కూసుమంచి గణపేశ్వరాలయం/గంగాదేవి చెరువు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గంగాదేవి చెరువు

ఈ దేవాలయం కాకతీయులు కట్టించినదే అని చెప్పేందుకు మంచి ఆధారంగా గంగాదేవి చెరువు కనిపిస్తుంది. కాకతీయుల నిర్మాణంలో టిటిటి అంటే ట్రిపుల్ టీ పద్దతిని అవలంబించారు. ట్రిపుల్ టీ విధానం అనగా టీ (టౌన్) నగరం, టీ (టెంపుల్) ఆలయం, టీ(ట్యాంక్) చెరువు. ప్రకృతి సిద్ధంగా వర్షపు రూపంలో వచ్చే నీటిని నిల్వ చేసుకునే లక్ష్యంతో కాకతీయుల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి. కాకతీయులు ఊరికి అనుసంధానంగా ఆలయమూ, జలవనరులూ వుండాలనుకున్నారు. ఈ గంగాదేవి చెరువు ఆలయానికి ఈశాన్య దిశలో వుంటుంది. చెరువు ఆధారంగానే అప్పట్లో పంటలు పండించుకునేవారు. వర్షం ద్వారా నగరంలో కురిసిన వర్షపు నీటితోపాటు దగ్గరలోని పెద్ద జలాశయాలనుంచి ఈ చెరువుకు నీరందే ఏర్పాటు చేసారు. చెరువుకు ఎగువలో నగరం, దిగువన పొలాలు వున్నాయి. దానివల్ల నగరానికి వరదముప్పు వుండదు. పొలాలకు నీటి సమస్య రాదు.

కాకతీయ చక్రవర్తులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాలను సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు అని నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి ప్రోలరాజు నుంచి జలాశయాల నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇతడు కేసీయసముద్రం నిర్మించినట్లు గణపతిదేవుడు వేయించిన మోటుపల్లి స్తంభశాసనం ద్వారా తెలుస్తోంది. రెండవ బేతరాజు అనుమకొండ పట్టణంలో శివపురం పేరుతో తోటను, చెరువును నిర్మించినట్లు మోటుపల్లి శాసనం తెలియజేస్తోంది. గణపతి దేవుడు నెల్లూరు, గంగాపురం, ఎల్లూరు, గణపురం, ఏకశిలాపురంలో అనేక చెరువులు నిర్మించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ వ్యవసాయం ప్రజల ప్రధాన జీవనాధారం కాబట్టి, కాకతీయులు వ్యవసాయ భూమిని, పంటలను విస్తృతంగా అభివృద్ధి పరిచే చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా...

  1. అడవులను నరికించి వ్యవసాయ యోగ్య భూములను అందుబాటులోకి తెచ్చారు.
  2. నిరుపయోగంగా ఉన్న భూములను పోడు చేసేవారికి (వ్యవసాయం) పన్నులలో రాయితీ ఇచ్చారు.
  3. గ్రామాలకు దూరంగా నిరుపయోగంగా ఉన్న భూములను బ్రాహ్మణులకు, పండితులకు, అధికారులకు, దేవాలయాలకు, అగ్రహారాలుగా, కానుకలుగా, వృత్తులను నిర్వహించుకోవడానికి ఇచ్చి ఆయా భూములను వ్యవసాయం యోగ్యంగా మారేలా చేశారు.

4. రాజ్యంలోని భూమి అంతటికీ రాజే యజమాని కాబట్టి, రాచభూములను సగం ఆదాయాన్ని చెల్లించే రైతులకు (అర్థసీరులు) కౌలుకు ఇచ్చారు. చివరి పద్ధతిని ‘అడపగట్టు’ అనేవారు.

కాకతీయులు చేపట్టిన ఇటువంటి సంస్కరణల వల్ల చెన్నూరు, పాలంపేట, పాకాల, మంథని, ఏటూరు నాగారం, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాలు భూమి కొత్తగా సాగులోకి వచ్చినట్లు, ఆయా ప్రాంతాల్లోనే కొన్ని వేల గ్రామాలు ఏర్పడినట్లు, ఆయా ప్రాంతాల్లో దొరికిన శాసనాలు విశదం చేస్తున్నాయి.

పర్యాటక ఆకర్షణగా పాలేరుజలాశయం

గణపేశ్వరాలయానికి చాలా దగ్గరలోనే పాలేరు జలాశయం వుండటంతో చాలామంది గణపేశ్వరాలయంలోని శివుడిని దర్శించుకోవడంతో పాటు దగ్గర్లోని పాలేరు జలాశయాన్ని కూడా సందర్శిస్తుంటారు. అక్కడి సరస్సులో బోటింగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటారు. ఆలయానికి అనుబంధంగా నిర్మించిన గంగాదేవి చెరువును పునరుద్ధరణ చేస్తే మళ్ళీ ఇక్కడ పాడిపంటలు పెంపొందుతాయి. గ్రామం సస్యశ్యామలం అవుతుంది. పర్యాటకానికి మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

కూసుమంచి సందర్శన ఒక మరచిపోలేని అనుభూతి

చక్కటి ప్రశాంత వాతావరణంలో ప్రాచీన శిల్పనైపుణ్యాన్ని, ఆధ్యాత్మిక శోభను ఒకసారి చూసి తరించటం ఎవ్వరికైనా ఒక మరచిపోలేని అనుభూతినిస్తుంది. చరిత్ర విద్యార్ధుల అధ్యయనానికి అనువైన సమాచారమూ లభిస్తుంది. ఖమ్మంజిల్లా పర్యాటక రంగంలో సగర్వంగా చెప్పుకోదగిన ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా చూసితీరాల్సిందే.