కుంభరాణా (మీరాబాయి)/స్థలము 5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్థలము - 5 : అంత:పురము

________

[మీరాబాయి ధ్యాననిమగ్నయై యుండును. తెరయెత్తఁబడును. సుశీల మందుగిన్నెతో ప్రవేశించును.]

సుశీల : రాణిగారూ, ఈమందు కొంచెం పుచ్చుకోండి. ఈసారం కడుపులోకి పొయ్యేసరికే పిచ్చి కుదురుతుందట.

మీరా : [పలుకదు]

సుశీ : ఈమెపిచ్చి మందూమాకులతో కుదిరేలాగులేదు. మూడు దినాలు నుంచీ అన్నం నీళ్లు అంటకుండా ద్యాన్నించుకొంటూ, పాడుకొంటూ, నవ్వుకొంటూ మనలోకంలోనే లేదు. మా లలితకు జన్నిగుణం తగిలినప్పుడు ఈలాగే వుణ్ణింది. ఇట్టాంటి రోగాలు కట్టెతోగూడా పోవాల్సిందే - అమ్మ గారూ, కొంచెమయినా యీమందు తాగండి.

మీరా : [ధ్యాన నిమగ్నయై పలుకదు.]

సుశీ : మందంతా తాగేశిందని బలవంతరావుగారితో చెబుతాను. [ఒకప్రక్కకువచ్చి మందు క్రింద పాఱఁబోసి మెల్లఁగా స్తంభమున కానుకొని తూఁగుచుండును.]

మీర : [మెలమెల్లఁగఁ గనులెత్తి] శ్రీకృష్ణా, రాధామనోవల్లభా, దీనావనదీక్షా పరతంత్రా, నన్నేల యీనిర్బంధమున నుంచితివి ? నేనేమి యపరాధ మొనరించితిని ? నీమందిరమునకు వచ్చి నీదివ్యసుందరమూర్తిని సేవింప నీయక నాభర్త నన్నీ యంత:పురమున బంధించియుండుట నీకు సమ్మతమేనా ? - తమ సర్వస్వమును నీపాదములకు నర్పించిన పల్లెటూరి గొల్ల పడుచుల సైతము నల్లాటవెట్టుట కలవాటుపడిన నీకు న న్ను పేక్షసేయుట యొకవింతయా ! - ఓభక్తవత్సలా, యజ్ఞానముచే నీసదుద్దేశమును తెలిసికొన లేక నిందించితిని. సందేహించితిని. విషయవాంఛా మలీమసములై గోపికల హృదయములను విరహాగ్ని జ్వాలలందు పరిశుద్ధము గావించి, వారికి నిర్వాణసామ్రాజ్యము నొసంగితివి. నీదాసురాలను నన్నుఁగూడ నట్లే పరిశుద్ధము చేయుటకు ఈ యుపాయము పన్నితివి కాఁబోలు! "సకలాంతర్యామినైన నన్ను ఈ యజ్ఞానవతి యెఱుంగలేక మందిరము మందిరమని భ్రమపడుచున్నది. దీనికి చక్కని గుణపాఠము నేర్పించెద"నని యెంచి, నాకీ బంధనము విధించియుందువు. ఆపత్పరంపరలు మహోపకార గర్భితము లను గభీర సత్యమును నేఁడు గ్రహించితిని. కృష్ణా, నీకరుణ అనంతము ! అనంతము !

[ధ్యాననిర్మగ్న యగును.]

[వాసంతిక ప్రవేశించును.]

వాసంతిక : సుశీలా, యెక్కడ?

సుశీ : [తూఁగుచుండి యుల్కిపడిలేచును] మల్లీ మందుతెచ్చావా ? అమ్మగారు వొక్కచుక్క పోకుండా మందంతా తాగేశినారు.

వాసం : దొరసానమ్మగారు అ అవస్తలో వుంటే నీవు నిమ్మళంగా నిద్రపోతున్నావా ?

సుశీ : నీవొక్కదానివే బయబక్తులతో నవకరి చేసేదానివిన్నీ తక్కిన వాళ్ళందరూ కూలికి పనిచేసేవాళ్ళు. ఎందుకీ పనికిమాలిన బడాయి ? వచ్చినపని చూచుకోని పోరాదూ.

వాసం : సుశీలమ్మగారూ, బుద్ది, బుద్ది. [చెంపలువేసుకొనును] రాణిగారికెట్లావుందో కనుక్కోని రమ్మన్నారు బలవంతరావుగారు. మందు తాగిన వెనుక నెమ్మదిగా పడుకుందోలేదో కూడా అడిగి రమ్మన్నారు.

సుశీ : బుద్దితో అట్లా అడుగు చెబుతాను. - మునుపటికంటె పైదుర్గుణాలేమి కనిపించలేదు. ఇంకా కాళ్ళుముక్కు పీక్కునే సితికిరాలేదు. తనలో తానే మాట్లాడుకొంటుంది. ఇప్పుడే కన్ను మాల్చింది. ఇంతవఱకు నేను విసురుతునే వుణ్యాను - కానీ, యీసంగతంతా నేనుపోయి బలవంతరావుగారితో విన్నవిస్తాను. అంతదాకా రాణిగారి దగ్గర వుంటావుగదూ ?

వాసం : ఆమాటలు చెప్పడానికి యెవరితెలివైనా యెరవుతెచ్చుకోవాల్నా యేంటి ? [నిష్క్రమించును.]

సుశీ : ఇది బహుచమత్కారి తొత్తుకూతురు. మఱచిపోయైనా మోసపోతుందంటె మోసపోదు. రేయింబవుళ్ళు నన్నే పడిచావమంటుంది.

మీర : [ఉల్కిపడిలేచి బయలుచూచు] హృదయేశ్వరా, యింతలో నా కౌఁగిలి విడిపించుకొని యెట్లుపోయితివి ? ఎచ్చటికేగితివి ? ఈదీనురాలిని వంచించుటకు నీకు మనసెట్లు పుట్టెను ? ఒక్కస్థలమున నుందువని నిర్ణయములేని నిన్ను నే నెక్కడయని వెదకుదును ?

                     ఉందువో మౌనిజనోత్ఫుల్ల హృదయాబ్జ
                               కర్ణికా నాట్య రంగములయందు?
                     ఉందువో శాంత రసోజ్జ్వల మూర్తివై
                               క్షీరాబ్ధిలో మృదుశేషశయ్య?
                     ఉందువో దీనావనోద్యోగ రతుఁడవై
                               తలపోఁత కందెడు దవ్వునందు ?
                     ఉందువో నిర్వాణయోగ సంధాయివై
                               రాస లీలా భోగరాజ్యమందు?

                     ఇంక నెచ్చోట నుందువో యెవరికెఱుక?
                     సృష్టినాటక సూత్రధారివి ! నిరంత
                     ప్రకృతి కేళీ వినోద హర్షంబు కొఱకు
                     బొమ్మరిలు గట్టి తుడిపెదు మొదలుసెడక.

లోకేశ్వరా, ఎందుకీ లీలావిలాసము ? నీదివ్యమంగళ సౌందర్యము నీ యనంత ప్రకృతి దర్పణమునఁ ప్రతిఫలింపఁజేసి నిన్నునీవు చూచుకొనుటకా ? [బయలుచూచి క్రమక్రమముగ ధ్యాననిమగ్న యగును.]

సుశీ : ఈయమ్మగారి మాటలూ మందలింపులూ నాకు సంస్కుతంగావుంది - నిన్నటిరాత్రంతా కునికిపాటైనాలేక యీమెతోటి మేల్కొని అవస్తపడ్డాను. కొంచమట్ట కన్ను మాలస్తాను. ఆముదనష్టపు వాసంతికతో నాకు అత్తపోరయింది. [పైటచెంగు పఱచుకొనియొక మూలగ పరుండును]

మీర : నన్నేల యింకను నీయొద్దికి చేర్చుకొనవు ? దవాగ్ని మధ్యమున పరితపించుచున్న యీ కురంగిని కాపాడుటకు నీకింకను దయ గలుగులేదా ? నీకంఠమున వేయుటకై కట్టిన పొగడదండ నాయంజలిపుటమున కమలి పోయినది. ఇంకను నీవురావేమి ? నేను పంపుచుండిన బాష్పదూతికలు నిన్నింకను చేరలేదా? నా విన్నపమును గొనిపోయిన బలాకలు దారిలో నేమైన నాలసించినవా ? లేక నీవే యుపేక్షించితివా ?

                     ధూళి గప్పిన యీజీర్ణ చేలఁదాల్చి
                     గఱిక పువ్వులు కొప్పులోఁ దుఱిమి, ముసుఁగు
                     టంబరంబును రాణివాసంబు వీడి
                     దుమ్ము గద్దియ నెక్కితిఁ దుదకు నాథ !

ఇంకనైనను నీచరణదాసినగుటకు తగనా ? పూర్వ మా రుక్మిణిని గొనిపోయినట్లు నన్నేల గొనిపోవు? రాధామనోవల్లభా, నీవు రాధాకౌఁగిటిలో చిక్కియున్నావు. లేకయున్న నీవేల మఱతువు, రాధా ? నీవు ధన్యవు - ధన్యవు - [ధ్యాన నిమగ్నయగును.]

సుశీ : [మేల్కొని కూర్చుండి పైటచెంగుతో విసురుకొనుచు] అబ్బా ! యీ హడావుడిలో నిద్రపట్టడంగూడానా. [ఆవులించి, తూగి, కొంచెము జరిగి పండుకొనును.]

మీరా : [ఉల్కిపడిలేచి అటునిటుచూచుచు] ఇంతలో నెక్కడ మాయమైతివి ? - నాయొద్దనే కూర్చుండి నన్ను ముద్దిడుచుంటివే. నీ త్రిజగన్మోహన స్వరూపము నొక్కక్షణమాత్రము నాకన్నులకు కనిపించి యానందపారవశ్యమున నే నొడలు మఱచియుండ మోసముచేసి పారిపోయితివా ? నీ కెందఱో ప్రాణవల్లభులు గలరు. వారిని వదలి నీవొక్క క్షణమైన సహింపనోపవు. ఈరాధతో నీకేమిపని? - నేను సౌందర్యవతిని గాను. భాగ్యవతిని గాను - కులీననూ గాను - కృష్ణా, నీకిట్టి భేదబుద్ధియుం గలదా? ఆకుబ్జ యెట్టి యందకత్తె? ఆ విదురుఁడెంతటి బాగ్యవంతుఁడు? ఎట్టికులీనుఁడు? అట్టి యవ్యాజ కృపాకటాక్షము నాయెడల యేల యుజ్జగించితివి? - మోసగాఁడా, పొమ్ము, పొమ్ము. నీవు మరల అర్ధరాత్రమున వచ్చి నాతలుపుతట్టి నన్ను బ్రతిమాలుకొన్నను నేను లోఁబడును. అలుకపూని నిన్ను వెనుకకు మరలించెదను. చెలులారా, ఒకవేళ నేను మెత్తందన మూనినను మీరు గట్టితనముబూని నాకు సహాయపడవలయును. - ఇసీ ! నేనెంత ముద్దరాలను? పదియారువేల గోపికలకు జీవితేశ్వరుఁడైన మన్మధజనకుని ఈదీను రాలి అలుకయేమిసేయును ? పేదవారలకోపము పెదవులుదాఁటదు. దాఁటినను నవ్వులచేటు. - హృదయేశ్వరా, నా కా యభిమానము దుమ్ముదుమారమైనది. నేను నీసొత్తును. అస్వతంత్రను. తలపై పెట్టుకొన్నను కాలిక్రింద వైచికొనున్నను నాకిష్టమె. - నాకిష్టమనునది యెక్కడిది? అంతయు నీయిష్టమె. నన్నేల ప్రొద్దుపొడుపుననే నీతోడ యమునా తీరమునకు కొనిపోవు? గొల్ల పడుచునకు రాణివాసమెక్కడిది ? ఇరువురముఁ దోడుతోడుగఁ బసుల మేపు కొనుచుందముగదా!

                      నీ వెండలోఁ జెట్లనీడలఁ బన్నుండి
                                 పసుల మేపఁగ నన్నుఁబంపరాదొ;

                      చలిది చిక్కంబుల సడలించి యన్నంబుఁ
                             బెట్టవేయని పేర్మిఁ బిలువరాదొ;
                      అలసితి నొక్కింత తలిరువీవన వీవు
                             ప్రేయసీ, యని యాజ్ఞవెట్టరాదొ;
                      మనసయ్యె భువన మోహనగాన మొనరింప
                             మురళి యిమ్మని చూడ్కి నెఱపరాదొ;

                      తలిరుటాకులు పూవులు దండగట్టి
                      మెడను గీలింపుమా యని నుడువరాదొ;
                      అట్టి యుపచారముల కే ననర్హ నైన
                      నిష్టముండిన రీతి నన్నేలరాదొ!
                                                [ధ్యాననిమగ్నయగును]

[అగ్బరు తాన్‌సేనులు వైద్యుల వేషముతో ప్రవేశింతురు]

అగ్బరు, తాన్‌సేనులు : తల్లీ, చరణదాసులము. [దండము పెట్టుదురు.]

మీరా : [ఆనంద పారవశ్యమున నుండును]

తాన్ : దర్శనమాత్రముననే ధన్యులము.

అగ్బ : గానమువిన్న నేమి యగుదుమో!

మీరా : నందనందనా, దివ్యసుందరశరీరా, నీవంటి సుకుమార కుమారుని ఆకొండ తిప్పలలో ఆ యరణ్యములలో పసుల గాచుటకు ఆ యశోదాదేవి యెట్లుపంపెను? ఆనందుఁ డెట్లియ్యకొనెను ? తలిదండ్రుల హృదయము లింత కఠినముగ నుండునా ?

                      పగలెల్ల సూర్యాతపంబునఁ దిరుగంగ
                               ముదుక వాఱిన నీదు మోముఁగాంచి;
                      సజలమేఘశ్యామ సంకాశదేహంబు
                               గోరజ చ్ఛన్నమౌ తీరుగాంచి;
                      లలిత పల్లవ కోమలములైన వ్రేళులు
                               కఱ్ఱ రాపిడి కాయ గాయఁగాంచి;
                      వజ్రభామినీ మన: పథముల విహరించు
                               పదములు ముండ్ల పాల్వడుటఁగాంచి;
                      వేడినిట్టూర్పు విడతు; నావిధిని దూరు
                      కొందు; హృదయంబు వ్రీలిపోఁ గుందుచుందు;
                      నీచరణదాసిని రాధను నేనులేనె,
                      యంతకష్టంబు నీకేల యాత్మపాల?

అగ్బ : ఈ పరమభక్తురాలికి రాధాత్వము సిద్ధించినది.

మీరా : కృష్ణా, రేపటినుండియు నేనే యాల మేపఁబోయెదను. నీవా యరణ్యమునకు రావలదు. నాకు వాదోడుగా నుండుటకు నీపిల్లనగ్రోవినిమ్ము. నీ పెదవి కెంజిగురులంటిన వివరమునందె నా వాతెఱనాన్చి నీమధురాధర రసస్పర్శ ననుభవించెదను.

తాన్ : [మెల్లగా కనుఱెప్పలువాల్చుచు] గానపారవశ్యముచేత కన్నులు మూఁతవడుచున్నవి.

అగ్బ : కన్నులు మూఁతవడుచుండఁగనె ఇంతకు ముం దెన్నడును ఎఱిఁగియుండని హృదయద్వార మొకటి తెఱవఁబడినది.

తాన్ : దాని తాళపుచెవికొఱకె మనమింత దూరము వచ్చితిమి. ఏమి యీగాన విశేషము !

అగ్బ : కావుననే లోకప్రసిద్ధమైనది.

తాన్ : తల్లీ, మమ్మొక్కమాఱు కరుణింపుము. మేము కృతార్థులమయ్యెదము.

సుశీ : [కన్నులుపులుముకొనుచు లేచి కూర్చుండి] మల్లీ వైద్దుగు లొచ్చినారె ! రోగమొక దోవ మందొకదోవ.

మీరా : [ఉల్కిపడిలేచును]

[అగ్బరు తాన్‌సేనులు లేతురు]

మీరా : ఆ! - మనోమోహనా, వచ్చితివా ? నన్నుఁగొనిపొమ్ము. ఎంతకాలము నీకయి వేచియుంటిని ?

సుశీల : ఇక్కణ్ణుంచి కొనిపొమ్మని వేడుకొంటుంది దొరసానమ్మ. [కూర్చుండి తూగును.]

మీరా : [అగ్బరు తాన్ సేనులు తట్టుతిరిగి] ఇద్దరు శ్రీకృష్ణులు ! [సుశీలవంకచూచి] ఇంకొక శ్రీకృష్ణుఁడు. [నలువంకలుచూచి] కోటానుకోట్ల శ్రీకృష్ణులు ! ఇందులో నాప్రాణేశ్వరుఁడైన యశోదానందనుఁడేడి?

అగ్బ : ఈ భక్తురాలికి లోకమంతయు శ్రీకృష్ణమయముగ నున్నది. అమ్మా, ఆకృష్ణుని మాకు చూపించి మమ్ములను భవ విముక్తులను గావింపుము.

మీరా : జగన్మోహనా, నీవు నాతో చెరలాట మాడుచున్నావా? నీవు నిన్నెఱుఁగవా? నీవు శ్రీకృష్ణుఁడవుగావా?

అగ్బ : ఈమె కీసమయమున నిహలోకజ్ఞాన మంతరించినది. రాధయే తానను విశ్వాసమున శ్రీకృష్ణ విశ్లేషము సహింపనోపక యార్తిఁజెందు చున్నది. మనమిప్పు డీమెతో సంభాషింపలేము. దర్శనముచే పవిత్రుల మైతీమి. గానముచే హృదయము నిర్మలమయ్యెను. ఇఁక మరలుదము. తాన్ : 'నీవు నిన్నెఱుఁగవా? నీవు శ్రీకృష్ణుఁడవు గావా ?' యను వాక్యముతో మనకు చిరంతన సత్యమును బోధించినది.

సుశీ : [కనులెత్తి] అబ్బో! మరల దోమరాటుకూడా యెక్కువైంది. [పైటతో విసరుకొనుచు] కన్నట్టైమూయనీయ వీ పాపిష్టిదోమలు - అయ్యా, యేమైనా మందిచ్చిపోతున్నారా ? కుప్పెకట్టయితే మఱొక్క సుట్టు యెక్కువగా సాదియ్యండి. కాస్త యిచ్చాపత్తెం పెట్టండి. పాపం మారాణిగారు ఇప్పటికే సన్నగిల్లి పోయారు.

అగ్బ : ఆమెపిచ్చికి ఆమెయొద్దనే మందుగలదు. దానిని మేము గూడ కొంచెము గ్రహించితిమి.

సుశీ : [స్వగతము] వీళ్ళకుగూడా పిచ్చిపట్టిందాయేంటి ! ఈపిచ్చి అంటురోగమాల అందరికీ తగులుకొనేటట్టుంది. ఈ గాలితగిలి నాకుగూడ పిచ్చిపట్టిందోయేమొ అద్దముచూచుకొనివస్తాను. [నిష్క్రమించును.]

అగ్బ : ఈదాసి మనల ననుమానించి యుండదుకదా.

తాన్ : అది తూగుబోతు.

అగ్బ : తల్లీ, ఈగురుకట్నమును గ్రహింపుము. ఈ హారమును శ్రీ కృష్ణునకు స్వయంవర హారముగ సమర్పింపుము.

[మీరాబాయి అంజలిలో హారమును విడచును.]

తాన్ : ఈబీదకట్నమునుగూడ సంగ్రహింపుము. [పూవులదండను దోసిట విడచును.]

[దండముపెట్టి యిరువురు నిష్క్రమింతురు. ధ్యాన నిమగ్నయైయున్న మీరాబాయి చేతిలోనుండి హారము క్రిందికి జాఱిపడును.]

సుశీ : [ప్రవేశించి] అద్దములో చూచుకొంటె ముందరి మొఖం లాగేవుంది. నాకేం పిచ్చిపట్టలేదు. - వైద్దుగులు మందైనా యియ్యకుండా వెళ్ళిపొయ్యారె. - [హారమును చూచి ఆశ్చర్యముతో] ఆ! యిదేంటి చుక్కల దండలాగా మెరుస్తుంది. [నలుప్రక్కలు పరికించి] ఇక్కడ యెవ్వరూలేరు. రాణిగారు కన్నుమాల్చివున్నారు. [హారముతీసికొని] వైద్దుగులు చూచివుంటె తట్టేసివుండేవాళ్ళే. దీన్ని దొంగిలిస్తే దేవుడుకూడా కనుక్కోలేడు. [అటునిటుచూచి ఱవికెలో దోపుకొనును]

మీరా : [మెల్లగా కనులెత్తి] ప్రాణవల్లభా, యీవిరహణిని నీవు పరిత్యజించితివి. ఇఁక నే జీవించియుండలేను. ప్రాణపరిత్యాగము చేసికొందును. ఈ హత్యాపాతకము నిన్నుఁదప్పక చుట్టుకొనును. [తన్నుఁజూచుకొని యుల్కిపడిలేచి] హా! ఇదియేమివింత ! నేనే కృష్ణుఁడను ! - మా కిరువురకు నభేధ ప్రతిపత్తి గలిగినది ! - ఈ చరాచర భూతసృష్టియంతయు నేనే ! - నేను లేనిదియు నేను కానిదియు నొక్కటియైన కనఁబడదు ! అంతయు నేనే - నేనే - నేనే - నే - నే...

[మూర్చిల్లును; సుశీల ఆనుకొని పట్టుకొనును]

[తెరజాఱును.]