Jump to content

కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/సందేహాలు, సమాధానాలు

వికీసోర్స్ నుండి

సందేహాలూ, సమాధానాలు

ప్రశ్న : మానవుడి సమస్యలు పరిష్కరించాలంటే రావలసినది ఆర్థిక విప్లవం కానీ, సామాజిక విప్లవం కానీ కాదు; కావలసినది మత విషయకమైన విప్లవం అని మీ ప్రసంగంలో అన్నారని యీ రోజు వార్తాపత్రికలో చదివాను. మతవిషయకమైన విప్లవం అంటే మీ అర్థం ఏమిటి?

కృష్ణమూర్తి : మొట్ట మొదట అసలు మతం అంటే మనం ఏమనుకుంటున్నామో చూద్దాం. మనలో చాలామందికి అసలు మతం అంటే ఏమిటి? మతం అంటే ఫలానా అని చెప్పే ఒక సిద్ధాంతంగా కాదు, అసలు వాస్తవంలో ఏమిటి? చాలామంది దృష్టిలో సర్వసాధారణంగా మతం అంటే కొన్ని కొన్ని మూఢ విశ్వాసాలూ, ఆచారాలు, వుపనిషత్తుల్లో, గీతలో, బైబిల్లో ఏం చెప్పారూ అనేవి. లేదా నిబద్దీకరణం చెందిన మన మనసుల్లోనుంచి, హిందువులుగానో, క్రైస్తవులుగానో, కమ్యునిస్టు ధోరణిలోనో రూపుదిద్దుకున్న మన మనసుల్లో నుంచి పుట్టుకొచ్చిన అనుభవాలతో, అలౌకికమైన స్వప్నాలతో, ఆశలతో, వూహలతో తయారు చేసినదాన్ని మతం అని అనుకుంటాం. ఒక రకమైన నిబద్దీకరణంతో ఆరంభమైన మనం, దానికనుగుణంగా వుండే అనుభవాలనే పొందుతూ వుంటాం. మతం అని మనం పిలుస్తున్నదంతా ఏమిటంటే ప్రార్థనలు, కర్మకాండలు, అంధ విశ్వాసాలు, దేవుడిని ప్రత్యక్షం చేసుకోవాలనుకోవడం, ఆధిపత్యానికి తలవంచడం, అసంఖ్యాకమైన మూఢాచారాలు- ఆంతే కదూ! అదేనా మతం అంటే? నిజంగా సత్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నవారు అసలు యిదంతా పూర్తిగా విసర్జించి పారేయాలి, వదిలేయవద్దూ? గురువుల ఆధిపత్యాన్ని, వుపనిషత్తుల ఆధిపత్యాన్ని, తన స్వీయ అనుభవాల ఆధిపత్యాన్ని అన్నింటినీ పూర్తిగా వదిలివేయాలి. ఆ విధంగా ఆధిపత్యమంతా తొలగించుకొని ప్రక్షాళితం అయింది కాబట్టి మనసు కొత్తదానిని ఆవిష్కరించుకోగలుగుతుంది. అంటే అర్థం మీరు హిందువుగానో, క్రైస్తవునిగానో, బౌద్ధునిగానో వుండటం మానేస్తారు. అటువంటి వ్యవహారంలో వుండే బుద్దిహీనతను గ్రహించి దానినుండి మీరు బయటపడాలి. అది మీరు చేస్తారా? ఎందుకంటే అట్లా చేస్తే ప్రస్తుత సమాజాన్ని మీరు ధిక్కరించినట్లవుతుంది, మీ వుద్యోగం వూడచ్చు. కాబట్టి భయం మీ మనసుమీద పెత్తనం, వహిస్తుంది; అందుకని మీరు ఆధిపత్యానికి తలవంచుతూనే వుంటారు.

మతం అని మనం యిప్పుడు అంటున్నది మతం కానే కాదు. దేవుడంటే మనకు నమ్మకం వున్నదా, నమ్మకం లేదా అన్నది మన నిబద్దీకరణం మీద ఆధారపడి వుంటుంది. మీకు దేవుడంటే నమ్మకం వుంటుంది, కమ్యునిస్టుకి దేవుడు లేడు అనే దాంట్లో నమ్మకం వుంటుంది. ఈ రెంటి మధ్యన ఏం భేదం వుంది? వీరిద్దరిలో ఏ మాత్రం వ్యత్యాసం లేదు. ఎందుకంటే మీరు నమ్మటంలో శిక్షణ పొందారు; అతనికి నమ్మకుండా వుండటంలో తర్ఫీదు యిచ్చారు. కాబట్టి నిజంగా తరచి శోధించాలను కునేవారు ఆ పద్ధతులన్నీ సంపూర్ణంగా తిరస్కరించాలి. తిరస్కరించి తీరద్దూ? ఇందులోని ప్రాధాన్యతనంతా అర్ధంచేసుకున్నారు కాబట్టి తిరస్కరించాలి. భద్రతాలేమి వల్ల, భయపడుతుండటం వల్ల, అంతర్గతమైన వెలితి వల్ల ఒక దేశంతోనో, ఒక సిద్ధాంతవాదంతోనో, దేవుని మీద విశ్వాసంతోనో మనం పూర్తిగా ఐక్యమై పోతాం. దీనివల్ల ఏం జరుగుతున్నదో ప్రపంచమంతటా కనిపిస్తూనే వుంది. మతాలన్నీ ప్రేమనీ, సహోదరభావాన్నీ, యింకా అటువంటివాటినీ ఒక ప్రక్కన ప్రవచిస్తూనే మనిషిని మనిషినుండి విడదీస్తున్నాయి. మీరు సిక్కులు, నేను హిందువుని, అతడు ముస్లిం, మరొకరు బౌద్ధులు. ఈ గందరగోళం, యీ విభజనలు, యివన్నీ చూసినప్పుడు మరో కొత్త రకమైన ఆలోచనా సరళి వుండితీరాలని మనం గ్రహిస్తాం. అయితే మనం హిందువులగానో, క్రైస్తవులుగానో, యింకా రకరకాలుగానో వుండి పోయినంతవరకు కొత్త రకంగా ఆలోచించడమన్నది జరగదు అని స్పష్టంగా కనబడుతూ వున్నది. దీనంతటినుండి విముక్త మవాలంటే మిమ్మల్ని, మీ అస్తిత్వం యొక్క మొత్తం స్వరూపాన్ని మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు అంగీకరిస్తుంటారో, ఎందుకు ఆధిపత్యాన్ని అనుసరిస్తారో గ్రహించి తీరాలి. అదంతా మీరు చాలా స్పష్టంగా చూడాలి. మీకు గెలుపు కావాలి; కష్టాలు మీదపడ్డప్పుడు ఆధారపడటానికి దేవుడంటూ ఒకడున్నాడని ఎవరయినా మీకు హామీ యివ్వాలి. నిజంగానే ఆనందంగా, సంతోషంగా వున్న వారు ఎవ్వరూ దేవుడిని గురించీ తలుచుకోనే తలుచుకోరు. బాధల్లో, సంఘర్షణలో వున్నప్పుడే దేవుడిని తలచుకుంటాం. అయితే యీ బాధల్నీ, సంఘర్షణనీ తయారు చేసుకున్నదీ మనమే. ఈ ప్రక్రియనంతా అవగాహన చేసుకోనంతవరకు వూరికే దేవుడిని గురించి అన్వేషించడం నిస్సందేహంగా భ్రాంతిలో పడవేస్తుంది.

కాబట్టి నేను మాట్లాడుతున్న మతపరమైన విప్లవం అంటే ఏదో ఒక మతాన్ని పునరుద్ధరించడమో, సంస్కరించడమే కాదు. అది సర్వమతాల నుండి, సమస్తమైన సిద్దాంతవాదాల నుండి సంపూర్ణమైన విముక్తి. అంటే నిజమైన అర్ధం ఏమిటంటే వీటిని తయారుచేసిన సమాజం నుండి విముక్తి. ఆకాంక్షా పరత్వం వున్న మనిషి మతచింతనా పరుడు అవలేడు. ఆకాంక్షాపరత్వం వున్న మనిషికి ప్రేమ అంటే తెలియదు. అతను ప్రేమను గురించి మాట్లాడవచ్చుగాక. ఒకరు లౌకిక దృష్టిలో ఆకాంక్షాపరులు కాకపోవచ్చు. అయితే తాము మహాత్ముడినవాలనో, ఆధ్యాత్మిక రంగంలో గుర్తింపు పొందాలనో, పైలోకంలో ఫలితం రాబట్టాలనో కోరుకుంటుంటే అతనిలో ఆకాంక్షాపరత్వం వున్నట్లే, కాబట్టి మనసు అన్ని మంత్రాలను, పూజలను, నమ్మకాలను, అంధవిశ్వాసాలను, యింకా అటువంటి వాటి నన్నింటినీ త్రోసి అవతల పారవేయడమే కాకుండా, అసూయనుండి కూడా విముక్తి పొందాలి. మనిషి సంపూర్ణమైన స్వేచ్ఛను పొందడమే మతపరమైన విప్లవం. అప్పుడే అతడు జీవితాన్ని పూర్తిగా విభిన్నమైన దృష్టితో సమీపిస్తాడు. ఒక సమస్య తరువాత మరొక సమస్యను సృష్టించుకోవడం ఆపివేస్తాడు.

ఇవన్నీ వట్టి మూటలుగానో, మేధావిత్వంగానే భావిస్తూ మీరు విని వుంటారు. ఎందుకంటే, 'ఆకాంక్ష అనేదే లేకపోతే నేను జీవితంలో ఏం చేయగలుగుతాను? సమాజం నన్ను నాశనం చేసేస్తుంది' అని మీలో మీరు అనుకుంటూ వున్నారు. సమాజం మిమ్మల్ని నాశనం చేస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. సమాజాన్ని అవగాహన చేసుకొని, దానిని నిలబెడుతున్న యీ ఆకాంక్షా పరత్వం, అసూయ, గెలుపు కోసం ప్రయాస పడటం, మతపరమైన మూఢవాదాలు, విశ్వాసాలు, అంధాచారాలు అనే మొత్తం నిర్మాణ స్వరూపాన్ని అంతా తిరస్కరించిన మరుక్షణమే మీరు సమాజంలో నుండి యివతలగా వచ్చేస్తారు. కాబట్టి సమస్య మొత్తాన్ని మళ్ళీ కొత్తదనంతో చూస్తారు. బహుశ అప్పుడు సమస్య అనేదే లేకపోవచ్చు. అసలు మీరు యిదంతా కేవలం మాటల స్థాయిలోనే విన్నారేమో. అప్పుడు మళ్ళీ రేపు అంతా యధాతధంగా పాతపద్ధతిలోనే కొనసాగిస్తారు. గీతనో, బైబిలునో చదువుకుంటారు. మీ గురువు వద్దకో, మతాచార్యుల వద్దకో వెళ్లారు. మళ్ళీ అన్నీ మామూలే. ప్రసంగం అంతా విని మేధాపరంగా, వాచ్యంగా అదంతా మీరు ఆమోదించవచ్చు. అయితే మీ జీవితం దీనికి వ్యతిరేకమైన దిశలో పోతూవుంటుంది. కాబట్టి మీరు మరొక సంఘర్షణను తయారు చేసుకుంటారు. అందువల్ల అనలు మీరు వినకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం మీకున్న సంఘర్షణలు, సమస్యలు చాలవన్నట్లు మరొకటి అదనంగా చేర్చడం ఎందుకు. ఇక్కడ కూర్చుని, చెప్తున్నవన్నీ వినడం చాలా బాగుంటుంది. అయితే దీనితో మీ వాస్తవ జీవితానికి ఏ సంబంధమూ లేనప్పుడు, మీరు చెవులు మూసుకొని వుంచుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే సత్యం విన్నాక, అట్లా జీవించకపోతే, అప్పుడు మీ జీవితం ఘోరమైన గందరగోళంలో పడిపోతుంది. దుఃఖభూయిష్టమూ, చీకాకుల మయమూ అవుతుంది. నిజానికి మీ జీవితం అట్లాగే వుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, X వాల్యూమ్,

న్యూఢిల్లీ అక్టోబర్ 10, 1956

ప్రశ్న : మా అందరిలోనూ ఏదో భయాలు యుద్ధాన్ని గురించో, పుద్యోగం కనుక వుంటే అది పోతుందేమోననో, వుగ్రవాదులనీ గురించో, మా పిల్లలలో కనబడుతున్న దౌర్జన్యం గురించో, అప్రయోజకులైన రాజకలయవేత్తల పాలిట పడ్డామే ఆనో- యిట్లా రకరకాల భయలు మా జీవితాలను ఎప్పుడూ కళవళ పెడుతూవుంటాయి. ఇటువంటి యీ జీవితాన్ని మేము ఏవిధంగా ఎదుర్కోవాలి?

కృష్ణమూర్తి : ఎట్లా ఎదుర్కొంటారు? ప్రపంచం రోజు రోజుకూ హింసాపూరితంగా తయారవుతున్నదనే విషయం మనం వొప్పుకొని తీరాలి. అది స్పష్టంగా కనబడు తున్నది. యుద్ధ ప్రమాదం కూడా స్పష్టంగా కనబడుతూనే వున్నది. మన పిల్లలు హింసాత్మకంగా తయారవుతున్నారనే ఒక కొత్త వైపరీత్యం కూడా మన కళ్ళముందు వున్నది. కొంతకాలం కిందట భారతదేశంలో పిల్లలతల్లి అయిన ఒకావిడ మా వద్దకు రావడం గుర్తుకొస్తున్నది. భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లి అంటే చాలా గౌరవనీయమైన స్థానంలో వుండే వ్యక్తి. ఈ తల్లిని తన పిల్లల ప్రవర్తన దిగ్ర్భాంతిలో ముంచింది. పిల్లలు ఆమెని కొడుతున్నారట- భారతదేశంలో కనీ వినీ ఎరగని సంగతి. అంటే యీ హింస, దౌర్జన్యం ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ఇక యీ ప్రశ్న ఆడిగినవారు ఉన్నట్లుగా వుద్యోగం పోతుందనే భయం ఒకటి వున్నది. ఇవన్నీ చూస్తు, యిదంతా తెలిసి, ప్రస్తుతం యిట్లా వున్న యీ జీవితాన్ని మీరు ఏవిధంగా ఎదుర్కోవాలి?

నాకు తెలియదు. నేను ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు. మీరు ఎట్లా ఎదుర్కొంటారో నాకు తెలియదు. మొట్టమొదటగా, జీవితం అంటే ఏమిటి? ఎక్కడ చూసినా దుఃఖం, మితిమీరిన జనాభా, ఆప్రయోజకులైన రాజకీయవేత్తలు, రకరకాల మాయలూ, మోసాలూ, చిత్తశుద్దిలేక పోవడం, లంచగొండితనం వంటివి నిరాఘాటంగా సాగుతున్న ప్రపంచంలో మన అస్తిత్వం అన్నది ఏమిటి? ఇదంతా ఎట్లా ఎదుర్కోవాలి? అందుకు మొదట తప్పనిసరిగా తరచి చూడవలసినది జీవించడం అంటే అర్థం ఏమిటనేది. ప్రస్తుతం వున్న ప్రపంచంలో జీవించడం అంటే ఏమిటి? మన నిత్య జీవితాన్ని అసలు ఎట్లా గడపాలి, సిద్ధాంతరూపేణా కాదు, తాత్త్విక యోచనగా కాదు, ఆదర్శవాదం కాదు, అసలు వాస్తవంలో మన నిత్య జీవితాన్ని ఎట్లా జీవించాలి?

మనం కనుక పరీక్షిస్తే, బాగా గాఢమైనస్పృహతో గమనిస్తే, అది ఒక నిరంతరమైన సమరం, నిరంతరమైన పోరాటం, ప్రయాస మీద ప్రయాస పడుతూ వుండటం. ఉదయం నిద్రలేవడం ఒక ప్రయాస. ఏం చేయాలి మనం? తప్పించుకొని పారిపోవడం సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో జీవించడం అసాధ్యం అని అనుకున్న చాలామంది, అన్నింటినీ వదిలేసి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళిపోయి, అంతర్థానమయ్యారు. అదంతా కేవలం తప్పించుకోవడం, యదార్థాన్నుండి పారిపోవడం. అది కూడా సమష్ఠిగా నివసించే సహజీవన సంఘాల్లో చేరి కలసిపోవడం లాంటిదే, బోలెడు ఆశ్రమాలు, ఆస్తులూ వున్న గురువును చేరి అందులో పడి మునిగిపోవడం వంటిదే. వీళ్ళంతా నిత్యజీవితపు సమస్యలని పరిష్కరించుకోరు. సమాజంలో రావలసిన మార్పు, మానసికమైన విప్లవాల గురించి లోతుగా శోధించరు. వీటినుంచి పారిపోతారు. ఇక మనం, మనమూ తప్పించుకొని పారిపోకుండా, యీ వున్న ప్రపంచంలోనే నిజంగా జీవిస్తుంటే, అప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాల్ని మార్చుకోగలమా? మొత్తం జీవితంలో సంఘర్షణ అనేది లేకుండా చేసుకోగలమా, ఎందుకంటే సంఘర్షణ కూడా హింసలో ఒక భాగమే- అది సాధ్యమేనా? మన జీవితాలకు ఆధారం ఏమిటీ అంటే ఏదో ఒక గొప్పదనాన్ని సాధించాలనే పోరాటం; ప్రయాసా, పోరాటమూ.

ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనుష్యులం మనం- మనల్ని మార్చుకోగలమా? అదే అసలైన ప్రశ్న - సమూలంగా, మనో తత్వంలోనే పరివర్తన తీసుకొనిరాగలమా? కాలక్రమేణా వచ్చే పర్యవసానంగా కాదు, కాలానికి కట్టు బడకుండా, లోతుగా ఆలోచించేవారికి, నిజమైన ఆధ్యాత్మికులకు రేపు అనేది వుండదు. రేపు లేదు అని అనడం చాలా కరినవాక్యం. ఇవాల్టి రోజును సంరంభంతో పూజించడం అన్నది మాత్రమే వుంది. ఈ జీవితాన్ని ప్రతిరోజూ, పరిపూర్ణంగా, యదార్థంగా జీవించగలమా, మన బాంధవ్యాలలో పరివర్తన తేగలమా? అసలు సమస్య ఆదీ, ప్రపంచం ఎట్లా వుంది అన్నది కాదు. ఎందుకంటే ప్రపంచం అంటే మనమే. దయచేసి యిది గ్రహించండి : ప్రపంచం అంటే మీరు, మీరు అంటే ప్రపంచం. ఇది స్పష్టంగా కనబడుతున్న, భయంకరమైన వాస్తవం. అసాంతంగా ఎదుర్కోవలసిన ఒక పెద్ద సమస్య- అంటే ఎంతో ఆసహ్యమైనవన్నీ కలిగివున్న యీ లోకం అంటే మనమే అనీ, మనకీ అందులో భాగస్వామ్యం వుందనీ, యిదంతా యిట్లా వుండటంలో బాధ్యత మనమీద కూడా వున్నదనీ, మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నదానికి, ఆఫ్రికాలో జరుగుతున్నదానికి, ప్రపంచమంతటా జరుగుతున్న మతిలేని వ్యవహారాలన్నింటికీ మనమూ బాధ్యులమేనని గ్రహించడం. మన తాతలు, మన ముత్తాతలు చేసిన క్రియలకు- బానిసత్వం, వేలకొద్దీ యుద్ఘాలు, సామ్రాజ్యాల్లోని క్రూరత్వం- మనం బాధ్యులం కాకపోవచ్చును కానీ మనమూ అందులోని వాళ్ళమే. మన బాధ్యతను మనం గ్రహించకపోతే, అంటే మన సమస్త బాధ్యతను, మనం చేసే పనులకు, ఆలోచనలకు, ప్రవర్తనకు మన బాధ్యతను మనం గుర్తించకపోతే, అప్పుడు బొత్తిగా ఏ ఆశా లేనట్లే, లోకం సంగతి తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా, విడివిడిగా మనం యీ వుగ్రవాదపు సమస్యను పరిష్కరించలేమని తెలుసు కాబట్టి. అదీ ప్రభుత్వాల సమస్య. పౌరులకు భద్రత, రక్షణ కల్పించడం వారి విధి. అయితే అది వారు లక్ష్య పెట్టడంలేదు. తమ ప్రజలను రక్షించుకోవాలనే సంగతి ప్రతి ప్రభుత్వమూ నిజంగానే కనుక పట్టించు కుంటే, అప్పుడు యుద్దాలు వుండవు. కాని ప్రభుత్వాలకు కూడా మతిస్థిరత్వం పోయినట్లే కనబడుతున్నది. వాళ్ళకి కావలసినదల్లా పార్టీ రాజకీయాలు, వాళ్ళ అధికారం, వాళ్ళ పదవులు, వాళ్ళ పలుకుబడి- అవన్నీ, ఆ నాటకం అంతా మీకు తెలుసు.

కాబట్టి, కాలాన్ని లెక్కలోకి తీసుకోకుండా, అంటే రేపు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, యివాళ ఆత్యంత ప్రధానం అన్నట్లుగా మనం జీవించగలమా? అంటే అర్థం, మన ప్రతిస్పందనల ఎడల, మనలోని గందరగోళం ఎడల అశేషమైన జాగరకతతో వుండాలి. మన పై మనమే ఒక పరమావేశాన్ని ప్రయోగించుకోవాలి. మనం చేయగలిగిన పని యిదొక్కటేగా కనబడుతున్నది. ఇది కనుక మనం చేయకపోతే మానవుడికి భవిష్యత్తు లేదు. పత్రికల్లో వస్తున్న పతాక శీర్షికలను మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. యుద్ధం కోసం జరుగుతున్న సన్నాహాలను గురించీ. సన్నాహాలు జరుగుతున్నాయంటే అది తప్పక జరిగి తీరుతుందన్నమాటే- వంటకాలు తయారు అవుతున్నట్లుగా. ప్రపంచంలోని సామాన్య ప్రజలకీ సంగతి పట్టినట్లు లేదు. మారణాయుధాల తయారీలో మేధాపరంగా, వైజ్ఞానికంగా పాల్గొంటున్న వాళ్ళూ లక్ష్యపెట్టడం లేదు. వాళ్ళకు కావలసినదల్లా తమ వృత్తిలో పైకి పోవడం, తమ వుద్యోగాలు, తమ పరిశోధనో. చాలా సామాన్య పౌరులుగా లెక్కించబడే మనలాటి వాళ్ళం, మధ్య తరగతి అని పిలవబడే మనం కూడా కనుక లక్ష్య పెట్టకపోతే మాత్రం మనమంతా నడి సముద్రంలో దూకినట్లే. ఇందులోని విషాదం ఏమిటంటే మనం యిది లెక్క చేస్తున్నట్లుగా కనబడటంలేదు. అందరం కలసి ఒకచోట చేరడం, కలిసి ఆలోచించడం, కలిసి పనిచేయడం లేనే లేదు. సంస్థల్లోనూ, సభల్లోనూ చేరడానికి మాత్రం చాలా వుత్సాహం చూపుతాం, అవీ యీ యుద్దాలు, యీ నరికి పోగులు పెట్టుకోవడాలు ఆపు చేస్తాయని ఆశపడతాం. ఇంతవరకూ ఆవి ఏమీ చేయలేదు. సభలూ, సంస్థలు వీటిని ఆపడం అనేది జరగదు. మానవ హృదయమే, మానవ మస్తిష్కమే అసలు యీ పనులను చేయిస్తున్నది. దయచేసి యివి ఆవేశంతో అంటున్న మాటలని అనుకోకండి. నిజంగానే చాలా గొప్ప వుపద్రవాన్ని మనం ముఖాముఖీగా ఎదుర్కోబోతున్నాం. ఇందులో పాల్గొంటున్న చాలా ప్రముఖులైనవారిని మేము కలుసుకున్నాం. వారు యీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వున్నారు. మనం కనుక యిది పట్టించుకున్నట్లయితే, మన నిత్యజీవితాన్ని సవ్యంగా గడుపుతే, ప్రతిరోజూ మనం ఏం చేస్తున్నామన్న స్పృహ మనలో వుంటే, అప్పుడు భవిష్యత్తు కొంత ఆశాజనకంగా వుంటుంది.

(మీటింగ్ లైఫ్)

ప్రశ్న : మీరు వుపన్యాసాలు యిస్తూ ఎందుకు కాలాన్ని వృధా పుచ్చుతారు; దానికి బదులుగా ప్రపంచానికి క్రియాశీలకంగా ఏదయినా సహాయం చేయచ్చు గదా?

కృష్ణమూర్తి : సరే, 'క్రియాశీలకంగా' అంటే మీ అర్ధం ఏమిటి? ప్రపంచాన్ని మార్చివేసి, యింతకంటే మంచి ఆర్టికమైన సర్దుబాట్లను తేవడమా, మొత్తం సంపద పంపిణీని, సంబంధ బాంధవ్యాలను యింతకంటే మెరుగు పరచడమా? ఇంకా కఠినంగా చెప్పదలుచుకుంటే, మీకు ఒక మంచి వుద్యోగం వెదికి పెట్టడమా? ప్రపంచంలో మార్పు రావాలని మీరు కోరుకుటున్నారు- బుద్దివున్న ప్రతి మనిషీ అదే అనుకుంటున్నాడు. ఈ మార్పును తెచ్చే ఒక పద్ధతిని కోరుతున్నారు మీరు. ఆ విషయకంగా ఏదయినా చేయకుండా వుపన్యాసాలతో కాలాన్ని వృధాచేస్తున్నానని ఆకారణంగా అడుగుతున్నారు. సరే, నేను చేస్తున్నది నిజంగా కాలం వృధా చేయడమేనా? పొత సిద్ధాంతవాదాల స్థానంలో, పాత పద్ధతుల స్థానంలో ఒక కొత్త సూత్రావళిని నేను ప్రచారం చేస్తే అప్పుడది తప్పకుండా కాలం వ్యర్థం చేయడమే అవుతుంది, అవదూ? నేను చేయాలని మీరు కోరుకుంటున్నది బహుశ అదేనేమో? అయితే, ఆచరించడానికి, జీవించడానికి, మంచి వుద్యోగం సంపాదించడానికి, యింతకంటే మంచి లోకాన్ని నిర్మించడానికి మీరు చెప్తున్న క్రియాశీలకమైన ఒక విధానాన్ని సూచించడానికి బదులుగా, ఒక నిజమైన విప్లవం రాకుండా నిరోధిస్తున్న ప్రతిబంధకాలు అసలు ఏవి అనేది తెలుసుకోవడం ముఖ్యం కదూ! విప్లవం అంటే వామ పక్షంవైపుకీ కాదు, మరో పక్కకీ కాదు; మౌలికమైన, సమూలమైన విప్లవం; సిద్ధాంతాలమీద ఆధారపడినది కాదు, ఎందుకంటే, మనం ముందే చర్చించినట్లుగా ఆదర్శాలు, నమ్మకాలు, సిద్ధాంతవాదాలు, మూఢవిశ్వాసాలు అసలు చర్యకు ప్రతిబంధకూలవుతాయి. మన చర్యలు భావాల మీద ఆధారపడినంతవరకు ప్రపంచ పరివర్తన, విప్లవం జరగవు. ఎందుకంటే అప్పుడు కేవలం మరోదానికి ప్రతిస్పందనగా మాత్రమే కార్యాచరణ జరుగుతుంది. అందువల్ల కార్యాచరణ కంటే భావాలకే ప్రాధాన్యం ఎక్కువవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో సరిగ్గా యిదే జరుగుతున్నది, అవును కదూ? కార్యాచరణ జరగాలంటే చర్యలను నిరోధించే ప్రతిబంధకాలు ఏమిటో మనం కనిపెట్టాలి. అయితే మనలో చాలామంది కార్యాచరణ కావాలనుకోవడం లేదు. అదీ మనకున్న క్లిష్టపరిస్థితి. అంతకంటే మనకి చర్చలు జరపడం, ఒక సిద్ధాంతాన్ని తోసేసి, దాని స్థానంలో మరో సిద్ధాంతం పెట్టడమూ యిష్టం. ఆ విధంగా కార్యాచరణ చేయకుండా సిద్ధాంతాలను పట్టుకొని పారిపోతాం. ఇదంతా చాలా స్పష్టంగానే వుంది కదా, వుందా లేదా? ప్రస్తుత సమయంలో ప్రపంచం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నది. జనాభా పెరుగుదల, ఆకలి చావులు, జాతులుగా వర్గాలుగా ప్రజల్లో విభజనలు యింకా యిటువంటివి. జాతీయవాదం వల్ల వచ్చే సమస్యల పరిష్కారం కోసం కొంతమంది కలిసి ఒక బృందంగా ఏర్పడి ఎందుకు ప్రయత్నించరు? ఒక పక్కన మన జాతీయ భావాలను వదలకుండా పట్టుకొని కూర్చుని, అంతర్జాతీయతను సాధించాలని మనం ప్రయత్నిస్తే మళ్ళీ యింకో సమస్యను తయారుచేస్తాం. మనలో చాలామంది చేస్తున్నది యిదే. కాబట్టి నిజంగా చూస్తే ఆదర్శాలే కార్యాచరణను నిరోధిస్తున్నాయని గ్రహించవచ్చు. ఒక రాజకీయ వేత్త, చాలా వున్నతమైన అధికార స్థానంలో వున్న వ్యక్తి, యీ ప్రపంచాన్నంతా ఒక వ్యవస్థ క్రిందకు తెచ్చి, ప్రజలందరికీ తిండి దొరికేటట్లుగా చేయవచ్చని అన్నారు. అప్పుడది ఎందుకు జరగడం లేదు? ఆలోచనల్లో వైరుధ్యాలుండటం వలన, నమ్మకాల వలన, జాతీయ వాదాలున్న కారణంగా జరగడం లేదు. కాబట్టి సిద్ధాంతాలే నిజంగా ప్రజల ఆకలిని తీర్చకుండా నిరోధిస్తున్నాయి. మనలో చాలా మంది భావాలతో ఆటలాడుతుంటారు; తాము చాలా గొప్ప విప్లవకారులమని అనుకుంటారు, క్రియాశీలకం లాంటి మాటలతో మనల్ని మనమే సమ్మోహ పరచుకుంటాం. అసలు ప్రధానమైన సంగతి ఏమిటంటే భావాల నుండి, జాతీయవాదాల నుండి, మతపరమైన అన్ని నమ్మకాలనుండి, విశ్వాసాల నుండి మనల్ని విముక్తి చేసుకోవడం. అప్పుడు, ఒక విధానాన్ని అనుసరించి కానీ, ఒక సిద్ధాంతవాదాన్ని అనుసరించి కాని కాకుండా, అవసరాలకు తగినట్లుగా మనం చర్యలు తీసుకుంటాం, కాబట్టి అటువంటి కార్యాచరణకు అడ్డుతగిలే అవరోధాలను, ప్రతిబంధకాలను ఎత్తి చూపడం కాలాన్ని వ్యర్థం చేయడం ఎంతమాత్రం కాదు, గాలి పోగుచేయడమూ కాదు. మీరు చేస్తున్నది నిస్సందేహంగా అర్ధంలేని పని. మీ భావనలు, మీ నమ్మకాలు, మీ రాజకీయ, ఆర్థిక, మత సంబంధమైన పరమౌషధాలన్నీ వాస్తవంగా ప్రజలను విడదీసి, యుద్ధాలకు దారితీయిస్తున్నాయి, సిద్ధాంతాలనుండి, నమ్మకాలనుండి మనసు విముక్తి పొందినప్పుడే, సవ్యమైన చర్య తీసుకో గలుగుతుంది, దేశ భక్తుడు, జాతీయవాది అయిన వ్యక్తి సహోదరభావం అంటే ఏమిటో ఎప్పటికీ తెలుసుకోలేడు; దాన్ని గురించి అతడు ఎంతయినా మాట్లాడవచ్చు గాక. అంతే కాకుండా అతను ఆర్థిక రంగంలోనూ, యితర రంగాల్లోనూ చేసే పనులు కూడా యుద్ధాన్ని ప్రేరేపించేవిగా వుంటాయి. కాబట్టి సవ్యమైన కార్యాచరణ ద్వారా సమూలమైన, శాశ్వతమైన పరివర్తన రావాలంటే మనసులో అంటే పై పై వుపరితలంలోనే కాదు, మూల మట్టంలోనే సిద్దాంతాలనేవి వుండకూడదు. స్వీయాన్నీ గురించిన ఎరుక ద్వారా, స్వీయాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా మాత్రమే సిద్ధాంతాల నుండి స్వేచ్ఛ పొందడం జరుగుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VI వాల్యూమ్,

1 జనవరి 1950, కొలంబో

ప్రశ్న : మాలో చాలామందికి ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసిన ఒకటే రకం పనులతో విసుగొచ్చేసింది. అయితే యీ పనులు, అంటే ఆ వుద్యోగాలే మా జీవనాధారం. చేస్తున్న పనులతోనే సంతోషంగా జీవించటం మాకు వీలవుతుందా?

కృష్ణమూర్తి : నిజమే, ఆధునిక నాగరికత వ్యక్తిగతంగా మనకి ఏ మాత్రం యిష్టంలేని పనులను మనచేత బలవంతంగా చేయిస్తున్నది. ప్రస్తుతం వున్న సమాజపు నిర్మాణం పోటీలు, నిర్దాక్షిణ్యత యుద్ధం అనే వాటిని ఆధారం చేసుకొని వుంది. దానికి కావలసినది వుదాహరణకి, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులూ అనుకుందాం. ప్రపంచంలో ప్రతి చోటా వీళ్ళ అవసరమే కనబడుతున్నది. ఎందుకంటే యుద్ధపరికరాలని వీళ్ళు యింకా బాగా అభివృద్ధి చేయగలుగుతారు, దయాదాక్షిణ్యాలు లేని యాంత్రికమైన సామర్థ్యాన్ని దేశంలో యింకా పెంపుచేయ గలుగుతారు. కాబట్టి ఒక వ్యక్తిని యింజనీరుగానో, శాస్త్రజ్ఞునిగానో తయారు చేయడానికే విద్యా విధానమంతా నడుంకట్టుకొని కూర్చుంది. అతను వీటికి అర్హుడా కాదా అన్న సంగతి ఎవరికీ అక్కర్లేదు. ఇంజనీరు అవడంకోసం విద్య అభ్యసిస్తున్నవారికి యింజనీరు అవడం అసలు యిష్టమే లేకపోవచ్చు. అతనికి చిత్రకళ మీదో, సంగీతం మీదో, మరోదాని మీద అభిరుచి వుండచ్చు. అయితే పరిస్థితులు- విద్యా విధానం, కుటుంబ సంప్రదాయం, సమాజపు వొత్తిడులు మొదలైనవన్నీ అతన్ని యింజనీరే అయితీరాలని ఆదేశిస్తాయి. ఈ విధంగా ఒకే రకమైన పనులని తయారు చేస్తున్నాం, చాలామంది అందులో చిక్కుకొని పోతున్నారు. ఇక ఆ తరువాత నిస్పృహ,బాధ, అసంతృప్తి వారిని జీవితాంతం వెంటాడుతూ వుంటాయి. ఇది అందరికీ తెలిసినదే.

ముఖ్యంగా యిది విద్యావిధానానికి సంబంధించినది. అవును కదూ? ఒక కొత్తరకమైన విద్యావిధానాన్నీ, అంటే బోధకునికి, విద్యార్థికి యిద్దరికీ కూడా తము చేస్తున్న పని మీద ప్రేమ వుండే విద్యావిధానాన్ని మనం తీసుకురాగలమా? ప్రేమ - ఆ మాటని అచ్చంగా ఆ అర్థంలోనే అంటున్నాను. అయితే, ఎంత సేపూ గెలుపు, అధికారం, పదవి, ప్రతిష్ట సాధించడానికి ఒక సాధనంగా మీ పనిని మీరు వుపయోగించు కుంటుంటే ఆ పని మీద మీకు ప్రేమ వుండదు. ఇప్పుడున్న తీరులో వున్న యీ సమాజం బొత్తిగా విసుగెత్తి పోయిన, ప్రతీరోజూ చేసే పనుల్లో చిక్కుకొని పోయిన వ్యక్తులనే తయారు చేస్తున్నదనడంలో సందేహం లేదు. కాబట్టి, పూర్తిగా భిన్నమైన వాతావరణాన్ని తీసుకొని రావాలంటే, విద్యార్థులు, పిల్లలు తాము చేసేది ప్రేమతో చేయగలిగే వాతావరణంలో పెరగాలంటే, విద్యావిధానంలోను, యితర విషయాల్లోనూ కూడా ఒక బ్రహ్మాండమైన విప్లవం రావలసిన అవసరం వుంది. లేదూ? ప్రస్తుత పరిస్థితుల్లో, ఒకే రకమైన పనులు ప్రతిరోజూ చేయడం, విసుగెత్తిపోవడం మనం భరించవలసి వస్తున్నది. అందుకని రకరకాల మార్గాల్లో పారిపోవడానికి ప్రయత్నిస్తూ వుంటాం. వినోద కాలక్షేపాలు, టెలివిషన్, రేడియో, పుస్తకాలు, మతం అనీ మనం పిలిచేది మొదలైన వాటిలోపడి పారిపోవాలని ప్రయత్నిస్తూ వుంటాం. అందువల్ల మన జీవితాలు డొల్లగా, శూన్యంగా, మందకొడిగా తయారవుతాయి. ఇట్లా డొల్లగా వుండటం వల్ల ఆధిపత్యానికి తలవంచడం పెరుగుతుంది. దానివల్ల మనం లోకంతో పాటు కలిసి వున్నామనే భావం, కొంతబలం ఒక స్థానం మనకి దొరుకుతాయి. ఇదంతా మనకు హృదయగతంలో తెలుస్తునే వుంటుంది. కాని యిందులో నుంచి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే బయటపడాలంటే కావలసినది అతి సాధారణమైన భావోద్వేగంకాదు; దానికి అత్యంతంగా ఆవశ్యకమైనవి ఆలోచన, శక్తి,కృషి.

కాబట్టి, మీరు కనుక ఒక నూతన ప్రపంచాన్ని తయారు చేయాలనుకుంటే, మానవులు అనుభవించిన యీ భయంకరమైన యుద్ధాలూ, యీ క్షోభా, యీ ఘోరాలు చూశాక తప్పక తయారు చేసి తీరాలి. అప్పుడు ఒక మత విషయైక విప్లవం మనలో ప్రతి ఒక్కరిలో వచ్చి తీరాలి. ఆ విప్లవం ఒక నవ్య సంస్కృతినీ, ఆసాంతం కొత్తదైన ఒక మతాన్నీ- అది ఆధిపత్యంతో కూడిన, పురోహితుల ఆచారవిధులతో కూడిన, మూఢ విశ్వాసాలు, కర్మకాండలతో కూడిన మతం కాదు - తీసుకువస్తుంది. అన్ని విధాలా భిన్నమైన ఒక సమాజాన్ని తయారు చేయాలంటే యీ మత విషయైక విప్లవం వచ్చి తీరాలి. అంటే వ్యక్తి లోలోపలే జరిగే విప్లవం; అంతే తప్ప నియంతృత్వాన్ని, బోధలని, భయాన్ని పెంచి పోషించే ఆ ఘోరమైన రక్తపాతాల విప్లవం కాదు. ఒక నూతన ప్రపంచాన్ని- అంటే పూర్తిగా భిన్నమైన అర్థంలో కొత్తదానిని మనం నిర్మిస్తే, అప్పుడది మన అందరి ప్రపంచం అవుతుంది; ఒక జర్మన్ ప్రపంచమో, రష్యన్ ప్రపంచమో, హిందూ ప్రపంచమో ఆవకూడదు. ఎందుకంటే మనమంతా మానవులం, యీ భూమి మనది.

అయితే, దౌర్భాగ్యం ఏమిటంటే, మనలో చాలా తక్కువ మంది వీటిని గురించి లోతుగా ఆలోచిస్తారు. ఎందుకంటే దీనికి ప్రేమ ఆవశ్యకమవుతుంది, భావోద్వేగం కాదు, ఆవేశతత్వం కాదు. ప్రేమ చాలా దుర్లభమైనది. భావోద్వేగంతోను, ఆవేశంగానూ వుండేవారు సాధారణంగా చాలా క్రూరంగా వుంటారు. పూర్తిగా భిన్నమైన ఒక కొత్త సంస్కృతిని తేవాలంటే మనలో ప్రతి ఒక్కరిలోనూ యీ మతపరమైన విప్లవం జరగాలని నాకు అనిపిస్తున్నది. అంటే అర్థం స్వేచ్ఛ పొందాలని. మత సూత్రాలన్నిటి నుండీ, అంధ విశ్వాసాలన్నిటినుండే కాదు, వ్యక్తిగతమైన ఆకాంక్షా పరత్వం నుండి, స్వార్థపూరిత కార్యకలాపాల నుండి కూడా స్వేచ్ఛ పొందాలి. అప్పుడు మాత్రమే ఒక నూతన ప్రపంచం ఆవిర్భవించ గలుగుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, X వాల్యూమ్,

హేంబర్గ్, 15 సెప్టెంబర్, 1956.


ప్రశ్న : నేను, నా భార్య ఎప్పుడూ పోట్లాడుకుంటూ వుంటాం. మా యిద్దరికీ ఒకరంటే మరొకరికి యిష్టమే. అయినా ఎందువల్లో యీ కీచులాటలు వస్తూనే వుంటాయి. చాలా అసహ్యంగా తయారయింది యిదీ. ఇదంతో మానేయ్యాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాం. కాని యిద్దరమూ మానసికంగా ఒకరి నుంచి యింకొకరం స్వతంత్రంగా వుండలేకపోతున్నాం. మీ సలహా ఏమిటి?

కృష్ణమూర్తి : ఆధారపడటం అన్నది వున్నంతవరకు వొత్తిడి తప్పదు. నేను ఒక సఫలత సాధించడం కోసంగాను, అసంఖ్యాకమైన ప్రజలకు వుపన్యాసాలు యిచ్చే గొప్పవాడినని అనుకోవడానికి గాను శ్రోతలుగా మీ ఆలంబనాన్ని కోరుతుంటే, అప్పుడు నేను మీ మీద ఆధారపడుతున్నానన్నమాట, మిమ్మల్ని స్వలాభం కోసం పువయోగించుకుంటున్నాను, మానసికంగా నాకు మీ అవసరం వుంది. ఈ ఆధారపడటాన్ని ప్రేమ అంటున్నాం. మన సంబంధ బాంధవ్యాలన్నీ దీని మీదే నిర్మించుకున్నాం. మానసికంగా నాకు మీ అవసరం వుంది, మీకూ మానసికంగా నా అవసరం వున్నది. మీకు నాకు మధ్యన వున్న బాంధవ్యంలో, మానసికంగా నాకు మీరు చాలా ముఖ్యులు అవుతారు. ఎందుకంటే మీరు నా అవసరాలు తీరుస్తున్నారు. ఒక్క శారీరకంగానే కాదు, అంతర్గతంగా కూడా మీరు లేకపోతే నేను అయోమయమై పోతాను, సందిగ్ధంలో పడిపోతాను. మీ మీద నేను ఆధారపడుతున్నాను; మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆ ఆధారపడటం గురించి సందేహాలు రేకెత్తినప్పుడల్లా సందిగ్ధంలో పడతాను. అప్పుడు భయం కలుగుతుంది. ఈ భయాన్ని దాచడానికి రకరకాల కపటవేషాలు వేస్తాను. భయం బారినుండి తప్పించుకొని పోవడానికి అవి సహాయం చేస్తాయి. మనకి యిదంతా తెలుసు. మనలో వున్న శూన్యాన్ని, మనలో వున్న వొంటరితనాన్నీ కప్పిపుచ్చడానికి సాధనాలుగా ఆస్తిని, సమాచారాన్ని, దేవుళ్ళనీ, రకరకాల భ్రాంతులను, బాంధవ్యాలను వుపయోగిస్తూ వుంటాం. అందువల్ల అవన్నీ చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించు కుంటాయి. మనకి పలాయన మార్గాలుగా వుపయోగపడుతున్న వాటి విలువ బ్రహ్మాండంగా ఎక్కువవుతుంది. కాబట్టి ఆధారపడటం అన్నది వున్నంతవరకు భయం వుండి తీరుతుంది. అది ప్రేమకాదు. దానిని ప్రేమ అని మీరు పిలవవచ్చు; దానికి ఒక చక్కని, శ్రావ్యమైన మాట తొడిగి కప్పి పుచ్చవచ్చు. అయితే వాస్తవంలో దాని అడుగున వున్నది ఖాళీతనం. ఏ చికిత్సా విధానానికీ లొంగని ఒక గాయం అక్కడ వున్నది. దాని ఎడల స్పృహ వున్నప్పుడు, దాని ఎరుక కలిగినప్పుడు, దానిని అవగాహన చేసుకున్నప్పుడు అది అంతమై పోతుంది. వివరణల కోసం మీరు వెతకనప్పుడు మాత్రమే అవగాహన కలుగుతుంది. చూడండి, యీ ప్రశ్న అడిగినవారు ఒక వివరణ అవసరమని కోరుతున్నారు. నేను చెప్పే నాలుగు మాటలు అతనికి కావాలి. మాటలతోనే మనం తృప్తిపడిపోతోం. ఆ కొత్త వివరణను- అందులో అసలు కొత్తదనం అంటూ వుంటేదాన్ని మీరు మళ్ళీ మళ్ళీ పారాయణ చేస్తారు. అయితే సమస్య మాత్రం యింకా అట్లాగే వుంటుంది; కీచులాటలు యింకా సాగుతూనే వుంటాయి.

అయితే యీ ఆధారపడటం అనే ప్రక్రియని- బాహ్యంగా కనబడేవి, అంతర్గతంగా దాగివుండే ఆధారపడటాలని, మనోతత్వ సంబంధమైన వాంఛలను, 'మరింత' ఎక్కువ కావాలనే ఒత్తిడులనూ- వీటన్నింటినీ కనుక అర్ధం చేసుకుంటే, అప్పుడు మాత్రమే 'ప్రేమ' వుండటానికి తప్పక అవకాశం వుంటుంది. ప్రేమ వ్యక్తి నాశ్రయించుకొని వుండదు, నిరాధారంగానూ వుండదు. అది ఒక అస్తిత్వపు స్థితి. అది మనసుకు సంబంధించినది కాదు. మనసు దానిని సంపాదించుకోలేదు. ప్రేమని మీరు అభ్యాసం చేయలేరు. ధ్యానం ద్వారా కూడా దానిని పొందలేరు. భయం లేనప్పుడు, ఆందోళనా భావం, ఒంటరితనం అంతమైపోయినప్పుడు, ఆధార పడటమూ, స్వాధీనం చేసుకోవడమూ లేనప్పుడు ప్రేమ జనిస్తుంది. మనల్ని మనం అవగాహన చేసుకున్నప్పుడే, మన లోపల దాగివున్న వుద్దేశ్యాలను మసం పూర్తిగా గ్రహించుకున్నప్పుడు, మనసు తన లోలోపలి లోతులలోకి ఒక సమాధానమో, ఒక వివరణో వెతకకుండా తొంగి చూసుకో గలిగినప్పుడు, తన లోపలి ప్రతిదానికీ ఒక పేరు తగిలించడం ఆపివేసినప్పుడు అది జనిస్తుంది.

నిజంగా మన దురవస్థల్లో ఒకటి ఏమిటంటే, మనలో చాలామంది జీవితంలోని పై పై కృత్రిమ విషయాలతో- ముఖ్యంగా వివరణలలో- సంతృప్తి పడిపోతారు. వివరణలు యివ్వగానే అన్నీ పరిష్కారం అయిపోయాయని అనుకుంటారు. వివరణలు యివ్వడం మనసు సాగించే ఒక కార్యకలాపం. దేనికైనా సరే, ఒక పేరు తగిలించ గలిగామంటే, ఫలానాదీ ఆనీ గుర్తించగలిగామంటే చాలు. ఎంతో సాధించేశామని అనుకుంటాం. గుర్తించడం, పేరు పెట్టడం, వివరణ యివ్వడం అనేవి ఏవీ లేని తత్వం ఒకటి వున్నదంటేనే మనసు గందరగోళంగా అయిపోతుంది. వివరణలు అనేవి లేనప్పుడే, మాటలలో మనసు చిక్కుకొని పోనప్పుడే, ప్రేమ జనించడానికి ఆస్కారం వుంటుంది.

(ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VI వాల్యూమ్,

లండన్, 15 ఏప్రిల్ 1952

ప్రశ్న : ఏ సమాజ వ్యవస్థలోనైనా వివాహం అన్నది తప్పక అవసరం. కానీ మీరు మొత్తం వివాహవ్యవస్థనే వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఏమంటారు? దయచేసి యీ సెక్స్ అనే సమస్యను కూడా వివరించండి. ప్రస్తుతం వున్న అతి ముఖ్యమైన సమస్యల్లో యుద్ధం తరువాత స్థానాన్ని ది ఆక్రమిస్తున్నది. ఇది ఎందుకు యిట్లా తయారైంది?

కృష్ణమూర్తి : చాలా సునాయాసంగా ఒక ప్రశ్న అడగవచ్చు. అయితే అసలు సమస్యలో లోతులను చాలా జాగ్రత్తగా పరికించడమే ప్రయాసతో కూడుకున్న పని. అందులోనే సమాధానం వుంటుంది. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే దానిలో పెనవేసుకొని వున్న ఎన్నో అంతర్గర్భితమైన వాటిని కూడా చూడాలి. మనకు వున్న సమయం చాలా కొద్ది కాబట్టి అది చేయడం కష్టం. అందుకని క్లుప్తంగా చెప్పవలసి వస్తున్నది, చాలా శ్రద్ధతో మీరు వినకపోయినట్లయితే అర్థంచేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. సమాధానాన్ని కాకుండా అసలు సమస్యనే తరచి విచారిద్దాం. ఎందుకంటే సమాధానం సమస్య లోపలే వున్నది తప్ప ఎక్కడో దూరంగా లేదు. సమస్యను స్పష్టంగా అర్థం చేసుకుంటున్న కొద్దీ, సమాధానం కూడా స్పష్టమవుతూ వుంటుంది. కేవలం సమాధానం కొరకే వెతికినట్లవుతే అది మీకు దొరకదు. ఎందుకంటే సమాధానం కోసం సమస్యకు అవతలగా ఎక్కడో వెతుకుతూ వుంటారు. వివాహాన్నే తీసుకుందాం. సైద్ధాంతికంగా కాదు, ఆదర్శంగా కాదు. అట్లాచూస్తే అది పరమ మూర్ఖత్వం. వివాహాన్ని ఒక ఆదర్శవాదంగా చేయవద్దు, ఉన్నదానిని వున్నట్లుగా చూద్దాం. అప్పుడే ఆ విషయంలో ఏదయినా చేయగలుగుతాం. అది ఒక పూలబాట అన్నట్లుగా చిత్రించుకుంటే యిక దానిని గురించి ఏ చర్యా తీసుకోలేము. దానివైపు పరికించి చూసి, వున్నదానిని వున్నట్లుగా కనుక చూస్తే, అప్పుడు చర్యతీసుకోవడం బహుశ సాధ్యపడవచ్చు.

సరే, వాస్తవంలో అసలు ఏం జరుగుతుంది? యౌవనంలో వున్నప్పుడు శరీర సంబంధమైన, సెక్స్ సంబంధమైన వాంఛ చాలా తీవ్రంగా వుంటుంది. దీనికి హద్దులు ఏర్పరచడం కోసం వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇరు పక్షాలలోను యీ శరీర సంబంధమైన వాంఛ వుంటుంది. అందువల్లనే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని కంటున్నారు. ఒక పురుషుడికో, ఒక స్త్రీకో జీవిత పర్యంతం మిమ్మల్ని కట్టి వేసుకుంటుంటారు. ఈ విధంగా సుఖాన్ని అందించడానికి ఒక శాశ్వతమైన ఏర్పాటూ, మీ భద్రతకు హామీ లభిస్తాయి. దీని ఫలితంగా క్రమక్రమంగా మీరు క్షీణించిపోతారు. అలవాటు అనే చక్రంలో పడి, జీవిస్తూ వుంటారు. అలవాటు అంటే క్షీణించి పోవడం. ఈ శరీర సంబంధమైన, సెక్స్ సంబంధమైన వాంఛను అవగాహన చేసుకోవాలంటే విశేషమైన తెలివి వుండాలి. అయితే యింత వివేకం మనలో కలిగేలా మనకి విద్యాబోధన చేయడంలేదు. కలిసి జీవితం గడపవలసిన పురుషునితో లేదా స్త్రీతో ఎట్లాగో ఒకలాగా నెట్టుకొని పోతుంటాం. 20, 25 ఏళ్ళ వయసులో నేను పెళ్ళి చేసుకుంటాను. ఇక తక్కిన జీవితకాలమంతా, ఆ స్త్రీ గురించి నాకు ఏమీ తెలియకపోయినో ఆమెతో నేను గడిపితీరాలి. ఆమెను -గురించి నాకు కాస్తయినా తెలియదు. అయినా జీవితాంతం ఆమెతో నేను జీవించాలని మీరు అంటున్నారు. వివాహం అనే పేరుతో మీరు పిలుస్తున్నది యిదేనా? నేను ఎదుగుతున్న కొద్దీ, పరిశీలిస్తున్న కొద్దీ, ఆమెకూ నాకూ మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి. ఆమె వేరూ అనీ, ఆమె అభిరుచులు పూర్తిగా భిన్నమైనవనీ గ్రహిస్తాను. ఆమెకి క్లబ్బులకి వెళ్ళడం అంటే చాలా యిష్టం. నాకేమో గంభీరమైన విషయాల్లో ఆసక్తి; లేదూ ఆమెకి యిందులోనూ నాకు అందులోనూ ఆసక్తి, అయినా కూడా మీకు పిల్లలు కలుగుతారు. అదే యిందులో వున్న వింత. సర్! స్త్రీలవైపు చూస్తూ చిరునవ్వులు చిందించకండి. ఇది మీ సమస్య. సరే, నేనొక భాంధవ్యాన్ని స్థిరపరచుకున్నాను. దానిలోని విశిష్టత ఏమిటో నాకే తెలియదు. అదేమిటో నేను కనిపెట్టనూ లేదు, అవగాహనా చేసుకోలేదు.

చాలా చాలా కొద్దిమందికీ, ప్రేమించే వారికి మాత్రమే వివాహ బాంధవ్యానికి వున్న విలువ తెలుసు. వారికి అది విడదీయరానిది. కేవలం ఒక అలవాటు వంటిదో, ఒక సౌకర్యం వంటిదో కాదు. అది శరీర సంబంధమైన, సెక్స్ సంబంధమైన అవసరాల మీద ఆధారపడినది కాదు. ఏ నిబంధనలు లేని ఆ ప్రేమలో వ్యక్తిత్వాలు పూర్తిగా కలిసి ఒకటై పోతాయి. అటువంటి బాంధవ్యంలోనే వుపశాంతి లభిస్తుంది. ఆశ వుంటుంది. అయితే మీలో చాలామందిలో మీమీ వివాహా బాంధవ్యాల్లో యిటువంటి ఐక్యత వుండదు. వేరువేరుగా వున్న రెండు వ్యక్తిత్వాలు కలసి ఒకటై పోవాలంటే, మీమ్మల్ని మీరు తెలుసుకోవాలి, ఆమె తనని తాను తెలుసుకోవాలి. దీని అర్థమే ప్రేమ. కాని మీకు ప్రేమ లేదు, అదీ స్పష్టంగా కనబడుతున్న వాస్తవం. ప్రేమ ఎప్పుడూ కొత్తగా, నవ్య నూతనంగా వుంటుంది. అది కేవలం కోరికలు తృప్తి పరచుకోవడం కాదు. వట్టి అలవాటూ కాదు. దానికి ఏ షరతులు వుండవు. మీ భర్తని, లేదో భార్యని మీరు యీ విధంగా చూడరు. అవునా? మీ ఏకాంతవాసంలో మీరు నివసిస్తుంటారు, తన ఏకాంతవాసంలో ఆమె నివసిస్తుంటుంది. అయినా నిరాటంకంగా సెక్స్ సుఖపు అలవాట్లను సాగించుకుంటూ వుంటారు, ఒక స్థిరమైన ఆదాయం క్రమం తప్పకుండా వస్తూ వుంటే ఆ వ్యక్తి ఏమై పోతాడు? నిస్సందేహంగా దిగజారి పోతాడు. మీరా సంగతి గమనించలేదూ? స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్న ఒక వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. అతని బుద్ధి అతివేగంగా శుష్కించి పోతూ వుండటం మీరు చూడవచ్చు. అతను గొప్ప పదవిలో వుండవచ్చు, మహా చాతుర్యంగల వాడనే ఖ్యాతి వుండచ్చు. అయితే జీవితంలోని అసలైన ఆనందాన్ని మాత్రం అతను కోల్పోయాడనే చెప్పాలి.

అదే విధంగా మీ వివాహం- నిరంతరంగా సుఖాన్ని అందిస్తూ వుండే ఒక శాశ్వతమైన గని. అవగాహన అన్నది లేనీ, ప్రేమ అన్నదీ లేని ఒక అలవాటు. అందులోనే మీరు జీవించక తప్పదు. మరో గత్యంతరం లేదు. ఫలానా విధంగా మీరు చేయాలి అని నేను చెప్పడం లేదు. కానీ అసలు సమస్యవైపు దృష్టి సారించమంటున్నాను. అదంతా సబబుగా వుందని మీరనుకుంటున్నారా? అంటే మీ భార్యని వదిలేసి మీరు మరొకరి వెంటపడాలని కాదు అర్థం. అసలు యీ బాంధవ్యంలోని అర్థం ఏమిటి? ప్రేమించడం అంటే అన్యోన్యత. మీ భార్యతో మీకు అన్యోన్యమైన సంబంధం వున్నదా? శారీరకంగా కాకుండా ఆమెని గురించి మీకు తెలుసా, ఆమె శరీరం కాక? ఆమెకి మీ గురించి తెలుసా? మీ యిద్దరూ ఎవరి ఏకాంతవాసంలో వారు వుంటూ, మీ మీ స్వాభిలాషలు నెరవేర్చుకుంటూ, మీ ఆకాంక్షలు, మీ అవసరాలు వెతుక్కుంటూ, మీ విషయ తృప్తికై, ఆర్థికమైన లేదా మానసికమైన భద్రతకై ఒకరినొకరు వుపయోగించుకోవడం లేదూ? ఇటువంటి బాంధవ్యం నిజమైన బాంధవ్యం కానే కాదు- ఇది మానసిక, శారీరక, ఆర్థిక అవసరాలను పరస్పరమూ స్వార్థ పూరితంగా నెరవేర్చుకొనే ఒక విధానం- దీనిలో నుంచి సంఘర్షణ, క్షోభ, సాధించుకోవడం, స్వంతంచేసుకోవాలనే ఆదుర్దా, అసూయ మొదలైనవి పుట్టుకొస్తాయనడంలో సందేహం లేదు. ఇటువంటి బాంధవ్యం ఫలితంగా వికృతమైన శిశువులు, వికృతమైన నాగరికత తప్ప మరొకటి జనిస్తుందా? కాబట్టి యీ ప్రక్రియనంతా, యిదంతా అసహ్యకరమైనది అని కాకుండా, మీ కళ్ళముందు జరుగుతున్న ఒక నిజమైన వాస్తవం అని గ్రహించడం ముఖ్యం. అది గ్రహించాక, అప్పుడు మీరు ఏం చేస్తారు? దానిని అట్లాగే వదిలివేయలేరు కాబట్టి, అయినా దానివైపు చూడటం మీకు యిష్టం లేదు కాబట్టి, త్రాగుడునో, రాజకీయాలనో, సమీపంలో వున్న మరో స్త్రీనో అలవరచుకుంటారు. ఏదయినా ఫరవాలేదు, అదీ మీ యింటినుంచీ, సాధించే మీ భార్యనుంచో లేదా భర్త నుంచో దూరంగా తీసుకొనిపోతే చాలు. ఆ విధంగా సమస్యని పరిష్కరించి వేశానని అనుకుంటారు. అదీ మీ జీవితం. కాదంటారా? అందువల్ల, యీ సంగతేదో మీరు తేల్చుకోవాలి. అంటే సమస్యని నేరుగా ఎదుర్కోవాలి అని అర్థం. అంటే ఏమిటంటే, అవసరమైతే విడిపోవాలి. ఎందుకంటే తల్లిదండ్రి అస్తమానం ఒకరి నొకరు సాధించుకుంటూ, పేచీలు పడుతూవుంటే దాని ప్రభావం పిల్లల మీద పడకుండా వుంటుందా?

కాబట్టి వివాహాన్ని ఒక అలవాటుగా, ప్రతిరోజూ సుఖాన్ని అందజేసేదానిగా అలవరచుకుంటే, అది మనిషి దిగజారిపోవడానికి కారకమవుతుంది. ఎందుకంటే అలవాటులో ప్రేమ వుండదు. ప్రేమ అలవాటయిపోదు. ప్రేమ అంటే చాలా వుల్లాసకరమైనది. సృజనాత్మకమైనది. నవ్యనూతనమైనది. అందుకని అలవాటు ప్రేమకి పూర్తిగా ప్రతికూలమైనది. అయితే మీరు అలవాటులో చిక్కుకుపోయారు. ఎదుటివారితో మీ బాంధవ్యం అలవాటుగా మారిందంటే అది నిస్సందేహంగా నిర్జీవమై పోయినట్లే. కాబట్టి మనం మళ్ళీ అసలు మూలవిషయానికే వస్తున్నాం. అది ఏమిటంటే సమాజ సంస్కరణ జరగాలంటే అది మీ మీదే ఆధారపడి వుంది. న్యాయశాసనాల మీద కాదు. చట్టాల వల్ల మళ్లీ కొత్త అలవాట్లు, లొంగి పోయివుండటం ఎక్కువవుతాయి, అంతే. కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు ఏదయినా చేయాలి- చర్య తీసుకోవాలి. అయితే మీ మనసు, హృదయమూ జాగృతం అయినప్పుడే చర్య తీసుకోగలుగుతారు. మీలో కొంతమంది నాతో ఏకీభవిస్తున్నట్లుగా తలలు ఆడిస్తున్నారు. కానీ పరిణామమూ, మార్పూ తీసుకొనివచ్చే బాధ్యత మీపై వేసుకోవడం మీకు యిష్టంలేదనే వాస్తవం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది, సవ్యంగా జీవించడం ఎట్లా అన్నది కనిపెట్టడం అనే పెద్ద అల్లకల్లోలాన్ని నెత్తిన వేసుకోవడం మీకు యిష్టం వుండదు. అందువల్ల సమస్య అట్లాగే వుండిపోతుంది. కలహించుకుంటుంటారు, మళ్ళీ సర్దుకుపోతుంటారు; చివరకు మీరు చనిపోతారు, చనిపోతే ఏడవడానికి ఎవరో ఒకరు వుంటారు. ఏడుపు చనిపోయినవారిని గురించి కాదు, తను ఒంటరితనం తలుచుకొని. ఏ మార్పూ లేకుండానే మీరు గడిపివేస్తూ వుంటారు. అయినా, చట్టాలు చేయగల, గొప్ప పదవులు చేపట్టగల, దేవుణ్ణి గురించి మాట్లాడగల, యుద్ధాలు ఆపే మార్గాలు కనుక్కోగల గొప్ప మానవులం అని మీరు అనుకుంటుంటారు. వీటివల్ల ఏం లాభంలేదు. ఎందుకంటే అసలు ముఖ్యమైన విషయాలని మీరు పరిష్కరించనే లేదు.

ఇక, సమస్యలోని రెండో భాగం సెక్స్; సెక్స్ కి యింతకి ప్రాముఖ్యం ఎందుకు వచ్చిందీ అని ఈ వాంఛ మీమీద యింతటి ప్రాబల్యం ఎట్లా సంపాదించింది? అని మీరెప్పుడైనా ఆలోచించారా? అందులో మునిగితేలుతూ వుంటారు కాబట్టి ఆ సంగతి మీరెప్పుడూ ఆలోచించలేదు. అసలు యి సమస్య ఎందుకున్నది అన్నది కూడా మీరెప్పుడూ అన్వేషించలేదు. సర్! యీ సమస్య ఎందుకు కలిగిందని మీరు అనుకుంటున్నారు? దానితో తలపడాల్సివచ్చినప్పుడు దానిని పూర్తిగా అణచి వేసుకుంటే ఏమవుతుంది - బ్రహ్మచర్యం అనే ఆదర్శం మొదలైనవి మీకు తెలుసు. అప్పుడు ఏం జరుగుతుంది? సమస్య అట్లాగే వుండిపోతుంది. స్త్రీని గురించి ఎవరైనా మాట్లాడితే మీరు సహించలేరు మీలో వున్న లైంగిక వాంఛలను పూర్తిగా అణుచు కోవడం ద్వారా సమస్యని పరిష్కారం చేయచ్చని మీరనుకుంటారు, కాని అది మిమ్మల్ని వదలకుండా వెంటాడుతుంది. ఇది ఎట్లా వుంటుందంటే ఒక యింట్లో మీరు నివసిస్తూ, వికారంగా వుండే వస్తువులన్నీ ఒక గదిలో పడేసి దాచినట్లు. అయితే అవన్నీ యింకా యింట్లోనే వుంటాయి. కాబట్టి, క్రమశిక్షణ ద్వారా యీ సమస్యని పరిష్కారం చేయలేము. క్రమశిక్షణ అంటే యిక్కడ నిగ్రహంచుకోవడం, అణచివేసుకోవడం, మనసు మరో దాని మీదకు మళ్ళించడం. ఇవన్నీ మీరు ప్రయత్నించారు. బయటపడే మార్గం యిది కాదు. మరి ఏది దారి? సమస్యని అవగాహన చేసుకోవడమే మార్గం. అవగాహన చేసుకోవడం అంటే ఖండించడమూ కాదు, సమర్ధించడమూ కాదు. అదేమిటో యిప్పుడు మనం చూద్దాం.

మీ జీవితాల్లో సెక్స్ యింత ప్రధానమైన సమస్యగా ఎందుకు తయారయింది? లైంగిక చర్య, ఆ భావన తననితాను మరిచిపోవడానికి ఒక మార్గం కాదూ? నేను అంటున్నదేమిటో మీకు అర్ధం అవుతున్నదా? ఆ చర్యలో యిద్దరూ సంపూర్ణంగా ఐక్యం కావడం జరుగుతుంది. ఆ క్షణంలో సంఘర్షణలన్నీ పూర్తిగా ఆగిపోతాయి. అపారమైన సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన అస్తిత్వంతో వుండవలసిన అవసరం అప్పుడు మీకు వుండదు. పైగా ఎప్పుడు మిమ్మల్ని నమిలివేస్తూ వుండే భయం కూడా అప్పుడు వుండదు. అంటే అర్ధం, ఒక క్షణం సేపు స్వీయ స్పృహ మాయమవుతుంది. మిమ్మల్ని మీరు మర్చిపోవడంలో వుండే నిర్మలత్వం, స్వార్థాన్ని తోసివేయడంలో వుండే ఆనందం మీకు తెలుస్తాయి. సెక్స్ చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది, ఎందుకంటే జీవితంలో ఏ వైపు చూసినా సంఘర్షణలతోను, అహాన్ని పెంచుకోవడంలోను, నిరాశానిస్పృహలలోను మీరు గడుపుతుంటారు కాబట్టి, సర్! మీ జీవితం వైపు రాజకీయ, సామాజిక, మతపరమైన మీ జీవితాలవైపు మీరే ఒకసారి చూసుకోండి. ఏదో అవాలని మీరు ఎప్పుడూ ప్రయాసపడుతూ వుంటారు. రాజకీయాల్లో గొప్ప అధికారస్థానంలో వుండాలనీ, హోదా, ప్రతిష్ఠ సంపాదించాలనీ కోరుకుంటుంటారు. మీ దృష్టి యింకెవరి వైపో తిప్పకండి. మంత్రుల దిక్కుగా చూడకండి. అవన్నీ మీకు దొరికితే మీరూ అట్లాగే ప్రవర్తిస్తారు. కాబట్టి, రాజకీయాల్లో ప్రయాసపడుతున్నారు, మిమ్మల్ని మీరు యింకా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు, అవునా కాదా? దానివల్ల మీరు సంఘర్షణను సృష్టిస్తున్నారు. 'నా' ను కాదనలేరు, వదులుకోలేరు. పైగా 'నా' కు యింకా ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంటారు. ఇతర విషయాలకు సంబంధించి కూడా, ఆస్తిపాస్తుల అధికారం విషయంలో, మీరు అనుసరించే మతవిషయంలో యిదే పద్ధతి అవలంబిస్తుంటారు. మీరు చేస్తున్న వాటిల్లో, మీరు పాటిస్తున్న మతాచారాల్లో అర్ధంలేదు. వట్టి నమ్మకం, అంతే. కొన్ని పేర్లనీ, మాటలనీ పట్టుకొని వేళ్ళాడుతుంటారు. పరిశీలించి చూశారంటే అక్కడ కూడా కేంద్రస్థానం అయిన 'నా' గురించిన స్పృహ నుండి స్వేచ్ఛ లేదు. ఒక పక్కన మీ మతం అహాన్ని మర్చిపొమ్మని చెప్తూనే వుంటుంది. కాని మీ పద్ధతి అంతా మీ స్వార్దానికి యింకా బలం చేకూర్చుకోవడానికే; మీరే అన్నింటికంటే అతి ముఖ్యమైన జీవి. గీత చదువుతారు, బైబిల్ చదువుతారు. కాని మీరు మాత్రం మంత్రిగానే మిగిలిపోతారు. బలహీనుల్ని దోపిడీ చేస్తూ, ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ, గుళ్ళూ గోపురాలూ కట్టిస్తూ వుంటారు.

కాబట్టి ఏ రంగంలో, ఏ కార్యకలాపంలో మునిగితేలుతున్నా మీ స్వార్థాన్ని, మీ ప్రాముఖ్యతను, మీ ప్రతిష్టను, మీ భద్రతను గట్టిచేసుకుంటుంటారు. అందువల్ల స్వార్థాన్ని మర్చిపోవడానికి ఒకే ఒక మార్గం మిగిలింది. అదే సెక్సు. అందుకని ఆ స్త్రీకాని, ఆ పురుషుడు కాని మీకు చాలా ముఖ్యం అవుతారు. అందుకని వారిని మీరు స్వంతం చేసుకొని తీరాలి. కాబట్టి యీ స్వంతం చేసుకోవడాన్ని అమలులో పెట్టి, స్వాధీనంలో వుంచుకునే భరోసాను సమకూర్చే సమాజాన్ని మీరు నిర్మించుకుంటారు. తక్కిన అన్నింటిలోనూ 'నేను' కే ప్రాధాన్యం; సహజంగానే సెక్స్ చాలా ముఖ్యమైన సమస్య అయి కూర్చుంటుంది. సర్! యిటువంటి స్థితిలో పరస్పర వైరుధ్యాలు లేకుండా, బాధ లేకుండా, నిస్పృహ లేకుండా జీవించడం సాధ్యం అని మీరనుకుంటున్నారా? అయితే మతంలో కాని, సామాజిక కార్యకలాపాల్లో కాని నిజంగానే, చిత్త శుద్ధిగా స్వార్థచింతన లేనప్పుడు సెక్స్ కు యింత పెద్ద స్థానం వుండదు. రాజకీయాల్లో గాని, సమాజంలో గానీ, మత విషయాల్లో కానీ, ఏ గొప్పా లేకుండా సొమాన్యంగా వుండిపోవాలంటే మీకు భయం. కాబట్టి సెక్స్ ఒక సమస్య అవుతున్నది. ఈ విషయాలన్నింటిలోనూ మీరు కనుక తగ్గిపోయి వుండటానికి, సామాన్యులుగానే వుండటానికి వొప్పుకుంటే, అప్పుడు సెక్స్ అసలు సమస్యే కాదని మీరు గ్రహిస్తారు.

ప్రేమ వున్నప్పుడు మాత్రమే సౌశీల్యం వుంటుంది. ప్రేమ వున్నప్పుడు సెక్స్ ఒక సమస్య అవదు. ప్రేమ లేకుండా బ్రహ్మచర్యం అనే ఆదర్శాన్ని సాధించాలను కోవడం అసంబద్ధం. ఎందుకంటే ఆదర్శం నిజంకాదు, భ్రమ. మీరు ఏమిటో, అది నిజం. మీ మనసుని, మీ మనసు చేసే పనులని మీరే అవగాహన చేసుకోక పోతే సెక్స్ ని కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే సెక్స్ మనసుకి సంబంధించినది. సమస్య అంత చిన్నదేమీ కాదు. కొన్ని అలవాట్లను అభ్యాసం చేసుకోవడం వల్ల ఏ లాభమూ జరగదు. తోటి మనుష్యులతో, ఆస్తిపాస్తులతో, సిద్ధాంతాలతో మీకుండే సంబంధ బాంధవ్యాలను గురించి అపారమైన ఆలోచన, లోతైన పరిశోధన అవసరం, సర్! దీని అర్థం ఏమిటంటే మీరు మీ హృదయాన్ని, మీ మనసును అత్యంతమైన కఠిన పరిశీలనకి గురి చేయాలి. ఆ విధంగా మీలో ఒక సంపూర్ణ పరివర్తనాన్ని తీసుకొనిరావడం జరుగుతుంది. ప్రేమ అంటేనే పవిత్రమైనది. ప్రేమ వున్నప్పుడు అంటే మనసు సృష్టించిన పవిత్రత అనే ఒక వూహ కాకుండా, నిజమైన ప్రేమ వున్నప్పుడు యీ సెక్స్ ఒక సమస్య అవదు. దాని అసలైన అర్థం చాలా భిన్నంగా వుంటుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, V వాల్యూమ్,

న్యూఢిల్లీ, 19 డిసెంబర్ 1948


ప్రశ్న : గందర గోళంగా వున్న యీ ప్రపంచాన్ని ఎదుర్కొని నిలబడాలంటే మా పిల్లలకి ఎటువంటి విద్యావిధానం వుండాలి?

కృష్ణమూర్తి : ఇది చాలా పెద్ద ప్రశ్న. అవునా కాదా? రెండు నిముషాల సమాధానం సరిపోదు. అయినా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. తరువాత ఎప్పుడయినా వివరాలలోకి పోవచ్చును. సమస్య పిల్లలకి ఎటువంటి విద్య వుండాలి అని కాదు; అసలు అధ్యాపకుడికే ముందు చదువు నేర్పించాలి, తల్లిదండ్రులకీ నేర్పించాలి అన్నది. (గుసగుసగా నవ్వులు). దయచేసి నవ్వకండి. మిమ్మల్ని నవ్వించడానికి, మీరు వినోదించడానికి చమత్కారంగా మాట్లాడటంలేదు. పూర్తిగా విభిన్నమైన, ఒక కొత్త విద్యావిధానం మనకి అవసరం కదూ?- కేవలం జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకునేది కాదు; పిల్లలకు ఒక కౌశలాన్ని నేర్పించేది కాదు; ఏదో ఒక వుద్యోగానికి, జీవనోపాధి గడించుకోడానికి వారిని తయారుచేసేది కాదు. వారిని నిజంగా తెలివిగల వారిగా చేసే విద్యావిధానం కావాలి. తెలివి అంటే యీ సమస్త ప్రక్రియను, జీవితం అనే సమస్త ప్రక్రియను ఆకళింపు చేసుకోవడం, జీవితంలోని ఒక చిన్న ముక్క గురించి తెలుసుకోవడం కాదు.

అసలు సమస్య నిజంగా యిదీ. మనం, అంటే పెద్దవాళ్ళం చిన్నపిల్లలు స్వేచ్ఛగా, సంపూర్ణమైన స్వేచ్ఛలో ఎదగడానికి తోడ్పడగలమా? అంటే అర్థం, పిల్లల యిష్టప్రకారం వాళ్ళని వదిలేయాలని కాదు. స్వేచ్చగా వుండటం అంటే ఏమిటో మనం అర్ధం చేసుకున్నాం కాబట్టి, స్వేచ్ఛ అంటే ఏమిటో పిల్లలు అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేయగలమా?

ప్రస్తుతం చదువు అంటే లొంగిపోయి వుండటానికి సిద్దపరిచే ఒక ప్రక్రియ. సమాజంలో వున్న ఒక రకమైన నమోనాకు అనుగుణంగా వుండేటట్లు పిల్లవాడిని తయారు చేయడం. అంటే, ఒక వుద్యోగం సంపాదించుకొని, నలుగురిలో మర్యాదస్థుడిగా పేరు తెచ్చుకొని, చర్చికి వెళ్తూ, తక్కినవారిలాగే వుండటం, చని పోయేదాకా యీ ప్రయాస పడుతూ వుండటం, అంతర్గతంగా స్వేచ్ఛగా వుండి, పెద్దవుతున్నకొద్దీ జీవితంలో వుండే సంక్లిష్టతలన్నీ ఎదుర్కోగలగడానికి అతన్ని మనం తయారుచేయడం లేదు. అంటే, ఆలోచించగలిగే శక్తిసామర్థ్యాలు యివ్వాలి తప్ప, అతను ఎట్లా ఆలోచించాలో నేర్పడం కాదు. దీనికి అవసరమైనది ఏమిటంటే ముందుగా అధ్యాపకుడు అధికారపు ఆధిపత్యాన్నుండి, అన్ని రకాల భయాలనుండి, జాతీయ భావాల నుండి, వివిధ నమ్మకాల నుండి, సంప్రదాయాల నుండి తన మనసును విముక్తం చేసుకోవాలి. అప్పుడే పిల్లలు మీ సహాయంతో, మీ వివేకంతో, స్వేచ్ఛగా వుండటం అంటే ఏమిటి, ప్రశ్నించడం అంటే ఏమిటి, తరచి శోధించడం అంటే ఏమిటి, కొత్తవి కని పెట్టడం అంటే ఏమిటి అనేవి అర్థం చేసుకుంటారు.

అయితే, చూడండి, అట్లాంటి సమాజం కావాలని మనం కోరుకోవడం లేదు. ఒక నూతన ప్రపంచం మనకి అక్కర్లేదు. పాత ప్రపంచమే మళ్ళీ పునరావృతం అవుతే చాలు మనకి. కాస్త రూపు మార్చుకొని, యింతకంటే యింకొంచెం బాగా, మరి కాస్త మెరుగు పెట్టుకొని వస్తే చాలు మనకి. పిల్లలు పూర్తిగా లొంగిపోయి వుండాలి అనీ, ఏమాత్రం ఆలోచించకూడదు అనీ, ఎరుకగా వుండకూడదనీ, అంతర్గతంగా నిర్దుష్టతతో వుండకూడదనీ మనం కోరుకుంటాం. ఎందుకంటే వారిలో స్పష్టంగా చూసే శక్తి వుంటే గట్టిగా హత్తుకొని పోయిన మన విలువలకు ప్రమాదం వాటిల్లవచ్చు. కాబట్టి యీ సమస్యలోని అసలు అంశం ఏమిటంటే, ఆధ్యాపకుడికి సరియైన విద్య గరపడం ఎట్లా అనేది. మీరూ, నేనూ- ఎందుకంటే బోధించేది తల్లిదండ్రులూ, సమాజమే కాబట్టి- ఏ విధంగా మీరూ, నేను మనలోపల స్పష్టతను సాధించగలుగుతాం అనేది తెలుసుకోవాలి. అప్పుడే పిల్లలు కూడా స్వేచ్ఛగా ఆలోచించగలుగుతారు. అంటే నిశ్చలంగా వుండే మనసు, నెమ్మదిగా వుండే మనసు, దాని ద్వారా నూతనమైన విషయాలను గ్రహించడమూ, సృజించడమూ పిల్లలలో కలుగుతుంది.

ఇది నిజంగానే చాలా ముఖ్యమైన ప్రశ్న. అసలు మనం చదువుకుంటున్నది ఎందుకు? ఉద్యోగం కోసమా? కేథలిక్ మతాన్నో, ప్రొటెస్టెంట్ మతాన్నో స్వీకరించ డానికి, కమ్యునిస్ట్ సిద్ధాంతాలో, హిందూమత సిద్ధాంతాలో ఆమోదించడానికా? ఒక సంప్రదాయాన్ని అనుసరించడానికో, ఒక వుద్యోగంలో సర్దుకొనిపోవడానికోనా? లేదూ చదువు యింతకంటే చాలా భిన్నమైనదా? అది జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకోవడం కాదు, అవగాహన చేసుకొనే ప్రక్రియ. విశ్లేషణ ద్వారా అవగాహన కలగదు. మనసు చాలా నెమ్మదిగా వుండి, బరువు భారాలన్నింటినీ దింపుకొని వున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. విజయం సాధించాలనే ఆరాటంతోనూ, భంగపడుతూనూ, ఓటమి అంటే భయపడుతూనూ వున్నప్పుడు కాదు. మనసు నిశ్చలంగా వున్నప్పుడు మాత్రమే అవగాహన కలగడానికి, వివేకం కలగడానికి అవకాశం వుంది. అటువంటిది నేర్పించేదే సవ్యమైన విద్యావిధానం. దీనిద్వారా తక్కినవన్నీ తప్పక సాధ్యపడతాయి.

అయితే మనలో చాలా మందికి దీనిలో ఏమాత్రం ఆసక్తి లేదు. మీకో కొడుకు వుంటే అతడొక వుద్యోగస్తుడవాలి. మీకు కావలసిందల్లా అంతే. అతని భవిష్యత్తు బాగుండాలి. మీకు వున్నవి అన్నీ- మీ ఆస్తిపాస్తులు, మీ విలువలు, నమ్మకాలు, సంప్రదాయాలు- అవన్నీ మీ పిల్లలకు వారసత్వంగా వచ్చి తీరాలా? లేదూ సత్యం అనే దానిని తనంతట తానే కనిపెట్టడానికోసమై ఆతను స్వేచ్ఛగా పెరగాలా? అది జరగాలంటే ముందుగా యీ వారసత్వాలన్నీ మీరు వదులుకోవాలి; తరచి శోధించడానికి, సత్యం ఏది అన్నది కనిపెట్టడానికి మీరు స్వేచ్ఛగా వుండాలి.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

ఆమ్స్టర్ డామ్, 19 మే 1955

ప్రశ్న : సైకో సోమాటిక్ వ్యాథి అంటే ఏమిటి? అది నయంచేసుకోవడానికి మార్గాలు ఏమిటో మీరు సూచించగలరా?

కృష్ణమూర్తి : సైకోసొమాటిక్ వ్యాధి నయంచేసుకోవడానికి మార్గాలు కనుక్కోవడం సాధ్యమని నేను అనుకోను. అసలు మనసుకు చికిత్స చేసే ఒక పద్దతిని వెతకడమే వ్యాధికి కారణమవుతున్నదేమో. ఒక మార్గం కని పెట్టాలి, ఒక పద్ధతిని అభ్యసించాలి అని అన్నప్పుడు దాని అర్థం- ఆలోచనలను హద్దుల్లో వుంచడం, అదుపు చేయడం, అణచి వేయడం అని. అంటే మనసుని అవగాహన చేసుకోక పోవడం. భౌతిక శరీరాన్ని మనసు వ్యాథిగ్రస్తం చేస్తుంది అనేదానిలో సందేహం లేదు. కోపంగా వున్నప్పుడు భోజనం చేస్తే కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతాయి. చాలా తీవ్రంగా ఎవరినైనా మీరు ద్వేషిస్తే శరీరం అనారోగ్యానికి గురి అవక తప్పదు. మనసుని ఒక ప్రత్యేకమైన విశ్వాసానికి పరిమితం చేస్తే మానసిక వైకల్యంగాని, నరాల సంబంధమైన జబ్బులు గాని కలుగుతాయి. అవి మళ్ళీ మీ శరీరంమీద ప్రభావం చూపుతాయి. ఇదంతా సైకోసోమాటిక్ ప్రక్రియలో భాగం. అయితే అన్ని వ్యాధులు సైకోసొమాటిక్ వే అనీ చెప్పడానికి వీల్లేదు. కానీ, భయమూ, ఆందోళన మొదలైన మానసికమైన కలతలు శరీర అనారోగ్యానికి తప్పక దారితీస్తాయి. కాబట్టి మనసును ఆరోగ్యవంతంగా చేయడం సాధ్యమేనా? మనలో చాలామంది సవ్యమైన ఆహారం తీసుకోవడం మొదలైన జాగ్రత్తలు పాటించి శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ద చూపుతుంటారు. ఇది అవసరమే. కాని మనసును దిగజారిపోకుండా వుంచుకుంటూ, ఎప్పుడూ ఆరోగ్యంగా, నవ్యనూతనంగా, అప్రమత్తంగా, సజీవంగా మనసుని వుంచుకోవాలనే శ్రద్ధ చాలా తక్కువమందికి వుంటుంది.

సరే, మనసు చెడిపోకుండా వుండాలంటే మరొకరిని అనుసరించడం ఏమాత్రం వుండకూడదు. అది స్వతంత్రంగా, స్వేచ్చగా వుండాలి. అయితే అట్లా స్వేచ్ఛగా వుండటానికి మన విద్యావిధానం మనకు సహాయపడటం లేదు. పైగా యీ దిగజారిపోతున్న సమాజంలో యిమిడిపోయేటట్లుగా మనల్ని తయారుచేస్తుంది. అప్పుడు మనసు కూడా దిగజారిపోతుంది. భయపడుతూ వుండాలనీ, యితర్లతో పోటీపడాలని, మన గురించీ, మన భద్రత గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలనీ బాల్యం నుండీ మనకు నూరిపోస్తారు. దీనివల్ల మనసు నిరంతరమైన సంఘర్షణకు లోనవడం సహజమే. ఆ సంఘర్షణ ఫలితం శరీరం మీద కనబడుతుంది. కనుక యీ సంఘర్షణ అనే ప్రక్రియనంతా అప్రమత్తమైన జాగరూకత వహించి మనంతట మనమే తెలుసుకుంటూ, అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. అంతే తప్ప మనస్తత్వ శాస్త్రజ్ఞుడి మీదనో, గురువు మీదనో ఆధారపడకూడదు. ఒక గురువుని అనుసరించడం అంటే మీ మనసుని ధ్వంసంచేసుకోవడమే. ఆ గురువు వద్ద వున్నదని మీరు అనుకుంటున్నది ఏదో మీకూ కావాలని అనుకోవడం వల్లనే మీరు అతని వెంటపడుతున్నారు. దిగజారిపోవడానికి యీ విధంగా నాంది పలుకుతున్నారు. లౌకిక విషయాల్లో కాని, ఆధ్యాత్మిక విషయాల్లో కాని గొప్పవాళ్ళం కావాలని ప్రయాస పడటం అధోగతికి పోయే మార్గాల్లో ఒకటి ఎందుకంటే యిటువంటి ప్రయాస వల్ల మిగిలేది ఆందోళనే. దాని ఫలితంగా భయమూ, నిస్పృహ, మానసిక అనారోగ్యం తప్పవు - యివి మళ్ళీ శరీరం మీద తమ ప్రభావాన్ని చూపుతాయి. ఇదంతా మీకు స్పష్టంగా వున్నదని ఆశిస్తాను. మనసుకు చికిత్స చేయడానికి యింకొకరిని ఆశ్రయిస్తున్నారూ అంటే హీనస్థితికి దిగజారడంలో అదీ ఒక అంశమే.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

బొంబాయి, 28 మార్చి, 1956

ప్రశ్న : నా శరీరమూ, మనసూ రెండూ కూడా బాగా లోతుగా పాతుకొని పోయిన వాంఛలతోనూ, సచేతనమైన, అచేతనమైన భయాలతోను తయారు చేయబడ్డాయేమో అనిపిస్తూ వుంటుంది. నా మనసును నేను జాగ్రత్తగా కని పెట్టే వుంటాను. కాని తరచుగా యీ సాధారణ భయాలే నన్ను పూర్తిగా లోబరిచేసుకున్నట్లు అనిపిస్తుంది, నేను ఏం చేయాలి?

కృష్ణమూర్తి : సర్! ముందుగా భయం అంటే ఏమిటో తెలుసుకుందాం. భయం అంటే ఏమిటి? భయం మరొకదాని ఆధారంతోనే నిలబడ గలుగుతుంది. దానికి ఒంటరిగా అస్తిత్వం లేదు. ఏదో ఒకదానికి సంబంధించినదిగా అది వుంటుంది. అంటే- మీరు నా గురించి ఏమంటారో, ప్రజలు నా గురించి ఏమనుకుంటారో, వుద్యోగం పోతుందేమో, వృద్ధాప్యంలో భద్రత ఎట్లా, తల్లిదండ్రులు చనిపోతారేమో- యింకా యిటువంటివి ఎన్ని వున్నాయో దేవుడికే తెలియాలి. భయం అనేది ఏదో ఒక అంశాన్ని గురించి వుంటుంది.

సరే, యీ భయం ఎట్లా తొలిగిపోతుంది? ఒక ప్రత్యేక రకమైన క్రమశిక్షణ ద్వారా భయాన్ని పోగొట్టుకోగలమా? క్రమశిక్షణ అంటే నిరోధించడం; యీ నిరోధాన్ని అభ్యసించడం, అలవరచుకోవడం. దీనివల్ల మనసులో నుండి భయం తొలగి పోతుందా? లేక దాన్ని కొంత దూరంగా నిలబెడుతుందా? మధ్యలో ఒక గోడ కట్టినట్లు; అయితే గోడకు అవతలి వైపున భయం అట్లాగే వుండిపోతుంది. కాబట్టి నిరోధంతో గాని, ధైర్యాన్ని అలవరచుకోవడం ద్వారా గాని భయాన్ని తొలగించలేము. ఎందుకంటే ధైర్యం భయానికి వ్యతిరేకమైన గుణం. మనసు ధైర్యమూ, భయమూ అనే రెండింటిలో చిక్కుకొని పోయినప్పుడు, మళ్ళీ వీటికి నిరోధాన్ని అలవరచుకోవడమే తప్ప పరిష్కారం జరగదు. కాబట్టి ధైర్యం అలవరచుకోవడం ద్వారా భయాన్ని పోగొట్టుకోలేము.

అయితే నేను భయాన్ని పోగొట్టుకోవడం ఎట్లా? దయచేసి శ్రద్దగా వినండి. ఇది మన సమస్య. మీదీ, నాదీ, భయాన్నుంచి విముక్తి కోరే ప్రతి మానవుడిదీ కూడా. ఎందుకంటే భయం నుంచి నేను విముక్తి పొందానంటే అప్పుడు యీ 'నా', ప్రపంచంలో యింత దుర్మార్గాన్నీ, యింతటి క్షోభను సృష్టిస్తున్న యీ 'స్వార్థం' అనేది అదృశ్యమై పోతుంది. భయానికి కారణం యీ 'నేను' అన్నదాని స్వభావమే కాదూ? నాకు భద్రత కావాలి, ఆర్ధికమైనదో, కాకపోతే రాజకీయమైనదో నాకు భద్రత కావాలి. లేదా నాకు సమాజంలో కీర్తి కావాలి. పైలోకంలో నాకు భద్రత కావాలి. దేవుడి వద్ద నుంచి నాకు హామీ కావాలి, ఆయన నన్ను భుజం తట్టి మెచ్చుకోవాలి. 'వచ్చే జన్మలో నీ అదృష్టం బాగుంటుంది' అనాలి. ఇట్లా నాతో అనడానికి, నన్ను ప్రోత్సహించడానికి, ఆశ్రయమూ, రక్షణా యివ్వడానికి ఒకరు నాకు కావాలి. ఎటువంటి రూపంలోనైనా సరే భద్రత కోరుకుంటున్నప్పుడు దాని వెనకాల భయం తప్పకుండా వుండి వుంటుంది. ఈ భయంలో నుండే పుట్టుకొస్తాయి ప్రాధమికమైన కాంక్షలన్నీ కూడా. కాబట్టి భయం అంటే ఏమిటి అనేది కనుక నేను అవగాహన చేసుకుంటే అప్పుడు బహుశ ఎడతెగనీ యీ కోరికల్లో నుండి బయట పడటం జరుగుతుంది.

భయం అంటే ఏమిటో నేను ఎట్లా అవగాహన చేసుకోగలను? క్రమ శిక్షణ అమలు పరచకుండా, నిరోధం చూపకుండా, దాని నుంచి పారి పోకుండా, రకరకాలైన భ్రాంతులలోనో, సమస్యలలోనో, గురువులలోనో, వేదాంతులలోనో పడిపోకుండా అసలు భయాన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతాను, ఎట్లా అర్థం చేసుకోగలుగుతాను, ఎట్లా దాని నుండి విముక్తి చెంది ఆవలగా పోగలుగుతాను? భయానికి దూరంగా పారిపోకుండా వున్నప్పుడే, నిరోధం చూపకుండా వున్నప్పుడే దానిని అర్ధం చేసుకోగలుగుతాను. ఇప్పుడు, యీ నిరోధించే సత్వం ఎవరు, ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం, భయాన్ని నిరోధిస్తున్న యీ 'నేను' ఎవరు? సర్! మీకు అర్ధమవుతున్నదా? అంటేనేను భయపడుతున్నాను; నేను మర్యాదస్తుడిగా పేరు పొందాలనుకుంటున్నాను, కాబట్టి ప్రజలు నా గురించి ఏమంటారో అని భయపడుతున్నాను. నేను లోకంలో ఎన్నో సాధించాలనుకుంటున్నాను. పేరు, ప్రతిష్ట, అధికారము సంపాదించాలని కోరుకుంటున్నాను. అందుకని నాలో ఒక భాగం వీటి వెనకాల పరుగులు పెడుతున్నది. లోలోపల, నేను ఏది చేసినా ఆశాభంగానికే దారి తీస్తుందనీ, నేను చేయాలను కుంటున్నవే నాకు ఆటంకంగా నిలుస్తాయని మరొక భాగం అనుకుంటుంది. కాబట్టి నాలో రెండు ప్రక్రియలు పనిచేస్తున్నాయి ఒకటి అన్నీ సాధించాలనీ, పరువు ప్రతిష్ఠలు సంపాదించాలనీ, విజయం చేపట్టాలనీ కోరుకుంటున్న సత్వం; మరొకటి యివన్నీ నేను సాధించలేనేమోనని ఎప్పుడూ భయపడుతూ వుండే రెండో సత్వం.

నాలోనే రెండు ప్రక్రియలు పనిచేస్తూ వున్నాయన మాట. రెండు కోరికలు, రెండు వ్యాపకాలు- 'నేను సంతోషంగా వుండాలనుకుంటున్నాను' అని అనేది ఒకటి, యీ ప్రపంచంలో సంతోషం లేనే లేదేమో అని తెలుసుకున్న మరొకటి. నేను ధనవంతుడిని కావాలి. లక్షలాది పేదవారు నాకు కనబడుతూనే వున్నారు. అయినా సరే, ధనవంతుడినవాలని నేను ఆకాంక్షిస్తాను. భద్రతకోసం కాంక్ష నన్ను నడిపిస్తున్నంత వరకు, ఆ కాంక్ష నన్ను తరుముతున్నంత వరకు నాకు విముక్తి లేదు. మళ్ళీ నా లోపలే కరుణ, ప్రేమ, సున్నిత తత్వమూ కూడా వున్నాయి. నా లోపల ఒక అంతులేని సమరం జరుగుతునే వుంటుంది. ఆ సమరమే బయటపడి, సంఘవిద్రోహకరంగా తయారవుతుంది, యింకా ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ లోపలి సమరాన్నుండి, అంతర్గతమైన యీ సంఘర్షణ నుండి నేను ఎట్లా విముక్తుడి నవుతాను నా లోపల ఒక్క ప్రక్రియను మాత్రమే నేను పరిశీలించుకుంటూ, ద్వంద్వ ప్రక్రియను అలవర్చుకోకుండా వుంటే సంఘర్షణను ఎదుర్కోవడానికి అవకాశం వుంది. అంటే సద్గుణాలని, ధైర్యాన్ని అలవరచుకోకుండా భయాన్ని దాని స్వస్వరూపంలోనే పరిశీలిస్తూ వుంటే భయంతో తలపడవచ్చు. దీని అర్థం ఏమిటంటే 'వుండవలసిన దానిని' కాకుండా 'వున్నదానిని' తెలుసుకుంటే, అప్పుడు 'వున్నదానిని' ఎదుర్కొన గలుగుతాం. అయితే మనలో చాలామందికి 'వున్నది' ఏది అని తెలియదు. ఎందుకంటే చాలామంది 'వుండవలసినది' ఏది అన్నదానిలోనే ఆసక్తి చూపుతారు కాబట్టి. ఈ 'వుండవలసినది' ద్వైదీభావాన్ని సృష్టిస్తుంది. 'ఉన్నది' ఎప్పుడూ ద్వైదీభావాన్ని సృష్టించదు. 'ఉండవలసినది' సంఘర్షణను, ద్వైదీభావాన్ని తీసుకువస్తుంది.

కాబట్టి 'వున్నది' ని, ఘర్షణను కలిగించే దీని వ్యతిరేకమైన దానిని తీసుకు రాకుండా చూడగలనా; 'వున్నది' ని ఏ నిరోధభావమూ లేకుండా చూడగలనా? ఎందుకంటే నిరోధించడమే వ్యతిరేకమైన దానిని తయారు చేస్తుంది. అవును కదూ? అంటే, నేను భయపడుతున్నప్పుడు ఏ నిరోధభావమూ నాలో కలిగించుకోకుండా ఆ భయంవైపు చూడగలనా? ఎందుకంటే భయాన్ని వ్యతిరేకిస్తూ నిరోధభావం కలిగిన ఆ క్షణంలోనే మళ్ళీ మరొక సంఘర్షణను నేను సృష్టిస్తాను. 'ఉన్నది' నీ ఏ నిరోధ భావమూ లేకుండా నేను చూడగలనా? అట్లా చేయగలిగితే, భయంతో నేరుగా తలపడటం నాకు చేతనవుతుంది. సరే, భయం అంటే ఏమిటి? భయం ఒక మాటా? ఒక భావమా?అది ఒక ఆలోచనా? యదార్థమా? భయం అనే మాట ద్వారా భయం వునికిలోకి వస్తున్నదా లేక ఆ మాటకూ భయానికీ సంబంధం లేదా? సర్! దయచేసి నాతో పాటు కలిసి ఆలోచించండి. అలసిపోకండి. మనస్సును అటు యిటూ పోనీయకండి. మీకు నిజంగానే యి భయం అనే సమస్య గురించి అక్కర వుంటే- మీ ఒక్కరికే కాదు, ప్రతి మనిషికీ యిది తప్పకుండా వుంటుంది. చావు అంటే భయం, మీ తాతగారో, అమ్మమ్మో చనిపోతారనే భయం- యింత ఘోరమైన కారునలుపు బరువును మీరు మోస్తున్నారు కాబట్టి, యీ సమస్యను పక్కకి తోసేయకుండా దానితో సూటిగా మీరు తలవడవద్దూ? ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలిస్తే, భయానికి దూరంగా పారిపోవడంతోనూ, ధైర్యం అలవరుచుకోవడం మొదలైన పద్ధతులతోనూ దానికి అడ్డంగా గోడలు కట్టడం ద్వారా భయాన్ని వ్యతిరేకించే నిరోధ భావాన్ని పెంచు కుంటున్నంత కాలం సంఘర్షణ తప్పదని తెలుస్తుంది. నిరోధ భావమే యీ సంఘర్షణను, రెండు వ్యతిరేకతల మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది. రెండు వ్యతిరేకతల మధ్య గల సంఘర్షణ ద్వారా అవగాహన చేసుకోవడం ఏనాటికీ సాధ్యం కాదు.

పూర్వ పక్షానికీ, ప్రతి పక్షానికీ మధ్యన జరిగే సంఘర్షణ ఫలితంగా సమన్వయం సిద్ధిస్తుందనే వాదంలో నిజం లేదు. 'ఉన్నది' అనే వాస్తవాన్ని అర్థం చేసుకోవడం వల్ల అవగాహన కలుగుతుంది తప్ప దానికి వ్యతిరేకమైన దానిని సృష్టించడం వల్ల కాదు. కనుక, నిరోధభావం లేకుండా, అక్కడ నుండి పారిపోకుండా, భయాన్ని ముఖాముఖిగా ఎదుర్కోగలనా, దాని వైపు చూడగలనా? భయంవైపు చూస్తున్న యీ సత్వం ఏమిటి? నేను భయపడుతున్నాను అన్నప్పుడు, యిందులోని 'నేను' ఏమిటి, 'భయం' ఏమిటి? అవి రెండు వేరు వేరు దశలా, రెండు వేరు వేరు ప్రక్రియలా? 'నేను' భావిస్తున్న భయం వేరూ, నేను వేరూనా? నేను వేరూ, భయం వేరూ అయితే, అప్పుడు ఆ భయాన్ని నేను ఏదయినా చేయగలను, దానిని మార్చగలుగుతాను, నిరోధించగలుగుతాను, పక్కకి తోసేయగలుగుతాను. అయితే, భయమూ నేను కనుక వేరు వేరు కాకపోతే అప్పుడు చర్య పూర్తిగా భిన్నంగా వుంటుంది కదూ?

సర్! యిదంతో బొత్తిగా వూహకి అందనంత అస్పష్టంగానూ, క్లిష్టంగానూ వున్నదా? బాగా వివరంగా తెలుసుకుందాం రండి, దయచేసి శ్రద్దగా వినండి. వాదించకుండా వూరికే వినండి. ఎందుకంటే వినడం వల్ల మాత్రమే, వాదప్రతివాదాల్లో పడిపోకుండా వట్టిగా వినడం వల్ల మాత్రమే నేను చెప్తున్నది మీరు ఆకళింపు చేసుకోగలుగుతారు. భయాన్ని నిరోధిస్తున్నంత వరకు, భయపు బారినుండి నాకు విముక్తి వుండదు. పైగా సంఘర్షణ ఎక్కువవుతుంది, బాధ ఎక్కువవుతుంది. నిరోధభావం చూపనప్పుడు భయం మాత్రమే వుంటుంది. ఇక, భయం పరిశీలకుడి నుండి, 'నేను భయపడు తున్నాను' అనే 'నా' నుండి విడిగా వుంటుందా? 'నేను భయపడుతున్నాను' అంటున్న యీ 'నేను' ఏమిటి? నేను భయం అని పిలుస్తున్న ఆ మనోభావంతోనే యి 'నా' అనేది కూడా తయారు చేయబడింది కదూ? 'నా' అంటే భయం అనే భావమే కదా? భయం అనే మనోభావం లేకపోతే 'నా' కూడా' పుండదు. కాబట్టి యీ 'నా', యీ భయమూ ఒక్కటే. భయం కాకుండా 'నా' అనేది ఒకటి విడిగా లేదు. కాబట్టి భయమే 'నేను'. కనుక వున్నది భయం ఒక్కటే.

ఇప్పుడిక, యిది విచారణ చేద్దాం. భయం అనేది కేవలం ఒక మాటా? భయం అనే ఒక మాటను, ఆ భావాన్ని, ఆ సంకేతాన్ని, ఆ దశను- అసలు వాస్తవంతో ఏ సంబంధమూ లేకుండా మనసు సృష్టించిందా? దయచేసి వినండి. భయమే 'నా', ఇది కాకుండా మరో 'నేను' అనేదీ విడిగా లేదు. మానవుడు, యీ 'నేను'- 'నేను చాలా దురాశ కలవాడిని' అని అంటాడు. 'నేను' దే ఆధిపత్యం అంతా. ఆ గుణం 'నేను' నుండి విడిగా లేదు. 'నేను దురాశనుండి విముక్తి పొందాలి' అని 'నేను' అనుకుంటున్నంతవరకు, అది ప్రయత్నం చేస్తూనే వుంటుంది, పోరాటం సలుపుతూనే వుంటుంది, కానీ ఆ 'నేను' లో దురాశ మాత్రం యింకా అట్లాగే వుంటుంది. ఎందుకంటే దురాశ లేకుండా వుండాలని ఆది కోరుకుంటూ వుంటుంది కనుక. అదే విధంగా 'నేను భయాన్ని పోగొట్టు కోవాలి' అని 'నేను' అనుకున్నప్పుడు అది నిరోధ భావాన్ని అలవరుచుకుంటున్నది. అందువల్ల సంఘర్షణ కలుగుతుంది. భయం మాత్రం ఎప్పటికీ తొలగిపోదు. అందువల్ల భయమే 'నేను' అనే వాస్తవాన్ని గుర్తించినప్పుడు, ఆ వాస్తవాన్ని అవగాహన చేసుకున్నప్పుడు, యీ 'నేను' భయాన్ని గురించి ఏమీ చెయ్యలేదని తెలుసుకున్నప్పుడు మాత్రమే భయం నుంచి విముక్తి కలుగుతుంది. "నేను భయపడుతున్నాను, యీ భయాన్ని గురించి ఏదయినా చేయాలి" అని అంటున్న ఆ 'నేను' ను చూడండి. భయాన్ని గురించి అది పనిచేస్తున్నంతకాలమూ నిరోధభావాన్ని కలిగించి, ఆ విధంగా సంఘర్షణను యింకా పెంచుతుంటుంది. మనం కనుక భయం అంటేనే 'నా' అని గుర్తిస్తే అప్పుడు 'నేను' పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మాత్రమే భయం తొలగిపోతుంది.

చూడండి, భయంగాని, ఒక బలమైన కాంక్షగాని, సెక్స్ సంబంధమైన వాంఛగాని కలిగినప్పుడు దాని గురించి ఏదో ఒకటి చేయడం మనకు అలవాటై పోయింది. వాంఛ, 'నా' వేరువేరుగా వున్నాయని అనుకుంటూ దాని పై చర్య తీసుకుంటాం. కాబట్టి కోరికను 'నా' తో కలిసి కాకుండా వేరుగా వున్నదని అనుకుంటూ మనం చూస్తున్నంతవరకు సంఘర్షణ తప్పదు. 'నా' లేకుండా కోరిక వుండదు. నేనే కోరిక అవి రెండూ విడివిడిగా లేవు. దయచేసి యిది గ్రహించండి. భయం అంటే నేనే అనీ, దురాశ అంటే 'నేనే' అనీ, అవీ నేనూ ఒకటే తప్ప విడి విడిగా వుండమనీ గ్రహించినప్పుడు కలిగే ఆ భావం చాలా బ్రహ్మాండమైన అనుభవం.

ఆలోచించేవాడు లేనప్పుడు ఆలోచన వుండదు. ఆలోచన అంటూ వున్నంతవరకు ఆలోచించే వాడూ వుంటాడు. ఆలోచించేవాడు, ఆలోచన విడివిడిగా లేరు. అయితే ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తున్నది. అతన్ని వేరుగా విడదీస్తున్నది. ఎందుకంటే ఆలోచన నిరంతరంగా శాశ్వతత్వం కోసం ఆరాటపడుతుంటుంది, అందుకని 'నేను' ను శాశ్వతంగా వుండే ఒక సత్వంగా సృష్టిస్తుంది. ఆ 'నేను' ఆలోచనను అదుపులో వుంచుతుంది. అయితే ఆలోచన లేకుండా 'నేను' లేదు. మీరు ఆలోచించకుండా వున్నప్పుడు, ఫలానా అని గుర్తిస్తూ లేనప్పుడు, విచక్షణ చేస్తూ లేనప్పుడు యీ 'నేను' అన్నది వుంటుందా? అప్పుడు యీ 'నా' వుంటుందా? ఆలోచన అనే ప్రక్రియే 'నా' ను తయారు చేస్తున్నది. ఆ 'నా' యే మళ్ళీ ఆలోచనను నడిపిస్తుంది. అంతు లేకుండా యీ ప్రయాస అంతా యిట్లా సాగిపోతూనే వుంటుంది.

భయాన్నీ పూర్తిగా పోగొట్టుకోవాలనే వుద్దేశ్యం వుంటే, అప్పుడు భయం అంటే 'నేను', 'నేను' కాకుండా భయం అనేది విడిగా లేదు అనే సత్యాన్ని గ్రహించి తీరాలి. అదీ వాస్తవం. ఒక వాస్తవాన్ని ఎదుర్కొన్నప్పుడు చర్య జరుగుతుంది. యిది చేతన మానసం ద్వారా జరుగుతున్న చర్య కాదు; ఆ చర్యను ఎన్నుకోవడం లేదు, నిరోధభావం వల్లా ఆ చర్య జరగడం లేదు. అది సత్యం అనే చర్య. అటువంటప్పుడు మాత్రమే మనసును అన్ని రకాల భయాల నుండి విముక్తం చేయడం సాధ్యమవుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VIIవాల్యూమ్,

బొంబాయి, 15 ఫిబ్రవరి 1953.

ప్రశ్న :నా లోపల ఎంతో సంఘర్షణ వుంది, ఎన్నో బాధలున్నాయి. ఈ బాధలకు గల కారణాలను గురించి, యీ బాధలను నివారించే మార్గాలను గురించి, వేల సంవత్సరాలుగా మనకు బోధిస్తూనే వున్నారు. అయినా అప్పుడు ఎట్లా వున్నామో యిప్పుడు అట్లాగే వున్నాం. ఈ బాధలు లేకుండా చేసుకోవడం సాధ్యమా?

కృష్ణమూర్తి : మనం బాధల్లో వున్నామనే స్పృహ ఎంతమందికి వున్నదంటారు? ఒక సిద్ధాంతం లాగా కాకుండా, నిజంగానే మీలో సంఘర్షణ వున్నదని మీరు తెలుసుకున్నారా? తెలుసుకొని వుంటే మీరేం చేస్తారు? దాన్నుంచి పారిపోవాలని చూస్తారు; కాదూ? మనలోపల యీ సంఘర్షణ, బాధ వున్నాయనే స్పృహ కలగగానే మేధకు సంబంధించిన వ్యాపకాలలోనో, పనిలోనో, వినోదాలలోనో, సౌఖ్యాల్లోనో మునిగిపోయి, అది మరచిపోవాలని ప్రయత్నిస్తాం. బాధల నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తాం. నాగరీకమైనవైనా సరే, మోటువైనా సరే అన్ని పలాయనాలూ సమానమే, కాదంటారా? అసలు సంఘర్షణ అంటే అర్ధం ఏమిటి? మీలో సంఘర్షణ వున్నదని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? 'నా' అనే స్పృహ మీకు కలిగినప్పుడే సంఘర్షణ బయలుదేరుతుంది. ఈ 'నాకు' హఠాత్తుగా తన గురించిన స్పృహ కలిగినప్పుడు మాత్రమే సంఘర్షణ వున్నదనే ఎరుక వస్తున్నది. అది లేనప్పుడు ఏ మార్పులూ లేని, ఒక కృత్రిమమైన, జడమైన, ఒకటే రకమైన నిత్యకృత్యపు జీవితాన్నే మీరు గడిపి వేస్తుంటారు, అవునా? సంఘర్షణ వున్నప్పుడు మాత్రమే మీ గురించి మీకు చైతన్యం కలుగుతుంది. ఏ వైరుధ్యాలూ లేకుండా, ఆశాభంగాలు లేకుండా అన్నీ సాఫీగా జరిగిపోతున్నంత కాలమూ మీ గురించిన చైతన్యం తల ఎత్తదు. నన్ను బంతిలాగా అటూ యిటూ నెట్టివేయనంతకాలం, నాకు కావలసినది నాకు లభిస్తున్నంత కాలం నాలో సంఘర్షణ వుండదు. నాకు అడ్డు తగలగానే నాగురించి నాకు స్పృహ కలుగుతుంది, క్షోభ పడతాను. ఇంకో రకంగా చెప్పాలంటే, నేనులో తన చర్యలకు ఆశాభంగం ఎదురవుతున్న భావం కలిగినప్పుడు మాత్రమే సంఘర్షణ ఆరంభమవుతుంది. కాబట్టి మనకు కావలసింది ఏమిటి? ఏ ఆశాభంగాలూ ఎదురవకుండా నాకు నిరంతరంగా స్వీయ సాఫల్యత సిద్ధించే చర్యలే జరగాలి. అంటే జీవితంలో మసకి ఏవీ అడ్డు తగలకూడదు. వేరే మాటల్లో చెప్పాలంటే, మన కోరికలు నెరవేరుతూ వుండాలి, కోరికలు నెరవేరనప్పుడు సంఘర్షణ బయలుదేరుతుంది, వైరుధ్యాలు మొదలవుతాయి. కాబట్టి మన సమస్య ఏమిటంటే, సఫలత ఎట్లా సాధించాలి, భంగపాట్లు ఏవీ లేకుండా స్వీయ సాఫల్యం సాధించడం ఎట్లా నాకు నా స్వంతానికి ఆస్తి కావాలి, ఒక మనిషి కావాలి, బిరుదులు కావాలి, యింకా అవీ యివీ. అవి నాకు స్వంతమైతే, యింకా నాకు కావలసినవన్నీ కూడా నాకు లభ్యమవుతూవుంటే నేను సంతోషంగా వుంటాను. అప్పుడు ఏ వైరుధ్యాలూ వుండవు. కాబట్టి మనం ఆశిస్తున్నది స్వీయ సాఫల్యం కోసం, ఆ తృప్తి మనకు లభిస్తున్నంత వరకు ఏ ఘర్షణా వుండదు.

సరే, ప్రశ్న ఏమిటంటే స్వీయ సాఫల్యసిద్ధి అనేది అసలు వున్నదా? అంటే, నేను గొప్పతనాన్ని సాధించగలనా, గొప్పగా అవగలనా, సత్యం ఏది అని గ్రహించగలనా? ఇటువంటి యీ కోరికలో ఒక నిరంతరమైన పోరు జరగడం లేదూ? అంటే ఏదో అవాలని, ఏదో సాధించాలని, స్వీయ సాఫల్యసిద్ధి జరగాలని ఆరాట పడుతున్నంత వరకు భంగపాటూ వుంటుంది, భయమూ వుంటుంది, సంఘర్షణా వుంటుంది. కాబట్టి స్వీయ సాఫల్యత అనేది అసలు వుంటుందా? అసలు స్వీయ సాఫల్యం అంటే అర్ధం ఏమిటి? స్వీయ సాఫల్యం అంటే మన అర్ధం ఏమిటంటే స్వలాభం- అంటే 'నా' మరింత పెద్దగా, గొప్పగా, ప్రముఖంగా అవడం. 'నేను' ఒక గవర్నరు అవడమే, పెద్ద వుద్యోగస్తుడిని అవడమో, బ్యేంక్ మేనేజరు అవడమో మొదలైనవి. ఇంకా కొంత లోతుగా దీన్ని పరిశీలిస్తే, స్వార్ధం పనిచేస్తున్నంతవరకు అంటే తను చేసే చర్యల్లో నేను గురించిన స్పృహ వున్నంతవరకు భంగపాటు తప్పదు. ఆ కారణంగా బాధలు కూడా తప్పవు. కాబట్టి మన సమస్య బాధలను తట్టుకోవడం ఎట్లా, సంఘర్షణను తొలగించడం ఎట్లా అని కాదు; ఈ నా యొక్క, తన యొక్క స్వభావగుణాలని అవగాహన చేసుకోవడం. ఇదంతా నేను మరీ జటిలంగా తయారు చేయడం లేదనే ఆశిస్తున్నాను. కేవలం సంఘర్షణను తట్టుకోవడం గురించీ, దుఃఖాన్ని తొలగించడం గురించీ మాత్రమే ప్రయత్నిస్తే దుఃఖాన్ని సృష్టించిన కర్త స్వభావాన్ని మనం అర్ధం చేసుకోలేము.

ఆలోచన తన స్వంత వికాసం కోసమూ, తన స్వంత పరివర్తన కోసమూ, తన స్వీయ అభ్యున్నతి కోసమూ అపేక్షిస్తున్నంతవరకు సంఘర్షణ, వైరుధ్యాలు వుంటూనే వుంటాయి. కాబట్టి, నన్ను నేను అవగాహన చేసుకోనంతవరకు సంఘర్షణ, బాధ తప్పవు అన్న సుస్పష్టమైన వాస్తవానికే మళ్లీ మనం వచ్చి చేరాం. అందువల్ల దుఃఖాన్నీ, సంఘర్షణనూ తట్టుకోవడం ఎట్లా అన్నది తెలుసుకోవడం కంటే తననితాను అవగాహన చేసుకోవడం ముఖ్యం. ఇది యింకా వివరంగా తరువాత తెలుసుకుందాం. అయితే, పూజా పునస్కారాల ద్వారా, వినోద కాలక్షేపాల ద్వారా, నమ్మకాల ద్వారా, యింకో రకరకాలైన వ్యాపకాల ద్వారా బాధల నుంచి పారిపోవడం వలన, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం అనే అసలు ప్రధాన సమస్య నుంచి మీ ఆలోచనలను యింకా చాలా దూరంగా నెట్టి వేస్తున్నారు, దుఃఖాన్ని అర్థంచేసుకోవాలంటే యీ రకరకాలైన పారిపోవడాలన్నీ ఆగిపోవాలి. అప్పుడే చర్య జరుపుతూ వున్న మిమ్మల్ని మీరు ఎదుర్కో గలుగుతారు. చర్య జరుపుతున్న మిమ్మల్ని అవగాహన చేసుకోవడం లోనే. అంటే అర్ధం మీ సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకోవడంలోనే ఆలోచనలను అన్ని సంఘర్షణలనుండి పూర్తిగా విముక్తం చేసి, ఆనందమైన స్థితిలో, యదార్ధ్యమైన స్థితిలో జీవించగల మార్గం మీకు కనబడుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, V వాల్యూమ్,

న్యూ ఢిల్లీ, 14 నవంబర్ 1948

ప్రశ్న : కాంక్షలు ఎన్నయినా వాటిలోని అసలు విషయం ఒకటే అని మీరు అన్నారు. అంటే దైవాన్ని చూడాలని తపించే మనిషిలోని కాంక్షకూ, ఆడవాళ్ళ వెంటపడేవారిలోనూ, తప్పతాగి మైమరచే వారిలోనూ వుండే కాంక్షలకూ వ్యత్యాసం ఏమీ లేదని మీరనుకుంటున్నారా?

కృష్ణమూర్తి : కాంక్షలన్నీ ఒకే మాదిరివి కాకపోవచ్చు. అయితే అవన్నీ కాంక్షలే. మీకు దేవుడి మీద కాంక్ష వుండచ్చు; నాకు తాగాలనే కాంక్ష వుండచ్చు; యిద్దరమూ ఆ ఒత్తిడికి లోనవుతూ వున్నాం; యిద్దర్నీ కాంక్ష ప్రేరేపిస్తున్నది. అది మిమ్మల్ని ఒక దిక్కులోనూ, నన్ను మరో దిశగానూ తోస్తూ వుంటుంది. మీరు వెళ్తున్నది గౌరవ మర్యాదలు గల మార్గం, నాది అటువంటిది కాదు. కాకపోగా నన్ను సమాజ విరోధి అని కూడా అంటారు. కానీ మనసుని సద్గుణాలతోను, దేవుడితోను నింపుకున్న మునులూ, సన్యాసులూ, పారమార్థికులు అని మనం అంటూ వుంటామే వారూ, వ్యాపార వ్యవహారాలు, స్త్రీలు, త్రాగుడు మొదలైన వ్యాపకాలలో మునిగిపోయి వున్నవారూ అంతా ఒకటే; అందరిలోనూ ప్రధానంగా వున్న లక్షణం ఒకటే; ఇదే తమ తమ వ్యాపకాల్లో పూర్తిగా మునిగి పోయివుండటం? అర్ధమవుతున్నది కదూ? ఒకరికి సమాజపరంగా గౌరవం వుంటుంది. త్రాగుడు అనే వ్యాపకాన్ని మనసులో పెట్టుకున్న యింకొకరిని సమాజం వెలివేస్తుంది. కనుక, సామాజిక కోణం నుంచి మీరు తప్పొప్పులు నిర్ణయిస్తున్నారు. కాదంటారా? సన్యాసం పుచ్చుకొని, ఒక ఆశ్రమంలో చేరి, రాత్రింబగళ్ళు దైవప్రార్ధనలు చేస్తూ, మధ్యలో కొంత సేపు తోటపనీ అదీ చేస్తూ, మనసుని పూర్తిగా దేవుడితో, ప్రాయశ్చిత్తాలతో, క్రమశిక్షణతో, యింద్రియ నిగ్రహంలో నింపుకునే వారిని పుణ్యపురుషులనీ, మహాత్ములనీ మీరు అంటారు. తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ, స్టాక్ ఎక్స్ ఛేంజిని గుప్పిట్లో పెట్టుకొని, ఎప్పుడూ డబ్బు సంపాదించే వ్యాపకాల్లో మునిగితేలే మనిషిని గురించి, 'అబ్బే, మనందరి లాగే మామూలు మనిషి' అని చప్పరించేస్తారు. కానీ యిద్దరు చేస్తున్నదీ వారి వారి వ్యాపకాల్లో మునిగివుండటమే. మనసు ఏ వ్యాపకంతో వున్నది అన్నది నాకు ప్రధానం కాదు. మనసుని దేవుడు అనే వ్యాపకంతో నింపుకున్న వ్యక్తి దేవుణ్ణి ఎప్పటికీ కనుక్కోలేక పోవచ్చు. ఎందుకంటే దేవుడు ఒక వ్యాపకంగా పెట్టుకునే విషయం కాదు. అది మనకు తెలియనిది, కొలతల్లో యిమడ్చలేనిది. దేవుడిని ఒక వ్యాపకంలాగా మీరు పెట్టుకోలేరు. అట్లా చేస్తుంటే మీ దృష్టిలో దేవుడు అంటే చాలా చవక రకం అన్నమాట.

మనసు ఏ వ్యాపకంతో వున్నది అనేది కాదు ముఖ్యం. ఆ వ్యాపకం వంటిల్లవచ్చు, పిల్లలవచ్చు, వినోదకాలక్షేపమో, వంట ఏం చేయాలి అన్నదో, సద్గుణాలో, దేవుడో యింకా అటువంటిదేదైనా కావచ్చు. ఏదో ఒక వ్యాపకంతో మనసు నిండిపోయి వున్నదనే వాస్తవం చాలా ముఖ్యమైనది. మనసు ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో పడివుండి తీరాలా? అర్ధం చేసుకుంటున్నారా? వ్యాపకంలో పడి వున్న మనసు ఒక కొత్తదానిని దేన్నయినా, తన వ్యాపకాన్ని కాకుండా మరొకదాన్ని చూడగలుగుతుందా? ఏ వ్యాపకంతోనూ లేనప్పుడు మనసుకు ఏమవుతుంది? మీకు యిది అర్థమవుతున్నది కదూ? ఏ వ్యాపకమూ లేకపోతే అప్పుడసలు మనసు అనే ఒకటి వుంటుందా? విజ్ఞాన శాస్త్రజ్ఞుడికి తన సాంకేతిక సమస్యలు, తన యంత్ర సంబంధమైన విషయాలు, గణితమూ వ్యాపకాలుగా వుంటే గృహిణికి వంటయిల్లూ, తన పాపాయీ వ్యాపకాలు. ఏ వ్యాపకమూ లేకుండా వుండిపోతామేమోనని మనకు భయం. సామాజికంగా దీనివల్ల ఏ అనర్థాలు కలుగుతాయో అని భయం. ఏ వ్యాపకమూ లేకుండా వున్నప్పుడు మీరు ఏమిటో అది వున్నది వున్నట్లుగా కనిపెట్టవచ్చు. కాబట్టి వ్యాపకం మీరు ఏమిటో దాని నుండి పారిపోవడానికి తోడ్పడుతున్నది.

అయితే, మనసు నిరంతరంగా వ్యాపకంలో మునిగి వుండాలా? మనసుకు ఏ వ్యాపకమూ లేకుండా వుండటం సాధ్యమేనా? క్షమించండి, సమాధానం మీవద్ద లేని ఒక ప్రశ్నలు వేస్తున్నాను. ఆ సమాధానాన్ని మీరు కని పెట్టాలి; అది మీరు తెలుసు కున్నప్పుడు ఒక అపూర్వమైన అద్భుతం జరగడం చూస్తారు.

మీ మనసు ఏవిధంగా వ్యాపకాలతో నిండిపోయి వుంటుందో మీ అంతట మీరే తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఒక చిత్రకారుడు తన కళ, తన పేరు, తన పెరుగుదల, రంగులు కలుపుకోవడం, తన కీర్తి, తన ఖ్యాతి- వీటి వ్యాపకంతో నిండిపోయి వుంటాడు. పండితుడు తన జ్ఞానం అనే వ్యాపకంతో నిండిపోయి వుంటాడు. స్వీయజ్ఞానం పొందాలని పూనుకున్న మనిషికి తన గురించి తెలుసుకోవడమే వ్యాపకంగా వుంటుంది. ఒక చీమ లాగా ప్రతి చిన్న ఆలోచనను, ప్రతి కదలికను గమనించడానికి ప్రయత్నిస్తుంటాడు. వీరందరు చేసేది ఒకటే, బొత్తిగా ఏ వ్యాపకమూ లేకుండా వున్న మనసు, సంపూర్ణంగా ఖాళీగా వున్న మనసు, ఏ వ్యాపకమూ లేని మనసు మాత్రమే కొత్తదానిని అందుకోగలుగుతుంది. అయితే మనసు వ్యాపకంతో వున్నంతవరకు కొత్తది ఆవిర్భవించలేదు.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

ఒహాయి, 4 ఆగష్టు 1955

ప్రశ్న : మనం చనిపోయాక, యీ భూమిమీదే మళ్ళీ పుడతామా? మరో లోకంలోకి నిష్క్రమిస్తామా?

కృష్ణమూర్తి : ఇది మనందరిలోనూ చాలా ఆసక్తి రేకెత్తించే ప్రశ్న, చిన్న వారిలో పెద్దవారిలో కూడా కాదంటారా? అందువల్ల కొంచెం లోతుగా దీనిని విశదపరుస్తాను. ఇప్పుడు నేను చర్చించబోతున్న యీ విషయాన్ని, కేవలం అందులోని శబ్దాలనే కాకుండా, అందులో వున్న అసలైన ఆ అనుభూతిని కూడా దయచేసి గ్రహించమని మీకు మనవి చేస్తున్నాను.

మరణం అనే ఒకటి వున్నదని మనకందరికీ తెలుసు. ముఖ్యంగా వృద్ధులకు తెలుసు. పరిశీలించే దృష్టి వున్న చిన్నవారికీ తెలుసు. 'అది వచ్చేదాకా ఆగి, అప్పుడు దాని సంగతి తేల్చుకుందాం' అని చిన్నవాళ్ళు అంటుంటారు. పెద్దవాళ్ళు మరణానికి సమీపంగా వచ్చేశారు కాబట్టి రకరకాల వుపశమన వర్గాలు వెతుక్కుంటూ వుంటారు.

దయచేసి యిది అర్ధంచేసుకొని మీకు మీరే అన్వయించుకోండి, మరొకరి మీద రుద్దకండి. ఎప్పుడో ఒకరోజు చనిపోతారని తెలుసు కాబట్టి దాన్ని గురించి కొన్ని సూత్రాలు మీరు తయారుచేసి పెట్టుకుంటారు. అవునా? దేవుడి మీద నమ్మకం పెంచుకుంటారు. పునరుత్థానాన్నో, కర్మనో, పునర్జన్మనో నమ్ముతారు. ఇక్కడో, మరో లోకంలోనో మళ్ళీ జన్మిస్తామని మీరు అనుకుంటారు. లేకపోతే మరణం అనివార్యమనీ, ప్రతివారూ చనిపోవలసిందే ఆనీ చావుని గురించి హేతువాదం చేస్తారు. చెట్టు వాడి, ఎండి పోతుంది. భూమిని సారవంతం చేస్తుంది. మళ్ళీ యింకో కొత్త చెట్టు పెరుగుతుంది. మీ నిత్య జీవనపు విచారాల్లో, ఆందోళనల్లో, అసూయల్లో, యీర్ష్యల్లో, మీ పోటీలలో, మీ సిరిసంపదల్లో తలమునకలుగా మునిగిపోయి కనుక మీరు వుంటే మరణం గురించి ఆలోచించే వ్యవధానం కూడా వుండదు. అయితే మీ మనసు లోపలగా అది వుండే వుంటుంది. చేతనంగానో, అచేతనంగానో అది అక్కడ లేకుండా వుండదు.

ముందుగా, చావుని గురించి మీరు వంట పట్టించుకున్న నమ్మకాలను, హేతువాదాలను, వుపేక్షాభావాన్ని అన్నింటినీ వదుల్చుకోగలరా? ఈ క్షణంలోనే వాటన్నింటి నుండి మిమ్మల్ని విముక్తి చేసుకోగలరా? అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, జీవిస్తూ వుండగానే, పూర్తి చైతన్యంతో వున్నప్పుడే, చురుకుగా, ఆరోగ్యంగా వున్నప్పుడే మరణ గృహంలో ప్రవేశించడం. చావు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు. అది ఒక్క రెప్పపాటులో మిమ్మల్ని ఏ ప్రమాదంలోనో ఎతుకు పోవచ్చు. లేదూ జబ్బు చేసి తీసుకుంటూ, మెలిమెల్లిగా అచేతనావస్థలోకి మీరు వెళ్ళిపోవచ్చు. మరణం కలిగినప్పుడు అది ఒక అద్భుతమైన ఘడియ అవాలి, ప్రాణంతో వుండటమంత మహాశక్తివంతమైనదీ అవాలి.

సరే, ప్రాణం వుండగానే నేను మరణగృహంలో ప్రవేశించగలనా, మీరు ప్రవేశించగలరా? అదీ సమస్య- పునర్జన్మ వున్నదా లేదా అని కాదు. మనం మళ్ళీ జన్మించే మరో లోకం వున్నదా అనీ కాదు. అవన్నీ బొత్తిగా పరిణతిలేని పసివయసు ఆలోచనలు. బ్రతికి వున్న మనిషి ఎప్పుడూ 'ప్రాణం అంటే ఏమిటి' అని అడగడు. బ్రతికి వుండటం గురించీ అతను సిద్ధాంతాలు చేయడు. సగం చచ్చి, సగం ప్రాణంతో వున్న మనిషి మాత్రమే జీవితానికి గల ప్రయోజనం గురించి మాట్లాడుతూవుంటాడు.

కనుక, మీరూ నేను కూడా, జీవించి వుండగానే, చైతన్యంతోను, చురుకుగాను వున్నప్పుడే, మనకు ఏ ఏ శక్తి సామర్థ్యాలు వున్నాయో అవన్నీ, యింకా వున్నప్పుడే మరణం అంటే ఏమిటో తెలుసుకోగలమా? అప్పుడు మరణం వేరూ, జీవించడం వేరుగా వుంటాయా? మనలో చాలామందికి సజీవంగా వుండటం అంటే శాశ్వతమైనవీ అని మనం అనుకునేవి అట్లాగే కొనసాగుతూ వుండటం. అంటే మన పేరు, మన కుటుంబం, మన ఆస్తిపాస్తులు, ఆర్థికంగాను, ఆథ్యాత్మికంగాను మనకు లాభసాటిగా వుండేవి, మనం అలవరచుకున్న సద్గుణాలు, మనోద్వేగాల ద్వారా మనం ఆర్జించుకున్న విషయాలు- యివన్నీ ఎప్పటికీ వుండిపోవాలని కోరుకుంటాం. మరణం అనే పేరుతో మనం పిలిచే ఆ క్షణం మనకు బొత్తిగా తెలియని క్షణం. అందుకని భయపడతాం. అందుకు వూరటగా, వుపశమనంగా వుండే దాని కోసం ప్రయత్నిస్తాం. మరణించాక మళ్ళీ యింకో జీవితం వుంటుందా వుండదా అనీ, యింకా సవాలక్ష సంగతుల గురించీ తెలుసుకోవాలనుకుంటాం. అవన్నీ వ్యర్థమైన సందేహాలు. అవన్నీ సోమరి పోతులూ, జీవించి వుండగానే మరణం గురించి తెలుసుకోవడం యిష్టపడని వారూ వేసే ప్రశ్నలు. కాబట్టి మరణం గురించి మీరూ, నేనూ కలిసి కని పెడదామా?

చనిపోవడం అంటే ఏమిటి? మీకు తెలిసినవన్నీ పూర్తిగా ముగిసిపోవడం. మీరు తెలుసుకున్నదంతా ముగిసి పోకపోతే అది మరణం కాదు. మరణం అంటే ఏమిటో ముందే తెలుస్తే అప్పుడు మీరు భయపడవలసిన పనే లేదు. అయితే మరణం మీకు తెలుసా? అంటే, అనిత్యమైన ఒకదానిలో ఎల్లకాలం కొనసాగుతూవుండే దానిని కని పెట్టాలనే నిరంతర పోరాటాన్ని మీరు సజీవంగా వున్నప్పుడే ఆపివేయ గలరా? అజ్ఞేయమైన దానిని (తెలుసుకోలేనిదానిని), మరణం అని మనం అనే ఆ స్థితిని జీవించి వుండగానే మీరు తెలుసుకోగలుగుతారా? మరణించాక ఏమవుతుందో అన్నదానిని గురించి పుస్తకాల్లో మీరు చదివిన రకరకాల వర్ణనలను, వుపశమనం కోరుతూ మీలోలోపల వున్న అచేతన కాంక్షలు జారీ చేస్తున్న ఆజ్ఞలను అన్నింటినీ పక్కకి నెట్టేసి, అద్భుతమైన ఆ స్థితిలో వుండే ఆ అనుభూతినీ యిప్పుడే రుచి చూడగలరా, అనుభవించగలరా? ఇప్పుడే ఆ స్థితిని కనుక మీరు అనుభూతి పొందగలిగితే అప్పుడిక జీవించడం, చనిపోవడం రెండూ ఒకటే అవుతాయి.

కాబట్టి, 'నేను' అనేది- విస్తారమైన చదువు, విజ్ఞానం, అసంఖ్యాకమైన అనుభవాలు, పోరాటాలు, ప్రేమలు, ద్వేషాలు కలిగివున్న యీ 'నేను' - సమాప్తం చెందగలదా? సమస్తమైన ఆ జ్ఞాపకాలు 'నేను' లో ముద్రితమై వున్నాయి. అటువంటి యీ 'నేను' సమాప్తమై పోగలదా? ఒక ప్రమాదంలో గాని, ఒక వ్యాధివల్లగానీ అంతమై పోవడం కాకుండా, యిక్కడ కూర్చొనివుండగానే మీరు, నేను ఆ ముగింపు ఏమిటో తెలుసుకోగలమా? అప్పుడు మరణం గురించీ, శాశ్వతత్వం గురించీ, దీనికి తరువాత మరో లోకం వున్నదా అనీ అవివేకమైన ప్రశ్నలు ఏవీ మీరు అడగరు. అప్పుడు అసలు సమాధానం మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే అజ్ఞేయమైనది అప్పుడు వునికిలోకి వచ్చేస్తుంది. అప్పుడు పునర్జన్మ అనే వ్యర్థప్రలాపాలు, బ్రతుకు అంటే భయం, చావు అంటే భయం, వయసు పై బడుతున్నదనీ, యితర్లచేత చేయించు కోవాలేమో అని భయం, ఒంటరితనం గురించీ, మరొకరికి భారంగా వుండటం గురించీ యీ విధమైన రకరకాల భయాలు- యివన్నీ సమాప్తమై పోతాయి. ఈ మాటలు కేవలం అర్థంలేని కబుర్లు కావు. మనసు తను శాశ్వతంగా కొనసాగాలని ఆలోచించడం ఆపివేసినప్పుడు, అజ్ఞేయమైనది వునికిలోకి వస్తుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

ఒహాయి, 21 ఆగష్టు, 1955.


ప్రశ్న : నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. నా ప్రార్థనలు విని, ఆయన నా కోరికలు తీరుస్తుంటారు. దేవుడున్నాడు అని యిది రుజువు చేయడం లేదా?

కృష్ణమూర్తి : ఒక నిదర్శనం ఆధారంగా దేవుడున్నాడని మీరు నిరూపిస్తుంటే అది దేవుడు కానే కాదు (నవ్వులు). ఎందుకంటే నిదర్శనం లేదా రుజువనేది మనసుకి సంబంధించినది. దేవుడున్నాడు. లేడు అనే సంగతి నిరూపించడం మనసుకి ఎట్లా సాధ్యమవుతుంది? మనసు తన తృప్తికోసం, తన అభిరుచి ప్రకారం, తన సుఖసంతోషాల కోసం లేదా తన భయంవల్ల దేవుడు అని మీరు అంటున్న దీన్ని తయారు చేసుకుంది. అటువంటి చిత్రకల్పన దేవుడు అవడు. అది కేవలం ఆలోచన చేసిన సృష్టి; మనకు తెలిసిన దానితో అంటే గతం సహాయంతో అల్లుకున్న చిత్రకల్పన. మనసు వెతుకుతూ వుంటుంది, దేవుడి కోసం చురుకుగా అన్వేషిస్తూ వుంటుంది. అయితే మనసు తెలుసుకున్నది దేవుడు కాదు. ఈ ప్రశ్న అడిగినవారు తము చేసిన ప్రార్థనలకు దేవుడు బదులు పలికాడంటున్నారు. దేవుడున్నాడనడానికి యీ రుజువు చాలదా అని అడుగుతున్నారు. ప్రేమను రుజువు చేసి చూపాలని మీరు అనుకుంటారా? ఒకరిని మీరు ప్రేమించినప్పుడు ఆ సంగతి నిరూపించాలనుకుంటారా? ప్రేమకి ఒక రుజువు వుండితీరాలని మీరు అనుకుంటే అదీ అసలు ప్రేమేనా? మీ భార్యాపిల్లల్ని మీరు ప్రేమిస్తూ, ఒక రుజువు చూపాలని అనుకుంటుంటే, అప్పుడది యిచ్చిపుచ్చుకునే బేరం అవుతుంది. కాబట్టి దేవుడిని మీరు ప్రార్థించడం కూడా ఒక బేరం పెట్టడం వంటిదే. (నవ్వులు). నవ్వులతో తీసిపారేయకండి. ఇది చాలా గంభీరమైన విషయం. ఒక యదార్ధం. ఈ ప్రశ్న అడిగినవారు దేవుడు అని తము పిలుస్తున్నవారిని అర్థిస్తున్నారు, వేడు కుంటున్నారు. త్యాగాల ద్వారా, కర్తవ్య నిర్వహణ ద్వారా, బాధ్యతా నిర్వహణ ద్వారా సత్యాన్ని కనుక్కోలేరు. ఎందుకంటే యివన్నీ ఒక లక్ష్యం చేరుకోవడం కోసం వుపయోగించే సాధనాలు. అటువంటప్పుడు ఆ లక్ష్యానికీ, సాధనాలకూ పెద్ద వ్యత్యాసం ఏమీ వుండదు. సాధనమే లక్ష్యం అవుతుంది.

'నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఆయన బదులు పలుకుతాడు' అని యీ ప్రశ్న వేసినవారు అంటున్నారు. దీనిని కూడా పరిశీలిద్దాం ప్రార్థన ఆంటే మీ అర్థం ఏమిటి? మీరు చాలా వుల్లాసంగా వున్నప్పుడు, సంతోషంగా వున్నప్పుడు, ఏ గొడవలూ, ఏ బాధలూ లేకుండా వున్నప్పుడు ప్రార్థిస్తారా? దుర్భరమైన బాధలున్నప్పుడే, అలజడీ, భయమూ, సంక్షోభమూ వున్నప్పుడే ప్రార్ధిస్తుంటారు. మీ ప్రార్థన అర్ధింపులతో, వేడుకోళ్ళతో కూడుకొని వుంటుంది. బాధలో వున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటారు, ఒక వున్నతమైన శక్తి ఏదో మీకు చేయూత నివ్వాలని కోరుకుంటారు. సహాయం కోసం వేడుకొనే రకరకాల ప్రక్రియలనే ప్రార్ధన అని అంటున్నారు. అంటే ఏం జరుగుతున్నదన్నమాట? ఎవరిముందో మీ భిక్షాపాత్రను జాపుతున్నారు. అది ఎవరిముందయితే ఏమిటి- ఒక దేవదూత అవచ్చు, మీరే స్వయంగా చిత్రకల్పన చేసుకొని దేవుడు అని పేరు పెట్టుకున్న వారవచ్చు. భిక్ష ఎత్తిన మరుక్షణమే ఏదో ఒకటి మీకు దొరుకుతుంది. అయితే ఆ లభించినది అసలైనదా కాదా అనేది వేరే విషయం. మీకు కావలసినది మీ కలతలు, మీ బాధలు తీరిపోవడం. అందుకని సంప్రదాయంగా వస్తున్న కొన్ని ప్రత్యేకమైన మాటల్ని పేర్చి మీ భక్తిని బయటకు ప్రదర్శిస్తారు. ఆపకుండా పదేపదే అవి పునశ్చరణ చేయడంవల్ల మనస్సు నెమ్మదించే మాట నిజమే. అయితే అది అసలైన ప్రశాంతి కాదు. కేవలం మనసుని మత్తులో పడేసి నిద్రబుచ్చడం. ఈ విధమైన మత్తుద్వారా వచ్చిన ప్రశాంత స్థితిలో అర్థించడం జరిగితే దానికి ప్రత్యుత్తరం కూడా వచ్చినట్లే అనిపిస్తుంది. అయితే యిది దేవుడు బదులు పలకడం కానే కాదు. మీ చిత్ర విచిత్రమైన వూహాకల్పనల్లో నుండి వచ్చినదే అదీ. మీరు అడిగిన ప్రశ్నకు యిదే సమాధానం. కాని యింత లోతుగా విచారించి చూడటం మీకు ఇష్టం వుండదు. అందుకని ఒక ప్రశ్న వేసి వూరుకుంటారు. మీరు చేసే ప్రార్థన ఒక విన్నపం. ఏదో విధంగా మీ ప్రార్థనకు ప్రత్యుత్తరం సంపాదించాలని మీ తాపత్రయం. ఆ విధంగా మీ బాధలు తొలగి పోతాయని మీరనుకుంటారు. మీ హృదయాన్ని ఏదో ఒకటి రాచి రంపాన పెడ్తూ వుంటుంది. ప్రార్థనలు చేయడం ద్వారా మిమ్మల్ని మీరే నిశ్చలనంగా, మత్తుగా తయారు చేసుకో గలుగుతారు. ఇటువంటి కృత్రిమమైన ప్రశాంతిలో ఒక ప్రత్యుత్తరం వినబడుతుంది. అది తప్పకుండా మీకు తృప్తి కలిగించేదే అయ్యుంటుంది. లేకపోతే దాన్ని మీరే ఆవతలకు నెట్టిపారేసి వుండేవారు. ఈ ప్రార్థన మీకు తృప్తి కలిగించేది కాబట్టే దాన్నీ మీరే తయారుచేసుకొని వుంటారు. మీరు స్వయంగా కల్పన చేసుకున్నదే మీకు సహాయపడుతున్నది. ఇది ఒక రకం ప్రార్థన. ఇంకొక రకం వున్నది, ప్రయత్న పూర్వకంగా మనసుని ప్రశాంతంగా, స్వీకార శీలంగా తెరచివుంచే వుద్దేశ్యంతో చేసే ప్రార్ధన. సంప్రదాయం చేత, గతం అనే నేపధ్యంచేత నిబద్ధీకృతం కావించబడిన మనస్సు మూసుకొని పోయి కాకుండా తెరచుకొని ఎట్లా వుంటుంది? తెరచి వుంచడం అంటే ఆవగాహన శీలత్వం; అంటే ఆలోచనకు అందనివాటిని గ్రహించే శక్తి కలిగి వుండటం, బంధించి వేసి, నమ్మకం అనే రాటకు మనసును కట్టి పడేస్తే అప్పుడది తెరచుకొని వున్న మనసు కాదు. ఉద్దేశ్య పూర్వకంగా తెరచివుంచుతే అప్పుడు ఆ మనసు అందుకునే ప్రత్యుత్తరాలు కూడా ఆ మనసు స్వయంగా తయారు చేసుకున్నవే అయివుంటాయి. మనసును నిబద్దీకరణం నుంచి తప్పించినప్పుడు మాత్రమే, ఒక్కొక్క సమస్యతల ఎత్తగానే దానితో తలపడటం ఎట్లాగో తెలిసినప్పుడు మాత్రమే- అప్పుడు మాత్రమే సమస్యలనేవే లేకుండా పోతాయి. వెనకటి నే పధ్యం కొనసాగుతూ వున్నంతవరకు సమస్యలు తయారవుతూనే వుంటాయి. అది ఎడతెగకుండా కొనసాగాలి అనుకుంటే సంక్షోభమూ, బాధలూ ఎక్కువవుతూనే వుంటాయి. స్వీకారశీలత్వం అంటే మనసుని తెరచివుంచగలిగిన సామర్థ్యం. అంటే 'వున్నది' ని నిందించడంగాని, సమర్థించడంగానీ లేకుండా స్వీకరించగలగడం. ఈ 'వున్నది' నుంచి పారిపోవాలనే మీరు ప్రార్థన ద్వారా ప్రయత్నిస్తుంటారు.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VI వాల్యూమ్,

కొలంబో, 8 జనవరి 1950.

ప్రశ్న : అపరిమితమైన ఆవేదన, నైరాశ్యం నన్ను అలముకున్నప్పుడు, నా ప్రయత్నం ఏదీ లేకుండానే ఎవరో తెలియని ఆ పైవాడికి నన్ను నేను పూర్తిగా అర్పించుకుంటాను. ఆ విధంగా నాలో నిస్పృహ తొలగిపోతుంది. ఇదే లేకపోతే నేను సర్వనాశనమైపోయి వుండేవాడిని. ఈ సమర్పణ అనేది ఏమిటి, యిట్లా చేయడం తప్పా?

కృష్ణమూర్తి : బుద్ధిపూర్వకంగా ఏదో తెలియని ఒకదానికి మనసు తన్ను తాను అర్పించుకోవడం సరియైన పద్ధతి కాదు. ఇది కూడా ప్రేమ, నమ్రత లేని మనిషి ప్రయత్నపూర్వకంగా ప్రేమని, నమ్రతని అలవరచుకోవడం లాంటిదే. నాలో హింస వున్నది, అహింసాత్మకంగా అవాలని నేను ప్రయత్నిస్తున్నంత మాత్రాన నాలో హింస లేకుండా పోదు. నేను వినయంగా ప్రవర్తిస్తూ వుంటే నాలో నిజంగా నమ్రత వున్నట్లా? అట్లా ప్రవర్తించడాన్ని మర్యాద అంటాం. అది నమ్రతకాదు. ఇందులోని నిజం మీకు కనబడుతున్నదా? అబ్బ, చాలా తెలివైన మాటలు, ఎంతో చమత్కారంగా చెప్పారు. అని ప్రశంసించకండి. ఇందులో వున్నది చమత్కారం కాదు. ఉద్దేశ్య పూర్వకంగా తనని తానే మంచిగా వుండమని ప్రోత్సహించుకునే వ్యక్తి చేస్తున్నదీ, దేవుడు అని తను పేరు పెట్టుకున్న వాడికి, ఆ పైవాడికి తన్ను తాను సమర్పించుకునే వ్యక్తి చేస్తున్నదీ- బుద్ధి పూర్వకంగా, తమ యిచ్ఛానుసారం చేస్తున్న ఒక సంకల్పక్రియ. అటువంటి సమర్పణ సమర్పణ కాదు. అది తనను తాను మరచిపోవడం, మరొకర్ని తెచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టడం, భర్తీ చేయడం, ఒక విధమైన పలాయనం, తనని తానే సమ్మోహ పరచుకోవడం లాంటిది, మాదక ద్రవ్యాలు తీసుకోవడం లాంటిది, అర్ధంలేని మంత్రాలను పునశ్చరణ చేయడం లాంటిది.

బుద్ధి పూర్వకంగా చేసేది కానటువంటి సమర్పణ కూడా ఒకటి వున్నది. అందులో అణుమాత్రం కూడా కోరుకోవడం, కావాలనుకోవడం వుండవు. మనసు ఒత్తిడి చేయడం వలన చేస్తే అది సమర్పణ కాదు. శాంతి కావాలనీ, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, దైవప్రేమే నా లక్ష్యం' అనీ మనసు అంటే అది ప్రేమ కానే కాదు. మనసు బుద్ధిపూర్వకంగా చేసే కార్యకలాపాలన్నీ మనసు ఎడతెగకుండా కొనసాగడానికి తోడ్పడుతుంటాయి. కొనసాగింపు వున్నదెప్పుడూ కాలంతో కలసివుంటుంది. కాలం అంతమైనప్పుడే సత్యమైనది వునికిలోకి రాగలుగుతుంది. మనసు సమర్పణ చేసుకోలేదు. మనసు చేయగలిగిందల్లా నిశ్చలంగా వుండటం, అయితే ఆశ వున్నా, నిరాశ వున్నా నిశ్చలత్వం కలగదు. నిరాశ అనే ప్రక్రియనీ అర్థం చేసుకుంటే, మనసు కనుక అసలు నిరాశలో వున్న అంతరార్థాన్ని గ్రహిస్తే, అప్పుడు అందులోని నిజం తెలుస్తుంది. ఒకటి కావాలని మీరు కోరుకుంటున్నప్పుడు, అది పొందలేకపోతే నిరాశ తప్పకుండా కలుగుతుంది. కోరుకున్నది కారు అవచ్చు, స్త్రీ అవచ్పు, దేవుడవచ్చు, అన్నీ సమానమే, భేదమేమీ లేదు. ఏదయినా ఒకటి కావాలి అని మీరు కోరుకోగానే, అప్పుడే ఆ కోరడంలోనే నిరాశ ఆరంభం అవుతున్నది. నిరాశ అంటే భంగపాటు. మీరు కావాలనుకున్నది మీకు లభిస్తే తృప్తిపడతారు. కావాలనుకున్నది మీకు లభించలేదు కాబట్టే 'దేవుడికి నన్ను సమర్పించుకుంటాను' అని అంటారు. కోరుకున్నది దొరికివుంటే నిస్సందేహంగా సంతృప్తి పడివుండేవారు. అయితే త్వరలోనే ఆ తృప్తి తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ యింకొకటి కావాలనుకోవడంలో మునిగిపోతారు. కాబట్టి తృప్తిచెందడానికి కావలసిన వస్తువును మాటిమాటికీ మార్చేస్తుంటారు. అందువల్ల దీనితోపాటుగా కలిగే ప్రతిఫలమూ, బాధలూ, వేదనలూ, సంతోషాలు తప్పవు.

ఏరకమయిన కోరికయినా సరే తనతో పాటుగా భంగపాటును, నిరాశను మోసుకొస్తుందనీ, ఆశనిరాశలనే ద్వంద్వాల మధ్య సంఘర్షణ దాని ఫలితమనీ మీరు అవగాహన చేసుకుంటే, అందులోని వాస్తవాన్ని మీరు గ్రహిస్తే- 'ఆ స్థితిని నేను ఎట్లా చేరుకుంటాను' అని వూరికే అడగడం కాకుండా, కోరిక వల్లనే బాధ కలుగుతున్నదని మీరు గ్రహించినప్పుడు. ఆ గ్రహింపే కోరిక నోరు మూయిస్తుంది. మనసు గోల చేస్తూ వుంటుందనే, మనసు నిరంతరంగా కదిలిపోతూ వుంటుందనే నిరంతరమైన పోరాటం సాగిస్తూ వుంటుందనే ఎరుక కలిగితే, యిచ్చారహితంగా, స్వచ్చంగా, సరళంగా ఎరుక కలిగితే- అటువంటి ఆ ఎరుక మూలంగానే ఆ గోల అంతా మరోమాట లేకుండా ఆగిపోతుంది. ప్రధానమైన విషయం ఎరుకగా వుండటం. నిరాశను పోగొట్టుకోవడమూ కాదు, నిశ్శబ్దంగా వుండటమూ కాదు. స్వచ్ఛమైన తెలివి లేదా వివేకం అంటే ఎరుకగా వున్న మానసిక స్థితి; ఆ స్థితిలో యిష్టాయిష్టాలు వుండవు, ఆ స్థితిలో మనసు నిశ్శబ్దంగా వుంటుంది. అటువంటి నిశ్చలమైన స్థితిలో 'వుండటం' మాత్రమే వుంటుంది. అప్పుడు ఆ సత్యం, అంటే కాలరహితమైన ఆ అద్భుతమైన సృజనశీలత వునికిలోకి వస్తుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VIII వాల్యూమ్,

బొంబాయి, 10, ఫిబ్రవరి 1954.

ప్రశ్న : మీ అభిప్రాయంలో నిజమైన ధ్యానం అంటే ఏమిటి?

కృష్ణమూర్తి : ముందుగా, ధ్యానం చేయడంలో గల వుద్దేశ్యం ఏమిటి? అసలు ధ్యానం అంటే మనం అనుకుంటున్నది ఏమిటి? మీరు ధ్యానం చేస్తుంటారేమో నాకు తెలియదు. ఇప్పుడు మనందరం కలిసి ప్రయోగం చేసి చూద్దాం. నిజమైన ధ్యానం అంటే ఏమిటో కని పెడదాం. ఈ విషయంలో నేను వ్యక్తంచేస్తున్న వాటిని వినడంకాకుండా, నిజమైన ధ్యానం అంటే ఏమిటి అన్నది మనందరం కలిసి కనుక్కుందాం. కలిసి అనుభవంలోకి తెచ్చుకుందాం. ధ్యానానికి చాలా ప్రాముఖ్యం వున్నది, వున్నది కదూ? నిజమైన ధ్యానం అంటే ఏమిటో మీకు తెలియకపోతే, స్వీయజ్ఞానం కూడా వుండదు. మీ గురించే మీకు తెలియకపోతే ధ్యానానికి అర్థంలేదు. ఎక్కడో ఒక మూలన కూర్చొని గాని, తోటలోనో, వీధిలోనో అటూ యిటూ పచార్లు చేస్తూ గాని ధ్యానంచేయడానికి ప్రయత్నించడంలో అర్థంలేదు. దానివల్ల ఒక విధమైన ఏకాగ్రత కలుగుతుంది, అంటే కొన్నింటిని బహిష్కరించడం. మీలో కొందరైనా యీ పద్ధతులన్నీ ప్రయత్నించే వుంటారు. అంటే, ఒక ప్రత్యేకమైన విషయం మీద కేంద్రీకరించే ప్రయత్నం చేయడం, మనసును నిర్బంధించడం, నిలకడ లేకుండా కొట్టుకుపోతున్న మనసును ఒకదానిమీద కేంద్రీకరింప జేయడం; అది సాధ్యం కానప్పుడు ప్రార్థనకు పూనుకుంటారు.

కనుక, సరియైన ధ్యానం అంటే ఏమిటి అనేది అవగాహన చేసుకోవాలను కున్నప్పుడు మనం ధ్యానం అని అనుకుంటున్న అసత్యాలను గురించి కూడా తెలుసుకోవాలి. ఏకాగ్రత ధ్యానం కాదనడంలో సందేహం లేదు. ఎందుకంటే మీరు గమనించి చూస్తే, ఒకదానిపై ఏకాగ్రత నిలపడం అనే ప్రక్రియలో తక్కినవాటిని బహిష్కరించడం వుంటుంది. అంటే ధ్యాసను మళ్ళించడం వుంటుంది. ఒకదాని మీద ఏకాగ్రత నిలపాలని మీరు ప్రయత్నిస్తుంటారు, కాని మీ మనసు మరో దాని మీదకు షికారు వెళ్తూంటుంది. మనసు స్థిరంగా ఒకదాని మీద నిలబడటం, అది తిరస్కరించి మనసు ఎటో షికారు చేయడం అన్న రెండింటి మధ్యా సదా సమరం జరుగుతూ వుంటుంది. ఈ విధంగా సంవత్సరాల తరబడి ఏకాగ్రత సాధించడం కోసం, ఏకాగ్రత నేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ వుంటాం. ఇదే ధ్యానం అనే తప్పుడు అభిప్రాయంలో వుంటాం. ఇక, ప్రార్థన అనే సంగతి వుంది. ప్రార్థన ద్వారా కొన్ని ఫలితాలు పొందడం జరుగుతూ వుంది. లేని పక్షంలో లక్షలాదిమంది ప్రజలు ప్రార్థనలు చేయరు. ప్రార్ధన చేస్తున్నప్పుడు మనసు నెమ్మదించడం కూడా నిజమే. కొన్ని కొన్ని వాక్యాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేస్తుండటం వల్ల మనసు నెమ్మదిస్తుంది. ఆ నెమ్మదిలో ఏదయినా తెలిసిరావచ్చు, కొంత గ్రహింపు, కొంత స్పందన అందుకోవడం జరుగుతుంది. అయితే యిదంతా కూడా మనసు చేసే యింద్ర జాలంలోనిదే. ఎందుకంటే సమ్మోహపరచుకొనే పద్ధతి ద్వారా మనసుని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చును. అటువంటి ప్రశాంతస్థితిలో అచేతన మానసంలో నుండీ, చేతన మానసానికి అవతల నుండీ ప్రచ్ఛనంగా వుండిపోయిన కొన్ని స్పందనలు బయటకు రావచ్చు. అయినా కూడా యీ స్థితి మనలో అవగాహన కలిగించే స్థితి మాత్రం కాదు.

సరే, ధ్యానం అంటే భక్తి కాదు. ఒక ఆలోచన మీదనో, ఒక బొమ్మ మీదో, ఒక ఆదర్శం మీద భక్తి నిలపడం ధ్యానం కాదు. ఎందుకంటే మనసుకి సంబంధించినవన్నీ కూడా విగ్రహారాధన కిందికి వస్తాయి. ఒక ప్రతిమను పూజించడం మాత్రమే విగ్రహారాధన అనీ, వెర్రితనమనీ, మూఢవిశ్వానమనీ మీరు అనుకోవచ్చు. కొని చాలామంది మనసులో పుట్టిన వాటిని కూడా పూజిస్తూ వుంటారు. ఇది కూడా విగ్రహారాధనే. ఒక బొమ్మకు కాని, ఒక ఆలోచనకు కాని, ఒక పరమగురువుకు కానీ భక్తి చూపడం ధ్యానం కాదు. అది నిస్సందేహంగా తననుంచి పారిపోవడానికి ఒక మార్గం. ఈ పారిపోవడం చాలా సుఖంగా వుంటుంది. అయినో కూడా ఆది పలాయనమే.

సత్పురుషులుగా మారాలనే యీ నిరంతర ప్రయాస, క్రమశిక్షణ ద్వారా, తనని తాను జాగ్రత్తగా పరీక్షించుకుంటూ వుండటం ద్వారా సద్గుణాలు సంపాదించాలను కోవడం- యివన్నీ కూడా ధ్యానం కాదు అని గట్టిగా చెప్పచ్చు. మనలో చాలామంది యీ ప్రక్రియల్లో చిక్కుకొని పోతారు. ఇవి మనల్ని గురించిన అవగాహనను మనకి కలిగించవు కాబట్టి సవ్యమైన ధ్యానానికి యివి మార్గాలు కావు. అసలు మిమ్మల్ని మీరు అర్థంచేసుకోకపోతే సవ్యంగా ఆలోచించడానికి మీకు ఆధారం ఎక్కడుంటుంది? స్వీయ అవగాహన లేనప్పుడు మీరు చేయగలిగిందల్లా ఏమిటంటే మీ వెనకాల వున్న నేపధ్యానికి, మీ నిబద్ధీకరణం కలిగించే స్పందనలకు లొంగిపోయి వుండిపోతారు. నిబద్దీకరణాన్ని బట్టి ప్రతిస్పందించడం ధ్యానం కాదు. అయితే యీ ప్రతిస్పందనలను గురించి ఎరుకగా వుండటంవల్ల, అంటే ఏ దూషణ భావమూ లేకుండా ఆలోచనల, మనోభావాల రాకపోకల ఎడల ఎరుకగా వుండటం వల్ల 'నేను' యొక్క తీరుతెన్నులు సంపూర్ణంగా అవగాహన అవుతాయి. అదే సవ్యమైన ధ్యానం చేసే మార్గం. ధ్యానం అంటే జీవితాన్ని వదిలేసి దూరంగా తొలగిపోవడం కాదు. ధ్యానం అంటే తనని తాను అవగాహన చేసుకొనే ఒక ప్రక్రియ. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం ఆరంభించినప్పుడు చేతనావర్తంలో వున్నదానినే కాకుండా, మీ లోపల ప్రచ్ఛన్నంగా వున్న అన్ని అంశాలనూ కూడా అవగాహన చేసుకుంటారు, అప్పుడు ప్రశాంతస్థితి కలుగుతుంది. ధ్యానం ద్వారా, నిర్బంధాల ద్వారా, లొంగదీసుకోవడం ద్వారా మనసుని నెమ్మది పరుస్తే, అది నిశ్చలస్థితి కాదు. అది నిలవవుండి పోయి, కుళ్ళిన మనసు. అప్రమత్తతో, సహనమూ వుండి, సృజనాత్మకమైన స్వీకారశీలతను సంతరించుకునే మనసు కాదు. మన స్వీయ అస్తిత్వపు స్థితిగతులను, ప్రచ్ఛన్నంగా లోపల వున్న వాటినీ, వుపరితలంలో వున్న వాటిని కూడా తేటతెల్లం చేసే ప్రతి మాట ఎడల, ప్రతి ఆలోచన, ప్రతి మనోభవం ఎడల నిరంతరమైన జాగరూకత, నిరంతరమైన ఎరుక ధ్యానానికి అవశ్యం వుండితీరాలి. ఇది మహా కరినతరమైనది కాబట్టి, మనకు హాయిగా, సౌకర్యంగా వుండే కపటమైన వాటిల్లోకి పారిపోయి, అదే ధ్యానం అని అనుకుంటాము.

ధ్యానానికి ఆరంభం స్వీయజ్ఞానమే అని కనుక మీరు గ్రహిస్తే, యీ సమస్య మహా ఆసక్తికరంగానూ, అత్యంత ప్రధానమైనదిగానూ అవుతుంది. ఎందుకంటే స్వీయజ్ఞానం కనుక లేకపోతే, ఒక ప్రక్కన ధ్యానం అని మీరు అనుకుంటున్నది చేస్తూనూ వుండచ్చు, మరో పక్కన మీ ఆదర్శసూత్రాల మీద, మీ కుటుంబంమీద, మీ ఆస్తిపాస్తులమీద మమకారబంధం పెంచుకోనూవచ్చు. ఒకవేళ ఆస్తిపాస్తులను వదులుకున్నా ఏదో ఒక సిద్ధాంతం మీద మమకారం పెంచుకుంటారు. ఆ సిద్ధాంతం మీదే బాగా కేంద్రీకరించి, దాన్ని యింకా, యింకా వృద్ధి చేసుకుంటారు. ఇది ధ్యానం కాదని నిస్సంశయంగా చెప్తున్నాను. కనుక, స్వీయజ్ఞానం ధ్యానానికి ఆరంభం. స్వీయజ్ఞానం లేకుండా ధ్యానం వుండదు. స్వీయజ్ఞానం అనే అంశాన్ని బాగా లోలోపలకు తరచి చూసిన కొద్దీ, పై పైన వున్న మనసు ప్రశాంతంగా, నెమ్మదిగా అవడమే కాకుండా, ప్రచ్ఛన్న మానసంలో పొరలుపొరలుగా దాగి వున్నవన్నీ వెల్లడవుతాయి. ఉపరితల మానసం నెమ్మళించగానే, అచేతన మానసం అంటే చేతనావర్తంలో దాగివున్న పొరలు పైకి ప్రదర్శితమవుతాయి. వాటిలో వున్న విషయం బయటకు వస్తుంది. వాటిని గురించిన సూచనలను అవి అందిస్తాయి. ఆ విధంగా మీ అస్తిత్వం అనే మొత్తం ప్రక్రియ అంతా పూర్తిగా అవగతమవుతుంది.

ఆవిధంగా మనసు అమోఘమైన ప్రశాంతిని పొందుతుంది. నెమ్మళిస్తుంది. నెమ్మదిగా చేయబడటం కాదు; భయపెట్టిగాని, ప్రతిఫలం చూపి కాని నెమ్మదిగా వుండమని నిర్బంధించబడటం కాదు. ఇటువంటి నిశ్శబ్దంలో సత్యం వునికిలోకి వస్తుంది. అయితే యీ నిశ్శబ్దం క్రైస్తవ నిశ్శబ్దంకాని, హిందూ నిశ్శబ్దంకానీ, బౌద్ధనిశ్శబ్దం కానీ కాదు. ఈ నిశ్శబ్దం వట్టి నిశ్శబ్దం. దానికి పేరు లేదు. కాబట్టి క్రైస్తవ నిశ్శబ్దం లేదా హిందూ లేదా బౌద్ధనిశ్శబ్దం అనే మార్గం అనుసరిస్తే మాత్రం నిశ్శబ్దాన్ని మీరు ఎప్పటికీ పొందలేరు. అందువల్ల సత్యాన్ని కనుగొనబోయే వ్యక్తి తన నిబద్ధీకరణాన్ని పూర్తిగా వదిలేసుకోవాలి- అది క్రైస్తవ, హిందూ, బౌద్ద మరే యితర సమాజాలకి చెందినదైనా సరే. ధ్యానం ద్వారా, లొంగిపోయి. అనుగుణంగా వుండటం ద్వారా మన నేపధ్యాన్ని యింకా బలపరచుకుంటే, దాని వల్ల మనసు మురిగిపోతుంది. జడంగా తయారవుతుంది. అయితే ఎక్కువమంది కోరుకునేది యిది కాదు అని నేను గట్టిగా చెప్పలేను. ఎందుకంటే ఒక వరవడి ఏర్పరచుకొని, దాని ప్రకారం వెళ్ళిపోవడం ఎంతో సులువైన పని. కాని నేపధ్యం నుండి విముక్తి పొంది స్వేచ్ఛగా వుండాలంటే సంబంధ బాంధవ్యాలలో అనుక్షణం జాగరూకత అత్యంత అవసరం.

ఒక్కసారి నిశ్శబ్దం వునికిలోకి వచ్చిందంటే అప్పుడొక అద్భుతమైన, సృజనశీలక స్థితి కలుగుతుంది - అంటే అర్థం మీరు కవిత్వం రాస్తారని కాదు, చిత్రాలు గీస్తారనీ కాదు. చేయచ్చు, చేయక పోవచ్చు కూడా. ఈ నిశ్శబ్దాన్ని మీరు వెతికి పట్టుకోలేరు, నటించలేరు, అనుకరించలేరు- అసలు అప్పుడది నిశ్శబ్దం అవదు. ఏ మార్గం ద్వారానూ దీన్ని చేరుకోలేరు. 'నేను' తీరుతెన్నులు అవగాహన చేసుకున్నప్పుడే, 'నేను' తన కార్యకలాపాలతో, తన హానికరమైన చేష్టలతో పాటుగా అంతరించి పోయినప్పుడే నిశ్శబ్దం వునికిలోకి వస్తుంది. అంటే, మనసు సృష్టిచేయడం ఆపివేసినప్పుడే సృజనశీలత కలుగుతుంది. కాబట్టి మనసు సరళంగా అవాలి, నెమ్మది చెందాలి, నెమ్మది చెంది తీరాలి. ఇక్కడ 'చెంది తీరాలి' అన్నది తప్పు. మనసు నెమ్మదిగా అయితీరాలి అని అన్నప్పుడు నిర్బంధం చేయడం అన్న అర్థం వస్తుంది. 'నేను' అనే మొత్తం ప్రక్రియ అంతా అంతమై పోయినప్పుడే మనసు నెమ్మదిగా వుంటుంది. 'నేను' తీరుతెన్నులు అన్నీ అవగాహన చేసుకోవడం వల్ల 'నేను' కార్యకలాపాలన్నీ అంతమైపోతాయి. అప్పుడు మాత్రమే నిశ్శబ్దం వునికిలోకి వస్తుంది. ఆ నిశ్శబ్దమే నిజమైన ధ్యానం. ఆ నిశ్శబ్దంలో శాశ్వతమైనది వునికిలోకి వస్తుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, V వాల్యూమ్,

లండన్, 23 అక్టోబర్, 1949.

ప్రశ్న : నాకు తెలిసినంతలో, ఆధ్యాత్మిక విషయాలను బోధించే తక్కిన ఆచార్యులలాగా కాకుండా, అంతర్గతమైన శాంతిని అందుకోవడానికి ధ్యానమార్గాన్ని నిర్దేశించని వారు మీరొక్కరే. అంతర్గతమైన శాంతి అవసరం అని అందరం వొప్పుకుంటాం. కానీ, ఏదో ఒక ప్రత్యేక పద్ధతిని- తూర్పుదేశాల యోగాభ్యాసమో, పాశ్చాత్యుల మనోతత్వ శాస్త్రమే సాధన చేయకుండా దానిని ఎట్లా అందుకో గలుగుతాం?

కృష్ణమూర్తి : ఈ ఆచార్యులు, ఆధ్యాత్మిక గురువులు, శిష్యులూ యిదంతా పరమ దండగ కాదూ? ఒక గురువును ఆశ్రయించి శిష్యరికం మొదలు పెట్టగానే, కనుగొనడానికి, దర్శించుకోవడానికి మీకు తప్పక అవసరమైన, అనుక్షణమూ వెలుగుతూ వుండవలసిన, మీ లోపల వుండే ఆ జ్వాలను హతమార్చుకోవడం లేదూ? సహాయం కోసం అర్థిస్తూ ఒక గురువును ఆశ్రయించినప్పుడు, మీరు అన్వేషిస్తున్న సత్యం కంటే ఆ గురువే ఎక్కువ ముఖ్యడవటం లేదూ? కాబట్టి యీ గురుశిష్యుల పద్ధతినంతా వదిలేసేద్దాం. అసలు యీ పద్ధతిని మన రక్తంలో నుంచే తొలగించేసుకుని, అప్పుడు అసలు సమస్యను పరికిద్దాం. ఎందుకంటే దీని ప్రభావం మనలో ప్రతి వొక్కరి మీదా వున్నది. సత్యం కనుగొనడానికి ఏ గురువూ సహాయం చేయలేడు. అందులో సందేహం లేదు. అది మన లోపలే వుంది. మనమే అది తెలుసుకోవాలి. ఇందుకోసంగాను కష్టాలు పడాలి; బాధ, శోధన తప్పవు. ప్రతివారూ తమంత తామే అన్వేషించుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అంతేతప్ప, ఎవరో ఒక గురువును పట్టుకొని, ఆయన శిష్యరికం చేయడంవల్ల మీరు స్తబ్దతనూ, సోమరితనాన్ని అలవరచుకోవడం లేదూ? మనసు మూసుకొనిపోయి చీకటిగా అవడం లేదూ? అంతేకాకుండా అనేక రకాల వారైన గురువులూ, రకరకాలైన వారి విధానాలు అన్నీ పరస్పర విరుద్ధంగా వుంటాయి; వారిలో వారికి పోటీలు, ప్రచారం చేసుకోవడాలు- ఆ తతంగమంతా మీ అందరికీ తెలుసు.

కాబట్టి, యీ శిష్యబృందాలు, గురువులు అనే యీ పద్ధతి అంతా వట్టి హాస్యాస్పదమూ, అవివేకమూ. అయితే యిందులో వున్న ముఖ్యమైన సంగతి యిదీ: శాంతిని అందుకోవడానికి ఒక ప్రాచ్యపద్ధతిగాని లేదో ఒక పాశ్చాత్య పద్దతి గాని, అసలు ఏదో ఒక పద్ధతి అంటూ వుంటుందా? ఒకవేళ ఏదో ఒక పద్ధతిని సాధన చేయడం ద్వారా శాంతిని అందుకుంటే, మీరు అందుకున్నదానిలో, మీరు శాంతి అని అనుకుంటున్న దానిలో సజీవగుణం వుండదు. అది ప్రాణరహితంగా వుంటుంది. శాంతి అంటే యిట్లా వుండాలి అనే ఒక సూత్రీకరణ మీవద్ద వుంటుంది, దాని వైపుగా వెళ్ళడానికిగాను మీరే ఒక మార్గాన్ని చేసుకొని బయలుదేరుతారు. అటువంటి శాంతి మీ లోపల వున్న కోరికకు మీరు యిచ్చుకున్న రూపమే, అవునా కాదా? అందువల్ల అది అసలైన శాంతి కాదు. అది మీకు కావాలని మీరు కోరుకున్నదీ, మీరు ఏమిటో దానికి సరిగ్గా విరుద్ధమైనదీను. నేను సంఘర్షణల్లో, దారుణమైన బాధల్లో, వైరుధ్యాలలో చిక్కుకొని పోయివున్నాను. దౌర్బాగ్యస్థితిలో వున్నాను, నాలో హింస వుంది. ఏ గొడవలూ నాలో అలజడి కలిగించని ఒక ఆశ్రయం, ఒక స్థితి నాకు కావాలి. అందుకోసం నేను నానారకాల గురువుల వద్దకూ, ఆచార్యుల వద్దకు వెళ్తుంటాను. పుస్తకాలు చదువుతాను, నేను కోరినవి నాకు తప్పకుండా లభిస్తాయనీ భరోసా యిచ్చే క్రమశిక్షణలు పాటిస్తాను. శాంతిని పొందడానికి నన్ను అణచివేసుకుంటాను, నిగ్రహం అవలంబిస్తాను, లొంగిపోయివుంటాను. అదేనా శాంతి అంటే? శాంతి కావాలంటూ దాని వెనకాల పరిగెత్తితే చిక్కేదికాదు శాంతి- అది కలుగుతుంది, అంతే. అదే గమ్యం కాదు, దారిలో అది లభిస్తుంది. నేను - నా అనే మొత్తం ప్రక్రియను, నాలోని వైరుధ్యాలను, నా కోరికలను, ఆకాంక్షలను, నా గర్వాన్ని అవగాహన చేసుకోవడం నేను ఆరంభించినప్పుడు అది కలుగుతుంది. అయితే శాంతే నా గమ్యం అని కనుక నేను అనుకుంటే అప్పడు కదలికలేకుండా మురిగిపోయిన స్థితిలో నేను జీవిస్తుంటాను. శాంతి అంటే అదేనా?

కాబట్టి, ఏదో ఒక విధానం ద్వారానో, ఒక పద్ధతో లేదా ఒక సూత్రబద్ధమైన మార్గం ద్వారానో శాంతిని సంపాదించాలనుకుంటుంటే, ఆ విధంగా శాంతిని సాధించవచ్చు. అయితే ఆ శాంతి లొంగుబాటులో వుండే శాంతి, మరణంలో వుండే శాంతి. కాని మనలో చాలామందికి కావలసినది అదే. తళుక్కుమనే ఒక ప్రకాశం ఏదో చూస్తాను, మాటల్లో పెట్టలేని అనుభవం అది, ఆ స్థితిలోనే ఎప్పటికీ వుండిపోవాలని కోరుకుంటాను, అదే కొనసాగుతూ వుండాలని కోరుకుంటాను. నిర్ద్వందమైన పరమ సత్యం నాకు కావాలి. నిర్ద్వందమైన పరమ సత్యం అనేది ఒకటి వుంటే వుండవచ్చు గాక, మహోన్నతమైన గొప్ప అనుభవాలు వుంటే వుండవచ్చుగాక, కానీ నేను ఏదో ఒక దాన్ని గట్టిగా పట్టుకొని వేళ్ళాడుతూ వుంటే మృత్యువును ఆహ్వానిస్తున్నట్లే కాదూ? శాంతి మరణంలో లేదు. కాబట్టి యీ విధమైన గందరగోళపు స్థితిలో, సంఘర్షణలో వున్నపుడు అసలు శాంతి అంటే ఏమిటి అనేది నేను వూహించను కూడా లేను. నేను వూహించగలిగిందల్లా దానికి వ్యతిరేకమేన దానిని, అంతే. ఇష్పడు నేను వున్న దానికి వ్యతిరేకమైనది. శాంతి కానే కాదు. అందువల్ల యీ పద్దతులన్నీ కూడా యిప్పుడు నేనున్న దానికి వ్యతిరేకమైన దానిని పొందడానికి మాత్రమే నాకు తోడ్పడుతాయి. నేను ఏమిటో అవగాహన చేసుకోకుండా దానిలోకి పూర్తిగా వెళ్ళకుండా, అంటే ఒక్క సచేతనమైన పొరల్లోకే కాకుండా, అచేతనంగా వున్న పొరల్లోకి కూడా వెళ్ళకుండా, నేను- నా అనే మొత్తం ప్రక్రియను అవగాహన చేసుకోకుండా, కేవలం శాంతికోసం వెతుక్కోవడంలో ఏమాత్రం ప్రయోజనం లేదు.

చూడండి, మనలో చాలామందికి సోమరితనం అలవాటు, స్తబ్దంగా జీవిస్తుంటాం. మనకి సహాయం చేయడానికి గురువులూ, ఆశ్రమాలూ కావాలి. నిరంతరమైన మన ఎరుక శీలత్వం ద్వారా, మన శోధన ద్వారా, మన స్వంత అనుభవాల ద్వారా, అవి ఎంత స్పష్టంగా ఎంత సూక్ష్మంగా, ఎంత అందీ అందకుండా జారిపోతూ వున్నా సరే, వాటి ద్వారానే, మనంతట మనమే కనిపెట్టాలని అనుకోము. అందుకనే చర్చీలలో, సంఘాలలో చేరతాం. ఏదో ఒకదానిలో చేరి, అనుయాయూలం అవుతాం. అంటే అర్థం, ఒక పక్కన పోరాటమూ వుంటుంది, మరో పక్కన స్తబ్దతను అలవరచుకోవడమూ వుంటుంది. అయితే ఎవరయినా నిజంగా కనుగొనాలని కోరుకుంటుంటే, ప్రత్యక్షంగా అనుభవం పొందాలని కోరుకుంటుంటే- యిటువంటి అనుభవం ఏమిటి అనేది మనం యింకోసారి చర్చించుకుందాం... అప్పుడు యిటువంటివన్నీ పక్కన పెట్టి, అసలు మనల్ని మనమే అవగాహన చేసుకోవడం తప్పనిసరిగా జరగాలి. వివేకానికి స్వీయజ్ఞానమే ఆరంభం. దీని ద్వారా మాత్రమే శాంతిని పొందగలుగుతాం.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జై కృష్ణమూర్తి, VI వాల్యూమ్,

ఒహాయి, ఆగష్టు, 1952.

ప్రశ్న: ఆలోచనలు అంతులేకుండా అట్లా ఎప్పటికీ సాగిపోతూ ఉంటాయి కదా, అటువంటప్పుడు వాటిని ఆపడం అసాధ్యమయ్యేదేనా?

కృష్ణమూర్తి: 'నాకు తెలియదు' అని కనుక నేను అంటే అప్పుడు మీరేం చేస్తారు? నిజంగానే నాకు తెలియదు. సర్! ఇక్కడ చెప్తున్న విషయాన్ని శ్రద్దగా వినండి. ఎన్నో రకాలైన ప్రయత్నాలు జరిగాయి. ఆశ్రమాల్లో చేరడం; ఒక బొమ్మతోనో, ఒక సిద్దాంతంతోనో, ఒక వూహాప్రతిపాదనతోనో మనల్ని మనం తాదాత్మ్యం చేసుకోవడం క్రమశిక్షణ ద్వారా, ధ్యానం ద్వారా, నిర్బంధించీ, అణచివేసీ ఆలోచనలను అంతంచేయడానికి ప్రయత్నించడం- మనిషి తనకు సాధ్యమైన పద్ధతులన్నీ ప్రయత్నంచేసి చూశాడు. శత సహస్రాలైన పద్ధతుల్లో తనను తాను చిత్రహింస చేసుకున్నాడు, ఎందుకంటే ఆలోచించడం అంటేనే దుఃఖాన్ని కొనితెచ్చుకోవడం అని గ్రహించాడు కాబట్టి. అయితే అసలు అది ఎట్లా సాధించగలం? ఇందులో అనేకమైన విషయాలు కలిసిపోయి వున్నాయి. ఆలోచన్లని ఆపివేయాలనీ మీరు ప్రయత్నించిన మరుక్షణంలోనే అది ఒక సమస్య అయి కూర్చుంటుంది. ఒక పరస్పర వైరుధ్యంగా తయారవుతుంది. ఆలోచనను ఆపుచేయాలని మీరు చూడటం, అదేమో యింకా యింకా సాగుతూ వుండటం, ఈ పరస్పర వైరుధ్యమే సంఘర్షణను పెంచి పోషిస్తుంది. వైరుధ్యాలన్నీ కూడా సంఘర్షణలకు ఆటపట్టులు. కాబట్టి మీరు చేసింది ఏమిటి? ఆలోచనలను మీరు అపలేక పోయారు. పైగా మరో కొత్త సమస్యను పట్టుకొచ్చారు. అదే సంఘర్షణ ఆలోచనలను ఆపాలని ఏ ప్రయత్నం చేసినా దానివల్ల ఆలోచనకి మరికొంత మేత దొరికి, యింకాస్త బలం పుంజుకుంటుంది. మీరు ఆలోచించి తీరాలి, తప్పదు అని మీకు తెలుసు. స్పష్టంగా, దోషరహితంగా, స్థిరచిత్తంతో, హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించడానికి మీ వద్ద వున శక్తిలో ప్రతిబొట్టూ వుపయోగించవలసి వస్తుంది. అయితే ఆరోగ్యకరమైన, హేతుబద్దమైన, తార్కికమైన ఆలోచనలు ఆలోచించడాన్ని ఆపలేవనే సంగతి కూడా మీకు తెలుసు.

ఇప్పుడిక మీరు ఏం చేయాలి? ఆలోచించడం ఆపి తీరాలి అనే ఒక సూత్రం తయారు చేసుకొని, అది సాధించడానికి అణచి వేసుకోవడం, క్రమ శిక్షణలో పెట్టుకోవడం, లోపలకు తొక్కి చేసుకోవడం, నిరోధించడం, లొంగిపోయి వుండటం వంటి ఏ పద్దతిని అవలంబించినా అది దండగే అని మీకు తెలుసు. అవన్నీ తోసి పారేశేయ్యండి. ఆ పని చేశారా? త్రోసివేసేక అప్పుడిక ఏం చేస్తారు? బొత్తిగా ఏమీ చేయరు! మొదట్లో యిదంతా ఆపి వేయాలని ఒక ఆలోచన చేశారు. అది ఒక భావన. దాని వెనకాల ఒక వుద్దేశ్యం వుంది. అదంతా ఆపివేయాలని అసలు మీరు ఎందుకు అనుకున్నారంటే ఆలోచన ద్వారా ఏ సమస్యా పరిష్కరించలేక పోయారు కాబట్టి. అందువల్ల మనస్సు- మనస్సులోని ఏదో ఒక భాగం కాదు, ఒక ప్రత్యేకమైన చిన్న ముక్కకాదు, మొత్తం మనసు సంపూర్ణంగా- నాడీమండలం, మెదడు, మనోభావాలు, అన్నీ --వీటన్నింటినీ కలుపుకొని వుండే ఆ మనస్సు యీ విషయంలో ఏమీ చేయలేనని గ్రహించగలుగుతుందా? అది తెలుసుకున్నాక కూడా అట్లానే సాగిపోతుందా? అట్లా సాగిపోదని మీరే కని పెడతారు.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVI పొల్యూమ్,

సానెన్, 19 జూలై, 1966.

ప్రశ్న: మీరు చెప్తున్న యీ స్వీయజ్ఞానం అంటే ఏమిటి? నేను అది ఎట్లా సంపాదించగలుగుతాను? దీనికి ఆరంభం ఎక్కడ? ఎట్లా?

కృష్ణమూర్తి: సరే, దయచేసి శ్రద్దగా వినండి. స్వీయ జ్ఞానాన్ని గురించి మీకేవేవో విపరీతమైన పూహలు వున్నాయి- స్వీయజ్ఞానాన్ని సంపాదించడానికి రోజూ సాధన చేయాలనీ, ధ్యానం చేయాలనీ, యింకా రకరకాలవేవో చేయాలనీ మీరు అనుకుంటూ వుంటారు. కానీ సర్! యిది చాలా సులువుగా చేయచ్చు. స్వీయజ్ఞానానికి మొదటిమెట్టే ఆఖరిమెట్టు కూడా ఆరంభమే ముగింపు. ఆ మొదటి సోపానమే ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే స్వీయజ్ఞానం మరొకరి ద్వారా నేర్చుకోనేది కాదు. ఎవరో వచ్చి మీకు మీ స్వీయజ్ఞానం బోధించలేరు. మీకు మీరుగా తెలుసుకోవాలి. మీ అంతట మీరే స్వంతంగా కనుక్కోవాలి. అయితే యీ కని పెట్టినది బ్రహ్మాండంగానూ, అత్యద్భుతంగానూ వుండదు. చాలా సరళసామాన్యంగా వుంటుంది. నిజంగా చూస్తే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే, మీ ప్రవర్తన తీరును, మీ మాటలను, దైనందిన జీవితంలోని మీ బాంధవ్యాలలో ఎట్లా వుంటారు అనేవాటిని జాగ్రత్తగా గమనించడం, అంతే. దాంతో ఆరంభించండి. అప్పుడు యీ ఎరుకతో వుండటం- అంటే - మీరు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారు, నౌకరుతో మాట్లాడేటప్పుడు, పై అధికారితో మాట్లాడేటప్పుడు ఏయే మాటలు వుపయోగిస్తుంటారు, మనుష్యుల ఎడల, రకరకాల భావాల ఎడల, యితర విషయాల ఎడల మీరు ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తారు అన్నవి జాగ్రత్తగా గమనించడం; యిదంతా- ఎంత మహా కరినంగా వుంటుందో తెలుసుకుంటారు. మీ ఆలోచనలను, మీ వుద్దేశ్యాలను, సంబంధ బాంధవ్యాలనే అద్దంలో ఒకసారి గమనించండి; గమనిస్తున్న క్షణంలోనే, 'ఇది మంచిదే, అది మంచిది కాదు, నేను యిది చేయాలి, అది చేయకూడదు' అనుకుంటూ సరిదిద్దుకోవాలని చూస్తారు. బాంధవ్యాలు అనే అద్దంలో మిమ్మల్ని మీరు పరికించుకుంటున్నప్పుడు ఖండించేదో, సమర్థించేదో అయిన దృష్టి మీలో వుంటుంది. అందువల్ల మీరు చూస్తున్న దానిని వక్రీకరిస్తారు. అట్లాకాకుండా, ఆ అద్దంలో చూస్తూ, యితరుల ఎడల, సిద్ధాంతాల ఎడల, విషయాల ఎడల మీ వైఖరి ఎట్లా వున్నది అనేదాన్ని వూరికే గమనిస్తూ, తప్పొప్పుల నిర్ణయం చేయకుండా, ఖండించకుండా, ఆమోదించకుండా కేవలం యదార్థాన్ని మాత్రం చూడండి. అప్పుడు ఆ గ్రహింపులోనే దానివల్ల జరిగే చర్య కూడా వున్నదని తెలుసుకుంటారు. స్వీయజ్ఞానానికి యిదే ఆరంభం. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా గమనించుకుంటూ వుండటం, మీరు చేస్తున్నదానిని, మీరు ఆలోచిస్తున్నదానిని, మీ లోపలి వుద్దేశ్యాలు ఏమిటి, మీకు ప్రేరణ కలిగించే ఆకర్షణలు ఏవి అని పరిశీలిస్తూ వుండటం; పైగా చూడటంలో ఖండనగాని, సమర్ధనగాని లేకుండా వుండటం మహా కరినమైన పని. ఎందుకంటే మొత్తం మీ నాగరికత అంతా ఖండించడం, తప్పొప్పులు నిర్ణయించడం, విలువలు బేరీజువేయడం అనేవాటి మీద ఆధారపడి వున్నది. “ఇది చేయాలి, యిది చేయకూడదు” అని నేర్పిస్తూ మిమ్మల్ని పెంచడం జరిగింది. బాంధవ్యం అనే అర్ధంలో కనబడుతున్న దానిని, ఆ వున్నదానికి విరుద్ధమైనది తయారుచేయకుండా చూడగలిగినప్పుడు, స్వీయజ్ఞానానికి ఒక ముగింపు అంటూ లేదని అప్పుడు మీరే గ్రహిస్తారు.

చూడండి, స్వీయజ్ఞానం కోసం చేసే శోధన మొదటగా ఒక బాహిరమైన కదలిక ఆ తరువాత అది అంతర్ముఖంగా మళ్ళుతుంది. ముందుగా నక్షత్రాల దిక్కుగా చూస్తాం. ఆ పైన మన లోపలకు మనం చూసుకుంటాం. అదే విధంగా, యదార్థమైన దీనికోసం, దేవుడికోసం, భద్రతకోసం, సంతోషం కోసం ముందుగా యీ దృశ్య ప్రపంచంలో వెతుకుతాం. అక్కడ కనబడనప్పుడు అంతర్ముఖంగా మళ్ళుతాం. స్వీయజ్ఞానం వలన లోపలవున్న దేవుడి కోసమో, పరబ్రహ్మం కోసమో లేదూ ఏదో మీరు పెట్టుకున్న పేరు కోసమో సాగించే అన్వేషణ ఆగిపోతుంది. మనసు అప్పుడు చాలా నెమ్మదిగా అవుతుంది. అది క్రమశిక్షణ వల్ల కాకుండా కేవలం అవగాహన ద్వారా, జాగరూకతతో గమనించడం ద్వారా, మనసు తనని గురించి తాను ప్రతి క్షణమూ నిరపేక్షకమైన ఎరుకతో వుండటం ద్వారా మాత్రమే యిది జరుగుతుంది. “నేను ప్రతి క్షణమూ ఎరుకతో వుండితీరాలి” అని అనకండి. ఎందుకంటే, ఒక గమ్యం చేరాలనీ, ఒక ప్రత్యేకమైన స్థితిని అందుకోవాలనీ మనం కోరుకుంటుంటే అది మన మూర్ఖత్వానికి మరొక ప్రత్యక్ష నిదర్శనం అవుతుంది. ముఖ్యమైనది ఏమిటంటే మీ గురించి మీరు ఎరుకగా వుండటం. అదంతా పోగుచేసి నిలవవుంచు కోవడం కాకుండా ఎరుకగా వుంటూనే వుండటం, ఎందుకంటే నిలవచేసుకోవడం ఆరంభించగానే ఆ ఏర్పడిన కేంద్రంలో నుండి విమర్శించడం మొదలవుతుంది. స్వీయజ్ఞానం అంటే పోగుచేసుకొని నిలవవుంచుకునే ప్రక్రియ కాదు. సంబంధబాంధవ్యాలలో ప్రతి క్షణమూ 'కనిపెట్టడం' అనే ఒక ప్రక్రియ.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VIII వాల్యూమ్,

బొంబాయి. 20 ఫిబ్రవరి 1955.

ప్రశ్న : మీ దృష్టిలో ఎరుక అంటే ఏమిటో దయచేసి వివరంగా చెప్తారా?

కృష్ణమూర్తి : కేవలం స్పృహగా వుండటం, అంతే, మీరు తప్పొప్పులు నిర్ణయం చేస్తూ వుండటం గురించీ, మీలో వుండే అపోహల గురించీ, మీ యిష్టాలను గురించీ, అయిష్టాలను గురించీ ఎరిగివుండటమే ఎరుక. ఏదయినా ఒక విషయాన్ని మీరు చూస్తుంటే, ఆ చూడటం మీద మీ పోల్చిచూడటం, ఖండించడం, తప్పొప్పులు తీర్మానించడం, విలువలు కట్టడం అనే వాటి ప్రభావం వుంటుంది. వీటన్నింటి పర్యవసానమే మీరు చూడటం, కాదంటారా?మీరు ఏదయినో చదువుతున్నప్పుడు, చదువుతూ వుండగానే తప్పొప్పులు నిర్ణయిస్తూ, విమర్శిస్తూ, ఖండిస్తూ, ఆమోదిస్తూ వుంటారు. ఎరుకగా వుండటం అంటే ఆ జరుగుతున్న క్షణంలోనే యీ తప్పొప్పుల నిర్ణయం, విలువలు బేరీజు వేయడం, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, సంప్రదాయ బద్ధత, సన్ముతమూ, నిరాకరించడమూ అనే యీ మొత్తం ప్రక్రియనంతా చూడటం.

సరే, యిదంతా లేకుండా ఎరుకగా వుండటం ఎవరికైనా సాధ్యమేనా? ప్రస్తుతం మనకు తెలిసిందల్లా విలువలు బేరీజు వేసే ప్రక్రియ ఒక్కటే. అది, ఆ విలువలు కట్టడం ఎట్లా వచ్చిందంటే మన నిబద్ధీకరణపు, మన నేపథ్యపు, మన మతపరమైన, నీతిపరమైన, మనం నేర్చిన విద్యకి సంబంధించిన ప్రభావాలు అన్నింటినీ మిళితం చేసుకోగా వచ్చిన ఫలితం అది. మన స్పృహ అని మనం అంటున్న అది మన జ్ఞాపకాల ద్వారా కలుగుతున్నది- 'నా' అనే జ్ఞాపకం, డచ్ వాడిని, హిందువుని, బౌద్ధుడిని, కేథలిక్ ని, మరొకరిని, మరొకరినీ అనే స్మృతి, 'నేను' అంటే- నా జ్ఞాపకాలు, నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు, నా గుణగణాలు. అంటే పరికించడం, తప్పొప్పులు నిర్ణయించడం, విలువలు కట్టడం. మనం అప్రమత్తంగా కనుక వుంటే యివన్నీ మనకు చిరపరిచితమైనవే అని గ్రహించవచ్చు. సరే, యివన్నీ లేకుండా, 'నేను' లేకుండా ఎరుకగా వుండటం సాధ్యం కాదా? ఖండించడం లేకుండా కేవలం చూడటం, పరికించి చూడటం సాధ్యమవుతుందా? మనసులోని కదలికలను, మన స్వంత మనసును, తప్పొప్పులు నిర్ణయించడం లేకుండా, విలువలు కట్టడం లేకుండా, 'ఇది మంచి' 'ఇది చెడు' అంటూ ఖండించకుండా వూరికే పరిశీలించడం సాధ్యం కాదా?

నేను' లోనుండి వుత్పన్నమయే ఎరుక, అంటే విలువలు కట్టడాలతోను, తీర్పులు చెప్పడాలతోను కూడుకొని వున్న ఎరుక ద్వైదీభావాన్నీ, రెండు వ్యతిరేక భావాల మధ్య, 'వున్నది' 'వుండవలసినది' అనే రెండింటి మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది. అటువంటి ఎరుకలో తప్పొప్పులు నిర్ణయించడం వుంటుంది, భయం వుంటుంది, విలువలు కట్టడం వుంటుంది; ఖండించడమూ, ఫలానాది అని గుర్తించడమూ వుంటాయి. ఇదంతా కేవలం 'నా' యొక్క, 'స్వ' యొక్క, 'నేను' యొక్క ఎరుక- యిందులో నేనుకు సంబంధించిన సంప్రదాయాలు, స్మృతులు మొదలైనవన్నీ మిళితమై వుంటాయి. ఇటువంటి ఎరుక పరిశీలిస్తున్నవాడికి, అతడు పరిశీలిస్తున్న దానికీ మధ్య, నేను ఏమిటి అన్నదానికి నేను ఎట్లా వుండాలి అన్నదానికి మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది. కాబట్టి ఖండించడం, తప్పొప్పులు నిర్ణయించడం, విలువలు కట్టడం అనే ప్రక్రియ లేకుండా ఎరుకగా వుండటం సాధ్యం కాదా? నా వైపుకు నేను వూరికే చూసుకోవడం- నాలో వున్నవి ఎటువంటి ఆలోచనలయినా సరే- ఖండించకుండా, తప్పొప్పులు నిర్ణయించకుండా, విలువలు కట్టకుండా చూసుకోవడం సాధ్యం కాదా? మీరెప్పుడయినా యిది ప్రయత్నించారేమో నాకు తెలియదు. ఇది చాలా కరినాతికరినమైన పని. ఎందుకంటే చిన్నతనం నుండీ మనకు యిచ్చిన శిక్షణ వల్ల మనం ఎప్పుడూ ఖండించడమో, ఆమోదించడమో చేస్తూ వుంటాం. ఈ ఖండన, ఆమోదం అనే ప్రక్రియలో ఆశాభంగం వుంటుంది, భయం వుంటుంది, నమిలివేస్తున్నలాంటి బాధ, ఆందోళన వుంటాయి. ఇదే 'నా' అనే, 'నేను' అనే ప్రక్రియ.

కాబట్టి, యిదంతా తెలుసుకున్నాక, ఒక ప్రయాసగా కాకుండా, ఖండించకూడదు అని ప్రయత్నించకుండా, తప్పొప్పుల నిర్ణయాలు చేయకుండా మనసు ఎరుకగా వుండగలదా? ఎందుకంటే 'నేను ఖండించకూడదు' అని అన్న మరుక్షణమే ఖండన అనే ప్రక్రియలో మనసు చిక్కుకొని పోయివుంటుంది. మనస్సు ఆవేశ రహితంగా గమనించగలదా, ఆ విధంగా తనకు విషయాలతో, మనుష్యులతో, వివిధ భావాలతో వున్న బాంధవ్యం అనే అద్దంలో తన ఆలోచనలను, తన మనోభావాలను పరిశీలించుకోగలదా? అటువంటి మౌనమైన పరిశీలన వలన ఏకాకితత్వము, ఆర్ధ్రత లేని మేధావితత్వమూ అలవడి, పెరిగిపోతాయని అనడానికి వీల్లేదు. అందుకు పూర్తిగా విరుద్ధంగా జరగవచ్చు. నాకు ఒక విషయం గురించి అవగాహన కలిగినప్పుడు యిక ఖండించడం అనేది వుండనే వుండకూడదు; పోల్చి చూడటం కూడా వుండకూడదు ఇది నిజంగా చాలా సులువైన విషయం. కానీ పోల్చిచూడటం ద్వారా అవగాహన జరుగుతుందని మనం అనేకమైన వాటితో రకరకాలుగా పోల్చి చూస్తుంటాం. మన విద్యావిధానంలో అంతా పోల్చి చూడటమే. మన సమస్తమైన నీతి సూత్రాలు, మతవ్యవస్థ అంతా పోల్చి చూడటం, ఖండించడం అనే వాటితో ముడిపడి వున్నాయి.

కాబట్టి, నేను చెప్తున్న ఎరుక ఏమిటి అంటే- ఖండించడం అనే మొత్తం ప్రక్రియ ఎరిగివుండటం, దాన్ని పూర్తిగా అంతం చేసి వేయడం. ఇందులోనే తప్పొప్పుల నిర్ణయం లేకుండా పరిశీలించడమూ వుంటుంది. అయితే యిది చాలా కష్టతరమైన పని. దీని అర్థం ఏమిటంటే, యిది ఫలానా అని మాటల్లో అనడానికి, పేర్లు పెట్టడానికి స్వస్తి చెప్పాలి, వాటిని పూర్తిగా ఆపివేయాలి. నాలో దురాశ వుంది, స్వంతానికి కూడబెట్టుకునే తత్వం వుంది, కోపంగా వుంటాను, ఆవేశంగా వుంటాను, లేదా మరొకటి అని ఎరిగినప్పుడు, పోటిని ఖండించకుండా కేవలం పరిశీలించడం, ఎరుకగా వుండటం సాధ్యం కాదా? అంటే అర్థం, ఆ మనోభావానికి ఒక పేరు పెట్టడం అనేదే ఆపివేయాలి అని; ఉదాహరణకి, 'దురాశ' అనే ఒక పేరు నేను పెట్టినప్పుడు, ఆ పేరు పెట్టడమే దాన్ని ఖండించే ప్రక్రియ అవుతున్నది. అసలు 'దురాశ' అనే ఆ మాట వినగానే దండనార్హమైనది అని మన నాడీమండలం అంటుంది. ఇటువంటి తీర్పుల నుండి మనస్సును విముక్తం చేయడం అంటే పేర్లు పెట్టడాన్ని అంతం చేయాలి. నిజంగా చూస్తే యీ పేర్లు పెట్టడం ఆలోచిస్తున్నవాడు చేస్తున్న పని. ఆలోచిస్తున్నవాడు తనని ఆలోచననుండి వేరు చేసుకుంటుంటాడు. ఇది పూర్తిగా కృత్రిమమైన పద్దతి, యిందులో నిజం లేదు. ఉన్నది ఆలోచించడం ఒక్కటే. ఆలోచిస్తున్నవాడు వుండడు. ఆనుభవం చెందుతున్న ఒక స్థితి వున్నది తప్ప, అనుభవిస్తున్న ఒక జీవి లేడు. కాబట్టి ఎరుక, పరిశీలన అనే యీ సమస్త ప్రక్రియ అంతా ధ్యానప్రక్రియ. ఇంకో విధంగా చెప్పాలంటే ఆలోచనల రాకపోకలకు నిరభ్యంతరంగా సమ్మతించడం. మనలో చాలామందిలో ఏ పిలుపూ లేకుండానే ఒక దాని తర్వాత యింకొకటిగా ఆలోచనలు వస్తూ వుంటాయి. ఆలోచనలకు ముగింపే వుండదు. అన్ని రకాలైన తిరుగుబోతు ఆలోచనలను రానిచ్చి మనసు వాటికి దాస్యం చేస్తుంటుంది. ఇది మీరు గ్రహిస్తే అప్పుడు ఆలోచనలను మనమే పిలవచ్చు- ఆలోచనలను పిలిచి, వుదయిస్తున్న ఒక్కొక్క ఆలోచన వెనకాలే వెళ్ళడం. మనలో చాలామందికి పిలవకుండానే ఆలోచనలు వస్తాయి. ఎటు నుంచి బడితే అటు నుంచి అవి వస్తుంటాయి. ఈ ప్రక్రియనంతా అర్థం చేసుకొని, ఆలోచనలను ఆహ్వానించి, ఒక్కొక్క ఆలోచననూ కొనదాకా వెంబడించడమే నేను వర్ణించిన ఎరుక అనే మొత్తం ప్రక్రియ. ఇందులో పేర్లు పెట్టడం అన్నది వుండదు. అప్పుడు మనస్సు అద్భుతమైన నెమ్మదిని పొందినట్లు గమనిస్తారు. ఇది అలసట వల్లా కాదు, క్రమశిక్షణ ద్వారానూ కాదు, తనని తాను చిత్రహింస చేసుకోవడం, అదుపు చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా కూడా కాదు. తన కార్యకలాపాలను గురించి తను ఎరుకగా వుండటం వల్ల మనసు పరమాశ్చర్యకరంగా నెమ్మదినీ, నిశ్చలతనూ, సృజనాత్మకతను పొందుతుంది. ఏ క్రమశిక్షణా, ఏ బలవంతమూ అమలు చేయకుండానే యిది జరుగుతుంది. అప్పుడు, అటువంటి మానసిక నిశ్చలత్వంలో ఏ ఆహ్వానమూ లేకుండానే సత్యమైనది ఆవిర్భవిస్తుంది. సత్యాన్ని మీరు ఆహ్వానించలేరు. అది అజ్ఞేయమైనది. ఇటువంటి నిశ్శబ్దంలో అనుభవం పొందుతున్నవాడు వుండడు. కాబట్టి అనుభవంలోకి వచ్చినదానిని దోచుకోవడం జరగదు. 'నా సత్యానుభవం' అంటూ జ్ఞాపకం పెట్టుకోవడం జరగదు. అప్పుడు కాలరహితమైనది అస్తిత్వంలోకి వస్తుంది. దానిని అనుభవం పొందినవాడు కాని, అనుభవాలను స్కృతిలో పెట్టుకొనేవాడు కాని కొలతలలో చెప్పలేడు. సత్యం అనేది ప్రతీ క్షణంలోను కలుగుతూ వుంటుంది. దానిని అలవరచుకోలేము, ఒక జ్ఞాపకంగా దానిని పోగుచేసి వుంచుకోలేము, దాచుకోలేము. అనుభవం పొందుతున్నవాడు వుండని ఒక ఎరుక కలిగినప్పుడు మాత్రమే అది వస్తుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

ఆంస్టర్డేమ్, 26 మే 1955.

ప్రశ్న : మీరు చెప్పేది వింటున్నప్పుడు మీరు చాలా చదివారనీ, సత్యాన్ని ప్రత్యక్షానుభవంలోకి తెచ్చుకున్నారనీ కూడా అనిపిస్తుంది. అటువంటప్పుడు జ్ఞానాన్ని ఆర్జించడం దోషమని మీరెందుకనుకుంటున్నారు?

కృష్ణమూర్తి : ఎందుకో చెప్తాను వినండి. ఈ ప్రయాణం ఒంటరిగా చేయ వలసినది. జ్ఞానాన్ని మీ వెంటపెట్టుకున్నప్పుడు అది ఒంటరి ప్రయాణం అవదు. గీతను, వుపనిషత్తులను, ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని మీరు చదివివున్నట్లయితే, పండితుల దగ్గర మీ గురించిన సమాచారాన్ని, వాళ్ళ దృష్టిలో అసలు మీరు ఏం సాధించాలి అన్నదీ పోగుచేసుకున్నట్లయితే- ఆ జ్ఞానం ఒక ప్రతిబంధకంగా తయారవు తుంది. అమూల్యమైన సంపద వున్నది పుస్తకాల్లో కాదు, మీ లోపల, మీ మనసులోనే దాగివుంది. ఆ అమూల్యసంపదని కనిపెట్టడం మీ మనసుకొక్కదానికే చేతనవుతుంది. స్వీయజ్ఞానం పొందడం అంటే మీ మనసు తీరుతెన్నులు తెలుసుకోవడం; దానిలోని సూక్ష్మాసూక్ష్మాలను గురించి, వాటి అంతరార్థాలను గురించి ఎరిగివుండటం. దీనికోసం ఒక్క పుస్తకం కూడా చదవనక్కరలేదు. నిజం చెప్పాలంటే నేను యివేవీ చదవలేదు. చిన్న పిల్లవాడిగా వున్నప్పుడు, ఆ తరువాత కొంత వయసు వరకు యీ పవిత్ర గ్రంధాలనే వాటిని కొన్నింటిని యధాలాపంగా తిరగవేసివుండవచ్చు. అంతే తప్ప వాటిని ఎన్నడూ నేను అధ్యయనం చేయలేదు. అట్లా అధ్యయనం చేయాలని నాకు లేదు. అమూల్యమైనవన్నీ మరెక్కడో వుండటం వల్ల యిది చదవడం అంటే నాకు విసుగ్గా వుంటుంది. అమూల్య సంపద ఏ పుస్తకాల్లోనూ లేదు, మీ గురువులోనూ లేదు. అది మీ లోపలే వుంది. మీ మనసును మీరు అవగాహన చేసుకోవడం అన్నదే ఆ అమూల్య ధనాగారాన్ని తెరిచే తాళంచెవి. మీ మనసును మీరు అర్థం చేసుకోవాలి. పతంజలి చెప్పిన ప్రకారంగానూ కాదు; చాలా చాతుర్యంతో విషయాలను వివరించి చెప్పగల ఎవరో ఒక మనోవైజ్ఞానిక నిపుణుడు చెప్పిన ప్రకారంగానూ కాదు. మిమ్మల్ని మీరు మెళకువతో గమనిస్తూ వుండటం ద్వారా, మీ మనస్సు అంటే చేతన మానసమే కాదు, అచేతన మానసంలోని నిగూఢమైన పొరలతో సహా ఎట్లా పనిచేస్తున్నదో పరిశీలించడం ద్వారా అర్థం చేసుకోవాలి. మీ మనస్సును మెళకువతో కనుక గమనిస్తూ వుంటే, దానితో ఆటలాడుతూ వుంటే, అప్రయత్నంగా అభివ్యక్తీకరిస్తూ మనసు స్వేచ్ఛగా వున్నప్పుడు దానిని పరికిస్తుంటే, మాటల్లో చెప్పలేనన్ని అమూల్య సంపదలను అది తెరిచి చూపిస్తుంది. అప్పుడు మీరు యీ పుస్తకాలన్నింటినీ మించి పోతారు. అయితే దీనికి అత్యంతమైన సావధాన శీలత్వం, జీవశక్తి, తీవ్రమైన అభిలాష చాలా ఆవశ్యకం. కాలక్షేపానికి చేసే వ్యాఖ్యానాలతో తృప్తిపడే దంతవేదాంతం కాదు. అందువల్ల మనస్సు తను తెలుసుకున్న జ్ఞానాన్నుంచి విముక్తి పొంది వుండాలి. సంపాదించిన జ్ఞానంతో ఆవరించుకొని పోయి వున్న మనస్సు 'వున్నది' ఏమిటనేది ఏనాటికీ కనుక్కోలేదు.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

బొంబాయి, 25 మార్చి 1956.