Jump to content

కవిజనాశ్రయము/షట్ప్రత్యయాధికారము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవిజనాశ్రయము.

షట్ప్రత్యయాధికారము.

క. శ్రీనారీప్రియకరుఁ డఖి
   లానందకరుడు[1] కవిజనాశ్రయుఁడు ధరి
   త్రీనుతుఁడు సమస్తకళా
   నూనుఁడు షట్ప్రత్యయంబు లొగి నెఱిఁగించున్.[2] 1

క. క్రమమునఁ బ్రస్తారము న
   ష్టము నుర్దిష్టమును వృత్తసంఖ్య యనంగా
   నమరు లగక్రియ యన న
   ధ్వము నన షట్ప్రత్యయములు తనరున్ గృతులన్. 2

క. ఇడి గురువుక్రింద లఘు వ
   క్కడ సదృశము సేసి పిఱుఁదఁ గదిసినగురువం
   దిడఁ బస్తారము; రెం డిడి
   మడుప నగును వృత్తసంఖ్య మల్లియరేచా ! 3

క. [3]ధరవృత్తసంఖ్యలో సవ
   మురుముం జేసినను గూడు మొన్కడ లఘువుల్ [4]
   గురువులు సమవిషయంబులు
   విరచింపఁగఁ జెడినయట్టివృత్తము వచ్చున్. 4

క. [5]ఒక్కటి మొద లిడి మడుపుచు
   నక్కడఁ దుదదాఁక లఘువులందలిలెక్కల్
   లెక్కించి కూడఁ బదపడి
   యొక్కటి మఱి యందుఁ గూడ నుద్దిష్ట మగున్. 5

క. తరతరమ దొంతివృత్తా
   క్షరములు లెక్కాదికంబుగా నిల్పి యధో౽
   క్షరము లుపర్యక్షరములు
   పరువడిఁ గూడుచు నుపాంతపర్యంతముగాన్. 6

క. కలయ నుపాంతాధో౽క్షర
   ము లుపాంతములందు నిల్పి మునుగూడిన నొ
   క్క లగక్రియ (తత్పిండిత)
   మలవడ సద్వృత్తసంఖ్య మల్లియరేచా ![6] 7

క. అగు నర్ధ మేకరహిత
   ద్విగుణితసంఖ్యాంగుళీకృతివ్యాపక మి
   ద్ధగుణాఢ్య ! కవిజనాశ్రయ!
   జగజ్జనాధార! ధీర! చారుచరిత్రా! 8

[7]గద్యము. ఇది వాదీంద్రచూడామణిచరణసరసీరుహ మధుకరాయమాన శ్రావకాభరణాంక విరచితం బైనకవిజనాశ్రయం బనుఛందంబునందు షట్ప్రత్యయాధికారము.


_________
  1. ద-శ్రీనారీప్రియుఁ డఖిలబుధానందకరుండు .
  2. ద-లొప్పఁగఁ జెప్పున్. ద-ప్రతి యింతటితో సరి .
  3. క-వృత్తసంఖ్యార్థమున్ దుదివిషమమైన | గురువు లిడుచును నొక్కటి గూర్చి మఱియు |దళముచేయుచు సమసంఖ్య దగఁగ లఘువు | దనర నిడినను నష్టవృత్తంబు వచ్చు.
  4. ఈపాదము సమన్వయముగా లేదు.
  5. డ-లో నున్నది. క-ఆది రెండిడిమడుపుచు నలర గురువు | లున్ననొక్కటి దరపుచు నన్ని యక్క, రముల నీరీతిమడుపంగఁ గ్రమముతోడఁ, దెలిసి సుకవులు దీని నుద్దిష్ట మండ్రు.
  6. ళ-లో "నొక్కలగక్రియ” యనునంత వఱకు మాత్రమే యున్నది.
  7. మూలములో లేదు.