కవికోకిల గ్రంథావళి-2/భగ్నహృదయము

వికీసోర్స్ నుండి

I some times hold it half a sin
To put in words the grief I feel
For words, like Nature, half reveal
And half conceal the Soul within.

But, for the unquiet heart and brain,
A use in measured language lies:
The sad mechanic exercise,
Like dull narcotics, numbing pain.

In words like deeds, I'll wrap me o'er,
Like coarsest clothes against the cold:
But the large grief which these enfold
Is given in outline, and no more.

in memorium.


భగ్నహృదయము.

_____________

ప్రియావియోగము.

________

జలధరమాలికా మలినశయ్యను మిత్రుఁడు గూలె; నేడ్పులా
ర్పులఁ బులుఁగుల్ కులాయముల పొంతలకేఁగక కొమ్మలెక్కిము
క్కులఁ దడిలేకయూర్చు; వడఁగూరినపోలికఁ బూలతీగలుం
దలలనువాంచు; గాలి వెతతాకున మూల్గు సహానుభూతితోన్.

మును గనుపండువై తనరు మోహనవస్తువులెల్ల వెల్లఁబో
యినగతి బాష్పముల్ దొనఁక నేడ్చుచు నీరవభాషఁ బల్కెడిన్
‘గనుఁగొన, మాకునున్ నెగులుగల్గెడి నీదు ప్రియావియోగ సం
జనిత దురంతతాపమున, శాంతిలుమోయి' యటన్నమాటలన్.

ఇరువురి చిత్తఖండముల నేకముచేసిన ప్రాణకాంత యం
తర విరహాబ్ధిపంకమున నాఁటుకొనన్ నను ముంచిపోయెఁ; గ్ర
మ్మఱ ధరఁ జేరరా దనెడుమాట నెఱింగియు నేమొకాని, నా
తరుణ మనంబు స్వాప్నికపథంబునఁ బోవును బ్రేమవాసనన్.

కన్నులువిప్పి చూచితిని గాంతశవంబును, జేతితోడనే
యన్నులమిన్న కాష్ఠమున కగ్గి రగిల్చితి, నింతచేసియుం,
జన్న తెఱంగెఱింగియును సంశయమొందును బాడుబుద్ధి! యా
పన్నుల చిత్తవిభ్రమపుఁబాటులు నిట్టివియేమొ యెల్లెడన్ !

కలలోనైనఁ దలంపలేదుగద యోకల్యాణి, నీ కింతలో
పల నూఱేఁడులు నిండునంచు, విధి దుర్వారప్రభావంబు మ
ర్త్యులయత్నంబు సధఃకరించుగద! వైద్యుల్ దివ్యసంజీవిఁ జెం బులఁద్రావించియుఁబూర్వదుష్కృతఫలంబున్ మార్పలేరైరిగా!

ఇరువదియేనువత్సరము లేఁగకపూర్వమె, యౌవనంపు బం
గరు చషకంబులో నురుగుగ్రమ్మెడి యాసవ మింకకుండఁగన్,
సరస మనోనురాగ తృష శాంతిలకుండనె, జీవితంపు మా
ధురిఁ దనివార నానకయె తొయ్యలి, పోయితె కాలదుర్గతిన్ !

పది పదునొండు వర్షములపాటు నిరంతర దుగ్ధకుల్యయై
హృదయ తటంబు లొత్తి ప్రవహించిన ప్రేమరసంబు లింక, నీ
యదనున సార్ధవాహము జలాశయహీన మరుప్రదేశ దు
ష్పదయుస నెట్లు నీ నడుపఁజాలుదు నిర్దయ దీర్ఘ యామినిన్.

దర్పణంబున బింబంబు దనరినటులు,
నీదురూపంబు మదిలోన నిలిచియుండు!
ఇదిగో! నెచ్చెలి, యని చేతు లెదురుచాఁపఁ,
గఠినసత్యంబు నామోముఁగాంచి నవ్వు!
గాజులును మెట్టె లెవరివో ఘల్లుమనఁగఁ,
దెలియకుండనె కన్నులు తిరిగిచూచు;
నంతదారుణ యాధార్థ్య మాత్మమెఱవ,
గుండె జల్లను, నిట్టూర్పు మెండుకొనును.
ఇరువురకుఁ దప్ప నితరుల కెఱుఁగరాని,
మన రహస్యంబు లెవరితో ననుదు నింక?
హృదయ మంజూష నాచేత నిడి యదేల
తాళపుంజెవి నీయొడి దాఁచినావు?

మఱ పెటుగల్లు నీ నగవు మాటలు నీ దరహాస చంద్రికాం
కురములు,వచ్చిరాని మృదుకోపము, చామనచాయరూపమున్,
సరసత, మన్మనోనుసరణత్వము, నిర్భరమైన ప్రేమయున్,
మురిపెపుఁజూపుఁగావ్యములు, ముద్దులపేటికలౌ కపోలముల్.

పరలోకంబున కేఁగువేళఁ బ్రణయవ్యామోహ మొక్కండె నీ
పరమై పోయె నటంచు నుంటిఁ; దెలిసెం బ్రచ్ఛన్నసత్యంబు; నీ
కరముల్ నాహృదయంబుఁ, గోరికల, సౌఖ్యంబున్, భవిష్యన్మనో
హర గార్హస్థ్య సుజీవితం బడుగుబాయన్ లాగి కొంపోయెఁగా


పరలోకంపుఁ గవాటముల్ దెఱచి నాపై నొక్కమాఱైన నీ
సరసాలోల కటాక్షముల్ నెఱపుమా, సర్వంబు నీ కాత్మగో
చరమౌ; నన్ గురుతింపఁజాలుదువె యో చానా, నిరంతంబు నీ
కొఱకుం బిచ్చిబికారినై తిరిగెదన్ ఘూర్ణిల్లు చిత్తంబుతోన్ ,
తెలివి నశించినప్పు డొకతేప నినుం గను కోర్కెతోడ నే
వెలుపలకేఁగి, కాఁటిదరి నెచ్చగనూర్చుచుఁ గూరుచుండి నీ
లలిత మనోహరాకృతి నిలాతలమందునఁ బాఱ జూడ బొ
గ్గుల మసి భగ్నశల్యములు గోచరమయ్యె నిఁకేమి చెప్పుదున్ !
స్థిర మిహలోక, మీతనువు జీర్ణముగాదు, సమస్తసౌఖ్యముల్
మఱగవటంచు యౌవనపుమత్తున నుండిన నాకు నెంతలోఁ
గఱపితి వీవు: 'సర్వమును గాలవశంబున నంతరించు, న
శ్వర మగు నీప్రపంచకము స్వప్నమయం' బనుసత్య మంగనా!
కవితా కల్పిత లోకమందు మురళీగానంబు గావించుచున్
బవలున్ రేయు సుఖంబుగా నెగురు నాపక్షంబులం ద్రుంచి న
న్నవలీలన్ ధరణీతలంబునకుఁ ద్రోయన్ మేలఁటే కాఁత? క
న్గవమోడ్తుం, దిలకింపఁజాల నిలలోఁ గన్పట్టు యధార్థ్యమున్ !

హృదయమును దొంగిలించిన రీతిగానె
స్మృతిని సైతంబు నీవు హరింపు మతివ,
అంత సుఖదుఃఖములు భేద మరయరాక,
భావశూన్యత లీనమై పట్టువిడచు!


చేతన్ జాఱిన గాజుగిన్నె మరలం జేఁజిక్కు నే? వ్యర్థ చిం
తా తాపంబున లాభమేమని ప్రబోధజ్ఞాత తత్వుండ నై
చేతన్ గ్రంథముఁ బూని యక్షరములం జిత్తంబు లంకింతు; నా
చేతం గాదొకవాక్యమైనఁ జదువం, జిత్రంబుపో తత్క-థల్!

అనివార్యంబగు దైవనిర్ణయము; దేహం బొక్కఁడే పంచభూ
త నిలీనంబగు; నాత్మకున్ మరణబాధల్ లేవు; లోకంబునన్
జననంబున్ మృతి నైజమంచు నెటులో స్వాంతంబుఁజిక్కించుకో
ననయంబున్ యతినింతుఁ గాల గురుపాదాబ్జంబులే దిక్కుగన్

వేఁగు మాంసంబురీతి నావిళ్ళువాఱు
నుల్లమునఁ దత్త్వబోధ కాలూనఁ గలదె?
యూరడింపులు పుండుపై నుప్పుగల్లు;
ఇంక నేకాంతమే నాకు నేడుగడయ!

12-7-1925



_________



స్మృతి కణము .

________

కనులు మూసినఁ దెఱచినఁ గానుపింతు
వింట నడయాడినట్టులె యిందువదన!
సంతత ధ్యానలీనమౌ స్వాంతమునకు
వెలుఁగు జీఁకట్ల భేదంబు దొలఁగునేమొ!
తెల్లవాఱినఁ బూదండఁ దీసివైవఁ
దరుణి వేణిక నిలుచు నెత్తావి పోల్కి,
మర్త్యమౌ నీస్వరూపము మాటువడియు
సార వర్ణాంకిత స్మృతి సమసిపోదు
చావు బ్రతుకులమధ్య విశాలమైన
కలలవంతెన గట్టితి తలిరుఁబోణి,
కార్యలంపట దినమునకన్నఁ బ్రకృతి
ముసుఁగుఁ దీసెడి రాత్రి నాకొసఁగుఁ బ్రియము.
పవలు రేయికిఁగల భేదబాంధవములె,
యిహపరంబులయందు నూహింపఁగలము;
రెంటి కూడలియగు సంజ, మింటికొనల
విమలరాగంబు వెదజల్లు, వెఱపునిడదు.

మే 1926.



శిశువియోగము.

________

కాలచక్రంబు మును శీఘ్రగామివోలె
నంచు జాడలు గనరాక యరుగుచుండె,
నేఁడు ప్రియురాలి పోకకు గోడుగుడుచు
కతన, నిమిషంబు యుగముగాఁ గడచునాకు.

పూవురాలిన జిఱుపిందె పూపయైన
నంటుకొనియుండు నన్న పేరాస నుంటి;
మృత్యునిశ్వాస పవనంబు రేఁగిసుడిసి
భావిఫలమును గసుగందుఁ బైకివిసరె.

చెట్టువోయిన విత్తైనఁ జిక్కెనన్న
యాసయుంగూడ నేఁటితో నంతరించె;
నకట! నా పూపుదోఁటకాదాయె నోయి
తోఁటమాలి వసంతుఁడా, తొలఁగిపొమ్ము!

పూవుంగిన్నెల దేనెలాని, లతికాపుంజంబు లుయ్యాలకుం
దావుల్ గాఁగ, నిరంతరంబు సుఖయాత్రల్ సేయుతేఁటుల్ ననున్?"
భావా భ్రంకపపక్షుఁగాంచి మదిలోభావించు నాత్మీయ లీ
లా వాల్లభ్యముఁ గ్రిందుసేయు నితఁడేలా వచ్చెనం చెప్పుడున్.

ఇపుడన్నన్ విధి వేఁటకాని వలలో నేకాకినై చిక్కి, పూ
ర్వపుటుత్సాహముగోలుపోయి, గఱులున్ భగ్నంబులైచిందఁగం
గృపతో వీడిన, నీడ సంస్థితుఁడనై "రేయుంబవల్ చీఁకటిన్
అపనోదించు తలంపుతో బ్రదుకు నాయాధిక్య మింకేటికిన్ ?

చిత్తతాపంబుఁ బాపుకోఁ జేలగట్ల
కరిగి కూర్చుండ, మూక సహానుభూతిఁ
బైరు తలవంచు భారంబుఁ బంచికొన్న
ప్రాణసఖులట్లు, కవులకు బ్రకృతితోడు!

అపర దిక్కాంత సైతము నస్తమించు
నరుణ బింబంబుతోఁ గన్ను లవియఁ జేయుఁ ,
దనదు పూజారి యిక్కట్లు తలఁచి కుంద
నెఱ్ఱ ఫుండాయెనో యేమొ హృదయమనఁగ.

ఈ యిలకున్ ననుం బెనచు నే గుదిబందములేదు; ప్రేమ యా
దాయము సన్నగిల్లె; నది దాఁటుట కింకఁ దయారు; రేవునం
బాయక వేచి యుందు నుడుపంబులు నచ్చెడిదారిఁ జూచుచుం
జేయునదేమి? యా పడవ శీఘ్రమువచ్చునొ! యాలసించునో!

మునుపటిరీతిఁ బ్రత్యుషము మోహనవేషము దాల్చి శయ్యపై
గనుగవమోడ్చియున్నననుగాంచి 'సఖా'యని మేలుకొల్పు,మో
మునఁ దన మోము నాన్చి సుఖముం జిలికించెడి ముద్దువెట్టు; నై
నను బరిదగ్ధసారము మనంబు ముదం బెటు లాశ్రయించెడిన్?

ఎంతకాలంబు చీఁకటియింటియందుఁ
గాఁపురం బుంట? యడుగంటఁ గాలిపోయి
స్నేహహీనంబుగా వట్టి శెమ్మె నిలిచె,
నెవరు వెలిఁగింతురో? తైల మేడదింక !

యౌవన నవ్య సౌరభ విహంగ మనాది కులాయవీథికిం
బోవ నుపక్రమించెఁ జెలిపోయిన దారి, శరీర వల్లికిన్
రావిఁక రెండుమాఱులు, తిరంబు, వసంత శుభోదయంబు; లిం
కా వివరంబులేల? గతమయ్యె సుఖంబు, శమంబె దక్కెడిన్ !

పొలములనుండి రాఁగనె ప్రపూర్ణ కళా శశిబింబమట్లు వా
కిలి కడనిల్చి, సిగ్గుమెయిఁ గ్రీగనులం దిలకించుచున్ మనో
విలసన మాననంబున స్రవించెడినోయన నవ్వు స్వాగతం
బుల నుపచర్యసల్పు చెలి వోవ మఠంబుగ మాఱె గేహమున్.

పూవులఁ బిందెలన్ లతలఁ బుప్పొడితావుల నందమైన నా
యౌవన నందనంబిటు ప్రియార్ద్రవియోగ దురంత తాప చిం
తావిల కీలలందు నుసియయ్యెను; ఆ మసి ప్రేమదేవతా
జీవ విహీన మూర్తిపయిఁ జిట్టెముగట్టె సమాధి పోలికన్.

ఉప్పు లోపింప మిగతవి యుండిగూడఁ
జవియు సారంబు కొఱవడు సాదకమున;
మనసుగలసిన యిల్లాలు మఱిఁగిపోవ
నన్ని యుండియు లేనట్టులయ్యె నాకు!


హృదయపు వల్లకాటి రసహీనత దేహమునందె గాక నా
మృదుల కవిత్వపున్ లతల మీఁదికి సైతము నల్లునంచు నా
కొదవెడి సంశయంబు; కృతియున్ సతియట్టుల జంటవాసినన్
బ్రదిమికి నువ్వునీళ్ళనుచుఁ బాద పరాగము రాల్చిపోయెదన్.

విరహపు దుమ్ములోఁ బొరలి వెఱ్ఱిదనాల బికారినై వ్యధా
భర కబళంబులన్ హృదయపాత్ర భుజించుచు బ్రేమవాకిటన్
జిరముగ వేచి యీ కఠిన జీవితమున్ గడుపంగనేల? యం
బరచర కామినీ ప్రణయ మందిరముల్ కఱవాయె నేమొకో!

ఆసవ మింకి క్రొన్నురుఁగు లారిన కొంచెపు మట్టిపాత్రలో
నాసలు నింపి, క్రొత్తఁదన మంటుకొనం బునరుద్ధరించు నా
యాస మదేల నీకు; బ్రభువా? యిఁక నన్నొక భగ్న పాత్రలన్
వేసెడి మూలలో విసరివేయుము భుక్తము సంస్మరింపఁగన్.

24-9-1926.



__________

కవితా చితి.

_______

నాలుక త్రుప్పుపట్టె; నొకనాఁడయినం జెవి కింపుగొల్పు కా
వ్యాలపనం బొనర్చు తల పంకుర మెత్తదు; వ్రాయఁబూనినం
దేలికకాలిగుఱ్ఱపు గతిన్ మఱపించెడు భావ మిప్పుడ
బ్బే! లివసచ్చి ముందడుగు పెట్టదు చాకలియెల్లి బేపినాన్.

రమణీయంబగు నాట్యరంగము నటీరాజ్యంబుగా మాఱి యం
దము నానందముఁ గూర్పఁ, బందిరి హఠాద్దగ్ధంబుగాఁ జూచి ని
ష్క్రమణద్వారముఁ గాంచలేక పొగలో గగ్గోలుగాఁ బర్వు పి
చ్చిమనుష్యుల్ గతి భావముల్ దిరుగు నాచిత్తంబునన్ మొత్తమై.
 
ఇదివఱ కెన్నఁడైన నుదయించిన యంతనె భావపంక్తులన్
బదుఁడని పంపుచుంటిని బ్రపంచపు సంతకు; నిప్పుడన్న నా
చిదగొద కాఱుచీఁకటులఁ జీఁకగు నాశ్రయ లుబ్ధభావముల్
మెదలవు నీరుటెండలఁ; దమిస్రమె స్వర్గము భుక్తిసారతన్.
 
కలమును కాగితంబు తనఖాపడె! 'గుడ్బయి!' రామిరెడ్డి, నీ
పలుకులు వీనులార విని వత్సరముల్ సనె; నంత చెల్లె! చి
ట్టెలుక విధాన దాఁగికొని యేమొనరించెదవోయి యంచునన్
బలుమఱు హెచ్చరించు హితవర్యుల కేమని విన్నవించెదన్.


కలకల ముగ్ధమంజుల వికస్వర సుస్వర గీతికాగతిన్
దొలఁకు కవిత్వనిర్ఝరము నూత్న పథంబులఁ ద్రొక్కుఁగాని,శీ
తల హిమరాశి పేరి జలధారలు నిర్గతిమాని గడ్డలై
యలమటవేచియుండుఁ దరుణార్క. కరాంకుర హాసరోచికిన్ .

కమనీయంబగు వింతవస్తువులతోఁ గాంతిల్లు నా గేహరా
జము మధ్యన్ వెలుఁగొందు దివ్వెగనువై సర్వంబు పెంజీఁకటిన్
సమసెన్; నే నిఁకఁ గొన్నినా ళ్ళతిధిపూజాసేవకుం జాలనం
చు మదిందోఁచెడి; దీపమెప్పు డచటన్ శోభిల్లునో క్రమ్మఱన్

పలుకగు కెంపురాల పరిపాటి నగందగు నాసవంబు నం
చులు పొరలంగ నింపి సరసుల్ చవిచూడఁగఁ బానశాలలో
నిలుపుదుఁ గాచపాత్రికల; నేఁ డయొ! యన్నియు బాష్పవారిబిం
దులఁ బరిపూర్ణమై రుచికి దూరమునై వెతగూర్ప వేరికిన్?

కనఁగ మనోహరంబులగు కల్యకు సంధ్యకుమధ్య బొల్చుమో
హన భువనంబు నాదు హృదయార్తి మలీమస వర్ణవర్ణికన్
బెనమటు పూసిపూసి కడువెక్కసముం బొసరింపఁగోర; నన్
బెనఁగొని పిప్పిసేయు పరివేదనతోఁ బనియే మొకళ్ళకున్?

శిరము నిశీథ తారకల శీతలకాంతి సుఖంబుఁ గోరి యం
బర చరవాసనన్ మరలఁ బై కెగ నిక్కునుగానిఁ, పాదముల్
మదగొని కర్దమహ్రద నిమగ్నములౌట వృధాప్రయత్న ము
ష్కరతఁ గలంచుదున్ మకరసంభృతమౌ కలభంబు పోలికన్ .

కడచెను మూడువర్షములు కాంతవియోగము సంభవించి;యా
పిడుగు కండిది తాఁకులకు బీటలు వ్రయ్యలు వాఱినట్టి నా
యెడఁదను బూర్వరూపమున నేరిచి కూరుచు మంత్రకత్తె యె
ప్పుడు పొడకట్టునో యమృతపూర్ణ కళోజ్జ్వల పాత్రహస్తయై,

రూపములేని సంస్మృతికి రూఢిగ సల్లుకొనంగలేక దా
దాపుగఁ బ్రేమవల్లి కృశతంగని దగ్గఱనున్న కొమ్మనే
ప్రాపుగఁ జేసికోఁ దలఁచి ప్రాకెడినౌర! గతానుభూతముల్
తీపులె యయ్యు మానవహృదిన్ సతతంబును బందిసేయునే?

భావము మాఱినంతనె ప్రపంచముమాఱును; బూర్వమట్లు సం
ధ్యా వివిధాభ్రవర్ణముల తట్టుకుఁ బోవదు బుద్ధి; కోకిలా
రావము లింపు నింపవు; నిరర్థక దాస్యములయ్యె యామినీ
సేవలు; రమ్యమౌ ప్రకృతి ఛీ! యనిపించు విరక్తి పెంపునన్..

ఇట్టి మంటల నింకెట్టు లించుకైన
నవురు వెన్నెల కవిత మనంగ నేర్చు?
నదియుఁ గాలానధింగాంచి యరిగెనేని
దాని చితిపైన నిర్మింతుఁ దాజమహలు!

మే 1927



_________

మనో విప్లవము.

_______

సృష్టి, చిత్రంబునకు మూలజీవమైన
జనన మరణ క్రమంబుఁ జింతన మొనర్చి
యంతుగనలేక యత్నంబునాఁపుకొంటి;
దేవ, పరమేశ, యున్నావొ? లేవొ? చెపుమ!

చాల ప్రసిద్ధ శిల్పివని చాటుచునుండును బండితాళి; నీ
లీల లనంతముల్; దెలియ లేము రహస్య; మదేలొకో నమూ
నాలను వ్రాసి వ్రాసి కరుణంబును దృప్తియులేక చింపె; దీ
కీలెఱుఁగంగ రాని కృతికిన్ లభియించున దేమి దెల్పుమా?

కొందఱు సృష్టి నీదయని కొందఱు కర్మఫలంబటంచు నెం
దెందఱొ వ్రాసినార లది యెట్లగు? కర్తవు నీవయేని నీ
చందము దూష్యమౌను; మఱి సర్వము కర్మఫలంబటన్న నీ
వెందు కజాగళ స్తనమ వీ యపదూఱు వహింప దైవమా?

తీవలునాటి, పాదులకుఁ దీయక నీరమువోసి, యామనిం
బూవులు పూవనున్న తఱి మూలములం దెకలించివైచు నీ
భావ మదేమి? యీముడిని బండితులైన సడల్పలేరు; కా
లావధి డగ్గఱించు! వృథ యయ్యెను జీవిత ముత్తచర్చలన్ .


మనమున కందరాని యను మానపుఁ జిక్కునువిప్పుయత్నముల్
దినదినముం బొనర్చి కడతీరము గానక బమ్మరింపఁజా
లను; నెటులైన రాఁగల ఫలంబులు, కాఁగల మంచిచెడ్డలున్
బెనఁగొని వచ్చు నొక్కటిగ, వీడుఁ దమంత నయాచితంబుగన్,

కర్మఫలమైన దైవాధికారమైన
నింక నేమైనఁ గానిమ్ము; సుకటములు
పోకమానవు, సుఖములు రాకపోవు;
వానియెడల తాటస్థ్యంబు నూనియుందు.

_________



కవి యలౌకికత.

_________

ఓయి కవీశ, భావ రుచిరోజ్జ్వల దృశ్యములన్ సృజించి త
చ్ఛాయలు లౌకికంబులగు సత్యములంచు భ్రమించి, నమ్మి, నీ
ప్రాయము జీవితంబు నిటుపాడొనరించెద; వొక్కనాఁడు నిన్
బాయక మేలుకొల్పు విధి భగ్నమనోరథ తోదనంబునన్ .

భావన నీకుశత్రువు; విభావరి దాఁటక మున్నె, సూక్ష్మతా
రానళి కాంతిఁ గాంచి గగనాంచలమందు మనోజ్ఞ వర్ణ రే
ఖా వలితేంద్రచాపమును గల్పనసేతువు; గుడ్లగూబ ఘూ
ఘావనికూయ, నుల్కిపడి కాంతువు నిక్కపు టంధకారమున్.

కావ్యరచనలందుఁ గవివి కావచ్చును;
దివ్యలోకమందుఁ దిరుగ వచ్చుఁ;
గామ్య వస్తువులను గవిదృష్టిఁ జూడకు;
గట్టినేలఁ దడవి కాలు మెట్టు.
 
కంటి కందని యాదర్శకంబుఁ గోరి
యకట! దఃఖాంతనాటక మాడెదీవు!
వెనుక ఫలమేమి?___మానవద్వేషవహ్ని!
రక్తసిక్త హస్తముల నిష్క్రాంతి నీకు!

21-2-1928.



___________

నిస్సహాయత.

_______

చెలిదనినంత నాయెడఁదచిక్కము, లుబ్ధుని ముష్టిరూకలన్
బలముగఁ బట్టియుంచుగతిఁ బల్లనకోమలమైన ప్రేమఁ జి
క్కులనిడె; నిచ్చిపుచ్చుకొనఁ గూడని యీదురవస్థ కెన్నినా
ళులునెలలేడులోర్చుకొని లొంగుదు,మ్రింగుదులోనదుఃఖమున్ !

కొలఁదికి మించు భారమగు గోనెను గాడిదమీఁద వైచి దొ
త్తిలఁ బడి కాలువూనుకొలఁదిన్ గొరడా మెదలించు నిర్దయున్
దలఁపున కీడ్చే దైవకృతి; తెన్నును గార్దభమేని నోర్చుకో
నలవి దొలంగ; మానవునకా తుదిమార్గము గూడ లేదుగా!

2-7-1928



_________

ప్రణయ బలి.

______

బచ్చెన వండుఁ గీర మటు భ్రాంతిమెయిం గనిపెట్టుకొన్న నా
పిచ్చితనంబు కొందఱకు వేడ్కయు, నా కనవాప్తిలజ్జయుం,
బచ్చని కోర్కెకుం దెవులు, బంధుహితాళికి జాలిఁ గూర్చిపై
పెచ్చుగఁ దీఱరాని వెతవెట్టునొ జీవితశేష మంతయున్ .

రాజరాజ హృద్దేశ విభ్రాజమాన
కమ్రముక్తాఫలము శుక్తి గనును గాని
మూల్య మెఱుఁగ ద దెంతటి మూఢమతమొ;
వింత యొనగూర్చెఁ బ్రారబ్ధ విలసనంబు.

ఈఁక లెదిగినఁ గనుదాఁటి యెగురు నంచు
ఱెక్కలను ద్రుంచెఁ బిల్లకు నొక్క పులుఁగు;
ఇదియె వాత్సల్య దృష్టాంతమేని యింక
స్వార్థపరతకు ముద్దుపేర రబ్బినట్లు!


అతివ, యవివేక దూషితంబైన బంధు
జన సదుద్దేశమే భావి సమయ భోగ
భాగ్యములకు నిరోధక బంధమయ్యె;
దల్లి విషపాత్ర నందీయఁ ద్రావ వలెనొ?

సదనురాగంబు పరిభవక్షతి నొగిలియు
ద్వేషముగ మాఱఁబోదు పవిత్ర మగుట;
వే ఱొకని జీవితంబు నీప్రేమ కతన
సౌఖ్యపడునేని యది కొంత సంతసంబె.

మగనాలి వౌట, నాకుం
దగ దిఁకఁ దలపోయ నిన్నుఁ దక్షిణీమణి, నే
నగపడను దెరల మాటున;
విగతాశుని వీడుకోలు వేడకు మింకన్.

కాని, యొకకోర్కె గలదు; నీ మానసమునఁ
బ్రణయ బలిరక్త ధార లార్ద్రముగ నున్న
మఱవఁ బోకు మత్ప్రేమసమాధిమీఁదఁ
గనికరంబున నొక బాష్పకణము రాల్ప.

నెలఁతా, భగ్నమనోరథుం డగుట నేనే కాని వాంఛింపకే
కలిగెన్ నీ కమృతత్వసిద్ధి, కవితా కల్యాణ సౌధంబునన్
నెలకొంటం; గవియాత్మమ్రుచ్చిలవయేన్ నీతోడి సామాన్యలౌ
చెలులట్లే నివసింతువేమొ యిల నజ్ఞేయంబుగం జీఁకటిన్.


అన్నిదినాలు భావపటమందున నే లిఖి యించికొన్న య
భ్యున్నత భావిచిత్రము లొకొక్కటిఁ జింపి, నిరాశ మంటలు
దిన్నగ వైచి, పై కెగసి తేలెడు ధూమముఁ జూచి చూచి, మే
ల్కొన్నటు క్రమ్మఱం బడయఁ గోరుదుఁ గీలల రూపరేఖలన్.

అమలంబైన ప్రభాతరాగరసవిన్యాసంబునం బ్రేమ చి| త్రము
లన్ వ్రాసియువ్రాసియిప్పటికివర్ణంబంతయుం, గుంచెయుం మౌ
హిమికాస్వచ్ఛమనోంబరంబువ్యయమాయెం; దచ్ఛ్రమప్రాప్త
కమనీయం బగుసృష్టి, నాయెదుట దగ్ధంబౌట కెట్లోర్తునో!

కవితలు వ్రాసి చింపునటు గాదు! హృదంతరలగ్నమైన యా
యువతి మనోహరప్రతిమ నూడఁ బెకల్చెడుసప్డు జీవిత
ప్రవిమలరక్తపూరములు పై కెగఁజిమ్మెడు బాధ నొర్చుకో
నవునెవిధాత, నీకయిన; నారునె గాయము, మచ్చమాయునే?

ఆశాభంగ కఠోరశస్త్రికల న న్నంతంబు గావించి యా
వేశోన్మత్తతఁ ద్రొక్కినన్ సరియ! దుర్వీక్ష్యంబు కోటీన సం
కాశ ప్రాభవ దివ్యతేజము మనఃకంజంబునన్ వెల్గెఁ; ద
ద్రాశీభూత పవిత్రశక్తి యెదుటన్ దర్పింతువే దుర్విధీ?

తలవంపులు ఘటియించితె
పలువంతల సన్నగిలినవానికి; విధి, నీ
బల మెంతొ దెలిసికొందును;
కలకాలము నీకు నాకుఁ గలహము సుమ్మీ.

కాలన్ రాచి విదల్ప నేఁ బురుగునే, కాలానలజ్యోతి యం
చేలా నీ వెఱుఁగంగ లేవు? నిను నీసృష్టిం దుటారించి భా
వాలంబంబున దివ్యలోకములు రమ్యం బౌనటుల్ సల్పి నీ
యాలిన్ దొంగిలిపోయి మత్ప్రణయరాజ్యశ్రీ నొనర్తున్ విధీ!

తలఁపులయందె నావెతను దాఁచఁదొడంగితిఁ గాని, వాతసం
చలిత పయోధి వీచికల చాడ్పున రేఁగు విషాద మేఁచి, యా
కులమయి, గాఢసంయమనకూలముఁ ద్రెంపి క్రమించెనాలుకం;
దలఁగెను దానఁ గొంతపరితాపము; నర్ధవిముక్తి చేకుఱెన్ .

కరుణను నా కయాచితముగా నరిషించిన నీ వరంబులన్
మరలఁ బరిగ్రహింపుము రమాధవ, రమ్యకళావిభూతి, యం
బరచర భావలోలతయుఁ, బల్లవకోమలమౌ మనంబు దు
ర్భర రుజలౌచు నైహిక నివాస మసహ్య మొనర్చు నెంతయున్ .

గఱులను ద్రుంచి, నేలకును గాలికి బంధము వైచియుం, బయో
ధర రథచక్రముల్ పగులఁ దాఁచి, తటిల్లత జాటిఁ ద్రెంపి, క
ర్బుర రమణీయతా కిరణ రోధకమౌ కవచం బొసంగి, ప్ర
స్తర కఠినాత్ముఁ జేసి నను సంసరణార్హు నొనర్పు మీశ్వరా.

కవితానిర్ఝరి, క్రూరమౌ విధి తిరస్కారంబునన్ నీకు సం
భవమయ్యెన్ హృదయాంతక వ్యధలు కావ్యాలల్లిపాండగఁజా
లు విషా దాంకిత గీతికారవళి! చాలున్ నిల్పు మాక్రోశ గా
న విషజ్వాలలు! పూనుమీ యచల మౌనన్యాసదీక్షాధృతిన్.


ఆశీర్వాదము.


చెలియా, నిత్యశుభోదయంబు, సకలశ్రేయంబులున్ ,భోగముల్
విలసత్ ప్రేమ సదాభివృద్ధియుఁ, గళా విద్యాభిలాషంబు, ని
శ్చల మాంగల్యము, పుత్రపౌత్రులును బజ్ఞాతారతమ్యజ్ఞతల్
వెలయన్ జీవిత యాత్ర మీ కిఁక సుఖాన్వీతంబుగా సాఁగుతన్!

21-2-1929



___________

అధ్యాయాంతము.

________

"| made another garden, yea!
           For my new love:
 I left the dead rose where it lay
           And set the new above.

_________

చివురుల కెంపుపెంపెసఁగఁజేయువసంతమువచ్చె; నెన్నఁడో
కవటలుమాని శుష్క. రసకాండత నున్న రసాలశాఖి పూ
ర్వ విధమునం గిసాల విసరంబులఁ బూతల దర్శనీయమై
కవగొనె మాధవీలతను; గష్టములుం గడఁదాక కుండునే!

చీఁకటియింటి కాఁపురపుఁ జీకుదొలంగెను; జల్లవెన్నెలల్
ప్రాఁకి కుటీరకుడ్యముల రాత్రి, దినంబుగమార్చె; స్నేహధా
రా కలితంబు సెమ్మె; కసరావిఁక భావ పిశాచ రూపముల్
చేకుఱెఁ జిత్తశాంతి, విరచించెడి నూహలు భావిచిత్రముల్ .

'గతము గతంబె యెన్నటికిఁ గన్నులఁ గట్టదు; వర్తమానమే
సతత మవశ్య భోగ్యమగు సంపద ' యన్న ఖయాముసూక్తులన్
మతి నిడి, మల్లికా లతిక నాటితి దగ్ధ గతస్మృతిన్, సుమ
ప్రతతుల సౌరభంబు పరిపాకము నొందఁగఁ బండువెన్నెలన్.


అనునిమిషంబు జీవితమునందు నవీన దిగంచలంబులే
కనఁబడు; దుఃఖమున్ సుఖమగాధత విస్తృతిఁ జూపు; రెండునున్
మనుజుని జ్ఞానవృద్ధికి సమానమె; యైన, నగాధతన్ వరిం
పను వెనుదీయుఁగా యుపరిమంథనలోల మనం బధీరతన్ !

అంతంబొందె మదీయమౌ కృతి వియోగాధ్యాయమీనాఁడు;చి
త్తాంత స్సంయమి తానురాగ రసముల్ వ్యాపించె సేతుచ్యుతిం;
జింతాక్రాంతత యౌవనంబు వ్యయముం జేయంగ నేమాయె?సాఁ
గింతున్ జీవిత నందనంబున లతాంగీ దోహదక్రీడలన్ .

చతురంబౌఁ గద దైవకల్పనము! లాశాభంగముల్ గూర్చి, దు
స్థితులం దేలిచి, లోఁతుపాఁతులఁ బరీక్షింపన్ వెతల్ గొల్పి, పై
ధృతిహీనుఁడగు మానవుం గని దయార్ద్రీ భూతుఁడై సంసృతి
క్రతుకర్తం బొనరించు దేవుఁడు సుఖప్రాబల్య మేపారఁగన్ !

7-9-1929.