివంతు లాత్మఘనరక్షాజాగరూకాత్మకుల్
     పరదోషేక్షణదివ్యచక్షు లితరప్రజ్ఞాప్రశంసానిరం
     తరమౌనవ్రతు లన్యవిత్తహరణధ్యానక్రియానైపుణుల్.31
క. చేరంగఁ దగని దుర్జనుఁ, జేరంగానిచ్చిరేని నేగియు నిడుమల్
     కూరుదురు తొల్లి కాకము, సేరిన యంచలకు నైనచేటు వినమొకో.32
క. అనవుడు మండూకేశుఁడు, విన మెన్నఁడు నంచ లేమివిధమునఁ గాకం
     బునకు నిర విచ్చె నెవ్విధ, మునఁ నానిం బిదపఁ గీడు పొందెం జెపుమా.33
వ. అనిన యాకథ విను మని యాకృష్ణరూపి యి ట్లనియె.34
సీ. ఒక పర్వతముమీఁద నొప్పెడుకొలనిలో నంచలు కొన్ని యిచ్ఛానువృత్తిఁ
     బగ లెల్ల విహరించి భానుఁడు గ్రుంకంగఁ బాపాత్ములకుఁ జేరఁ బ్రాఁకరాని

     యున్నతోన్నతమగు నొకగండశిలయందు రే లెల్ల సుఖలీలఁ గ్రాలుచుండు
     నట్లుండఁ దద్గ్రహణాపేక్ష నొకబోయ తెంకిప ట్టరసియుఁ దేఱిచూడ
గీ. లేక యరిగెను నొకనాఁడు కాక మొకటి,
     ప్రొద్దుగ్రుంకిన నచటుగాఁ బోయిపోయి
     ఖగనినాదము విని వాని గదియవచ్చి
     యుండుటయుఁ దానిఁ గని హంసయూధ మెల్ల.35
ఉ. ఎచ్చటనుండి యెచ్చటికి నేగెద వేమి ప్రయోజనార్థ మై
     యిచ్చట నిల్చి తీ వనిన నేఱి తినంజని కుక్షినిండఁ గాఁ
     జెచ్చెర నున్కిపట్టునకుఁ జేరఁగఁబోయెడి ప్రొద్దులేమి నా
     కిచ్చట నుండఁగా వలసె నిట్టిది నావిధ మంచుఁ జెప్పినన్.36
క. అగుఁగాక నిలుపు మనిహం, సగణం బంతయును బలుక సంకటపడుచున్
     సుగుణుఁడు మతిమంతుం డనుఁ, తగ వెఱిఁగినయంచ యొకటి దా ని ట్లనియెన్.37
గీ. సబము నెంగిళ్లు దీనిభోజనము క్రూర, మిట్టియెగ్గులు వేయును నేల చెప్ప
     ఖగములందుఁ జండాలుఁడు కాక మనుట, కడుఁబ్రసిద్ధంబుఁ గాదె యానొడువు వినరె.38
క. వల దీరే యిది మనకడ, నిలిచినఁ గీ డొందు మనల నేఁ డెల్లిటిలో
     పలఁ జేరకున్నఁ గాలము, తలనైనను జేరు నింత తథ్యము సుండీ.39
వ. అనుటయుఁ గార్యం బెఱుఁగని తరుణమరాళములు కొన్ని యమ్మతిమంతు నుద్దేశించి.40
గీ. ఇంతవల్దువాద మీకాకి యొక్కటి, యొక్కరాతి రిచట నున్నమాత్రఁ
     గీడు సేరు ననుచుఁ గీనువగొట్టుట, యిద్ది వెఱపు గాక యెఱుక యగునె.41
క. పెక్కులు బుద్ధులు గఱచిన, నెక్కుడు భయ మనుట నిక్క మింకబహూక్తుల్
     తక్కు మిదియుఁగా కిది తా, నెక్కడకిం బోవుఁ దిమిర మిప్పుడు రాఁగాన్.42
క. అని పలికి దాని నుండం, బనిచి యభీష్టంబు లైన ఫలములచే భో
     జన మొనరింపఁగ నుండగ, దనయమ్ముల వాయసంబు దగ నివసించెన్.43
వ. ఇట్లు వసియించి.44
గీ. అచట రెట్టఁబెట్టి యర్కోదయము గాఁగఁ, దడయకరిగె నంత దానిరెట్ట
     శిలలసంధిఁ బొంద మొలచె నం దొకవట, భూజఫలములోని బీజముండి.45
మ. అది నానాఁటికిఁ బేర్చి, శాఖల విహాయస్పర్శ మై యుండఁగాఁ
     బదియేండ్లుం జనునంత నూడలు కడుం బల్పారి వర్ధిల్లుచుం
     గదిసెన్ వచ్చి యధిత్యకాతలమువంకం న్మానఁదాఁ బ్రాకియ

     భ్యుదితానంది కిరాతుఁ డొగ్గె నురు లాభూజంబునం దెల్లెడన్.46
చ. ఉరులు కుజంబునం గలయ నొగ్గి నిసాదుఁడు చన్నమీఁద భా
     స్కరుఁ డపరాద్రిఁ జేరె జలజాతవనంబులఁ గ్రీడ మాని స
     త్వరగతి మీఱి మీఁదికి సితచ్ఛదముల్ చనుదెంచి యాఁగి పో
     గురికలఁ జిక్కి యన్నియును గుందుతఱిన్ మతిమంతుఁ డి ట్లనున్.47
మ. మన కీపాటులు వచ్చెఁ జూచితిరె నామాటల్ వృథాహంకృతిన్
     వినఁగా నొల్లక యల్లరాత్రి యిచటన్ మీ రెల్ల వాదాడి యుం
     చిన యాకాకమురెట్టలో మొలిచి హెచ్చెం జూవె యీమఱ్ఱి డి
     గ్గిన యాయూడలఁ బ్రాఁకి కాదె మన కొగ్గెం బోయఁ డీజాలమున్.48
క. తగువానిపలుకు సేయుట, తగ వెఱుఁగక యడిచిపడమి తమవారలతో
     సగుణత్వము గొను టుత్తము, లగుణము లటు గామి యరయ నధమగుణంబుల్.49
చ. అనవుడు నంచ లిట్లను మహాత్మ భవత్ప్రతిభావిలంఘనం
     బున మన కిట్టికీ డిపుడు పుట్టె నుపాయము కల్మి దీనిఁ బా
     పనలవియేనిఁ బాపి హితబంధుల నిన్నును గాచికొమ్ము నీ
     పనిచినయట్ల చేసి భటభావముఁ బొందెద మెల్లవారమున్.50
వ. అనుటయు మతిమంతుం డి ట్లనియె.51
క. తమలో నన్యోన్యవశ, త్వము గలిగినబంధు లాపదల నెల్ల నుపా
     యము మైఁ బాతురు నిక్కము, కమఠంబులు గరుడబాధ గడచినభంగిన్.52
వ. కాన భయంబు వలువ డక్కథ వినుం డని యి ట్లనియె.53
క. అంబుధితీరంబునఁ గూ, ర్మంబులు చరియించుచుండుఁ బ్రతిదినమును వా
     నిం బట్టి తనకు నాహా, రంబుగఁ గొనుచుండుఁ బక్షిరా జుగ్రుండై.54
వ. ఆట్లు సెల్లుచుండ నొక్కనాఁడు.55
చ. వననిధినీట నిల్చి ఖగవల్లభుతో నొకకూర్మముఖ్యుఁ డి
     ట్లనియె మదీయబంధునివహంబులు దేవరవాతఁ ద్రుంగె నే
     న నిలచినాఁడ నిప్పటికి నాకుఁ దొలంగినఁ బోదు నీకు నా
     కు నొకటి పన్నిదంబు సమకూఱునె యోలము మాని చెప్పుమా.56
క. అనుటయు నవ్వుచు వినతా, తనయుం డది యేమి పన్నిదము సెప్పవయా
     యనవుడు నలుగక చిత్తం, బున నించుక యవధరింపుము మహావిహగా.57
ఉ. ఉడువీథిన్ వెస నీవు వాఱ జవసత్వోత్సాహ యంబోధిలోఁ

     గడునంబాఱెద నిన్ను నేను మిగులంగాఁ జాలినట్లైన నె
     న్నఁడు భక్షింపకు మమ్ము నోడినటులైనన్ మాకులం బెల్ల నె
     ప్పుడు నాహారము గొమ్ము నీవు వినతాపుత్రా మహాధార్మికా.58
వ. ఇవ్విధంబు సేయం దలంపు గలిగెనేని నొక్కనాఁ డిచటికి విజయం చేయుం డనిన
     సుపర్ణుం డట్లు చేయుదు నని యొడంబడి పోయిన.59
క. తనచుట్టంబుల నందఱి, ననువుగ నొకచోటఁ గూర్చి యాకూర్మము తా
     ర్క్ష్యునితోఁ దా నొడఁబడి వ, చ్చినచందము వారితోడఁ జెప్పుడు వారున్.60
క. నినుఁ గడచినమతిమంతులు, మనలోపలఁ గలరె పంపు మము నైపని యై
     నను జేయుదు మనవుడు నది, మనమలరఁగఁ జెపుదు వినుఁడు మన మంచఱమున్.61
క. ఆమఱి యెడఁ బదిపదిగా, సాముద్రతటంబునీరఁ జని యుండి ఖగ
     స్వామి పఱవంగ నాతని, కాముందటివాఁడు చూపునది పొడ వచటన్.62
వ. అని యోజచేసికొని విహగవల్లభుతోడఁ దాను మాటలాడినయెడన యాకచ్ఛపం
     బు నిలిచె నచ్చటు మొదలుకొని యనేక యోజనంబులు దాఁకఁ దక్కినవియు న
     ట్ల యుండ మఱునాఁడు సనుదెంచి.63
క. గరుడుం డవ్వలనికి స, త్వరగఁ గూర్మంబుఁ బిలిచి వారిధిపై నం
     బరవీథిఁ బెద్దయునుద, వ్వరుగుచు నది చిక్కనోపు నని చీరుటయున్.64
క. ఓ యని పలుకుచు ముందఱఁ, దోయధిలోఁ గచ్ఛపంబు దోఁచిన మఱియున్
     వాయుగతిఁ బఱచి చీరిన, నాయెడ నగ్రమునఁ గమఠ మల్లన నెగసెన్.65
వ. అవ్విధంబుఁ గని యచ్చెరు వొందుచు.66
క. అందుండి మగుడఁ బఱచుచు, ముండటి యట్లట్ల పిలువ ముందఱ నంతం
     తం దోఁచుచు నవి పిఱుఁదులు, ముందఱఁగాఁ జేసి పక్షిముఖ్యునిఁ గెలిచెన్.67
క. అతఁడు తనయోటమిని ల, జ్జితుఁ డై మీ కెందు నెగ్గు సేయం బ్రమద
     స్థితి నిలువుఁ డనుచుఁ బోయిన, నతిసంతోషమునఁ గచ్ఛపావళి యుండెన్.68
వ. అట్లగుటఁ బరస్పరవశ్యు లగుబంధువు లాపద గడవవచ్చు నింక నైన మదీయవచ
     నంబు లంగీకరించెదరేని వినుం డని మతిమంతుం డి ట్లనియె.69
సీ. కంఠమూలంబునఁ గదిసినయీయురు లూడిచికొని పోవు యుక్తి లేదు
     గాని చావక యుండఁ గల దుపాయం బైకమత్యంబు గలిగిన మనకు నెల్ల
     నె ట్లన్న నిజ్జాల మొడ్డినవేఁటకాఁ డేతెంచు నిందుకు వేగఁ దడయ
     కప్పుడు మన మెల్ల నవగతప్రాణులకరణి నుండినఁ జాలు నురులఁ బాపి

గీ. చచ్చినని మున్న యని తాను జంపు టుడిగి, వటముక్రింద నన్నిటి దిగవైచువాఁడు
     డిగ్గ నరుదెంచుతఱిఁ గని ది గ్గనంగఁ, బాఱిపోద మెవ్వరమును బట్టువడక.70
వ. అనుటయు సంతసిల్లి మరాలంబు లన్నియు నిది లెస్సమతం బని నిశ్చయించి యమ్మ
     తిమంతునుపదేశంబున నట్ల యుండునంత.71
గీ. వేగుటయు వచ్చి బోయ యవ్విహగయూధ
     మున్నచందంబుఁ గనుఁగొని యుల్ల మలరఁ
     గడసినవి పులుఁగు లురులచే మెడలు బిగిసి
     యనుచు వట మెక్కి డిగవైచె నంతవట్టు.72
క. ఒకఁ డొకఁడు డిగ్గవైవఁగ, సకలంబును బ్రోవు గట్టి సంభ్రమమున ని
     ల్వక చనె మతిమంతుఁ డొకఁడు, నొక కడపటిశాఖయందు నురి నుండంగన్.73
గీ. అతనిరాకఁ దలంపక యధికభీతిఁ, బోవుటయు ఱిచ్చవడి ముండపులుఁగు లకట
     మోసపుచ్చెర న న్నని డాసి బోయ, యలిగి మతిమంతుమెడ బిగ్గ నులిమి చంపె.74
క. మతి ధృతి లేని వెడంగుల, మతి గఱపిన సుమతికిం బ్రమాదము వచ్చున్
     మతి గఱపిన మతిమంతుఁడు, సితచ్ఛదోత్కరముచేతఁ జెడ్డవిధమునన్.75
క. మతిమంతుం డవ్విధమున, హతుఁ డయ్యెం దక్కుఁగలుగు హంసలు దుఃఖా
     యతనంబు లయ్యె దముఁ గు, త్సితకాకం బొక్కరేయి సేరినకతనన్.76
క. కావున నీసర్పము మన, యావాసముఁ జేరెనేని నతిశయదుఃఖం
     బీవశత వచ్చు దీనికిఁ, ద్రో వెఱిఁగించెడితలంపుఁ దొఱఁగుము బుద్దిన్.77
క. నీ వుపకారం బితనికిఁ, గావింపఁ గడంగి యధికకరుణామతివై
     యావిధము సేయుచుండియు, భావింపందగు నపాత్రపాత్రత లెందున్.78
క. క్రూరు లగుజనులు ప్రత్యుప, కారంబులు సేయఁజాలయక సుజనులపై
     నారోపింతురు తప్పులు, కారండవచయమువలనఁ గాకులువోలెన్.79
వ. అక్కథ యెట్లనినం బురాతనకాలంబున.80
క. కోసలదేశంబున ధా, రాసనుఁ డనఁగాఁ గలండు రా జతఁడు నయ
     వ్యాసంగము ధర్మంబున్, బాసి చరింపంగఁ దొడఁగెఁ బ్రజలు దలంకన్.81
క. ఆరాజు సేయు నెగ్గులు, కారణముగ జనపదమునఁ గఱ వగుటయు ము
     న్నారాష్ట్రంబు దమకు నా, ధారమ్ముగ నుండుకాకితండం బెల్లన్.82
వ. ఒకయెడం గూడుకొని.83
క. ముంగిళ్ళ నెండువులు గా, నంగఁబడవు గలుగుపట్టునం గాపుఘనం

     బెంగిలిమెతుకులు చల్లుట, యుం గలుగదు మున్నవోలె నుర్విఁ దఱుచుగన్.84
క. కడు బలు లిడలే రిచ్చటి, వెడమాయపుటాస లెల్ల వేగ విడిచి యొం
     డెడ కరిగి నేరిచినక్రియఁ, గడుపులు రక్షించుకొనుట కార్యము మనకున్.85
మ. అని కాకుల్ తమ దేశమున్ విడిచి భుక్త్యాకాంక్ష నెందేనియుం
     జనుచో దవ్వులఁ ద్రోవ నొక్కయెడఁ గాసారంబులో నుండి క
     న్గొని మోదంబున నీరుకాకు లనుపక్షుల్ పక్షిజాతిత్వమా
     త్రనిబద్ధం బగు బాంధవంబునన చేరంబోయి ప్రార్థించుచున్.86
ఉ. తోకొని వచ్చినం దొలుతఁ దోయజషండము దన్పు తియ్యనీ
     రేకట వోవఁ గ్రోలి దరి ని మ్మగుచెట్టులనీడ నుండఁగాఁ
     బ్రోకలు గట్టి వారిఖగముల్ తమముందఱఁ బెట్టు మీలఁ బే
     రాఁకలి యల్లఁ దీర్చుకొని యచ్చట నద్దినరాత్రముండుచున్.87
సీ. కదలి వేకున నేగఁగడగుచో నప్పుడు నీరుకాకులు వచ్చి మీర లేమి
     పనికి నెచ్చోటికి జనియెద రనిన మావసియించుదేశ మవగ్రహమున
     పలఁగిన నాహారములు లేక యిందఱుఁ బండినభూముల కొండుకడకు
     నరిగెద మనని వాయసములఁ గారండవము లట్టిదేని నేవలను నేల
గీ. యిచట నిల్వుఁ డింక దీకొల నెన్నఁడు, జలచరములు నిందుఁ జూలఁ గలవు
     ననుడుఁ గాకు లబ్బ వామిషంబులు మాకు, మేము నీఁదువెరవు లేమిఁ జేసి.88
క. కావున నుదరము లిచ్చట, నేనెరవునఁ బ్రోచికొందు మే మనుటయు మే
     మీవిధ మెఱుఁగుచు నొండొక, ఠావునకుం బోవచ్చుట తగవే మాకున్.89
వ. అని మఱియును.90
క. కారండవమ్ము లనియెన్, మీ రూరక కొలనికఱుత నిలువుఁడు మీకా
     హారంబులు గా నిచ్చలు, వారిచరోత్కరముఁ బెట్టువారము తనియన్.91
వ. అనుటయు నగుగాక యని నిలిచి.92
మ. జలపక్షుల్ వెలివైనఁ గ్రొవ్వు గలమత్స్యవ్రాతమున్ మ్రింగుచున్
     జలజావాససమీపకుంజశిశిరచ్ఛాయాప్రదేశంబులన్
     లలిఁ గ్రీడించుచు లీల న ట్లమితకాలం బచ్చటం బుచ్చి య
     బ్బలిపుష్టంబులు పుష్టదేహములతోఁ బ్రహ్లాదముం జెందుచున్.93
క. తమదేశంబున దుర్భి, క్షము వాయుట యరసి యెఱిఁగి చనుచుండి విచా
     రము సేయఁ దొడఁగె నప్పుడు, తమలో నన్నీచఖగవితానము లెల్లన్.94

క. కారండవములు మన కుప, కారము చేసినవి వీనిఁ గన్ను మొఱఁగి పో
     నేరకయుండినఁ బ్రత్యుప, కారము సేయంగ శక్తి కలదే పిదపన్.95
వ. అనుపలుకులు విని యందుఁ గొన్ని యి ట్లనియె.96
క. వీరికిఁ జెప్పక పోయినఁ, జోరత్వము వచ్చుఁ జెప్పి సులభప్రీతిన్
     వీ రనుపఁ జనినఁ బ్రత్యుప, కారం బొకయపుడు సేయఁగావలయుఁ దుదిన్.97
వ. అ ట్లగుటంజేసి.98
క. వీరు మనకుఁ జేసినయుప, కారం బప్పుగ ని దేల కైకొనిపోవన్
     వీరిపయిం ద ప్పొక్కటి, యారోపింపుదము గాక యది యెల్లఁ జెడున్.99
క. అనవుడు వీరలమీఁదను, నొనరింపగ దోస మొకటి యొనరికయది క
     ల్గునె యనుచు వెదకి కొఱఁతలు, గనుఁగొని యన్నియును జలఖగంబులకడకున్.100
వ. చని వాని నుద్దేశించి.101
క. చిరజీవము మానామము, సరకే మా కొకటి యిష్టసంచారము మై
     నరుగక మీ రిట నాఁపినఁ, బరిభవములఁ బొందనాపఁ బడితిమి మీచేన్.102
చ. నెల పదిప్రొద్దు లే మిచట నిల్చినమాత్రన మాకు మీర లెం
     గిలి సతతంబు వెట్టితిరి కిల్బిషవర్తనులార యక్కఱల్
     కలుగవె యెట్టివారికి జగంబున నోడల బండ్లు బండ్ల నో
     డలుఁ జనుదెంచునంట యకటా వినరే యిటుఁ జేయఁ గూడునే.103
వ. అదియునుంగాక.104
క. పుచ్ఛంబు లెత్తి మీవగు, పుచ్ఛంబులక్రిందు మాకుఁ బొరిఁ జూపుచు న
     స్వచ్ఛు లయి నీటఁ గ్రుంకెడు, తుచ్ఛుల మిముఁ దిట్టఁ జాలుదుమె యె ట్లైనన్.105
గీ. వ్రతులు మాలోన సగ ముండ్రు వార లిచటఁ
     జేరు టాదిగ నొల్ల రాహార మెపుడు
     సరసిఁ గ్రుంకుచు మీరు పుచ్ఛములక్రిందుఁ
     జూపఁ జూచుచుఁ గోఁతలు చుట్టుకొనిన.106
వ. అని పలికి.107
క. మీకొఱగాములు సర్వము, మీ కుండుంగాత యనుచు మింటఁ గలగొనన్
     గా కా యని యఱచుచు వెసఁ, గాకులు పూర్వప్రదేశగమనముఁ జెందెన్.108
వ. అ ట్లగుటంజేసి.109
క. ఉపకార ముత్తముఁడు తన, కృపమొక్కలమున నొనర్పఁ గిల్బిషుఁ డొకప్ర

     త్యుపకారము వెదకం డొక, యపకారమె రోయు నొండె నాపదఁ జేయున్.110
క. అని కృష్ణరూపి చెప్పిన, వినియును నప్పాఁప చెలిమి విడక తనమనం
     బునఁగలతలంపు మానని, తన పతికి వృకోదరప్రధానుం డనియెన్.111
క. తులువకు నాపద మూడినఁ, జెలియై తగువాఁడు చక్కఁజేయుట యెల్లం
     బులికి నొకమ్రానిపోటుం, బులుఁ గుపకారంబు సేయుపోల్కి యగుఁ దుదిన్.112
వ. ఆకథ యెట్లనినఁ దొల్లి యొక్కకాంతారంబున.113
శా. లీలానిర్జితసర్వజంతు వన బల్మిన్ జేరుకొన్నట్టి శా
     ర్దూలం బొక్క జరన్మృగంబు నొకచో దుర్దాంతమై వ్రేసి త
     త్కీలాలం బది మున్ను గ్రోలి యుదరోద్దీవ్యద్భుభుక్షానల
     జ్వాలల్ తన్నలఁపంగఁ దల్చె శితమాంసం బొంది భక్షింపఁగన్.114
ఉ. కోఱలసంధి నెంపములు గ్రుంకిన నంత దినక్రమంబునన్
     మీఱిననొవ్వి భుక్తిఁ గొననేరక యాననగహ్వరంబునం
     గాఱెడులాలతోడఁ బులి గ్రచ్చఱి లోఁబడి యుండ మ్రానిపైఁ
     గూఱినవంత నొక్క ద్రుమకుట్టవిహంగము దాని కి ట్లనెన్.115
ఉ. నొవ్వియలంపఁ గూసెదవు నో రొకమాఱును మూయ వేలొకో
     తివ్వలు కాలఁ జుట్టినను దెంపఁగ లేవు తరక్షునాథ నీ
     కివ్విధ మైనయాపదకు నేదికతంబు విధాత యక్కటా
     యెవ్వరి నెట్లు సేయఁడు విహీనమతిం బ్రతికూలుఁ డైనచోన్.116
క. అనుటయు దానికిఁ జెప్పెం, దనపొందినవేధ పులి; యుదారోపాయం
     బునఁ దీనిఁ బుత్తు నే మే, లొనరించెద వని విహంగ మొయ్యనఁ బలికెన్.117
చ. అనవుడుఁ జిత్రకాయము ప్రియంబున నట్టిదయేని నొక్కమే
     లని మితి సేయ నేమిటికి నాప్తసఖుండుగ నిన్నుఁ జేసి యే
     వనమున నేమిజంతువు నవారణఁ జంపిన మాంస మర్ధముం
     కొనుమని యిత్తు నేహితముఁ గోరినఁ జేయుదు నీకు నెచ్చెలీ.118
క. నావుడుఁ బెద్దయుఁ విప్పుగ, నీవదనముఁ దెఱవు మనుచు నియమించి దురం
     తావిర్భావిత సాహస, యై విహగం బందుఁజొచ్చె నతినిపుణతతోన్.119
గీ. దంష్ట్రికలు పాదమునఁ గొని తన్నిసంధి, నున్నయెముకను సంచున నూఁది పట్టి
     పాపి కదిలిచి పెఱికి యాపక్షి యధిక, వేగమునఁ బులివాఁగడ వెడలి పోయి.120
క. ధ్రుమశాఖ నెక్కి యెముకను, నుమిసినఁ బులినోరు నొవ్వియుడిగి మఱి దిన

     క్రమమునఁ బుండాటిన నొ, క్కొమహామృగమును వధించికొని యొకచోటన్.121
క. నమలంగా నచ్చోటికి, ద్రుమకుట్టము వచ్చి కట్టెదుట నిలిచి మృగో
     త్తమ నాభుక్తికిఁ దగుమాం, సము వెట్టుము పలుకు మృదువచనములు నాతోన్.122
వ. అని పలుకుటయు.123
క. నీ వెవ్వరు మాంసం బే, లావలసె న్నీకు నేను లంచము వెట్టన్
     నీవు పులుఁగ వే మృగపతి, నావచనమ్ములఁ బ్రయోజనము నీ కేలా.124
క. అనవుడు నెఱుఁగవే నన్ను వ, దనకుహరములోనఁ జొచ్చి దౌడలయెడ నా
     టినశల్యముఁ బెఱికిన చెలిఁ, జనునే నను మఱవ నీకు శార్దూలపతీ.125
వ. అనుపలుకు విని నవ్వుచు నది యాద్రుమకుట్టంబుతో ని ట్లనియె.126
గీ. కాయ లుడివోయినట్టి వృక్షంబుఁబాఁడి, యెల్లఁ గడచినధేనువు నేఱుఁ గడపి
     నతఁడుఁ గార్యము దీర్చినయతఁడు నపుడ, గాని యాదరణీయులు కారు పిదప.127
వ. అది యెట్టిదనిన వినుము.128
మ. విపినాంతర్బహుసత్వఘాతుకుఁడ నై విఖ్యాతకృత్యుండ నై
     కృప యొక్కింతయు లేని నావదనముం క్రీడారతిం జొచ్చినం
     గుసితత్వంబున మ్రింగినం జనఁగ నీకుం గ్రమ్మఱం గల్గునే
     యుపకారం బన నింతకంటె మఱి యిం కొం డెద్ది యూహింపుమా.129
వ. అని యి ట్లావ్యాఘ్రంబు ప్రలాపింప నప్పటికిం జేయునది లేక ద్రుమకుట్టంబు తొ
     లఁగిపోయి యాత్మగతంబున.130
క. ఇలపైఁ బాదాహత మై, తలవట్టెడు నెగసి ధూళి తా నొకరునిచే
     నలఁపఁబడి వాని దొడరం, దలకిన యచ్చెనటికంటెఁ దక్కువ కాఁడే.131
చ. అని చిత్తంబునఁ దెంపుఁ జేసికొని రోషాధిష్ఠమై పొంచి కీ
     డొనరింపం దఱి వేచి యుండి విహగం బొక్కింత యాలస్యమూ
     నిన శార్దూలముకన్ను వోఁబొడిచి పూర్ణీభూతసంతోష మై
     చని భూజాగ్రముఁ బొంది యి ట్లనియె హాస్యప్రౌఢవాక్యంబులన్.132
క. వింటే మృగమా పోయిన, కంటికి వగవకుము రెండు కన్నులు వొలియం
     గొంట యుడుగుటకు నొకక, న్నుంటకు సంతసముఁ జెందుఁ టుచితము నీకున్.133
క. అని పలికి యది నిజేచ్ఛం, జనుటయు నయనంబునొవ్వి సైఁపక పులి య
     వ్వన మద్రువన్ వాపోవును, దనదుకృతఘ్నత్వమునన తా హతమయ్యెన్.134
వ. కావున.135

క. బలహీను లగుచు ధీమం, తుల కెగ్గులు సేసి పొందుదురు కీడు మహా
     బలులయ్యు మ్రానిపోటుం, బులుఁగుఁ బరిభవించి తొల్లి పులిచెడ్డక్రియన్.136
వ. అనుటయు నబ్భేకంబుల నుద్దేశించి భయదర్శకం బిట్లనియె.137
క. ఏ నొకపుడిసెఁడు ద్రావిన, నీనూతిజలంబు పొలియునే యంతయు నా
     తో నేల పోర నీళ్ళకు, నై నిష్ఠురలోభ మింతయగునే చేయన్.138
క. తగుకొలదిఁ గాని లోభము, మిగులఁగఁ జేయంగరాదు మిక్కిలి యగులో
     భగుణంబుకతనఁ గాదే, మృగధూర్తుం డొకఁడు తొల్లి మృత్యువుఁ జెందెన్.139
వ. అది యె ట్లనిన నక్కథ వినుం డని యిట్లనియె.140
సీ. విజయపురప్రాంతవిపినాంతరమునకుఁ బోయ యొక్కఁడు వేఁటవోయి యచట
     వనహస్తిఁ గనుఁగొని వల్మీక మెక్కి భల్లమునఁ తుండము ద్రుంచి సమయఁజేసె
     వానియెక్కిన పుట్టలోను వెల్వడి భుజంగం బక్కిరాతునిఁ గఱచె నంత
     వాఁడును మొల నున్నవాఁడికుఠారంబు గొని దాని వధియించి కూలి యీల్గె
గీ. నచటి కొక్కనక్క యరుదెంచి మందమంది, యేనుఁ గాఱునెలలు మానవుండు
     సప్తవాసరములు సర్ప మేకదినంబుఁ, బోవుఁ బొమ్ము తనకు భుక్తి కనుచు.142
క. నేఁటి కివి గంటివెట్టఁగ, నేటికి నీబోయ వింట నిడ్డనరము లీ
     పూఁటఁ గడపఁ జాలవె యొక, నాఁటం బ్రాణంబు సనునె నవసినమాత్రన్.143
క. అని తలఁచి యెక్కుపెట్టిన, ధనువుఁ గదిసి దాని కొమ్ముఁ దనగొంతుంగ్రో
     లున మోచి యుండఁ జెలఁగుచు, గొనయంబు నరంబు లొయ్య గొఱకఁ దొడంగెన్.144
గీ. నరము లొక్కఁ డొకఁడు నానిచి కొఱకంగ
     గొనయ మెల్లఁ ద్రెవ్వి ధనువు కొమ్ము
     మిడిసి గళమునాఁటి పెడతల వెడలినఁ
     గూసికొనుచు నక్క కూలి గెడసె.145
వ. అట్లగుటంజేసి లోభం బొప్ప దనుద్విజిహ్వు పలుకు లాక్షేపించుచు నసారియను
     హరి లోభం బొప్పదేనియు నతివ్యయశీలత్వంబు మేలె యని యి ట్లనియె.146
క. కలిమిఁ చలముగాని వ్యయం, బులు పెరిమెలకొఱకుఁ జేసి పొలియరె దుర్బు
     ద్ధులు నారికేళబక మను, పులుఁగు దురైశ్వర్యమహిమఁ బొలిసినభంగిన్.147
వ. అది యె ట్లనిన.148
గీ. పెక్కు నీళులు లేనట్టి యొక్కమడుఁగు
     క్రేవ నున్నత మగునారికేళ మొకటి

     చీకుకొక్కెర యొకటి వసించు నచట
     వారిబహుతరజలచరాహార మగుచు.149
క. అది యొక నాఁ డంబరమునఁ, పదివేలు బకాదివారిపక్షులు సనఁగా
     నదె నాకొలసాములు వో, యెద రని యడ్డముగఁ బాఱి యెక్కుడుప్రియముల్.150
క. కావించి మీర లూరక, పోవుట దగ దల్లభూజమున నిలుతు మదీ
     యావాసం బది యచటికి, రావలయును బాంధవాభిరంజన మొసఁగన్.151
వ. అని తనవసియించు నారికేళంబును జూపి ప్రార్థించి మఱియును.152
క. కొల నొక్కటి కల దచ్చట, జలములు నాహారములు ప్రశస్తరుచులతోఁ
     గలిగెడి నేటికి మాటలు, కొల మెల్లను బొగడ విందు గోరి యొనర్తున్.153
వ. అనుపలుకులు విని బుద్ధిమంతంబు లగువిహంగములు కొన్ని.154
చ. వలవదు మమ్ము నాఁగ గుణవంతుఁడ వీవు కొలంబువారిపైఁ
     గలిగిన భక్తియుం బ్రియముఁ గన్గొన సంతసమయ్యె నిచ్చలున్
     నిలిచినఁగాని కాదె గమనింపఁగని మ్మని పెక్కుభంగులన్
     బలికినఁ బోవకున్నఁ గని పక్షులలోపలఁ గొన్ని దానితోన్.155
క. ఈయూధ మిది యనంతము, నీయిర వెడలేదు నిలువ నీచెప్పినయా
     తోయంబుల నాహారము, మాయెఱుఁగనియదియె యల్పమాత్రము లవియున్.156
వ. అట్లుం గాక.157
క. కనుకొఱకు వంద లివి మఱి, చను నొండొకదెసకు నీవు చాలవు నీకొ
     క్కని కైనను జలదాగమ, మునయంతకు నోర్చు మడుఁగు పోనిమ్ము మమున్.158
చ. అనుటయుఁ బొత్తువారికృప నన్నియుఁ గల్గెడు నన్నుఁ ద్రోచిపో
     యినఁ గుల మెల్లఁ గన్గొనఁగ నిప్పుడు మేను దొరంగువాఁడ జుం
     డనుడుఁ బతత్రికోటి మనకారడిఁ బాపముఁ బొంద నేటి కి
     ట్లని యితఁ డాడ నంచుఁ జని రందఱుఁ గొక్కెరయింటివిందు లై.159
వ. అటు పోయి.160
మ. మడు వెల్ల న్వెరఁజాడి మందుకయినన్ మత్స్యంబు లేకుండ న
     ప్పుడ యొండొంటికి మున్ను మ్రింగి విహగంబుల్ మాపు నిల్వంగ ని
     క్కడ నిమ్మేమియు జాల దంచుఁ జనినం గారించు పేరాఁకటన్
     మడిసెన్ గొక్కెర కొన్నిప్రొద్దులకు హీనం బైనదేహంబుతోన్.161
వ. అ ట్లగుటంజేసి.162

క. వ్యవసాయము కొలఁదియు దే, శవిధముఁ గాలంబుఁ బూర్వసంచిత మగుసొ
     మ్ము విచారింపక యుబ్బునఁ, దివిరి వ్యయము సేయునతఁడు దీనతఁ జెందున్.163
క. అమరఁగ నాయవ్యయముల, క్రమము జలము పెద్దవాతఁ గైకొని యది స
     న్నముగ వెలార్చుచు నుండెడి, కమండలువుఁ జూచి యైనఁ గాదే తెలియన్.164
వ. అనుటయు భయదర్శకం బుచితలోభంబు కర్తవ్యంబు.165
క. అతిలోభ మొప్ప దతిలు, బ్ధత ధనగుప్తుం డనంగఁ బరఁగినవణిజుం
     డతిశయనిజవిత్తము భూ, పతిపాలుగఁ జేఁత వినఁగఁబడదే కథలన్.166
వ. అక్కథ యె ట్లనిన.167
ఉ. ఉర్వికి భూషణం బయినయుజ్జయినీనగరంబులోపలన్
     గుర్వనురాగమూర్తి ధనగుప్తుఁడు పుణ్యుఁడు వర్ధమానుఁడున్
     సర్వధనప్రపూర్ణు లయి సఖ్యముఁ బొంది వణిక్కులంబులోఁ
     బర్విన పెంపుతోడ ననపాయవిభూతి వహించుచుండుచున్.168
ఉ. జీనపుదీవి నిన్మును బసిండియుఁ దుల్య మటన్న నచ్చటన్
     మానియ మాడఁబోద మని నావల వేఱొకఁ డాయితంబుగా
     బూని ఘటింప నందినము పూర్ణముగాఁ గొని సెట్టు లిద్దఱున్
     ఫేనతరంగభంగురగభీరపయోధిలోన నావపై.169
చ. అరుగఁగ వర్ధమానుని మహాజ్వర మొందిన నేన చాలుదున్
     శరనిధియాత్రకున్ వలదు చయ్యన నేగుము నీవు నీకు నే
     నెరపి భవద్ధనంబు నిడనే యెడసేయఁ దలంతునే కటా
     మరలుము నీవు గల్గిన సమస్తశుభంబులు కల్గు నెచ్చేలీ.170
మ. అని వానిన్ మగిడించి తాన చని యి న్మాదీవి నె త్తొంటికిన్
     గనకం బెత్తులు రెంటిలెక్కఁ దెగినం గైకొంచు నాల్గోడలన్
     నినుపారంగ సువర్ణ మెత్తుకొని పూర్ణీభూతసానందసం
     జనితోద్గర్వమనస్కుఁ డై మరలి యాసాముద్రమధ్యంబునన్.171
క. చనుదెంచుచు ధనగుప్తుఁడు, మనమునఁ దలపోసే వర్ధమానునియోడెం
     డినుమున కై రెం డోడల, కనకము నా కె ట్లొసంగఁగా నోపనగున్.172
క. ఈసొమ్ములలో నతనికి, వీసము నీఁజాల నేను వెనుక నతం డా
     యాసపడి తాను గూర్చిన, యాసకలార్థంబు నాకు నర యొసఁగెడినే.173
క. ఎక్కడిచెలితన మాతం, డెక్కడిచుట్టంబు నాకు నీవననిధిలో

     గ్రక్కున మునిఁగిన నప్పుడు, చక్కంబెట్టెడినె యతనిసంఖ్యము నన్నున్.174
వ. అని తలంపుచు నంబోధిలోనం బడి.175
ఉ. వచ్చుచు వర్ధమానుదెసవారల నెల్లర నీటిలోపలం
     జెచ్చరఁ ద్రోచి చంపి యొకచెంగటిఱేవున వీడుఁ జేరి తా
     నచ్చట నౌచతుష్క మగునర్థముఁ బాఁతి దరిద్రతాభరం
     బచ్చువడంగఁ జేసికొని యాత్మనివాసముఁ జెంది యుండఁగన్.176
గీ. వర్ధమానుఁ డపుడు వచ్చి యన్యోన్యస, మాగమోచితంబు లైనవాని
     నడిపి యేను బీడవడితిఁ బెక్కులు సేగు, లయ్యె ననుచుఁ బిచప నాడి మఱియు.177
ఉ. సొ మ్మఖిలంబుఁ బోయిన విశుద్ధచరిత్ర భవత్ప్రతిప్రయా
     ణమ్ము మనంబులో ననుదినంబును గోరఁగ రాక గల్గె మీ
     రెమ్మెయి లాభముం బడసి యేక్రియ వచ్చితి రన్న లేనిదుః
     ఖమ్ము నటించుచున్ సుకృతఘస్మరుఁ డాధనగుప్తుఁ డిట్లనున్.178
శా. అన్నా యే మని చెప్పుదుం జెఱచె దయ్యం బప్రమాదంబునన్
     మున్నీ రెల్లను దాఁటి యమ్మెడుపురంబుం జేరి యందొక్కయిం
     ట న్నిండారఁగ బండ మెల్లనిడి యుండంగం ద్రిరాత్రంబులో
     విన్నం బొంకగునట్లు గాఁగ నెలుకల్ వే మ్రింగె నాలోహమున్.179
క. కొండంతయినుములోపల, ముండయెలుక లేమిచోద్యమో పాతికయె
     త్తుండనియక తినె నచ్చట, నుండఁగ లజ్జించి మగుడ నుదధి గడచితిన్.180
క. పొలిసిరి తెవుళ్ళ నీవా, రలు రోగము లచటఁ బెద్ద రాఁబో నెడరై
     యలజడిఁ జెందితిఁ బాపపుఁ, జెలినగునే నకట నిన్నుఁ జెఱచితిఁ జాలన్.181
క. అని పలికి వీడుకొలిపిన, ననయము నిది బొంకు పొసఁగ దాత్మధనము వం
     చనఁ గొనియె నితం డని తన, మనమునఁ దెలిసియును వర్ధమానుం డచటన్.182
వ. ఏమియుం బలుకక నిజగృహంబున కరిగి యి ట్లని తలంచె.183
గీ. నమ్మఁదగదు మొదల నమ్మి తా రాత్మకా
     ర్యమున కొరులఁ బనిచి యందు వార
     లరయ సేసి రేని యడియాల మెఱుఁగక
     వేగఁబడుట యెల్ల వెఱ్ఱితనము.184
క. సొమ్ములయెడ నెవ్వారల, నమ్మఁ దగదు నమ్మకుండినను జరగ దిలన్
     సొమ్ము గలవారి కర్హులఁ, నమ్మఁగఁ గీ డైన నేమి యనఁగలదు తుదిన్.185

క. తన దేహము నిత్యంబే, తనధన మది సెప్పనేల తాను దనధనం
     బును దైవధనంబులు తన, ధనము లతఁడు పఱచినట్టు తగదే పడఁగన్.186
క. చెలితనమునఁ దనుఁ జెఱచిన, తులువం గని తొలఁగిపోక తోరపుఁ బ్రియముల్
     పలుకులతీపులుఁ జూపుచుఁ, జెలియై వర్తించి గాక చెఱపఁగ నగునే.187
క. అని నిశ్చయించి యాతని, తనయెడ నొకవెఱపులేనిదట్టపునెయ్యం
     బొనర నటియించి యొక నాఁ, డనురాగియపోలె నతనియాత్మోద్భవుతోన్.188
క. లాలనము సేయుచుం దన, యాలయమున కెత్తికొని రయంబునఁ జని యే
     కీలున నెవ్వరు నెఱుఁగం, జాలనియెడ డాఁచి దుఃఖిచాడ్పున నుండెన్.189
ఉ. కొండొకసేపులోన ధనగుప్తునివారలు వచ్చి పాపనిం
     దెం డని పల్కినన్ వగచి తెక్కలిగృధ్ర మొకండు నాదుచే
     నుండఁగ బిడ్డ నెత్తుకొని యుగ్రతఁ బోయిన నేమి చెప్పుదు
     న్నిండినతీవ్రదు:ఖ మనునీట మునింగినవాఁడువోలె నై.190
ఉ. సెట్టికిఁ జెప్ప రా నచటఁ జేరఁగ నోడెద నన్నఁ బోయి యా
     పట్టివిధంబు వా రతనిపల్కినయట్లన చెప్పినం బులిం
     గొట్టినమాడ్కి నల్గి ధనగుప్తుఁడు లోకములోన నెన్నఁడే
     నిట్టివి వింటిరే యని మహీంద్రున కవ్విధ మెల్లఁ జెప్పినన్.181
గీ. వర్ధమానుని రప్పించి వసుమతీశుఁ, డింత నెఱమానిసివి బొంక నిట్లు తగునె
     బాలకుని గ్రద్ద యెత్తుక పాఱె ననుట, యేయుగంబుల నెచ్చట నేని గలదె.182
వ. అనిన వర్ధమానుఁడు ముకుళితకరకమలుం డై యిట్లు విన్నవించె.193
ఉ. దేవర పొందుగా నిది నుడిం బరికించితి రిట్లు సర్వమున్
     భావములో నెఱుంగఁ దగు నావలరెంటియయంబు నెల్కలీ
     భూవలయంబునం దినుట పోలగునే యిది సెట్టి సెప్పెడున్
     నావెఁడు మధ్ధనంబుఁ గొని నా కిడనొల్లక శాఠ్యబుద్ధి యై.194
క. ఆనుటయు జనపతి యిది యె, ట్లని యా ధనగుప్తుఁ జూచి యడిగిన నతఁ డీ
     తనిపొత్తునఁ జినమునకై, యిను మోడల రెంటఁ గొంచు నేగితి నధిపా.195
క. కొనిపోయిన యిను మంతయుఁ, దన దగు భాగ్యమున నెలుకతండము భక్షిం
     చిన నాయినుమోడెంటికిఁ, గనకం బోడెఁ డని నన్నుఁ గల్లలె నడపెన్.196
వ. అనిన వర్ధమానుం డప్పలుకులు దెలియ నవధరింపుం డని రాజు నుద్దేశించి.197
క. రెండోడలినుము మూషిక, కాండము భక్షించె ననుట కల్లపలుకు గా

     కుండినటు లయిన గృధ్ర మొ, కం డొకబాలుఁ గొనిపోక కడు ననుచితమే.198
చ. అనవుడు రాజు నవ్వి సచివావళిఁ జూచుచు నంత మేటిబొం
     కున కిది పోలు నంచు ధనగుప్తుఁ గనుంగొని యిట్టిమాట లా
     యినుము భుజించునే యెలుక లింతమానిసి విట్లు వల్కినన్
     విని ప్రజ నవ్వదే యతనివిత్తము నాతని కిమ్ము నావుడున్.199
క. ధనగుప్తుం డితఁ డిచ్చిన, యినుమునకే యినుము గాక యేలా యిత్తుం
     గనకం బనుటయు భూపతి, కనలుచుఁ దనయొద్దఁ జనవు గలలెంకలతోన్.200
క. ఓరీ కోమటిముక్కున, నీరెత్తుఁడు మేము కినియనేరక యున్నన్
     నోరికి వచ్చినయట్టులు, వారణ యొక్కింతలేక వదరు లఱచెడిన్.201
మ. అనినన్ లెంకలు ద్రోచికొంచుఁ జనఁగా నయ్యాకటా బొంకితిన్
     గనకం బోడెఁడు కల్గెఁ గాని మిగులం గా లేదు మీయాన యీ
     తని కై యర్ధము వెట్టబంపుఁ డనుడుం దథ్యంబు గా దిప్పు డీ
     తనిప ల్కంచు విభుండు పల్కుటయు బాధం బెట్టఁగా నత్తఱిన్.202
చ. ఇనుమున కబ్ధిలోఁ బసిఁడి యిమ్మడిగల్గుట నాలుగోడలు
     గనకము తాను దెచ్చి చెలికానిభటప్రకడంబుఁ గ్రూరతన్
     వననిధిఁ ద్రోచి చంపుట సువర్ణము పాఁతినచోటు సర్వముం
     గొనములప్రోక యైన ధనగుప్తుఁడు సెప్పిన రాజు నవ్వుచున్.203
మ. ధన మెల్లం గడు వేగఁ దేఁ బనిచి చేతఃప్రీతితో వర్ధమా
     నుని కొప్పించిన దేవ నాధనము నన్నుం జేరినం జాలు నం
     చు నతం డర్ధముఁ గొన్న మెచ్చుచు మహీశుం డున్న యయ్యర్ధముం
     ధనగుప్తార్జితసర్వవిత్తచయముం దాఁ గొంచు నుగ్రాకృతిన్.204
క. ఇలుఁ బురమును దేశంబున్, వెలువడఁ ద్రోపించుటయును నెలఁతుకయును బి
     డ్డలు దానుం దిరిపి తినుచు, నిలపై ధనగుప్తుఁ డిట్టియిడుములఁ బడియెన్.205
క. కలమెం డినుమున కై యిరు, కలముల హేమంబు తనకుఁ గలిగిన యపుడున్
     వలను గలిగి ధనగుప్తుఁడు, మెలఁగంగా నేరఁ డల్పమేధత్వమునన్.206
క. లోభంబున ధనగుప్తుని, ప్రాభవ మట్లడఁగె నాదు పలుకులు విను మీ
     లోభం బుడుగుఁడు నీళుల, కై భూమిని నిట్టిలోభ మగునే చేయన్.207
వ. అని పల్కి యవ్వర్షాభూవల్లభు మున్నవోలె బహువిధంబుల స్తుతియించి భయదర్శ
     కంబు మఱియు నిట్లనియె.208

గీ. చిఱుతనారటఁగోలె జీవహింస యొనర్ప, దానివ్రతముఁ గాఁగఁ దడవనేల
     జీవహింసఁ జేయుజీవుల సోఁకిన, గాలి సోఁకఁ దలఁతుఁ గల్మషముగ.209
వ. అనుటయు నప్పలుకు లుద్దేశించి యభిజ్ఞుం డనుప్లవంగంబు దనపతి కి ట్లనియె.210
క. అతినిష్ఠ యనాచారం, బతిశౌచ మశౌచభంగి యతినింద యతి
     స్తుతి యివి ధూర్తులవిధము ల, గతి మఱి నైష్ఠ్యంబు దుష్టకపటము దెలియన్.211
వ. అది యె ట్లనిన.212
గీ. ప్రాయమునఁ బెద్దవాఁ డొకబ్రాహ్మణుండు, లక్ష్మణజ్ఞుండు సంగతలక్షణాంగి
     నొక్కకన్నియఁ బెండ్లియై యొరులగోష్ఠి, మరగకుండంగ సఖి నేలమాలెఁ బెట్టి.213
క. పెనుపఁగ నందపెరిఁగి యా, వనితయు యౌవనవిలాసవైభవముం దా
     ల్చిన ఋతుకాలం బన విని, చనుదెంచెను విప్రుఁ డొకనిశాసమయమునన్.214
గీ. వచ్చి యాలి మానవతి నోరకన్నులఁ, జూచి బిట్టబిఱ్ఱుసురతమునకు
     వేగపడిన నచట వెలిఁగెడిదీపంబుఁ, జూపి యిట్టు లనియె సుదతి పతికి.215
క. అనలుఁడు పురుషుఁడు దీపం, బనలుఁడు పరపురుషుఁడైన యనలుని నేఁజూ
     చినఁ దప్ప కాక నన్నతఁ, డనవరతముఁ జూచుచుండ నర్హుండగునే.216
క. కావునఁ దమ ప్రాణేశుల, దీనియ లుండంగఁ గవయు తెఱవలశీలం
     బే వెలితిగఁ దలఁతు ననుచు, దీవియ వెంచి సుఖకేలిఁ దేల్చె నిజేశున్.217
చ. అతఁడును సౌఖ్య మొంది తనయంగన యాడిన సాదుమాట హృ
     ద్గతముగ దాని శీలవతిఁగా మదినమ్మి నిజేచ్ఛ నున్నచో
     గతిపయమాసము ల్చనిన గర్భిణియై యొకనాఁటిరాత్రి యే
     కతమున నాథుతోఁ బ్రసవకాలము డగ్గఱి యుండి ని ట్లనున్.218
ఉ. నా కుదయించుబిడ్డ యిది నాతుక గాక సుతుండయేని న
     స్తోకవివేక యన్యపురుషుం డనఁగాఁబడుఁ గాన వాని నా
     లోకన సేయ నేను బరలోకము వొందెడుఁ బుణ్యభామినీ
     లోకము నాథుఁ దప్ప నవలోకన మొం డొకమర్త్యుఁ జేసినన్.219
గీ. ఇతరపురుషుని విన్నప్పు డేమి చెప్పఁ, జెవులు రెండును బుం డ్లగు జీవితేశ
     నిన్ను వినఁ జూడ వీనులు గన్నుదోయి, కలిగి తక్కినయెడ నవి వలవదందు.220
మ. అని తత్సన్నిధి నేత్రపట్టము దృఢం బై యుండ నయ్యింతి తా
     ల్చిన నాథుండును నమ్మి భూగృహనివాసిత్వంబున న్మాన్చి యా
     త్మనివాసంబున నిడ్డఁ బుత్రవతి యై తత్పుత్రు నెన్నండుఁ జూ

     డని యాచారముతోడఁ బెంచెఁ దన నైష్ఠ్యం బెల్లవారు న్నగన్.221
క. అంత నొకదివసమున గ్రా, మాంతరముననుండి వచ్చె నాగృహపతిపై
     నెంతయుఁ గూరిమి గల మతి, మంతుఁడు తజ్జనకుభ్రాత మనుమనిఁ జూడన్.222
ఉ. వచ్చి తదీయమందిరము వర్తన లెల్ల నెఱింగి యక్కటా
     సచ్చరితంబు గల్గు సతిచాడ్పున ముద్దఱికంబు చూపుచు
     న్మ్రుచ్చిలి రాత్రు లీజరభి మూఁడుజగంబులు మ్రింగుచుండె వె
     ల్వుచ్చకయున్న నాకొడుకు బోదఁ డెఱుంగునె దీని చెయ్దముల్.223
వ. అని మఱియు నాత్మగతంబున.224
సీ. మగనివా రెవ్వరు మందిరంబున లేక జవ్వనంబునఁ దనచనప యైన
     నెల్లకాలముఁ బుట్టినిండ్లన నిల్చిన యాత్రోత్సవములకు నరుగుచున్నఁ
     బనిలేక పొరుగిల్లు పలుమాఱు ద్రొక్కిన మగవానితో గోష్ఠి మానకున్నఁ
     జెడ్డయింతులతోడి చెలిమి యొనర్చిన వరుఁడు ప్రవాసైకనిరతుఁ డైన
గీ. విభుఁడు కొనటివాఁ డైనను వృద్ధుఁడైనఁ
     దన్ను మెచ్చక యొక్కతెఁ దగిలె నేని
     బచని కాఁడేని నెప్పుడుఁ బరుసనైనఁ
     జెడక తక్కదు ధర నెట్టిపడఁతి యైన.225
వ. అటు గాక.226
క. వృద్ధునకుఁ దరుణి యమృతము, వృద్ధుఁడు దరుణికి నసహ్యవిష మూహింపన్
     వృద్ధకుఁ దరుణుం డమృతము, వృద్ధయుఁ దరుణున కసహ్యవిష మూహింపన్.228
క. అని తలపోయుచు నేకత, మున నతఁ డొకనాఁటిరేపు పుత్రుఁడు గ్రామం
     బునపొంత చేనియొద్దకుఁ, జని యుండఁగ నచటి కేగి సముచితభాషల్.229
వ. కొన్ని యాడి తదనంతరం బిట్లనియె.230
క. నీయంగన కపటాచా, రాయత్తము మాకు వెడెలనాడుట తగదే
     మీయున్న రాత్రులంద త, దీయవ్యాపార మేము తెలిసితి మెల్లన్.231
క. కడు నమ్మకయున్నను నె, క్కుడు నమ్మినఁ జెడుట నిజము గోతులఁ జిన్న
     ప్పుడు నమ్మక భూగృహమున, నిడ నేటికి నిప్పుడేల యిటుగా నమ్మన్.232
క. పొడమదు చేయనికార్యము, పొడమక యుండంగఁ గప్పిపుచ్చెద మన నె
     న్నఁడు రాదు సేయు కార్యము, వెడమాయపు మనుజు లేల వేల్పులకైనన్.238
క. అతులైశ్వరఘనుఁడు సం, తతయజనుఁడుఁ గామరూపతాఘనుఁడు బృహ

     స్పతిసఖుఁ డన వెలయు దివ, స్పతిచేఁతయు మున్ను బయలుపడియెనకాదే.234
క. పుత్రస్నేహము నట్టి క, ళత్రముపైఁ గూర్మియును దలంపక దానిం
     బాత్రము చేయుము కినుకకు, గోత్రము వోనాటవచ్చుకొఱకే భార్యల్.235
వ. అని యిట్లు పలికి.236
క. ఊరికిఁ బోయెద మేమని, పూరితబాష్పాక్షుఁ డగుచుఁ బోయిన విప్రుం
     డూరక యొకవడి నిలిచి య, గారంబున కేగి లజ్జగదిరినమదితోన్.237
క. దూరగ్రామంబునఁ బని పే, రొక్కటి చెప్పి కపటపేశలమృదుభా
     షారసమునఁ దేల్చి గృహ, ద్వారము వీడుకొని పోయి తగునోలమునన్.238
మ. పగలెల్లన్ వెలి నిల్చి రాతి రరుదౌభంగిన్ స్వగేహంబున
     ట్టుగమీఁదన్ వసియించి భార్యపయి దృష్టుల్ నిల్పియుండంగఁ బ్రొ
     ద్దగుడుం గంజిమడుంగు పేర రజకుం డత్యాస్థ నే తెంచిన
     న్మృగరాజేక్షణ లోచనావరణము న్వేగంబుతోఁ బుచ్చుచున్.239
క. తలుపుం దాన వెసం జని, బలుపుగ నిడి వచ్చి యింటఁ బ్రభు వేవంకన్
     మెలఁగునొ యనియెడు తలఁపున, నలుదిక్కులు చూచి జారనాతుక ప్రీతిన్.240
క. కదియఁ జనుదెంచి కౌఁగిటఁ, గదియఁగ నందంద పేర్చి కామాతుర యై
     సదనములోనికి రమ్మని, తుదచే దిగుచూచువానితో నిట్లనియెన్.241
ఉ. నీకొడు కూర లేఁడు మది నిర్భయ మొందుము వాఁడు గ్రమ్మఱన్
     రాకయు నచ్చటం బదిదినంబులు పోయినఁ గాని లేదు రా
     గాకులచిత్త నైన నను నక్కఫవో రతికేలిఁ దేల్పు ర
     మ్మా కుడువంగ నీకు నని నట్టులు వండినదాన వేఁడిగాన్.242
క. అని భోజ్యంబులు శీఘ్రం, బున నిడి తనయర్ఘ్యసత్యమున నిద్దఱుఁ బొ
     త్తునఁ గుడువఁ జూచి విస్మయ, ఘనలజ్జాక్రోధదుఃఖగతమానసుఁ డై.243
గీ. బ్రాహ్మణుఁడు మందిరాంతరప్రాప్త మైన, యచటి యట్టువ దిగి తనయంగణంబు
     వెడలి యారెకులను దెచ్చి వేగఁ బట్టఁ, బనిచి యిద్దఱ నొప్పించె జనవిభునకు.244
క. ఊరిప్రజ లెల్ల నత్యా, చారం బనఁబరఁగు కులటచరితము లహహా
     యారూఢతఁ జెప్పికొనఁగ, భూరమణుం డర్హదండమున నుగ్రుండై.245
క. ఇరువుర దండించె మహీ, సురుఁడును దనయాలి చెయ్ది సొలయుట భార్యాం
     తరమును బొందఁగ నొల్లక, విరతుం డై యరిగె జాహ్నవికి నతినిష్ఠన్.246
వ. అ ట్లగుటంజేసి.247

క. అత్యాచారపుమాటలు, నత్యంతస్తుతులుఁ గల్ల లగుట వినవె సాం
     గత్యాన కేల నమ్మెదు, ప్రత్యక్షక్రూర మైనపాము వచనముల్.248
క. మావాక్యంబులు వొందవు, నీవీనులఁ దగినవారి నీతివచనముల్
     భావింపనివారలపై, దైవంబును నలుగు నింత తథ్యము చుమ్మీ.249
క. అనిపలికి యభిజ్ఞుఁడు మౌ, ననియతుఁ డై యూరకుండెఁ దక్కినవార
     ట్ల నిలిచి రప్పుడు వెండియుఁ, దనుఁ బొగడిన మేనువొంగి తత్క్షణమాత్రన్.250
క. ఉరగంబున కచ్చటుసొర, దెరు వెఱిఁగించుటయుఁ జొచ్చి తెలిసి నీళ్ళు చె
     చ్చెరఁ గ్రోలియుఁ జిఱుకప్పల, నెరగొనియును లావువొంది యిచ్ఛానిరతిన్.251
మ. భయదాకారతఁ బేర్చి దర్దురముల న్భక్షింప నానాఁటికి
     న్లయముం బొంది దశాంశశేషమగుసేనం జూచుచు న్మంత్రులున్
     బ్రియులుం జుట్టును నుండి దూఱ వినుచున్ భేకాధినాథుండు ని
     శ్చయమానాధికచింతఁ బొందుచును బశ్చాత్తాపసంతప్తుఁడై.252
క. ఉండి భుజంగముఁ గన్గొని, మండూకకులంబు నెల్ల మడియించితి మి
     త్రుండువలె నుండి తగునే, యొండొరులకుఁ గీడుచేయు టుచితమె మనలోన్.253
చ. అన విని నవ్వుచు న్భుజగ మాతని కిట్లను నీ ప్రధాను లె
     ల్లను గడుఁబాపకర్ములు చలంబున నిన్నును నన్నుఁ బొంద నీ
     కనయవిహీనబుద్ధు లయి కల్లలు ప్రేలిరి గాన వీండ్ర ను
     న్మనిచిన నీకు నాకుఁ గలమైత్రి హరింతురు వక్ర భాషలన్.254
క. అని పలికి దాని యెదురునఁ, దనుఁ జొరనీ కడ్డుపడిన తన్మంత్రుల నె
     ల్లను ద్రుంచి యంతఁ గతిపయ, దినములలో మ్రింగె వొకఁడు ద్రిక్కకయుండన్.255
వ. అప్పుడు.256
మ. తనవా రెల్లరు వోవ నొంటిపడి భీతస్వాంతుఁ డై బొక్కమా
     టున మో మర్ధము దోఁపనున్నతని మండూకాధిపుం జేరి యి
     ట్లనుఁ బా మక్కట యేను నూతిదరి దాహం బొంది కూపెట్టగా
     నను రప్పింపవు నీవు రాజ్యమదఘూర్ణం బైనచిత్తంబుతోన్.257
క. ఈ జలముపట్టె చూడ మ, హాజగమఁట కప్పప్రువ్వులఁట యందుఁ బ్రజల్
     పూజింప వాని కెల్లన్, రాజఁట యొకకప్ప యట్టి నగవులు గలవే.258
వ. అని యిట్లు సాహసంబుతోఁ బలికి యాభయదర్శకంబు మఱియును.259
క. నీపెరిమెలు నా కిప్పుడు, సూపెదవే నగరిలోను జొచ్చి యనుచు నా

     టోపముతో భేకంబును, వాపోవఁగఁ గఱచి చంపి వడి గ్రహియించెన్.260
వ. కావున.261
క. బలియుం డగుపగతున కెడ, గలిగి చనన్వలయు వాఁడు కార్యముకొఱకై
     కలయఁగ వచ్చినఁ బేల్వడి, కలపికొనఁగ వలరు బుద్ధిగలిగినమనుజుల్.262
క. అని యిట్లు సుమతి యెఱిఁగిం, చినకథ విని చాల సంతసిల్లి యిరువురుం
     కొనియాడి రప్పు డాసఖి, గనుఁగొని సుకుమారి కనియెఁ గడునెయ్యమునన్.263
క. ఏకాధివాస మైతిం, జేకొనుమేఖలకు హితము చెప్పుతలఁపునన్
     బోకుము నీ వెన్నఁడు నది, క కొనదు హితోక్తి తెలియఁగా లేదు మదిన్.264
క. అపగతవివేకులకు హిత, ముపదేశించుటయు వారినొందుటయును నీ
     తిపరుల కొప్పదు విహగము, కపిసహవాసమునఁ బడిన కాఱియ వచ్చున్.265
వ. అక్కథ యెట్లనిన.266
క. కానన మొక్కట బహుఫల, నూనక మొకమ్రాన నొక్కసూచీముఖమ
     న్వారమును దమలోపల, నూనిన నెయ్యమున నుండ నొకనాఁటి నిశిన్.267
క. మిన్నెల్ల నీలమేఘ, చ్ఛన్నం బై యొక్కవాన సాంద్రజలం బై
     మున్ను గురిసి తుది నీదయు, సన్నపుఁ జినుకులును విపినచరబాధలుగాన్.268
వ. ఎడతెగక యున్న సమయంబున వానరంబు చెలియగు నగ్గిజిగాఁ డొకనాఁడు.269
చ. మిడుఁగుఱుఁబుర్వు వెన్ను తగుమృత్తికపాదున నంటఁజేసి యొ
     క్కెడనఱలోన నిడ్డ నదియిమ్ములఁగ్రాలెడు రూపరేఖగా
     దడియని గూటిలోనఁ బ్రియదారయుఁ దానును నుండి సీతునం
     గొడుఁగుర వోయియున్న సఖుఁ గ్రోఁతిఁ గనుంగొని చాలఁ గుందుచున్.270
వ. నీడద్వారంబునకుం జనుదెంచి యతనితోడ.271
క. వడఁకెదు గదయ్య వానకు, నుడుకువ లే దయ్యొ రాత్రి యుగమునుగా కె
     న్నఁడు వేగునె యెవ్విధమున, నుడుగు న్నీబాధ యెట్టు లూరక నిలుతున్.272
క. ఎడలేదు నిన్ను రమ్మనఁ, గడుసన్నము నాగృహంబు కపివర పెక్కా
     డెడిదేమి యిట్టిపుట్టుగు, వడసినపుడ కాదె నాదు పౌరుష మడఁగెన్.273
ఉ. మచ్చిక రెట్టిగాఁగఁ దనమందిర మొంది యభీష్టవస్తువుల్
     నెచ్చెలు లెల్లఁ బొంది సుఖలీలఁ జరింపఁగఁ జేయలేమికిన్
     వెచ్చనియూర్పు నించికొని విన్నఁదనంబును బొంది వెవ్వగ
     న్వెచ్చినయట్లు సజ్జనుఁడు వేఱొకదుర్దశచేత నొచ్చునే.274

క. ఓర్వం డెఱుఁగక యుండఁగ, నోర్వం డెఱుఁగంగఁ జూడకుండఁగ నోర్వం
     డోర్వఁడు సూడఁగ సుజనుం, డుర్విం దనవారి కైనయొప్పము లెందున్.275
వ. అని తగుమాటలాడి పెద్దయు వగచి మఱియు నప్పక్షి యి ట్లనియె.276
గీ. కాలఁజేతఁ బేదగావు నీయట్టివాఁ, డకట యుండఁదగిన యాలయంబు
     మున్ను జేసికొనని మోసాన నీ పాట్లు, పడఁగవలసె నిపుడు నడికిరేయి.277
క. అని పక్షి హితము చెప్పిన, విని వెంగలి యైనక్రోఁతి వీఁ డిరవున నా
     లును దాను నుండి నన్నొక, పినుఁగుం గాఁ దలఁచికాదె వ్రేలఁ దొడంగెన్.278
క. తనయింట దివియ యుండఁగ, నను గాయు మనండు నెగడి నాతోఁ గొఱమా
     లినమాటల నిసుమంతయుఁ, గొనకుంకఁగ నాడె నిట్టికుటిలుఁడు కలఁడే.279
చ. తన కఁటె యిల్లు గల్గె నఁటె తా దొర నాకఁటె యిల్లు లేదు! న
     న్పునఁ గడుం గ్రొవ్వె నీపులుఁగు పుచ్చెద దీనిమదం బటంచుఁ బె
     ళ్ళనఁ దరుశాఖ విర్చి కపియచ్చటి చేరువఁ బల్వలోదకం
     బునఁ బడవైచె నంత వెఱపుట్ట ఖగాంగన గూయుచుండఁగన్.280
వ. అప్పుడు.281
క. తడిసినయెఱకలు నీళ్ళం, బడి బెగడిన మనసు గలుగు ప్రాణేశ్వరి న
     య్యెడ నుడిపి తెచ్చి యొండొక, యెడకుం గొని యేగి పక్షి యిమ్ముల నుండెన్.282
క. కావున వివేకహీనుల, త్రోవం బోవలదు వారితోడి చెలిమి దా
     నేవెంటనైన నాపద, గావింపకపోదు సుమతికలితుల కైనన్.283
క. ధర దుష్టసఖులగుణములు, వెరవున నేమేని జేయవేచుట తప్పు
     ల్పరిగొలుపుట మర్మాంతర, పరిహాసము సేయుచునికి పంకజవదనా.284
వ. అని సుకుమారి యెఱింగించిన కథ యిరువురుం గొనియాడి రప్పుడు మకరం
     దిక యి ట్లనియె.285
క. ఇమ్ముగఁ జెలిమి యొనర్చినఁ, గుమ్మరిపుర్వులవిధంబు కుజనులు చూడన్
     సొమ్మిత్తురు తుదిముట్టినఁ, దమ్మిత్తురు నీతిపరులు తగుమిత్రులకున్.286
వ. అని మఱియు ని ట్లనియె.287
గీ. బుద్ధిమాలినకపి యొక భూమిపాలుఁ
     జంపె హితుఁడయ్యు, నొకదొంగ శత్రుఁడయ్యె
     విప్రునొక్కని గాచె వివేకి యగుట
     సుమతిపగ మేలు విమతి నెయ్యమున కంటె.288

వ. అది యె ట్లనిన.289
క. మందరపురిఁ గాంతాజన, కందర్పుఁడు గలఁడు రాజు ఖగవృత్తిసమా
     ఖ్యం దనరి బుద్ధిమంతుల, జెందఁడు సాక్షరుఁడు గాఁడు శిశుకాలమునన్.290
క. గర్వోద్ధతచాపలమున, దుర్వర్తనుఁ డైన నృపసుతునిచే నిడుమల్
     సర్వము గని తన్మంత్రులు, దుర్వారాసహ్యబహులదుఃఖాన్వితులై.291
వ. ఆత్మగతంబున.292
సీ. అక్షరజ్ఞుఁడు గానియతనికి శాస్త్రపురాణాగమాదులు రావు సొరఁగ
     గ్రంథాధిగమశక్తి గలుగక శుద్ధవివేకంబు లేదు వివేకశుద్ధి
     కలుగక కర్తవ్యకర్మ మెఱుఁగఁడు కర్తవ్య మెరుఁగక కడఁగిచేయు
     క్రియల నీగఁగరానికిల్బిషంబులఁ బొందుఁ బాపుండు నరకకూపమునఁ ద్రెళ్ళు
గీ. నరకవాసి పేదనరుఁ డగుఁ బేదయై, కడుపుకొఱకుఁ బాతకములు చేసి
     రౌరవమునఁ గూలు గ్రమ్మఱ నట్ల యా, పదలకెల్లఁ గుదురు చదువులేమి.293
వ. అని చింతించుచుండ నక్కాలంబున.294
సీ. ఎలుకవేఁటలపేర నేగి పట్టణముబోఁ బ్రజలయిండులు కూలఁద్రవ్వఁబంపు
     జెలఁగి డేగలకుఁ దొండల నేయఁబోయి ద్రాక్షామంటపంబులు గాసిసేయుఁ
     గోడిపోరులపేర వాడలఁ దిరుగుచుఁ బొడఁగన్నకడవలఁ బొలియవైచు
     వేఁటకుక్కలఁ దెచ్చి విడిచి మందలలోని మేఁకల కుసికొల్పి మెచ్చి యార్చుఁ
గీ. గాలకింకరులట్టి కింకరులతోడఁ, గూడి రాఁగూడి ప్రొద్దునఁ గుడుపుదొరఁగి
     వెడఁగుఁదనము బ్రల్లదమును వేనవేలు, మదముతోఁ జేయుచునుఁ రాకుమారుఁ డిట్లు.295
క. ఉరులును బోనులు గూళ్ళును, బరుసని చెయ్దములు గాలిపడగలు బొరిఁగిం
     కరులం బొడిపించెడి యా, సరభసములు దక్క నొండు సైఁప వతనికిన్.296
క. ఆనరపతి యనువుగ నొక, వానరపోతంబుఁ దెచ్చి వాత్సల్యముతో
     దానిఁ బెనిచి యాయుధవి, ద్యానిపుణతఁ బొందఁ జేసి యది వర్ధిలుడున్.297
క. కంచుకము దొడిగి కుండల, చంచత్కటకాతివేషచయ మిడి శితఖ
     డ్గాంచితరూపముతోఁ దన, కంచుకియై యుండఁబనిచెఁ గదలక యెపుడున్.298
సీ. ఆరాజు మందిరోద్యానంబునకు నేగి యొకనాఁడు తాను బయోజముఖులుఁ
     దడవుగాఁ గ్రీడించి యొడలు నిద్రాలసం బగుటయు నందఱ నచట నచట
     వసియింపుఁ డని పంచి వనచర మొక్కఁడ తోడరా దట్టంపునీడ నిలిచి
     పరిమళమృదుసితపవనంబు నెలవైన గురివెందపందిరి గుజ్జుసెజ్జ

గీ. సుప్తుం డగుచుండి వానరుఁ జూచి నన్ను
     డాయవచ్చిన జీవుల వేయు ఖడ్గ
     ధారఁ దునియంగ నని చెప్పి కూరె నిద్రఁ
     గపియుఁ బనిపూని భూపతిఁ గాచియుండె.299
వ. ఆసమయంబున.300
మ. సుమనోదామము రాజుకంధరమున్ శోభిల్లు నత్తావికై
     భ్రమరం బొక్కటి మూఁగ దానిఁగని కోపవ్యగ్రమై క్రోఁతి ఖ
     డ్గమున న్వేసినఁ దేఁటితోన ధరణీకాంతావతంసంబుకం
     ఠము రెండయ్యె వినీతుఁ డైన పతిచేష్టల్ చేటు దేకుండునే.301
వ. వివేకి యైన చోరుండు శత్రుం డైన విప్రుం గాచిన విధంబె ట్లనిన.302
గీ. నందినీనామనగరంబునందుఁ గలఁడు
     బంథుకుం డనియెడునొక బ్రాహ్మణుండు
     ధనికుఁ డట తొల్లి యవిలంఘ్యదైవఘటనఁ
     బిన్నలై పుత్రులుండంగఁ బేదవడియె.303
వ. అప్పుడు.304
మ. కటబద్ధాంబరఖండమృత్పటలికాక్రాంతస్తనోపాంతికన్
     జటిలాపింగళ కేశభారఁ బ్రణితోష్ఠద్వంద్వదీనాననన్
     కటకస్థానపరీతరజ్జువలయం గాత్రస్తమాలీన ను
     త్కటబాష్పాక్షుఁడు చూచె బంధుకుఁడు దుఃఖవ్యూహినిం గేహినిన్.305
వ. అట్లు చూచుచు నాత్మగతంబున.306
మ. బలవద్దైన్యము వక్త్రగహ్వరముగాఁ బల్చోట్లఁ గొన్నట్టియ
     ప్పులు మైచాఱలు గాఁగ బాలరుదితంబు ల్మ్రోగుట ల్గాఁగ దు
     ర్నిలయారణ్యములో భయప్రకరమూర్తి క్రూరమై యుండఁగాఁ
     దలమే వెల్వఁడఁజేయ లావుకలిమిన్ దారిద్ర్యశార్దూలమున్.307
ఉ. ఐనను దీనిఁ బాపఁదగు యత్నము చేసెదఁగాక చిత్రవ
     ర్ణీనగరంబులో గుణగరిష్ఠుఁడుఁ బూర్ణధనుండు నై మదీ
     యానుజుఁ డున్నవాఁడు విపులాఖ్యుఁడు వానికి సొమ్ముగల్గఁగా
     నే నిటు బీద నైనవిధ మిచ్చ నెఱింగిన వాఁడు కుందఁడే.308
వ. అతం డొసంగు కనకము గొనివచ్చి యిచటం గర్షకుండ నయ్యెద.309

సీ. ఈలోక మింతయు నాలుగుపాళు లిందొకట భిక్షుకులు సోమకులు నొక్క
     పాలు సేవావృత్తి బ్రదికెడువారు విద్యోపజీవికులును నొక్కపాలు
     వ్యవహారమాడెడువారుఁ దస్కరులును నొకపాలు కర్షకు లొక్కపాలు
     మొదలిపాళ్ళు మూఁడుఁ బిదపటిపాలిన యనవరతంబును నపహరించు
గీ. నపహరించియు నంతంత కవి నశించు, నపహృతం బయ్యు నది వృద్ధి నందుచుండు
     గానఁ దగురాజు గలిగినఁ గరిసనంపు, జీవనముఁ బోల దొండొకజీవనంబు.310
క. అని తలఁచి కదలి కతిపయ, దినముల ననుజపురి చేరి తెరువున డస్సెన్
     దనువు మును బేద యై నలి, గినమానముకంటె మిగులఁ గృశమై యుండన్.311
మ. అనుజాగారముఁ జేరవచ్చిన నతం డల్లంతఁ దా నగ్రజుం
     గని సందేహము వొందియున్ గమనరేఖామాత్ర శోధించి క
     న్గొని కన్నీరునఁ బాదము ల్గడిగి సమ్మోదమ్ముతో నెత్తి దీ
     వన డగ్గుత్తిక డింద నాతఁ డదిమె న్వక్షంబుతోఁ దమ్మునిన్.312
వ. తదనంతరంబున.313
క. విపులుం డగ్రజునకుఁ దగు, నుపచారంబులు ప్రమోద ముత్కటముగ ని
     క్కపుభక్తిఁ జలిపి యాతఁడు, విపన్నుఁ డగు టతనిచేత విని దుఃఖితుఁ డై.314
వ. నిజపుత్రకళత్రసహితంబుగా నాతని నిష్టదేవతానిర్విశేషంబున నారాధించుచుండ
     నొక్కమాసంబు చన బంధుకుండు తమ్మునితో నొకనాఁటిరాత్రి యెల్లి యవస్యం
     బునుం దనకుఁ బయనంబు సేయవలయు నని నిర్బంధించి పలికిన నర్ధరాత్రసమయం
     బున నవ్విపులుండు దనయంగణంబున గతపరిసాంద్రమాధవీలతాచ్ఛన్నం బగుచూ
     తకుంజంబుక్రిందికిం బూర్వజుం దోడ్కొని యేగి వేకువన యతనిపయనం బగుట
     దన్నిమిత్తంబు లగు మాటలాడి.315
క. కొనిపోవరాదు తెరువునఁ, గనకము తెక్కలిఘనంబు కాకున్నను మో
     నను రాదు పెద్దహేమం, బని యన్నకుఁ దెలియఁ జెప్పి యకుటిలమతియై.316
వ. అనేక నిష్కసహస్రమూల్యం బగునొక్కమాణిక్యం బతనికి మ్రింగ నిచ్చి మీరు
     ప్రభాతకాలంబున జీర్ణమలినాంబరంబులు ధరియించి యరుగునది యని చెప్పి యి
     రువురు శయనస్థానంబుల కరుగుటయు.317
క. వారలపలుకులుఁ దద్వ్యాపారంబులుఁ దెలియనెఱిఁగి ప్రమదహృదయుఁడై
     చోరుం డొకరుం డచ్చటి, భూరుహమున నుండి వారు పోయినవెనుకన్.318
ఉ. కన్నము పెట్టఁ జన్న నొకకందముఁ జేతయుఁ గాక యున్చి దా

     సన్నిలువం బ్రమాద మది చాలఁగ లాభము చేరె నాకు నే
     నిన్నిశివుచ్చి వేగుతఱి నిప్పటివిప్రుని గూడి పోవుచుం
     గన్నపువేఁట మాని మణిఁ గైకొని ధన్యుండ నై చరించెదన్319
వ. అని నిశ్చయించి యచ్చోటువాసి పోయి ప్రభాతం బగుటయు.320
గీ. పయనమై పోవు బ్రాహ్మణు పజ్జఁ దగిలి, సాధువోలె నాతనితోడ సముచితంపు
     భాషలాడుచుఁ దనచేయు పనికి ననువు, తలఁచికొను జోరకుండును దనమనమున.321
క. నడుమ నలవడదు ముందటి, యడవిం దెగఁ జూతు విప్రునని తలఁచుచు స
     య్యడవిఁ దరిసి యరుగఁగ న, క్కడఁ దెక్కలికాఱు వచ్చి కడురౌద్రమునన్.322
క. ఇరువురఁ గట్టియుఁ గొట్టియుఁ, బరిభవములు వెట్టఁ బేదపన్నల మనుచున్
     గరుణముగఁ బలుకఁగాఁ గృప, యొరగినచిత్తముల వార లొండొరుతోడన్.323
క. ఈ యొడళుల కీకోకలు, వేయైనను దగవు కపటవేషము లివి యీ
     మాయలకు మనకు లేదె యు, పాయము చీరుదము వీరిఁ బట్టి యుదరముల్.324
వ. అనుచుండ నందులో ముఖ్యలగువారు.325
గీ. వ్రత్త మొకనికడుపు వ్రయ్యంగ నందులో, బసిఁడి లేక యున్నఁ బరుని బ్రదికి
     యరుగనిత్త ముండిన ట్లైన నితరుల, వ్రత్త మిదియె కార్యవృత్త మనుచు.326
వ. నిశ్చయించి తమ యిరువురిలోపల నొకని వధియింప నుద్యుక్తు లగుసమయంబునం
     జోరుం డాత్మగతంబున.327
క. ఏ నేమి తలఁచి వచ్చినఁ, దా నేమి తలంచె నిచట దైవం బవురా
     తా నొక్కటి తలఁపఁగ విధి, తా నొక్కటి తలఁచు ననుట తథ్యం బయ్యెన్.328
క. పావనుఁడు బ్రాహ్మణుం డని, భావింప కకారణముగఁ బాపాత్ముఁడ నై
     యీ విప్రుఁ జంపఁదలఁచితి, నావిధి యిట్లుండ నట్లు నా కేలబ్బున్.329
మ. ఒప్పమి సేయఁడేని దగు నుత్తమవంశజుఁ డేని నేరికిం
     ద ప్పొనరింపఁ డేని నతిధార్మికుఁ డేని దురాత్మలైనవా
     రప్పురుషావతంసమున కాఱడి యెగ్గొనరింపఁ జూచినం
     దప్పునె చేటు వారలకు దైవము కన్నలు పుట్టుఁ జీకులే.330
గీ. ఇతనికడుపు వ్రచ్చి యిం దిప్డు రత్నంబుఁ గాంచిరేని దనదుకడుపు వ్రత్తు
     రురక చంపిపోదు రూరక విడువరు, కడుపు వ్రచ్చు టెట్లు గట్టి తనకు.331
వ. అయినను.332
క. తనకడుపు మున్ను వ్రచ్చినఁ, గనకము లేకున్న నతనిఁ గాచెద నిట్లుం

     దను విడువ రింక బహుచిం, తనములఁ బని యేల కాచెదం గా కితనిన్.333
వ. అట్లుంగాక.334
క. క్షీణకరుణచే బ్రాహ్మణు, ప్రాణము గొనఁదలఁచినట్టిపాపము మగుడం
     బ్రాణంబుఁ గాచి యతనకిఁ, బ్రాణం బీకున్న నెట్లు పాయఁగ నేర్చున్.335
వ. అని కృతనిశ్చయుండై.336
క. తనకడుపు మున్ను వ్రచ్చుం, డనుటయు నటుఁజేసి వార లందేమి యుఁ గా
     ననివారై యీతని వ్ర, చ్చిన యట్టుల కాదె యేల చెనఁటిగఁ జంపన్.337
వ. అనుచు నవ్విప్రు బంధముక్తునిం జేసి నిజేచ్ఛం జను మనుటయు.338
క. క్రూరులచే విడివడి సుత, దారాదులఁ గలసి యతఁడు ధన్యుం డయ్యెం
     జోరుఁడు వివేకమానస, చోరుఁడు నాకమున కరిగి సుఖియై యుండెన్.339
క. అవివేకచరిత మట్టిది, సవివేకచరిత్ర మిట్టిచందం బగుటన్
     సవివేక హీను సంగతిఁ, దవులఁగవల దాపదలకుఁ దప్పఁ దలఁచినన్.340
వ. అని మకరందిక యెఱింగించిన కథఁ గొనియాడి రిట్లు సుఖగోష్ఠి యొనరించి య
     మ్మువ్వురు సముచితవ్యాపారంబులకుం జనిరంత నిక్కడ.341
శా. దేవీరత్నము కిన్కతో, జనిన ధాత్రీనాథుఁ డుల్లంబులో
     నావిర్భూతమనోజతాపదహితుం డయ్యెం బరీహాసభా
     షావిన్యాసముచే దినంబు గడపం జారాయణుం డేగి ని
     ద్రావాసంబు భజించె రాజు కృతసంధ్యాముఖ్యకర్తవ్యుఁ డై.342
ఉ. అచ్చటనుండి నేర్పగలయట్టి యనుంగులయైన యింతులం
     బుచ్చిన రాక దేవి తనబోఁటికిఁ దెల్లమి గాఁగ నిల్చినన్
     వెచ్చని యూర్పు నించుచును వేదనఁ బొంచుచుఁ గన్ను మోడ్చుచు
     న్వెచ్చుచు సజ్జపైఁ దనువు వెమ్మగనేఁచుచు నీల్గి లేచుచున్.343
సీ. ఉండె నంతకుమున్న యుర్వీశతిలకుపై దేవి తప్పులువెట్టి పోవుటయును
     రాత్రి దా సజ్జకు రాకుండుటయుసు జెప్పినఁ గళావతి నతిప్రీతితోడఁ
     బసదనంబునఁ దన్పి భాగురాయణుఁడు లాటేశ్వరుపుత్రిక నెసకమెసఁగఁ
     గైసేయఁబనిచి యక్కన్యాశిరోమణి నటకుఁ దోడ్కొనియేగునట్లు చేసి
గీ. వలయు బుద్ధులు చెప్పిన నెలమి నదియు
     నీమృగాంకావలియు మున్న యెఱఁగికొనిన
     నెయ్యములకల్మి నోర్తోర్తు దియ్య మెక్కఁ

     కూడికొని రహస్యక్రియాకుశలు లగుచు.345
ఉ. వర్జితలోభుఁ డాదిసచివప్రభుపాత్రుఁడు సద్వదాద్యతా
     నిర్జితసూర్యసూనుఁడు మనీషిజనస్తుతధర్మవర్తనుం
     డూర్జితసంపదాఢ్యుఁడు పయోనిధిసప్తకబంధుకీర్తి కిం
     గర్జితదానివృష్టి కవిగాయకపోషకదృష్టి యిమ్మహిన్.346
క. ఆజన్మవదాన్యుఁడు బహు, రాజసభావినుతకీర్తిరమణీరమణుం
     డోజఁప్రధానకాంతి, భ్రాజితమృదుమధురకావ్యపరిణతుఁ డెందున్.347
మాలిని. సరససుకవిగోష్టీసంభవానందచేత
     స్సరసిజుఁడు కళావిజ్ఞాతసంగీతవిద్యా
     భిరతుఁడు ధృతి విద్యా భీమనామాత్యపుణ్యో
     దరశరనిధిసంభూతప్రపూర్ణేందుఁ డుర్విన్.348
గద్య. ఇదిసకలసుకవిజనవిధేయ మంచననామధేయప్రణీతం బైన కేయూరబాహు
     చరిత్రమునందుఁ దృతీయాశ్వాసము.