కుంభరాణా (మీరాబాయి)/స్థలము 7

వికీసోర్స్ నుండి

స్థలము 7 : రాణాగారి విశ్రాంతిమందిరము.

_________

[పట్టు మెత్తలుకుట్టిన సోఫాయుండును. దానికి కుడి ప్రక్కన రెండుకుర్చీలు వేయఁబడియుండును. ఎడమ ప్రక్కన ఒక చిన్న టేబిలుపై హుక్కాయుండును. రెండు మూడు పుస్తకములు పెట్టఁబడియుండును. రాణా ఆలోచనా నిమగ్నుఁడయి అటునిటు పచారుచేయుచుండఁగా తెరయెత్తఁబడును. రాణా కుదుటపడని మనస్సుతో ఒకతూరి పుస్తకము తీసికొని పుటలుత్రిప్పి మరల బల్లపై పెట్టును. అటునిటు తిరుగును. ఒక్క గ్రుక్కెడు హుక్కాపీల్చి గొట్టమును బల్లపై పెట్టును. రాణా యిట్లు మనస్సంక్షోభము కనఁబఱచు చేష్టలు ఒకటి రెండు నిమిషములు చేయును.]

రాణా : మీరాయొక్క నడవడి విడదీయరాని చిక్కుగ నేర్పడినది. ఇది యది యని నిర్ణయించుటకు వీలు కాకున్నది. కొందఱు దీనిని మతావేశమని చెప్పుచున్నారు. మతావేశముకూడ యొక మానసిక వ్యాధియనియే నాయుద్దేశము. [సోఫాపై కూర్చుండును] ఔరా ! నాకన్నుల యెదుటనే నా జీవిత మెట్లు మాఱిపోయినది ! ప్రేమకు విషయీభూతమగు వస్తువే ద్వేష ప్రేరకమైనయెడల - ఈరాజ్యమేకాదు, ప్రపంచమునంతయు నేలు వానికైన శాంతిలేదు, ఆనందములేదు. - హృదయము శ్మశానము. జీవితము మరుప్రదేశము. ఇంతకన్న దు:ఖకరమైన ఆంతరిక సంక్షోభము వేఱొండు లేదు. [లేచి అటునిటు తిరిగి] తనకు తెలిసి మీరా నన్ను తిరస్కరించుట లేదు, ద్వేషించుటయులేదు. ఒకప్పుడు తాను వంచించు మాటల ఫలితమును యోచింపలేనంత అమాయికగ నగపడును. ఆకాంత యొనరించు ప్రతికార్యమును తనకు నైసర్గికమైనట్లె తోఁచుచుండును. ఏదియో యొక బలాత్కార శక్తి తన్ను నన్నుండి యాకర్షించుకొన్నట్లు నిస్సహాయమై వర్ణించుచుండును. [మఱల సోఫాలో కూర్చుండును.]

మీరాను పరిత్యజింపఁజాలను. ప్రణయమంజులమైన గతజీవితస్మృతి నాసంకల్పమున కడ్డుపడుచున్నది. ఎప్పటికైనను మీరాను నావంకకు త్రిప్పుకొనగలనను నమ్మకము గలదు.

[బలవంతరావు ప్రవేశించును]

బలవంతరావు : జయము, జయము ధర్మప్రభువులకు!

రాణా : కూర్చుండుము - మీరా ఇపు డెట్లున్నది?

బల : [కూర్చుండి] నిన్నటివలెనే యున్నది. ఔషధ సేవనము వలన ప్రయోజనమేమియు నగపడుటలేదు. దైవానుకూలముగ నా కొక విషయము జ్ఞప్తికి వచ్చినది. భూతచికిత్స చేయించి వేయిమంది సద్భ్రాహ్మణులకు షడ్రసోపేతముగ సంతర్పణ చేయించి, శాంతిచేసిన యడల రాణిగారికి తప్పక జాడ్యము కుదురును !

రాణా : [విసుగుచూపుచు, స్వగతము] ఇతఁడు పురాణ పురుషుఁడు. ఇతని ఇప్పటి యోగ్యత వార్థక్యమే !

బల : భేతాళుని ఆజ్ఞలోనుండి అప్పుడప్పుడు కొన్నిపిశాచములు తప్పించుకొని, భూలోకమునకువచ్చి ప్రజలను బాధపెట్టుచుండునని మంత్రశాస్త్రవేత్తలు చెప్పుదురు. అవి పట్టినప్పుడు ఆవేశమునచ్చినట్లూ, పిచ్చిపట్టినట్లూ ఉండేదికలదు. భల్లూకశాస్త్రులవారు శాతపొడి మంత్రములలో -

రాణా : [విసుగుతో] ఇస్ - ఇఁక చాలింపుము ! ఎంతతెలివి తక్కువ వ్యాఖ్యానము ?

బల : [అణఁగిపోయి] ప్రభువులవారు మత విషయములలో ఇంత కఠినముగా మాట్లాడడము కొంచెము - [నీళ్ళు నమలును]

రాణా : మూఢ భక్తులకు మతము కానిదేది ?

బల : పాఠశాలలో మతప్రచారము చేయకూడదని దేవరవారు కావించిన శాసనము ప్రజలలో కల్లోలము పుట్టించుచున్నది. పీఠాథిపతులు, కులగురువులు, రాజద్రోహము బోధించుచున్నట్లు వినికిడి. మొగలాయి వాళ్ళు మనమీఁద కత్తిగట్టియున్న యీసమయమున మన ప్రజలలో రాజ్యద్వేషం కలగడము మంచిపనిగాదు. ఏదో వృద్ధుఁడను. సంస్థాన శ్రేయోభిలాషిని, అనుభవశాలిని విన్నవించుకొన్నాను. తర్వాత ప్రభువుల చిత్తము.

రాణా : నిజమే! దానిని నేను గమనింపకపోలేదు. విశ్వసనీయుఁడైన సేనాధిపతికి ఖచ్చితమైన ఉత్తరువు పంపియున్నాను. ఈమతాధికారము ప్రతిపదమునందును నాయాజ్ఞ నెదుర్కొనుచున్నది. నారాజ్యమునందు నా శాసనమే శిరసావహింపఁబడవలయును. అరాజకము, బహురాజకము రెండును అపాయకములే ! మతాచార్యుల పలుకుబడి సన్నగిల్లిననే ప్రజలలో మూఢభక్తి నశింపఁగలదు. లౌకిక జ్ఞానమును, జీవితమును ద్వేషించు ప్రతి మతమును మానవుని మనోవికాసమునకు అభ్యంతరమగును. ఈ సంకుచిత మతములను నారాజ్యమునుండి సమ్మార్జింపవలయును.

బల : మతాధికారము చాలా శతాబ్దములనుండి వేళ్ళు పారియున్నది.

రాణా : నేను ప్రవేశపెట్టిన విద్యాపద్ధతికి కఱకైన వాదరగలదు.

బల : దేవరవారికి తెలియనిదేమున్నది ? సర్వజ్ఞులు - అయినా అనుభవశాలిని. శలవు పుచ్చుకొంటాను. [లేచి కొంతనడచి] మనవి చేసుకొన వలయునని మఱచిపోతిని - ఒక చిన్నసంగతి, ప్రభువులవారికి తెలియవలసిన ముఖ్యమైన విషయము గాదు. రాణా : ఏమది?

బల : రాణిగారికి చికిత్సచేయుటకు నిన్నటిదినమున ఎవరో యిద్దరు వైదేశిక వైద్యులు వచ్చియుండిరి. వారును వచ్చినట్లే పోయిరి. అప్పుడు రాణిగారివద్ద సుశీలయనుదాసి యుండినది. ఈనాఁడు అదిఏదోయొకహారము వేసికొని తిరుగుచున్నదని ఇంకొక దాసి వాసంతిక చెప్పెను. దానిని పిలిపించితిని; అది ధరించుకొన్న హారము అమూల్య వజ్రహారముగా కనుపట్టినది.

రాణా : ఈవిషయము చిత్రముగనున్నది. దాసి ఏమి? వజ్రహారమును ధరించు టేమి ? దాని నిటకు పిలిపింపుఁడు.

బల : ఎవడురా అక్కడ ?

ద్వారపాలకుఁడు : స్వామి.

బల : రాణిగారి పెద్దదాసిని సుశీలను ఇచ్చటకుఁ దోడ్కొనిరమ్ము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

రాణా : ఆదాసి యెచ్చటనైన దొంగిలించి యుండునా ?

బల : అది సామాన్యభాగ్యవంతులు వేసికొను హారముగాదు. దొంగిలించియుండిన అంత:పురముననే దొంగిలించి యుండవలయును.

[సుశీల మెడలో హారమువేసికొన్ యోరపైటతో కల్కునడకతో ప్రవేశించును]

సుశీల : [స్వగతము] రాజుగారు నన్నెప్పుడు పిలిపించేవారుగారు. ఈదండ మహత్తెంవల్ల నాకేదో యదృష్టం పట్టేలాగుంది. [సిగ్గు నభినయించుచు] నీళ్ళల్లో లోతు, మనుసులో మర్మం యెవరికి తెలుస్తుంది ! [పైటసవరించుకొని హారము దిద్దుకొని] దాసురాలిని [దండముపెట్టును.]

రాణా : [సుశీల మెడలోని హారమును పరికించును.]

సుశీ : [స్వగతము] రాజుగారు నా వోరపైటమీదనే కన్ను వేశారు రాణా : ఆ హారమును దీసికొండు.

సుశీల : [సిగ్గుపడుచు హారముదీసి వినయ మభినయించుచు దూరము నుండి బలవంతరావుచేతి కందియిచ్చును]

బల : [రాణాచేఁత బెట్టును]

రాణా : [పరీక్షించుచుండును.]

సుశీ : [స్వగతము] ఎవరైనా నన్ను మోసంచేసి వుండరుగదా ?

రాణా : దాసీ, నీ కీహార మెక్కడిది ? మాబొక్కసములోని ధనమంతయు వెచ్చించినను దీని మూల్యమునకు సరిపోదు.

సుశీ : [స్వగతము] అబ్బో! అట్టాంటి హారమా యిది ? యెంత వెఱ్ఱి ముండను. దాచైనా పెట్టుకోక పోతిని.

రాణా : ఏమి యాలోచించుచున్నావు ? కట్టుకథ లల్లకుము. యధార్థము చెప్పుము.

సుశీ : నిన్నటిదినం రాణిగారికి మందియ్యడానికి వచ్చిన వైద్దుగులు ఈహారము ఇచ్చిపోయినట్లుంది.

రాణా : ఊహించుటయేమి ? నీవు చూడలేదా ?

సుశీ : [భయముతో] రాత్రంతా అమ్మగారికి విసుర్తూనే వుండి నిద్రలేక అప్పుడే కన్నట్ట మాల్చాను.

రాణా : ఓహో ! కన్నుమాల్చితివా ?

సుశీ : తర్వాత రాణిగారు నన్ను దగ్గరికి పిలిచి "ఒసె సుశీలా, ఇక్కడ వుండే దాసీల్లోకెల్లా నీవుకొంచెం ముక్కూ మొగం అందంగా వుండేదానివి, ఈహారం నీకైతే తగివుంటుంది" అని నేను వద్దనేకొంది నా మెళ్ళోవేశారు.

రాణా : [కోపముతో] ఓసీ, బుద్ధిలేనిదానా, నీసౌందర్యవర్ణనముతో మాకిప్పుడు పనియేమి ? మీరాకు ఆవైద్యులు ఈవజ్రహారము నిచ్చిరా? లేక అంతకుముందే ధరించియుండినదా ? సుశీ : అంతకుముందు లేదండి దొరగారు, వాళ్ళు రాణిగారికి నజరు తెచ్చినారేమొ.

రాణా : వైద్యులేమి అంత:పురమున కిట్టి నజరులు తెచ్చుటయేమి? ఇదియొక క్రొత్తచికిత్స కాఁబోలు !

బల : [స్వగతము] ఇది అటుతిరిగి యిటుతిరిగి కడపటికి నాప్రాణముల మీదికే వచ్చునట్లున్నదే.

రాణా : పాతర త్రవ్వఁబోవఁగా భూతము బయట పడినట్లు ఇదేదియోయొక క్రొత్తవిషయము బొగడపొడిచెను. దీనినంతయు మా యమాత్యులుకూడ విచారించి పరిశీలించిన బాగుగనుండును - ఓరీ

ద్వారపాలకుఁడు : దాసుణ్ణి.

రాణా : మా మంత్రులను నిచ్చటకు రమ్మని చెప్పుము; శీఘ్రముగ'

ద్వార : చిత్తం [నిష్క్రమించును.]

రాణా : బలవంతరావ్, ఆవైద్యులు మీయుత్తరువు తీసికొని యంత:పురములోనికి ప్రవేశించిరా?

బల : [సగర్వముగ] నా యనుమతి లేనిదే పోతుటీఁగ కూడ అంత:పురములోనికి ప్రవేశింపదు.

రాణా : వారి వేషభాష లెట్లుండినవి ? అసాధారణ విశేషము లేవియు మీకు తోఁపలేదా ?

బల : వారివేషములు వారికి తగినవిగనే యుండినవి. వారి సంభాషణ యోగ్యతను పట్టిచూడగా రాజసంస్థానములలో మెలఁగిన వైద్యులవలెనే యగపడిరి. ద్రవ్యార్జనముకంటె వ్యాధి కుదిర్చిన కీర్తియే వారికి ముఖ్యమైనట్లు తోఁచినది. తిరిగి పోవునప్పుడు సంభావన మాటయే యెత్తలేదు.

రాణా : [కోపము బిగపట్టుకొని] అప్పుడు నీబుద్ధి స్వాధీనమున నుండినదా లేక అభిని మత్తున తూఁగుచుంటివా ?

బల : [తత్తరముతో చేతులు పిసుగుకొనుచు, స్వగతము] రాజు గారికిగూడా తెలిసినట్లే యున్నది.

రాణా : [కోపముతో] ఓయీ, పిచ్చిబ్రాహ్మణుఁడా, నీవు కన్ను లుండియు చూడలేవు; వీనులుండియు వినలేవు; తలయుండియు నాలోచింపలేవు. ఇట్టి యమూల్య హారములను నిశ్చింతముగ కానుక యియ్యఁగల వైద్య వేషధారులకు నీవిచ్చు బీదసంభావన లెందుకు?

బల : [ఆశ్చర్యముతో] వేషధారులా వారు!

రాణా : కాక, మఱియెవ్వరు ?

సుశీ : [స్వగతము] ఈ ముసలాయనకు మూడుచిట్ల ముక్క జొన్నలు బత్తెం పడేలాగుంది.

[మంత్రు లిరువురు ప్రవేశింతురు]

మంత్రులు : జయము, జయము !

రాణా : విచ్చేయుఁడు.

[మంత్రులు కూర్చుండుదురు]

రాణా : శ్యామలరావుగారూ, మన యంత:పురమున వింతలు పుట్టుచున్నవి. ఈ హారమును చూచితిరా ? [శ్యామలరావు చేతికిచ్చును.] దీని ఆదాసివేసికొని తిరుగుచుండఁగా మఱియొకదాసి చూచి బలవంతరావుగారి కెఱిఁగించెను.

సుశీ : [స్వగతము] చూపోపలేక ఆ మాయలాడి తొత్తుకూతురు వాసంతిక మోసంచేసి వుంటుంది. ఈ ముసలిబాపడికి నేనంటె కళ్ళల్లో కారం చల్లినట్లుంటుంది.

రాణా : నిన్నటిదినమున ఎవరో యిద్దఱు వైద్యులు మన యంత:పురమునకు వచ్చి మీరాకు ఈహారములను నజరిచ్చి పోయిరఁట !

శ్యామ : వైద్యులా యిట్టిహారములను బహుమతిచేయుట ! మాధ : [హారమును తాను తీసికొని] ఇది నమ్మతగినది కాదు.

సుశీ : నిజమేనండి ధొరగారు.

మాధ : నీవు చూచితివా?

సుశీ : నా చేరడేసి కళ్ళనిండా చూచానండి.

రాణా : రావుజీ, వైద్యులు మనయంత:పురమునకు వచ్చినమాట యధార్థము. ఆసంగతి బలవంతరావుగారె చెప్పిరి.

బల : వచ్చినమాట వాస్తవమె.

రాణా : ఆవైద్యులే యీ హారమును దెచ్చియుండక పోయిన, అంతరాళము నుండి యూడిపడి యుండునా !

శ్యామ : వారు నిక్కువమైన వైద్యులైనట్లు తోఁపదు.

రాణా : నేనును అట్లెతలంచితిని. ఎవరో దురాత్ములైన సంస్థానాధిపతులు మాయంత:పురము నపవాద కళంకితము కావించుటకొఱకు వైద్యవేషధారులై వచ్చిరి, - నీకు వారి యుచ్చారణలో భేదమేమైన గోచరింప లేదా ?

బల : [తత్తరముతో] ఏదో కొంచెముండి నట్లుగనే తోఁచుచున్నది. నాకప్పు డనుమానము తట్టనందువలన అంతగా పరిశీలింపలేదు. కొంత మొగలాయిదేశ స్పర్శ ఉండినట్లుగా భ్రమ.

రాణా : ఆ1 - తెలిసినది. ఇది యంతయు ఆ కపటాత్ముఁడు అగ్బరు పన్నిన కుట్రవలె నగపడుచున్నది. నన్ను శౌర్యముతో లోఁబఱచుకొనలేక యిట్టి యధమకృత్యమున కొడిగట్టి యుండును - మీరేమి తలంచెదరు?

శ్యామ : మన యూహావలంబనమునకు ఇంకను కొన్ని, ఘనిష్టములైన యాధారములు దొఱకవలయును.

మాధ : ఒకవేళ ప్రభువుగారి యూహ సత్యముగనే యుండవచ్చును. మొగలాయివారు ఎట్టి నీచకార్యములకైన సాహసింపఁ గలరు.

రాణా : ఆ దుర్వివేకుఁడు ఇట్టి కుతంత్రములవలన నన్ను లోఁబఱచు కొనఁగలఁడా? అక్క సెలియండ్రను ఆలుబిడ్డలను మొగలాయి పాదుషాల కర్పించి యా యపకీర్తి మూల్యముచే నున్నతోద్యోగముల విలిచి నీచ జీవనము సేయుచు చిరంతన యశో విరాజితమైన రాజపుత్ర కులమునకు కళంకము దెచ్చిన మానసింహాదులవంటి పతితుఁడ ననుకొనెనా నన్ను ? ఎన్ని యుపాయములైన పన్ను గాక, కుంభరాణా అగ్బరునకు ప్రాణముతో లోఁబడడు. [బలవంతరావు తట్టు తిరిగి] ఓయీ నిద్దురపోతా, నీ యజాగ్రత్తవలన గదా మాయంత:పురమున కింత యపనింద కలిగినది ?

బల : [లేచి. గద్గద స్వరముతో] మహాప్రభూ, అంత: పురాధికారి నౌట నేనే యపరాదిని. వృద్ధుడనౌట బుద్ధిపాటవముకూడ తగ్గిపోవుచున్నది. కన్నులును చక్కగ గనబడవు. నన్నిక నుద్యోగ విముక్తుని గావింపవలయునని ప్రార్థించుచున్నాను.

రాణా : ప్రార్థన మవసరములేకయే నిన్ను పదబ్రష్ఠుని గావించు చున్నాను; నీవయస్సు, నీస్వామిభక్తియు, నీప్రాణములను దక్కించినవి. వెడలిపొమ్ము.

బల : మన్నింపబడితిని. ధన్యుడను. [తాళములు రాజుముందర పెట్టును]

రాజసేవ కత్తిపైని సాము ! [నిష్క్రమించును]

సుశీ : [స్వగతము] ఈ ముసలిబాపడు మేయబోయి మెడకు దగిలించుకొన్నాడు. ఆ వాసంతిక మాటవిని నామీద చాడీలు చెప్పినందుకు ఆ వుద్యోగం కాస్తా వూడిపోయింది.

రాణా : మాకు విశ్వాసపాత్రుఁడైన కుమార సింహుని అంత:పురాధికారినిగా నియమించితిమి. ఉత్తరువు సాదరు చేయించుఁడు.

శ్యామ : చిత్తము. దేవరవారు చాలా న్యాయముగఁ దీర్మానించితిరి. కుమారసింహుడు పసిప్రాయము వాఁడగుటవలన అతని తండ్రి యుద్యోగమును బలవంతరావుగారి కొసఁగఁబడియుండెను. ఇప్పుడు కుమార సింహుడు యుక్తవయస్కుడు.

సుశీ : రాణిగా రొంటరిగ వుంటారు. మల్లీవస్తాను. [నిష్క్రమించును.]

ద్వార : తలారివాడొకడు ప్రభువులవారి దర్శనానికి కనిపెట్టుకోని వున్నాడు.

శ్యామ : ప్రభువుగా రిప్పుడు కార్యాంతర నిమగ్నులు. రేపువచ్చి మనవి చేసికొమ్మనుము.

ద్వార : [నిష్క్రమించి, మరలవచ్చి] వాడిది అగత్తెమయిన మని వంట. పెళ్ళాం బిడ్డల నోటికాడ కూడంట.

రాణా : ఏమది? వానిని రమ్మనుము. - నాదర్శనమును గోరువారి నెవ్వరిని ఆటంక పెట్టకుఁడు. అంతకన్న నాకు ఉత్తమ మయిన కార్య మేమున్నది?

శ్యామ : చిత్తము.

[తలారి మురళీదాసు ప్రవేశించును.]

మురళిదాసు : మహాప్రెభో, నాది అగిత్తెమయిన మనివండి. పెళ్ళాం బిడ్డల నోటికాడ కూడండి. [వంగి దణ్ణము పెట్టును.]

శ్యామ : ఏమిరా నీమనవి ! ఒకటి రెండు మాటలతో విన్నవించుము.

మురళి : చిత్తం మహాప్రెభో, యీయాళపొద్దున, అంటె పొద్దు అల్లాడి కెక్కినాక, [నిర్దేశించును] నేనొక బంగారు మోరీ యెత్తుకోని మార్చుకొందామని దునీచంద్ సేట్ దగ్గిరికి వెళ్ళినాను. ఆమోరీ తీసుకొని దాని కరీదు పది రూపాయలని అయిదు రూపాయలిచ్చి మిగత పైకానికి పదిరోజులు తాళి రమ్మన్నాడండి.

రాణా : కానిమ్ము. మురళి : ఆపక్కంగటి సేటు ఆయన కడుపు సల్లంగుంటె - దాని కరీదు యిరవయి రూపాయలని చెప్పినాడు. ఆపాట మల్లీ దునీచందుసేటు దగ్గిరికి పోయి నీపయికంతీసుకోని నా మోరీఅన్నా యియ్యీ, లేకుంటె యిరవయి రూపాయలన్నా యియ్యీ అని బతిమాలినాను. మోడేసుకొన్నాను. ఏమీచేసినా నాకోడికి మూడే కాళ్ళంటాడు. ససేమంటే ససేమంటాడు. మోరీయెత్తి తిత్తిలో యేసుకొని పెట్లోపెట్టి బీగంయేసి, మొల్లో యేసుకొన్నాడు. నేను మల్లీ గట్టిగా అడిగితే నీవిక్కడ అల్లరిచేస్తే దొంగసొత్తని చెప్పి దండాధికారికి పట్టిస్తాను కబరారని గుడ్లు మిటకరించాడు. ఆపాట నేను యిదంతా యిన్నపం చేసుకోడానికి దండాదికారిదగ్గిరికి పోయినాను. పోయినపాటనే అక్కడవుండిన నౌకరి నాచేతికి యిసనకఱ్ఱ పట్టిచ్చి ఆయన యాడకో జారుకొన్నాడు. నేను విసుర్తూ మనవి చేసుకొంటూ వుణ్యాను. అయ్యగారు మెల్లంగా కన్నుమాల్చినారు. రెండు గెడియలకి మేల్కొని సరే అంతా విన్నానుగాని, దునీచందు నీమీద ఫిర్యాదుచేస్తే అప్పుడు విచారిస్తాము పో అని పంపేశాడు. నామోరీ యిప్పించేమాట మరిశేపొయ్యాడు.

శ్యామ : నీమనివి యా మోరీని తిరుగ యిప్పించమనియే కదా.

మురళి : అదేనండి మహప్రేభో.

రాణా : శ్యామలరావుగారూ, చూచితిరా మన పరిపాలనా సౌష్ఠవము, దండనీతి విధానము ? ప్రజల మనస్సులేకాదు పాలనా యంత్రము కూడా సంస్కరింపఁ బడవలయును.

శ్యామ : చిత్తము.

రాణా : నీకు మొహరీ యెక్కడిదిరా ?

మురళి : నిన్నటిరాత్రి ముసాపురిఖానా వద్ద గుస్తు తిరుగుతుణ్యాను. నేను అందరి తలారివాళ్ళలాగ రాత్రంతా నిద్రపోయి పొద్దున్నేలేచి కాగడా పట్టుకోని వచ్చేవాణ్ణి కాదండి. గుట్టుగా నవుకరి చేసుకోని బతికేవాణ్ణి. రాణా : కానిమ్ము.

మురళి : చిత్తం మహప్రెభో - ఆ సాలలో యిద్దరు ముసాఫర్లు పండుకోని నిద్రపోతుండినారు. వాళ్ళను లేవగొట్టి మూటాముల్లె భద్రమని యెచ్చరించాను. నేనెప్పటికి ప్రతి బాటసారిని కఱ్ఱతో తట్టి లేపి కాగడా బట్టి చూస్తుంటాను. అందువల్లనే నా ఫారాలో వొక్క దొంగతనమైనా పోలేదండి ధొరగారూ. అదంతా ప్రెభువుల కెరికె.

రాణా : అధిక ప్రసంగము చేయకుము. శీఘ్రముగ ముగించుము.

మురళి : [భయముతో] చిత్తం మహప్రెభో - మాటామాటలో మా యింటి మంచీ శెబ్బరా చెప్పుకొన్నాను. వాళ్ళల్లో నొకాయన నామీద కనికరంపుట్టి వొక మోరియ్య యినామిచ్చినాడు. ఇంతకంటె చిల్ల పెంకెత్తుగూడా యెత్యాషం జరగలేదండి ధొరగారు. [దండము పెట్టును.]

రాణా : వారు వైదేశిక యాత్రికులా, బైరాగులా ? వారిపై నీ కేమైనా అనుమానము తట్టలేదా?

మురళి : వాళ్ళు దొంగల్లాగా లేరండి మహప్రెభూ, పెద్ద పెద్ద నామాలు, తొళిసిపూసల దండలూ చూస్తే భక్తుల్లాగా కనబడ్డారు. నా యంటివాణ్ణీ గూడా 'అయ్యా' అని పెద్దమణిశినిలాగా పలకరించారు.

రాణా : అందుకే యుబ్బి తబ్బిబ్బులయి నీయుద్యోగ విధులను మఱచితివా ? అడిగినంతనే బంగారు మొహిరీల విసరి పాఱవేయఁగల సంపన్న యాత్రికులు బిచ్చ గాండ్రకయి కట్టింపఁ బడియున్న పాంథశాలలలో నివసింతురా ? ఓరీ, మూర్ఖుడా, నీగాడిద బుద్ధిచే మానవాకృతి దూషింపఁబడినది. [మంత్రులతట్టు తిరిగి] రావుజీ, యీబాటసారులే యావేషధారి వైద్యులు.

శ్యామ : అట్లే తోచుచున్నది. ఆ దునీచందుశేటును పిలిపించెదము. ఆతఁడు రత్న వ్యాపారముచేయు గొప్ప షాహుకారు. అతనిచేత ఈ హారమునకుగూడా మదింపు వేయింపవచ్చును. రాణా : పిలిపింపుడు.

శ్యామ : ఓరీ.

ద్వారపాలకుఁడు : స్వామి.

శ్యామ : నీవు శీఘ్రముగాపోయి దునీచంద్‌ శేటును రాజాజ్ఞగా పిలిచికొనిరమ్ము. తలారియొద్ద తీసికొనిన మొహరీనిగూడ తీసికొనిరమ్మనుము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

రాణా : మనవేగువారు చాలాప్రమత్తులయినటుల కనఁబడుచున్నారు. లేకయున్న పరదేశీయులు మాఱువేసములతో సంచరించియు, అంత:పురమున దూరియు తప్పించుకొని పోగలుగుదురా ?

శ్యామ : ఈతూరి ప్రమాదమే జరిగినది.

రాణా : తీవ్రముగ మందలింపుడు.

శ్యామ : చిత్తము.

[దునీచంద్ శేటు ప్రవేశించును.]

దునీచంద్ శేటు : [తలారి మురళీదాసును చూచి రహస్యముగ] ఏమిరా యీసంగతి రాజుగారిదాకా తెచ్చావా? ఉండు ! భడవా, నీసంగతి చెప్పిస్తాను.

మురళి : చూడండి ధొరగారూ, యీ శేటుగా రేమంటున్నారో.

దునీ : జయము, జయము ఏలినవారికి ! ధొరగారి వుత్తరువైతే యీ మొహరీ వాడికిస్తానని చెప్తున్నానండి.

మురళి : [స్వగతము] ఆ - వూరికే యిస్తావా, వుంగరాల చేతి ముట్టు దగిలితే పెద్దమణిశి లాగా యిస్తావు.

శ్యామ : నీవుపోయి, నీ నవుకరి చూచుకొమ్ము. మేము విచారించి నీసొత్తును నీకిప్పించెదము.

మురళి : దయిసేయించండి సోమి, పిల్లా జల్లా గల్లవాణ్ణి. [దండము పెట్టి, నిష్క్రమించును.]

దునీ : [తిత్తికుచ్చె విప్పుచు] తమరు బంట్రోతును పంపేటప్పటికే నేను దండాధికారి దర్శనం చెయ్యడానికి సగందూరం వచ్చానండి. నే నబద్ధమాడితే ఆ జవ్వాన్నడగండి. [మొహరి శ్యామలరావు చేతికిచ్చి] ఇది దొంగ సొత్తేనని నాకు చాలా అనుమానం తట్టింది. అట్టాంటి సొత్తులను కొనవలెనంటె నాకు మహా చెడ్డ భయమండి.

శ్యామ : [పరిశీలించి] ప్రభువుగారు దీనిని చిత్తగింపుడు: ఇది మొగలాయి నాణెము.

రాణా : [పరికించి] అవును ! ఆవేషధారులు కూడ మొగలాయి రాజ్యమునకు సంబంధించినవారె.

దునీ : [భయముతో] ఇంకే వేషధారులు మా దుకాణానికి దొంగ సొత్తులు తేలేదండి. కర్పూరం వెలిగించి ఆర్పమన్నా ఆర్పుతాను.

శ్యామ : శేటుగారూ, దొరగారు మీ పెద్దమనిషితనమును అనుమానింపలేదు. ఈ వజ్రహారమునకు మదింపు వేయుడు.

దునీ : [హారమును తీసికొని ఉత్తరీయపు చెఱఁగుతో దానిరుద్దుచు] నేను ధరవేస్తే త్రాసులోపెట్టి తూచినట్లు సరీపోతుంది. [పరికించి ఆశ్చర్యముతో] ఈహారము నే నిదివఱకు చూచినదేనండి. కాశ్మీరదేశవర్తకుడు సంవత్సరము క్రిందట పదిలక్షల రూపాయలకు అగ్బరు చక్రవర్తి గారికి అమ్మినాడు.

రాణా : [చివుక్కనలేచి] ఏమంటివి ? అగ్బరుకా?

దునీ : [తత్తరముతో స్వగతము] కొంపమునిగినట్టుంది [ప్రకాశముగ] పరధ్యాన్నంమీద యేమొ అన్నాను.

రాణా : [ఉద్రేకముతో శేటు భుజముపట్టుకొని] యధార్థము చెప్పుము ! సంవత్సరముక్రిందట అగ్బరు ఈహారమును కొనియుండెనా?

దునీ " ఇటువంటిదానివలె వుండినదేగాని, అయితే యిదౌనోకాదో నేను నిర్ణయించి చెప్పడానికి జ్ఞప్తిచాలదండి మహప్రభో.

మాధ : నిజముచెప్పుము; అందువలన నీకేమి యపాయములేదు.

దునీ : [అనుమానించుచు] ముప్పాతికా మూడువీసాలా మూడు పిరలు ఆ హారంమాదిరిగానే - వుండినట్లు - తోస్తుందండి ప్రభో.

రాణా : [శేటుభుజము వదలి] సత్యము బయటబడినది. అమాత్యులారా, యింకను మీకు ఘనిష్టములైన యాధారములు కావలయునా ? ఆ దుర్మార్గుఁడైన అగ్బరే మాఱువేసమున మాయంత:పురముఁ జొచ్చెననుట కింకను సందియము గలదా ? కుంభరాణా బ్రతికి యుండగనే తనయంత:పురమున నింతటి యన్యాయము జరుగునా ? [నలుప్రక్కల చూచి] ఆదాసి యెచ్చటకు తారిపోయినది? - అంత:పురములో నొళవు లేనిదే యితరు డింతటి సాహస కార్యమున కియ్యకొనునా ? పూజ కను నెపమున కోరినప్పుడెల్ల మీరా కృష్ణమందిరమునకు పోవుచుండెను. యాత్రికుల వేషము ధరించి అగ్బరు అప్పుడప్పుడు ఆ మందిరమునకు వచ్చుచుండెఁ గాఁబోలు ! ఆ కపట వతి యంత:పురమున బంధింపఁ బడుట యెఱింగి వైద్యవేషధారులయి వారు వచ్చి యుందురు.

శ్యామ : నాబుద్ధి సంశయాందోళితమైనది. ఎట్లు నిర్ణయించుటకును వీలు కాకున్నది.

మాధ : రాణిగా రిట్టి నింద కతీతులు.

రాణా : [రేగుచున్న కోపము బిగబట్టుకొనుచు] ఏమీ? రాణిగారు ఆకసము బొంద చేసికొని క్రిందికినూడి పడిరా ? ఏల మీకింకను సందేహము ? అది యేమిబుద్ధి ? మీ ముందు మట్టిబొమ్మనజేసి పెట్టినఁగాని యధార్థము నూహింపలేరా ? - ఆ దాసి యెక్కడ ?

[భయముతో సుశీల ప్రవేశించును.]

రాణా : ఓసీ, ఆవైద్యులు వచ్చినప్పుడు నీ వంత:పురమున నుంటివా ?

సుశీ : [గొణుగుచు] వుణ్యానండి

రాణా : మీరా అ వైద్యులతో నేమైన మాటలాడినదా?

సుశీ : అమ్మగారు ముందటి మాదిరిగానే మాట్లాడుకుంటూ వుణ్యారు. వైద్దుగులను చూచి అమ్మగారు "వచ్చితివా, నన్ను తీసుకొని పొమ్ము, ఎంతకాలము వేచివుందును" అని వేడుకొంటూ వుణ్ణింది.

రాణా : ఆఁ ? [క్రోధమూర్తి యగును]

సుశీ : అమ్మగారితో గూడా రాత్రంతా మేల్కొనుండి అప్పుడే తెలియకుండా కన్నుమాల్చినాను.

రాణా : [కోపముతో] అమ్మగారు - అమ్మగారు - ఆ అమ్మగారిని నిన్ను ఒక్క త్రాటనే యురివేయించెదను. నీకంతలోనే నొడలు తెలియని నిద్రవచ్చెనా ? దీని నిద్రమత్తు వదలునట్లు గుఱ్ఱపు కమిచీతో మేలుకొల్పుడు.

సుశీ : [దు:ఖముతో] ఈతప్పు మన్నించండి దొరగారు. బుద్ది గెడ్డిదిని నిద్రబొయ్యాను.

[బంట్రోతు నెట్టుకొనిపోవును.]

శ్యామ : మహప్రభూ, యిట్టి సందర్భముల తొందరపాటు తగదు. ఆ తెలివితక్కువదాసి, చెప్పిన తబ్బిబ్బు మాటల నాధారము చేసికొని మీ సందేహమును బలపఱచుకొనఁ బోకుఁడు. అది నిద్రమత్తున నుండి పూర్వాపరముల నెఱుంగక అసంగతముగ కొన్నిమాటలు చెప్పెను.

రాణా : శ్యామలరావ్, మీ సదుద్దేశము ప్రశంసనీయము. కాని, సదుద్దేశములు అపరాధ కళంకమును తుడిచి వేయఁజాలవు. ఇఁక నేను బూటకపు సమాధానముల నమ్మను. ఇదివఱకు నా యనుమానము నిర్హేతుకమని తలఁచి యుంటిని. సందేహ వశంవదుఁడనైన నా యభిప్రాయము నణఁగ ద్రొక్కి నిష్పక్షపాత బుద్ధితో అన్యునివలె విషయ పరిశీలనము గావించితిని ఇప్పుడంతయు స్పష్టమైనది.

శ్యామ : ప్రథమ విచారణయందు దోషములని తేలినవి. కొన్ని పునర్విచారణయందు నిర్దోషములని నిరూపింపఁ బడవచ్చును. మేఘాచ్ఛన్నమైన యాకాశము ఒక్కపెట్టున మేఘ నిర్ముక్త మగుటలేదా?

రాణా : మీ కవితా ప్రియత్వము మన్నింపఁ దగినది.

శ్యామ : దేవరవారు నామనవిని తుదివఱకు చిత్తగింపుఁడు : - అగ్బరు చక్రవర్తి మాఱు వేసమున మన యంత:పురము జొచ్చినది నిశ్చయము. అది అంత:పురధర్మమునకు కేవలము విరుద్ధము.

మాధ : నింద్యమును.

శ్యామ : నింద్యమె, కాని! -

రాణా : [విసుగుతో] కాని యేమి?

శ్యామ : కొంచెము ఓర్పు వహింపుఁడు.

రాణా : నిరర్థక కాలయాపనము !

శ్యామ : అయినను ఇచ్చట కార్యోద్దేశము ముఖ్యముగ గమనింపఁదగిన విషయము. రాణిగారు సర్వభోగములఁ బరిత్యజించి, వైరాగ్యమూని నిరంతరము శ్రీకృష్ణపదధ్యాన పరాయణయై కాలము గడపుచున్నది. ఆమె భక్తురాలను కీర్తి దేశమంతట వ్యాపించియున్నది. ఆమెను దర్శించుటకు వేనవేలుగ భక్తులు వచ్చుచుందురు.

రాణా : ఇంతకు మీమాటలలో స్ఫురించున దేమనఁగా, మీరా యొక లోకాతీతయైన భక్తురాలు, అగ్బరు లోకాతీతుఁడైన పరమభాగవ తోత్తముఁడు, మోక్షార్థియై భక్తిభావనతో అతఁడు మీరాను సేవింప వచ్చెను. ఇంతియేనా ?

శ్యామ : చిత్తము.

రాణా : చక్కగానున్నది విషయకల్పనము! విపరీత వ్యాఖ్యానమునకు కూడ నొక హద్దుండవలయును. ఆత్మవంచనమునకు పరస్పర ప్రతారణమున కిచ్చట నవకాశములేదు. నా వివేకమును మీ రనుమానించు చున్నట్లున్నది. నేను పసిపాపనుగాను [ఉద్రేకముతో] నేను తిరస్కరింపఁబడితిని. వంచింపఁబడితిని. నాబలము, నాశౌర్యము, నాయభిమానము, నాగౌరవము - తుదకు నాస్థితియె ధిక్కరింపఁబడినది, తృణీకరింపఁబడినది. పట్టపగలే నా యంత:పురము గణికా మందిర మైనది. ఇఁక నేమి కావలయును ?

మంత్రులు : రామ! రామ! పాపము శాంతిల్లుఁగాక !

రాణా : [దు:ఖగద్గద స్వరముతో] నా యాశాలేశముకూడ భగ్నమై పోయినది. [మీరాబాయి నుద్దేశించి] మీరా, ఇఁక నీవు నాప్రేమకుఁ బాత్రమవు కావు. నా సంసార మసారమైనది. సుఖస్వప్నము ఆతర్కితముగ భిన్నమైనది. మీరా, నీవు చావ వలయును ! చావ వలయును !

శ్యామ : [తత్తరముతో] మహప్రభూ, - ఏమి నిర్ణయించితిరి. ఘోరము! ఘోరము! ఈ తొందర పాటునకుఁ బశ్చాత్తప్తులు కాఁగలరు. వెనుక చింతించుటకంటె ముందుజాగ్రత మేలు. కోపోద్రిక్త మానసులయి సత్యము నెఱుంగఁ జాలకున్నారు.

రాణా : దుర్బల హృదయులై మీరు సత్యము నెదుర్కొనభయపడుచున్నారు. మీరా భక్తురాలను మీ దురభిప్రాయము సత్య సందర్శనమున కడ్డువడుచున్నది. ఆమాయలాడి రక్తపాతమునఁగాక యీ యపయశో మాలిన్యము సమ్మార్జితముకాదు.

మాధ : హరి! హరి! కొంచెము తడవిండు. నిజము నిలుకడమీఁద తేలఁగలదు. రాణా : కాలము జరుగుకొలఁది దాంపత్యప్రేమ విడంబించి విధినిర్వర్తనమునందు అసమర్థుఁడను గావచ్చును.

శ్యామ : నాచిన్న మనవి యాలకింపుఁడు. ఈ విషయమును గుఱించి రాణిగారేమి సమాధానము చెప్పికొందురో తెలిసి కొనవలయును.

మాధ : అవును. అపరాధిని విచారింపక యెంత యల్పదండనము విధించినను అది న్యాయ్యముగాదు.

రాణా : నాకుఁదెలిసి నేనెవ్వరికి నన్యాయమొనరింపను. ఇంతకుఁ దెగించిన సాహసవతి తనతప్పుల నొప్పుకొనక పోవునా ? అయినను కనుగొందము. పిలిపింపుఁడు.

శ్యామ : రాణిగారు పట్టమహిషి !

రాణా : [కోపముతో] ఇంకను పట్ట మహిషియా ?

శ్యామ : దేవరవారు పట్టభద్రులై యున్నంతవఱకును.

రాణా : [విసుగుతో] నా సంకల్పము నాటంక పెట్టుటకు మీరు పండితులు. నే నిప్పు డేమి చేయవలయు?

శ్యామ : అంత:పురమునకుపోయి రాణిగారిని విచారింపవలయును.

రాణా : [లేచి కొంతదూరము పోయి, వెనుకకు మరలి కోపముతో] ఆపాపిష్టురాలి మొగము నే నింకఁ జూడనొల్లను. [కూర్చుండును]

శ్యామ : అట్లయిన నెవరినైన నియోగింపుఁడు.

రాణా : నే నెవ్వరిని విశ్వసింపఁ జాలను. నేనే పోయి విచారించెదను. ఇప్పుడు నేను భర్తనుగాను. న్యాయాధిపతిని. [లేచును.]

శ్యామ : మాకు సెలవిండు. మరల మాపై మీకు నమ్మకము గలిగినప్పుడు పిలిపింపుఁడు.

రాణా : [వినిపించుకొనక నిష్క్రమించును.]

మాధ : రాజు తననే తాను నమ్మలేఁడు. ఇఁక నితరులను నమ్ముటెట్లు ? శ్యామ : అయినను ఈ సమిష్టి నింద యసహ్యము. మన జీవిత మంతయు ప్రభువు శ్రేయోభి వృద్ధులకు ధారవోసితిమి ! అందుకు ప్రతిబహుమానమేమి?

మాధ : అవిశ్వసనీయుల మగుట!

శ్యామ : మరల రాజమందిరమునకు వచ్చుటకుఁ బూర్వము మనకర్తవ్యమును నిశ్చయించుకొనవలయును. మొదటినుండియు రాజు స్వభావము మన మెఱుంగుదుము. అనురాగము గాని విరాగముగాని అతిగాఢము; భావోద్రేకము కలవాఁడు. వదలక పట్టువట్టి తన యభిమతము నెగ్గించుకొనును.

మాధ : చాలవఱకు న్యాయబుద్ధియుఁ గలదు.

శ్యామ : కలదు; కాని, న్యాయబుద్ధియె తప్పుదారిపట్టి అందుకు ధృడ సంకల్పము తోడ్పడునెడల గుణము విషమించి యవగుణ మగును. ఒకవేళ ఆశ్రయనాశకమును గావచ్చును.

మాధ : మనచేత నైనంతవఱకు విప్పి చెప్పితిమి. మన విధి మన:పూర్వకముగ నిర్వర్తించితిమి. రాజుగారి యకార్యమునందు మనము భాగస్వాములము కాము. ఇఁకమీఁది కర్తవ్యము మీరే నిశ్చయింపవలయును.

శ్యామ : భాగస్వాములము కాము గదాయని తృప్తిపడి యుండకూడదు. పవిత్రశీలయగు రాణిగారు రక్షింపఁ బడవలయును.

మాధ : అవును. మా మంత్ర ప్రయోగమునకు అవకాశ మేర్పడినది.

శ్యామ : సైన్యాధిపతి మన యభిప్రాయమునకు విరుద్ధుఁ డయ్యె నేని అతని నెట్లయిన మనప్రక్కకుఁ ద్రిప్పుకొనవలయును.

మాధ : అదిచాల ముఖ్యము.

శ్యామ : రాణిగారిని సంరంక్షిచుటకొఱకు రాణాగారిని తిరస్క రింపవలసి వచ్చినను అందుకు మనము సంసిద్ధులమై యుండవలయును.

మాధ : నేను మిమ్ము ననుసరించెదను. - కాని, కుమారసింహుఁడు ?

శ్యామ : ఆతఁడు రాజభక్తి యంత్రము. ధర్మమైనను అధర్మ మైనను రాజాజ్ఞ నెరవేర్చును. మన నిర్ణయ మతనికి తెలియకూడదు.

మాధ : అట్లె.

[ఇరువురు నిష్క్రమింతురు.]