కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/కృష్ణమూర్తి : వికాసోదయం

వికీసోర్స్ నుండి

కృష్ణమూర్తి : వికాసోదయం

భారతదేశాన్ని విక్టోరియా మహారాజ్ఞి పరిపాలిస్తున్న రోజుల్లో ఆమె సామ్రాజ్యంలోని మారుమూల ప్రాంతంలో ఒక బాలుడు జన్మించాడు. అది 1895 వ సంవత్సరం. అది మదనపల్లి అనే చిన్న వూరు. పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన చిత్తూరు జిల్లాలో వున్నది. అబ్బాయి తండ్రి తెలుగు బ్రాహ్మణుడు - పేరు జిడ్డు నారాయణయ్య, ఆ జిల్లా రెవెన్యూశాఖలో చిన్న వుద్యోగి. ఆ పిల్లవాడికి కృష్ణమూర్తి అని పేరు పెట్టారు.

అంతకు యాభై సంవత్సరాలకు పూర్వం భారతదేశం లో విద్యావిధానం ఎట్లా వుండాలి అనే విషయం మీద ధామస్ బేబింగ్ టన్ మెకాలే అభిప్రాయాలు ప్రజల్లో చర్చా స్పదంగా తయారయ్యాయి. విద్యా బోధనకి ఇంగ్లీషు భాషే సరైన మాధ్యమం అనీ, పురోగమనానికి అదే ఆదర్శమనీ మెకాలే గట్టిగా విశ్వసించాడు. పందొమ్మిదో శతాబ్దపు భారతదేశాన్ని మధ్యయుగపు ఐరోపాతో పోలుస్తూ నిర్జీవమై పోతున్న సంప్రదాయాన్ని మృతభాషలో నేర్పించడానికి ప్రభుత్వ ధనాన్ని వ్యర్ధం చేయడం సబబేనా అని మెకాలే వుద్రేకంగా ప్రశ్నించేవాడు. భారతదేశంలో విద్యావిధానం ఎట్లా వుండాలి అని నిర్ణయించడానికి మార్గం యింగ్లీషా, సంస్కృతమా - న్యూటనా, టొలెమీయా ఏడం స్మిత్తా, వేదాలా - మిల్టనా, మహాభారతమా - ఆధునికవైద్యమా, ఆయుర్వేదమా - సదా చలనంలో వున్న భూమా, భూమి చుట్టూ తిరుగుతున్న సూర్యుడా అనే ప్రశ్నలకి సమాధానంలో వున్నదని మెకాలే అభిప్రాయం.

ఇండియన్ సివిల్ సర్వీసు ప్రణాళికను రచించినవాడూ, మెకాలే బావమరిది అయిన సి.యి. ట్రెవిల్యాన్ 'చెల్లుకు చెల్లు ' అనే బ్రిటిష్ సామ్రాజ్య రీతిని యిట్లావివరించాడు.

'భారతీయులకు ప్రసాదించడానికి బ్రిటిష్ వారివద్ద వున్నతమైన తమ విజ్ఞానం తప్ప మరొకటేమి లేదు తక్కినవన్నీ పన్నులు మొదలైన ఆర్ధికరాబడులు, గౌరవాలు, వ్యక్తిగత సంపాదనలు మొదలైనవి భారతీయుల వద్ద నుంచి పుచ్చుకున్నా, చివరకు బ్రిటిషువారు తాము పొందిన లాభాల్లో చాలా వాటికి పుష్కలమైన ప్రతిఫలాన్ని తిరిగి యివ్వబోతున్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, భౌతిక వనరులను, సంపదనూ అర్పించుకొని భారతీయులు అందుకు బదులుగా యూరప్ సంస్కృతినీ, పాశ్చాత్య విజ్ఞానాన్ని ముందు కాలంలో అందుకోబోతున్నారు.'
విక్టోరియా యుగానికి చెందిన ఈ మిత వాదులంతా హేతువాదం పురోగమనం, స్వాతంత్ర్యం, మానవాభివృద్ధి వికాసాలు అనే ఆదర్శాలకు తమని అంకితం చేసుకున్నారు. శాస్త్రీయ చింతనను ముందుకు తీసుకొని వెళ్ళటానికి కంకణం కట్టుకుంది వారి దేశం. పారిశ్రామిక విప్లవం అవతరించడానికి ప్రధాన పాత్ర వహించింది. ఈ నేపధ్యంలో చూస్తే భారతీయ సాంప్రదాయంలో భద్రపరచవలసినంత విలువైనవేమీ వారికి కనిపించలేదు. బ్రిటీషు చరిత్ర పదిహేడవ శతాబ్దపు ఆరంభం నుండీ ‘భౌతికమైన, నీతిపరమైన, మేధాపరమైన’ అభివృద్ధి పధంలో నడిచిన చరిత్ర అనీ, దీనితో పోల్చదగిన పురోగమనం భారతీయ చరిత్రలో కనపడదనీ మెకాలే అభిప్రాయ పడేవాడు. ట్రెవిలియన్ మాత్రం భారతదేశం యొక్క గత చరిత్ర ‘తప్పకుండా’ చదవవలసిందే అని ఒప్పుకున్నాడు. అయితే కేవలం ‘పురాతన విషయాల పరిశోధన’ మీద ఆసక్తి వల్లనే చదవడం జరుగుతుంది అనే అభిప్రాయం వెలిబుచ్చాడు. సామ్రాజ్య సంరక్షకులు అని పిలువబడే వీళ్ళు తమ జాతి భవిష్యత్తే తమను నడిపిస్తున్నదని భావించారు. విక్టోరియా రాణి దర్బారులో ఆస్థానకవి అయిన ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ కూడా అదే భావాన్ని వుద్వేగ భరితమైన యీ కవితలో యిట్లా పొందుపరిచాడు.

దూర తీరాల వెలుగు దీపాల
ఆశలూరించే పిలుపులవిగో
పదండి, పదండి, పయనమై పోదాం
ఘల్లున మారుమ్రోగే నవ్య నూతన పధాలలో
ఆగదు, యీ మహా ప్రపంచపు గమనం ఆగదు.

భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని, యింగ్లీషు భాషనీ ప్రవేశ పెట్టడంలో విజయం సాధించిన వారితో అందరూ ఏకీభవించారని చెప్పలేము. సంస్కృత కళాశాల స్థాపకులు, ప్రాచ్యతత్వాన్ని బాగా అధ్యయనం చేసినవారూ, గౌరవనీయులూ అయిన హెచ్. హెచ్. విల్సన్ వంటి కొందరు నవభారత నిర్మాణానికి కావలసిన విషయ సామగ్రి అంతా ఆ దేశపు గత చరిత్రలోనే లభిస్తుందని విశ్వసించారు. యూరపు నుంచి వచ్చిన విజ్ఞానశాస్త్రమూ, పాండిత్యమూ భారతదేశం తన గత వైభవాన్ని పునర్నిర్మించుకోవడానికీ, తిరిగి తన ‘మేధాపరమైన, నీతిపరమైన అభివృద్ధి’ని సాధించడానికీ వినియోగపడాలనీ విల్సన్ పదే పదే హెచ్చరించాడు. ఇరు పక్షాల వారూ కూడా సమాజ పురోగతికి పాశ్చాత్య శాస్త్రీయ విధానమూ, హేతువాదమూ ఎంతో లాభదాయకాలని వప్పుకున్నారు. ఇది మెకాలే ఆధునిక శాస్త్రాన్ని మధ్యయుగాల సిద్ధాంతాలతో పోల్చి తారతమ్యాలు చూపడంలోను, విల్సన్ సంస్కృత కళాశాల పాఠ్య ప్రణాళికలో మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఆప్టిక్స్ ను కూడా చేర్చాలని నిర్ణయం తీసుకోవడంలోనూ కనబడుతుంది.

ఈ విధంగా యూరప్, భారతీయ సంస్కృతుల మధ్య పోటీ సాగుతున్నది. అందులో ఒకటి వలస రాజ్యాధిపతులకు చెందిన సంస్కృతి. అటువంటి పరిస్థితుల్లో పరిపాలిస్తున్న ప్రభువులకీ, దాస్యంలో వున్న ప్రజలకీ మధ్యన సంబంధాలలో అస్పష్టత, అపనమ్మిక, వుద్రిక్త వాతావరణం వుండటం సహజమే కదా. అయితే మెకాలే పొత సంప్రదాయాలను త్రో సేసి ఆధునికత్వాన్ని ఎన్నుకోవడం రాజా రామమోహనరాయ్ వంటి మేధావులను యూరప్ సంస్కృతివైపు మొగ్గేటట్లుగా చేసింది. అదే ఆ కాలానికి సబబైన మార్గంగా వారికి తోచింది.

భారత రంగంమీద యీ రకమైన వాద వివాదాలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే కృష్ణమూర్తి తల్లిదండ్రులు వున్న ప్రపంచం వేరు జన్మతః బ్రాహ్మణులు కాబట్టి అనూచానంగా వస్తున్న భాషా పాండిత్యాలకూ, మత సంప్రదాయాలకూ వారు వారసులు. అయితే తాత ముత్తాతలు కాలానుగుణంగా వస్తున్న మార్పులు గ్రహించి, సంప్రదాయ బద్ధమైన తమ జీవన సరళిలో నుంచి యివతలగా వచ్చి, విశాలమైనా యింకా పరాయిదే అయిన యింగ్లీషు భాషా ప్రపంచపు మారుమూలల్లో చిన్న చిన్న వుద్యోగాలు సంపాదించుకున్నారు. అయితే, వుద్యోగాల్లో చేరినా వారు తరతరాలుగా వస్తున్న తమ ఆచార వ్యవహారాలను వదులుకోలేదు, సద్బ్రాహ్మణుని దైనిక జీవితాన్ని కుటుంబంతో, సమాజంతో, వూర్ధ్వలోకాలతో అనుసంధించే తమ కర్మకాండల అనుష్టానాలలో విశ్వాసాన్ని చెదిరిపోనీయలేదు.

పందొమ్మిదో శతాబ్దంలో సాధారణమైన బ్రాహ్మణ గృహంలో కుటుంబ జీవనం పరిమితులు గల పరిధిలోనే తిరుగుతూ వుండేది. అక్కడ బయట ప్రపంచంమీద ఆధారపడటం లేదు, దానికదే ఒక స్వయం సంపూర్ణమైన దినచక్ర క్రమం. పుత్రసంతానంమీద విపరీతమైన శ్రద్ద చూపేవారు, దేవుళ్ళనూ, దేవతలనూ అధివసింపజేసి, వారి చుట్టూ పూజా పునస్కారాలూ, వ్రతాలూ చేసి, అజ్ఞాత భయంకర శక్తులనుంచి అవి తమని కాపాడుతాయనుకునేవారు. కొడుకుల అభీష్టాలకు ఏమాత్రం అడ్డుతగలకుండా ప్రవర్తించేవారు. కృష్ణమూర్తి జన్మించిన మర్నాడు ఒక జ్యోతిష్యుడిని పిలిచారనీ, జాతక చక్రం వేయించారనీ, అతనికి గొప్ప భవిష్యత్తు పున్నట్లుగా అందులో వ్రాసి వుందనీ అంతా చెప్పుకుంటారు. కొంత కాలానికి పూర్వ సంప్రదాయానుగుణంగా కృష్ణమూర్తికి అక్షరాభ్యాసం చేశారు. అంటే, వెండి కంచంలో బియ్యం పోసి, అతనిచేత ఇందులో ఓం అనే అక్షరం దిద్దించారు. 

రెవెన్యూ శాఖలో పనిచేస్తుండటం వల్ల కృష్ణమూర్తి తండ్రి తరచుగా గ్రామాంతరం వెళ్ళవలసి వస్తుండేది. కృష్ణమూర్తి తల్లి సంజీవమ్మ. ధర్మపరాయణురాలు. నెమ్మదీ, దయాగుణమూ గల మనిషి. కుటుంబం అంటే అమిత శ్రద్ద. శ్రీకృష్ణుడిమీద అపారమైన భక్తి. పెద్ద కూతురు పనిపాటల్లో సహాయం చేస్తుంటే, యింట్లో వున్న సభ్యులందర్నీ ప్రేమతో, ఆప్యాయతతో కనిపెట్టి చూసుకుంటూ వుండేది. కొడుకులూ, కూతుళ్ళతో వున్న పెద్ద సంసారం అది. కృష్ణమూర్తి తర్వాత నిత్యానంద మొదలైనవారు ఆమెకు జన్మించారు. పుట్టిన ప్రతివారికీ ఆచార విధులు తప్పనిసరి. కానీ మతపరమైన, ధర్మపరమైన మానసిక తత్వం ఆ యింట్లో అందరికీ సమానంగా అబ్బలేదు. నిత్యానంద వయసుకు ముందే బడికి పోవడం ఆరంభించాడు. చదువులో పైకి పోయే లక్షణాలు కనిపించాయి. కాని కృష్ణమూర్తికి ఎప్పుడూ మలేరియా జ్వరం, అందువల్ల బడికి పోవడం తక్కువ. ఆ విధంగా భక్తురాలైన తల్లితోపాటే వుంటూ, ఆమె ధర్మపరాయణత్వంలో పాలు పంచుకున్నాడు. రామాయణ భాగవతాల నుంచి ఆమె కధలు చదివి వినిపిస్తూ వుండేది. ఇద్దరూ కలిసి కొండమీద వున్న శ్రీకృష్ణుని ఆలయానికి ఎక్కి వెళ్ళి, దివ్యదర్శనం జరిగినట్లుగా అనుకుంటూ వుండేవారు. అయితే తరువాత కాలంలో కృష్ణమూర్తి యీ దివ్యదర్శనాలన్నీ కేవలం నిబద్ధీకృతమైన మనసు కల్పనలని త్రోసి పుచ్చారు. ఒకవేళ క్రైస్తవునిగా పుట్టి వుంటే జీసస్ గురించి యిటువంటి దివ్యదర్శనాలు జరిగి వుండేవని అన్నారు. అయినా కూడా సంజీవమ్మలో వుండే దయా ధర్మగుణంలో నుంచి పూర్తిగా కాకపోయినా కొంతవరకు కృష్ణమూర్తి నేర్చుకొని, అందిపుచ్చుకున్నారు. ప్రతిరోజూ ఒక ఆచారంగా జరిగే దానధర్మ విధులలో అనుకోకుండానే కృష్ణమూర్తి కూడా పాలు పంచుకోవడం గురించి నారాయణయ్య యీ విధంగా వర్ణించాడు.

పొద్దునపూట యింటి ముందుకి బిచ్చగాళ్ళు వచ్చేవారు. మా ఆచారం ఏమిటంటే బిచ్చం వేయడానికి రోజూ ఒక గ్లాసుడు బియ్యం విడిగా వుంచేవాళ్ళం. గ్లాసు ఖాళీ అయేదాకా చేయి జాపిన ప్రతి వారికీ కొద్ది కొద్దిగా బియ్యం పంచి పెట్టేవాళ్ళం. నా భార్య ఒక్కో రోజు కృష్ణని బిచ్చం వేయమని పంపుతుండేది. ఈ చిన్నవాడు యింకా కావాలంటూ వెనక్కి వచ్చేవాడు, గ్లాసు మొత్తం ఒక్కరి జోలెలోనే పోసేశానని చెప్తూ అప్పుడు వాళ్ళ అమ్మ వెంట వెళ్ళి, ఒక్కొక్కరికే ఎట్లా పంచాలో నేర్పిస్తూ వుండేది.

కృష్ణమూర్తికి రెండేళ్ళ వయసులో తీసిన ఒక చిత్రపటంలో కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ స్నేహపూరితమైన చూపులతో కెమేరాలోకి సూటిగా చూస్తూ కనబడతాడు. కొంచెం పెరిగాక, మృదువైన హృదయమూ, వుదారగుణమూ గల బాలుడిగా తయారయ్యాడు. అయితే తరచూ మలేరియాతో తీసుకుంటూ బడికి సక్రమంగా వెళ్ళలేకపోయేవాడు. పారాలు సరిగ్గా నేర్చుకోలేక, తరగతిలో తక్కినవారికంటే వెనకబడి వుండేవాడు. ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తినడం కూడా అప్పుడప్పుడు జరిగేది.

కృష్ణమూర్తికి చిన్ననాటి జ్ఞాపకాల్లో సంతోషకరమైనవి తల్లిని గురించినవే. అయితే అతనికి పదేళ్ళు నిండాయో లేదో తల్లీ, ప్రేమాస్పదురాలైన అక్కా యిద్దరూ చనిపోవడంతో నిశ్చింతగా సాగిపోతున్న ఆ కుటుంబ జీవనం ముగిసిపోయింది. ఆ సంఘటన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కృష్ణమూర్తి యిట్లా వ్రాసుకున్నాడు. '1905 లో మా అమ్మ చనిపోయాక మమ్మల్ని ప్రేమగా, మా బాగోగులు కనిపెడ్తూ చూసే వ్యక్తి నాకూ నా అన్నదమ్ములకూ లేకుండా పోయింది. మా నాన్నకు తన పనులతో తీరిక లేకపోవడం వలన మా గురించి అంతగా పట్టించుకొనేవాడుకాదు. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ వుండేవారుకాదు.'

మనిషి అంతఃప్రేరణల్లో కల్లా మతం గురించినది చాలా నిగూఢమైనది. శబ్దలక్షణ శాస్త్రాన్ని బట్టి చూస్తే “రిలిజియన్' అనే మాట యొక్క ధాతువుకి అర్ధం 'కలిపి వుంచేది' అని. ఒక దృష్టితో చూస్తే మతం స్త్రీ పురుషులను ఒక బహుళ జన సమాజంగా కట్టివేసి వుంచుతుంది. మరో స్థాయిలో అది వారిని కొన్ని దైవికమైన సిద్దాంతాలలో బంధించి వుంచుతుంది. చావు, పుట్టుక, యుక్తవయసులోకి ప్రవేశించడం, వివాహాలు మొదలైన ప్రధాన సంఘటనల సందర్భంలో పవిత్రమైన కర్మకాండల రూపంలో యివి వుంటాయి. ఆయా సందర్భాల్లో కలిగే భావోద్వేగాలలో ఆ సమాజంలోని అందరూ పాలు పంచుకుంటారు. అందరూ కలసి ప్రదర్శించుకుంటారు. జీవితంలో ఎదురయే పెద్ద పెద్ద మార్పుల సమయంలో తమ మనోభావాలను పదిమందితో కలిసి పంచుకోవడం వలన ఒంటరితనపు బాధ కొంత తట్టుకోవడం సాధ్యమవుతుంది. మతసంబంధమైన పాటలు, గాధలు, ఆచార కర్మలు మొదలైన వాటిలో ఆయా ప్రజల ఆందోళనలకు. విజయోత్సాహాలకు, భయాలకు, ఆశలకు సంబంధించిన సామూహిక స్మృతులు అభివ్యక్తమవడానికి అవకాశం వుంది. అజ్ఞాత నామధేయులైన మతగురువులు, కవులు, కళాకారులు యీ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయా మతాలను విస్తరింపజేసుకోవడానికీ, కొత్తవారిని చేర్చుకోవడానికీ చేసిన ప్రయత్నాల్లో ఒక భాగం ఏమిటంటే విశ్వాసమూ, క్రోడీకరించి సూత్రబద్ధం చేసిన నమ్మకాలూ, ఒక దశలో యివి ఒక్కొక్క మతపు ప్రత్యేక లక్షణాలుగా తయారయ్యాయి.

కృష్ణమూర్తి పుట్టుకకు యిరవై సంవత్సరాలకు పూర్వం, దివ్యజ్ఞాన వుద్యమం అమెరికాలో ఆరంభమైంది. భౌతిక వాదాన్ని, ఆ కాలంలో ప్రచారంలో వున్న శాస్త్రబద్దమైన మానవతా వాదాన్ని గర్హిస్తూ ప్రతిరోధించే ధోరణిలో యీ వుద్యమం బయలుదేరింది. హెలెనో పెట్రోవ్నా బ్లవట్ స్కీ అనే రష్యా దేశస్థురాలు దీనిని స్థాపించింది. ఈవిడ భవిష్యవాణి చదవగలిగిన మర్మజ్ఞురాలు. వానరాలనుండి నరుడు పరిణామం చెందాడనే వాదాన్ని యీవిడ ఘట్టిగా ఖండించింది. పైగా క్రైస్తవులు జీసస్ క్రీస్తు సందేశానికి వక్రభాష్యాలు యిస్తున్నారని కూడా ఆరోపించింది. అతీంద్రియ శక్తులని వుపయోగించడం ద్వారా విజ్ఞాన శాస్త్రం, మతమూ తత్వశాస్త్రాలను సమ్మేళవించి 'ప్రకృతిలో నిగూఢంగా వున్న రహస్యాలను, మనిషిలో అజ్ఞాతంగా దాగివున్న శక్తులను' వెలికి తీస్తాననీ ఆమె విశ్వాసభరితంగా పలికింది.

డార్విన్ సూచించిన పరిణామ సిద్ధాంతాన్ని బ్లవట్ స్కీ తీవ్రంగా నిరసించింది. అయితే పందొమ్మిదో శతాబ్దంలో బాగా ప్రాముఖ్యం సంపాదించిన పరిణామ క్రమంలో పురోగమనం అనే భావన ఆమె ఆలోచనా ధోరణిలో కూడా ప్రతిధ్వనించింది. 'భూతలం' నుండి 'దివ్యలోకాల' స్థాయివైపు పైకి పోయే క్రమానుగత గమనంలో మానవజీవితం ఒక దశ అని ఆమె అభిప్రాయపడింది. వైజ్ఞానిక సత్యం, గతమూ, భవిష్యత్తూ అన్నీ కూడా దివ్యదృష్టి ద్వారా పరీక్షించి దర్శించడం సాధ్యమవుతుందని ఆమె నమ్మింది. ఆమె అనుయాయి మాటల్లో చెప్పాలంటే :

'తొలినాటి పరిణామ క్రమంలో వివిధ దశలు వున్నట్లుగానే - ముడి ధాతువులు తర్వాత వృక్షజాతీ, వృక్షజాతి పైన జంతువులు, జంతువుల పైన మానవుడు అదే విధంగా మానవజాతికి కూడా ఒక చివరి హద్దు వున్నది; యీ సరిహద్దు దాటాక తమకంటే వున్నత స్థితిలో వున్న మరో లోకంలోకి అడుగు పెడుతుంది; మానవుల తర్వాత అధిమానవులు వున్నారు.'

బౌద్ధము, హిందూ మొదలైన అనేక మూలాధారాల నుంచి బ్లవట్ స్కీ పుష్కలంగా గ్రహించి తన వాదాలలో సమీకరించుకున్నది. ఆమె రచనలలో కర్మ, పునర్జన్మ, బంధాలనుండి మోక్షప్రాప్తి వంటివన్నీ కనబడతాయి; విముక్తి మార్గం చూపడానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకులూ వుంటారు. నిజమైన ఆధ్మాత్మిక గురువు ఆమె సిద్దాంతం ప్రకారం యిట్లా వుంటాడు :

'అతడికి అఖండమైన జ్ఞానం వుంటుంది. బాహ్యవిషయాల జ్ఞానమూ, రహస్యమైన నిగూఢజ్ఞానమూ కూడా. ప్రధానంగా రహస్యజ్ఞానం కలిగి వుంటాడు. ఐహిక జ్ఞానాన్ని తన సంకల్పం యొక్క స్వాధీనంలో వుంచుకుంటాడు. ప్రకృతి శక్తుల్ని నిగ్రహించే సిద్ధులు పొందినవాడై వుంటాడు. ఒకప్పుడు తనలో
నిద్రాణంగా వుండి, ప్రస్తుతం జాగృతమైన తన ప్రాణశక్తుల సహాయంతో ప్రకృతి రహస్యాలను ఛేదించగల సామర్థ్యం అతనికి వుంటుంది.

అంటే మూఢ విశ్వాసాల మతపు ఆధిపత్యాన్నీ, భౌతిక విజ్ఞాన శాస్త్రాన్నీ ఆయా సిద్ధాంతాల పరిధుల్లోనే ఎదిరించి, తలపడగల శక్తియుక్తులు అతడికి వుంటాయి. ఇది తన మనో సంకల్పాన్ని వుపయోగించడం ద్వారానూ, అతీంద్రియ శక్తుల ద్వారానూ అతడు చేయగలుగుతాడు.

1882 లో బ్లవట్ స్కీ దివ్యజ్ఞాన సమాజం వారి ప్రధాన కార్యాలయాన్ని భారతదేశానికి తరలించింది. ఎందుకంటే దివ్యజ్ఞానంవారి సిద్ధాంత శాసనంలో హిమాలయ పర్వతాల్లో మహాశక్తివంతులైన పరమగురువులు వాసం చేస్తున్నారని వున్నది, మద్రాసు నగరానికి చేరువలోనే వున్న ఒక సువిశాలమైన స్థలాన్ని యిందుకోసం ఎన్నుకున్నారు. ఆ ఆవరణ అంతా పచ్చని కొబ్బరిచెట్లతోనూ, పూజనీయంగా తోపించే బ్రహ్మాండమైన మర్రివృక్షాలతోనూ కలకలలాడుతూ వుంటుంది. ఒక వైపున అడయారు నది ప్రవహిస్తూంటే మరొకవైపు బంగాళాఖాతం సరిహద్దుగా వుంటుంది. ఆ అడయారు తోట లోపల కాలక్రమేణా దివ్యజ్ఞాన సమాజం వారు ప్రత్యేకంగా ఎన్నుకున్న నమూనాల్లో నిర్మించిన దేవాలయాలు, మందిరాలు, చర్చీలు, మసీదులు ఎన్నో వెలిశాయి.

భారత భూ భాగంమీద యీ సమాజం అవతరించడం అనేక భవిష్య ప్రయోజనాలకు ఒక ద్వారాన్ని తెరిచినట్లయింది. అప్పటివరకు వున్నత వర్గాలకు చెందిన భారతీయులకు, ఆంగీకరించబడిన సమాజంలో వారు భాగస్థులవడంవల్ల తమ మతాన్నీ, తమ కళలనూ యితరులు నిరసించడం అలవాటైపోయింది. అసలు వారే తమ సంస్కృతిని పాశ్చాత్య ప్రమాణాలతో కొలిచి చూడటం నేర్చుకున్నారు. అటువంటి వారికి పురాతనమైనవీ, సంకుచితమైనవీ అయిన అంశాలనుంచి తమ ఆధ్యాత్మిక గతానికి యీ సమాజపు సిద్ధాంతాలు విముక్తి గల్పించి, విశ్వాత్మకంగా రూపొందించి, ఆ విధంగా పరిపూర్ణవంతం చేయడం కనువిప్పు కలిగించింది. అటువంటి ఎంతోమందిని యీ సమాజం ఆకర్షించి తన సభ్యులుగా చేర్చుకుంది. తమ ఆధీనంలో వున్న వలస దేశస్థులను తమ మతంలోకి మార్చుకోవాలని వచ్చిన క్రైస్తవ మత ప్రచారకులు, యీ దేశపు విశ్వాసాల ఆకర్షణకు పాశ్చాత్యులే లోనవు తుండటం చూసి దిగ్ర్భాంతి చెందసాగారు. జాతీయ భావాలను పురికొల్పే విషయాలంటే అతి సందేహంతో చూస్తే ప్రభుత్వం కూడా యీ మతప్రచారకుల లాగే కళవళపడింది. సనాతనాచార పరాయణులైన హిందువులు కూడా తమ పాత సంప్రదాయాలకు భ్రష్టత కలుగుతుందేమోననే భయంతో యీ నూతన సమాజాన్ని ఆమోదించలేదు.

ఒక కొత్త మతాన్ని వుద్యమ స్థాయిలో నిర్మించాలంటే కథలూ, గాధలూ, పూజా కర్మలూ, ఒక ప్రత్యేక సంఘానికి సంబంధించిన కట్టుబాట్లూ పెద్ద ఎత్తున సమకూర్చుకోవలసి వుంటుంది. ఇవన్నీ అంత త్వరగానూ, సులభంగానూ చేర్చడం సాధ్యంగాదు. అయినా కూడా, పందొమ్మీదో శతాబ్దపు చివరి సంవత్సరాల్లో, ఒక ప్రక్కన యూరప్ బలం పుంజుకొని విభిన్న జాతుల ప్రజలను తన వలసాధిపత్యం అనే ఛత్రం కిందికి తీసుకురాగా, ప్రాచ్య, పాశ్చాత్య అనే రెండు భిన్న సంస్కృతులనూ, విజ్ఞానశాస్త్రాన్ని, మతాలనూ ఒకదానికొకటి చేరుస్తూ గొలుసులను నిర్మించగలిగిన పుద్యమానికి ఒక చిన్న మార్గం తెరుచుకున్నది. విభిన్న పరిధుల్లో శాంతియుతమైన ఒక సహోదరత్వాన్ని నిర్మించే దివ్యజ్ఞాన సమాజపు కార్యక్రమం ప్రపంచం నలుమూలలనుండి అనేకులను ఆకర్షించి సభ్యులుగా చేర్చుకుంది.

ఈ ఆదర్శాలను అందుకోవాలనే వుద్దేశ్యంతో దివ్యజ్ఞాన సమాజంపైపు ఆకర్షితులైనవారిలో అనీబెసెంటు ఒకరు. ఈ వుద్యమంలో చేరే నాటికే యింగ్లండులోని ప్రగతి వాద, సాంఘిక వుద్యమాలలో చాలావరకు అన్నింటిలోనూ శ్రీమతి బెసెంటు పని చేసింది : మహిళా హక్కుల కోసం పోరాడింది, స్వేచ్ఛావాదులతోను, కార్మికోద్యమాలలోను పనిచేసింది; లండన్ స్కూలు బోర్డులో కార్యోత్సాహం గల సభ్యురాలిగా వుండేది. 1879 లో హెలెనా బ్లవటిస్కీ ప్రభావానికి లోను ఆయాక, హిందూ సనాతనత్వానికి, పాండిత్యానికి కేంద్రమైన వారణాసికి ఆమె వచ్చి చేరింది. అరవై ఏళ్ళ వయసు సమీపిస్తున్న పాశ్చాత్య మహిళకది నిజంగా సాహసకృత్యమే. వారణాసిలో నివసిస్తూ భారతదేశపు గతకాలపు సంపదలోనుండి ఒక నూతన సంస్కృతిని పునఃసృష్టి చేయడం కోసం ఆమె తన శక్తినంతా వినియోగించడం మొదలు పెట్టింది. సంస్కృత పండితుల సహాయంతో భగవద్గీతకు ఒక అనువాదాన్ని తయారు చేసింది. దేశంలోని పలుప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు స్థాపించింది.

దివ్యజ్ఞాన సమాజాని (టి ఎస్) కి శ్రీమతి బెసెంట్ అధ్యక్షులుగా వున్నప్పుడే కృష్ణమూర్తి తండ్రి నారాయణయ్య ఆమెవద్ద గుమాస్తాగా పనిచేస్తానని వచ్చాడు. అప్పుడే ప్రభుత్వోద్యోగంనుండి రిటైరయాడాయన. ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేస్తే దానికి బదులుగా పనిచేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. 1909 లో నారాయణయ్య తన ముగ్గురు పిల్లలను, ఒక మేనల్లుడిని, వయసు పైబడిన పెత్తల్లిని తీసుకొని వచ్చి, టి ఎస్ ఆవరణకి బయటగా వున్న చిన్న కుటీరంలో నివసించడం సాగించాడు. దగ్గరలోనే మైలాపూరులో వున్న ఒక పాఠశాలలో కృష్ణమూర్తిని, అతని తమ్ముడినీ చేర్పించాడు.

ఒకరోజు అడయారులో యీ పిల్లలిద్దరూ దివ్యజ్ఞాన సమాజంలో శ్రీమతి బెసెంటుతోపాటు కలిసి పనిచేస్తున్న సి. డబ్ల్యు, లెడ్ బీటర్ దృష్టిని ఆకట్టుకున్నారు. బాలుడైన కృష్ణమూర్తిలో అసాధారణమైనదేదో లెడ్ బీటర్ కి గోచరమైంది. 'ఏమాత్రం స్వార్ధపు జాడలేని తేజోవలయం' అని దానిని ఆ తరువాత వర్ణించాడు. అప్పుడు శ్రీమతి బెసెంట్ యూరపులో వున్నది. లెడ్ బీటరు ఆమెకి నారాయణయ్య గురించి, అతని కుటుంబంలో వున్న పిల్లల సత్ర్పవర్తన గురించి రాశాడు. ఇంకా తను చేసిన పరిశోధన ఫలితంగా కృష్ణమూర్తి 'గతం చాలా ప్రాముఖ్యత గలది, అతని తండ్రికంటే అతను చాలా ముందున్నాడు . అసలు ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో వున్న వారందరికంటే అతను ముందున్నాడు - హ్యూబర్ట్ కంటే కూడా. అతని పూర్వ జన్మలు వుత్తమమైనవి' అని కని పెట్టాననీ కూడా రాశాడు. ఇది మహా ఆశ్చర్యకరమైన పోలిక. ఎందుకంటే దివ్యజ్ఞాన సామాజికులు ఒక అవతార పురుషుడి కోసం చాలా వుత్సహంగా అన్వేషిస్తున్నారు. హ్యూబర్ట్ (వేన్ హుక్) అనే పిల్లవాడిని ఆ పదవికి తగిన ముఖ్య అభ్యర్థిగా అప్పటికే శిక్షణ యిచ్చి సిద్ధం చేస్తున్నారు.

అవతార పురుషుడు రాబోతున్నాడనే విషయం అనేక మత సంప్రదాయాల్లో వున్నది. భగవద్గీతలో బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని శ్లోకాలలో కృష్ణభగవానుడు ప్రతీ యుగారంభములోను తాను తిరిగి అవతరిస్తూంటానని యీ మాటల్లో చెప్పాడు:

“ఎప్పుడు ధర్మానికి హాని కలిగి, అధర్మం వృద్ధిచెందుతూ వుంటుందో, అప్పుడు సత్పురుషుల్ని సంరక్షించి దుష్టుల్ని సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించడానికి నేను అవతారం తాలుస్తూ వుంటాను."

ప్రపంచాన్ని అంధకారంనుండి రక్షించడానికి అవతార పురుషుడొకడు జన్మిస్తాడని జూడామతం, బౌద్దమతం, క్రైస్తవం, ఇస్లాంలోని కొన్ని మతశాఖలూ బోధించాయి. శ్రీమతి బెసెంటు నాయకత్వంలో దివ్యజ్ఞాన సమాజం కూడా ఒక ప్రత్యేకమైన అవతార సంబంధమైన సిద్ధాంత సూత్రాన్ని కనిపెట్టింది. కొద్ది కాలానికే దీనిని నిజం చేసే అనుకూల 'వాహనం' గా కృష్ణమూర్తిని వారు ఎంపిక చేసుకున్నారు. అనేక మత సంప్రదాయాలనుంచి ప్రగాఢ శోధన చేసి గ్రహించిన అంశాలతో తయారుచేసినది థియొసాఫికల్ సిద్ధాంతం; క్రమక్రమంగా వీరంతా, కృష్ణమూర్తిని కనుక సవ్యమైన పద్ధతిలో సిద్ధపరుస్తే మైత్రేయ ప్రభువు లేక బుద్ధుని మరో అవతారం అతని శరీరంలో ప్రవేశించి, ఆ విధంగా అవతారం తెలుస్తాడని నమ్మడం ఆరంభించారు. అందుకని ఆ సమాజం వారు ప్రపంచాన్ని యీ సంఘటన కోసం తయారుచేయడానికి పూనుకున్నారు.

లెడ్ బీటరుకు ప్రాచ్యదేశాల మార్మికతత్వంలో ఆసక్తి వున్నది. దానితో పాటు అతనిలో అధికారం చలాయించే స్వభావమూ, వలసరాజ్య పాలకవర్గంలో వుండే లక్షణాలు మితిమీరిన ధోరణీ కూడా వున్నాయి. లెడ్ బీటరుకు సాహసకృత్యాలంటే మహా యిష్టం; దానికి తోడు విపరీతమైన వూహాలోక సంచారత్వం; వీటివల్ల అతడు తన జ్ఞాపకాలకు కూడా రంగులు అద్దుతాడు. ఎంతగా అంటే అతడి జీవితంలో జరిగిన సంఘటనలే అతడు తిరిగి చెప్పినప్పుడల్లా యింకా యింకా అద్భుతంగా ధ్వనిస్తుండేవి. వ్యక్తుల చుట్టూ వుండే 'తేజోవలయాలను' పరికించడం, వారి 'పూర్వజన్మల'ను చదవడం, రహస్యనిగూఢ పద్ధతులు సాధనచేయడం మొదలైన వాటిల్లో అతడికి చాలా ప్రావీణ్యం వుండేది. ప్రధమ పరిచయం అయీ అవగానే తన భవనానికి కృష్ణమూర్తిని తీసుకొని రమ్మని లెడ్ బీటరు నారాయణయ్యను ఆదేశించాడు. ఒక సోఫాలో తన పక్కనే ఆ చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నాడు. తన చేతిని ఆ పిల్లవాడి తలమీద పెట్టి నాటకీయంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అందులో చిలవలు పలవలుగా మలుపులు తిరుగుతున్న ఎన్నో కధలు సాహస కృత్యాలలో, స్వార్ధత్యాగాలతో కూడుకున్నవి దొర్లిపోయాయి. వాటన్నింటిలోనూ కధానాయకుడు అల్సేయన్- అది కృష్ణమూర్తికి మారు పేరు అని కూడా చెప్పాడు. చిక్కగా అల్లుకొని పోయిన యీ కథనమంతా వ్రాతరూపంలోకి మార్చి 'అలసియన్ జీవితాలు' అనే పుస్తకంగా ప్రచురించాడు. ఈ కధల్లో శ్రీమతి బెసెంట్ మొదలైన దివ్యజ్ఞాన సామాజిక సభ్యులు కూడా దర్శనమిస్తారు. అయితే భూలోకంలోనూ, అనేక యితర గ్రహలోకాల్లోనూ వారు సంచరించినప్పుడు ఆయా చారిత్రక కాలాలకు అనుగుణంగా రకరకాలైన వేరు వేరు రూపాలను వారు తాల్చుతారు. ఒకరోజు ఆరుబయట డాబా మీద యీ పూర్వ 'జీవితాల' ను లెడ్ బీటరు అందరికీ చదివి వినిపింప జేశాడు. శ్రోతలు వుద్వేగంతో పులకించి పోయారు.

కృష్ణమూర్తికి అతని గతజన్మల పట్టికనొకటి తయారుచేసి యిచ్చాక, లెడ్ బీటరు అతన్ని అతడు పుట్టిన వాతావరణం నుండి, అతని కుటుంబం నుండి, దివ్యజ్ఞాన సమాజపు ప్రహరీగోడకు బయటవైపు శిధిలావస్థలో వున్నవారి చిన్న యింటి నుండి యీ వైపుకు లాగుకొని రావడానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు. తన కొడుకులను మైలాపూరు పారశాలకు పంపడం ఆపివేయమని నారాయణయ్యకు నచ్చజెప్పడం లెడ్ బీటరు ప్రయత్నాల్లో మొదటిది. "బూట్ల తాళ్ళు అమ్ముకోవలసినవాడు వుపాధ్యాయుడి పిల్లలను కొట్టి హింసిస్తున్నాడని" అతని వాదం. వారికి చదువు నేర్పడానికి కొందరు పాశ్చాత్య అధ్యాపకులను ఏర్పాటుచేసి, పై నుంచి తాను పర్యవేక్షణ చేస్తూవుండటం పిల్లలకు మంచిదని నారాయణయ్యను వొప్పించాడు. మగపిల్లలిద్దరికీ కొత్త బట్టలు కుట్టించారు. కొద్ది పింఛనుమీద జీవనం వెళ్ళదీస్తున్న వారి తండ్రి సమకూర్చలేని రకం ఆహారపదార్థాలు వాళ్ళకు తినిపించడం మొదలు పెట్టారు. వారి బ్రాహ్మణ సంస్కారానికి తగినట్లుగా పెంచుకున్న శిఖలు కత్తిరించి వేశారు. జుట్టు భుజాల వరకు పెంచి, వెనక్కు దువ్వి మధ్య పాపిళ్ళు తీయించారు. సైకిళ్ళు ఎక్కి తొక్కడం, ఆటల్లో పాల్గొనడం నేర్పించారు. ప్రతి వుదయమూ వారిని “సరే, రాత్రి మన కార్యక్రమాలను గురించి మీకు ఏవేం గుర్తున్నాయి” అని లెడ్ బీటరు ప్రశ్నించేవాడు. వాళ్ళు సిగ్గుపడుతూ వచ్చీరాని యింగ్లీషులో సమాధానాలు చెప్తుండేవారు. లెడ్ బీటరు 'జ్యోతిర్మండలంలో జరిగిన' ఆసక్తికరమైన విషయాలు మరికొన్ని చేరుస్తుండేవాడు.

నవంబరు నెల 1909 సం॥లో కృష్ణమూర్తికి శ్రీమతి బెసెంటును పరిచయం చేశారు. ఇది జరిగిన ఒక నెల లోపలే ఆమె అతనికీ, నిత్యానందకు వుపదేశదీక్ష యిచ్చీ రహస్యసాధన విభాగం లోనికి ప్రవేశ పెట్టింది. ఇది టీ ఎస్ (థియొసాఫికల్ సొసైటీ) లోని ఒక ఆంతరంగి బృందం. ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన యీ సభ్యులు ఆమెకు విధేయులుగా వుంటామని ప్రమాణాలు చేయాలి; జగద్గురువు రాక కోసం తమని తాము పూర్తిగా నిర్నిబద్దంగా అంకితం చేసుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోని వారిని- అటువంటి వాళ్ళు చాలా మందే వుండేవారు. క్రింది తరగతిలోనే అంటే శిక్షణ తరగతిలోనే అట్టే పెట్టే సేవారు. దీనితో పాటు శ్రీమతి బెసెంటు ఆత్మిక పధము అనే మరొక సిద్దాంతాన్ని కూడా అమలు చేసింది. ఇందులో అయిదు క్రమానుగత దశలు వుంటాయి. దీక్ష ఆరంభదశనుండి ఔన్నత్య దశవరకు వున్న యి ప్రధాన కొలమానం మీదే సభ్యుల అర్హత నిర్ణయించబడుతుంది. ఆత్మిక పధంలో ఎవరెవరు ఏఏ ఆధ్యాత్మిక స్థాయిల్లోకి వచ్చారన్నది నిర్ణయించే అధికారం ఆమెకూ, లెడ్ బీటరుకూ మాత్రమే వున్నది.

లెడ్ బీటరు యిచ్చిన ఆదేశానుసారం శ్రీమతి బెసెంటు పిల్లలిద్దరూ తన గది పక్కనే వున్న గదిలో నివసించడానికి నారాయణయ్యను ఒప్పించింది. అక్కడ ఆవిడ వారికి యింగ్లీషు పుస్తకాలు చదివి వినిపించేది. వారికి యింగ్లీషులో మాట్లాడటం నేర్పిస్తూ వుండేది. మరికొద్ది కాలానికి లెడ్ బీటరు 'దివ్య శక్తులతో ఒక మహా దర్బారు' ఏర్పాటు చేశాడు. ఆ దర్బారులో దివ్యజ్ఞానంవారి పరమగురువుల్లో ఒకరైన కుతుమి కృష్ణమూర్తిని మైత్రేయభగవానుడి ముందు 'అత్యున్నతమైన యీ సహోదరత్వంలో ప్రవేశం కోసం అర్థిస్తున్న అభ్యర్థి' అంటూ సమర్పించాడు. కుతుమి పరమగురువుగా, లెడ్ బీటరు, శ్రీమతి బెసెంటు వున్నత పధంలో మార్గదర్శకులుగా కృష్ణమూర్తి ఆధ్యాత్మిక పధంలో నవ్యారంభకుడైనాడు. శ్రీమతి బెసెంటుకు రాసిన ఒక లేఖలో మార్మికలోకంతో తన పరిచయం గురించి కృష్ణమూర్తి యీ విధంగా వర్ణించాడు :

"అప్పుడు ఆ మహాత్ముడు మొదటిసారిగా నాతో యిట్లా అన్నారు : 'ఈ సహోదరులిద్దరి మీదా నీకు ప్రేమ వున్నదా, వారి మార్గదర్శకత్వాన్ని సంతోషంగా నీవు తలదాల్చుతావా'. నేను వెంటనే సమాధానం యిచ్చాను. 'అవును, నేను హృదయపూర్వకంగా వారిని ప్రేమిస్తున్నాను. 'అనాది నుండి అనంతం వరకు విస్తరించివున్న యీ సహోదరత్వంలో చేరాలనీ నీవు ఆభిలషిస్తున్నావా' అని వారు అడిగారు. 'నేను అర్హుడనైనప్పుడు చేరాలని కోరుకుంటున్నాను' అని నేను చెప్పాను. 'ఈ సహోదరత్వం యొక్క లక్ష్యం ఏమిటో నీకు తెలుసా' అని వారు అడిగారు. 'లోకానికి వుపకారం చేయడం ద్వారా లోగోస్ సంకల్పాన్నీ నెరవేర్చడం' అని నేను సమాధానమిచ్చాను. 'నీ జీవితమంతటినీ, నీ శక్తి అంతటినీ యికమీదట యీ పనికోసమే అంకితం చేస్తానని నీ మీద ప్రమాణం తీసుకోగలవా, లోకక్షేమం కోసం నిన్ను నీవు సంపూర్ణంగా మరిచిపోగలవా, ప్రేమ స్వరూపుడైన పరమాత్మవలె నీవూ జీవితాన్ని ప్రేమమయం చేసుకోగలవా' అని అడిగారు. నేను :- 'తప్పక చేస్తాను, పరమ గురువుల సహకారంతో' అని సమాధాన మిచ్చాను. వారు యింకా యీ విధంగా అన్నారు : 'రహస్యంగా వుంచమని నీకు తెలిపిన విషయాలను రహస్యంగా వుంచుతానని వాగ్దానం చేస్తావా?', 'వాగ్దానం చేస్తాను' అని నేను సమాధానమిచ్చాను.”

ఈ కార్యక్రమంలో, తన జీవితకాలమంతా స్వేచ్చా, అన్వేషణల పక్షం వహించి, వాటి ప్రాధాన్యాన్ని చాటి చెప్పిన కృష్ణమూర్తి పూర్తిగా వాటికి వ్యతిరేకమైన దాసత్వం, గోప్యత అనే వాటికి వాగ్దత్తం కావడం కనబడుతుంది.

ఆ మరుసటి సంవత్సరం ఒక అధ్యయన సంస్థకు అతనిని అధిపతిగా చేశారు. త్వరలోనే అది ఒక అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది. దాని పేరు ప్రాచ్యతార ('ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ యిన్ ది యీస్ట్'). శ్రీమతి బెసెంటు, లెడ్ బీటరు అతని చుట్టూ నిర్మిస్తున్న సంపన్న వాతావరణానికి యిది కేంద్ర బిందువు. నూతనమైన వీరి యీ అవతార సంబంధిత విశ్వాసం గురించి ప్రశంసాత్మకమైన వర్ణన చేస్తాడు జార్జి అరండేల్,

'మా నాయకుడు అధిష్టించిన స్థాయి మీకు తెలుసా. మా బృందంలోని సభ్యులకు ఆమె, శ్రీ లెడ్ బీటరు యీ లోకంలో వుండవలసిన జీవితా దర్శాలకు నిదర్శనాలు. వారిని మనం విశ్వసించి, అనుసరించిన కొద్దీ, అంత వేగంగానూ మనమూ అభివృద్ధి సాధించగలుగుతాము, వుత్తమమైన సేవలను అందించే గలుగుతాము... ఇప్పుడు మన ప్రపంచం గొప్ప ఆందోళనా కాలాన్ని ఎదు
ర్కొంటున్నది, యిటువంటి పరిస్థితి వేల సంవత్సరాల కొకసారి మాత్రమే కలుగుతూ వుంటుంది. మన బృందానికి సంబంధించినంత వరకూ మన చుట్టూరా యిప్పుడు- ఆ పరిస్థితుల యొక్క కేంద్రస్థానానికి చేరువయ్యే ఏర్పాట్ల మధ్య వున్నాము. మన సమాజపు అసలైన సభ్యులను నేరుగా వారి దైహికరూపాలలోనే కలిసి మాట్లాడుతున్నాం. రెండు వేల సంవత్సరాల క్రిందట అవుతే వీరిని దేవదూతలని ఆని వుండేవారు. మనలో ఋషులకు ప్రేమ పాత్రులైన జాన్ మహాత్ముడు మొదలైన వారున్నారు.'

ఈ అతిశయోక్తుల వ్యవహారం కృష్ణమూర్తి మీద ఏ ప్రభావమూ చూపినట్లు కనపడటం లేదు. వుడ్ హౌస్ చెప్పినది యిట్లా వున్నది :


'మేమందరం వయసులో పెద్దవాళ్ళం, విద్యాబోధనలో ప్రత్యేకత సాధించిన వాళ్ళం. యువకులను గురించిన అనుభవం మాకు వుంది. అతనిలో లేశమాత్రమైన గర్వంగానీ, భేషజంగాని కనబడి వున్నా, పరమ పవిత్ర బాలుడి' ననే వైఖరిగానీ, అహంభావంతో కూడిన గొప్పతనం కానీ ప్రదర్శించినా మేము నిస్సం దేహంగా దీన్నంతా వ్యతిరేకిస్తూ నిర్ణయం ప్రకటించి వుండేవాళ్ళం.'

మొత్తం మీద కృష్ణమూర్తి మెత్తని విద్యార్థి; నొప్పించకుండా నడుచుకోవాలని అభిలషించేవాడు; అయితే అతనిలో అందరికీ దూరంగా వుండే స్వభావం వున్నది, చూపుల్లో అస్పష్టత-శూన్యత-పుండేవి. అది చూస్తే లెడ్ బీటరుకు ఒళ్ళు మండుతుండేది. ఒకసారి కృష్ణమూర్తి నోరు పెద్దగా తెరిచి పెట్టి శూన్యంలోకి చూస్తూ వుంటే, లెడ్ బీటరు నిగ్రహం కోల్పోయి గట్టిగా ఒక దెబ్బ వేశాడు. ఆ పిల్లవాడిని అదో పెద్ద మలుపు తిప్పింది. ఆ పైన లెడ్ బీటరుతో అతని బాంధవ్యంలో మార్పు వచ్చేసింది. ఇంకెప్పుడూ అట్లా నోరు తెరుచుకొని వుండకుండా చూసుకున్నాడు. అంతకంటే ముఖ్యం - దీర్ఘచింతనతో కూడుకున్న ఒక విశిష్టమైన చేతన అతనిలో చోటుచేసుకుంది. పెద్దవారయాక, పధ్నాలుగేళ్ళ వయసులో వున్న ఆ బాలుడిని గురించి కృష్ణమూర్తి, అతడిది ఖాళీ వ్యక్తిత్వం అనీ, ప్రపంచంవైపు విస్మయంతో చూసేవాడనీ అన్నారు: 'అదంతా అక్కడ వున్నది; సముద్ర తీరం, గవ్వలు, తెప్పకొయ్యలు; అతను, అదంతా.' నిజమైన పారమార్ధికునిలో వుండవలసిన సున్నితత్వం లేకపోవడం వలన లెడ్ బీటర్ ఆ బాలుడిలో వున్న ప్రత్యేకతను కని పెట్టలేక పోయాడని కృష్ణమూర్తి భావించారు. బహుశ ఆ బాలుడిలో వున్న విశేష తత్వానికున్న కీలకం అసలు యీ అస్పష్టతలోనే వున్నదేమో. అతని చేతనలో విస్తారమైన చోటు, ఒక ఖాళీతనం- దీనినే తరువాత మౌనమైన మనసు అని అన్నారు.

లెడ్ బీటరు యీ బాలురిద్దరినీ గూఢమైన రహస్య సాధనకు చెందిన కార్యకలాపాల్లో పూర్తిగా మునిగించి, తమ కుటుంబానికీ, తమ సంస్కృతికీ దూరంగా లోక్కుని వెళ్ళిపోవడం నారాయణయ్య వ్యతిరేకించాడు. కొన్ని సంవత్సరాల క్రితం లెడ్ బీటరు కొని అవకృత్యాలు చేసి, నిందలకు గురికావడం అందరికీ తెలిసిన విషయమే. దరిమిలా రేగిన ఘాటు విమర్శల వల్ల అతడు దివ్యజ్ఞాన సమాజ సభ్యత్వానికి కొంతకాలం పాటు రాజీనామా యివ్వవలసి వచ్చింది. మద్రాసులోని సనాతనవాదులు కొందరి సహాయంతో నారాయణయ్య శ్రీమతి బెసెంటుమీద దావా వేశాడు. ఆవిడ తనతో చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమించి, పిల్లల్ని మళ్ళీ లెడ్ బీటర్ శిష్యత్వంలో పడవేసిందనీ, ఆ పాత విషయాలన్నీ తిరగతోడి, ఆరోపణలు చేస్తూ వ్యాజ్యం వేశాడు. తన పిల్లల సంరక్షణ భారం తిరిగి తనకి అప్పగించవలసిందనీ ఆ దావాలో కోరాడు.

తన పక్షం తరఫున శ్రీమతి బెసెంటు తనే ఎంతో అనర్గళంగా వాదించింది. కాని సంరక్షణ విషయంలో దావా ఓడిపోయింది. అయితే లెడ్ బీటరు మీద చేసిన ఆరోపణలు మాత్రం నిలబడలేక పోయాయి. ఆమె ప్రివీ కౌన్సిల్ కు ఆభ్యర్థన పెట్టుకుంది. మరో కొత్త తీర్పు వచ్చేలోగా పిల్లలను యింగ్లండుకు పంపివేసింది. ఈ విధంగా కృష్ణమూర్తి జీవితంలో మొదటి అంకం ముగిసింది. అర్ధంలేని, నిలకడలేని చూపులతో 'స్వ' అనే భావం యింకా స్పష్టంగా రూపుదిద్దుకోకుండా వున్న ఒక పసివాడిని అతడి సాంప్రదాయకమైన పరిసరాల నుండి తొలగించి జగద్గురువుగా శిక్షణ గడిపే దశ- అదీ ముగిసిన ఆ అంకం.

ఇక్కడ దాకా వచ్చాక, కృష్ణమూర్తి ఎడల, జగద్గురువు అనే విశ్వాసం ఎడల శ్రీమతి బెసెంటు వైఖరికీ, లెడ్ బీటర్ వైఖరికీ మధ్యనున్న వ్యత్యాసం తెలుసుకోవడం వుపయోగంగా వుంటుంది. శ్రీమతి బెసెంటు లెడ్ బీటరును బాగా నమ్మింది; బహిరంగంగా వారి మధ్య ఏ విభేదాలు పొడములేదు; ఆయినా కూడా వారిద్దరూ కృష్ణమూర్తి భూమికను రెండు విభిన్న దృష్టులతో చూశారు. లెడ్ బీటరు స్వయంకృషితో పైకి వచ్చినవాడు అని చెప్పుకోవచ్చు; ముఖ్యంగా పందొమ్మిదో శతాబ్దంలో వున్న అర్ధంలో, సామాన్యమైన సామాజిక పరిస్థితుల్లో పుట్టినా మహాశక్తిమంతులుగా పరిణతి చెందిన జాన్ జేమ్స్ ఆడుబన్, సర్ హెన్రీ స్టాన్లీల లాగానే అతడు కూడా తన జీవితాన్ని గొప్ప భావనా బలంతోను, తగినంత అభినివేశం తోను చక్కగా నిర్మించుకున్నాడు. పందొమ్మిదో శతాబ్దపు ఆఖరి భాగంలో యూరపు ఖండంలో జీవితాలను కొత్తరకంగా వికసింపచేసుకోవడం అనేది ఒక ప్రత్యేక నైపుణ్యంతో కూడిన కళగా విలసిల్లింది. ఈ రంగంలో లెడ్ బీటర్ అపారమైన ప్రావీణ్యం సంపాదించాడు; అవతార పురుషునిగా కృష్ణమూర్తి అనేది అతని అపూర్వ కళాఖండం.

భారత దేశంలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటపు విశాల రాజకీయ వేదిక మీద పరమోత్సాహంతో కృషిచేస్తున్న శ్రీమతి బెసెంటు బహుళ ప్రజాదరణ పొందిన మహిళ. బెర్నార్డ్ షా, హెచ్.జి. వేల్స్, మహాత్మా గాంధీలతో సన్నిహితంగా మెలగ గలిగిన స్నేహం ఆమెకి వుండేది. దివ్యజ్ఞాన సమాజం ద్వారా వ్యక్తిగతంగా ఏదో లాభం పొందాలని ఆమె అభిలషించలేదు. కృష్ణమూర్తే కాబోయే జగద్గురువు కనుక అవుతే అతనిని సంరక్షించడానికి, అతనిని విద్యావంతుడిని చేయడానికి, ఒక వున్నతమైన గౌరవస్థానంలో అతనిని నిలబెట్టే మేధాపాటవం, మర్యాదా మన్ననా అతనిలో పెంపొందించడానికి ఆమె తన శాయశక్తులా పాటుపడాలనుకుంది. అతని పట్ల గౌరవం చూపుతూ సంరక్షించే అర్హులైన శిష్యులు అతని చుట్టూ సమకూడాలని ఎంతో ఆరాటపడింది. కృష్ణమూర్తి ఆమెతో విభేదించాడు. అయితే శ్రీమతి బెసెంటులోని నిజాయితీని కాని, తన ఎడల ఆమె మనోభావాల్లోని నిర్మలత్వాన్ని కానీ అతడు ఎన్నడూ శంకించలేదు.

లెడ్ బీటరు తను చేస్తున్న కృత్యాలన్నింటికి, దాదాపు ప్రతిదానికీ కూడా, నమ్మశక్యంగా నంత చిన్న వివరాలతో సహా, “పరమ గురువుల ఆదేశాలు" ఆధారమని అధికార యుక్తంగా చెప్పేవాడు. పరమగురువు కుతుమి అధికారపూర్వకంగా తనకు 'చెప్పినట్లు' అందజేసేవాడు.

“వారిని నాగరీకులను చేయాలి; చెమ్చాలు ఫోర్కులు వుపయోగించడం, గోళ్ళకీ, దంతధావ నానికీ బ్రషులు వుపయోగించడం నేర్పించాలి; నేల మీద ముడుచుకొని కూర్చోవడం కాకుండా కుర్చీల మీద హాయిగా కూర్చోవడం, కుక్కల్లాగా ఏదో ఒక మూలన జేరకుండా మనుష్యుల్లాగే మంచాలమీద నిద్రించడం నేర్పాలి "

నాగరకమైన ప్రవర్తన అంటే యూరపియన్ పద్దతులనీ, యింకా అంతకంటే ఆంగ్ల సమాజంలోని వున్నతవర్గాల వారి రీతులు, మర్యాదలు ఆనీ యీ ఆదేశాలు సూచిస్తున్నాయి. ఈ మధ్య జరిపిన అధ్యయనాల వల్ల లెడ్ బీటరు తాను చెప్పుకున్నంత సామాజిక స్థాయికలవాడు కాదనీ సందేహాలు రేకెత్తినా, ఆ కాలంలో ఎంతో మంది భారతీయులు, అమెరికన్లు, రష్యాకు చెందిన వున్నత కుటుంబాలవారు అతని లాగే యీ ఆంగ్ల సమాజపు పైవర్గాన్ని చాలా గొప్పగా పరిగణించేవారు. అందుకే యీ బాలురను యింగ్లండుకు పంపమని శ్రీమతి బెసెంటును లెడ్ బీటరు కొంతకాలంగా అర్ధిస్తూనే వున్నాడు. నిజానికి అప్పటికింకా వాళ్ళు ఎవరి సంరక్షణలో వుండాలి అనే ఘర్షణ మొదలవనేలేదు, ఆ కారణంగా వారిని దూరంగా పంపే యీ ఏర్పాటు చేయడానికి. వలస పాలన జరుగుతున్న ఆ రోజుల ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని యీ అన్నదమ్ములిద్దరి చదువుల కోసం సముచితమైన ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఇంగ్లండులోని గొప్ప విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం సంపాదించడానికి తగినట్లుగా ప్రత్యేక అధ్యాపకుల చేత చదువు చెప్పించాలనుకున్నారు. వారి చెవి తమ్మెలకున్న రంధ్రాలను కుట్టించి పూడ్చేశారు. వాళ్ళ పాదాలకు నొప్పి కలిగినా సరే బూట్లు తొడుక్కోవడం అలవాటు చేశారు; మైదానాల్లో పరుగెత్తే వ్యాయామం చేయించారు; వారి జీర్ణశక్తిని బాధించే గుడ్లు, జావ వంటి వుదయపు అల్పాహారాలు తినిపించారు. కెన్సింగ్టన్ గార్డెన్స్ లో గుర్రపుస్వారీలో శిక్షణ, పడవలు నడపడం, సూర్యాస్తమానం అయ్యేవరకు గ్రీష్మఋతువు సాయంకాలాల్లో 'క్రొకె' అనే బంతి ఆటను పచ్చిక బయళ్ళలో ఆడటం మొదలైనవన్నీ నేర్పించారు. నాటకాలకు, క్రికెట్ పోటీలకు, లండన్ జంతు ప్రదర్శనశాలకూ తిప్పి అన్నీ చూపించారు. సెవైల్ రో అనే ప్రఖ్యాత దర్జీల చేత వారి దుస్తులు అతి నవీనమైన తీరులో తయారు చేయించారు. ఒక ఎర్ల్ గారి భార్య, మరో వైస్రాయిగారి కూతురు వారిని కనిపెట్టివుండి చూసుకునేవారు; సమాజంలోని వున్నత కుటుంబీకులతో పరిచయం కల్పించారు.

కృష్ణమూర్తికి పరిచయం చేసిన ఆ యింగ్లండు సమాజం అప్పుడప్పుడే విక్టోరియన్ జీవితం నుండి బయట పడుతున్నది. రోజు రోజుకీ సంపన్నమవుతూ వుండటం వల్ల సమాజంలోని కట్టడులు సడలి, స్వేచ్ఛా పూరితమూ, ప్రగతి శీలమూ అయి, ఆలోచనా శక్తినీ, మేధనూ పునరుజ్జీవింపచేసే సంస్కృతి నెలకొల్పబడటానికి సాధ్యపడింది. ఒక పక్కన మొదటి ప్రపంచ యుద్ధంలో భయంకరమైన వినాశక శక్తులు పనిచేయడం ఆరంభించినా, మరొక పక్కన 'మానవులు నిజంగానే నాగరికులుగా మారబోయే ఆ చివరి అంచుల్లోకి చేరుకున్నారేమో ననే భావాలు కూడా వాతావరణంలో చోటు చేసుకుంటున్నాయి. స్వతంత్రమైన, హేతుయుక్తమైన, నాగరకమైన, సత్య సౌందర్యాలను అభిలషిస్తున్న' ఒక కొత్త సమాజాన్ని గురించిన ఆశలు కలగడానికి కొంతవరకు సర్వసమానత్వం, అందరకూ న్యాయం అనే సోషలిస్టు. ఆదర్శాల ప్రేరణే కారణం. దీనికి బెర్నార్డు షా, హెచ్.జి.వెల్స్, సిడ్నీ వెబ్, ఓయట్రీస్ వెబ్ మొదలైన ఫేబియన్ సమాజపు సభ్యుల రాజకీయ సంబంధిత రచనలు దోహదం చేశాయి. వీరంతా శ్రీమతి బెసెంటుకు మిత్రులే. తత్వవేత్తలు బెర్ట్రాండ్ రసెల్, జి.యి. మూర్ లు, రచయితలు వర్జీనియా పుల్ఫ్, లియొనార్డ్ వుల్ఫ్ లు, టి.ఎస్. ఇలియట్, ఇఎమ్. ఫోర్ స్టర్ మొదలైనవారంతో పాత విక్టోరియాకాలానికి చెందిన సంప్రదాయాలకు కాలం చెల్లిపోయిందని భావించి, వాటిని వ్యతిరేకించ సాగారు. యూరపులోని మరికొన్ని కేంద్రాల్లో కూడా ఒకప్పుడు పరలోక జీవితం గురించి చింతనలో మునిగివున్న శక్తియుక్తులన్నీ యిప్పుడు సామాజిక నిర్మాణాన్ని మార్చివేసే ఆలోచనల వైపుగా దృష్టి సారించాయి.

తరువాత ఒక తొమ్మిది సంవత్సరాల పాటు కృష్ణమూర్తి యూరపులోనే నివసించినా, యీ నవ్య ఆలోచనా ధోరణుల వుద్యమాలలో అతనికి ఆసక్తి కలగలేదు; సమకాలిక కళా, సాహిత్య వుద్యమాలు కూడా అతన్ని ఆకర్షించలేదు. భావోద్వేగ ప్రభావానికి లోనై తిరుగుబాటుదారులుగా తయారైన తక్కిన విద్యార్థులలాగా కాకుండా కృష్ణమూర్తి కేవలం ఒక ప్రేక్షకుడి లాగే వుండి, మొదటి ప్రపంచ యుద్ధంలో జరుగుతున్న రాక్షసకృత్యాలను, రాబోయే రష్యన్ విప్లవపు విపత్తునూ, నానాజాతి సమితి ఆధ్వర్యంలో శాంతి కోసం, మానవులలో రావలసిన శాంతి కాకుండా- శాంతి అనే ఆదర్శాన్ని తేవడం కోసం పడుతున్న అత్యుత్సాహాన్నీ పరికిస్తూ వుండిపోయాడు.

మొదట్లో కృష్ణమూర్తి లోకమంతా అతని అధ్యాపకుల చుట్టూరా తిరుగుతుండేది. వయసులో పెద్దవారూ, శ్రీమతి బెసెంటుకు, లెడ్ బీటరుకు సన్నిహితులూ అయిన సి. జినరాజదాస, జార్జి అరండేలు లిద్దరినీ యీ అధ్యాపకత్వానికి నియమించారు. తమ స్వంత వున్నత విద్యాధ్యయనాన్ని ఆపివేసుకొని, కృష్ణమూర్తిని ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయపు ప్రవేశపరీక్షల్లో వుత్తీర్ణుడిని చేయడం కోసం తయారు చేయమని వారిని ఒప్పించడం జరిగింది. మరికొంత కాలానికి వీరి స్థానంలో వరుసగా యితర అధ్యాపకులూ నియమించబడ్డారు కానీ, ఎంత ప్రయాసపడినా ఒక్కరు కూడా కృష్ణమూర్తికి గణితంలో కాని, సిద్ధాంతాల చరిత్ర పుట్టు పూర్వోత్తరాలలో కాని, రాజకీయ శాస్త్రంలో కానీ ఆసక్తి కలిగించలేక పోయారు. అన్ని ప్రయత్నాలూ వ్యర్ధమై పోయాయి. ఈ యువ విద్యార్థికి పరీక్ష చదువులకి కావలసిన బుర్ర లేనే లేదు. అంతర్గర్భంలో సృజనాత్మకత మరుగుతున్న యూరపు కానీ, ఆ రోజుల్లో మేధావంతులందరినీ కలచి వేస్తున్న సమస్యలు కానీ అతని మీద ఏ ప్రభావమూ చూపలేక పోయాయి. అతని మనస్సులో యివేవీ నాటుకోలేదు. అయితే రకరకాల భాషలు అతన్ని అలరించేవీ, కవిత్వం అంటే మక్కువ చూపేవాడు. ఆక్స్ ఫర్డులో ప్రవేశం తలకు మించినదై పోవడం వల్ల, అతనిని ఫ్రెంచి భాష, సంగీతం నేర్చుకోమని పారిస్ పంపారు.

చక్కని వస్త్రధారణ, నాగరికమైన నడవడితో కృష్ణమూర్తి ఒక నవీన యువకుడిలా చూపరులను ఆకర్షించేవాడు. కొద్దిగా సిగ్గుపడుతూ కనిపించేవాడు. ఏ పని ఒత్తిడి లేనప్పుడు చిన్నపిల్లవాడిలా సరదాగా అల్లరి చేసేవాడు. బయటకు కనబడే యీ ఆకట్టుకునే గుణం వెనకాల మానవాళి దైన్య పరిస్థితిని పరిశీలిస్తున్న ఒక యువకుడు వున్నాడు. అతడు ఎన్నో సందేహాలను వెలిబుచ్చుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. వాటిలో తనమీద రుద్దబడిన యీ భూమిక గురించీ, దాని చుట్టూరా వున్న ఆడంబరాలను గురించీ, తతంగాలను గురించీ కూడా ప్రశ్నలు వున్నాయి. ఆ రోజులనాటి అతని చిత్రపటం చూస్తుంటే అందగాడైన, మనోహారుడైన ఒక యువకుడు దూరంగా దృష్టిని సారించి చూస్తూ, నిరాసక్తంగా, తను దేనికీ చెందనట్లు కొంచెం అయోమయంగా కనబడతాడు. ప్రపంచంలో తన స్థానం ఏది అని తెలిసిన వ్యక్తిలో వుండే ఆత్మ విశ్వాసం, స్వార్ధదృష్టీ అతనిలో కనిపించవు.

లెడ్ బీటరన్నా అతని ప్రణాళికలన్నా ప్రతిరోధం చూపడం కృష్ణమూర్తిలో అతని పద్దెనిమిదో ఏటి నుండీ వ్యక్తమవడం మొదలయింది. ఒక పక్కన అతని తండ్రితో సంరక్షణ బాధ్యతకు సంబంధించిన దావా సాగుతూ వున్నది. లెడ్ బీటర్ కు వ్రాసిన ఒక లేఖలో యిట్లా వుంది :

"నా వ్యవహారాలన్నీ నేనే స్వయంగా చూసుకునే సమయం వచ్చిందని అనుకుంటున్నాను. పరమగురువుల ఆదేశాలను యితరులు నా మీద బలవంతానరుద్ది, చీకాకు పెట్టడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది; అంతకంటే నా అంతట నేనే వాటిని స్వీకరించి అమలు చేస్తే, యింతకంటే బాగా చేయగలనని భావిస్తున్నాను... నా బాధ్యతలేమిటి. అన్నది నా అంతట నేను గ్రహించడానికి నాకు అవకాశం యివ్వడం లేదు. చిన్న పాపాయిలా నన్ను అటూ యిటూ ఆడిస్తున్నారు."

1920 కల్లా మానవ సమస్యలకు దివ్యజ్ఞానం ఏవిధంగా అన్వయిస్తుంది అనే సందేహం కృష్ణమూర్తిలో కలిగింది. గాఢంగా ప్రేమించిన వారిని పోగొట్టుకున్న ఒక పరిచితురాలిని గురించి యీ విధంగా వ్రాశాడు :

"అసలైన పరీక్షా సమయం వచ్చినప్పుడు, దివ్యజ్ఞానం కొని, దానికి సంబంధించిన అసంఖ్యాకమైన గ్రంథాలుకానీ ఏ సహాయమూ చేయలేవు. పరమగురువులను ఆమె భౌతికంగా గాని, మానసికంగా కానీ దర్శించాలనుకుంటున్నది. ఆ.బి చేప్పినా లె.బీ. చెప్పినా ఆమె నమ్మలేక పోతున్నది. నిజం చెప్పాలంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మేము (నిత్య, నేను) అనుకుంటున్నట్లుగానే ఆమె భావిస్తున్నది... దివ్యశక్తులను జాగృతం చేయడం, యింకా అటువంటి యితర విషయాల జోలికీ పోవద్దని ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను; కాని ఆమె అదే కావాలని కాంక్షిస్తున్నది."

ఒక దశాబ్దంపాటు జగద్గురువు అవడం కోసం శిక్షణ పొందాడు కృష్ణమూర్తి, అయితే రహస్య, మార్మిక సిద్ధాంతాలతోను, అతీంద్రియ శక్తులతోను నిండి వున్న యీ దివ్య జ్ఞానం 'అత్యంతమైన ఆపత్కర పరిస్థితి' లో వున్న ఆ యువతికి ఏ వుపశమనమూ యివ్వలేదని గ్రహించాడు. అంతకు మునుపు జరిగిన విపత్తు, మళ్ళీ యిప్పుడు మృత్యువు చేసిన యీ ఆఘాతం ఆమెని దారుణంగా బాధిస్తున్నాయి. ఆమెకు ఏ వూరటనూ అందించలేని స్థితిలో కృష్ణమూర్తి అపరిమితమైన ఒంటరితనాన్ని అనుభవించాడు. అయితే లోలోపల ఒక నమ్మకం కలుగుతున్నది. అసలైన మతం అంటే ప్రతి మనిషి అనుభవిస్తున్న యీ దుఃఖం అనబడేదానిని సూటిగా తాకాలి.

ఈ నమ్మకం సిద్ధాంతాలను కాని, తాత్విక జ్ఞానాన్ని కాని ఆధారంచేసుకొని కలిగినది కాదు; అంతఃస్ఫురణతో కూడిన ఎరుక వల్ల కలిగినది, అది ఒక ఒరిపిడిరాయిలా అతని లోపల నిక్షిప్తంగా వుంటూనే వచ్చింది.

యూరపులో తొమ్మిదేళ్ళు గడిపాక తన స్వదేశంలోని ఆచార సంప్రదాయాలతో సంబంధం పూర్తిగా సన్నగిల్లిపోయింది. అయితే దానికి బదులుగా మరొక పాశ్చాత్య సంప్రదాయమూ అతను తలదాల్చలేదు. అతీంద్రియ ప్రపంచం కూడా అతన్ని ఆకర్షించలేదు.

1621 నాటి శీతకాలంలో యిరవై ఆరు సంవత్సరాల వయసులో అతడు ఆస్ట్రేలియా వెళ్తూ భారతదేశంలో కొద్ది రోజులు ఆగాడు. అతనితో పాటు నిత్య కూడా ప్రయాణం చేస్తున్నాడు. అయితే నిత్య ఆరోగ్యం ఏమీ బాగులేదు. క్షయవ్యాధి అతని శరీరాన్ని క్రమంగా క్షీణింపచేస్తున్నది. ఏటా జరిగే దివ్యజ్ఞాన సమాజంవారి సమావేశాల్లో కృష్ణమూర్తి ప్రసంగించవలసి వున్నది. ఆ సందర్భంలోనే అతడు తన తండ్రిని చూడటానికి వెళ్ళాడు. బహుశ అదే అతను చివరిసారిగా తండ్రిని కలుసుకోవడం, వారి కలయికలో సంతోషం లేదు. అప్పుడు నిజంగా ఏం జరిగింది అనే విషయం తలా ఒక రకంగా చెప్తారు. కృష్ణమూర్తి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు, సాంప్రదాయకమైన రీతిలో. ఆప్రాచ్యులైన కొడుకుల స్పర్శతో మైలపడ్డానని నారాయణయ్య అనుకున్నాడనే భావం కృష్ణమూర్తికి కలిగింది. పూర్వ చరిత్ర కానీ, ముందుకు సాగవలసిన దిశ కానీ ఏదీ లేని దశలో కృష్ణమూర్తి 1922 ఆరంభంలో, కేలిఫోర్నియాలోని ఒహాయిలో ఏకాంతజీవనం అభిలషించాడు. అక్కడ వాతావరణంలో తేమ వుండదు, ప్రశాంతమైన పరిసరాలలో జనసమ్మర్ధానికి దూరంగా వున్న ప్రాంతం. నిత్య ఆరోగ్యం బాగుపడటానికి, కృష్ణమూర్తి అధ్యయనమూ, ధ్యానమూ సాగడానికి అనువైన ప్రదేశం.

అతని జీవితంలోని మహత్వపూర్ణమైన ఘట్టం అట్లా ప్రారంభమయింది. ఒహాయిలోని ఒక పిప్పలి వృక్షపు నీడలో 'మనుష్యుల సంతోషానికి అతీతమైన ఆనందంతో' కూర్చున్న వ్యక్తికీ, యూరపు అంతటా తిప్పుతూ రకరకాల పరీక్షలకు కూర్చోబెట్టినా ఎందులోనూ సఫలత సాధించలేక విసుగెట్టిపోయిన యువకునికీ పోలికే లేదు. మొదట్లో ఆరంభ సంవత్సరాల్లో తన భవిష్యకాలం గురించి అతనికి ఏవయినా అంతర్గతం నుండి సందేశాలు వినిపించి వుండవచ్చేమో కాని యిప్పుడు మాత్రం తన జీవితం ఏ దిశలో సాగాలన్నది గట్టిగా తెలిసిపోయింది. ఇక ఏ సందేహాలూ లేకుండా అతను సాగిపోయాడు.

'నా జీవితాన్ని నడిపించే తాత్వికత ఏమిటి అన్నది యిప్పుడు నాకు తెలియదు. అయితే ముందు ముందు నా తాత్వికత నాకు వుంటుంది... నా అంతట నేను అది తెలుసుకుంటాను. అప్పుడే యితరులకి నేను సహాయపడగలుగుతాను' అని అంతకు ఒక సంవత్సరానికి పూర్వం ఒక స్నేహితునికి వ్రాశాడు. అయితే అతడిని వివశత్వంలో ముంచిన ఆ మహత్వపూర్ణమైన అనుభవం పొందిన తరువాత, అతనిదైన తాత్వికత పూర్తిగా పరిణతి చెందాక కూడా, జీవితం చాలా నిగూఢమైనది, అందులో మన స్థానం ఏమిటి అనేది కనిపెట్టడం ప్రతివారూ తమకు తామే కొత్తగా తెలుసుకోవాలి అనే ఒక గ్రహింపు అతనిలో చిరకాలం వుండిపోయింది.

1922 ఆగస్టుకీ, మార్చి 1923 కీ మధ్యకాలంలో ఏం జరిగింది అన్నదానికి ఆధారాలు మనకి నిత్య వ్రాసి పెట్టుకున్న పుస్తకాల్లోనూ, ఆ యిద్దరు సోదరులూ శ్రీమతి బిసెంటుకు, లెడ్ బీటరుకు వ్రాసిన వుత్తరాల్లోనూ చాలా వరకు దొరుకుతాయి. ఆదృశ్య శక్తులు మైత్రేయుడి ఆవాహనకు తన అన్న శరీరాన్ని సిద్ధం చేస్తున్నాయనీ, ఆ పవిత్రకాండను తాను సాక్షిగా తిలకిస్తున్నాననీ నిత్య భావించారు. 1909 లో లెడ్ బీటరు చెప్పిన భవిష్యవాణి యిప్పుడు యీ విధంగా ఫలిస్తున్నదని కూడా భావించాడు.

ఆధునికులైన పాకులకు ఒహాయిలో జరిగిన యీ పరిణామ ప్రక్రియను అవగాహన చేసుకోవడం అంత సులువు కాదు. దిగ్ర్భాంతిలో మునిగి పోయిన నిత్య లాగే మనం కూడా మునుపు ఎన్నడూ అనుభవంలో, లేని యీ సంఘటనలను యోగంతోనో, మహాయాన బౌద్ధంతోనో ముడి పెట్టి, ఆ సంప్రదాయ సంబంధమైన శబ్దజాలం వుపయోగిస్తూ పరికించడం సహజమే. అయితే ప్రస్తుతం సంఘటనల వెనక వున్న పారభౌతికమైన అర్ధాలను నిర్ణయించకుండా వుండటమే వుత్తమం. దానికి బదులు కృష్ణమూర్తి జీవితం పై వీటి ప్రభావం, ప్రాధాన్యం ఏమిటి అన్నది గ్రహించడం ముఖ్యం.

నిత్య 'ప్రక్రియ' అని పేరు పెట్టినది 1922 నుండి 1923 వరకు మధ్యన వున్న నెలల్లో అప్పుడప్పుడు జరుగుతుండేది. శారీరకంగా చాలా బాధాకరమూ, శ్రమ పూరితమూ అయిన యీ అవస్థలో మధ్య మధ్యన మహా సౌందర్యపు దర్శనం, సుస్పష్టమైన నిర్దుష్టతతో ప్రకాశించే క్షణాలూ కూడా వుండేవి.

ఒహాయి లోయప్రాంతంలో నివసించడం ఆరంభించగానే కృష్ణమూర్తి క్రమంగాసు, సునాయాసంగానూ ధ్యానం చేయడం ఆరంభించాడు. అప్పుడు ఆతని మెడ వెనుక భాగంలో నొప్పి మొదలైంది. తరువాత కొద్ది వారాల్లోనే అది చాలా తీవ్రంగా తయారై, శరీరంలోని యితర భాగాలకు కూడా పాకింది. ఆ నొప్పి ప్రధానంగా వెన్నుపాము పొడుగునా, కనుల వెనకాల, తల శీర్షభాగాన వుండేది.

నొప్పితో అన్న వణికిపోవడం, బాధతో మెలికెలు తిరగడం, తరచు స్పృహ లేకుండా పడిపోవడం నిత్య చూస్తూ కూర్చునేవాడు. రకరకాల కంఠస్వరాలలో మాట్లాడటం కూడా విన్నాడు. ఒక్కొక్కసారి ఒక చిన్న పిల్లవాడు భయంతో వణుకుతున్న గొంతుతో 'కృష్ణ' వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ యిక రాడు అని అనడం కూడా విన్నాడు. మరికొన్ని సమయాల్లో 'అభయమిస్తున్న ఒక ఆగంతుకుని' కంఠం కూడా విన్నాడు. నిత్య రాసుకున్న పుస్తకంలో 'అదృశ్యశక్తుల' తో జరిగిన సంభాషణలో యివతల వారు మాట్లాడిన మాటలు వ్రాసివున్నాయి. ఒక్కొక్కసారి యీ కంఠస్వరాలు అస్పష్టంగా ఆయిపోవడం కూడా నిత్య గమనించేవాడు. మరికొన్ని సార్లు జరిగిపోయిన సంఘటనల్లో కృష్ణమూర్తి మళ్ళీ జీవించడం కూడా నిత్య చూశాడు. తల్లి చనిపోయిన ఘట్టాన్ని, నారాయణయ్య ధోవతి చెంగుతో ముఖం కప్పుకొని ఏడవడం దృశ్యాన్ని కృష్ణమూర్తి వెనక్కు వెళ్ళి చూడటం నిత్య గమనించాడు. అప్పుడు ఆ కంఠస్వరం ఆ వ్యక్తిదిగా మారిపోయేది. ఎప్పుడో మరిచిపోయిన తన మాతృభాషలో ఏడుస్తున్న చిన్నపిల్లవాడిదిగా.

తనకు ఏం జరుగుతున్నదీ అనేది కృష్ణమూర్తి వివరించి చెప్పలేక పోయేవాడు. ప్రక్రియ జరుగుతుంటే మధ్యలో అతను అపస్మారకంగా పడిపోయేవాడు. ఆ తరువాత స్పృహ వచ్చాక ఏం జరిగిందో అతనికి గుర్తుండేది కాదు. అయితే అతడు తన స్వంత మాటల్లో యిదంతా తన చేతనను ఏ విధంగా మార్పు చెందించిందీ సూచన ప్రాయంగా చెప్పడం వ్రాసి పెట్టి వున్నది. 'అసాధారణమైన అనుభవం ఒకటి నాకు జరిగింది' అని అతను చాలా సాధారణంగా రాశాడు శ్రీమతి బెసెంటుకు పంపిన లేఖలో, ఆ వుత్తరంలో యింకా యిట్లా వుంది:

'రోడ్డు బాగుచేస్తూ ఒక మనిషి పనిచేస్తున్నాడు, ఆ మనిషిని నేనే. అతని చేతిలో వున్న పలుగును నేనే. అతను పగలకొడుతున్న రాయి సాక్షాత్తూ నాలో
భాగమే. లేత గడ్డిపోచల్లో వున్నది నా అస్తిత్వమే. ఆ మనిషి పక్కనే వున్న చెట్టే నేను. ఆ రోడ్డు బాగుచేస్తున్న మనిషివీ నావీ మనోభావాలు, ఆలోచనలూ దాదాపుగా ఒక్కటిగా వున్నాయి. చెట్టు మధ్యలో నుండి గాలి వీచడం నన్ను స్పృశిస్తున్నట్లే వుంది. గడ్డిపోచ మీద చీమ పాకడం నేను అనుభూతి చెందు తున్నాను. పక్షులు, ధూళి, ఆ సందడీ అంతా నాలో భాగంగా అనిపిస్తున్నది... నేను ప్రతిదాంట్లోనూ వున్నాను; అది కాదు, నాలోనే ప్రతిదీ వున్నది. ప్రాణరహితమైనవి, ప్రాణం వున్నవీ, పర్వతమూ, చిన్న పురుగూ, గాలి పీల్చే అన్ని ప్రాణులూ నాలోనే వున్నాయి.

ఈ వాక్యాలు 'అక్కడ వున్నదాని'తో అన్యోన్యత చెంది, కరిగిపోయిన ఒక వ్యక్తిత్వాన్ని వర్ణిస్తున్నాయి. కర్త, కర్మ {ద్రష్ట, వస్తువు} కలిసిపోయిన ఒక గాఢమైన సహానుభూతీ కృష్ణమూర్తి సహాజ స్వభావంలో మొదటి నుంచీ స్థిరంగా వుంటూ వచ్చింది. బాల్యంలో అతనిలో కనబడిన 'ఖాళీతనం' లో దీనిని స్పష్టంగా చూడవచ్చు. అతనిలో సహజసిద్ధంగా వచ్చిన యీ సహానుభూతికీ, దాని సంపూర్ణమైన అభివ్యక్తీకరణ అయిన 'నీవే ప్రపంచం' అనే ప్రవచనానికీ మధ్యన పరిపక్వమైన కృష్ణమూర్తి అంతర్దృష్టి వున్నది. తనలో గాఢంగా, స్థిరంగా వున్న సహానుభూతి సాధారణ మానవుని చేతనావర్తంలో కూడా ఎందుకని ఒక ప్రధానభాగంగా లేదో కృష్ణమూర్తి నేర్చుకోవలసి వచ్చింది. ఈ వాస్తవానికి తగిన ఒక సమాధానాన్ని అతడు కనిపెట్టవలసి వచ్చింది. కృష్ణమూర్తి లేఖలో యింకా యీ విధంగా సమస్తాన్నీ ఆవరించుకొని వున్న ఆ ప్రశాంతతను గురించిన వర్ణన వుంది.

"నా లోపల ఒక లోతైన, అగాధమైన కొలనుకు అట్టడుగున వుండే నెమ్మది వున్నది. ఆ కొలనులాగే నా దేహాన్నీ, నా మనసునీ, అందులోని వుద్వేగాలనూ వుపరితలం మీద అలలు అలలుగా కదిలించవచ్చును గానీ, నా ఆత్మలోని నెమ్మదిని మాత్రం ఏదీ- అవును, ఏదీ అలజడి చేసి చెరపలేదు."

శ్రీమతి బెసెంటు నిరీక్షణకూ, పెట్టుకున్న ఆశలకూ తగినట్లుగా జీవిస్తున్నాననే నమ్మిక అతనిలో పెరుగుతున్నట్లు సూచనలు కనబడతాయి.

"నేను కాంతిని దర్శించాను. దుఃఖాన్ని, బాధను నయంచేసి వేసే కారుణ్యాన్ని నేను అందుకున్నాను. ఆ కారుణ్యం నా కోసం కాదు, యీ ప్రపంచం కోసం... ఇక మళ్ళీ ఎన్నడూ అంధకారం నన్ను తాకలేదు, మహాద్భుతమైన, స్వాస్థ్యగుణం కల కాంతిని నేను దర్శించాను... ఆనందమూ, అనంత సౌందర్యమూ అనే స్రవంతిలో నేను ఓలలాడాను. దైవత్వం నన్ను పరవశత్వంలో ముంచి వేసింది."

సుమారుగా యిదే సమయంలో అతడు లెడ్ బీటరుకు తనను క్షమించమంటూ ఒక లేఖ వ్రాశాడు. అందులో తనను దివ్యజ్ఞానానికి మళ్లీ పూర్తిగా పునరంకితం చేసుకుంటున్నానని, యికమీదట 'పరమగురువులనూ, పరమాత్ముడినీ, సేవించు కొనడమే తన భవిష్యత్ కార్యక్రమమనీ ప్రకటించాడు.

కర్తవ్య పరాయణుడిలాగా యీ విధంగా ప్రకటించినా, తన ఆధ్యాత్మిక అనుభవాన్ని మూలాధారంగా చేసుకొని ఏ ప్రత్యేక మత సంప్రదాయాన్నీ ఆరంభించ లేదు. అంతేకాదు, దినసరి జీవనంతో పొసగని ఒక అలౌకిక స్మృతిగా చేసుకొని అందులో జీవించనూ లేదు. దాని అవశేషమే అతని చేతనలోని 'మౌన స్థలం'. అక్కడే సత్యం ఎడల వుపేక్షతో వుండే వాటినన్నింటినీ వుంచి, పరీక్షించ గలిగేది; ప్రేమ ఎడల తటస్థంగా వుండే వాటిని సార్ధపరిచేదీ అక్కడే. ఆ నిశ్శబ్దాన్ని రోజువారీ జీవితంతో అన్వయించుకోవచ్చును, మరో లోకంతో కాదు, అది అవగాహనకు తలుపులు తెరచివుంచుతుంది తప్ప, రహస్య శక్తులకోసం కాదు.

ఈ సమయంలోనే, ఎంతో దైహికబాధతోనూ, వ్యక్తిత్వాన్ని ఛిద్రంచేయడంతోనూ కూడుకొని, పరమానందకరమైన దృశ్యాలను, ప్రశాంతపూర్ణమైన కాంతిని ప్రసాదిస్తూ, 'ప్రక్రియ' నెలల తరబడి కొనసాగుతూ వున్నది. అన్న దమ్ములు ప్రపంచమంతటా పర్యటిస్తూ వుంటే, ఖండాంతరాలలో, మహాసముద్రాలను దాటుతూ అదీ సాగిపోతూనే వున్నది. తన సోదరుడికి ఏం జరుగుతున్నదో నిత్యకు అర్ధంకావడం లేదు. కృష్ణమూర్తికి కూడా తన చేతనావర్తంలో జరుగుతున్న యీ మార్పుల అంతరార్థం ఏమిటో, చివరకు యిది దేనికి దారితీస్తుందో అన్నది అనవగాహంగా వుంది. దివ్యజ్ఞానానికి సంబంధించిన భాషలో చెప్పాలంటే, ఈ ప్రక్రియ అతీంద్రియ జ్ఞానాన్ని విస్తృత పరుస్తుందనీ, అతీంద్రియమైన సత్యాలకు 'ప్రత్యక్షబోధ' అనీ అన్నట్లుగా వారి ఆలోచనలు సాగాయి. అయితే అట్లా జరగలేదు. అసలు జరిగిందేమిటంటే, ఆ 'నిశ్శబ్దస్థలం' మరింత గాఢమై, ఒక కాంతిపుంజంగా తెరచుకున్నది. అది ఒక సంఘటన కాదు, కృష్ణమూర్తి స్వతఃసహజంగానే ప్రవహించిన ఒక స్థితి అది.

అన్న పడుతున్న అవస్థ నిత్యలో ఆందోళన రేకెత్తించిందీ; సలహాల కోసం లెడ్ బీటరును ఆర్ధించాడు. అయితే లెడ్ బీటర్ యీ విషయంలో తాటస్థ్యం వహించినట్లు, అనుమానాలు వెలిబుచ్చుతున్నట్లు నిత్యకు అర్ధమైంది. ఆస్ట్రేలియా నుండి రాసిన సమాధానంలో లెడ్ బీటరు, ప్రస్తుతం కృష్ణమూర్తి 'మూడవ వుపదేశం'లో వుత్తీర్ణుడయాడనీ, అయితే తాను మాత్రం నాల్గవ వుపదేశం ఎప్పుడో దాటేసినట్లూ, పైగా ఒహాయి 'ప్రక్రియ' లాంటి శారీరక దుష్ఫలితాలేవీ తాను పొందనట్లూ వ్యక్త పరచాడు. ఈ జరుగుతున్న మార్పులన్నీ లెడ్ బీటరునూ కలత పెట్టాయి; 'దుష్టశక్తులు' ఏవైనా తన మాజీ శిష్యుడిని పట్టుకున్నాయేమోననే అనుమానంతో, దివ్యజ్ఞానంవారి వైద్యుని రహస్యంగా ఒహాయికి పంపించాడు; పరిస్థితిని గురించి తనకు నివేదిక పంపమన్నాడు. దురదృష్టవశాత్తు ఆమె పంపిన నివేదిక మనకు మిగులలేదు.

1925 లో 'పరమగురువులు-మార్గము' అనే గ్రంధాన్ని లెడ్ బీటర్ ప్రచురించాడు. ఇందులో ప్రధానంగా వున్న ప్రతీక ఆధ్యాత్మిక పధం- యిది ప్రపంచంలో వున్న అన్ని మతాల్లోనూ కనబడుతుంది. అన్నింటికంటే అత్యంత సుందరమైన చిత్రణ బొరుబదుర్ మహాస్తూపం మీద చూడవచ్చు. జీవితమూ, పునర్జన్మ అనే దీర్ఘమైన ఆధ్యాత్మిక పధానికి సంకేతంగా అక్కడ క్రమక్రమంగా అధిరోహణ చేస్తూ, మెలికలు తిరుగుతూ పైకి పోతున్న దారి ఒకటి వుంటుంది. ఈ మార్గానికి మధ్య మధ్యలో శిల్పాలు చెక్కి వుంటాయి. వాటిలో సుబంధు జ్ఞానోదయం (సంబోధి) అందుకోవడానికి చేసిన సుదీర్ఘ ప్రయాణం చెక్కి వుంది. ఆ ప్రాచీన ప్రయాణాన్ని అనుకరిస్తూ యాత్రీకులు శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ఎక్కుతూ వుంటే, బుద్దుని జీవితం గురించీ, అతను చేసిన సత్కిృయల గురించీ చెక్కిన శిల్పాలు దారి చూపుతుంటాయి. బాధ, విమోచనాలతో కూడుకొనివున్న ఆథ్యాత్మిక పధంలో మార్గదర్శకుల్లో అగపడే బోధిసత్వుల శిల్పాలు మార్గమధ్యంలో దర్శనమిస్తాయి.

భారతీయ తాత్విక సంప్రదాయంలోని శాఖలను రెండు రకాలుగా విభజించ వచ్చును. జ్ఞానోదయం లేక సంబోధి క్రమక్రమంగా జరుగుతుందా లేక హరాత్తుగా కలుగుతుందా అనేది యీ విభజనకు ఆధారం. నాగార్జునుడు 'లంఘనము' (గెంతు) ను నిర్దేశించిన తాత్వికుడు. అయితే పతంజలి యోగసూత్రాలలో క్రమానుగతమైన మార్గంలో జ్ఞానోదయం సిద్ధిస్తుందని అంటాడు. లెడ్ బీటరు అధిరోహణంలో నాలుగు దశలను గుర్తించాడు; దివ్యజ్ఞానంవారి యీ సూత్రాన్ని పైన పేర్కొన్న రెండు సంప్రదాయ ధోరణుల మధ్యన నిలబెట్టవచ్చును.

యూరపులో చిన్న చిన్న బృందాలతో సన్నిహితంగా పనిచేస్తూ ఆధ్యాత్మిక అధ్యయనం గురించి చర్చిస్తున్న యువకుడైన కృష్ణమూర్తిని పరీక్షిస్తుంటే ఒకటి స్పష్టమవుతుంది. ఒక ప్రత్యేక మార్గంనుండి అతడు 'లంఘనం’ తత్వం వైపు జరిగిపోతున్నట్లుగా కనబడుతుంది. ఇదే అతని భావప్రకృతికీ, మానవుని నిబద్దస్థితి గురించిన అతని అవగాహనకూ చక్కగా సరిపోతుంది. యువకులైన తన శిష్యులతో నిస్వార్థత, ప్రేమ, సొనుభూతుల విలువ గ్రహించమనీ, 'తెలియని దానిలోకి దూకండి... ప్రమాద పూరితంగా జీవించండి..., 'మారడం ఎంతో సులువు', అందులో ఎంతో 'సరదా' వున్నది అనీ వారిని ప్రోత్సాహపరుస్తూ బోధించేవాడు. ఆత్మ క్రమంగా పరిణామం చెందుతుందని దివ్యజ్ఞానం హామీ యిస్తుంటే, అప్పటి రోజుల్లోనే కృష్ణమూర్తి తన బోధల్లో ఒక విప్లవం వంటి దానిని లక్ష్యంగా ప్రకటించాడు.

* * *

ఒక కొత్త తరానికి చెందిన దివ్యజ్ఞాన సామాజికులు, అధికారశ్రేణిలో తమ స్థానాలకోసం వుత్సాహంతో ముందుకొస్తున్నారు. హాలెండులోని హ్యుజెన్ లో జార్జి అరండేల్ నాయకత్వం వహించాడు. 1925 ఆగస్టులో వారం రోజులపాటు జరిగిన అతి ముఖ్యమైన సమావేశాల్లో అతడు వరుసగా కొన్ని జ్యోతిర్ సందేశాలు 'భూమి మీదకు' తీసుకొచ్చాడు. తననూ, తన సహచరులనూ 'మార్గం' లో ముందుకు తీసుకొని పోవడం కోసమని. ఇంతవరకు శ్రీమతి బెసెంటు, లెడ్ బీటర్లు మాత్రమే నాల్గవ వుపదేశం' దాట గలిగారు. ఇప్పుడు తనకు, లేత వయసులో వున్న తన భార్య రుక్మిణీ దేవికీ, కృష్ణమూర్తికీ యీ హోదా అనుగ్రహింపబడిందనీ అరండేల్ ప్రకటించాడు. అంతే కాకుండా మైత్రేయుడు పన్నెండుమందిని ప్రధాన శిష్యులుగా ఎన్నుకున్నాడనీ త్వరలోనే వారి పేర్లను తెలియ పరుస్తారనీ కూడా అన్నాడు.

శ్రీమతి బెసెంటు యిప్పుడు డబ్బయి సంవత్సరాల వృద్ధురాలు. కళ్ళు తిరిగే వేగంతో సాగుతున్న పరిణామాలు ఆమెను సమ్మోహపరిచాయి. హాలెండులో జరిగిన తారక సభలో ప్రధానశిష్యులుగా ఎన్నుకోబడిన ఏడుగురి పేర్లను ఆమె తెలియపరచింది. వారు వెడ్జ్ వుడ్, లెడ్ బీటర్, జినరాజదాస, అరండేల్, రుక్మిణీదేవి, ఆస్కార్ కొల్ స్ట్రామ్, తనూ. పరమాత్మ అవతరించే శుభసందర్భాన్ని కొనియాడుతూ ఒక ప్రపంచ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. దానికి తను ప్రధాన అధ్యక్షులుగా, అరండేల్ ప్రధానోపాధ్యాయులుగా, జేమ్స్ వెడ్జ్ వుడ్ అధ్యయన శాఖాధ్యక్షులుగా వుంటారని తెలియపరచింది. దూరంగా ఒహాయిలో వున్న కృష్ణమూర్తి యిదంతా నమ్మలేదు. అతనికి యిదంతా అనుమానాస్పదంగా అనిపించింది. నిత్యకు తీవ్రంగా జబ్బు చేయడం వల్ల అతనికి శుశ్రూష చేయడంలో మునిగిపోయి వున్న కృష్ణమూర్తికి, యీ ప్రకటించబడిన 'జ్యోతిర్లోకపు స్టాయి' సంఘటనల్లో తాను పాల్గొన్నట్లుగా గుర్తు లేదు. అరండేల్ తదితరులు వున్నత దశను చేరుకోవడాన్ని అతను రూఢి పరచలేదు. వారిని ప్రధాన శిష్యులుగా కూడా అతను అంగీకరించలేదు.

క్షయవ్యాధితో పోరాటంలో ఓడిపోయిన నిత్య నవంబరు 1925 లో ఒహాయిలో మరణించాడు. ఆ సమయంలో కృష్ణమూర్తి భారతదేశానికి వెళ్తున్న ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. అడయారులో జరుగబోయే దివ్యజ్ఞానంవారి స్వర్ణోత్సవాల కోసం అతను వెళ్తున్నాడు. ఓడ సూయజ్ కాలువను సమీపిస్తుండగా, మొదట నిత్య ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా వున్నదని, ఆ తరువాత చనిపోయాడని తంతి ద్వారా వార్తలు వచ్చాయి. నిత్య ప్రాణాలకు భయం లేదనీ, అతను నిర్వర్తించవలసిన పనుల కోసం అతడు తప్పక బ్రతికి వుంటాడనీ నచ్చజెప్పిన తరువాతే కృష్ణమూర్తి స్వర్ణోత్సవాలలో పాల్గొనడానికి బయలుదేరాడు. అంతకు ఒక సంవత్సరం మునుపు ఒక స్వప్నంలో కృష్ణమూర్తి నిత్య ప్రాణాల కోసం అర్థించాడు. ఆ కలలో పరమగురువు మహా చొహాన్ 'అతను తప్పక బ్రతుకుతాడు' అని హామీ యిచ్చాడు. 1922 లో పొందిన మార్మికమైన అనుభూతులు సోదరులిద్దరినీ మరింత సన్నిహితంగా చేర్చాయి. ఇద్దరిదీ ఒకటే ఆశయంగా అనిపింపజేసింది. నిత్య విషయంలో తనకు కలలో లభించిన హామీ తప్పక నిజమవుతుందని కృష్ణమూర్తి అమాయకంగా ఆశించాడు. ఇప్పుడతనీ శోకానికి అవధులు లేకుండా పోయాయి. నిత్యవీ, అతనివీ ఒకటే అనుభవాలు, ఒకరంటే ఒకరికి సంపూర్ణమైన అవగాహన; అంత నిర్మలంగా, హాయిగా నిత్యను అతడు ప్రేమించాడు. బాల్యం నుండి వారి జీవితాలు పరస్పరం పెనవేసుకొని పోయాయి. తమ కుటుంబం నుంచి దూరం కావడం, తము పుట్టిన సంస్కృతిని వదులుకోవడం యిద్దరూ కలిసి అనుభవించారు. ఇద్దరూ కలిసి ఒక విజాతీయ వాతావరణానికి సర్డుకొని పోయారు. ఓడ మద్రాసు సమీపిస్తుండగా కృష్ణమూర్తి ఒక సందేశాత్మకమైన ప్రకటన వ్రాశారు. అందులో అమేయమైన దుఃఖం నిండి వుంది, ఆ దుఃఖాన్ని చల్లార్చడంలోనే ఇతనికి నూతన శక్తి లభించింది.

“పాత స్వప్నం ఒకటి మరణించింది. మరో కొత్తది జన్మిస్తున్నది. ఒక నూతన దర్శనం అవిర్భవిస్తున్నది, ఒక కొత్త చేతన వికసిస్తున్నది. నేను ఏడ్చాను, కాని మరెవ్వరూ శోకించకూడదని నేను కోరుకుంటున్నాను.”

నిత్య మరణంతో కృష్ణమూర్తిలో దివ్యజ్ఞాన సమాజం ఎడల విముఖత ఆరంభమైందని యీ విషాదపూరితమైన అడయారు ప్రయాణంలో కృష్ణమూర్తితో పాటు ప్రయాణించిన బి. శివరావు గట్టిగా భావించారు.

అతని జీవితతత్వం సమస్తం- శ్రీమతి బెసెంటు, శ్రీ లెడ్ బీటర్లు చిత్రించిన భవిష్యత్తులో అకుంఠితమైన విశ్వాసం, అందులో నిత్య ప్రధాన పాత్ర- అంతా భగ్నమై పోయింది.
నిత్య మరణం గుండెలు బ్రద్దలు చేసేలాంటి సంఘటన అని ఒప్పుకోవలసిందేఅది కొంతవరకు నిజమే- అయితే దివ్యజ్ఞానం ఎడల కృష్ణమూర్తిలో అసంతృప్తి కొన్ని సంవత్సరాలుగా మరుగుతునే వున్నది. నిత్య మరణం తరువాత హాలెండులో జరిగిన సంఘటనలు పరిస్థితిని ఒక విపత్కర స్థాయికి తీసుకొచ్చాయి. 1927 లో అతడు యిట్లా వ్రాస్తున్నాడు :
“నేను స్వంతంగా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు- యిది గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వున్నాను- నాలో ఒక తిరుగుబాటు చేలరేగింది. ఏ బోధలు కానీ, ఏ ఆధిపత్యం కానీ నాకు సంతృప్తిని యివ్వలేదు.”

నిత్య మరణానికి చాలా యేళ్ళకు పూర్వమే యీ తిరుగుబాటు ఆరంభమైంది. ఆధిపత్యం చలాయించడమంటే కృష్ణమూర్తిలో సహజంగానే వున్న రోత, దివ్యజ్ఞాన సమాజం (టీఎస్) లో ఆధ్యాత్మిక పురోభివృద్ధి విషయంలో సుస్థిరంగా పాతుకొనిపోయిన లేడ్ బీటర్ మధ్యవర్తి పాత్రా దానిని మరింత ఎగసన దోశాయి.

నిత్య మరణం వల్ల దివ్యజ్ఞానం ఎడల కృష్ణమూర్తిలో కలిగిన అసంతృప్తి స్పష్టంగా విదితమైంది. అడయారులో అందరి మధ్యా సంబంధ బాంధవ్యాలను బాగుపరిచి సరిచేయాలని అని బెసెంటు ప్రయత్నించింది. కృష్ణమూర్తి చేతులు పట్టుకొని లెడ్ బీటరును, అరండేలును, తక్కినవారిని ప్రధాన శిష్యగణంగా పరిగ్రహించ మని మళ్ళీ మళ్ళీ అభ్యర్థించింది. కృష్ణమూర్తి మళ్ళీ రెండోసారి నిరాకరించాడు. ఆ తరువాత పాత మర్రివృక్షం నీడన జరిగిన తారాసంస్థ సభలో ప్రసంగిస్తూ కృష్ణమూర్తి శ్రోతలతో “కావాలనుకున్న వారి కోసం, కోరుకున్నవారి కోసం కాంక్షించిన వారి కోసం మాత్రమే జగద్గురువు రాబోతున్నాడ” ని అన్నాడు.

“సానుభూతి కోరుకుంటున్న వారి కోసమూ, సంతోషం కావాలనుకుంటున్న వారి కోసమూ, విముక్తమవాలని కోరుకుంటున్నవారి కోసమూ, అన్నింటా సంతోషం కావాలనుకుంటున్నవారి కోసమూ... వస్తున్నాను తప్ప విచ్ఛిన్నం చేయడానికి కాదు, నిర్మించడానికి వస్తున్నాను.”

జగద్గురువు రాక విషయం కలిగించిన వుద్రేకోత్సాహాలలో శ్రోతలు అసలు విషయం పట్టించుకోలేదు. తను ఎట్టెదుట వున్న బోధకుడు హఠాత్తుగా కొత్త కొత్త ఆశయాలను ప్రకటిస్తున్నాడు; కొత్త శ్రోతల బృందాలను తయారుచేసుకోవాలని వుత్సాహంతో ఎదురుచూస్తున్నాడని కూడా వారికి తెలియదు. పాత తరానికి చెందిన దివ్యజ్ఞాన సామాజికులు 'మార్గం' లో తమ తమ నిర్దేశ స్థానాల్లో స్థిరంగా కూర్చొని వున్నారు; తమ గత జన్మల గురించీ, యితర లోకాల గురించీ సమాచారం తెలుసు కుంటూ వుండటం వారికి అలవాటై పోయింది. ఇప్పుడు కృష్ణమూర్తి యీ ప్రపంచానికి చెందిన, యీ ప్రస్తుత జీవితానికి చెందిన సమస్యల పై, విషయాల పై కేంద్రీకరించడమే తన పని అని గట్టిగా చెప్తున్నాడు. సమాధానాల కంటే సందేహాలను వెలిబుచ్చడమే ప్రధానం అంటున్నాడు. అసలు మూలంలోనే జరిగిన యీ మార్పుకు అతని శ్రోతలు సిద్దపడి లేరు. దివ్యజ్ఞాన బోధనల్లో ప్రతి అంశంతోనూ విభేదించే మరో కొత్త బాటను నిర్మించుకోవడం మొదలుపెట్టారు కృష్ణమూర్తి. పరిణతి చెందిన తన చింతన ద్వారా, ప్రసంగాల ద్వారా, సంభాషణల ద్వారా, రచనల ద్వారా శ్రోతల మనసులను జాగృతం చేయడానికి రకరకాల పద్ధతులు కనిపెట్టారు. సందేహించడం, ప్రశ్నించడమే ఆధ్యాత్మిక విచారణకు సరియైన పద్ధతి అని సూచించారు.

“సందేహం అమూల్యమైనది. మనసును అది ప్రక్షాళితం చేసి, స్వచ్ఛ పరుస్తుంది. ప్రశ్నించడమే, మనలో నాటుకున్న సందేహ బీజమే మన అన్వేషణలను సుస్పష్టంగా చేయడానికి సహాయపడుతుంది.”

హృదయాన్ని తెరచివుంచడానికి కూడా యీ బోధనల్లో తక్కువ విలువ ఏమి యివ్వలేదు. అది సౌందర్య భావంతో ఆరంభమై, జీవితంలోని అద్భుతాలతో, ప్రకృతి వర్ణాలతో జాగృతం చేయబడి, 'స్రోతస్సు' లో దాహం తీర్చుకున్నవారి సమక్షంలో ఆనందించడం జరుగుతుంది.

టి ఎస్ లో కృష్ణమూర్తి కొత్త బోధలకు వ్యతిరేకత త్వరలోనే బయటపడింది. క్రమంగా ఎక్కువైంది కూడా. శ్రీమతి బెసెంట్ యీ బోధలకు, పరమగురువుల శిష్యత్వానికీ నడుమన వారధులు నిర్మించడానికి ఎంతో సాహసంతో ప్రయత్నించింది. చివరకు రహస్య సాధన కార్యక్రమాల శాఖను కూడా ఆమె మూసివేయించింది. అయినా కూడా కృష్ణమూర్తి పై పై మర్యాదల కోసం రాజీ పడలేదు. ప్రస్తుతం అతడు అన్ని విధాలైన ఆధ్యాత్మిక ఆధిపత్యాలకూ వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. 1929 లో హాలెండులో జరిగిన తారకసంస్థ సమావేశంలో తారక సంస్థ సభ్యత్వాన్నంతటినీ రద్దు చేసే మహదైక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే “సత్యం బాటలు లేని సీమ” అని ప్రకటించాడు.

***

1929 కి ఆరు సంవత్సరాల ముందు నుంచీ కృష్ణమూర్తి రచనల్లో అన్వేషణ దీపం అంతర్ముఖంగా తిరిగి, పరిణతి చెందుతున్న అవగాహన పై వెలుగు ప్రసరిస్తూ వుండటం కనబడుతుంది. మొట్టమొదటి రచన అయిన 'మార్గం' అపరిపక్వతతో నిండి, పలుపలు విధాలుగా సాగిపోయే వచన కవిత. ప్రధాన వస్తువు లేకుండా అస్పష్టతతో వున్న యీ రచనలో అలసిపోయిన అన్వేషి కనబడీ కనబడని మార్గంలో పైకి ఎక్కుతూ కనబడతాడు, పరిపూర్ణత్వాన్ని చేరడం కోసం. అతడు ఒంటరి, నిస్సహాయుడు, అనేక పూర్వ జన్మల భారాన్ని మోస్తూ వుంటాడు. అందులోని నాయకుడు తనలో తను అనేక భాగాలుగా ముక్కలైపోయి, మార్పు చెందుతూ వుంటాడు. అలసియన్ జీవించిన అనేక జన్మలను తన లోపల సమీకరించుకుంటూ వుంటాడు. 'అన్వేషణ' అనే మరొక రచన కూడా కొంతవరకు ఆత్మకథలాగే వుంటుంది. అందులో మూడు పాత్రలు నేను, నీవు, లోకం మోక్షం కోసం ఆరాటపడుతుంటాయి. ఇందులోని ప్రధాన వస్తువు, రచనాశైలి తెలుసుకోవాలంటే 'జీవనగానం' అనే యీ కవితలో చూడచ్చు :

కాలవేదన వుచ్చులో చిక్కి
ఎదుగు ఎదుగు అన్న లోలోని ఒత్తిడికి అవిటినై
సంపూర్ణతే నీవు అయిన
ఓ ప్రియతమా
నీలో ఒక శకలమైన నేను
వెలుగులీనే మహదానందానికి
దారికోసం వెతుకుతున్నా

'సత్ ఆలోచన, సత్ కర్మలతో కూడిన ఒక జన్మ వృధా అయిన వేయి జన్మల కన్న మిన్న' అని 1925 లో ప్రకటించినప్పుడు, అల్సియన్ ని చివరకు సమాధి లో పూడ్చివేసినట్లుగా అనిపిస్తుంది. 1920 తరువాత ఆస్పష్టంగాను, ఛాందసంగాను వుండే ఆలోసియన్ మాటలు, వ్యక్తీకరణ మాయమై తోటి మానవుడి దుఃఖాన్ని కరుణతో కూడిన శ్రద్ధతో వింటున్న అసలైన బోధకుడు ఆ స్థానంలో నిలబడ్డాడు. తరువాత జగిగిన సమావేశాల్లో విశ్వజనీనమైన మానవ సమస్యలను గురించే చర్చించినా, ఒక విధమైన ప్రత్యేకత, అనన్యత్వం వాటిని ఆవరించేవి. అక్కడ పాల్గొనే వారి మధ్యన వున్న అడ్డుగోడలను ఒక అపారమైన నిశ్శబ్దం కరిగించి వేసేది. ఆ విధంగా కృష్ణమూర్తి చెప్పిన 'నీవే ప్రపంచం' అనే మాటలను రూఢి చేస్తూ.

పరిణతి చెందిన కృష్ణమూర్తి బోధలు 'నీవే నీకు ఒక దీపమై వెలుగు నిచ్చుకో మన్న బుద్దుని సూక్తికి ఒక కొత్త ప్రాణశక్తిని యిచ్చాయి. ఈ మాటల్లో మానవాళికంతటికీ ఒక సందేశం పొదిగి వున్నదని అతడు భావించాడు మీ జీవితాన్ని నడిపిస్తున్న ప్రతిదానినీ ప్రశ్నించండి : మీ గురించి మీరు ఏర్పరచుకున్న మనోబింబాన్ని పరీక్షించండి, మీ అపోహలను వదిలేయండి, మీ బాంధవ్యాలపై శ్రద్ధ చూపండి. ఇందులో వున్న అంతరార్ధాన్ని విప్పి చెప్పడానికి కృష్ణమూర్తి ఏ మాత్రం సంకోచించ లేదు- ఆధ్యాత్మిక జీవనంలో ఆధిపత్యం చలాయించడానికి ఎవ్వరికీ హక్కులేదు. మతగ్రంథాలకు లేదు, గురువులకు లేదు; ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మధ్య వర్తులు లేరు, అధికార శ్రేణీ లేదు. ప్రతి మానవుడూ తన విముక్తిని కొత్తగా కని పెట్టవలసిందే. జగద్గురువు దారిని పోయే బాటసారి మాత్రమే.

ఆధ్యాత్మిక పరిణామవాదాన్ని ఖండిస్తూ చేసిన విమర్శను కృష్ణమూర్తి యింకా ముందుకు తీసుకొని వెళ్ళారు. ఆధ్యాత్మిక రంగంలో భూతల స్వర్గంలాంటి ఆదర్శాలకు చోటు వున్నదా అని ప్రశ్నించారు. 1933 లో తన శ్రోతలను ఆకాశాన్నంటే 'ఆదర్శాల' ను చిత్రించుకోవద్దని హెచ్చరించారు. ఆ విధంగా, భవిష్యత్తులో యింతకంటే వుత్తమంగా పరిణామం చెందాలనే వృధా ఆశలను పెట్టుకోవద్దనీ, తన బోధలను మరో ఆదర్శంగా చిత్రించుకొని, 'ఆ కొత్త ఆదర్శానికి తగినట్లుగా తనను తాను మలచుకోవాలి' అనే ప్రధమోత్సాహాపు ఆలోచనను నిరోధించుకోమనీ అర్ధించారు. ఆదర్శాలను చిత్రించుకోవడం సాధారణంగా మనసును మరపింపజూసే ఒక వుపాయం అనీ, యీ విధంగా మనసు బాధ్యతను ఎగవేసెయ్యాలని చూస్తుందని అతడికి తెలుసు.

“మీరు కారాగారంలో ఒక బందీ అవుతే, స్వేచ్ఛ అంటే ఏమిటి అని వర్ణించడంలో నేను ఆసక్తి చూపను. ప్రధానంగా నేను అప్పుడు చేసేది ఏమిటంటే ఆ కారాగారాన్ని తయారు చేసిందేమిటో చూపడం, ఆ కారాగారాన్ని పగలగొట్టడం మీ వంతు".

కారాగారాన్ని కూల్చి వేయడం అంటే ఎక్కువగా బాధతో కూడుకున్నటువంటిదే అయిన, ఎట్ట ఎదుటనే వున్న 'ఉన్నది' తో సూటిగా తలపడటం; ఎక్కడో దూరంగానూ, దాదాపు భ్రాంతి వంటిదీ అయిన 'ఉండవలసినది' ని చేజిక్కించుకోవాలనుకోవడం కాదు.

***

ప్రాచ్య తారక సంస్థను రద్దు చేశాక, యాభై అయిదు సంవత్సరాలు కృష్ణమూర్తి ప్రపంచంలోని నలుమూలలా తిరిగి, జీవితదర్శనం గురించి ప్రవచిస్తూ ప్రయాణించారు. ఈ కాలంలో అతడు స్థాపించిన ఫౌండేషన్లు అతని ప్రసంగాలను ఏర్పాటు చేయడం, అతని రచనలను ప్రచురించడం, విద్యాలయాలు నడిపించడం, అధ్యయనం, ధ్యానం చేయడానికి సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాయి. ప్రతి వ్యక్తి బోధకుడే ప్రతీ వ్యక్తీ విద్యార్థే, అన్న తన మనోభావాన్ని అతడు చిత్తశుద్ధితో అమలు పరిచారు. అందుకే తనకు ఆధ్యాత్మిక వారసులు లేరన్నారు. ఇతరుల ధార్మికస్థాయిని నిర్ణయించే ఆధిపత్యాన్ని ఎవరికీ యివ్వలేదు.

తన బోధనలు ఒక కొత్త విద్యావిధానం నెలకొల్పడానికి ఆధారంగా వుంటాయని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇండియా, యింగ్లాండు, అమెరికాలలో అనేక విద్యాలయాలను స్థాపించారు. ఈ పాఠశాలలన్నీ ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతున్న ప్రాంతాల్లో వున్నాయి. అవి ప్రకృతి మీద ప్రేమనూ, తోటి మానవులంటే అక్కరనూ, ప్రశ్నించే వైఖరితో జీవితాన్ని ఎదుర్కొనడాన్నీ విద్యార్థులలో పెంచి పోషించడానికి కంకణం కట్టుకొన్నాయి.

కృష్ణమూర్తి తన గురించి తానే స్వయంగా యిచ్చిన సమాచారంలో, తనలో జరిగిన వికాసాన్ని అవగాహన చేసుకోవాలంటే ఒక కీలకం తనలో స్వతఃగా వున్న “అపార నిశ్శబ్దం' అని అన్నారు. ఈ అపారత్వమే తను జన్మించిన మూఢ నంవ్రదాయాచారాలనుంచి విముక్తి కలిగించింది; టీఎస్ లో పొందిన అధివాస్తవికమైన పెంపకపు తీరునుండి నిండుగా, నిష్కల్మషంగా నిర్గమింపజేసింది; ఇంగ్లాండులో విద్యార్ధి దశలో వున్నత విద్యలో వుత్తీర్ణత పొంద లేక పోయినప్పుడు తట్టుకొనడానికి అదే సహాయపడింది. అతని బోధనలకు హృదయస్థానంలో వున్న నిశ్శబ్దం అడ్డుగోడలను కరిగించి వేసింది.

“మీరు ఒక అమెరికనూ కాదు, రష్యనూ, హిందూ, ముస్లిమూ కాదు. మీరంటే యీ పేర్లు, యీ మాటలు కాదు. మీరు వేరు. మీరు మానవాళిలో ఒకరు. ఎందుకంటే మీ చేతన, మీ ప్రతిస్పందనలూ, మీ విశ్వాసాలూ, మీ నమ్మకాలు, మీ సిద్ధాంతాలూ, మీ భయాలూ, మీ ఆందోళనలూ, ఒంటరితనం, దుఃఖమూ, సుఖమూ అన్నీ తక్కిన మానవాళికి వున్నటువంటివే. మీరు కనుక మారితే అది మానవాళి నంతటినీ ప్రభావితం చేస్తుంది.”

ఆ అపార నిశ్శబ్దాన్ని, సంవత్సరాల తరబడి పెంచి పోషించి, సంపూర్ణం చేస్తుండటం వల్ల అతని సుదీర్ఘ జీవితం పొడుగునా స్రవించే బ్రహ్మాండమైన విస్తృతత్వాన్ని సంతరించుకున్నది.

***

పంధొమ్మిదో శతాబ్దపు ఆలోచనలలో లోతుగా పాతుకొనిపోయిన పురోభివృద్ధి భావం డార్విన్ ప్రతిపాదించిన పరిణామవాదాన్ని అతిగా విస్తరించి, దానికి పుట్టుక నిచ్చిన జీవశాస్త్ర రంగాన్నుంచి బయటకు లాక్కొని వచ్చింది. ఆ యుగంలో ప్రతి విషయంలోనూ యీ వుపమానాన్ని ఒక మార్గదర్శకసూత్రంగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు నిరాదరించినా ఒకప్పుడు ప్రకృతిలో మానవుడే అత్యున్నత ప్రాణి అనే ఆధిక్యభావం వున్న రోజుల్లో దానిని బలపరచడానికి ఆ పరిణామక్రమ వాదాన్ని వాడుకోవడం జరిగింది. ఆ తరువాత రోజుల్లో సర్వశ్రేష్ఠ అధికార జాతి అనే ఒక దుష్ట సిద్ధాంతం ప్రబలడానికి కూడా దీనిని ఎంచుకున్నారు. వామపక్ష రాజకీయాల్లోని సమాజ సంస్కర్తల్లో అద్భుతమైన ఆదర్శాలతో కూడుకున్న కమ్యునిస్టు వాదానికి స్ఫూర్తి నిచ్చింది. మరో పక్షపు రాజకీయాల్లోని ఆదర్శవాదులకు ప్రస్తుత ప్రపంచంలోని అసమానతలను కొనసాగించడానికి 'యోగ్యత గలవారే జీవించగల్గుతారు' అనే సూత్రాన్ని బలపరచే ఒక వుపయుక్తమైన సాధనంగా పనికి వచ్చింది. కృష్ణమూర్తికి తెలిసిన దివ్యజ్ఞానం, ఆతను పెరిగే వయసులో అతని చుట్టూ వున్న దివ్యజ్ఞానమూ కూడా పరిణామక్రమంలో పురోభివృద్ధి అనే వూహా సూత్రాన్ని అతి విపరీతంగా విస్తరించుకున్నది. ఇప్పుడున్న మానవుని స్థితినుంచి దాటి పైన ఎక్కడో దూరంగా ఆధ్యాత్మికమైన ఔన్నత్యం వున్నదనీ, అదే యిక పై భవిష్యత్తులో 'మూలజాతి' అవుతుందనే కధను అల్లింది. ఇప్పుడు, యిరవయ్యవ శతాబ్దం ఆఖరవుతున్న తరుణంలో పరిణామక్రమంలో పురోభివృద్ధి చెందడం అనే ఆలోచన గాలి తీసేసినట్లుగా నీరసపడిపోయింది. పరిణామ క్రమ వాదపు జీవశాస్త్రజ్ఞుడు అయిన స్టీఫెన్ జే గోల్డ్ ఏ మొహమాటమూ లేకుండా తన భావాలను యిట్లా వ్యక్తపరచాడు :

చరిత్ర నడిచిన విధానాన్ని అవగాహన చేసుకోదలిస్తే యీ పురోభివృద్ధి అనే వాదం స్థానంలో మరో కొత్తదానిని కనిపెట్టాలి. ఎందుకంటే యీ పురోభివృద్ధి అనే భావనే చాలా అసహ్యకరమైనది, అది ఆయా సంస్కృతుల్లో నిండా మునిగిపోయివుంటుంది, ఏ విధంగానూ దాన్ని సమర్థించలేము, అమల్లో పెట్టడానికి పనికిరాదు- అసలు అది చాలా మూర్ఖమైన వాదం.

ఆధ్యాత్మిక రంగంలో పరిణామక్రమ గతమైన పురోభివృద్ధిని గురించి కృష్ణమూర్తి చేసిన విమర్శ చాలా శక్తివంతమైనది, నిరాఘాటమైనది, పరిపూర్ణమైనది. మానవ స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి చేసినది. జీవశాస్త్రంలోను, సామాజిక సంస్కరణలోను, రాజకీయ సంబంధిత ఆర్థిక శాస్త్రంలోను పరిణామక్రమంలో పురోభివృద్ధి అనే సూత్రానికి గల పరిమితుల అవగాహన జరగక ముందే కృష్ణమూర్తి యీ పరిశీలన చేశారు. దివ్యజ్ఞాన సమాజంలో అతని పెంపకపు తీరుపై తిరుగుబాటులో యిది బాగా స్పష్టంగా కనపడుతుంది. కృష్ణమూర్తి జీవన తాత్వికతలో అది సుస్థిరంగా వుండిపోయిన ఒక అంశం.

రాధికా హెర్జ్ బర్గర్