కుసుమాభ్యర్ధన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కుసుమాభ్యర్ధన

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి


నేనొక పూలమొక్కకడ నిల్చితి పూలనుకోయునంతలో మానసమందు

తోచెగద మమ్ముల నివ్విధి బాధపెట్టగా మానుమటంచు పూలు బ్రతిమాలుచు

చూచువిధంబుగా ఏనిక మిమ్ములకోయనని యింటికి బోవగనెంచునంతలో

నన్ను ఎవరొ పట్టినట్టవ ఒకపరి తిరిగి చూచినాను తెల్లబోయి

వక గులాబి కొమ్మ వంగి తగిలి తాను పలికె నన్నుజూచి బాధతోడ

చూడుమీ వనమంత సోయగమొలికించు ప్రకృతిసౌందర్యమింపార

నెరపె మల్లెలు జాజులు మందార చామంతి విరివిగా వికసించి పరిమళించె

పూవులన్నియు నొక్క పూసలదండగా పరికింప కన్నుల పండుగయ్యె

ఇది మధుమాసమా ఏమని భ్రమకల్గ చేసెడి రీతిగా సీమ వెలసె

కాని నేల రాలుకద మరుదినమందు జన్మ వృధ మరియు విషాధభరిత

మగును కాద! అట్టి మమ్ముల వీడుట న్యాయమగున మాకు సాయపడక?

పుట్టిన ప్రాణి గిట్టుటయు పుట్టుటయున్ సహజంబు, పుట్టినన్ వట్టినె

రాలిపోవుటది పాడియ? ఏమిఫలంబది? తోచెనొక్కటిన్ గుట్టుగ

తాప్రమోదమొనగూర్చిన, మెచ్చిన చాలు తృప్తియౌ

పుట్టుక సార్ధకం బగును పుష్పమలంకృతమంచెరుంగవే?

మాగతికానకుండ అటు మళ్ళెదవేల దయానిధీ? త్వదీ యాగమనంబుచూచితిమి

హర్షిత భావ పులంకితంబుగన్ స్వాగతమయ్యనీకు! మనసారగ తోచిన

పూవులన్నియున్ వేగమె సజ్జనిండుగను పేర్మిని నింపుము వెంటగైకొనన్

త్యాగముకాదు నిక్కువము దైవ పదంబుల చేరుభాగ్యమున్

యీగతి దక్కనిమ్ము తడవెందుకు? సందియమేల రమ్మికన్

పొలతుల సిగలోన పూలచెండ్లుగ మమ్ము ముడిచిన మాకదిమోదమవదె?

గొబ్బెమ్మపై మము కూర్చగ కన్నియల్ పాడుచు తిరిగిన భాగ్యమదియె

పెండ్లిలో దంపతుల్ పేర్మి తలంబ్రాల్గ పోసుకొనుట మాకు పుణ్యమవదె

పూలమాలగకట్టి పురుషోత్తముని మెడ చేరగా మాకింక చింతగలదె?

ఇట్టివిధముగా సేవల నింపుమీర సల్పు భాగ్యము దక్కదె సన్నుతింప

మమ్ము గొనిపొమ్ము దయచూపుమయ్య నీవు ఇటనెవున్న ప్రయోజనమేమి మాకు?


(పూవులను కోయకుండా చెట్టునేవుంచేస్తే అవి రాలిపోతాయి కనుక,

కోయండి, వుపయోగించండి అని పూవులు అభ్యర్ధిస్తున్న భావం)