కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/స్వేచ్ఛ, బాంధవ్యాలు, మరణం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వేచ్ఛ, బాంధవ్యాలు, మరణం

క్రిందటిసారి మనం యిక్కడ కలుసుకొని ప్రస్తావించుకొన్న విషయాలను గురించి, మీకు అభ్యంతరం లేకపోతే మరికొంత వివరంగా యిప్పుడు మాట్లాడు కుందాం, సమూలమైన విప్లవం రావలసిన ఆవశ్యకత వున్నదని అన్నాము; కేవలం ఆర్థిక రంగంలో కాని, కేవలం సామాజికమైనది కాని కాదు, ఇంకా గాఢమైన లోతుల్లో, చేతనావర్తపు మూలంలోనే విప్లవం రావాలి. ప్రపంచపు స్థితిగతులు యీ విప్లవం జరిగితీరాలని ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాకుండా, ప్రపంచమంతటా సాంకేతిక రంగంలో కాదు- మతపరమైన దృష్టితో చూసినప్పుడు, క్రమక్రమంగా క్షీణస్థితి దాపురిస్తున్నదని కూడా అన్నాము. ఈ 'మతం' అనే మాటను అత్యంత జాగరూకత తోనూ, ఎంతో సందేహిస్తూనూ వాడుతున్నాను. ఎందుకంటే 'మతం' అనే మాటను పూర్తిగా దుర్వినియోగం చేసేశారు. మేధావులు దీనిని మొత్తంగా తృణీకరిస్తారు, తిరస్కరిస్తారు, ఆ మాట వింటేనే వాళ్ళు దూరంగా పారిపోతారు; వైజ్ఞానికులు, మేధావులే కాక మానవతా వాదులు కూడా ఆ మాటతో- ఆ మనోభావంతో, మతం అని అందరూ పిలుస్తున్న, ఆ వ్యవస్థీకరించబడిన నమ్మకాలతో తమకేమీ సంబంధం లేదంటారు. అయితే, మనం యిక్కడ మాట్లాడుతున్నది లక్షల సంవత్సరాల కాలగమనంలో అనేకమైన ఆనుభవాల ద్వారా, అనేకరకాల స్థితిగతుల ద్వారా నిర్మించుకున్న మన మనోతత్వపు స్వభావం లోనూ, మన చేతనావర్తపు స్వరూపంలోనూ రావలసిన విప్లవం గురించి. ఇప్పుడు మనం యిట్లా ప్రశ్నించుకుంటున్నాం. ఈ ప్రపంచంలో- క్రూరంగా, హింసాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా వుండే యీ ప్రపంచంలో, రోజురోజుకీ ప్రయోజకత్వానికే ప్రాధాన్యత పెరిగిపోతూ, ఆ విధంగా యింకా యింకా నిర్ణయాత్మకంగా తయారవుతున్న యీ ప్రపంచంలో- ఒక విప్లవాన్నీ, బాహ్యమైన సామాజిక బాంధవ్యాలలోనే కాకుండా, అంతకంటే అదనంగా ఆంతరీకమైన జీవితంలో కూడా తీసుకొనిరావడం సాధ్యమేనా అని. చేతనావర్తం సమస్తంలోనూ- అంటే ఆలోచనాపరిధి అంతటిలోనూ ఒక సమూలమైన విప్లవం కనుక రాకపోయినట్లయితే మనిషి క్షీణస్థితికి దిగజారి పోయి, హింస, దుఃఖం శాశ్వతంగా వుండి పోతాయి. అంతేకాకుండా, యింకా యాంత్రికంగా, యింకా సుఖాలకు నిలయంగా వుండే సమాజాన్ని తయారు చేసుకొని, చాలా చాలా కృత్రిమమైన జీవితం సాగిస్తాడు. వాస్తవంగా జరుగుతున్నది అదే అని మనం పరిశీలించి చూస్తే తెలుస్తుంది.

యంత్రాల సహాయంతో పనులు చేయించుకోవడం, సైబర్నటిక్స్ (కంప్యూటర్ల సంబంధితశాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడం, ఎలక్ట్రానిక్ మెదడు మొదలైన వాటి వలన మానవుడికి తీరిక సమయం రోజు రోజుకూ ఎక్కువవుతున్నది. ఈ తీరిక సమయాన్ని అతడు వినోద కార్యక్రమాలతో గడపదల్చుకుంటాడు- అవి ఆధ్యాత్మికమైన కాలక్షేపాలు అవచ్చు, అతనికి రకరకాలైన వినోదాన్ని కలిగించేవి కావచ్చు; మనిషికీ మనిషికీ మధ్యన గల బాంధవ్యాలను ఒకరినొకరు ధ్వంసం చేసుకొనడానికి వుపయోగించుకోవడం ఎక్కువవచ్చు కూడా యీ తీరిక సమయాల వల్ల. మనిషి అంతర్ముఖుడవడానికి కూడా యీ తీరికను వినియోగించుకోవచ్చు. కాబట్టి, యీ మూడు రకాలుగా సంభవించడానికి మాత్రమే అవకాశం వుంది. సాంకేతిక విజ్ఞానపరంగా చూస్తే మానవుడు చంద్రమండలంలో అడుగు పెట్టగలడు, అయితే దాని వల్ల మానవజాతికున్న సమస్యలు తీరవు. తన తీరిక సమయాన్ని ఆధ్యాత్మికమైన లేదా మనోల్లాసకరమైన కార్యక్రమాలతో గడిపివేసినంత మాత్రాన కూడా పరిష్కారం అవవు. చర్చికిగాని, దేవాలయానికిగాని వెళ్ళడం, నమ్మకాలు, అంధవిశ్వాసాలు, పవిత్ర గ్రంధాలు పారాయణ చేయడం యివన్నీ ఒక రకంగా కాలక్షేపం కోసం చేసే కార్యక్రమాలే. దానికి బదులు మనిషి తనలోకి తను లోతుగా చూసుకుంటే, శతాబ్దాల తరబడి మనిషి తయారుచేసి పెట్టుకున్న విలువలను ఒక్కొక్క దానినీ ప్రశ్నించి చూసి, యీ మెదడు వుత్పత్తి చేసినది కాకుండా, మరింకేదైనా వున్నదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ప్రపంచమంతటా కూడా కొంతకొంతమంది రకరకాల మాదక ద్రవ్యాలు తీసుకోనీ, సామాజిక జీవనంలో ఏ విధంగానూ పాల్గొనకుండానూ, పాతుకొనిపోయిన వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు.

కాబట్టి మనం మాట్లాడుకుంటున్నది ఏమిటంటే, యిటువంటి ప్రపంచంలో జీవిస్తున్న మనీషి భిన్నమైన మరో సమాజాన్ని, పూర్తిగా విభిన్నమైన మరో క్రమ తను తయారుచేసే ఒక విప్లవాన్ని, ఒక మానసికమైన విప్లవాన్ని తీసుకొనిరాగలడా అని మనకి క్రమశీలత అత్యవసరం. ఎందుకంటే విపరీతమైన అస్తవ్యస్తత అంతటా ప్రబలిపోయింది. అసలు సామాజిక నిర్మాణ స్వరూపం సమస్తం క్రమరాహిత్యం, పోటీలు, స్పర్థలు, ఎదుటి వాడిని పడత్రోసైనా తాను బతకొలనుకోవడం, మనిషికి మనిషి శత్రువు అనే తత్వం, వర్గవిభజనలు, జాతిభేదాలు, దేశదురభిమానాలు, తెగల విభేదాలు మొదలైన వాటిమీద ఆధారపడి వున్నది. ఈ సమాజ నిర్మాణంలోనే అస్తవ్యస్తత వున్నది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అనేక రకాల విప్లవాలు-రష్యన్ విప్లవం మొదలైన ఎన్నో రకాలవి సమాజంలో ఒక క్రమశీలత్వాన్ని నెలకొల్ప డానికి ప్రయత్నించాయి కాని అవి ఘోరంగా పరాజయం చెందక తప్పలేదు. రష్యా, చైనాలలో యిదీ కనబడుతున్నది. అయితే మనకు క్రమత చాలా అవసరం, ఒక క్రమ శీలత్వం అనేది లేకపోతే మనం బ్రతకలేము. జంతువులు కూడా ఒక క్రమత్వాన్ని కోరుకుంటాయి. వాటిలో క్రమత అంటే ఆస్తికి సంబంధించినది, సెక్సుకు సంబంధించినది. మనలో అంటే మానవుల్లో కూడా ఆస్తికి, సెక్సుకు సంబంధించిన క్రమశీలతను ఆస్తిపై హక్కుల కోసం వదులుకోవడానికి మనకి అభ్యంతరం లేదు. ఇప్పుడు యీ రంగంలో క్రమతను సాధించడానికి మనం ప్రయత్నిస్తూ వున్నాం.

అయితే స్వేచ్ఛ వున్నప్పుడే క్రమత వుంటుంది. స్వేచ్ఛ అంటే సాధారణంగా చెప్పుకొనే అర్థంలో కాదు. స్వేచ్ఛ ఎక్కడయితే వుండదో అక్కడ అస్తవ్యస్తత వుంటుంది. అందువల్ల అక్కడ నియంతృత్వం వుంటుంది. క్రమతను తీసుకొనిరావడానికి అక్కడ మనుష్యుల మీద బలవంతంగా సిద్ధాంతాలను రుద్దడం వుంటుంది. దానివలన అక్కడ చివరకు మళ్ళీ అస్తవ్యస్తత నెలకొంటుంది. కాబట్టి క్రమత్వం అంటే అందులో క్రమశిక్షణ వుంటుందన్నమాట. అయితే సాధారణంగా క్రమశిక్షణ అని మీరు చెప్పుకొనేది లొంగిపోయి వుండటంమీద, విధేయత మీద, ఒప్పుదల మీద ఆధారపడి వుంటుంది. లేదా భయపెట్టి, శిక్షించి, విపరీతమైన నిరంకుశాధికారం చలాయించి మిమ్మల్ని క్రమబద్ధంగా వుంచడం జరుగుతుంది. అయితే మనం మాట్లాడుతున్న క్రమశిక్షణ, స్వేచ్ఛ అంటే ఏమిటి అన్నది అర్థంచేసుకోవడం ద్వారా కలిగేది. స్వేచ్ఛ అంటే ఏమిటో అవగాహన చేసుకోవడమే స్వేచ్ఛకు ఒక క్రమశిక్షణను కలిగిస్తుంది.

కాబట్టి, 'స్వేచ్ఛ', 'ఆవగాహన' అనే యీ రెండు మాటలకి అర్థం ఏమిటన్నది మనం చక్కగా ఆకళింపు చేసుకోవాలి. సాధారణంగా మనం, 'నాకు యిది అవగాహన అయింది' అన్నప్పుడు మేధాపరంగా, శబ్దపరంగా అది వర్తిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని సుస్పష్టంగా, మీ మాతృభాషలో కానీ, మనిద్దరకూ తెలిసిన ఒక విదేశ భాషలో కానీ చెప్పినప్పుడు, “నాకు అవగాహన అయింది' అని మీరు అంటారు అంటే మనిషి సంపూర్ణత్వంలో కొంత భాగాన్ని మాత్రమే 'నాకు అవగాహన అయింది' అన్నప్పుడు మీరు వుపయోగిస్తారు. అంటే ఏమిటంటే, ఆ మాటలు మీ మేధ ద్వారా అవగాహన ఉయాయి, యీ వక్త ఏమనుకుంటున్నాడో అది మీకు అవగాహన అయింది. అయితే యిక్కడ అవగాహన అనే మాటను వుపయోగించినప్పుడు, ఒక వూహా ప్రతిపాదనను మేధాపరంగా ఆకళింపు చేసుకోవడం అనే అర్థంలో మనం వాడటంలేదు. అవగాహన అనే పదాన్ని దాని సంపూర్ణమైన అర్ధంలో వుపయోగిస్తున్నాం. అంటే అవగాహన చేసుకున్నప్పుడు, మీరు చర్య తీసుకుంటారు. ఒక ఆపద వున్నది అనే సంగతి మీరు అవగాహన చేసుకున్నప్పుడు, - ఆపదను మీరు స్పష్టంగా చూసినప్పుడు, తక్షణమే మీరు క్రియని చేస్తారు. అవగాహనలోని క్రియాశీలత్వమే దాని క్రమశిక్షణ. కాబట్టి యీ అవగాహన అనే మాటలోని విశిష్టతను మనం స్పష్టంగా గ్రహించాలి. మనం అవగాహన చేసుకుంటే, తెలుసుకుంటే, ఆకళింపు చేసుకుంటే, విషయాన్ని వున్నది వున్నట్లుగా చూస్తే క్రియ జరుగుతుంది. ఒక విషయాన్ని మీరు అవగాహన చేసుకోపోలంటే, మీ మనస్సునీ, మీ హేతుబుద్ధినీ, మీ శక్తిసామర్థ్యాలనే కాకుండా, మీ మొత్తం సావధానత్వాన్ని వుపయోగించాలి. అట్లా చేయని పక్షంలో అవగాహన వుండదు. ఇది బాగా స్పష్టంగా వుందని ఆశిస్తాను.

కాబట్టి, స్వేచ్ఛ గురించి అవగాహన- అంటే అది తిరుగుబాటు కాదు, అంతకంటే భిన్నమైనది అని మనం తెలుసుకుంటున్నాము. తిరుగుబాటు అంటే పాతుకొని పోయిన వ్యవస్థకు వ్యతిరేకతను ప్రకటించడం- జుట్టు కత్తిరించుకోకుండా పొడుగ్గా పెంచుకునేవారి తిరుగుబాటు వంటివి. ఒక నిర్ణీతమైన పద్ధతికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు; అయితే, తిరగబడినప్పుడు, మరో కొత్త పద్ధతిలో వాళ్ళు చిక్కుకొనిపోయి, దానికి ఆమోదం తెలుపుతున్నారు. మనం మాట్లాడుతున్నది తిరుగుబాటు కానటువంటి స్వేచ్చను గురించి. ఇది మరొకదాని నుంచి విముక్తి పొందడం కాదు; అస్తవ్యస్తతను అవగాహన చేసుకోవడంలోనే వున్న స్వేచ్ఛ. దయచేసి దీనిని స్పష్టంగా తెలుసుకోండి. క్రమరాహిత్యాన్ని అంటే అస్తవ్యస్త స్థితిని అవగాహన చేసుకోవడంలోనే దానినుంచి విముక్తి వుంది. ఆ స్వేచ్ఛ క్రమతను తెస్తుంది. ఈ క్రమతలోనే క్రమశిక్షణ వుంటుంది.

అంటే అర్థం, ప్రతికూలమైన దానిని అవగాహన చేసుకోవడంలో అనుకూలమైన చర్య జరగడం వున్నది. అనుకూల పక్షపు విధానం అవలంబించడం ద్వారా క్రమత సిద్ధించదు. క్రమరాహిత్యస్థితి అనేది యిక్కడ వున్నది. మానవుడు ఒక నిర్ణీతమైన పద్ధతిని, సామాజిక పద్ధతిని, నైతిక పద్దతిని, మతరీతిని, తన స్వంత వ్యక్తిగతమైన అభిరుచుల పైనా సుఖాల పైనే ఆధారపడిన ఒక పద్ధతిని పట్టుకొని అనుసరిస్తూ వుండటం కారణంగా యీ అస్తవ్యస్తత ఏర్పడింది. అంటే ఆర్జనపరత్వంతో జీవితాన్ని ముడిపెట్టి చూసే వైఖరీ, పోటీ తత్వమూ, విధేయతా, ఆధిపత్యమూ అనే వాటి మీద యీ సమాజాన్ని నిర్మించారు; కాబట్టి అస్తవ్యస్తత నెలకొన్నది. ప్రతి మనిషి పాటు పడుతున్నది తన స్వంతం కోసమే. పారమార్ధికుడు పని చేస్తున్నదీ స్వార్ధం కోసమే! 'దేశ క్షేమం కొరకు' అని వుపన్యాసాలు చేస్తున్నా, రాజకీయ వేత్త పనిచేస్తున్నదీ స్వార్ధం కోసమే. వ్యాపారస్థుడి దృష్టి స్వలాభం పైనే, ప్రతి మనిషి తన స్వప్రయోజనం కోసమే పొటుపడుతున్నాడు. అందులో సందేహం లేదు. కాబట్టి అతడు అస్తవ్యస్తతను సృష్టిస్తున్నాడు. కొందరు ఆదర్శవాదులున్నారు; ప్రతి మనిషి తన కోసమే తను శ్రమ పడుతున్నాడు కాబట్టి, ఆదర్శజీవి తన దేశంకోసం, తన సమాజంకోసం, తన వర్గంకోసం, యింకా అట్లాంటివాటి కోసం పాటుపడాలని వాళ్ళు అంటున్నారు. అంటే అప్పుడు క్రమతను మనమీద బలవంతంగా రుద్దుతారనమాట. అప్పుడూ అస్తవ్యస్తత కలుగుతుంది. చారిత్రకంగా చూస్తే యిదంతా చాలావరకు నిజమే. కాబట్టి అస్తవ్యస్త స్థితిని- ప్రతి మనిషి అస్తవ్యస్తతను ఎట్లా సృష్టిస్తున్నాడు అనేదానిని అవగాహన చేసుకోవడం వల్ల, మేధాపరంగా కాదు, మాటల్లో కాదు, మనిషి ఏంచేస్తున్నాడు అనే వాస్తవాన్ని చూడటంవల్ల, ఆ గ్రహింపు ద్వారా నిజంగా 'ఉన్నది' ని పరిశీలించడం ద్వారా, యిదంతా అవగాహన చేసుకోవడం ద్వారా ఒక క్రమశిక్షణ కలుగుతుంది. ఆ క్రమశిక్షణ క్రమతను తీసుకొస్తుంది.

కాబట్టి, 'స్వేచ్చ' అనే మాటను 'అవగాహన' అనే మాటను, అంతేకాకుండా 'చూడటం' అనే మాటను కూడా మనం అర్ధం చేసుకోవాలి, ఆకళింపు చేసుకోవాలి. ఒక వస్తువునీ మనం చూస్తామా లేదూ దానిని గురించి మనకి వున్న మనో రూపం ద్వారా చూస్తామా? ఒక చెట్టుని చూసినప్పుడు, చెట్టుని గురించి మీకు వున్న ఒక మనోబింబం ద్వారా అసలు వాస్తవంలో వున్న చెట్టుని చూస్తున్నారన్నమాట. దయచేసి యిది మీరే పరిశీలించండి, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా గమనించుకోండి. చెట్టువైపు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడే మనం మాట్లాడుతుండగానే చూడండి. ఆలోచనతోపాటు దానీవైపు చూస్తారు. 'అది తాడిజాతి చెట్టు; దీని పేరు యిది, దాని పేరు అది' అని అంటారు. ఆలోచన అనేది చెట్టు అనే నిజమైన వాస్తవాన్ని పరికించకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. మరికొంచెం మనోగతంగా, మరికాస్త అంతర్ముఖంగా వెళ్ళండి. మీ భర్తవైపో, భార్యవైపో మీరు చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని గురించి మీరు ఏర్పరచుకొన్న ఒక కాల్పనిక బింబం ద్వారా చూడటం వుంటుంది నిస్సందేహంగా. ఎందుకంటే అతనితో కాని, ఆమెతో కాని మీరు అనేక సంవత్సరాలు కలిసి జీవించడంవల్ల అతనిని గురించి, ఆమెని గురించి మీరు ఒక మనోబింబాన్ని ఏర్పరచుకొని వుంటారు. అందుకని ఆమెవైపు లేదా అతనివైపు మీరు ఏర్పరచుకొన్న ఆ కాల్పనికరూపం ద్వారా చూస్తారు, సంబంధ బాంధవ్యం కూడా మీరు పెంచుకున్న ఆ రెండు కాల్పనిక రూపాల మధ్యనేయిద్దరు మనుష్యుల మధ్యన కాదు. కాబట్టి మీరు నిజంగా చూడటం లేదు; ఒక కాల్పనిక బింబం మరో కాల్పనిక బింబాన్ని చూస్తున్నది. అంతే.

ఇది ముఖ్యంగా మీరందరూ గ్రహించవలసిన సంగతి. ఎందుకంటే యిప్పుడు ప్రపంచమంతటా కూడా మానవుల మధ్య వుండే పరస్పర సంబంధాలను గురించే విచారిస్తున్నారు. ఈ కాల్పనిక బింబాలు వున్నంతవరకు పరస్పర సంబంధం అనేది వుండదు. అందువల్లనే మనిషికీ మనిషికీ మధ్యన యీ సంఘర్షణ అంతా వున్నది. మనలో ప్రతి ఒక్కరం ఎదుటివారినీ గురించి ఒక మనో రూపాన్ని సృష్టించుకుంటాం అన్నది అసలైన వాస్తవం. మనం ఒకరివైపు ఒకరం చూసుకుంటున్నప్పుడు, వారిని గురించి మనం ఏర్పరుచుకున్న కాల్పనిక రూపాన్ని లేదో మనల్ని గురించి వారు ఏర్పరచుకున్న కాల్పనిక రూపాన్ని చూసుకుంటున్నాం. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించి తీరాలి. చూడటం వేరు, దానిని గురించి మాటల్లో చెప్పడం వేరు. ఆకలి వేస్తుంటే అది మీకు తెలుస్తుంది. మరెవరో వచ్చి మీకు ఆకలిగా వున్నదని చెప్పనవసరం లేదు. చూడండి, మీకు ఆకలిగా వున్నదని ఎవరో వచ్చి చెప్పారనుకోండి, మీరు ఆ వాక్యాన్ని ఆమోదిస్తారు. అయితే, దీని తాత్పర్యం వేరూ, మీకు నిజంగా ఆకలి వేయడం పూర్తిగా వేరు. కాబట్టి, యిదే విధంగా మీకు యితర్లను గురించి కాల్పనిక రూపాలు వున్నాయనేది మీ అంతట మీరే నిజంగా గ్రహించాలి; ఎదుటివారినీ ఒక హిందువుగానో ఒక ముస్లింగానో, ఒక కమ్యునిస్టుగానో, లేక మరొకటిగానో మీరు చూస్తున్నప్పుడు మానవుల మధ్య వుండవలసిన సంబంధ బాంధవ్యాలన్నీ ఆగిపోతాయి. ఎదుటివారిని గురించి మీరు ఏర్పరచుకొన్న ఒక అభిప్రాయం వైపు మాత్రమే మీరు చూస్తున్నారు. అందువల్ల, మేము అడుగుతున్నది ఏమిటంటే, యీ కాల్పనిక బింబాల తయారీలోనే ఒక విప్లవాన్ని తీసుకొనిరావడం సాధ్యమేనా అని. దయచేసి శ్రద్దగా వినండి, దీనిలో ముడిపడి వున్న విషయాలు చాలా ఆశ్చర్యం గొలిపేవిగా వుంటాయి. మానవులు తాము నివసిస్తున్న సమాజం చేత, ఆ సంస్కృతి చేత, మతం చేత, ఆర్ధికమైన ఒత్తిడుల చేత, శీతోష్ణస్థితులు, ఆహారం, వారు చదివే పుస్తకాలు, వార్తా పత్రికల చేత ప్రభావితులై నిబద్ధీకరణం చెందుతున్నారు. వారు నిబద్ధులై వున్నారు, వారి చేతనావర్తం మొత్త నిబద్ధీకృతం అయివుంది. మనం యిప్పుడు కని పెట్టబోతున్న దేమిటంటే యీ నిబద్దీకరణం కాకుండా యింకేదైనా దానిని మించి వున్నదా అని. అయితే, ఆలోచనా స్రవంతి అంతా కూడా చేతనా వర్తం అనే పరిధులలోపలకే పరిమితమై వున్నదని మీరు గ్రహించినప్పుడు మాత్రమే యీ నిబద్ధీకరణకు ఆవలగా ఏదయినా వున్నదేమో అనేది మీరు తెలుసుకో గలుగుతారు. ఇది స్పష్టంగా వుందా? ఇప్పుడు యింకా కాస్త వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తాను.

చూడండీ, మనిషి ఎప్పుడూ తనని మించి ఆవలగా వున్నదానికోసం, ఒక పరతత్వం కోసం అన్వేషిస్తూనే వున్నాడు; దానిని “దైవం” అన్నాడు, “పరమచైతన్యం” అనీ యింకా రకరకాల పేర్లతోనూ పిలిచాడు. అతడు యిదంతా ఒక కేంద్రం నుంచి ఆరంభించాడు. అదే అతని మొత్తం చేతనావర్తం, సర్! యిటు చూడండి, మరొక విధంగా వివరిస్తాను. మనిషిలోని చేతన కాలం కారణంగా ఏర్పడినది, తను నివసిస్తున్న సంస్కృతి ఫలితంగా ఏర్పడినది. సంస్కృతి అంటే సాహిత్యం, సంగీతం, మతం- యివన్నీ అతన్ని నిబద్ధీకృతం చేశాయి. అతను ఒక సమాజాన్ని నిర్మించు కొన్నాడు, యిప్పుడు ఆ సమాజానికే అతను దాసుడయ్యాడు. ఇది స్పష్టంగా వుందా? కాబట్టి మనిషి తను నిర్మించుకున్న సమాజంచేత నిబద్ధుడయాడు, ఆ సమాజం అతన్ని యింకా యింకా నిబద్ధీకరణకు లోనుచేస్తున్నది. మళ్ళీ యిందులో నుండి బయటపడటంకోసం, ఆ స్పృహతోనో, తనకే తెలియకుండానేనో మనిషి అన్వేషిస్తూనే వున్నాడు. స్పృహతో అంటే- మీరు ధ్యానం చేస్తుంటారు, పుస్తకాలు చదువుతుంటారు, మత సంబంధమైన కర్మకాండల్లో పాల్గొంటుంటారు, యీ నిబద్దీకరణం నుంచి తప్పించుకొని పారిపోవడానికి యింకా అవీ యివీ చేస్తుంటారు. తెలుసుకున్న స్పృహతోనో, ఆ స్పృహ లేకుండానేనో చేతనత్వపు పరిధులను దాటి ఆవలగా వున్న దానిని అందుకోవాలనే ఒక వెతకులాట, ఒక అన్వేషణ సాగుతూ వుంటుంది.

కాలం కారణంగా జనించిన ఆలోచన తన నిబద్ధీకరణాన్నీ దాటుకొని ఆవలగా వెళ్ళగలనా అని విచారణ చేస్తూ వుంటుంది; అది సాధ్యమనో, అసాధ్యమనో మళ్ళీ తనే అంటూవుంటుంది; లేదా ఆవలగా ఏదో వున్నదని గట్టిగా నొక్కి చెప్తూవుంటుంది. కాబట్టి, కాలం ఫలితంగా జనించిన ఆలోచన, చేతనా వర్తం అంతటికీ- అంటే చేతనకీ, అంతఃచేతనకీ కూడా రంగస్థలం అయిన ఆలోచన, నూతనమైనదానిని ఏదీ కనిపెట్టలేదు. ఎందుకంటే ఆలోచన ఎప్పటికీ పాతదే. అనేక లక్షల సంవత్సరాలను జ్ఞాపకాలుగా పోగు చేసుకున్నదే ఆలోచన. జంతువుల నుండి వారసత్వంగా సంక్రమించినదాని ఫలితమే ఆలోచన. నిన్నటి అనుభవం గురించిన జ్ఞాపకమే ఆలోచన. కాబట్టి, చేతన పరిధులను దాటుకొని ఆవలగా పోగలగడం ఆలోచనకు ఎన్నటికీ సాధ్యంకాదు.

అందుకని, మీరు ఒక చెట్టువైపు చూస్తున్నప్పుడు, ఆలోచన ఆ చెట్టుని గురించి సృష్టించిన ఒక కాల్పనిక బింబాన్ని చూస్తూ వుంటారు. మీ భార్య వైపో, భర్తవైపో, మీ రాజకీయనాయకుడు, మీ ఆధ్యాత్మిక గురువు మొదలైనవారి వైపో చూస్తున్నప్పుడు, ఆలోచన ఆ వ్యక్తిని గురించి తయారుచేసిన కాల్పనిక రూపాన్ని మీరు చూస్తుంటారు. కాబట్టి నూతనమైనదాన్ని మీరు చూడటం వుండనే వుండదు. ఆలోచనను సుఖం అదుపు ఆజ్ఞల్లో పెడ్తూవుంటుంది. అసలు సుఖసంతోషాలనే సూత్రమే మనల్ని నడిపిస్తూ వుంటుంది. దీనిని గురించి క్రిందటిసారి మనం కొంత మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నది ఏమిటంటే యీ పరిమితులుగల చేతనావర్తాన్ని దాటుకొని ఆవలగా వెళ్ళడం అనేది సాధ్యమేనా అని. ఆలోచనను గురించి విచారణ చేయడం ధ్యానంలో ఒక భాగం. దీనికి అపారమైన క్రమ శిక్షణ వుండవలసిన ఆవశ్యకత వుంది. ఈ క్రమశిక్షణ అంటే అదుపు, అణచివేత, అనుకరణ, ఒక పద్ధతిని అనుసరించడం మొదలైన అర్ధంలేని వేషాలతో కూడిన క్రమ శిక్షణ కానేకాదు.

ఇప్పుడు, విచారణ అనే యీ ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం. ఈ వక్త దీనిని పరిశీలించ బోతున్నాడు; మీరు కూడా యీ వక్తతో పాటు ప్రయాణించ దలచుకుంటే, అతను చెప్పేదానిని సావధానంగా వినడమే కాకుండా, అతనితోపాటు మీరు కూడా అందుకునే ప్రయత్నం చేయాలి, కేవలం మాటల రూపంలో కాదు, యదార్ధంగా.

అమాయకత అనే రంగం వున్నదా, ఆలోచనచేత ఏ మాత్రం స్పృశింపబడని సహజస్వచ్ఛత్వం వుందా అని మనం కనిపెట్టబోతున్నాం. ఆ చెట్టువైపు యిదే ప్రప్రధమంగా చూడటం అన్నట్లుగా చూడగలనా; లోకం వైపు- గందరగోళం, బాధలు, దుఃఖం, మోసాలు, అమానుషత్వం, కపటం, క్రూరత్వం, యుద్ధాలతో కూడినటువంటి లోకంవైపు- లోకం అంటే మనకున్న సమస్త భావనాజాలంవైపు, అదే ప్రప్రధమంగా చూడటం అన్నట్లుగా చూడగలనా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, నేను కనుక అదే ప్రప్రధమంగా చూడటం అన్నట్లుగా చూడగలిగితే, నా చర్య పూర్తిగా నూతనంగా వుంటుంది. కాబట్టి మనసు యీ అమాయక స్వచ్ఛత్వం అనే రంగాన్నీ కనుక ఆవిష్కరించుకోకపోతే, అది ఏం చేసిన సరే- సాంఘిక సంస్కరణలు ఎన్ని చేసినా, ఎన్ని కార్యకలాపాలు నిర్వహించినా- ఆలోచన మనసును కలుషితం చేస్తూనే వుండిపోతుంది. ఎందుకంటే మనసును తయారుచేసింది ఆలోచనే. ఆలోచన ఎప్పటికీ పాతదే.

మేము ప్రశ్నిస్తున్నది ఏమిటంటే చేతనావర్తానికి పరిధులున్నాయి కాబట్టి, యీ చేతనలో కలిగే ఏ కదలిక అయినో ఆలోచసయొక్క కదలికేనా అని; అది చేతనంలో కానివ్వండి, అంతఃచేతనలో కానివ్వండి. దేవుడిని, సత్యాన్ని మీరు అన్వేషిస్తుంటే, అది ఆలోచన చేసే అన్వేషణే కదా; కాబట్టి తనకు తెలిసిన దానిని ఫలానా అని గుర్తించడానికి అనువుగా పైకి తీసి ప్రదర్శించడమే ఆలోచన చేసే పని. అందువల్ల యింతకు మునుపు తెలిసిన దానినే మీరు అన్వేషిస్తున్నారు. కాబట్టి మీరు నిజంగా అన్వేషణ చేయడమే లేదు. ఇది మీరు అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల అన్వేషించడం సమస్తం ఆగిపోపోలి. అంటే, నిజంగా అర్ధం ఏమిటంటే 'ఉన్నది' ని మీరు వాస్తవంగా చూసితీరాలి. అంటే మీరు కోపంగానో, అసూయతోనో, పోటీ పడుతూనో, దురాశతోనో, స్వార్ధపూరితంగానో, పశువులాగానో, దౌర్జన్యంతోనో, హింసాత్మకంగానో వున్నారని మీరు గ్రహించినప్పుడు, ఒక ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని యిదంతా చూడటం కాదు, 'ఉన్నది' ని మీరు నిజంగా వున్నది వున్నట్లుగా చూసినప్పుడు, అప్పుడు మీరు సంఘర్షణను పూర్తిగా తొలగించివేస్తారు. సంఘర్షణతో వున్న మనసు, ఆ సంఘర్షణ ఏ రకమయినదయినా సరే, ఏ స్థాయిలోనైనా సరే వున్న మనసు మందకొడిగా తయారవుతుంది. అస్తమానం పోట్లాడుకుంటున్న యిద్దరు వ్యక్తుల లాగా- వాళ్ళు జడంగా, మూర్ఖంగా వుండి, సున్నితత్వాన్ని కోల్పోయి, మొద్దుబారిపోతారు. సంఘర్షణ ఎటువంటిదయినా సరే మనసును మందకొడిగా తయారు చేస్తుంది. అయితే, 'ఉన్నది'ని, దానికి విరుద్ధమైన దానిని తేకుండా, వాస్తవంగానే మీరు చూసినప్పుడు, సంఘర్షణ బొత్తిగా వుండదు.

ఇంకా వివరంగా చెప్తాను. జంతువుల్లో హింసాత్మకత వుంటుంది. జంతువుల నుండి పరిణామం చెందిన మానవుల్లో కూడా హింస వుంటుంది; హింసాత్మకంగా వుండటం, కోపం తెచ్చుకోవడం, యీర్ష్యపడటం, అసూయ చెందడం, అధికారం కోసం, హోదా కోసం, ప్రతిష్ఠకోసం పాకులాడటం, యితర్లమీద పెత్తనం చలాయించడం, దౌర్జన్యం ప్రదర్శించడం యివన్నీ మనిషి అస్తిత్వంలో వున్నాయి. మనిషిలో హింస వున్నది- వేల సంఖ్యలో జరిగిన యుద్ధాలవల్ల యిదీ తెలుస్తూనే వుంది. కాని మనిషి ఒక ఆదర్శవాదాన్ని తయారుచేసి దానికి 'అహింస' అని పేరు పెట్టాడు. దయచేసి శ్రద్దగా వినండి. ఈ దేశం, యీ భారత దేశం, నిరంతరంగా దానిని గురించే అంతులేకుండా మాట్లాడుతూ వుంటుంది. అదంతా వట్టి వూహలపోగు అయిన ఆదర్శవాదం ఆనబడే చెత్త. నిజంగా హింస జరిగినప్పుడు, అంటే యీ దేశానికీ, పక్కనే వున్న మరో దేశానికీ మధ్య యుద్ధం జరిగినప్పుడు, అందరూ హాయిగా ఆ యుద్ధంలో పాల్గొన్నారు; ఎంతో యిష్టంగా. సరే, వాస్తవంలో హింసాత్మకంగా వుండి, అహింస అనే ఆదర్శం మీకు వుంటే సంఘర్షణ బయలు దేరుతుంది. అహింసాత్మకంగా అపాలని మీరు సదా ప్రయత్నిస్తూ వుంటారు- సగం సంఘర్షణ అందువల్లే. హింసాత్మకంగా వుండకుండా మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకుంటారు- ఇందులో మళ్ళీ సంఘర్షణ వుంటుంది, ఒత్తిడి వుంటుంది. కాబట్టి, మీలో హింస వుండి, అహింస అనే ఆదర్శాన్ని అవలంబిస్తే, మొత్తం మీద మీరు హింసాత్మకంగా వున్నట్లే. హింస మీలో వున్నదని గ్రహించడమే మొట్టమొదట మీరు చేయవలసినది-అహింసాత్మకంగా అవాలని ప్రయత్నించడం కాదు. హింసను వున్నదాన్ని వున్నట్లుగా చూడటం, దానిని మార్చడానికి ప్రయత్నించకుండా, క్రమశిక్షణలో పెట్టకుండా, ఎదుర్కొని తట్టుకోకుండా, అణచివేయకుండా, దానిని మీరు అప్పుడే ప్రప్రధమంగా చూస్తున్నట్లుగా చూడటం- అంటే ఏ ఆలోచన లేకుండా దానిని పరికించడం.

ఒక చెట్టును అమాయకమైన స్వచ్చత్వంతో పరికించడం అంటే అర్థం ఏమిటో మునుపు వివరించి చెప్పాను. అంటే ఒక మనోబింబం అనేది లేకుండా దానివైపు చూడటం. అదే విధంగా హింసను కూడా ఒక మనోబింబం లేకుండా చూడాలి; అసలు హింస అన్న మాటల్లోనే ఆ బింబం కలిసిపోయివుంది. ఆలోచన యొక్క కదలిక లేకుండా దానివైపు చూడటం అంటే మొట్టమొదటిసారి దానివైపు చూస్తున్నట్లుగా చూడటం- కాబట్టి అమాయకత్వంతో దానివైపు చూడటం.

ఇది మీరు గ్రహిస్తున్నారని ఆశిస్తాను, ఎందుకంటే యిది అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. తన లోపల వున్న సంఘర్షణను కనుక మానవుడు పూర్తిగా తొలగించుకో గలిగితే, అన్ని విధాలా విభిన్నమైన ఒక నవ్య ప్రపంచాన్ని అతను తయారు చేయగలుగుతాడు. అప్పుడు అది సమూలంగా జరిగిన విప్లవం అవుతుంది. అందుకని, మనం అడుగుతున్నది ఏమిటంటే, మానవుడు, నిబద్ధీకరణం చెందిన యీ జీవి, తన నిబద్దీకరణం అంతటినీ బ్రద్దలు చేసుకొని బయట పడగలడా? అది జరిగితే అటు పైన అతను ఒక హిందువుగానో, ముస్లీంగానో, కమ్యునిస్టుగానో, అభిప్రాయాలతో, సిద్దాంతాలతో నిండిపోయిన సోషలిస్టుగానో వుండిపోడు. అవన్నీ సమాప్తమయి పోతాయి. విషయాలను నిజంగా ఎట్లా వున్నాయో అట్లా చూడటం మీరు ఆరంభించినప్పుడు మాత్రమే యిదీ సాధ్యమవుతుంది.

చెట్టుని చెట్టులాగే చూడాలి; చెట్టు ఎట్లా వుంటుంది అని మీరనుకుంటుంటారో దానిని కాదు. భార్యవైపో, భర్తవైపో చూస్తున్నప్పుడు అతడు కాని, ఆమెకాని నిజంగా ఎట్లా కన్పిస్తున్నారో దానినే చూడాలి తప్ప, ఆ వ్యక్తి గురించి మీరు తయారు చేసుకున్న కాల్పనిక స్వరూపం ద్వారో కాదు. అప్పుడే వాస్తవాన్ని మాత్రమే, 'వున్నది' ని మాత్రమే మీరు చూడగలుగుతారు. అంతే తప్ప, మీ వ్యక్తిగతమైన అభిలాషలతోనూ, అభిరుచులను బట్టీ, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వ్యాఖ్యానించుకోవడానికి ప్రయత్నించరు. పరిస్థితులు మనల్ని అదుపు చేస్తూ వుంటాయి. మన అభిలాష, మన అభిరుచి మనల్ని నడిపిస్తూ వుంటుంది. అందువల్లనే 'యదార్థంగా వున్నది' ని చూడనే చూడం, యదార్ధంగా వున్నది' ని చూడటమే అమాయకమైన స్వచ్ఛత్వం. అప్పుడే మనను ఒక బ్రహ్మాండమైన మార్పును పొందుతుంది. ఇదంతా మీకు అర్ధం అవుతున్నదో లేదో నాకు తెలియదు. ఒక చిన్న పిల్లవాడికి, నీవు హిందువు అని మీరు నేర్పిస్తారు; నీవు నల్లగా వున్నావు అనీ, నీ రంగు యిదీ అనీ, మరొకరికి నీవు క్రైస్తవుడివి అనీ నేర్పిస్తారు. ఇటువంటివన్నీ మీరు నేర్పిస్తారు; నేర్పించి, ఆ విధంగా అతన్ని అదుపు ఆజ్ఞల్లో పెట్టి నిబద్ధీకృతుడిని చేస్తారు. ఇప్పుడు మేము అంటున్నదేమిటంటే యీ నిబద్ధీకరణాన్ని బ్రద్దలు చేయాలంటే, నేను హిందువును అనే, నేను ముస్లింను అనే, కమ్యునిస్టును అనే, క్రైస్తవుడిని అనే దృష్టితో ఆలోచించకుండా, విషయాలను యదార్థంలో ఎట్లా వున్నాయో అట్లా చూసే ఒక మనిషిని అనే వైఖరితో ఆలోచించడం అవసరం. అంటే నిజమైన అర్ధం, వాటి విషయంలో చనిపోవడం.

మీకు తెలుసు, మనలో చాలామందికి మరణం అంటే ఒక భయానకమైన విషయం. చిన్నా, పెద్దా, వృద్ధులూ రకరకాల కారణాల వల్ల మరణం అంటే, అంతా ఒకటే తీరుగా భయపడతారు. మనం యిట్లా భయపడుతూ వుంటాం కాబట్టి అనేక రకాల సిద్దాంతాలు కని పెట్టాం- పునర్జన్మ, పునరుజ్జీవనం- మరణం వున్నది అనే అసలు వాస్తవాన్నుండి పారిపోవడానికి ఎన్నో రకరకాల దారులు. మరణం అజ్ఞేయమైనది (తెలియరానిది). మీ భర్తని గురించో, భార్యని గురించో మీ వద్ద వున్న కాల్పనిక రూపం తప్ప అతన్ని గురించి కానీ, ఆమెని గురించి కానీ మీకు తెలియదు. అదే విధంగా మరణం గురించి కూడా నిజంగా మీకు ఏమీ తెలియదు. ఇది అవగాహన అయిందా? మరణం అనగానే అదేదో తెలియనిది, అదేదో భయంకరమైనదీ. మీరు అనబడే ఒక జీవి పూర్తిగా నిబద్దీకరణం చెంది వున్నాడు. అతనిలో వున్నదంతా ఆతని ఆందోళనలు, అతని అపరాధభావం, ఆతని క్షోభ, ఆతని బాధలు, అతిస్వల్పమైన ఆతని సృజనాత్మక శక్తి, అవీ యివీ చేయడంలో అతని ప్రతిభ అతను అంటే యిదంతా. తనలోని వన్నీ ఖండిస్తూ, అణచివేస్తూ వుండటమే అతని ఆలోచనల తత్వం. కాబట్టి, తనకు తెలిసినవన్నీ పోగొట్టుకుంటానేమోనని అతను భయపడుతుంటాడు. ఆలోచించడం అనేది లేనట్లయితే, 'నా' వుండదు; భయం అనేదీ వుండదు. కాబట్టి తెలియని దానిని గురించి యీ భయాన్ని సృష్టించినది ఆలోచనలు.

మరణంలో రెండు విషయాలు కలిసిపోయి వుంటాయి. భౌతికమైన ముగింపుతో పాటుగా మానసిక సంబంధమైన ముగింపు కూడా వుంది. అందుకని మనిషి ఏమంటాడంటే ఆత్మ అనేది ఒకటి వున్నది, అది ఎప్పటికీ కొనసాగుతుంది; శాశ్వతంగా వుండిపోయేది ఒకటి వున్నది. నాలోనూ, నీలోనూ; అది ఎప్పటికీ వుంటుందీ అని. ఇప్పుడు, యీ శాశ్వత స్థితిని సృష్టించినది ఆలోచనలు; ఇటువంటి ఆలోచనకు జన్మనిచ్చినది ఎవరయినా అయుండచ్చు, ప్రాచీనకాలం నాటి ఒక బోధకుడో, ఒక రచయితో, ఒక కవో, ఒక నవలా రచయితో- గొప్ప తత్వ సిద్ధాంతాలు చేసిన మత ప్రవక్త అని మీరు అనుకున్నా అనుకోవచ్చు. ఆత్మ అనే యీ భావనని, శాశ్వతమైన సత్వం అనే ఒకదానిని, తన ఆలోచన ద్వారా అతను సృష్టించాడు. మనం ఆ ఆలోచనను పట్టుకొని దాని వెనకాల వెళుతూ వుంటాం, ఆ నిబద్దతలో చిక్కుకుని పోతాం. కమ్యునిస్టులు కూడా యింతే- అయితే శాశ్వతమైనది ఒకటే వున్నదనీ వాళ్ళు నమ్మరు. వాళ్ళకు ఏదో బోధించారు, దాని ప్రకారం వాళ్ళు ఆలోచిస్తుంటారు. శాశ్వతమైనది ఒకటి వున్నదనే నమ్మకాన్ని మీకు బోధించినట్లుగానే, శాశ్వతంగా వుండేది ఏదీ లేదు అనే నమ్మకాన్ని వారికి బోధించారు. వారు మీరూ అంతా సమానులే. ఒకరికి నమ్మకం వుంది, ఒకరికి నమ్మకం లేదు. నమ్మకం అనేది మిమ్మల్నీ, వారినీ అందర్నీ నిబద్ధుల్ని చేసింది.

సరే, మరొక వివాదం కూడా దీనికి సంబంధించినది వుంది. అది ఏమిటంటే ఆలోచన ఎప్పటికీ కొనసాగుతూ వుంటుందా అని. ఆలోచనకు మీరు బలం చేకూరుస్తూవుంటే అది కొనసాగుతుంది. అంటే మీరు ప్రతీ రోజూ మిమ్మల్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ దేశాన్ని గురించి, మీ కార్యకలాపాల గురించి, మీరు వుద్యోగం చేయడం గురించి, పని చేయడం, ఆలోచించడం, పనిచేయడం, ఆలోచించడం యిదంతా చేస్తుండటంవల్ల ఒక కేంద్రస్థానాన్ని తయారు చేస్తారు; అందులో వున్నది ఆలోచనల రూపంలో వున్న జ్ఞాపకాల మూట, ఇక, ఆలోచన తనకు తానుగా కొనసాగుతూ వుంటుందా అనే విషయం విచారణ చేసి తీరాలి. ప్రస్తుతం సమయం తక్కువగా వున్నది కాబట్టి అందులోకి మనం పోవద్దు.

మరణం అంటే మనకు తెలియనిది. స్వచ్ఛత్వం అనే అమాయకత్వంతో దాన్ని చూద్దామా? అర్థమయిందా మీకు? ఆ ఆకులమధ్యనుండి ప్రసరిస్తున్న చంద్రుడి కాంతిని యిదే ప్రప్రధమంగా చూస్తున్నట్లుగా చూడగలనా? ఆ కాకులు చేస్తున్న ధ్వనిని యిదే మొట్టమొదటిసారిగా వింటున్నట్లుగా వినగలనో, నాకు తెలిసిన దంతా వదిలివేసేసి పూర్తిగా అమాయకంగా? అంటే ఏమిటంటే, నిన్న అనబడే, నాకు తెలిసిన వాటికి అన్నింటికీ చనిపోవడం, నిన్నటి స్మృతిని మోసుకొని రాకుండా వుండటమే చనిపోవడం అంటే. మీరు అది యదార్ధంగానే చేయాలి. దానిని గురించి అంతులేకుండా సూత్రీకరిస్తూ వుండటం కాదు. ఇందులోని ప్రాధాన్యాన్ని గ్రహించినప్పుడు మీరు తప్పకుండా చేస్తారు. దీనికి ఒక పద్ధతి అన్నది లేదని, ఒక విధానం అనేది లేదని కూడా మీరు గ్రహిస్తారు. ఎందుకంటే ప్రమాదకరమయినదీ ఏదయినా చూసినప్పుడు, వెంటనే ఆ క్షణంలోనే మీరు చర్య చేస్తారు. అదే విధంగా, ఒకప్పుడు వుండిన దాని కొనసాగింపు మాత్రమే కలిగివున్న మనస్సు నూతనమైనది ఏదీ సృష్టించలేదని మీరు గ్రహిస్తారు. వైజ్ఞానిక రంగంలో కూడా మనస్సు పూర్తిగా ప్రశాంతంగా వున్నప్పుడే నూతనా విష్కరణలు సాధ్యమవుతాయి. కాబట్టి, నిన్నలకు, స్మృతులకు, గాయాలకు, సుఖాలకు చనిపోవడం అంటే అమాయకంగా, స్వచ్ఛంగా అవడం. మృత్యు రాహిత్యం, అంటే మరణం లేకుండా శాశ్వతంగా కొనసాగడం కంటే అమాయకత్వం చాలా ఎక్కువ ప్రాధాన్యం కలది. ఆలోచన అమాయకత్వాన్ని తాకలేదు. అయితే మృత్యురాహిత్యాన్ని ఆలోచన ముస్తాబు చేసి తయారు చేస్తుంది.

కాల్పనిక బింబాన్ని తయారుచేసే యంత్రాంగం నడవడానికి ఆధారం శక్తి. ఈ శక్తికి వున్న ముఖ్య సూత్రం ఏమిటంటే సుఖాన్ని వెతుక్కోవడం. మనం చేస్తున్నది అదే. అదే కదూ? మనకందరికీ సుఖం కావాలి. ఆ సూత్రం మీదే మనం పనిచేస్తూ వుంటాం. ఆ సూత్రం మీదే మన చర్యలన్నీ వుంటాయి. మన నీతి సూత్రాలు, మన సామాజిక సంబంధ బాంధవ్యాలు, దేవుడు అని అంటుంటారే- దానికోసం అన్వేషణ యింకా యితరాలు. అవన్నీ సుఖం కోసమే, సుఖలాలసను తృప్తిపరచడంకోసం చేసేవే, సుఖం అంటే కోరికను ఆలోచన ద్వారా కొనసాగించడం, ఎప్పటికీ వుండేలాగా.

అమ్మా, మేడం! దయచేసి యిదంతా కాగితం మీదికి ఎక్కించకండీ. దీనికి పరీక్షలు లేవు. నోట్సు రాసుకొని యింటికి తీసుకెళ్ళి, ఆలోచించి, ఆ పైన సమాధానాలు వ్రాసెయ్యడానికి. మనం అందరం కలిసి యీ పని చేస్తున్నాం. మీరు క్రియ చేస్తూ వున్నప్పుడు తక్కినవాటికీ వ్యవధానం లేదు. మీరు యదార్థంగా జీవిస్తున్నప్పుడు, అదే ప్రస్తుతం. రేపు కాదు. మీరు యిది గాఢంగా అర్ధం చేసుకుంటూ వుంటే, నోట్సు రాసుకోవడానికి మీకు సమయం వుండదు. దయచేసి వినండి.

వినడం అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే కూడబెట్టుకోవడం కాదు. అంటే మీరు నేర్చుకున్న తరువాత, ఆ నేర్చుకున్న దానిలో నుంచే మీ చర్యలు వుంటే- అటువంటి నేర్చుకోవడం వట్టి కూడబెట్టుకోవడమే అవుతుంది. కూడబెట్టుకున్నాక, ఆ కూడబెట్టిన వాటిని ఆధారం చేసుకొని మీ చర్యలు వుంటాయి. ఆ విధంగా మీరు ఘర్షణను సృష్టిస్తారు. మీరు కనుక వింటుంటే, అంతకంటే చేయవలసినది యింకేమీ వుండదు. మీరు చేయవలసినదంతా కేవలం వినడమే. ఆ చెట్టువైపు చూసినట్లుగా, ఆ చంద్రుడి వైపు చూసినట్లు, ఏ ఆలోచన లేకుండా, ఏ తాత్పర్యాలూ చెప్పుకోకుండా. ఊరికే వింటూ వుండండి. అందులో ఎంతో సొందర్యం వుంది. ఆ వినడమే స్వీయాన్నీ పూర్తిగా పరిత్యజించడం. అట్లా చేయని పక్షంలో మీరు వినలేరు.

ప్రసంగాలు

31

గాడమైన వుద్వేగం మీలో వున్నప్పుడే మీరు వింటారు. ఏ విషయమైనా సరే, దేని కోసం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా పరిత్యజించుకో లేక పోతే మీలో గాఢోద్వేగం లేనట్లే. ఆ విధంగా మీ స్వీయాన్ని సంపూర్ణంగా పరిత్యజించి వింటూ వుంటే మీకు సాధ్యమైనదంతా మీరు చేసినట్లే. ఎందుకంటే అప్పుడు సత్యాన్ని మీరు చూస్తారు. ప్రతి రోజులోను వుండే సత్యాన్ని, ప్రతి ఒక్క చర్యలోను వుండే సత్యాన్ని, ప్రతి ఆలోచనలోను, ప్రతి రంగంలోనూ వున్న సత్యాన్ని వున్నది వున్నట్లుగా చూస్తూ వుంటారు. రోజువారీ జీవితపు కదలికలోని, రోజువారీ కార్యకలాపాలలోని, నిత్యకృత్యపు పనిలోని, నిత్యజీవితపు ఆలోచనలలోని సత్యాన్ని చూడటం ఎట్లాగో మీకు తెలియకపోతే మీరు దీనికి ఆవలగా ఎన్నటికీ పోలేరు; చేతనావర్తపు పరిధులకు ఆవలగా ఏమున్నదో దానిని మీరు ఏనాటికీ కనుక్కోలేరు.

కాబట్టి, మేము యింతకు ముందు చెప్పినట్లుగా, స్వేచ్చని అవగాహన చేసుకోవడం దానికి సంబంధించిన క్రమశిక్షణను కూడా తీసుకొస్తుంది. ఆ క్రమశిక్షణ అనుసరణ కాదు, లొంగిపోయివుండటం కాదు; ఉదాహరణకు, మరణంవైపు మీరు చాలా సావధాన శీలతతో చూడగలుగుతారు; ఆ చూడటమే క్రమశిక్షణ. మేము చెప్పినట్లుగా చేతనావర్తం పరిమితులు కలది. ఈ పరిమితుల వరకు ఆలోచనకు అందుబాటులోనే వుంటుంది. అయితే యీ పరిమితులను పగలగొట్టుకోని ఆలోచన దాటిపోలేదు. ఈ నిబద్దీకరణాన్ని బ్రద్దలు చేయాలంటే ఎంతటి మానసిక విశ్లేషణ కానీ, ఎటువంటి తత్వశాస్త్రాలు కానీ, ఎంతటి శారీరక క్రమశిక్షణ కానీ సరిపోదు. ఆలోచనకి సంబంధించిన యంత్రాంగాన్నంతా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే దీనిని బ్రద్దలు చేయగలుగుతాం. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఆలోచన పాతది, కొత్తవాటిని ఏనాటికీ కనిపెట్టలేదు. తను ఏమీ చేయలేను అనే సంగతిని ఆలోచన గ్రహించుకున్నప్పుడు, ఆలోచన అనేదే అంతమై పోతుంది. ఆ విధంగా చేతనావర్తం యొక్క పరిమితులను బ్రద్దలు చేయడం జరుగుతుంది.

ఈ బ్రద్దలు చేసి దాటుకొనిపోవడమే పాతదానికి చనిపోవడం. ఇది ఒక సిద్ధాంతం కొదు. దీనిని అంగీకరించనూ వద్దు, నిరాకరించనూ వద్దు. 'ఇది చాలా మంచి యోచన' అనీ అనకండి, చేయండి. అప్పుడు నిన్నకు చనిపోవడంలో అమాయక శీలత వుద్బవిస్తుందని మీ అంతట మీరే కనీ పెడతారు. అప్పుడు ఆ అమాయకత్వంలో నుండి పూర్తిగా విభిన్న కరమైన చర్య వస్తుంది. మానవులు దీనిని కనిపెట్టనంతవరకు, వాళ్ళు ఏంచేసినా సరే ఎన్ని సంస్కరణలు, ఎన్ని పూజా పునస్కారాలు, ఎన్ని రకాల పలాయనాలు, ఐశ్వర్యాన్ని ఆరాధించడం వంటివి ఎన్ని చేసినా సరే- వాటి వల్ల లాభం లేదు. స్వీయాన్ని సమస్తమూ పరిత్యజించడం ద్వారా మాత్రమే కలిగే అమాయక శీలత ఎక్కడ వుంటుందో అక్కడ ప్రేమ వుంటుంది. ప్రేమ లేనప్పుడు, అమాయక శీలత లేనప్పుడు జీవితమే వుండదు, చిత్రహింస మాత్రం వుంటుంది, సంఘర్షణ మాత్రమే వుంటుంది. అమాయకత్వమూ, ప్రేమ వున్నప్పుడు పూర్తిగా భిన్నమైన ఒక కొత్త స్థితి అక్కడ వుంటుందని మీరు తెలుసుకుంటారు. దీనిని గురించి మరొకరు ఎవరూ మీకు చెప్పలేరు. ఎవరయినా చెప్పినా అది నిజం కాదు. తమకు తెలుసును అనేవారికీ- నిజంగా ఏమీ తెలియదు. అయితే, యిది అవగాహన చేసుకున్న వ్యక్తి చల్లగా, చాపకింద నీరులాగా, అజ్ఞాతంగా పూర్తిగా విభిన్నమైన మరో ఆయతన స్థితిలో అడుగు పెడతాడు ఆది పరిశీలకుడు, పరిశీలితము అన్న పాటి మధ్యన వున్న ఎడాన్ని తొలగించడం వంటిది. ఆ స్థితి పరిశీలకుడు, పరిశీలితము వేరువేరుగా వుండే స్థితి కాదు, దానికి పూర్తిగా భిన్నమైనది.

ది కలెక్టెడ్ వర్క్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,

రెండవ ప్రసంగం, బొంబాయి, 22 ఫిబ్రవరి, 1967