Jump to content

కబీరు

వికీసోర్స్ నుండి

మానవసేవా గ్రంథమాల-1


కబీరు


ఇది

అత్తిలి సూర్యనారాయణచే

రచింపబడి

మానవసేవా పత్రికయందు

ప్రకటింపబడియె.




రాజమహేంద్రవరము.

శ్రీ మనోరమా బ్రాస్ ఇండస్ట్రియల్ మిషన్ ముద్రాక్షరశాలయందు

ముద్రింపబడియె.

1911.

వెల. 2 అణాలు.

భక్తమాల

కబీరు.

ఆ సన్మార్గమునందు సంచరించుచు, నజ్ఞానాంధకారమునఁ బడి పొరలుచున్న జనసామాన్యము నుద్ధరించుటకై తమజీవితములను ధారవోయ నుత్తరహిందూస్థానమున నుద్భవించిన పరమభాగవతోత్తములయిన మతసంస్కర్తలలో కబీరుదాసుని మించినవారు వేఱొకరు లేరని నిస్సందేహముగాఁ జెప్పవచ్చును. కబీరుకాలమునాఁటి హిందూదేశ స్థితినిబట్టి చూడఁగా, పరస్పర వైషమ్యములతో వేఁగుచున్న హిందూమహమ్మదీయులకు మతమూలమున నైకమత్యమును గూర్చుటకై ధీరవృత్తితోఁ బ్రయత్నింపఁగల మహనీయుఁడొకఁడు పుట్టుట యావశ్యకమైయుండెననియు, మనుష్యకోటియొక్క యభివృద్ధికయి నిరంతరము ప్రవహించుచుండిన యీశ్వర కారుణ్యము విశేషముగా నవతరింప వలసిన యవసరమప్పుడు వచ్చియుండె ననియు, స్పష్టముగా దెలియఁగలదు. పతానుపరిపాలకులు చండశాసనులై మతసహన మన్న మాటలేక విమతస్థుల నెందఱిని జంపించిన నంతకీర్తి సంపాదించుచుంటిమని గర్వించుచుండిరి. పరిపాలనముకట్టుదిట్టముగాలేక యుండుటచేతను బలవంతుఁడే సర్వాధికారము కలవాడై యుండుటచేతను, అందుచే ఢిల్లీపాలకులలో నెప్పటికప్పుడు మార్పులు కలుగుచుండుట చేతను, పట్టణములందును పల్లెలందును గల తురకప్రజలు తామే యధికారులుగా చరించుచు తోడి హిందువులను ద్వేషించి పలుతెఱంగుల హింసించుచుండుటయు, హిందువులు తమ్ము విగ్రహారాధనమును మానవలయునని తుఱకలు కఱకుపద్ధతులను బూని గావించినకొలఁదిని పట్టుదల వహించి మ్లేచ్ఛులపై విద్వేషమును పెంచుకొని మఱింతయెక్కువగా తమపద్ధతుల కంటియుండుటయు, సంభవించుచుండెను. ఇట్లు దేశము పరస్పర కలహములతో నిండియుండఁగా ఈదేశమును స్వాధీనము చేసికొనుటకు సమయమెప్పుడు దొరకునాయని యాఫ్‌ఘనుదేశమం దున్న మొగలాయినాయకులు తొంగితొంగి చూచుచుండిరి. అట్టికష్టకాలమున కబీరు జన్మించి దేశమునందలి విగ్రహారాధకుల మనస్సులను ఏకేశ్వరుని వైపునకు మరల్చి హిందూమహమ్మదీయుల కైకమత్యమును నెలకొలుపవలయునని ప్రయత్నించెను కబీరు జీవచరిత్రమును గుఱించి పలువురు పలువిధములుగాఁ జెప్పుచుండుటచేత అందేది సత్యమో మనము సరిగా నిర్ధారణ చేయఁజాలకున్నాము. పంజాబుదేశమునందు సిక్కుమతమును స్థాపించిన గురునానక మహాశయుఁడు తనయేకేశ్వరోపాసకధర్మములను కబీరుదాసుని గలసికొని సంభాషించిన తరువాతనే బాగుగ పాదుకొలుపుకొనియున్నందున, ఆసిక్కు మతవేదమయిన యాదిగ్రంథమునందు కబీరుదాసుని చరిత్రమును ఆతని బోధనలును విపులము గాఁ జేర్పఁబడియున్నవి కాఁబట్టి యందుండి కబీరునుగూర్చిన సంగతు లనేకములు మనము తెలిసికొనఁ గలుగుచున్నాము. కబీరునే యొక మతకర్తను గా నెంచి యాతని మత మవలంభి ---- కబీరుపంథులను పేరఁ బిలువఁబడుచున్న వారు మనదేశమునందు దాదాపు తొమ్మిదిలక్షలమంది యున్నారు. వారు తమమతకర్తను గూర్చి చెప్పెడి కథలును అనంతములుగానున్నవి. ఈయన్నిటినిబట్టియు కబీరు మహాభక్తాగ్రేసరుఁ డయినట్టును గొప్ప మతసంస్కర్త యైనట్టును గ్రహింపవచ్చునుగాని యాతనిగుఱించి సరియైన చరిత్ర వ్రాయుటమాత్రము సాధ్యముకాదు.

కబీరు జన్మమునుగూర్చియు, అతని తల్లిదండ్రులను గూర్చియు, కథ లనేకములు వాడుకలో నున్నవి. బాల్యమునందు కబీరు ఒక తురకసాలెవానియింట పెరిఁగినట్లుగా కబీరుపంధులు చెప్పుచున్నారు. సిక్కుమతగ్రంథమైన యాదిగ్రంథమందు కబీరు తురకసాలెవాఁడని నానక మహాత్ముఁడు బాబరుచక్రవర్తితోఁ జెప్పినట్లుగా వ్రాయఁబడి యున్నది. కబీరుపాటలలోనే యొకదానిలో కబీరు తాను కొలఁదికాలములోనే నేతపని విడిచిపెట్టి కేవల హరినామస్మరణమునందే కాలము గడపఁబోవుచున్నానని చెప్పఁబడియున్నది. మఱియొకకీర్తనలో తాను పూర్వజన్మమందు బ్రాహ్మణుఁడైయుండి రామభజన చేయ మానుటచేత నీజన్మమందు తురకసాలెవాఁడుగా పుట్టినట్టు కబీరు చెప్పికొనియున్నాఁడు. అయినను, అతని తల్లి బ్రాహణవితంతువై యుండినట్లును, ఆమె తనతండ్రితోఁగలసి తీర్థయాత్రలుసేయుచు నొకసన్యాసి నిలిచియుండిన దేవళమునకుఁబోఁగా నత డామెభక్తికి మెచ్చి 'నీకు పుత్త్రసంతాన మగుఁ గాక' అని దీవించినట్లును, అంతటి మహానుభావుని దీవన మూరకే పోదు గనుక, యామె కొలఁది దినములకే గర్భవతియై లోకనింద కోడి ప్రసవమైనవెనుక తనకుఁ గలిగిన బిడ్డను బైట పాఱవేయగా నొక తురకసాలెవాని భార్యకు దొరికి యామె యపుత్త్రవతి యగుటచేత సంతోషముతోఁ దీసికొనిపోయి యా శిశువునకు కబీరను నామమునిడి ప్రేమతో పెంచినట్లును ఒకకథ చెప్పుచున్నారు. ఈకథకంటె ఈక్రిందికథ మఱింత విచిత్రకల్పనలతో నిండియున్నది. "ఉల్లోకమునుండి దిగి లోకమున కబీరు అవతరించెను. కబీరు అవతరించిన తావున తామరపువ్వు వికసించుచుండెను. భ్రమరములు ఝుంకారములు చేసిచే సి విసుఁగుజెందియుండెను. రాయంచలును భరద్వాజములును మఱి యితరపక్షులును ఆకసమున తమదారిని తా మెగిరిపోవుచు అతటాకముచుట్టును ప్రదక్షిణముచేసి మఱిపోవుచుండెను. అకమలాకరము మధ్యమున కమలగర్భమున కబీరు అవతరించినవేళ నుఱుములును మెఱుములును బ్రహ్మాండమున నిండియుండెను. 'నిరూ' యను సాలెవానిని బెండ్లియాడి యతనితోఁగలసి యత్తవారింటికిఁ బోవుచుండఁగా 'నిమా' యనునామెకు దారిలో దాహమయ్యెను. ఆమె యాతటాకమును సమీపించి యచ్చటనున్న యాశిశువును జూచి మిక్కిలి భీతిఁజెందినదయ్యెను. ఆశిశువునుజూచి యామె “ఎవ్వతియో బాలవితంతువుయొక్క యవమానమున కిది ప్రత్యక్ష దర్శనము కాఁబోలును!" అని హృదయములో తలపోసెను. ఆబిడ్డను తమయింటికిఁ దీసికొనిపోదమని 'నిరూ' సూచించెను గాని, యట్లు చేసినపక్షమున లేనిపోని లోకాపవాదము పాలవుదుమన్న భయముతో నిమా ముందుగా కొంచెము వెనుకదీసెను. "కమలములవంటి నేత్రములుగలిగి యత్యంత సౌందర్యముతో నలరారుచున్న యీపిన్న వానిని గన్న తల్లి యెవ్వతె?” యని యమ్మలక్క లడుగకుందురాయని వారిర్వురును గొంతసేపు తమలోఁదాము ఏమిసేయుటకును బాలుపోక శంకించిరిగాని తుదకు ఆభయములనన్నింటిని మూలద్రోసి యాశిశువుపైని కనికరము వహించిరి. వారిద్దఱును గృహము చేరినతోడనే స్త్రీలు మంగళగీతములుపాడి వారిని గృహప్రవేశము చేయించిరిగాని యాస్త్రీలు ఆశిశువు కంటఁబడిన తక్షణమే యేవేవో చెడ్డతలంపులు గలిగిఁ "ఈపిల్లవాఁడు దీనికి ఏలాగున కలిగినాడమ్మా!" యని తమలో తాము వితర్కించుకోసాగిరి అది విని నిమా తాను ఆపిల్లవానిని కనకుండగ నే సంపాదించితినని సమాధానము చెప్పఁగా, అప్పటినుండియు వారింక ప్రశ్నలడుగ మానివైచిరి.”

ఈవిధముగా కబీరు జన్మవృత్తాంతము లనేకము లనేకవిధములుగా నున్నందున నందేదియు యధార్థమని మనము వక్కాణింపఁజాలము. అయినను కబీరు బాల్యమునందు మహమ్మదీయులయింట పెరిఁగినట్లుగా నన్ని కథలును ఐకకంఠ్యముగా నుడువుచున్నందున మనము దానిని నిశ్చయముగా నమ్మవచ్చును. కబీరు బాల్యమున మహమ్మదీయుడైన సాలెవానియింట పెరుఁగుచున్నప్పుడే భక్తి యంకురించినట్లుగా చిహ్నములను గనబరుచుచుండెనని చెప్పుదురు. అతఁడు తనతోడివారైన హిందూబాలకులతోను మహమ్మదీయబాలురతోను ఆటలాడుకొనునప్పుడు సైతము తనభక్తిని గనఁబఱిచి యాయుభయులకును కూడ కోపము కలిగించుచుండెనట! ఆటలసందడిని కబీరు రామ! రామ! యనియు హరి! హరి! యనియు, గేకలు వేయుచుండఁగాఁ జూచి వీఁడు వట్టి కాఫరు (నాస్తికుఁడు) అని తురకబాలకులు అతనిని నిందించుచుండిరనియు, దానికి క కబీరు "ఎవఁడు చెడ్డపనిచేసిన, వాఁడే కాఫరు (నాస్తికుఁడు)" అని మాఱుపలుకుచుండెననియు, ఈవిధముగానే యొక సారి నుదుట బొట్టు పెట్టుకొని మెడలో జందెమువేసికొనఁగా తమయధికారమును దిక్కరించుచున్నాఁడని బ్రాహణబాలకులచే మహాగ్రహముతో నిందింపఁబడి యీక్రింది చందమున వారికి సమాధాన మిచ్చెననియుఁ జెప్పు చున్నారు.:--

"ఇదిగో! వినుఁడు నామతము! నాజిహ్వమే విష్ణువు, నానేత్రములే నారాయణుఁడు, గోవిందుఁడు నాడెందమునం దధివసించియున్నాఁడు. మీరు మృతులయిన వెనుక మీరు కావించియుండిన కర్మములనుగురించి యేమి సమాధానము చెప్పఁగలరు? నేను సాలెవాఁడను. కనుక నేను జందెము వేసికొందును. మీరు యజ్ఞోపవీతమును ధరింతురు; గాయత్రి పఠింతురు! దినదినమును గీతాపారాయణము చేయుదురు. కాని నాహృదయమునందే గోవిందుఁడు వసియించియున్నాఁడు. నేను పశువును, మీరు పసులకాపరులు. పాపములోఁ బడకుండ మమ్ము గాపాడవలసిన విధి మీది! మీరు బ్రాహ్మణులు, నేను కాళికానగరపు సాలెవాఁడను. నాబుద్ధి వినుఁడు! నేను హరిని ధ్యానించుచుండఁగా, మీరు ఎవ్వఁడో యొక యైహికవిభునిగూర్చి ప్రతిదినమును వెదకులాడుచుండెదరు!"

ఇట్లు కబీరు తన్ను నిందించువారికిఁ దగినట్లుగా సమాధానములు జెప్పుచు తనజ్ఞానాతిశయమును ప్రకటించుచువచ్చినను, తోడివారు మఱియేవిధమునను మాఱుపలుకఁజాలక గురువులేనివాని మాట పాటింపరాదని యతని వాక్యములను త్రోసివేయఁ జొచ్చిరి. అప్పుడు కబీరు తనకు గురువులేఁడన్న లోపమునుగూడఁ దీసివేసికొని తరువాత ప్రజల కందఱకును తనమతమును బోధింపవలయునని నిశ్చయించెను. ఆకాలములో నుత్తరహిందూస్థానమున రామానందుఁడను భక్తివర్యుం డొక్కఁడు విఖ్యాతయశుఁడైయుండెను. కబీరు అతనిశిష్యుఁడుగఁ గావలయునని యెంచెను. కాని తురకవాడైన తన్ను రామానందుఁడు తనశిష్యవర్గములోఁ జేర్చుకొని యుపదేశమొనర్చుట యసాధ్యమని కబీరు గ్రహించినవాఁడై యందులకొక యుపాయమును పన్నెను. రామానందమతస్థులకు రామమంత్రమే ప్రధానమైనదని యతఁడు గ్రహించి, యొక్కనాఁడు సాధారణముగా రామానందుఁడు తెల్లవాఱుజామున గంగాస్నానము నేఘట్టమునొద్ద చేయునో అఘట్టమునొద్దసోపానములమీఁద దారికడ్డముగా పడియుండెను. చీఁకటిలో మెల్లగా నడుగులు పెట్టుకొనుచు వచ్చుచుండిన రామానందునిపాదము క్రిందఁ బడియన్న కబీరుమీఁద పడఁగా రామానందుఁ డులికిపడి "అయ్యో నిష్కారణముగ నేజంతువుమీదనో పాదములువైచి బాధించితి నని తలఁచి "రామ! రామా! యని పలికెను. కబీరు రామానందుని వెంటఁబడి యప్పుడే గురూపదేశమైనది కాఁబట్టి తన్ను శిష్యునిగా గణియింపవలసినదని వేడుకొనెను. అతనిభక్తికి మెచ్చి రామానందుఁడు వెంటనే యతినిని తనఛాత్రునిగా నంగీకరించెను. అంతటినుండియు కబీరు మతబోధన చేయుటలోను ఇతరులతో వాదించుటలోను, తాను రామానందుని శిష్యుఁడ నని చెప్పుకో సాఁగెను. ఇతఁడు రామానందుని శిష్యుఁ డైనాఁడని విన్నతోనే తమబాలకుడు పోయి విమత మవలంబించి చెడిపోయినాఁడని మహమ్మదీయులును, మతాంతరునికి రామానందుఁ డెట్లు మంత్రోపదేశము చేసినాఁడని హిందువులును, ఒక్కపెట్టున నివ్వెఱపాటు జెందిరి. అప్పు డుభయమతస్థులును గూడి రామానందునికడ కరిగి మీమతములో నొకతురక చిన్నవానిని జేర్చుకొంటి రేమి? యని యడిగిరి. ఆసంగతి తన కేమియుఁ దెలియనట్లు రామానందుఁడు పలికి యా చిన్న వానిని తనకడకుఁ గొనిరమ్మని కోరెను. కబీరు రామానందుని సన్నిధి కరిగిన తోడనే రామానందుఁ డడ్డముగా నొకతెర వేయించి తాను లోనఁ గూర్చుండి "ని న్నెప్పుడు నేను శిష్యునిగాఁ జేర్చుకొంటిని" అని బైటనున్న కబీరు నడిగెను. మహాత్మా! ఈలోకములో గురువులు తమ శిష్యులకుఁ జెవిలో నుపదేశించు మంత్రము లనేకములు, నాశిరమును గొట్టి మీరే యొకనాడు రామమంత్రమును దెలియఁ జేసితిరి.” అని చెప్పినతోడనే రామానందుఁడు వెనుక జరిగిన సంగతినంతయు జ్ఞప్తికిఁ దెచ్చుకొని, యడ్డముగా వేయించిన తెరను త్రోషివేసి బైటికి వచ్చి కబీరుని కౌఁగిలించుకొని నిస్సందేహముగా నీవు నా శిష్యుఁడ వైతివి అని వక్కాణింపఁగా నచ్చటికి వచ్చినవారందఱును భంగపాటుతో నిండ్లకుఁ జనిరి. కబీరును తనయింటి కేఁగి నేత నేసికొనుచుఁ దనయింటికి వచ్చిన యతిథుల నభ్యాగతుల భక్తి తాత్పర్యములతో నాదరించుచుండెను. ఎవ్వరైన సాథు లరుదెంచునపుడు వారికి అదివఱకు వాడియుండిన కుండలలోఁ గాక క్రొత్తకుండలలో నన్నము వండింపించి పెట్టుచు, అసాధువులకు హిందువుల పద్దతులతో నేలను శుభ్రపఱచి యుచితాసనములు పెట్టుచు, వారు భిక్షవేయుతఱిని తాను భక్తితో నెదుట నిలువఁబడుచు నుండుట జూచి యతని తల్లియైన నిమా మిక్కిలి యసహ్యతను బూని యాతని చేష్టితములన్నియు కులాచార విరుద్ధములుగా నుండెనని నిందించుచుండెను.

కబీరు బాల్యమునుండియు నిట్లు సాధుసాంగత్యము చేసి భక్తిజ్ఞానములు సంపాదించెను. కబీరుయొక్క యుపదేశవాక్యము లనేకము లీతనికి హిందూమతసాంప్రదాయములు బాగుగఁ దెలిసియున్నట్లు ప్రబలసాక్ష్య మిచ్చుచున్నవి. ఈ పరిజ్ఞానము చాలవఱ కతఁడు పండితులతో వాదములు సలిపి సంపాదించినదే. కబీరునకు గ్రంథపరిజ్ఞాన మంతగా లేదని చెప్పుదురు. అయినను పరులతో మతవిషయకమైన చర్చలు జరపియుండుట చేతను సూక్ష్మబుద్ధియు నపారభక్తియు విశేషచింతనయుఁ గలవాఁడగుటచేతను, అతని పరిజ్ఞాన మసమాన మయ్యెను.

కబీరుదాసునిభక్తి కేవల మీశ్వరధ్యానకీర్తనములందేగాక యీశ్వరప్రీతికరములైన కార్యములు చేయుటయందును వెల్లడియగుచుండెను. అతఁడు తాను వస్త్రములు నేసి విక్రయింపఁగా వచ్చిన యల్పధనములోఁ గొంత తనతల్లి కిచ్చి,తక్కినది సాధుల నాదరించుటయందును దీనులఁ బోషించుటయందును వినియోగపఱుచుచుండెను. ఇతరు లెవ్వరు వనటఁ దూలుచున్నవా రని విన్నను వారికిఁ దోడ్పడి వారియార్తి హరింపఁజేయుటకై యీకాల మాకాల మను నియమము లేక యాతఁ డింటినుండి యాకస్మికముగా మాయమై పోవుచుండును.

కబీరు యావజ్జీవమును బ్రహ్మచర్యమునె నడపెనా? లేక వివాహితుఁడయి సంసారముచేసి బిడ్డలఁ గని కుటుంబికుఁ డయ్యెనా?యను విషయము పలువుఱు పలువిధముల నభిప్రాయపడుచున్నారు. అతఁడు లోయి యను కాంతను వివాహమాడి కమాల్ అను తనయుని, కమాలి యను తనయను, గాంచెనని యనేకులు తలంచుచున్నారు. ఈతలంపునకుఁ గారణ మెట్టిదో, చాలాకాలముక్రిందట బొంబాయినగరములోఁ బ్రచురింపబడిన కబీర్ కసౌతి యను హిందీగ్రంధమునందలి యీక్రింది సంగతులను జదివినపక్షమున తేటతెల్ల మగునని యొకానొకరు వ్రాయుచున్నారు :—

కబీరుదాసునకు ముప్పదివర్షములప్రాయము వచ్చెను. అతఁ డొకానొకదినమున గంగానదీతీరమున నడచి పోవుచు, తుదకొక్క వసఖండిబైరాగి వసియించు కుటీరమును సమీపించి యచ్చటికిఁ బోయి కూరుచుండెను. కొంతవడికి అతావునకే యిర్వదియేండ్ల ప్రాయమున నున్న కన్నియ యొక్కర్తు వచ్చి, క్రొత్తగా వచ్చి విశ్రమించియున్న యా పురుషునిం జూచి "అయ్యా! మీ రెవ్వరు అని పృఛ్ఛచేయఁగా, “నేను కబీరును" అని యతఁడు సమాధాన మిచ్చుటయు, నంతటితో నూరకుండక యాయువిద "మీవర్ణమెయ్యది మీశాఖ యేది?” యని మరల ప్రశ్న చేసెను. ఈరెండు ప్రశ్నలకునుగూడ "నేను కబీరురు” అనియే పైరీతిని ప్రత్యుత్తర మీయఁగా, నింతవఱకు సాధులెందఱో యిచ్చటి కరుదెంచిరి గాని వారిలో నిట్లు తమపేరును వర్ణమును శాఖనుగూర్చి చెప్పిన వారొక్కరును లేరని యామె వచియించెను. “నేను చెప్పినదానిలో నసత్య మెద్దియు లేదు" అని కబీరు వక్కాణించెను. ఇట్లు చెప్పుటలో కబీరుయొక్క యుద్దేశము స్పష్టముగాఁ దెలియుచునే యున్నది, "కబీరు" అనఁగా మహాదేవుఁడైన పరమాత్ముఁ డని యర్థము. తనకేమియు వర్ణభేదము లేదనియు, మనుష్యులందఱును దేవుని సేవకులే యనియు సూచించి యీవిధముగా హిందూమహమ్మదీయుల నేకముచేయుటయే కబీరు తనసందేశముగాఁ జేసికొన్నట్లుగా నిట్టికథ లనేకములు స్పష్టపఱచుచున్నవి. ఇంతలో నచ్చటికి మఱికొందఱు సాధు లేగుదెంచిరి. తోడనే యాకన్యక తనకుటీరములోనికిం జని కుండతో పాలు తీసుకొనివచ్చి యేడుభాగములుగాఁ జేసి యం దైదు భాగములు క్రొత్తఁగా వచ్చిన బైరాగులకును ఒకపాలుకబీరునకు నిచ్చి, తననిమిత్త మొకపాలుంచుకొనియెను. తనకిచ్చినభాగమును కబీరు త్రాగివేయకక్రిందఁబెట్టియుంచెను. తక్కినబైరాగులు తమ తమపాలను త్రాగివైచిరి. కబీరు త్రాగకుండుటకు వారు కారణ మరయసాఁగిరి. గంగానది యావలియొడ్డునుండి యొకసాధువు వచ్చుచున్నాఁ డనియు, తనపాలు అతనికొఱ కుంచితి ననియు కబీరు చెప్పఁగా 'స్వామీ! ఆసాధువు వచ్చినయెడల నాయొద్ద వలయు నన్నీ యున్నవి. మీపాలు మీరు గ్రహింపుము' అని యా బాలిక వేఁడుకొనియెను. "హరినామమే నా కాహారము" అని కబీరు పలికెను. ఇంతలో నవ్వలియెుడ్డునుండి యొక సాధు నచ్చోటికి విచ్చేయఁగా, కబీరు తనవంతుపాల నాతని కిచ్చివేసెను. అట్టి నిర్జనప్రదేశమున నొంటరిగా నుండుటకు హేతువే మనియు, తల్లిదండ్రు లెవ్వార లనియు, నంత నాకాంతను సాధువు లడుగ సాగిరి. అందున కామె తనతల్లిదండ్రులు జీవించి యుండ లేదనియు, తన్నొక్కసాధువు పెంచి పెద్దఁ జేసెననియు, అంతకు ముందు కొంత కాలముననే యాతఁడును లోకాంతరగతుఁడైనందున తానొక్కతియే యుండుట తటస్థించినదనియుఁ దెలియఁ బఱచెను. అంతటితో వారు తృప్తి నొందక తక్కిన యుదంత మంతయు వినఁ గుతూహలము కలవారై 'అమ్మా! అసాధుపురుషుఁ డెవ్వాఁడు? అతడునిన్నుఁ బెంచుటెట్లు కలిగె!' నని మఱల నడుగుటయు, నామె యిట్లని యుత్తర మొసంగెను. "ఆసాధుపురుషుఁ డొకవనఖండి బైరాగి, అతఁ డొక్క యావుపాలు మాత్రమే త్రాగి జీవించు వాఁడు. నాపూర్వ చరిత్రమును గూర్చి యితరు లాతని నడుగునప్పు డిట్లు చెప్పుచుండెను. 'నేనొక్కనాడు గంగాతరంగిణిలో స్నానము చేయుచుండఁగా నొకతట్ట కొట్టుకొనివచ్చి నాకుఁ దగిలెను. అది పైకిఁ దీసి చూచినతోడనే యాఁడుశిశువు కనఁబడెను. అప్పు డాశిశువును కుటీరమునకుఁ గొనివచ్చి యావుపాలలో ముంచిననత్తితోఁ బెంచితిని. మొదట నాకు తట్టలో దొరకినప్పు డీబిడ్డ దుప్పటిలోఁ గప్పి యుంచఁబడియుండుట చేత 'లోయి' (దుప్పటి) యనుపేరు పెట్టితిని. ఈవిధముగా నన్నుఁ గూర్చి యాస్వామి సాధులతోఁ జెప్పుచుండఁగా నేను వినియుంటిని.'

కబీరు యొక్క సాధుస్వభావమును గురులక్షణమును గాంచి లోయి యాతని నుద్దేశించి "స్వామీ! నాకు చిత్తశాంతిని ప్రసాదింపఁగల సదుపదేశము చేయుఁ" డని పలికెను. అబాలిక భక్తివిశ్వాసములు దీపింప, చిత్త శుద్ధి యొసంగ, నిట్లు వేఁడికొన్నందులకు కబీరు సంతోషతరంగితస్వాంతుడై “నిత్యమును సత్యనామమును స్మరియింపుము. సాధుసేవ గావించుకొనుచుఁ గాలము గడపుము" అని యుపదేశించుటయు, లోయి యా వాక్యములఁ దలఁ దాల్చి, యైహికవిషయచింతనమును దెగనాడి, వారణాసికిఁబోయి, సాధుసేవ యొనరించుచుఁ బ్రొద్దులు పుచ్చ సాఁగెను. ఇట్లు కబీరు తనతో నీకాంతను కాశికిఁ గొనివచ్చుట చూచి యతఁ డామెను చేపట్టినట్టుగా భ్రమపడి నిమా, యాతనిం గని యిట్లనియె, "బిడ్డా! లోయితోఁ గాపురము చేయక వేఱుగా నుంటివి కదా? ఇంక నీవామెను పెండ్లియాడిన ప్రయోజనమేమి?" ఇట్లే పలువురు కబీరు వివాహితుఁ డైనట్లు భావించి లేని పోని కధ లల్లఁ జొచ్చిరి.

లోయియును కబీరును భార్యాభర్తృసంబంధము కలవారని లోకము భ్రమపడుటకు మఱియొక యంశము కూడ తో డయ్యెను. ఒకనాఁడు కబీరు వేఱొక భక్తునితోఁ గలసి గంగానదీతీరమున నడచుచుండఁగా, నదిలోఁ గొట్టుకొని పోవుచుండిన యొక శిశువు కానవచ్చెనఁట. ఆసహచరుని కోరికపై కబీరు ప్రవాహములోఁ బడి కొట్టుకొని పోవు శిశువును పైకిఁ దీసి, యాశిశువు చెవిలో భగవన్నామము స్మరియించి బ్రతికించి, తోడ గొనివచ్చి లోయి కిచ్చి పెంపవలసిన దని చెప్పఁగా నామె మక్కువతో నాశిశువును పెంచి పెద్దవానిం జేసె నఁట! ఆశిశువు సౌందర్యాతిశయముఁ జూచి నప్పుడే కబీరు ఆబిడ్డనికిఁ "కమాల్" (పరిపూర్ణార్థకపదము) అను పేరుపెట్టెనఁట! ఇది చూచి కొందఱు కబీరు మృతు లయిన వారిని బ్రతికింపఁగల మహాత్తుఁ డని నమ్మసాగిరి. మఱి కొందఱు అబిడ్డఁడు కబీరునకు లోయి వలనఁ గలిగినవాఁడే యని యూహించిరి.

ఇట్లుండ మఱియొక్కనాడు కబీరు ఒకరి గృహములో నుండఁగా వారి యాఁడుశిశు వొక్కతె మరణింపఁ దటస్థించెనఁట! మరణించిన బిడ్డను గని తల్లిదండ్రు లాక్రందనము సేయుచుండఁ గాంచి కబీరు తన కామృతశిశువు నీయవలసిన దని యడుగుటయు, అంతకు మున్ను తన దివ్యమంత్రప్రభావముచేత కమాలును బ్రదికించిన మహానుభావుఁ డని విని యున్నది కావున శిశువుతల్లి యందుల కంగీకరించె నఁట! అనంతరము కబీరు దివ్యశబ్దపునశ్చరణము చేసి యా శిశువును పునరుజ్జీవింపఁ జేసి, కమాలి యను నామ మొసంగి యీయాఁడుపిల్లను గూడఁ బెంపవలసిన దని లోయి కిచ్చివేసెనఁట. ఇట్లు కబీరుచే బ్రతికింపఁ బడిన పిల్ల లిద్దఱును వయసు వచ్చిన తరువాత కబీరును తాము, "స్వామీ! స్వామీ! యనిపిలుచుచు నాతని గృహమునందేయుండి వస్త్రములు నేయుటలో నాతనికి దోడుపడుచుండి నట్లు తెలియవచ్చుచున్నది. అందుచే వీరిద్దఱును కబీరుదాసునకుఁ గలిగిన బిడ్డలే యని లోకులు తలంప సాగిరి.

కమాలి యొక్క తరువాతి చరిత్ర సంగ్రహముగా నిట దెలుపవలసియున్నది. ఆమె యౌవనవతియై యిర్వదియేండ్ల ప్రాయము వచ్చియున్నప్పుడు ఒక్కనాఁడు కబీరుదాసు గృహము చెంత నున్న నూతిలో నీళ్లుతోడుకొనుచుండగా, మార్గాయాసముచే గడు డస్సి పిపాసాపీడితుఁ డైన యొక బ్రాహ్మణపండితుఁ డాదారిని బోవుచు, నీరువట్టు చేర్చుకోవలయునని యాకాంతచెంత కేతెంచి యిన్ని నీళ్లుచేఁది పోయు మని యడిగెను. ఆపండితుఁడు కమాలి కృపాయత్తచిత్తముతోఁ దోడి యిచ్చిన చల్లని జలముల మనసారఁ ద్రాగి, యనంతరము “కాంతా! నీ వెవ్వరి కుమార్తెవో గాని ధన్యురాలవు సుమీ!" యని యామె యుదంతమును గొంత తెలియఁగోరెను. కాని, యామె తురక సాలెవాని తనయ నని తెలిపినతోడనే గుండెలో ఱాయిపడి "నాకొంప దీసి నాకులముఁ జెఱిచి నన్ను వర్ణభ్రష్టుని జేసితివి కదే! " యని యెంతయు వాపోవఁ దొడంగెను. ఆ పురుషుఁ డిట్లు క్రోధావేశపరవశుడైఁ దురంతచింతాక్రాంతుఁ డగుటకుఁ గారణ మేమి కానోపునో యూహింప నేరక, కమాలి యాతనిని వచ్చి కబీరుతో సంభాషించి పొమ్మని కోరుటయ నీమాటలువిని కబీరు ఈక్రింది చందమున సహధానమిచ్చెను: —

"ఓబ్రాహ్మణా! జలపానముసేయుటకు ముందీయంశములను గుఱించి విచారించునది. మైలపడుట యన నేమి? చేఁపలు, తాబేళ్లు రక్తము, ఉప్పు చెత్త, చెదారము, మృతకళేబరములు, – ఇవన్నియు నీటఁ దడసియుండను. కాలవశమున లక్షోపలక్ష జనులు మృతు లగుచున్నారు. నీవు ముందునకు పెట్టి నట్టి యడుగడగునకును ఎన్నఁడో మృతుఁ డయిన యెవ్వాని దేహము మీఁద నుండియో త్రొక్కికొనియే పోవుచున్నావు. అట్టి మట్టితోఁ జేయఁబడిన పాత్రములతోనే కదా నీవు నిత్యమును నీరు త్రాగుచున్నది? మైల కలుగు నన్న భీతితో భోజనవేళ కట్టువస్త్రములఁ దీసివైచి సాలెవానిచే నేయఁబడిన దోవతుల మేనెల్లఁగప్పుకొనుచున్నావే కాని, మలినపదార్థముల మీఁదినుండి యెగిరివచ్చి యీఁగలు నీవు భుజింపఁబోవు నాహారము మీఁద వ్రాలుచుండుటను గనఁజాలకున్నావు. దీనిని నీ వెట్టు లడ్డపెట్టగలవు చెపుమా? అట్టి వట్టి భ్రమలను మదినుండి పోఁదోలి వేదములఁబఠించి, రాముని శరణు జొచ్చుమా!” ఈవాక్యములను విన్న యాబ్రాహ్మణుఁడు తనలో నా తురకసాలెవాఁడు నిశ్చయముగా మహాత్ముఁడై యుండవలయు నని తలంచి, యింకను తనకు జ్ఞానబోధన చేయు మని భక్తిపూర్వకముగా వేడుకొనియెను. కబీరు అందులకు సమ్మతించి యీశ్వరగుణగణములను గూర్చియు, ఏకేశ్వరారాధనావశ్యకతను గూర్చియు, తనయభిప్రాయములఁ దెలుపుచు నుపదేశించెను. ఆయుపదేశము చేసినతోడనే యందలి సత్యమును దెలిసి యా బ్రాహ్మణ పండితుఁడు కబీరుమహాశయుఁ డుపదేశించిన సద్ధర్మముల నన్నింటిని స్వీకరించెను. స్వీకరించిన సద్ధర్మము స్వాదరణమునందు సువ్యక్త మయినప్పుడే శోభఁజెంది యుపయుక్త మగునుకదా! ఆబ్రాహణుని యంగీకారమును బడసి, కబీరు తనపెంపుడు కూఁతురైన కమాలి నిచ్చి యాతనికి వివాహము చేసెను. ఈవిధముగా కబీరు సత్యబోధనము విజయము గాంచుచు, బహుదేవతారాధనపరులై విగ్రహపూజానిరతులై జాతివిద్వేషపూరితులై యుండినవారిని, ఏకదైవతోపాసకులుగాను సమదర్శినులు గాను క్రమముగా మార్చఁ గలుగుచుండెను.

సామాన్యుఁడును, గ్రంథపరిజ్ఞాన మంతగా లేని వాఁడును, అయిన యీతని బోధనలు ఇట్టి మహత్తరశక్తి కల వగుట కేమి రహస్యమున్నది? వేదవిదు లయిన పండితోత్తములు, శాస్త్రపరిచితి గల విజ్ఞులు, కబీరుతో వాదింపజాల కుండిరి. అతని సత్యబోధనప్రభావము నెదుట నన్యుల ప్రజ్ఞలు తమతమ తలలు వాఁచుచుండెడివి? దీనికిఁ గారణ మేమి? సకల సత్యములకును మూలమైనవాఁడును, అలఘుదుర్ జ్ఞానతిమిరములకు నెల్ల నమోఘప్రభాకరుఁడును అయినవిశ్వేశుని కబీరు తన హృదయుమునఁ గనఁ జాలెను. అట్టి సర్వశక్తిమయుని ప్రాపు నమ్మినప్పుడు అట్టివానికి మఱేకొఱఁత యుండును? భక్తిప్రభావముచే తనకట్టి యానందము, అట్టి మహత్తరశక్తి, కలిగినవని గ్రహించినవాఁ డగుట చేతనే, తోడి మానవుల నీశ్వర సాక్షాత్కారము నుండి మఱుఁగుపఱుచుచుండిన బహుదేవతారాధనము వ్యర్థకర్మాచరణ పరత్వము, ద్వేషము, మాలిన్యము, మున్నగు వాని నన్నింటిని తీవ్రతరముగ ఖండించుచు దేశదేశములు గ్రామగ్రామములుతిరిగి జనసామాన్యము ఏకదైవమతోపాసనావశ్యకతను గ్రహించి, యసన్మార్గమును వీడు నట్లు చేయవలయు నని యతఁడు బోధించుచుండెను. కబీరు బోధపపద్ధతి మిక్కిలి యద్భుతమైనది. అతఁడు విగ్రహార్చనమును ఖండించు నట్టియు, వ్యర్థకర్మమున నిస్సారతను వ్యక్తముచేయు నట్టియు, బ్రహ్మజ్ఞానమును బోధించునట్టియు, నీతివర్తనమును గఱపు నట్టియు, స్వకీయములయిన భగవత్కీర్తనలను పాడుకొనుచు, వీథుల వెంబడి నూరురుతిరిగి పోవుచుండును. జనులు గుంపులుగా వచ్చి యాతని హితబోధ యాలించుచుందురు. జనులు సాధారణముగా నజ్ఞానవిమోహితులై ఐహికజీవనమే శాశ్వతమనియు, ఐహికసౌఖ్యములను పొంద ప్రయత్నించుటే మనుగడ యొక్క సార్ధకత యనియు, నమ్మి నిత్యానిత్యవిచారములేక వర్తించుచుందురు. అట్టి వా రందఱును నిత్యసౌఖ్యప్రద మైన భగవత్సేవను చేయ మఱవవల దని యాతఁ డుపదేశించెను. చాలమంది యీశ్వరతత్త్వమును గ్రహింప నేరక బహుదేవతలను నమ్మి ఱాలను ఱప్పలను గొలిచి వెఱ్ఱిసంతుష్టి నందుచు, నీశ్వరారాధనము వలనఁ బొందవలసిన యానందమును బలమును బొంద నేరక దుర్గతుల పా లగుచున్నారు. అట్టి పామరజనాళి కెల్ల దేవు డొక్కఁడే సమస్తజనసంసేవ్యుడం డనియు, భగవద్భక్తికి పరమశత్రువు అయిన స్వార్థపరత్వము, దురహంకారము, ధనకాంక్ష, విషయలోలత, మున్నగువానిని పరిత్యజింప వలయు ననియు, ఒక్క పరమాత్ముని గొల్వఁగాఁ గలుగు నానందముతో నీలోకములో సంపన్న త్వాదులచేఁ గలుగు తాత్కాలిక సౌఖ్యము లెవ్వియును తుల్యము కానేర వనియు, నాతఁడు తెలిపెను. ఒక్కఁడే భగవంతుఁడను పరిజ్ఞానమును విడనాడి తమలో తాము మతభేదములను వర్ణభేదములను కల్పించుకొనుచుఁ జెడువారి దుస్థితిని జూచి యాతఁడు నిజముగా శోకించుచుండును. మతభేదముల వలనను, జాతి విద్వేషముల వలనను, కలిగిన మహాయుద్ధముల వలనను, కలుగుచున్న బ్రబల విరోధముల వలనను మానవసంఘ మేరీతి దుర్గతులఁబడుచుండెనో యీతఁడు బాగుగ గ్రహించినవాఁ డగుటచే సంఘాభివృద్ధి కవి వేరుపురుగు లని పలుమా ఱుద్ఘోషింప సాగెను. ఈశ్వరుని సమీపించు నట్టి యధికారమునకు వారు వీ రను నంతరము లేక యెల్లవారును సములే యనియు, వివేకమును విడవాడి ప్రతిపూర్వాచారమునకును దాసులై యుండుటయు మతసిద్ధాంతములను గూర్చి కేవలవాదాపేక్షతోఁ దగవు లాడుచుండుటయు, నెవ్వారికిని దగ దనియు, భక్తివిశ్వాసముల చేతనే గాని కేవలకర్మాచరణముచే ముక్తిచేకూరనేర దనియు, సంపూర్ణభగవద్భక్తి సమస్తభయములను భంజింపఁజాలు ననియు, నాతఁ డుపదేశించిన యుపదేశములు మిక్కిలి యుత్తమములైయున్నవి.

కబీరు జనుల కుపదేశించు పద్ధతిని బాగుగఁ దెలుపుటకై యొకటి రెండు కధలను దెలిపెదను. హిందువులు కొన్ని నదులను పవిత్రముగా నెంచి యచ్చటికిఁదీర్థయాత్రలు సేయుచు, అందు స్నాన మాచరించినందుననే తమ కావించిన సమస్త దోషములును హరించు నని విశ్వసింతురు. అట్టి వారి కడకుఁ బోయి కబీరు సత్యజ్ఞానమును గీతములతోఁ దెలుపుచుండెను. ఒకనాఁడు బ్రాహ్మణులు కొందఱు చేరి గంగాజలము పాపులను పవిత్రులను గాఁ జేయ సమర్థము కల దని యుగ్గడించుచుండిరి. ఆమాటలు విని కబీరు తోడనె తన కమండలువు నిండ గంగాజలమును దీసికొని వచ్చి వారి నా నీరు త్రాగవలసినదని యడిగెను. అధమజాతివాని చేతి నీరు త్రాగుట యన్న తోడనే మిక్కిలి యేవపడి వారందుల కంగీకరింపరైరి. .అంత కబీరు వారినవలోకించి "అయ్యా! గంగానదీజలము నా పాత్రమునే పరిశుద్ధము చేయఁజాల నప్పుడు అది నాపాపముల నెల్ల హరించి వేయఁ గలదని యెట్లు నమ్ముదును ?' అని బుద్ధివచ్చునట్లు పలికెనట. ఈ సందర్భమున నాతని యుపదేశములు కొన్ని యుదాహరింపవలసి యున్నది.

"కబీరు చెప్పుచున్నాఁడు – నా కేమియుఁ దెలియకున్నది? తీర్థమెక్కువా ? హరిదాసుఁ డెక్కువా? "

"జలము సమీపముననే యున్నది. కాని యందులోనే నడచిపోవుచు పశువులు దానిని త్రాగతున్నవి. తఱుచు హరినామస్మరణము సేయుచున్న పక్షమున జలము పొంగిరాఁగలదు. ఆజలమే పరిశుద్ధిమైనది. ఇది కబీరు వాక్కు." "వాని హృదయములో కల్మష మున్నది. తీర్థము నొద్ద స్నాన మాచరించినను వాఁడు మోక్షమును పొందఁడు. జనులకు నమ్మక మున్నంత మాత్రము చేత నేమియు జరుగదు. రాముఁడు తెలివి తక్కువ వాఁడు కాఁడు.”

ఆకాలములో విగ్రహారాధనము ప్రబలమై జనులను సన్యస్త వివేకులనుగఁ జేసినదనియు, అట్టి నీచస్థితిలో నున్న వారి నుద్ధరింపవలయు నని కబీరు గట్టిగా సమకట్టె ననియు నింతకు ముందే సూచింపఁబడినది.

ధర్మదా సను వైశ్యుఁ డొకఁ డుండెను. అతఁడు మిగుల భాగ్యవంతుఁడై నిత్యమును సాలిగ్రామపూజ గావించుచు, భాగవతులను బైరాగులను సత్కరించుచు, భగవద్గీతాపారాయణ మొనర్చుచు శ్రీకృష్ణుని గొనియాడుచు, ఆత్మశాంతికొఱకై పుణ్యక్షేత్రముల నెల్ల మెట్టుచుండును. అతని కొక్కనాఁడు కాశికానగరమునందు కబీరుదాసు దర్శనము ప్రాపించెను. ధర్మదాసుని యుదంతము విన్నతోడనే కబీరు విగ్రహార్చనమును విడనాడి మనస్సు నేకేశ్వరుని వైపునకు మరల్పనంతకాల మాతనికి నిక్కమైన శాంతి చేకూరనేర దని బోధించెను. తర్వాతఁ గొంతకాలమునకు ధర్మదాసు బృందావనమునందు కబీరు కంటఁబడఁగా, నాతఁ డింకను విగ్రహపూజను బరిత్యజింపలేదని విన్నతోడనే, ఖండితముగా నతనితో నది కూడ దని వక్కాణించి యాతఁడు పూజించు సాలిగ్రామమును గైకొని కబీరు దానిని గంగలోఁ బారవైచెను. మఱికొంతకాలమునకు మఱల వారిరువురును గలసికొన్నప్పుడు సైతము అతఁ డింకను ఱాలఁ గొలుచుట మానలే దని తెలిసికొని కబీరు ఇట్లనియె; - "ఓయీ ! ధర్మదాసా ! నీవు నీవ్యాపారమునం దుపయోగించు తూనికఱాళ్లు వేనితోఁ జేయఁబడినవో వానితోనే చేయఁబడిన విగ్రహములను నీ వెట్లు దైవతములని పూజింపనేర్తువో యాశ్చర్యకరముగా నున్నది "ఈవాక్కులు ధర్మదాసుని మనమ్మున జక్కఁగా నాటెను. అప్పటినుండి ధర్మదాసు ధర్మపత్నీ సమేతముగా కబీరుమార్గము నవలంబించి మించెను. మతమహావృక్షమునకు వేరుపురు గనందగిన విగ్రహారాధనమును రూపుమాపి యెట్లయినను ప్రజల జ్ఞాననేత్రము విప్పవలయు నని కబీరు మిక్కిలి యభిలషించుచు, అందుకొఱకై నిరంతరము విచారించు స్వభావముకలవా డయినట్లు ఇట్టి కథలే గాక యాతనిచే నుపదేశింపఁబడిన ధర్మములును స్పష్టముగాఁ దెలుపుచున్నవి. "ఓసాధులారా ! లోకము పిచ్చిమార్గమునఁ బడిపోయినది, నేను సత్యమును చెప్పితినేని లోకులునన్ను చంపుటకై నామీఁద పడవత్తురు. వారు కేవలాసత్యమునె విశ్వసింతురు. క్రమము దప్పక నిత్యమును పాతఃకాలమున స్నానములుచేయు భక్తి సంపత్తి సంపన్నులను నే నెందఱినో చూచియున్నాను ! కాని వారు భగవంతుని వర్జించి ఱాలను భజింతురు. వారికి నిజముగా వివేకము లేదు. వారు రాగిబొమ్మలను రాళ్ళను పూజింప మొదలుపెట్టి, తాము తీర్థయాత్రలు చేయుచుంటి మరి సంతుష్టిమై గర్వించుచున్నారు. వారు తావళములు ధరించి, నామములు టోపీలు చక్రాంకితములు పూని తమతమ దేవతలను స్తుతించి కీర్తించుచు కాలము గడపు చున్నారు; వారు భగవంతుని వర్జించివేసినారు, ఱాలను పూజించినందువలవ నొకనికి ఈశ్వరసాక్షాత్కార మయ్యెడు పక్షమున, నేను మహాపర్వతము నొకదానిని పూజించెదను. ఈఱాతి విగ్రహములకంటె ఇంకను మనుష్యులు బియ్యము విసరుకొను తిరుగలిఱాళ్లు నయము. తమ పాదముల మీఁద సైతము పడి కన్నులనీరు గారునట్లుగా నే నెంత ప్రార్ధించినను హిందువులు విగ్రహారాధనమును విడువకున్నారు; మహమ్మదీయులు తలబిరుసుదనముచేత తమమూర్ఖతను బాయకున్నారు.” ఇట్టి యుపదేశవాక్యములు కబీరు చెప్పినవి యనేకములు కలవు.

ఈవిధముగా కబీరు ధీరచిత్తుఁడై హిందూమతలోపములను మహమ్మదీయుల దుర్వర్యసనములను బహిరంగముగా ఖండించుచుండుటచేత ఆయుభయులందును గూడ నతనికి శత్రువులనేకులు బయలుదేరిరి. తురకలలో గొందఱు ప్రముఖులు బయల్వెడలి కబీరు భగవంతుని కున్న లక్షణములు తానే కలిగి యున్నట్లుగా చాటుచున్నాడనియు అందుచేత మహమ్మదీయ మతధర్మము ననుసరించి యాఁతడు తప్పక వధ్యుఁ డనియు అప్పుడు చక్రవర్తిగా నున్న సికందరులోడీ కడకుఁ బోయి మొఱపెట్టుకొనిరి. అప్పుడు కబీరును పట్టి బంధించి తనయెదుటికిఁ గొనిరావలసిన దని చక్రవర్తి యుత్తరు సేయగా భటులు పోయి కబీరును గలసికొని సంగతితెలిపి సాయంకాలమునకు గాని యాతని నొప్పించి చక్రవర్తి సన్నిధికి దీసికొని రాజాలరైరి. ఉదయముననే రావలసినదని యుత్తరు వీయఁగా సాయంకాలము వఱకును తడసిరాకుండుటకు హేతు వేమని చక్రవర్తి కబీరు నడిగెను. ఇంతలో కబీరు చక్రవర్తికి మొక్కకుండుటను జూచి యచ్చటి యాచార్యుఁడొక్కఁడు 'ఓరీ కాఫరా! (నాస్తికుఁడా) చక్రవర్తికి నీ వేల మ్రొక్కకున్నావు?' అని యడుగ, 'అన్యులబాధల నెవ్వాఁడు గ్రహించునో వాఁడే సీరు; అట్లు చేయఁజాలని వారే కాఫరులు' అని సమాధానమిచ్చి, చక్రవర్తిని జూచి, తాను వచ్చుచుండఁగా నొకవిచిత్రము కనఁబడి తనదృష్టి నరికట్టినందున తా నంతవఱకు నాలస్యము చేయవలసి వచ్చె నని యు"త్తర మిచ్చెను. చక్రవర్తియాజ్ఞల సైత ముల్లంఘింపఁ దగినంతటిది యేమి కనఁబడిన దని మరల చక్రవర్తి యడుగ, సూదిబెజ్జముకంటె సన్నముగా నున్న యొక వీధిలో నుండి గుంపుగుంపులుగా నొంటెలు పోవుచుండఁగాఁ జూచితి నని కబీరు చెప్పెను. అది కేవల మసత్య మని చక్రవర్తి యనెను. అంత కబీరు 'ప్రభువరా! అకసమునకును భూమికిని మధ్యమం దెంతదోర మున్నదో కొంచె మాలోచింపుము. సూర్యచంద్రులమధ్యమం దున్న స్థలములో నసంఖ్యము లయిన యేనుంగులును లొట్టియలును ఉండవచ్చును; అవన్నియుఁ గూడ సూదిబెజ్జముకంటె సన్నముగా నున్న కంటిపాప గుండఁ జూడవచ్చును గదా!' యని ప్రత్యుత్తర మీయఁగా, దీనితో సంతుష్టిపొంది చక్రవర్తి యాతనిజ్ఞానము గ్రహించి, కబీరును విడిచిపెట్టెను. చక్రవర్తి యిట్లు అతనిని విడిచిపెట్టినందులకుఁ దమలో దాము గొణుగుకో సాగిరి. తరువాత, బ్రాహ్మణులును కబీరు అనుమానాస్పదమైన వర్తనముగల స్త్రీతో వర్తించుచున్నాఁ డనియు, రామదాసను మాదిగ వానిని భక్తుని జేసి యాతనితోఁ గలసి తిరుగుచున్నాఁ డనియు నిందింప జొచ్చిరి. కబీరు తనమతధర్మములను చక్రవర్తికిఁ దెలిపినట్లును, చక్రవర్తి ప్రజలపక్షమునే వహించి కడకు కబీరును చంపి వేయవలసిన దని యుత్తరు విచ్చినట్టును, కబీరు తనమహిమచేత పలుమారు మృతిని దప్పించుకొని చెక్కు చెదరక పైకి వచ్చినట్లును, అంత చక్రవర్తి యాతనిమహత్వమును గ్రహించి తానుచేసిన యకార్యములకై తన కేమి శిక్ష విధించెదవని యడుగఁగా కబీరు సజ్జనుఁ డెప్పుడును తనపాదములక్రింద ముండ్లను జల్లువారి పదములక్రింద పూలు చల్లవలయు నన్న సద్దర్మమును దెలిపినట్లును, ఒకకథ చెప్పుదురు, కాని యది యెంతవఱకు విశ్వసింపఁదగినదో మనము చెప్పఁజాలము.

కబీరు మృతిఁజెందులోపలఁ జేసిన మహత్తరకార్యము లెన్నో చెప్పబడుచున్నవి. కాని యవి సత్యము లయినను కాకపోయినను అతని సత్స్వభావమును భక్తివైరాగ్యములను ఆయన్నింటివలనను సువ్యక్త మగుచున్న దన్న యంశ మొక్కటి మనకుఁ జాలును. అవసానదశ ప్రాపించునాటికి కబీరు మిక్కిలి వార్ధక్యములో నుండెను. అతఁడు కాశిలో నివసించుట మాని కడదినములను మాఘారుపట్టణమునందుఁ గడపెను. తొల్లింటివలె కర్ణరసాయనముగ మధురగానముతో భగవత్కీర్తనములు పాడుచు చితారుపై వాయించుటకు వీలులేకుండునట్లుగా చేతులు పడిపోయెను. కాశీనగరమునందు తన్నుఁ జూడవచ్చి తనతో భగవద్ధ్యానము సేయు భక్తులును మిత్రులును నేఁడు తమమోము చూపకుండిరి. ఇట్లు తా నొంటరిగా కాలము గడపుచున్నను కబీరు తన కేకాంతవాసము కలిగిన దని యెన్నండును దుఃఖింపలేదు. తనప్రాణనాధుఁ డైన పరమేశ్వరుఁడే తన చెంత నుండఁగా మఱెవ్వరు లేకున్న నేమి యని యతఁడు నిశ్చింతలో పరమసంతుష్టితో నుండెను. ఈచందమున మాఘార్ పురమునందు కబీరు నిశ్చింతతోఁ దనయంత్యదినములను గడుపుచున్నను, ఆతని శిష్యవర్గము మాత్ర మతఁ డచ్చట నుండుట సమ్మతింపలేదు. దీని కొకకారణము కలదు. కాశిం జచ్చినవా రందఱును అనాయాసముగా కైవల్య మందుదురనియు, మాఘారులో మరణించినవా రందఱును మఱల నీలోకమునందే గార్దభజన్మము నెత్తవలసినవా రగుదు రనియు, అందుచేత పుణ్యక్షేత్రమైన కాశికయందే మరణించువఱకును నిలిచియుండుట మంచిదనియు కబీరునకు వారు హితబోధచేసిరి. ఈ వాక్యములను విన్నతోడనే వారివిశ్వాసరాహిత్యమునకు కబీరు నిందించి శివనివాసమైన కాశీనగరమందుఁ గాక వేఱొక చోట తనభక్తుఁ డొక్కఁడు ప్రాణములు విడువ నిచ్చగించుచుండఁగా వానికి విముక్తి నియ్యఁజాలనంత యత్యల్పముగా నున్నదా యేమి శ్రీరామమహిమ! యని వక్కాణించెను.


గీ॥ క్షితిని మాఘా రదేమి? కాశిక యదేమి?
     చావలేదు మాఘారునఁ జచ్చునతఁడు
     తనర రాముండు వానిచిత్తమున నిలువ;
     నిట్టు లెంచక పెఱచోట నెవఁడు జచ్చు
     వాఁడు రాముని నవకీర్తిపాలు సేయు.


అని కబీరుదాసుఁడు అట్టి యవస్థయందే యొక్క కీర్తనము చేసెను. దీనింబట్టి భగవంతుఁడు సర్వవ్యాపియై సమదర్శియై యున్నాఁడన్న విశ్వాసము స్వానుభవసిద్ధమై కబీరుని హృదయమునం దెంతదిటవుగా నెలకొనియున్నదో స్పష్టమగుటయేగాక, దుర్భవమైన వార్ధకబాధ యతిశయించి, లోకములోని యేవిషయములును చిత్తశాంతిని కలిగింప నేరక, యెట్టి మిత్రబాంధవులును అంతరంగమున కూఱట కలిగింపఁజాలక యున్న యవసరమున నాతని కంతటి మహత్తరశాంతి నిలిచియుండుటకు రహస్య మేదిగా నుండెనో కూడి వెల్లడి యగుచున్నది.

కబీరుమృతినిగూర్చి యాశ్చర్యజనకములైన కథ లనేకములు చెప్పుచున్నారు. అతఁడు సిద్ధిపొందిన తోడనే మహమ్మదీయులు చేరి యతఁడు తమమతస్థుఁ డగుటచేఁ దమమతాచారము చొప్పున ఖననముచేసి గోరీకట్టవలయు ననియు, హిందువులు వచ్చి యాతఁడు తమమతస్థుఁడే యగుటచే దహ నమే చేయవలయు ననియు, తమలో తాము పోరాడుచు శవముకొఱకై మిక్కిలి పెనఁగులాడఁజొచ్చిరి. ఇట్లీయుభయుల వైరములును దురంతములై మిన్ను ముట్టుచుండఁగా కబీరే వారి కప్పుడు ప్రత్యక్షమై వారిని వారించి తన మృతశరీరముపైఁ గప్పఁబడియుండిన వస్త్రమును తొలఁగింపుఁడని యాజ్ఞాపించుటయు, వా రట్లు చేసిచూడఁగా లోనుండిన శవ మద్భుతముగా మాయమై పోయి, కొన్ని పుష్పములు మాత్ర మాతావున నుండెనఁట! ఈపువ్వులను గొన్నిటిని హిందువులు చేకొనిపోయి కాశీనగరమందు గంగానదియొడ్డున యధావిధిగ దహనము చేసిరఁట! తక్కినవానిని మహమ్మదీయులు గైకొని మాఘారునందే ఖననముచేసి గోరీ నిలిపిరఁట!

ఈకథ విశ్వాసపాత్రమైనదైనను కాకపోయినను, ఒక్కకబీరునుగుఱించియే కాక మహాత్ములైనవారందఱి చరిత్రములకు సంబంధించియు కొన్ని గొప్ప సత్యములను దెలుపుచున్న దనుటకు సందియము లేదు. ఈలోకములో నేమహాత్ముఁడు కాని సాధారణముగాఁ దనకాలమునందే లోకముచే గౌరవింపఁబడఁడు. ఒకమహాత్ముఁడు జనసామాన్యముయొక్క దుస్థితిని గ్రహించి వారి నుద్ధరించుటకై యున్నతసందేశమును గొనివచ్చినప్పుడు వారు దానిని తెలియఁజాలక వ్యాధిగ్రస్థుఁడగువాఁడు మిత్రవైద్యుఁ డీఁబోయిన మందును ద్రోచిపుచ్చునట్లుగా, మొట్టమొదట నాయుపదేశములను వెగటుగాఁ జూచి కొంతకాలమైన వెనుక వానియావశ్యకతను గ్రహింపఁగల్గుచుండుట లోకసామాన్యమైయున్నది ఇందు మఱియొక గొప్పవిశేష మున్నది మహాత్ము లెప్పుడును ఒక్కజాతివారును గాక, ఒక్కమతమువారు గాక లోకమే కుటుంబముగను సకలలోకైకనాయకుఁడైన భగవంతు నొక్కనినే నమ్మి యచంచల విశ్వాసముతో భజియించువారందఱును నొక్కమాటలోనివారుగను విశ్వసించి వర్తించుచుందురు. అట్టివారిని జూచి యల్పబుద్ధులు వీ రీమతమువా రనియు, వారామతమువా రనియు, తమలో తాము కయ్యములాడుకొందురే కాని యా మహాత్ము లవలంబించిన మతస్వభావమునుబట్టియే వారు సర్వసము లనియు, సత్య మేమతమం దున్నను వారి కాదరణీయమే యనియు, ఒక్కఁడైన భగవంతుని నమ్మనివారికి బహుమతములు కాని నమ్మినవారికనేకములు లేవనియు అట్టి మహాత్ములను ప్రత్యేకమతసంఘములకు బంధింపఁజూచుట తమయజ్ఞతయే కాని వేఱొక్కటి కా దనియు, తెలిసికోఁజాలకున్నారు. కబీరుదాసుని మరణా నంతరము కబీరు మావాఁడు మావాఁ, డని హిందూమహమ్మదీయులు పోరాడుట చూడఁగా, కబీరుమతము సర్వసాధారణమత మైనటులు తోడనె గ్రహింపవచ్చును. ఆతఁడు చేసిన యుపదేశము లన్నియు నీ యంశమునే నిర్ధారణ చేయును. ఆతఁడు నమ్మిన రాముఁడు లోకాభిరాముఁడైన పరమాత్ముఁడే కాని వేఱొకఁడు కాఁడనియు, రామనామమును లోకసామాన్యమును జేసి, సకలమతములను సమ్మేళనము కావించి, మతవైషమ్యముల నడుగంటఁ జేయుటయే అతని యుద్దేశమైనట్లును అతని బోధన లన్నియు ప్రబలసాక్ష్యము నిచ్చుచున్నవి. అతని కీయద్భుతపరిజ్ఞాన మంతయు కేవలభక్తిప్రభావముచేతనే కలిగినది. అదియే మధ్యయుగమునందు మహాంధకారములోఁ బడియున్న యార్యావర్తమును తేజోవంతముగఁ జేసిన మహాపురుషాగ్రేసరులలో నాతని నొక్కనిగాఁ జేసినది. అట్టి జాతీయోద్ధారకుని మహోపదేశములను విస్మరించి నవభారతీయుఁ డెవ్వఁడును ప్రోన్నతి నందఁజాలఁ డని నిశ్శంకముగా వచియింపవచ్చును. మన దురదృష్టవశము చేత, ఆమహనీయుని సత్యచారిత్రము మఱుఁగుపడియున్నను, మన యభ్యుదయమునకు ముఖ్యముగాఁ గావలసిన యా భక్తాగ్రేసరుని సదుపదేశములు ఏదోయొకవిధముప, గ్రంథస్థములై నిలిచియున్నందులకు మన మానందింపవలసియున్నది. ఆతనిచరిత్రనుగూర్చి తెలియని సంగతులను పెంచివ్రాయుటకంటె నమ్మహనీయుఁడు చేసిన యుపదేశములను గొన్నింటిని, అమ్మహాశయుఁడు తెలిపిన మతాభిప్రాయము లన్నియు సత్యములని సాక్ష్యమిచ్చునటి యాతని సుభాషితములను గొన్నింటిని, ఇందుఁ గ్రిందఁ బొందుపఱుచుచున్నాము.


ఉపదేశములు.

1. ఈలోకములో మనుష్యుఁడు జన్మాదినుండియు కేవలము పాప వర్తనుఁడై యున్నాఁడు. వానిదేహము "నాది, నాది" యని గ్రహింప సిద్ధమగువారు ఎందఱెందఱో యున్నారు. "వీఁడు మాబిడ్డడు, మాలాభము కొఱకై వీనిని మేము పెంచి పెద్దవానిని చేసినాము" అని తల్లిదండ్రులు చెప్పుదురు ఇఁక భార్య యన్ననో "ఇతఁడు నా పెనిమిటి" యని బెబ్బులివలె వానిని పట్టుకోఁజూచును మఱి పిల్లలందఱును వానిమీఁద చూపునిలిపి మృత్యుదేవతవలె నోళ్లు తెఱచుకొని రక్షణకై ప్రతీక్షించుచుందురు. రాబందులు కాకులు చేరి వీఁ డెపుడు చచ్చునా యని కనిపెట్టుకొనియుండును . పందులు కుక్కలు శ్మశానవాటికకు తామును వెంబడించుటకై వీని శవమును ఎప్పుడు తీసికొనిపోవుదురా యని రాజమార్గముమీఁద వేచియుండును "వీనిని పూర్తిగా భస్మము చేయువఱకు నేను విడిచిపెట్టువాఁడను గాను" అని అగ్నిహోత్ర మనుచుండును. భూమి "వీనిని నాపాలు చేసికొందును" అని చెప్పుచుండును. వాయువు వానిని తీసికొనిపోవలె నని యాలోచించుచుండును. ఓజడమతులార! ఈ దేహమును మీదేహముగా చూచుకొనుచున్నారు. ఎప్పటి కప్పుడు మీగొంతుక పిసుకవలె నని వేనవేల శత్రువులు కనిపెట్టుకొని కూర్చుండుట మీకు తోఁచుట లేదా! ఐహికమోహము కన్నుగప్పుటచే నట్టిదేహమును మీది యని భావించుకొనుచున్నారు. అంతమంది చేరి మీదేహమున పాలుగొనవలె నని చూచుచుండుట చేత యావజ్జీవమును మీ కేదోయొక కష్టమే గాని సుఖ మనుమాట లేక యున్నది. ఓవెఱ్ఱులార! మీరు మేల్కొని యీ సంగతి తెలియనొల్లరు గాని యిది నాది యిది నాది యని మాత్రము విరామము లేక చెప్పుచుందురు.

2. రామనామ మను ధనమును పోగు చేయుఁడు. ఆధన మెన్నడును నశించునది గాదు. అగ్ని దానిని దహింపలేదు. మారుతము దానిని కొట్టి కొనిపోఁజాలదు. దొంగలు దానిని సమీపింపలేరు.

3. బంగారముతో కొనఁదలఁచినయెడల రాముఁడు దొరకఁడు. హృదయమూల్యమున కతఁడు చిక్కును.

4. భక్తి లేని జీవనము వ్యర్థము. భక్తసమాజమునఁ జేరి భగవంతుని పూజింపనిపక్షమున ఎవ్వానికిని సౌఖ్యము నిలువఁజూలదు, 5. కాలసర్పము హృదయములో నున్నది. అందఱియాత్మలయందును నది విషానలమును గ్రక్కినది. మనఃపూర్తిగా ఎవ్వరు నిక్కమైన యీశ్వరుని పూజింతురో వారు కొంద ఱే విముక్తి నందఁగలుగుదురు.

6. ఓమత్స్యమా! చిన్న బావియందు పల్లెవాఁడు అవలీలగా వలను పన్ను చున్నాఁడు. అట్టి బావినుండి తప్పించుకొనుట నీకు సాధ్యముకాదు. మఱల మహార్ణవము మాట జ్ఞప్తికిఁ దెచ్చికొని దాని నాశ్రయింపుము.

7. దురహంకారమునందు దుస్థ్సితి యున్నది. పాపమునందు బాధ యున్నది. కారుణ్యమునందు నిలుకడ యున్నది. అపరాధక్షమయందు దేవుఁ డున్నాఁడు.

8. నాది నీది ఒకటే రక్తము. ఒక్క ప్రాణమే మనయిద్దఱియందు చలించు చున్నది. ఒకతల్లి గర్భమునుండియే యీవిశ్వ ముద్భవించుచున్నది. మనలో మన కెడము కలిగించుచున్నది యిది యేటి జ్ఞానము?

9 ఒక్క దేశమునుండియే అందఱును వచ్చినారు. ఒక్కఘట్టముకడనే యందఱును దిగినారు. కాని యీయైహికదుర్విషయము లన్నియు చేరి మనలను అసంఖ్యాకములైన శాఖలగునట్లుగా విడఁదీసినవి.

10. బ్రహ్మ యెక్కువా? ఆతని నెవఁడు పుట్టించినాఁడో వాఁ డెక్కువా? వేద మెక్కువా? అది యెవనివలన వచ్చినదో వన వాఁ డెక్కువా?

11. నీ వేది చూచుచున్నావో యది నశించిపోవుచున్నది. నీ వెవ్వని చూచుటలేదో వానినిగూర్చి నిరంతరము చింతనచేయుచుండుము.

12. చక్క గా వేసిన బొమ్మ గొప్పవిలువ కలదే సందేహము లేదు. బొమ్మను విడిచిపెట్టి చిత్రకారుని స్మరియింపుము.

13. ఓ మందబుద్ధి! స్నానముచేయుటకు పుణ్యక్షేత్రము లనేకము లున్నవి. అర్చించుటకు విగ్రహములా వేనవేలున్నవి. కబీరు చెప్పున దేమనఁగా "ఈ లాగు మోక్ష మెన్నటికిని ప్రాప్తింపదు. మోక్ష మన్న హరిసేవయందే యున్నది.

14. నీవు పడునట్టి చిక్కులన్నిటియందును ని న్నెవ్వఁడు భరియింపఁగలడో అట్టి నిక్కమైన ప్రభువు నొక్క, నినే యనుసరింపుము. ఆప్రభువు దశరధుని యింట జన్మ మెత్తలేదు; లంకాపతిని హింసింపనులేదు. యశోద యాతనిని తన యొడి నిడికొని లాలింపలేదు; అతఁడు దేవకీగర్భమున ప్రవేశింపను లేదు; అతఁ డీలోక మును విధ్వంసము చేయలేదు; బలిని మోసపుచ్చుటకై యతఁడు పాతాళమునకు దిగలేదు. అతఁడు వరాహరూపమును ధరింపలేదు; క్షత్రియులను పరిమార్పను లేదు. ఆతఁడు తనవ్రేలికొనమీఁద గోవర్ధనపర్వతము నెత్తలేదు; అటవీవాటికల యందు గోపికలతోఁ గూడియుండను లేదు. అతఁడు సాలగ్రామము కాడు. మఱి యేఱాయియు కాఁడు. అతఁడు మత్స్యము కాఁడు. కూర్మము కాఁడు, జలచరములైనవి యివెవ్వియును గాఁడు. అతఁడు ద్వారావతియందు నిర్యాణము చెందలేదు. జగన్నాధమునం దాతని శవము ఖననము చేయఁబడను లేదు. కబీరు లోకమునకు ప్రకటించునది యేమనఁగా: –

"ఈ లాటి బోధనల, నెవ్వఁడును అనుసరింపవలదు. ఎవ్వానిని స్థూలమును భౌతికమును నైన యుపాదానము కలవానినిఁగా భావించుచున్నారో, వాఁడు బహుసూక్ష్మధర్మములు కలవాఁడు."

15. కాశీలో కాపురముచేయుచుండిన శివునితోఁ గూడ బ్రహ్మ అప్పుడే చచ్చిపోయినాఁడు. మధురానగరమునందు గొల్లవాఁడైన శ్రీకృష్ణుఁడు ప్రాణములు విడిచినాఁడు. దశావతారము లన్నియు నిదివఱకే గతించినవి. మత్స్యేంద్రనాధుఁడు, గోరకనాధుఁడు, దత్తాత్రేయుఁడు, వ్యాసుఁడు ఈ యందఱిప్రాణములును పోయి చాలకాల మైనది. కబీరు ఉద్ఘోషించునది యేమనఁగా: -

"ఈ మనుష్యు లందఱును గూడ మృత్యువు వలలో బడిపోయినారు. "

16. అన్ని సంగతులును మనస్సునకుఁ దెలియును; తెలిసియుండియు పాపము లొనర్చుచున్నది. చేతిలో దీప ముండియును నూతిలోఁ బడినప్పుడు, ఇంక నాదీప ముండిన ప్రయోజన మేమి?

17. మాతృగర్భమునం దుండినప్పుడు జాతియు లేదు, వర్ణము లేదు; బ్రహ్మ బీజమునుండి సృష్టి యంతయుఁ గలిగినది. ఓపండితుఁడా! బాహ్మణు లెప్పుడు సృష్టింపఁబడినారో చెప్పు! "నేను బ్రాహ్మణుఁడను" అని చెప్పుకొన్నందువలన నీమతము నీజీవము నశించుచున్నవి సుమా! నీవు బ్రాహ్మణస్త్రీవలనఁ గలిగిన బ్రాహ్మణుఁడవే యైన పక్షమున నీవు వేఱుమార్గమున నేల పుట్టవైతివి ?

ఎవ్వరివాఁడవు నీవు? బాపనివాఁడవా? నే నెవరివాఁడనెను? శూద్రపువాఁడనా? నే నెవరిరక్తమువలన పుట్టితిని? నీ వెవరిక్షీరములవలన జనించితివి? కబీరు సూక్తి యేమనఁగా: బ్రహ్మమునుగూర్చి యెవ్వాఁడు చింతనసేయునో వాఁడె నాచేత బ్రాహ్మణుఁ డని పిలువఁబడుచున్నాఁడు. వర్ణమునుండి వర్ణము బయలు దేరుచున్నది. అయినను విచారించి చూడఁగా నన్నియు నొక్కటే. ప్రాణమున కేమివర్ణ మున్నది? దీనినిగూర్చి చక్కఁగ యోజింపుము.

19. ఓ బ్రాహ్మణులార! అన్యులను అంటినంతమాత్రాన మీరు మైలపడితిమని తలంచుచున్నారు. మిమ్ముల నొక్కప్రశ్న మడుగనిండు! మీకంటె నీచుఁ డెవ్వ డున్నాడు? దురహంకారముచేత వారు విఱ్ఱవీఁగుచున్నారు. గర్వాతిశయము ఎన్నడును ఏప్రయోజనమును గలిగింపఁజాలదు. గర్వభూయిష్ఠు లగువారిని అడంచువాఁ డని పేరుగన్న యాతఁడు మీపొగరు చూచి యెట్లు సహింప నేర్చును?

20. ఎవ్వనివాక్కునకు అడ్డమేదియు లేదో, వానిహృదయములో సత్యము లేదు. అట్టివానితో పొందుసేయకు. వాఁడు నిన్ను బహిరంగముగా మార్గములో మట్టు వెట్టును సుమా!

21. నాదైన దేదియు నాలో లేదు; ఉన్నదంతయు నీదే. నీదైనదంతయు నీయధీనము చేసిన తరువాత, ఇంక నాది మిగులున దేమున్నది?

22. సప్తసముద్రముల నన్నిఁటిని నేను సిరాగాఁ జేసినను వృక్ష సంతతు లన్నిటిని కలములుగా జేసినను భూతలమునంతను కాగితముగాఁ జేసినను హరిప్రభావమును వర్ణించి వ్రాయుట యసాధ్యమగును. -

23. దైవభీతి యుదయించిన తోనే యితర భీతి యస్తమించును. ఆభీతి యంతయు దైవభీతిలో మగ్నమై పోవును. దైవభీతి క్షీణింపఁజొచ్చెనా, మఱల భయము మనుష్యు నాశ్రయించును. మనుష్యునకు దైవభీతి నశించి నప్పుడు హృదయములో భయ ముద్భవించును; అదే వానికి మరణము,

24. లోకమంతయు దేనిపేరు విన్న భయావేశపరవశమగునో, యట్టి మృత్యువు నామనస్సునకు ఆనందము; మృత్యువువలననే పరిపూర్ణానందమంతయు లభ్యమగుచున్నది.

25. నే నేదినమున మరణించితినో, యాదినమున మహదానంద ముప్పొంగివచ్చినది. ప్రభువు నాకు దర్శనమిచ్చెను. గోవిందుఁడు తన నెచ్చెలిని మన్నించుట సహజమే కదా! 26. గ్రంధపఠనమువలన మే లొదవునని నే నెఱుంగుదును; కాని గ్రంథ పఠనము కంటె ధ్యానము శ్రేష్ఠతరమైనది. లోకులు నన్నెంత నిందించినను సరే రాముని యాశ్రయమును నే నెన్నఁడును విడుచువాఁడను కాను.

27. ఈ లోకముయొక్కస్థితినిఁ జూచి నేను కన్నీరు విడిచితిని. మఱి యెవ్వఁడును నాతోఁ గలసి దుఃఖించినవాఁడు లేఁడు. భగవన్నామ మెవ్వాఁడు గ్రహించునో, వాడే నాతోఁ గలసి యశ్రుకణములు రాల్ప సమర్థుఁడు.

28. అందఱును దేవునిగుఱించి ముచ్చటించువారె; కాని, నామనస్సులో నొకశంక పొడముచున్నది. వారు తమకుఁ దెలియని దేవుని ప్రార్థించుటకై యెట్లు గడంగుదురో తెలియరాకున్నది.

29. పండితులు వేదములు చదివి తప్పుదారిలో బడియున్నారు. వారికి ప్రపంచజ్ఞాన మావంతయు లేదు. ఎంతయు నియమముతో క్రమము తప్పక , ఉదయమునను సాయంకాలమునను ఆయాకర్మములను ఆచారములను వారు నడపుచుందురు. నాలుగు యుగములందును వారు గాయత్రిని పఠింపఁజేసినారు. ఆ లాగుచేయుటవలన పాపమునుండి యెవనికి ముక్తికలిగినదో వారిని చెప్పమనుఁడు. ఇతరులను ముట్టుకొన్నందువలన తాము మైలపడితి మని వారు భావించుచున్నారు; తమ కంటె నీచు లెవ్వరున్నారో వారిని చెప్పమనుఁడు.

30. తరువునకొఱకే ఫలములఁ బూనుటలేదు. ప్రవాహము తన నిమిత్తమే జలముల గహించుటలేదు. ఇతరులకొఱకే సాధుజనుఁడు. దేహధారి యగుచున్నాఁడు.


కబీరు.

కబీరు సాక్ష్యములు.



చ॥ ఇరులు తొలంగు భానుఁ డుదయించిన, మానవదుష్టచింతనల్
      విరియు మహాత్ము సద్గురు వివేకము వ్యాపనమైనతోనె; యీ
      సరణినె సద్గుణాగుణ విచారము పాయు దురాశచే; నహం
      కరణముచే నశించు నధికంబగు నీశ్వరభక్తి వ్రేల్మిడిన్. 1

గీ॥ సన్నయావగింజంత సూక్ష్మంబు గాదె
     భక్తిమార్గంబునకుఁ గల్గు ద్వార మరయ!
     గర్వమునఁ జేసి యేనుంగు కరణిఁ దోఁచు
     డెంద మక్కటా! నరుఁ డెట్టు లందుఁ జొచ్చు?2

గీ॥ గురువునకు నెద్దియైనను గొంక కీయ
     సిద్ధుఁడై యుండవలయును శిష్యుఁ డెపుడు;
     నెద్దియును శిష్యుఁ డీయ గ్రహింపఁజనదు
     గురువు; గురుశిష్యధర్మంబు తెరువు లివియ. 3

గీ॥ అందినట్టి మానవదేహ మందరాదు
     మఱల నరునకు నెన్నండు మనసుదీఱఁ;
     జెట్టుపండును జెట్టుతోఁ జేర్పరాదు
     పుడమిఁ దొరఁగిన నొకమాఱు తొడిమి వీడ. 4

గీ॥ కాలమెల్లను వృధ యౌచుఁ గడచె నకట!
     యజ్ఞుఁ డనురక్తి భజియింపఁడయ్యె హరిని;
     నెంతయును వెన్క కులదంగ నేమిఫలము
     పక్షు లెల్లను గడతేర్పఁ బంటలెల్ల? 5

చ॥ వ్యసనము నందఁబోకు, మనయంబును జింతను దక్కియుండు, మిం
      పెసఁగ సృజించినట్టి విధియే సకలం బిడు నంచు నెంచుచున్;
      బసులకుఁ గీటకంబులకుఁ బక్షులకుం గన నెందు నేని వె
      క్కసముగఁ బెన్నిధుల్ గలవె? గాఢతరంబుగఁ గల్మి యున్న దే? 6


చ॥ కమకము గ్రుడ్డులం బొదివి కాచుఁగదా పదిలంబుగా నురో
      జములును లేకయే, పెనుచు సాధనకోటి తెఱం గెఱింగి; యా
      క్రమమున జీవరాసుల జగంబుల సృష్టి యొనర్చినట్టి దై
      వమె సమకూర్చుఁ బ్రేమమున వస్తువులన్, దగు జీవికాదులన్. 7

గీ॥ సుత్తి దొంగిలించి సూది దానముచేసి, తేరు వచ్చునంచుఁ జూరు నెక్కి
     చూచువానిపగిది, సుంత సత్క్రియ చేసి, యజ్ఞు డుబ్బు మోక్ష మబ్బు నంచు. 8

గీ॥ నమ్రులై కడు నెందఱు నడచువారొ, వారలందఱు మోక్షంబుఁ బడయువారు.
     అగ్రజన్ముల మంచు గర్వోగ్రు లగుచుఁ, ద్రుళ్లువార లధోగతిఁ ద్రెళ్లువారు. 9

గీ॥ అధికులకె తోడుపడ నెంతు రంద ఱెచటఁ; గాని యల్పుల కెవ్వారుగానరారు;
     దవమునకు గాడ్పు తోడ్పడి రవులఁజేయు, నదియె దీపంబు నింతలో నార్పివేయు. 10

గీ॥ పూలతోఁటలోనికిఁ దోఁటమాలి యరుగ, బల్కుఁ బూమొగ్గ లీరీతి వానిఁజూచి:
     'పుణుకఁబడియెడు వికసించు పూలు నేఁడు; ఎల్లిమావంతు వచ్చెడు నిది నిజంబు.' 11

గీ॥ జాతి యేది యనుచు సాధు నడుగ నేల? దానిజ్ఞాన మరయ వలయుఁ గాని;
     కత్తివిలువఁగూర్చి కడఁగి యోజించుచో, నొఱనుగూర్చి పెద్దయూహ యేల? 12

గీ॥ ఉర్విఁ బెద్దయై, యేమి ప్రయోజనంబు? తాళవృక్షంబు మిగులఁ బెద్దదియ కాదె?
     దానినీడను గూర్చుండఁ దలఁచు నెవఁడు? దానిఫలములు మన కందరానివెకద? 13

గీ॥ బాధపెట్టకు మెవని దుర్బలుఁ డఁటంచు, నతని హాహారవంబుల హననశక్తి
     కలదు సుమి; ప్రాణమేలేని కొలిమితిత్తి, చేతఁ గత్తియు రూపఱఁజేయఁబడదే? 14

గీ॥ జల్లెడను జూడు! పొల్లును సంగ్రహించి, సారమాగింజలను గ్రింద జాఱవిడుచు;
     నవ్విధంబుననే యజ్ఞుఁడైన నరుఁడు, సారమును ద్రోసి, పూను నసార మిలను. 15

గీ॥ తమకొఱకె పూన వంబువుల్ ధరణినదులు, స్వాదుఫలముల్ భరింపవు, పాదపములు
     సాధుజనముల యైహికజన్మమిట్టు, లంచితపరోపకృతిని గావించుకొఱకె. 16


This work was published before January 1, 1931, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
"https://te.wikisource.org/w/index.php?title=కబీరు&oldid=527442" నుండి వెలికితీశారు