Jump to content

కవికోకిల గ్రంథావళి-2/పరిశిష్టము

వికీసోర్స్ నుండిపరిశిష్టము.

__________

పంటకారు - సాయంకాలము.

________

దినమెల్లన్ గృహ కార్యనిర్వహణ బంధీ భూత చిత్తుండనై
యినుఁడస్తాద్రి నలంకరింపఁగ విహారేచ్ఛల్ తలల్ సూపఁబా
వనమై పండినపైరు చేలనడుమన్ బంగారు స్వప్నాల కో
నను దేలాడినయట్లు పోయితి మహానందంబు చేకూఱఁగన్.

గూళులకువచ్చు పక్షుల కూజితములు
సంజకెంజాయ గారడి చక్కఁదనము
వరుల వినవచ్చు కీటకా వ్యక్తగీతి
కాఁపువానిని సైతము కవినొనర్చు !

ఆ పొలంబొక దేవాలయంబొ యనఁగ
హృదయము ప్రశాంతమై చింతలెల్లఁ బాసెఁ;
బ్రకృతి సౌందర్య గరిమ నన్ బందిసేయ
నోరులేని పూజారినై యూరకుంటి.


చిలుకలదండు క్రేంకృతులుసేయుచు మామిడియాకు తోరణం
బులు చదలెల్లఁ గట్టినటుమూఁగి, చివుక్కునవ్రాలి, దోర కం
కులఁ దమనోటఁబెట్టికొని గూళులకుం గొనిపోవుచుండె; సం
చలనములేని నామనము సందడి చప్పుటి కుల్కి మేల్కనెన్.

ఫలసష్టం బగుచున్నదన్న తలఁపుల్ బాధింపఁజిత్తమ్ముఁ; జి
ల్కలసౌందర్యము, వానిస్వేచ్ఛ మదవాక్కర్ణప్రియత్వంబునుం
బలుకన్ శక్యముగాని సమ్మదముగూర్పన్, రెంటికింజిక్కియా
కులమై చిత్తము తోఁచితో పకయటం గూర్చుంటిముగ్ధుండనై.

కాఁపువానికిఁ గవికి సంగ్రామ భూమి
యయ్యె హృదయంబు; కొంతసేఁపైన వెనుక
కవియె మీఁదయ్యెఁ, గ్రిందయ్యెఁ గర్షకుండు!
తారలుదయింప నింటికిఁదరలిపోతి.

మే 2-1927_________

జాతీయత.

_______


ఓసి జాతీయతా, నీబలో జ్జ్వలత్వ
మెంత! నీశక్తి సామర్థ్యమెంత! నీదు
శంఖరవమునఁగల యింద్రజాల మెంత!
అస్థిపంజరములు సైత మాడు నౌర!

నీ యాజ్ఞచేఁగదా నిఖిల భారతభూమి
           గాంధీ మహాత్ముని కట్లఁ బడియె;
నీ కోర్కెచేఁగదా నెఱలోభి యైనను
           దాఁచి యుంచిన నిధుల్ త్రవ్వియిచ్చె;
నీ ధర్మమునఁగదా నెఱజాణయైనను
           మోటు ఖద్దరు మేన మోయఁ దొడఁగె;
నీ పిల్పుచేఁగదా నిర్ణిద్ర కీర్తులు
           చెఱసాలలం జిక్కి చీకువడిరి;

ఒక్క పెట్టున నీ భారతోర్వి నెల్ల
నూఁపి, కెరలించి, వేమాఱు ప్రోత్సహించి
త్యాగ సామ్రాజ్య పట్టభద్రతను గూర్చి
వడిగ స్వాతంత్య్ర రథమును నడిపె దరరె!


పూర్వకీర్తి ప్రతాపంబుఁ బొగడినావు;
భావి భాగ్యోదయం బగపఱచినావు;
వర్తమాన దాస్యంబును వదలఁజేయ
నే యుపాయంబు వెదకెదో యింకమీఁద!

17-2-1928.__________

మంచు కాలపుఁ బ్రొద్దు పొడుపు

_________

పిఱికివాఁ డొక సింహపంజరముఁ దెఱచు
నట్లు, కిటికీని దెఱచితి నల్లనల్లఁ;
జలికిఁ గప్పిన బూర్నీసు సడలనీక
తొంగిచూచితిఁ; గనుక్రొత్తదోఁచె నాకు!

ఆకసం బడ్డముగ వ్రాలె ననఁగ మంచు
దట్టముగ వ్రేలి సర్వంబుఁ దానె యయ్యె;
భావ దుర్బిణీ యంత్రంబుఁ బట్టిచూడఁ
బ్రళయకాల సూక్ష్మాకృతి ప్రతిఫలించె.

బాలభానుండు మంచులోపల వెలుంగఁ
గ్రమముగా బహుత్వము చుట్టుఁ గాన నయ్యె;
బాల్యమున విన్న “ దయ్యాల బైని” కథకుఁ
దగిన యస్ఫుటచిత్రమై తనరె జగతి !

వలికిం జెమ్మలువోయి కుత్తుక మెదల్పన్ లేక లేయెండ రా
కలకున్ ఱెక్కలువిచ్చి యార్చు ఖగసంఘాతంబుప్రాభాత మం
జులగీతల్ వినిపింప నోపవు; హిమాంశుడయ్యె సూర్యుండు; ప్రా
చి లవంబేనియుఁ జిత్రకారునకు సంసేవ్యంబు గా దిప్పుడున్ .

ఇనకరతాప చండిమము హెచ్చుకొలందిని మంచుకోఁత కో
యను వరిమళ్ళకుం బఱచు హాలికపాళి సువర్ణరోచులన్.
మునిఁగి యథార్థరూప పరిపూర్ణత నొందిరి; తద్వసుంధరా
తనయ లవిత్రపూజ సరిదాఁకునె విగ్రహపూజ లెన్నియేన్ .

నా కిటికీకి నేరుగఁ గనంబడి రిద్దఱు యౌవనంపు లేఁ
బాకపుఁ దీపులన్ మెఱుఁగువాఱిన యాలుమగల్ ; నెలంతయుం
బోక సగంబుగం గొఱికి ముందుగ భర్తకుఁబెట్టె; నాతఁడున్
ఆకుఁ బొగాకుఁ ద్రుంచుకొని యాలిపయంటనుగట్టె శేషమున్

పెండ్లిక్రొత్తదనము వీడని దాంపత్య
లజ్జ, యళుకువారు లాలనంబు,
మొదటి ప్రేమ దుడుకుపోకల మురిపెంబు
వారి చేఁతలం దవార్య మయ్యె.

పనులు పాటులు నంతగాఁ బట్టువడని
తరుణి మునుమును మున్నుగాఁ దానె కోయు;
శ్రమకుఁ దాళని చెలిపైన జాలి పుట్టి
దప్పి గొనె నీరు దెమ్మని తడయఁ బంపు.

ఆఁడుబిడ్డల యత్తల యాడికలకుఁ
బొంచుచూపుల కెడమైన పొలముపనియె
క్రొత్త మిధునంబునకు స్వేచ్చఁ గూర్చునేమొ!
తోడి పనిపాటు ప్రేమకు దోహదంబు.

వా రటు పంటచేలఁ బని పాటొనరింపఁగఁ గాంచి నేను సో
మారితనంబునన్ గిలకమంచము డిగ్గక, యున్నిశాలు వే
మాఱక పొర్లుచుంటఁ గని మాటికి నాపయి రోఁత పుట్టి సం
సారి వ్రతంబుఁ బూనుటకు సల్పితి గొప్పప్రతిజ్ఞ ధీరతస్.

17-2-1929


__________

గాంధి.

____


ధర్మసంస్థాపనార్థంబు దైవశక్తి
యుగయుగంబున జన్మించుచుండునన్న
యార్యసూ క్తికిఁ దార్కాణమైనయట్టు
లవతరించితె గాంధిమహాత్మ, నీవు ?

భీష్ముదీక్షయుఁ జైతన్యు ప్రేమరసము,
బుద్ధుని యహింస, ప్రహ్లాదు పూతభ క్తి,
యల హరిశ్చంద్రు సత్యవ్రతాఢ్యతయును
గలసి మూర్తీభవించితే కార్యశూర?

కురుభూమిన్ స్వవిపక్ష శోణితపు వాఁగుల్ పొర్లిపాఱన్ వసుం
ధరభారంబును డించి ధర్మనియతిన్ దక్కించె శ్రీకృఁష్ణుఁ; డి
త్తఱి నీవన్న నహింససూత్రమును సంస్థాపించి, వర్తించి, దు
ర్భర దౌర్జన్యపు మూలబంధము సడల్పంజాలితౌ దీనిధీ!

ముప్పదిమూడుకోట్లప్రజ ముక్తపథంబున నీ యనుజ్ఞలం
దప్పక యాచరింత్రు; మృతి దంష్ట్రలఁజిక్కగనైన జంకరో
యప్ప! చిరప్రసుప్త శిథిలాస్థి కళేబరమైన నీవు చేఁ
ద్రిప్పఁ బునఃప్రబుద్ధమయి తేజరిలున్ - మహిమేంద్రజాలతన్.

కడపల్ దాఁటని కోమలుల్ విజయశంఖంబెత్తి పూరించి న
ల్గడ సత్యాగ్రహమంత్రబోధనలు సల్పంజల్ప, గ్రామీణులున్
నడుముల్‌గట్టి స్వదేశ సేవలకుఁబూనన్, జైళ్ళునిండార నె
క్కడఁనూహించితివీమహోద్యమమమోఘశ్రేయమున్ గాంధిజీ

మొనలో మేటిఫిరంగిదెబ్బలకు రొమ్ము , సాఁపి పోరాడఁగం
జను నాంగ్లేయుల వజ్రముష్టియుతమౌసామ్రాజ్యగర్వంబు, త
ర్జన, ధిక్కారము, నీదు నాత్మబలమున్ రాకొట్టి డీకొట్టి పొం
దెనుగండూతి చికిత్స, ప్రాకృతులకున్ దివ్యప్రభల్ లొంగునే!

అరకట్టుపుట్టంపు నిఱుపేదవయ్యును
          సమ్రాట్టుతో సరి సమతగనుట;
మఱునాఁటి కర్చుకై చిఱుపై సయును లేక
          కోటిరూప్యంబులఁ గూర్పఁగనుట;
శమదమక్షమ నిత్యశాంతికి నెలవయ్యు
          సత్యాగ్రహంబును సల్పుచుంట;
కంటికిం దాళని కాయంబుగల్గియు
          దేశ దేశంబులఁ దేజరిలుట;

ఇట్టి యన్యోన్యవైరుధ్య మెసఁగునట్టి
నీ మహత్తర జీవిత నియతిలోని
గుప్తభావంబులెవ్వరి కొలతకందు
నందు వైదేశికుల కెట్టు లంతుచిక్కు?

హేళనపాత్రమై మొదట, నింతగనంతగ మోసులెత్తి, వే
వేలకు వేలునౌచు జనవిశ్వసనీయముగాఁ జెలంగి, యు
ద్వేల పయోధి వీచికల తీరునరేఁగి సమస్తదేశమున్
మూలము ముట్టనూచెఁగదమున్ లవణోద్యమతత్త్వ మెట్టిదో!

భోగము సౌఖ్యసంపదలు బొందుటకుందగు మార్గముండియున్
వేగమ తత్పంథబువిడి విశ్వజనీన కుటుంబినై మహా
త్యాగముఁజూపి జీవితమునంత స్వరాజ్యపు యజ్ఞవహ్ని నీ
రాగత వ్రేల్చినాఁడవు ధరంబశుశక్తి వినాశమొందగఁన్.

అరరే! నేడు వినంగనయ్యెభవదీయంబైన భీష్మప్రతి
జ్ఞ, రవంతేని స్వచింతలేక ప్రజకై సర్వంబు వోనాడియున్
మఱలంబ్రాణముఁగూడ వీడ నసమానంబైన యత్నంబు! నీ
మరణజ్వాలలు కోటిసూర్యులటులన్ మండిపవే లోకమున్.

కలవరమయ్యెదేశమున గాంధిమహాత్మ, నిరస్నదీక్ష నే
వలదనిచెప్పునంతటి ప్రపన్నుఁడగా; నెటులైనఁగాని నీ
తలపయిమోపియున్న జనదాస్యవిమోచన కార్యభారమే
తల వహియింపనోపు; నవతారపుఁబర్యవసానమిద్దియే?

అతుల పరోపకార యుతమైన మహాత్ముని జీవితంబు సం
తతము నిరామయంబయి జనంబుల పాలిటి కల్పవృక్షమై
శతసమలుండు గాత యని సంతస మొప్ప జయంతి సల్పఁగా
మతిఁదలపోయ నీ పిడుగు మాటలు దూకెనుపాయనంబుగన్.

చావుం బ్రతుకులు రెంటికి
నావలిమార్గంబుఁద్రొక్కు నచలుఁడవగుటన్
మావలెఁ దలఁపం గోరవు;
దేవుఁడు గలఁడింకమీఁది. దేశస్థితికిన్.

22-9-1932.__________

కళాప్రపూర్ణుఁడు.

___________

తీరుగఁ దిక్కయజ్వ తరితీపు తెనుంగు కవిత్వ సారపున్
ధారల నాంధ్ర సాహితి సుధామధురం బొనరించెఁబూర్వ,మా
కీరీతి పొల్లువోక పలికించెడు సింహపురాన నేఁటికిన్
శారద కావ్యనాటక విశారద మంజువిపంచి నాదముల్ .

నాఁటిని నేఁటినిం గలుప నాణెపు వంతెనయౌచుఁ బాండితీ
పాటనమందు విద్వదభివంద్య కవిత్వ విమర్శనంబులన్
బోటియు సాటిలేని కవిపూజ్యుఁడు వేంకటరాయశాస్త్రి యా
మేటరి సంస్కృతి ప్రతిమ మించు హృదంతర పద్మపీఠికన్ .

శ్రీనాథకవివర్యు శేముషీ. విభవంబు
         కావ్యార్ధ కల్పనా గౌరవంబు;
కృష్ణరాయ నృపేంద్ర కృత విష్ణుచిత్తీయ
         కేరళ ఘన నారికేళరుచులు,
ప్రకృతి సౌందర్యంబు ప్రతి పదంబున నించు
         కాళిదాస కవీశు కావ్యరసము;


భవభూతి సాహిత్య భాండారపేటిక
          దాఁగిన యాణి ముత్యాలసరులు,

శ్రమలకోరిచి, యేరిచి, సంతరించి,
యాంధ్ర వాఙ్మయ దర్శన హర్మ్యమందు
సంతపెట్టిన వ్యాఖ్యాతృ చక్రవర్తి
పేరు స్వర్ణాక్షరంబుల వెలుఁగుటరుదె!

కల్పించినాఁడు యుగంధరామాత్యుని
            కైతవోన్మాదంబుఁ, గార్యదీక్ష,
చిత్రించినాఁడు కృశించిన యాంధ్ర శౌ
            ర్యము రేఁగ బొబ్బిలి యాహవంబు;
పరగించినాఁడు మా భావన బాణ పు
            త్రిక పెండ్లి చలువపందింళ్ళ నీడ;
దక్కించినాఁడు కథాసరిత్సాగర
            కథలఁ దెల్గున గద్య గౌరవంబు;

'ఆంధ్ర భాషాభిమాని' సమాదరించి
దిద్ది యభినయాభిరుచులు దీర్చినాఁడు;
అంతటి కళాప్రపూర్ణున కంకితముగ
స్మరణ చిహ్నంబు నిల్పుట సార్థకంబు!


ఈ వొనర్చిన సేవకు నీడుజోడు
ప్రతికృతి యొనర్పలేము విద్వద్వ రేణ్య;
యెవరి యుపకృతియును లేక యీ యనంత
కాలమున నీదునామ మక్షరత గాంచు!

(వర్ధంతినాడు చదువఁబడినవి.)


24-12-1932