కవిజనాశ్రయము/ప్రక్షిప్తపద్యములు

వికీసోర్స్ నుండి

[1]ప్రక్షిప్తపద్యములు.

క. [2]శ్రీవల్లభు యతిగణసం
   సే(వితపా)దారవిందుఁ జింతితఫలదున్
   భావజగురు నలఘుచ్ఛం
   దోవినుతు మురారి భక్తితో వినుతింతున్.

పఙ్త్కిచ్ఛందంబునందు :-
   మనోరమావృత్తము.
   నరజగంబులన్ మనోరమన్
   బరఁగు షడ్యతిం బఠింప నౌ'. 1

మణిరంగవృత్తము.
   సప్రసాదరసాగము లొందున్
   దీప్రబాణయతిన్ మణిరంగన్. 2

పంచకమలావృత్తము.
   పంచకమలాఖ్యన్ భయసల్గం
   బంచితముగా షడ్యతిఁ జెందున్. 3

తిష్టుప్ఛందంబునందు :-
ఉపజాతివృత్తము.
   ఈ రెండువజ్రంబులు నిందుఁ గూడన్
   సరోజనేత్రా! యుపజాతి యయ్యెన్. 4

మందారదామవృత్తము.
   ఆఱింట విశ్రాంతి యై తాతగాస్వా
   ధారంబు మందారదామంబు రుద్రా! 5

సుముఖవృత్తము.
   నజజవమున్ శరవిశ్రమమున్
   సుజననుతా! సుముఖం బెసఁగున్. 6

జగతీఛందంబునందు :-
పుటవృత్తము.
   నగయుతయతితో నాతయుతం బై
   యగణము తగ ఫాలాక్ష ! వుటం బౌ. 7

చంద్రవర్త్మవృత్తము.
   చంద్రవర్త్మ మగు సామజయతితోఁ
   జంధ్రజూట ! రనభంబు నగణమున్. 8

కుసుమవిచిత్రవృత్తము.
   కుసుమవిచిత్రం గొను నయయుగ్మం
   బసదృశషడ్యత్యభిహిత మైనన్ . 9

ఉజ్జ్వలవృత్తము.
   స్మయరుచి తలషడ్యతి నుజ్జ్వలా
   హ్వయము ననభరావళిఁ జెందినన్ . 10

అతిజగతీఛందమునందు :--
ప్రీతివృత్తము.
   నగణత్రయమున్ జగసంయుతంబుగా
   నెగడు న్నిధివిశ్రమనీతిఁ బ్రీతికిన్. 11

సుమంగలీవృత్తము.
   సజసంబుతో సగము సంగతితో సా
   మజవిశ్రమంబున సుమంగలి యయ్యెన్. 12

క్షమావృత్తము.
   ననతతగములన్ నవ్యభూభృద్యతిన్
   వినుతమయి క్షమావృత్త మొప్పు న్మహిన్. 13

శక్వరీఛందమునందు :-
జలంధరవృత్తము.
   వ్రాలిభకారమునున్ భభజవంబులతో
   లాలితకీర్తి! దిశాయతి జలంధర యౌ. 14

లోలావృత్తము.
   భూతేశా! మసమంబుల్ పొందంగా భగగంబుల్
   స్వాతంత్ర్యక్షితిభృ ద్విశ్రామం బొందును లోలన్. 15

కమలవిలసితవృత్తము.
   కమలవిలసితము కలయతితోడన్
   గ్రమమున ననననగగములు గూడన్. 16

అతిశక్వరీఛందమునందు :-
మాలినీవృత్తము.
   ననమయయయుతంబు న్నాగవిశ్రాంతమై యి
   ట్లనుపమ మగుమాలిన్యాహ్వయం బయ్యె ధాత్రిన్ . 17

మణిగణనికరవృత్తము.
   మనులఘుగురుకము మణిగణనికరం
   బనఁ జను నెనిమిది యగునెడ యతిగాన్. 18

[3]శాంతివృత్తము.
   ఒందుగా రజద్వయంబు లొప్పు రేఫతో జనా
   నందకారి శాంతి యయ్యె నాగవిశ్రమంబుతో. 19

సుకేసరవృత్తము.
   హరినిభమూర్తి! సత్కవిజనాశ్రయా ! సుకే
   సర మగు దిగ్యతి న్నజభజంబు రేఫతో. 20

మనోజ్ఞవృత్తము.
   నజజభరప్రకరంబున న్నిధివిశ్రమం
   బజితమనోజ్ఞ మగున్ నయం బొనగూడఁగాన్. 21

మాలతీవృత్తము.
   కరటివిరతి నారకాంత యాయుక్తి తోడన్
   మరిగి తిరిగి చెప్ప మాలతీవృత్త మయ్యెన్. 22

ప్రభద్రకవృత్తము.
   రజనిచరాన్వవాయహర ! రామ ! రాఘవా !
   నజభజరల్ ప్రభద్రకము నవ్యదిగ్యతిన్. {{float right|23||

చంద్రరేఖావృత్తము.
   సారంబై చంద్రరేఖన్ జంచన్మరేఫల్ మయాసం
   చారంబుం జెంది పొందున్ సప్తోదయద్విశ్రమం బై. 24

హంసయానావృత్తము.
   ఆనతారిరేచ ! హంసయానకొప్పుఁ గుంజర
   స్థానవిశ్రమంబుగా రజద్వయుబు రేఫతో. 25

ఆకృతిచ్ఛందమందు :-
విచికిలప్తబకవృత్తము.
   శబర నికృతిధర ! పురహర ! సవితృవిరతి విచికిల
   స్తబకమున నిరువదిలఘువులు చన లగ మొగిఁబెనఁగున్.[4] 26

వికృతిచ్ఛందంబునందు :--
పద్మనాభవృత్తము.
   ఎన్నంగ నీతం డనాద్యంతుఁ డంచుం బ
        రీక్షింతు రెవ్వాని వాఁ డెల్లనాఁడున్
   నన్నేలు నా నర్కవిశ్రామ మై పద్మ
        నాభం బగున్ సప్తతంబుల్ గగంబున్. 27

మత్తాక్రీడితవృత్తము.
   మత్తాక్రీడితం బన్ వృత్తం బౌఁ ద్రిదశయతి
        మయమననననవముల్. [5] 28

  1. 25 వ పద్యము క-లో నున్నది. 14 వ పద్యము ద-లో నున్నది. తక్కినవన్నియు బ-లో నున్నవి.
  2. ఈపద్యము విష్ణుపరము గా నుండుట చేతను గొంచెము మార్పుతో ఛందోదర్పణములో నుండుటచేతను బ్రక్షిప్తము. 1 మొదలు 26 పద్యములలో యతిస్థానము చెప్పబడినది. ఈఛందస్సులక్రిందఁ బుస్తకములోని పద్యములలో యతిస్థానములు చెప్పఁబడలేదు. చెప్పకుండుటయే కవిమత మైనట్లు తోఁచుచున్నది. కావున నివి ప్రక్షిప్తములు. 27 వ పద్యములో శివసంబోధస ముండుటచేఁ బ్రక్షిప్తము. 28 వ పద్యము, అనంతునిఛందస్సులోని పద్యమునం దుత్తరార్థ మగుటచేఁ బ్రక్షిప్తము.
  3. అప్పకవీయములో దీనికే సుగంధి యని పే రున్నది.
  4. ద్వితీయపాదమందు యతి చెడినది.
  5. యతి చెడినది. మత్తాక్రీడాఖ్యం బెంపారు న్మమతననననవమహిత మగుచు ర,త్నాత్తబ్రహ్మశ్రాంతు
    ల్గ్రందై (అప్పకవీయము).