కలువపూ బ్రతుకులో కనుమోడ్చు వెన్నెలే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కలువపూ బ్రతుకులో కనుమోడ్చు వెన్నెలే

కాలానలం బైన గతి యేమీ!

నిరుపేద రెల్లులో నిదురించు సెలయేరె

కల్లోలమే యైన గతి యేమీ!


చలువతెమ్మెరజాణ చలచిత్తుడే కాని

మాలతీలతిక కీ మమతకౌగిలి యేలొ?

ఆగడమ్మే కాని మూగవేణువుగొంతు

మ్రోగునో హృదయమ్ము రాగిల్లు వరకేని!


నిదురలో స్వప్నాల కదలికే బరు వైన

కల లెల్ల కను విచ్చి కాల్చు నా గతి యేమి?

బ్రతుకులో భావాల పరిమళమె బరు వైన

భావాలె పరువమై బ్రతుకు నా గతి యేమి?


చివురాకు తెరలనే చిన్న వోవును కాదె,

విరజాజిమొగ్గనే విరియు మంటా రేమొ!

చదలేటి నీలాల ఝరులలో తారయా?

నటియింప నేర్చునా? నవయింప నోర్చునా?