Jump to content

కాశీయాత్ర చరిత్ర/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

గోడలకంటె ద్విగుణ మయిన బలము కలవి గనుకనున్ను బహు బల మయిన కొయ్యసామాను అతినయముగా దొరుకుచున్నది. గనుకనున్ను వారు చెప్పిన ప్రకార మొక చావిడి కట్టదానకు రూ 20 చాలు నని తోచినది. ఆరాత్రి చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని ఉదయమయిన 4 ఘంటకు బయలుదేరినాను. ఆరాత్రి మిక్కిలి చల్లగాలితో కూడామబ్బు తుంపర పడుచుండెను గనుక నొక బోయిగుడిశె ఖాళీ చేయించి అందులో పండుకొన్నాను.


రెండవ ప్రకరణము

16 రతేదీ అక్కడికి 4 కోసుల దూరములో నుండే శ్రీశైలము 12 గంటలకు చేరడ మయినది. పెద్దచెరువు విడిచి వెంబడిగానే కొండయెక్కను ఆరంభించవలసినది. ఒక్ కోసెడు యెక్కుడు, దిగుడుగా నుంచున్నది. అయితే మెట్లువైపు (వీలు)గా కట్టియున్నవి. నిండా ప్రయాస కాదు, ఇరుప్రక్కలా అడివి. అటుపిమ్మట కోసెడు దూరము సమభూమి. అందులో పొయ్యేదారి రాతిగొట్టుగా నుంచున్నది. అటుపిమ్మట భీముని కొల్ల మనే$ అగాధాఇన కొండ్ పల్లమువరకు కొండ యెక్కుడు దిగుడుగా నుంచున్నది. అక్కడ మెట్లు ఏర్పరచి కట్టియున్నవి. ఆయాగాధ మైన కొండదొవలో నొక వాగు పారుచున్నది. అక్కడ ఆసోదా చేసుకొని కొండయేడుతిరుగుళ్ళు, రెండువేల మెట్ట్లు పర్యంతము, మిక్కిలి పొడుగుగా నెక్కవలసినది. ఆ ప్రదేశములో నెక్కేటప్పుడు, దిగేటప్పుడున్ను వాడికె లేనివారికి చుట్టూ చూస్తే కండ్లు తిరుగును. మెట్లు బాగుగా నెక్కవలసినంత దూరము కట్టి యున్నవి. చుట్టు ఏతట్టు చూచినా నవ్రతములున్నవి. యీప్రకారము రెండుకోసులు ఎక్కిన వెనుక సమభూమిలో రాతిగొట్టు గల మార్గము శ్రీశైల పర్యంతము పోవుచున్నది. ఆ కొండ యెక్కుటుకు, దిగుడుకు తిరుపతి బోయీలు డోలీకి 6 మంది అయినట్టయితే అనాయాసముగా నెక్కిపోదురు. అంతదూరము ఎక్కుడు దిగుళ్ళలో తిరుపతి గాలిగోపుర పర్యంతము అక్కవలసినంత ప్రయాస యెక్కడనున్నులేదు. నాతోడవచ్చిన వుప్పాడా బోయీలు 8 మందిన్ని నాడోలీని అనాయసముగానే మోసినారు. అయితే నాగులోటి దాటగానే కొండ యెక్కవలసిన దాని కంటే రఫంత ప్రయాస యెక్కువ గనుక, అక్కడ ప్రధమ మందే యీలాగున నున్నదే, యిక నేలాగున నుండునో యని అధైర్యము తోచుచున్నది. అవతల సాగిపోగా సుళువనిపించుచున్నది గాని వేరుగాదు. ఆ కోండ ఉయెక్కుడు, దిగుడులలో ఆత్మకూరి బోయీలకు వుప్పాడ బోయీలు తీసిపోలేదు. ఆ యాత్మకూరి బోయీలకు సంవత్సరమునకు నొకసారి పనిపడు చున్నది గాని నిండా పనిలేదు గనుక నెక్కడము, దిగడములలో తిరుపతి బోయీల వలెనే ఆబోయీలు వాడికే పడిన వారుకారు. నేను చేయించిన డోలీకి బంగాళా పాలకీ వలెనే రెండుం ముక్కాలడుగు వెడల్పు పెట్టించినాను. అది శ్రీశైలమునకు సాధారనముగా సాగిపోయినది. కందనూరు నవాబు వగయిరాలు పల్లకీల మీదనే శ్రీశైలమునకు వెళ్ళియున్నారు. సంపన్నులయి నందున దోవలోని చెట్ల కొమ్మలు కొట్టడమునకు ముందుగా మనుష్యులను జాగ్రత్త పెట్టి యుండవచ్చును.

17 తేది పగలు 3 ఘంటలకు శ్రీశైలముమీది గుడి కల్యాణ మంటపములో నుంటిని. అక్కడ ముందు గుడికి చుట్టున్ను గొప్ప పట్టణ ముండను. వేశ్యా స్త్రీల యిండ్లు మట్టుకు 370 ఉండినవి. ఆపట్టణ మంతయు ఇప్పుడు పాడుబడి పోయెను. ఇంటింటనున్న బావులు శిధిలములయినవి. గోడలుగూడా ఇప్పుడు తెలియుచునున్నవి. 500? ఏండ్లనాడు అనవేమారెడ్డికి భగవంరుని కటాక్షము చేత బంగారనుములు పండినవని వాడుక కలిగియున్నది. అతడు స్వామి గర్బగృహమునకున్ను, ధ్వజస్తంభములకున్ను బంగారు మొలాము చేసిన రాగి తగుళ్ళు కొట్టించినాడు. అని యుప్పుడు నిండా శిధిలములుగా నున్నవి. గుడికి రెండు ప్రాకారములు కలిగియున్నవి. బయిటి ప్రాకారపు గొడలమీద నాలుగుపక్కల శివలీలలు సుందరములయిన ప్రతిమలుగా చెక్కియున్నవి. వాటిని శిల్పి బహు బాగాచేసినాడు. అయితే రాళ్ళను వయివుగా నంతన చేసినవాడుకాడు. ప్రాకారము మీద ప్రతి కోట కొమ్మకు నొక్కొక్క ప్రతిమ చెక్కియున్నది. గుడి లోపల గెండో ప్రాకారము బొత్తిగా శిధిల మయిన్నది. మంటపములు ఆ రీతిగానే యున్నవి. అర్చకులకు మనసు వచ్చినప్పుడు దీపారాధన, నైవేద్యములు స్వామికి చేయబడు చున్నవి. గాని నిత్య నియమము లేదు. బ్రాంహ్మణులు స్వేచ్చగా లింగమును తాకి అభిషెక నివేదనలు చేయవచ్చును. భ్రమరాంబా దేవికి మాత్రము మిరాశీ అర్చకులతరపున నొకడు నియమముగా గుడిలో కాపురముండి అర్చన చేయుచున్నాడు. అలాగు అర్చనచేసే గుమాస్తా సంవత్సరము ప్రాణము తోనుండుట దుస్తరము. అందుకు కారణము రోగప్రదేశమేనో, వానిభక్తి తక్కువేనో తెలిసినదికాదు. ఇప్పుడు 5 సంవత్సరములుగా రాజశ్రీభొట్లు అనే బ్రాహ్మణుడు 30 ఏండ్లవాడు ప్రాణముతో నక్కడ నిలచియున్నాడు. అది ఆశ్చర్యముగా నున్నది. అతడు ఏకాకి. ఆగుడి లింగము భూమికి జీనెడు పొడుగుగా నున్నది. విమానమునకు 4 శిఖరములు, అని నాలుగుపక్కల శిధిలము లయియున్నవి. నడమనున్న గొప్పశిఖరము దర్శనమునకు నుపయోగింపు చున్నది. ఆత్మకూరి దారిని వస్తే గుడిలో ప్రవేశించేవరకు శిఖరదర్శనము కానేరదు. నెల్లూరి కంభము మార్గములనస్తే గుడికి మూడుకోసుల దూరములోనున్న శిఖరేశ్వర మనేపేరు గలిగిన యున్నత ప్రదేశమునకు శిఖరము తెలియు చున్నది. ఆగుడివద్ద వశింపుచున్న చెంచువాండ్లు ఆత్మకూరి వారివలెనే మిక్కిలి కొవ్వినవారు. భ్రమరాంబ గుడికిన్ని, మల్లికార్జునస్వామి గుడికిన్ని సమీపమందే కొంచెపు మిట్టమీద శ్రీచక్రస్థాపన చేసియున్నది. గుడిలో 22 తీర్ధములున్నవి. ప్రతి తీర్ధమందున్నుకొండ వూట స్రవించి తీర్ధములము అంతర్వాహినిగా పారివచ్చి అవతల సాగి పోవుచున్నది. ప్రతి తీర్ధమునకున్ను సూర్యరశ్మి పడకుండా పైన మంటపాలు కట్టియున్నవి. ఏ తీర్ధమున్ను మోకాటిలోతుకు నెక్కువలేదు. రోగకారియని అక్కడివారు చెప్పినారు. ఉదకము నిర్మలముగా నున్ను, శీతళముగా నున్నది. ఆగుడిహాశ్శీలు మూలకముగా సంవత్సరము ఒకటికి 15000 కందనూరు నవాబుకు వచ్చినా, గుడి యేగతి పొందేదిన్ని విచారింపడు. ఏరయినా మరమ్మతు చేసినట్టయితే సెలమత హాశ్శీలు తీసుకొనుచున్నాడు. రాజా చందలాలా ఈనిర్బంధము చేత కొంత మరమ్మతుచేసి విసికి విడిచి పెట్టినాడు. అతను అర్గురు బ్రాంహ్మణులను నెల 1కి 3 రూపాయీలు జీతముచేసి నిత్యము స్వామికి అభిషేకము చేసేటట్టు వుంచినాడు. మహిషాసుర మర్ధనము మహినూరి దేశములో చేసినందున ఆదేశమునకు మహిసూరనే పేరు వచ్చినదను చున్నారు. అక్కడ మహిషాసుర మర్ధనమయినందున వెనుక భ్రమరాంబ శ్రీశైలము ప్రవేశించినది. మహిసూరు తద్ద్వారా ఆమె పుట్టిన దేశమని ఆ దేశస్థులు ఎవరు వచ్చినా హాశ్శీలు యియ్యనక్కరలేదు. జంగాలకు, ఆరాధ్యులకు, బ్రాంహ్మణులకున్ను ఉత్సవ కాలములో హాశ్శీలు లేదు. గుడిలో నే పక్క చూచినా అడివి ములిచి సర్ప వ్యాఘ్ర భూయిష్తముగా నున్నది. ఆ యడవి కొట్టి చక్కచేసే దిక్కులేదు. స్వామికిన్ని, దేవికిన్ని ఎవరయినా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించిరేని వాటిమదింవంత రూకలు హాశ్శీలు పుచ్చుకోనడము మాత్రమే కాకుండా కొన్ని దినములు పోనిచ్చి ఆ వస్తువులే ఆ కందనూరి నవాబు అపహరించు చున్నాడు. తిరుపతి విషయముగా కుంఫిణీవారిని "అహో గుణవతీ భార్యా భాండమూల్యం న యాచతే" అనే శ్లోకసంగతి ప్రకారము ఆ స్థలవర్తమానము తెలిసినవారు కొనియాడవలసియున్నది. కలి సామ్రాజ్యము గనుక లోకక్రమం సాక్షిగా నుండే యీశ్వరుడు లోకులకు కర్మఫలప్రదానము చేయుట కంటె ఎక్కువ యేమి చేయగలడు? ఇది నర్మజనపూజిత మయిన ప్రసిద్ధి కొనిన స్థలము. శిఖరదర్శన మాత్రము చేతనే జన్మాదులు లేవని పురా ణాలు మొరపెట్టు చున్నవి. యీ మహాస్థలము 3 ఘంటలకు వదిలి 4 ఘంటలకు దిగుడు గనుక త్వరగా భీముని కొల్లము చేరినాను. 6 4 ఘంటలకు పెద్దచెరువు చేరినాను. ఆ రాత్రి అక్కడ వచించి 21 తేది ఉదయమయిన 3. 4 ఘంటకు బయలువెళ్ళి 6 ఘంటలకు నాగులోటి చేరినాను. అక్కడ నించి భోజనోత్తరము 3 ఘంటలకు బయలుదేరి సాయంకాలము 4 ఘంటలకు బయలుదేరి సాయంకాలము 5 ఘంటలకు ఆత్మకూరు చేరినాను.

23 తేది 3 ఘంటలకు అక్కడనుంచి బయలివెళ్ళి కోసెడు దూరములో నుండే నందిగుంట అనేగ్రామము 4 ఘంటలకు చేరి వర్షో పద్రవముచేత అక్కడనే నిలిచినాను. భాట మంచిది. అయితే ముండ్లు విస్తారముగా నున్నవి. ఆ గ్రామము గొప్పది. భ్రాంహ్కణుల యిండ్లు, కోమట్ల యిండ్లు న్నున్నవి. సకల పదార్ధాలున్ను దొరుకును. దేవస్థల్లములున్నవి. ఆ దేవస్థలములో దిగినాను. 20 తేది ఉదయాన 3 ఘంటలకు బయిలుదేరి రెండామడ దూరములోనున్న నివృత్తిసంగమ మనే పుణ్యక్షేత్రము 21 ఘంటలకు చేరినాను. అది కృష్ణాతీరము. ఆ కృష్ణలో తుంగభద్రతో కూడా అయిదు నదులు అంతకు మొందే కలియుచున్నవి. భనాశిని అనే నదిన్ని ఆ స్థలమందు కలియుచున్నది గనుక అక్కడ కృష్ణానది అనర్గళముగా ప్రవహింపుచున్నది. వాసయోగ్యమైన ప్రదేశము. ఏటియొడ్డున ధర్మరాజ ప్రతిష్టితమైన శివస్థల మొకట్యున్నది. బృహస్పతి కన్యాగతు డయినప్పుడు అక్కడ అనేకవేల ప్రజలు వచ్చి కృష్ణపుష్కరాల యాత్ర చేసుకొని పోవుచున్నాదు. సకల పాపాలను నివృత్తిని పొందించే ప్రదేశము గనుక నివృత్తి సంగమ మనేపేరు ఆస్థలమునకు వచ్చినది. ఇరువది బ్రాంహ్మణుల యుఇండ్లున్నవి. కావలసిన పదార్దాలు ప్రియముగా దొరుకును. ఊరుకొండకింద నున్నది. అక్కడ కృష్ణ ఉత్తర వాహినిగా ప్రవహించు చున్నది. ఆ దినము వచ్చినదోవ మహా సుఖకర మహినది. ఎటువంటి ఋతువులోనున్ను సన్న గులక భూమి గనుక భాట ప్రతికూల మయ్యేది కాదు. అడివిలేదు. దోవలో అడుగడునకు గ్రామాదులున్నవి. జలవసతి కలదు. ఊరూరికి శిధిల మయిన కోట యొకటి కలిగియున్నది. అక్కడి గుళ్ళలో తంబలవాండ్లు అర్చకులుగా నున్నారు. కావలిసినవారు తామే పూజ చేయవచ్చును. ఆ యూరున్ను కందనూరు నవాబుతో చేరినది. ఆ కృష్ణ దాటడానికి మనిషికి ఇంతమాత్రమని హాశ్శీలు పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలానకు వెళ్ళేటందుకు నేను శూద్ర మనిషికి 1 కి ర్పూ 3 1/2 గుర్రనికి ర్పూ 3 1/2 అభిషేకానికి ర్పూ 1/2 బ్ర్రాహ్మణునికి అ 2, లెక్కనిచ్చినాను. కృష్ణ అక్కడ దాటవలసినది గనుక అక్కడ ఘాటు హాశ్శీలు ఒక పక్క కందనూరు నవాబుకున్ను ఒక్కప్రక్క హయిదరాబాదు వారికిన్ని యివావలసి యున్నది. ఆకృష్ణ యీవలి గట్టువరకు కందనూరి నవారియొక్క దొరతనమునకు లోబడిని దేశము. ఆవలిగట్టు మొదలు చేసుకొని హైదరాబాదు వారి రాజ్యము. తిరుపతి మొదలు ఆ యూరివరకు ప్రతి గ్రామమున కున్ను ఒక రెడ్డిన్నీ, ఒక కరణమున్ను ఉన్నారు. ఆ కరణాలు కొందరు నందవరీశులు, కొందరు ప్రధమ శాఖలు, కొందరు నియోగులు. ఈరీతిగా బ్ర్రాహ్మణులు ఆ యుద్యోగమును చూచుచున్నారు. కట్టుబడి బంట్రోతులని జీతానికి బదులుగా భూమిని అనుభవింపుచు కావలి కాచుకొని గ్రామాదుల సకల పని పాటలున్ను చూచున్నారు. పరువు కలిగిన ముసాఫరులకు కావలసిన సరంజామా సహాయసంపత్తు ఆ రెడ్డి కరణాలగుండా కావలసినది. ఆ యుద్యోగస్థుల నిద్దరినిన్ని నయభయముల చేత స్వాధీన పరచుకొంటేగాని మార్గవశముగా వచ్చే పరువుగల వారికి పనులుసాగవు. పరువుగలిగిన ముసాఫర్లు అధికారపు చిన్నెకొంత వహించితేనే బాగు. నిండాసాత్విక గుణము పనికిరాదు. మార్గము చూపించడమూకున్ను దిగిన తావున కావలసిన సామానులు తెప్పించి యివ్వడమునకున్ను రెడ్డి కరణాల యొక్క ఉత్తరవు ప్రకారము ఆ కట్టుబడి బంట్రోతులు పనికి వచ్చుచున్నారు. ఓంకార మనే స్థలమందలి తీర్ధములో నున్న జలమందు మునిగి క్షణమాత్రము తల యెత్తక నిలిపియుంటే ఓంకార నాదము వినిపింపుచున్నది. ఆనివృత్తిసంగమమునకు నేను వచ్చిన భాటలో అక్కడకు ఆమడ దూరములో ముసలిమడుగు అని యొక యూ రున్నది. అది పేటస్థలము, దిగేమజిలి, వసతియయిన గ్రామము. ఆ నివృత్తిసంగమములో నుండే అగ్రహారీకులకు భళ్ళారి జిల్లా శిరిస్తా చేసి యిప్పట్లో బోర్డు సిరస్తాగానుండే రామచంద్రరాయుడు ఒకకాలమందు అక్కడికి యాత్ర బోయి వాక్సహాయముచేసి ఆ యగ్రహారీకులు నవాబు సరకారుకు కట్ట్టుచునుండే పన్నురూకలను మాపుచేయించినారు. అనుభవించే భూమిని సర్వదుంబాలా చేశినాడు. గనుక అక్కడి ద్విజులు మేము చేసే సత్కర్మ ఫలము అతనికి చెందవలసిన దని చెప్పి కొనియాడుచున్నారు. కడప మొదలుకొని యిదివరకు జ్యేష్టమాసము మొదలు శ్రావణమాస పర్యంతము క్రమమయిన వర్షాకాలము. ప్రతి దినమున్ను మబ్బు, వర్షము కలిగియున్నది. కొండకింది గ్రామాదులలో గాలి కొట్టేటప్పుడు ఆ గాలి కొండలమీద మోది అతి ధ్వనితో బహువేగముగా సమీపమందు విసురుచున్నది. కొత్తవారికి ఆగాలి సహించడము ప్రయాసగా నుంచున్నది. తిరుపతి మొదలు కొని యెంత పాతబియ మని అంగటివాడు ఇచ్చినను కొత్తబియ్యము వలెనే అన్నము మెత్తపడుచున్నది; గనుక ఆ బియ్యము వాడికె బడేదాకా ప్రయాసగా నుండును. నాటు ఉప్పుడుబియ్యము ఆ ప్రాంతములలో బొత్తిగా దొరకదు. పేదలు జొన్నలతోనున్ను, అరికె యన్నముతోనున్ను కాలము గడుపుచున్నారు.

21 తేది మొదలు 24 తేది మధ్యాహ్నపర్యంతము తీర్ధ విధి మొదలయిన పితృక్రమములు చేయడానికు అక్కడ వుండి 12 ఘంటలకు భోజనము చేసుకొని బయలుదేరి 2 కోసెడు దూరములో నుండే సిద్ధేశ్వరం ఘాటుకు పోయినాను. ఆ 2 కోసున్ను కొండమీద నెక్కి నడిచి కొండ తిరిగి పోవలసినది. దారి రాతిగొట్టు ఎక్కి దిగుచు నడవలసినది. అక్కడ కందనూరు వారిది యొక పుట్టి యున్నది. నలుగురు బోయిజాతి మనుష్యులు ఆ పుట్టిని తెడ్లతో తోసిగడుపు చున్నారు. ఆ పుట్టి - అనగా పెద్ద వెదురుగంప; 20 మంది కూర్చుండవచ్చును. పయిన చర్మముతో కవచము కుట్టియున్నది. బహుసున్నితము. రవంత ద్వారము పడితే ప్రమ్మదము వచ్చును. ఒక్ పల్లకీనిన్ని 12 మంది బోయీలనున్ను ఒక ఇడతకు దాటించినారు. అవతలిగట్టుకు పోయి రావడానికి 24 నిముషాలు పట్టుచున్నవి. దాని తావున నదికి నిరుపక్కలా కొండలున్నవి. తద్వారాగాలితోను విస్తరించి ఆఘాటుకు లేదు. గనుక ఆఘాటు ఇతరములయిన ఘాట్లకన్నా నది దాటడానికి క్షేమకరము. నాలుగు ఘంటలకు నాసరంజామాతో గూడా అవతలిగట్టుకు పోయి అక్కడ హాశ్శీలు సవారీకి రూపాయిలు 5ద్ను, గుఱ్రానికి 2 రూపాయిన్ని, శూద్రులకు స్వల్పముగా నున్ను యిచ్చి ఆగట్టువలేనే నిజాం యిలాకా వారికిన్ని యిచ్చి 4 ఘంటలకు బయలుచేరి అక్కడికి మూడుకోసుల దూరములో నుండే పెంటపల్లి అనే గ్రామము 3 ఘంటలకు చేరినాను. డారి కొండలనడమ బోవుచున్నది. అందులో 2 కోసులదూరము రాళ్ళమయమయిన కనమ. అది దాటిన వెనక నొక కోసెడు దూరము వెల్లడిగా, భాట బాగుగా నున్నది. ఆ గ్రామములో విశాలమున్ను, సుందరము న్నయిన వెంకటేశ్వర దేవాలయ మొకటి యున్నది. ముసాఫరులు దిగడానికి ఇదే యిండ్లకన్నావసతిగా నున్నది. బస్తీ గ్రామము 20 కోమటి యిండ్లున్నవి. సకల పదార్ధములున్ను దొరుకును. ఆగ్రామము హయిదరాబాదు రాజ్యములో చేరినది. అయినా హయిదరాబాదు నవాబు క్రింద అనేక జమీనుదారులున్నారు. గనుక కొల్లపురపు జమీనిదారునితో ఆ గ్రామముచేరియున్నది. ఆ జమీందారులు క్లుప్తమయిన రూకలు కట్టి సకల రాజ తంత్రములున్ను తమ తమ జమీనుదారిలో స్వతంత్రముగా జరిపింపుచున్నారు. సేవా సయాయ సంపద ఎక్కువగల జమీనుదారుడు క్లుప్తమయిన రూకలిచ్చుటలేదని చెప్పుట కలదు. అప్పుడు హయిదరాబాదు వారు దండెత్తి కొట్టి సాధించి రూకలు తీసుకునుచున్నారు. ఆ జమీనుదారులకు ఒకరి కొకరికి సరిపడక వచ్చినట్టయితే పోట్లాడి చావడముమాత్రమే కాకుండా ఒకరి గ్రామాదులను ఒకరు కొల్లపెట్టి రహితులను హింసించి గామాదులను పాడు చేయుచున్నారు. ఈలాగున కలహములు పొసగినప్పుడు న్యాయము విచారించి యొకరి కొకరికి సమ


' రస పెట్టకుండా దివాన్ జీతనము చేసే చందులాలా ప్రభృతులు ద్రవ్య కాంక్ష చేత నుభయులకున్ను కలహమును పెంచి వేడుక జూచుచున్నారు. ఈలాటి ప్ర్రారబ్దము నా ప్రయాణకాలములోనే వనపత్రి జమీను దారునికినీ కొలాపురపు జమీనుదారునినిన్ని ఒక సంవత్సరముగా పొసగి తహతహపడుచున్నది. నెను ఆ పెంటపల్లి కోటలో హయిదరాబాదు నవాబువారిది కొంత ఫౌజు ఉన్నందున నయభయాలచేత ఆ ఖిల్లాదారుని స్నేహితుని చేసుకొని జవానులను కొందరినికూడా తీసుకొని 23తేది ఉదయాన 4 ఘంటలకు ప్రయాణమై 2 కోసుల దూరములోనున్న పానగల్లు అనే ఖిల్లాగ్రామము 1-2 ఘంటలకు చేరినాను. 3 కోసుల దూరమునకు వెనక తుమ్మగుంట యనే గ్రామమున్నది. అది మొదలు కుంపిణివారు హయిదరాబాదుకు లష్కరు వెళ్ళడానకు నెర్పరచిన భాట. అంతకు లోగడ దువ్వూరు మొదలుకొని ఆ తుమ్మగుంట వరకు శ్రీశైల యాత్ర నిమిత్తమై నేను కల్పించుకొన్న భాట. ఆ పెంటపల్లెకు పోయిన వెనక హయిదరాబాదుకు వెళ్ళను అనేక భాటలను లోకులు చెప్పుదురు. వాటిలో కొత్తకోటభాటను అందరు సాధారణముగా ముఖ్యమని చెప్పుదురు. అది చుట్టుగానున్ను, ప్రయాసమైన మార్గముగా నున్నది. ఆ తుమ్మగుంటవరకు భాట వెల్లడిగా సరళమయినదిగా యిసకపరగా నున్నది. అది మొదలుకొని పానగల్లువరకు చిన్నచిన్న కొండలపక్క పార్శ్వములలోనుంచున్నది. అపానగల్లు కొండకింద నున్ను, కొండమీద విశాలమైన దుర్గమున్నది. ఆగ్రామమున్ను, దానితొ చేరిన మరికొన్ని గ్రామములున్ను డేరాల దారోగాకు జాగీరుగానిచ్చినారు. గ్రామము బస్తీగాకపోయినా యింగీలీషుల ముష్కరుకు సరంజామాచేసి వాడికె పడినది గనుక ముసాఫరులకు కావలసిన వస్తువులు దొరుకుచున్నవి. ఇండ్లు మిక్కిలి కుసందిగా నున్నవి. చావళ్ళు గలవు. బ్రాంహ్మణులు నిండా పారమార్ధికులుగారు. ఆ రాత్రి అక్కడనే నిలచినాను.

23 తేది ఉదయాన 4 ఘంటలకు బయలునెళ్ళీ 12 ఘంటలకు 3 కోసుల దూరములోనుండే చిన్నమంది అనే గ్ర్రామము చేరి నాను. 3 కోసుల దూరమునకు వెనక వనపర్తి అనే జమీనుదారి కసుబాగ్రామము ఖిల్లా సహితముగా సంస్థానపరువు కలిగియున్నది. పానగల్లునించి తెచ్చిన జవానులను మార్చడమునకు 2 గంటలసేపు అక్కడ నిలిచినాను. వనపత్రి 2 ఘంటలకు చేరినాను. దోవ యిరుప్రక్కలా అడివి కలిగియున్నా దారి సన్నయిసుకపరగా బాగాఉన్నది. మృగభయము లేదు. వనపత్రివరకు కొండలనడమ భాటపోయినా రాతిగొట్టుకాదు. ఆ యూరున్ను రహదారి అయినందున ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. ఊరూరికి కోటలు వుండడము మాత్రమే కాకుండా హయిదరాబాదువారి రాజ్యములో ఊరూరుకి ఒక జమీదారుడున్నందున శిబ్బందికి జీవనము కలగడమొక్కటేగాని, రహితులకు న్నితరులకున్ను క్షేమములేక ప్రాణభయముతో సదాకాలము తోయుచు నుండవలసి యున్నది.

కుంఫిణివారు మజిలీపట్టీలు వారి పంచాంగములో వ్రాయుచువచ్చుచున్నారు. గ్రామాదులపేళ్ళు అడిగితే అట్టి గ్రామమే దారిలోలేదనుచున్నారు. గ్రామదుల దూరమును కొన్ని ప్రకరణములలో తప్పివ్రాసినారు. ఇందుకు సందేహములేదు.

ఆచిన్నమంది అనేవూళ్ళో వసతి యయిన చెరువు కట్టమీద నీడయివ్వగల చెట్లున్నవి. ఇండ్లలో దిగడానకు స్థలముచాలదు గనుక చెరువుకట్టమీదనే వంట చేసుకొని భోజనము చేసి 2 ఘంటలకు బయిలువెళ్ళి అక్కడికి 4 కోసుల దూరములోనుండే గణపురము సాయంకాలము 3 ఘంటలకు చేరినాను. ఆగణపురానికి వెళ్ళేదోవలో చోళపురము, మొనోజీపేట అనే రెండూళ్ళున్నవి. మనోజీపేటవరకు భాట కిరుపక్కల దట్టమయిన అదివి భాట విశాలముగానున్ను, గులక యిసుక పొరగానున్ను నడవడానికి వైపుగానున్నది. భాట కిరు పక్కల కొంతదూరములో చిన్నతిప్పలున్నవి. మనోజీపేట అనే వూరు బస్తీ అయినది. దేవాలయమున్నది. కొంత దూరములో కొండమీద వెంటెశ్వర స్థలమున్నది. ప్రసిద్దమయిన దేవస్థలము. ఆ మనోజీపేటకు సమీపాన నీడ గల యొక తోపు సుందరుముగా నున్నది. అక్కడికి సమీపముగానే బంగారురంగు అనే పేరు కలిగిన యొక సోగసయిన గుండు ఒక తిప్ప కొన యందున్నది. చూపుకు ఆతిప్పగుండు పానపట్ట సహితమయిన లింగాకారముగా నగుపడుచున్నది. ఆ మనోజిపేట మొదలుగా గణపురము వరకు కొండలనడుమ భాట పోయినా రాళ్ళు లేవు. అది గులక యిసక పొరగా నున్నది. ఆ గణపురము జాగీరు గ్రామము. కొండకింది యూరు, కొండమీద దుర్గము, కోట, మజుబూతి(గట్టి)గా కట్టి యున్నది. బస్తీగ్రామము. 20-30 బ్రాహ్మణులయిండ్లునా చిన్నవి గనుక స్థలము దొరకడము ప్రయాస. చావిళ్ళున్నవి. అన్ని పదార్దాలు దొరకును గాని నీళ్ళకు బహుప్రయాస. బావులు లోతుగా నుండడమే గాక జలము ఉప్పుగా నున్నది. మంచినీళ్ళు బహు దూరముగా వెళ్ళి తెచ్చుకొనవలసినది. ఆ రాత్రి అక్కడ నిలచినాను.

27 తేది ఉదయాన 4 ఘంటలకుప్రయాణమై 11 ఘంటలకు 3 కోసుల దూరములో నుండే జడచర్ల అనే యూరు చేరి నాను. దారి యిసుకపొర. ఆ నడమ మూలకర్ర, కోటూరు, ఆలూరు అనే గ్రామాలు న్నవి. ఆలూరివరకు అడివినడమ భాట. ఆలూరుమొదలుకొని అడివిలేదు. దారిలో జలసమృద్ది గల బావులు, చెరువులు న్నున్నవి. పరిపొలాలు పొలకట్లు తీర్చియున్నవి.

కృష్ణానది దాటినదిమొదలు శెషాచలపర్వతము అదృశ్వమయినా అడుగడుగుకు చిన్న చిన్న పర్వతాలున్నవి. సృష్టిచేసిన పరమాత్ముడు ఆ కొండలు రాతిమీద రాయిని అతికియుంచినట్టుగా నొక కొండమీద నొక బండ యిమడక దొర్లునని తొచిన తావులలో పలకవంటి రాళ్ళను కొల్లేరులో చెక్కి చక్కచేసినట్టు ఉంచి యిమిడిచి యున్నవది. ఆ కొండల సమూహములను జూడగా భూమిని మొక్కాలు వాశి పర్వతమయముగా భగవంతుడు చేసినట్లు తోచుచున్నది. అన్ని పర్వతములను సృష్టించ డానికి ముఖ్యకారణ మేమని యోచించగా నీ భూగోళము ఉదకబుద్బుదము గనుక భూమిని స్థావరదశను పొందించేటందుకు ఈ పర్వతసమూహములను సృస్టించినట్టు తోచబడుచున్నది. పరమాత్ముని యొక్కలీలావిభూతియయిన యీవిచిత్ర పర్వత సమూహములున్ను నానావిధములయిన వృక్షాలున్ను కలిగిన అరణ్య సమూహాలు చూడగా బుద్ధి ఆశ్చర్య పడడానికి చాలియున్నది గాని ధృడమయిన భక్తిని పొందచాలక నున్నది. ఆపగలు అక్కడ నిలచినాను. ఆయూరు బస్తీయయినది. సంపన్నులయిన కోమటివసతి గదులున్నాయి. దేవస్థలమున్నది. అందులో దిగవచ్చును. రమణియ్యమైన కొలను వున్నది. అదిచుట్టు మంటపాలతో నేర్పరచ బడియున్నది. సకల విధవస్తువులు దొరుకును. ఆయూరున్ను ఇంకా36 గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. 3 లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడు12 సంవత్సరముల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.

21 తేది ఉదయమయిన 5 ఘంటలకు లేచి 3 కోసుల దూరములోనుండే నాగనపల్లె, బాలనగర మని రెండుపేళ్ళుకలిగిన యూరు10 ఘంటలకు చేరినాను. దారిమిక్కిలి సరాళము. గులక అయిసక కలిగిన రేగడభూమి. నడవ డానికి బండ్లకు మిక్కిలి సయిపుగా నున్నది. ఆయూరికి చుట్టున్ను కోట యున్నది. అది బాలచందు అనేముసద్దికి జాగీరుగానివ్వబడినది. అతడు బహుధర్మాత్ముడని పేరుబడి యశ:కాయముతో ఇప్పటికి జీవింపు చున్నాడు. అతనికి మొగసంతులేదు. అల్లునికి జాగీరు నదుచుచున్నది. ఆకోటనున్ను, గ్రామమునున్ను బహుబస్తీచేసియున్నాడు గనుక ఇదివరకు చూచిన యనేకములయిన కోటలలో ఈకోట గచ్చుచేసి చూపుకు బాగా ఉన్నది. బహుబస్తీ గ్రామము ఆ గ్రామములో నుండే యొక ఆడమనిషి అక్కడ ధర్మ శాలయని వాడుకొనే యొక సత్రము కట్టియున్నది. తిరుపతి వదిలిన వెనుక సత్రమనే మాట యిక్కడ విన్నాను. బాలచందు 2 దేవాలయములు హరి హరాదులకు చేర్చి యొకటిగా కట్టి తోపువేసి సమీపమందు అగ్రహారముకట్టి యిచ్చివాటికన్నిటికిన్ని జీవనానికి పూర్తియయిన భూవసతి యేర్పచినాడు. అక్కడ భొజనము చేసుకొని 3 1/2 ఘంటలకు బయలు దేరి 3 కోసుల దూరములో నుండే జానంపేట ఫరక్కూనగర మని రెండు పేళ్ళుకలిగి బస్తీ బజారువీధి కలిగియున్న గ్రామము 5 1/2 ఘంటలకు చేరినాను. ఆ యూరు తురకలతో నిండియున్నది. ఒక గోసాయిచావడి గుడికి అంతర్భూతముగా నున్నది. దిగడానికి అదిన్ని, చావిళ్ళును తప్పవేరే యిండ్లలో స్థలము దొరకదు. నీళ్ళకు బహుప్రయాస, లోతుగల బావులు ఊళ్ళోఉన్నా మంచి యుధకము కాదు. దూరమునించి మంచినీళ్ళూ తెచ్చుకోవలసినది. పానగల్లు మొదలుగా ఆయూరివరకు బాట గుర్రపుబండ్లు వచ్చేపాటి విశాల మయి చక్కతనము గలిగియున్నా బాలనగర మనే యూరిముందర కొంచము రాతిగొట్టు. మిగతభాట బహుసరాళముగా నున్నది. పల్లములలో దిగి మిట్టలెక్కుచు భాట సాగిపోవలెను. సాధారణ మయిన యడవినడమ భాట పోవుచున్నది. ఆ జానంపేట వద్ద నొక కోటయున్నది. కడప వదిలిన వెనుక అప్రయత్న పూర్వకముగా శాకములు అక్కడి అంగళ్ళలో దొరకుచున్నవి.

ఈదేశాటనము ఛేసుటవలన దేహమునకు లాఘవము కలుగుట యనే లాభ మొక్కటి మాత్రమే కాక ద్రవ్య సాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రమే కాక ధ్రవ్యసాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రము దొరికినా అవి అపూర్వము లైనందున జీవాత్మునికి మిక్కిలి ప్రియ భొజ్యములుగా నుంచున్నవి. నానావిధ స్వభావములు కలిగిన మనుష్యులు ఇతర దేశపు జంతువులనున్ను, స్థావరములయిన శిలా వృక్షాదులనున్ను చూడడము జన్మాంతర సుకృతముచేత నొకవేళ భక్తి కలుగుటకు కారణము గావచ్చును. ఆ రాత్రి ఆ గ్రామమందు నిలిచినాను.

29 తేది ఉదయాన 4 ఘంటలకు ప్రయాణమై 6 కోసుల దూరములో నున్న షాపుర యూరు 10 ఘంటలకు చేరినాను. దోవలో పాలమాకుల యనే జలసౌఖ్యము గల గ్రామము మున్నది. ఆ పాలమాకుల వరకు భాట సరాళము. కొంత కొంత దూరము రాతిగొట్టుగా నున్నది. హలచలక వదిలిన వనక పర్వత సమూహముల దర్శనము దారిలో నిదివరకు లేదు. సాధారణమైన యడవినడుమ భాట పోవుచున్నది. ఆ గ్రామములో దిగి వాడికెపడిన మామిడితొపు జలవసతిగా నున్నందున అక్కడ భోజన మునకు దిగినాను. గ్రామమందు కావలసిన పదార్ధములు దొరకును గాని దిగను స్థలమివ్వరు. ఆత్మకూరు మొదలుకొని దిగడానకు దేవస్థలములుంటేనే వయివుగాని యండ్లలో స్థలమివ్వరు. ఇచ్ఫేపాటి విశాలమయిన యిండ్లులేవు.

ముసాఫరులు పరువు కావాలంటే డంభము వహించవలెను. ఆ డంభమునకు తగిన దాతృత్వము లేకుంటే లోకులు సంతోషింపరు. ఇంతే కాకుండా దోవలో విషయభోగములు నెక్కువగా ఆపేక్షించే కొద్ది వ్యసన మొక్కువౌచున్నది.

దూరప్రయాణము బోను మేనా సవారీలు తీసుకొనివచ్చేవారు సవారీలకు దండను ఆసరాచేసి కిందను మీదను 4 ఇనపకమ్ములు బిగియింఛి యిస్కూలు చీలలు కొట్టక మునుపు బలమయిన మూలతగుళ్ళు కొట్టించి ఆ తగుళ్ళలో ద్వారములు చేసి వాటిలో యిస్కూలు చీలలు బిగియించవలెను. అటు చేయనందున నా బంగాళాపాలకీ దోవలోమోసుకొని వచ్చునప్పుడు ఆ చీలలు కొట్టిన తావున పలక చీలి పల్లకీ కిందపడుచు నుండెను. చీలిన చప్పుడు వినగానే నాబోయీలు పల్లకీని దిగువ దించినారు. దోవలో బావులు లోతుగా నుంటే నీళ్ళు చేదుకోవచ్చు నని తెచ్చిన సీమ సన్నతాడు 20 బారలది వద్దనుండగా పయిన 4 కట్లున్నూ చట్టానికి దిగువ 4 కట్లున్ను చుట్టు బలముగా వేసి ముందు దండెకున్ను వెనక దండెకున్ను దిగువ ఛట్టముగుండా మూడు కట్లువేసి బిగించి ఇదివరకు భగత్కటాక్షము చేత ఆ పల్లకీ మీదనే సవారీ అయి వచ్చినాను కాబట్టి పల్లకీసవారీ అయి వఛ్ఛేవారు కొన్ని తాళ్ళు చాలక దోవలో నెక్కడ విచారించినా తాళ్ళు దొరికినవి కావు గనుక సాగ నార నివృత్తిసంగమ మనే గ్రామములో తీసి బోయీలచేత తాళ్ళు పేడించి కట్టించినాను.

యింతే కాకుండా పనివారసమేతముగా దూరదేశము పొయ్యే వారు దారిలో అస్వస్థపడే పరిజనము ఆటంకపడి నిలవకుండా సాగి రావడానికి దినానికి 3 ఆమడ దూరము నడవగల యొక గుఱ్ఱపు తట్టున నున్ను 4 బోయీలలో నొక తేలికయయిన సామాన్యపు డోలీ నిన్ని కూడా తీసుకొని రావలసినట్టుగా నా యనుభవము నాకు తెలియ చెప్పినది. అదే ప్రకారము తిరుపతిలో రూ.23 కి ఒక గుఱ్ఱపుతట్టువను తీసి కూడా తెచ్చినాను. అందరున్ను ఆరొగ్యముగా నుండే కాలములో తట్టువ మీదనున్ను డోలీలోనున్ను కావలసిన భోజన సామానులను అధికముగా చెయికావలికి వెసుకొని పోవచ్చును.

యింకా నా యనుభవము వలన తెలియవచ్చినది యేమంటే సపరివారముగా దేశము తిరిగేవారు చికిత్స చేసే క్రమము యధోచితముగా తెలిసిన వారిని కూడా పిలుచుకొని తగుపాటి యౌషధములు కూడా తీసుకొని పోవలసినది. ముఖ్యముగా అజీర్తికి జ్వరమునకు వ్రణాలకు గాయములకున్ను ఔషధాలు తీసుకొని పోవలసినది. ఆ ప్రకారముగానే నేను తెచ్చి నా వద్దనుండే ఔషధాలు నా బుద్ధిస్పురణద్వారా నాతో కూడా వచ్చిన వారికె ఇచ్చుచు వచ్చినంతలో భగవత్కటాక్షముచేత నా పరివారానికి వచ్చిన యుపద్రవములు నివారణ మవుచు వచ్చినవి. కూడా వఛ్ఛేవారికి నొక విధమయిన నిర్బయమున్ను తోచి యుండను. శీమమైనపువత్తు లెంత భద్రముగా నుంచినా తునకలుగా పగులు చున్నవి గనుక బంగాళా నాటువత్తులే దారికి యోగ్యము లని తెలుసుకొన్నాను. అణాలు, అర్ధణాలు, పావులాలు చెన్నపట్టణపు దుడ్లు కడప విడచిన వనుక దొరకవు. కూడా తెచ్చియుంటే వెండినాణ్యములు మాత్రము పనికివచ్చుచున్నవి. కృష్ణ కవతలి పయిసాలు కృష్ణ కీవల పనికిరావు. కృష్ణకు నుత్తరమున అణాలున్ను పనికిరావు.