Jump to content

కవికర్ణరసాయనము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

షష్ఠాశ్వాసము



రంగధరాధిప శృం
గారరసాధీశభావ గరుడగమన సం
స్మేరముఖాంబుజమధురా
కారాలంకృత నమజ్జగజ్జనహృదయా.

1

మాంధాత తపంబు సేయుట

వ.

ఇ ట్లమ్మహీవరశ్రేష్ఠుండు నిష్ఠురతపోనిష్ఠుం డై.

2


చ.

పరువడిఁ గందమూలఫలపర్ణజలంబులఁ గొన్నికొన్ని వ
త్సరములు వోవఁ గాఁ బిదప సర్వము మాని నిజాంతరంబునన్
హరి భజియించి శేషసవనాశనభర్తయుఁ బోలె నాతఁడున్
గరువలిఁ గ్రోలఁ జొచ్చెఁ ద్రిజగంబులు విస్మయ మొంద నయ్యెడన్.

3

గ్రీష్మర్తువర్ణనము

క.

అతనిసమగ్రం బగుతీ, వ్రతపోగ్ని జగంబు నిండ వడిఁ బర్వినసం
గతి దుస్సహోష్ణసంప, ద్వితతం బై యంతలోన వేసవి వచ్చెన్.

4


ఆ.

తాపతప్తజంతుతతుల విశ్వంభర, గర్భమున భరింపఁ గరుణఁ దలఁచి
తెఱపి యిచ్చె ననఁగఁ దీవ్రాతపాహతి, నేల నెల్ల గాఁడి నెఱియ లొదవె.

5


సీ.

ఏకార్ణవంబులో నిర వైనపటపత్ర, శయనంబు మదిఁ గోరి శార్ఙ్గపాణి
యష్టమూర్తులలోన నంబురూపము నాత్మఁ, గాంక్షించి హరిణాంకఖండమాళి
ప్రథమాంబుజఘ్రాణభావస్థితియ వేఁడి, యభిలషించెఁ బయోరుహాసనుండు.
వేడ్క గా కుండియు విలయోదకోదర, స్థితి యపేక్షించె ధాత్రీవధూటి


గీ.

హేమరజతాచలాదిమహీధరములు, హిమగిరిత్వంబు మతుల నూహించుకొనియె
సకలలోకానివార్యదుస్సహమహోష్ణ, భీష్మగతి యైన యమ్మహాగ్రీష్మవేళ.

6


క.

ఆమనిరాజ్యం బెడలుట, గాముఁడు నెల వేది యున్నఁ గ్రమ్మఱ గ్రీష్మం
బాముక్తహారతోరణ, భామాకుచమండలముఁ బట్టము గట్టెన్.

7

సీ.

సరసీపునఃపునస్సలిలఖేలనముల, సరసగైరికపటాచ్ఛాదనముల
సహిమాంబుఘనసారచందనచర్చలఁ, దారహారావళిధారణముల
యంత్రధారాగృహాభ్యంతరక్రీడల, శశికాంతశయ్యాంతసంవసతుల
సంతతకరతాళవృంతవీజనముల, చిరసాంద్రచంద్రికాసేవనముల


గీ.

స్వాదుఖర్జూరనారికేళాదివివిధ, సారపానకరససుధాస్వాదనముల
హితసమీహితగతులఁ జయించి రవుడు, దంపతు లమోఘనైదాఘతాపభరము.

8


ఉ.

అట్టినిదాఘవేళ నిబిడాగ్నులు నల్దశలందుఁ బర్వఁగాఁ
గట్టిగ నేల యంగుళ మొకండ ఘటించి ఖరాంశుమూర్తిపైఁ
బెట్టినచూడ్కితో హృదయపీఠికయం దమృతాబ్ధిమందిరున్
బట్టము గట్టి దుస్సహతపం బొనరించె జగంబు బెగ్గిలన్.

9

వర్షర్తువర్ణనము

ఉ.

దీపిత మయ్యె నంతట నదీనవయౌవన మంబుజాననా
కోపకవాటనిర్ఘటనకుంచిక చాతకనిర్జలవ్రతో
ద్యాపన మబ్జినీవికసనాస్తమయంబు మయూరనర్తనా
టోపనిధోపదేశకనటుండు పయోదసమాగమం బిలన్.

10


ఉ.

చాతకభాగ్యరేఖ జలజాతపరిచ్యుతి పక్వకందళీ
సూతిచికిత్సకాంగన ప్రసూనశరాసన రాజ్యలక్ష్మి ప్ర
జ్యోతనచంద్రమఃపటువిధుంతుదభీషక సర్వజీవజీ
వాతువు గాన నయ్యె నవవారిధరోదయవేళ యంతటన్.

11


మ.

విరహిస్వాంతమనోజపానకశిఖావిర్భూతధూమంబులం
బరకాసారగతాసితోత్పలకలాపంబుల్ జగన్మండపో
పరినీలాచ్ఛవితానచేలములు దృష్యద్గ్రీష్మనిర్వాసణో
ద్ధురవర్షాగమరాజభద్రకరు లుద్ఘోషించె నూత్నాభ్రముల్.

12


ఉ.

వచ్చె ఘనాఘనంబు లివె వల్లభు లేలొకొ రా రటంచు వి
ద్యుచ్చలనోద్యతద్యుతుల కుల్కుచుఁ ద్రోవలు నిక్కి చూచి
పుచ్చక నెవ్వగ న్వగపు పుట్టఁగఁ బాంధసతు ల్నిగుడ్చుపె
న్వెచ్చనియూర్చుల న్విరిసె మిన్నుపయిం బ్రథమాంబువాహముల్.

13


క.

నీరం బప్పుడు నూతులఁ, బూరించె నటంచు నేల పొగడగఁ? నాక్రొ
క్కారుతఱి బాష్పవర్షము, పూరించెం బాంథకర్ణపుటకూపములన్.

14


సీ.

కేళీనటద్గేహకేకికేకారవో, న్మేషంబు చెవులఁ దేనియలు చిలక
నభినవార్జితగర్జితారవోల్లసనంబు, లిఱియుఁగౌఁగిటిబిగి నినుమడింప

ధారాళనవనవోద్దామసౌదామని, ప్రభవించుటలుకలఁ బాయఁ ద్రోవ
మణిగవాక్షనిరీక్ష్యమాణవాసనధను, ర్విభవముల్ చూడ్కులవిం దొనర్పఁ


గీ.

జంద్రకాంతావళీకనిష్యందమాన, నీరధారాపరంపరానిష్ప్రయత్న
యవనికారమ్యకనకహర్మ్యములయందుఁ, జెందు దంపతికులము వార్షికసుఖంబు.

15


మ.

శ్లధవేణీభర మై మహోష్ణబహునిశ్వాసానిలంబు ల్వియ
తృథముం గ్రాఁపఁగ మోము లెత్తి తము నుద్యద్దైన్యు లై చూడఁ
బథికస్త్రీనయనాబ్జకోణవిగళద్భాప్పాంబుబిందుచ్ఛటల్
ప్రథమాంభఃకణికానిపాతములగుం బ్రావృట్పయోదాళికిన్.

16


తే

ఒదరి విరహుల నులికింప నోపెఁ గాని, యిరులకలిమి బయళ్లంద యేగెడునభి
సారికలశంక గొలుపంగఁ జాల వయ్యె, నూర్జితము లైనఘనకాలగర్జితములు.

17


చ.

చలిఁ బడి యున్నపేరలుక శయ్యపయిన్ మొగ మీనికాంత లా
తొలుకరివేళ కామజయదుందుభిఘోషమువోనిగర్జకుం
గళవళ మంది బిట్టు తముఁ గౌఁగిటఁ జేర్పఁగఁ బ్రాణవల్లభుల్
దెలియఁగ నేర రాత్మలఁ దదీయవిశుద్ధవిదగ్ధభావముల్.

18


క.

ఇక్కువ చేయుంబగలును, నొక్కటిగ మెొయిళ్లు పర్వి యుండినయపు డా
క్రొక్కారుకలిమి యే మన, నిక్కిన వందుకొనవచ్చు నింగిఁ దలంపన్.

19


ఉ.

క్రూరతటిత్కృపాణవతి రూఢబలాకకపాలమాలికా
హారిణి నిర్నివారణవిహారిణి కాళిక కాళికాగతిన్
దారుణలీలమై భువనదాహకుఁ డైననిదాఘదైత్యు నం
భోరుహమిత్రు పేరితలఁ బుచ్చుక మ్రింగె విచిత్రవైఖరిన్.

20


క.

పిరిగొనుతొలుకరిమొగుళుల, భరితాంధంకరణమునకు బాసట యయ్యెన్
బురివిచ్చి యాడు నెమళుల, నిరస్తతాపింఛపింఛనిర్భరదీప్తుల్.

21


క.

నిర్భరగతిఁ గరకాసం, దర్భంబులు రాలె నంత ధరపై జలదా
విర్భావమగ్నహంసీ, గర్భస్రవదండపిండఖండము లనఁగన్.

22


క.

కుంభీనసములు ద్రేలిన, గుంభనమునఁ గుంభిహస్తగురుతరధారా
రంభమున రేయుఁబగలున్, గుంభద్రోణములు వట్టి కురిసె న్వానల్.

23


వ.

ఇట్టివర్షాగమంబున.

24


తే.

జలధరంబులు గుదిసె నాసారవృష్టి, బయటఁ బద్మాసనస్థుఁ డై పల్లటిలని
యత్తపోధనవర్యుపై నతని కదియ, చిరతపోరాజ్యపట్టాభిషేక మయ్యె.

25

హేమంతర్తువర్ణనము

ఉ.

అంతఁ గ్రమంబుతోడ శరదంతమునం బరిముక్తమై జలం
బంతయుఁ జెల్లుటం జులుక పై తెలు పైనమొయిళ్లు గాడ్పుచే

నెంతయు ధూళి యై విరిసి యీగతిఁ దూలె నొకో యనంగ హే
మంతమహోదయంబున హిమంబు తమంబుగ ముంచె లోకమున్.

26


క.

కలయ జగ మెల్ల ముంచిన, బలు వగునమ్మంచులోన భావింపఁబడున్
వెలుగులఱేఁ డొకవేళ, న్వలిపపుఁదెరలోనిదర్పణంబును బోలెన్.

27


క.

దీపితముక్తాహారముఁ, బాఁపినదోషంబు తలఁపువాఱినఁ బశ్చా
త్తాపమున నొక్కొ సతులకుఁ, బాపటముత్తియము లయ్యెఁ బ్రాలేయంబుల్.

28


క.

వలువ దొలంగుట కుల్కుచుఁ, బులకలు పుంఖానుపుంఖముగ భీతి మదిం
దలకొనఁ ద్రిలోకి వడపడఁ, జలియించెన్ శిశిరనూత్నసంగమవేళన్.

29


క.

చెప్ప నశక్యం బగుచలి, యుప్పతిలం బాలవృద్ధయువజనములకుం
దప్పక శరణము లయ్యెం, గుప్పసములు ముర్మురములు గుచకుంభములున్.

30


ఆ.

అట్టిశీతవేళయందుఁ గుత్తుకబంటి, నీటఁ దపము చేసె నిష్ఠ నతఁడు
నిజతపోగ్నివలన నిఖిలలోకము శీత, భావ మెఱుఁగ కాత్మఁ బరితపింప.

31

నారఁదుడు మాంధాతృతపశ్చరణము నింద్రుని కెఱిఁగించుట

తే.

ఇట్లు దప మాచరింప మహేంద్రుఁ డున్న
కొలువునకు నేగి కయ్యపుఁగూటితపసి
యతఁడు గావించుపూజన మంది కలదు
చింతనం బొండు వలయు నేకాంత మనిన.

32


క.

ఏకత మని వినిపింపఁగ, నేకతమో? యనుచు సంళయించుచు వేవే
పాకారి కొల్వు వీడ్కొని, యేకాంతమునందు నతని నే? మని యడుగన్.

33


క.

ఓయమరేశ్వర! యిట ము, న్నేయుగములఁ గనియు వినియు నెఱుఁగము వినుమో
హో! యిదె మాంధాతృమహీ, నాయకుఁ డుగ్రముగఁ దప మొనర్సఁగఁ గంటిన్.

34


అతులయోగసమాధిచే నత్తపస్వి, నిశ్చలుం డని వేఱ వర్ణింప నేల
యతనిఁ గనుఁగొన్నయంత నత్యద్భుతముగ, నిశ్చలుం డెంతవాఁ డైన నిర్జరేంద్ర!

35


తే.

తలఁపులోపలికోర్కి తీవలు ఫలింప, మొదలఁ దగఁ బల్లవించినమురువుచూపు
సంతతస్నాననియమైకశాలి యతని, పాటలాంశుజటాచ్ఛటాప్రాంచలములు.

36


ఉ.

హెచ్చుతపోగ్ని యప్పు డపు డీనెడుపిల్లలువోలె నల్గడం
జిచ్చు లెలర్ప నుంగుటము చేతన నిల్చి ఖరాంశుమూర్తిపై
వెచ్చనివేళఁ బ్రత్యహము విచ్చి తనర్చుట గాని మోడ్పమిన్
నిచ్చయ మమ్మహామహుని నేత్రము లబ్జము లౌట వాసవా!

37


ఉ.

కర్తవు గాన నిక్కముగఁ గన్నతెఱం గెఱిఁగింతు నీకు సా
ర్వర్తుకపుష్పసంపదల రంజిలుతద్వనపాటి నందన

స్ఫూర్తి వహించు నిట్లు బలసూదన తావకలక్ష్మి తత్తప
స్ఫూర్తికి మెచ్చి తాన చనఁ బూని పదం బిడి యున్నదో సుమీ!

38


తే.

అసమసింహాసనస్థుఁ డై యఖిలరాజ్య
వైభవంబులు గైకొంచు వఱలువాఁడు
నియతిమై గాలి గ్రోలెడు నేఁడు నహహ!
యధిప! యతఁడు మహాభోగియగుట నిజము.

39


ఆ.

కోర్కి వ్రేఁకమునను గులశైలమునుఁ బోలె, నిశ్చలత నతండు నిలిచెఁ గాక
భృశతపంబువలనఁ గృశుఁ డతం డొకమంద, పవనుచేతఁ నెగసి పాఱఁ డెట్లు?

40


ఉ.

శి ష్టగునత్తపస్విజనశేఖరుఁ డుగ్రతపంబు చేఁ బద
భ్రష్టునిఁ జేయఁగాఁ దలఁచి బ్రహ్మహరాదులలోన నొక్కయు
త్కృష్టునిమీఁదఁ దాను జగతిం గలవైరము గొంట యెల్ల వి
స్పష్టము గాన లేదు మృగజాతివిరోధము తద్వనంబునన్.

41


క.

ఏల పలుమాట? లనిమిషపాలక ! యెల్లింట నేఁట ఫలియించుఁ దదు
త్తాలతపఃకల్పకమున, రాలెడువడపిందె నీదురాజ్యం బనఁగన్.

42


తే.

ఖచరవర! చెప్పితిమి నీకుఁ గన్నతెఱఁగు, చిత్తగించి ప్రతిక్రియ సేయు మిఫుడ
యనుచు వీడ్కొని నారదుం డరుగుటయును, డెందమునఁ జాలఁగలఁగి పురందరుండు.

43

ఇంద్రుఁడు మాంధాతృతపంబుఁ జెరుప నచ్చరలం బంపుట

క.

మంత్రుల దిక్పాలుర నయ, తంత్రజ్ఞులఁ బిలిచి కూడి తానున్ వారున్
మంత్రపరు లై తదీయని, యంత్రంబునఁ బిలువఁ బనిచె నపు డచ్చరలన్.

44


సీ.

విధివత్సమాపితవివిధయజ్ఞఫలంబు, లుంకువ యైనయేణాంకముఖులు
పటుసంగరాంగణప్రాణదానంబులు, రోవెల యైనమెఱుంగుఁబోండ్లు
నిరుపమతమతపఃపరమపుణ్యంబులు, కట్టడ యైనశృంగారవతులు
కల్పోక్తతీవ్రనైకవ్రతాచరణముల్, మూల్యంబు లైనయంబుజవదనలు


గీ.

పట్టుఁగొమ్మలు రమణీయభావములకు, జన్మభూములు తారుణ్యసంపదలకుఁ
బ్రాప్యదేశంబు లతులాభిరూప్యములకు, వచ్చి రచ్చర లనిమిషస్వామికడకు.

45


ఉ.

పంకరుహాయతాక్షులు త్రపావినయంబుల ఱెప్పపాటునం
బొంకము చూపుచూపుగమిఁ బూజ యొనర్చుచు బాహుమూలదీ
ప్త్యంకురహేమనిష్కనిచయంబు లుపాయన మిచ్చి కంకణ
క్రేంకృతు లుల్లసిల్లఁగ మొగిడ్చిరి చేతులు దేవభర్తకున్.

46


ఆ.

జంభరిపుకొల్వు రంభాదిసతులచేతఁ, బంచసాయకసాయకప్రాయ మయ్యె
వారిఁ గనుఁగొన దిక్పాలవరులమనము, పంచసాయకసాయకప్రాయ మయ్యె.

47

క.

ఉల్లము వే ఱైనమరు, ద్వల్లభుఁ గని రంభ యపుడు దప్పక రామా
పల్లవకరముఖవీణా, వేల్లితతానప్రతానవినిమయఫణితిన్.

48


ఉ.

దేవ! సురాధినాథ! భవదీయమనోబ్జమునందు వింతగా
విధి జింతిలంగఁ గత మెయ్యది? నేఁడు తపోనిమి త్త మెం
దేవెడవార్త గల్గెనొ యదేనిఁ దపోధనశుద్ధచిత్తము
క్తావలి గ్రువ్వఁగా గుణము లౌట యెఱుంగవె మత్కటాక్షముల్?

49


సీ.

పంచాగ్నిశిఖలచేఁ బరితపింపనివారి, విరహాగ్నిశిఖలచే వేఁచి విడుతు
వర్షాంబుధారల పడిఁ గలంగనివారి, మోహదృగ్ధారల ముంచి కలఁతు
మంచుచిల్కుటకు రోమాంచ మొందనివారి, ననుపు పుట్టింతు లేనవ్వు చిలికి
సతతోపవాసు లై చవులు డించినవారిఁ, దవులింతు నధరామృతంబుచవులఁ


గీ.

గాదు లక్ష్యంబు నాకు లోకత్రయంబు, పలుక నేటికి బడుగుతాపసులకధలు?
నన్నుఁ జూడక నాపేరు విన్న మాత్రఁ, బల్లవింపవె రాతిరూపంబు లైన.

50


తే.

కార్య మెఱిఁగినఁ దీర్చియ కాక నీదు, సన్నిధికి వత్తుమే మేము జంభమథన!
యింక నైనను బంపు మమ్మింతనుండి, మృగ్య మగుఁ గాని జగతి వైరాగ్యపదము.

51


చ.

అన విని సంతసించి త్రిదశాగ్రణి లోనికలంకు దేఱి యా
నన మెగయించి మించి చిఱునవ్వు దొలంకెడుసాదరావలో
కనములఁ జూచుచుం బలికెఁ గామిను లిందఱు మీ రమోఘసా
ధనములు గల్గి నాకుఁ గలదా మదిలో నణువంత వంతయున్?

52


క.

పోలించి చూడ నఖిలో, త్తాలం బగునాకనామదైవతలక్ష్మీ
లీలాసౌధము నిలిపిన, మూలస్తంభములు గారె? ముద్దియలారా!

53


తే.

అద్రిపక్షాభిహతిమాత్ర కశని గాని, యహహ! ప్రతిపక్షపక్షాభిహతికి నెల్ల
సంతతము మాకు నమ్మినసాధనంబు, చలితభవదీయవీక్షణాంచలము గాదె?

54


ఉ.

ఆరసిచూడ వేదములయట్ల మనంబునఁ దోఁచి యున్నశృం
గారరసాధిదేవతలఁ గంజవిలోచనలార! మిమ్ముఁ బెం
పార సృజించెఁ గాక తనయంతన యేని గణింప నెట్టు లం
భోరుహసూతి మీభువనమోహనరూపవిలాససంపదల్?

55


ఉ.

గట్టిగ నిట్టిచోట ధృతికంకటముల్ విదళింప నేర్చు మీ
యట్టియమోఘసాధనములందుబఁ గాక జగత్త్రయీజయం
బెట్టు ఘటించు మన్మథున? కింతయు నిక్కువ మిట్లు గానిచోఁ
బట్టినఁ గందుపువ్వు లొకబాణములే యలశంబరారికిన్.

56

ఆ.

ఇట్టిమిముగుఱించి హీనకార్యం బైన, మాకుఁ బ్రళయ మనుచు మగువలార!
భయ మొనర్చెఁ గానఁ బనిచెద నొక్కకా, ర్యమున కరుగవలయు నదియు వినుఁడు.

57


వ.

మహీమండలంబున నయోధ్యాప్రాంతంబునం దమసాసరయూమధ్యంబున మాంధాతృ
మహీవరాగ్రణి యుగ్రతపం బొనరించుచు నున్నవాఁడు. అతనినిష్ఠకు నంతరాయంబు
ఘటియించి రండు పొం డని సంభావించి గంధర్వులం గాపుగాఁ జన నియమించి
వీడ్కొలిపిన.

58


తే.

ప్రమదమునఁ బొంగి పాణిపద్మములు మొగిచి, యేగుదెంచుసుపర్వపర్వేందుముఖుల
విభునికంటె నపూర్వభూవిహరణేచ్ఛ, లపుడు పురికొల్పె విజయప్రయాణమునకు.

59


క.

సురరమణీజనవిద్యు, త్స్ఫురణావిర్భావమునకు సూచక మగుచున్
మొరసెం దత్ప్రాస్థానిక, మురజధ్వనిగర్జ లఖిలమోహనభంగిన్.

60


తే.

స్తనితగతశంఖమర్దళధ్వానమునకు, నుబ్బి పురివిచ్చి యాడుమయూరశిశువు
కడప దిగకుండి యానవిఘ్నము ఘటించెఁ, బయనమై వచ్చు నొకమరుత్పద్మముఖికి.

61


ఉ.

వల్లభుహస్త మూఁది సురవారవిలాసిని యోర్తు వచ్చి శో
భిల్లువిమాన మెక్కి మణిభిత్తిపయిం దననీడ దోఁచుటం
బల్లవధూర్తు మున్నుగ సపత్ని నయించితె యంచుఁ గిన్పునం
బల్లవితాక్షి యై దిగియె భావమునం బరితాప మెక్కఁగన్.

62


క.

కొలికిఁ దగుల్బమి నొక్కతె, మొలనూలు పదాబ్జములకు మొరయుచు జాఱెన్
ఫలియింపదు పయనం బిది, వల దనుచుం గాళ్లఁ బెనఁగువైఖరి దోఁపన్.

63


క.

ఉర్వీస్థలిపై వేడ్క న, పూర్వవిహారములు సలుపఁబోయెడుతమి లోఁ
బర్వగఁ శకునము దలఁపక, గర్వంబున వెడలి రమరకాంతాజనముల్.

64


తే.

అబ్జభవుపట్టి కంతరాయంబు గొలుప, వెడలి రచ్చర లవ్వేళ వేల్పుఁబ్రోలు
ఘనతదీయతపస్సమాకర్షణమున, వైంద్రవిభవాధిదేవత లరుగుమాడ్కి.

65


తే.

వాసవునివీటివారవిలాసవతులు, తీవ్రభానునిఁ గదియ నేతెంచి రంత
నతనిఁ జొరఁగోరి యమవస యందుదాఁకఁ, గ్రమ్మి చనుదెంచుబహుచంద్రకళలువోలె.

66


క.

సరికడచి వచ్చునపు డ, చ్చరపిండు వెలింగె మున్ను సంపూర్ణసుధా
కరమండలమును బోలెన్, ఖరకరబింబమున నేఁడు గలిగెద రనఁగన్.

67


తే.

పాసి చనుటకు నోర్వ కచ్చరలు నిలుప, వేఁడి పట్టంగ నిగిడించువిధము దోఁప
భానుకరసంచయము తద్విమానరత్న, కాంతిసంయుక్తిదీర్ఘమై కాన నయ్యె.

68


సీ.

బలిదాతృదానసంభవకీర్తిలేఖిక, మురదైత్యభిత్పదాంబుజమధూళి
విధికమండలుపయోనిధిసుధారసధార, జగదండఖండకచ్ఛత్రయష్టి
మదనభేదనశిరోమందారమాలిక, సగరసంజీవనౌషధిమతల్లి
కనకాద్రిదండసంకలితకేతనశాటి, హారినభోంతరహారలతిక

గీ.

జంభశాసనపురమణిసాలచక్ర, మండలీకృతనిజభోగకుండలీశ
ముచ్యమానవినూత్ననిర్మోకయష్టి, యచ్చరల కంతఁ జూపట్టె నభ్రగంగ.

69


చ.

కనకమయాంబుజప్రసవగంధము లానియు బిందుపంక్తిచే
ననయము దొప్పఁదోఁగియును నభ్రసరిత్సవనంబు లప్సరాం
గనలముఖాబ్జసౌరభము ఘర్మజలంబులుఁ గ్రోలెఁ గ్రొత్త లై
ఘనతరలాభముం గలుగఁ గైకొనరే ధర నెంతతృప్తులున్?

70


తే.

కూడి జలదేవతలు మమ్ముఁ గూడవచ్చి, ఇంత చక్కనివారంచు నెపుడు వెఱఁగు
దనుక మిన్నేఁటఁ దమనీడఁ దార చూచి, ముచ్చటలఁ బొంది రప్సరోముగ్ధ లపుడు.

71


చ.

త్రిదళతరంగిణిం గడచి తీవ్రతమై దిగి వచ్చి దేవతా
సుదతులయూర్పుఁ దానిచవిచోఁకున వెంటన వచ్చెఁ దేంట్లు త
ద్వదనసనాభివర్గము నవశ్యతఁ జంపఁగఁ బంపు పూని య
న్నదికమలాధిదేవతల వచ్చిననెయ్యురు వచ్చిరో యనన్.

72


ఉ.

వచ్చువిమానపంక్తులజవంబున జల్లున మున్ను పాయ గా
చినవారివాహములు వెండియు వెంటన రాఁ దొణంగె న
య్యచ్చరపిండుఁ జూచి తమ రప్పుడు వాయుట నాత్మకీయవి
ద్యుచ్చయశంకమై తగిలి తోడనె కుయ్యిడుమాడ్కి మ్రోయుచున్.

73


ఉ.

మందసమీరణక్రియల మార్గపరిశ్రమశాంతిగాఁ బయో
బిందువిముక్తి నింపుమదిఁ బెంపుచు నీడలు వేయఁ దోయభృ
ద్బృందమునందు మెల్లనిగతిం జనఁగా నియమించి రప్డు సం
క్రందనవారకామినులు కామగ మైనవిమానసంఘమున్.

74


చ.

పొదిగొనుచూడ్కుల న్మెఱచి పోనిమెఱుంగులు గా నిగుడ్చుచుం
జెదరనిభూషణప్రభల జిష్ణుధనుశ్శతకోటిఁ బన్నుచుం
ద్రిదశపురీవిలాసినులు జిల్లమిగా జనియింపఁ జేసి రం
బుదముల కెల్ల న ట్లొకయపూర్వమనోజ్ఞవిలాససంపదల్.

75


తే.

అద్రిశృంగము లనుశంక నధిగమింపఁ, గోరియునుబోలె బలుమాఱు వారిధరము
లాత్మపావనంబుచేత నయ్యమరసతుల, పయ్యదలు దూల్చి కుచములు బయలుపఱిచె.

76


చ.

తపమునకుం గుశాసనము దానపువిత్తు ఫలించుపాదు ని
క్కపుసుఖసిద్ధి గోరి వెదకం దగునాకర మబ్జజాదివి
ష్టపముల కెల్ల సంబళ మొసంగెడుపాలెము మర్త్య మంత వే
లుపువెలమచ్చెకంట్లకును లోచనగోచర మయ్యె దవ్వులన్.

77


వ.

తదనంతరంబ.

78

సీ.

 సంభవించె నపూర్వషట్పదీగీతులు, లలితమంజీరఝళంఝళములు
ప్రాపించె నభినవపరభృతారవములు, కాకలీవ్యాహారకలకలములు
బుగులుకొనె నవీనపుష్పసౌరభములు, గుంభితాస్యామోదఘుమఘుమములు
కలిగెఁ దద్ధ్వనికి నుజ్జ్వలపల్లవద్యుతుల్, శయకుశేశయవికాసచకచకలు


తే.

భూవరాన్వయతిలకతపోనివాస, మగుట నొదవినభాగ్యోదయమునఁ బోలె
నపుడు సరయూనదీతీరవిపినమునకు, నమరపురవారలలనాసమాగమమున.

79


వ.

ఇట్లు తపోవనప్రాంతంబున విడిదిగా విడిసి.

80

మాంధాతృతపోవనంబున రంభాదులు శృంగారక్రీడ లొనర్చుట

మ.

కర మాశ్చర్యము గాఁగ నచ్చరలు శృంగారోజ్జ్వలాకారు లై
సరసక్రీడలఁ జొచ్చి రానృపతపస్సంస్థాన ముచ్చైరట
చ్చరణాంభోరుహనూపురధ్వనుల నాశ్చర్యానుమోదంబు లై
హరిణీసంఘము దర్భగర్భితముఖవ్యావృత్తి నాలింపఁగన్.

81


సీ.

పరిమళం బంటక పరువంపుమొగ్గల, కెలయించుతనుగాలిపొలసమునకుఁ
దమలోన జాతివైరము డించి దూర్వముల్, మెట్టనిమృగజాతిమెలఁకువలకుఁ
బక్వసార్వర్తుకఫలపుష్పములు గల్గు, తరువులనీడలు దరలమికిని
బగలు రే మొగుడనితొగలఁ దమ్ములఁ గ్రాలు, కొలఁకులు గడ లెత్తి కలఁగమికిని


తే.

వెఱఁగు దనుకంగ నిజతపోవిభవ మాత్మ, మెచ్చి పొగడుచుఁ జనుదెంచునచ్చరలకుఁ
జిత్తవీథుల జనియింపఁ జేసి శంక, నపుడు గనుపట్టె యువనాశ్వనృపతిపట్టి.

82


ఉ.

చెంతల నంతరాయ మనుచీఁకటి పైకొననీక తేజ మా
క్రాంతదిగంత మై వెలయ గాడుపు సోఁకనిదీపమట్ల వి
శ్రాంతసమాధిసంగతి నచంచలుఁ డైనతపస్వియందుఁ ద
త్కాంతలయత్నముల్ విఫలకార్యము లై విలసించె నయ్యెడన్.

83


చ.

ఒకయడు గెత్తి జంగ యిడ నూరురుచుల్ తలచూపఁ దీవ యం
దుకొన నిగుడ్చుట న్వికచదోర్లతమూలము చూడ్కి చూఱగా
నకనక కౌను సాఁగి నదినాభి బయల్పడ నీవి జాఱ మీఁ
దికి మొగ మెత్తి యొక్కసుదతీమణి చేరువఁ గోసిఁ గ్రొవ్విరుల్.

84


చ.

పదముల కెంపునన్ బయలు పల్లవితంబుగ రాకపోకలన్
వదనముతీవఁ జందురునివైఖరి చూపఁగ దూఁగఁచూఁగఁ బ
య్యద పలుమాఱు గాలి నెగయం జనుగుబ్బలు తొంగిచూడఁగాఁ
ద్రిదశవధూటి వేరొకతె తీవల నుయ్యల లూఁగె వేడుకన్.

85

చ.

కొలఁదిగ నీడ్చి యీడ్చి కొనగోళ్ళ మెఱుంగు దుఱంగలింపఁ గా
వలపల దాపల న్నిగిడి వాలికచూపులు తీఁగె సాగు గు
బ్బలయిరుగ్రేవల న్నఖరపంక్తి బయల్పడఁ జేతు లార్చుచున్
వెలఁది యొకర్తె కట్టెదుర వేనలి చి క్కెడలించె సోలుచున్.

86


ఉ.

పట్టినహస్తకాంతి మును పల్లవితం బగువీణె పాటచేఁ
బుట్టుచిగుళ్ల రెట్టి యగుపొల్పు వహింప మొగంబుతావికిం
జుట్టినతేంట్లకున్ శ్రుతులు చూప సుధారసధార పాలికం
బట్టి మృదుస్వరం బెసఁగఁ బాడె నొకర్తు మనోజ్ఞభంగులన్.

87


క.

ఈరీతి వివిధమధురా, కారంబులఁ దమవిలాసగరిమలు నెఱపన్
మేరుగిరిలీల మలయస, మీరణగతులకునుబోలె మెదలక యున్నన్.

88


సీ

కుసుమపల్లవభాసికుంజపుంజంబులు, రత్నచిత్రితమందిరంబు లయ్యె
నుత్తాలధరణీరుహోత్కరస్థలములు, నవమణిస్తంభమండపము లయ్యెఁ
బావనస్నానార్థబహుపల్వలంబులు, కృతకకేళీసరోవితతు లయ్యె
విహరమణానేకవిధశకుంతంబులు, తరుణపారావతద్వయము లయ్యెఁ


తే.

దీవ్రనియమానుకూలప్రదేశ మైన, యర్కకులమౌళి నివసించునాశ్రమంబు
హాళిరతిఖేలనోచితహర్మ్య మయ్యె, మఘవదిందీవరాక్షులమాయవలన.

89


వ.

అనంతరంబ సమయసముచితసన్మార్గధూపలేపస్రగ్బలిప్రకరవర్ణనోపశోభితం బై తపస్వి
రంగంబు విలాసినీలాస్యరంగం బగుచు లోకవిలోచనోత్సవంబు నాపాదింప నను
రూపరూపానవద్యవాద్యధ్వనులతోడ నవినూత్నవిచిత్రయవనికాభోగంబు నభోభా
గంబు నలంకరించె. నృత్తవిద్యాచాతుర్యధుర్యుం డగునాచార్యుండు కట్టెదుర మధు
రగంభీరస్ఫుటాక్షరంబు గాఁ బుష్పాంజలిక్షేపణంబుతోఁ బ్రస్తుతోచితదండలాస్య
ప్రస్తావంబు చూపి యవనికాపనయపూర్వకంబుగా షోడశాష్టచతుర్ద్వయద్వయైక
క్రమసంఖ్యాకంబు లగుమృదంగకాహళకాంస్యతాళహుడుక్కాకరడావాద్యవిశే
షంబులయందు నేకైకమేళాపరవాదనోపరిపరిస్ఫురితంబుల గుఱిగవణిలాగుమోడి
బంధవతికుండల్యాదివాదనభేదంబుల వివిధమధురగంభీరఘోషంబు లఖిలచేతనశ్రవ
ణేంద్రియమోహకంబు లయ్యె. ఉపరతము రజకరణాహుఢక్కాదినాదంబులు
నతిచతురవాంశికోపదీయమానతానోపగీయమానవీణాతిపేశలకలక్వాణప్రాణాయ
మానంబులం బ్రోజ్జ్వలాలప్తిపూర్వకంబులు నై కాక్వాదిదోషరహితకలకంఠీకంఠ
గీయమానగేయంబు లనుపమేయంబు లై నిఖిలచేతన చేతన స్రావకంబు లయ్యె. మల
యపవనచపలశిలీముఖముఖరస్థలనలినీకులవిలాసాపహాసకంబు లయి యనురూపాధిక
నూపురఝుళంఝళశింజితమంజులంబులు గావించి విచిత్రరతిప్రవృత్తంబు లగు నేప

థ్యాంతరితపాత్రంబులఁ గించిల్లక్ష్యమాణపదపల్లవాంచలంబులు దిదృక్షుజనహృదయో
న్మాదకంబు లయ్యె. గవుసెన దివిసినం గనుపట్టువిచిత్రచిత్రరూపంబులరూపంబున
యవనికాభోగంబు నపనయింప నిశ్శబ్దభూషణంబును నిర్వికృతినియతసకలాంగకంబు
నగునిజనైశ్చల్యంబు నిర్భరం బై దైవాఱి పారవశ్యచ్ఛలంబున పశ్యజ్జనంబులపయిం
బడం బిరిగొనుప్రవాళదండికాద్వయీమండితపుష్పాంజలివిలసిత లగునర్తకీపరంపర
లఖిలచేతనచేతోవలోకనగ్రాహంబు లై యావిర్భవించె. ద్రష్టృజనకౌతుకావేశోద
యసమర్పితికర్పూరధూపోపమానపునఃకల్పితాతిసూక్ష్మయవనికావ్యపాయంబున లఘు
మేఘావృతి దొఱంగి మెఱుం గెక్కుశారదనక్షత్రంబులచందంబున నిర్నిమేషనిరీక్షణ
పాత్రంబు లై పాత్రంబు లనురూపనేపథ్వస్ఫురితంబులు సమపాదస్థానకస్థితంబులుం
గీతానుగుణాకంపితశిరస్కంబులు నగుచు విలాసగతిం బుష్పాంజలిక్షేపణం బొనరించి
నిఖిలలోకవిలోకనోపాస్యంబు లైనదండలాస్యంబులకు నుపక్రమించి రప్పుడు శిరో
వక్షఃకరపార్శ్వకటిపదాభిధానంబుల నేత్రభ్రూనాసాహనుకపోలాధరనామధేయం
బులం గ్రీహబాహుతుండోరుజానుజంఘానామంబులం గల్గునంగోపాంగప్రత్యంగం
బులు తాళలయానుకరణవిశిష్టచేష్టావిశేషంబులయందుఁ బ్రత్యేకంబ యథోక్తంబు
లగు త్రయోదశవిధశిరఃప్రయోగంబులు పంచప్రకారవక్షోవిలసనంబులు చతుష్షష్టి
భేదప్రశస్తహస్తాభినయంబులు నంగుళిక్రమవర్తనోపచితచతుర్విధహస్తాభినయాంత
రంబులుం బంచపార్శ్వవిభ్రమంబులు బంచవిధకటినటనంబులు నవసంఖ్యాకరచరణ
విన్యాసంబులుం జతుర్భంగికచరణ విన్యాసాంతరంబులునుం బంచప్రకారవక్షోవిలస
నంబులును షట్త్రింశద్దృష్టివిశేషంబులు నుపాంగభేదోక్తచతుర్విధముఖరాగయోగం
బులు నష్టధాబహుస్ఫురణంబులుఁ బంచప్రకారోరుసంచలనంబులును సప్తవిధజాను
విలాసంబులును బంచవిధజంఘాప్రవర్తనంబులును వెండియు దండలాసకాంగోక్తకం
బులగు త్రింశత్స్థానకంబులు త్రింశచ్చారిభేదంబులు భ్రమరిసప్తకంబునుం గరణవింశ
తియు నంగహారదశకంబును మఱియు ముఖకసముఖసౌష్ఠవలలితభానకౌతుక్యనుమాన
ప్రమాణఝంకారవాసురేఖతాంగానంగడాలఢిల్లాయీనవణికిత్తుతరహారోల్లాసవేవతన
నిలయపయపాటన సంధిస్థాపనచొక్కినామంబులం గలుగులాస్యాంగచతుర్వింశతివిశే
షంబులు నాదిగాఁ గలుగునసంఖ్యేయాభినవాభినయంబులు యథాలక్షణంబులు
యథాక్రమములు యథారసంబులుం గా నృత్యప్రవర్తనంబున నభినయించుచుఁ
బాత్రగుణవ్యక్తిప్రయుక్తంబులు శిల్పవైచిత్రీసమాలోచనసూచకంబులుం బరస్పర
సామ్యలక్ష్మీప్రదర్శకంబులు బహుపాత్రోపయోగప్రయోజనంబులుం గ్రియామాత్స
ర్యమాధురీధురీణంబులును సభ్యక్షేత్రచమత్కారకారకంబులు నై సమవిషమభేదద్విధా
కారంబు లగువివిధవిచిత్రబంధప్రచారంబుల విలసింపం జొచ్చి రండు నూర్వశియుం
బూర్వచిత్తియు మేనకయు సహజన్యయుం బ్రమ్లోచయు ననుమ్లోచయుఁ బుంజికస్థ

లయు గృతస్థలయు విశ్వాచియు ఘృతాచియు మనోరమయు రంభయుఁ దిలోత్తమ
యుఁ జంద్రరేఖయుం బంచచూడయు మిశ్రితయు మిశ్రకేశయు మొదలుగాఁ
గలిగినచతుర్దశవంశావతీర్ణంబులు షోడశకోటిసంఖ్యాకంబులు తుల్యరూపవయో
విభ్రమంబు లై చరింపఁ బ్రపంచమనోపంచకంబు లగుదివ్యాప్సరోజనంబులు శంబ
రారికిం దోడు చూపుచుఁ దదీయమూలబలంబు చందంబునం బర్జన్యునకుఁ
దోడుచూపుశంపాపరంపరలవిధంబున వసంతునకు నెన్నిక యిచ్చుపుష్పలతికలవిలస
నంబునం గ్రామంబున జతురష్టషోడశద్వాత్రింశచతుష్షష్ట్యాద్యుత్తరోత్తరగణనా
వృద్ధివిశేషంబులం బంక్తిబంధబంధురగతి నద్భుతాద్భుతంబుగా నావిర్భవించుచు దండ
యుగ్మంబుల నంజలిపుటంబులు ఘటియించుచుఁ బరస్పరసామ్ముఖ్యంబునం బొలు
చుచు నితరేతరస్థితస్థలవినిమయంబు చూపుచు నిరంతరనూపురఝళంఝళశింజిత
మంజులంబుగా సవ్యాపసవ్యపార్శ్వంబులం గ్రమప్రసృతపార్ష్ణిప్రచారంబులు
గొలుపుచు వాద్యతాళయతిమానంబు లాకర్ణించుచుఁ దదనుగతంబు గా నర్త
నౌత్సుక్యజచిత్తవికారానుకారం బగుశరీరపారవశ్యంబు నెఱపుచు నాకులనర్తనంబు
లం బ్రవర్తించుదు మండలప్రచారంబుల సంచరించుచు వాద్యానుకృతంబులు గాదండ
తాళంబు లిచ్చుచు నాభిముఖ్యపరావృత్తముఖంబుల దండతాడనంబులు గావిం
చుచు వాద్యతాళానుకూలంబుగా నితరేతరదండానువిద్ధస్థానకంబులు సంఘటించుచు
హస్తచలనవలననర్తకీవర్తనంబుల వర్తించుచు లయత్రయసమన్వితంబుగా వివిధబంధ
బంధురప్రచారంబుల విహరించుచుం గేవలయతిమానంబున నృత్తబంధప్రవర్తనం
బుల వినసించుచు వృత్తప్రయోగబంధప్రయోగంబులు రెంటియందు నాదిమధ్య
నిర్వాహంబులం గ్రమంబున మృదుమధ్యద్రుతగతిభ్రమరీవిశేషంబులం బరిభ్రమిం
చుచుఁ బ్రతిగతిసమాపనంబు నతికోమలంబుగా స్థానకోపక్రమంబు నెఱపుచు నుప
క్రాంతభావంబుల రసోత్తరంబుగాఁ గళాసించుచుఁ బ్రవృత్తైకమార్గంబు నందంద
యమందరసోదయవశంబున నూత్ననూత్నంబుగా ననుక్తవిచిత్రాంతరమార్గాంతరం
బులం బ్రపంచించుచు ఋజుచతుష్కచక్రాకారగతిత్రయీప్రారబ్ధంబులు పరస్పర
వ్యతిలంఘనమార్గరూపంబులు నై సారిచంద్రకళాబంధుసారమురడిహంస లీలారథాం
గాభరణనారాయణవల్లభ చతుర్ముఖరంగలక్ష్మీరంగమనోహరాది వివిధమధురానవధికబంధ
ప్రచారంబుల నటియింపం జొచ్చిరి. ఇవ్విధంబున సౌందర్యంబులకు సాఫల్యంబును
దారుణ్యంబులకుఁ గృతార్థతయు లావణ్యంబులకు నుత్తేజనంబును విభ్రమంబులకు
నుపాదానంబును నేపథ్యంబులకు విషయంబును నై నర్తకీవిలోకనజనితం బైనశృంగా
రంబునుం దదీయవివిధాపూర్వనృత్తబంధవిషయం బైనయాశ్చర్యంబును దదన్యలాసి
కాంతరవిషయం బైనహాస్యంబును దదితరవిషయం బైనబీభత్సంబును దదీయపయోధ
రభరభుగ్నావలగ్నశంకితభంగీవిషయం బైనభయానకంబును రసాతిరేకసద్యస్సమీహిత

తత్పరిరంభదౌర్లభ్యవిషయం బైనకరుణయుఁ దదవలోకనవిరోధినిరసనవిషయంబు
లైనవీరరౌద్రంబులును ఉపద్రష్టలయందుఁ బరిస్పష్టంబులు గావించురాసక్రీడావిశే
షం బైనయాదండికావృత్తంబు యతిమానమానితం బగుట సుకవికవితయుం బోలె,
భ్రమవిహారమనోహరం బగుట వసంతాగమంబునుం బోలె, ప్రకటితకరణపాటవం
బగుట యౌవనోదయంబునుంబోలె, బహువిధబంధబంధురం బగుట నిధువనక్రీడ
యుంబోలె, నిశ్చలీకృతనభశ్చరవిమానంబును నిరుక్తదూర్వాచర్వణమృగీసంతానంబును
పల్లవితనస్థాణుకులంబునుం బరిస్రావితపరిసరనగోపలంబునుం గా విశ్వసమ్మోహనం
బగుచుఁ బ్రవర్తింపం గొంతకాలంబున.

90


ఉ.

యోగసమాధి చాలి నృపయోగికులాగ్రణి యంత దివ్యకాం
తాగమనప్రయోజనము నాత్మ నెఱింగి బలారికల్పితో
ద్యోగముఁ గూర్చి నవ్వొలయ నొయ్యన శాంతిసుధానిధాన మై
తీఁగలు వాఱుపార్శ్వగతదృష్టిఁ దగం గలయంగఁ చూచినన్.

91

మాంధాతకు నప్సరసలు శిష్య లగుట

సీ.

రంభ కారంభసంరంభంబు గడివోయె, నూర్వశిగర్వంబు ఖర్వ మయ్యె
మేనక తలఁపులోఁ బూనిక దిగఁ ద్రోచెఁ, దలఁగెఁ దిలోత్తమ తత్తఱంబు
నీచ మై తోఁచె ఘృతాచి యాచరణంబు, ఘోష ముడిగె మంజుఘోషపలుకు
ప్రమోచనకుఁ బర్వెఁ బ్రమ్లానభావంబు, తమియేది కడలకుఁ దారెఁ దార


గీ.

కదుపుఁ బాసినహరిణియై కలఁగె హరిణి, మఱియుఁ దక్కినవేల్పుఁగ్రొమ్మెఱుఁగుఁబోండ్లు
కనదహంకారములకు ధిక్కారమైన, నృపతపోధనుచూడ్కి పై నిగుడునపుడు.

92


క.

ఆట లపు డెల్లవారికి, నాటల పట్టయినయప్సరోంగనలయెడం
బాటలు నప్పుడు పరువుం, బాటలు నై పోయె నృపతిభాస్కరునెదుటన్.

93


వ.

మఱియు నయ్యచ్చరలు మచ్చరంబులకచ్చు వదలి పంతంబులపొంతువులు గూడక
భావంబులచేవలు డిగి చక్కఁదనంబులయుక్కు దక్కి చూపులయే పెడలి నవ్వుల
కొవ్వు లఱి సూయలచాయ లుడిగి పరుసంబులు సోఁకినలోహంబులు సువర్ణభావం
బు భజియించినచందంబునం దపఃప్రభావసంపన్నుఁ డగునన్నరేంద్రచంద్రునిదృష్టి
పాతంబున నత్యాశ్చర్యంబుగాఁ జిత్తంబులు విషయనివృత్తంబులు వైరాగ్యతప్తంబు
లు నపవర్గమార్గాయత్తంబులు నై యతం డనిపినం జనక తదీయపరిచర్యతాత్పర్య
పర్యాయంబున.

91


సీ.

విటకచాకృష్టికి విసువు నొక్కలతాంగి, వేలిమికట్టియల్ విఱిచి తెచ్చు
నధిపుమై ముద్రింప నలయు వేఱొకరామ, సుదగోళ్లఁ గుసుమముల్ చిదిమి తెచ్చుఁ
బతియున్నయెడ కేగ బడలుబాలిక యోర్తు, పరవనంబుల కేఁగి పండ్లు దెచ్చు
నెయ్యురు పన్నీట నింప లావఱునొక్క, నెలఁత తీవల కెల్ల నీరు నించు

ననుపుఁబల్లవులకు నర్మోపచారముల్, సేయ సేద నూఁదుచిగురుఁబోండ్లు
చిత్ర మైనతపసిశిష్య లై పరిచర్య, చూపు చుండి రాత్మశుద్ధి గలిగి.

95


క.

చిరకాల మిట్లు వారిం, బరిచర్యలు గొని తపస్వి పర్వినకృపమై
మరలం బనిచిన నంతయుఁ, బురుందరుం డెఱిఁగి యాత్మఁ బొడమినభీతిన్.


ఇంద్రుఁడు మాంధాతపై మేఘములనంప బృహస్పతితో నాలోచించుట

తే.

దిగధిపాలుర నెల్లఁ దోడ్తేరఁ బనిచి, వారు దాను రహస్యవిచారపరత
నుండి వెఱతోడి భయమున నుదిలకొనుచుఁ, బలికె గీష్పతిఁ జూచి యాబలవిభేది.

97


చ.

నరసురదైత్యజాతిజు లొనర్పరె మున్ను దపంబు ధాత్రిపై?
మరునకు లోను గానిధృతిమంతుఁడు గల్గినఁ గల్గుఁ గాక! శం
బరరిపుబంటుగాఁ గొనుతపస్వియుఁ గల్గునె? చూచునంత న
చ్చర లఁట శిష్యు లైరి పెఱసంయమియుం గలఁడే యి టెన్నఁగన్.

98


ఉ.

ఖండసుధాకరాలికలు గాఢవిరక్తిఁ దపస్విశిష్యు లై
యుండిరి పూఁపు దప్పుటకు నుల్లము రోసి రతీశుఁ డిక్షుకో
దండముఁ బుష్పబాణములదండముఁ బాఱఁగ వైచి చేతులం
దండమునుం గమండలువుఁ జాలిచి మస్కరి గాక యుండునే?

99


తే.

కార్య మెయ్యది మనకు నక్కడిఁదితపసి, కంతరాయంబు పుట్టెడునంత గాఁగ
వర్ష మొదవింపఁ బుష్కలావర్తకములఁ బంపుదమె? యన్న విని నవ్వి పలికె గురుఁడు.

100

బృహస్పతి యింద్రునకు మాంధాత వశ్యుఁడు గాఁ డని చెప్పుట

ఉ.

కా దమరేశ! కార్య మది కన్గొన బ్రహ్మకు నైన మన్మథో
న్మాదము గొల్పునచ్చరలమాసస మింతటిలో విరక్తికిం
బాదుగఁ జూడ నేర్చినతపస్విశిఖామణి మింటఁ బన్నునం
భోదకులోదయంబు నలవోకయ నువ్వున బాఱ నూఁదఁడే.

101


ఉ.

అద్రులు మీఁద బడ్డ భర మౌటఁ దలంపరు శూలహస్త యై
భద్ర యదల్చి పైకొనిన భ్రాంతి వహింపరు మేర దప్పి సా
ముద్రతరంగముల్ దిశలు ముంచినఁ జింతిల రన్న వారిదో
పద్రవవృత్తికిం గలఁగఁ బాఱుదురే హరిభక్తినిశ్చలుల్?

102


సీ.

దూషింప నొల్లరు దుష్టాత్మకుల నైనఁ, బ్రతి సేయ నొల్లరు పగతు కైన
నభిలషింపఁగ నొల్ల రాత్మదేహం బైన, వగవంగ నొల్లరు వొగిలి యైనఁ
బట్టంగ నొల్లరు ప్రాణసంకట మైన, నాడించుకొన నొల్ల రలసి యైన
వాదింప నొల్లరు వశ మైనపని కైన, మఱుపెట్ట నొల్లరు మర్మ మైన

హరిపరాయణు లైనమహాత్మజనులు, గాన హరిభక్తినిశ్చలుం డైనయతని
వలనఁ గలుగదు భయ మనునార్త యైన, మనక కా దెల్లచో జీవమాత్రమునకు.

102


వ.

అదియునుం గాక.

103


సీ.

ఎవ్వనిమహిమాబ్ధి కేకశీకరరేణు, పరమాణువులు పరబ్రహ్మముఖ్యు
లెవ్వనియలవోక కిచ్చలోఁదలఁపు లీ, విశ్వజన్మస్థితివిలయవిధము
లెవ్వనికృత్యంబు లిష్టశిష్టావనా, నుగ్రహదృష్టవినిగ్రహమ్ము
లెవ్వనినామంబు లెట్టివారల కేనిఁ, జరభవబంధవిచ్ఛేదనంబు


గీ.

లమ్మహామహుఁ డాదినారాయణుండు, దన కొనర్చినతప్పేని దా సహించుఁ
గాని తనభక్తజనులకుఁ గ్రౌర్యమెపుడు, దలఁచుటయు నోర్వఁ డిది నిశ్చితంబుసూవె!

104


ఉ.

కావున నాగ్రహం బుడిగి కంజవిలోచనుఁ గృష్ణుఁ గానఁ గాఁ
బోవుట కార్య మవ్విభుఁడు పూర్ణకృపామతి మిమ్ము నందఱం
బ్రోవఁగ నత్తపోనియతి పూనిక మాన్పఁగ శక్తుఁ డన్న న
ద్దేవకులాధిపప్రముఖదిక్పతు లందఱు భీతచిత్తు లై.

105


వ.

అట్లుండియు సదుపాయంబు గా నైకమత్యంబు నంగీకరించి యందఱు నప్పుడ కదలి
యుదగ్దిశాభిముఖు లై చని చని.

106

ఇంద్రుఁడు బృహస్పతియనుజ్ఞచే వైకుంఠమున కేగుట

మహాస్రగ్ధర.

కని రంతర్మగ్నభూభృత్కబళనచటులగ్రహసంచారధాటీ
జనితస్పర్దాళువీచీసముదయలహరీసంభ్రమద్భోగిపూత్కా
రనిరంతోత్పాతితక్షీరవితతఘనధారాసహస్రస్వభావా
ఖనదీస్వైరోపగూహోద్గతసుఖసుముఖాకారలబ్ధిం బయోబ్ధిన్.

107


క.

కని యప్పయఃపయోనిధి, యనుభావంబునకు నద్భుతాహ్లాదమునన్
మునిఁగినమనములతోఁ గను, కనియఁగఁ గనుఁగొనుచు మౌళికంపము లొలయన్.

108


తే.

నిర్మల మగుమహాత్ముల నెమ్మనముల, యోగబలమున వెడదోఁచునురగశాయి
యున్నవాఁ డిందు గాఁపురం బన్న నీప, యోంబునిధినిర్మలత యెన్న నలవి యగునె?

109


చ.

ఉదరగతాఖిలుం డగుమహోత్పలనాభుఁడు లో వసించుచోఁ
బొదలుపయఃప్రపూరములఁ బొడ్మెడుతత్పరివాహరేఖ లై
యెదవి యజాండభాండబహిరూర్ధ్వముల న్నటనంబు చూపునీ
యుదధికులాధినాథుమధురోజ్జ్వలసాంద్రయశోవిలాసముల్.

110


తే.

బ్రహ్మరుద్రాదివివిధరూపములచేతఁ, బరమపురుషుండుఁబోలె నిప్పాలకడలి
మధుఘృతోదధిలవణాదిమయతఁ దాన, పెక్కుమూర్తుల విలపించునొక్కఁ డయ్యు.

111

చ.

కరుణయ కాక నన్ను నరికట్టఁగ నీ వొకలక్ష్య మెట్టు? లం
బర మఖిలంబు మ్రింగి యుడుపఙ్క్తులఁ గ్రాసెదఁ జూడు మన్నయ
ప్పరుసున నిప్పయోంబునిధి పల్మఱుఁ జెల్లెలికట్టమీఁదఁ బె
ల్లరుదుగఁ బ్రోవుకొల్పెడు మహామలకోపమమౌక్తికావలిన్.

112


చ.

వెడఁదలు గాఁగవించుచుఁ బ్రవేశతటంబుల నొగ్గి క్రోలి నో
ళ్లడవఁగ వీఁపుచిప్ప లెగయం బడి పింజలు వాఱ మింటిపై
వెడలునదీప్రవాహములవెంటనె వెల్వడఁ గాంచు నిమ్మహా
జడనిధిలోనిశాబకఝషంబులు మ్రింగినగర్భశైలముల్.

113


ఉ.

హేల దలిర్ప మి న్నొరసి హెచ్చుముహుర్లహరీవిజృంభణా
భీలతఁ జూచి ముంచు నని బెగ్గిలి వెల్వడి పోవుబాడబ
జ్వాల కిప్పయోంబుధి యొసంగుకృపాయహస్తపఙ్క్తులం
బోలెడుఁ దీరవిద్రుమసమూహశిరఃపతదూర్మిమాలికల్.

114


చ.

ఎడపక యిచ్చుదాతలకు నివ్వలఁ గల్గుచు నుండు నిక్క మి
క్కడలిపయఃప్రపూరము లగణ్యము లైనఘనాఘనంబు లె
ప్పుడుఁ దనియంగఁ గ్రోలికొని పోయి నిరంతరవృష్టి చూపుటం
బొడమినయేఱు లీయుదధిపుంగవునందె గమించి కూడెడున్.

115


తే.

విశ్వవిశ్వంభరకు హారవిలసనంబు, దోఁపఁ జేయుచు నున్నది దుగ్ధవార్ధి
యున్నవాఁ డిందు నిందీవరోజ్జ్వలుండు, నాయకస్ఫూర్తి నాదినారాయణుండు.

116


వ.

అని యనేకభంగులం గొనియాడుచుం జని యప్పయఃపయోనిధానంబునకు నంతరం
గంబునుంబోనిశ్వేతద్వీపంబు లోచనగోచరం బగుటయుఁ బ్రహర్షితాంతఃకరణు
లగుచుం గరకమలంబులు మొగిచి నభోవతరణం బొనరించి బహుసహస్రయోజన
విశాలరమణీయం బైనయమ్మహాద్వీపంబునం జూపట్టు వివిధవిశేషంబు లొండొరులకుం
జూపి చెప్పికొనుచుం గనువారు ముందట.

117

శ్రీవైకుంఠవర్ణనము

మ.

నముచిద్వేషిముఖామరు ల్గనిరి వందారుస్వభూనీలకం
ఠము నభ్రంకషసాలచక్రనవరత్నశ్రీకృతాశావకుం
తము దౌవారికరుద్ధసిద్ధమునిపూర్ణస్వాపకంఠంబు నా
త్మమనఃకల్పితనిర్భరాద్భుతభయోత్కంఠంబు వైకుంఠమున్.

118


క.

కని యంతంతట వినయా, వనతశిరస్కు లయి చేర వచ్చి దిశాపా
లసజనితాహంకృతి నిడి, వనజోదరపారతంత్ర్యవశగాత్మకు లై.

119


సీ.

చక్రభూధరకులస్వాములపెంపునఁ, గనుపట్టుసాలచక్రములపొడవు
నూర్ధ్వాండఖండమునుండుకుంభము లయి, రంజిల్లుబహుగోపురములమురువు

నై కటికంబు మహేంద్రలోకములోని, రమ్యహర్మ్యపరంపరలబెడంగు
నింగి యింతని తెల్పి నిజకింకిణీధ్వనిఁ, జాటెడుకేతనచ్ఛటలసొబగుఁ


గీ.

బురరమాధృతిఘనసారభూష లనఁగ, నమరు నుపకంఠమణితోరణములచెలువుఁ
జూడ్కిగమి నుల్లములతోన చుట్టి తివియ, నాననము లెత్తి కనుఁగొంచు నరిగి మఱియు.

120


సీ.

ప్రసవరసం బాని పద్మినీస్థలములఁ, బ్రణన మావర్తించుబంభరముల
మధురోపననముల మంత్రరాజము గ్రోల్చు, శారికాశుకపికశాబకములఁ
దాపత్రయంబు డిందఁగఁ జిదానందశై, త్యము వెదచల్లుమందానిలముల
సాలోక్యసామీప్యసారూప్యసాయుజ్య, భంగుల విలసించుభాగవతుల


గీ.

సంస్తుతించుదు మెచ్చుచు సంతసిలుచుఁ, గాంచి మ్రొక్కుచు రాజమార్గమున నేగి
ఖచరకులముఖ్యు లల్లంత గాంచి రెదుట, మధుమహాసురవిధ్వంసిమందిరంబు.

121


వ.

కాంచి కదియ నేతెంచి భయాద్భుతావహమస్తకవక్షస్స్థలబాహుచరణాభిరామమూ
ర్తులుం గరాళదంష్ట్రాకరాళాస్యులు వివిధాయుధహస్తులు విచిత్రభూపణాంబర
గంధమాల్యాభిశోభితులు ననుపమానజ్ఞానశక్త్యాదిగుణసంపన్నులు నప్రతిమాష్టవిధై
శ్వర్యధుర్యులు నయుతలక్షకోటిశతకోట్యాదివర్గంబులు నసంఖ్యేయులు నగు
విష్ణుకింకరులును, పూర్వద్వారంబునఁ జండప్రచండాదులును, దక్షిణద్వారంబున
భద్రసుభద్రాఖ్యులుం గుముదకుముదాక్షముఖ్యులును, పశ్చిమద్వారంబున జయ
విజయప్రముఖులును, ఉత్తరద్వారంబున ధాతృవిధాతృప్రభృతులును రక్షింప,
మఱియుం జతుర్భుజులును శంఖచక్రధరులునుఁ బీతాంబరపరికల్పితులునుం
గాలమేఘసంకాశమనోజ్ఞశరీరులును గణసహస్రపరివృతులు నగువైకుంఠనైమా
నికు లనేకులు పరితఃపరిరక్షకులునుం గా, హరహిరణ్యగర్భసనకాదివందనీయంబును
తదీయవాఙ్మానసాగోచరామేయప్రభావైశ్వర్యస్వాభావికంబును సేవాగతపాలితా
నేకసురాసురసిద్ధయోగిపరంపరాసంకులప్రాంగణంబును నగునమ్మహామందిరంబునం
బ్రాంజలు లగుచు నిలిచి, అవసరం బెఱింగి లోపలికి విజ్ఞాపనంబు చేసి పనిచినపిదప
నాహూతు లై పురుహూతముఖ్యులు హర్షోత్కర్షంబునం బ్రవేశించి, అంత
రాంతరదివ్యావరణశతసహస్రంబులు దివోద్యానశతసహస్రంబులుం గడచి నడచి,
అనంతరం బాయనంతవిశాలరమణీయం జైనయంతర్దివ్యాయతనాంతరంబు దఱిసి
చని, అందుఁ గ్రీడాశైలశతసహస్రోపశోభితంబులుం గోకిలశారికామయూరకీరాది
శకుంతకులకోమలకలకూజితసమాకులంబులుం బరితఃపతితపవమానపాదపస్థనానాగంధ
వర్ణదివ్యప్రసవసమగ్రంబులుం గ్వచిత్క్వచిదంతస్థపుష్పరత్నాదినిర్మితదివ్యలీలా
మండపశతసహస్రాలంకృతంబు నగుపారిజాతాదిదివ్యకల్పకారామళతసహస్రంబుల
చేతను, మణిముక్తాప్రవాళకృతసోపానపరంపరావిరాజితంబులు దివ్యామలామృత

రసోదకపూరపూరితంబులు నతిరమణీయదర్శనరాజహంసాదిదివ్యాండజకులాతిమనోహ
రమధురస్వరవాచాలంబులు నంతస్థముక్తామయదిన్యక్రీడాస్థానోపశోభితంబులు నగు
దివ్యసౌగంధికదీర్ఘికాశతసహస్రంబులచేతను, మఱియునుం బ్రవిష్టజనంబులకు నిరస్తా
తిశయానందైకరసావంత్యంబున సకలకరణసమున్మాదంబులు ననవరతానుభూయమానం
బు లయ్యు నభూతపూర్వంబులచందంబున నవనవాశ్చర్యావహంబులు నై నారా
యణదివ్యలీలాసాధారణంబులుం బద్మవనాలయాదివ్యలీలాసాధారణంబులును నగు
వివిధమధురక్రీడాదేశశతసహస్రంబులచేతను పరివృతంబై, దివ్యరత్నమయంబును
దివ్యరత్నస్తంభశతసహస్రశోభితంబును దివ్యనానారత్నకృతస్థలీవిచిత్రంబును దివ్యా
లంకారాలంకృతంబును బ్రతిప్రదేశకృతదివ్యపుష్పపర్యంకవిలసితంబును నిత్యవికచ
నానాప్రసవాసనవాసనాస్వాదమత్తభృంగావళీసముద్గీయమానదివ్యగాంధర్వపూరితం
బును జందనాగరుకర్పూరదివ్యపుప్పావగాహితమందానిలాసేవ్యమానంబు నగుదివ్యస్థా
నమండపంబునందు మధ్యప్రదేశంబున, విశ్వప్రపంచసామ్రాజ్యభారకుఁ డగువిష్వ
క్సేనుండును, వెండియు స్వభావనిరస్తసమస్తసాంసారికస్వభావులును భగవత్పరిచర్యైక
భోగపరాయణులు నసంఖ్యేయులు నగువైనతేయాదినిత్యసిద్ధపరిజనంబులును, యథా
యోగ్యంబుగం బరివేష్టించి సేవింప, గుణశీలరూపవిలాసాద్యనురూపలక్ష్మీసమేతం
బుగాఁ బుష్పసంచయవిచిత్రితమహాదివ్యయోగపర్యంకంబుపై ననంతభోగిభోగా
సనంబున.

122

శ్రీమన్నారాయణదివ్యమంగళవిగ్రహవర్ణనము

సీ.

ఆత్మప్రదానాహమహమికావయవంబు, సౌందర్యసర్వవశంవదంబు
దశదిశాముఖగంధితారుణ్యకౌమార, మఖిలలోకైకస్వయంసుఖంబు
పశ్యజ్ఙనేక్షణ ప్రవణామృతౌఘంబు, నైజదోరంతరాంతఃపురంబు
సిద్ధయోగివ్రాతచేతఃప్రపశ్యంబు, వమదారుదోషసర్వంసహంబు


తే.

కరతలోచ్చయఫలనక్రకల్పకఁబు, సర్వతోముఖసౌహృదసంప్లవంబు
నగువిచిత్రమహామహం బౌపనిషద, మమరలోచనగోచరం బయ్యె నపుడు.

123


తే.

ఆదిపూరుషప్రత్యవయవములందు, వితతలావణ్యమగ్న మై వెడలలేని
ఖచరతతిచూడ్కి నితరాంగకములు దార, ప్రవణగుణములచేఁ జుట్టి తిగిచికొనియె.


మ.

సరసాంభోదము గాఁ దలంతురు రమాసౌదామినీరేఖచే
పరిశీలాగము గాఁ దలంతురు మహావక్షస్తటీశోభచేఁ
బరమాంభోనిధి గాఁ దలంతురు చలద్బాహూర్మిసంఘంబుచేఁ
బురుహూతప్రముఖామరాధిపతు లంభోజాక్షు వీక్షించుచోన్.

125

తే.

పదమసుకుమారవిగ్రహస్పర్శనమునఁ, బూరుషోత్తముదివ్యవిభూషణములు
పులకితము లైన వని రుచిస్ఫూర్తివలన, విస్మయంబున మునిఁగి రవ్విబుధవరులు.

126


ఉ.

పానుపుఁబాముభోగరుచిఁ బర్వెడువెన్నెలవెల్లిచేత స
న్మానము గాంచి యంతికరమాతనుకాంతినవాతపంబుచే
గానుక లంది వేల్పులకుఁ గ్రమ్మగఁ జేసె మహాద్భుతంబు నా
సూనకులాస్త్రుతండ్రి నునుసోయగపుంజిగిచిమ్మచీఁకటుల్.

127


తే.

చిదచిదధిరాజభావైకచిహ్న మైన, కైటభారాతిరత్నకిరీటమునకు
సాహసాక్రమణక్రీడ సలుపఁ బోయి, ఖచరతతిచూడ్కి రశ్ములఁ గట్టుపడియె.

128


క.

చరణవినతాస్మదాదులఁ, గరుణ విలోకించునపుడు కాని యవనతిం
బొరయనియది యిది పొ మ్మని, సురవరు లసురారిమౌళిఁ జూచిరి వేడ్కన్.

129


క.

వరమకుటరత్నకిరణ, స్ఫురణ ప్రతిఘట్టనమున భుగ్నాగ్రము లై
మరలి తనుద్యుతు లనుమతి, నెరపె సుపర్వులకు విభునినిటలాలకముల్.

130


ఉ.

అచ్చుగఁ బోరిపోరి సగ మై జయ మేది రమాధిపాస్యముం
జొచ్చినచంద్రు గాఁ దలఁచి చూచిరి ఫాలము నోడి తారునుం
జొచ్చిన పంకజంబు లని చూచిరి నేత్రయుగంబు భీతిమైఁ
జొచ్చిన దర్పణంబు లని చూచిరి చెక్కుల దేవతావరుల్.

131


క.

లోలవిలోచనసతతో, ద్వేలకృపాపూరమృదులవీచుల యని ర
వ్వేలుపుఁబ్రోడలు శేషశ, యాళునిఁగఱివంకబొమలయాకృతిఁ గనుచోన్.

132


క.

సురుచిరలావణ్యామృత, సర మగువక్త్రమునఁ జపలచక్షుశ్శఫర
స్ఫురణమున నొలయుతరఁగలఁ, బురుణించిరి సురలు విభుని భూవిభ్రమముల్.

133


తే.

తెగున లంఘించి తలచుట్టుఁ దిరిగినవియొ నిక్కముగ వీను లనధిగా నిలిచినవియొ!
తెలియరా దని మతుల సందియము నొంది, రమరు లవ్విభుదీర్ఘనేత్రములు చూచి.

134


క.

కేవలకరుణావిషయం, బీవిశ్వము గాన విషయ మెఱుఁగమి నికటీ
భావము నొందనివిష్ణు, భ్రూవల్లులు చూచి ముదముఁ బొందిరి దివ్యుల్.

135


క.

తిలకోర్ధ్వపుండ్రకల్పక, విలసన్ననమూలకాండవిభ్రమ మన నా
జలరుహలోచనునాసిక, బలభిత్ప్రభృతులకుఁ జూడ్కి పండువు చేసెన్.

136


క.

సితదశనకుందకలిత, స్మితలతికాపల్లవంబు చెలువున నరుణ
ద్యుతిమధుర మైనకవులా, పతియధరముఁ బ్రీతిఁ దేల్చెఁ బశ్యజ్జనమున్.

137


తే.

కమలనాభకపోలరంగములయందు, మకరకుండలమణివిభామందహాస
నవవధూవరపరిణయోత్సవమునపుడు, క్రతుభుజులచూడ్కి పెండ్లిపేరఁటము సేసె.

138


తే.

కర్ణకుండలప్రతిబింబగర్భవతులు, గాన సుస్మితపాండూయమానముఖము
లగుట వీనికిఁ దగు నని హరికపోల, రేఖలకుఁ బ్రీతిఁ బొందిరి లేఖవరులు.

139

తే.

కదిసి యంతఃప్రదేశంబు గాచి యున్న, సనకముఖ్యమహాకవిసంస్తవముల
మొదలిశ్రీకారములశంక నొడవఁ జేసె, దేవదేవునివీను లాదివ్యతతికి.

139


క.

ఆకృతిసామ్యము గల దని, కాకు న్నెనయించు దీని ఘననిస్వన మెం
దాకరముచిందమున కని, శ్రీకాంతుగళంబు నూహ చేసిరి ఖచరుల్.

140


క.

సరసశ్రీభూనీలా, సరళభుజాగ్రహణనియతసంస్థానపుసం
స్కరణ మని తోఁచెఁ జూపఱ, కరు దై రేఖాత్రయంబు హరికంఠమునన్.

141


క.

సురకరికటమదరేఖా, దరసరణీయద్రులతలఁ దలపించె నభ
శ్చరులకు శార్ఙ్గజ్యాకిణ, పరిచిహ్నితవిష్ణుదీర్ఘబాహార్గళముల్.

142


చ.

ప్రణయకృతోపధానవిధిఁబ్రాప్తము లైనరమాకళావతీ
మణిమయకర్ణకుండలవిమర్దనముద్ర లయత్నసిద్ధభూ
షణములు గాన నమ్రజనసంభరణంబులయందు బద్ధకం
కణములు గా నెఱింగి మురఘస్మరుబాహువులన్ సురావళుల్.

143


తే.

దీర్ఘదీర్ఘంబు లగురమాధిపుని బాహు, లతలఁ దిరిగి పరిశ్రాంతిగతము లైన
వేల్పుఁ బ్రోడలచూడ్కులు విశ్వవిభుని, వెడఁదనిద్దంపుటురమున విశ్రమించె.

144


మ.

సురరక్షార్ధకవాట మైనహరివక్షోవీథి రక్షోభటో
త్కరశస్త్రాస్త్రనిపాతరేఖల నలంకారంబు గా నెన్ని త
త్పరభావప్రథమానచిహ్నములు గా భావించి రీక్షాపరుల్
సిరినిం గౌస్తుభరత్నహారతులసీశ్రీవత్సచిహ్నంబులన్.

145


తే.

తాఁ గృశత్వంబు నొంది సౌందర్యమునకుఁ, బూర్ణభావంబు గొల్పెడుపుండరీక
నయనుమధ్యంబు పశ్యజ్జనంబు పొగడెఁ, బరమపదపోషకులు పేదవడియుఁ దగరె.

146


క.

ఉదరస్థితిలోకత్రయ, పదజనిపరిదృశ్యమానపార్థక్యం బై
త్రిదశాధిపదృష్టివశం, వద మయ్యె మురారిత్రివళివలనం బచటన్.

147


ఉ.

మువ్వురు దేవత ల్సములు మువ్వురు నేకమ వేఱతత్వ మీ
మువ్వురకంటె మీర దను ముగ్ధుల నాత్మవికారరేఖచే
నవ్వువిధీశహేతుహరినాభిపయోజముచే నెఱింగినా
రవ్విభుదృష్ట్యధీనము తదన్యసమస్తము నౌట వేలుపుల్.

148


తే.

బహుమహల్లహరీవిజృంభణమువలనఁ, ద్రిజగదంతర్ధి యగురమాధిపమహాబ్ధి
మధ్యభాగంబునందు నున్మజ్జదవని, పద్మ మని తోఁచెఁ దన్నాభిపద్మ మపుడు.

149


క.

తనచెలువున గెలిచి జయం, బున నొక శ్రీభూమికరభములచే సంవా
హనరూపసేవ గొనియెడు, నని విభునిమృదూరుయుగళి నరసిరి దివ్యుల్.

150

క.

మధుకైటభకుటిలాసుర, రుధిరార్ద్రము లైననాఁటిరూపము దెలిపెన్
మధుమథనుతొడలు కాంచీ, మధురారుణమణిమరీచిమహితము లగుచున్.

151


క.

అభ్రశ్యామలహరికటి, విభ్రాజత్కనకశాటి వీక్షకులకు న
య్య భ్రంకషకనకనగో, దభ్రద్యుతివిభ్రమంబు దలఁపం జేసెన్.

152


క.

శతమఖముఖులకు నిరలం, కృతి యయ్యును నింపు గొలిపె కృష్ణునిజంఘా
ద్వితయ మది యట్ల వృత్తో, న్నతులకు మఱి వేఱ భూషణంబులు గలవే?

153


సీ.

వీనిచెల్వము వార్త విన్నభయంబున, వ్రీహిగర్భంబులు విరియకున్నె?
కొమరెల్ల వీని చేఁ గోల్పడ్డకాహళు, లీశులకడ మొఱ లిడక యున్నె?
యెదిరి వీనికి నిర్వహింపనికాళాంజు, లొరులతమ్మలకు నో రొగ్గ కున్నె?
యొప్పిదంబున వీని కోడినశరధులు, హృదయశల్యవ్యథ నెరియ కున్నె?


గీ.

సోయగముచేత బటు వైనసొబగుచేతఁ, బోల్ప నొండొంటిఁ దమలోనఁ బోలుఁ గాక
వీని కుపమాన ముండునే వేఱ? యనుచు, విభునిజంఘలఁ బొగడి రవ్విబుధవరులు.


తే.

ఆదిపూరుషదివ్యనానాఖిలాంగ, పథపథిక మైనదేవతాపతులచూడ్కి
చేరుగడ యైనతత్పదాంభోరుహములఁ, జెంది చరితార్థభావంబు నొందె నపుడు.

155


సీ.

పరమనిత్యైకాంతభక్తసర్వస్వంబు, జలజాలయాహస్తసౌఖ్యసాక్షి
ప్రాభాతికాంబుజప్రస్పర్ధమానార్థి, శింజానవేదమంజీరకంబు
దీనరక్షావిధాదీక్షాకృతక్షణ, మాపవర్గికనిరస్యైకపదవి
సంతతశ్రుతిశిఖాసంసృగ్యమాణంబు, శాంతసంయమిజనస్వాంతసుఖము


గీ.

కరతలోచ్చయసకలార్థికల్పకంబు సకలచేతనమూర్ధవాస్తవ్యకంబు
వేలుపులచూడ్కి నొడిచి దక్కోలుగొనియెఁ, బరమపురుషుని శ్రీపాదపద్మయుగము.

156


ఆ.

లీల నంగుళీప్రణాళీముఖంబులఁ, బ్రణతజనుల కమృతరసము గురియు
నదియ కాఁ దలంచి రమరులు నఖరుచి, స్ఫురిత మైనవిష్ణుచరణయుగము.

157


చ.

పరుసన కల్పకప్రథమపల్లవముల్ మలినంబు శోణసం
స్ఫురదరవిందరాగరుచిపుంజము సంకుచితంబు శారదాం
బురుహకులంబు దీనిగుణముల్ ప్రకటించినచోట నంచుఁ ద
చ్ఛరణతలద్వయంబునకు జాతమహాద్భుతు లైరి దిక్పతుల్.

158


సీ.

విశ్రాణనాభ్యాసవిధికిఁ గల్పనగంబు, వికసనావేశంబు వినఁగఁ దమ్మి
శ్రితతాపహృతి నేర్చుమతి నాతపత్రంబు, త్రిజగజ్జయక్రియ దెలుపఁ బడగ
చిత్రశౌర్యంబు నేర్చికొనంగ వజ్రంబు, నవనతాలంకృతి కరిదరంబు
లకులలావణ్యసుబాబ్ధిఁ గాన ఝషంబు, నైశ్వర్య మెఱిఁగింప నంకుశంబు


గీ.

నాశ్రయించి యున్న నగు నిక్క మిది యని, యుల్లములు దలిర్పనూహ చేసి
రమరవరులు విభునియంఘ్రితలంబులఁ, జెన్నుమిగులుకుశలచిహ్నములకు.

159

చ.

హరుఁడు శిరంబుపై నిడి సమావరణంబు ఘటించినప్పుడుం
బొరసినకందు కార్శ్యమును బోదొకొ చంద్రున! కీమురారిస
చ్చరణము లాశ్రయించునఖచంద్రులు పూర్ణులు నిష్కళంకులున్
హరిసరియాశ్రయంబు గలదా యని దివ్యులు మెచ్చి రాత్మలన్.

160


వ.

ఇవ్విధంబున నఖిలచేతనచేతోవలోకనలోభనీయసర్వాంగసుందరుండును, నిత్యనిరవ
ద్యనిసర్గదివ్యాద్భుతాచింత్యతారుణ్యలావణ్యమాధుర్యగాంభీర్యస్థైర్యధైర్యాద్యనంత
కల్యాణగుణరత్నరత్నాకరుండును, ఆత్మానురూపసుకుమారసుఖస్పర్శసుగంధబంధుర
దివ్యభూషణభూషితుండును, దివ్యమూర్తిధరపాంచజన్యసుదర్శనకౌమోదకీనందకశా
ర్ఙ్గాదిదివ్యాయుధసేవ్యమానుండును, నిజోత్సంగసంగరమాసమాహితాత్మపరస్పర
నిరీక్షణమధురసార్ద్రప్రణయనవ్యతరదివ్యరసానుభవంబునం గాలంబు నంతర్భ
వింపం జేయుచు, మధురగంభీరభావగర్భితమందహాసవిలాసవికాసితదివ్యవదనా
రవిందశోభానుభావభావితం బగుచు నిగుడునిజదివ్యామలకోమలావలోకనలీలాలస
వాగమృతస్యందంబున నఖిలజనహృదయాంకరంబులు నాపూరితంబులు గావింప, సకల
కార్యకారణైకకారణు నశేషేచిదచిదంతరాత్ముం బరమాత్ము నఖిలేశ్వరేశ్వరు ననీశ్వ
రు నఖిలైకసాక్షి నఖిలవాఙ్మానసగోచరామేయప్రభావు నిఖిలహేయప్రత్యవీకుం
గళ్యాణగుణైకతానస్వరూపుం బురాణపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు సమస్త
చేతనైకాభిగమ్యు సర్వప్రకాశైకనిరతిశయభోజ్యు నాశ్రితవత్సలు నాపత్సఖు ననాథ
నాథుం గృపాలీలాపరాయణు శ్రీమన్నారాయణుం గాంచి, మహేంద్రాదిబృం
దారకు లాపాదచూడంబు నాచూడపాదంబునం గాఁ దదఖిలావయవమబుల వెల్లివిరి
యునమందసౌందర్యసముత్తేజసద్యోలావణ్యామృతరసపూరంబు నాత్మీయనిశ్చలదృష్టి
నాళంబుల వెక్కసంబునం గ్రోలుచు నిరస్తసమస్తాంతస్తాపులు నిస్సీమపరమానందజలధి
నిమజ్జమానాంతరంగులుం బ్రకృష్టసంతోషబాష్పధారాప్రాలంబచుంబితోరస్కులుం
బ్రహృష్టరోమాంచకంచుకితసర్వాంగులు నగుచు నత్యంతసాధ్వసవినయావనతసర్వాం
గంబులతోఁ దదీయదివ్యపదపీఠోపాంతప్రదేశంబుల నంతంతం బునఃపునసాష్టాంగ
దండప్రణామంబు లాచరించి లేచి ఫాలకీలితాంజలిబంధంబులతో గద్గదకంఠంబు
తో నిట్లని వినుతించిరి.

161

దేవేంద్రాదులు శ్రీమన్నారాయణుని స్తుతించుట

భుజంగప్రయాతము.

నమస్తే సమస్తైకనంతవ్యమూర్తే, నమస్తే సమస్తన్యనాద్యంతకీర్తే
నమస్తే ప్రశస్తోల్బణజ్ఞానమూర్తే, నమస్తే నిరస్తాంఘ్రినమ్రాఖిలార్తే.

162

వ.

అని వెండియు.

163


క.

సేమమున నఖిలచిదచి, త్త్సోమంబున కాత్మ వగచుఁ దోఁపించుటచే
నేమై పరు లై సర్వము, వై మెరసెద వీ వొకండ వంబుజనాభా!

164


క.

కారణముకంటెఁ గార్యము, వేరై కలుగమికిఁ గాదె వేదాంతంబుల్
నారాయణ యీవిశ్వము, కారణ మగునిన్నొకండ కా వచియించున్.

165


క.

దిక్కుగఁ బుట్టెద ననునీ, యొక్కమనోరథము మొదలు నొగిఁ దెలిపి కదా!
యొక్కటి దెలిసినఁ దెలియుం, దక్కటిసర్వంబునను బ్రధానపుఁబలుకుల్.

166


క.

దేవతల వీని మూఁటిని, జీవుఁడ నగునేన చొచ్చి చేసెద రూపా
ఖ్యావివరణ మనునీతొలు, భావము గనఁబడిన నినుఁ బ్రపంచము దెలియున్.

167


క.

ఆరూఢవేదశిఖలం, దా రై బ్రహ్మాత్మసత్పదప్రముఖంబుల్
కారణము దెలుపఁ జాలక, నారాయణ! నీవిశేషనామము గోరున్.

168


తే.

ఈశభసదాత్మకతచేత నెల్లజగము, నొకఁడ యని కాదె భవదాత్మకముగఁ గంట
కించనుల 'నేహ నావాస్తి కించ' నాది, వాక్యములు విశ్వవైవిధ్యవారకములు.

169


క.

పరమును నపరంబును మఱి, పర మై యపరంబు దెలుపఁ బడుననుశంకన్
బరమేశ! నీకు నధికము, సరియును లే దని విశేషశాస్త్రము దెలుపున్.

170


చ.

తివుటఁ బయోధు లేడు గణుతించినచోటఁ దదూర్మి ఫేనబిం
దువులు సమంబు గానిగతి తోయరుహేక్షణ విశ్వ మింతయున్
భవదయుతాయుతాంశశతభాగకళాస్థిత మెట్లు నీ సమం
బవు నని కాదె నీకు నిగమాగ్రము లెన్నెడు నద్వితయతన్.

171


క.

సేసి మఱి తాన క్రమ్మఱ, గ్రాసము గొనునేఁతపురువుగతి నీకలుగం
జేసినయీవిశ్వమును ర, మాసఖ! మ్రింగుదువు నీవ మరలన్ లీలన్.

172


ఆ.

హార్దపద్మవీథి నాహంతవాస్మదా, ద్యష్టగుణవిధానజుష్ట మైన
యౌపనిషద మైనయలదహరాకాశ, మీవ యగుటఁ గాంతు రీశ! బుధులు.

173


సీ.

బోధాశ్రయత్వంబు బోధమాత్రత్వంబు, రూపించుశ్రుతులవిరోధ ముడిపి
యద్వితీయత్వంబు నంతరాత్మత్వంబుఁ, జాటుప్రాబలుకులజగడ ముడిపి
గుణనిధానత్వంబు గుణవిహీనత్వంబుఁ, గలిగించుచదువులకలహ ముడిపి
దేహసాహిత్యంబు దేహరాహిత్యంబు, వచియించునొడువులవైర మణఁచి


గీ.

సాత్వికస్మృతితత్త్వంబు సంవదింప, నైకమత్యంబు గాంచుయథార్థవిదులు
తత్త్వమున నిన్నుఁ గనుఁగొని తావకాంఘ్రి, పద్మముల నేల విడుతురు పద్మనయన!

174


క.

పరతత్త్వసమన్వేషణ, పరు లై వెరవు గలవారు పదిలంబుగ నీ
చరణములచొప్పు వదలక, తిరిగి తిరోహితుని నిన్ను దెలియుదు రీశా!

175

క.

ఊహింప సకలచిదచి, ద్దేహివి నీ వగుట లెస్స దెలిసినమీఁదన్
సో౽హ మనరాదొ! మరి దా, సోహ మనఁగరాదొ! బుదున కంబుజనాభా!

176


సీ.

రూపింపఁబడునీస్వరూప మిట్టిది గదా, జ్ఞానంబు నీకు బ్రధానగుణము
పరమేశ! నీజగత్ప్రకృతిభావం బెద్ది, యది శక్తి నీకు రెండవగుణంబు
పేర్మితో స్వాతంత్ర్యబృంహితకర్తృత్వ, మైశ్వర్య మనఁగ మూఁడవగుణంబు
సకలప్రపంచంబు సతతంబుఁ జేయుచో, నలయమి బలము నాలవగుణంబు


గీ.

జగదుపాదాన మయ్యు నిశ్చలత వికృతి, నందమియ వీర్య మనఁగ నేనవగుణంబు
కార్యకరణంబు నెడ సహకారి నొకటి, నభిలషింపమి తేజ మాఱవగుణంబు.

177


చ.

గుణములు నీకనంతములు కోకనదోదర! యాదిభారతీ
గణితము లందులోఁ బ్రథమగణ్యము లై చెలువారు నెవ్వి త
ద్గుణములు దార యన్యగుణకోటి సమస్తముఁ గుక్షిఁ దాల్చు దు
ర్గుణగణదూర! నీవు నిజకుక్షిఁ బ్రపంచము దాల్చుకైవడిన్.

178


తే.

అల్పసంకల్పలీల నయ్యఖిలమునకు, సృష్టిరక్షాలయక్రియల్ సేయు దీవు
సహజతేజోబలైశ్వర్యశక్తివీర్య, గుణము లవి యెట్టియవియొ ముకుంద! నీకు.

179


క.

నీమహిమాబ్ధికణస్థిత, మై మెఱయుప్రపంచ మిది యనంతం బనినన్
నీ మహిమానంతత్వము, కైముతికన్యాయ మనుట గాదె? ముకుందా!

180


క.

దనుజాంతక! కౌతస్కుత, జన మనవరతానుభూతి శాస్త్రంబులచేఁ
గని గ్రుడ్డియు వినిజెవుడును, జనవరి నీమాయ కిఁక నసాధ్యము గలదే!

181


ఉ.

ఎవ్వరు మౌట మ మ్మెఱుఁగనీదు యథాకథితస్వరూప మై
యెవ్వఁడ వౌట ని న్నెఱుఁగ నీ దనుభావ్యతఁ దోఁచి యైనఁ దా
నెవ్వరి దౌటఁ ద న్నెఱుఁగనీదు ధ్రువం బగువెల్లిదొట్టు నీ
ద్రెవ్వనిమాయలో మునిఁగి తేలెడుమీలము గామె? యీశ్వరా!

182


చ.

క్షణమునఁ జేయుచేత యజకల్పశతాయుతభుక్తిఁ బో దను
క్షణమును బుణ్యపాపములు సంతత మై యొనరించుచొప్పు త
త్క్షణ మగునిమ్మహాభయదసంస్కృతికిన్ భవదంఘ్రిపంకజ
ప్రణతి యొకండు దక్క మఱి పారము గల్గునె భక్తవత్సలా!

183


క.

అని మఱియుఁ బెక్కు దఱఁగుల, వినుతింపఁ గృపార్ద్రదృష్టి వీక్షించి ఘనా
ఘనగంభీరస్వనమున, దనుజకులధ్వంసి దేవితాశతి కనియెన్.

184


క.

క్షేమంబే మీ కిందఱ?, కేమిటి కరుదేరవలసె ని? ట్లనుడు సుర
స్తోమానుమతి బృహస్పతి, తామరసోదరుని యెదుటఁ దాఁ బ్రాంజలి యై.

185


క.

దేవ! సకలైకసాక్షివి, నీ వెఱుఁగని దొకటి కలదె నిక్కం బిపు డే

మై విన్నవింప విను టిది, మావలనం గలుగునట్టిమన్ననఁ గాదే!

186


క.

మాంధాతృమహీపతి దృఢ, సంధామతి మగ్రతపము సలుపఁగఁ దత్తే
జోంధీభూతం బై ని, ర్బంధంబునఁ బొందినది ప్రపంచం బెల్లన్.

187


ఆ.

ఇంద్రపదము నొండె నితరపదం బొండె, నతని కెద్ది యిష్ట మది యొసంగి
భువన ముద్ధరింప నవధరింపుము దేవ!, యిదియె మనవి మాకు నిప్పు డనిన.

188


వ.

దరహసితలసితవదనారవిందుం డగుచు మత్పదభక్తుం డైనయతనివలన నొరుల కెవ్వరికిం
గీడు పొంద దట్లగుట నిశ్శంక మరలి చనుఁ డిదె యతనితపంబు నివారింపుదు నని
కృపావలోకనంబునం బరితృప్తులం జేసి యనిపినం గృతార్థు లై మహేంద్రాదిబృం
దారకముఖ్యు లానందంబున నానందకపాణి కంతంతం బునఃపునఃప్రణామంబు లాచ
రించి వెడలి నిజనివాసంబులకుం జని యనంతరంబ.

189


సీ.

దివ్యవిగ్రహకాంతి దిగ్వధూవితతికి, హరినీలవల్లరు లభినయింపఁ
బేరురంబునందు బెడఁ గైనకౌస్తుభం, బెల్లచోఁ గలయ నీరెండ గాయఁ
బింజించి కట్టిన బిగువపచ్చనిపట్టు, తొలుకారుమెఱుఁగులఁ దుఱఁగలింప
నిడుదహస్తములఁ బూనినశంఖచక్రంబు, లినచంద్రదీప్తుల నీనికొనఁగ


గీ.

శిరసుమకుటంబు నింగిఁ జిత్తరువు గొలుప, గల్లములఁ గుండలద్యుతి వెల్లి గొనఁగఁ
గలికితెలిసోగకన్నులఁ గరుణ చిలుక, జనవరునిమ్రోల శౌరి సాక్షాత్కరించె.

190


వ.

ఇట్లు గరుడవాహనరూఢుండై యారూఢదివ్యమునిసేవ్యమానుం డై యఖిలభువనా
వనదక్షుం డై పుండరీకాక్షుండు ప్రత్యక్షం బగుటయు.

191


శా.

హర్షాశ్చర్యభయంబు లుప్పతిల సాష్టాంగంబు మ్రొక్కి యు
త్కర్షింపంగఁ దరంబు గానియొకయంతస్సౌఖ్యమున్ బొందిపై
వర్షింపం బ్రమదాశ్రుపూరము కరద్వంద్వంబు నొక్కొంత గా
శీర్షంబుం గదియించి సాంద్రపులకశ్రేణీపరీతాంగుఁ డై.

192

మాంధాత శ్రీమన్నారాయణుని స్తుతించుట

దండకము.

శ్రీ వల్లభా! గల్లభాగద్వయీదర్పణాత్యర్పణాలోక! లోకత్రయత్రాణలీలాకళా
దక్ష! దక్షాత్మజాభర్తృచూళీపరిష్కారమందారమాలాభవత్పాదనిర్యత్పయోధార! ధా
రాసహస్రాంశుదీప్తప్రభాభారమారీకృతారాతిదైతేయనాథావరోధాంజనధ్వాంత
సంతాన! సంతానభూజప్రభాపాదపార్థిప్రజాభీష్టవస్తుప్రదానప్రశస్తా! సమస్తాత్మభా
వానుభావంబు నీ వంబుజాతాక్ష! కైకొన్న పైకొన్న నీమాయ నేమా యథామానముం
గానఁగా లేక నానానుసంధానసంధానుబంధానుబంధాంధకారంబుచే ని న్నెఱుంగం
డెఱుంగం దరంబా? భువిం జిత్తగర్తంబునం గర్తృతాహంకృతిన్ జీవబీజంబు సంక
ల్పరూపాంకురం బౌచు నుద్దామకామాదికాండప్రకాండంబు లడ్డంబుగాఁ బుత్రమి

త్రాదిపత్రంబులం జొంపమై సంపదల్ మవ్వపుంగ్రొవ్విరుల్ బునర్జన్మకృద్బీజ
సంయోజనామాత్రపాత్రంబుగాఁ గర్మమర్మంబునం బండ నొండొంటి కంటైనయీ
మేను లన్మానులం దట్ట మైనట్టినిస్సారసంసారఘోరాటవీవాటిక న్నిర్గమింపంగ మార్గం
బు లే కెమ్మెయిం ద్రిమ్మరం గండ్లు ముండ్లుం గొనన్ నొప్పిచే నెవ్వగం గూలుచుం
దూలుచుం తద్వ్యపాయం బుపాయంబునం జెందు టానందమై తోఁచు నందంద మై
నింద్రియద్వంద్వసంప్రాప్తిచేఁ దప్తుల మ్మైనమానేరముల్ దూరముల్ చేసి యాశీవిషాధీశ
శయ్యా! మదీయాపదల్ పాపవే! పాపవేగోదయం బింక మమ్మింక నాలింపఁ బాలింపఁ
గా దిక్కుద క్కెవ్వరే! నవ్వరే చీఁకునుం జీఁకుఁ జేయూతగాఁ జేఁత! కీదృశ్యవిశ్వం
బునం ద్వత్ప్రభావంబు భావంబునం దాన కానంగ లేఁ డొక్కరుం డొక్కరు న్ముక్తునిం
జేయఁగా శక్తుఁ డే? యుక్తిసంధిత్సమాత్సర్యబద్ధైకబుద్ధి న్వికల్పించి కించిత్పరిజ్ఞానముం
గానఁగా లేనిదుర్వారదుర్వాదులంగా దనం జాలి లీలాకలోత్సేకతన్నైకతాపాద్యమా
నుండ వై యెన్న నుద్యోగి వై నీతవిద్యాగతిన్ లోకమున్ దూరితాలోకముం జేసి
చీకాకుగాఁ గాకు సేయంగ నేపోకలం బోక యేకాకు లై యాకులైశ్వర్యకార్యంబు
వర్ణించి పంచేంద్రియాదిప్రపంచంబు నిర్జించి మోహంబులం గోసి దేహంబులన్ బూర్ణ
గేహంబులన్ రోసి శీతాతపాభీరు లై జీర్ణపర్ణానిలాహారు లై ఘోరతీవ్రప్రభాచార
చాతుర్యధుర్యు ల్మహాయోగివర్యు ల్సదాగాథసంబోధసంబాధనిర్బాధహృద్వీథులన్
నిన్ను శోధించియున్ గట్టిగాఁ బట్ట లే రన్న మమ్మెన్నఁ గానేల? యేలా వృథా గాథ
లింకన్?భవాంధాంధుమూలంబులం గూలియుక్కేది దిక్కేదియున్ లేని మూఢు ల్నిరూ
ఢానుకంపాగుణావిద్ధులం జేసి నీ వుద్ధరింపంగ దా రెంతయున్ నీపదారాధనాసాధనా
సక్తులై భక్తిసంయుక్తు లై ముక్తులై శుద్ధ మిద్ధంబు వేదప్రసిద్ధం బసూయం బమానం
బమేయం బజేయం బనాచ్యం బమోచ్యం బనాశం బనీకాశ మేసౌఖ్య మాసౌఖ్యముం
గాంతు రబ్జాలయాకాంత! యేక్రంతలన్ వ్రంతలన్ రంతలం జెందలే న్గుందలే నింక
నేఁ గింకరత్వంబు తత్వంబు గాఁ జూచెదన్ దాస్య మాశాస్యముంగా నపేక్షించెదన్
భృత్యకృత్యంబు నిత్యంబు గాఁ గోరెదన్ సేవకత్వంబు సత్త్వంబు గా నెంచెదన్ దావ
కీయార్హనిర్హేతుకారుణ్యగణ్యైకవీక్షం గటాక్షింపవే! శిష్టరక్షావరా! దుష్టశిక్షాకరా!
ధర్మసంస్థాపకా! శర్మసందీపకా! భక్తకర్మచ్ఛిదా! ముక్తిమర్మప్రదా!

193


సీ.

తృష్ణాపరుం డైనతెరువరి తియ్యని, మున్నీటిసలిలంబు లెన్ని గ్రోలు
నిఱుపేద యగువాఁడు నిర్జరగిరిఁ జేరి, జాతరూపం బెంత సంగ్రహించు
గణనాపరుం డైనగణికుండు సమకొని, రిక్కల నెన్నింటి లెక్క పెట్టు
లంఘనోన్ముఖుఁ డైన జంఘాలుఁ డొక్కరుం, డిమ్మహీవలయంబు నెంత గడచు


గీ.

నట్టిదయ పో యనంతకల్యాణగుణస, మృద్ధుఁ డగునిన్ను ననుబోఁటి యెంత పొగడు
నెంతమాత్రయుఁ బొగడుట కేది యెఱుక? యెఱుక నేఁ డిఁకఁ గలుగునే? యీశ్వరేశ!

194

చ.

తొలుదెసవేల్పుమానికపుఁదోరపుఁగాంతికి మేలుబంతి క్రొ
మ్మొలకమొయిళ్లవన్నియలమొల్లమికిం దగుపుట్టినిల్లు గుం
పులుగొనుతోరపుంబసిమిబూమియచూపువిడంబనంబు నీ
బలితపుమేనిచాయ కనుఁబండువు నా కొనరించె నచ్యుతా!

195


చ.

అసుజలవర్గముం జలరుహంబులు నీశ్వర! తారు శారదో
ల్లసనముఁ బూని యైన నవిలంఘ్యతమఃకృతమీలనంబు రా
జసవృతికల్మియందలిప్రసాదము నొందక యుండునట్టినీ
యసమపదాబ్జయుగ్మ మలరారెడు మామకమానసంబునన్.

196


చ.

సురనదికంటెఁ దార తొలుచూలుసుమీ యని యెల్లవారికిం
జిరతరధాళధళ్యమునఁ జెప్పక చెప్పెడుభంగిఁ బొల్చునీ
చరణబిసప్రసూననఖచంద్రమరీచులు పర్వి నామదిం
దొరలుతమంబు వో నడిచెఁ దోయరుహోత్సలబంధులోచనా!

197


చ.

సిరియును ధాత్రియున్ శయకుశేశయయుగ్మములం బ్రవీణ లై
సరసత నొత్తుచోఁ బొదలి సంకులముత్పులకాంకురావళుల్
బెరసినయప్పు డీమెఱుఁగుఁబిక్కలు నిక్కము నిక్కము దాల్పకుండునే
యురగశయాన! పాదకమలోచితకంటకనాళభావమున్?

198


ఉ.

అందము లైననీతొడలయాకృతిశోభ వహింప లేనియా
నిందకుఁ జాలమిన్ నిలువునీ ఱగుటెంత యనంటికంబముల్?
నందితభక్తలోకయతులం బగునీభవదూరుసామ్యముం
బొందఁ దలంచుధూర్తమతిఁ బొందె నధోగతి హస్తిహస్తముల్.

199


ఉ.

కన్నులపండువై ధగధగంజిగిరింగు దుఱంగలింపఁగాఁ
జెన్ను వహించునీపసిఁడిచేల వహించిన నీలవర్ణ! నీ
యిన్నెఱిఁ జూడ మీఁదినగ మెల్ల ఘనాఘనపంక్తి పర్వి పై
కొన్నమెఱుంగుబంగరువుకొండగతిం దిలకించె నెంతయున్.

200


ఉ.

లోకము లెన్ని యన్నియును లోఁగొనియుం దనలేమిఁ జూపునీ
యీకృశమధ్యభాగ మిపు డీక్షణలక్ష్యము గా దటంచు నే
నోకమలేశ! లే దనుట యుక్తము గా దలబ్రహ్మఁ గన్న నా
ళీకముతోడి పొక్కిలికి లేమి ఘటిల్లెడునట్లు గావునన్.

201


చ.

పొలుపుగ మధ్యదేశమునఁ బూనిన కౌస్తుభ మెఱ్ఱచాయలన్
ధళధళితద్యుతుల్ గొలుప దైత్యవిమర్దన! నీయురంబు ని
ర్మలరుచి గూడఁ బొల్చె నడుమం బ్రతిబింబితబాలభానుమం
డలము వెలుంగఁ బొల్చుయమునానది గన్నహ్రదంబుకైవడిన్.

202

చ.

దళితమహేంద్రనీలరుచిదాయకవిగ్రహ! నీగభీరతా
జలనిధిభావముం దెలుపఁ జాలినలక్షణలక్షితంబు లై
యలవడెఁ గంకణాంకితము లై సముదంచితశంఖచక్రసం
కలితము లై యభంగపరిఘాసమతుంగభుజాతరంగముల్.

203


చ.

తనసుషమావిశేషములఁ దప్పక శంఖములం జయించుటం
దనికినకీర్తిరేఖలవిధంబున నుజ్జ్వలకాంతిఁ బొల్చునీ
యనుపమతారహారబతికాపరికల్పితవేల్లనంబుచేఁ
గనుఁగొన నొప్పు నీ కిపుడు కంధరకంధరవర్ణబంధురా!

204


చ.

వెడవెడ క్రొత్తక్రొత్తమొగి విచ్చినకెందలిరాకుఁ గెంపు చూ
పెడుజిగి గల్గునీయధరబింబమరీచులు దొంగలింప నీ
బెడఁగు వహించునెమ్మొగముపేరిటిపున్నమచందమామకున్
సడలనిదట్టపుంబొడుపుఁజాయ ఘటించెడు నంబుజోదరా!

205


చ.

తిలకితదంతకాంతు లనుతీవమెఱుంగులు సుస్వరాఖ్యగ
ర్జలు గలనీవచోమృతరసంబులు పైఁ గురియంగ నామదిం
గలభవతాప మెల్ల విడి గ్రమ్మవె యంగకదంబకంబులం
బులకనవాంకురంబు లివి పొం దగురీతి గదా! గదాధరా!

206


ఉ.

ముద్దులు గుల్కునీభువనమోహనకుండలరత్నదీధితు
ల్గద్దఱిలాగు మై ధళధళం బొలుపారెడుభంగిఁ జూడఁ గాఁ
దద్దయుఁ జెన్ను మీరెడుఁబదప్రణతావనకేళిలోల! నీ
నిద్దపుఁ జెక్కుటద్దముల నిల్వక జాఱుచుఁ బ్రాఁకుకైవడిన్.

207


ఉ.

క్రొవ్వున మచ్చరించి తుద గూడక వే శరణార్థిబుద్ధితో
నివ్వటిలంగ నీమొగము నెమ్మదిఁ జొచ్చి వెలుంగుమవ్వపుం
గ్రొవ్విరితెల్లతామర లోకో! యనఁ గాఁ దగి చక్రహస్త! లే
నవ్వు దొలంకునీదునయనంబులు నామదిఁ జూఱలాడెడిన్.

208


ఉ.

నాసిక పేరిమవ్వపుటనంటికిఁ బైబొమ లాకు లయ్యె ను
ల్లాసము చూపులేఁతమొవులాగు మెయిం దిలకంబు గల్గెడుం
బ్రాసవగంధ మింకు నని బంభరడించకపఙ్క్తి చేరున
ట్లై సకలేశ! నీదునిటలాలకజాలక మింపు గొల్పెడిన్.

209


చ.

అభయవితీర్ణిధుర్య! కరుణామృతవర్షము చూపుమేఘస
న్నిభుఁ డగునీకు నీవివిధనిర్మలరత్నకిరీటభూషణ
ప్రభలు ఘటించు చున్నయవి భక్తమయూరమహోత్సవంబు గా
నభినవపాకశాసనశరాసనసృష్టికళాకలాపముల్.

210

ఉ.

ఉల్లము చల్ల నయ్యె మొద లూడె మనోరథముల్ జగంబుపై
నొల్లమి పుట్టె చేరుగడ నొందితి నీశుభదివ్యవిగ్రహా
భ్యుల్లసనావలోకనసుఖోదధిలోపల నోలలాడుచుం
దొల్లిటివాఁడఁ గానిగతిఁ దోయరుహేక్షణ! సంతసించెదన్.

211


చ.

తెలియనిధూర్తవర్తనులు తెంపరు లై తమయుక్తిభంగులన్
బలుకుట గాక నిక్కముగ భక్తివశుం డగునిన్నుఁ జూడఁ గాఁ
గలుగుటకంటె నొండొకసుఖంబును గల్గునె? కల్గ నిమ్ము! నా
తలఁపున కింపు గా దిదియ తప్పక కల్గ ననుగ్రహింపవే!

212


క.

అని భక్తిపరతఁ గ్రమ్మఱ, వినతుం డగునృపునిఁ జూచి విశ్వైకగురుం
డనుకంపమై ఘనాఘన, ఘనగర్జాస్వరవిధావికస్వరఫణితిన్.

213

శ్రీమన్నారాయణుండు మాంధాత ననుగ్రహించుట

తే.

కువలయేశ్వరచంద్ర! నీ కోరినట్ల, మోక్షఘంటాపథం బైనమునివరైక
దుర్లభాస్మత్పదాంబుజోద్భూతభక్తి, గలుగు నీ కింక నా యనుగ్రహమువలన.

214


వ.

అస్మదీయమాయావిమోహితం జైనజగజ్జనంబు యథార్థంబున న న్నెఱుంగను మత్పద
ప్రాప్తిరూపమోక్షంబు గొనను నెఱుంగదు. నీకు మదీయమాయాజయంబును మత్పద
ప్రాప్తిపాధనం బైన మదీయపదభక్తియు నొసంగితి నెప్పటిగతి రాజ్యపరిపాలనంబు
సేయుచు మద్భక్తియోగనిష్ఠుండ వై యుండు మని కృపావలోకనసుధాధారల నభిషి
క్తునిం జేసి భగవంతుం డంతర్ధానంబు నొందినం గృతార్థుం డై.

215


శా.

చేసెం భ్రాజ్యము గాఁగ రాజ్యము నృపశ్రేష్ఠుండు ధీనిష్ఠుఁ డై
త్రాసాపాదితదోషదూరఫణరత్నద్రత్నగర్భాసము
ద్భాసిస్వీయభుజాభుజంగమనిపీతక్రూరవీరారికాం
తాసోల్లాసవిలాసహాసనికరోదంచత్పయఃపూరుఁ డై.

216


క.

కవితావిచక్షణత గల, కవి కంఠవిభూషణముగఁ గైకొనవలయుం
౧వివరనృసింహవిరచిత, కవికర్ణరసాయన మనుకావ్యము దీనిన్.

217

ఆశ్వాసాంతము

శా.

ప్రస్తుత్యప్రవిఫుల్లహల్లకరుచిస్పర్ధాళుహస్తాభయ
ప్రస్తారప్రతిభారితానతనమఃపర్యాయనాదోద్యమ
ప్రస్తావోద్గమకప్రతీకవిలసత్ఫాలస్తలాద్రిస్ఫుట
త్కస్తూరీతిలకోపలక్షితదళత్కల్హారవారత్రపా.

218

క.

ఆదిమశఠకోపాది, ద్వాదశనిజసూరివిరచితద్రావిళగ్రం
థాదృతసతతశ్రవణా, స్వాదకళాముక్తముక్తసామవిభేదా.

219


మాలిని.

శతశతరవితేజా సర్వరాజాధిరాజా
నతజనసురభూజా నాభిదీవ్యత్పయోజా
సతతమహితభూమా సత్యసంపూర్ణకామా
దితిసుతకులభీమా దేవతాసార్వభౌమా.

220


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరసీరుహసేపకోపసేవక నరసింహనామధేయ
ప్రణీతం బైనకవికర్ణరసాయనం బనుకావ్యంబునందుఁ దపశ్చరణంబును, గ్రీష్మవర్షా
శిశిరర్తువర్ణనంబులును, అప్సరస్సమాగమప్రకారంబును, నృత్తప్రపంచంబును,
సముద్రవర్ణనంబును, వైకుంఠవర్ణనంబును, భగవద్దివ్యమండపవిగ్రహవర్ణనంబును,
స్తోత్రంబును నన్నది సర్వంబును షష్ఠాశ్వాసము.

కవికర్ణరసాయనము సంపూర్ణము.