Jump to content

కావ్యాలంకారచూడామణి/ప్రథమోల్లాసము

వికీసోర్స్ నుండి

కావ్యాలంకారచూడామణి

ప్రథమోల్లాసము

శా.

శ్రీవాగాస్పదయోః పరస్పరయుజోః శ్రుత్యుత్సవశ్లాఘయోః
రాగాలాపనిరూఢియోః ర్యతిగణవ్యాపారపారీణయోః
సారస్య ద్గీరిజేశయో రివ సదా సంగీతసాహిత్యయో
ర్విద్వద్విశ్రమహేతుకం విహరశాం చాళుక్యవిశ్వప్రభౌ.

1


ఉ.

పంకజమున్ దొఱంగి తదుపాంతచరన్మధుపప్రసక్తికిన్
గొంకి ఝషాదిరూపములకున్ జనునాథుని వింతయక్కుపైఁ
గింకిరి గాఁగ లచ్చి తిలకించి యజస్రము నుండుఁ గాత ని
శ్శంకఁ జళుక్యవిశ్వమనుజప్రభుపుణ్యకటాక్షదృష్టులన్.

2


చ.

వరచతురాననప్రతిభ వాసికి నెక్కఁ బదక్రమంబులన్
దిరుగుచు నంగవిభ్రమము ధీముకురంబులఁ గానిపించుచున్
సరసవచస్సవిత్రి యగుచామ యలంకృతులన్ దనర్చి సు
స్థిరతం జళుక్యవిశ్వనృపుచిత్తమునన్ బొలుపారుచుండెడున్.

3


సీ.

శ్రీకంఠచూడాగ్రశృంగారకరణ మేరాజున కన్వయారంభి గురుఁడు
చాళుక్యవంశభూషణము శ్రీవిష్ణువర్ధనుఁ డేమహీశుతాతలకుఁ దాత
ధృతకుమారారామభీముండు చాళుక్యభీముఁ డేనృపకులాబ్ధికి విధుండు
రాజమహేంద్రపురస్థాత రాజనరేంద్రుఁ డెక్కువతాత యేవిభునకు


తే.

నంధ్రదళదానవోపేంద్రుఁ డగునుపేంద్ర
ధరణివల్లభుఁ డేరాజుతండ్రితండ్రి
ఘనుఁ డుపేంద్రాఖ్యుఁ డెవ్వనికన్నతండ్రి
యతఁడు విశ్వేశ్వరుఁడు లక్కమాంబసుతుఁడు.

4


శా.

సర్వశ్రీ దనపేరివాఁ డగుటచే సంతుష్టచేతస్కుఁ డై
సర్వజ్ఞత్వము రాజశేఖరతయున్ శంభుత్వము న్విశ్వనా
థోర్విభర్తకు విశ్వనాథుఁడు శివుం డోజించెఁ గా కున్న నీ
దుర్వారప్రతిభాతిభాగ్యశుభదస్తుత్యత్వముల్ గల్గునే.

5


ఉ.

అశ్రుతవైరివర్గుఁడు సమాశ్రితభర్గుఁడు దివ్యవాహినీ
విశ్రుతకీర్తి పుణ్యగుణవేషవిభూషితమూర్తి మానసో

న్మిశ్రితరాజనీతి యధమాకృతభూవరభూతి సర్వలో
కాశ్రయచక్రవర్తి సమరారిచమూసమవర్తి శూరతన్.

6


సీ.

లక్ష్మీధరిత్ర్యుపలాలనప్రౌఢిమ రాజనారాయణప్రభ వహించి
హవ్యకవ్యార్థనిత్యప్రదానవ్యాప్తి సర్వలోకాశ్రయక్షమతఁ జెంది
త్రస్తశస్త్రాఖిలోద్ధరణక్రియాసిద్ధి ధరణీవరాహశబ్దమునఁ బేర్చి
గర్వితారాతివిఖండనోదారతఁ గరవాలభైరవఖ్యాతి వడసి


తే.

కదనభీతులఁ బులు మేపి కాచి రాయ
గండగోపాలబిరుదసంగతిఁ దనర్చి
యాపనిఁ బొగడొందు బహువిజయప్రవర్తి
చారుచాళుక్యవిశ్వేశచక్రవర్తి.

7


ఉ.

ఎందుఁ జళుక్యవిశ్వధరణీశ్వరురాయఠారిసాళువ
స్పందన మొప్పఁ జెప్ప బహుపక్షబలంబునం గ్రందుఁ జెంది మి
న్నందినరాజహంసనివహంబులఁ బట్టి వధించి సన్నతిం
బొందినధార్తరాష్ట్రకులపూగములన్ గరుణించు నాజులన్.

8


వ.

మఱియును;


సీ.

వేదశాస్త్రరహస్యవిధు లెల్లఁ బరికించి సవిఁ జతుర్వగ్రప్రశస్తి నొంది
రాజవిద్యాతంత్రరక్తి సంభావించి వర్ణక్రమంబుల వల నెఱింగి
జ్యౌతిషాయుర్వేదసంగతి నెగ డొంది సంగీతసాహిత్యసరణి నేర్చి
తురగేభరోహణాదుల విశ్రుతికి నెక్కి యాయుధవిద్యల నతిశయిల్లి


తే.

యచట నచ్చట నున్న కావ్యాగమములఁ
జెలఁగి సత్కవిసౌకర్యసిద్ధికొఱకు
నొక్కచోటనె యొడఁగూర్ప నుత్సహించి
సత్కళవర్తి విశ్వేశచక్రవర్తి.

9


మ.

ననుఁ గావ్యక్రమవేది నర్చితబుధానందాదరాలోకితున్
మనితశ్రీగిరిజేశపాదయుగళున్ మాన్యున్ గళాకౌశిలున్
వినుతున్ గౌశికగోత్రుఁ బెద్దన సుధీవిఖ్యాతు రావించి స
ద్వినయం బొప్పఁగ నాదిరించి తగ నావిశ్వేశ్వరుం డి ట్లనున్.

10


ఉ.

భావరసప్రపంచమునఁ బర్వునలంకృతిలక్షణంబు, ఛం
దోవిచితిప్రచారము, గుతూహలదస్ఫురదంధ్రదేశభా
షావివిధప్రసంగములచందము నందముగా నొనర్చి వి
ద్యావిధి గానిపించుటగదా చతురత్వ మనంగ మేదినిన్.

11


క.

అను నవ్విశ్వేశ్వరవిభు, ననుమతి యనునూత్నపోత మాధారముగా
ఘనరసరత్నాకరమునఁ, గనుఁగొని యొడఁగూర్చి యిత్తుఁ గబ్బపుమణులన్.

12

షష్ఠ్యంతములు

క.

లక్ష్మీపుత్త్రునకు నుపేం, ద్రక్ష్మావరనందనునకు ధర్మజ్ఞునకున్
లక్ష్మవిభేదనలాఘవ, లక్ష్మణునకు సర్వశాస్త్రలంపటమతికిన్.

13


క.

సింధురసత్త్వునకు మరు, త్సింధురసక్రీడదహితతృప్తికరునకున్
బంధురశుభానుభవునకు, బంధురమావృద్ధికరణబహువిభవునకున్.

14


క.

చాళుక్యవిశ్వధరణీ, పాలునకు నమన్నృపాలపరిపాలునకున్
శ్రీలునకు సమరవిజయ, శ్రీలలనాశ్లేషసౌఖ్యశీలున కెపుడున్.

15


వ.

అభ్యుదయపరంపరల కకంపితస్థితి యావహిల్లునట్టుగా మద్వచోరచనీయం బగు
కావ్యాలంకారచూడామణి యను నలంకారలక్షణంబునకుఁ బ్రథమావతరణం
బెట్టిదనిన;

16


చ.

సరళవిరాజదుచ్చరణశస్తము వర్ణము, వర్ణపక్తివి
స్తరము పదంబు, తత్పదవితానము వాక్యము, వాక్యభేదసుం
దరతర మర్థ, మర్థఘనతత్త్వవిబుద్ధము భావ, మట్టిభా
వరుచిరసుప్రసన్నవిభవంబు రసం బొడఁ గూర్ప నేర్చినన్.

17

భావము

క.

బహిరర్థాలంబనమై, విహరించు మనోవికారవిలసితము సుమీ
విహిత మగు భావ మన; నది, మహి విజ్ఞానంబు నా సుమితులం బరఁగున్.

18


క.

ఘనవిజ్ఞానం బాత్మకు, మనసుననే కలుగు నట్టిమనసున కబ్బున్
గనదింద్రియములచేతన్, వినఁగా వీనులకు దొడవు విషయప్రాప్తిన్.

19

భావభేదములు

తే.

అట్టి విజ్ఞానకలిత మై యమరుభావ
మాత్మఁ బ్రవ్యక్త మై విభావానుభావ
సాత్త్వికవ్యభిచారిసంజ్ఞలఁ దనర్చు
నాల్గుతెఱఁగుల రసనిదానంబు గాఁగ.

20


క.

నవరసవిస్ఫుటకరణ, ప్రవణము లగు నుచితరుచివిభావము లెల్లన్
వివిధస్త్రీపురుషులయం, దవిరళముగఁ బొడముఁ దెలియు నగును గవీంద్రుల్.

21

విభావములు

ఆ.

అవ్విభావ మొప్పు నాలంబనంబు ను
ద్దీపనంబు నాఁగ ద్వివిధ మగుచు
నిఖిలరసవిబోధనిర్మాణకరణంబు
లిత్తెఱంగు లెల్ల నెఱుఁగవలయు.

22

ఆలంబనవిభావము

క.

ఆలంబనంబు నాఁగ ర, సాలంబన మైనరూపయౌవనకాంతి
శ్రీలావణ్యాదిక; మది, మూలము తద్వ్యక్తికిన్ బ్రమోదప్రద మై.

23

ఉదాహరణము

చ.

నెలవుల నిండుచన్నుఁగవ నిక్కును, గామునితూపు కైవడిన్
వెలిఁగెడు రూపవిభ్రమము, విద్యుదుదారతఁ దేజరిఁల్లుఁ జూ
పులజిగి, సొంపు వెట్టనివిభూషణ మై మెయి నంతకంతకున్
బలియుఁ, జళుక్యవిశ్వజనపాలునిమన్ననఁ గన్నయింతికిన్.

24

ఉద్దీపనవిభావము

క.

చలియింపక రస మింపుల, నొలయుచు నెవ్వానిచేతి నుద్దీపించున్
గలఁగొన బుధులకు నవి యి, మ్ముల నుద్దీపనవిభావములు వాఁ బరఁగున్.

25


క.

ఆలంబనోక్తగుణములు, నాలంబనచేష్టితములు హారాలంకా
రాళియు నుత్సవలీలలు, నోలిన్ జతురాహ్వయంబు లుద్దీపనముల్.

26


సీ.

రూపలావణ్యతారుణ్యాదిశారీరగుణము లాలంబనగుణము లరయ,
నంగనోచితభావహావహేలాదివింశతియుఁ జేష్టితము లై సంచరించు,
హారకేయూరమంజీరకంకణకంఠకాదు లలంకరణాఖ్యఁ జెందు,
నుపవనజలచంద్రికోత్సవార్తవలీల లాత్మవిహారంబు లనఁగఁ బరఁగు;


తే.

నిట్టి యుద్దీపనవిభావహితవినోద
విభవములఁ బొందుఁ జాళుక్యవిశ్వవిభుఁడు
అలరువిల్తునిభంగి జయంతులీల
భద్రుచందమున నలకూబరునిపగిది.

27

అనుభావములు

శా.

భ్రూతారాననరాగదృగ్విలసనంబుల్ పాణిపాదాంగవా
క్చాతుర్యంబును నోష్ఠకంపనము నాఁగం బేర్చు చేష్టాసము
ద్భూతం బై టనుభూత మై రసము సొంపున్ జెందుటన్ జేసి వి
ఖ్యాతం బై యనుభావ మొప్పు లలితవ్యక్తాకృతిన్ దోఁచుచున్.

28


చ.

వదనవికాసమున్, బొలయు వాలికచూపులు, లేఁతనిగ్గుతోఁ
బొదలెడితారకల్, బొమల పొల్పగుపోకలు, మోవికెంపుపైఁ
గదిరెడి చిన్నినవ్వు, చెలికత్తెల కందము సేయుమాటలున్,
సుదతి చళుక్యవిశ్వనృపసుందరుఁ జెందుటఁ జెప్ప నొప్పగున్.

29

సాత్త్వికభావములు

తే.

సత్త్వ మన మనోవృత్తి, తజ్జంబు లైన
భావములు సాత్త్వికము లష్టభావితములు,

స్తంభరోమాంచబాష్పవైస్వర్యకంప
విలయవైవర్ణ్యఘర్మసంజ్ఞలఁ దనర్చు.

30

స్తంభము

క.

మే నెఱుఁగ కున్నయునికిన, నానాభయహర్షదర్శనశ్రవణములన్
మ్రానుపడి యునికి చేష్టా, హీనస్తంభంబు నాఁగ నెఱుఁగఁగ వలయున్.

31


క.

చాళుక్యవిభుని ఖేల, త్కోలధ్వజపటముఁ జూచి క్రొవ్వఱి, యని ను
త్తాలస్తంభస్థితికి, న్బాలుపడును బగఱ సాలభంజిక వోలెన్.

32

రోమాంచము

క.

ఆనందాతిశయంబునఁ, గానఁబడుట రోమహర్షకల్పనము సుమీ
మానితరోమాంచం బనఁ, గా నిష్టస్పర్శనప్రకాశనవిధులన్.

33


క.

మనమున విశ్వేశ్వరు నిడి, కొని గాఢాలింగనములఁ గొఱలెడిచోటన్
దనువునఁ బొడమెడిపులకలు, వనితకు రాగాంకురముల వడువున నొప్పున్.

34

అశ్రువు

క.

అతిదుఃఖహర్షణాదులఁ, బ్రతిపాదిత మైన నేత్రపాథఃకనుసం
వాతి యశ్రు వండ్రు, నఖముఖ, కృతమార్జనవిధులు దానిక్రియ లరయంగన్.

35


క.

ఆలములో విశ్వేశనృ, పాలునికరవాలు మెఱయఁ బరనృపవనితా
లోలనయనాంబుదంబులు, వాలాయము గురియు నశ్రువర్షం బోలెన్.

36

వైస్వర్యము

క.

భయరోషహర్షణాదుల, నియతం బగు గద్గదధ్వనిత్వం బది ని
శ్చయముగ వైస్వర్యం బగు, రయవాగుచ్చరణసరణి రభసం బగుటన్.

37


క.

రాగముగ నలుకఁ దేర్పఁగ, నాగతుఁ డగువిశ్వవిభునియాలోకముచే
రాగాలాపక్రమము వి, రాగాలాపక్రమముగ రమణి కలంకన్.

38

కంపము

క.

ఆకస్మికభయదయితా, లోకనహర్షాదిరుజలు లో నగుదానన్
జేకూఱుఁ గంప మంగ, వ్యాకులచలనాది నెఱుఁగవచ్చుం దెలియన్.

39


క.

మృదులతరచంద్రహాసము, గదలించుచళుక్యవిభునిఁ గని భీరువు లై
నుదవిమతులు వడవడ వణఁ, కుదు రాతఁ డుపేంద్రపుత్త్రకుఁడు గానఁ జుమీ.

40

ప్రళయము

క.

ప్రళయము నా సుఖదుఃఖా, దుల నింద్రియమూర్ఛనంబు దొఱఁగుట దానిన్
దెలియునది భూమిపతన,స్ఖలితాకారములచేతఁ గనుఁకొని చతురుల్.

41


క.

ఇమ్మహి నుపేంద్రపుత్త్రుడు, సమ్మోహనమూర్తి యగుట సత్యం, బతనిన్
నెమ్మిఁ గనుగొన్నయింతికి, నెమ్మది మూర్ఛిల్లి మేను నిలువక నడలున్.

42

వైవర్ణ్యము

క.

మదరోషవిషాదాదులఁ, గదిరెడుసహజాంగరుచివికల్పమునకుఁ బేఁ
రొదవును వైవర్ణ్యం బన, నది వర్ణవ్యత్యయమున నగుఁ దెలియంగన్.

43


క.

సారమతి విశ్వనృపతిని, గోరిన సమకూఱ కున్నె కోర్కులు ధరణిన్?
గౌరయశస్స్మరణంబున, సారూప్యపదంబు గలిగెఁ జామకు నొడలన్.

44

స్వేదము

క.

దయితాలింగనసురత, ప్రయాసకలనములఁ జెమరు వాటిల్లు మిథః
ప్రియదంపతులకు, నది గా, త్రయుతార్ద్రత్వమునఁ దెలియఁ దగుఁ జతురులకున్.

45


క.

ఇల విశ్వనృపతిచంద్రుని, లలితకరస్పర్శనములఁ లలన గరంగెన్,
దలపోయ దీనియొడ లి, మ్ముల నలవిధి చంద్రకాంతమునఁ జేసెఁ జుమీ.

46

సంచారిభావములు

తే.

స్థాయిభావంబునందు నిత్యత్వ ముడిగి
వ్యభిచరించుచు నబ్ధిభంగాళివో లె
నోలిఁ బొడముచు నడఁగుచు నుంటఁజేసి
యెసఁగు సంచారిభావంబు లెఱుఁగవలయు.

47


సీ.

గ్లాని విర్వేద శంకా మదాసూయలు నాలస్య దైన్య శ్రమాహ్వయములు
స్మృతి మోహ చపలతా చింతలును విషాద సుప్తి విబోధ కౌత్సుక్యములును
నావేగ గర్వ హర్షామర్ష నిద్రలు మ త్యపస్మారకోన్మాదములును
త్రా సోగ్రతా జడతా వితర్కంబులు నవహిత్థ ధృతి మరణాభిధములు


తే.

వ్యాధియును వ్రీడయును నన వరుసఁ గృతుల, సాగు ముప్పదిమూఁడు సంచారిభావ
చయము వాని నెఱుంగక జరుగ దండ్రు, రసవివేచనచాతుర్యరంజనంబు.

48

గ్లాని

క.

మానస మెరియఁగ మేనికి, నానాదౌర్బల్యకారణం బై యొంటన్
మాననిపశ్చాత్తాపము, గ్లాని యనగ బరఁగు సుకవికల్పనవిధులన్.

49


క.

శ్రీకరుఁ డగువిశ్వేశ్వరు, భీకరధరణీవరాహబిరుదభరాత్మున్
జేకొని మది ధరియించిన, యీకోమలి క్లేశ ముడుప నింతులతరమే?

50

శంక

క.

ఇదియును నదియును నట్లయి యొదవెడునొకొ యనఁగఁ బొడము నూహాపోహా
స్పద మై చనుననుమానము, మది శంక యనంగ బుద్ధిమంతుల కెక్కున్.

51


క.

స్తనితము తత్ప్రతినినదము, విని ధాటీపటహనాదవిభ్రాంతిమెయిన్
వెనుకకు ముందఱిదెసకును, జన శంకింపుదురు విశ్వజనపతిశత్రుల్.

52

నిర్వేదము

క.

దుర్విఫలత నీర్ష్యాదుల, దుర్వారప్రతిభ గలిగి తోఁపమి మొదలై
పగ్వెడుచిత్తవ్యథచే, నిర్వేదం బొదవు సోప్మనిశ్వసనం బై.

53


క.

ఈనోము లేల నోమఁగ? నీ నవశిశిరోపచార మేటికి? నెలఁతన్
మానుప విశ్వేశ్వరుఁడే; నానాఁటికి మనుసు రాజనారాయణుఁడే.

54

మదము

క.

మదిరాకృతమోహము సం, పదుదితహర్షము గళాదిపాటవమును స
మ్మదమున కుదయింపఁగ నా, స్పదములు దెలియంగవలయు భావజ్ఞు లిలన్.

55


క.

కించి త్సంప దవిద్యో, దంచితమదిరామదావిలాత్ముల నేర్పుల్
మించుఁ బెఱరాచకొలువుల, నించునె విశ్వేశమేదినీశ్వరుసభలోన్?

56

అసూయ

క.

పరబలమదవిద్యాసుం, దరతలకు సహింపలేక తఱు దగురోషా
చరణము గల్పించుట పే, రరయ నసూయాభిధాన మై నెగ డొందున్.

57


క.

ఈమహి విశ్వేశ్వరుచే, శ్రీమహిమన్ గన్నకవిగరిష్టు లసూయల్
వేమఱు భావింతురు చిం, తామణి సురధేను కల్పతరువులతోడన్.

58

ఆలస్యము

క.

పొందుగ నిజకృత్యంబుల, మందోద్యోగంబు చేసి మసలుటయ కదా
యెందును నాలస్యం బీ, చందం బతిప్రీతి నెఱుఁగ జనుఁ జతురులకున్.

59


క.

చాళుక్యవిశ్వవిభుతో, నాలమునకుఁ గడఁగువిమతు లలసు లగుటయున్;
జాలఁగ వన్నెలు వెట్టక, యాలస్యము చేసి రచట నమరాంగనలున్.

60

దైన్యము

క.

విపదాప్తి విత్తహరణ, స్వపతినిరాకృతుల నుద్భవంబయ్యెడు త
త్కృపణత్వము దైన్యం బగుఁ, గృప కాస్పద మగుచుఁ జూడఁ గృతపుణ్యులచేన్.

61


క.

పరగండభైరవునియు, ద్ధురధాటీపటుత యెట్టిదోవో రిపుభూభృ
త్పుర మాపురంధ్రిముఖముల, సరి నొక్కట దైన్య మండ్రు జను లరయంగన్.

62

శ్రమము

క.

సురతక్లేశాయాసా, తురనిరమనాదికములఁ దోతెంచు శ్రమం
బరసి తెలియంగవలయును, దరళశ్వాసారి ఘర్మతనువిదళనలన్.

63


క.

అడవులకై యద్రులకై, యడుగడుగున నలఁత వొడమ నడలుచుఁ జని రీ
పడఁతుకలు పతులు మనుగడ, నడరఁగ గరవాలభైరవార్చలు సేయన్.

64

స్మృతి

క.

అమరఁ బురాకృతసుఖదుః, ఖములం దలపోసి పోసి కనుఁగొనుటకు నై
నమితోన్నమితాననముగ, నెమకుట సంస్మృతి యనంగ నెలకొనుఁ దలఁపన్.

65


ఉ.

"ఈసురచాపదీప్తులకు నీడు సుమీ మన సాలరత్న వి
న్యాసము, లీతటిల్లతలయచ్చు గదా మన లాసికాతనూ
ల్లాసము, లీఘనోపలములం దెగడున్ మన మౌక్తికావళీ
భాసము” లంచు విశ్వజనపాలవిరోధి దలంచుఁ గానలన్.

66

మోహము

క.

భయదుఃఖావేశమహా, మయచింతనవిధుల మెఱయ మలఁగొను మూర్ఛో
దయ మది మోహం బనఁజను, నయుక్త మవివేకసరణి నగుఁ తెలియంగన్.

67


ఉ.

అద్దముఁ జూచి బిట్టులుకు, నానతిఁ జేసిన సంచలించు, న
మ్ముద్దియ విశ్వనాథుపయి ముచ్చట చేసినయంతనుండి; యి
క్కద్దు నెఱింగి చందురునిఁ గానఁగ నీరు, పికంబు గూయ న
న్నిద్దపుమ్రోఁత మాన్పుదురు, నెచ్చెలు లిచ్చ యెఱింగి నిచ్చలున్.

68

చపలత

క.

రాగద్వేషాదులచే, సాగెడు చంచలత పరు చపలత, నిజనా
థాగోవిస్ఫురతతి కా, రాగవి నెఱుఁగంగవలయు నండ్రు రసజ్ఞుల్.

69


ఉ.

నెయ్యపుబోటి మున్ను చెవి నించినవార్త లెఱుంగు కున్న యీ
తొయ్యలి విశ్వభూవిభుని దూరమునం గని రాగసక్త యై
తియ్యపునవ్వు వాతెఱకుఁ దెచ్చె, వడి న్గుచమండలంబుపైఁ
బయ్యెద చక్కఁ జేర్చెఁ, బొలపంబు నమర్చెఁ గటాక్షవీక్షులన్.

70

చింత

క.

తనరు ననిష్టాగమనం, బున నగు తలపోఁతపేరు వో చింత యనన్;
మనసున నెలకొనుదానిన్, గనునది సంతాపహేతుక ధ్యానమునన్.

71


చ.

తిరముగ విశ్వభూవిభుడు దేర్చినఁ దేరక త్రోచి పిమ్మటన్
దరుణి తదీశుతో వెస ముదంబునఁ జన్న మనంబుఁ ద్రిప్పఁగా
వెర వఱి చింత నొందు, పృథివీతల మూరక వ్రాయు, బోటులన్
బరువడిఁ జూచి సిగ్గుపడు, బాయనిధీరత దూరు బుద్ధిలోన్.

72

విషాదము

క.

అబ్బెఁ దగులాభ మని మది, నుబ్బెడుచో మంతరాయ మొనఁగూడుటయున్
బ్రబ్బికొను వెఱగుపా టది, నిబ్బరపువిషాద మనఁగ నెగడుం జూడన్.

73

క.

'ఇనుఁ డరిగెఁ, దిమిర మది కను, కని పర్వెడు, విశ్వనాథుకడ కేఁగెద నే'
నని యొకమానిని దలఁపఁగ, ఘనకరములు నిగుడ ధవళకరుఁ డుదయించెన్.

74

సుప్తి

క.

లీనేంద్రియ మై విషయ, ధ్యానంబునఁ గొలువ నంతరంగములోనన్
గానఁబడు కలల కెల్ల ని, దానం బగు సుప్తి, దానిఁ దగుఁ దెలియంగన్.

75


క.

నుత్యచరిత్ర విశ్వేశ్వర, కృత్యము సంకల్పసుప్రకీర్ణము నగు సా
హిత్యమును మరగి సుప్తికి, నిత్యత్యము గలుగఁ గోరు వెలతుక యెపుడున్.

76

బోధము

క.

ఇంద్రియములు చిత్తమున క, తంద్రత లో సగుటఁ జెప్పఁ దగు బోధముగా,
రంద్రకారవిలోచన, సాంద్రవికారముల నెఱుఁగఁ జనుఁ దజ్జ్ఞులకున్.

77


క.

విశ్వేశ్వరుండు పాలిత, విశ్వంభరుఁ డనుచు బుధులు వేదప్రముఖా
నశ్వరవిద్యలయందున్, శశ్వత్పరిబోధసిద్ధిఁ జాటిరి జగతిన్.

78

ఔత్సుక్యము

క.

గురుబంధు ప్రియ ధరణీ, వరవనితాలోకనారి వాంఛలచేతన్
బరు వగు నౌత్సుక్యము త, త్పరత విలంబమునఁ గావవచ్చున్ జెలిమిన్.

79


క.

ధరణీవరాహలక్ష్మణుఁ, డరిలక్ష్మి వహింప వచ్చునప్పుడు నగధీ
తరుణులు తొడవులు వీడ్వడఁ, బొరిఁ దొడిగెడు కౌతుకంబు పొల్పగుఁ జూడన్.

80

ఆవేగము

క.

అమితవిచిత్రాలోచన, సమయంబుల సంక్రమించు సంభ్రమ మావే
గము నాఁబడు; ననుచిత ని, ర్గమనస్ఖలనాదికములఁ గనుఁగొనవలయున్.

81


క.

సొబగారువిశ్వభూవరు, ప్రబలజయశ్రీలఁ జూడఁ బఱతెంచుతఱిన్
గబరీకుచజఘనంబుల, నిబిడత నసియాడెఁ బురమునెలఁతలనడుముల్.

82

గర్వము

క.

రిపుతర్జనవాచాటము, విపులాత్మోత్కర్షకథనవికటము రణలో
లుపమును నగుభుజదర్పము, నిపుణులు గర్వం బనంగ నెగడుచునుండున్.

83


క.

బాణకళాగర్వమునఁ గృ, పాణాహంకారగరిమఁ బాటియె సమర
శ్రేణీవిహరణవికట, క్షోణీశులు రాయగండ గోపాలునకున్.

84

హర్షము

క.

దయితాలోకన విభవో, దయ కదనస్తుతులవలనఁ దగ నుదయించున్
బ్రయుతముదము హర్షం బం, గయుతప్రస్వేదపులకకలితం బగుచున్.

85

క.

కరవాలభైరవాంకుని, కరవాలభుజంగి పోరఁ గడు హర్షించున్
బరువడిఁ బరభూపాలక, సరసప్రాణానిలముల సరిఁ జవిఁ గొనుచున్.

86

అమర్షము

క.

అపరాధులపై మనమునఁ, గుపితాత్మున కుద్భవించుకోప మమర్షం
బుపగతమత్సరపాప, వ్యపదేశంబులను నెఱుఁగ నగుఁ జతురులకున్.

87


క.

పరబలములఁ గనుఁగొని, జము, కరణిం గనుఁకొనల నగ్నికణము లురులు నీ
వరగండభైరవునిభట, వరుల యమర్షంబు పొగడ వశమే పోరన్.

88

నిద్ర

క.

అలవున నలసత సురతా, కులతన్ బ్రణయోపపన్నకోపాదులచే
నలవడు నిద్దుర, యది యి, మ్ముల ముకుళితనయనమాత్రమున నెఱుఁగఁబడున్.

89


చ.

చెలువ చళుక్య విశ్వనృపుచే మరుతూవుల నెల్ల గెల్చి యొ
ప్పుల సుఖనిద్ర సేయుతఱి బోటులచూపుల కిం పొనర్చె న
య్యలికముమీఁద: గ్రాలునలకాళియుఁ దిన్ననియూర్పుతావికిన్
జెలఁగెడుతేం ట్లనన్ జెలిమి సేయుచుఁ కొండొకసేపు శయ్యపై.

90

మతి

క.

సహజార్థతత్త్వసంశయ, మహితవినిర్వహణశక్తి మతి యనఁబరఁగున్
ముహురుర్భూతప్రతిభా, విహరణమున నెఱుఁగఁ దగు వివేకప్రౌఢిన్.

91


ఉ.

పాయక కొల్చువారల సుపర్వులఁ జేయుట, వైరులం బలో
పాయసుదర్శనాంచలవిధగ్నులఁ జేయుట, నుర్వి రాజనా
రాయణుఁ డంట, నిశ్చయమ యంచు సుధీంద్రులు విశ్వమేదినీ
నాయకు సత్ప్రభావకథనంబు మహిన్ బచరింతు రెప్పుడున్.

92

అపస్మారము

క.

భూతావేశక్లమమో, హాతురవికృతులఁ దనర్చి యాత్మలయం దు
ద్భూత మగు నపస్మారము, చేతోగతి నెఱుఁగవలయుఁ జేష్టాదులచేన్.

93


క.

భేరీరావంబులు విని, వైరులు కరవాలభైరవభ్రాంతి నప
స్మారులగతిఁ బొగులుచుఁ దల, చీర లెఱుంగురు భయోపచితి యెట్టిదియో.

94

ఉన్మాదము

క.

చిత్తప్రియవనితాహృతిఁ, బిత్తోద్రేకమునఁ గలుగుఁ బృథులోన్మాదం
బిత్తెఱఁ గెఱుఁగుడు దుల్యా, యత్తాచేతన సచేతనాదులయందున్.

95


మ.

హరిణశ్రేణిఁ దురంగమప్రతతిగా నర్చించి మేఘంబులన్
గరులన్ జేసి ద్రుమంబులన్ భటులఁగాఁ గల్పించి పోరాటకున్

దిరుగన్ జూతురు భ్రాంతు లై తఱుచు ధాత్రీపాలు రున్మాదకా
తరబుద్ధిన్ బరగండభైరవునితోఁ దత్తత్ప్రదేశంబులన్.

96

త్రాసము

క.

చిత్తమున నున్నయునికిని, హత్తెడుభయకలన త్రాస మనఁ జనుఁ గ్రూరో
ద్వృత్త నృపదర్శనాదిని, మిత్తంబులఁ బుట్టు నెఱిఁగి మెలఁగఁగవలయున్.

97


క.

ధరణీవరాహు భేరీ, విరావ మాలించి వైరివీరులు వికృతా
తురు లై సాగరగిరి సరి, దరణ్యదుర్గస్థలముల కరుగుదు రోలిన్.

98

ఉగ్రత

క.

దండించుచోట నుండెడు, చండతపే రుగ్రతాఖ్య జనుఁ గలియంగా
ఖండన తాడన తర్జన, తుండనములచేత నెఱుఁగుదురు భావజ్ఞుల్.

99


క.

మ్రొక్కుఁడు బిరుదము లుడిగియు, మ్రక్కుం డటు సేయకున్నమనుజపతుల కా
యక్కజ మగువిశ్వేశ్వరు, దృక్కీలలఁ గమరిపోక ద్రిమ్మర వశమే.

100

జడత

క.

జడత యది కడు ముదంబునఁ, బడు నిష్టానిష్టకర్మభంజనములచో
నడరెడుభయమోదాదులు, దొడరెడునెడఁ బనులవరుస దోఁపింపనిదై.

101


క.

ప్రణయమున రాజనారా, యణుఁ డతిశౌర్యముగ జేయు నాదరణ నుభ
క్షణతృప్తి నఖిలనృపతులు, ప్రణతిప్రణుతులకు జొరరు పరమోత్సుకు లై.

102

వితర్కము

క.

గుణగణవిగుణోత్కర్షణ, గణన వితర్కంబు, దాని గనుఁగొనఁదగు నై
పుణమునఁ జతురులు తత్కా, రణకార్యవిభేదబుద్ధిరసికతచేతన్.

103


క.

శ్రీవిశ్వవిభుఁడు చేసిన, యావెరగుల కలుగవలయు నలిగిన పిదపన్
భావింప నతఁడు ధీరుఁడు- వావిరి ననుఁ దేర్పఁ డతనువడిఁ బడవలయున్.

104

అవహిత్థ

క.

కడు హర్షంబున మదిలో, నడరెడుననురాగ మొప్ప నణఁచెడువెర వ
ప్పడఁతికి నవహిత్థ యనం, బడు నూత్నవిచేష్టితములు పరికింపంగన్.

105


క.

అవిరళముగ విశ్వమహీ, ధవుగుణములు పొగడుచోటఁ దద్గతమతి యై
చెవిఁ బెట్టుచు నొకముద్దియ, చవిచదువులు గఱపెఁ గీరశాబంబులకున్.

106

ధృతి

క.

ఎట్టిపదార్ధము లబ్బిన, నొట్టిడిన ట్లంట నోప నొల్లక మదిలో
గట్టి యపదిట్టతిన మది, యిట్టలముగ ధృతి యనంగ నెందునుఁ బరఁగున్.

107

క.

చాళుక్యవిశ్వవిభుచే, శ్రీలన్ దనరారుబుధులు చేకొన రవనీ
పాలానీతపటీరదు, కూలాగురుచంద్రగంధకోటుల నైనన్.

108

మరణము

క.

గరళానలరోగాయుధ, విరహాదులవలన నగు వివేకింపంగా
మరణము, నయననిమీలన, విరళశ్వాసాంగవర్ణవిధిఁ దెలియ నగున్.

109


క.

కరవాలభైరవుని యని, నరి చావక చచ్చినట్ల యటు పడి యుండెన్
పొరి నూర్పు లణఁచి ఱెప్పలు, మరలింపక గాజువాఱి మ్రాన్పడి భీతిన్.

110

వ్యాధి

క.

జ్వరమున నైనను విరహ, జ్వరమున నైనను దనర్చుసంతాపము వి
స్ఫురితవ్యాధి యనంబడు, శరీరసాదాదివిధులఁ జనుఁ దెలియంగన్.

111


క.

కీలెరియు నొడలు దడివినఁ, గోలంబము లూర్పు లేశిఖుల మండిపడున్
చాళుక్యవిభునిఁ జూచిన, బాలికపరితాప మెన్నఁ బని లే దింకన్.

112

వ్రీడ

క.

మెయిచెలువులు పరికించుచు, దయితునిఁ గట్టెదురఁ జూచి తల వంచినము
ద్దియసొబగు వ్రీడ యెఱుఁగుఁడు, నయనచ్ఛదలీనదర్శనప్రసరములన్.

113


ఉ.

వేడుక విశ్వనాథపృథివీవరసుందరు బిట్టు చూచి తో
డ్తోడన సిగ్గు డగ్గఱుడుఁ దొంగలి ఱెప్పలకప్పులోనఁ జి
ట్టాడెడుచూడ్కు లొప్పెఁ గుసుమాయుధతూణముఖంబునందు మా
టాడెడుపువ్వుఁదూపు లన నంగనకుం దరళింపుఁజాయలన్.

114

స్థాయిభావములు

తే.

ఆత్మసంభావితవిభావకానుభవ
సాత్త్విక వ్యభిచారి సంజ్ఞలఁ దనర్చు
భావములచేత సువ్యక్రభంగు లైన
దాని రసికులు స్థాయిభావంబు లండ్రు.

115


క.

రతి హాస శోక రోషము, లతులోత్సాహంబు భమసమాఖ్య జుగుప్సా
కృతి విస్మయ శమములు నా, సతతరసస్థాయిభావసంపద నొందున్.

116

రతి

క.

సంభోగానాప్తకృతా, రంభస్పృహసాంపుపేరు రతి యనఁ బరఁగున్
సంభృతచేతఃకుతుకవి, జృంభణమున నెఱుఁగఁదగు రసికముఖ్యులకున్.

117


క.

మంగళరూపవిలాసజి, తాంగజుఁ డగువిశ్వనాథునంద మెలఁగు నీ
యంగనకోరిక సతతము, శృంగారస్థానజాతచేష్టాంగక మై.

118

హాసము

క.

అతివికృతదర్శనాభా, షితచేష్టాగతులచేతఁ జేపడుహాస
ప్రతిపాదన; మెఱుఁగం దగుఁ, జతురులు చేతోవికారసరసతచేతన్.

119


క.

చాళుక్యవిభునిఁ దలఁచిన, హేలలు నీనుదుటిచేత నెఱిఁగితి మనుడున్
లీలాహాసమునకు నా, వాలము గావించె నింతి వదనోదరమున్.

120

శోకము

క.

శోకం బనఁగను మదిలో, నాకస్మికవిపదవాప్తి నడరెడుదుఃఖ
వ్యాకులత, దాని నెఱుఁగుఁడు, చేకొని రసభేదిసిద్ధి చేయుటకొఱకున్.

121


క.

ఈకోలధ్వజు నని పెను, బోకులచే నఱ్ఱుఁగడుపుఁ బొలిసిన యరినా
రీకులము నెరయ శోకం, బాకారము దాల్చినట్ల యంగంబులతోన్.

122

రోషము

క.

పరకృతధిక్కారాదుల, నరు దగుకలుషంబు రోష మనఁగాఁ బేర్చున్
పొరిఁబొరిఁ గనలుచునుండెడు, పరుసున నెఱుఁగంగవలయు భావజ్ఞులకున్.

123


క.

ఏపోరిలోన నైనను, నేపారు చళుక్యవిభుని యెసకపురూపా
టోపము దీపించుఁ గడున్, రూపింపఁగఁ గల్పసమయరుద్రాకృతియై.

124

ఉత్సాహము

క.

మత్సరమర్దనమును ద్రిజ, గత్సంకీర్తితము నైనకడిమి నడరు నా
సత్సాహసప్రయత్నం, బుత్సాహం బనఁగఁ బరఁగు నురుతేజమునన్.

125


క.

శంకింపక సురవనితా, శంకరు లగువిశ్వవిభుని సమదభటులకున్
బింకముగ మేను లుబ్బిన, గంకణములు విరిసె శౌర్యగరిమోత్పత్తిన్.

126

భయము

క.

భయ మనగఁ బూరుషత్వ, వ్యయకరణం బగుచు నంతరంగమునందున్
క్షయమునకు వెఱచువెఱ పది, నియతం బగుచుండుఁ బ్రాణినికరంబులకున్.

127


క.

కరవాలభైరవునికర, కరవాలప్రభలసొబగు గలుగుటనె కదా
పరికింపఁగ నెచ్చటఁ బర, ధరణీశతమోగుణంబు తలచూప దిలన్.

128

జుగుప్స

క.

హేయాపాదకవస్తుని, కాయశ్రవణావలోకకథనంబులచే
నాయత మగురోఁత సుమీ, యేయెడల జుగుప్ప యనఁగ నింపులఁ జెఱుచున్.

129


క.

బిరుదములు పెట్టుకొని తుది, బిరుదార్ధము నిలుపలేని బిరుసునృపులకున్
బరికించి రోయు ననిమొన, నరు దగు పరగండభైరవాంకుఁడు లీలన్.

130

విస్మయము

క.

శ్రవణాలోకాపూర్వ, ప్రవరచమత్కారమైన బంధురకృత్యం
బవని నగు విస్మయం బనఁ, బ్రవీణు లెఱుఁగంగవలయుఁ బ్రచురప్రతిభన్.

131


క.

అసముఁ డగువిశ్వభూవిభు, నసిధారాశీతజలము లరినారీదృ
గ్విసరములఁ కొరుఁగుచున్నవి, కసుగందక విస్మయంబు గాదె తలంపన్.

132

శమము

క.

దూరీకృతసంసారవి, కారము శమ మనఁగ నిగమసారం బై పెం
పారు నది గలిగెనేని వి, చారము గడు నొప్పు నెపుడు చతురుల కెల్లన్.

133


క.

చాళుక్యవిశ్వవిభుఁడు మ, హీలలనాపాలనమున నెసక మెసఁగుచో
నోలి యతీంద్రులు మనముల, నాలవపురుషార్థసరణి ననిచిరి మిగులన్.

134


మ.

ఇది నానావిధభావబోధపద మిం దేరాజు రాజత్కళా
సదనం బై విహరించు నాతఁడుగదా సంగీతసాహిత్యసం
పదత్రోవం జనఁ జాలుఁ, జాలిన భవాపాయంబుఁ దూలించు స
మ్మదలీలన్ గృతకృత్యుఁడై నెగడు సమ్యగ్రాజతేజోనిధీ!

135


ఉ.

సోమకులాబ్ధిచంద్రుఁడు యశోధవళీకృతదిగ్గజేంద్రుం డు
ర్వీమహిలాభిరాముఁడు నవీనభుజాబలరాముఁ డంగనా
రామవసంతుఁ డున్నమితరాజజయంతుఁడు వైరిఘోరసం
గ్రామధనంజయుండు రిపుకాననదావధనంజయుం డిలన్.

136


క.

కంఠీరవశూరుఁడు శ్రీ, కంఠపదస్మరణవిగతకల్మషుఁ డసుహృ
త్కంఠగ్రహఖడ్గుఁడు వై, కుంఠపరాక్రముఁడు కదనకోవిదుఁ డెపుడున్.

137


మాలిని.

అతులవిభవశక్రుం డర్థసంపన్నచక్రుం
డతీసుగుణగరిష్టుం డాత్మవిద్యావరిష్ఠుం
డతనుతనువిలాసుం డంగనావికాసుం
డితిరనృపతిపూజ్యుం డిద్ధరాజ్యుండు నీతిన్.

138

గద్యము
ఇతి శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన
వివిధబుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన కావ్యా
లంకారచూడామణి యను నలంకారశాస్త్రంబున భావప్ర
పంచప్రకటనసముద్దేశ్యం బనఁ ప్రథమోల్లాసము.

—————