Jump to content

కవిజనరంజనము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

శాపానుగ్రహసమర్థులును బ్రౌఢకవితాధురంధరులును శ్రీనాథాది మహాకవులలోఁ బరిగణింపఁబడిన యడిదము సూరకవి పదు నెనిమిదవ శతాబ్దమునాఁటివాఁడు. ఆంధ్రకావ్యచరిత్రమునందుఁ బ్రబంధకవిత్వప్రకరణము సూరకవి రచించిన కవిజనరంజనము తోడనే ముగియునలసియున్నది. ఎఱ్ఱనాదులచేఁ దిక్కన సోమయాజి తెఱంగునఁ దన సమకాలికమహాకవులచే నీ సూరకవియు మిక్కిలి పొగడ్తగన్న మేటి.

క.

రవి యెఱుఁగును భువితత్వము
భువిలోపల నుండు జనులఁ బోషించు సదా
శివుఁ డెఱుఁగు నాట్యతత్వము
కవితాతత్వంబు సూరకవియే తెలియున్.


క.

అంతా కవులము గామా
అంతింతో పద్యమైన నల్లఁగలేమా
దంతివి నీతో సమమా!
కాంతాసుమబాణ! సూరకవి నెఱజాణా!

ఇట్టి పద్యము లనేకము లున్నవి. ఇట్లు సమకాలికులే గాక తరువాతి వారుఁగూడఁ దమ తమ గ్రంథములందలి పూర్వకవిస్తుతులలో నీ సూరకవినిగూడ స్తుతించుచుండిరి. మాడుగుల సంస్థానాధీశ్వరుఁడైన శ్రీ కృష్ణభూపతి యాస్థానకవియగు మంత్రిప్రగడ సూర్యప్రకాశకవి కృష్ణార్జునచరిత్రమునఁ గవిస్తుతులలో సూరకవి నిట్లు స్తుతించెను.

క.

అడిదమువంశాంబుధిరా
డుడు పతియన ధరణి వెలసి యుర్వీశులచేఁ
గడ మన్ననగొని యెన్నం
బడు సూరకవీంద్రుఁ దలఁతుఁ బటుగుణసాంద్రున్.

ఇట్టి పద్యములన్నియు సేకరించిచూడ, నాంధ్రకవులచరిత్రములో సూరకవి కొసంగవలసిన యున్నతస్థానమును గూర్చి యియ్యిఱువదియవ శతాబ్దమునందలి మనము చర్చించవలసిన యవసరము లేకుండఁ బూర్వకవులే యొకవిధముగా నిర్ణయించిరని యూహింపవలసియున్నది. పిండిప్రోలు లక్ష్మణకవి లంకావిజయమునందు రచించిన యొకపద్యములో సూరకవికి భీమకవి శ్రీనాథ రామలింగకవులతో సమానమైన స్థానమును గల్పించుచున్నాఁడు,

క.

తెలియువిను రామకవ్యా
దులు సూరకవిప్రముఖ పృథుప్రతిబావం
తులు భీమ శ్రీనాథుల్
వెలయఁగ నాకరణిఁ దిట్టలే రూఢమతిన్.

తిట్టుకవిత్వమునం దీ కవు లందరికంటఁ దాను ఆద్యుడని లక్ష్మణకవి యభిప్రాయము. కాని సూరకవి తిట్టు కంసాలి సుత్తెపెట్టు" అను పద్యపాదము లోకోక్తియై దక్కిన చాటుపద్యములును గూడ నప్రయత్నముగ నత్యాశువున క్షణకాలములో గవినోటనుండి వెలువడియుండునని శ్రవణమాత్రముచేతనే కవిత్వవేత్తలు గ్రహింపగలరు. ఆయాపద్యము లెల్ల వాని జీవిత చరిత్రాంశములను దెలిసికొనుటకు మాత్రమే మన కుపయోగపడును గాని కవిత్వతత్త్వవిచారమునకుఁ బనికిరావు. కావ్యకవితాప్రౌఢిమ చాటుకవిత్వమున కలవడుట దుష్కరము. సూరకవిచాటుకవిత్వ మంతయు నించుమించుగఁ దిట్టు కవిత్వమే. అందుచే నట్టి పద్యములయందలి భాష సామాన్య గ్రాంథికభాషగాక తఱచుగ వాడుకభాషయే యగుచున్నది.

ఆ.

మోటముండకొడుకు మాట చెల్లిననాఁడు
నన్ను లక్ష్యపెట్టినాఁడు కాడు
తెలిసి యిప్పుడు నన్ను దీవించమంటాఁడు
పడ్డ చన్ను లెత్త బ్రహ్మవశమె.

నిత్యవ్యవహారసంభాషణలయందుఁ గూడ సూరన తఱుచుగఁ బద్యములతోడనే ప్రసంగించుచుండువాఁడని వాడుక. కవి ప్రయత్నపడ నవసరము లేకయే వాని నోటఁబడిన సామాన్యవాక్యములు ఛందోబద్ధములై వెడలుచుండెను. ఒకానొక కాపుఁబడంతి తన యత్తవారియూరగు అదపాకకుఁ బోవుచు గ్రామాంతర మేగుచుండిన కవికంటఁబడినంత సూరకవి యామెను “అదపాకా? అత్తవారలౌనే పాపా!" అని యడిగెనఁట. ఇట్టి ప్రాసంగిక పద్యములు వందలకొలఁది మాప్రాంతమున మిక్కిలి ప్రచారములో నున్నవి. దూషణ భూషణ ప్రసంగాదులయందు సూరకవి చెప్పుచుండిన పద్యములు తఱుచుగాఁ గందములే. ఈతని కందములు కవిత్వవసంతమాకందములు. పూర్వము కవిచౌడప్పశతకకారుఁడు కందపద్యరచనయంచుఁ దాను దిక్కనకంటె ఘనుఁడనని చెప్పుకొనినాఁడు:

క.

క్రిందటిదినములలోపలఁ
గందములకు సోమయాజి ఘనుఁడందురు నే
డందఱు నను ఘనుఁ డందురు
కందంబులఁ గుందవరపు కవిచౌడప్పా!

ఛందస్సంబంధ నిబంధనలయందుఁ గందరచన క్లిష్టతరమగుటచేతఁ "గందము చెప్పినవాఁడు కవి, పందిని బొడిచినవాఁడు బంటు"నను సామెత వచ్చినది. పదునెనిమిదవ శతాబ్దమునందలి కవులలో సూరనవలెఁ గందము చెప్పఁగలిగిన కవి వేరొకఁడు లేడు. తిట్టుకవిత్వమున సూరకవికంటె ఘనుఁడనని చెప్పుకొనిన పిండిప్రోలు లక్ష్మణకవి కాలక్రమము తప్పకుండ నలువురు కవులపేరు లొకకందమునఁ బొందుపఱుపఁజాలక తారుమారు చేసి పద్యము రచించుట కెంత ప్రయాసపడెనో పద్యరచనాతత్త్వజ్ఞు లీ క్రింది పద్యమువలన గ్రహింపఁగలరు.

క.

తెలియవిను రామకవ్యా
దులు సూరకవి ప్రముఖ పృథుప్రతిభావం
తులు భీమ శ్రీనాథుల్
వెలయగ నాకరణిఁ దిట్టలే రూఢమతిన్.

సూరన యిట్టి రచనలయందు గొప్ప నెఱజాణ. ఎట్టి కల్పనలు, నెట్టి భావములు, నెన్నిపేరులైనను గందములలో నౌచితి చెడకుండ నందముగాఁ గూర్పఁగల నేర్పరి.

క.

 సరివత్తురె గుణసంపద
వెఱవక మాపొణ్గుపాటి వేంకటపతి కా
ర్గురు చక్రవర్తులు బదా
ర్గురు రాజులు ముప్పదిద్దరు నియోగివరుల్.


క.

ధీరాగ్రణి శివరామ
క్ష్మారమణుం డేలు చెముడు శంబరపురమా?
పోరామా? రొంపిల్లా?
పొరాదా? మంగరాజు పాలెము పట్టా?


క.

బలవంతుఁడు బలహీనుఁడు
బొలుతురు విధితప్ప; నల్లపూసలు ముత్యాల్
తొలగుఁగద మగఁడువోయిన
వెలఁదుకకున్ బొణ్గుపాటి వేంకటమంత్రీ!


క.

కోయక పెరుగదు బచ్చలి
మేయక పాలీయ దావు మేదిని నెపుడే
నీయక రాదు సుకీర్తియు
వేయేలా పొణ్గుపాటి వేంకటమంత్రీ!

కందరచనయందేకాక తక్కిన వృత్తములు రచించుటయందుఁ గూడ సూరన గొప్ప చతురుఁడని వాని కవిజనరంజన కావ్యమును బట్టి చెప్పవలసియున్నది. అందు ముఖ్యముగా శార్దూలవృత్తరచనలో సూరకవి రెండవ శ్రీనాథుఁడు. భాసురాలంకార పరిష్కృతములైన మదవారణముల కరణి నతని శార్టూలవృత్తములు వాని కావ్యకథావీథుల నతిగంభీరముగ సంచరించుచుండును.

శా.

శయ్యాదంభముసన్ మురాంతకుఁడు, భూషాకైతవస్ఫూర్తిచే
నయ్యార్యారమణుండుఁ దాల్తురు భుజంగాధీశులన్ నీయ సా
హాయ్యప్రస్ఫుటధాటి కోర్వ కనుచో నబ్జాస్యలా గెల్చు వా
రయ్యా గంధసమీర! ప్రోవఁగదవయ్యా యీకురంగేక్షణన్.

పద్యరచనయందుఁ గవికిఁ గల సామర్థ్యము యతిప్రాసలకూర్పు నేర్పునందే కొంత వెల్లడియగుచుండును. కవికిఁ గల రచనాచాతుర్యము పరీక్షించుట కీ యతిప్రాసలు గీటుఱాళ్ళు. కవిత్వతత్త్వమున నప్రతిమప్రతిభావంతుఁడైన సూరన యీరహస్య మెఱింగియే యతిప్రాసలం గూర్చి యీ క్రింది సూత్రములను గల్పించినాఁడు:

సీ.

యతియుక్త వాక్యానుగతి నంటవలయు వ
                  త్సంబు ధేనువువెంటఁ దవిలినట్లు
మెట్టు మీఁదను గాలు పెట్టఁ గైదండ యం
                  దిచ్చినట్టులు ప్రాస మెనయవలయు.

ఉభయభాషలయందును గవిత సెప్పు పోకడలుం గూర్చి పెద్దన చెప్పిన సింహావలోకన మను నుత్పలమాలికయందు సూరకవికి మక్కువ యెక్కువ. ఆ మాలికయందుఁ బెద్దన వివరించిన కవితాధర్మములను సూరన తన కవిజనరంజనమునందు మిక్కిలి పాటించెను. ఇంతియేకాక యట్టి మాలిక తానుఁగూడ రచించినాడు. కాని పెద్దనమాలికవలె సూరనమాలిక యాంధ్రదేశమున కంత వెల్లడి కానట్లు తోఁచుచున్నది. విమర్శకుల పరిశీలనకై యామాలిక నీవ్యాసమునకుఁ చివర చేర్చితిని. ఈ మాలిక సూరకవి విరచితమని యొకప్పు డముద్రితగ్రంథచింతామణియందు మాత్రము ప్రకటింపఁబడినది.

ఒక్క పెద్దన కవితారీతులేగాక శ్రీనాథాది మహాకవుల జాడ లనేకములు కవిజనరంజనమునఁ గానవచ్చుచున్నవి. శృంగారనైషధ వసుచరిత్రాది మహాకావ్యములకుఁ దరువాత నాధునికాంధ్రవాజ్మయములో నంత యున్నతస్థాన మలంకరింపఁదగిన దీ కవిజనరంజన మొక్కటియే. మఱియు నాఁటంగోలె నేఁటివరకు నియ్యది పిల్లవసుచరిత్రమను విఖ్యాతి నొందుచున్నది. తన కావ్యపుత్రికలలోఁ గవిజనరంజనమునే సూరకవి యెక్కుడు ప్రేమించుచుండెను. రాజాస్థానములయందును, నూతనగ్రంథరచనారంభములయందును దాను