Jump to content

కవికోకిల గ్రంథావళి-2/ప్రథమ కవిత్వము

వికీసోర్స్ నుండి

ప్రథమ కవిత్వము

1916 - 1918


విన్నపము.

1915 వ సంవత్సరాంతమున నాయందు కవిత్వ మంకురించినది. 1916 మొదలు 1917 వఱకు నాకవితాభ్యాస కాలము. ఈయొక సువత్సరములోపల వ్రాయుటయు చదువుటయు చాలతీవ్రముగ కొనసాగినది. రసికజనానందము, స్వప్నాశ్లేషము, అహల్యానురాగము, కృష్ణుని రాయబారము, అను ప్రబంధములను రచించితిని. ఋతుసంహారమును పుష్పబాణవిలాసమును ఆంధ్రీకరించితిని. అప్పు డప్పుడు ఖండకావ్యములుగూడ వ్రాయుచుంటిని, ఇవియన్నియుంగలసి వేయి పద్యములకంటె నెక్కుడుగనుండును. కాని, ఆకావ్యములు, వ్రాతనెరపడి కుదురుటకు వాయఁబడు కాపీపుస్తకములవలె నున్నవనియు ప్రకటనార్హములుకావనియు భావించి మూటకట్టి మూలపెట్టితిని.ఎవరైనను “పద్యములు బాగుగానేయున్నవి" అని చెప్పినప్పుడు వారు మోమోటతో చెప్పుచున్నారని భావించితిని. “బలవదపిశిక్షి తానామాత్మన్యప్రత్యయంచేతః” అను అనుభవపూర్వకమైన కాళిదాసుని సూక్తియుండగా నా బోఁటి యశిక్షితునకు ఆత్మవిశ్వాసము కొఱవడుట యొక వింతగాదు.

1927 నవంబరునెలలో వీచిన పెనుతుఫానుగాలికి కిటికీ తలుపులుపగిలి పక్కననున్న పుస్తకములబీరువా వాన జల్లున తడిసి లోనికి నీరు ప్రవేశించి పుస్తకములు నానిపోయినవి. వ్రాతప్రతుల దస్త్రముకూడ నానిపోయెను. ఆనోటు బుక్కులసుతీసి యెండఁబెట్టితినిగాని, కాగితములు అట్టలు కట్టుకొని పోయి సిరాతో నలికివేసినట్లు అక్షరములు అగోచరములైనవి. వస్తువు నశించిన వెనుక దానిపై ప్రీతిహెచ్చుట నైజమేమొ! భగ్నావశిష్టములైన యీకావ్యములను ఖండకావ్యములను గుర్తింపసాధ్యమైనంతవఱకు ఎత్తివ్రాసి “ప్రధమకవిత్వ" మనుపేర ఈఖండకావ్య సంపుటమున చేర్చితిని. “స్వప్నాశ్లేషము” మాత్రము బొత్తిగా చీకిపోయినది.

“నలజారమ్మ"కు ననంతరమును "వనకుమారి'కి పూర్వమును అనగా 1917వ సంవత్సరమున వ్రాయఁబడిన “మాతృ శతకము” ప్రతికూడ తడిసిపోయికొన్ని పద్యములు గుర్తించుటకు వీలులేక అర్ధానర్థరూపములతో బయటపడినది. దానిని కూడ నిందుచేర్చితిని. ఈశతకము కావ్యసంపుటమున నలజారమ్మ వనకుమారీకావ్యముల మధ్యగాని లేక ఖండకావ్య సంపుటమున మొదటగాని చేర్పఁబడియుండిన రచనాకాల క్రమమునకు భంగమువాటిల్లకుండెడిది.

ప్రధమకవిత్వముమీఁది ప్రేమచాపల్యముచేత ఈకావ్యఖండములను ప్రకటించుచున్నాను. నాకవిత్వ పరిణామమును దెలిసికొనుట కీకావ్యములుకొంత తోడ్పడగలవు. సహృదయులు నాచాపల్యమును మన్నింతురుగాక..

పెమ్మారెడ్డి పాళెము
9 - 5 - 1935

ఇట్లు,

దుప్వూరి రామిరెడ్డి.



రసికజనానందము.

శ్రీమహిళామణీ కుచపరిస్పుట కుంకుమ చందనాంకమున్
భామినిరాధ దా వరుని వక్షమునంగని మోముఁద్రిప్ప “నా
కేమి శరణ్యమింకసుదతీ,” యనిపాదసరోజ పాళికిన్
వేమఱుమ్రొక్కు కృష్ణుఁడు వివేకరమా విభవంబు మాకిడున్

"క్రీడికినోడి, కంఠమున క్ష్వేళమునుంచియుఁ, బున్కదాల్పువై
పాడి రవంతలేక పరభామను గంగనుబొంది, బూచులం
గూడి నటించునీకు ననుగూర్చె గిరీశుఁడ"టంచు మేలనం
బాడెడుపార్వతిన్ నగి ప్రియంబులఁ దన్పు మహేశుఁగొల్చెదన్

పలుకున్ జోటి విపంచికానవరసవ్యాబద్దగీతంబులన్
వలపింపన్ నిలుపోపలేనితమిఁ జేరంజీరి కర్ణోత్పలా
విలసద్గండము నొక్కినొక్కి యధరావిర్భూత సౌరభ్యసం
కుల మాధ్వీరసమత్తుఁడౌ విధియుమాకుంగూర్చు దీర్ఘాయువుల్ .


ఒక్కరిశిక్షలేదు; కవినొక్కనినేనియుఁ గాంచలేదు; పే
రెక్కిన పండితాడ్యు లిదమిత్థమటంచొక కావ్యమేనియున్
నిక్కము, సెప్ప లేద! యిఁకనీదగు సొంపురహించుకైత వే
ఱెక్కడనుండి యుప్పతిలె? హృత్సరసీజమునుండియేకదా!

కాఱునఁ బట్టిలాగినటుగాఁ దిలపిష్టపుశైలిఁగూర్చి ము
మ్మాఱు విమర్శచేసినను మాధురి సుంతయులేక యెంతయున్
నీరసమౌ కవిత్వమును నేర్వకయుండిన నేమిలోటు? సొం
పారెడు భావబంధముల కాశ్రయముల్ గద సత్ప్రబంధముల్ .

భావరసప్రసంగములు పాయఁగరాదు; సుధామయోక్తులం
బోవిడరాదు; మార్దవమువో శృతికంటకమైన పల్కు సం
భావన సేయరాదు; మదిభారము తోఁపఁగరాదు; శైలిసొం
పేవగఁజూడ నిక్షురసమీనెడు నట్లు రచింపు కావ్యమున్.

బాలురు సైతమొక్కరిని పద్యగతార్థము వేడరాదు! వా
చాలురు బాపురేకవిత! సారససారమరందలుబ్ధతన్
మాలలుగట్టిమూఁగు నళిమండల గీతములంచుఁ బేర్కొనన్
మోలిన ముద్దుమాటలను మూటలు గట్టుమ తీపుజొ త్తిలన్.

రసికులు మెచ్చుకోవలె; విరాజితకుండల గండపాళి సొం
పొసఁగవలెన్; మరందరసమూటలు గట్టవలెన్; మిటారిమే
ల్పసిమి వలందగుబ్బలను బయ్యెదజాఱినఁ బొల్చుక్రొంబసల్
పొసఁగవలెం గడింది; యటుపొల్పెసఁగన్ రచియింతు వేకృతిన్.

అనియిటు మత్సఖుఁడర్మిలి
పనిఁబూని వచించినట్టి పల్కులనెల్లన్
మనమునఁ జింతన చేసియు
ననుమానముతోడ నిట్టు లంటిని మిత్రా.

చిన్నయసూరి వ్యాకరణసింధువు నీఁదను: సంస్కృకాంథ్రశ
బ్దోన్నతపారముంగనను; నొప్పులు తప్పులెఱుంగుబుద్దిసం
పన్నతలేదు, కాని యలవాణి యయాచితరీతి సన్నుఁగై ,
కొన్న తెఱంగుగాక, కృతిగూర్పగ శక్యమె నన్నుబోఁటికిన్.

దొసఁగులు గల్గునంచుఁ, బరితుష్టి యొసంగదటంచు, నెవ్వరో
కసరుదురంచు, మత్సరులుగాంచి హసించెదరంచు, భావముల్
రసములుగూడవంచును జిరంబుగ వేచిననేమివచ్చు, నా
పొసఁగినకైతయుం జివికిపోవును బాండితి దిబ్బగుంటలో .

కృతులురచియించి యందఱి మతులనొకట
తుష్టిపఱుపంగనౌనె యాస్రష్టకైన?
“జిహ్వకొకరుచి” యంచును జెప్పునుడిని
సాహితీపరు లేఱుఁగ రే సరసులౌట?

అంగజ సంగర క్లిశిత హల్లకపాణుల చెక్కుఁ జెమ్మటల్
రంగుగ జోపునేర్పున నిరంతరమున్ మృదుమందవాయువుల్
గాంగతరంగ సంచలిత శాంచనవారిజ సౌరభార్ద్రతన్
బంగరుమేడ సోరణలబాటఁ జరించు సుశీతలంబులై.

నీవిసడల్పకుండ, రమణీయకుచంబులఁ బైటఁ దీయకే
ద్రావఁగనీకయోష్ఠరసపానము మోసపుటక్కుసల్పుచున్
జేవయొకింతలేని విట శేఖరులన్ గిలిగింతలార్చియే
భావజుకేళిఁదన్పకయె పంపుదు రర్థమునాఁచి రోఁచెలుల్

అట్టిపురోత్తమంబున.

కలఁడొక పంటకాఁపు కలకాలముఁ దాతలనాఁటి యాస్తులై
వెలయు మణీకలాపములు వేసవినేన్ వరిపండు నైదువం
దల యకరాలమళ్ళు, దగుధాన్యపుగాదులు పాడియావులుం
గలిగి సమస్తసంపదలఁ గ్రాలుచునుండెను బెద్దకాఁపునాన్ .

[ఈపెద్దకాఁపున కొకపుత్రుడుద్భవించి క్రమముగ బాల్యంబు గడపి విద్యలనభ్యసించి యౌవనప్రారంభసమయమున కామాయత్తచిత్తుఁ డాయెను.]

కన్నులువాల్చూపు కడలొత్తె; వక్షము
         కాంక్షించె ఘనసార కర్దమంబు;
బాహువుల్ ప్రియురాలి పరిరంభమాశించె,
         ముద్దు సౌఖ్యముఁగోరె మోవిచివురు,
చన్నుగుబ్బలిపైకిఁ జననుబ్బె నఖశశి;
         రదనముల్ జిలగొనె బెదవినొక్క;
కర్ణయుగ్మముగోరెఁ గంతు కయ్యపుఁబల్కు
         నాస యపేక్షించె శ్వాసతావి;

అంగమంతయుఁ గైసేత నభిలషించెఁ;
జెలులబొమవింట వాల్చూపు ములికిదొడిగి
మరుఁడుగాఱించ గోవాడి మనమునొచ్చె
లలిత యౌవన సౌభాగ్య లక్ష్మిరాఁగ.

[ఆయెమ్మెకాని సదనంబునకు కతిపయదూరంబున రోవెలందుల వాడగలదు. అందు కనకాంగియను కన్యసౌందర్య రాశియై యొప్పారుచుండెను.]

అంతనా కలహంసీయానకు.
        కన్నులండలఁ జేరఁగావలెననుకొన్న
                 నరచూపు చూచె నీ యన్నుమిన్న
       యురమున సుఖసుప్తి మఱిఁగియుండెదనన్న
                 నిక్కుగుబ్బలరాపు లుక్కుమీఱె;
      కౌను పేదఱికంబుఁగాంచి యాశ్రయలాభ
                 మేమి యటంచట కేఁగ నైతి;
      నాభిపజ్ఞనునుండ నాభీల కూపమై
                 వెఱపు నబ్బురమును గఱపె మిగుల;

      కన్నెపుట్టిన దాదిగాఁ గన్ను ఱెప్ప
      మైత్రి గల్గిన యాయేణ నేత్రఁబాసి
      యెట్లు సైచెదవని బాల్య మేంతొవనరి
      యరిగె నెట్టన యౌవనం బడుగువెట్ట.

కనకాంగి మోవికి నెనగాక కాఁబోలు
        పల్లవంబొక సుప్రవాళ మయ్యె;
పూఁబోఁణి నాసతోఁబోల్పు చెందకయేమొ
        కలికి సంపెగమేలి కనకమయ్యె;
నుత్పలేక్షణ కౌను కుద్దిగాకనొ యేమొ
        యంతరిక్షము శూన్యమై రహించె;
పాటలాధర కటి సాటికి నిల్వక
        వసుధవెలసెను కువలయమనఁగ;

కన్నులకు నోడి లేళులు కానఁదిరిగె;
పాదములకోడి జలముల్ పడెనునీట;
మాఱుపేరులతోనైన మఱిఁగియైనఁ
బడఁతి సౌందర్యమునకోడి బ్రతికెనవియు.

తేఁటిదాఁటు నీటుఁబాటి సేయవు కురుల్ ;
మీల నేలఁజాలు వాలుఁ గనులు;
కెంపు పెంపుఁజంపు సొంపు నింపెడుమోవి;
మించు మించు నొంచు మేనిసంచు,

పున్నాగము రోమావళి;
పున్నాగము నాభి; చనులుఁ బున్నాగములే;
తన్నాగంబుల గెలువఁగఁ
బెన్నాగంబగుచుఁ దనరె వేణి సుదతికిన్.

శ్రోణియందముదాచఁ బ్రసూనశరుఁడు
మిండ తుమ్మెద ఱెక్కలకాండపటము
గట్టెనోయనఁ జికురాళి కలికి పిఱుఁదు
లంటిజీరాడుఁ జీఁకటులావరింప.

వక్షమనుకాంతిసరసి యౌవనమదేభ
మీఁద, హరిమధ్యమేఖల హేతుకలన
బిట్టుగర్జింపఁ గుంభముల్ భీతినెత్తె
ననఁగఁజనుదోయి రాజిలు నబ్జముఖికి.

ఇట్లు సకలజనానురంజకంబై యొప్పువసంతంబున నొక్కనాఁటి సాయంసమయమున కాపుఁకోడెగాఁడు ఉద్యానవనంబునఁ దీవచప్పరంబునఁ గూరుచుండి మన్మథార్తుఁడై వార కాంతా యత్తచిత్తంబున నిట్లుచింతించె:

మత్తమతంగయాన మధు మత్తతఁ గన్నరమోడ్చి యుబ్బి పై
కొత్తెడుపూపచన్మొనల నోరగఁబయ్యెద జాఱఁదీసి మే
ల్పుత్తడి కీలుబొమ్మవలెఁ బొల్చునొయారముగాంచనామరుం
డెత్తడె మీనకేతనము, నేడ్తెఱగుప్పడె పూవుటమ్ములన్?

అరయఁగలేదె మాకొలపుటంగనలం బదివేలసారు; లె
త్తఱిఁ దలదువ్వి క్రొవ్వెదను దండిగఁ బూవులువెట్టిపట్టుటం
బరములుగట్టి వల్లభులభావములన్ హరియింపఁబోరు; రో
తెఱ వలయట్లు నాణెమును తీరును ప్రోదియొనర్పరీసతుల్.

మనకులకాంతలా చెలులమాదిరిగా; రదియెట్టులన్న నే
వినయములేదు, మన్మథవివేకముశూన్య, మటుండ గానముం
బనుపడఁబోదు; పల్కరొకపాటిరసోక్తు; లవెట్టులుండినం
గనఁబడఁబోవుగా వెదకికాంచినఁ జేఁతకుమాఱుసేతలున్.

సొగసులుచేసికొన్నఁదఱుచుం దలదువ్వినఁ బాటపాడినన్
మగల మనంబులాఁకగొను మాదిరి సల్ప సతీత్వధర్మముల్
విగళితమౌనటంచు విలపింత్రుకులాంగన లేమిసెప్ప; నా
మగువలు పేడతట్టలటు మాఱఁ బతివ్రతలౌదు రేమొకో!

ప్రాజ్ఞులాడిన “శయనేషురంభ” యనెడు
సూక్తి కులసతి యెఱుగని సుద్దిసూనె!
అట్టి నైపుణి వెలయాలినాశ్రయించె;

నిగనిగల్ నగఁజాలు తొగఱాల పోగులు
          నిద్దంపుఁ జెక్కుల ముద్దుగురియ,
మగఱాలు పగడాలు సగపాలు జిగులారు
          తారహారములెదఁ దళుకులీన ;
పాలడాలును జాల నేలఁజాలిన మేలు
         వింత దువ్వలువ పై వెల్లివిరియ;
జిలుగు కస్తురిక్రొత్త కలపముల్వలపుల
         నాయుపోతములకు వడ్డికీయ;

అంగుళుల ఱాల యుంగరాల్ రంగు మీఱి
కుండలంబుల కాంతితోఁ గూర్మిసలుప;
నెల వెలందుల వాడకు వెడలె నంత
రామకృష్ణుండు రెండవ కాముఁడనఁగ.

వినని యట్టుల వినువారి వింత నుడులు;
చూడనట్టులఁ జూచునా సుందరులను;
నడచి నట్టుల నడచును గడవఁ డొక్క
బాఱెఁడైనను దన్మయ భావమంది.

అప్పుడా పల్లవుండుల్లము పల్లవింపఁ బల్లవపాణులంగని యిట్లు చింతించు:

కన్నుసన్నల నాయింతి కన్నువిల్తుఁ
బిలిచి ననుజూపి చిత్తము బిట్టునొవ్వ
వేగఁ జనుదెంచె నొకవంక వీధిదాఁటి
గబ్బిగుబ్బల వ్రేగునఁ గౌను వడఁక.

వలపు గుల్కెడు క్రొత్త కలపమలఁదెనేమొ
          కమ్మ కస్తురితావి గ్రమ్ముకొనియె;
విటుని పుక్కిటనున్న విడెమందుకొనెనేమొ
          ఘనసార గంధంబు గడలుకొనియె;

పటుబంధ నిపుణత విటులఁ దేల్చినదేమొ
          భామయూరులు తొట్రుఁబాటునొందె;
సురతాంత తాంతయై సొక్కిపొర్లినదేమొ
          చెక్కులమకరికల్ చెదరిపోయె;

క్రమముదప్పిన చుంగులు గదలియాడఁ
బైట సవరించు నెపమునఁ బట్టెడేసి
చనులు చూపియుఁ జూపక సగము మూసి
కాంత ననుగాంచె నెవతెయో సంతసమున.

ఇప్పుడె వత్తునంచుఁ దన యిక్కకుఁగాంతుఁడు సేరకుంటవాఁ
డెప్పుడువచ్చునో యనుచు నెవ్వరుపోయినఁ బుల్కు పుల్కునం
దప్పక పైగవాక్షమున దామరసేక్షణ తొంగిచూచె; నే
నిప్పుడెదాని బారిఁబడియేఁగెద నన్ను వరించిరమ్మనన్ .

జవ్వని యెవ్వతో తెలియఁజాలనుగాని తదీయవేణితీ
రెవ్వనికైనఁ దెల్పదె మృగేక్షణ భోగినియంచు; మించుక్రొం
బువ్వుల సెజ్జపై స్మరవిభూతికిఁ బట్టముగట్టుకొన్ననే
జవ్వను పుట్టువైన భువి సంతతసార్థకమౌట వింతయే!

ఈతని నడక యొయారము,
ఈతని తెలివాలుచూపు, లీతనియందం
బీతని వెడఁద యురంబును
బ్రీతిగనే యువతిచూడ వీడునె మరుఁడున్.

సిబ్బిగుబ్బలు గఱుపాటు చెందివడఁక
జాఱుపయ్యెదను సవరించకయ మఱచి
కాఁపు బొజుగును గాంచుచుఁ గదలకుండె
నతను పడుకింట వ్రాసిన ప్రతిమవోలె.

దైవవశమ్మున నప్పుడు
పూవులు గోయంగనేఁగు పూఁబోఁడి ననిం
ద్రోవకు నడ్డంబల్లిన
తీవనుసరియొత్తి మరలఁ దిరిగెడునపుడున్.

కులుకు మిటారి గబ్బిచనుగుబ్బలఁ జేసి తదీయభారముం
దెలిసి, లతాంగికౌను గడతేరదటంచుఁబిఱుందు భాగమున్
బలితపుమూలబంధనము భాతినొనర్చియు నారుకమ్మినిన్
వళులనుత్రాటితోనడుముపైబిగియించెనొయేమొబ్రహ్మయున్.

ఎచ్చటనైనఁగాంచితినె యిట్టిమనోహరరూపు? కాంచినన్
మెచ్చుగడించు క్రొందళుకు మీలకనుంగవయున్నె; యుండినన్
బొచ్చెములేని చంద్రకళఁబోలెడి నెన్నుదురున్నె; యుండెఁబో
యచ్చపలాయతాక్షి దరహాసము చాలదె గెల్వనంతయున్.

ఎయ్యదియూరు, మీరిచటికేగుటకుం గత మెద్దియయ్య యిం
కియ్యెడనుందు రె సతము; నెవ్వరుబంధులు, సమ్మదప్రదం
బయ్యెనె వాడసొంపు; పనులన్ని యుఁ దీరెనె; యెప్పుడేగుటల్;

గానాలాపము వింటిరే, నటనముల్ గాన్పించెనే, హార్మొనీ
వీణానాదము మోదముం గొలిపెనే, వీక్షించితే మాడుగుల్,
కానంగల్గితె వారకామినుల నాకస్త్రీసమానాంగులన్
దేనన్ మీకిటఁ దృప్తిగల్గెమదికిం దెల్పంగరాదే ప్రియా.

వార కాంత మాత వచ్చి దగ్గఱ నిల్చి
యింపు కానిఁ జూచి యిట్టులనియె;
నెప్పుడై మీర లీవాడ కేగరు
వెలవెలందు లంత వెకలివారొ?

కాలము చెల్లెకొంత; యలకమ్ముల వెల్లిచిగిర్చె; మున్ను నే
జాల విటాగ్రగణ్యులను జాతురిమైఁగవగూడి యుంటి; నే
వేళను నెట్టివారు వెలబిత్తరి బాహ్యముసేయ; రింతకున్
మూలకమింగిలీషు; మునుమున్నిటువంటి కలాఢ్యులుండరే.

ఎట్టోవిద్యల నభ్యసించి తుద బి. య్యే. ప్యాసుగావించి, తా
రెట్టోప్లీడరులయ్యు వేదికలపై నింగ్లీషుభాషించి మా
పొట్టల్ మాడ్చెడు సంఘసంస్కరణమున్ బోధింత్రులోకంబునన్
గట్టా! గోప్యముగాను వారు గణికం గామింపకేనుందురే.

తహసీలుదారుఁడు దంపూరు శివరావు
           మీనాక్షితోఁగూడి మెలఁగలేదె;
అగ్రహారీకుఁడు హరిహరశాస్త్రులు
           ఇందిరమ్మకు ధన మీయలేదె;

పించెను కలకటేర్ పెద్దిచిన్నయసెట్టి
           నన్నుఁజేవీడెనే మొన్న దనుక;
ప్లీడరు వినుకొండ పిచ్చి మాధవరావు
            విజయలక్ష్మి గృహాన విడియలేదె;

చక్కనయ్యలు వేదిక లెక్కినిక్కి
చేయిత్రిప్పుచు లెక్చరుల్ చెప్పనవియు
నేతిబీరకాయలుగావె! సేఁతలేవి?
పలుకవచ్చును నోటికిఁదలుపు గలదె?

గురువునైనఁగాని కుంభినీ ధవునైన
గణికనైనఁ బేర్మిఁ గాంచునపుడు
రిక్తకరములఁ జన యుక్తముకాదండ్రు
ధర్మవిదులు; గాన, ధనమునిపుడు,

తెచ్చితి. నూటపదారులు
పొచ్చెములేకుండు కూర్మి బోటికి; నిదిగో
యిచ్చెదఁగొనుమా, విను, నీ
వెచ్చట ననఁబోకు గోప్యమిది. యన వినియున్.

వినుమొకమాటఁ జెప్పెదను వీరలవారలరీతి మమ్ములన్
మనమున నెంచఁబోకుఁ; డతిమాన్యతనొందెను నాదుతల్లి; మే
మనయముబూజ్యులలౌవిటులకాతతసౌఖ్యముగూర్చు టొండె;
యాధనమతిముఖ్యమా, రసికతల్ సుగుణాలు ప్రధాసమాసఖా

ఇటుసుతపలికిన వినియా
మటుమాయల వేశ్యమాత "మనసిరియెల్లన్
విటునిదికాదే, యిరువురు
కిటుభేదములున్నె బేలవీవుమృగాక్షీ.

తీసిపెట్టుధనము తిరిగి యాయనయెప్డు
వలసి యడుగ నీయవచ్చుమనము;
అనిన రొక్కమంది యానంద కలితయై
యినుప పెట్టెయందు నిడియెఁ జెడిప.

ఇటులొక సంవత్సరకాలము సంతోష తరంగితాంత రంగులై వెలవెలందియు కాఁపుకోడెగాఁడును కాలము పుచ్చుచుండ నొక్కనాఁడు వేశ్వమాత ధనాకర్షణ యంత్రమోయన అతని సమీపమున నిలుచుండి యారోపిత వినయావనత వదనయై యిటులవిన్నవించె:

దాదాపబ్దంబయ్యెను
నీదాపునఁజేరి తనయ, నీవెఱుఁగవొకో,
నాదాఁచిన ధనమంతయు
నీదినమున కడుగుముట్టె నిఁకమీఁదెటులో.

నీవిటఁ జేరిన దాదిగ
నే విటులును నెంత విత్తమిచ్చినఁగానీ

నావాకిలిఁ జొరనియ్యను;
నీ వెఱుఁగవె దాని ప్రణయ నిశ్చలవృత్తిన్.

కోకలు ప్రాఁతవైచినిగెఁ గోరిన పట్టుగులాబిఱైకలం
జాకలి పాఱవేసె; నిఁకఁజాయమఱంగిన చీటిగాగరా
రేకులు చీకువట్టెను సరే, ఘనసార మృగీమందంబులున్
లేకగదా నెలంతయు విలేపము మేదుటలేదు రొమ్మునన్.

దినమును జెప్పనెంచి నిను ధీరతఁ జేరుటెకాని చెల్ల రే,
మనమెటు ఱాయిచేసినను మాటలురావుగ! జంకిగొంకి నిన్
గనుఁగొని యెట్ట కేలకును గష్టములన్నియుఁ దెల్పికొంటి; దీ
నిని మనకన్యకుం దెలియనీకుఁడు; చూడుడు కార్యపద్ధతిన్.

అంతట నొక్కనాడు తల్లి రామకృష్ణారెడ్డిని జేరఁబిలిచి యిట్లనియె.

జనకుఁడు వృద్ధుఁడయ్యె; వ్యవసాయముభారము; కూలివారలన్
దినమును బిల్చి సేద్యము నుదీర్ణతఁ జేయఁగలేఁడు; తోడు నీ
వనిమది సమ్మియుంటిఁ గొడుకా, ముదిప్రాయపుఁదండ్రి కూఁతవై
పనుల నొనర్పకున్న నిలవారలు ఫుత్రులఁ గోరు టేలొకో.

ఎన్నోనోములునోచి తుట్టతుద కెంతే ప్రీతి నిన్ గాంచి నా
నన్నా, పుట్టిననాటఁగోలె ధరపైనాన్చంగ నేమౌనొ యం
చెన్నో దృష్టులు దీయుచున్ దినము నీదేచింతగాఁ జాకుచుం
గన్నారం గనుచుంటినయ్య తనయా, గారాము తోరంబుగన్.

పుట్టునొయొక్క బిడ్డ యటుపోవుట వచ్చుటఁ జూచుభాగ్యముల్
గట్టునొయంచు నాకడుపు గల్గినదాదిగ నెంచికొందు; నీ
యట్టిడు పుట్టి చందనకుజాళికి నల్లిన ముండ్లతీవెనాఁ
గట్టడి బిడ్డవైతివిగ కాఁపుకులానకు మచ్చ వెట్టఁగన్.
తనయుఁడు గల్గునా, కులముధన్యతనొందున, పేరునిల్పునా,
యని మదినెంచి యుంటి నవురా, యిదియేమిర, చేటుగాల మీ
వనయము వారకాంతల గృహంబునఁ బ్రొద్దులుపుచ్చి పెద్దవా
రిని రవసడ్డసేయక చరించెదు సోమరిపోతువై యసీ!
కులమును శీలముం గలుగు కోడలు నా కుపచర్యసేయరాఁ
బిలిచెడు భాగ్యమబ్బునని ప్రీతిమెయిం దలపోయుచుంటి; నేఁ
దెలియక పోతి నీ కసటుఁ దెక్కలి చెయ్వులు,మానవేర యా
కలికి పిసాళి పచ్చిపలగాకులఁ గూళల రోనెలంతలన్.
కంటిని నీరు చైదములు, కంటిని నీకయి డబ్బుపోకడల్ ;
తుంటరివారిఁజేరి వెలతొయ్యలి నెయ్యము దెచ్చికొంటె; వా
ల్గంటులు లేరె కాఁపుల కొలంబునఁ బెండిలి చేసికోఁగ; పా
ల్వంటి కులంబు నీటఁగలుపన్ గమకించితె యోరిమూర్ఖుఁడా.

[శ్రీ తిరుపతి వేంకట కవుల శ్రవణానందమును చదివిన వెనుక అటువంటి కథనే కల్పించి 'కావ్యము వ్రాయవలయునని దీనిని వ్రాసితిని. ఇది నాలుగాశ్వాసముల ప్రంబంధము. 550 పద్యములు.)

ఋతుసంహారము.

వేసవిరాత్రులందు నలివేణుల యూర్పులకుం జలించు న
వ్యాసవముం గరంబు కుసుమాస్త్రక దీపనమౌ విపంచి గీ
తాసదుపాయముం గలిగి దర్పక బాధితులంత ధూప స
ద్వాసిత రమ్యహర్మ్యముల పైతలమందు సుఖింతు రర్మిలిన్ .

సారసుగంధ సమ్మిళిత చందన లిప్తపయోధరంబులన్
హారి తుషార గౌర సముదంచిత హారములన్ ఘటించి యిం
పారు నితఁబసీమను సువర్ణపుఁగాంచి నలంకరించు శృం
గారవతీలలామఁ గనఁగాఁ బ్రియమారదె నెట్టివానికిన్.

కరము నసహ్యమౌ పవనకాండము రేణుక మండలంబు స
త్వరగతిరేఁప భూమి ఖరభాను కరావళి సంతపింప దు
ర్భర వనితా వియోగశిఖ ప్రజ్వలియింప హృదంతరంబులం
దిరుగు ప్రవాసులిద్ధరణిఁ దేఱి కనంగ నశక్యమయ్యెడున్ .

మలమలఁగాయు నెండలకు మ్రగ్గుచు జింకలు కానయందు దౌ
డలు వసివాడ నత్యధికదాహమునం జరియించి భిన్న క
జ్జల నిభమౌ నభంబు పలుసారులు నీరను భ్రాంతి నాతురన్
బలు పరుగెత్తుచున్నయవి పైఁబయి నఱ్ఱుల నెత్తిచూచుచున్.

మిక్కుటమైన యెండలకు మిక్కిలి తాపమునొంది విశ్రమం
బెక్కడలేక వక్త్రము మఱింతగ విప్పుచు వ్రేలు కేసరాల్
నిక్కవిదిల్చి నాల్క గదలించుచుఁ బెన్‌దగ సింహమచ్చటం
బ్రక్కలనేఁగుచుండెడు నిభంబును సైతముఁ జంపదుద్ధతిన్.

నురుగులు మాటిమాటికిని నూల్కొన నాల్కలుసాఁపినోళులం
దెఱచుచు మోరలెత్తుచును ద్రిప్పుచు దాహముపుట్ట నీటికిన్
దెరువులు సూచుచున్ బడలి నెట్టన భూధరగహ్వరంబులన్
బరువిడె బఱ్ఱెతండములు బారులు గట్టి తదగ్రభూమికిన్.

చిటపటదావదాహమునఁ జెట్టులు చేమలు గాలిపోవ, ను
త్కట పవమానవేగ పరికంపిత శుష్క పలాశ సంచయం
బటునిటు పైకిరేఁగఁ, గమలాప్తవితప్తజలంబులౌట నా
యటవులు భీతిదంబులుగ నయ్యెను నెత్తుననుండి చూడఁగన్

అనిల వివృద్ధ వహ్ని నికటాద్రి గుహాంతర సీమమండుచున్
ఘన నినదంబునన్ విరియఁ గాననఁ గాలిన శుష్క వంశముల్,
కనులటు మూసియెత్తఁదృణకాండమునంజొరి వృద్ధినొందుచున్
వనమృగ వర్గముం గడు వనారిలఁ జేయును బ్రాంతలగ్నమై,

జ్వలనము శాల్మలీమహిజ సంతతులం బ్రభవించి ధాత్రిజం
బుల పెనుకోటరంబులఁ బ్రభూత శిఖాజిత హేమవర్ణమై
తళతళ మండుచున్ బరిణతచ్ఛదసంకుల వృక్షజాల శా
ఖల కెగఁబ్రాఁకుచుం బవనకంపితమై భ్రమియించు నంతటన్.

భిన్న ఖగేంద్రరత్నములపెంపును నింపు దృణాంకురంబు, లు
త్పన్న శిలీంద్రకందళ వితాన మనోజ్ఞత, యింద్రగోపకా
భ్యున్నతి మీఱుభూమి యసితోజ్జ్వల రత్నవిభూషితాంగియై
చెన్నలరారు కాంతవలెఁ జెల్వగు నెల్లెడఁ బాఱఁజూచినన్.

కమ్మని తేనెఁద్రావి తమకమ్మున జుమ్మనిపాటపాడి ప
త్రమ్ములులేని తమ్మివిరి తండమువీడి సముత్సుకమ్ములై
యిమ్మగు నల్లగల్వలని, యెమ్మెగ నెమ్ములు నృత్యమాడ భృం
గమ్ములు పింఛచక్రములఁ గ్రమ్మెడు; మూఢులెకా మలీమసుల్

ఒకయెడ శంఖపాండురత, యొక్కెడ బాలమృణాళ కాంతి, వే
ఱొకయెడ వెండి నిగ్గులనునొప్పి, విముక్తజలంబులౌట వే
శకలములై లఘుత్వమున సాగు పయోదము లొప్పఁ జామర
ప్రకరముచేత వీవఁబడు రాజనఁ గ్రాలు నభంబు మిక్కిలిన్.

ఆకాశంబు విమర్దితాంజన నిభంబౌ కాంతి దీపింప, బం
ధూకంబుల్ వికసించి శోణరుచులన్ దోఁపింప ధాత్రిన్, నవా
స్తోకాంభోజవనావృతోర్వులగుచున్ సొంపార వప్రంబులున్
లోకంబందు నిఁకెట్టి యౌవనునకే న్నూల్కొల్పవే వేడుకల్.

ఫలభారంబున వ్రాలుశాలితతులం బల్మాఱునూఁకించి పు
ష్పలతాభారవినమ్రముల్ తరువులంబ్రాపించి యూఁగించుచున్
విలసత్ఫుల్ల నవారవింద నలినీ వీధిం బ్రవేశించి గం
ధిలవాతంబు బలాత్కృతిన్ యువమనోధీరత్వమున్ డుల్చెడిన్

మదనుఁడు,నృత్యకృత్యములు మాని చరించు మయూరసంతతిన్
వదలి రసార్ద్రగీతములు పాడెడు హంసల నాశ్రయించెడున్ .
హదనని పుష్పలక్ష్మి, కుటజార్జున సర్జ కదంబ నీపముల్
వదలి సమాశ్రయించె సుమవార మనోహర సప్తపర్ణలన్.

మదిరను గ్రోలినట్టి బలుమత్తడగంగ నిశీధిగాంతుఁడుం
గొదనుపిసాళి గబ్బిచనుగుబ్బలఁ గౌఁగిట నొత్త వత్తలై
మెదగఁగఁ, దెల్లవాఱ నొక మేచకకుంతల కేళివాసమున్
వదలి మఱొక్కెడన్ గదికిఁ బాఱుఁ దనుంగని తానెనవ్వుచున్

వనితల తనువుల నియ్యెడ
మనసిజుఁడు విపాండురముగ, మంధరముగ, జృం
భణ తత్పరముగఁ, గృశముగ
ఘనలావణ్య విలసితముగా వర్తించున్.

ప్రేంకణపుఁ బూవు కస్తురి
కుంకుమ కస్తూరిపసుపుఁ గూర్చి మెదిపి యే
ణాంకముఖులు కలపంబును
బొంకపుఁ దెలిగుబ్బచనులఁ బూయుదురిపుడున్.

సరస రసాలసాల నవ సారకిసాల రసాసవంబునం
బరభృతరాజమెంతయును మత్తిలి రాగరసాంతరంగమై
నిరతము నాఁడుకోయిలను నిక్కు-చు ముద్దిడు; దేఁటి పద్మమం
దిరమున నర్మకృత్యములఁ దేల్చుఁ బ్రియన్ మధువానిపాడుచున్

తరుణుల చిత్తపేటికల దాఁచిన కాముకపాళి మానసాం
బురుహములన్ శుకాస్యములువోలు పలాశసుమాళి చీల్పవే?
ఖరముగఁ గర్ణికార సుమకాండము కాల్పదె? యంత బోక బం
ధుర కలకాకలీధ్వనులఁ దూర్ణము నొంచుట యేల కోయిలల్.


[ఈకావ్యము సంపూర్ణముగ నాంధ్రీకరింపఁబడియుండినది.]


___________

పుష్ప బాణవిలాసము.

అనువుగ గోపకాంతలు స్వయమ్ముగఁ గౌఁగిల గబ్బిగుబ్బ పో
టున కొకయింత చందనముడుల్లియు సౌరభ మొల్కు కాయ మొ
ప్ప, నిశి నసుప్తిమైఁ గనులఁ బాటలమారఁ బ్రభాతవేళ శో
భనువహియించిమించు విటవర్యుఁడు మిమ్మనిశమ్ముఁ బ్రోవుతన్

అన్నులవేనవేల మదిహాయి జనింపఁగఁ గూడియాడు నా
వెన్నుని చిత్రమౌ చరిత విత్తములోకమునందుఁ; దత్కథా
భ్యున్నతి నాశ్రయించి సరసోజ్జ్వల కావ్యము వ్రాయనున్ననా
కెన్నఁగఁ దల్లి భారతి యహీనకృపామతిఁ బల్కుతోడగున్ .

కన్నులుగొప్పవాయెఁబ్రియకాంతుఁడుదృష్టిపథమ్మునొంద; నా
కన్నియ మేన నొత్తెఁ బులకల్ విజనాలయమందుఁ గాలిడం;
బ్రన్నని చన్ను గుత్తులను బట్టునెడం దనువల్లి కంపిలెన్;
గ్రన్నననూడెఁదానయయి కంఠముఁ గౌఁగిలువేళ నీవియున్.

అరవిందప్రతిమానమై నగవుతో నాస్యంబు రంజిల్ల, సుం
దరవక్షోజ తటాంతలగ్న పట మత్యంతంబు జాఱంగఁ, జె
చ్చెర నాసన్న జనప్రతారణమతిం జేచాటుగావించి బి
తరి దూరంబుననుండి కాంచు నను మోదంబార సాకూతయె.

మడఁతిరొ చూచితే నిబిడమాధవి మధ్య నికుంజసద్మముం?
బుడమిని రాలి చల్లినటు పూవులుశోభిలు; నిందుబాళిమై
పడఁతులు కాముకేళి సలుపన్ మణితంబుల శబ్ద మేరి కె
ప్పుడు వినరానియట్లు గొలుపుం బికముల్ కలకాకలీధ్వనుల్.

కీరము బింబమంచుఁ గొఱికెన్ బెదవిం; బరుగెత్త వీడె నీ
భారపుఁగొప్పు; మోముశ్రమవారి కణంబులఁదోఁగెఁ;గంటకాం
కూరము మేనఁగాటు లిడెఁ గోమలి, కంకణమార్భటింపఁగన్
బాఱెదవేల చిల్కకయి భ్రాంతి, ననందయుఁ బూలుగోసెడిన్

జాఱిన పయ్యెదం గరకిసాలముచేఁ జనుదోయిఁ జేర్చుచున్
వేఱొకముద్దు కేల ముడివీడిన క్రొవ్వెద దిద్దికొంచు నొ
య్యారి సుగంధకర్దమకణాంకిత దేహముఁ బాటలోష్ఠ మొ
ప్పారఁగ వెల్వడుం బ్రియునిహర్మ్యము కంతునిజైత్రలక్ష్మినాన్

కాంతుండేఁగుఁగదా విదేశమని యోకాంతా, మదీయాత్మయం
దెంతోచింతయెసంగె; లోకహితుఁడౌ యిందీవరాప్తుండు దుః
స్వాంతుండై కలహించుఁ; గోకిలల రమ్యాలాప సంగీతముల్
వంతం గూర్చు; వనానిలంబులకటా! ప్రాణంబులందీసెడున్.

కన్నులవిల్తు కీలల వికారము పేర్చినఁ దాపశాంతికై
పన్నిన మావిలేఁ జివురుఁబాన్పునఁ దొయ్యలి చేయినాన్చినం,
గ్రొన్నన లెల్లమాడె; సుమకోమలగాత్ర యనంగసంజ్వరం
బెన్నఁగ నింత యంతయని నెవ్వరికేనియు శక్యమే ధరన్.

లలనారత్నము నవ్వుమోము విధునిన్ లజ్జాంకితుంజేయ మం
జుల కీరాలపమున్ వచః ఫణితి యస్తోకంబు నిందింపఁగన్,
జలజామోదభరానిలంబులను నిశ్వాసంబు గ్రేణింప నా
ర్తిలి యిందాకను వేచి కాంత నవి గాఱించున్ వియోగంబునన్

కన్నియ పాడినన్ శ్రుతివికారము గొల్పు విపంచినాదముల్ ;
వెన్నెల చీఁకటట్లు గనిపించును దెల్లనినవ్వు నవ్వినన్ ;
గన్నులముందుఁ గ్రొత్తదగు కల్వయు వాడినయట్లుదోఁచు; మై
వన్నియచెన్నుఁజూడఁగ వివర్ణములౌఁ దొలుకారు మించులున్.

చిరము, నభూతపూర్వము విశేషసఖీజన దోషజంబు నై| పురి
గొనురోషమున్ విడిచి మోమిటు చూపుము, నేత్రజాడ్యముల్
కరఁగుత; కర్ణపేయమగుఁగాతఁ త్వదీయ రసార్ద్ర వాక్యముల్ .
తరలుత తాపబాధ వనితా, వెదఁజల్లుము చల్లచూపులన్ .

కాంతుఁడు మ్రొక్క నించుకయుఁగాంచ, దతండునుగిన్కఁబోయినం
జింత నిరంతముం బొగులు, జెచ్చెర నెచ్చెలులంత వల్లభుం
జెంతకు బల్మిఁదేమఱలఁజెల్వయుమౌనముఁబూను;గ్రమ్మఱన్
వంత నతండుఁ బోవఁ జెలి ప్రాణము కంఠమునాశ్రయించెడిన్

కన్నియ కన్నుదోయికడఁ గన్నులుమూసినమేల్ కురంగముల్ ;
విన్నను బల్కు, వీనులకు వేదగుఁ గోకిల కాకలీరుతుల్;
పొన్నరిమోముఁజూచుటకుఁ బూర్వమెలోకముగోరుఁజంద్రునిన్
మన్ననపొందు హేమలత మానినిఁ జూడని యంత కాలమున్.

అహల్యానురాగము.

పూలగుత్తులుదేవె పూజార్థమనియన్నఁ
         జనుకట్టు క్రిందికి జాఱనొత్తు;
జలజంబు లైనను సంతరించితె యన్న
         వెడఁద వాల్గన్నులు విప్పిచూచు;
కుందంబు లొకకొన్ని కోసి తేవే యన్న
         దరహాస మొనరించి తలనువంచు;
పున్నాగమల్లదో పూచెఁ గైకొమ్మన
         నెఱినాభి క్రిందికి నీవి దిగుచు;

యజ్ఞవేదిక సమిధలు నాజ్యపాత్ర
పెట్టవేయన్న హృదయంబు తట్టిచూపి
భావజానల ధూమంబు బయటి కూర్చు
యౌవనారంభమున నహల్యాలతాంగి.

అలరుల్ చల్లనితావులం జిలుక,స్విన్నాంగశ్రమన్ వాయువుల్
దలఁగింపన్ సెలయేళ్ళుకోయిలలు పంతాలాడి పాడంగ వె
న్నెలపర్వన్ విలసత్సమాధి పదవీ నిష్ణాతు నాగౌతమున్
జెలి కౌఁగింటనుబట్టె ఱాప్రతిమఁ బుంజీభూత కామార్తయై

[ఇది 110 పద్యముల కావ్యము పుస్తకము ఎప్పుడు ఎక్కడ పోయినదో తెలియదు. ఈకావ్యమును వ్రాసిన కొన్ని దినములకు పిశుపాటి శేషాచలశాస్త్రులవారికి కొన్నిపద్యములు చదివి వినిపించితిని. వారు పై రెండు పద్యములను మెచ్చుకొనిరి. ఆపద్యములను మరల మరల చదివి కంఠగతము చేసికొంటిని. అవి నేఁటికిని జ్ఞప్తియున్నవి.]



__________

శ్రీకృష్ణుని రాయబారము

_________

శ్రీరాజిల్లెడు స్వర్గదేశమును దోర్వీర్యంబునన్ గెల్చి వృ
త్రారిం గానలపాలుచేసి నరకుం డత్యంత గర్వోన్నతిన్
మీఱన్ సంగరమందు నయ్యసురునిం బిల్కార్చి దేవేంద్రునిన్
స్వారాజ్యంబున నిల్పినట్టి హరి నిచ్చల్‌మాకు సౌఖ్యంబిడున్ .

పొలయును గ్రొత్తనెత్తురులు పొల్పెసలారి యకాలసంధ్య ది
క్తలముల నించు మత్తగజదానవచర్మము వల్లెవాటు చుం
గులు కటిసీమ జాఱ, శివఁగూడి ముదంబునఁ దాండవించు న
వ్వలిమల యల్లువాని రిపుభంజకశూలము మమ్ముఁగాచుతన్.

బలయుతులైన దైత్యులకుఁ బ్రాభవమొంద వరంబులిచ్చి వా
రల రణశక్తి ధాటికిఁ బరాజితులైన నిలింపకోటి యు
మ్మలికముదీఱఁ గొండొక సమంచిత కార్యవిధంబుఁ దెల్పు నా
జలజభవుండు మానొసటఁ జక్కనివ్రాతలు వ్రాయుగావుతన్.

భారత కావ్యరాజమున భావరసోదధి తిక్కయజ్వ శో
భారమణీయ కల్పనల వాకొనెఁ గృష్ణుని రాయబారమున్
నే రచియింతు నేఁడు, దగునేర్పున నద్దియె కాలపద్ధతుల్
మాఱుటఁజేసి నూత్నగతులన్ సమకాలికు లెంతొ మెచ్చగన్

అని యిష్టదైవ ప్రార్థనంబును, సత్కవి ప్రశంసయు విష్ణులీలా బహుళత్వంబును గణించి పఠితల కభ్యుదయ పరంపరగ నాయొనర్పంబూనిన శ్రీకృష్ణుని రాయబారంబను ప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన: –

కురురాజేంద్రుని పేరుటోలగమునం గొల్వుండి శాస్త్రార్థముల్
పరతత్త్వంబులు లోకవృత్తములు నుల్లాసంబుగన్ భీష్ముఁడున్
గురుఁడున్ ద్రౌణియు సంజయుండు కృపుడుంగుందేద బోధింప ని
ర్భర మోదంబున సభ్యులెల్ల శిరముల్ పంకింప నత్యంతమున్ .

దరహాసోల్లసితాస్య పద్మమున కుద్యద్దంతకాంతుల్ తదం
తరజాతామల కేసరంబులన విన్నాణమ్ము గొల్పంగ భీ
కరసంగ్రామకళోక్తులం బలుకుచుంగర్ణుండు దుర్యోధనా
ది రసాకాంతుల మెప్పులంబడసి యుత్తేజంబునన్ మీఱఁగఁన్.

అతులమణిమయ హేమసింహాసనమున
నధివసించి యిట్లనియెను నంధనృపతి
సంజయునిఁగాంచి హృదయంబుసంచలింప
వదనబింబము దీనత వాడువాఱ.

అర్జునుఁడేల శత్రువిజయాంకము గాండివ మూననేల య
త్యూర్జితబాహువీర్య సమరోద్ధతుఁడా మరుదాత్మజుండె వే
కర్జముఁదీర్పఁబూని లయకాలకృతాంతుని లీల రేఁగ గ
ర్వార్జితబుద్ధిమాంద్యులగు నయ్యలుకొండొకలెక్క యేయిటన్

అనవుడు ధృతరాష్ట్రునివంక మొగంబై ద్రోణసుతుం డిట్లనియె.

పాండునృపాలసూనులు స్వభావకృపామయులౌట నీర్ష్యమై
గండుతనమ్ముఁబూనకయ కానలకేఁగిరి; కాకయున్న, తా
ఖండలసూతిగాండివముఁ గైకొన నొక్కఁడు నిల్చువాఁడె త
ద్భండన కౌశలోద్ధతి విధానము గోగ్రహణానఁజూడమే.

పాఱులెవారు “దేహి" యని పాండుమహీశుని రాజ్యభాగముం
గోరుట, కెమ్మెయిన్ విమతకుంజర కేసరులై రణావనిం
బోరి సమస్తసంపదలు పొందకయుందురె? యీయమన్నవా
రూరకపోదురే భుజబలోగ్రులు సంగరమన్న భీతిచే.

    అనవిని యింతదనుక సభ్యుల యభిప్రాయంబు గనుంగొన నెట్టులో కోపము బిగఁబట్టి వేచియున్న దుర్యోధనుండు దండతాడిత భుజంగప్రాయుండై వీరావేశంబునఁ కనీనికలు రక్త

గోళంబులై చూపఱకు వెఱపుం గఱప నిట్లనియె:


వెలితి ప్రసంగముల్ సలిపె వృద్దమహీపతి; యంతఁబోక పెం
జలమున సంజయుండు తసచాతురిఁ జూపెను ధర్మవేత్త నా
వలఁతుల యట్లు ద్రోణకృపవక్తలు వాకొనిరేమొ పద్ధతుల్
పలికెను ద్రోణపుత్రుఁడును పాండుతనూజుల శౌర్యగాధలన్.

కురురాజేంద్రుని సత్సభాగరిమ యెగ్గుంబొందఁగా మీరు సి
గ్గఱిగాజుల్ధరియించు కొన్నటుల విక్రాంతిన్ విసర్జించి సం
గరమన్నన్ వెఱగొందు పందలయి పల్కన్‌వింటి మిానాఁడు,
చూ| డరమమ్మైనను; మేటులంచునిటులాడన్ బాడియే దీనతన్.

పాండుతనూజులంట! బలుపాడి చెలంగెడు వారలంట! తా
మొండనలేక ధర్మరతి నోరిమి రాజ్యమువీడి కానకున్
భండన మొల్లకే చనిన బాహుబలాడ్యులటంట! యింతకా
ఖండలసూతి గాండివముఁగైకొన నిల్వరటంట కౌరవుల్ !

పరదోర్వీర్యము వందులట్లెపుడు గైవారంబులం జల్పుకొం
చు రణంబౌతఱి నీతిశాస్త్రముల హెచ్చుల్ మాకుబోధించి ని
ర్భర శౌర్యాత్మున కేని పందతనముం బట్టించు పాండిత్య బం
థురులౌపాఱులు మాకుసాయపడనెందున్ లోటు వాటిల్లునే?

కరమున గాండివంబుగొని కవ్వడి చివ్వకుఁ గాలుదువ్వఁ బెం
పఱవెఱఁబూని కౌరవులు పాఱులువోలె వడంకి యార్తురే?
నరుఁడననేమి యాతనికి నాయన నాకవిభుండు వచ్చినన్
గురుధరణీశు శాతశరకోటులు పాపపుబుద్ది నెంచునే.

పెనుగదఁదాల్పనేల, యనిఁబేర్చగనేల విభీషణంబుగన్
ఘనసమరారవంబులు వికత్తనముల్ ఠవణింపనేల మ
ద్దనురతిముక్త హేమకలిత ప్రదరోద్దతి కాఁగినంగదా
యనిలతనూజు సంగరవిహారపుమాటలు మున్న యేటికిన్.

కపటపు ద్యూతముం గొలిపి కన్నులు రెండునుగప్పి పాండుభూ
మిప సుతులన్ వనంబులకు మేమనిపించితిమోటు? వారు ము
న్నె పణముగాఁగ భార్య ధరణీతలభాగము నొడ్డిమాకు నో
డి పురమువీడిపోయిరి; కడింది మగంటిమి గల్గఁ బోరరే?

బలముఁ బ్రతాపమున్నఁదమపాలు చలంబున నాలమందు వే
గెలిచి గ్రహింపరే, వనులఁ గీడ్పడియుందురె వీరులైన నం
దుల నొడఁబాటు మై సమయధూర్వహతన్ నటియింపనేల ని
చ్చలు నిజధర్మవృత్తియను ఛాయను డాఁగిరిగాక పాండవుల్

బలము గలిగినపుడె బవరమ్ము సలుపంగ
హక్కుగలదు; సమయహాని యనెడు
మిషయె మాటుగాఁగ మెలఁగిరి యెట్టులో
పాండుసుతులు ధర్మవర్తులటుల.

అనవిని చెవులకు ములుకులవలెసోకు ధుర్యోధనుని వచఃప్రహారంబుల మనంబు గలంగి రక్తరూక్షేక్షుణుండై భీష్ముఁడు మేఘునిర్ఘోషంబుల ననుకరించు పలుకుల నిట్లనియె;

ధర్మబద్ధులౌట ద్రౌపది చెఱనాఁడు
నూరకుండి రకట, యొప్పుదఱిగి
కుంతిసుతులు; పోరు గూడినయపుడైన
మీ పరాక్రమంబుఁ జూపినారె?

సమరమందు వైరి సమ్ముఖంబుననిల్చి
యుద్ధురాస్త్రచయము లోర్చుకన్న
నోలగంబుననె రణోక్తులు వచియింపఁ
గొంతమెప్పుగాదె కురుకులేశ.

నిర్జరనాధుపుత్రునొకనిన్ మనమందఱ మాలముట్టున్నాఁ
డూర్జితబాహుగర్వమున నొప్పుదొఱంగఁగఁ జేసినారమే!
తర్జన భర్జనాదుల నుదాత్తత సూపెదుగాని పోరునం
దర్జును నొంచినాఁడవె శరాసన పాండితి మేరమీఱఁగన్.

పందతనాన నుత్తరుఁడు పాఱఁగ సారథిగాఁగ దేరిపై
ముందల బెట్టి పార్థుఁడు సముజ్జ్వలసారశర ప్రకాండముల్
గ్రందుకొనంగనేయఁగ వికత్తనముల్ దెగనాడు నేఁటివా
రందఱులేరొ, సంగర విహార మనోరథముల్ సెలంగవో!

నాఁడు నరుండుకైవడిని నాటిన తూఁపుల పోటుగంటులీ
నాఁడును గ్రొత్తనెత్తురులనానెడి; మానఁగలేద; యింతకే
పోడిమిమాలి యాలమునఁబోటరులంచుఁ దలంపనేల మీ
రాడిన పోటుమాటలు రణావనిఁబల్కినఁగాదె దీటగున్.

అబలయౌ ద్రౌపది యార్తయై కుయ్యిడ
          నోలగంబునఁ జీర లొలిచినట్లు;
కపటపు ద్యూతంబుఁ గల్పించి పాండుపు
         త్రులపాలి రాజ్యంబు గెలిచినట్లు;

లక్కయింటనుమే నలసి నిద్ర వోయెడు
          కుంతిపుత్రుల గాల్పఁగోరినటులు;
విషసంయుతాన్నంబుపెట్టి భీమన్నను
          జంపుయత్నంబులు సలిపినట్లు,

అంతతేలికయే రణమందునిల్చి
పార్థబాణా సనోన్ముక్త పరకఠోర
కంఠలుంఠన లీలాప్రకార ఘోర
శరపరంపర కోర్వంగఁ గురుకులేశ.

బెట్టిదముగ గంధర్వులు
ముట్టగనిన్నపుడు పార్థుభుజవీర్యం బి
ట్టిట్టిదనుచు నీమదికిం
దట్టదె రవయేని? యింతదాపఱికంబే?

అనవుడు కోపంబురూపంబుదాల్చిన తెఱంగుస నుగ్రుండై పలుకంబోవు, దుర్యోధనుని వారించి సటాలుంచసంబున గర్జించుపంచానన కిశోరంబువరవడి కర్ణుఁడిట్లనియె.

యుద్ధము గల్గినప్పుడు బలోన్నతి చూపక ధర్మశాస్త్రసం
బద్దమనస్కులై పనికిమాలిన సుద్దులు పల్కుచుందు; రీ
బుద్ధులవేలోకో పరచమూ కరకంఠ మృణాలహంస చం
చూద్దతి మీఱు క్రూరవిశిఖోత్కరముం బఱపింపలేనిచో.

నరుఁడడుగో రథంబుపయినా మనముబ్బగఁ జెంగలించి య
త్తఱిని నమస్కృతీషువు నతండొకఁడేయఁగలొంగిపోయి, ని
ర్భరగతివచ్చెఁ బార్థుఁడిఁక భండనమేల యతండు భర్గునిన్
దురమున గెల్చెఁగాదె యసదో కపికేతనుఁడంట లెస్సయే?

వీరుల యట్లు గోగ్రహణ విశ్రుతలీలకువచ్చి యర్జునుం
దేరిపయిం గనుంగొని యుదీర్ణపరాక్రముఁ డాతడంచు మీ
బీరము సారముందొలఁగ బెల్చనఁ గౌరవసేనముందఱం
గాఱులు వల్కమేలె పతిగాఱియవొందగ శంకపుట్టఁగన్

పరమాన్నంబులుభక్ష్యముల్ పులుసులుంబప్పప్ప డంబుల్ తెరల్
వరుగుల్ గా రెలుసుష్ఠుగా మెసవుచున్ వహ్వాయటంచున్ రుచుల్
హరువుల్ పల్కుచు బ్రాహ్మణార్థములఁ బిండాసక్తిపర్తించుమిా
మ్మెఱుఁగండేమొసుయోధనుండనిసహాయేచ్చన్ గడున్ వేడఁగన్

అనవుడు కోపసంక్షుబ్ధ చిత్తుండయి యంగంబున రోమాంచంబు లుప్పతిల్ల దిగ్గని గద్దియనుండి లేచి యశ్వత్థామ యిట్లనియె.

ఓరీకర్ణుఁడ, కండకావరము నిన్నూఁకింప మాబోఁటి స
ద్వీరశ్రేష్ఠుల వ్రేలుచూపి పలుకన్ దీటైతివే యౌర! నీ
బీరంబున్ సహియింపనోపనిఁక దోర్వీర్యంబు శూరత్వ మే
దీ రా చూతము; చాపపాండితి బలోదీర్ణత్వమున్ సత్త్వమున్

కులము కొఱంత యట్టులొనగూరెను బల్కులు, రాజరాజు ని
చ్చలు నినుబెద్దఁజేయఁగొనసాఁగెనుడంబు, పవిత్రవంశ పూ
జ్యుల మముబోఁటి యోధుల విశుద్ధయశంబును మాపునీదు పె
గ్గెల నటు గట్టిపెట్టి రణ కేళికి రమ్మిట సూతనందనా.

అరయండెక్కములో, రథాంగములొపల్యాణంబులో కోలలో
తురగ శ్రేష్ఠములో కరీంద్రఘటలో తోత్రంబులో గాక భూ
వరులున్ బ్రాహ్మణయోధులున్న సభలోభాషింతువే ధీరునాన్
బరరాజన్య గళాబ్జనాళ దళన ప్రావీణ్య ధుర్యుండునాన్ .

అని సజ్యంబునుజేసి కార్ముకము నత్యాకుంచిత భ్రూకుటిన్'
మునుకో, భీష్ముఁడునాఁగుమాఁగుమని తాముం జేయి సారించియా
తనిఁ బీఠంబునం బెట్టఁ జిత్తమునఁ గ్రోధజ్వాల ధూమంబుపై
కొనెనో నాగురుపుత్రుఁడూర్చెను సభాకూటంబు వేండ్రంబుగాన్

జననీ కంఠలతానికృంతన గళత్సారాస్ర ధారాముఖం
బునఁ గెంజాయలుచల్లుగొడ్డలి తృషన్ భూపాస్రసంతర్పణం
బునఁ జల్లార్పడెక్షత్రియాన్వయమురూపున్ మాపియా రేణు కా
తనయుం; డాతఁడు బ్రాహణుండొ పరుఁడోతథ్యంబు యోచింపుమా
 
కురుసభనుండు నర్హత యకుంఠిత గౌరవమేఁగె; నింక ని
త్తెఱఁగున నిల్వనేల, పనిదీఱెనురండు మహీసురుల్, వృధా
భరమెక కౌరవేంద్రునకు; భండనమెల్లియకాకమాన, దం :
దొరసెడి గర్ణపార్థవిశిఖోద్ధురతం గనుగొందుమేగదా!

సూతసుతుండ నయ్యెదనొ సూర్యతనూజుఁడనౌదునో రిపు
ద్యోతిత కంఠనాళ రుధిరోదధిలో జయలక్ష్మిపోత ము
ఱ్ఱూతలువోవ నెట్టుకొని యుద్ధతినేఁగెడువాఁడు సూతసం
జాతుఁడొ క్షత్రియాన్వయ నిశాపరిపూర్ణ సుధామయూఖుఁడో

తేరకుఁగౌరవేశ్వరునిఁ దిట్టుచుఁదిమ్ముచు వాలుబొజ్జలన్
ధేరులలీలఁ బెంచికొని పెద్దఱికంబు భరింపుడన్న నిం
కేరును నోరులెత్తనటు లెంతయు మాటకు వేయిమాటలన్
దూఱుట కబ్బెసంబయిన దూబలతో సరిపల్కవచ్చునే?

అవనిసురుల కొఱకు నమవస నిలుచునా
పుంజులేక ప్రొద్దువొడవకున్నె !
చూతమింక రణము చొప్పుడునప్పుడు
నర్జునుండు శరము లడరునపుడు.

బలవంతులైన వైరుల
మెలకువఁ దప్పించుకొనుట మేలగు; మధురో
జ్జ్వలవాక్పూర్ణుఁడు, కార్యం
బులవిజ్ఞుఁడు సంజయుండు, పోలఁగ నతనిన్.

కుంతీపుత్రులపాలికంపి యట నెగ్గుల్ పుట్టకుండం గడున్
శాంతోక్తుల్ నుడివించి సంధివిధముల్ చర్చింపఁజేయించి దు
ర్దాంతాభ్యాగమలీల మాన్పి ధరణీరాజ్యంబు నేలుండు మా
స్వాంతంబుల్ ముదమొందఁబాండవుకురుక్ష్మా పాలకుల్ నెమ్మిమై

లేరేపూర్వులు కీర్తిధన్యులు ధరాలేఖ ప్రభుల్ సద్గుణో
దారుల్ శూరులు వారితోడ నొకచింతాకైనఁ గొంపోయిరే,
పేరుంగీర్తి యెకాదె నిల్చినది, నీవేయెంచుమీ, దుష్టచే
ష్టారక్తిందగు రాజులం ప్రజలు విశ్వాసంబుతోఁ గొల్తురే?

సరసిజబాంధవుండు విలసత్కరపంక్తి దొఱంగి రక్తవ
ర్ణ రమనుదాల్చి పశ్చిమధరాధర శృంగముపైకిఁ బ్రాకఁ, ద
ద్గిరి విలసిల్లె సల్లలితదీప్తిని కాలవరుండు సంధ్యకున్
సరసతఁగూర్చు హేమకలశస్ఫురితంబు గుడారమోయనన్.

కాంతాకాంతుల సౌఖ్యవల్లరులు చక్కంబూయ నిండారు పై
కాంతుల్ నాఁగ సుధామయూఖుఁడుదయగ్రావంబునందోఁప న
త్యంతం బభ్రచరద్దునీ సలిల భంగాభోగడిండీర ఖం
డాంతః స్వచ్ఛసిత ప్రభాకలితమై వ్యాపించెడిన్ వెన్నెలల్ .

మారుని యుద్యోగంబిఁకఁ
దీఱిక యగుననుచు ముందుఁ డెలిపెడి ధవళా
కారపు టాజ్ఞాపత్రము
నా రాజిలె నింద్రుదిక్కు నలుపు వదలుచున్.

లలితానేక సుమప్రకాండ లతికాలాస్యంబులన్ మీఱి యు
జ్జ్వల చంద్రోపల సంస్రవత్సలిల మిచ్చం గ్రుంకి యామీఁద గం
ధిల శీతామలవాతపోతములు ప్రీతింజొచ్చె శయ్యాగృహం
బులఁ గాంతామృదుగండ ఘర్మకణికాపూరంబులం ద్రావఁగన్

కులుకుంగత్తెలు నీటిబిందెలు భుజాకూలంకషస్ఫూర్తిఁదా
ల్చలతాంతాయుధుచిహ్నముల్ గలుగులేఁజెక్కుల్చనుల్వా తెఱ
ల్సొలపున్నెన్నడలుం బరస్పరము నాలోకించి హేలావచో
విలసత్ స్వాంతతఁ బోవుచుండిరి సరోవీధిన్ మీటారించుచున్ .

అంతధృతరాష్ట్రుండును దక్కుంగల సుతహితామాత్య బంధువర్గంబులు సభామందిరమున నోలగంబుండి సంజయుని రావించుడు ఆతనిదిక్కు మొగంబై యంధభూపతి యిట్లనియె:

సుమతివి, మధురాలాప
క్రమచాతురిగలదు; రాజకార్యజ్ఞుడఁవీ
వు మతిఁదలంచిన యత్నము
సమకూరు నిర స్తవిఘ్నసముదాయంబై.

అవ్యయసంగరాంగణవిహారులు పాండుతనూజు లాయుప
ప్లావ్యపురంబునన్ మురవిపాటను గూడి వసించువారలీ
వేవ్యతిరేకభాషణములెత్తక యుక్తిఁ దదీయచిత్తచిం
తావ్యయముం బొనర్చి యమితక్రుధదీఱు వచోమనోజ్ఞతన్.

కనఁబఱచి వననివాసం
బునఁబొందిన ఖేదమును సమూలంబుగ నూ
డ్చి నయముసెప్పి రణంబున
కనుమతిలేకుండు తెఱగు నరసి పల్కుమీ.

నాపూర్వపుణ్య ఫలములు
దీపించెనొ నాఁగ మిమ్ముఁ దేజోమయులన్
బాపవిదూరుల సుమతులఁ
బ్రాపించుట గల్గె నంధపతి మూలమునన్.
 
మీర లుపప్లావ్యంబునఁ
జేరుటవిని వృద్దనృపతి చిత్తంబున బొం
గారెడు వాత్సల్యంబునఁ
గోరి ననుంబంపె మీదు కుశలంబడుగన్.
 
వనవాసాయసంబులు
ఘనమగు నాపదల నెల్లఁ గడపి యపాయం
బును బొరయక మీవచ్చుట
మనమున ధృతరాష్ట్రపతి ప్రమదముం బొందెన్
 
అనవుడు సంజయు, గని ధ
ర్మనందనుఁడు పల్కె గూఢమతియై మేమా
జనకుని వాత్సల్య భరం
బునఁగాదే కానఁ గష్టములు పుచ్చుటయున్.
 
సేమమే వృద్ధనృపతికి శ్రీసమృద్ధి
యుతమె రాజ్యంబు ధృతరాష్ట్ర సుతశతంబు
జనకునాజ్ఞ నడపుచున్నె, సర్వజనులు
నాయురారోగ్య విభవంబు లందువారె?

గురుకృపభీష్మ ద్రౌణులు
నిరతముస్యౌఖంబు లంది నెగడుదురే, యా
కురురాజువారి మతి పొం
దరసి నటించునె సగౌరవాంచితరీతిన్ !

సూతసుతుఁడు కర్ణుఁడు వి
ఖ్యాతరమాపూజ్యరాజ్య కలితుఁడు కురుభూ
మీాతలపతియును సౌఖ్య
స్ఫాతిఁ బరస్పరముఁ గలసి వర్తించెదరే

అనవిని సంజయుండించుక దైన్యము మోమునం దులాకింపఁ గౌంతేయగ్రజున కిట్లనియె:

ధార్తరాష్ట్రులు సతము మత్తద్విపేంద్ర
ముల తెఱంగున స్వాతంత్యమునఁ గడంగి
కార్యభారము వహియింపఁ గలదె వృద్ద
కురుపతికి గుండెలొక్కటఁ గుదుటవడుట.

శకునికర్ణదుశ్శాసన వికటమతులు
ధారుణీపాలనాది సందర్భములను
దోడుపడఁ గౌరవేశుఁడు దుష్టబుద్ధి
గానితెఱఁగు కొండొక్కఁడు గలదెచెపుఁడ.

అనవిని ధర్మనందనుండిట్లనియె:

ఎపుడైనన్ గద సోరుగల్గునెడ నెంతే మోదమేపార భూ
మి పతుల్ భీముగదావిహారచణతోన్మేషంబుఁ జింతుంతు రే?
కృపభీష్మాఖిల వీరయోధులు సభంగీర్తింతురే విద్విష
త్తపనాపాదకగాండివంపుఁ బస నుత్తాలత్వమున్ సంజయా.

అడుగోపాండవ కల్పశాఖ కరుణాస్వాంతుడు దైత్యాంతకుం,
డడుగో భీముఁడు, వాడెయర్జునుఁడు సల్లారే కవల్ వారి వెం
బడియున్నారదెచూడుబాంధవహి తామాత్యుల్మహారాజులున్ .
గడఁకంజెప్పుమ వార్తలున్ననిచటన్ గౌతూహలంబొత్తగన్.

వారువినంగరాని యెటువంటి రహస్యములేని మాకు బం
గారమువచ్చినన్ వినుటగాదు; సభాస్థలమందు నియ్యెడం
జేరినవారలెల్లరును శ్రేష్ఠులు శిష్టులు మిత్రబాంధవుల్
శూరులు పండితుల్ గురుయశోధరులౌట నెఱుంగుమీమదిన్.

కావున ధృతరాష్ట్రుడు ని
న్నేవిధి వచియింపఁబంపె నింపుదొలఁక నీ
వావార్త లుగ్గడింపుమ
మావారలు మేము ముద మమందతఁగాంచన్.

అనిపాండుక్షితిపాలకాగ్రతనయుండాడంగ సూతాత్మజుం
డును దద్గర్వవచో విధానమునకొండుం బల్క కేయోలగం
బునఁ గూర్చుండిన వారికందఱికి సమ్మోదంబుగన్ మ్రొక్కియి
ట్లనియెం దేనియసోనలం జిలుకురమ్యాలాపముల్ భక్తిమై.

కాలమువచ్చెఁగృష్ణ, కలకాలముఁ బాండవకౌరవేశ్వరుల్
బాలురనాఁటినుండి యెదఁబాటిలు నీర్ష్యనడంప, బంధువుల్
పోలగ సర్వసౌఖ్యములు పొందగ, నెయ్యముభోగభాగ్యముల్
చాలఁబరిగ్రహించి ప్రజసంతసమొందఁగ శాంతిమీఱగన్ .

శాంతాకారుఁడవీవు కృ
తాంతాత్మజుఁడును క్షమాపరాత్ముఁడు మీర
త్యంతముఁ జేరినయెడ నొ
క్కింత జనకోభమెత్తునే శ్రీకృష్ణా!

శరమునకున్ ధనుస్సు ' సంధీయొడంబడ దుర్ణిరీక్ష్యమై
పరఁగువిధానఁ గౌరవు , పాండవులుందగఁ గూడియున్న నె
వ్వరికిని వారిఁదేఱి కనవచ్చునె? శాత్రవకోటి సంగరో
ద్ధురభుజగర్వ నిష్ఠురత దొల్గదె వెల్గదె దోఃప్రతాపమున్.

మారుత పుత్రుఁడొక్కఁడె యమానుషశక్తి గదాప్రహారదు
ర్వారత వైరివీరనికరంబుల నెత్తురు లొల్క మొత్తి పు
ష్పారుణవంజుళ ద్రుమము లట్లొనరించి జయేందిరన్ వసం
తోరువనీవిహారమున నుల్లమురంజిలఁజేయఁడే, నృపా.

సవ్యాపసవ్యకరముల
నవ్యయశరముల్ నిగుడ్చి యర్జునుఁడు రిపూ
గ్రవ్యధ యను మూల్యంబున
భవ్య విజయులక్ష్మి గొనఁడె భండనవిపణిన్ .

ఐన నజాతశత్రుఁడు నయంబుఁ దితీక్షయు ధర్మర క్తియుం
బూనిన సాత్వికుండగుట బుద్ధివిహీను లొనర్చుసేఁత యొం
డేనియుఁ దప్పుగాఁదలఁచి యేయపకారము సల్పనోపఁడెం
తే నియతాత్మతం బవర మెందు జనార్తికి మూలమౌటచే.

ధరణిన్ క్షత్రియఘస్మరుండయి భుజదర్పంబునం జాప వి
ద్య, రణావేశమునం బ్రతాపగరిమన్ ధైర్యంబునం దుద్ది యె
వ్వరు లేకుండెడు జమదగ్ని సమరవ్యాపార పారీణతం
బొరినొప్పించిన భీష్ముఁడాహవమునం బోరంగ మాఱుండునే?

చాపాచార్య శరప్రయోగ విలసన్యా . . . సుకీర్తనం
బేపారన్ రణమందునీల్గు పరభూమీ ' , వచింపంగ నా
రా! పాఱుండు దలాలి మాకనుచు స్వర్గ స్త్రీలు పానాత్తమం
దాపాంగంబులఁ గాంతులంగనఁగ నేనా తాదృశుం బల్కుటల్ !

గురుసుతుఁడైన నేమి, తనకున్ రణమబ్బినఁ బూర్వపుణ్యమం
చరుసముఁ బొందుశౌర్యనిధి; యాతఁడు చివ్వకు రేఁగియాశుగో
త్కరముల నుద్ధతిం బఱపఁ దచ్ఛర ఝంకృతి హెచ్చరించు ని
ర్భరకులిశాయుధాగ్రముల వాడిమి పోడిమిమాలు వైరికిన్ .

కర్ణుఁడు వైరివీరలయకాలుఁడు కార్ముకమంది శౌర్య సం
పూర్ణతఁ గ్రోధమూర్తియయి పోరఁగడంగి నిశాతబాణముల్
ఘార్ణిలు సేననేయ రిపుకోటి శివుండొ రమాధవుండొ యా
కర్ణుఁడొ యంచు నిర్ణయముగాక గణింతురు నాకమేగుచో.

రాధేయుండు సమస్తగర్విత రిపువ్రాత ప్రతాపోద్ధతిన్
బాధింపంగ సమర్థుఁడంచెపుడు సౌభ్రాత్రంబు వాటించు చా
యోధాగ్రేసరు గౌరవించుఁ గురుభూపోత్తంసుఁ డత్యంతమున్
మేధాయుక్తునిఁ గర్ణునిం బొగడగన్ నేనెంతవాఁడన్ నృపా.

అంగపతి సూత సుతుండని యుపాలంభించుటయేగాక దాననేమి శౌర్యంబునకు లోటు వాటిల్లెనే?

సూతసుతుండ యౌటయది సొంపెగదా, కదనోగ్రబాహు గ
ర్వాతత సైన్య మత్స్యనిచయాంతక శాతకలంబ కల్పనా
ద్యోతిత జాలమొప్ప సమరోదధి స్యందనపోతమెక్కి ప్ర
స్పీతవిహారతన్ ధరకువ్రేఁగగు ధీవరమాన్యుఁడుర్విపా!

కావునఁ దుల్యబలులైన యిరుతెగలవారు నెమ్మిమై నుంట శ్రేయంబు నావుడు కర్ణదుర్యోధన శౌర్యోత్కర్ష కథనంబు సహింపనోపక యీసడించి భీమసేనుండు వెక్క సముగ నిట్లనియె.

ఔపోసంజయ, కర్ణబాహుబల విఖ్యాతిం బ్రశంసించె దీ
వీపాండు క్షితిపాలసూనులకడన్ హెచ్చింపుగన్, సౌబలే
యీపుత్రుల్ నినుఁజేరఁబట్టిన ఋణంబీగంగ వర్తించి తౌ
రా! పౌర్థున్ హరినైనఁ జూడవలదా రాధేయుఁ గీ ర్తించుచో

మీదుర్యోధను శౌర్యసాహసములన్ మేమెల్ల వీక్షింపలే
దే దెల్లమ్ముగ ఘోషయాత్ర, మఱి యింకేలా నుతింపంగ వా
గ్వాదంబుల్ బలియంగ నేమిటికి వక్కాణింపుమీ వృద్దరా
జాదుల్ పల్కిన తేరమాటలను మాయన్నయ్యశాంతింపగన్.

[ఈకావ్యము అసంపూర్ణము. 215 పద్యములు వ్రాయఁబడియుండినవి.)


___________

సింహప్రబోధము

సమ్మోదంబున వన్యసత్వములు నిన్ సామ్రాజ్య భారమ్ముఁగై
కొమ్మంచున్ బ్రతిమాలుచుండదినముం గుంభీంద్రఫాలాసమాం
సమ్ముం ద్రావుచు మెక్కుచుం దిరుగు నీశౌర్యమ్మదేమాయె సిం
హమ్మా, కాననరాజ్య మేలఁజనుమాయత్యంత స్వేచ్ఛారతిన్

కమ్ముల్దాపిన బోనునన్ నిలిపి సౌఖ్యమ్ముల్ దొలంగించి రా
పొమ్మంచున్ వినయంబునేర్పి ,తుదకుం బూర్వంపురోషమ్ము శౌ
ర్యమ్మున్ లేమిని నైజముం జలిపె నాహా! కాలచక్రమ్ము, సిం
హమ్మా, కాననరాజ్యమేలఁ జనుమాయత్యంత స్వేచ్ఛారతిన్

సొమ్మల్ వాఱెడు నీ మొగంబు గనినన్ శోకంబుపెల్లుబ్బు, బీ
రమ్ముల్వల్కు నృకంబు లీవెసఁగి దుర్వారాత్మ వీర్యమ్మునన్
హుమ్మంచున్ వడిబోనువ్రచ్చిచనఁగుయ్యోయంచుబోనే మొసిం
హమ్మా, కాననరాజ్యమేలఁజనుమాయత్యంత స్వేచ్ఛారతిన్ .

వమ్మౌనో జతనంబటంచు నిరసింపంబోకు యత్నమ్ము; నై
జమ్ముల్ మార్పులు, స్వీయమౌబలముసచ్ఛౌ సచ్ఛౌర్యమ్ముమేధాప్రకా
రమ్ముల్ శంకయొనర్చి దీనతఁబడన్ రంజింపె యోచింపు సిం
హమ్మా, కాననరాజ్యమేలఁ జనుమా యత్యంత స్వేచ్ఛారతిన్

చుమ్మల్ చుట్టగఁ బొట్టగట్టుకొనిహుస్సుల్వాఱుచున్ మేకఁమాం
సమ్ముంబట్టెఁడు దిందువో, పలలమిచ్చంగాన భక్షింతు వో;
కమ్ముల్ గిమ్ములు స్వప్నబంధములువీఁకన్ బోనులంఘింపు సిం
హమ్మా, కానన రాజ్యమేలఁజనుమా యత్యంతస్వేచ్చారతిన్

_________

కవి

సరసకవీశ, నీయశము సర్వదిగంచల చంచలేక్షణా
వరకుచ చందనాంకమయి పండితచిత్త చకోర చంద్రికో
త్కరమయి, కాలపత్రమున గట్టిగ వ్రాసిన వర్ణపంక్తియై
ధర వెలుఁగొందుతన్ జనవితానము సన్నుతియింప నిత్యమున్

నీయాశయంబులే నిఖిలలోకమునకు
         మార్గదర్శకములై మహిమఁదాల్చు;
నీమహా సూక్తులే నిర్ణిద్ర విజ్ఞాన
         పటిమ సంపాదించుఁ బ్రజలకెల్ల
సీసరసోక్తులే నీరసాత్మునకైనఁ
        గరుణాంకుర స్ఫూర్తి గలుగఁజేయు;
నీ వీరవాక్కు లే నిర్బలాంగకునైనఁ
        గరవాలు దూయించుఁ గలనుసలుప,

నీవు గలుగని సంఘంబు నిర్మనంబు;
నీవు పుట్టని దేశంబు నిష్ఫలంబు;
నీవు దలఁపని యూహలు నీరసములు;
నిన్నుఁ బొందని వాక్తతి నిందితంబు.

సత్యమ్ము ధర్మమ్ము శౌర్యమ్ము వీర్యమ్ము
         మూర్తీభవించె నీమూలముననె;
సాంఘికాచార సంచయము శాశ్వతముగ
         మూర్తీభవించె నీమూలముననె;
దృగ్గోచరముగాని దివ్యభావములెల్ల
         మూర్తీభవించె నీ మూలముననె;
భూతకాలైక భూభుజుల చారిత్రముల్
         మూర్తీభవించె నీమూలముననె;

నీమహత్త్వము నేమని నేనుతింతు;
నీవు వచియించు నదియెల్ల నిత్యమగును;
సమయభేదావరోధంబు సమసిపోవు;
సకల సజ్జన సన్నుత సత్కవీంద్ర,

__________

సంక్రాతిపండుగ

గరుడస్తంభము చేతఁబట్టి చలికిం గాయంబు కంపింపఁగన్
స్వరముల్ గద్గద మొందమేలుకొలుపుత్సాహంబుగంబాడుచున్
దరమున్ భొమ్మనియూఁదుచున్ ఘణఘణధ్వానంబుగన్ జాగటం
బొరివాయించుచు దాసరయ్య దిరిగెం బ్రోలెల్లడన్ వేకువన్

చలికప్పున్ సడలింపలేక ప్రణయస్పర్ధన్ రహశ్శయ్యపై
నలుకంబొర్లుచుఁబ్రత్యుషంబున గవాక్షాయాత సూర్యాంశువుల్
దళుకున్ బంగరు నిగ్గులం జిలుకఁ గాంతా, లేవెయంచత్తయుం
బలుకన్ లేచెను గాఁపుకోడ లెఱకల్ పయ్యంట బాగొత్తుచున్

అలరు సుమావరోధమును నల్ల గ్రమించి కవోష్ణదీధితుల్
చిలుకుచు లోకబాంధవుఁడు శీతలతన్ హరియించి చెట్లకొ
మ్మలఁ జిగురాకు జొంపములు మాదిరి మీఱఁగ నెఱ్ఱడాలుపూఁ
తలఁ బచరించెఁ గల్యరమతాఁగయిసేసెనొనాఁగఁ బండుగన్.

సరసిజలంబులాడి వెనుజాఱిన క్రొవ్వెద వారిబిందువుల్
దొరఁగి సువాసినీ వితతి తోయములంగొనిపోవుచుండఁగా
నరుణ మయూఖపాళి నిటలాలక సంతతులన్ మెలంగి కే
సరయుత పద్మ విభ్రమము సంధిలఁ జేసెను ముద్దుమోములన్.


పూవులు క్రొమ్ముడిందుఱిమి భూషణరాజిమెయిన్ ధరించి శో
భావహమైన పట్టుజఱిపయ్యెదలం గయిసేసి ద్వారబం
ధావళిఁగామినీమణు లుదంచితరీతి నలంకరించుచున్
హా! విలసిల్లిరెంతయు గృహాంగణముల్ నవదీప్తిశోభిలన్

__________



భారతమాతృ ప్రబోధము.

__________

లెమ్మో మాతro యీప్రభాతరుచులన్ లీనమ్ములై యంధ కా
రమ్ముల్ వీఁగె; మనః ప్రబోధక కలారావంబుగం బక్షులున్
సమ్మోదమ్మునఁ బాడె నీచరితముల్ శౌర్యమ్ముపొంగంగ; లే
వమ్మా, స్వాప్నికశయ్యవీడి,కనుమాయందంద సూర్యాంశులన్

ఫలభారంబు ధరింపనున్న మొగడల్ వాసంతమందానిలం
బులకుం బూచి భవిష్యదద్భుతఫలస్ఫూర్తింబిసాళించు చి
హ్నలసూచించెఁ, దదీయవాసనలకైనన్ లేచి యోతల్లి నీ
తళుకుంగన్ను లఁ గప్పుముంగురులఁ జిత్తంబారఁబైకొత్తవే.

మును గంగా లహరీతరంగతతులన్ భోకొట్టు స్వాతంత్యగా
న నినాదంబులు నేఁడు త్వత్ప్రియసుతానందాత్మ వీణారవ
మ్మున సమ్మేళనమంది. నాగరికతా పూర్ణత్వసంధాన సూ
త్రనినాదంబయి మిన్నుముట్టె జననీ, తల్పంబు వేడిగ్గవే.

కాళిందీ సికతాప్రదేశముల మున్ గల్యాణ కృష్ణుండు స
ల్లీలన్ వేణురవ ప్రబోధములఁ దల్లీ నిన్ను మేల్కొల్పె ని
ద్రాలోకమ్ముననుండి; నేఁడును సుధాధారాభినిష్యందగీ
తాలోలమ్ముగ నారవీంద్రకవి నిన్నగ్గించెఁ, గన్నెత్తవే.

నీపుత్రుల్ గనుచున్న స్వప్నశతముల్ నిండారు సత్యమ్ములై
దాపుం జేరెడు మూర్తిమంతములుగా ధైర్యమ్ముఁబ్రేరించుచున్
మాపుణ్యంబు ఫలోదయంబగునెడన్ మమ్మెల్లదీవింప ని
ద్రా పర్యంకము వీడిరమ్ము జననీ రాగంబవార్యంబుగన్.

___________

విమర్శకుఁడు.

విను: కవితావిమర్శకుఁడ, పెద్దఱికంబును మానుమింక, నీ
మనము శిలామయంబొ,యభిమానమనంతమొ, కోమలాశయం
బణఁగెనొ, సత్కకవిత్వపరమావధి నందితొ, శబ్దలోక జీ
వనమగు భావసృష్టి, సలుపన్ గమకింతువొ, పూవుఁదేనెకున్
మునుకొని మూఁగు తేఁటి పెనుమూఁకలజుమ్మనుకమ్మగీతితో
నెనయగు శబ్దరత్నము లనేకము సుందరభావసూత్రమం
దొనరఁగఁ గూర్చుచుందువో,రసోజ్వలయౌకవితావధూటి మో
హనముగ నిన్వరించునొ, యహర్ముఖమందు హసించుపూవులం
దొనుఁకు తుషార బిందువులు దోఁచిన మోదరసాంకితాశ్రు సం
జననము గల్గునో, వివిధసాంధ్యవిలాసము లంకురింప మిం
చినతమిఁ బశ్చిమాశఁగల చిత్రములం దిలకింతువో ఘనా
ఘనములు నంతరాళమున గంతులు వైవఁగఁ జూచుచుందువో,
వనభృతకాకలీ కలరవంబులు విందువొ, భూధరంబులన్
వనుల వయాళి సల్పెదొ, స్రవంతి నిపాతముఁ గాంతువో నిశీ
థినిఁజని యొంటిగా నిసుకతిన్నెల మే నరమోపి తారకా
స్వనమున గర్భితంబయిన భావరహస్యముఁ గందువో మదిన్ .
తనివి సనంగవ్యాకృతియుఁ దక్కినలక్షణ లక్ష్యముల్ మనం

బునఁ బెనుజిడ్డు గట్ట నెగఁబోసి యజీర్ణవు గాలిత్రేఁచుచున్
మనియెడినీకుఁ గావ్యరసమాధురి నాని యధార్థలోక సీ
మ నొకత్రుటింగ్రమించి క్షణమాత్రముస్వర్గముచూఱగొట్టఁబో
లునె? సరసాత్మ కోమలత లోపముచేసెను నీకుబ్రహ్మ! కా
దనియెదొ? యట్టులేని మధురామృత శీకరముల్ వెలార్చుమో
హన కవితాసుమంబులను నగ్గి రగుల్తు వదేల? పుట్టు మ
చ్చను దొలఁగింపనెంచి నవసారసనేత్ర కపోలఫల్కమున్
ఘనముగ గంధకామ్లమునఁ గాల్చినరీతిఁ బటంబునందు బొ
మ్మను దిలకించి నేత్రములమాదిరి దప్పెనటంచు దబ్బనం
బునఁ దెగదిద్ది కన్నుఁగవ పోడిమి నూడ్చెడు పోల్కి కావ్యముం
గొని వివిధావయంబులనుగోసి కసాయిబజారుఁ బెట్టదో?
కనుఁగొనవోయి మున్‌గవియగాధ హృదంబుధి గర్భ గుప్తర
త్ననిచయమున్ బదింబదిగఁ దత్తటమందుఁ జరించిచూచి; భా
షను నెఱసుల్ గలంచ సరసంబగు పద్ధతి దిద్దుచుందుమం
చనుటయె! యెవ్విమర్శనమునైన విమర్శన దృష్టిఁజూడ ఈ
సును వెలిగ్రక్కుచుండు; గడుసుందనమెంతయు భాషసేవసే
యనుదగు సాధనంబొ,మదియందు నెదోయనుమానమున్న యో
చనమెయిఁ జర్చసేయ కవిచారతఁ దప్పులటంచు దిద్దు నీ
యనుభవ మేమిసెప్పను! మహాశయులీవెడ సేతఁగాంచి ప
క్కున నగరే? మహాకవి నకుంఠితరీతి సడింప గౌరవం
బొనరు నటుచు నెంచెదవహో! యిదిధర్మమె? చిత్రకారుఁడున్

అనుదినముం బ్రయత్నమున నద్భుతచిత్రములన్ లిఖప ఈ
సున నొకడట్టి లేఖ్యములఁజూచి మషీజల సేచనంబుచే
సిన నదియౌనె నైపుణి? కుశేశయపత్రవిశాలనేత్ర నొ
క్క నెలఁతఁ గూడుచెలికారము చొప్పడ నెన్నొయత్నముల్
పొనరిచియుం గృతార్థతను బొందక తత్ప్రణయంబు నీర్ష్యగా
నొనరిచి కాంతనేచు నొక యున్మదుభంగిఁ బికస్వరస్పుట
స్వనమును హంసికాగతియు సారవచో విభవంబుముగ్ధ మో
హన తనువల్లిగల్గు కవితాంగన కౌఁగిలి గోర నాకె చీ
యనుచుఁ దిరస్కరింప రదనాంచలముల్ పొడిగాగగీటి క
న్గొనలను గెంపులూర “నిదిగో కనుఁగొమ్ము విమర్శనాస్త్రముం
గొని దినపత్రికాధనువుగూరిచి నిన్నొగిలింతు” నం బ్రతి
జ్ఞను నెఱవేర్పఁబూని కడఁకం గువిమర్శనకార్యదీక్షఁ జే
కొనెదవు; పండితో త్తములకుం గవివర్యులకుం బరస్పరం
బును నెవియో విరోధములు పుట్టిన యప్డె విమర్శనంబు పు
ట్టును; నటులౌటఁ జిత్తము పటుక్రుధతోఁ జ్వలియింపనొప్పులుం
గనఁబడు తప్పులట్టు; లొకకావ్యమునందున నొప్పుదప్పులం
గని రసముల్ గణించి, యెసకమ్మగు భావములం దలంచి శో
భను గమనించి, శిల్పకళపద్దతిఁగాంచియు నౌచితిం గనుం
గొని, కవిచిత్తమారసియు క్రోధముఁ బాసి విశేషశాంతభా
వ నియతితో విమర్శనము వ్రాసిన నయ్యది మార్గసూచియై
తనరునుగాని పండితుఁడు తప్పులనే యొక కొన్నిచూపి యొ



ప్పును గమనింపకుండుట ప్రపూర్ణవిమర్శన ఫక్కీయౌనె? చిం
తన మొనరింపుమయ్య, కవితాసుమంజరి కమ్మతావులం
గొని సువిమర్శనానిలము గూఱిచి మానవపాళి కెల్లఁ బం
చిన నది మేలుసేతఁయగు; శ్రేయము కీర్తియు నీకుఁ జేకుఱున్;
మునుపటినుండి నీవచన ముద్గరసంహతి నెందఱోకవుల్
మనమెఱియంబొకారిరి; కుమారికలౌకవితాలతాంగులే
యనలముఁ జొచ్చిరో, రసమయంబుగ నేఁటికిఁగైత సెప్పఁజా
లిన కవులెందఱో తొలిమలిం గుఱివెట్టు విమర్శతాఁకునన్
దినదినముంగృశించి యతిదీనత నీకవితోద్యమంబె మా
నినసుఖమంచునెంచిరొ, వినీతి నిఁకం గవిమారకాస్త్రలీ
లను నుపసంహరింపుమి కళాపరిపూర్తికి దారిచూపుమీ.

_________

దేశమాతృస్తవము.

ఏధీరహృదయకు నింపారు హిమవద్ద
          రాధరంబు కిరీటరాజమయ్యె;
ఏపుణ్యచరిత కహీన గంగాసింధు
          వాహినుల్ తోమాలె వలె రహించె;
ఏమహాసాధ్వికిఁ గోమలతరులతా
          బృందమ్ము ఫుల్కలచందమయ్యె;
ఏవీరమాతకు దేవారిపురిలంక
          పాదపీఠంబుగఁ బరిఢవిల్లె;

అట్టితల్లిని నిన్ను జేపెట్టి యెపుడు
భక్తి సేవింతుమమ్మ నీపాదమాన;
మమ్ము నీపుత్రకులఁ గావుమమ్మ కరుణ,
దివ్యశక్తిప్రపూత యోదేశమాత.

కొఱలు ముప్పదిమూడుకోట్ల కోటీరముల్
          నక్షత్ర చయములై నభము ముట్ట;
ఘోరారి మదకుంభి కుంభశోణితధార
          లేఱులై సెలవులఁ బాఱుచుండ;

వజ్రప్రభావ నిర్భరత శాసించెడు
           శాతత్రిశూలంబు చేతమెఱయ;
నీలకంధరవర్ణనిబిడమై దేహంబు
           భూనభోంతరములఁ బూరటిల్ల

దుర్ణి రీక్ష్యప్రతాపంబుతోడఁ దాండ
వంబు సల్పెడు నీస్వరూపంబు మాకు
దర్శనంబీయఁ గొల్తు నితాంతభక్తి
దివ్యశక్తిప్రపూత యోదేశమాత!

వేదాంతవిద్యా వివేకస్వరూపకుం
            డల వివేకానందు నాత్మ శక్తి;
ప్రకృతివిజ్ఞానశాస్త్ర ప్రవీణుఁడు జగ
           దీశచంద్రుని బుద్ధిపేశలతయు;
కవితారసాస్వాదకవ నీతకంఠుండు
           కవిరవీంద్రుని కావ్యగానరక్తి;
చిత్రకళాప్రభా శేముషీ ధుర్యుండు
           రవివర్మ తూలికారత్నమహిమ

మాకుదయచేసి విద్యానవివేకఘనులు
గా నొనర్పుమ వాత్సల్య గరిమ మమ్ము;
కనుము పూర్వస్మృతిని కొంత మనమునందు
దివ్యశక్తి ప్రపూత యోదేశమాత!

దుర్వారశత్రు సందోహమ్ము మర్దింపఁ
          దొడరునట్లుగ శౌర్యదోర్బలంబు
నీమహావిఖ్యాతి నిత్యంబు వినుతించి
          చెలఁగునట్లుగ మాదు జిహ్మలతలు;
స్వాతంత్ర్యబలిజేది సన్నిధిఁ గానుక
         లర్పించునట్లుగ నాత్మదృఢత,
కావింపఁ దలపెట్టు కార్యాళి సాధింపఁ
         గడఁగు నట్లుగ వీరకార్యదీక్ష

అమ్మ ప్రతిపక్ష వీరసంహార ఘోర
భీకర కరాళ రూపిణీ, ప్రీతిమీఱ
మాకు దయసేయుమమ్మ తన్మహిమలెల్ల
దివ్యశక్తి ప్రపూత యోదేశమాత!

పుణ్యస్రవంతికా పులినభాగంబుల
          వేద ఋక్కుల ఘోష వెలయవలయు;
హైందవ యువకుల యాత్మదర్పణముల
         నీమనోహరమూర్తి నెగడవలయు;
ఆరణ్య విశ్వవిద్యాలయమ్ములయందు
         విద్యార్థులను జదివింపవలయు;
భారతీయులొనర్చు ప్రతికార్యమునయందు
         జాతీయతావ్యక్తి చాటవలయు;

ఎట్టు దిద్దెదొ పుత్రుల నింకమీఁదఁ,
బూర్వశోకమ్ము విడనాడి పూనుకొమ్ము
గౌరవాస్పదానల్ప సత్కార్యదీక్ష
దివ్యశక్తి ప్రపూత, యోదేశమాత!

___________

జలజము.

సంతమసావరోధమున సన్ననిమంచు చెఱంగుఁగప్పి నీ
వెంతయు వంతలంబొగుల నింతకురాడు మయూఖమాలి తా
నెంత కఠోరచిత్తుఁడొ సహించునొకో ప్రణయప్రవాహ సం
క్రాంత మనస్కయై చెలఁగు కాంత హృదీశుఁ డుపేక్ష చేసినన్.

కడు గర్భస్థ మిళిందబృందము మిషన్ గగ్గోలుగానేడ్చి సం
దడిసేయంగ నిఁ కేల వారిజమ, యుద్యద్ధాళధళ్య ప్రభం
బుడమిన్ ముంచుచువచ్చుమిత్రుఁడనుచున్ బోధింపఁబెన్వీచులం
బడి నిన్ జేర రథాంగదంపతులు ప్రేమన్ వచ్చె వీక్షింపుమా.

అరుణుఁడువొల్చె శీర్షమకుటాగ్రమణీమయకాంతి పుంజముల్
వఱలఁగ; వందిమాగధుల భాతి ఖగంబులుగూసెఁ; జీఁకటుల్
దొఱఁగెను; నింకనైన మది దుఃఖమువాసి ప్రసన్న చిత్తవై
కరుణ ననుగ్రహింపు బలుకౌగిటఁ గాంతుని; నల్కమానుమీ

__________

ఆశీర్వాదము.

లోకోజ్జీవన కరమయి.
ప్రాకట రసభావ శిల్ప భరితంబయి నూ
త్నా కారంబుల వెలసెడు
నీకవిత చెలంగుఁగాత నిత్యము సుకవీ!

శారదచంద్రికా స్ఫురిత శర్వరులందు నదీతరంగ ఝం
కార రవానుకారియయి కమ్ర రసాభ్యుచితప్రచారియై
సారస నిర్యదంబు ఘనసార సుశీతలతం జెలంగి సొం
పారునుగాత! నీకవిత యాంధ్రకవీ, రసికోపభోగ్యమై.

ఱాలఁ గరంది మ్రోడుల సరాళకిసాల చయంబులొత్తి శో
భాలలితార్ద్రభావ రసభంగులకుం దలిదండ్రులైన వా
గ్జాలముగూర్చి గీతముల సత్కవిశేఖర, పాడిపాడి యాం
ధ్రాలి చిరప్రసుప్తమగు నాత్మను నిద్దురలేపు మియ్యెడన్ .

___________

బంభర శుకకీట సంవాదము.

శుకకీటంబునుగాంచి బంభర మహో! చోద్యంబు! నీపక్షవ
ర్ణకళాచిత్రము లెట్టిపుర్వునకు నైనం గల్గునే? యింద్రచా
ప కణంబుల్ నవరత్నఖండరజముల్ పక్షంబులంజెక్కి తా
నొక కీటంబు రచింపఁగోరి విధి నిన్నొప్పార నిర్మించెనో!

నిను గాంచంగనె యెట్టి జీవులకునేనిం బ్రేమ చిప్పిల్లు, స
న్ననిపూరేకులం బోలు నీగఱుల సౌందర్యంబు కొల్వుండెడిన్,
అనయంబున్ బువుఁదేనెలాని రమణీయంబైన నీరూపమున్
ఘనఝుంకారనిబద్ధ గీతముల నే గానంబుఁగా వించెదన్.

అనవిని సీతాకోకము
తను బొగడుచునున్న షట్పదంబును గని, నీ
వనునది యెల్ల నిజంబై
నను, సంతాపాంకితంబు నాబ్రతుకు సఖా!

నను గనినంత బాలురు మనంబున సంతస ముప్పతిల్ల జ
క్కని పురువియ్యదే యనుచుఁ గాలుకుఁ గాలు మెదల్పకుండ మె
ల్లన ననుబట్టి ముద్దిడుచు, లాగుచు, నొండొరు చేతికిచ్చుచుం
గొనుచు గఱుల్ సడల్చి తుదకుం బడరువ్వుదు రేమిసెప్పుదున్!

అర్భకుల కాటయయ్యు నయ్యయ్యొ! నాకుఁ
బ్రాణ సంతాపకరమగు బాధయగును;
నాదు సౌందర్యగరిమయే నాకు మృత్యు
వగును బంభరమా, యిఁ కేమని వచింతు?

కమ్మఁదేనియఁ ద్రావి ఝంకారములను
శ్రుతి సుఖమ్ముగఁ జేయుచు సొంపుమీఱు
నీరజాగారమున నుండు నీకు నెపుడు
సాటియౌదురె మాబోంట్లు షట్పదంబ?

అని శుకకీటమాడ విని యౌనపు నందఫు రూపుగల్గి తా
ననయముఁ బ్రాణసంశయమునందుచుఁ ద్రిమ్మరుకంటె, నల్లరూ
పున మసిబొగ్గులా గలరి పువ్వుల తేనియలాని తమ్మిగీ
మున నివసించుటే సుఖము మోదమునించును;బోయివచ్చెదన్

అనివచియించి మిళిందము
ఘనవర్ణ గరుద్ద్వయంబుఁ గదలించుచు జు
మ్మని గానము లొనరించుచుఁ
దనదారిని బోయెఁ బుష్పతరువాటికకున్.

__________

మాతృశతకము.

శ్రీకళ్యాణనిధాన మాశ్రితజనాశ్లేషానుభావ్యంబు పు
త్రైకానందకరం బరాతినృపమూర్ధన్యస్త ముద్యద్యశో
వ్యాకోశీకృత దిఙ్ముఖంబు కరుణావాల్లభ్యపూతంబునై
మాకుంగూర్చుత దేశమాతృపదయుగ్మం బర్థమారోగ్యమున్

తల్లీశారద, మాతృదేశమును శ్రద్ధాభక్తి సేవింప నేఁ
దుల్లాసంబుగ సన్నుతుల్ సలుప నేనుంకించితిన్, నీవు నా
యుల్లంబందు దయామతిన్నిలిచి యుద్యోతించి, మందాకినీ
కల్లోలార్భటి నించు పల్కు- రసనం బల్కింపవే, నింపవే.

కఱవుంగాలమనాక బిడ్డలను నెక్కాలంబునందైన స
త్కరుణా దృష్టులఁ బ్రోచి కట్టఁగుడువం గల్పించి పోషించి యా
త్యురుకష్టంబులు సైచు నీకుఁ దులయే యోచింపఁగన్ దేవతల్
గురువుల్ బంధులు పుత్రమిత్ర, ధనముల్ కోట్లైన నోమాతరో

తళుకుం జెక్కులు గబ్బిగుబ్బలును నిద్ధంపున్ లలాటంబు ను
జ్జ్వల శంపాలతఁ గేరుమేననుచు నిచ్చల్ స్త్రీలవర్ణింప నే
మిలభించున్ వెత దక్క? నిన్నుఁదలఁపన్ మించుంగదే సద్యశో
విలసత్ సౌఖ్యసమస్తసంపదలు నిర్వేలాకృతిన్ మాతరో.

ఘనముల్ కుంతలపాళిగాఁగ హిమవద్గ్రావంబు హీరప్రభా
ఖనియౌ దివ్యకిరీట మట్లెసఁగ గంగాసింధువుల్ బాహు లై
యొనరన్ వింధ్యము మేఖలావలయమైయొప్పార భవ్యాకృతిన్
మును గన్పట్టిన నీస్వరూప మిపు డింపుల్ వాసెనే మాతరో

సరసీజాప్తమయూఖముల్ కిసలయచ్ఛాయన్ విడంబించి క
ల్యరమాకంఠమునన్ సుమస్రజము లీలంగేరు వేళన్ సరో
వరతీరంబుల మౌనులాగమవచః ప్రాగల్భ్యముం జూపుచుం
బరగన్ స్నానము మున్నొనర్తు రిపుడవ్వా రేడనే మాతరో.

హరిణుల్ నిర్భయలీలఁ బచ్చికలనాహారింప వన్యోర్వి, ని
ర్భరమోదంబున గిండ్లు గైకొని ఝరింబ్రాపించి సల్లాపముల్
జరుపం దాపసకన్యకల్ ఋషులుసంజన్ మ్రొక్క, నానందమం
దిరముల్‌ గా మునిపల్లెలొప్పెఁగద మున్ నేఁడేవియో మాతరో

హోమోద్భూత పవిత్రధూమచయ సంయోగంబునం బుష్పితా
రామంబుల్ ఘృత సౌరభాంచితములై రాగోల్లసత్పల్లవ
స్తోమంబుల్ మసిపూతలొంద, మృగసందోహంబు క్రీడింపఁగన్
గోముం జిల్కువనంబు లిత్తఱిని రంగుల్వాసెనే మాతరో.

సెలయేఱుల్ శిలలం దొరంగి రవముల్ సేయంగ వాసంత కా
ల లతావాటులు తావులం జిలుక నుల్లాసంబుగం గోయిలల్
పలుకన్ మావుల నీడ శిష్యతతికిల' బాఠంబులం జెప్పు నొ
జ్జలు నావన్య పవిత్రసంస్థ లిపు డేజాడయ్యెనే మాతరో.

తలఁపం జిత్రముగాదె బౌదుల నలందావిశ్వవిద్యాలయ
స్థలమున్ ముప్పదివేల శిష్యులట శాస్త్రంబుల్ పఠింపంగ ని
చ్చలు వాణీనిలయంబులై వెలయు నాస్థానంబు లేమయ్యెనో?
కలఁ జింతించిన యట్టులాయెఁగదె యిక్కాలంబునన్ మాతరో.

జలకంబాడి త్రయీప్రయుక్తవిధులన్ సాంగంబుగందీర్చి వి
ద్యల నభ్యాసము సల్పఁదాపసుల చైత్యంబుల్ సమీపించు శి
ష్యులు లేమింగద భావదాస్యపరతన్ శుష్కించుచుం గ్రుంగె దే
బలవత్కాలజలప్రవాహ భయదావర్తావళిన్ మాతరో.

సుతులత్యంత భుజబలాడ్యులగుచున్ శూరత్వమేపార వి
శ్రుతనంగ్రామకళాధురంధరత శత్రువ్రాతముం ద్రుంచి సం
తత కీర్తిన్ వెలయింప నీనయన పద్మంబుల్ ప్రమోదాశ్రుశో
భితిముల్ గావొకొ మున్ను; నేఁడవియెటుల్ పెంపేదెనే మాతరో.

అవనిన్ వాఙ్మయమందు క్షత్రియపద వ్యాప్తిందొలంగింప భా
ర్గవరాముండు ప్రతిజ్ఞపట్టి తరుణక్ష్మాపాల కంఠాంకు రా
స్రవదస్రోత్కట నిర్ఝరిం బరశు మత్స్యం బీఁదనేర్పించి సం
స్తవనీయుండయి మించె నట్టిసుతు నెంచన్ లేవటే మాతరో.

ఖరరక్షో ముఖులైన నాల్గుఁబదివేల్ క్రవ్యాదులన్ ధైర్య సు
స్థిరతన్ దా నసహాయశూరుఁడయి నిశ్శేషంబుగంగూల్చి, రా
గ రమం గ్రక్కు నశోకశాఖవలె రక్తప్లావితాంగంబుతో
ధరణీజాతకు డాయు దాశరథి సందర్శింపవే మాతరో.

వనధిన్ గోష్పదమట్లుదాటి యసుర శ్రాతంబుఁ జెండాడి సీ
తను దర్శించి యశోకవాటిక సముద్ఘాటించి పౌలస్త్యు చెం
తను నిర్భీతిగ రామునాజ్ఞపలుకన్ దర్పించి లంకం ద్రుటిం
గనదగ్నిన్ రగిలించు మారుతి కిఁకం గైమోడ్పనే మాతరో.

కురువంశస్థులు పాండవుల్ సమదనిర్ఘోషంబులం జేయుచున్
ధరణీచక్రము దిద్దిరందిరుగ యుద్ధక్రీడ నన్యోన్యమున్
శరకౌశల్యముఁ జూపఁ గాంచి మది నుత్సాహంబు పొంగంగ నీ
మురువుఁజూపిన కాలమిప్డు కలయైపోయెంగదే మాతరో.

మును చంద్రార్ధకళా కిరీటు శివునిం బోరన్ బడాయించి యా
తని మెప్పించి గడించి పాశుపతమున్, ధర్మక్షమాజానికిన్
ఘనరాజ్యంబును గట్టి కౌరవపతిం గాఱించి శౌర్యంబు చూ
పిన గాండీవి శరాలు త్రుప్పుదినెనే పృథ్వీస్థలిన్ మాతరో.

గురుకర్ణాఖిలయోధ సంఘటితమై ఘోరారి దుర్భేద్యమై ..
స్థిరమై యొప్పెడు తమ్మిమొగ్గరము దోఃస్థేమంబునం జీల్చి వై
రి రసాకాంతులు సైతముం బొగడ నిర్జిద్రోగ్ర సంగ్రామబం
ధురతం జూపిన పార్థపుత్రుఁడు మదిందోఁతెంచు నే మాతరో.

విజయా, నీతలగాచికొమ్మని రణావేశంబునం దేరులుం
గజముల్ సేనలు పీన్గుపెంట లటులం గావించి గర్జించి, యం
బుజనాభుండును జక్రమెత్తునటు లేపుంజూపె గాంగేయుఁడా
ధ్వజినీకాంతుని యంపశయ్యఁ గనుమా భావంబునన్ మాతరో.

గురుశాపంబును విప్రశాపమిపుడే గూడెంగదా, యస్త్రముల్
పరునిం దాఁకవటంచు నర్జున శరవ్రాతక్షతిన్ రొమ్ము నె
త్తురుఁబైఁజిమఁగ, నేలఁగ్రుంగు రథమున్ దోర్దండముల్ మోపియే
డ్తెఱఁ బైకెత్తెడి కర్ణయోధ రణశక్తిం బాడుమీ మాతరో.

సెలవుల్ సాంధ్యరమన్ వహింపఁగఁ గురుక్షేత్రంబునన్ ధార్తరా
ష్ట్రుల కీలాలము దోయిలించి దగగొట్టుల్ దీఱఁగాఁద్రావి,తూఁ
పులగంటుల్ విరఁబూయు కింశుక కుజంబున్ గ్రేణిసేయన్ జగం
బులు భీతిల్లగ ద్రౌపదిం దరియు భీముం గాంచుమో మాతరో.

గురువృద్ధాంచిత సైన్యముంగనుచు నీగోడేల నాకంచు సం
గర వైముఖ్యముఁజూపు పార్థునకు వీకన్ గీత బోధించి ని
ర్భర శౌర్యంబును గొల్పి తేరికిని సారథ్యంబుఁగావించి భూ
భరమున్ డించిన సూత్రధారిని మదిన్ భావింపవే మాతరో.

కంసోర్వీశుఁడు క్రూరుఁడై నిజభుజూగర్వంబునన్ లోకమున్
హింసింపన్ గతియేమిలేక పనులెంతేఁ గుయ్యొ మొఱ్ఱోయనన్
శంసాపాత్రుఁడు కృష్ణుఁడా నృపతి మస్తంబూడ్చె; నవ్విక్రమో
త్తంసున్ దుష్టనికృంతనున్ నిరతమున్ ధ్యానింపవే మాతరో:

శరదిందూదయవేళ యామునతటిన్ సంగీతనాదంబు లం
బురహాంతస్థమిళింద ఝంకృతులలోఁ బూర్ణత్వముంబొంది యిం
పు రహింపన్ మురళీరవాంచిత సుధాపూరంబు వాఱించి యే
పరమాత్ముండిల మేలుకొల్పె, నతనిం బ్రార్థింపుమా మాతరో

ఆలీసాందరువంటి శూరుని రణవ్యాపారముల్ మాన్పి సై
న్యాళిం బీఁనుగు పెంటలంజలిపి కయ్యంబందుఁ బ్రాచ్యావనీ
పాలుర్గండర మిండలంచుఁ దలవంపన్ గ్రీకుసర్దార్లు దో..
ర్లీలం జూపిన చంద్రగుప్తు మదిఁ బేర్మింగాంచవే. మాతరో.

ఢిల్లీ రాజ్యధురంధరుంగదిసి దుండిన్ బోర జృంభించి శుం
భల్లీలన్ జయలక్ష్మిఁగైకొని రిపువ్రాతంబులంజీల్చి పే
రుల్లాసంబున రాజపుత్ర యశముద్యోతింపఁ జిత్తోడ్ క్షమా
వాల్లభ్యంబు భరించె; నట్టిపురిశోభల్ మాసెనే మాతరో.

ఆర్యావర్తమనార్య సంఘపద విన్యాసోగ్రపాపంబునన్
శౌర్యౌదార్యపవిత్రవేదవిధులం బాసెంగటా! లెండు మీ
ధైర్యస్ఫూర్తి యొకింతచూపుఁడనిపోత్సాహంబుఁగొల్పెన్ యశో
ధుర్యుండా మహరాట బెబ్బులి మదిందో తెంచునే మాతరో.

ఔగా! గౌతమి తీరముల్ యవనపాలానీకినీ స్పర్శచేఁ
గూరెం గల్మష, మాంధ్రదేశయశ మెగ్గుంబొందె, నేమున్నదిం
కోరాయా, యని పౌరులాడఁ బరరాడ్యూధంబులన్ గెల్చిపొ
ట్నూరన్ నిల్పడెకృష్ణరాయఁడుజయాంకోత్తంసమున్ మాతరో.

పరరాణ్మత్తగజేంద్ర కుంభదళన ప్రారంభనిర్యాత భా
స్వరముక్తాఫలహారముల్ నిజయశః సాధ్వీగళాలంక్రియ
స్ఫురణన్ మీఱఁగనాంధ్రశౌర్యముఁబరాసుల్ మెచ్చఁబోరాడె
భూ! వరుఁడాబొబ్బిలి బెబ్బులింగనుమ పాపారాయనిన్ మాతరో

సిరుగన్ దుగ్ధము ఖడ్గతిక్కనయు "నబ్బే!పాలిదేమే?" యనన్
"విరుగన్ నీవెరణంబునం దిఁకను బాల్ విర్గ న్విచిత్రంబె"యం
చరినిర్మూలన కేళికిం దనయు డాయంజేయు వీరప్రసూ
త్తరయింకొక్క తెలేదెయాంధ్రమహినిద్రంబాపగన్ మాతరో.

“ఇటనీరాడెడు చోట సిగ్గుపడిపోనేలా? తమాయింపు మి
చ్చట నీమువ్వుర మాఁడువార"మనుచున్ సంగ్రామమం దోడిని
ష్కుటముంజొచ్చినభర్త హేళనములన్ శూరత్వమ్మున్ రేఁపి యు
త్కటయుద్ధంబున కంపినట్టి సతికిం గైమోడ్పవే మాతరో.

పరమత్తేభఘటాంకుశంబయి రణప్రౌఢిన్ విజృంభించి భూ
భరముందాల్చిన నాగమాంబికయశఃప్రాగల్భ్యమాంధ్రాంగనా
భరణంబైచెలువారు, నట్టిసుత సంభావించి నేఁడైన సం
బరమున్ ముచ్చటముద్దు దీర్చుకొనవేభావ్యమ్ముగన్ మాతరో

గ్రీకుల్ మూఢత నుండ, జంతువులటుల్ క్రీడింపరోమన్లు, ఘో
రాకారంబుల నీలిరంగుల శరీరాద్యంతముంబూసి కొం
చే కాంతారములందొ యాంగ్లజనముల్ హేయంబుగానుండ నీ
కాకాలంబువ మించె నాగరక విద్యాసంపదల్ మాతరో.

ధరనెచ్చోటనుగాని విద్యలు విధుల్ ధర్మంబులున్ శాస్త్రముల్
సరసత్వంబునులేని నాఁటను మనోజ్ఞంబైన చిత్రంబులం
బరతత్త్వ ప్రకృతి ప్రభావముల నుత్పాదించు వేదంబులం
బొరి వాక్రుచ్చిరికారె నీకొమరులింపుల్ మీఱఁగన్ మాతరో

ఇలనేదేశమునందు నిట్టికళ నెందేఁగాంచమంచున్ జనుల్
పలుకం, జంద్రశిలావళీరచితమై ప్రత్యగ్రరత్నాంకురో
జ్జ్వలమై తాజమహల్ నిలింపపురినా సంధించు నాశ్చర్యమున్
గలరే నేడును నట్టిశిల్పులు ధరాకాంతాగ్రణుల్ మాతరో.

దేవాగారవిహారమంటపములన్ దీపించు చిత్రాళి ప్రా
ణావిర్భావముగల్గఁ బల్కవె త్వదీయానల్పశిల్పక్రియా
సేవాసక్తి “నజంత” చిత్రరచనా శిల్పోన్నతిం గన్న నేఁ
డేవారల్ నిమసన్నుతింపరు ముదంబెచ్చన్ మదిన్ మాతరో.

యవనోర్వీశుల ధాటికిన్ మిగిలి యర్ధానర్థరూపంబులం
దవులన్ నిల్చిన దేవతాలయములన్ దర్శింపఁ ద్వత్పూర్వశి
ల్పవిధానంబుల యస్థిపంజరము లన్ భావంబుదోఁ తెంచు; నిం
క వివేకింపుమ పూర్వశిల్పమెటులం గాంతిల్లెనో మాతరో.

మును మంత్రంబులశక్తిచేఁ బ్రతిమలైపోయెన్ శిలల్, లేకయుం
డిన నింకెట్టుల నిట్టివిగ్రహములన్ నిర్మించు నేశిల్పియై
నను నాఁగన్ రమణీయ శిల్పముల ధన్యంబైన “యెల్లోర"సృ
ష్టినిగావించిన సిద్ధహస్తుల కళల్ జీర్ణించెనే మాతరో.

హరినీలంబులు పద్మరాగములు వజ్రాంకూరముల్ పచ్చలుం
బరగన్ నవ్యమహేంద్రచాప సుషమా ప్రాగల్భ్యముంగేరు ఠే
వ రహించెంగదె నెమ్మిగద్దియ కళావాల్లభ్యముంజాటు చా
వరపీఠం బిపు డేడనున్నదొ మదిన్ భావింపవే మాతరో.

అన్నల్దమ్ములు మచ్చరించి సకలం బర్ఖంబు వేఱొక్క పు
ల్లన్నన్ నమ్మి వృథాగఁ దుట్టతుద కయ్యర్థంబుఁ గోల్పోవు రీ
తి న్నీవ్రాతయుఁ డెల్లవాఱె; బకభక్తిన్ నమ్మి మత్స్యంబులా
పన్నత్వంబున డిందవే కపటముం బాటింపమిన్ మాతరో.

గంగోత్తుంగ తరంగ పాళులకు నాల్కల్ గల్గినం బూర్వ రా
జ్యాంగ ఖ్యాతి పరాక్రమక్రమరణ వ్యాపార పారీణతన్
రంగారన్ వచియింపవే వసజ నిర్యద్బంభరీ డింభకా
భంగోద్యన్ మృదులార్భటుల్ శ్రుతులుగా భాసిల్లగన్ మాతరో.

పోయెన్ శౌర్యము, పోయెవీర్యము రమాభోగంబులుంబోయెవే
ఱాయెంగీర్తికి నీకు దుర్యవన సైన్యాంబోధి కౌర్వానల
ప్రాయంబౌ యసి త్రుప్పుపట్టెఁ; బదముల్ బంగారుసంకెళ్ళలో
రాయన్ భూషలటంచు సంతసమునన్ రాజిల్లితే మాతరో.

పారావారములెల్లదాఁటి మునుపుం బాశ్చాత్యదేశంబుతో
బేరంబుల్ పొనరించి నావికులుగాఁ బేరొంది హిందూ వణి
గ్ధీరుల్ గాంచిరి కోట్లకున్ ధనము; నాతేంజంబు నీనాఁటి వ్యా
పారుల్‌పొంద నుపాయమొండు గనుమా భావించియోమాతరో

హిమవత్పర్వత గహ్వరంబు డిగి మౌనీశుండొకం డిప్పు డా
ర్యమహింజొచ్చి యిదేమి దేశమన నార్యావర్తమం చేరు ధై
ర్యముతోఁ జెప్పఁగలారు? పూర్వమటులాయౌన్నత్యమాటెక్కు
నా రమణీయత్వము సట్టినీతి గలదే రాజ్యంబునన్ మాతరో.

పరవీరుల్ బెగడొంద ఖడ్గములఁ ద్రిప్పంజాలి యుద్ధంబులన్
శరముల్ గాడిన పోటుగంటులె తగన్ సమ్మానపత్రంబులై
యొరపుంజూపిన యార్యయోధులిపుడేమో కత్తిచేపట్టఁగా
నరుహుల్ గారట! యిట్టివింతగలదే, న్యాయమ్మటే మాతరో.

కనకాగారము, రత్నసంఖచిత మెక్కాలంబునం బండ్లు నిం
దునకేవచ్చును, బంజరంబయిన నిందుంగల్గు సౌఖ్యమ్మటం
చను రాచిల్కవిధాన నుంటి; విఁకనే నానందముంబొంద ముం
జని స్వాతంత్య్రనభో విశాలతను నిచ్చల్గాంచుమీ మాతరో.

చెఱకా బెల్లము, బియ్యమా కబళ,మోచెట్లా ఫలంబిండు మి
మ్మురుభక్తిన్ భజియింతునన్న నిడునాయుప్పొంగి వాంఛార్థముల్
పరగన్ గానుగ రాచకున్న, ననలవ్యాపారమీకున్నఁ, గ్ర
చ్చఱఁగోలంగొని రాల్పకున్న; నిదినైజబెందు నోమాతరో

గమనాయాసమునన్ హయంబులొఱగెం గపించెఁడెక్కెంబు; క
ర్దమనిర్మగ్నములాయెఁ జక్రములు; చేరన్ లేదు గమ్యస్థలం
బ, మహింజుట్టెను జీఁకటుల్, రథమువోఁబై కెత్త నీపుత్రులన్
గుమిగూడింపు ప్రబోధగీతములదిక్కుల్ మ్రోవఁగన్ మాతరో

"తరుణార్కుండిదెవచ్చువాఁడు, తమముల్ తల్గండి,పొల్పేదేమీ
హరువుల్” నా వచియించు శుక్రునటు భక్త్యావేశనక్షత్ర మీ
తరుణంబందుఁ ద్వదీయపుత్రహృదయాంతర్వర్తియైశోభిలెన్
సరగన్ స్వాప్నికబంధముం జదిపి స్వేచ్చన్ లెమ్మిఁకన్ మాతరో

తిమిరాంధీకృతశయ్యపైఁ గలగనందెల్వేది స్వీయస్పృహా
సమతంబాసి, తమిస్రనైతినని యెంచంబోకు సూర్యాంశువుల్
రమణీయంబగు నీశరీరగరిమల్ రాజిల్లఁ జూర్ క్రంతలం
దెమలన్ లేదొ స్వరూపబోధకరుచిం దీండ్రించుచున్ మాతరో.

మదవేదండము శృంఖలందునుప, దిఙ్మాతంగ కర్ణోత్థ భీ
ప్రదఝంఝూ నిలమట్టెవీవఁ, దటఘర్ష స్ఫూర్తినంభోధిశుం
భదనంతోర్మి కరాళదంష్ట్రల ధరన్ భక్షింప నెవ్వారు కా
దిదియౌనం చెదురొడ్డువారు ప్రకృతిస్వేచ్చాహతిన్ మాతరో

ఆకుల్ ద్రుంచియుఁ దీవలంజదిపి యాయావాపముంబూడ్చి పై
పోకల్వాపఁగనల్లుదించి యెటులో సొక్కించియుం జైత్ర భే
రీకళ్యాణ రవంబు రేగఁ గళికల్ రెక్కో వెపూఁదోఁట, నా
యాకాలంబుస కవ్విగూడును నయత్నావాప్తిగన్ మాతరో.

కడుపుంగాల్చెడు శోకమే మొ! పలుకంగారాదు వాకట్టు చే!
నొడలెల్లన్ వసివాళ్ళువాడె, నిఁకఁ గుయ్యో మొఱ్ఱచే నెల్గురా
పడె, ఝాళంఝళరత్ననూపురమిషణన్ బల్మారునమ్మించియున్
దొడిగెన్ శృంఖల నీకభాగ్యరమ సందుంజూచియోమాతరో

తనయుల్ మేమట! మౌనిరాణ్ణికరపాదస్పర్శ బూతాత్మవౌ
నినుబూజించెడివారమంట! రణనిర్ణిద్రోగశౌర్యప్రధా
ఘనులౌ వీరులుపూర్వులంట! యిఁకనిక్కాలంబునన్ నీవు భో
జనహీనంబుగఁ బొట్టగట్టికొన నిచ్చల్ సూతుమే మాతరో.