Jump to content

కలుగునా నాకు నీ వియోగమ్ము సకియ?

వికీసోర్స్ నుండి

కలుగునా నాకు నీ వియోగమ్ము సకియ?


వాలు నీ కనురెప్పల జాలిచూపు

లల్ల దిగజారి దిగజారి, అమరనాథ

కంఠమాలా సుమదళాలు గాగ, గగన

వాహినీ నీర జాళినీ పక్ష నీల

నాట్యములుగ, తారా తోరణములు గాగ,

నింగి నీడల మెట్లుగా, నీలి మొయిలు

జిలుగువిరుపులుగా, పులుగులుగ, నలరు

లుగ, నలలుగా, కలలు గాగ, సొగయబోని

విసివికోని వింతవలపు వేడి వేడి

తొందరల పరువుల నెంత తూలి తూలి,

ఎంత దిగజారి దిగజారి, ఎంత వెదకి

వెదకి పడినవొ, పెంధూళి కదల లేక

వెలుగు లేక యెగుర లేని వీని కనులె

శిలలు గాక; వదలని కౌగిలి పెనంగ

బెదరు గాక లజ్జా గాఢ వేద నాగ్ని!


వదలునా యెట నెదు రేగి వెదకు వలపు!

కలుగునా నాకు నీ వియోగమ్ము, సకియ!