Jump to content

కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/సామెతలు

వికీసోర్స్ నుండి



సామెతలు

వీట్లని లోకోక్తులనడమూ వుంది. ఇవి యెన్ని వున్నాయో నిష్కర్షించి దాదాపుగానేనా నిర్ణయించలేము. కొన్ని ఆయా దేశప్రాంతాలకే కాక గ్రామ ప్రాంతాలకు మాత్రమే సంబంధించి వుంటాయి.

1) వింజరానికి తగవూలేదు, కోలంకకి మాఱువీధీలేదు.

2) ఆలిలేనివాడికి ఆత్మకూరు - యివి ఆయా గ్రామప్రాంతాల వారికే సమన్వయిస్తాయి. ఇందులో రెండోది గద్వాల ప్రాంతంలో విన్నది. మొదటిది యానాం (ఫ్రెంచి టవును) ప్రాంతంలోది.

3) ఆలీ బిడ్డలులేని వానికి ఆంజనేయులు గతి.

కర్నూలు ప్రాంతంలో ప్రతి పల్లెలోనూ ఆంజనేయులగుడి వుంటుంది. సాధువులు ఆ గుడి ఆవరణలో మకాం చేస్తూ వుంటారు. మఱిన్నీ కొన్ని సామెతలు భిన్నభిన్నంగా పయికి వుంటాయిగాని, వొకటే అర్థాన్ని బోధిస్తాయి. వ్యాసాంతమందు జ్ఞప్తికిఁదెచ్చుకొని యీ అంశం వివరిస్తాను. దేశద్రిమ్మరితనంచేత, నాకు అక్కడక్కడ విన్నవి చాలా సామెతలయితే వచ్చునుగాని అవి యేదేనా గ్రంథరచనకు పూనుకొన్నప్పుడు తన్మయత్వంలో స్ఫురిస్తాయిగాని, తీరికూర్చుని జాబితా వ్రాయవలసివస్తే స్ఫురించవు. వీట్లను ఆంధ్రభాషా పరిషత్పత్రిక కొలఁది యేళ్లనాఁడు కొన్నిటిని జాబితాగా ప్రచురించింది. మీమాంసకులు న్యాయాలుగా వీట్లను వ్యవహరిస్తారు. -

1) ఖలేకపోతన్యాయం 2) తృణజలూకికాన్యాయం 3) భ్రమర కీటన్యాయం 4) తిలతండులన్యాయం. మనకు ప్రస్తుతం వీట్లకు పర్యాయంగా వుండే సామెతలు (లోకోక్తులు) యేదో వొకటి వుదాహరించి చర్చిస్తాను. 'కుక్కలు కూసుకుంటే జంగం పరువుపోతుందా?' కుక్కలూ జంగమూ యి ద్వయాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తాను. ఆయా సామెతల కెప్పుడూ పరార్థ ప్రవృత్తేగాని స్వార్ధమందు ప్రవృత్తి వుండదు. అంటే? యేమన్నమాట.

శ్లో. ఏతే సత్పురుషాః పరార్ధ ఘటకా స్సార్వర్థాన్ పరిత్యజ్యయేII

- భర్తృహరి

సజ్జను లెంతసేపు తమ ప్రయోజనాలను వదిలికొని పరుల కార్యములు (పరోపకారార్థ మిదం శరీరం) నిర్వహిస్తూవుంటారు. (తుదకు సామెతలు సజ్జనులవంటివని తేలింది) ఆలాగే యివీని అన్నమాట. అంటే? యేమిటి? కుక్కంటే కుక్కాకాదు. జంగమంటే జంగమూకాదన్నమాట. సోదిచెప్పే యెఱకల దాని భాషలో యీలాటి వ్యాఖ్యానం వినఁబడుతుంది. వ్యాకరణ గ్రంథాలలో యింకా యీ విషయమై విపులంగా చర్చవుందిగాని, అది తీసుకువస్తే అసలు మూలాన్ని మరవవలసి వస్తుంది. అయినా చూపుతాను కొంచెం. “తేషాం పారార్ధ్యాత్" అంటూ వుంటారు వ్యాఖ్యాతలు. తేషాం - ఆసంజ్ఞా పరిభాషా శాస్త్రములకు, పారార్ధ్యాత్ - పరప్రయోజన మగుటవల్ల నుంచి అని అక్షరార్ధం - పిండి తార్థమో? -

సంజ్ఞావిధాయక శాస్త్రములకున్నూ, పరిభాషాశాస్త్రములకున్నూ, విధిశాస్త్రం కోసం పాటుపడడం అనఁగా రాజునిమిత్తం భటులు యుద్ధం చేసినట్లు యింకా యిందులో కొంత స్వార్ధంవుంటే (చావకబ్రతికి బయటcబడితే పెన్షన్ వగైరా) వుంటుందేమో! యింకో దృష్టాంతం చూపుతాను. కాశ్మీరగర్ణభాః అంటే? ఆ దేశపు గాడిదలన్నమాట. వీట్లమీఁద ఆ దేశంలో పైరయ్యే విలువగల కుంకుమపువ్వును పొలాలనుంచి యింటికిఁగాని వొక చోటునుంచి యింకోచోటికి (వర్తకం) గాని తీసుకు వెడతారు గాని వాట్లకు ఆకుంకుమ పువ్వులో లేశమున్నూ ఆహారంగా పెట్టరు. చాలాదూరం వచ్చాం యీ పరార్ధత్వాన్ని గూర్చి వ్రాస్తూను. క్రియలోమాట; సామెతలకు అర్థం యేదో యితరం వుంటుందిగాని, దానిలో మాటలకు సంబంధించి వుండదని పిండితార్థం; అయితే ప్రస్తుత సామెతలో జంగంఅంటే యెవరో గౌరవనీయమైన వ్యక్తిగా గ్రహించాలి. గౌరవనీయవ్యక్తులు ప్రపంచకంలో యెందఱోవుంటే జంగం అని బిచ్చగాణ్ణి వుటంకించడానికి హేతువెట్టిది? అని విచారణచేయవలసివస్తే, గ్రంథం చాలా పెరుగుతుంది. టూకీగా వ్రాస్తాను. ప్రతాపరుద్రాదుల ప్రభుత్వ కాలంలో శైవమతం రాజ్యంజేసిందంటే, విశ్వసించని వారుండరు. అప్పుడు జంగాలంటే సాక్షాత్తూ మహేశ్వరులే. అందుచేత ఆపదంతో గౌరవనీయులను వాడినట్లయింది. యీ సామెత ఆ రోజులలో పుట్టిందే. యిఁక కుక్కలు యెవరో నీచులు ఆపదంతో వాడబడ్డట్టయింది. ఈసామెతలో కూసుకుంటే, అనేది ఆత్మనేపదం. గ్రామంలో కొను ధాతువు బాగా వినబడడంలేదు. కాని దానిలో ఉంది. దానివల్ల అంతకు ముందు లోకంలో జంగానికివుండే పూజ్యతలో లేశమున్నూ తగ్గదని తాత్పర్యార్థం. జంగం శబ్దానికి యీ కాలంలో సామాన్యంగా అయే అర్థమే మనం చూచుకోకూడదు. ఆ కాలంలో వుండేదే చూచుకోవాలి. వ్యంగ్యార్థం విచారించ వలసివస్తే తనవెంటఁబడి మొఱుగుతూవుంటే... కుక్కలను... తనదగ్గఱ దండంవున్నా దానితో కొట్టడంగాని, తుదకు బెదిరించడంగాని, చేయకుండా, చక్కాపోతాఁడని స్ఫురిస్తుంది. దీనిక్కారణం ఆ మొఱిగేవి కుక్కలు అవడమే! అనఁగా? తత్తుల్యమైన మనుష్యులు యెన్ని నీచపు మాటలు వినియోగించినా, గౌరవ భాజనంగా ఉండేవాళ్లు తూష్ణీభావము వహించడమే యుక్తంగానీ వాళ్లతో మాటకు మాటగా జవాబు చెప్పరాదని, ఫలితార్థం. యిలా చెప్పకపోతే స్పష్టంగానే నీచులు తన్నెంత దూషించినా ఘనులు ప్రతి చెప్పరు అనే అనఁగూడదా? అంటే, వినండి కవిత్వానికి వాచ్యంకంటే వ్యంగ్యమే ముఖ్యం (అఱవెత గుబ్బచన్వలె, చూ.) అందులోనే అందంవుంటుంది. బట్టవిప్పేసినట్లుంటే రసం లేదు.

“జీవితం వ్యంగ్య వైభవమ్" అన్నారు సహృదయులు! కవిత్వ పదార్ధం లోకోక్తులలో విస్తరించి వుంటుంది. ఆ వ్యంగ్యంలో ఉత్తమ మధ్యమాధమత్వాలున్నాయి. ఆయీ విషయం వ్యాఖ్యానించ వలసి వస్తే చాలా పెరుగుతుంది. సామెతలు వాడడంలోనే కవిత్వానికి జీవభూతమైన వ్యంగ్యం బాగా స్ఫురిస్తుంది అని తెలిసికొందాం. ఉ. కుక్కలు కూసికోఁ జెడునొకో మఱి జంగము పర్వు - మొట్ట మొదట హెడ్డింగుగా వుంచిన సామెతనే గ్రాంథిక భాషలో మాఱిస్తే ఆయీ విధంగా తేలింది. మఱి అనే పదం అధికంగా చేరింది. కొన్ని సామెతలు కవులు యథాశ్రుతంగానే వాడుకున్నారు పాలు విఱిగితే పెరుగగునే? వగయిరాలు యీ ప్రకారం వాడేటప్పుడు వ్యాకరణ ప్రకారం తప్పొప్పులు పట్టకూడదు. అనుకరణం లేకపోయినా వున్నట్టే. ఆయీ విషయం పలుచోట్ల నాచేత వ్యాఖ్యానింపఁబడ్డదే కనక స్పృశించి విడుస్తున్నాను. వొక్క సామెతలో యెంతో అర్థం యిముడుతుంది.

"తెగితే లింగcడు రాయి, చూడండి. యెనిమిదక్షరాలలో యెంత అర్ధం యిమిడిందోను, "నాకు కోపం వచ్చేవఱకే కాని కోపంవస్తే గౌరవా గౌరవాలు చూసేవాణ్ణి కాను జాగ్రత్త" అని వొక అర్థం స్ఫురిస్తూవుంది. యింకా కొన్ని అర్థాలు పాఠకులే చూచుకోండి. అసలు అక్షరార్థం చెప్పవలసి వస్తే - మెడలో వున్నంతసేపే ఆ రాతిముక్కకీ పరమేశ్వరుఁడనే పూజ్యతగాని అది ఆచోటు వదిలి క్రిందపడ్డట్టయితే దాని గౌరవంవుండదు అని మాత్రమే. దీనికిప్పుడు నేను చెప్పిన విధంగా కాక యింకా కొన్ని విధాల వ్యాఖ్యానం చేయవచ్చును. విస్తరభయంచేత వ్యాకరించలేదు. (స్థాన భ్రంశే నశోభంతే. చూ.) శ్రవణానందంలో "తెగితే లింగండు ఱాయియంచును జనోక్తి నమ్మె నేమో కదా" అని వాఁడబడింది. ఆపద్యం చదువుతుంటే ఆయీ సామెతకు వుండే యావత్తాత్పర్యమూ బోధపడుతుంది. సంస్కృతకవులుకూడా కొన్ని దేశ సామెతలు సంస్కృతీకరించి వాడుకున్నారు. యే కవిత్వంలో సామెతలు విశేషించి వుంటాయో ఆ కవిత్వం యెక్కువ హృద్యంగా వుంటుంది. దానిక్కారణం భాషాజ్ఞానం లేనివాళ్ల క్కూడా దేశసామెతలు సుళు వుగా అర్థమవడమే యెంత మంచి కవిత్వమేనా నిఘంటులు దగ్గిఱ పెట్టుకుంటేనేగాని సమన్వయించేది గాకపోతే చట్టన ఆనందాన్ని కలిగించదు. ఆయీ మాటకు కొందఱు పండితులు సమ్మతించరు, వారికి బాగా సంస్కృతపదజటిలంగా వుండటమే కావలసింది. మృదంగాది ధ్వనులవంటివి కవిత్వాలుగా అభియుక్తులుగణింపరు. యిది విషయాంతరం. ఆ యీ సామెతలు. “బేవారసాస్తి" వంటివి. ఒకకవి వాడినంత మాత్రంచేత యింకొక కవిదాన్ని వాడుకోరాదనే నియమంలేదు గాని కొన్ని సామెతలుయే శార్దూలంలోనోతప్ప యితర పద్యాలలో యిముడవు. ఆ పక్షంలోమాత్రం దాని జోలికిఁ పోఁగూడదు. మచ్చుచూపుతాను.

"జ్ఞాతిశ్చే దనలేన కిమ్మనెడి వాచారూఢి సత్యమ్ముగన్"

దీనిని మఱోకవి వాడుకోవడానికి హక్కులేకపోదు గాని, భట్టు మూర్తి శార్దూలంలో పెట్టినట్లే ఆకవిన్నీ శార్దూలంలోనే పెట్టాలి. అది గ్రంథచౌర్యం కాకపోయినా గ్రంథచౌర్యంగా పరిణమిస్తుంది. ఆ యీ సామెతలు కవి నివసించే మండలాన్ని బట్టి వుంటాయని లోఁగడ వ్రాసే వున్నాను. యెంతపాండిత్యంవున్నా ఆ సామెతకు సంప్రదాయార్థం తెలియకపోతే పద్యం యొక్క అర్థం అడ్డుతుంది. వొకటే అర్థమిచ్చేవి దేశ భేదం చేత రెండు మూడు సామెతలు వుంటాయని లోఁగడ సూచించేవున్నాను, మచ్చు చూపుతాను.

"ఒజ్జల పచ్చకాయ గావలయు" అని పింగళి సూరన్నగారు వాడినారు. యీ సామెత కర్నూలు ప్రాంతంలో చంటిపిల్లలకు కూడా అర్థమవుతుంది. గోదావరి మండలంలోఁగానీ, గంజాం విశాఖపట్నం మండలాలలోఁగాని అర్ధం పెద్ద పండితులకే కాదు, కర్నూలు ప్రాంతంలో పుచ్చకాయ వుల్లిపాయిలతో (సకలంజం భక్షయేత్) పాటు నిషిద్ధవస్తువు. దీనితోపాటు సొరకాయా, నీటివంకాయఁ, గోళికాయ (గోరుచిక్కుడు) వగయిరాలునూ నిషిద్ధం. కాని పుచ్చకాయంత నిషిద్ధం మాంసంతప్ప వేఱొకటికాదు. దానిక్కారణం ఆయీ పుచ్చవిత్తనం ఖురాసాని దేశాన్నుంచి తురుష్కులు తెచ్చినట్లు కనఁబడుతుంది. ఆముక్తమాల్యదలో "ఖురాసాని పుచ్చలు వోదున్ని" అనే వాక్యం గలపద్యార్థం బాగా తెలిస్తే యీ పుచ్చకాయల హిస్టరీ బాగా తెలుస్తుంది. కాని ఆపద్యం తెలుగే అయినా కూర్పు యిమిడిక భాషాంతరంలాగు కనపడుతుంది. కడప, కర్నూలు ప్రాంతంలో మాంసాశనులు తప్ప పుచ్చకాయ తినరు. తింటేనో? మాంసం తిన్నట్లే, యింత నిషేధం వున్నా ఆపుచ్చకాయలు అగ్రవర్ణస్థులుకూడా చాటునా మాటునా (మన దేశస్థులు వుల్లివలె) తింటూనే వుంటారు కనకనే యీలోకోక్తి పుట్టింది. "ఒజ్జల పుచ్చకాయ" అన్నంతలో యేం తెలుస్తుంది? గురువుగారి పుచ్చకాయ అన్నంతవఱకే తెలుస్తుంది. లోగడ చేసిన వ్యాఖ్యానాన్ని అనుసరించి కొందఱికి తెలిసినా యింకా కొంత వివరించాలి. గురువుగారేమో? తినడానికని పుచ్చకాయ తెచ్చుకొని దాచుకున్నారు. ఆ సంగతి శిష్యు లెఱుఁగుదురు. యే యెఱుఁగని కుఱ్ఱలో ఆ పుచ్చకాయ బయటికి తీశారు. అదిచూచి పెద్దలు లేదా యెఱిఁగిన శిష్యులు మందలిస్తున్నారు.

ఒజ్జల పుచ్చకాయరా అది అని; నిషిద్ధవస్తువే అయినా అది గురువు లామోదించడంచేత జాగ్రత్తగా కాపాడాలి, ఆక్షేపించనూ కూడదు వారితోపాటు మనం తినాకూడదు. (యా న్యస్మాకం సుచరితాని. నోయిత రాణీ, చూ) అని దాని తాత్పర్యార్థం. సూరన్నగారు యేదో పురవర్ణనా సందర్భంలో, కల్పనాచమత్కృతి ద్వారా భగవంతుఁడు బొత్తిగా నిషిద్ధమయిన దివాసంభోగాన్ని చేస్తున్నట్టు కల్పించి ఆ యీ ఘట్టంలో దీన్ని వాడినారు. ఈ లోకోక్తికి సంప్రదాయార్థం తెలిస్తేనేగాని ఆ పద్యార్థం తేలదు; ఇదేవిధంగా వక్కొక్క లోకోక్తిని వ్యాఖ్యానించవలసివస్తే గ్రంథం బళ్లతో తోలవలసివస్తుంది. కాగితాల కరువుదినాలలో యే పత్రిక భరిస్తుంది? ఇప్పటికి

(1) కుక్కలూ - జంగమూ

(2) ఒజ్జల పుచ్చకాయ.

అనేవి రెండుమాత్రం పూర్తిగా వ్యాఖ్యానించడం జరిగింది. రెండు మూడు వుదహరించడం జరిగింది - యీ "ఒజ్జల పుచ్చకాయ" సామెత గోదావరి మండలంలో యెవరేనా కళాపూర్ణోదయం ద్వారా యెఱిఁగినవారుంటే వుంటారు (అది లెక్కేమిటి,) గాని సర్వేసర్వత్ర యీ అర్థంలో - “గురువులోరి పొగచుట్ట" అని నిమ్నజాతులవారి సహజభాషలో వాడుకుంటారు - దీనికీ కాస్తవివరణం వ్రాయాలి. ఆ కడప ప్రాంతంలో ఆ పుచ్చకాయ నిషిద్ధం. మా ప్రాంతంలో పుచ్చకాయ అంతగాని కొంతగాని నిషిద్ధంగా వున్నట్లు లేదు గాని - పొగచుట్టమాత్రం (అదేనా యిప్పడుకాదు) బాగా నిషిద్ధం, యేదో సందర్భంలో నేను యేభైయేళ్లకు పూర్వం వ్రాసిన పద్యం జ్ఞాపకంవచ్చింది. వుదాహరిస్తే పొగచుట్ట యేలాటిదో తెలుస్తుంది.

క. “ఇంజరము గాదు, రైల్వే,
    యింజననన్ యోగ్యమగు నదే మనఁజుట్టల్
    పుంజముగఁ గాల్చి పొగచే
    రంజిపం గలుగు ద్విజులరాయిడికలిమిన్"

ఆయీ పొగచుట్టలలో చిలక కొట్లు వుండడం గలదు - చిలకకొట్లు అంటే కొంతవఱకుకాల్చి తక్కినశేషం కాలాంతరమందు కాల్చుకోవచ్చునని భద్రపరచిన బాపతన్న మాట. ఆలాటివాటిని నిమ్నజాతి బీదలు వాడతారు. చిలకకొట్టు యే ద్వారబంధం సందులోనుంచో కిందఁబడితే దాన్ని చీపురుకట్టతో తుడిచివేస్తూ వుండఁగా అది గురువుగారు దాఁచుకున్న దన్నసంగతి యెఱిఁగిన శిష్యుఁడు నివారిస్తున్నాఁడు. యేమన: “అది గురువులోరి పొగచుట్ట" అని. ఆయీ వ్యాఖ్యవల్ల ఒకటే అర్థాన్ని బోధించే సామెతలు రెండూ లేక మూడూ మండలభేదాన్ని బట్టి వుంటాయని తెల్పినట్లయింది. కొన్ని సామెతలు శుద్ధపచ్చి బూతులుగా వుండిన్నీ మంచి అర్ధాన్ని యిస్తాయి. అయితే మాత్రం యేలాగ వుదాహరించడం? మనుచరిత్రలో "కెలకులనున్న తంగెటి జున్ను గృహమేధి" అనివుంది. యెవరికోగాని తంగెటిజన్ను అంటే తంగేడుచెట్టు కొమ్మకు పట్టిన తేనె పట్టు అని తెలియదు. యీ అర్థంలో యింతకన్న అందమైనది. అదృష్టవంతునికి... తేనెపట్టు పట్టింది అనేది. ఆంధ్రభాషకు యతులేమి ప్రాసలేమి సహజాలంకారాలు గనక యతిజ్ఞానంవల్ల పూర్తిగా బోధపడుతుంది. శ్రమలేకుండా అదృష్టం ఫలించి భాగ్యవంతుడైనాఁడన్నమాట.

యిచ్చేది కాసు. తాసు, యిది నైజాంలో సర్వేసర్వత్ర వాడతారు. తాసు అంటే? గంటన్నరకాలంగా నైజాంలో వాడతారు. మఱివొకప్పుడు సామెతలను గూర్చి యింకా విపులంగా వ్రాస్తే వ్రాస్తాను, యీపని అవసర నైవేద్యాలతో తేలేది కాదు. స్వస్తి,


★ ★ ★