కృషీవలుడు/పద్యాలు 101-110
ఉప్పుతో దొమ్మిది యున్న కాపురములు
సేయు గృహిణుల కేచిక్కు లేదు,
ఎవ్విలేకున్నను నిరుగు పొరుగు కులాం
గనలకు చేయొగ్గి గైకొనుటకు
నిష్టపడక, యున్నదే పెట్టి యక్కఱ
వాపుకొనెడు మానవతుల కెందు
లేమిడి సంసార మేమెయి పరువుతో
గడపంగ నిక్కట్లు గలుగుచుండు
నెన్ని కష్టములున్న నిట్లని పలుకక
పొసగినయంతకు బొదువుచేసి
మగనికి బిడ్డలకు బెట్టి మిగిలియున్న
యింత దా దిని భిక్షున కిడు పురంధ్రి
శాంతి నీతియు నురుకష్టసహనశక్తి
నెవరెఱుంగుదు రంతటి యింతి దక్క! 101
తల తాకటులువెట్టి ధనికుల దగ్గఱ
బన్నుకై గొన్న రూపాయలప్పు
కూలికి నాలికిం గూటికిం జాలక
నాముగా గొన్న ధాన్యంపుటప్పు
చిల్లర మల్లర చేబదులుగ దెచ్చి
యక్కఱ గడపిన యట్టి యప్పు
పండుగపర్వాల బందుల విందుకై
సామానుగొన్న బజారుటప్పు
వాయిదా మించవచ్చిన వడ్డియప్పు
పడతిసొమ్ముల కుదువకు బడ్డయప్పు
వేగ తీఱిచి స్వాతంత్ర్యవీథి యందు
సంచరింపుము నిశ్చింత సంతతంబు. 102
పవలు నడుచుబ్రొద్దు; తోవవిందు రేవేళ;
పవలు రేయి నడచు పాడువడ్డి!
అప్పుచేసి కుడుచు పప్పుకూళుల కన్న
గాసు ఋణములేని గంజి మేలు. 103
సంఘపరివర్తనంబులు జరుగుచున్న
రాజకీయ సంక్షోభంబు రగులుకొన్న,
విప్లవంబుల దేశమ్ము వీగుచున్న,
గృషి ద్యజింపకు కర్షకా, కీడు గలుగు. 104
నవ్యపాశ్చాత్య సభ్యత నాగరకత
పల్లెలందు నస్పష్టరూపముల దాల్చి
కాలసమ్మానితములైన గ్రామపద్ధ
తులను విముఖత్వముం గొంత గలుగజేసె. 105
పంచాయతీసభా భవనంబులౌ రచ్చ
కొట్టంబు లొకమూల గూలిపోయె,
వీథిబడుల జెప్పు విజ్ఞానధుర్యులు
నొజ్జలు దాస్యంబు నూతగొనిరి,
గ్రామపరిశ్రమగలుగు నన్యోన్యమౌ
సహకారవృత్తంబు సమసిపోయె,
సత్యజీవనము, విశ్వాసమ్ము, భక్తియు
నైకమత్యము మున్నె యంతరించె
బూటకములు, కుయుక్తులు, మోసగతులు
కోర్టువ్యాజ్యాలు, ఫోర్జరీల్, కూటమైత్రి,
స్వార్థపరత, మౌఢ్యంబు, గర్వప్రవృత్తి
నేర్పు విద్యాలయంబులు నేటియూళ్లు. 106
నేటి నాగరకత నీమేలు గోరక
యప్పుచేసి బ్రతుకుమని విధించు;
నాయవృద్ధికన్న నావశ్యక పదార్థ
సంఖ్య హెచ్చ చిత్తశాంతి యున్నె? 107
జీవనస్పర్ధ సామాన్యచేష్టయైన
కాలమున వ్యక్తివాద మగ్రత వహించు
సత్త్వవిరహితు డన్యభోజ్యత నశించు;
నర్హజీవియె యంతరాయముల దాటు. 108
కాన, జీవనసంగ్రామ కార్యమందు
విజయి వగుటకు శౌర్యంబు విద్య బుద్ధి
సత్యసంధత యాత్మవిశ్వాస మనెడు
నాయుధంబుల విడువకు హాలికవర్య. 109
చాలు విజ్ఞానమతబోధ! సాంధ్యరాగ
కాంతి బండిన కేసరి కారుచేలు
స్వర్ణసైకత ఖనులుగా పరిణమించె
గనుల కాప్యాయనంబుగ గాంచుమోయి. 110