కేనోపనిషత్
శాంతి మంత్రములు
[మార్చు]మంత్రము | భావము |
---|---|
ఓం సహనావవతు |
మన ఉభయులను భగవానుడు రక్షించు గాక. మనల నిద్ధరిని పోషించు గాక. మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక. మన అధ్యయనము తేజోవంతము అగు గాక. మనఁవిరువురము ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక. |
ఓం ఆప్యాయంతు మమాంగాని, వాక్ ప్రాణ చక్షుః శ్రోత్ర మథో బల మింద్రియాణి చ సర్వాణి , సర్వం |
నా అవయవములు శక్రివంతములు అగు గాక. నా వాక్కు, ప్రాణములు, కన్నులు, చెవి మొదలగు ఇంద్రియము లన్నియు శక్తివంతములు అగు గాక. సర్వము ఉపనిషత్ప్రతిపాదిత బ్రహ్మమే. నేను ఎన్నడు బ్రహ్మను నిరాకరింపకుండెదను గాక. బ్రహ్మము నన్ను నిరాకరింపకుండు గాక. నా నిరాకరణము బ్రహ్మమునందు లేకుండా ఉండు గాక. బ్రహ్మ నిరాకరణము నా యందు ఉండకుండు గాక. ఉపనిషత్తులలో తెలుపబడిన ధర్మములు నా యందు స్థిరపడు గాక. |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
ప్రథమ ఖణ్డః
[మార్చు]మంత్రము | భావము |
---|---|
కేనేషితం పతతి ప్రేషితం మనః |
శిష్యుడు - ఎవరిచేత కోరబడి పంపబడినదియై మనస్సు వస్తు ప్రపంచము పైకి నడచుచున్నది. ఎవరి ఆజ్ఞకు లోబడి ముఖ్య ప్రాణము చరించుచున్నది. ఎవరి వలన వాక్కు నడచుచున్నది. ఏ జ్ఞానము ఛక్షుశ్శ్రోత్రములను నడిపించుచున్నది. |
శ్రోత్రస్య శ్రోతం మనసో మనో య |
ఏదైతే చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా ఉన్నదో అదియే ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా ఉన్నది అని గ్రహించిన ధీర పురుషులు విముక్తినొందినవారై ఈ లోకము నుండి విడిపడి అమృతతత్వమును పొందుచున్నారు. |
న తత్ర చక్షుర్గచ్ఛతి |
దానిని నేత్రములు చూడలేవు. వాక్కు దానినిగూర్చి పలుకలేదు. దానినిగూర్చి ఎలా తెలుపవలెనో మాకు తెలియదు. తెలిసినదాని కంటెను, తెలియనిదాని కంటెను అది అతీతమైనది. దానినిగూర్చి మాకు భోధించిన మా పూర్వీకుల నుండి మేము అలాగే విన్నాము. |
యత్ వాచా అనభ్యుదితం |
ఏది వాక్కు ద్వారా వ్యక్తపరచబడదో, దేని వలన వాక్కు వ్యక్త మగునో అదియే బ్రహ్మము అని గ్రహింపుము. అంతియేకాని ఇక్కడ జీవులు ఉపాసించునది మాత్రము కాదు. |
యన్మనసా న మనుతే |
దేనిని గూర్చి మనస్సు మననము చేయలేదో, దేనివలన మనస్సు సంచరించుచున్నదో అదియే బ్రహ్మము అని తెలుసుకొనుము. అంతియేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. |
యచ్చక్షుషా న పశ్యతి |
దేనిని నేత్రములు దర్శించలేవో, దేని ప్రభావము వలన నేత్రములు చూడగలుగుచున్నవో అదియే బ్రహ్మము అని తెలుసుకొనుము. అంతియేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. |
యత్ శ్రోత్రేణ న శృణేతి |
దేనిని శ్రోత్రము ఆలకించలేదో, దేనివలన చెవి ఆలకించ గలుగు తున్నదో అదియే బ్రహ్మము అని తెలుసుకొనుము. అంతియేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. |
యత్ప్రాణేన న ప్రాణితి |
దేనిని ముక్కు శ్వాసించలేదో, దేనివలన నాసిక శ్వాసించుచున్నదో అదియే బ్రహ్మము అని తెలుసుకొనుము. అంతియేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. |
ద్వితీయ ఖణ్డః
[మార్చు]మంత్రము | భావము |
---|---|
యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం |
గురువు - బ్రహ్మమునుగూర్చి నాకు తెలియును అని నీవు భావింతువేని, అది నిజముగ అతి స్వల్పమైనదియే. దేవతలతో నీవు దర్శించు బ్రహ్మము కూడా స్వల్పమైనదియే. కనుక నీవు బ్రహ్మమును గూర్చి ఇంకను విచారించ వలసి యున్నది. |
నాహం మన్యే సువేదేతి |
నాకు అది బాగుగా తెలిసినది అనుకొనుట లేదు. అలాగని తెలియదు అనుకోవడం లేదు. మా ఇరువురిలో ఎవడు అది తెలిసినది అనియు తెలియనిది అనియు తెలుసుకొనునో అతడికే బాగుగ తెలియును. |
యస్యా మతం తస్య మతం |
ఎవనికి తెలియదో వానికి తెలుస్తుంది. ఎవనికి తెలుసో వానికి తెలియదు జ్ఞానులైన వారికి తెలియదు. అజ్ఞానులకు అది చక్కగా తెలియును. |
ప్రతిభోధ విదితం మతం |
బుద్దియందు నడిచే ప్రతి విషయమును ఎవడు దర్శించునో వాడు అమృతత్వమును పొందుచున్నాడు. ఆత్మ ద్వారానే వ్యక్తి వీర్యవంతు డగుతున్నాడు. జ్ఞానము ద్వారానే వ్యక్తి అమరుడగుచున్నాడు. |
ఇహ చేదవేదీదథ సత్యమస్తి |
ఇచ్చట గనుక తెలుసుకొనినచో అప్పుడు సత్యము తెలుస్తుంది. కాని ఇక్కడ తెలిసికొననిచో వినాశనము గొప్పగా తెలుస్తుంది. ధీరులగు వారు సర్వ భూతములలో ఒకే ఆత్మను దర్శించిన వారై, ఈలోకమునుండి విముక్తిని పొంది అమృతస్వరూపు లగుచున్నారు |
తృతీయ ఖణ్డః
[మార్చు]మంత్రము | భావము |
---|---|
బ్రహ్మ హ దేవేభ్యః విజిగ్యే |
ఒకప్పుడు దేవతల కొరకు బ్రహ్మ దానవులపై విజయమును సాధించెను. ఈ విజయము వలన దేవతలు వైభవమును పొందిరి. మాదే విజయము - మాదే వైభవము అని దేవతలు భావించిరి. |
తత్ హ ఏషాం విజజ్ఞౌ తేభ్యో హ ప్రాదుర్బభూవ |
వారి భావమును గ్రహించిన బ్రహ్మము వారి ముందు ప్రత్యక్షమాయెను. అయితే ఆ అర్చనీయమైన ఆకృతి ఏమిటో తెలుసుకొనలేకపోయిరి. |
తే అగ్ని మబ్రువన్ జాతవేద |
వారు అగ్నిదేవునితో - ఓ జాతవేదుడా, ఈ విస్మయాకృతి ఏమిటో తెలిసికొనుము - అని చెప్పినారు. అలాగే - అన్నాడు అగ్నిదేవుడు. |
తదభ్యద్రవత్ తమభ్యవదత్ |
అగ్నిదేవుడు పరుగిడి యక్షుని సమీపించెను. యక్షుడు - నీవెరవు - అని ప్రశ్నించెను. నేను అగ్నిని. నేను జాతవేదుడను - అని అగ్నిదేవుడు సమాధాన మొసంగెను. |
తస్మింస్తయి కిం వీర్యమితి |
జాతవేదుడనని చెప్పుకొనిన నీలో ఏ శక్తి ఉన్నది - అని యక్షుడు ప్రశ్నించెను. ఈ భూమి మీద ఉన్న సమస్తమును నేను తగుల బెట్టగలను - అని అగ్నిదేవుడు యక్షునికి సమాధానము నొసంగెను. |
తస్మై తృణం నిదధావేతత్ దహేతి |
యక్షుడు అగ్నిదేవుని ముందు ఒక గడ్డిపోచను పడవేసి, - దీనిని దహింపజేయుము - అనెను. అగ్నిదేవుడు ఆ తృణమును సమీపించి, తన యావచ్చక్తితోను దానిని కాల్చలేకపోయెను. అతడు దేవతల వద్దకు మరలిపోయి - ఆ అద్భుత రూపములో ఉన్నదెవరో నేను కనుగొనలేక పోయాను - అని తెలియజేసెను. |
అథ వాయు మబ్రువన్ వాయువే |
తరువాత, దేవతలు వాయుదేవునితో - ఓ వాయుదేవుడా, ఈ యక్షుడెవరో తెలిసికొనుము - అని చెప్పినారు. అలాగే - అన్నాడు వాయుదేవుడు. |
తదభ్యద్రవత్ తమభ్యవదత్ |
వాయుదేవుడు యక్షుని సమీపించెను. నీవెరవు - అని యక్షుడు ప్రశ్నించెను. నేను వాయువును. మాతరిశ్వుడను - అని వాయుదేవుడు సమాధాన మొసంగెను. |
తస్మిం స్త్వయి కిం వీర్యమితి |
నీలోని ప్రభావమేమిటి - అని యక్షుడు ప్రశ్నించెను. ఈ భూమి మీద ఉన్న సమస్తమును నేను వీచి దూరముగా పడవేయ గలను - అని వాయుదేవుడు యక్షునికి తెలిపెను. |
తస్మై తృణం నిదధౌ ఏత దాదత్స్వేతి |
యక్షుడు వాయుదేవుని ముందు ఒక గడ్డిపోచను ఉంచి, - దీనిని కదిలించుము - అనెను. వాయుదేవుడు ఆ తృణమును సమీపించి, తన యావచ్చక్తితోను దానిని కదిలించ లేకపోయెను. అతడు వెనుదిరిగి దేవతల వద్దకు వచ్చి - ఆ వ్యక్తి ఎవరో నేను కనుగొనలేక పోయాను - అని తెలియజేసెను. |
అథేన్ద్ర మబ్రువన్ మఘవన్ |
ఆ తరువాత దేవతలు ఇంద్రునితో - ఓ మఘవా, అర్చనీయమైన ఈ రూపమేమిటో తెలుసుకొనుము - అని చెప్పిరి. ఇంద్రుడు - అలాగే - అని, వేగముగా అచటికి వెళ్ళెను. కాని, ఆ యక్షుని స్వరూపము అంతర్థాన మయ్యెను. |
సః తస్మిన్నే వాకాశే స్త్రియ మాజగామ |
ఆ స్థానమునందే అతడు శోభాయమానమై గోచరిస్తున్న హిమవంతుని కుమార్తె యగు ఉమాదేవిని గాంచెను. ఇంద్రుడు ఆమెను - ఈ యక్షస్వరూపము ఏమిటి - అని ప్రశ్నించెను |
చతుర్థ ఖణ్డః
[మార్చు]మంత్రము | భావము |
---|---|
సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణోవా |
ఉమాదేవి - అది బ్రహ్మము - అని చెప్పెను. ఆమె - బ్రహ్మ యొక్క విజయమునందే మీరు వైభవమును పొందినారు - అని తెలిపెను. అప్పుడు యక్షస్వరూపము బ్రహ్మమే యని ఇంద్రుడు గ్రహించెను. |
తస్మాద్వా ఏతే దేవా అతితరామ్ |
అందుచేతనే ఇతర దేవతలను అతిక్రమించి అగ్ని, వాయువు, ఇంద్రుడు యున్నారు. వారే బ్రహ్మమును సమీపములో స్పృశించినారు. వారే ప్రథమముగా బ్రహ్మమును తెలుసుకొనినారు. |
తస్మాద్వా ఇన్ద్రోఽతితరాం |
అందువలన దేవతలందరి కంటెను ఇంద్రుడు శ్రేష్ఠుడాయెను. బ్రహ్మమునకు సమీపముగా అతడు చరించుటచేతను, బ్రహ్మమును ప్రథమముగా తాను తెలిసికొనుటచేతను ఇంద్రుడు శ్రేష్ఠుడు అయ్యెను. |
తస్యైష ఆదేశో |
బ్రహ్మమును గూర్చి ఆదేశము ఈ విధముగా యున్నది. అతడు మెరుపు యొక్క ప్రకాశము వలె శోభించి, కన్ను మూసి తెరుచు లోపల అదృశ్యమవుతాడు. దేవతలతో సరిపోల్చి చూసినప్పుడు ఇదియే బ్రహ్మనిర్దేశమై ఉన్నది. |
అథాధ్యాత్మం యదేతద్వగచ్ఛతి చ |
ఇప్పుడు ఆత్మ గురించి బోధ జరుగుతున్నది. దేని సమీపమునకు మనస్సు పరిగిడుచున్నదో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరింపబడుచు, సమీపమున ఉన్నట్లు నిర్ణయింపబడినదో అదియే ఆత్మ. |
తద్ధ తద్వనం నామ |
బ్రహ్మము అందుచేతనే - తద్వనం - అని పిలువబడినది. బ్రహ్మము - తద్వనం - అనెడి నామముతో ఉపాసింపబడుతాడు. ఎవరయితే ఇలా గ్రహిస్తాడో అతనిని సర్వభూతములు అభిలషిస్తాయి. |
ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా |
శిష్యుడు - ఆచార్యా, ఉపనిషత్తును నాకు బోధించుము.
గురువు - ఉపనిషత్తు నీకు చెప్పబడినది. బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన ఉపనిషత్తు నీకు చెప్పితిమి. |
తస్మై తపోదమః కర్మేతి ప్రతిష్ఠా |
ఆ ఉపనిషత్తునకు తపస్సు, దమము, కర్మ పునాదులవంటివి. వేదములే దాని యొక్క సర్వాంగములు. సత్యమే దాని నివాస స్థానము. |
యోవా ఏతేమేవం వేదాపహత్య |
ఈ విధముగా ఉపనిషత్తును తెలుసుకొనిన వాడు పాపమును పోగొట్టుకొని బ్రహ్మము నందు ప్రతిష్ఠితుడగుతున్నాడు. బ్రహ్మము నందు ప్రతిష్ఠితుడగుతున్నాడు. |
జై గురుదేవ్
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనాః సుఖినో భవంతు