Jump to content

కాశీయాత్ర చరిత్ర/నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మనిషికి రెండేసి పయిసాలువంతున పుచ్చుకొను చున్నారు. యీఠాణావారు పాంధులను కాపాడే వారివలె అభినయించడమే గాని వేరుగాదని తెలిసియుండ వలసినది. ఈ జగనంపల్లెలో రెండు చిన్న దేవాలయాలున్నవి. రమణియ్యమైన స్నానఘట్టము కలిగిన చెరువున్నది. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధములు దొరుకును. బ్రాంహ్మణుల యిండ్లలోనే దిగి నాను. యిక్కడికి 4 మజలీల దూరములో వేములవాడ అనే మహాక్షేత్రమున్నది. అది భీమేశ్వర రాజేశ్వరక్షేత్రము. వేములవాడ భీమకవి జన్మప్రదేశము. ఈ ప్రాంతములో వ్యాఘ్రాలు పశువులను అప్పుడప్పుడు భాధింపుచున్నవి. ఆ రాత్రి జగనంపల్లెలో నిలవడమయినది.

నాల్గవ ప్రకరణము

28 తేది ఉదయమున 6 ఘంటలకు ఆ యూరువదిలి 12 ఘంటలకు అక్కడికి 6 కోసుల దూరములో నుండే దూదుగాం అనే ఊరు చేరినాను. అది గోదావరీ నదీతీరము. ఆరు భ్రాంహ్యణుల యిండ్లున్నవి. గోవదావరి కవతలి గట్టున స్వర్ణ అని చెప్పబడే భ్రాంహ్మణుల యిండ్లు గల యగ్రహారమున్నది. ఆ దినము నడిచిన భాట సరాళము, యిసకపొర, నిండా అడివి లేదు. జగనంపల్లె నుంచి యీదూదుగాముకు రెండు మూడు భాటలు కలవు. అందులో నేను వచ్చినభాట కొంచము చుట్టయినా వసతి యయునది. ఆర్మూరు అనే బస్తీ గ్రామము జగనంపల్లెకు 2 కోసుల దూరములో నున్నది. ఆయూరి మీదనొక భాట పోవుచున్నది. అది వసతి కాదు. జగనంపల్లెకు 4 కోసుల దూరములో బాలకొండ యనే గొప్పగ్రామము షహరువలెనే బస్తీగానున్నది. యేరస్తాగుండా జగనంపల్లెనుంచి వచ్చినా యీ బాలకొండ నడివీధిలో నడిచి రావలసినది. నేనువచ్చిన భాట శీదాగా బాలకొండకు మధ్య యేయూరున్ను తగలకుండా వచ్చుచున్నది. హయిదరాబాదు వదిలినది ఏనుగుల వీరాస్వామయ్య గారి

మొదలుగా పాలు, పెరుగు మాత్రము తంబళజాతి వారిగుండా ఊరూరిలో సమృద్దిగా దొరకును. కూరగాయలు మాత్రము ఈబాలకొండలో కండ్ల చూడవలసినదిగాని మధ్యదొరకవు. ఈయూరికి 3 కోసుల దూరములో రామనపేట అనే యూరున్నది. అక్కడ మేనాసవారీలు గంజీఫాచీట్లు ఇవి మొదలయినవి చేసి హయిదరాబాదుకు తీసుకొనిపోయి అమ్ముచున్నారు. యీ యూరిలో జీనిగెలవాండ్లు అనేకులు ఉపపన్నులుగా నున్నారు.

ఈదేశములో కంబళ జాతివారు పుష్పాలు, పాలు, పెరుగు తెచ్చి యిచ్చి మేళాలు వాయింపుచున్నారు. మంగలజారివారు మషాల్ వేయుచున్నారు. బాలకొండకు ఇవతల కొసెడు దూరములో మూకలా అనెచిన్నగ్రామము; అదిదాటి యీదూదుగాముకు రావసినది. యిదినిండా బస్తీ అయినది కాదు. ఆర్మూరు పరగణాతో చేరినది. పట్టేలు గుమాస్తా ఉన్నాడు. నది దాటీంచే పుట్ల విచారణకర్త వాసముగా నున్నాడు. ఈయూరికి అవతలు తట్టున నుండే యూరు మాధ్వుల మయము. వారే తీర్థవాసులు. స్మాత్రులు నది యిండ్లవారు ఈ రెండూళ్ళలో నున్నారు. కావలసిన పదార్ధాలు యధోచితముగా దొరుకును. యీ దూదుగాముకు ఉభయపార్శవాలలో షహరులవంటి గ్రామాలు రెండున్నది. ఒక పక్క బాలకొండ సరేగదా' గోదావరి నదికి అటుపక్క నిర్మల అనే షహ రొకటి యన్నది. ఈ రెండు స్థలములలో పట్టణములలో దొరికేలాగు సకల వస్తువులు దొరుకును. యీదలవాయి మొదలుగా దూదుగాము వరకు భాట యోగ్యముగా నున్నది. అడుసువల్ల, రాతిగొట్టువల్ల ప్రయాస నిండాలేదు. ఈగోదావరి తీరమందు తీర్ధవిధులు మొదలయినవి చేయడానికు 4 దినములు ఉంటిని. హయిదరాబాదులో నున్న మట్టుకు అన్ని, దినములు అక్కడ వృధాగా నిలవవలసి వచ్చెగదా అనేవ్యసనము చాలావుండెను. ఇప్పుడుతర్వ్యతిక్తముగా మనస్సుకు బోధ అయినది. ఏలాగంటే అక్కడ నేను నిలిచియున్న సుమారు 20 దినములున్ను ఈప్రాంతములలో క్షోణీపాత మయిన నష్టము, ఇరిగింటి మనిషి పొరిగింటికి పోకూడ కుండా కురిసినందున చెరువులు కాలువలు పుష్కలముగా నిండినవి. ఆ వర్షాకాలములో నేను ఈ గ్రామాలలో తగిలి నట్టయితే మిక్కిలి ప్రయాస పడుదును. అటుగాకుండా శ్రీరాముల దేమో నన్ను కొన్ని కారణాలచేత హయిదరాబాదు షహరులో నిలిపినదీన్నికాక, షహరు విడిచి ప్రయాణమైన వనుక కూడా, ప్రతిదినమున్నూ నేను మజిలీచేరి భోజనము చేసిన వెనక సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు వర్షము కురిసి వెలిసేటట్టు కటాక్షింపుచు వచ్చెను.

హయిదరాబాదు వదిలింది మొదలు ఈగోదారి తీరము వరకు నడమనుండే జమీను దారులు, జాగీరుదారులు పరగణాదారులు, షహరుకు ఆపక్కనిండెవారిపాటి బలాడ్యులున్ను కలహప్రియులున్ను కారు. యధోచితముగా రహితు జమాబందిమీద రూకలు వసూలు చేసే జ్ఞాపకము యీప్రదేశపు వారికి ఉన్నది గాని, షహరుకు అవతలితట్టు వారివలె ఊరూరికి కోటలు, కొత్తళాలు, బలముచేసి గ్రామాదులను పాడుచేయడములేదు. కృష్ణదాటినది మొదలుగా ఈగోదావరీతీరమువరకు యిక్కడివారు వాడే కోసు, మన 14 గడియ దూర మవుచున్నది. యిది హల్కాకోసు అనుచున్నారు. కృష్ణకు అవతలిగట్టు పర్యంతము వాడే కోసు, మన రెండుగడియల దూర మవుచున్నది. యిక్కడి కోసు 2 మయిళ్ళుకు కొంచము తక్కువనే చెప్పవచ్చును. నేను మనకోసుల ఉమారే చూచి వ్రాయుచు వచ్చుచున్నాను. మనగడియ దూరం 24 నిమిషాలకు నడవ వచ్చును. గనుక ఆ నిజామున ఊహించి, ఆ యూ యూరికిగల దూరమును నిర్ణయించి వ్రాయుచు వచ్చుచున్నాను. ఇక నున్నూ అట్లాగే వ్రాయడ మవుచున్నదని తెలియవలసినది.

ఈ గోదావరీ తీరమువరకు ఆ యా మజలీ గ్రామములలో తమలపాకులు దొరుకుచు వచ్చినా మంచివిగా నుండవు. గనుక దిగిన మజిలీ గ్రామాదులలో తమలపాకు లున్నచోటు విచారించి తోటలవృద్దికి మన సంతమనుష్యులను పంపించి లేతవిగా గిల్లించి సంగ్రహించు కొనుచు వచ్చినట్లయితే అనుకూలముగా నుంచున్నది. హయిదరాబాదులో గొప్పవారందరున్ను పండుటాకులు వేసుకొనుచున్నారు. యీదలవాయిలో తమలపాకులు బహునయము. బాలకొడలో పండటాకులు దొరుకును. కడప మొదలుగా యీ గోదావరీ తీరమువరకు అమ్మే వక్కలు ముడి వక్కలు రెండుగా వొత్తి ఉడక బెట్టినవి కావు; మంచిదిగా ఏర్పరచివొత్తివేసుకొంటే మనదేశపు వక్కలకన్నా బాగా రుచిగా ఉంచున్నవి. యీదేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవడము లేదు; ఒక్కలు మాత్రము నవులుతారు. శూద్రుల చేతి హుక్కాలు ఇతరులు తాగుచున్నారు.

కృష్ణదాటినది మొదలుగానున్న ముఖ్యముగా హయిదరాబాదు మొదలుగానున్ను, ప్రతిమజిలీ యూళ్ళలో బియ్యముతోటి పాటు తియ్యగానుండే గోధుములపిండి విసిరి అమ్ముచు వచ్చుచున్నారు. యీదేశములో రొట్టె వినాగా అన్నమే భుయింపుచు వస్తే దేహానికి బలము లేదని వదైంతి గనుక, మే మొకపూట రాత్రి అన్నముతో కూడా రొట్టె తీసుకొనుచు వచ్చుచున్నాము. అది ఆరొగ్యము గానే యున్నది.

పై జగనంపల్లె నుంచి కుళదర్పణ మనే గోదావరీ తీరపు రామక్షేత్రానికి దారి పోవుచున్నది. ఆక్షేత్రము ఇమ్మడికి 4 కోసుల దూరము. నాగపూరి దారికి వొత్తియుంచున్నది. అక్కడ అనేక బ్రాంహ్మణులు తీరవాసమని యిండ్లు కట్టుకొని యున్నారు. ఈదూదుగాము నదికి గడియదూరములోనున్నది. యిక్కడ స్నానఘట్టము వసతికాదు; నీడలేదు. నది యిప్పట్లో పూర్ణ ప్రవాహముగా నున్నది. ఇక్క్డసుమారు నది గడియదూరము వెడల్పుకలది. నది నడమ కొన్ని లంక లున్నవి.

కడప వదిలినది మొదలుగా అరవభాష తెలిసి మాట్లాడ తగినవారు సకృత్తుగానున్నారు. తెనుగుమాటలు సర్వసాధారణముగా రాగసరిళిగా చెప్పుచున్నారు. ప్రశ్నపూర్వకముగా ఉత్తర ప్రత్యుత్తర మెచ్చేటప్పుడు శబ్దములను సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్లాగంటే యీ యూరు ఆయూరికి ఎంతదూరమంటే నాకు యేమి యెరుక యని ప్రత్యుత్తరము పుట్టుచున్నది. పండుకొన్నాడు అనడానకు పండినాడని అనుచున్నారు. హిందూస్తాని తురకమాటలు తరుచుగా దేశ భాషలయినందున ఆమాటలు తెనుగుభాషలో గలిపి మాట్లాడుచున్నారు. ఈదేశములో ఈగలు బహు బాధపెట్టుచున్నవి. వర్షా కాలమయి నందున యిటు విస్తారమయిన దని చెప్పుచున్నారు.

కృష్ణ మొదలుగా గోదావరివరకు డ్రావిళ్ళు లెరుగదా? ఆంధ్రులుగా నుండే బ్రంహ్మణులందరు సగోత్రముగాక ఋషిప్రవనర కలియక పొయి నట్టయితే మధ్యదేశమువలె వెలనాడు, కాసలనాడు అనే తెగలు విచారించక సంబంధములు చేయుచున్నారు. లౌకీకులను వ్యాపారులను చున్నారు. మధ్యదేశపు సిద్ధాంతి పంచాంగముతో ఈ గొదావరీ తీరములో నుండే అనేక సిద్ధాంతులు గుణియించిన పంచాంగాలను సరిపెట్టినాను. తిది వార నక్షత్ర యోగ కరణములు అహ: ప్రమాణములు అరగడియ యేక్కువ తక్కువగా సరిపడుచు వచ్చుచున్నవి. యీదేశ పంచాంగములో శూన్యతిధులు, తిధిద్యయాలు వ్రాయడము లేదు. తద్ద్వారా పంచాంగపు వారి మూడ్యముచేత తిధులు ముణిగిపోవుచున్నవి. వైదికులు పాగా, చొక్కా లేక, ఆశీర్వాదము చేసే సంప్రదాయము లేదు. ప్రతిద్వ్జునకున్నూ చేత పంచంగ ముండవలసినది. పంచాంగశ్రవణము బహుప్రబలము. ఈదేశములో యిప్పట్లో వర్షా కాలము గనుక మన దేశపు కార్తిక మాసములోని వ్రతములు శ్రావణమందు శ్రావణ సోమవారలని, నిత్యాభిషేకాలని, సక్త భోజనాలని, ఛెయుచున్నారు. గృహకల్లోల కార్యములలో పురుషులకన్నా స్త్రీలకు చొరవ యెక్కువగా యీ దేశములో కలిగియున్నది.

కడప మొదలుగా గొప్ప వర్తకులు, ధనికులున్నుండే స్థలములో నొక్కొకవేళ డాగావాండ్లనే దొంగలు అతి ధైర్యముతో సాయంకాలములో గుంపుగా ప్రవేశించి యెదట కండ్లపడ్డ వారినంతా చంపి ధనికుల యిండ్లలో, అంగళ్ళలో జొరపడి ఖామందులను పోడిచి చంపి, ఉండే ధనము నెత్తుకొని, అరగడియలో మటుమాయ మయి పోవుచున్నారు. యీప్రకారము హయిదరాబాదు యింగిలీషు లష్కరు మధ్యె జరిగినది. యీ డాగావారి భయము యీ దేశములో విస్తరించి కలిగియున్నది. సాత్వికుల యోగ్యత యిటువంటి దుష్టులు లేకనే ప్రబలముగాదు గనుకనున్ను యిటువంటి వారు యీశ్వర చిద్విలాసానికి సామాగ్రి గనుకనున్ను, వారినిన్ని యీశ్వరుడు రక్షింపుచున్నాడు.

31 తేది మధ్యాహ్నము 12 ఘంటలకు ఆ గోదావరి నది దాటి యివతల అయిదు కోసుల దూరములో నుండే నిర్మల అనే షహరు 4 ఘంటలకు ప్రవేశించినాను. దారి నదికి అటు ప్రక్క రెండు మజిలీల వరకు ఉన్నట్టే బాగా గులక యిసుక పరగా నున్నది. నదిదాటగానే ఒక బంగాళా జాతులవాండ్లు దిగడానికి యోగ్యమయినదిగా నున్నది. యివతల చిన్న యూళ్ళు మూడున్నవి. కొన్ని మజబూతి అయిన పాడుకోట లున్నవి. నిర్మల అనేయూరు పట్టణము వంటిది. సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పని వాండ్లున్నారు. ఊరుచుట్టున్నూ, ఊరు నడుమనున్ను చిన కొండలు నిండా వున్నవి. గొప్ప యిండ్లు కలవు. ఊరుకి చుట్టున్ను, తొటలు, చెరువులు కలిగి యున్నవి. ఇక్కడ అరికాటి నబాబు కింద లోగడ రాయిజీ *[1] సర్వాధికారిగా ఉన్నట్టు ఒక పరగణాదారుడు ఉన్నాడు. దేశముఖి, దేశపాండ్యాలు ఉన్నారు. కొత్తవాలు మొదలయిన యధికారస్థులున్నారు. 100 బ్రాంహ్మణ యిండ్లును, ఒక దేవాలయమున్నూ ఉన్నవి. అక్కడ నేను దిగినాను. యిట్లా గొప్ప యూళ్ళలో నుండే బ్ర్రాంహ్మణ మండలికి సభాపతి అనే ఒక బ్రాహ్మణుదు ఉన్నాడు. అతని యూజ్ఞకు తక్కిన వారు యధోచితముగా లోబడి యున్నారు. నిర్మల పంచపాత్రలు ఈప్రాంతములలో బహు ప్రసిద్దిగా నున్నవి. నిండా కంచర యిండ్లున్నవి. అయితే కూతురి ప్రౌఢమ తండ్రికి ఏప్రకారము అనుభవానికి రాదో అలాగే ఆయాపదార్ధాలు పుట్టే స్థలముల యందు అచ్చటివారికి అనుభవానికి రావు. అందుకు దృష్టాంత మేమంటే యిక్కడచేసే పంచపాత్ర యొకటి చూతామన్నా యీ యూరున దొరికినదికాదు. ఈ నిర్మల నుండే పొష్టు రన్నర్సులనే టప్పా మనుష్యులు హైదరాబాదు పోష్టాఫీసు యిలాకావారు ఇది మొదలుగా నుండే టప్పా మునుష్యులు నాగపూరి పోష్టాఫీసు యిలాకావారు గనుక రెండు యిలాకాలకు న్నిద్దరు మనిషీలు ఇక్కడ నున్నారు. నాగపూరు మనిషీగుండా నగపూరు వరకూ నొకటప్పామనిషిని మజిలీ మజిలీకిన్ని కూడా వచేటట్టు దిట్టము చేసుకొన్నాను. వూరి అములు దారుడు నేను వచ్చేటందుకు మొందరనే తగయిరు అయినాడు గనుక దేశపాండ్యా వెంకటరాయనివారిగుండా యేదులాబాదు వరకు వచ్చే టట్టు 4 మంది ఆయుధ పాణులయిన జవానులను తయినాతి చేసుకొన్నాను. ఈ నిర్మలలో దృశ్యాఅనేవాడు. నిజాముకింద అధికారము చేసేవాడు. అతడు తన రాజ్యపురూకలు యజమానునికి పంపించకుండా తన చేతికిందనున్న భూమిని ఆక్రమించవలనని కోటలు కట్టి యజమానునితో చచ్చేవరకు యుద్ధముచేయుచు రాజ్యము ననుభవింపుచువచ్చినాడు. నేను దిగిన దూదుగాము అనేది నదీతీరమదలి యూరు. బహు రహధారి. కశిభాటలో నున్నది. ఆ నిర్మలలో మొదటి తేది ఉంటిని.

ఆగస్టునెల 2 తేది ఉదయాన 6 ఘంటలకు ఉదయాన బయలువెళ్ళీ 8 కోసుల దూరములో నుండే వొడ్డూరు అనె యూరు 1 ఘంటకు చేరినాను. దోవ బహు ప్రయాస. నల్ల రేగడి భూమి. వర్షాకలములో నడిచేవారికి అడుగు అమడగా నుండును. 7 కొండలు దారిలో నడిచేవారికి నెక్కి దిగవలసియున్నది. దారిలో అడుసుతో కూడా రాళ్ళు మిశ్రములై యున్నవి. దారిలో అంకిరి అనే యూరున్ను మరికొన్ని చిన్న యూళ్ళున్నున్నవి. మజిలీ చెయ్యడానికి వయిపు అయినవి కావు. యీ నిర్మల్ నుంచి నేరేడు కొండ అనే యూరిమీదనొక భాటపోవుచున్నది. అ భాట సమీపమయినా వర్షాకాలములో నడవకూడదు. యీదినము నడిచిన భాట కిరుపక్కల దట్టమయిన యడవి. వ్యాఘ్రభయము జగనంపల్లె మొదలుగా కలిగియున్నది. పాంకిలి అనేయూరివద్ద ఒక వాగు దాటవలెను. ఇది బలమయిన వారు. అవతలి యూరి ముందర నొక లోతుగల వాగు ఉన్నది. యిదేగాక అనేకములయి గనుక చిల్లర వాగులు అనేకములు దాటినాను. ఈ వొడ్డూరు బస్తీ గ్రామము. సకల పదార్ధములు దొరుకును. భ్రాంహ్మణుల యిండ్లు చావిళ్ళున్నున్నవి. ఇక్కడ నొక చావిడిలో ఈ రాత్రి నిలిచినాను.

3 తేద ఉదయాన 6 ఘంటలకు బయలు వెళ్ళి 7 కోసుల దూరములో నుండే విచ్చోడా అనే యూరు 1.2 ఘంటలకు చేరినాను దారి నిన్నటివలెనే సకల్ విధములయిన ప్రయాసలను ఇచ్చుచున్నది. కొండ యొక్కుడు దిగుడు గలది. రాతి గొట్టు మాత్రములేదు. దారిలో కడం అనే నది దాటవలెను. ఈ నది వెడల్పు తక్కువ అయినను బహు ఘాత చేసేది. పడవ, తెప్ప, మొదలైనవి కూడా ప్రవాహవేగములో నడవవు. ప్రవాహ కాలములో కుంఫీణీ టప్పాకూడా రెండు మూడుదినములు ఇక్కడ నిలిచిపొవు చున్నది. విచ్చోడా అనే యూరు బహుచిన్నది. యధోచితముగా కావలసిన పదార్ధాలు ముసాఫరులకు దొరుకును. ఇక్కడ డేరాలలో వసించినాను. వోడ్డూరు - విచ్చోడా మధ్యే కొన్ని చిన్న గ్రామాలున్నవి. నిలవయోగ్యములు కావు. దారికి యిరుపక్కలా చిన్న పర్వతములు దర్శన మవును. మిట్టలో నించి పల్లానికి నిండా దిగే కడం నది దగ్గిర నెక్కవలసి యున్నది. ఆయూరున ఆరాత్రి ఉన్నాను.

4 తేది 6 ఘంటలకు బయలుదేరి 2 ఘంటలకు 10 కోసుల దూరములో నుండే యేదులాబాదు అనే షహరువంటి యూరు చేరినాను. దారి అట్నూరు అనే యూరివరకు నల్లరేగడభూమి. అడుసు లోగడి రెండు దినముల వలెనే దిగపడుచున్నది. ప్రయాస చెప్పి తీరదు. ఆట్నూరు మొదలు యేదులాబాదు వరకు దారి నడవడానికి గులక యిసుక పరయున్నుచిన్న రాళ్ళగోట్టున్ను గనుక అనుకూలముగా నున్నది. అయితే మేకల గండి అనే ప్రసిద్ద మైన ఘాటు ఇక్కడ దాటవలసినది. ఈ ఘాటులోని యడివి, బల్లెము దూరని పాటి దట్టమని చెప్పవచ్చును. వ్యాఘ్రభయము విస్తారము. పులియడుగులు దారిలో చూచుచు మేము నడిచినాము. బహు జాగ్రత్తగా బాటసార్లు ఇక్కడ నడుచు చున్నారు. ఒకరిని ఒకరు విడిచే ప్రదేశము కాదు. తుపాకులు అక్కడ కాల్చుచు వచ్చినాము. కొండల చెరువుల నడమ భాట పోతున్నది. అట్నూరి వద్ద నొక పెద్దవాగు దాటవలసినది. యింకా శానాశానా చిన్నచిన్న వాగులు దాట వలిసియున్నవి. నిర్మల మొదలు భాటలో సన్నముగా, విడువుగా నిండే చీకటి యీగెలు నిండా కరుచుచున్నవి. యీ మేకల గండి యడివిలో నడిచే టప్పుడు నడిచేవారు చిన్న మండలు విరిచి చేతపట్టుకొని తోలుకొనుచు రావలసినది. ఆ మక్షికాల భాధ ఘాటు దాటే పర్యంతముగలదు. ఆఘాటు ములులే అనే యూరి పర్యంతము ఉన్నది. ఆఘాటును మేకలగండి అనటానికి కారణమేమంటే ఘాటు మధ్య వుండే రాళ్ళన్ని మేక అడుగులతో ఈశ్వరుడు సృస్టిచేసి యున్నాడు. యేదులాబాదులొ సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పనివాండ్లు వున్నారు. జలవసతి కలదు. బ్రాంహణ యిండ్లు కలవు. ఊరికి బయిట బ్రంహ్మచారి బావా మఠ మున్నది. వూరి మధ్యే కొన్ని మఠాలున్నవి. ఒక మఠములొ దిగినాను. విచ్చోడా అనే వూరు మొదలుగా వోణి అనే వూరు వరకు ముషోర్మల్కు అనే దివాంజీకి జాగీరు అయివున్నది. యీ యేదులాబాదులో నాయబు అనే అములుదారు డున్నాడు. ఈయూళ్ళోకూడా వచ్చిన వారియొక్క అసోదా నిమిత్తమున్ను, పదార్ధాల సంగ్రహము కొరకున్ను ఆ దినమంతా నిలచినాను.

6 వ తేది ఉదయమైన 6 ఘంటలకు బయలు వెళ్ళీ 8 కొసుల దూరములో నుండే ధనోరా అనే యూరు 1.2 ఘంటలకు చేరినాను. దారి నల్లరేగడ అయినా అడుగున రాతిపారు గనుక నెంత వర్షముకురిసినా ఆట్నూరు వర్యంతము దిగబడేలాకు ఈదారి దిగబడదు. దారి కిరుపక్కల భూమి వెల్లడిగానున్నది. ఆదివిలేదు. అయితే దారి రాతిగొట్టు. శానా వాగులు వర్షాకాలములో దాటవలసి యుంచున్నవి. యేదులాబాదుకు కొంత దూరములో నొక పెద్దవాగు మధ్య వుండే జేనదు అనే వూరి వద్ద నొక పెద్ద వాగు దాటవలెను. ఈ జేనదు అనే యూరు మంచి బస్తీ అయినది. ముచ్చటగా రాతి పని చేసిన యొక విష్ణు దేవాలయము ఈ యూరి చెరువు గట్టున వున్నది. సకల పదార్ధాలు దొరుకును. యేదులాబాదుకు సమీపముగా 4 కోసుల దూరములో ఈ వూరున్నందున నెను దిగలేదు. ఇదిగాక చిన్నవూళ్ళు కొన్ని వున్నవి. మజిలీ చేయడానికి తలుచుకొనతగినవి కావు. ధనొరా వూరిముందర పిన్నగంగ అనే నది దాటవలసినది. ఇక్కడ కొయ్య తొలిచిన రెండేసి చిన్న దోనెలు జోడించి కట్టినదోనె రెండేసి సవారీలున్ను ఆరుబోయీలున్ను ఒక తేవకు దాటింపు చున్నది. సామానులున్న పరివారమున్ను దాటడానికి రూ.2 దోనెవాండ్లకు ఈనాముగా నిచ్చినాను. కొంఫిణీవారి తఫాల్ దాటించడానికి సంవత్సరానికి 1 కి 3 రూపాయీలు లెక్క జీతముగా 12 రూపాయిలు గోదావరి మొదలయిన నదులు దాటించేవారికి యిచ్చేటట్టు వర్షాకాలము నాల్గు నెలలకు నెల 1 కి 3 మూడురూపాయీలు లెక్క జీతముగా నిచ్చుచున్నారు. లోకులవద్ద మనిషికిన్ని పశువుకు న్నింత మాత్రమని పుచ్చుకొని యీ దోనె వాండ్లు తమ వచ్చుఒడిలో నొక హిస్సా నిజాము సర్కారుకు ఇస్తారు. ధనొరా అనే వూరు చిన్నది. యధోచితముగా ముసాఫరులకు కావలసిన సామానులు ప్రయత్నముమీద దొరుకును. నేను నదియొడ్డున డేరాలలో వసించినాను. బ్ర్రాంహ్మణుల యిండ్లు లేవు. ఒక అంగడి యున్నది. యీ ప్రాత్యపు గ్రామాలలోనంతా వర్షాకలములో కాలుపెట్టను మనసురాదు. అసహ్యమయిన అడుసు. నడమ గ్రామములున్నవి. యిక్కడ యీ రాత్రి నిలిచినాను.

7 వ తేది ఉదయమైన 6 ఘంటలకు బయలుదేరి 1 ఘంటకు 7 కోసుల దూరములో నుండే కాయరా అనే వూరు చేరినాను. దారి నిన్నటి దారివంటిదే. చిన్న వాగులు శానా వర్షాకాలములో దాటవలసి యున్నవి. యిదిగాక ఒకరాతి గొట్టుకల కనమ యెక్కి దిగవలసి యున్నది. యీ కనమ మీద ముందు వెనక అడివి కలిగియున్నది. యీ యడివిలో మేకల గండిలోనున్న యీగెలవంటి యీగెలు నడిచేవారిని బాధ పెట్టుచున్నవి. రోనేగరుగాం అనే వూరితో యీయడివిసరి. అవతల పొడిచెట్లుగాని భయములేదు. కాయరా యూరి ముందర నొక పెద్దవాగు దాటవలెను. కాయరా అనే యూరు బస్తీయయినది. నాయబు ఉండే కసుబా స్థలము. సకల పదా ర్ధాలు దొరుకును. బ్రాంహ్మణ యిండ్లు యిరవైదాకా కలవు. ఫేష్కారు యొక్క యింటిలో దిగి యీ రాత్రి ఇక్కడ నున్నాను.

1 తేదీ ఉదయమున 3 ఘంటలకు బయలు వెళ్ళి 5 కోసులదూరములో నుండే వోణీ అనే యూరు 11 ఘంటలకు చేరినాను. దారిలో చిన్నయూళ్ళు నాల్గున్నవి. నడిచినంత దూరము నల్ల రేగడ, అడుగున రాతిపరి; పయిన అడుసు. చిన్న వాగులు కొన్ని దాటవలసినది. అడివి; రాతిగొట్టు, వేమనో అనే గ్రామము బహు బస్తీ అయినది. దేవాలయాలు కలవు. సకల పదార్ధాలు దొరుకును. అధికారస్థులుండే కసుబాస్థలము, జలవసతి కలదు. ఇండ్లుగొప్పవి. నేను గొప్ప వేంకటేశ్వరదేవాలయములో దిగినాను. సవారీల నుంచడానికి, బోయీలు జవానులు కావటివాండ్లు వగయిరా లుండడానికిన్నీ, చావిళ్ళూ మణిగ లడే జామీనులు, మశీదులు అసర్ ఖానాలు శానా వున్నవి. దినుసువల్లు నాణ్యములు ఇక్కడ మార్చుకోవలసినది. ఈ యూరంతా యిసుక పర గాని, అడుసుకాదు. ఆ యూరు నదీతీరము. నిజాము వద్ద కలటరు హొదా చేసినవారు కొంద్రు జాతులవాండ్లు యిక్కడ యిండ్లు కట్టుకొని యున్నారు. ఇంగిలీషువారు కలకటరులు కావడానికి హేతువేమంటే నిజాము తరపున నున్న అధికారస్థులు జమీందారులు నసిగా రూకలు పంపించనందున యింగిలీషు దొరలు తాలూకాలమీద నుండే దాపుమీద రూకలు వచ్చునని దివాంజీ చేసే చందులాలా యోచించి రిసైడెంటుతో మాట్లాడి తాలూకాల మీదికి తన యములు దారులతొ కూడావుండి వ్యవహారము చూడ గలందులకు యింగిలీషు దొరలను పంపించినాడు. వారు అక్కడక్కడ నిజాం అధికారస్థులతొ కూడా వుండే వ్యవహారము జరిగించినారు. అందువల్ల మొగలాయి ధోరణి జులుము లోకుల మీద నిండా వ్యవహారస్థులు చేయకుండా వచ్చినది గనుక అధికారస్థులకు వైపు (ఉపాయము) తోచక, చందూలాలాకు తెలియచేసి నంతట్లో మళ్ళీ ఆ కలకటరులను రిసైడెంటు పిలుపించుకొన్నాడు. యిప్పటికీ యింగిలీషువారి న్యాయ ఉన్నది గాని, *[2]కాలీజి సిద్ధాంతి వ్రాసినట్టు యింతకు మునుపే సింహరాశిగతుడైనట్టు వ్రాయలేదు. తూర్పు దేశము నుంచి క్షామాదులకు లేచివచ్చి యిక్కడ నిలకడగా నిలచిన వారెవరయినా గ్రామాదులలో నుంటే వారు మాత్రము తెనుగు మటలాడుచున్నారు. తూర్పు దేశపు బ్రాంహ్మణులు, కోంట్లు మాత్రమీ దేశానికి యిదివరకు యొగ పాకి వచ్చుచున్నారు. నేను బ్రాంహ్మణనింటిలో యీ రాత్రి వసించి, యింగిలీషువారు యిక్కడనున్ను ముందు మజిలీలో నున్ను కట్టించి యుండే ముసాఫరుఖానాలో నా సవారీలు మూడు న్నుంచినాను.

10 తేది 4 ఘంటలకు లేచి యిక్కడికి 8 కోసుల దూరములో నుండే నాగిరి అనే యూరు చేరినాను. దారిలో నదరహి దోనెలవంటి దోనెలతో నొక నది దాటవలసినది. చికనీ అనే యూరివరకు దారి వల్లెడిగా నల్ల రేగడ భూమిగా నున్నది. ముందు గడిచిన దినముల దోవ వలెనే కాలు దిగబడే అడుసుకలది కాదు. ఆ గ్రామము మొదలుగా భూమి నల్ల రేగడయయినా గట్టిపరగనుక అడుసు త్వరగా నెండిపోవుచున్నది. విస్తరించి వాగులు యెక్కుడు దిగుడుగా దాటవలసి వున్నది. ఈ నాగరి అనే గ్రామము బస్తీ అయినది. రుక్మి విఠోబా దేవాలయము కొంచము విస్తారమయిన ముఖమంటముతో కూడా నున్నది. భ్ర్రాంహ్మణ యిండ్లున్నవి. ముసాఫరుఖానా కలదు. నేను దేవాలయములో దిగినాను. ముసాఫరులకు కావలసిన పదార్ధాలు దొరుకును. యేదులాబాదు మొదలుగా నిది వరకు మెరక పంటభూమి; పుంజధాన్యము చేనులు చేసి పయిరు చేయుచున్నారు. భాటకు నిరుపక్కల చేనులలో పశువులు చొరపడకుండా ముండ్లకంపలు తెచ్చి వెలుగు వేసుటవల్ల యీ ప్రయాస నిఛ్ఛే అడుసుతో కూడా ముండ్లుకలిసి యంచున్నవి. ఆ గ్రామములో ఆరాత్రి వసించినాను. 11 తేది ఉదయాన 6 ఘంటలకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములోనుండే మాండగాం అనే యూరు 1.2 ఘంటలకు చేరినాను. దారిలో హింగన్ ఘాటు అనే షహరువంటి యూరివద్ద వన్నేనే నది సదరహివ్రాసిన దోనెకుండా దాటవలసినది. హింగన్ ఘాటు అనే షహరు స్థలము నిన్నటి మజిలీకి 4 కోసుల. యీ యూరిలో చుట్టుపక్కలా బహు దూరానికి అందేటట్టుగా వుప్పు తెచ్చియుంచి వర్తకులు రాసులమోడిగా అమ్ముచున్నారు. సాహుకారు కొఠీ లున్నవి. నాణ్యములు ఇక్కడ మార్చుకొన వచ్చును. బట్టలు వగయిరాలు, సకల పదార్దాలు, ఔషద దినుసులు సమేతముగా యిక్కడ కావలసినంత దొరుకును. నేటి దారి చికిని అనే యూరు మొదలుగా నాగిరి పర్యంతము ఉన్నట్టే యధోచితముగా అనుకూలముగా నున్నది. వాగులు విస్తారము దాటవలెను. మాడుగాం అనే యూరు యధోచితముగా బస్తీ అయినదే. ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. స్థల సంకుచితము లయిన యిండ్లు కలవు. బ్ర్రాంహ్మణయిండ్లున్నవి. నిన్నటి దేవాలమువంటి దేవాలయము ఒకటి యున్నది. యీ దినము గోకులాష్టమి గనుక ఆగుళ్ళో ఉత్సవము జరుగుటచేత నొక సంకుచిత మైన మారువాడివాని అంగట్లో దిగి ఈరాత్రి దిగి ఇక్కడ వసించినాను.

12 తేది 6 1/2 ఘంటలకు బయలువెళ్ళీ 5 కోసుల దూరములో నుండే చింది అనే గ్రామము 10 ఘంటలకు చేరినాను. దారినిన్నటి వలెనే యున్నది. అనేకములయిన పల్లాలు దిగి మిట్ట లెక్కవలసి వాగులు దాటవలసి యున్నవి. చింది యనేది కసుబా గ్రామము. పేట స్థలము. అన్ని పదార్దాలు దొరుకును. భ్ర్రాంహ్మణయిండ్లు, చావిళ్ళున్ను కలవు. నేను కఛ్ఛేరి చావడిలో దిగినాను. ఈ ప్ర్రాంతముల బస్తీ మజిలీ వూళ్ళలో వారానకు నొక దినము సంత. ఆ సంతకు అన్ని పదార్ధాలు ఇతర గ్రామాలనుంచి తెత్తురు. అదే ప్రకారము ఈదినమున ఈ యూరికిన్ని తెచ్చినారు. అప్పట్లో అన్ని వస్తువులు సయముగా బాహటముగానున్ను దొరుకుచున్నవి. కూరగాయలు, తమలపాకులు మొదలయినవి కూడా సంతకు తెచ్చుచున్నారు. ఈ రాత్రి ఇక్కడ నిలిచినాను.

23 తేది ఉదయాన 6 1/2 ఘంటలకు బయలువెళ్ళి 8 కోసుల దూరములో నుండే గూంగాం అనే యూరు 11 ఘంటలకు చేరడమయినది. దారి ముందు నడిచిన దినముల దారివలె నల్లరేగడ, రాతి గొట్టు కూడా కలిగియున్నది. యిక్కడికి 4 కోసుల దూరములో నుండే కాకిఘాటు అనే యూరివరకు కొంచెము పొడిచెట్ల యడివి భాట కిరుప్రక్కల నున్నది. కాకిలిఘాటు ఊరివద్ద నదివంటి వాగు ఒకటి దాటవలసినది. యేదులాబాదు మొదలుగా ప్రతియూరు న్నొక యేరు వంటి వాగును అనుసరించి యున్నది. చెరువులు నిండాలేవు. ఈవాగులే ఉదక సమృద్ధిని కలకలగచేయు చున్నవి. కాకిలిఘాటు మొదులుగా రాతి గొట్టున్ను అడివిన్ని లేదు. భాట కిరుపక్కల చదరమైన భూమి. గూంగాం అనే యూరు కసుబాస్థలము. బక్కిబాయి అనే నాగపూరు రాజు బంధురాలికి జాగీరు గ్రామము. ఈవూరివారున్నూ, ఇక్కడి యధికారస్థులున్ను, నాగపూరు షహరుకు సమీపమందున్నారు గనుక అలక్ష్యము, అహంకారమునున్ను వహించియున్నారు. అయినా బస్తీ గ్రామము గనుక అన్ని పదార్ధాలు బజారులో దొరుకును. ఈవూరిమధ్య స్వచ్చమయిన జలము కల వాగు ఒకటి పారుచున్నది. దేవాలయము, ధర్మశాల అనే చావడి, బ్ర్రాంహ్మణ యిండ్లున్నవి. ధర్మశాల అనేది ఒక తాళ్వారము వీధికి అభిముఖముగా వేసి యుంచున్నది.

యీ దేశపు ముసాఫరులు తాము బ్రాంహ్మణులయినా దృష్టిదోషము పాటించడము లేదు. గనుక అందులో దిగి, వీధిలోవచ్చేవారు పొయ్యేవారున్నూ చూడగా వంట చేసుకొని భోజనము చేయుచున్నారు. భ్రాంహ్మణులు భోజనము చేసేటప్పుడు శూద్రులను యెదుగా కూర్చుండ బెట్టుకొని మాట్లాడు చున్నారు. శూద్రులను ఎదట పంక్తిగా తమతోపాటు కూర్చుండపెట్టి వడ్డించి చూచుచు, మాట్లాడుచు బోజనము చేసుట కలదు. అయితే "మన ఏపయనుష్వాణాం కారణం బంధమోక్షయో!" అనే న్యాయముచొప్పున ఇట్టి నియమములంతా స్వతంత్ర ప్రవృత్తి నివృత్తులను కలవి గనుక ఈ ఆచారము ప్రమాదమైనది కాదు. అయినా ఆ స్థలము యుక్తముగా తోచనందుననున్ను, బ్ర్రాంహ్మణ యిండ్లలో జాగా కునందిగనుకనున్ను మరిన్ని వారి యాచారవ్యవహారాలలొ శూద్రులగుండా ఉదకము తెప్పించుకొని వాడుకొనేటట్టుగాకూడా ఉన్నది గనుక నున్ను వాగువొడ్డున డేరాలు వేసి దిగి ఆ యూరిలో ఆ రాత్రి వసించినాను. దారిలో దాకిలి ఘాటుదాకా కొన్ని యూళ్ళున్నవి. మజిలీ చేయడానికి యోగ్యములు కావు. హయిదరాబాదు మొదలుగా మంచి యిండ్లు కట్టుకొనేవారు మట్టిమిద్దె నొక అర యింటికిగాని, కూటానికిగాని వేసి పైన పెంకుల పూరితో నొక కట్టడి యేర్పరచి పైన నెక్కడానకు, ఒక నిచ్చెనగాని, పొడుఘుమెట్లుగాని కట్టి పెట్టుచున్నారు. సాధారణముగా ఇండ్లు కట్టే వారు పెంకులతోను, పూరితోను కట్టుచున్నారు. యెదులాబాదువరకు నుండే పెంకులు దక్షిణదేశములో నీళ్ళకాలువలకు పెట్టే కోవుల మాదిరిగా నుంచున్నది. ఆయూరికి ఇవతలి పెంకులు దక్షిణదేశములో మిద్దెలకు వేసే చదరపు పెంకుల జాడగా నడమ కొంచమువంపు కలిగి యున్నవి.

ఐదవ ప్రకరణము

14 తేది ఉందయాన 7 ఘంటలకు ఈ యూరు వదిలి యిక్కడికి 4 కోసుల దూరములో నుండే నాగపూరు షహరు 10 ఘంటలకు ప్రవేశించినాను. దారి ఘట్టి నల్ల రేగడభూమి; అడివి కలదు. రాతిగొట్టులేదు. బాట కిరుపక్కల కనుచూపుమేరకు చదరముగా నుంచున్నది. నాగపూరు ముందర నగలేరు అనె పెద్దవాగు దాటవలెను. నాగపూరు షహరువద్ద శీతాబులిడి అనే ప్రదేశ మున్నది. అక్కడ రెసైడెంటు ఇల్లు, తోటలు కలుగ జేసుకొని యుంచున్నాడు. చుట్టున్ను కొన్ని ఇండ్లు అంగళ్లు తోటలు న్నవి. చెన్నపట్టణపు కాపురస్తుడయిన వీరాసామిమొదలారి పోష్టాఫీసు రయిటరుగా ఇక్కడ నున్నాడు. గనుక నితో హయిదరాబాదులొ కమ్మిస్సెరియాట్ మ్యానేజరు రామస్వామి

  1. *ఆర్కాటు నవాబుకింద రాయరేడ్డెరావు అను నతడు శిరస్తాదారుగా నుండేవాడు. ఇతడు 1809 లో బలవన్మరణము నందినాడు.
  2. *మద్రాసు ఫోర్టుసెంటు జార్జికోటలో సివిలు సర్వీసు ఉద్యోగులకు దేశభాషలు వ్యవహారములు నేర్పడం కోసం 1812 లో నొక కాలేజి స్థాపింప బడినది.