కవి జీవితములు/ముద్రాపకుల విన్నపము
ముద్రాపకుల విన్నపము.
మన యాంధ్రభాషలో బ్రథమచారిత్రగ్రంథ మగు నీ ' కవిజీవితములు ' తమ యితరచరిత్రగ్రంథముల తోపాటు గ్రంథకర్తచే రెండుమాఱులు ముద్రింపబడియు నిప్పుడు చాలకాలమునుండి మరల ముద్రితము కానందున బలువురచే నపేక్షితమయ్యి లభ్యము కాకున్నయది. ఇట్టిస్థితిలో మనమైన జేతనైనంతవఱకు లోకోపకారక మగుదీని ముద్రించి లోకమున కిచ్చెదముగాక యని మేము చిరకాలము క్రిందటనే తలచియుంటిమి. పలువురు మిత్త్రులును మమ్ము దీనిం బ్రకటింప బ్రోత్సాహపెట్టుచుండిరి. అయినను మా కింతకంటెను నవశ్యకార్యము లుండుటచేతను, వేఱుచిక్కులవలనను ఇంతకాల ముపేక్షతో నుండగా సంస్కృతాం ధ్రాంగ్లభాషావిశారదు లగుమామిత్త్రులు శ్రీయుత గురుజాడ అప్పారావు పంతులు బి.ఏ., ఎఫ్.ఎమ్. యు. గారు దీని ముద్రింప మమ్ము బురికొలిపి, పైగ్రంథకర్తగారి కొమారు లగు శ్రీయుత గురుజాడా దుర్గాప్రసాదరావుపంతులు బి.ఏ., బి.ఎల్. గారినుండి యీగ్రంథమును బ్రకటింప మా కనుమతి నిప్పించి మాచే దీనిని బ్రకటింప జేసిరి. ఇట్లు జనోపయోగముపొంటె మాచే సద్గ్రంథ ప్రకటనము జేయించిన శ్రీ అప్పారావు పంతులుగారికిని, శ్రీ దుర్గాప్రసాదరావుగారికిని, మాచేయు పరిశ్రమ కనుగుణముగా మమ్ము సంద్గ్రంథప్రకటనమునకు బురికొలుపుచున్న భాషాభిమాను లగునితర పంటులకును ననేక వందనముల నర్పించుచు నింతటితో విరమించి మఱియొకదెస కేగుచున్నారము. ఈగ్రంథమున కనుబంధముగా రచియింపబడిన శృంగారప్రబంధ కవుల చరిత్రము, గొంత యితర కవులచరిత్రము, కొన్ని విమశానములును గల గ్రంథము నముద్రితమైన దానిని పైగ్రంథకర్త వలన సంగ్రహించి యుంచిన శ్రీ అప్పారావుగారే మాకొసంగియున్నారు. అది చాల శిథిలమై మొదట గొన్ని పొరటలయంతర్థానముగలదై యున్నది గావున నెమ్మదిగా జక్కబఱిచి కొఱవడినదాని సంపాదించుకొని వెనువెంటానే ప్రకటించెద మని విన్నవించు విధేయులు.
చెన్నపురి. 10-3-1913
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.