కవికోకిల గ్రంథావళి-2/నక్షత్రమాల
నక్షత్రమాల
1918 - 1921
"Poetry has been to me its own exceeding great reward. It has soothed my afflictions it has multiplied and refined my enjoyments : it has endeared solitude ; and it has given me the habit of wishing to discover the good and beautiful in all that meets and surrounds me".
--COLERIDGE.
ఉపోద్ఘాతము.
మానవహృదయమును దైనిక కలకలమునుండి తొలఁగించి' విషయభార విముక్తముచేసి, ప్రాపంచిక సీమాంతముల కవ్వల భావసృష్టి కల్పితమైన నక్షత్రమండలమున సంచరింపఁజేయుటకు శిల్పము సహాయకారి. శిల్పములలోఁ బ్రతిక్షణ భావనవ్యతకు నాలవాలమైనది కావ్యశిల్పము. ఇతరశిల్పములకును గావ్యశిల్పమునకును జాల వ్యత్యాసముగలదు. ఒకచిత్ర పటమును దర్శింత మనుకొనుఁడు. ఆ పటమునందు ఒక్క భావము, ఒక్క స్థితి, ఒక్క విధమైన రసానుభూతి యలవడును. కాని, కావ్యశిల్పమునం దిట్టినిశ్చలత యుండదు. అనుక్షణము భావములు పరిసరదృశ్యములు అనుభూతియు మెఱుఁగుతీఁగవలె మాఱుచుండును. కావ్యమును ఇప్పటి సినిమాకుఁ బోల్పవచ్చును.
కవులు సృష్టికర్తలు. వీరి ప్రధానకార్యము సృష్టి. ఇట్టిసృష్టివలనఁ బ్రయోజన మేమియని కొందఱు ముగ్ధహృదయులు, కొందఱు శుష్క రస హృదయులు ప్రశ్నింపవచ్చును. కావ్యసృష్టివలన సమూల్యమైన ప్రయోజనము గలదు. రమణీయకము పరిపూర్ణముగ వీకసింపని యీప్రపంచమునుండి సర్వతోముఖ రచణీయమైన కల్పనా ప్రపంచమున, గంగాతరంగ శీతలవాః కణ పూరితమును, నందనవన సద్యోవికసిత కుసుమ సౌరభ్య పులకితమునకు మందమారుత స్వాప్నికడోలికల రసార్ద్రమైన మానవహృదయమును గావ్యము ఉయ్యెల లూఁపుచుండును. శంపాలతాంగిని అమృతాంశుముఖిని ఇంతవఱకు సృజింపలేదు. కాని శిల్పియుఁ గవియుస్పజించిరి. ప్రకృతిలోపమును బూరించుటయే కళయొక్క ముఖ్యప్రయోజనము, వివిధ వస్తు సంయోగము నందుఁ బ్రకృతికన్నాను గవులు ముందంజ వేసియున్నారు. చలువగల వెన్నెలల చెలువునకు సౌరభము గలిగినటు
Melody of flowers
మున్నగుకల్పన లిందునకుఁ దార్కాణములు. కావ్యము ఆనందమయము. కావుననే యానంద దాయకము. కావ్య ప్రయోజనములలో సద్యః వర నిర్వృతయే
అను లాక్షణిక నిర్వచనము ప్రధానమైనది.
నిజమైన కవిత్వము ఆకృతిబద్దము గాదు. ఏయాకృతయుఁ గవితారస ప్రవాహమును బట్టియించ లేదు. మూర్తీభవింపని కవిత్వమే ఆప్పటమైన కవిత్వము. ఈ కవిత్వము ఏకాంతమునందు రసార్ద్రమైన మానవహృదయ ముచే ననుభవింపఁబడుచున్నది. ప్రశాంతమను అక్షరములతో వ్రాయఁబడిన యీ కవిత్వమందుఁ జెవికి వినఁబడని గానమున్నది. ఈ గానమనోహరత్వమును మార్దవమును గర్ణేంద్రియ సహాయము లేక హృదయమే స్వయముగ వనుభవించుచున్నది. కావుననే నొగూచి యను జపానుదేశపుఁ బ్రఖ్యాతకవి వ్రాయఁబడిన కవిత్వమున కన్నను వ్రాయఁబడిన కవిత్వమే మధురమై
దని నుడివియున్నాడు. కీట్సు అను ఆంగ్లేయ కవియు, Heard melodies are sweet, but those unheard are sweeter
అని వ్రాసియున్నాఁడు. కవి యనుభవించు ఆనందము అతని భావవీథినిఁ బొడకట్టుదృశ్యము, స్థూలమైన భాషయందు గర్భికరింపఁపడినపుడు ఆత్మ సౌందర్యమును సగము కోలుపోవును. ఎందు వలన ననఁగా భావములు సున్నితములైనవి; భాష స్థూలమైనది. కావునఁ గవిత్వమునందు అంతర్భూతమైన భాషకొంతయు బహిర్భూతమైన భాష కొంతయు సమ్మిళితమై యుండును. కవిత్వమును నిఘంటు మూలమునఁ దెలిసికొసఁ గోరు నతఁడు రసహీనమైన
శల్యపంజరమును మాత్రము చూడఁగల్గును. కాని యందలి యానందమును సౌందర్యమును ననుభవింపలేఁడు. కవిత్వమందలి ప్రతిపదముచుట్టును నిఘంటువు నిర్ణయమున కతీతమైన భావరోచి యావరించియుండును.
పద్యములు భావప్రేరకములు. భావములు ప్రతిబింబించుటయు, నిరవియగుటయుఁ. బాఠకుని హృదయసంస్కారము ననుసరించి పరిపరివిధములుగ నుండును. కావుననే పాఠకులుగూడ కవులవలెనే రసార్ద్ర హృదయులుగా నుండవలయుననుట. తామరపాకుపైఁ జెరలాడు మంచుబొట్టు ప్రొద్దుపొడుపు మొదలు పొద్దెక్కు కొలది. కిరణవర్ణభేదముల ననుసరించి బహువర్ణములు దాల్చునట్లు పాఠకుల సంస్కారభేదముల ననుసరించి కవితయు వివిధాకృతులతోఁ బొడకట్టు చుండును. ఇందుకీక్రింది దృష్టాంతము గనుఁడు. సూర్యుఁడస్తమించెను. సంజకెంజాయలు జలద శకలములపై నలమికొని పశ్చిమదిశను నొక' చిత్రప్రదర్శన శాలగ మార్చివైచెను. వరిచేలు పండి యొరగి చల్లగాలికి సముద్రతరంగములవలె నల్ల నల్లన నాడుచుండెను. ఇట్టి దృశ్యమును నొక చిత్రకారుఁడును మఱియొక పల్లెటూరి కాపును సందర్శించు చుండిరనుకొందము. చిత్రకారుని చిత్తము ఊహాతీతమైన యా వర్ణసమ్మేళనము యొక్క సౌందర్యమున నిమగ్నమయి పోయియుండును. కాఁపువాని హృదయము బంగారు టిసుకవలె పండి యొరగియున్న వరిచేనుగాంచి నంత ఉవ్విళ్ళూరు చుండును. అతని మనము నాకర్షించుటకుఁ బడమటిదెస యందేమియును వింత తోఁచలేదు. దృశ్య మొక్కటియే యైనను, హరి హృదయఫలకములందు భిన్నముగఁ బ్రతిఫలించెను,
పూర్వులలోఁ గొందఱు కవిత్వమును శాస్త్రముగఁ బరిగణించిరి. ఇది చాల గొప్ప పొరపాటు. శాస్త్రమున నానందములేదు; నగ్న సత్యము కలదు. శాస్త్రకారునికిని శిల్పికిని జాల వ్యత్యాసము గలదు. వారి మార్గములు ధ్రువములవలెఁ బరస్పర భిన్నములనిన సత్యబాహ్యముగాదు, కవియును శాస్త్ర కారుఁడును ఒకహృదయమును బరీక్షింపవలసిన యెడల కవి రసము, అనుభూతి, భావము మున్నగు వానికై వెదకుచుండును. శాస్త్రకారుఁడా హృదయమును గోసి అందెన్ని క్రోవులున్నవి, ఎన్నియరలున్నవి, నెత్తురే మార్గమున సంచరించునను విషయములను బరీక్షించుచుండును,
తెలుఁగు కవులలోఁ, గవిత్వము శిల్పమని ప్రథమమునఁ గనిపెట్టిన తత్త్వవేత్త మహాకవి తిక్కన. కావుననే యాకవి బ్రహ్మ “ కవిత్వ శిల్పమునం బారగుఁడన్" అని చెప్పుకొని యున్నాడు.
స్వాతంత్ర్యమునఁ గొంత సాహసముగలదు. సాహస మనునది మానవ ప్రకృతిని నవీన మార్గావలంబనమునకుఁ బురికొల్పును. మానవ సంఘము రాజకీయ సాంఘిక మత నైతిక దాస్యమునం బడి యాచారశృంఖలల మూలమున యంత్ర చలితమగు నొక ప్రతిభాశూన్య విగ్రహమువలె నున్నపుడు అట్టి సంఘముయొక్క, మనము నవీనకల్పనలకుఁ జొరఁ బాఱదు. ఆస్థితినిఁ గల్లోలించి భావదాస్య భారమున మ్రొగ్గుచున్న హృదయమునకు విశాల ప్రపంచ దృశ్యము కనఁ బడునట్లు విప్లవము జరుగనిదే మానవప్రకృతి నిర్ణిద్రముగాదు. కృష్ణదేవరాయల కాలమునందు నూత్న కావ్య సృష్టికింగూడ నీలాటి విప్లవమే కారణము.
ప్రపంచ చరిత్రమును బరిశోధించి చూచినయెడల, పూర్వులకు భవిష్యత్సంతతి వారినిఁ దమతమ అభిప్రాయాచార మూలమున బంధించు చాపల్యము అమితముగ నుండినట్లు దోఁచుచున్నది. ఇట్టి యధికార చాపల్యము అన్ని మానవజాతులలోను నున్నది. ఇది యసంగతమేగాక హాస్యాస్పదమును. ఇట్టి యారోపితాధికారము మతసాంఘిక రాజకీయ విషయములందే కాక కవిత్వమునంగూడ నాటుకొనియుండినది. కావ్యలక్షణము ప్రథమమునఁ గవుల రచనలనుండియే యుద్భవించిన దయ్యుఁ బ్రత్యేక లాక్షణికుల యథికారముద్రవలన ఆలక్షణమే కవులను నిగళబద్ధులను గావించినది.
కావ్యములలో నేయేవర్ణనము లుండ వలసినదియు నెట్టినాయికా నాయకు లుండవలసినదియు లాక్షణికులే తీర్మానించిరి. కాన కవిసృష్టికిఁ గొన్నిహద్దులేర్పడినవి. పూర్వకవులకు రాజులే యాశ్రయులు. రాజులు పండితులను సులోచనముల మూలమునఁ గావ్యపరీక్ష గావించుచుండిరి. ఇఁకఁ బండితులు రసార్ద్రచిత్తముతోఁ గాక శుష్కమైన లాక్షణిక మానదండముతోఁ గావ్యశిల్పమును గొలతవేయుచుండిరి. లాక్షణిక ప్రమాణమునకు వెంట్రుకపోనంత తగ్గినను ఆ కావ్యము గ్రాహ్యముగాదు. కావుననే యాంధ్రప్రబంధము లన్నియు నొకే యచ్చున గ్రుద్దినట్టు లొకేతీరున నున్నవి. ఒక కావ్యమును సొంతముగఁ జదివిన మఱియొక కావ్యమును జదువ నవసర ముండదు. అదేనాయిక; అదేనాయకుఁడు; అదే యుద్యానవనము; ఆదే మోహము; అదే విరహము; ఆదేశీతలోపచారము; అదే చెలికిత్తె; అదేసూర్యోదయము, అస్తమయము!
కాని, యిప్పటి కాలస్వభావము, పరిస్థితులు మాఱినవి. ముద్రణ యంత్రములు కాగితములు ప్రబలినవి. కావున గ్రంథములు సర్వజనసామాన్యమునకు సులభము లగుచున్నవి. ఇప్పుడు కవులను బోషించు వారు ప్రజలు. ప్రజల యభిరుచియు మాఱినది, ఇందుకుఁ జాల చారిత్రక కారణములు గలవు. పాశ్చాత్య సారస్వత సంబంధము వలనను, తన్నాగరకతా సంపర్కము వలనను ప్రజల భావములు ఆదర్శకములు మాఱఁజొచ్చినవి. సంఘమునందుఁ గొంత జీవచలనము ప్రారంభమయినది. ఈ నవీనపరిణామము కవుల హృదయములఁ బ్రతిఫలించి ఆంధ్రసారస్వతమునఁ జొచ్చినది. కావుననే నేఁడు హృదయమోహనమైన ఆధునిక సారస్వతము తఱితీపు తెలుఁగునందు బయలు దేఱినది. ఈకావ్యములను నేను విమర్శింపఁబూనుకొనలేదు. కవియే తాను రచియించిన కావ్యములను, విమర్శకుఁడగ నవతారమెత్తి పరిశీలించుట యసంభవము. స్వాభిమానము వలన ననవసర ప్రశంస గావించుకొనుటయో లేక విషయము వలన ఉచిత ప్రశంస చేయకుండుటయో సహజముగఁ దటస్థించును. కావున నీ కావ్యములయొక్క గుణాగుణవిమర్శనము రనైక పక్షపాతులైన సహృదయులకు వదలుచున్నాను.
కవులయెడ సమకాలికులకు నిరాదరణము అన్ని కాలములందును ఉండినట్లు తోఁచుచున్నాది. ఈర్ష్యయుఁ దనపెరటిచెట్టు మందు గారు" నెడు సామాన్యజనుల మనస్తత్త్వమును, బరిచయమువలనఁ గలుగు నౌదాసీన్యమును ఇందుకుఁ గారణములుగ నుండవచ్చును. "సమకాలము వారలు మెచ్చరే గదా" యని చేమకూర వెంకన్నవ్రాసిన యీ చిన్న వాక్యమునందు ఆతని హృదయ వేదన యంతయు నిమిడి యున్నది. సమకాలికులచే నిరాదరింపఁ బడిన మహాకవి భవభూతియొక్క వేడినిట్టూర్పులు
యేనామ కేచిదిహ నః ప్రధయం త్యవజ్ఞాం
జానంతి తే కిమపి తాన్ప్రతినైషయత్నః
ఉత్పత్స్యతే౽.స్తి మమకో౽పి సమానధర్మా
కాలోహ్యయం నిరవధి, ద్విపులాచపృధ్వీ.
అను నీశ్లోకమునందు నేఁటికిని ఆవిళ్ళువాఱుచున్నవి. తాను రచియించిన "ఇస బెల్లా" యను కావ్యము పైదాడి వెడలిన యీర్ష్యాపూరిత విమర్శనము వలన భగ్నచిత్తుఁడై కీట్సు అను నాంగ్లేయకవి స్నేహితుఁడైన షేల్లీకి "నేను మరణించిన యనంతరము గొప్పకవి సయ్యెదను కాఁబోలు” అనివ్రాసిన లేఖను జదివిన కిరాతుని హృదయమునందైనఁ గరుణ మొలుకును . ఇట్టి నిరుత్సాహక సందర్భములందు “ 0! I sing for the mere joy of singing" అను ఉద్దేశమే కవిని ఆనంద కవచునిగ నొనరించు చున్నది.
ఓరి బాలక నిమురళీ రవంబు
వ్యర్థమౌనని చిత్తతాపంబువలదు;
రాగపరిచితుఁ డెవ్వఁడో రమ్యగీతి
వినియెయుండు నానందంబు వెల్లివిరియ.
ఇట్లు
దువ్వూరి రామిరెడ్డి.
- ___________
నక్షత్రమాల.
కవి మనోరథము.
సాంధ్యకిమ్మిరవర్ణవస్త్రములు దాల్చి
గిరితటవిహారశృంగారకేళి సొలసి
రమణఁ జరియించుజలధరార్భకుని గాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుండు ?
ప్రత్యుషఃశ్లేషమున విచ్చు ప్రసవమందుఁ
దరుణసూర్యాంశుమాలికా తరళకాంతి
మిళితమై రాలు తుహినాంబుకళిక గాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుండు ?
శిలలఁ బ్రవహించి, శీకరంబులను జల్లి
ప్రకృతిహృద్గతభావంబు బయలుపఱచు
గానముం జేయు మలయూఁటకాల్వ గాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుండు?
శారదేందుమయూఖ సంస్పర్శనముల
దైనిక స్వప్నమాంద్యమ్ముఁ దలఁగఁ ద్రోసి
మొలకనవ్వులమేల్కను కలువ గాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుండు ?
యామినీ వ్యోమమండల ప్రాంగణమున
సుకవియానంద రాజ్యంబుఁ జొచ్చువేళ
శోభ వెదచల్లు మురిపెంపుఁ జక్కగాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుడు ?
ప్రణయాంజలి.
ఎవ్వతెయందు నామది లయించి తదన్యము చింత సేయచో
యెవ్వతెప్రేమపుష్పము సహింపఁగరాని వియోగగంధమున్
నివ్వటిలంగఁ జేసెడినొ, నిద్దురలం దనుభావ్యయైన యా
జవ్వని మన్మనఃప్రణయసాక్షిగ మంగళ మొందుఁగావుతన్ !
అల్లియుఁబూలు పూవని లతావళు లట్టుల నాదుకోరికల్
గొల్లగ రేఁగియుం గుడుపుగూడకపోయె; మదీయపాపముల్
వెల్లువ లౌచు నిద్దఱను వేఱొనరింపఁగ, దైవదూషణం
బొల్లను; బూర్వకర్మఫలితోత్థితముల్ గదమోదభేదముల్ .
బయలం బ్రాఁకని ఱంపకోఁతలకు నాభావంబు శుష్కించి లో
సయిపన్ రాని విషాదకశ్మలతచే సంతోషలోకంబె యం
ధ యుతుంబై కళదప్ప, యౌవనపుటుత్సాహంబు జీర్ణింప, స్వ
ప్న యథార్థత్వము లౌకికంబనెడిత్రోవంబోయిచింతించుదున్.
నిమిషమైన రహస్యంబు నిలుపలేని
యద్దపుంబెట్టెలే మనయాత్మ లైన
బట్టబయలుగ నిరువురిభావవృత్తు
లెఱుకపడునేమొ కన్నియా, యింపు గలుగ.
కామదగ్ధంబునై, శాంతి గాంచి యున్న
భావభూతిని నిర్మలప్రణయ లతిక
లల్లుకొని పూలు పూచె, నా యార్ద్రగంధ
మిరువుర మనుభవింపలేమే లతాంగి?
పండిపండని కోరికపంటభూమిఁ
బొరలి ప్రవహించు విరహనిర్ఘరిణి తటులఁ
బ్రణయబంధంబు విచ్చి, పరస్పరాను
చింతలకు జలాంజలి యీయ సిద్దపడెదొ?
అట్లుగాక వెన్నెల గాయునట్టి రేల
వలపు మధువాని చిత్తంబు బ్రమయుచుండఁ
జుక్క పూవులపందిరి సొగయఁ, జేతఁ
బట్టెదో వట్టివేళుల వ్యజన మబల!
తలిదండ్రుల్ మనకోరికల్ సమయు యత్నంబింతగావించియుం
గలలం గల్గు మనోహరప్రణయసఖ్యంబుం దొలంగించిరే?
చెలియా, యిద్దరిప్రేమబంధనము విచ్చిన్నంబుగాకున్నఁ గాం
క్షలుదుస్సాధ్యములయ్యుఁగొంతదనుకన్ సంతోషమేకూర్చెడిన్
ఇంక నీలోకమున మన కిద్దఱకును
హృదయరక్తికి నాలంబ మొదవకున్నఁ
బ్రణయమెల్ల ఫలించు స్వర్గమ్మునందు
ననుభవింత మానంద రసామృతంబు.
కనులం గాటుకచీఁకటుల్ నెఱయఁ గ్రీగంట న్విలోకించి నా
మనమున్ మానఁగరానిగాయములనొంపన్ స్వప్నమట్లేల చ
క్కనిదానా, పొడగట్టె దీవు? నను నింకం జిమ్మచీఁకట్ల వీ
ణనువాయించి వియోగగీతి లయ మొందంబాడనిమ్మొంటిగన్.
సంధ్య.
అరుణుఁడు పశ్చిమాద్రిశిఖరాంగణమున్ డిగఁబాఱవారిదో
త్కరశకలంబులన్ రుధిరకాంతులు పెల్దలరన్ దిశాంతముల్
పరఁగెఁ బరస్పరంబు నిరువాగుల వారలు పోర, రక్త ని
ర్ఘరముల, నంగఖండములఁ గ్రాలు రణస్థలు లట్ల, రోఁచెడిన్.
భారతవీరపుంగవులు భాస్కరతేజు లపూర్వ శౌర్యదు
ర్వారులుధార్తరాష్ట్రులును బాండునృపాలతనూజు లుర్వికై
ఘోరరణంబు సల్ప నటఁ గూలిస సైనికభగ్న కాయముల్
పేరిన యుద్ధరంగములలీలఁ జెలంగును బశ్చిమాశయున్.
క్షాత్రయుగంబునన్ భరతశౌర్య రమామణి వారికేళికిన్
శత్రుల శీర్షముల్ జలజషండము గాగ విభిన్న బాహువు
చిత్రమృణాలవల్లులుగఁ జెల్వగు శోణితపూర్ణసంగర
క్షేత్ర సరోవరంబు విలసిల్లెనొ నా నపరాశ శోభిలున్.
కాంచఁగనే జపారుచిరకాంతులు మెల్లన నెల్ల లీనమై
కాంచనదీధితుల్ దిశలఁ గ్రమ్మఁ బురాతనభారతోర్వియీ
సంచున జాళువా గనిగ సంపదలం దులతూఁగుచుండెఁ బో
యంచుఁదలంప హేమమయమయ్యె నజాండము చూడనందమై
ఎరలకు నేఁగు పక్షికులమెల్లఁ గులాయములంటి యాతురం
బఱచుచు వచ్చుటం గనఁగ భారతదేశ సువర్ణసంపదం
బరధరణీజనుల్ గని యపారముదంబున దానిఁ దోచుకోఁ
బరుగిడి వచ్చిరో యనఁగ భావమునం బొడకట్టు వింతగన్.
అంతఁ గ్రమముగఁ గాంచనకాంతి దిశల
మఱుఁగ, నిబిడాంధకారంబు మల్లడించె
నతులభాగ్యంబు శౌర్యంబు సంతరింప
సొంపు దఱిగిన యార్యవసుంధర నటు.
ఎప్పుడు గాఢసంతమస మీవసుధ న్విడుఁ, బ్రాచ్యదేశ మిం
కెప్పుడు శోణితార్ద్ర రుచి నింపులుచిల్కును, బాలభాస్కరుం
డెప్పుడు పూర్వమట్టుల రహించుఁ బ్రతాప సముజ్జ్వలంబుగా
నెప్పుడు మానునో జలజశృంఖలరాయిడి బంభరాళికిన్.
కవి.
వేగుజామున వికసించు విరులయందు
ఱేకు లెడలించు సంజ పూరెమ్మలందుఁ
గావ్యమునఁ బోలెఁ బఠియింతుఁ గేతుకమునఁ
బ్రకృతిసామ్రాజ్య పాలనా పద్ధతులను.
చటుల కల్లోల రసనల సాగరంబు
పవలురేయి నాలాపించు పాటలందు
ననితర గ్రాహ్యధర్మంబులై చెలంగు
విశ్వసృష్టి ప్రకారముల్ వినుచునుందు.
శ్యామలాకాశ ఫలకమునందుఁ దరళ
కాంతి వెదచల్లు తారకాక్షరము లొనర
విశ్వవైశాల్య బోధక విద్యనేర్తు
శర్వరీగర్భశాంతి యొజ్జగ విధింప.
గజురు తుంపరముత్యాలు కాన్క లిడుచుఁ
దరలు సెలయేటిపాటలో దాఁగియున్న
రాగతత్త్వంబు నామనిరాత్రులందుఁ
గూయుకోయిలకడ నేర్చికొందు వనుల.
స్వీయచరిత రహస్యంబు వ్రాయఁబడిన
హృదయపుస్తకపుటముల ముదముతోడఁ
బ్రకృతి నామ్రోల విప్పుఁ బ్రభాతరాగ
రంజితం బైన తూర్పుతీరంబు నందు.
కుసుమాశ్రువులు.
'కమలా, లెమ్ము కుటీరకుడ్యముల బంగారంపు లేఁ బూఁతలం
గొమరారన్ రచియించె సూర్యకిరణాంకూరంబు లిప్పట్టునన్ ;
సుమముల్ గోయఁగఁబొమ్ము, నాన్నజలముల్ జొబ్బిల్లునీర్కావివ
స్త్రముతో స్నానముచేసి వచ్చెడిని పూజాసక్త చిత్తమ్మునన్.
అని జనయిత్రి పల్క విని యంతఁ గుమారిక లేచి దంతధా
వన మొనరించి బృందకును భక్తిఁ బ్రదక్షిణ మాచరించి చ
ల్లని మలగాలిసోఁకి యొడలం బులక ల్మొలకెత్తఁ బైటకొం
గును బిగింబుంచి తోఁటకడకుం జనుదెంచె ననంటిడొప్పతోన్.
లేఁత పచ్చికతలలఁ జలించుచున్న
మంచు తుంపరముత్యాలు మగువ నడచు
నపుడు నటునిటుఁ జిందఁగ నంఘ్రితలము
చలికి మొద్దువాఱెనొయన జలపరించు.
అరుణ మయూఖ రంజితములైన హిమాంబు కణాళి ముత్యపున్
సరములు ద్రెవ్విపో వరుసజాఱెడి పోలికఁ బూవురేకులం
దొరఁగుటఁగాంచి యేమియునుదోఁపక యాకమనీయ దృశ్యబం
ధురత మనంబుమగ్నమయితొయ్యలియాయనుభూతినుండఁగన్.
అమ్మ కమలా, బిరాన రావమ్మ యనుచుఁ
దల్లి పిలిచెనుగాని, నితాంత పార
వశ్యమున నున్న కమల యా పలుకులయిన
వినక తలపోయుచుండె నా విధములెల్ల.
ఎట్టులు చేతులాడునొకొ యీకుసుమంబులఁ గోయ? గాలువల్
గట్టెడు నశ్రుబిందులటు గాఱెడుఁ బువ్వులనుండి మంచు బొ
ట్లట్టిటు గాలికిం గదలినప్పుడు, పువ్వుల మధ్యనుండి సొం
పుట్టగ నవ్వెనాఁ బ్రకృతి, యుల్లము తాండవమాడు వేడుకన్.
కన్నుల విందుసేయు సుమకాండముఁ ద్రుంచి విచిత్రశోభలన్
జెన్నొలికించు నీప్రకృతి చిత్తము నెత్తురులొల్కఁజేయ నే
నెన్నడుఁబూన; లేఁబొడుపుటెండలు సోఁకినఁ బుల్కరించు పూఁ
బిన్నల హత్యచేయఁ దలపెట్టుట క్రూరము నన్నుఁబోఁటికిన్.
ప్రకృతి రామణీయకమును బాడువెట్టి
దైవపూజకుఁ దొడఁగెను దండ్రియేమొ!
ఆత్మకుసుమ సమర్పణం బాచరించి
వేద వేద్యునిఁ బూజింప వేడికొందు.
రెడ్డికులప్రబోధము.
రెడ్లుగాఁబుట్టిస ఋణముఁదీర్చికొనంగ
వీక్షించితిరె కొండవీటికోటఁ?
దలఁచిన యంతఁ జిత్తమున రోషము రేఁపు
కత్తుల కూపంబుఁ గాంచినారె?
రెడ్డివీరకుమార హృదయ రక్తంబులఁ
దోఁగిన రణభూమిఁ ద్రొక్కినారె?
యాంధ్రశౌర్యేందిర కకలంక భూషణం
బౌ రెడ్ల చరిత విన్నా రె? యన్న
లార, యూరకరెడ్డికులాన జన్మ
మెత్తితిమఁటన్న నాదాయ మేమిగలదు?
తల్లిమొగము నెఱుంగని తనయు లవత
రించియును లేనివారలే యెంచిచూడ !
సచ్చిదానంద దర్శనుఁడు వేమనయోగి
మనకులంబునఁ బుట్టెననినఁ జాలు;
షట్చక్రవర్తి సచ్చరిత్ర నిర్మాత
మనవాఁడెయన్న యాఘనతచాలు;
ఆంధ్ర వీరాంగన యైన నాయకురులు
మన కులస్త్రీ యన్న మాటచాలు
ఔదార్య ధుర్యాత్ముఁ డనవేమ భూపుఁడు
మావాఁడె యన్న సంబరముచాలు;
నింక నెందఱెందఱనో యహీనయశులఁ
గాంచి లోకైక విఖ్యాతి గన్నయట్టి
రెడ్డికులపుఁ జారిత్రంబు శ్రేష్ఠమనుట
కేమి లోపంబుగలదు? మీరెఱుఁగరయ్య.
ఘనసైన్యంబులఁగూర్చి, బాహుబల విక్రాంతి న్విశేషించి ప
ద్మ నృపాలాళికి గుండెగాలముగ, విద్యానాథులై కొండవీ
టను నద్దంకిని రాణ్మహేంద్రపురిఁ గోటల్గట్టి శౌర్యంబునన్
మును బాలించిన రెడ్డిరాజుల యశంబుల్ నేఁటికిం గ్రాలవే?
మార్తుర రాజ్యరమామణుల్ చెఱఁబడి
గోడుగుడిచిన చోటు కొండవీడు;
ఆంధ్రదేశ మతల్లి యలికంబునం దాల్చు
మండన తిలకంబు కొండవీడు;
కవితారసాలోల కల్లోలినిం దోఁగు
పండితాఢ్యుల నాడు కొండవీడు;
ఖండితారాతిరాణ్మండన మండితా
ఖండలచాపంబు కొండవీడు;
అట్టివీటను బెన్గోట గట్టి నట్టి
మేటిదిట్టలు మనతొంటి పోటరులెక!
నేటికిని రెడ్డి వీరుల నెత్తురచట
శౌర్యసౌరభ్యములు వెదజల్లుచుండు.
అరివీరకంఠనాళాస్ర ప్రవాహంబు
గవిసి త్రుప్పెత్తిన ఖడ్గధార,
భూగర్భమున రక్తపూరవిలీనమై
విశ్రమించిన బాహువీర్య మహిమ;
కావ్యసంపుటబద్ధ గాథాశ్రయంబున
గ్రుక్కిళ్ళువోవు నకుంఠకీర్తి;
బహుకాల విశ్లేషభరమున శోషిల్లి
రమణవాసినయట్టి రాజ్యలక్ష్మి;
యింకనెప్పుడు పూర్వశౌర్యాంక సరణి
రెడ్డికులవీర దోర్బల శ్రీసమాశ్ర
యంబుగాంచి వర్ధిల్లునో? యట్టి యదను
గల్గునో? మన కంత భాగ్యంబు గలదో?
పోయిరివీరభద్రుఁ డనపోతమహీపతి వేమయోగియుం,
బోయెను మల్లరెడ్డికవి, పోయెను గాటయవేముఁడున్, రణా
జేయ కుమారవీరులును జెల్లిరి; రెడ్డికులంబు డొల్లయై
పోయెనటన్న లాఘవము పొందనిరీతి యశంబునిల్పుఁడీ!
పోయిరేగాని వారల భూతినుండి
రేఁగుచున్నది వెండియు రెడ్డిశక్తి;
యింక నొకమాఱులోకంబు నెల్ల నాత్మ
దివ్యతేజంబున న్ముంచి తేల్పఁగలదు.
పచ్చినెత్తురుటలల్ పై రేఁగు రణభూమి
జయనావ నడిపించు శౌర్యలక్ష్మి;
మోహనసౌరభ్యము ల్పిసాళింపంగఁ
గవితాలతాంగితో, గలయునేర్పు;
కీర్తివల్లికలు క్రిక్కిఱిసి దిక్కులకల్లఁ
గృతులందుకొన్న సాహిత్యరక్తి;
చేయొగ్గి యర్థులు జేపెట్ట సర్వస్వ
మైన నిచ్చెడు నుదారాశయంబు;
హోమధూమావృతం బగ్నిహోత్రమటుల
సన్నగిల్లియుఁ, జావదు చావలేదు
ఇప్పటికిరెడ్డి కులమందు; నింకఁ జావఁ
బోదు మననెత్రుకడపటి బొట్టువఱకు!
కొండవీటి దుర్గంబునఁ గ్రుంకినట్టి
రెడ్డిసూర్యుండు కాళరాత్రిని దరించి
యభినవాంశు ప్రసారంబు లలరుచుండఁ
దూర్పుదిక్కున నల్లదే దోఁచువాడు!
అనుమానంబొకయింతలేక గనుఁడీ, యావచ్చు బాలార్కబిం
బ నవాంశుల్ ఘనమాలఁ జీల్చికొని సైఁపన్రానికాంతిచ్ఛటం
గనులంగట్టుఁ; బ్రబోధగీతము లుషఃకళ్యాణి తారస్వరం
బుననాలాపము సేయుచున్న యది పెంపుంబొందనుత్సాహముల్.
వీడిపోయిన తంత్రులు బిగియఁగట్టి
హృదయమందుఁ బ్రతిధ్వను లెసఁగునటుల
వీణసారించుచున్నాఁడు ప్రియసుతుండు
లెమ్ము నిద్దుర, రెడ్డికులమ్మ, యింక.
అరుగో! యూర్ధ్వపదంబునంగనుఁడు, దివ్యాకారముల్ దాల్చికీ
ర్తి రమాకాంతులు, రెడ్డివీరులు రణోర్విన్ దేహముల్వీడి ని
ర్జరలోకంబునసౌఖ్యముల్ వొరయు స్వార్థత్యాగు, లానందని
ర్భరచిత్తంబులఁ బుత్రులంగనఁగఁ జేరన్వచ్చి, మందారపు
ష్ప రసౌఘాకుల బంభరారవ మిళ ద్భవ్యామలాశీ రవం! బు
రహింపన్ వెదజల్లుపొరలు సుమంబుల్ మోదబాష్పార్ద్రముల్
నేఁడుపవిత్రవాసరము నిర్మల చిత్తముతోడ సందఱుం
గూడి కులాభివృద్దికొఱకుం బనిసేయఁగదీక్షఁబూని మీ
వాడలఁ బల్లెలన్ నగరవాటికలందుఁ బ్రబోధగీతముల్
పాడుఁడు, కంకణాలు మణిబంధములన్ ధరియింపుఁడర్థిమై.
ధనదాన్యంబులుప్రాజ్యభోగములువిద్యాబుద్ధులుం గీర్తియు
న్ఘనశౌర్యంబు నుదారతాగరిమ చక్కంగల్గి తంగేడుపూ
చిన చందాన సతంబు నూత్నరుచులంజెన్నారుతన్ విశ్వమో
హనమై రెడ్డికులంబు సర్వజన నిత్యానందసంధాయిగన్!
సోదరీస్మృతి.
చెల్లెలా, నీవుస్వర్గమ్ముఁ జేరి కొన్ని
వత్సరంబులు గడచియుఁ బ్రకృతియందు
నీదుచిహ్నంబు లెల్లెడ నింపినావె
యనుదినంబును నాకు దర్శన మొసంగ?
శారదాంబుదమాలిక సడలిపోవఁ
గళలుదేఱిన శశిరేఖఁ గాంచినంతఁ
బొత్తిగుడ్డలు దొలఁగింపఁ బొనరు నీదు
నాస్యబింబము తలఁపున నవతరించు.
ప్రత్యుషంబున మంచుతుంపరలతోడ,
విచ్చు పన్నీటిపువ్వు సేవించినంతఁ,
దల్లికౌఁగిట మురిపెంబు వెల్లిగొలుపు
నీదు ముద్దుమొగంబు వర్ణింపఁజేయు.
సందెవేళలఁ బలుచని జలదములను
బూతపూచెడి చెంగావి పూలసౌరు
నవ్వునెడ నీదు చెక్కుల నాట్యమాడు
కాంతిమంజిమ మటు నాకుఁ గానిపించు.
భౌతికంపు సంబంధము వాసియును ని
రంతరాధ్యాత్మిక ప్రణయంబు మనలఁ
గడవరాని బంధంబులఁ గట్టివై చె,
స్వప్నవీధికి వచ్చెదే ప్రతిదినంబు!
కోయిల.
పైరుకోఁతలఁ గష్టించి పల్లెచెలులు
కొంత విశ్రాంతిఁ గొన్నారు, కోయిలా, ర
సార్ద్రకంఠంబు నెత్తి గానామృతంబుఁ
జల్లుమా వారిమనములు చల్లవడగ.
చిత్తరంజక రాగనిశ్రేణి వైచి
దివ్యగానంబు భూమికి దింపరావె !
తంత్రు లెడలిన నల్లకీదండ మటులఁ
గూజిత విహీనమై తోఁచు గున్నమావి.
నీవు లేకున్న గగనవనీ నికుంజ
తలములును బాడుపడినవిధానఁ దోఁచు!
నేడ కేఁగితో కోయిల యెమ్మెలాఁడి ?
పాడరావమ్మ, యొకమాఱు ప్రణయగీతి.
తేనెలూ రెడి నీపల్కు తీయ్యఁదనముఁ
గోరి విరహులపోలికఁ గుందువారు
కవివతంసులు; వాసంతకాల లాంఛ
సంబవయి రావె కోయిలా, సంజరముగ.
స్వాతంత్ర్యరథము
అంబుదంబుల నమృతపూరంబు లొలుక
నింద్రచాపంపుఁ దోరణ మింపుఁగులుకఁ
గారుమెఱుఁగులు నెల్లెడఁ గడలుకొనఁగ
వెడలె స్వాతంత్యరథము విన్వీధియందు.
జలధరమాలఁ జీల్చికొని, స్యందనకాంతి సభోంతరాళ ము
జ్జ్వలితముచేసి, యంధతమసంబులు వాఱిన మూలనైన శో
భల ననలెత్తఁజేయుచుఁ బ్రభాతవిభాకర బింబమట్లు సొం
పిలుచు నవీనజీవనము వింతగ నింపె సమస్తసృష్టిలోన్.
ఆరథమందు దీప్తిమయమై కనుపట్టె నిజప్రభావ దు
ర్వారపవిత్రమూర్తి కనుపండువుసేయుచు, ధర్మజీవనా
కారమొ! శాంతిబింబమొ! యకల్మష సత్యనికేతనంబొ! సం
సారఫలస్వరూపమొ! ప్రజాహృదయంబొ! యనన్ వెలుంగుచున్
ఒకచేతన్ రుధిరంపుఁ బాత్రమును, వేఱొక్కంటఁబీయూష పా
త్రికయుం గైకొని సభ్యతామిషమునన్ దేశంబులందెల్ల నిం
తకు ధర్మంబులు గాఁగ నెన్నఁబడు నన్యాయంబు లీనాఁటితో
వికలంబై చనుఁగాక యంచుఁ గరుణావేశమ్ము దీపింపఁగన్.
పచ్చినెత్తురు నమృతంపుఁ బాత్రఁబోసి
దివ్యదుగ్ధంబుగా మార్చె దేవిమహిమ,
హాలహలగర్భమందైన నమృతరసము
సంభవించు నటం చిలఁ జాటనేమొ!
నిలువదు స్యందనంబు ధరణీపతిపాలన దండభీతిచే,
నిలుప దనాధభాష్పములు నిల్చిన పల్లపునేల, మోసగిం
పుల మఱపించు క్రించుఁదనపుం జతురాత్ముల కాఁగఁబో దన
ర్గళజవమొప్ప నేఁగెడిని గన్నులకం, గనరానిచోటికిన్.
పూర్వసిహాసనంబులు, ప్రోజ్జలంపు
మణిమయ కిరీటములు భోగమందిరములు
చక్రసంఘర్షణంబునఁ జదిసిపోయి
యవి యివి యనంగరాక రూపఱెడు నేఁడు.
లేవు దివ్యతురంగముల్, లేవు కరులు,
ప్రజలె యాతేరుమోకులఁ బట్టువారు;
వాయుజవమునఁ దారకాధ్వమున నేఁగు
నంతరాయశతంబుల నైన దాఁటి.
తేరుజాడల నెత్తురు పాఱిపాఱి
బంగరుంబంటఁ బండించె బక్క నేలఁ;
జక్రనేములు దాఁకిన స్థలములెల్ల
సస్యలక్ష్మికిఁ గళ్యాణశాల లయ్యె.
స్యందనాసీన యగుదేవి 'శాంతి శాంతి'
యనుచు మంజులగానమ్ము నలరఁజేసి,
నవ్యనక్షత్ర వీణాస్వనమ్ములందు
మేళవించెను జనులు విస్మితులు గాఁగ.
ప్రణయాహ్వానము.
చెలియా, వెన్నెలబైల మంచుతడిఁ బూచీపూవకున్నట్టి పు
వ్వులనెత్తావులు మోచిమోచి నిడియూర్పుల్వోవు నుద్యానకో
మల మందానిలపోతముల్ మనల సమ్మానింప వాతాయనం
బుల డాయంజని ముద్దుఁగౌఁగిలి సుఖంబుంగూర్చి సేవించెడిన్.
చదలుపందిట వెన్నెలజాజితీవఁ
జుక్కలను పూలుపూచి యో సుందరాంగి,
ప్రణయమోహనమైన యీ ప్రకృతినెల్ల
సురభిళోచ్ఛ్వాస వీచుల సొగయనూఁచు.
పరిసరోద్యానమునఁ జూతవాటియందుఁ
గలరవంబులు సల్పి పికద్వయంబు
నిస్తరంగ సరస్సటు నెగడురాత్రి
గర్భనిశ్శబ్దతకును భంగంబుఁగొల్పు.
చంద్రికాముగ్ధ శర్వరీఛాయలందు
జీవలోకంబు సుఖసుప్తిఁ జెందుచుండఁ,
గవిమనంబును బ్రకృతియుఁ గలయుచుండఁ,
బోదమా కాంత, సెలయేటి పొదలదరికి?
పులుఁగులు గూళులం జెదరిపోయినఱెక్కలనొత్తికొంచు గొం
తులను బరస్పరంబు బిగితోఁ బెనవైచెడివేళ, నెప్పుడుం
దెలుపని హృద్రహస్యములఁ దిన్నగవీనుల విందు సేయ నౌఁ
జెలి, సెలయేటి సైకతముఁ జేరుదమా మన కేలియూఁతలన్ ?
జిలిబిలి కమ్మగానములు చేసెడి యాసెలయేటి యొడ్డునన్
బులకల విస్తరిల్లి నునుఁబోడిమిఁ జూపెడు నీదు బుగ్గలన్
దొలఁకెడి సిగ్గుడాలు, గడదోఁపని ముద్దులఁ గుమ్మరించి య
వ్వల మధురోక్తులం గడగివైచెదఁ గోమలి, రమ్ము మెల్లగన్.
కొండవీడు.
సాంధ్యరాగాంకితాంభోద శకలచయము
లనెడి కీలల నిర్మగ్నుఁ డయ్యె నినుఁడు;
శర్వరీకాంత కుంతలచ్ఛాయలందు
నెలవుకొనె విషాదపు రామణీయకంబు.
కొండవీటి దుర్గంబునకు స్సమీప
మున నొకానొకకేదారమునఁ గృషీవ
లార్భకుండు దున్నుచుండి సూర్యాస్తమయము
గాఁగఁ దలపోయుచుండె నాగలిని విప్ప.
ఇటుతలపోసి, పూనుకొను నెద్దుల నిల్పఁగ మేడి నూనినం
తట మొనకఱ్ఱు లోఁదవిలి ధారుణిఁ జీల్పఁగ నందు వెండిసం
పుట మటు పున్క పైకుబుక భూతమటంచును గేకవైచి య
చ్చటఁ బనిసేయుతండ్రిఁ దనచక్కికి రాఁబిలిచెన్ భయంబునన్.
తనయుని వెఱ్ఱి కేకలకుఁ దందరలాడుచు వృద్ధుఁ 'డేమిరా?'
యని పరుగెత్త సీరపథమందునఁ బున్కనుజూపి బాలకుం
డను: 'నిదియేమితండ్రి? తలయాకృతిగల్గిన రాయి దున్నుచుం
డిన వసుధార్ద్రగర్భము వడి న్వెడలెం గనుఁగొమ్ము' నావుడున్.
కృషికుఁ డంతటఁ బున్కను గేలనెత్తి
యశ్రుధారాభిషేకంబు నాచరించి,
భయమునను సంభ్రమంబునఁ బలుకకున్న
తనయునిం గాంచి గద్గదధ్వని వచించె:
'మాతృదేశపరాయణ మానసులయి
సలిపి రిచ్చోట రెడ్డివీరులు రణంబు;
కత్తిగంట్ల నమూల్యరక్తంబు దొరఁగి
కీర్తివల్లిక పాదు కిక్కిఱిసి నిండ.
'శ్యామలాకాశవీధి నక్షత్రము లటు
కాలవాహినీతటములఁ గానిపించు
రెడ్డివీరకుమార చరిత్రపాద
చిహ్నములు, మృతశౌర్యంబు చివురువెట్ట.
'అరివీరుల్, పులిగర్జలన్ విని కురంగానీకముల్ కాననాం
తరముం జొచ్చెడుపోలికన్ రణమునన్ ధైర్యంబువోనాడి యే
డ్తెఱఁ బర్వన్, భుజవిక్రమంబు బలమున్ దీపింపఁ బోరాడి కీ
ర్తి రమం గాంచి ధరిత్రిగర్భమున శాంతింబొందువారల్ నృపుల్
'అట్టిశూరాగ్రగణ్యులయందు నొక్క
పురుషుశిరముగఁ దోఁచు నీపున్క తనయ,
దీని వీక్షించినంతనే స్తిమితమైన
నాదు రక్తంబు సైత ముష్ణముగఁ బాఱు.'
అనవిని 'బాలకుండు, 'జనకా, మనవారలెవారు? వారికిన్
మనకును బూర్వ మెన్నడయినం గలచుట్టఱికంబుఁ దెల్పుమా'
యనఁ,దలయూఁచివృద్ధుఁడు: 'దిగస్తములన్బలమయ్యెఁజీఁకటుల్
మనముగృహంబుసేరునెడ మార్గమునన్ వచియింతునంతయున్ '
అని యెద్దులఁ బోఁదోలుచుఁ
దనయుండును దాను నింటిదారి నడచుచున్
మును గొండవీటి నేలిన
జనవంద్యుల రెడ్ల పూర్విచరితలు వినిచెన్.
'పూర్వవీరుల ధమనులఁ బొంగినట్టి
రక్తపూరంబె మనలోనఁ బ్రజ్వరిల్లుఁ
గాని, కాలభరంబునఁ గండలెల్ల
శాంతకర్షకవృత్తి దాస్యమునఁ దవిలె.
కత్తికి నడ్డులేక రిపు ఖండనలీలల నారితేరి భూ
పోత్తములన్ యశంబు గని యుర్వినిఁ బాలనచేసినట్టి రె
డ్లిత్తఱి సీరచోదకపు వృత్తిగ్రహించిరి; పోటుకత్తులున్
నెత్తుటఁ ద్రుప్పువట్టి చెడనే చెడె శూరత యంతరించుటన్!
'పరవీరావళి హృత్పుటంబులను జీల్పన్ శక్తిమంతంబులై
దురమందున్ మెఱుపట్లు శోభిలిన కత్తుల్ నేఁడు రూపాంతర
స్ఫురణన్ సీరములందుఁ గఱ్ఱులుగ నేపున్ సొంపువోనాడి యీ
ధరణీగర్భముఁజీల్చుచున్నయవి శాంతప్రక్రియంగోరుచున్!
'ఒక్క క్షణంబునన్ గగన ముల్లసితంబుగఁ జేసి యుల్క వే
ఱొక్కక్షణంబులో మఱుఁగునోజగ రెడ్ల ప్రతావవహ్ని న
ల్దిక్కులనిండి యాంధ్రమహితేజము నిమ్మడిచేసి, మోసపుం
డక్కు లెఱుంగకుంట నకటా! యలకత్తులబావిఁజెన్నఱెన్.
ఇటులఁ జెప్పెడినంతలో నిల్లుసేరి
యెద్దులను దొడ్డిదోలిరి యిరువు రపుడు;
కొడుకు మనమున నిసియెల్లఁ గొండవీటి
స్వప్న మేతప్ప మఱియొండు స్మరణలేదు.
- __________
కవితాప్రణయిని.
'సరస కవిత్వ శారద, నిశాముఖచుంబి సుధాంశుమండిలీ
కిరణతతుల్ శరజ్జలద కీర్ణములై మెలమెల దిక్కులన్
నెఱసెడి రాత్రివేళ రమణీయ సముజ్జ్వల తారకావళీ
భరిత నభంపుఛాయలఁ గృపామతిఁ జేరెరె నన్నుఁగూడఁగన్?
'కలయన్ స్వర్గమునందు నీదు రుచిరాకారంబు వీక్షించి చం
చలమై ద్రిమ్మరు నామనంబు నినుఁ గాంచం గ్రమ్మఱం గోమలీ,
కలకంఠంబులు గూసినం, గిసలయాగ్రంబుల్ పిసాళించినన్,
వలపుంజిల్కెడిపూవు పూచినను నీ నామంబె చింతించుదున్.
'పల్లవకోమలంబులగు పాదము లీవలమెట్టుచుండు నా
చల్లనిచప్పుడుల్ హృదయ సంచలనంబుల శబ్దమట్లు రం
జిల్లఁగఁ జేయునుల్లమును; సిగ్గగు నా ప్రణయంబుఁదెల్పికోఁ
బల్లవపాణి, నీకృపకుఁ బాత్రుఁడనంచుఁ దలంచి వేఁడెదన్.
'తళుకున్ బంగరుటేటి సైకతములం దావుల్ గుబాళించు పూ
వులగుత్తుల్, వెదచల్లు పుప్పోదులసొంపుం జిల్కు నీపాదచి
హ్నాల వీక్షించి ప్రమోదబాష్ప సలిలస్నాతంబులంజేసి ము
ద్దులు వర్షించితిఁ జంచలాక్షి, మదియందుం బ్రేమ చిప్పిల్లఁగన్.
'నీవు వసియించుసీమకు నేనుగూడ
వచ్చెదనువేగఁ గొనిపొమ్ము వలపులాఁడి,
శీతలామృతవర్షంబుఁ జిందు నీదు
సరస వీక్షా ప్రసాద భిక్షంబు నెట్టి.'
అని యువకుండుపల్క విని, యాకవితాలలితాంగి ముద్దు మో
మునఁ జిఱునవ్వుదొంతరలు పొంపిరివోవఁగఁ బాణిపల్లవం
బున వలిపంపుఁబయ్యెదను బొల్పుగనొత్తుచుఁగాలియందె ఘ
ల్లని రవళింప నేలపయి నల్లనఁ దా బొటవ్రేలు రాచుచున్.
వలపుల తేనెతుంపరలఁ బచ్చనిమోసులనెత్తు చిత్తపుం
గలఁతను దోఁపనీక కలకంఠమునా వచియించె: 'మోహనా,
పలికెదవోయి నీప్రణయబంధము; నెవ్వఁడవీవు? స్వర్గపుం
బొలముల సంచరించు మముబోఁటుల సంగతిఁ గోరినచ్చితే?
'నాదు బహిరాకృతిఁ గని యానందవార్ధి
నోలలాడిన వారెందరో గలారు
గాని, యెడలేని ప్రేమ శృంఖలలఁ జిక్కి
నామనముఁగొన్న ప్రియులు గానంగ నరుదు.
'అవనిపై సంచరించు నీవంటివారు
దివ్య నక్షత్రమండలిఁ దిరుగఁగలరె?
అందరానిఫలంబుల కాసయేల?
పొమ్ము, ననుఁబోలువారు మీభూమిఁ గలరు.'
అనవిని, యా యువకుఁడు 'కా
మిని, యిట్టులఁ ద్రోసిపుచ్చ మేలే? నీకై
యనురాగవశత నెట్టుల
దినములు గడిపితినొ దానిఁ దెలిపెద వినుమా.
'అప్పుడైన నీహృదయంబు నందుఁ గొంత
నెనరు గల్గి నన్నేలెదో చనవులాఁడి,
వినియు నీప్రేమకుం దగ ననుచు భ్రుకుటి
భంగమాత్ర నసమ్మతిఁ బయలుపఱతొ.
'కవితాకోమలి, నీమనం బిడక యాకారంబుఁ గాన్పించి కై
తపలీలల్ పచరించి నాప్రణయగంధమ్మున్ వృధాపుచ్చెదే?
యువకుండ న్మధురార్ద్రచిత్తుఁడనుస్నేహోల్లాసధుర్యుండఁ బ్రా
భవకాంక్షిన్ ననుమోసగించి యరుగన్ భావించితే నిర్దయన్?
'ప్రత్యుషస్సుల నూత్నపత్రములు విచ్చి
విమల హిమబిందువులు రాల్చు సుమ వితతుల
తోడఁ బ్రమదాశ్రువులు వీడి పాడుచుందుఁ
గలికి, నీమనం బంటెడు గానములను.
‘సందెమబ్బుల చిఱువేరు చాయదీసి
పండువెన్నెల పసరునఁ బదనుచేసి
తరుణి, నీపట్టు ముసుఁగు నద్దకమువైవ
విఫల యత్నంబులం జల్పి వెఱ్ఱినైతి.
'పారిజాతపుష్పంబులు పవనహతిని
మృదులతృణముల రాలెడునెడల, నీదు
చరణవిన్యాస కోమల శబ్దమనుచు
నడుగుగుర్తులఁ బలుమాఱు నరయుచుందు.
'సాలెగూళుల ముత్తెంపు సరములటుల
లేఁతగాలికి నల్లఁ జలించు మంచు
నీటిబొట్ల మాలనుగట్టి నీదుమెడను
వైవఁ దలపోసి యెగతాళిపడితి చెలియ.
'గాఢ నిశ్శబ్ద శర్వరీ గగనమందు
నీవు వలికించు వల్లకీ నినదములను
వినుచుఁ బ్రమదాశ్రుపూరంబు కనులఁదొరఁగఁ
గాంచుచుందు గభీర నక్షత్రవీథి.
'వలపులు పండుపండమికి వందురు చుండెడు చిత్తమందు నె
త్రు లొలుక నడ్డుమాటలనుతూపుల నొంచెదెయాత్మహత్యకుం
దలకొన దారిఁజూపెదవె? ధర్మమె నమ్మినవాని మోసగిం
పుల వలయించి చంప? నినుబోఁటికి నింతటిక్రూరచిత్తమే!
'గ్రామవాసిని, ఎఱుఁగను గైతవంబు,
ప్రకృతి తల్లి స్తన్యంబునఁ బ్రబలినాడఁ,
బొలముల విహరించుచుఁ బ్రొద్దుఁ బుచ్చుచుందు,
నట్టి నాముద్దువలపును నరయలేవె?'
అని యువకుండు పల్కఁగ రసార్ద్రమనంబున రేఁగుభావముల్
దొనికెను బాహ్యరూపములతోననఁ బ్రార్థన కొప్పికోలుగాఁ
జనవుమెయిన్ మృణాలసదృశంబగుబాహువులెత్తి ప్రేయసుం
దన కవుఁగింటనొత్తెఁ గవితా లలితాంగి విముగ్ధచిత్తయై.
- __________
ద్రౌపదీసందేశము.
సంజయా, యింకఁజాలు నీశాంతిమార్గ,
మడవిఁ బడరాని యిడుమలఁ బడితిమయ్య;
బోధలొనరించి హక్కులఁ బులిమిపుచ్చ
నిన్నుఁబంపెనె కురురాజు నేర్పుతోడ.?
నగచినట్లుండవలయును, వాని యాలి
త్రాడు తెగవలెనున్న విధాన నీవు
పూర్వకష్టంబులకు సానుభూతి చూపి
తేనెపూసిన కత్తిని దింపఁదలఁతె.
కపటమార్గంబులం బన్ని కనుల మూసి
రాజ్యభాగంబుకొన్న ధైర్యంబు కతన
నేఁడు సైతము మాటల నిద్రపుచ్చి
వనికి వెడలింపఁ గుట్రలు పన్నువారె?
మున్నటి దినాలు గావివి, మోసములకుఁ
దవిలి తలయూఁచునే నేఁడు ధర్మరాజు?
పరిభవానల కీలలు పాండుసుతుల
హృదయముల రగిలింపవే రేపుమాపు?
నను సభలోని కీడిచి, కన న్వినరాని పరాభవంబుచే
సినఁ గనులారఁ గాంచియు నిసీ! పతులేవురు ధర్మబద్ధులై
మును పగఁదీర్పకుంటఁ గురుభూపతి మమ్ములఁ జుల్కనాడెనం
ట! నిరతమొక్కరీతిఁ జనునా మనకాలము సంజయా, యెటన్?
అంతంబొందెనె పాండుపుత్ర దృఢబాహాశక్తి రోషంబు? దు
ర్దాంత ప్రక్రియ వైరివీరమధన ప్రారంభ కౌతూహల
స్వాంతుల్శాంతులుగారు, కాలమెపుడోవచ్చుంగదాయంచు న
త్యంతాసక్తిఁ బ్రతీక్షచేసెదరు శౌర్యాలంబులౌ మత్పతుల్ .
రాయబారంబులేల యీరచ్చలేల?
పాలుఁగొనక శాంతింతు రే పాండుసుతులు?
ఊరకిమ్మన్న నిచ్చునా యుర్వి నృప్పుఁడు?
పిల్లిశాపంబులకు నుట్లు ప్రిదిలి పడునె?
తెలుపుము సంజయా, విరటుధేనువులం బరిముట్టువేళ ను
జ్జ్వలభుజవిక్రముల్ కురుసృపాలవరుల్ చవిగొన్న పార్థుతూ
పుల దొనలింక రిత్తవడిపోవవు; గాండివి చిత్తమట్ల వై
రుల రుధిరంబుఁజూఱగొన రోషముఁ గ్రక్కుశరంబులేనియున్.
రాజ్య మేనాఁటికిని వీరభోజ్యమనుచు
జనులు పల్కెడిమాట నిశ్చయము సుమ్ము,
పరమసుఖములఁ దులదూఁగు నరవరుండు
పిలిచిరాజ్యంబులిచ్చునే భిక్షుకులకు?
బొల్లి మొగాలపైఁ జెమటబొట్టులు గ్రమ్మ నురక్షతంబులన్
బెల్లుగ నెత్తురోడికలు పేర్చఁగ మిమ్ము పృధాసుతుఁడు వి
ద్యుల్లతికాభ బాణములఁ దూల నదల్చి వధించుదాఁక మీ
యుల్లము రాజ్యభాగమున కొప్పునొయొప్పదొ సూతనందనా.
వైరి విభీషణాకృతిని వాయుసుతుండు గదన్ ధరించి దు
ర్వార మదేభ మబ్దవనిపైఁ బడురీతిఁ గురూర్వినాధులం
బేరు దలంపరానియటు పీనుఁగుపెంటలు సేయునప్పుడై
నా రవయేని నెంతురె మనంబునఁ బాండుతనూజుశౌర్యమున్ ?
కవలనఁ బిల్లవారలటుగాఁ దలపోయుదు రేమొ! మీ పయిం
గవిసిన యప్డె వారి భుజగర్వము శౌర్యముగానవచ్చు; మ
బ్బు విడిచివచ్చుసూర్యుని సముజ్జ్వల తేజమునాఁగఁ జూడఁగా
నెవరును జాలరయ్య రణమేడ్తెఱ సల్పెడి బాలవీరులన్.
ఉత్తమాటలనేమి ప్రయోజనంబు?
అవని యొసఁగుటొ, లేకున్న నని సలుపుటొ
చెప్పిపంపుఁడు; నామేన జీవమున్న
దనుక సంధియత్నంబులు దలఁగుఁడయ్య.
- __________
దుర్యోధనుఁడు.
రాజరాజ దుర్యోధనా, రాజ్యలక్ష్మి
నట్టనడియేటియందు నీపుట్టిముంచె
నయ్య, విధి తిరస్కారంపు టవధివోలె
నీదు నంత్యపతన మింత నీచమగునె!
ఏలితి వీ ధరావలయ మెంతటివీరుల కేని గుండెలో
గాలముగాఁగ, వైరిబలగంబులకున్ యమదర్శనంబుగన్ ;
పాలకుఁ బోరువెట్టు పసిపాపలు 'వచ్చెను రాజరాజ' నన్
డోలిక నిద్రవోదురు కడున్వెఱపెత్తఁగఁ బేరువిన్కలిన్.
ఎఱుఁగవె భీతియన్న 'నదియెట్టుల నుండు' నటంచుఁ బల్కు నీ
వెఱవమి, విక్రమక్రమము; వీర్యము నెక్కడపోయెనోయి? యా
సరసున డాఁగినాఁడవు? విచారము లేదె? యశంబుకన్న న
శ్వరమగు ప్రాణముల్ మధురసంబులె? భారతకీర్తి నెంచవే?
హృదయముఁ గోసియిమ్మనినఁ బ్రీతిగ నిచ్చెడుప్రాణమిత్రుఁడే
యదవదలేక నీకయి రణావనిఁగూలిన కర్ణయోధ నీ
మదిఁ బొడకట్టఁడే? యిటుల మాన్యతపోవిడి తుచ్ఛజీవముం
బదిలము సేయనేల నరపాలక, వంశయశంబు నెంచుమా.
ఎంతకాలంబు బ్రతికిన నెప్పుడైన
మరణమొందక మానఁడు మానవుండు;
క్షత్రియుఁడు వ్యాధిబాధలఁ జచ్చుకన్నఁ
గత్తిపోటుల మడయుటే కరముప్రియము.
సాటిలేని విరోధులఁ జదిపినట్టి
పరభయంకర గద చేతఁ బట్టినావు;
లెమ్ము లెమ్ము, దుర్యోథనా, లెమ్ము లెమ్ము
క్షత్రియత్వము రూపింప శక్తి లేదె?
ప్రవహింపదే నీదు రక్తనాళంబులఁ
బూర్వుల శోణితపూర మిపుడు?
ప్రజ్వలింపదె నీదు భావకుండంబున
నవమానరోష హోమానలంబు?
తీఱెనే నేఁటితో దిక్కులవిలసిల్లు
భారత క్షత్రియ వంశకీర్తి?
గొడ్డువోయెనె నేఁడు కురురాజ్ఞి గాంధారి
కదనవీరశతంబుఁ గన్నతల్లి?
లెమ్ము, దుర్యోధనా, యింక లెమ్ము లెమ్ము,
సరసితటమున నున్నారు. సమరకాంక్షు
లైన పాండవేయులును మురాంతకుండు;
ప్రాణములపైన మోహంబు వదలుమయ్య.
ప్రాణమిత్రుండు కర్ణుండు స్వర్గమేఁగె;
నంపశయ్యను గాంగేయుఁ డస్తమించెఁ;
గొడుకులును దమ్ములునుగూడఁ గూలినారు;
అంత యభిమానమే దేహమందు రాజ?
గెలిచితివా యకల్మషపుఁగీర్తియురాజ్యమునబ్బుఁ, బ్రాణముల్
దొలఁగితివా నిలింపపురి తోఁటలలో విహరింతువయ్య; శూ
రులకు రణంబు పండువు; విరోధుల గీటడగించి సర్వభూ
వలయము నైనఁ జావయిన భారతరాజ,గ్రహింపు మిత్తఱిన్.
- __________
రాధయుత్కంఠ.
__________
చల్లని పన్నీట జలకంబులాడి
యగరుధూపము వెట్టి యలకంబులార్చి
నుదుటఁ గస్తురి బొట్టు కుదుటుగాఁదీర్చి
కన్నుఁదమ్ములఁ గ్రొత్తకాటుక దిద్ది
గోరంటపూగుత్తి కొప్పునం దురిమి
కమ్మతావులనీను కలపంబునలఁది
పొడికప్పురంబులఁ బడకింటఁ జల్లి
పాన్పుపైఁ బువ్వులు పఱపుగాఁ బఱచి
యేలరాడో సామి యిం కేలరాఁడొ
యనుచుఁ బొరము నానుకొని వేచియుంటి.
* * *
స్వాంత మాలస్యంబు సైరింపలేక
వేదనాభరమున వ్రీలంగఁజొచ్చెఁ
గనికని దారులు కన్నులు నొచ్చె
నాసామి కృష్ణుండు ననుఁ గాంచరాఁడు.
* * *
సంజ కెంజాయలు శమియిచిపోయెఁ
బక్షులు గూళ్ళకుఁ బరుగిడసాగె
మందల కావులు మరలిపోయెడిని
వేణుగానంబులు వీనులసోఁకె
కోయిల క్రొమ్మావి గుబురులోఁ గూసె
సందెచీఁకటి పొగ చదలావరించెఁ
జుక్కల రసగుండ్ల జొంపంబు లలరె
నేలరాఁడో కృష్ణుఁ డింకేల రాఁడొ!
* * *
కప్పురపుం దివ్వె కడముట్టవెల్గె
బాన్పుపైఁ బువ్వులు వసివాళ్ళువాడె
మంచిగందపుఁబూఁత మైఁ జిట్లిపోయె
నిద్రమాంద్యమ్మున నేత్రము ల్మొగిడెఁ
బడమటి దెసకేఁగు నుడు గణంబులను
గనుచు ద్వారముకడఁ గన్నుగూర్కితిని.
*. * *
నాసిగ్గు పుచ్చంగ నలిన బాంధవుఁడు
వెయ్యి దివ్వెలతోడ వెలుఁగుచు వచ్చె.
* * *
కూర్కు లేమిని గన్నుఁగొన లెఱ్ఱవాఱ
బొరలుచిట్టిన మేనిపూఁతలు రాలఁ
జెమ్మట ముత్యాలు చెక్కిళ్ళజాఱ
ఘల్లుఘల్లని చేతిగాజులుమ్రోయ
మజ్జిగ జిల్కుచు మధురగీతములఁ
గాంతుఁ డొనర్చిన కఠినంపుఁజేఁతఁ
దుమ్మెదపైఁబెట్టి దూఱుచునుండ
నాముద్దు కృష్ణుండు నావెన్కనిలిచి
ముసిముసి నవ్వుల మురియుచునుండె.
* * *
వేచియుండిన యప్డు విభుఁడరుదేఁడు,
వేసవివానల విధముగా నతఁడు
కలవలె వచ్చును గనిపించిపోవు.
- __________
ఎంత మోసము!
________
బాటసారి
చీలుదారులఁ గూర్చుండి చిన్నదాన,
కన్నులను నీరు నించెదు కరుణమొలుక,
నేపధంబున నేఁగ నీ కిచ్చ గలదు?
ఇరులు గ్రమ్మకమున్నె నిన్నిల్లు సేర్తు.
చెట్లనీడలు విరివియై చేరెఁ దూర్పు;
సంజకెంజాయ పడమటఁ జక్కనలమెఁ;
బైరుకోఁతలకేఁగిన పల్లెపడుచు
లింటి కరుగుచుఁ బాడువా రేలపాట.
గాలితాఁకున వెన్నులు కదలునపుడు,
తిరుగఁబాఱిన వరిచేలు తీయు రాగ
మదిగొ! వినఁబడుచున్నది, యలల మర్మ
రములు సంధ్యా ప్రశాంతగర్భమునఁ బోలె.
యువతి
గోపికామోహనుఁడు నందగోపసుతుఁడు
వచ్చు నీదారి నని సఖి పలుక వింటిఁ;
బ్రొద్దువొడుపున నుండి యీపొన్నక్రింద
వేచివేచి యీదారులు చూచుచుంటి.
రత్నఖచిత కిరీటంబు రాజుశిరము
నందు వెలుఁగొందుచుండు నటంచు వింటిఁ,
బట్టుపీతాంబరము వల్లెవాటువైచి
మత్తకరినెక్కి వచ్చు నన్మాట వింటి.
బాటసారి
చిన్నికృష్ణుని సేవింపఁ బొన్నక్రింద
వేచియున్నావె? నీముందు వెళ్ళినట్టి
వేణుధారినిఁ గాంచవే? విశ్వమోహ
నంపుగానంబు విననె యో నళినవదన?
నెమ్మిపించెము క్రొమ్ముడిఁ జిమ్ముజిగులు
చిన్నికూఁకట్లు మెడపైనఁ జిందులాడు
బొజ్జవఱకును వ్రేలు క్రొంబూలమాల
యతని పదశబ్దముల ఛంద మమరు చుండు.
ఆమహాత్ముఛాయలు సోఁకినంతమాత్ర
జీర్ణ తరు లతావళిగూడఁ జివురు వెట్టు;
ఆ మురళి మోహనారావ మలరినంత
రెల్లుపుల్లల సైతము రేఁగు గీతి.
యువతి
ఇపుడు స్మృతియందు నావ్యక్తి యెసఁగుచుండు
భగ్నమైన యింద్రధనుస్సుపగిది నహహ!
యెగిరిపోయెడు కలయట్టు లీక్షణముల
నంటి యింద్రజాల మదృశ్యమయ్యె సపుడె!
వేణుగానంబు దేనినో విన్నయట్లె
దోఁచుచున్నది, దూరానఁ దోయదములఁ
దారకావీణ లొనరించు ధ్వను లనంగ;
నెంతమోసంబు జరిగెనోయీ సఖుండ!
బాటసారి
అదియె తెలియరాని విచిత్ర మతివమిన్న.
- ___________
అజ్ఞాతకవి.
______
కిసలయగుచ్ఛమధ్యములఁ గీల్కొని నే దినకాంతిఁగాంచలే
నిసి! యని మంచుబాష్పముల నేడ్చు సుమంబటు సత్కవీశ, క
క్కస పడనేల? తావిఁగొనుగాడ్పులరీతి విమర్శకుల్ కృతిన్
రసముగ్రహించి నీయశము రాజిలఁజేయుదురయ్య యెల్లెడన్.
పొలుపుగ రేపవల్ నిలువఁబోక మనోజ్ఞ నిసర్గగానముల్
సలిపెడు నిర్ఝరంబ, గిరిసానుతటంబున నిన్ను నెవ్వరుం
దలఁప రటంచు నెంచెదవో, తాలిమినూనుము బాటసారి నీ
కలరవ మాధురీమహిమఁ గాంచి నినుం బ్రకటించు నిద్ధరిన్.
డాఁగియుందు వసంతంబు డాయుదనుక
వేఱ ప్రకటన నీ కేల వినుమ పికమ,
స్వర్గగానంబు భూతలస్థంబుచేయు
నీ వికస్వరకంఠంబు నెగడుచుండ?
ఓరి బాలక, నీమురళీరవంబు
వ్యర్థమౌనని చిత్తతాపంబువలదు,
రాగపరిచితుఁ డెవ్వఁడో రమ్యగీతి
వినియెయుండు నానందంబు వెల్లివిరియ.
- __________
ముసలిమాలెత.
మిడిమిడి యెండ సోలుచు శమింపని తాపముతోడ నూరుపుల్
వెడలఁగ డొల్లయై కడుపు వెన్నెముకం గర మంటియుండఁగన్
బుడిబుడి మిట్టపల్లములఁ బూనికఁ గాలిడఁబోయి తొట్రిలం
బడుచు గతి శ్రమన్ ముసలిమాలెత వచ్చుచునుండె నొంటిగన్.
కాల కఠోరసీర మలికంబను ధారుణిదున్న లోఁతుగం
జాళులు వాఱెనా వళులుసాగి శ్రమాంబులు పిక్కటిల్లి, స్వే
తాలక వృత్తముల్ నొసలి కావలనీవల వ్రేల నందు ము
త్యాలవిధంబునం దొరఁగు నాముదివగ్గు తలం జలింపఁగన్.
ఒంటిపూఁటైన నాఁకటిమంట దీఱఁ
గుడువ నొక కడియన్నంబు గూడకున్కి
నస్థిపంజరమైన దేహంబుగూడ
మోవలేదన సోలును ముసలియవ్వ.
దారిద్య్రదేవత తనరూపు గనుపింప
వగ్గువాలకమూని సచ్చెనొక్కొ!
భేతాళునాజ్ఞ గావించు పిశాచంబు
పీనుఁగు నొడలితో వెడలెనొక్కొ !
స్వార్థ పరస్వాంతుఁడౌ రాజుచేఁ బడి
లావుదూలిన దేశలక్ష్మి యొక్కొ!
సకలవస్తు ప్రదర్శన శాలలో నిడ్డ
ముదిమి యవధిఁదెల్పు మూర్తియొక్కొ!
యనఁగఁ జేయూఁతకఱ్ఱను నవనినూని
నడువఁజాలక తడఁబడి యడుగులిడుచు
నెండవేఁడికి మేనెల్ల నెరయుచుండఁ
జెట్టునీడకుఁ దానల్లఁ జేరవచ్చి;
నను నచ్పోటనుగాంచి, కూలఁబడి ప్రాణంబుల్ వెలింబాఱునో
యన నిశ్చేష్టతనుండి తేఱి కడుదాహంబెత్తె నీరమ్ముఁ దె
మ్మను నర్థంబుగ దోసిలిం బెదవి డాయంబట్టి చూపింప నం
తనె తద్భావమెఱింగి తాళదళపాత్రంబందు శీతాంబువుల్ ,
కొనితెచ్చి యీయఁ బెనుదగ
తనియంగాఁ ద్రావి యలఁత దఱిగినపిదపన్
నను దీనదృష్టిఁ గనుఁగొని
వినయముతో నిట్టులనియె వృద్దాంగనయున్:
'నోటఁదడిలేక మాటాడుదీటులేక
గాసివడియున్న ననుఁగాంచి కనికరమున
నీరు తాగించి ప్రాణంబు నిలిపినట్టి
నిన్ను నేమని పొగడుదుఁ గన్నతండ్రి!'
అని కృతజ్ఞతాసౌరభ మార్ద్రవచన
కుసుమములఁ జల్ల, నేనును గుతుక మొంది
యవ్వచరితంబుఁ గనుఁగొను నాసతోడ
నిట్టులంటిని నాదరం బుట్టిపడఁగ:
'ఎవ్వరిదాన వీవు? మఱియిచ్చటికిం జనుదెంచుటేల? నీ
కెవ్వరు చుట్టపక్కము? లిఁకెయ్యడకుం జననిచ్చగల్గె నో
యవ్వ? సమస్తముందెలుపుమా'యనఁగన్నుల బాష్పపూరముల్
నివ్వటిలంగ నాత్మకథ నెట్టనఁ దెల్పెను గద్గదోక్తులన్ :
'పడమటి మెట్టదేశములఁ బైరులు పంటలు వానలేమికీన్
నడఁబడి యెండి కాటకమువచ్చిన సన్న జనంబు మంటలం
బడియెడి దోమగుంపటుల మాడి దినంబున కొక్కసారియున్
గడికబళంబు లేక కడుకష్టము నొందుచు నుండి రచ్చటన్.
'డెలటాభూములఁ బైరులు
గలవని యచ్చోటిజనులు కౌతుకపడుచున్
వలసలువచ్చిరి ప్రాణం
బులు నిలువంబెట్టు నాస పొంపిరివోవన్ .
'నాకూఁతురు నాకొడుకును
నాఁకలి యెట్టిదియొ యెఱుఁగనట్టుల నన్నున్
సాఁకుచునుండిరి వేళకు
ఆకో అంబలియొ గలుగునంతకు నిడుచున్.
'ముసలితనమునందు ముప్పతిప్పలుగల్గెఁ
దమ్మిచూలివ్రాలు వమ్ముపడునె?
కొడుకుఁగూఁతు మొన్నఁ గ్రొత్తజ్వరంబుల
వాతఁబెట్టి నేన బ్రతికియుంటి.
'పండుటాకులురాల్చక పసరులొలుకు
పిన్నకనటల వెదకెఁ బాపిష్టిబ్రహ్మ !
ముసలిముదుకకు సంజీవి మెసవఁబెట్టి
విసముఁ దినఁబెట్టెఁ బ్రాయంపుఁ బిల్లలకును !
'క్రుంగుటేరు దెగియుఁ గూలని ముదిచెట్టు
పగిది నయ్యె నాదు బ్రతు కదేమొ!
యెవరికొఱకు మనుదు నిఁకమీఁద నిలలోన?
భారభూతమైన ప్రాణమేల?'
అనుచుం బట్టిన నిల్పరాని వెత యాస్యంబందుఁదొల్కాడ దృ
ష్టి నిరోధంబొనరించు బాష్పకణముల్ చెక్కిళ్ళపైజాఱ, పం
డిన కేశంబులు వాయుతాడితములై నీరంధ్ర ఘర్మాంబు సే
చనముంబొందఁగనార్తమూర్తియయిసం స్తంభించియున్నంతటన్
వృద్ధనారి దైన్య మీక్షించి మద్దృద
యాబ్జమొలికెఁ గరుణ మనెడు మధువు;
ఆర్ద్రహృదయముసకు నార్తభావమునకు
నెట్టిపరిచయంబు లెసఁగియున్నొ!
అవ్వకొంతసేపు నట్టులే కూర్చుండి
యేమితలఁచెనేమొ యేఁగునిచ్చఁ
గఱ్ఱఁదడవుచుండఁ గని నేను బల్కితిఁ
దోడ్పడంగఁ గోర్కె తొందరింప:
'కాయముజూడ దుర్బలము, కన్నులపాటవముం దొలంగె, నే
సాయమొనర్ప బందువులు సైతము లేరిట నెట్లుకాలముం
ద్రోయుదు వవ్వ? యీకలుపు దుంపలు తీయను సత్తువైనలే
దే! యటుగాక నీకడుపు నెట్టుల నింపెద విట్టిపల్లెలన్?'
ఎండుటాకుల వెన్నెల పండినటులఁ
బెదవిమూలలఁ జిఱునవ్వు పొదలుకొనఁగ
నవ్వ యిట్లనె: 'నాయనా, యైననేమి?
పుట్టఁజేసిన దేవుండు పూరియిడునె?
'గొడ్డుకాటకమున బందుగులను జేరి
యదవ త్రావుడు త్రావంగ నాసలేదు;
ఆట్టులౌటను ఆకైన అంబలైనఁ
గూలియొనరించి కుడుచుటే మేలునాకు.
'కన్నకన్నవారల యిండ్ల కడపఁద్రొక్కి
బిచ్చమెత్తుట యన్న నాకిచ్చలేదు;
కాలుసేతులు నున్నంత కాల మొరుల
చేతికూటికి నాసింపఁ జిన్నతనము!'
అనవిని, యవ్వ నైతిక గుణాతిశయంబున కబ్బురంబునొం
ది నెనరుమై వచించితిని: 'నీదగు నీతికి సంతసంబు గ
ల్గెను; నిఁకమీద నీవెచటికిం జననెంచక ప్రత్యహంబు గై
కొనుము మదీయగేహమునఁ గోరినయట్టుల మజ్జిగన్నముగన్.'
అనిన సంతసించి యవ్వయిట్లనె: 'నయ్య,
కూలిచూపి నాకుఁ గూడుపెట్టు,
తిరిపెమెత్తి తిన్నఁ దీఱునా యాఁకలి?
రమ్ము పల్లెఁజేర జిమ్మదీసె.'
- __________
జాతీయగీతము.
జొహార్ ! జొహార్ ! భారతమాతా,
జొహార్! జొహార్ ! జొహార్!
శారద శుభ్ర వియత్తల పధమున
సంచరించు నీరథము,
నీ మృదు వీణాగాన ప్రబుద్ధము
నిత్యము మామనము.
జొహార్ ! జొహార్ ! భారతమాతా,
జొహార్ ! జొహార్ ! జొహార్!
ప్రత్యుషలక్ష్మీ మకుటమణి ప్రభఁ
బాసె తమోగణము,
నీపదపంకజ నూపుర ఝుంకృతి
నిద్రారహితము జనము.
జోహార్ ! జొహార్ ! 'భారతమాతా,
జొహార్ ! జొహార్ ! జొహార్ !
విప్లవ ఝంఝా విచలిత జీవన
వీచి నికాయమున,
స్థిర విజయోడుప కర్ణ ధారణము
సేయుమ శౌర్యమున.
జొహార్ ! జొహార్ ! భారతమాతా,
జొహార్ ! జొహార్ ! జొహార్!
ముకుళిత హస్తులు నీప్రియపుత్రులు
మోదదృష్టిఁ గనుము,
నీకరుణామృత నిర్ఘరపూరము
నింపు మమ్మ సతము
జొహార్ ! జోహార్ ! భారతమాతా,
జోహార్ ! జొహార్ ! జోహార్ !
నీపదపీఠిని ప్రాణసుమంబులు
నిల్పి భజించెదము,
గర్హిత దాస్య భరంబును మాన్పి
సుఖంబులు మా కిడుము.
జొహార్ ! జోహార్ ! భారతమాతా,
జొహార్! జొహార్ ! జొహార్!
- __________
రాట్నపుపాట.
పొద్దుపొడుపూ చుక్క పొడిచింది రాట్నమా,
గూళ్ళలో పక్షులు కూసేను రాట్నమా
అరుణకిరణాలతో ఆటలాడే నూలు
తమ్మికాడలలోని తంతులంటీ నూలు
మంచినీళ్ళల్లోన మఱగిపొయ్యే నూలు
సాలీడుపోగుతో సరసమాడే నూలు
గాలితరఁగలలోన తేలిపొయ్యే నూలు
వడకవేరాట్నమా, వజ్రాలదూది
నడవవేరాట్నమా, నక్షత్రవీథి.
పొద్దుపొడుపూచుక్క. పొడిచింది రాట్నమా,
గూళ్ళలోపక్షులూ కూసేను రాట్నమా
ముద్దులొల్కేపాట ముత్యాలపాట
పరువు నిల్పేపాట బంగారుపాట
మతుమాపేపాట మధురంపుపాట
నిద్రలేపేపాట నిద్దంపుపాట
కడుపు నింపేపాట కనికిరఫుపాట
పాడవేరాట్నమా భావిభారతము
ఆడవేరాట్న యాంధ్రనాటకము.
పొద్దుపొడుపూ చుక్కపొడిచింది రాట్నమా
గూళ్ళలో పక్షులూ కూసేను రాట్నమా
కట్టగుడ్డాలేక కటకటాపడుచు
కుడువకూడూలేక గోడుగోడనుచు
దాస్యవారాశిలో దరిగానలేక
బెదరిబెదరీచూచు పిరికిపందలను
ఆత్మనిందలతోడ నడలు బేలలను
పురికొల్పశంఖంబు పూరించిరేపి
తిప్పవేరాట్నమా దేశచక్రంబు
విప్పవేరాట్నమా విజయకేతనము.
- _________
ఏల పాట.
వస్తావంటే చక్కనిదానా
వలపుచిందే చూపూదానా
మల్లెపువ్వుల కోనకుపోయిా మల్లీవస్తాము.
గండుకోయిలా కూసేచోట
గుండుమల్లెలు పూసేబాట
ముద్దుముచ్చటా దీర్చూకొంటా మురిపేమాడేము.
చెంపచేయీ పెట్టుకోని
చింతపొయ్యే చిన్నాదానా
కళ్ళనిండా కాటుకనీళ్ళూ గారూటెందు కే?
పక్కపక్కా రాసుకొంటా
పదములెత్తీ పాడూకొంటా
అల్లో నేరేటీచెట్లనీడ ఆడుకొందామె.
పూలగుత్తులూ కోసీయిస్తా
పుట్టతేనెలూ తీసిపెడ్తా
చల్లనీటీ కొండా యేట జలకమాడేమె.
వస్తావంటే చక్కనిదానా
వలపుచిందే చూపూదానా
మల్లెపువ్వుల కోసకుపోయీ మల్లీవస్తాము.
- __________