Jump to content

కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/నా గురుపరంపర

వికీసోర్స్ నుండి



నా గురుపరంపర

అయిదోవత్సరం దాటకుండా నాకు అక్షరాభ్యాసం జరిగింది. అక్షరాభ్యాస గురువు మా తండ్రిగారికి అక్షరాభ్యాసం చేసిన ధనుకొండ వెంకన్నగారనే వృద్దులే. నేను మఱునాడే బడికి వెల్లకపోవడంచేత అక్షరాభ్యాసానికి ద్వితీయవిఘ్నమే తటస్థించింది. ప్రతిరోజున్నూ ఆ బడికి సమీపంలోవున్న మాపెద్దమేనత్తగారింటికి మజ్జిగ పట్టుకెళ్లడం నామీదవుండేది. ఆ కారణంచేత బడిపిల్లలు అప్పుడప్పుడు నన్ను బలవంతంగా సాయంపట్టుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నించేవాళ్లు. కాని, ఆలాటి చిక్కులో వున్న నన్ను మా మేనత్తగారి కూతురు వచ్చి వాళ్లని పాఱదోలి తప్పించేది. ఈలా అయిదారునెలలు బడికి వెళ్లకుండానే గడిచి పోయాయి. అంతట్లో మా అమ్మగారి పెద్దమేనత్తగారు చనిపోయినట్లు కబురువచ్చింది. ఎప్పుడేనా వీథులో కర్మంచాలక బడిపంతులుగారు కనపడి, "యేమిరా బడికి రావడంలే” దంటే, “మాకు మైలవచ్చింది” అని చెప్పేవాణ్ణి. అది ఆయన మనస్సుకు నచ్చక, కారణం అడిగేవారు. నేను మా అమ్మ మేనత్తగారి సంగతి చెప్పేవాణ్ణి. "వోరి! అలాగబ్రా?” అని ఆయనలో ఆయన నవ్వుకొని వెళ్లేవారు. -

ఆ యీ వంకలతో చాలారోజులు గతించాయి. వ్యవసాయం తొందరచేత మా నాన్నగారు నా బడిసంగతి కనుక్కొనేవారేకారు. తుదకు యేడాదికో, యేణ్ణర్ధానికో బడికి వెళ్ళడం మొదలెట్టేను. గుంటవానమాలు వ్రాసియిచ్చారు. అప్పటికే పలకలు వచ్చాయిగాని, పూర్వపురకం బళ్లలో యింకా వాటిని వాడడంలేదు. ఓనమాలూ, అఆలూ, అయిదుబళ్లూ, గుణింతం, పేర్లూ నాకు త్వరగానే వచ్చాయి. పుస్తకం పట్టించారు. "వాగీశాద్యా” వగయిరా బాల రామాయణం శ్లోకాలు వ్రాసియిచ్చారు. ఇంకా ఆశ్లోకాలు వప్పగించకుండానే నా చదువు లోకల్‌ఫండు స్కూలుకు మాఱింది. యేమంటే : అంతకు పూర్వంనుంచిన్నీ అప్పటి లోకల్‌ఫండు స్కూలు మాస్టరుగారు యేలేశ్వరపు శ్రీరాములుగారు మా తండ్రిగారిని నన్ను తమస్కూలుకు పంపించవలసినదని కనపడ్డప్పుడల్లా ప్రేమతో అడుగుతుండేవారు. ఆ కారణంచేత లోకల్‌ఫండు స్కూలు విద్యార్థినిగా మాఱడం తటస్థించింది. "కాకుదీర్ఘమిస్తేకా" వదలిపెట్టి "కకారా కారములు కా" లోకి చదువున్నూ మాఱింది. కొత్తపద్ధతి అయినా నాకంత చిక్కుగా కనిపించలేదు. మొదటిరోజులోనే ఆమార్పు వంటికి పట్టింది. మాస్టరుగారికి నామీద అనుగ్రహం కలిగింది. మఱునాడే ఫస్టుక్లాసులో చేర్చేరు.  అప్పుడు ఆస్కూల్లో నాలుగుక్లాసులు వుండేవి. నాలుగోక్లాసు పిల్లలు ఇప్పటి మెట్రిక్యులేషన్ విద్యార్థులకు భాషలో నేమాత్రమున్నూ తీసిపోరు. కాని నా అదృష్టంవల్ల బ్రాహ్మణపిల్లవా డొకడు కొంచెం ముసలాగ్రబుద్ధి వుండేవాడు. అతన్నియేదో వర్ణక్రమం అడిగేరు మాష్టరుగారు. అతడు సరీగా చెప్పలేకపోయాడు. యేం తోచిందో; ఆ మాటకి వర్ణక్రమం నన్నడిగి చూచారు. నేను సరిగా చెప్పేను. దానితో మాస్టరుగారికి అనుగ్రహం మఱింత హెచ్చింది. నిన్ను నేడే సెకండు క్లాసులో వేసేమన్నారు. సెకండుక్లాసులో వున్నప్పుడు కూడా ఆవిద్యార్థిని అడిగిన వర్ణక్రమప్రశ్న అతడు తప్పినప్పుడల్లా నన్ను అడుగుతుండేవారు. నేను చెబుతూండేవాడను. ఆలాచెప్పడంతో ఆ విద్యార్థికి సిగ్గురావాలని కాబోలు. నాకేం తెలుస్తుంది? అతనిచేత నాకు ప్రదక్షిణ నమస్కారాలుకూడా చేయిస్తూవుండేవారు. అది పొందడం నాకిష్టం లేకపోయినా, మాస్టరుగారి భయంవల్ల విధిలేక అనుభవించేవాణ్ణి. అతడిప్పటికిన్నీ బాగానే వున్నాడు. నాకంటె నాలుగైదేళ్లు పెద్ద.

ఈలా రొండోక్లాసు చదువు జరిగింది. అంతలో మూడోక్లాసు. ఈక్లాసులో నాకు తక్కినవి బాగానే వచ్చేవి గాని, లెక్కలుమాత్రంనట్టేవి. నాలుగోక్లాసు ప్రవేశించడంతోనే భిన్నపులెక్కలు అప్పటి స్కూళ్లల్లో చెప్పేఆచారం. ఈ లోపుగా వుండేలెక్కలన్నీ మూడో క్లాసుతోనే సమాప్తికావాలి. నాకు లెక్కలంటే అప్పటికీ, యిప్పటికీ కూడా సగమెఱుకే. ఈ లెక్కల టయిము, ప్రతిరోజున్నూ మధ్యాహ్నం వచ్చేది. తఱుచు నే నెగబెట్టడంచేతనేమి, మాస్టరుగారు చదరంగమాడుకొంటూ యెప్పుడోగాని మధ్యాహ్నం స్కూలుకే రాకపోవడంచేతనేమి, చాలాభాగం నాకు లెక్కల గండం తప్పేది.

నా చిన్నతనంలో మా వూళ్లో చదరంగం విస్తారంగా వుండేది. ఈ యాటలో తఱుచు వ్యసనం కలిగివుండడంచేత, లోకల్‌ఫండువారిచ్చే జీతంకాక, వారి గ్రామంలో వున్న బడి అనే అభిమానంచేత శ్రీ పిఠాపురం జమీందార్లు అదనంగా యిచ్చే జీతం మా మాస్టరుగారికి యెవరో అర్జీ యిచ్చి ఆపుచేయించారు. అలా జరిగినప్పటికీ మా మాస్టరుగారు లక్ష్యం చేయనేలేదు. అప్పటి మాస్టర్లు తృణీకృత బ్రహ్మపురందరులు తఱుచు బల్లోకి రాకపోయినా అప్పటిమాస్టర్లు వచ్చిన నాలుగ్గడియలూ చెప్పే చదువువల్లనే పిల్లలు చక్కగా ప్యాసయేవారు. మా మేస్టరుగారు అంటే ఇప్పటి బోర్డు పల్లెటూరువారివంటివారు కారు. ఇప్పటి కాలంలో బి.యే.క్లాసుకుకూడా వారు పాఠం చెప్పదగ్గవారని నేననుకొంటాను. వారు స్వదస్తూరీతో వ్రాసుకొన్న నీతిచంద్రిక (చిన్నయసూరి గారిది) నాకు వారెప్పుడో అనుగ్రహం కలిగి యిచ్చారు. ఇప్పటికీ అది నా వద్ద నిల్వవుంది. అది చూచినప్పుడల్లా వారి విగ్రహం నాకు జ్ఞాపకం వస్తూ వుంటుంది. ఆ వాగ్దోరణీ, ఆ బ్రహ్మతేజస్సూ, ఆ సదాచారసంపత్తీ, ఇప్పుడెక్కడ చూడగలం? ఆ కాలం పోయింది. ఆయన యేలేశ్వరోపాధ్యాయులుగారి వంశంవారు. ఆ వంశంలో కల్లా ఆయనే తక్కువపండితులు. పెత్తండ్రిగారు వగయిరా మిక్కిలీ పెద్ద పండితకోటిలోవారు. తక్కువవారు కనకనే స్కూలు మాస్టరీకి వచ్చారు. వారి పాండిత్యం తక్కువ మా అదృష్టాని క్కారణమయింది. వారప్పుడప్పుడు తఱుచుగా భారతమో, రామాయణమో పురాణమో చదువుతూండేవారు. చిన్నప్పటినుంచీ ధారణ శక్తి వుండడంవల్ల వారు చదివిన కథంతా కొన్ని చిన్నపద్యాల సహితం నాకు ధారణకు వచ్చేవి. పైగా వారు చదివే ధోరణి కూడా కొంత పట్టుబడేది. కాని పదిసంవత్సరాల లోపుసంగతి అవడంచేత వారు చదివే ధోరణి మాత్రం యిటీవల నాయందు నిలవలేదు.

పదేండ్ల వయస్సులో నాచదువు ఫ్రెంచిటవును యానాముకు మాఱింది. అందుచేత కడియం మాస్టరుగారివద్ద మూడోక్లాసువఱకే చదువున్నూపల్లెటూరు ఆటలు, గోళీకాయలు, గుట్టాటా, ఒకమాదిరి కోతికొమ్మచ్చీ, బంతీ, ఈ ఆటలున్నూ, కొంచెం చుట్టకాల్చడమున్నూ మాత్రమే కడియంలో నాకు తటస్థపడ్డాయి. తుట్టతుది దురభ్యాసానికి కారణం యింట్లో విస్తరించి పుగాకుండడమే. అట్లా వుంచడానికి హేతువు మా తండ్రిగారి అమాయికత్వం. ఒకరైతు ఒక గృహస్థు దగ్గఱ అరవైరూపాయీలు ఋణం పుచ్చుకొంటున్నాడు, ఆ యిచ్చేటప్పుడు మా తండ్రిగారు అక్కడ వున్నారు. ఋణదాత "యేమండీ, కామయ్యగారూ, యితనికిస్తున్నాను, యివ్వవచ్చునుగదా?" అన్నారట. “అభ్యంతరమేమి" అని తల వూపేరట. ఈ మాత్రం తల వూపినందుచేత ఆ కాపువల్ల వసూలు కాని ఆ ఋణము మా తండ్రిగారు వారికి తీర్చారు. దానికై కృతజ్ఞత చూపుతూ ఆ రైతు తనంతటతాను రెండుపుట్ల పొగాకున్నూ రెండుకాళ్ల లేత దుక్కి గిత్తలున్నూ మా యింటికితోలిపెట్టేడు. ఆ కాలం యేలాంటికాలమో చూడండి. ఆ పొగాకు ఇప్పటి రోజుల్లో రెండువందలకు తక్కువ ఖరీదుండదు. ఆ యెడ్లు నాలుగున్నూ ఈ రోజుల్లో నూఱేనా చేయకపోవు. ఇదంతా కోర్డుద్వారా జరిగిందికాదు. గ్రామంలోనే. తమంతట తమకు తోచిచేసిన పనేగాని, వక తగవరీ గిగవరీ చెపితే చేసిన పనిన్నీకాదు. ఆ పొగాకు మా యింట్లో వుండడంచేత, ఆయా పదార్థాలు కొనడానికి చేతికి వచ్చినంత మా అమ్మగారు వాళ్లవాళ్లకి యిస్తూవుండేవారు. నేనున్నూ స్కూలుపిల్లల సహవాస దోషంవల్ల వాళ్లసహితంగా పొగాకును వాడుకోవడం తటస్థించింది. ఒకనాడు మా అమ్మగారు కనిపెట్టి మందలించారు. అంతతో అది ఆగిపోయినట్లయింది. కాని పూర్తిగా ఆగిందనడానికి వల్లకాదు. ఇటీవల కొన్ని యేళ్లకు కావ్యాలు చదవడం ఆరంభించాక పూర్తిగా ఆగింది.

యానాంలో ఫ్రెంచి స్కూల్లో ప్రవేశించాను. ఇప్పటి ఇంగ్లీషు స్కూళ్లలోవలెనే ఆ స్కూల్లో తెలుక్కంత ప్రాధాన్యంలేదు. సాతాని జియ్యన్నగారు తెలుగుమాస్టరు. ఫర్మా, విజే అను యిద్దఱు దొఱలు ఫ్రెంచి మాస్టర్లు. ఫర్మా హెడ్మాస్టరు. విజేగారు నాకు గురువు. చాలా దయాశాలి. ఇంగ్లీషులో త, ద లోనగు కొన్ని వర్ణములవలెనే, ఫ్రెంచిలో ట, డ లోనగు కొన్ని వర్ణములు పలకవు. నన్ను ఆ మేస్టరు గారు “సెలపిల యెంకతసలం’ అని పిల్చేవారు. ఆ బడిలో పిల్లలు జీతమివ్వనక్కరలేదు. పుస్తకాలు వారే యిచ్చేవారు. పైగా యెక్కువ తెలివితేటలుంటే ప్రజంట్లు కూడా యిచ్చేవారు. మాలా - మాదిగా అందఱూ వుండేవారు గాని, యెవళ్లబెంచీ వాళ్లదే. ఒక హాల్లో మాత్రం కూర్చోవడం తప్పదు. వారానికి రెండు రోజులు పూర్తిసెలవు. కాని వరుసగా మాత్రం కాదు. గురువారమున్నూ ఆదివారమున్నూ పిల్లలుచేసిన తప్పేదైనా వుంటే వారాని కొకమాటు శిక్షించడం. దానిపేరు "పటుసారి" అనేవారు. డ్రాయరుమీద పడుక్కోబెట్టి తప్పునుబట్టి బెత్తంతో కొన్ని దెబ్బలు కొట్టడం.

ఆస్కూల్లో అయిదాఱు మాసాలకన్న యెక్కువరోజులు చదివినట్లు జ్ఞాపకంలేదు. "అల్ఫాబెత్తు" అనే మొదటి పుస్తకంలో కొంత అయింది కాబోలును. తెలుగు కడియంలో వచ్చిందెంతో అంతేకాని వృద్ధికాలేదు. అంతలో భగవదనుగ్రహంవల్ల, ఆ ప్రభుత్వం రిపబ్లికు ప్రభుత్వం కనుక, మాలమాదిగలనుకూడ అందఱితో కలిసి కూర్చోనివ్వాలి అనే రూలు ప్యాసయింది. దానితో అన్ని వర్ణాలపిల్లలూ మానేశారు. నేను మాత్రం కొలదిమంది పిల్లలతో ఆ అవకాశంలో ఆ వూరికి సమీపంలోవున్న ఇంగ్లీషు గ్రామం నీలపల్లెలో లోకల్‌ఫండు స్కూల్లో ప్రవేశించాను. పిల్లలంతా మానుకోవడంచేత మళ్లా ఫ్రెంచి స్కూల్లో ఆ రూలు తీసివేశారు. తీసివేసినా తక్కినవాళ్లు ప్రవేశించారు గాని, నేనున్నూ మణికొందఱున్నూ ప్రవేశించలేదు.

ఆ నీలపల్లె స్కూల్లో ముగ్గురు మాస్టర్లూ సుమారు అయిదాఱువందల పిల్లలూ వుండేవారు. నాలుగో క్లాసులో అఱవై, డెబ్బై మంది వుండేవాళ్లం. ఆఱువేల నియోగులు చేమర్తి వేంకటాచలంగారు హెడ్మాస్టరు. శేషయ్య వ్యాకరణం, హిందూదేశ చరిత్ర, సుఖాధారప్రకాశిక, విభక్తి చంద్రిక, శబ్దలక్షణం, ఇత్యాదులు పాఠ్యపుస్తకాలు, శేషయ్య వ్యాకరణం ఇప్పుడెక్కడా కనపడడంలేదు. అది వెంకయ్య వ్యాకరణానికి బదులుగా బయలుదేరింది. వీరభద్రపళ్లేనికి హనుమత్పళ్లెం వంటిది. శేషయ్య అనే ఆయన వ్రాశారని తోస్తుంది. వెంకయ్య వ్యాకరణం మాత్రం వెంకయ్య అచ్చువేయించింది గాని రచించిందికాదు. అయితే ఆయనపేరుతో వ్యవహరించబడడం “పుణ్యైర్యశో లభ్యతే " అన్న అభియుక్తోక్తి కుదాహరణం అనుకోవాలి. నన్నయభట్టీయ సూత్రాలకు బాలసరస్వతి వ్రాసిన టీకను విడదీసి తాడినాడ వెంకయ్యగారు అచ్చువేయించినారు. ఇప్పటికిన్నీ అది ఆ పేరుతోనే వ్యవహరింపబడుతూ వుంది. ఇట్లాగే హైదరాబాదులో హుసేనుసాగరం అనే చెఱువొకటి వుంది. అదికూడా హుసేను తవ్వించింది కాదు. అతడొక నవుకరు. ఆ చెఱువు తవ్వించే రోజుల్లో ఆ పనిలో కాస్త పెద్దగా వుండి వుండును. ఈ యప్రస్తుతప్రశంస శేషయ్య వ్యాకరణంమీద వచ్చింది. ఆ వ్యాకరణంలో “తటం, ఏతటం” అంటూ రెండు సంజ్ఞలు వుండేవి. వాట్ల అర్థం అప్పుడు తెలియలేదు సరిగదా. ఇప్పటికీ తెలియనేలేదు. పుస్తకం కనపడితే ఇప్పుడు తెలుస్తుందేమో కాని అది దొరకడం మానేసి చాలా వత్సరాలయింది.

ఈ మోస్తరు పుస్తకాలతో నీలపల్లెలో "లోవరుఫోర్తు" అనే పరీక్ష యిచ్చి సర్టిఫికెట్టు పుచ్చుకొన్నాను. సర్టిఫికెట్టు యివ్వడం ఇనస్పెక్టరుగారే. అప్పుడు యినస్పెక్టరు జిల్లాకు వక్కరుగా వుండేవారు. వారి పేరు క్రోవి దక్షిణామూర్తి శాస్త్రులుగారు. జిల్లాకూడా ఇప్పటి కృష్ణలో చాలాభాగం తూర్పుగోదావరిలోనే వుండేది. ఇనస్పెక్టరుగారు సవారీ బోయీలతో వచ్చేవారు. నేను ప్యాసైన లోవర్‌ఫోర్తుప్యాసైతే స్కూలు మాస్టరీ చులాగ్గా యిచ్చేవారు. ఇదికూడా ప్యాసుకాకుండా యెంతోమంది మాస్టరీపని సంపాదించినవాళ్లు ఆ రోజుల్లో వుండేవారు. యినస్పెక్టరుగారి అనుగ్రహం సంపాదిస్తేచాలు, ఆ రోజులవి. ఈ రోజులను గూర్చి యెఱుగనివారు లేరు గాన విస్తరింపనక్కఱలేదు. ఆ నీలపల్లెలో చదివేటప్పుడు మమ్మల్ని పొరుగూరువాళ్లమనే కారణంచేత మధ్యాహ్నమున్నూ, సాయంకాలమున్నూ సుమారు వక గంట ముందుగా వదలిపెట్టేవారు. ఆ టయిములో మేము త్రోవలోవున్న శీతాఫలపుతోటల్లోనూ, జామతోటల్లోనూ యథేచ్ఛగా కాలక్షేపం చేసేవాళ్లం.

ఈరీతిగా నీలపల్లె చదువు ముగిసింది. తరువాత యానాంలోనే మాకు దగ్గఱచుట్టాలు చక్రవర్తుల బాపయ్యగారి బడిలో ప్రవేశించాను. ఈయనకు అంతో యింతో ఫ్రెంచి, ఇంగ్లీషుకూడా వచ్చును. తెలుగులో మంచిసమర్థులు. కొంతజ్ఞానం ఈబల్లో కలిగింది. ఈ బళ్లో చదివే రోజుల్లోనే కాగితపు అట్టలతో తోలుబొమ్మలుచేసి, నేనున్నూ, ఇంకొక సాతానుల పిల్లవాడున్నూ తోలుబొమ్మలాటాడించడం మొదలు పెట్టేటప్పటికి ఈ సంగతి శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమీందారుగారికి తెలిసి మమ్మల్ని పిలిపించి ఆడించారు. ఏదోకొంచెం సమ్మానం కూడా చేసినట్టు జ్ఞాపకం. బాపయ్యగారిబళ్లో వకరోజున డిక్టేషన్ వ్రాయడంలో కామాలో, పులుప్టాపులో పెట్టడం పొరబడ్డది. ఆయన దానికి కోప్పడ్డారు. ఆ మఱునాడు ఏమితోచిందో యిప్పుడు జ్ఞాపకం లేదుగాని, ప్రతీ అక్షరానికీ, కామా, లేదా, పులుస్టాపు - యిల్లా వుంచాను. దానిమీద పూర్తిగా మందలింపు తగిలింది.

ఈపైన కాపులపాలెంలో శ్రీ భుజంగరావుపంతులవారిదగ్గఱ రఘువంశం చదవడం, ఈ చదివేరోజుల్లో వక వైష్ణవునివద్ద సంగీతం గాలిపాట అంతోయింతో నేర్చుకోవడం, ఈయన యింటిపేరు పురాణంవారు. పేరు నరసింహాచార్యులు. ఈయన నాకు రఘువంశం చదవటంలో సహాధ్యాయి. ఈయన వుపదేశాన్ని బట్టినేను ఆ రోజుల్లో వైష్ణవమతస్థుడుగా వుండేవాణ్ణి. పైకి ఆ మతచిహ్నాలు ధరించకపోయినా శివుడంటే ద్వేషంగా వుండేవాణ్ణి. శివాలయంలోకి వెళ్లినా, ప్రసాదం పుచ్చుకొన్నా, దాన్ని మాత్రం తినేవాణ్ణిగాను. ఈ మతంబాధ క్రమంగా మాఱింది కాని కొన్నాళ్లు మాత్రం చాల పట్టుదలగా వుండేవాణ్ణి. ఆయన నాకు వుపదేశించిన వుపదేశమేనా అంత విస్తారమేమీలేదు. ఇద్దఱిని ఆశ్రయించడం వల్ల యేమీ లాభం వుండదు, వారు రక్షిస్తారని వీరు వూరుకొంటారు. వీరు రక్షిస్తారని వారూరకొంటారు, తుదకు భక్తుడు వ్యర్ధుడైపోతాడు అని చెప్పేవాడు. ఆయన సహాధ్యాయిగా వున్నది స్వల్పకాలంమాత్రమే గురుత్వంవల్ల నైతేనేమి, సహపాఠిత్వంవల్ల నైతేనేమి, నాకు ముక్కుపొడుం పీల్చడం అభ్యాసమయింది. అది యిప్పటిదాకా నిల్చివుంది. ఇంకనూ వుండేటట్టేవుంది.

ఈ రోజుల్లోనే నేను నృసింహదేవర సుబ్బారాయుడుగారివల్ల కాపీ పెట్టించుకొని దస్తూరీ కొంత బాగుచేసుకొన్నాను. ఈయన దస్తూరీ చాలామంచిది. ఈయన భార్యయున్నూ మా తల్లిగారున్నూ పినతండ్రి పెత్తండ్రి బిడ్డలు. ఈయన అత్తవారి గ్రామం యానామే కనుక తఱుచు వస్తూండేవారు. ఆ సమయంలో నా కీ వుపకారం జరిగింది. ఈ రఘువంశం చదివే రోజుల్లోనే కుమ్మరి కామయ్య అనే మార్దంగికునివద్ద కొంచెం మద్దెలవరసలు చెప్పుకొన్నాను. సేవమోళాపాటకులున్నూ, శ్రుత పాండిత్య పౌరాణికులున్నూ అయిన ముక్కామల జోగయ్యగారివద్ద నీలపల్లెవెళ్లి స్వరాలుకూడా మొదలెట్టేనుగాని, యీ రెండున్నూ కొన్ని రోజుల్లోనే ఆగిపోయినాయి. ఈ జోగయ్యగారు తఱచుగా దేవతా కార్యాలూ, సంతర్పణలూ జరిగిస్తూ జీవితం గడపిన పుణ్యపురుషులు. యీయన్ని గుణించి వ్రాస్తే చాలా వ్రాయాలి. ఆ రోజుల్లోనే కొంచెం కుస్తీ వగయిరాలల్లోకూడా కొంతకృషి జరిగింది. పేకాట చెప్పనే అక్కఱలేదు. వున్న స్నేహితులందఱూ ఆటలకు సంబంధించినవాళ్లే అయినా, యేనాల్గు రోజులకో కాపులపాలెం రఘువంశ పాఠానికి తప్పకుండా వెళ్లేవాణ్ణి. ఆ గురువుగారు, వెళ్లినప్పుడు పాఠం చెప్పడమేగాని, నిన్న వచ్చేవు కావేమని యెప్పుడూ అడిగేవారే కారు. వారిది నవాబుచూపు. సదాచారసంపత్తిలో ఏ విధమైన లోపమున్నూ లేదుగాని, వారికి కొంచెము మాదుం అభ్యాసం. ఆ మాదుంలో గంజాయి కొంచెం పడుతుంది. ఆ కారణంచే నవాబుచూపుగా వుండేవారు. వారువైదిక పండితుల వంటివారుకారు. ఆగర్భశ్రీమంతులు, ప్రతివత్సరమూ అయిదారు వేలరూపాయీలు ఆరోజులలో రాబడికలవారు. రాత్రి తెల్లవార్లూ విద్యా గోష్టితో మేలుకోవడము, అప్పుడు పరుండి పగలు పదకొండు రమారమీని మేల్కోడం. అప్పుడు దేవతార్చన బ్రాహ్మడు దేవతార్చన చేశాక వీరు స్నానాదికృత్యాలు జరిగేక సాలగ్రామతీర్థం పుచ్చుకొని భోంచేసేవారు. చదువే కాకుండా నా భోజనం కూడా చాలారోజులు వీరింట్లోనే. పంతుల వారిభార్య పంతులవారికన్నా నన్ను పుత్రప్రేమగా చూసేవారు. ఆరోజుల్లోనే ముక్కవిల్లి జగ్గన్నదీక్షితులుగారివద్ద సంధ్యావందనపు తప్పులూ, అపస్వరాలూ దిద్దించుకొన్నాను. వీరిది గోదావరితీరం కోరుమిల్లి కాపురం. మన్యంవారి సంస్థానంలో జపతపాలకై అప్పుడప్పుడు వస్తూవుండేవారు. మన్యంవారి పురోహితులు గాడేపల్లి సుబ్బావధాన్లుగారు కాపులపాలెంలోనే వుండేవారు. కాబట్టి, వీరు వారింటిలో మకాంగా వుండేవారు. ఆ కారణంచేత ఆ వూరు వెళ్లినప్పుడు వీరి శుశ్రూష నాకు లభించేది. గాడేపల్లి సుబ్బావధాన్లుగారి కుమాళ్లు వెంకటరామయ్యగారి వద్దనూ, మర్ల జోగయ్యగారి వద్దనూ అద్దరి మురుమళ్ల కొత్తపల్లి కాపురస్తులు వుప్పులూరి రామజోగన్న సిద్ధాంతిగారి వద్దనున్నూ యేవకటి రెండు శ్లోకాలో చదివికొన్నట్టు జ్ఞాపకంగాని, యేమైననూ రఘువంశ గురుత్వం సర్వమున్నూ కానుకుర్తి భుజంగరావు పంతులవారి ప్రసాదమే. చిన్నప్పుడు పడుగులో సంధ్యావందనం చెప్పుకున్నప్పటికీ ప్రతీపూటా సరిగా వార్చకపోవడంచేత మరచిన చోట్లున్నూ స్వరదోషాలున్నూ చాలాభాగం జగ్గన్నదీక్షితులవారి శుశ్రూష ఫోగొట్టింది. శేషమేమేనా వుంటే అది యిటీవల ప్రధాన గురువు బ్రహ్మయ్య శాస్త్రులవారి పాఠశాలలో శ్రీ గోరుగంతు శ్రీరామావధాన్లుగారివద్ద వేదంచెప్పుకునేటప్పుడు పోయివుండాలి. ఇంకా మిగిలితే ఇవి యిప్పటికిన్నీ మిగులే. ఈ సంధ్యావందనం విషయం నాబోట్లలెక్కేమి? పెద్ద పెద్ద వేదపండితులలో కూడా నూటికి తొంబది మందికీ చిక్కున్నదే. కారణం నోరు నలగనప్పుడు చెప్పకోవడమే. వేదంలో యేపన్నాలో కొన్నాళ్లు సంత చెప్పుకుంటేనే గాని నోరు నలగదు.

ఈ రఘువంశం చదివేరోజుల్లోనే యింజరంలో రామడుగుల వేంకట సుబ్బరాయావధాన్లుగారి శిష్యులలోచేరి జంద్యాలవడుకుతోపాటు కొన్ని పరాయాతప్పన్నాలు సంతచెప్పుకొన్నాను. కాని జంద్యాల వడుకు మాత్రం నేర్చుకొన్నట్టయింది. కొంచెం నోరున్నూ నలిగింది. కాని ఆ పన్నాలు పూర్తికాలేదు. ఆ జంద్యాల వడుకునుగూర్చి కొంత వ్రాస్తాను. గురువుగారు సంతచెపుతూ పత్తివిడదీసి పింజెలుచేసి శిష్యులకి యిస్తూ వుంటారు. శిష్యులు చేతితోవడుకుతూ నోటితో సంత చెప్పుకుంటూ వుంటారు. అధమం వొక్కొక్క శిష్యుడు రోజు వక్కంటికి అర్ధణానూలేనా వడుకుతాడు. నెల వక్కంటికి రూపాయిజీతం యిచ్చినట్లవుతుంది. ఈలాంటి శిష్యులూ, ఆలాంటి గురువులూ మా విద్యార్థి దశనాటికింకా వుండేవారు. యిప్పుడున్నట్టు తోచదు. చదువంటే యెంతో తేలికగా అప్పుడు వుండేది. యిప్పుడు వేలకొలది కొన్నిటికీ, లక్షలకొలది కొన్నిటికీ పెట్టుబడిపెట్టి పాఠశాలలు స్థాపిస్తూ వుంటారు. విద్య అంతకన్నబాగా జరుగుతూన్నట్టు కనపడదు. దానికీ దీనికీ యెంతభేదం ఉందో చూడండి. అన్నిటిమాటా అలా వుంచుదాం. ఈ జంద్యాల వడుకు పాఠశాలలు మన గాంధీగారు చూస్తే వుబ్బితబ్బిబ్బైపోతారు. ఈ రీతిని మాకు గురుత్వం చేసిన అవధాన్లుగారు ఆ గ్రామం పైమీద బట్టతో మాత్రం వచ్చినవారైనా ఆ వూళ్లో వుండే సంపన్నులలో వకరై యిప్పుడు పుత్రపౌత్రసంపత్తుతో తులదూగుచూ యజ్ఞయాగాదులు చేసిన కర్మిష్ఠులై చయనం చేసేకుతూహలంతో వున్నారు. రమారమీ యెనభై యేండ్ల వయస్సులో నలభై యేండ్ల వయస్సులో వున్నట్లుంటారు. వీరి పేరుగల వీరి మనుమడికే నేను చి|| సౌ|| మా రెండోపిల్ల నిచ్చివివాహం చేశాను. ఆ కుఱ్ఱవాడే ఆ మధ్యను షష్టిపూర్తి సభలో ఘనపనస చెప్పినవాడు. ఇప్పుడు పదకొండేండ్ల వయస్సులో నున్నాడు. ఆ అవధాన్లగారే కాదు, ఈయన పెద్దకొడుక్కూడా యజ్ఞం చేశాడు. నేనైతే కర్మిష్ఠిని కానుగాని, కర్మిష్ఠులను చూస్తే నాకు చాలా సంతోషం. అందుచేత ఇక్కడ కొన్నిపంక్తు లెక్కువగా వ్రాశాను. పశుహింసలేకుండా ఈ కర్మిష్ఠులు యజ్ఞాదికర్మలు జరిగిస్తే మఱీ సంతోషిస్తాను. కాని నా మాట వారు వినరు. ఏమన్నా అంటే, “వచనాత్ర్పవృత్తి వచానాన్నివృత్తి" అని చదువుతారు. దేవీభాగవతంలో ఋషులు పశుహింసలేని యజ్ఞాలే - చేశామని చెప్పుకొన్నారు. వారికి పైవాక్యాలు తెలుసునో లేదో!

ప్రకృతానికి వద్దాం. ఇతరవిద్యలప్రధానంగా, కావ్యాలు ప్రధానంగా, యేలాగైతేనేమి రెండేండ్లలో మూడుసర్గలు రఘువంశం చదవడం అయింది. కాని వల్లించుకోవడానికి మాత్రం అవకాశం వుండేదికాదు. ఆ వూరినుంచి వచ్చేటప్పుడు తోవలో గురువుగారు చెప్పిన పాఠం చదువుకోవలసిందేకాని, ఇంటికి వచ్చాక తీరుబడి వుండేదికాదు. త్రోవలోకి యెదురుగుండా స్నేహితులు వచ్చేవారు. ఇక చదువెక్కడ? ఆటలే ఆటలు, మేమే మేము. రఘువంశపు చదువిలా దాటింది. అంతలో యానాం గ్రామంలో నేమి, నీలపల్లె, తాళ్లరేవు, కోరంగి మొదలైన ఆ ఉప్పుటేటి ప్రాంతం గ్రామాల్లోనేమి, సర్వసాధారణంగా వుండే బోదకాలు వగైరా వ్యాధులలో వకటయిన “వరిబీజం” అనే వ్యాధి నా భవిష్యదభివృద్ధికి సూచకమై అంకురించింది. ఏవో కొన్ని వైద్యాలు చేసినప్పటికీ గుణం కనపడిందికాదు, గ్రామంవదిలేస్తే తప్పక కుదురుతుందని తోచి యానాముకు సుమారు నాలుగైదు మైళ్లలోవున్న పిల్లంక చదువుకోవడానికి మకాంగా ఏర్పఱచుకొన్నాను. కాని, నదీపాత మయిన కారణంచేత ఆ గ్రామం పునస్సృష్టమైన కారణంచేత ఇళ్లు దూరదూరంగా పొలాల్లో వుండేవి. చిన్నతనం గనక రాత్రి ఆయాచోట్లకు వారాలకి వెళ్లలేక ఆ వూరుకూడా వదులుకోవలసి వచ్చింది.

తరువాత అల్లంరాజు సుబ్రహ్మణ్యకవిగారితో చదువుకోవడానికి మా వూరునుంచి యింట్లో చెప్పకుండా చేబ్రోలుకు బయలుదేరి వెళ్లేనుగాని, త్రోవలో కాకినాడలో చదువుకొమ్మని చెప్పి ఆయన ఆ వూళ్లో దిగబెట్టి వెళ్లిపోయారు. ఆ వూళ్లో కల్లూరి గణపతి శాస్త్రులవారు పాఠం చెపుతామన్నారుగాని, వారాలు కుదరటం తటస్థించిందికాదు. అప్పుడు అంతకు మున్ను వక నెల్లాళ్లనాడు మా మేనత్తకూతురు వివాహానికి కాటవరం గ్రామం వెళ్లినప్పుడు ఆ గ్రామవాస్తవ్యులు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులుగారు సుమారు నాకన్న రెండుమూడేండ్లు పెద్దవారు నిర్వ్యాజమైన ప్రేమతో, అబ్బాయీ, నీవీవూరువస్తే నీకు చదువు చెపుతానని చెప్పివుండడంచేత, కాకినాడనుంచి కాటవరానికి మకాం యెత్తేశాను. మేనత్తగారి వూరవడంచేతనేమి, గురువుగారి ప్రేమాతిశయంచేతనేమి ఆవూరునాకు పొరుగూరనిపించనేలేదు. కాటవరం వెళ్లేటప్పటికి నాకు కుమారసంభవంలో మొదటిసర్గలో యేనాలుగైదు శ్లోకాలో పిల్లంక అనంతాచార్యులవారివద్ద అయినాయి. తెలుగులో స్కూల్లో చదివినది తప్ప ఇతరమేమీ రాదుగాని, జావళీలూ, భజనకీర్తనలూ, కొన్ని తరంగాలూ, కొంచెం . అధ్యాత్మకీర్తనలూ, మువ్వగోపాలపదాలూ ఈ సరుకుమాత్రం కొంత విస్తరించివుండేది. ఏదో కొంచెం పదకవిత్వంకూడా కంగాబంగాగా అల్లేవాణ్ణి. ఏదో చిన్నతనంచేత చెపితే అందులో తమకు సంబంధించిన దూషణ వుందని రఘువంశం చదివేరోజుల్లోనే నామీద వకరు కేసుకూడా పెట్టేరు. విచారణకర్త, ఫ్రెంచిదొర “వీడు పోయట్ అంటే నేను వప్పుకోను,” అని కేసుకొట్టేశాడు. కృష్ణమూర్తిశాస్త్రులుగారివద్ద కుమారసంభవంలో వకటి, మూడు, అయిదు సర్గలు చాలవఱకున్నూ, మేఘసందేశంలో పూర్వభాగంలో కొంతవఱకున్నూ చదవడమే కాకుండా, వారున్నూ వారి సహాధ్యాయులు మధిర సుబ్బన్నదీక్షితులు గారున్నూ లక్షణవిషయాలు చర్చించుకొనేటప్పుడు వినడంవల్ల కొంచెం లక్షణజ్ఞానంకూడా సంపాదించుకొన్నట్టయింది. పైగా చదరంగం నడకలేకాకుండా కొంత వఱకా ఆటలోకూడా ప్రవేశం వారే కలిగించారు. అంతతో ఆవూరు చదువుకు విఘ్నంవచ్చింది.

ఆపైని కాజులూరు విద్యార్ధిత్వం. ఆ వూళ్లో మేఘసందేశ పూర్వభాగంలో తరవాయి మాత్రం జరిగింది. చదరంగంలో కొంత పాండిత్యం అతిశయించింది. సులక్షణసారం స్వయంగానే చూచుకొని కవిత్వం పద్యాల్లో చెప్పడంకూడా ఆవూళ్లోనే మొదలు పెట్టాను. ఆ వూళ్లో గురువులు ముగ్గురు : రేగిళ్ల కామశాస్త్రులుగారు, పప్పు సోమయ్యగారు, పప్పు సోమనాథశాస్త్రులుగారు. వీరెవరున్నూ కవులుగారు. మొదటి గురువు భుజంగరావు పంతులుగారు గ్రంథాలేమీ వ్రాయలేదు గాని, వారు మాత్రం కవులే. తరువాత కాటవరంలో శుశ్రూషింపబడ్డ గురువులున్నూ కవులే. వారివారివద్ద నేను కవిత్వానికి సంబంధించిన కృషి చేయలేదు. ఏదో తోచినట్టు అల్లడానికి మొదలు పెట్టేనన్నదే ముఖ్యాంశం. అందుచేత లక్షణంలో యెన్నో సంశయాలు కలుగుతూవుండేవి. యెవరేనా తటస్థించినప్పుడు కనుక్కుంటూ వుండేవాణ్ణి. కాజూలూరులో ఒక విశేషం. వారాలు యెంతో గౌరవంగా యిచ్చేవారు. వున్నచోటికి వచ్చి పిల్చేవారు కూడాను. ఈలావుండగానే కాశీ ప్రయాణం. ఆ ప్రయాణం విశాఖపట్నంతోనే సమాప్తమై వెనక్కి వచ్చి చామర్లకోటలో ప్రతివాది భయంకరం రాఘవాచార్యులుగారి సన్నిధిని చదువుకోవడం, అక్కడనుంచి మళ్లా స్వగ్రామంవచ్చి కొలదికాలం పిల్లంకకూ, పల్లెపాలెముకూ వెళుతూ చామర్లకోటలో చదివిన లఘుకౌముది తరవాయిన్నీ భారవి తరవాయిన్నీ అనంతాచార్యులుగారి యొద్దనున్నూ, మధునాపంతుల సూరయ్యగారివద్దనున్నూ చదవడం వగైరాలు కొంత తపిసీలుగా జాతకచర్యలో వుండడంచేత యిక్కడ విస్తరించలేదు.

ఇటీవల చాలాకాలానికి విజయనగరం మహారాజావారి దర్శనానికి వెళ్లినప్పుడు, దర్శనం చాలా ఆలస్యంగా కాని కాలేదు. వృథాగా వుండడమెందుకని అంతోయింతో ఫిడేలుమీద స్వరాలుమట్టుకు, కట్టు సూరన్నగారివద్దనూ, సాలగ్రామ గోపాలంగారివద్దనూ చెప్పుకొన్నాను. వీరుకూడ “యేకాక్షర" న్యాయంచేత గురువుగా స్మరింపవలసినవారే. లెక్కపెడితే బ్రహ్మయ్యశాస్త్రులవారి సన్నిధికి కడియెద్ద గ్రామం ప్రవేశించేటప్పటికి యెందఱు గురువులైనారో చదువరులే లెక్కపెట్టుకొంటారు. బ్రహ్మయ్య శాస్త్రులుగారివద్ద చదువుకొంటూ కాశీ వెళ్లినప్పుడు అంతోయింతో వ్యాకరణం నోరి సుబ్రహ్మణ్యశాస్త్రులవారి వద్ద పఠించాను. అందఱు గురువులకన్న విస్తరించి చదివినది శ్రీచర్ల బ్రహ్మయశాస్త్రుల వారివద్ద మాత్రమే. చాలామందికి గురుశుశ్రూష చేసినట్లు పలుచోట్ల సూచించి వున్నాను. చూడండి -

ఉ. ఒక్కొక్కచోట నొక్కొకరియొద్ద నొకొక్కొకమాట చొప్పునన్.
    (నానారాజ సందర్శనంలో & విజయనగరము చూ.)

కారణం చెప్పలేనుగాని, నా చదువు తఱుచుగా కకారాదిగ్రామాలలో జరిగింది. కడియం, కాపులపాలెం, కాటవరం, కాజులూరు, కడియెద్ద, కాశీ, కాకినాడ, ఈ తుదిప్రదేశంలో చదవలేదుగాని చదువుకోడానికి కొంత ప్రయత్నించాను. వరిబీజం భవిష్యదభివృద్ధికి కారణమైనట్టు ఇటీవల తటస్థించిన విద్యాభివృద్ధివల్ల తెలిసికోవచ్చును. “ఒక యిక్కట్టున విద్య" అని వ్రాసిన ఆరోగ్యకామేశ్వరిలో పద్యానికంతకూ ఈలాటి కారణాలున్నాయి. మొదటిమాటకర్థం పైనుదహరించిన ఇక్కట్టే గ్రామం వదలడంవల్ల విద్య వృద్ధి అయిందనిన్నీ వరిబీజం తగ్గినదనిన్నీ తెలుసుకోవలెను. విద్యార్థిదశలో కాదుగాని, యిటీవల బందరు స్కూలులో టీచరీ వదులుకొని వచ్చేరోజులలో జంద్యాల గౌరీనాథశాస్త్రుల వారి వద్ద నలభైయాఱో వత్సరంలో కొంచెం సూత్రభాష్యం పఠించాను. ఆయా గురువులలో చాలామందిని గూర్చి వ్రాస్తే చాలా వ్రాయవలసివుంటుంది. ఎవరున్నూ సామాన్యులుకారు. అందఱున్నూ చారిత్రకపురుషులే. వీరందఱిలోనూ మఱీ విలక్షణ పురుషులు భుజంగరావుపంతులవారు. వీరెవరి వద్ద నేమిచదివిరో తెలుసుకోవాలని యెంతో కుతూహలం వుండేది. వక పర్యాయం అడిగేనుకూడా. శ్రీమద్భాగవతంలో పదకొండు శ్లోకాలు ఓగిరాల జగన్నాథంగారివద్దనో, రంగయ్యగారివద్దనో అన్వయం చెప్పకొన్నట్టు చెప్పారు. ఆ సోదరులు నీలపల్లె కాపురస్టులు. వారు పూర్వకవుల తరగతిలో తుట్టతుదివారు. వీరివద్ద సంస్కృతం చదివిన దింతమాత్రమేయైనా పంతులవారు సాహిత్యగ్రంథాలన్నీ పాఠంచెప్పేవారు. తెలుగులో సరేసరి. కొంచెం ఇంగ్లీషు, జ్యోతిషం. యివన్నీ యీలా వుండగా వైద్యం ఇప్పుడు పంచాంగాల్లో భుజంగరాడ్వైద్యశాల అనేదానిలోవున్న భుజంగరావుగారు వీరే. ఔషధాలు స్వబుద్ధినే కల్పనచేసి ఆ శిష్యుడు కిచ్చారు. దానివల్ల ఆ శిష్యుడు లక్షకో, కొన్నివేలకో అధికారైనాడు. అది ఆలా వుంచండి. ఒక భేదం మాత్రం వుండేది. అందఱిపాఠం ఒక మోస్తరు. వీరిపాఠం మరియొక మోస్తరు. దాన్నిబట్టి శిష్యులకు చిక్కుగా వుండేది. ఏమంటే! మిమ్మల్ని ఎవరేనా పరీక్షించినప్పుడు మా గురువుగారు చెప్పినట్టే ఆ పండితులకి పరీక్ష యిచ్చేవాళ్లం. దానిమీద వారు, “యిది పంతులవారి శిష్యరికంలే” అని హేళనగా అనేవారు. ఆ మాటకు మాకు యిబ్బందిగావుండేది. ఏమండీ? పండితులు యిలా అంటారని గురువు గారిని అడిగేం కూడాను, దానిమీద పంతులవారన్నారుకదా! “వొరే! వాళ్లు శుద్ధ ఛాందసులు. వాళ్లకీ సుళువులు తెలియవు. విద్యార్థిని బాగుచేసే తోవలు కొన్ని వున్నాయి. ఆ మెళుకువలు తెలియక పైగా వెక్కిరిస్తారు. “సీతాపతినా రామేణ” అని వుంటే, వాళ్లు, 'రామేణ కదంభూతేన' అని ఆకాంక్షించుకొని, రాముడెటువంటివాడు అని చెప్తారు. అది తప్పకాదుగాని, మనంచెప్పే 'యెటువంటి రామునిచేతను’ అన్నదే వీలయిన మార్గం, యేమంటే, అర్థంలోకూడా విద్యార్థికి అది తృతీయావిభక్తి అని తెలుస్తుంది' అని ఇలాటి సూక్ష్మాలుచెప్పి వారిపద్ధతిని చక్కగా సమర్థించేవారు. ఈ మహాసముద్రంముందు ఆనాటి పండితులలో నెవరోగాని నిలవ బడనేలేరు. కాని అక్కడక్కడ ఆక్షేపణమాత్రం చేస్తూవుండేవారు. వీరు ఆగర్భశ్రీమంతులవడంచేత వీరి విద్యార్థులతో తప్ప ఇతర పండితులకు యే సదస్యపు సభలలోనూ వీరితో సాక్షాత్తూ సంబంధం కలిగేదే కాదు. అందుచేత పరస్పరవాదాల కవసరం పట్టలేదు. వేయేల? మా పంతులవారు అప్పటి పండితులలో “సుల్తాను” అంటే సరిపోతుంది. “ప్రపేదిరే ప్రాక్తనజన్మ విద్యాః" అన్న కాళిదాసోక్తి కీలాటివారే ఉదాహరణం. ఆ విగ్రహం చూస్తే సమస్త విద్యారాశి అని తోచకపోదు. విద్యకు మించిన ఐశ్వర్యం. అది అనాదిసిద్ధం కూడాను. తరువాత పలువురివద్ద చదివినా, ఈ గురువుగారే నా విద్యకు పునాది. శిఖరం బ్రహ్మయ్యశాస్త్రులుగారు.


★ ★ ★