కాలమే పసిపాప కనువిచ్చిన యుషస్సు

వికీసోర్స్ నుండి

కాలమే పసిపాప కనువిచ్చిన యుషస్సు

కలగా కలవరించి వెలుగుగా పులకించి

ఇరుల కడు పొరసి నే తెరచి వాలిన నాడె

మిసిమి వన్నెల మేన మసి జాలిగా నయ్యె...

తొలి వియోగిని నేనె!

తొలి ప్రేయసిని నేనె!

ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!


మున్నీటి తరగలకు మిన్నేటి నురుగులకు

తడయు నెడబా టేనె! విడని కౌగిలి నేనె!

వానచినుకున సొగసి వలపుచూపుగ నెగసి

పడిపోదువును నేనె! పరువులిడుదును నేనె!

తొలి వియోగిని నేనె!

తొలి ప్రేయసిని నేనె!

ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!


హాలాహ లానలమె అమృత శీతల రసమె

తోడబుట్టులు నాకు! తోడునీడలు నాకు!

నిశి నీలి పదవిపై నిట్టూర్పుగా ప్రాకి

తొలిప్రొద్దు చెరగులో పలుకరింతగ సోకి...

తొలి వియోగిని నేనె!

తొలి ప్రేయసిని నేనె!

ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!


వేయివేలుయుగాలు రేయినై, పవలునై

అడరి కురిసిన యేడ్పు అలరి విరిసిన నవ్వు

బరువుకానుకగ, మన భాగ్యబంధమ్ముగా

చేర్చికొని నాలోన కూర్చితిని నేకొరకె!

తొలి వియోగిని నేనె!

తొలి ప్రేయసిని నేనె!

ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!


కలకాల మలయకే నిలువునా తెరచుకొని

ఎదు రరయు నీ వలపుటింటి ప్రాంగణములో

తొలి ప్రేయసిని నేనె!

తొలి వియోగిని నేనె!

ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!