కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/మఱొక అపవాద

వికీసోర్స్ నుండి



మఱొక అపవాద

అంటే ఇదివఱలో, తి. వెం. కవులకు సాక్షాత్తుగా దేవీప్రత్యక్షంవుంది అనే అపవాదనుగూర్చి “ప్రౌఢభారతి"లో కొంత వ్రాసివున్నాను. యిప్పుడు వ్రాసేది మఱో అపవాదనుగూర్చి కనుక, శీర్షిక అలా పెట్టవలసి వచ్చింది.

మొల్ల అనే కవయిత్రి పే రెఱుఁగనివారంటూ తెలుఁగు దేశంలో లేరుకదా. ఏమూర్ఖఁడుగాని, యేపండితుఁడుగాని ఆపె కవయిత్రి కాదనిన్నీ ఆపె తండ్రో, సోదరులో లేక భర్తో కవిత్వం చెప్పి ఆపె పేరు పెట్టి ప్రకటించి వుందురనిన్నీ చెప్పినట్లెక్కడనూ విన్నవారున్నట్లున్నూ లేదు. యీ అపవాద దైవవశాత్తు నాకేవచ్చింది. యేలా వచ్చిందంటే, యిప్పుడు నాకు శనిమహాదశ జరుగుతూ వుంది. వాఁడు చేసేకార్యాలు చాలావున్నాయి. అందులో మొదటిది. “మిథ్యాపవాద” అన్నది. ప్రస్తుతం నాకు సంభవించినదిన్నీ అదేకనక, గ్రహచారంవల్లనే యీ అపవాద వచ్చిందంటే యుక్తి సహంగా వుంటుంది. మొల్ల తండ్రిగాని సోదరులుగాని, భర్తగాని కవులుగా వుంటే, వెం. శా. అట్టి వుద్దేశం పడ్డాఁడనడానికేనా వీలుగావుండేది. అట్టి ప్రతీతి యొక్కడనూ లేదుగదా! అట్టి స్థితిలో వెం. శా. అలా వుపన్యసించాఁడెక్కడో అనే లోకులవుద్దేశం యెట్టిదైవుండునో! యీ మొల్లసంగతే నిలిచేటట్టులేదుకదా? యిఁక దీన్ని వుపజీవకంగా చేసికొని ధ్వనింపచేశాఁడన్న అంశాన్ని గుఱించి విచారించడమెందుకు? “నిమిత్తాపాయేనైమిత్తిక ప్యాప్యపాయః" కదా! కాఁబట్టి దాన్ని గుఱించి వ్రాసి కథ పెంచేదిలేదు.

మొల్లనుగూర్చి నాకుఁగల వుద్దేశాన్ని బందరు హిందూ హైస్కూలులో నేను తెలుఁగుపండితుఁడుగా వుండేరోజుల్లో చదువుకున్న విద్యార్థులు పలువురెఱుఁగుదురు. నేను పండితుఁడుగావున్న పదమూడేండ్లలో రెండు సార్లుఁకాబోలును మొల్లరామాయణం స్కూలు ఫైనల్కుటెక్ట్సుగా పడ్డది. అప్పుడు సీత రావణాసురునితో గడ్డిపరక మధ్యగాపెట్టుకుని మాట్లాడే పద్యాలు పాఠం చెప్పేటప్పుడు నాకు వొళ్లు తెలిసేదేకాదు. మొల్ల సాక్షాత్తుగా తానే సీతాదేవి ననుకోవడంచేత ఆలాటి కవిత్వం చెప్పఁగలిగిందని విద్యార్థులతో అనేవాణ్ణి. సాటిఆఁడుదానికిఁ గల్గిన పరాభవాన్ని గుఱించి ఆండుది చెప్పిన కవిత్వంకనుకనే కవిత్వం అంతపాకంగా వుంది అనేవాణ్ణి. వాల్మీకంలోగాని, భాస్కరాదుల కవిత్వంలోగాని యీ పాకం లేనేలేదు అనేవాణ్ణి. నేను స్కూలులో వున్నాననే సంగతి మఱచిపోయి స్వేచ్ఛగా కంఠంవిప్పి చదివేవాణ్ణికూడాను. యిట్టిస్థితిలో మొల్లవిషయంలో వెం. శా. దురభిప్రాయం కలవాఁడనే అపవాదు గ్రహచారవశంకాక యెట్టిదనుకోవాలి?

ఈ గ్రహచారాన్ని నేను మిక్కిలిగా నమ్మడంవల్ల యితరులకంటె ఆ యీగ్రహాలు నామీద యెక్కువ అధికారాన్ని చూపి చెలాయిస్తున్నట్టు నాకు తోస్తూవుంది. దేవుఁడుగాని, గ్రహాలుగాని నమ్మితేనేగాని యేమీ చేయలేవంటారు పెద్దలు. త్యాగరాయలువారేమన్నారు, “కద్దన్నవారికి కద్దు, కద్దని మొఱలిడిన, పెద్దలబుద్దులు, నేఁడబద్ధ మగునె" అన్నారు. యీలాటి సందర్భంలో గ్రహాలు నన్ను లోఁకువచేశాయంటే చేయవు? చేయుఁగాక, నేను నమ్ముతూనే వుంటాను. నమ్మి నామీఁదవచ్చిన "అపవాద"ను, మిథ్యాపవాదనుగా ఆగ్రహస్థితినిబట్టే సమర్థించాను గనుక నా నమ్మకం కూడా నాకు వుపకారమే అయిందని సంతోషిస్తూ దీన్ని ముగిస్తాను. ముగిస్తూ నేనేపద్యాలు మొల్లరామాయణంలో పాఠం చెప్పేటప్పుడు మొల్లకు సీతతో ఐక్యంచెప్పేవాణ్ణో ఆపద్యాలు మాత్రం వుదాహరిస్తాను.

క. పతిదైవముగా నెప్పుడు
   మతిఁదలఁచుచునుండునట్టి మగువలఁ జెఱుపన్
   బ్రతిన గలయట్టి నీతోఁ
   బ్రతివచనము లాడుకంటెఁ బాపముగలదే.

ఉ. సంగరరంగమందు నతిశౌర్యమునన్ రఘురాముతోడ మా
   తంగతురంగ సద్భట శతాంగబలంబులఁ గూడి నీవు పో
   రంగను నోప కిప్పుడు విరాధ ఖరాదులపాటు జూచియున్
   దొంగిలి నన్ను దెచ్చితివి తుచ్చపుఁ ಬల్కుಲು వల్కఁబాడియే.

సీ. కూకటిముడికినై కురులు గూడనినాఁడె
              బెదరక తాటకఁ బీచమడఁచె
    గాధేయుఁ డొనరించు క్రతువును రక్షింపఁ
              బెక్కండ్రు దైత్యుల నుక్కణంచె
    నవనిపై విలసిల్లు నఖిలరాజన్యులు
              వ్రేలఁజూపఁగలేని విల్లు విఱిచె
    ఘోరాటవులలోనఁ గ్రుమ్మరునప్పుడు
             ఖరదూషణాది రాక్షసులఁ జంపెఁ

తే. బాదరజమున నొకరాయిఁ బడఁతిఁజేసె
    లీల మాయామ్భగంబును గూలనేసె
    రాజమాత్రుండె మేదినీ రక్షకుండు
    రామభూపాలుఁ డాదినారాయణుండు.

తే. అట్టిరామున కీయబ్ది యనఁగ నెంత
    లంక యననెంత, దనుజులపొంక మెంత
    నీవనఁగ నెంత, నీలావుచేవ యెంత
    చెప్పనేటికి నీవ చూచెదవుగాక.

శా. వీరాలాపము లాడనేల వినుమీ విశ్వప్రకాశంబుగాఁ
    బారావారము గట్టి రాఘవుఁడు కోపస్ఫూర్తి దీపింపఁగా
    ఘోరాజిన్ నిను డాసి లావుకలిమిన్ గోటీరయుక్తంబుగాఁ
    గ్రూరాస్త్రంబుల మస్తముల్ దునిమి భుక్తుల్ వెట్టు భూతాళికిన్,

శా. ఆరూఢ ప్రతిమాన విక్రమకళా హంకార తేజోనిధిన్
    శ్రీరామున్ సుగుణాభిరాముఁ దెగడన్ జేకొన్న ని న్నాజిలో
    దారన్‌దొంగిలితంచు నిష్ఠురగతిన్ దండించి ఖండింప ము
    న్నీ రెట్లైనను దాఁటివచ్చు నలుకన్ నేఁడెల్లి శాంతింపుమా!

★ ★ ★



కీర్తి - అపకీర్తి

"పుణ్యైర్యశోలభ్యతే" అని యభియుక్తులు వచించినను, అంతకన్న కీర్తి సంపాదనకు ఋజువర్తనమే ముఖ్యమని నేననుకొందును. పుణ్యముపరంపరాకారణమైనఁ గావచ్చునుగాని సాక్షాత్కారము మాత్రముకాఁజాలదు. ఇందుల కెన్నియో యుదాహరణములు సుప్రసిద్ధములు కలవు. రావణుఁడెంత తపశ్శాలియైనను, పరాక్రమ సంపన్నుఁడైనను, ఋజువర్తనగల రామునికి వచ్చిన కీర్తి వానికిరాలేదు. ఇట్లే సుయోధనునికిని. ఇఁక ప్రస్తుతము యువ సం!! ఆషాఢమాస చంద్రికలో శ్రీయుత దువ్వూరి జగన్నాథశర్మగారు శ్రీ విజయనగర ప్రభువులచరిత్రను వ్రాయుచు బొబ్బిలి యుద్ధసందర్భమున అప్పటి శ్రీ విజయనగర ప్రభువొనర్చిన కార్యమును సమర్ధింప వలయునని కొంత ప్రయత్నించిరి. బొబ్బిలివారు వీరికాగ్రహమురాఁదగు చెడ్డపనులంతకుమున్నెన్నో చేసినట్లుదాహరించిరి. తుదకు తాండ్ర పాపయ్యగారు మహారాజును వధించుటను గూడ నుదాహరించి, అది యొక పౌరుషము గాదని వక్కాణించిరి. శ్రీ శర్మగారు వ్రాసిన ప్రతివాక్యమును నేను శిరసావహించువాఁడనే యైనను ఈ క్రింది మాటలు వ్రాయుచున్నాఁడను. శ్రీ మహారాజావారికిని, బొబ్బిలివారికిని ఎస్టేటు విషయముననేమి యితర విషయములయందేమి హస్తిమశకాంతరమన్నను కాదనువారుండరు. కాని యీ హెచ్చుతగ్గువల్లనే బొబ్బిలివారి కీర్తికి వన్నెయు, మహారాజావారి కీర్తికి కళంకమును విస్తరించుచున్నవి. ఎక్కుడు సేనయు రాజ్యమును గల శ్రీ మహారాజులుంగారు, ఫ్రెంచి సైన్యమును, పైగా తురుష్క సైన్యమును సాయముగాఁగొనుట, పిరికితనమునకు స్ఫోరకము. సమయము కాని సమయమున దండెత్తివచ్చుట కూడ డిటో, బొబ్బిలివారెన్ని విధముల సామోపాయము నవలంబించినను దానికి నంగీకరింపమి కూడ డిటో, బుస్సీ రక్షింపనెంచిన పసిబాలుని వధింపవలయునని నిర్ణయించుటయు డిటో, ఇంకను ఇట్టి హేతువులు బోలెడు కలవు. అన్నియు జగత్ప్ర సిద్ధములే. కాన విస్తరింపనక్కరలేదు. బొబ్బిలికథ వ్రాసిన యతఁడు బొబ్బిలివారివలన ధనముగొనిగాని వ్రాసియుండఁడు. మరల బొబ్బిలికి నామ రూపములు చాల వత్సరములకు పిమ్మటఁగాని రాలేదనుట చరిత్రప్రసిద్ధమే. ఈ కథయో! యుద్ధముజరిగిన కొలఁదినాళ్లలోనే అనఁగా - ఆవేఁడి చల్లాఱక పూర్వమే రచింపఁబడి యుండుననుట యుక్తియుక్తము. కావున నిది యొకరి ప్రేరణమునఁగాని, ధనముగొనిగాని రచింపఁబడి యుండదు. కొందఱు కవులట్లు రచించిన చరిత్రములు లేకపోలేదు. గాని కొందఱు తమంతటఁదాము స్వతంత్రించి వ్రాసిన కవులు లేకపోలేదు. “ఘనమతు లెల్లవారికి నకారణబంధులుగారె! సత్కవుల్". భారతరామాయణాదులిట్టి రచనలే. ఆయాచరిత్రలలో నచ్చటచ్చట నతిశయోక్తి వర్ణనలున్నట్లే ప్రకృతకథయందును అయ్యవి లేకపోలేదు. కాని ప్రధానాంశమునందట్టిది లేదని యెల్లరును విశ్వసించిరి.

ప్రధానాంశమనఁగా, బొబ్బిలికిని, విజయనగరమునకును యుద్ధము జరిగినది. ఇందులకు కారణము తమకన్న మిన్నయు అప్పటి కాలములో మహారాజై తమవంటివారి ననేకులను సామంతులుగాఁ జేసుకొని యేలుచున్న విజయనగర ప్రభువును బొబ్బిలి లక్ష్యపెట్టకుంటయే. సదరు యుద్ధములో బొబ్బిలి నాశనమైనది. విజయనగరము గెల్చినది, కాని "అత్యుత్కటైః పుణ్యపాపైః" అనురీతిని మహారాజు తాండ్ర పాపయ్యగారిచే మడియుటచే విజయనగరపు విజయముకన్న బొబ్బిలి పరాజయమే కవి గేయమైనది అనునది. ప్రస్తుత నాటకములుగాని, వెనుకటి ప్రబంధములుగాని యీ ప్రధానాంశమును బురస్కరించుకొనియే బయలుదేరినవి. శ్రీ శర్మగారికింబలె విజయనగరము నెడల నాకు మిక్కిలి యభిమానము. ఈ విషయము - "అల పతంజలి కృతంబైన భాష్యమునకే పరిఢవిల్లును మహాభాష్యపదము" అను సీసములోని యంశముల వలననే లోకము గుఱితించును. పైఁగా నిన్న మొన్నఁ బ్రకటింపఁబడిన నాజాతకచర్యలో - "రాజనఁగ నాతఁడే, మంత్రిరాట్టనంగ నాతఁడే" అనుపద్యమును గూడ శ్రీ శర్మగారు తిలకింతురుగాక. ఇట్టి యభిమానముగల నానోటనే ఆమధ్య బొబ్బిలికి వెళ్లినప్పుడు చరిత్రకు సంబంధించిన విషయమును బురస్కరించుకొని “మII వెలమల్ రాజులకన్న మిన్నలను నవ్విఖ్యాతి కిందావుగా వెలసెన్ బొబ్బిలి" అని నుడువవలసి వచ్చినది. శర్మగారీ వ్రాఁత యెడల నెట్టి యభిప్రాయమిత్తురో! చూడవలెను. ఈ యుద్ధకాలము వఱకును వెలమవారు శూరులలో నొకరుగానున్నను, అగ్రేసరులని అందులో క్షత్రియుల కన్న మిన్నలనిపించుకొనుచున్నట్లు లేదు. ఈ విజయనగర ప్రభువే వారికీర్తికి వన్నెవెట్టినట్లు నాకుఁదోcచినది. నేను బొబ్బిలివారిచే సమ్మానింపఁ బడవలయునను కోరికతో నట్లువ్రాయలేదు. విజయనగరము వారును నన్ను సమ్మానించిరి. కావున చరిత్రమునుబట్టి నాకు స్ఫురించినట్లు వ్రాసితినేకాని, ప్రయోజనాపేక్షచేఁగాదని మనవి చేయుచున్నాను. మఱియు బొబ్బిలి పట్టాభిషేకము వ్రాయుచు, అందీయుద్ధప్రసక్తి రాఁగా-

ఉ. “... ... ... రాతికంబ మొకఁ డెత్తయినట్టిది చూడనయ్యెడిన్"



చ. అది గనుఁగొన్నమాత్ర విజయావనిపాలని దుర్నయంబు దు
    ర్మదులు పరాసుసైన్యములరాయిడి, దుష్టతురుష్క సైన్యరా
    డదయత, వెల్మశూరులనయాంచిత బాహుపరాక్రమస్ఫుర
    త్కదనము నొక్క పెట్టునను కన్నులఁగట్టినయట్లు వ్రేలెడిన్"

అని నుడివితిని, ఈ వ్రాఁత నాకు ఆ స్థలము చూచుటవలనఁ గల్గిన యభిప్రాయమును బట్టి వ్రాసినదేకాని, యొకరిని సంతోషపెట్టుటకుఁ గాదు. నాకొక నియమము కలదు.

ఉ. ఆవల నెవ్వఁడేని కవి యల్లిన పద్యములం బఠించుచో
    నీవిధమెల్ల నిశ్చయమ; యీ నుతికిన్ దగు నీతఁడంచు సం
    భావనగల్గఁగావలయు భావమటుల్ పొడగట్టకున్న నా
    దేవురుగొట్టు పద్దెముల దీవనలేమిటి కప్పరాట్ర్పభూ!

నా నియమము పై పద్యమువలనఁ దెలియఁగలదని యుదాహరించితిని. ఏకొంచెమో ఆధారములేని వ్రాఁతను వ్రాయుటకు, కవులెవ్వరును ఇష్టపడరు. అందులో చరిత్ర విషయమున బొత్తిగా నిష్టపడరు. ఏదో కొంచెమున్నచోఁ గొందఱు మిక్కిలి పెంచి వ్రాయుదురు. కొందఱు సామాన్యముగా పెంచి వ్రాయుదురు. బొబ్బిలికథవలెనే వేఱొకరు విజయ నగరపుకథ అనుపేరుతో నేలవ్రాయలేదో మనమాలోచించుకోవలెను. పేరేది పెట్టినను బొబ్బిలివారినే పైకెక్కింపవలయుననియే నేననుకొందును. కొన్నిలోపములున్నను తరువాతి కవులకు జంగముకథలోని యంశములే మార్గప్రదర్శకములైన వనుకొందును. ఈ రెండుసంస్థానములకును గలపూర్వవైర కారణములను గూడ నేఁటి నాటకగ్రంథకర్త లుదాహరించినను తుదకు బొబ్బిలివారి కుత్కర్షమును, వేఱొకరి కపకర్షమును వ్రాయకతప్పదు. కావున శ్రీశర్మగారి యీక్రింది వాక్యమునకు సమంజసమైన యర్ధము నాకు స్ఫురింపదయ్యె ఆవాక్యమిదియే

“పైనుదాహరించిన శాత్రవ బీజములను వినాయించి, ఉత్తరకథను కేవల వధాపూర్వకమైన దానిని నాటకముగారచించి ప్రదర్శించుట చారిత్రక సత్యము లేనిపనియనియు, నాటకలక్షణము తెలిసిన విబుధులాక్షేపింపఁదగిన పనియనియుఁగాఁ జెప్పవలెను.” మఱియు నాటకకర్తలకు "అన్యథావాప్రకల్పయేత్" అనునొక యాధారము కలదు. అది నాయకుని యందేదేని లోపమున్నచో బహుసుగుణములుగల నాయకుని యందలి యాస్వల్పలోపమును అన్యథాగామార్పుచేసి సవరించుట కుపకరించును. ప్రస్తుత మీ బొబ్బిలికథను నాటకమునకుఁ గైకొన్నకవి విజయనగర ప్రభువును ప్రధాన నాయకునిగాఁ గైకొనుటయే తటస్థింపదుగాన మార్పున కవకాశమేలేదు. కావున నాటకకర్తల కీయాక్షేపణ తగులదు. శర్మగారింకొక వాక్యము నీసందర్భములో వ్రాసియున్నారు. అదియిది -

"... ... ... తాండ్ర పాపయ్య యను వెలమసేవకుఁడొకఁడు దొంగపోటున పొడిచిన ఖూనీకథను మహావీరలక్షణముగల నాటకముగా బ్రదర్శింప బూనుట. ఆంధ్రదేశమందలి నాటకరంగ మరణవార్తగా విబుధులు తలంపవలసియుండును.” . . .

ఈ వాక్యము కూడ నాకునచ్చలేదు. వెలమసేవకుఁడు, అని వ్రాయుటకూడ సమంజసముగాలేదు. కర్మధారయసమాసమో? తత్పురుషమో? అనుసందియము కల్లునట్లు వ్రాయుటయుక్తముగాదు. తాండ్రపాపయ్యగారి నింతకన్న గౌరవముగా వ్రాయుట యొప్పని నేననుకొందును. శూరుఁడను పేరు వంశప్రతిష్ఠనుబట్టి వచ్చెడిదికాదు. ఇఁక దొంగపోటును గూర్చి యతని నిందింపవలెను. కాని అప్పుడంతకన్న నయ్యనమున కవకాశములేదు. "అశ్వత్థామవలె" పాపయ్యగారును కొంతవఱకు సమ్మానార్హులే. ఒకటిమాత్రమున్నది. విజయనగర ప్రభువు సల్పిన యుద్ధము సర్వవిధముల నిర్దుష్టమై న్యాయబద్ధమై యున్నచో, అట్టి ధర్మవీరు నిట్లువధించిన పాపయ్యగారు నింద్యులైన నగుదురు గాని అన్యథాగా పాపయ్యగారు నింద్యులుగారు. ఆయనకు నాయకత్వమును కల్పించిన నాటకకర్తలును నింద్యులుకారని నేననుకొందును. నేనీ బొబ్బిలి చరిత్రను నాటకముగాఁగాని, ప్రబంధముగాఁగాని వ్రాసిన నేఁటికవులలోఁ జేరినవాఁడను గాకున్నను, శర్మగారువ్రాసిన - "విబుధు లాక్షేపింపవలసినపని” “నాటకరంగ మరణవార్తగా విబుధులు తలంపవలసి యుండును." అనెడి వాక్యద్వయము ప్రేరేపించుటచే నించుకనాకుఁ దోఁచినది వ్రాసితిని. ఇఁక నొకటి, నేను బొబ్బిలి పట్టాభిషేకమును వ్రాసియుండుటచే నీ వ్రాఁతకు నది నిమిత్తము కావచ్చునని చదువరు లూహింతురేమో? నేవ్రాసిన చరిత్రకును, ప్రస్తుత యుద్ధమునకును సంబంధములేదు. అందుఁ బ్రసక్తాను ప్రసక్తముగా దొరలిన పద్యములలో నొకటి యుదాహరించియేయుంటిని. ఆఘట్టములోని మఱికొన్ని పద్యములుగూడ నుదాహరించి దీనిని ముగించు చున్నాఁడను.

ఉ. ఇప్పటి బొబ్బిలిం గుఱిచియే యిపుడించుక చర్చఁజేసి నేఁ
    జెప్పితివెన్క బొబ్బిలి విశేషములన్ దిలకింప నొక్క నాఁ
    డప్పురి తూర్పునందు నొకయర్ధపుఁగ్రోశముఁ బోయినార మం
    దిప్పుడు రాతికంబ మొకఁడెత్తయినట్టిది చూడనయ్యెడిన్.

క. వెనుకటి యుద్ధమునకుఁ జెం
    దిన ముఖ్యాంశములుదానఁ దేట తెనుఁగుబా
    సను వ్రాయఁబడినవున్నవి
    మొనమొన్ననె జ్ఞాపకార్ధము నిలిపిరిదియున్.

తే. గీ. దాని నిల్పినయట్టిభూజాని నేఁటి
       ఱేనికిఁ బితామహుండు విజ్ఞానఘనుఁడు
       అంతటి ప్రయోజకుండు ధరాధిపతుల
       యందు నెందులేఁడని చెప్పవిందుమెందు.

ఉ. బొబ్బిలివారికిన్ మిగులఁ బొంపిరి వోవు యశమ్మనిచ్చి, పే
    రబ్బరమున్ ఘటించు నలయల్జడి యుద్ధము కారణమ్ముగాఁ
    బ్రబ్బినక స్తి నన్నగరి పాడఱి జాడఱి కాడువారియన్
    దిబ్బగమాఱియున్ బ్రథిత దృశ్యములందొక దృశ్యమై తగెన్.

శా. వీరక్షేత్రమటన్న పేరుగనుటన్ విశ్వస్తుతిం బొల్చుటన్
     శూరశ్రేష్ఠుల సచ్చరిత్రములచే స్తుత్యర్హ మౌటన్ సమి
     ద్దీరాగ్రేసరులైన వెల్మల యసృక్తేజంబుచే నానుటన్
     శ్రీరంజిల్లనితత్ప్రదేశ మఖిల ప్రేమాస్మదం బయ్యెడిన్.

ఆయా పద్యములవలన నా హృదయము చదువరులకు గోచరింపక మానదు. ఇఁక నొకటి. తాండ్రపాపయ్యగారిచేఁతకును అశ్వత్థామచేఁతకును గొంతపోలిక కలదుగాని బాగుగఁ బరిశీలించినచో ధర్మాత్ములగు పాండవుల వధింపనేగి యెఱిఁగియో యెఱుఁగకో తానననుకొన్నపనిని నిర్వర్తింపనేరక తత్పుత్రుల వధించిన యశ్వత్థామతో, తాననుకొన్నపని ననుకొన్నట్లే నిర్వర్తించిన పాపయ్యగారిని బోల్చుట కొంత తప్పేయగునేమో! యని కొంకుచు- "గుణాఃపూజాస్థానమ్” అను నభియుక్తోక్తిని స్మరించుచు దీనిని ముగించెదను.

  • * *